సంక్రాంతి వచ్చెనట సందడి తెచ్చెనట!
మంచుకు తడిసిన ముద్దబంతులు... ముగ్గులు... పూలు విచ్చుకున్న గుమ్మడి పాదులు... కళ్లాపిలు.... వంట గదుల్లో తీపీ కారాల ఘుమఘుమలు...కొత్త బట్టలు... కొత్త అల్లుళ్ల దర్పాలు...పిల్లల కేరింతలు... ఓపలేని తెంపరితనాలుసంక్రాంతి అంటే సందడే సందడి.మరి మేమేం తక్కువ అంటున్నారు సినిమా తారలు.మా సంక్రాంతిని వినుమా అని ముందుకొచ్చారు.రచయిత్రులు ఊసుల ముత్యాల మాలలు తెచ్చారు.‘ఫ్యామిలీ’ అంతా సరదాగా ఉండే సంబరవేళ ఇది.ప్రతిరోజూ ఇలాగే పండగలా సాగాలని కోరుకుంటూసంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాం.ఇన్పుట్స్ : సాక్షి సినిమా, ఫ్యామిలీ బ్యూరోమన పండుగలను ఎన్నో అంశాలను మిళితం చేసి ప్రయోజనాత్మకంగా రూపొందించారు మన పెద్దలు. ప్రకృతిలో వచ్చే మార్పులకు అనుగుణంగా పండుగ విధులుగా చెప్పి వ్యక్తిగత, కుటుంబపరమైన, సామాజిక క్షేమాలని కలిగించేవిగా వాటిని రూపొందించారు. మన పండుగల్లో ఖగోళ, ఆయుర్వేద, ఆర్థిక మొదలైన శాస్త్రవిజ్ఞానాలు మిళితమై ఉంటాయి. తెలుగువారి ప్రధానమైన పండుగ సంక్రాంతిలో కూడా అంతే! ప్రధానంగా చాంద్రమానాన్ని పాటించే తెలుగువారు సౌరమానాన్ని పాటించే ముఖ్యమైన సందర్భం ఇది. సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించినప్పటి నుండి ధనుర్మాసం అంటారు. అది డిసెంబరు 15 కాని, 16వ తేదీ కాని అవుతుంది. అప్పటి నుండి మకర సంక్రమణం వరకు అంటే జనవరి 14 కాని, 15 వ తేదీ వరకు కాని ఉంటుంది. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే రోజు మకర సంక్రాంతి. ఆ రోజు నుండి సూర్యుడు తన గమన దిశని దక్షిణం నుండి ఉత్తరానికి మార్చుకుంటాడు కనుక మకర సంక్రమణానికిప్రాధాన్యం. ఆ రోజు పితృదేవతలకి తర్పణాలు ఇస్తారు. బొమ్మల కొలువుపెట్టుకునే సంప్రదాయం కొన్ని ప్రాంతాలలో ఉంది. అసలు ప్రధానమైనది సంక్రాంతి. ఈ పుణ్యకాలంలో దానాలు, తర్పణాలుప్రాధాన్యం వహిస్తాయి. ఈ సమయంలో చేసే దానాలకి ఎన్నో రెట్లు ఎక్కువ ఫలితం ఉంటుంది. దానికి కారణం ఈ మూడురోజులు పాతాళం నుండి వచ్చి భూమిని పరిపాలించమని శ్రీమహావిష్ణువు బలిచక్రవర్తికి వరం ఇచ్చాడు. కనుక బలి తనకి ఇష్టమైన దానాలు చేస్తే సంతోషిస్తాడు. అందులోనూ గుమ్మడికాయను దానం చేయటం మరీ శ్రేష్ఠం. గుమ్మడిని దానం ఇస్తే భూగోళాన్ని దానం ఇచ్చినంత ఫలితం. మకరరాశిలో ఉండే శ్రవణానక్షత్రానికి అధిపతి అయిన శని శాంతించటానికి నువ్వుల దానం చేయటం శ్రేయస్కరం. వస్త్రదానం,పెరుగుదానంతో పాటు, ఏ దానాలు చేసినా మంచిదే. భోగినాడు ఏ కారణంగానైనా పేరంటం చేయనివారు ఈ రోజు చేస్తారు. అసలు మూడురోజులు పేరంటం చేసే వారున్నారు. సంక్రాంతి మరునాడు కనుము. కనుముని పశువుల పండగ అని కూడా అంటారు. ఈ రోజు పశువుల శాలలని శుభ్రం చేసి, పశువులని కడిగి, కొమ్ములకి రంగులు వేసి,పూలదండలని వేసి, ఊరేగిస్తారు. వాటికి పోటీలు పెడతారు. ఎడ్లకి పరుగు పందాలు, గొర్రె పొట్టేళ్ళ పోటీలు, కోడిపందాలు మొదలైనవి నిర్వహిస్తారు. నాగలి, బండి మొదలైన వాటిని కూడా పూజిస్తారు. ఇప్పుడు ట్రాక్టర్లకి పూజ చేస్తున్నారు. భూదేవికి, రైతులకి, పాలేర్లకి, పశువులకి, వ్యవసాయ పనిముట్లకి కూడా తమ కృతజ్ఞతలని తెలియచేయటం పండుగలోని ప్రతి అంశంలోనూ కనపడుతుంది. మాంసాహారులు ఈరోజు మాంసాహారాన్ని వండుకుంటారు. సాధారణంగా కోడిపందెంలో ఓడిపోయిన కోడినో, గొర్రెనో ఉపయోగించటం కనపడుతుంది. ఓడిపోయిన జంతువు పట్ల కూడా గౌరవమర్యాదలని చూపటం అనే సంస్కారం ఇక్కడ కనపడుతుంది. పంటను పాడుచేసే పురుగులని తిని సహాయం చేసినందుకు పక్షులకోసం వరికంకులను తెచ్చి కుచ్చులుగా చేసి, ఇంటి ముందు వసారాలలో కడతారు. కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ కనుమునాడు గుడిలో వరికంకుల గుత్తులను కట్టే సంప్రదాయం కొనసాగుతోంది. ‘కనుము నాడు కాకైనా కదలదు’,‘కనుము నాడు కాకైనా మునుగుతుంది’,‘కనుము నాడు మినుము తినాలి’ అనే సామెతలు కనుముకి పితృదేవతలకు ఉన్న సంబంధాన్ని సూచిస్తాయి. మొత్తం నెల రోజులు విస్తరించి, నాలుగు రోజుల ప్రధానంగా ఉన్న పెద్ద పండగ సంక్రాంతి తెలుగువారికి ఎంతో ఇష్టమైన వేడుక. – డా. ఎన్.అనంతలక్ష్మిముక్కనుముముక్కనుము నాడు ప్రత్యేకంగా చేయవలసినవి పెద్దగా కనిపించవు. పండగలో అలసిపోయిన వారి విశ్రాంతి కోసం కావచ్చు. కానీ, కొంతమంది కనుమునాడు కాక ఈ రోజుని మాంసాహారం తినటానికి కేటాయిస్తారు. సంక్రాంతికి అందరూ తమ గ్రామాలకి చేరుకుంటారు. అల్లుళ్లు, ముఖ్యంగా కొత్త అల్లుళ్లు తప్పనిసరి. నెల రోజులు విస్తరించి, నాలుగు రోజులు ప్రధానంగా ఉండే సంక్రాంతి పెద్దపండుగ. పెద్దల పండుగ కూడా. పెద్ద ఎత్తున చేసుకునే పండుగ కూడా.థీమ్‌తో బొమ్మల కొలువుసంక్రాంతికి ప్రతియేటా ఐదు రోజులు బొమ్మలు కొలువు పెడుతుంటాం. చిన్నప్పటి నుంచి నాకున్న సరదా ఇది. నేను, మా అమ్మాయి, మనవరాలు కలిసి రకరకాల బొమ్మలను, వాటి అలంకరణను స్వయంగా చేస్తాం. ప్రతి ఏటా ఒక థీమ్‌ను ఎంచుకుంటాం. అందకు పేపర్, క్లే, అట్టలు, పూసలు, క్లాత్స్.. ఎంచుకుంటాం. ఈ సారి ఉమెన్ పవర్ అనే థీమ్‌తో నవదుర్గలు పెట్టాం. అమ్మ వార్ల బొమ్మలు ఇప్పటికీ ఇంట్లో ఉన్నాయి. గుడిలాగా అలంకారం చేశాం. గుడికి అమ్మాయిలు వస్తున్నట్టు, పేపర్లతో అమ్మాయిల బొమ్మలను చేశాం. తిరుపతి చందనం బొమ్మల సేకరణ కూడా ఉంది. ఆ బొమ్మలతో కైలాసం అనుకుంటే శివపార్వతులుగా, తిరుపతి అనుకుంటే వెంకటేశ్వరస్వామి, పద్మావతి... ఇలా థీమ్‌కు తగ్గట్టు అలంకరణ కూడా మారుస్తాం. ఈ బొమ్మల కొలువుకు మా బంధువులను, స్నేహితులను పిలుస్తుంటాం. ఎవరైనా అడిగితే వాళ్లు వచ్చేవరకు ఉంచుతాం. – శీలా సుభద్రాదేవి, రచయిత్రిపండగ వైభోగం చూతము రారండి– రోహిణితమిళ, మలయాళ, కన్నడ సినిమాలలో ఎంతో పెద్ద పేరు తెచ్చుకున్న రోహిణి అనకాపల్లి అమ్మాయి అనే విషయం చాలామందికి తెలియదు. అయిదేళ్ల వయసులో చెన్నైకి వెళ్లిపోయినా... అనకాపల్లి ఆమెతోనే ఉంది. అనకాపల్లిలో సంక్రాంతి జ్ఞాపకాలు భద్రంగా ఉన్నాయి. నటి, స్క్రీన్ రైటర్, పాటల రచయిత్రి, డబ్బింగ్ ఆర్టిస్ట్ రోహిణి మొల్లెటి... ‘సంక్రాంతి ఇష్టమైన పండగ’ అంటుంది, ఆనాటి పండగ వైభోగాన్ని గుర్తు చేసుకుంటుంది.నా చిన్నప్పుడు .. సంక్రాంతికి స్కూల్‌కి సెలవులు ఇచ్చేవారు. అదో ఆనందం. అలాగే కొత్త బట్టలు కొనిపెట్టేవాళ్లు. ఇంట్లో చక్కగా పిండి వంటలు చేసి పెట్టేవాళ్లు. ఫుల్లుగా తినేవాళ్లం. మాది అనకాపల్లి. నాకు ఐదేళ్లప్పుడు చెన్నై వెళ్లిపోయాం. సో... నాకు ఊహ తెలిశాక జరుపుకున్న పండగలన్నీ చెన్నైకి సంబంధించినవే.సంక్రాంతికి నెల ముందే నెల గంట పడతారు. అప్పట్నుంచి రోజూ ముగ్గులు పెట్టేవాళ్లం. అయితే ఎవరి ముగ్గు వారిది అన్నట్లు కాకుండా మా ముగ్గుకి ఇంకొకరు రంగులు వేయడం, మేం వెళ్లి వాళ్ల ముగ్గులకు రంగులు వేయడం... ఫైనల్లీ ఎవరి ముగ్గు బాగుందో చూసుకోవడం... అవన్నీ బాగుండేది. నేను రథం ముగ్గు వేసేదాన్ని. ఇక సంక్రాంతి అప్పుడు గంగిరెద్దుల సందడి, హరిదాసులను చూడడం భలేగా అనిపించేది. సంక్రాంతి నాకు ఇష్టమైన పండగ. ఎందుకంటే మనకు అన్నం పెట్టే రైతుల పండగ అది. వారికి కృతజ్ఞత తెలపాలనుకుంటాను. రైతుల విలువ పిల్లలకు చెప్పాలి. ఏమీ చెప్పకుండా పండగ చేసుకుంటే ఇది కూడా ఓ వేడుక అనుకుంటారు... అంతే. అసలు ఈ పండగ ఎందుకు చేసుకుంటున్నామో పిల్లలకి చెప్పాలి. అర్థం తెలిసినప్పుడు ఇంకాస్త ఇన్ వాల్వ్ అవుతారు.ఇప్పుడు పండగలు జరుపుకునే తీరు మారింది. వీలైనంత వైభవంగా చేయాలని కొందరు అనుకుంటారు. అయితే ఎంత గ్రాండ్‌గా చేసుకుంటున్నామని కాదు... అర్థం తెలుసుకుని చేసుకుంటున్నామా? లేదా అనేది ముఖ్యం. తాహతుకి మించి ఖర్చుపెట్టి పండగ చేసుకోనక్కర్లేదన్నది నా అభిప్రాయం.సంక్రాంతి అంటే నాకు గుర్తొచ్చే మరో విషయం చెరుకులు. చాలా బాగా తినేవాళ్లం. ఇప్పుడూ తింటుంటాను. అయితే ఒకప్పటి చెరుకులు చాలా టేస్టీగా ఉండేవి. ఇప్పటి జనరేషన్ చెరుకులు తింటున్నారో లేదో తెలియడం లేదు. షుగర్ కేన్ జ్యూస్ తాగుతున్నారు. అయితే చెరుకు కొరుక్కుని తింటే పళ్లకి కూడా మంచిది. మన పాత వంటకాలు, పాత పద్ధతులన్నీ మంచివే. ఇలా పండగలప్పుడు వాటి గురించి చెప్పడం, ఆ వంటకాలు తినిపించడం చేయాలి.నెల్నాళ్లూ ఊరంతా అరిసెల వాసనపండగ మూడు రోజులు కాదు మాకు నెల రోజులూ ఉండేది. వ్యవసాయం, గోపోషణ సమృద్ధిగా ఉండటం వల్ల నెల ముందు నుంచే ధాన్యం ఇల్లు చేరుతుండేది. నెల గంటు పెట్టగానే పీట ముగ్గులు వేసేవారు. వాటిల్లో గొబ్బిళ్లు పెట్టేవారు. రోజూ గొబ్బిళ్లు పెట్టి, వాటిని పిడకలు కొట్టేవారు. ఆ గొబ్బి పిడకలన్నీ పోగేసి, భోగిరోజున కర్రలు, పిడకలతోనే భోగి మంట వేసేవాళ్లు. మామూలు పిడకల వాసన వేరు, భోగి మంట వాసన వేరు. ప్రధాన సెలబ్రేషన్ అంటే ముగ్గు. బొమ్మల కొలువు పెట్టేవాళ్లం. అందరిళ్లకు పేరంటాలకు వెళ్లేవాళ్లం. ఊరంతా అరిసెల వాసన వస్తుండేది. కొత్త అటుకులు కూడా పట్టేవారు. చెరుకు గడలు, రేగుపళ్లు, తేగలు, పిల్లల ఆటలతో సందడిగా ఉండేది. బంతిపూల కోసం అక్టోబర్‌లో మొక్కలు వేసేవాళ్లం. అవి సంక్రాంతికి పూసేవి. కనుమ నాడు గోవులను అలంకరించి, దండం పెట్టుకునే వాళ్లం. చేసుకున్న పిండి వంటలు పంచుకునేవాళ్లం. హరిదాసులకు, గంగిరెద్దుల వాళ్లకు ధాన్యాన్ని ఇచ్చేవాళ్లం. ఇప్పటికీ పండగలను పల్లెలే సజీవంగా ఉంచుతున్నాయి. పట్టణాల్లో మాత్రం కొన్నేళ్లుగా టీవీల్లోనే సంక్రాంతి సంబరాలను చూస్తున్నాం. – రమారావి, కథకురాలు, ఆధ్యాత్మికవేత్తనా జీవితంలో సంక్రాంతి చాలా స్పెషల్– మీనాక్షీ చౌదరి‘ఆరు నెలలు సావాసం చేస్తే వీరు వారవుతారు’ అనేది మన అచ్చ తెలుగు సామెత. తెలుగుతనం ఉట్టిపడే పేరున్న మీనాక్షీ చౌదరి తెలుగు అమ్మాయి కాదు. ఉత్తరాది అమ్మాయి మీనాక్షీ చౌదరి కాస్త బాపు బొమ్మలాంటి తెలుగింటి అమ్మాయిగా మారడానికి మూడు సంవత్సరాల కాలం చాలదా! మీనాక్షీ నటి మాత్రమే కాదు స్విమ్మర్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి కూడా. ఫెమినా మిస్ ఇండియా గ్రాండ్ ఇంటర్నేషనల్ (2018) కిరీటాన్ని గెలుచుకుంది. ‘ఇచ్చట వాహనములు నిలపరాదు’ సినిమా తో తెలుగు తెరకు సైలెంట్‌గా పరిచయం అయిన చౌదరి ‘హిట్: ది సెకండ్ కేస్’తో హిట్ కొట్టింది. సూపర్‌హిట్ సినిమా ‘లక్కీభాస్కర్’ లో సుమతిగా సుపరిచితురాలైంది. కొందరికి కొన్ని పండగలు ప్రత్యేకమైనవి. సెంటిమెంట్‌తో కూడుకున్నవి. మీనాక్షీ చౌదరికి కూడా సరదాల పండగ సంక్రాంతి ప్రత్యేకమైనది. సెంటిమెంట్‌తో కూడుకున్నది. ఈ హరియాణ అందాల రాశి చెప్పిన సంక్రాంతి ముచ్చట్లు ఇవి.మాది హర్యానా రాష్ట్రంలోని పంచకుల. మూడేళ్లుగా నేను హైదరాబాద్‌లో ఉంటూ తెలుగు సినిమాల్లో పని చేస్తున్నాను కాబట్టి సంక్రాంతి పండగ గురించి నాకు తెలుసు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రతి జనవరిలో ఒక సెలబ్రేషన్ (సంక్రాంతి) ఉంది. సంక్రాంతి–సినిమా అనేది ఒక బ్లాక్ బస్టర్ కాంబినేషన్ . సినిమా ఇండస్ట్రీకి సంక్రాంతి అన్నది సినిమాల రిలీజ్‌కి, సెలబ్రేషన్స్ కి చాలా మంచి సమయం. కుటుంబమంతా కలిసి సందడిగా పూజలు చేసి సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంటుంది. అది నాక్కూడా చాలా ఎగ్జయిటెడ్‌గా ఉంటుంది. గాలిపటాలంటే నాకు చాలా ఇష్టం. కానీ, ఎగరేయడంలో నేను చాలా బ్యాడ్ (నవ్వుతూ). అయినా, మా ఫ్రెండ్స్‌తో కలిసి మా ఊర్లోనూ, హైదరాబాద్‌లోనూ ఎగరేసేందుకు ప్రయత్నిస్తుంటాను. హైదరాబాద్‌లో ప్రతి ఏటా అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ నిర్వహించడం సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే గాలిపటాలు ఎగరేయడం అన్నది కూడా ఒక ఆటే. సంక్రాంతి టు సంక్రాంతి2024 నాకు చాలా సంతోషంగా, గ్రేట్‌ఫుల్‌గా గడిచింది. గత ఏడాది మంచి సినిమాలు, మంచి కథలు, పాత్రలు, మంచి టీమ్‌తో పని చేయడంతో నా కల నిజం అయినట్లు అనిపించింది. 2025 కూడా అలాగే ఉండాలని, ఉంటుందని కోరుకుంటున్నాను. చూస్తుంటే సంక్రాంతి టు సంక్రాంతి వరకు ఓ సర్కిల్లా అనిపిస్తోంది. నా జీవితం లో కూడా సంక్రాంతి చాలా స్పెషల్. ఎందుకంటే గత ఏడాది నేను నటించిన ‘గుంటూరు కారం’ వచ్చింది.. ఈ ఏడాది కూడా ‘సంక్రాంతికి వస్తున్నాం’ విడుదలవుతోంది! అందుకే చాలా సంతోషంగా... ఎగ్జయిటింగ్‌గా ఉంది.ముగ్గుల లోకంలోకి– దివి వాఢత్యాదివి పదహారు అణాల తెలుగు అమ్మాయి. ఎం.టెక్ అమ్మాయి దివి మోడలింగ్‌లోకి ఆ తరువాత సినిమాల్లోకి వచ్చింది. ‘బిగ్‌బాస్4’తో లైమ్‌లైట్‌లోకి వచ్చింది. హీరోయిన్గా చేసినా, పెద్ద సినిమాలో చిన్న పాత్ర వేసినా తనదైన మార్కును సొంతం చేసుకుంది. గ్లామర్ పాత్రలలో మెరిసినా, నాన్–గ్లామరస్ పాత్రలలో కనిపించినాతనదైన గ్రామర్ ఎక్కడీకి పోదు! మంచి పాత్రల కోసం ఎదురుచూస్తున్నట్లుగానే... మహా పండగ సంక్రాంతి కోసం ఎదురు చూడడం దివికి ఇష్టం. సంక్రాంతి వస్తే చాలు... ఆమెకు రెక్కలు వస్తాయి. సరాసరి వెళ్లి విజయవాడలో వాలిపోతుంది. పండగ సంతోషాన్ని సొంతం చేసుకుంటుంది. భోగిమంటల వెలుగు నుంచి గగనసీమలో గాలిపటాల వయ్యారాల వరకు దివి చెప్పే సంక్రాంతి కబుర్లు...మాది హైదరాబాదే అయినా, నేను పుట్టింది విజయవాడలో. ఊహ తెలిసినప్పటి నుంచి సంక్రాంతి వచ్చిందంటే చాలు, విజయవాడలోని మా అమ్మమ్మగారి ఇంట్లో వాలిపోతా. వారం ముందు నుంచే మా ఇంట్లో పండుగ సందడి మొదలయ్యేది. మా మామయ్యలు, పిన్నులు, చుట్టాలందరితో కలసి గారెలు, అరిసెలు ఇలా ఇతర పిండి వంటలు చేసుకుని, ఇరుగు పొరుగు వారికి ఇచ్చుకుంటాం. పండుగ రోజు ఉదయాన్నే లేచి భోగి మంటలు వేసుకునేవాళ్లం. తర్వాత నలుగు పెట్టుకుని స్నానం చేసి, ముగ్గులు పెడతాం. అమ్మమ్మ పూజ చే స్తే, మేమంతా పక్కనే కూర్చొని, దేవుడికి దండం పెట్టుకునేవాళ్లం. కానీ ఆ రోజుల్ని ఇప్పుడు చాలా మిస్ అవుతున్నా. ఏది ఏమైనా సంక్రాంతికి కచ్చితంగా ఊరెళతాను. ఆ మూడు రోజుల పాటు బయటి ప్రపంచాన్ని మర్చిపోయి కుటుంబ సభ్యులతో కలసి పండుగ చేసుకోవటం నాకు చాలా ఇష్టం. సాయంత్రం స్నేహితులతో కలసి సరదాగా గాలిపటాలు ఎగరేస్తా. ఇప్పుడు నటిగా ఎదుగుతున్న సమయంలో సంక్రాంతి జరుపుకోవటం మరింత ఆనందంగా ఉంది. ఊరెళితే చాలు, అందరూ ఇంటికొచ్చి మరీ పలకరిస్తుంటారు. వారందరినీ చూసినప్పుడు నాపై నాకే తెలియని విశ్వాసం వస్తుంది. చివరగా సంక్రాంతికి ప్రత్యేకించి గోల్స్ లేవు కాని, అందరినీ సంతోషంగా ఉంచుతూ, నేను సంతోషంగా ఉంటే చాలు. ఇక నన్ను బాధించే వ్యక్తులకు, విషయాలకు చాలా దూరంగా ఉంటా. ఇంటర్వ్యూ: శిరీష చల్లపల్లిమర్చిపోలేని పండుగ– అంజలి‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లో సీత ఎవరండీ? అచ్చం మన పక్కింటి అమ్మాయి. మన బంధువుల అమ్మాయి. తన సహజనటనతో ‘సీత’ పాత్రకు నిండుతనం తెచ్చిన అంజలికి... ‘మాది రాజోలండీ’ అని చెప్పుకోవడం అంటే ఇష్టం. మూలాలు మరవని వారికి జ్ఞాపకాల కొరత ఉంటుందా! కోనసీమ పల్లె ఒడిలో పెరిగిన అంజలి జ్ఞాపకాల దారిలో వెళుతుంటే....మనం కూడా ఆ దారిలో వెళుతున్నట్లుగానే, పల్లె సంక్రాంతిని ప్రత్యక్షంగా చూస్తున్నట్లుగానే ఉంటుంది! ఒకటా ... రెండా... పండగకు సంబంధించిన ఎన్నో విషయాలను నాన్‌స్టాప్‌గా చెబుతుంది. అంజలి చెప్పే కోనసీమ సంక్రాంతి ముచ్చట్లు తెలుసుకుందాం...చిత్ర పరిశ్రమలోకి రావాలనుకునే తెలుగమ్మాయిలందరికీ నటి అంజలి ఓ స్ఫూర్తి. మనందరి అమ్మాయి.. తెలుగమ్మాయి.. ఈ పెద్ద పండుగను ఎలా జరుపుకుంటుందంటే...కోనసీమజిల్లా రాజోలు మా ఊరు. గోదావరి జిల్లాల్లో సంక్రాంతి పండుగ గురించి పెద్దగా చెప్పక్కర్లేదు.. అందరికీ వారం ముందు నుంచి పండుగ మొదలయితే, మాకు నెల ముందు నుంచే ఇంకా చెప్పాలంటే పండుగయిన తర్వాతి రోజే.. వచ్చే సంక్రాంతి కోసం ఏర్పాట్లు చేస్తుంటాం. మా తాతయ్య సుబ్బారావుగారు పండుగలంటే అందరూ కలసి చేసుకోవాలని చెప్పేవారు. అందుకే, చిన్నప్పటి నుంచే నాకు అదే అలవాటు. మా ఫ్యామిలీ చాలా పెద్దది. అందరూ వస్తే ఇల్లు మొత్తం నిండిపోయేది. అయినా సరే, ఏ పండుగైనా అందరం కలసే జరుపుకుంటాం. ఇంట్లోనూ పొలాల్లోనూ ఘనంగా పూజలు నిర్వహిస్తాం. చిన్నప్పుడు కజిన్స్ అందరం కలసి ఉదయాన్నే భోగి మంటలు వేయటానికి, అందులో ఏమేం వేయాలో అనే విషయాల గురించి వారం ముందు నుంచే మాట్లాడుకునేవాళ్లం. తాతయ్య పిండివంటలన్నీ చేయించేవారు. అందుకే, ఈ పండుగ కోసం ఎంతో ఎదురు చూసేదాన్ని. కాని, సిటీకి వచ్చాక అంత ఎంజాయ్మెంట్ లేదు. చిన్నతనంలో మా పెద్దవాళ్లు ముగ్గు వేస్తే, మేము రంగులు వేసి, ఈ ముగ్గు వేసింది మేమే అని గర్వంగా చెప్పుకుని తిరిగేవాళ్లం. అందుకే, ముగ్గుల పోటీల్లో నేనెప్పుడూ పాల్గొనలేదు. గాలిపటాన్ని కూడా ఎవరైనా పైకి ఎగరేసిన తర్వాత ఆ దారాన్ని తీసుకుని నేనే ఎగరేశా అని చెప్పుకుంటా. అందుకే, సంక్రాంతి నాకు మరచిపోలేని పండుగ.నిండుగా పొంగితే అంతటా సమృద్ధిసంక్రాంతి పండగ అనగానే తెల్లవారకుండానే పెద్దలు పిల్లల్ని నిద్రలేపడం, చలికి వణుకుతూ ముసుగుతన్ని మళ్లీ పడుకోవడం ఇప్పటికీ గుర్తు వస్తుంటుంది. సందడంతా ఆడపిల్లలదే. ముగ్గులు వేయడం, వాటిల్లో గొబ్బెమ్మలు పెట్టి, నవధాన్యాలు, రేగుపళ్లు వేసేవాళ్లం. ముగ్గులు వేయడం, గొబ్బెమ్మలు పెట్టడం, ఆవు పిడకల మీద మట్టి గురిగలు పెట్టి, పాలు పొంగించేవాళ్లం. ఎటువైపు పాలు పొంగితే అటువేపు సస్యశ్యామలం అవుతుందని నమ్మకం. నిండుగా పొంగితే అంతటా సమృద్ధి. మిగిలిన గురుగుల్లోని ప్రసాదాన్ని అలాగే తీసుకెళ్లి లోపలి గదుల్లో మూలకు పెట్టేవారు ఎలుకల కోసం. సాధారణ రోజుల్లో ఎలుకలు గింజలు, బట్టలు కొట్టేస్తున్నాయని వాటిని తరిమేవారు. అలాంటిది సంక్రాంతికి మాత్రం, బయట పక్షులతోపాటు ఇంట్లో ఎలుకలకు కూడా ఇలా ఆహారం పెట్టేవాళ్లు. ముగ్గులు పెట్టడంలో ఇప్పడూ పోటీపడే అమ్మాయిలను చూస్తున్నాను. మేం ఉండేది వనపర్తిలో. అప్పటి మాదిరిగానే ఇప్పడూ జరుపుకుంటున్నాం. – పోల్కంపల్లి శాంతాదేవి, రచయిత్రి