కోడి బరిలోకి దిగాలంటే శిక్షణ ఇవ్వాల్సిందే
గోదావరి జిల్లాల్లో ప్రత్యేకంగా కోచింగ్ సెంటర్లు
వీటిలో కోళ్లకు మూడు నెలల కఠోర శిక్షణ
ఉదయం మౌత్ వాటర్ బ్రీతింగ్
స్విమ్మింగ్, స్టీమ్ బాత్.. మధ్యాహ్నం డ్రైఫ్రూట్స్‌తో స్పెషల్ డిష్
శిక్షణ కాలంలో ఫీజు రూ.30 వేలకు పైనే
దసరాకు మొదలై సంక్రాంతికి ముగింపు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు కోచింగ్ సెంటర్లున్నాయి. డీఎస్సీ, గ్రూప్స్ ఉద్యోగాల పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు కోచింగ్ సెంటర్లు చూశాం. మనుషులకే కాదు.. కోళ్లకు కూడా కోచింగ్ సెంటర్లున్నాయి. ఇదేమిటి అని అనుకుంటున్నారా? నిజమేనండీ.. గోదావరి జిల్లాల్లో కోడిపందేలు లేకుండా సంక్రాంతి పండగే జరగదు కదా.
పందెం గెలవాలంటే కోళ్లకూ శిక్షణ ఉండాలి. వాటికీ శరీర దారుఢ్యం, వేగంగా కదిలి శత్రువుపై దాడి చేసి మట్టుపెట్టే సామర్ధ్యం ఉండాలి కదా. అందుకే ఈ కోళ్ల కోచింగ్ సెంటర్లు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గోదావరి జిల్లాలకు మాత్రమే ఇవి ప్రత్యేకం. వీటికి మూడు నెలలు మంచి గిరాకీ ఉంటుంది. దసరాకు మొదలయ్యే శిక్షణ సంక్రాంతికి మూడు రోజుల ముందు ముగిస్తారు.
శిక్షణ ఇలా..
» రోజూ గాబు (చుట్టూ తెరకట్టి లోపలఉంచుతారు)లో ఉన్న కోళ్లను తెల్లవారుజామునే బయటకు తీసుకువస్తారు. ఉదయం ఆరు గంటల లోపు మౌత్ వాటర్ బ్రీతింగ్ (నోటిలో నీరు పోసి బయటకు వదలడం) చేస్తారు. ముందు రోజు రాత్రి మట్టిలో నోటితో పొడవడంతో మట్టి చేరి ఇన్‌ఫెక్షన్ రాకుండా ఈ వాటర్ బ్రీతింగ్ చేస్తారు.
» శీతాకాలం కావడంతో రోగాలు రాకుండా నిత్యం ఏలూరుకు చెందిన వెటర్నరీ వైద్యుడు ప్రహర్ష ఆన్‌లైన్‌లో పర్యవేక్షిస్తారు.
» మూడు నెలల శిక్షణలో ఆరేడుసార్లు ప్రతి పందెం కోడికి స్టీమ్‌బాత్ చేయిస్తారు. సంక్రాంతికి సున్నిపిండితో పిల్లలకు నలుగు పెట్టి స్నానంచేసే మాదిరిగా ఇది ఉంటుంది. వేప, జాజి, కుంకుడు తదితర ఆరు రకాల ఆకులతో నీళ్లను బాగా మరిగించి పందెం కోడి తట్టుకునే ఉష్ణోగ్రత కలిగిన వేడి నీటితో స్నానం చేయిస్తారు. తరువాత ఎండ తగిలేలా ఉదయం 7 నుంచి 10 గంటల వరకు ఆరుబయటే ఉంచుతారు.
» కోడి కాళ్లు సాగడానికి పెద్ద డ్రమ్ముల్లో నీటిని పోసి కనీసం గంట పాటు ఈత కొట్టిస్తారు.
» మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్య చోళ్లు, గంట్లు, ధాన్యం మిశ్రమాన్ని పెడతారు. దీనివల్ల పందెం కోడి రెండు, మూడు అడుగులు సునాయాసంగా పైకి ఎగురుతుంది. కోడి ఎగిరే ఎత్తునుబట్టి ప్రత్యర్థిని దెబ్బతీయడానికి అవకాశం ఉంటుంది.
» పందెంకోడి బరిలోకి దిగినప్పుడు మూడున్నర కిలోకు మించి బరువు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. అంతకు మించి బరువు ఉంటే పందెంలో పైకి ఎగరలేక దెబ్బ తగిలిన వెంటనే కిందకు పడిపోయి ఓడిపోతుంది. ఇందుకోసం ప్రతి రోజూ ఉదయం బాదం, పిస్తా, ఎండు కర్జూరం వంటి డ్రై ఫ్రూట్స్‌తో ప్రత్యేక ఆహారం పెడతారు.
»పందేనికి మూడు వారాలు ముందు నుంచి రాత్రి ఆహారం మార్చేస్తారు. అన్ని రకాల డ్రైఫ్రూట్స్‌తో పాటు మసాలా దినుసులు (లవంగాలు, దాల్చిన చెక్క, వెల్లుల్లి) సమపాళ్లలో కలిపిన నాస్తా (లడ్డూలు) రోజుకు రెండు ఆహారంగా ఇస్తారు. డ్రైఫ్రూట్స్‌తో స్వీట్ ఎక్కువగా ఉండటంతో ఆరోగ్యం దెబ్బతింటుందని వేడి చేసే మసాలాలను సమపాళ్లలో కలిపి పెడతారు.
మాస్టర్ ట్రైనర్లతో శిక్షణ
ఈ కోచింగ్ సెంటర్లు గోదావరి జిల్లాల్లో పదుల సంఖ్యలోనే ఉన్నాయి. పందెం కోళ్లు పెంచే వారు సొంతంగా నిర్వహించేవి కొన్ని, బయట పందేల రాయుళ్ల నుంచి వచ్చే కోళ్ల కోసం నిర్వహిస్తున్నవి మరి కొన్ని. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం ఉండూరు అనే చిన్న పల్లెటూళ్లో ఇలాంటి పందెం కోళ్ల కోచింగ్ సెంటర్ పుష్కరకాలంగా నడుస్తోంది.
ఇక్కడ శిక్షణ తీసుకున్న కోడి బరిలో దిగిందంటే సత్తా చాటాల్సిందే. అంతటి కఠోర శిక్షణ ఇస్తారు. ఇక్కడ దాదాపు 140 పందెం కోళ్లు శిక్షణలో ఉన్నాయి. సెంటర్ నిర్వాహకుడు కోటిపల్లి శ్రీను పర్యవేక్షణలో నలుగురు మాస్టర్ ట్రైనర్లు శిక్షణ ఇస్తున్నారు. ప్రతి కోడికి మూడు నెలల శిక్షణ కోసం రూ.30 వేలు తక్కువ కాకుండా ఖర్చు చేస్తారు.
పందెం కొట్టాలంటే శిక్షణ తప్పదు
శిక్షణ లేకుండా ఏ పందెం కోడినీ బరిలోకి దింపరు. బరిలోకి దిగేందుకు మూడు నెలల ముందే శిక్షణ మొదలవుతుంది. తినే తిండి నుంచి వాతావరణంలో మార్పులు గమనిస్తుండాలి.
కోళ్లను కంటికి రెప్పలా చూసుకుంటాం. ఇక్కడ శిక్షణకు అయ్యే డబ్బు కోసం చూడం. ఖర్చుకు వెనుకాడకుండా పందెం కొడిని అన్ని రకాల శిక్షణతో మెరికల్లా తయారు చేస్తాం. మా సెంటర్‌లో దాదాపు 140 కోళ్లకు శిక్షణ ఇస్తున్నాం. – కోటిపల్లి శ్రీను, మాస్టర్ ట్రైనర్, ఉండూరు, సామర్లకోట, కాకినాడ జిల్లా
Comments
Please login to add a commentAdd a comment