సాక్షి, తూర్పుగోదావరి: ఏపీలో సంక్రాంతి పండుగ వేళ కోడి పందేల ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. వీటి నిర్వహణ కోసం భారీ ఏర్పాట్లు చేశారు. కొన్ని చోట్ల ప్రజా ప్రతినిధులే పందెంలను ప్రారంభిస్తున్నారు. ఇక, పందెం రాయుళ్లు.. కోడి పుంజులతో బరులకు చేరుకుంటున్నారు.
తూర్పుగోదావరి జిల్లాలో కోడి పందెంల నిర్వహణకు భారీగా ఏర్పాట్లు చేశారు. సంక్రాంతి నేపథ్యంలో మూడు రోజుల పాటు డే అండ్ నైట్ కోడి పందెంల నిర్వహణకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ క్రమంలోనే పందెం బరుల దగ్గర ఎల్‌ఈడీ తెరలు సైతం దర్శనమిస్తున్నాయి. పెందెంలా నిర్వహణ కోసం భారీ ఏర్పాటు. మరోవైపు.. స్థానికంగా జరుగున్న కోడి పందెంలను చూసేందుకు ప్రజలు భారీగా బరుల వద్దకు చేరుకుంటున్నారు.
ఇదిలా ఉండగా.. కోడి పందేలు నిర్వహించడం నేరమని కలెక్టర్లు ప్రకటిస్తున్నా.. పందేలను కట్టడి చేయాలని హైకోర్టు గట్టిగా ఆదేశాలు ఇచ్చినా.. పోలీసులు హైకోర్టు ఆదేశాలు పాటించాల్సిందేనని న్యాయస్థానం సీరియస్ వార్నింగ్ ఇచ్చినా ఎక్కడికక్కడ జరగాల్సిన పనులు జరిగిపోతున్నాయి. పందేలరాయుళ్లు ఇన్‌స్టా వేదికగా కోడి పందేలపై విస్తృత ప్రచారానికి తెరతీయడం చర్చనీయాంశంగా మారింది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నిట్ కళాశాల సమీపంలోని వెంకట్రామయ్య బరిలో భారీ పందేలు నిర్వహిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. భోగి రోజున రూ.9 లక్షల పందేలు 9, రూ.6 లక్షల పందేలు 5, రూ.27 లక్షలు లేదా రూ.25 లక్షల పందెం ఒకటి చొప్పున జరుగుతాయని షెడ్యూల్ ప్రకటించుకున్నారు.
నిషేధం బేఖాతరు..
కోడి పందేలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేయాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఈ నెల 7న సమావేశం నిర్వహించి ఆదేశాలు జారీ చేశారు. ఏపీ గేమింగ్ యాక్ట్–1974లోని సెక్షన్ 9(1), 2 ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడానికి వీలుగా పశు సంవర్ధకశాఖ, పోలీసులు, రెవెన్యూ శాఖతో బృందాలు ఏర్పాటు చేశామని ప్రకటించారు. ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల పోలీసులు కోడిపందేల నిషేధంపై ఫ్లెక్సీలు, పోస్టర్లు ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నారు. అయినా.. సోషల్ మీడియాలో మాత్రం దీనికి పూర్తి భిన్నంగా పందేలు జరిగే ప్రాంతాలు, షెడ్యూల్స్, పందేలు వేసే ప్రముఖుల పేర్లతో పోస్టులు ట్రెండింగ్ అవుతున్నాయి.
దెందులూరు నియోజకవర్గంలో ‘ప్రీమియర్ లీగ్’
వివాదాస్పద ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గ పరిధిలోని పెదవేగి మండలం దుగ్గిరాలలో కాకతీయ ప్రీమియర్ లీగ్ (కోడి పందేల లీగ్) పేరుతో పందేలకు రెడీ అంటూ పోస్టులు వైరల్ అవుతున్నాయి. క్రికెట్ టోర్నమెంట్స్ లీగ్ మాదిరిగా కోడి పందేల లీగ్ అనే పోస్టర్లు కూడా విడుదల చేశారు. వీటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మరీ ప్రచారం సాగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment