
సౌత్ ఇండియాలో భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించిన లైకా ప్రొడక్షన్స్ సోషల్‌మీడియాలో ట్రెండ్ అవుతుంది. తమిళ, హిందీ, మలయాళంలో చాలా సినిమాలను తెరకెక్కించిన ఈ సంస్థ ప్రస్తుతం తీరని నష్టాల్లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ నిర్మాణ సంస్థను పూర్తిగా షట్‌డౌన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 2014లో విజయ్ 'కత్తి' సినిమాతో లైకా ప్రొడక్షన్స్‌ను సుభాస్కరన్ ప్రారంభించారు. కేవలం పదేళ్ల జర్నీలో మొదట మంచి విజయాలను అందుకున్న నిర్మాతగా ఆయనకు గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఆయన అత్యంత భారీ బడ్జెట్ చిత్రాలను తెరకెక్కించడం.. అవి బాక్సాఫీస్ వద్ద తీరని నష్టాన్ని మిగల్చడం వల్ల ఆయన చిత్ర పరిశ్రమ నుంచి తప్పుకోనున్నట్లు సమాచారం.

ముఖ్యంగా టాప్ డైరెక్టర్ శంకర్ వల్ల లైకా ప్రొడక్షన్స్ భారీగా నష్టపోయిందని కథనాలు వచ్చాయి. ఆయన దర్శకత్వం వహించిన భారతీయుడు-2 (రూ.300 కోట్లు), రోబో 2.O (రూ. 570 కోట్ల) బడ్జెట్ పెట్టారు. 2018 నుంచి ఈ చిత్రాలను తెరకెక్కించడంలో జాప్యం ఏర్పడింది. దీంతో నిర్మాణ ఖర్చులు పెరిగిపోయాయి. ఆపై రెండు పార్ట్‌లుగా తీయడం వల్ల బడ్జెట్ దాటిపోయింది. ఈ రెండు సినిమాలు విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద దారుణమైన డిజాస్టర్‌గా మిగిలిపోయాయి. భారతీయుడు-2 సినిమా అయితే ఏకంగా నెట్‌ఫ్లిక్స్‌తో ఓటీటీ డీల్ కూడా బ్రేక్ అయిపోయింది. ఇప్పుడు భారతీయుడు పార్ట్-3 కొనుగోలు చేసే వారు ఎవరూ లేకపోవడంతో కష్టాలు మరింత ఎక్కువ అయ్యాయి. అలా శంకర్ కొట్టిన దెబ్బతో లైకా భారీగా నష్టపోయినట్లు కోలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి.
రజినీకాంత్ మూవీ ‘లాల్ సలామ్’తో పాటు అజిత్ ‘విడాముయర్చి’ కూడా లైకాను ముంచేశాయి. ‘విడాముయర్చి’ సినిమా హాలీవుడ్ నుంచి కాపీ కొట్టి తీయడంతో ఆ సంస్థపై కాపీ రైట్ కేసు పడింది. దీంతో సెటిల్మెంట్ కోసం భారీగానే డబ్బులు చెల్లించుకోవాల్సి వచ్చింది. ఆపై సినిమా కూడా పెద్దగా కలెక్షన్లు రాబట్టలేదు. ఇలా వరుస దెబ్బలతో లైకా కోలుకోలేకపోయింది. ఇలా లైకా నష్టాల్లో పలు సినిమాల ప్రభావం ఉన్నప్పటికీ శంకర్ తెరకెక్కించిన చిత్రాలే ఎక్కువ దెబ్బ కొట్టాయిని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే లైకా రిలీజ్ చేయాల్సిన మోహన్‌లాల్ ‘ఎల్-2 ఎంపురన్’ మూవీని కూడా మరో సంస్థలకు అప్పగించేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని ఇప్పటికే టాలీవుడ్ హక్కులను దిల్‌రాజు కొనుగోలు చేశారు.

ఈ మూవీ తర్వాత లైకా అధినేత సుభాస్కరన్ చిత్రపరిశ్రమకు గుడ్‌బై చెప్పేసి.. తన చేతిలో ఉన్న సినిమాలను వేరే సంస్థలకు ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఆయనకు విదేశాల్లో భారీ వ్యాపారాలు ఉండటం వల్లే లైకాను ఇంతవరకు నడపగలిగారని తెలుస్తోంది. ఇప్పుడు దీనిని షట్‌డౌన్ చేసి విదేశాల్లోనే తన వ్యాపారాలను చూసుకోవాలని ఆయన ఉన్నారట. అయితే, ఈ వార్తలు రెండురోజులుగా వైరల్ అవుతున్నప్పటికీ వారి నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదు.
Comments
Please login to add a commentAdd a comment