పొంగల్‌కి పెరియ పడమ్ ఇల్లే
ఆట అంతా ‘గేమ్ చేంజర్’దే
సంక్రాంతి అంటే స్టార్ హీరోల చిత్రాలు కనీసం మూడు నాలుగైనా ఉండాలి. అప్పుడే సినీ లవర్స్‌కి అసలైన పండగ. కానీ ఈ పొంగల్‌కి తమిళ తెరపై ఒకే ఒక్క స్టార్ హీరో కనిపించనున్నారు. అది కూడా తెలుగు స్టార్ రామ్‌చరణ్. ‘గేమ్ చేంజర్’ తమిళంలో డబ్ అయి, విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇక తమిళంలో అజిత్ ‘విడాముయర్చి’ పొంగల్ రేసు నుంచి తప్పుకుంది. మొత్తంగా తమిళంలో ఆరేడు స్ట్రయిట్ చిత్రాలు పొంగల్‌కి రానున్నాయి. అవి కూడా మీడియమ్ కంటే ఓ మెట్టు ఎక్కువ ఉన్న హీరోలు, ఓ మెట్టు తక్కువ ఉన్న హీరోలవే. హీరోల రేంజ్ పక్కన పెడితే... ఒకవేళ కథాబలం ఉండి, ప్రేక్షకులను ఆకట్టుకుంటే మీడియమ్ రేంజ్ సినిమా పెద్ద రేంజ్ అయిపోతుంది. మరి... పొంగల్‌పోటీలో వసూళ్లు కొల్లగొట్టే సినిమా ఏది? అనేది తర్వాత డిసైడ్ అవుతుంది. ఇక ఈ పొంగల్‌కి తెరపైకి రానున్న చిత్రాల గురించి తెలుసుకుందాం...
తెలుగు సినిమాకి సంక్రాంతి సీజన్ ఎంత ముఖ్యమో తమిళ ఇండస్ట్రీకి పొంగల్ కూడా అంతే ముఖ్యం. వరుస సెలవులను క్యాష్ చేసుకునే వీలు ఉన్న సీజన్ కాబట్టి భారీ చిత్రాల విడుదలను ప్లాన్ చేస్తుంటారు. ఎప్పటిలానే ఈసారి తెలుగులో భారీ చిత్రాలు విడుదలకు సిద్ధం అయ్యాయి. సీనియర్ స్టార్ హీరోలు బాలకృష్ణ ‘డాకు మహారాజ్’, వెంకటేశ్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సంక్రాంతి సందడికి రెడీ అయ్యాయి. యంగ్ స్టార్ రామ్‌చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ కూడా ఈ పండగకి రానుంది. అయితే అటు తమిళంలో మాత్రం మీడియమ్ రేంజ్ హీరోల చిత్రాలే విడుదల కానున్నాయి. ఆ మాట కొస్తే... గతేడాది కూడా కోలీవుడ్ పరిస్థితి ఇదే. ధనుష్
‘కెప్టెన్ మిల్లర్’ మినహా మిగతావన్నీ ఓ మోస్తరు చిత్రాలే.
ఈసారి అజిత్ ‘విడాముయర్చి’ రావాల్సింది కానీ సంక్రాంతి రేసు నుంచి ఆ సినిమా తప్పుకోవడంతో ఇక పొంగల్‌కి పెరియ పడమ్ ఇల్లే (సంక్రాంతికి పెద్ద సినిమా లేదు) అన్నట్లు అయింది. సో... ఉన్నదంతా ‘గేమ్ చేంజర్’ మాత్రమే. అనువాద రూపంలో తమిళ తెరపై ‘గేమ్ చేంజర్’ కనిపించనుంది. ‘ఆర్‌ఆర్‌ఆర్’తో గ్లోబల్ స్టార్ అనిపించుకున్న రామ్‌చరణ్ హీరోగా నటించిన చిత్రం కావడం, తమిళ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన చిత్రం కావడం, సక్సెస్‌ఫుల్ ప్రోడ్యూసర్ ‘దిల్’ రాజు నిర్మించిన చిత్రం కావడంతో ‘గేమ్ చేంజర్’పై తమిళనాడులోనూ భారీ అంచనాలు ఉన్నాయి. సో... ఒక స్టార్ డైరెక్టర్–స్టార్ హీరో–స్టార్ ప్రోడ్యూసర్ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం కావడంతో కోలీవుడ్ పొంగల్ బాక్సాఫీస్ దగ్గర ఆట అంతా ‘గేమ్ చేంజర్’దే అని చె΄÷్పచ్చు. వేరే పెద్ద చిత్రాలు లేకపోవడంతో ఈ చిత్రానికే ఎక్కువ థియేటర్లు లభించాయి. ‘గేమ్ చేంజర్’కి ఇదో మంచి అవకాశం.
10న 3 సినిమాలు
ఈ నెల 10న తెలుగులోనూ, అనువాద రూపంలో తమిళ్, హిందీ భాషల్లోనూ ‘గేమ్ చేంజర్’ విడుదల కానుంది. అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, ‘దిల్’ రాజు ప్రోడక్షన్ బ్యానర్స్‌పై ‘దిల్’ రాజు, శిరీష్ దాదాపు రూ.450 కోట్లతో ఈ చిత్రాన్ని నిర్మించినట్లు సమాచారం. శంకర్ అంటే దాదాపు లార్జ్ స్కేల్ సినిమానే అవుతుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘గేమ్ చేంజర్’తోపాటు 10న తమిళంలో విడుదల కానున్న వాటిలో విలక్షణ నటుడు బాల దర్శకత్వంలో అరుణ్ విజయ్ నటించిన ‘వణంగాన్’, మలయాళ నటుడు షానే నిగమ్ తమిళ తెరకు హీరోగా పరిచయం అవుతున్న ‘మద్రాస్‌క్కారన్’ చిత్రాలు ఉన్నాయి. నిజానికి ‘వణంగాన్’ని సూర్య హీరోగా ప్లాన్ చేశారు బాల.
అయితే కొన్ని కారణాల వల్ల అరుణ్ విజయ్‌తో ఈ చిత్రం చేశారు. ఒకవేళ సూర్యతో చేసి ఉంటే... పొంగల్ రేస్‌లో తమిళంలో ఓ స్టార్ ఉండి ఉండేవారు. ఇక ‘మద్రాస్ క్కారన్’ విషయానికొస్తే... గతేడాది ‘రంగోలి’ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమైన వాలీ మోహన్‌దాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మలయాళ యంగ్ హీరో షానే నిగమ్ నటించారు.
11 ఏళ్ల తర్వాత 12న
ఇక పొంగల్ రేస్‌లోని తమిళ చిత్రాల్లో చెప్పుకోదగ్గ మాస్ హీరో అంటే విశాల్. ‘మద గజ రాజా’ చిత్రంతో ఈ 12న రానున్నారు విశాల్. ఈ సినిమా 2013లో విడుదల కావాల్సింది. కొన్ని కారణాల వల్ల కుదరలేదు. చివరికి 11 ఏళ్ల తర్వాత ఈ 12న విడుదల కానుంది. సుందర్.సి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది.
పొంగల్ రోజున...
పండగ రోజున ఆకాశ్ మురళి అనే నూతన హీరో వెండితెరకు పరిచయం కానున్నారు. ‘ఇదయం’ (హృదయం) ఫేమ్ మురళి రెండో కుమారుడే ఆకాశ్ మురళి. ఆల్రెడీ పెద్ద కుమారుడు అథర్వ హీరోగా (తెలుగులో ‘గద్దలకొండ గణేశ్’లో నటించారు) సినిమాలు చేస్తున్నారు. ఇక తమిళంలో ‘బిల్లా, ఆరంభం’ చిత్రాలతో మంచి మాస్ స్టయిలిష్ దర్శకుడు అనిపించుకున్న విష్ణువర్ధన్ నూతన హీరో ఆకాశ్ మురళితో తీసిన ‘నేసి΄్పాయా’ 14న రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో ప్రముఖ దర్శకుడు శంకర్ కుమార్తె అదితీ శంకర్ హీరోయిన్‌గా నటించారు.
ఇక పండగ రోజున సీనియర్ హీరో ‘జయం రవి’ ప్రేమించడానికి సమయం లేదంటూ ప్రేక్షకులు ముందుకొస్తున్నారు. ఆయన హీరోగా నిత్యామీనన్ హీరోయిన్‌గా నటించిన ‘కాదలిక్క నేరమిల్‌లై’ (ప్రేమించడానికి సమయం లేదు) చిత్రం ఈ 14న విడుదల కానుంది. ఈ చిత్రానికి కృతికా ఉదయనిధి స్టాలిన్ దర్శకత్వం వహించారు.
ఇలా పొంగల్ రేసులో తమిళంలో ఐదు చిత్రాలు నిలవగా, వాటిలో విశాల్, ‘జయం’ రవి పేరున్న హీరోలు కాగా... వీరి తర్వాత అరుణ్ విజయ్ కొంచెం చెప్పుకోదగ్గ హీరో కాగా... మిగతా ఇద్దరిలో యువ హీరోలు ఆకాశ్ మురళి, షానే నిగమ్ ఉన్నారు. ఈ ఐదు చిత్రాలే కాకుండా మరో రెండు మూడు చిన్న సినిమాలు కూడా విడుదల కానున్నాయి. సో... ఎలా చూసుకున్నా పొంగల్‌కి తమిళ ప్రేక్షకుల ముందుకు రానున్న పెద్ద సినిమా ‘గేమ్ చేంజర్’ మాత్రమే. మరి... వసూళ్ల పరంగా ఈ సినిమా ప్రభావం ఇతర చిత్రాలపై ఏ మేరకు ఉంటుంది? పొంగల్‌పోటీలో బాక్సాఫీస్ హిట్ ఏ సినిమాకి దక్కుతుంది? అనేది మరో వారంలో తెలిసిపోతుంది.
గేమ్ చేంజర్‌తో రీ ఎంటర్ కావడం హ్యాపీ
‘సందడే సందడి’తో నిర్మాతగా తెలుగులో ఆదిత్యా రామ్ ప్రయాణం ఆరంభమైంది. ఆ తర్వాత ‘ఖుషీ ఖుషీగా, స్వాగతం, ఏక్ నిరంజన్’ చిత్రాలు నిర్మించారాయన. ‘ఏక్ నిరంజన్’ (2009) తర్వాత మళ్లీ సినిమాలు నిర్మించలేదు. చెన్నైలో రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారు. కాగా ‘గేమ్ చేంజర్’ని తమిళంలో విడుదల చేస్తున్నారు ఆదిత్యా రామ్. ‘‘చాలా కాలం తర్వాత ఒక గ్రాండ్ స్కేల్ సినిమాతో వస్తున్నందుకు ఆనందంగా ఉంది. తమిళనాడులో దాదాపు నాలుగువందల స్క్రీన్స్‌లో విడుదల చేస్తున్నాం. రామ్‌చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్‌లో వస్తున్న ‘గేమ్ చేంజర్’ ఈ వీకెండ్‌కి పెద్ద సినిమా అవుతుంది. ‘దిల్’ రాజుగారి సినిమాని విడుదల చేయడం ఆనందంగా ఉంది’’ అని పేర్కొన్నారు ఆదిత్యా రామ్. – డి.జి.భవాని
‘విడాముయర్చి’ రాకపోవడం నిరుత్సాహమే
‘‘పొంగల్ చాలా పెద్ద పండగ. పైగా ఇది పెద్ద వీకెండ్. పెద్ద హీరోల సినిమాలు రాకపోతే అస్సలు పండగలానే అనిపించదు. తమిళనాడులోని థియేటర్ ఓనర్స్ అందరూ అజిత్ హీరోగా నటించిన ‘విడాముయర్చి’ కోసం ఎదురు చూశారు. హఠాత్తుగా ఈ సినిమా వాయిదా పడటంతో అందరూ నిరుత్సాహపడ్డారు’’ అంటూ తమిళ చిత్రపరిశ్రమకు చెందిన ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment