ఇదే సంక్రాంతి అంటున్న బాబు అండ్ కో
గత సర్కారులో సంప్రదాయాలకు గౌరవం
మూడు రోజులపాటు ఆటపాటలకు అవకాశం
నాడు దాన్నే తప్పుపట్టిన ఎల్లో గ్యాంగ్
నేడు అందుకు పూర్తి విరుద్ధంగా పండగ పేరుతో దందా
ఎంట్రీ ఫీజులు, బరుల వద్దే బార్లు, రికార్డు డ్యాన్సులు
పార్కింగ్ నుంచి పేకాట దాకా అంతా దందానే
సాక్షి, అమరావతి: ఇసుక నుంచి మద్యం దాకా కాసుల వేటకు అలవాటు పడిన టీడీపీ కూటమి నేతలు కోడి పందేలను వదల్లేదు. సంప్రదాయం ముసుగులో మూడు రోజులపాటు సాగించిన జూదక్రీడలో సంపాదనే లక్ష్యంగా బరి తెగించారు. మునుపెన్నడూ లేని విధంగా ఊరూవాడా కోడి పందాలు, పేకాట, గుండాటలను యథేచ్ఛగా నిర్వహించారు.
వైఎస్సార్‌సీపీ హయాంలో సంప్రదాయాన్ని గౌరవిస్తూ మూడు రోజులపాటు షరతులతో కోడి పందేల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే పచ్చ ముఠాలు ఎల్లో మీడియాలో నానా రభస సృష్టించాయి. గుడివాడలో క్యాసినో నిర్వహించారంటూ.. అమ్మ ఒడి సొమ్ము ఆవిరైపోయిందని.. ఒక చేతితో ఇచ్చి మరో చేతితో లాక్కున్నారంటూ దుష్ప్రచారాలకు తెగబడ్డ కూటమి నేతలు ఈ ఏడాది కోడి పందేలకు రాజకీయ రంగు పులిమి ఆదాయ మార్గంగా మార్చేశారు.
రాష్ట్రాన్ని క్యాసినో అడ్డాగా మార్చేశారు. పలుచోట్ల కోడి పందేలను కూటమి ప్రజాప్రతినిధులు, మంత్రులు స్వయంగా ప్రారంభించడంతోపాటు వారి ఫొటోలతో బరుల వద్ద ప్లెక్సీలు ఏర్పాటు చేసుకోవడం గమనార్హం.
చట్టాన్ని ఉల్లంఘించి.. జూదానికి జై
కత్తులు కట్టి కోడి పందేలను నిర్వహించకూడదని చట్టాలు చెబుతుండగా కూటమి ప్రజా ప్రతినిధులు వాటిని నిస్సిగ్గుగా ఉల్లంఘించారు. దెందులూరు నియోజకవర్గం దుగ్గిరాలలో రూ.కోటికిపైగా ఖర్చు చేసి మినీ స్టేడియంలా తీర్చిదిద్దిన టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మూడు రోజుల పాటు జూదాల జాతర నడిపించారు.
ఏలూరు జిల్లాలో ఎంపీ పుట్టా మహేష్‌కుమార్, అనకాపల్లిలో ఎంపీ సీఎం రమేష్, కాకినాడలో జనసేన ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, పిఠాపురం టీడీపీ ఇన్‌చార్జీ వర్మ, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, పులివెందులలో బీటెక్ రవి కోడి పందేలను ప్రారంభించడంతోపాటు దగ్గరుండి పర్యవేక్షించారు.
హోంమంత్రి వంగలపూడి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న పాయకరావుపేటలో యథేచ్ఛగా పందేలు వేశారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో కూటమి నేతల కనుసన్నల్లోనే పందేలు జరిగాయి. తాడిగడపలోని వక్ఫ్ భూమిలో, ఉభయ గోదావరి జిల్లాల్లో దేవాలయాలకు అతి సమీపంలో, రాయచోటిలో క్రషర్ స్థలాన్ని ఆక్రమించి మరీ కోడి పందేలు వేసినా పోలీసులు కన్నెత్తి చూడలేదు.
సీజ్ ద గ్యాంబ్లింగ్.. అనలేరా?
తామేమీ తక్కువ తినలేదన్నట్టుగా జనసేన నేతలు కోడి పందేలకు ప్రత్యేక బరులు ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. భీమవరానికి సమీపంలోని తాడేరులో సంక్రాంతి సంబరాల పేరుతో ఏర్పాట్లు చేసుకున్న జనసేన స్థానిక నేతలు కోడి పందేలు, రాత్రి రికార్డింగ్ డ్యాన్సులు నిర్వహించారు. తాడిగడపలో బరికి ఆనుకుని ఉన్న జాతీయ రహదారిపై అనధికారింగా టోల్ వసూళ్లకు దిగారు. కాకినాడలో సీజ్ ద షిప్ అని వ్యాఖ్యలు చేసిన డిప్యూటీ సీఎం పవన్ జూద క్రీడలపై ఎందుకు స్పందించడం లేదని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
వసూళ్ల దందా..
మూడు రోజుల్లో ఏకంగా రూ.5 వేల కోట్లు బెట్టింగ్‌ల రూపంలో చేతులు మారినట్టు అంచనా. ప్రతి పందేనికి ఒడ్డిన మొత్తంలో 10 శాతం కేవుల్ (కమిషన్) వసూలు చేశారు. అంటే పది నిమిషాల్లో తేలిపోయే కోడి పందెంలో బెట్టింగ్ రూ.కోటి గెలిస్తే అందులో రూ.10 లక్షలు నిర్వాహకులకు చెల్లించాలి. అనధికారికంగా మద్యం బెల్ట్‌షాపు మూడు రోజులు ఏర్పాటు చేసుకోవాలంటే బరి స్థాయిని బట్టి రూ.లక్ష నుంచి రూ.5 లక్షలు నిర్వాహకులకు కప్పం కట్టారు. ఫలితంగా బెల్ట్‌షాపుల విక్రయాలతో మద్యం ఏరులై పారింది.
గుండాట, పేకాట, కోతాట పెట్టాలంటే రోజుకు కనీసం రూ.10 వేల నుంచి రూ.లక్షకుపైగా రుసుం వసూలు చేశారు. కోడి పకోడి, బిర్యానీ, సిగరెట్, వాటర్, కూల్‌డ్రింక్స్ స్టాల్స్ పెట్టుకోవాలంటే రోజుకు రూ.5 వేల నుంచి రూ.25 వేలు చెల్లించాల్సి వచ్చింది. మోటార్ సైకిల్‌కు రూ.50, కార్‌కు రూ.200 వసూలు చేశారు. విజయవాడ రూరల్ మండలం పాములకాల్వ సమీపంలో బుధవారం రాత్రి పొద్దుపోయాక కోడిపందాలు నిర్వహించడంతో అక్కడకు వెళ్లిన వన్‌టౌన్ ఎస్సై హరిప్రసాద్‌పై నిర్వాహకులు తిరగబడటం కూటమి నేతల అరాచకాలకు పరాకాష్ట.
Comments
Please login to add a commentAdd a comment