Sankranti 2025
-
భోగభాగ్యల భోగి పండగ దేనికి సంకేతమంటే.?
'భగ' అనే పదం నుంచి భోగి అన్నమాట పుట్టిందని శాస్త్ర వచనం. 'భగ' అంటే 'మంటలు' లేదా 'వేడి'ని పుట్టించడం అని అర్ధం. మరోక అర్థంలో భోగం అంటే సుఖం పురాణాల ప్రకారం ఈరోజున శ్రీ రంగనధాస్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని దీనికి సంకేతంగా 'భోగి పండగ' ఆచరణలోకి వచ్చిందని పురాణ గాథ. అయితే చాలామంది భావించే విధంగా భోగి మంటలు వెచ్చదనం కోసం మాత్రమే కాదు ఆరోగ్యం కోసం కూడా. అలాంటి ఈ పండుగను అనాథిగా ఆచారిస్తూ రావడానికి గల కారణం, ఆరోగ్య రహాస్యలు గురించి సవివరంగా చూద్దామా..!భోగినాడు సూర్యుడు ఉత్తర ఆయనం వైపు పయనం ప్రారంభిస్తారు. సూర్యుడు కొంత కాలం భూమధ్యరేఖకి దక్షిణం వైపు ప్రయాణించి ఆ తర్వాత దక్షిణం నుంచి దిశ మార్పుచుని ఉత్తరం వైపు ప్రయాణిస్తాడు. సూర్యుడు ప్రయాణించే దిక్కుని బట్టి…దక్షిణం వైపు పయనిస్తే దక్షిణాయానం.. ఉత్తరం వైపు పయనిస్తే ఉత్తరాయణం అంటారు. మకర రాశిలోకి ప్రారంభ దశలో ఆ సూర్యని కాంతి సకల జీవరాశుల మీద పడడంతో మంచి జరుగుతుందని శాస్త్రం చెబుతోంది. సూర్యుడే ఆరోగ్యకారుడు ఆ ఆరోగ్యాన్ని ఇవ్వమని కోరుకునే పండుగ ఈ మకర సంక్రాంతి.. ఇక భోగ భాగ్యాలను అందించే పండుగ భోగి అని పెద్దలు చెబుతున్నారు.ఆరోగ్యం రహస్యం..ధనుర్మాసం నెలంతా ఇంటి ముందు ఆవు పేడతో పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు. వాటినే ఈ భోగి మంటలలో వాడుతారు. దేశీ ఆవు పేడ పిడకలని కాల్చడం వలన గాలి శుద్ధి అవుతుంది. సుక్ష్మక్రిములు నశిస్తాయి. భోగి మంటలు పెద్దవిగా రావడానికి అందులో రావి, మామిడి, మేడి మొదలైన ఔషధ చెట్ల బెరళ్లు వేస్తారు. అవి కాలడానికి ఆవు నెయ్యని జోడిస్తారు. ఈ ఔషధ మూలికలు ఆవు నెయ్యి ఆవు పిడకలని కలిపి కాల్చడం వలన విడుదలయ్యే గాలి అతి శక్తివంతమైంది. మన శరీరంలోని 72 వేల నాడులలోకి ప్రవేశించి శరీరాన్ని శుభ్ర పరుస్తుంది. అందువల్లే భోగి మంటల్లో పాల్గొనే సాంప్రదాయం వచ్చింది. పైగా దీన్నుంచి వచ్చే గాలి అందరికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. భోగి మంటలు ఎందుకంటే..చాలా మందికి భోగి మంటలు ఎందుకు వేస్తారో తెలియదు. పురాణాల ప్రకారం, దీనికి వెనుక ఒక కథ ఉంది. ఒకానొక సమయంలో రురువు అనే రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడు బ్రహ్మదేవుడి గురించి ఘోరంగా తపస్సు చేశాడు. అతడి తపస్సుకి మెచ్చి బ్రహ్మదేవుడి ప్రత్యక్షమై ఏం వరం కావాలని అడిగాడు. దానికి ఆ రాక్షసుడు మరణం లేకుండా వరం ఇవ్వమని అడుగుతాడు. అందుకు బ్రహ్మదేవుడు అంగీకరించలేదు. అప్పుడు రురువు ఎవరైనా సరే 30 రోజుల పాటు గొబ్బెమ్మలు ఇంటిముందు పెట్టి, అవి ఎండిపోయిన తర్వాత మంటల్లో వేసి ఆ మంటల్లో నన్ను తోస్తేనే మరణించేలా వరమివ్వమని బ్రహ్మదేవుడిని కోరాడు. అనంతరం రురువు వర గర్వంతో దేవతలందరినీ ఇబ్బంది పెట్టడం ప్రారంభించాడు. అప్పుడు దేవతలందరూ ఈ ధనుర్మాసంలో 30 రోజులపాటు ఇంటిముందు గొబ్బెమ్మలు పెట్టి.. ఆ తర్వాత వాటిని మంటల్లో పెట్టి రాక్షసుడిని అందులో తోస్తారు. అలా రాక్షసుడు చనిపోవడానికి సంకేతంగా భోగి రోజు భోగి మంటలు వేసుకోవడం ఆచారంగా వస్తోంది.ఈ పండగ సందేశం, అంతరార్థం..చలికాలంలో సూక్ష్మక్రిముల బెడద ఎక్కువగా ఉంటుంది. వాటిని తొలగిపోవడానికి మన పెద్దలు ఇలా భోగి మంటలు వేసి ఆరోగ్యాన్ని సంరక్షించుకునేవారని చెబుతుంటారు. ఇక ఈ పండుగ మనకు ఇచ్చే సందేశం ఏంటంటే..చెడు అలవాట్లను, అసూయా, ఈర్ఘ, దుర్భద్ధిని ఈ మంటల రూపంలో దగ్ధం చేసుకుని మంచి మనుసుతో జీవితాన్ని ప్రారంభించి సానుకూలా ఆలోచనలతో మంచి విజయాలను అందుకోవాలనే చక్కటి సందేశాన్ని ఇస్తోంది. మనం అగ్ని ఆరాధకులం. కనుక మాకు అసలైన భోగాన్ని కలిగించమనీ, అమంగళాలను తొలగించమని ప్రార్థిస్తూ అగ్నిహోత్రాన్ని రగులుస్తాము. గతించిన కాలంలోని అమంగళాలను, చేదు అనుభవాలు, అలాగే మనసులోని చెడు గుణాలను, అజ్ఞానాన్ని అన్నింటినీ అత్యంత పవిత్రమైన అగ్నిలో వేసి దగ్ధం చేసుకోవటమే భోగి. ఇలా మంగళాలను, జ్ఞానాన్ని పొందాలనే కోరికతో అగ్నిహోత్రుడిని పరబ్రహ్మ స్వరూపంగా భావించి పూజించటమే భోగి మంటల వెనక ఉన్న అంతరార్థం.(చదవండి: సంక్రాంతి అంటే పతంగుల పండుగ కూడా..!) -
సందళ్ల సంక్రాంతి
మనకు ఎన్ని పండుగలు ఉన్నా, సంక్రాంతి పండుగ ప్రత్యేకమైనది. సంక్రాంతి అంటేనే సందడి అనేంతగా తెలుగునాట సంక్రాంతి సంబరాలు ప్రసిద్ధి పొందాయి. సూర్యుడు మకరరాశిలోకి అడుగుపెట్టే సందర్భంగా మకర సంక్రాంతి వేడుకలు జరుపుకొంటారు. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించడంతో ఉత్తరాయనం మొదలవుతుంది. ఉత్తరాయనాన్ని పుణ్యకాలంగా భావిస్తారు. అందువల్ల మకర సంక్రాంతిని తెలుగునాటనే కాకుండా, దేశవ్యాప్తంగా జరుపుకొంటారు. సంక్రాంతి వేడుకలు జరుపుకోవడంలో ఒక్కో ప్రాంతానిది ఒక్కో పద్ధతి. సంక్రాంతికి ముందురోజున భోగి మంటలు వేయడం, సంక్రాంతి రోజుల్లో ముంగిళ్లలో ముగ్గులు వేయడం దేశవ్యాప్తంగా కనిపిస్తుంది. మకర సంక్రాంతి సందర్భంగా దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో కనిపించే సంక్రాంతి సందళ్ల గురించి తెలుసుకుందాం.సంక్రాంతి రోజుల్లో తెలుగునాట ఊరూరా ముంగిళ్లు గొబ్బెమ్మలను తీర్చిదిద్దిన ముగ్గులతో కళకళలాడుతూ కనిపిస్తాయి. గంగిరెద్దుల గంటల సవ్వడులు, బుడబుక్కల వాయిద్యాల ధ్వనులు, హరిదాసుల హరినామ సంకీర్తనలు వినిపిస్తాయి. కొన్నిచోట్ల కోడిపందేల కోలాహలాలు, ఇంకొన్ని చోట్ల నింగిని తాకే పతంగుల రంగులు కనువిందు చేస్తాయి. కొన్నిచోట్ల ఆడపడుచులు సంక్రాంతి సందర్భంగా ఇళ్లల్లో బొమ్మల కొలువులు కూడా పెడతారు. మకర సంక్రాంతి వేడుకలను సాధారణంగా మూడు రోజులు, ఒక్కోచోట నాలుగు రోజులు కూడా జరుపుకొంటారు. మకర సంక్రాంతికి ముందురోజు భోగి పండుగ, సంక్రాంతి మరునాడు కనుమ పండుగ, కనుమ మరునాడు ముక్కనుమ జరుపుకొంటారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు మిగిలిన దక్షిణాది రాష్ట్రాల్లోనూ సంక్రాంతి వేడుకలను దాదాపు ఒకేరీతిలో అత్యంత వైభవోపేతంగా జరుపుకొంటారు. సంక్రాంతి ప్రధానంగా వ్యవసాయ సంస్కృతిని ప్రతిబింబించే పండుగ. పంటల కోతలు పూర్తయ్యాక వచ్చే పండుగ ఇది. సంక్రాంతి నాటికి రైతుల ఇళ్లు ధాన్యరాశులతో కళకళలాడుతుంటాయి. మకర సంక్రాంతి పుష్యమాసంలో వస్తుంది. ఇంటికి ధాన్యలక్ష్మి చేరుకునే రోజుల్లో వస్తుంది కాబట్టి, సంక్రాంతి లక్ష్మి అని, పౌష్యలక్ష్మి అని అంటారు. ‘వచ్చింది వచ్చింది పచ్చ సంక్రాంతి/ వచ్చింది వచ్చింది లచ్చి సంక్రాంతి’ అంటూ సంక్రాంతి లక్ష్మికి స్వాగతం పలుకుతారు. నెల్లాళ్లు రంగవల్లుల వేడుకమకర సంక్రాంతికి నెల్లాళ్లు ముందు వచ్చే ధనుస్సంక్రాంతి నుంచి ముంగిళ్లలో నెల్లాళ్ల పాటు రంగవల్లుల వేడుక సాగుతుంది. ఇళ్ల ముందు రకరకాల రంగవల్లులను తీర్చిదిద్ది వాటిని గొబ్బెమ్మలతో అలంకరిస్తారు. అష్టదళ పద్మం, నాగబంధం, మారేడు దళాలు, శివుడి త్రినేత్రాలు, పెళ్లిపీటల ముగ్గు వంటి సంప్రదాయ ముగ్గులతో పాటు రకరకాల ముగ్గులను తీర్చిదిద్దుతారు. ధనుస్సంక్రాంతి నుంచి మకర సంక్రాంతి వరకు సాగే నెల్లాళ్లను సౌరమానం ప్రకారం ధనుర్మాసం అంటారు. ధనుర్మాసంలో వైష్ణవాలయాల్లో తిరుప్పావై పాశురాలను పఠిస్తూ, ప్రత్యేక పూజలు చేస్తారు. కట్టుపొంగలి, చక్కెరపొంగలి వంటి వంటకాలను నైవేద్యంగా పెడతారు. భోగి పండుగ రోజున ఆలయాల్లో గోదా కల్యాణం వేడుకలను నిర్వహిస్తారు. చివరి రోజున రథం ముగ్గు వేస్తారు. దీనిని దక్షిణాయనం నుంచి ఉత్తరాయనానికి పయనం సాగించిన సూర్యుని రథంగా భావిస్తారు.భోగ భాగ్యాల భోగిపూర్వం విష్ణుచిత్తుడు అనే విష్ణుభక్తుడు ఉండేవాడు. విష్ణుచిత్తుడికి ఒకనాడు తులసివనంలో ఒక పసిబిడ్డ దొరికింది. విష్ణుచిత్తుడు ఆమెను కుమార్తెగా స్వీకరించి పెంచాడు. ఆమె గోదాదేవి. చిన్ననాటి నుంచి శ్రీరంగనాథుడిని ఆరాధించేది. శ్రీరంగనాథుడు ఆమెను మకర సంక్రాంతికి ముందు ధనుర్మాసం చివరి రోజున పెళ్లాడాడు. ఆమెను భోగభాగ్యాలతో ముంచెత్తాడు. రంగనాథుని పెళ్లాడటంతో గోదాదేవి కైవల్య భోగాన్ని పొందిందని ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు. గోదా రంగనాథుల పరిణయానికి, భోగభాగ్యాలకు ప్రతీకగా భోగి పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. భోగి రోజున ఇంట్లోని చిన్నపిల్లలకు రేగుపండ్లు, చెరకు ముక్కలతో భోగిపండ్లు పోసి, పెద్దలు వారిని ఆశీర్వదిస్తారు. హేమంత రుతువులో చలితీవ్రత ఎక్కువగా ఉండేరోజుల్లో ఈ పండుగ వస్తుంది కాబట్టి, భోగిపండుగ రోజున వేకువ జామున ఇళ్ల ముంగిట గాని, వీథి చివరన గాని పెద్దపెద్ద భోగిమంటలు వేస్తారు. భోగిమంటల్లో పిడకల దండలు, ఎండిపోయిన తాటాకులు, పెద్దపెద్ద కర్రదుంగలు, పాత వస్తువులు వేస్తారు. రైతులు భోగిరోజున కోతలు పూర్తయిన తమ పొలాలను కొంత నీటితో తడుపుతారు. దీనిని ‘భోగి పులక’ అంటారు. భోగి రోజు నుంచి గాలిపటాల సందడి కూడా మొదలవుతుంది. సిరుల వేడుక సంక్రాంతి«రైతుల ఇళ్లు ధాన్యరాశులతో కళకళలాడే రోజుల్లో వచ్చే సిరుల పండుగ మకర సంక్రాంతి. ఈ రోజు పాలు పొంగించి, కొత్తబియ్యంతో పాయసం వండుతారు. పితృదేవతలను పూజించి, పితృతర్పణాలు విడుస్తారు. శ్రీకృష్ణుడు ఇదేరోజున గోవర్ధన పర్వతాన్ని పైకెత్తి, ఇంద్రుడు కురిపించిన రాళ్లవాన నుంచి యాదవులను కాపాడాడని, ఇంద్రునికి గర్వభంగం చేశాడని పురాణాల కథనం. ఈరోజున ప్రత్యక్ష నారాయణుడైన సూర్యభగవానుడిని పూజిస్తారు. సంక్రాంతి రోజున చేసే దాన ధర్మాలకు రెట్టింపు ఫలితం ఉంటుందనే నమ్మకం ఉండటంతో ఈరోజున విరివిగా దాన ధర్మాలు చేస్తారు. ఇళ్లకు వచ్చే హరిదాసులకు, బుడబుక్కల వాళ్లకు, గంగిరెద్దులను ఆడించేవాళ్లకు యథాశక్తి ధన ధాన్యాలను దానం చేస్తారు. సంక్రాంతి రోజున డబ్బు, ధాన్యం మాత్రమే కాకుండా, విసనకర్రలు, వస్త్రాలు, నువ్వులు, చెరకు, పండ్లు, కూరగాయలు వంటివి కూడా దానం చేస్తారు. సంక్రాంతి రోజున చేసే గోదానం విశేష ఫలితం ఇస్తుందని చెబుతారు. అందువల్ల సంపన్న గృహస్థులు సంక్రాంతి రోజున గోదానాలు కూడా చేస్తారు. పశువుల పండుగ కనుమమకర సంక్రాంతి మరునాడు కనుమ పండుగ జరుపుకొంటారు. పొలం పనుల్లో ఏడాది పొడవునా చేదోడు వాదోడుగా నిలిచిన పశువులను అలంకరించి, వాటికి ఇష్టమైన మేతను పుష్టిగా పెడతారు. కనుమ రోజున మాంసాహారులు రకరకాల మాంసాహార వంటకాలతో విందుభోజనాలు చేస్తారు. మనకు కనుమ నాడు మినుము తినాలని సామెత ఉంది. మాంసాహారం తినని శాకాహారులు మాంసకృత్తులు పుష్కలంగా ఉండే మినుములతో తయారుచేసే గారెలు, ఆవడలు వంటి వంటకాలను ఆరగిస్తారు. కనుమ రోజున ప్రయాణాలు చేయకపోవడం సంప్రదాయంగా వస్తోంది.ముగింపు ముక్కనుమసంక్రాంతి వేడుకల్లో మొదటి మూడు రోజుల్లోనూ నిర్దిష్టంగా పాటించవలసిన సంప్రదాయ నియమాలు ఉన్నాయి గాని, నాలుగో రోజైన ముక్కనుమకు ప్రత్యేక నియమాలేవీ లేవు. కొందరు మాంసాహారులు కనుమనాడు మాంసాహారం తినరు. వారు ముక్కనుమ రోజున మాంసాహార విందులు చేసుకుంటారు. ముక్కనుమ రోజున నవవధువులు సావిత్రి గౌరీవ్రతం చేస్తారు. ఈ వ్రతాన్ని బొమ్మల నోము అంటారు. నోము పూర్తయ్యాక, పూజలో ఉంచిన బొమ్మలను నిమజ్జనం చేస్తారు. ముమ్మతాల పండుగమకర సంక్రాంతి హిందువుల పండుగ మాత్రమే కాదు, ఇది ముమ్మతాల పండుగ. హిందువులతో పాటు జైనులు, సిక్కులు కూడా మకర సంక్రాంతి పండుగను తమ తమ సంప్రదాయ పద్ధతుల్లో జరుపుకొంటారు. జైన ఆగమం ప్రకారం ఈ దేశాన్ని పాలించిన భరత చక్రవర్తి మకర సంక్రాంతి రోజున అయోధ్యలో సూర్యుడిని చూసినప్పుడు, ఆయనకు సూర్యుడిలో ‘జిన’ దర్శనం లభించింది. వెంటనే ఆయన జినాలయాన్ని దర్శించుకున్నప్పుడు, ఆ ఆలయ ద్వారం అయోధ్య నగరానికి అభిముఖంగా ఉందట! జైన మతం ప్రకారం ఇంద్రియాలను జయించిన ఆధ్యాత్మిక విజేతను ‘జిన’ అంటారు. మకర సంక్రాంతిని పర్వదినంగా జరుపుకొనే జైనులు, ఆరోజున జైన ఆలయాలను దర్శించుకుని, ప్రార్థనలు జరుపుతారు. ఆలయాల వద్ద, తమ తమ నివాసాల వద్ద విరివిగా దానాలు చేస్తారు.సిక్కులు మకర సంక్రాంతిని ‘మాఘి’ పేరుతో జరుపుకొంటారు. సిక్కుల గురువైన గురు గోబింద్‌సింగ్ అనుచరుల్లో నలభైమంది 1705లో సంక్రాంతి రోజున జరిగిన ముక్తసర్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారు. అందువల్ల సిక్కులు సంక్రాంతిని ఆ నలభై మంది అమరవీరుల స్మారకదినంగా పాటిస్తారు. ముక్తసర్‌లోని గురుద్వారాలో ఉన్న తటాక జలాల్లో పవిత్ర స్నానాలు చేస్తారు. పంజాబ్, హరియాణా, జమ్ము, హిమాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లోని ప్రజలు సంక్రాంతి ముందు రోజును ‘లోహ్రీ’ పండుగగా జరుపుకొంటారు. లోహ్రీ సందర్భంగా వీథుల్లో భోగిమంటల మాదిరిగానే భారీగా చలిమంటలు వేసుకుని, ఆటపాటలతో ఆనందం పంచుకుంటారు. హిమాచల్ ప్రజలు సంక్రాంతి వేడుకల్లో అగ్నిదేవుడికి ప్రత్యేకంగా పూజలు జరుపుతారు.పతంగుల పండుగసంక్రాంతి సందర్భంగా పతంగులను ఎగురవేసే సంప్రదాయం మన దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఉంది. గుజరాత్లో పతంగుల సందడి మరింత ఎక్కువగా కనిపిస్తుంది. గుజరాతీలు ధనుర్మాసం నెల్లాళ్లూ గాలిపటాలను ఎగురవేస్తారు. పలుచోట్ల గాలిపటాల పోటీలు కూడా నిర్వహిస్తారు. మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోనూ సంక్రాంతి రోజుల్లో గాలిపటాల సందడి కనిపిస్తుంది. కర్ణాటక పర్యాటక శాఖ గోకర్ణ, కార్వార్ తదితర బీచ్‌లలో గాలిపటాల వేడుకలను కొన్నేళ్లుగా నిర్వహిస్తోంది. సూర్యభగవానుడికి కృతజ్ఞత తెలుపుకోవడానికే గాలిపటాలను ఎగురవేసే సంప్రదాయం పుట్టిందని చెబుతారు. చారిత్రకంగా చూసుకుంటే, మొఘల్‌ల కాలం నుంచి మన దేశంలో గాలిపటాలను ఎగురవేయడం వినోదక్రీడగా మొదలైనట్లు ఆధారాలు ఉన్నాయి.కోడి పందేలుకోడి పందేలు మన దేశంలో పురాతన వినోద క్రీడ. చట్టపరమైన నిషేధాలు ఉన్నా, నేటికీ ఏటా సంక్రాంతి రోజుల్లో కోడి పందేలు విరివిగా జరుగుతూనే ఉన్నాయి. కోడి పందేల కారణంగానే పలనాటి యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే! దేశంలోని మిగిలిన రాష్ట్రాల్లోనూ కోడి పందేల ఆచారం ఉన్నా, తెలుగునాట కోడి పందేలు మరింత ఎక్కువగా జరుగుతాయి. కోడి పందేల్లో గెలుపు సాధించడం కోసం పూర్వీకులు ఏకంగా ‘కుక్కుట శాస్త్రం’ రాశారంటే, కోడిపందేల పట్ల జనాల మక్కువ ఎలాంటిదో తెలుసుకోవచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ఖమ్మం జిల్లాల్లో కోడి పందేలు ఎక్కువగా జరిగేవి. ఇప్పటికీ ఈ ప్రాంతాల్లో కోడిపందేలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రాంతాల్లోని కోళ్ల పెంపకందారులు పెందేల కోసం మేలిరకం కోడిపుంజులను పెంచుతుంటారు. ఇదివరకు ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరం, జంగారెడ్డిగూడెం, చింతలపూడి, తాడేపల్లిగూడెం, తణుకు తదితర పట్టణాలు పందెంకోళ్లకు ప్రధాన కేంద్రాలుగా ఉండేవి. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇరవై ఏళ్ల కిందట ఆయిల్ పామ్ సాగు మొదలైనప్పటి నుంచి ఇక్కడ కూడా పందెం కోళ్ల పెంపకం మొదలైంది. ఆంధ్రప్రదేశ్‌లో కంటే తెలంగాణలోనే పందెంకోళ్లు చౌకగా లభిస్తుండటంతో ఒడిశా, ఛత్తీస్‌గఢ్ నుంచి కూడా పందెంరాయుళ్లు పుంజులను కొనేందుకు అశ్వారావుపేట, దమ్మపేట వంటి చోట్ల బారులు తీరుతుండటం విశేషం. పందెం కోళ్ల పెంపకం, వాటి శిక్షణ కోసం కోళ్ల పెంపకందారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. సంక్రాంతికి ఏటా కోట్లాది రూపాయల్లో కోడి పందేలు జరుగుతాయి. పందెం కొళ్లకు లక్షల్లో ధరలు పలుకుతాయి. పొరుగు దేశాల్లో సంక్రాంతిమన పొరుగుదేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, సింగపూర్, మలేసియా తదితర దేశాల్లోనూ మకర సంక్రాంతి వేడుకలను జరుపుకొంటారు. బంగ్లాదేశ్‌లోని బెంగాలీ హిందువులు సంక్రాంతి ముందురోజు భోగిమంటలు వేసి, బాణసంచా కాలుస్తారు. సంక్రాంతి రోజున పితృదేవతలకు పూజలు చేస్తారు. పండుగ రోజుల్లో ఇళ్ల ముందు ముగ్గులు వేస్తారు. ఈ సందర్భంగా బంధుమిత్రులతో కలసి వినోదంగా పాచికలాట ఆడతారు. ఈ రోజుల్లో సమీపంలోని చెరువులకు, నదులకు వెళ్లి చేపలను వేటాడతారు. పండుగ రోజుల్లో ఎవరికి పెద్దచేపలు చిక్కుతాయో వారికి ఏడాదంతా అదృష్టం బాగుంటుందని నమ్ముతారు. నేపాల్ ప్రజలు మకర సంక్రాంతిని ‘మాఘే సంక్రాంతి’గా జరుపుకొంటారు. థారు, మగర్ సహా వివిధ స్థానిక తెగల ప్రజలు తమ తమ సంప్రదాయ రీతుల్లో ఘనంగా వేడుకలు జరుపుకొంటారు. దేవాలయాల వద్దకు చేరుకుని, సంప్రదాయ నృత్యగానాలను ప్రదర్శిస్తారు. పాకిస్తాన్‌లోని సింధీ ప్రజలు మకర సంక్రాంతిని ‘తిర్మూరి’ పేరుతో జరుపుకొంటారు. ఈ సందర్భంగా ఆడపడుచులకు పుట్టింటి నుంచి నువ్వులతో తయారు చేసిన పిండివంటలను పంపుతారు. శ్రీలంక ప్రజలు తమిళనాడులో మాదిరిగానే ‘పొంగల్’ వేడుకలు జరుపుకొంటారు. ఇన్పుట్స్: దాళా రమేష్‌బాబు, గుంటూరు తాండ్ర కృష్ణగోవింద్, కొత్తగూడెం ఫొటోలు: షేక్ రియాజ్ -
ధరలు ధగధగ.. వ్యాపారం వెలవెల!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఈ ఏడాది సంక్రాంతి సందడి పెద్దగా కనిపించడం లేదు. అన్ని జిల్లాల్లోనూ వ్యాపారాలు అంతంత మాత్రమేనని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతుంటే సంతోషంగా పండుగ ఎలా చేసుకోవాలని పేద, మధ్యతరగతి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే వస్త్ర, బంగారు, ఇతర వ్యాపారాలన్నీ దాదాపు సగానికి సగం పడిపోయాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. సంక్రాంతి పూట పిండి వంటలు చేసుకునేందుకు కూడా సామాన్య, మధ్య తరగతి ప్రజలు దిక్కులు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత ఎనిమిది నెలలుగా ఆకాశమే హద్దుగా ఎగబాకుతున్న నిత్యావసరాల ధరలను చూసి జనం బెంబేలెత్తిపోతున్నారు. పండుగ పూట ఇంటికి వచ్చే బంధువులకు నాలుగు రకాల పిండి వంటలు కూడా చేసి పెట్టలేని దుస్థితిలో ఉన్నారు. గతేడాది జనవరితో పోల్చి చూస్తే ప్రస్తుతం మార్కెట్లో వంట నూనెల నుంచి బియ్యం వరకు మండుతున్న ధరలను చూసి గగ్గోలు పెడుతున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న ధరలకు కళ్లెం వేయలేని టీడీపీ కూటమి ప్రభుత్వం.. మరో వైపు ఎన్నికల్లో ఇచి్చన హామీలు అమలు చేయకపోగా, చంద్రన్న సంక్రాంతి కానుక సైతం ఇవ్వలేమని చేతులెత్తేసింది. ఈ పరిస్థితిలో ఏ విధంగా పండుగను సంతోషంగా జరుపుకోవాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 20–40 శాతం మేర పెరిగిన ధరలు సంక్రాంతి వచ్చిందంటే పల్లెలన్నీ కళకళలాడుతుంటాయి. పండుగ నాలుగు రోజులు ఇంటికి వచ్చే కొత్త అల్లుళ్లకే కాదు.. బంధువులు, స్నేహితులకు ఘుమ ఘుమలాడే పిండి వంటలు వండి వడ్డించడం మన తెలుగువారి సంప్రదాయం. బూరెలు, గారెలు, అరిసెలు, సున్నుండలు, పొంగడాలు, పాకుండలు, కజ్జి కాయలు, పులిహోర ఇలా ఎవరికి వారు తమ స్థాయికి తగ్గట్టుగా పిండి వంటలు చేసుకుని ఆనందంగా గడుపుతారు. టీడీపీ కూటమి ప్రభుత్వం గద్దెనెక్కింది మొదలు నిత్యావసరాల ధరలు షేర్ మార్కెట్లా దూసుకెళ్లాయి. కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులు ప్రభుత్వ అండదండలతో అందినకాడికి దోచుకుంటూనే ఉన్నారు. గతేడాది సంక్రాంతికి ముందు ఉన్న ధరలతో పోలిస్తే ప్రస్తుతం సగటున 20 నుంచి 40 శాతం మేర పెరిగాయి. నిత్యావసర వస్తువులే కాదు.. కాయగూరల ధరలు సైతం పెరిగాయి. వెల్లుల్లి అయితే రికార్డు స్థాయిలో మూడు రెట్లు పెరిగింది. పిండి వంటల్లో ఉపయోగించే పప్పులు, బెల్లం, నెయ్యి ధరలు కూడా గతేడాదితో పోలిస్తే భారీగా పెరిగాయి. పప్పన్నానికీ దూరం పండుగ పూట పప్పన్నం వండుకునేందుకు కూడా భయపడే పరిస్థితి నెలకొంది. పప్పు దినుసుల ధర సామాన్య, నిరుపేదలను బెంబేలెత్తిస్తోంది. గతేడాది జనవరిలో కిలో రూ.84.50 ఉన్న శనగపప్పు ప్రస్తుతం రూ.100–140 పలుకుతోంది. గత ఏడాది రూ.150 ఉన్న కందిపప్పు అయితే నేడు ఏకంగా రూ.160–224తో అమ్ముతున్నారు. గతేడాది రూ.126 పలికిన పెసరపప్పు నేడు రూ.140–170 పలుకుతోంది. బహిరంగ మార్కెట్లో కిలోకు రూ.10 నుంచి రూ.20 తగ్గించామని ప్రభుత్వం గొప్పలు చెబుతున్నప్పటికీ, అవన్నీ నాసిరకం పప్పులే. గోధుమ పిండి సైతం గతేడాది కిలో రూ.50 పలుకగా, నేడు రూ.70 చొప్పున విక్రయిస్తున్నారు. బియ్యం ధర గురించి అయితే చెప్పనవసరం లేదు. గతేడాది ఫైన్ క్వాలిటీ బియ్యం కిలో రూ.57 ఉండగా, నేడు సాధారణ రకమే ఆ ధరతో విక్రయిస్తున్నారు. ప్రీమియం రకాలు రూ.64–75 మధ్య పలుకుతున్నాయి. లూజ్ బాస్మతి బియ్యం ధర కిలో రూ.120కి పైగానే ఉంది. నూనెల ధర ధగధగ దేశంలో మరెక్కడా లేని విధంగా రాష్ట్రంలో వంట నూనెల ధరలు విపరీతంగా పెరిగాయి. కేంద్రం దిగుమతి సుంకం పెంచిందన్న సాకుతో కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులు ఇష్టారాజ్యంగా రేట్లు పెంచేశారు. ప్రియా, ఫ్రీడం, రుచి ఇలా ప్రధాన బ్రాండ్ నూనెల ధరలన్నీ కిలోకు రూ.30–50 వరకు ఎగబాకాయి. దిగుమతి సుంకంతో సంబంధం లేని కొబ్బరి నూనె కిలోకు రూ.18, వేరుశనగ నూనెపై రూ.10, పూజాదికాలకు ఉపయోగించే నూనెలపై రూ.10–30 చొప్పున పెంచేశారు. ప్రియా ఆయిల్స్ ఇతర బ్రాండ్ ధరల కంటే రూ.20 అదనంగా ఉన్నాయి. గతేడాది జనవరిలో లీటర్ 88.60 ఉన్న పామాయిల్ ప్రస్తుతం రూ.130 పలుకుతోంది. రూ.112.80 పలికిన సన్‌ఫ్లవర్ రిఫైండ్ ఆయిల్ ప్రస్తుతం రూ.150–160 చొప్పున అమ్ముతున్నారు. నెయ్యి కిలో రూ.150 నుంచి రూ.300 వరకు పెరిగింది. పాల ధరలు గతంతో పోలిస్తే లీటర్‌కు రూ.10–20 మేర పెరిగాయి. ఇలా బెంబేలెత్తిస్తున్న నిత్యావసర ధరల ప్రభావం వల్ల సామాన్య, మధ్య తరగతి ప్రజలకు సగటున ఒక్కో కుటుంబంపై రూ.వెయ్యి నుంచి రూ.2 వేల వరకు అదనపు భారం పడుతోంది.ముందస్తు ఆర్డర్లు లేవు.. సంక్రాంతి గతంలో ఉన్నట్టు ఈ ఏడాది లేదు. ముందస్తు ఆర్డర్లు తగ్గిపోయాయి. కార్పొరేట్ గిఫ్టుల కోసం తప్పితే ప్రజల నుంచి వచ్చే ఆర్డర్లు లేవు. చిన్న కుటుంబం రూ.1,500 ఖర్చు చేస్తే 10 రకాల పిండి వంటలు అందించేవాళ్లం. అవి దాదాపు 11–12 కిలోలు ఉండేవి. గతంలో పెట్టిన డబ్బులకు ఇప్పుడు 8 కిలోలు కూడా ఇవ్వలేకపోతున్నాం. శనగపిండి, వంట నూనెల రేట్లు పెరగడంతో తక్కువ పిండి వంటలు కొనుక్కుంటున్నారు. నెయ్యి క్వాలిటీదైతే రూ.వెయ్యి పలుకుతోంది. కంపెనీ నెయ్యి హోల్‌సేల్‌లోనే గతంలో కిలో రూ.500–550 ఉంటే ఇప్పుడు రూ.650 పలుకుతోంది. కొత్తగా అల్లుళ్లు, కోడళ్లకు సారె పెడితే 100 మందికి పంచుకునే వాళ్లుŠ. ఇప్పుడు 20–30 మందికే పరిమితం అయ్యేలా పెడుతున్నారు. ఫలితంగా మాకు ఆర్డర్లు తగ్గిపోయాయి. – కె.సందీప్, పిండి వంటల వ్యాపారం, రావులపాలెంమూడొంతుల వ్యాపారం పడిపోయింది సాధారణ రోజుల్లో రోజుకు రూ.8 వేల నుంచి రూ.10 వేల దాకా వ్యాపారం జరిగేది. పండుగ సీజన్లో రోజుకు రూ.19 వేల వరకు జరిగేది. సంక్రాంతి పండుగకు 15 రోజుల ముందు నుంచి షాపు కిటకిటలాడేది. ఇంటిల్లిపాది కొత్త చెప్పులు కొనుగోలు చేసేవారు. కానీ ఆరు నెలల నుంచి వ్యాపారం బాగా తగ్గిపోయింది. సాధారణ రోజుల్లో రూ.2 వేలు దాటడం లేదు. ఈ పండుగ సీజన్లోనూ రూ.4 వేలకు మించడం లేదు. మూడొంతుల వ్యాపారం పడిపోయింది. దీనివల్ల ఇబ్బంది పడాల్సి వస్తోంది. – ఇమ్రాన్, చెప్పుల వ్యాపారి, అనంతపురంరూ.50 లక్షల నుంచి రూ.25 లక్షలకు.. చాలా రోజులుగా బంగారు నగల దుకాణం నిర్వహిస్తున్నా. కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా నగలు తయారీ చేయించి విక్రయిస్తుంటాను. పలువురు మహిళా కస్టమర్లకు వాయిదాల పద్ధతిలో కూడా నగలు చేయించి ఇస్తున్నా. గతేడాది వరకు సంవత్సరానికి రూ.50 లక్షల మేరకు వ్యాపారం సాగుతుండేది. ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. ఈ ఏడాది రూ.25 లక్షలకు మించి వ్యాపారం జరగలేదు. ప్రస్తుతం తమ చేతులో డబ్బుల్లేవని కస్టమర్లు చెబుతున్నారు. – వి.శేషగిరిరావు, శ్రీ మహేశ్వరి జ్యూయలర్స్, ఆత్మకూరు ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు ఈ సంక్రాంతి పండుగ వ్యాపారుల పాలిట శాపంగా మారింది. లక్షల రూపాయలు అప్పులు చేసి ప్రధాన పట్టణాల నుంచి నిత్యావసర సరుకులు పెద్ద మొత్తంలో తెచ్చాం. కనీసం సాధారణ రోజుల్లో జరిగినంత వ్యాపారం కూడా జరగడం లేదు. గత ఏడాది సంక్రాంతికి పది రోజుల నుంచి పండుగ వరకు మా దుకాణంలో సుమారు రూ.25 లక్షల వరకు వ్యాపారం జరిగింది. ఈ ఏడాది జనవరి 12 వస్తున్నా కనీసం రూ.3 లక్షల వ్యాపారం జరగలేదు. ఇలాంటి పరిస్థితి గత పదేళ్లలో ఎప్పుడూ చూడలేదు. – శ్రీరాములు, జనరల్ స్టోర్ యజమాని, తిరుపతి ఇప్పుడే ఈ పరిస్థితి పెద్ద పండుగ వేళ అస్సలు వ్యాపారం లేకపోవడం ఇప్పుడే చూస్తున్నాం. ఎవరిని అడిగినా డబ్బులేదంటున్నారు. ఇంతకు ముందుకంటే ఇప్పుడు ఆఫర్లు మంచిగా ఇస్తున్నాం. కానీ ఎవ్వరూ కొనడం లేదు. కాలానికి తగ్గట్టు టీవీలు, వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లలో కొత్త కొత్త ఫీచర్లతో వస్తున్నాయి. బాగానే సేల్ అవుతాయని ఆశించాం. కానీ ఎల్రక్టానిక్స్ రంగం మొత్తం పండుగ వేళ పడిపోయింది. – బాలసుబ్రమణ్యం, ఎలక్ట్రానిక్స్ వ్యాపారి, నగరి ఇలా అయితే పండుగ చేసుకునేదెలా? నేను వ్యవసాయ పనులకు వెళ్తాను. నెలకు రూ.10 వేలు కూడా రావట్లేదు. నిత్యావసరాలకు గతంలో రూ.3 వేలయ్యేది. ప్రస్తుతం రూ.5 వేలకు పైగా ఖర్చవుతోంది. కందిపప్పు రూ.180 పైగానే ఉంది. వంట నూనె ధరలు చుక్కలనంటుతున్నాయి. ధరలు ఇలా మండిపోతుంటే పండుగలెలా చేసుకుంటాం? ఎవరైనా బంధువులు ఇంటికి వస్తే భయపడే పరిస్థితి కన్పిస్తోంది. – ద్వారపూడి సత్యారావు, సీతారాంపురం, విజయనగరం జిల్లావ్యాపారాలు తగ్గిపోయాయి ప్రస్తుతం వ్యాపారాలు 75% తగ్గిపోయాయి. చాలా ఏళ్లుగా సామర్లకోటలో వస్త్ర వ్యాపారం చేస్తున్నాను. గత సంక్రాంతి సీజన్లో రోజూ రూ.20,000 వ్యాపారం జరిగేది. ఈ సీజన్లో రూ.5,000 కూడా జరగడం లేదు. ప్రజల చేతిలో సొమ్ములు లేకపోవడం వల్ల కొనేవారు తగ్గిపోయారు. – గ్రంథి సత్యనారాయణమూర్తి, వస్త్ర వ్యాపారి, సామర్లకోట, కాకినాడ జిల్లా -
నేలకు చుక్కలు
ఒకప్పటి రోజుల్లో ఇంటి ఇల్లాలు ΄పొద్దున్నే లేవగానే చేసే పని,,, వాకిలి ఊడ్చి నీళ్లు చల్లి ముగ్గు వేయడం. వెసులుబాటును బట్టి, సందర్భాన్ని బట్టీ చిన్న ముగ్గెయ్యాలో... పెద్ద ముగ్గెయ్యాలో... చుక్కల ముగ్గు పెట్టాలో, గీతల ముగ్గు వెయ్యాలో ముందే అనుకునేవారు. ఇక సంక్రాంతి నెల వచ్చిందంటే పోటా పోటీలుగా ముగ్గులు వేసేవారు. పెద్ద ఎత్తున ముగ్గుల పోటీలు కూడా పెట్టేవాళ్లు. ముగ్గుల మీద కార్టూన్లు కూడా బాగానే పడేవి. ఇక ముగ్గులోకి దించటం, ముగ్గు΄పొయ్యటం లాంటి జాతీయాలు, ముత్యాల ముగ్గు లాంటి సినిమాల సంగతి సరేసరి. ముగ్గులు ఒకప్పుడు శుభాశుభ సంకేతాలుగా పనిచేసేవి. పూర్వం సాధువులు, సన్యాసులు, బ్రహ్మచారులు రోజూ ఇల్లిల్లూ తిరిగి భిక్ష అడిగేవారు. ఏ ఇంటి ముందైనా ముగ్గు లేదంటే ఆ ఇంటిలోకి అడుగుపెట్టేవారు కాదు. వారే కాదు యాచకులు కూడా ముగ్గు లేని ఇళ్ళకు వెళ్లేవారు కాదు! ఎందుకంటే, ఇంటి వాకిట్లో ముగ్గు లేదంటే అక్కడ అశుభం జరిగిందని గుర్తు. అందుకే మరణించినవారికి శ్రాద్ధకర్మలు చేసే రోజున ఉదయం ఇంటిముందు ముగ్గు వేయరు. ధనుర్మాసంలో ప్రతి ఇంటిముందు తెల్లవారుఝామున ఇంటిముందు అందమైన ముగ్గులు వేసి ముగ్గు మధ్యలో గొబ్బెమ్మలు, గుమ్మడి పూలు ఉంచి వాటిని బియ్యం పిండి, పసుపు, కుంకుమ, పూలతో అలంకరించి పూజించడం ఆచారం. ఎందుకంటే గొబ్బెమ్మలను పూజించడం వల్ల మంచి జరుగుతుందని విశ్వాసం.గొబ్బియల్లో... గొబ్బియల్లోముగ్గులకు ఎంత ప్రాధాన్యముందో, ముగ్గులలో పెట్టే గొబ్బిళ్లు లేదా గొబ్బెమ్మలకు కూడా అంతే ప్రాధాన్యతనిస్తారు తెలుగువాళ్లు. ఎందుకంటే గొబ్బెమ్మలు కృష్ణుడికి ఎంతో ఇష్టమైన గోపికా స్త్రీల రూపాలకి సంకేతంగా భావిస్తారు. ముగ్గుమధ్యలో పెట్టే పెద్ద గొబ్బెమ్మ గోదాదేవికి సంకేతం. ఆవు పేడని పవిత్రంగా భావిస్తారు. పేడతో చేసిన గొబ్బెమ్మలు ముగ్గుల మీద పెట్టడం సంప్రదాయంగా వస్తోంది. పెళ్లి కాని వాళ్ళు గొబ్బెమ్మలు పెడితే త్వరగా పెళ్లి అవుతుందని విశ్వాసం. గొబ్బెమ్మలు చుట్టూ తిరుగుతూ గొబ్బియెల్లో గొబ్బియెల్లో.. అని పాట పాడుతూ సందడిగా నృత్యం చేస్తారు. కృష్ణుడి మీద గోపికలకి ఉన్న భక్తి తమకు రావాలని కోరుకుంటూ గొబ్బెమ్మలు పెడతారు.గొబ్బెమ్మలు గోదాదేవితో సమానం కనుకే వాటిని కాలితో తొక్కరు. ఇంటి లోగిలి అందంగా ఉన్న ఇళ్ల మీద లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటాయని నమ్ముతారు. అలా అందంగా అలంకరించడం అనేది లక్ష్మీదేవిని తమ ఇంట్లోకి ఆహ్వానించినట్టేనని భావిస్తారు. శ్రీ కృష్ణుడి చుట్టూ గోపికలు ఎలా అయితే చేరి పాటలు పాడి సరదాగా నృత్యాలు చేస్తారో,, అలాగే గొబ్బిళ్ళ చుట్టూ కూడా చేరి పాటలు పాడుతారు.– డి.వి.ఆర్. భాస్కర్ -
వచ్చాడు బసవన్న
ఉదయం పూట చెట్ల కొమ్మలపై మంచుపూలు స్వాగతం పలుకుతుండగా సన్నాయి రాగం మధురంగా వినిపిస్తుంది. చేగంట మోగుతుండగా బసవన్న పాట వినిపిస్తుంది... ‘డూ డూ బసవన్నా ఇటురారా బసవన్నా/ఉరుకుతూ రారన్న రారన్న బసవన్నా/అమ్మవారికి దండం బెట్టు అయ్యగారికి దండం బెట్టు/రారా బసవన్నా... రారా బసవన్నా....’గంగిరెద్దులు ఊళ్లోకి అడుగు పెడితే ఊరికి సంక్రాంతి కళ సంపూర్ణంగా వచ్చినట్లే. విశేషం ఏమిటంటే... గంగిరెద్దుల ముందు పెద్దలు చిన్న పిల్లలై పోతారు. ‘దీవించు బసవన్నా’ అంటూ పిల్లలు పెద్దలై భక్తిపారవశ్యంతో మొక్కుతారు. కాలం ముందుకు వెళుతున్న కొద్దీ ఎన్నో కళలు వెనక్కి పోతూ చరిత్రలో కలిసిపోయాయి. అయితే గంగిరెద్దుల ఆట అలా కాదు. కాలంతో పాటు నిలుస్తోంది. ‘ఇది మన కాలం ఆట’ అనిపిస్తోంది...కొత్త కాలానికి... కొత్త చరణాలుకాలంతో పాటు బసవన్న పాటలోకి కొత్త చరణాలు వస్తుంటాయి. సందర్భాన్ని బట్టి ఆ పాటలో చరణాలు భాగం అవుతుంటాయి. ఒక ఊళ్లో... సంక్రాంతి సెలవులకు వచ్చిన పిల్లాడు బైక్ యాక్సిడెంట్లో చనిపోయాడు. అది ఎన్నో సంవత్సరాల చేదు జ్ఞాపకం అయినా సరే, ఊళ్లో సంక్రాంతి రోజు ప్రతి ఇల్లు పండగ కళతో కళకళలాడినట్లు ఆ ఇల్లు కనిపించదు. జ్ఞాపకాల దుఃఖభారంతో కనిపిస్తుంది. ఆ భారం నుంచి ఆ ఇంటి వాళ్లను తప్పించడానికి బసవడు ఆడుతాడు పాడుతాడు. ‘నవ్వించు బసవన్న నవ్వించు/అమ్మ వారికి దండం పెట్టి నవ్వించు/అయ్యవారికి దండం పెట్టి నవ్వించు/ వాళ్లు హాయిగా ఉండేలా దీవించు..ఆ దీవెన ఎంతో పవర్‌పుల్.పండగపూట బసవన్న ఇంటిముందుకు రాగానే బియ్యం లేదా పాత బట్టలతో రావడం ఒక విషయం అయితే... భవిష్యత్ వాణి అడగడం, ఆశీర్వాదం ఒక మరో విషయం. గంగిరెద్దులాయన సంచిలో బియ్యం పోస్తు ‘మా అబ్బాయికి ఈ సంవత్సరమన్నా ఉద్యోగం వస్తుందా బసవన్నా’ అని అడుగుతుంది ఒక అమ్మ, ‘అవును’ అన్నట్లు తల ఆడిస్తుంది. ‘మా తల్లే’ అని కంటినిండా సంతోషంతో గంగిరెద్దు కాళ్లు మొక్కుతుంది ఆ అమ్మ. గంగిరెద్దుల ఆటలో విశేషం ఏమిటంటే, తెలుగు ప్రాంతాల్లో ఒక్కో చోట ఒక్కో రకమైన ప్రత్యేతలు ఉన్నాయి. ఉదాహరణకు శ్రీకాకుళం జిల్లా మందస ప్రాంతంలో గంగిరెద్దుల వారి పాటల్లో తత్వం ధ్వనిస్తుంది. సామాజిక విశ్లేషణ ఉంటుంది. ఉదా: ‘దేవా! ఏమి జరుగుతున్నది ప్రపంచం/అహో! ఏం చిత్రంగున్నదీ ప్రపంచం/ పసుపురాత తగ్గిపోయి....΄పౌడరు రాతలెక్కువాయె’...సంక్రాంతి రోజుల్లో బసవన్నల విన్యాసాలకు ప్రత్యేకంగా రంగస్థలం అక్కర్లేదు. ఊళ్లోకి అడుగుపెడితే... అణువణువూ ఆ కళకు రంగస్థలమే. మనసంతా ఉల్లాసమే. తరతరాల నుంచి ప్రతి తరానికి దివ్యమై అనుభవమే.– బోణం గణేష్, సాక్షి, అమరావతి -
నగర వాసులు పల్లె బాట.. జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)
-
భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక బస్సులు నడుపుతున్న ఆర్టీసీ
-
సంప్రదాయాలకు ప్రతీక.. నెల్లూరు సంక్రాంతి సంబురాల్లో ఎడ్ల పందేలు (చిత్రాలు)
-
విజయవాడ పీబీ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో సంక్రాంతి సంబరాలు (ఫొటోలు)
-
Sankranti 2025: పండక కళ, పేస్ గ్లో కోసం ఇలా చేయండి!
సంబరాల సంక్రాంతి సందడి సమీపిస్తోంది. ఏడాదిలో తొలి పండుగ సంక్రాంతి అంటే చాలా హడావిడి ఉంటుంది. దేశవ్యాప్తంగా సంబరాలు ఘనంగా నిర్వహించుకుంటారు. ముఖ్యంగా తెలుగువారిలో మరింత సందడి ఉంటుంది. పిండివంటలు, షాపింగ్‌లు కాదు అందంగా కనిపించడం అమ్మాయిలకు అందరికీ ఇష్టం. కెమికల్స్‌తో నిండిన బ్యూటీ ఉత్పత్తులు కాకుండా, సహజంగా ముఖ చర్మాన్ని శుభ్రం చేసి కాంతివంతంగా మార్చడంతో పాటు కొన్ని సంరక్షణా టిప్స్ తెలుసుకుందాం.పండగ సందర్బంగా ముఖంమెరిసిపోవాలంటే.. ఇంట్లోనే దొరికే కొన్ని రకాల పదార్థాలో బ్యూటీ ప్యాక్స్‌ను తయారు చేసుకోవచ్చు. అలాగే ప్యాక్‌కు ముందు ముఖారికి ఆవిరి పట్టడం వలన మృత కణాలు తొలిగి, చర్మ రంధ్రాలు ఓపెన్ అవుతాయి. దీంతో మనం వేసుకున్న ప్యాక్ పోషకాలు అంది ముఖం మరింత అందంగా, షైనీగా ఉంటుంది.పొటాటో ప్యాక్ఒక చిన్న బంగాళదుంప (Potato) తీసుకుని శుభ్రంగా కడిగి తొక్క తీసి, చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఈ ముక్కలను మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి ,పల్చటి క్లాత్‌తో వడకట్టి రసం తీసుకోవాలి. ఈ రసంలో రెండు టేబుల్ స్పూన్లు బియ్యం పిండి(Rice Flour) కొద్ది పెరుగు,(Curd) కొద్దిగా బాదం ఆయిల్ వేసిన అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి కొంచెం మందంగా అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరనిచ్చి చల్లని నీటితో కడిగేసుకోవాలి. దీంతో నల్లమచ్చలు తొలిగి ఫేస్ అందంగా కనిపిస్తుంది.శనగ పిండి ప్యాక్రెండు స్పూన్ల శనగపిండి, కొద్దిగా పసుపు, రోజ్ వాటర్, పాల మీగడ, తేనె కలిపి మిశ్రమాన్ని సిద్ధం చేసుకోవాలి. ముందుగా ముఖాన్ని శుభ్రం చేసుకొని ఆవిరిపట్టి చల్లని నీళ్లతో కడుక్కోవాలి. ఆ తర్వాత ఈ ప్యాక్ అప్లై చేయాలి. ఆరిన తరువాత మృదువుగా పిండిని తొలగిస్తూ, శుభ్రంగా కడుక్కోవాలి. ఇన్స్టంట్ గ్లో వస్తుంది. అలాగే వారానికి రెండు, మూడు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. దీన్ని తలస్నానం చేసేముందు నలుగు పెట్టుకుంటే ముఖంతో పాటు చర్మానికి కూడా రాస్తే చాలా మంచిది. (కాల్షియం ఎక్కువగా ఎందులో ఉంటుంది రాగులా? పాలా?)కాఫీ పౌడర్కాఫీ పౌడర్, కొద్దిగా చక్కెర, నిమ్మరసం వేసి ముఖానికి అప్లయ్ చేయాలి. ఆరిన తరువాత శుభ్రంగా కడిగేసుకోవాలి. దీన్ని చేతులు, ముంచేతులు, మెడమీద కూడా రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఆవిరి పట్టడం: వేడినీళ్లలో కాసిన్ని పుదీనా ఆకులు, తులసి, వేపాకులు, పసుపు వేసి ముఖమంతా చెమటలు పట్టేదాకా ఆవిరి పడితే చర్మం బాగా శుభ్రపడుతుంది. చర్మం రంధ్రాలు ఓపెన్ అవుతాయి. ఇదీ చదవండి: మాయదారి గుండెపోటు : చిన్నారి ‘గుండెల్ని’ పిండేస్తున్న వీడియోదోసకాయ నీటితో ఆవిరిదోసకాయ ముక్కలను మరుగుతున్న నీటిలో వేయాలి. నీరు బాగా మరిగిన తరువాత ఈ నీటిలో కొన్ని చుక్కల లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ వేయాలి. ఇందులో ఒక గ్రీన్ టీ బ్యాగ్ కూడా వేయచ్చు. దీని నుండి వచ్చే ఆవిరి పట్టడం వల్ల ముఖ చర్మం మెరుస్తుంది. నూనె, దుమ్ము, ధూళి కారణంగా మూసుకుపోయిన ముఖ చర్మ రంధ్రాలు క్లియర్ అవుతాయి.నిమ్మకాయమరుగుతున్న నీటిలో కొద్దిగా నిమ్మరసం, గ్రీన్ టీ బ్యాగ్ లేదా టీ ఆకులు వేయాలి. నీటిని దించాక దీంట్లో కొన్ని చుక్కల పిప్పరమెంట్ ఎసెన్షియల్ ఆయిల్ వేయాలి. ఈ ఆవిరిని ముఖానికి పట్టడం వల్ల ముఖ చర్మం మెరుస్తుంది. చర్మం మీద ఉన్న మృత కణాలు, మురికి క్లీన్ అవుతాయి.మాయిశ్చరైజర్‌గా బాదం నూనెచలికాలం చర్మం పొడిబారడం సహజంగా జరుగుతుంటుంది కాబట్టి నూనె శాతం ఎక్కువ ఉన్న మాయిశ్చరైజర్లు వాడాలి.∙బాదం నూనె, అలొవెరా జెల్ సమపాళ్లలో తీసుకొని అందులో కొద్దిగా వెనిలా ఎసెన్స్ కలపాలి. ఈ మిశ్రమాన్ని చలికాలం మాయిశ్చరైజర్‌గా ఉపయోగించవచ్చు. స్నానానికి ముందు టీ స్పూన్ బాదం నూనె, అర టీ స్పూన్ తేనె కలిపి ముఖానికి, చేతులకు రాసి, మసాజ్ చేయాలి. పొడిబారే చర్మం మృదువుగా తయారవుతుంది. టీ స్పూన్ బాదాం నూనెలో అర టీ స్పూన్ పంచదార కలిపి ముఖానికి రాసి మృదువుగా మర్దన చేయాలి. తర్వాత పెసరపిండిలో కొద్దిగా నీళ్లు కలిపి పేస్ట్ చేసి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. వారానికి రెండు సార్లు ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మం పొడిబారదు. -
విశాఖపట్నంలో ముందస్తు సంక్రాంతి వేడుకలు (ఫొటోలు)
-
అప్పాల తయారీ అదుర్స్!
సాక్షి, పెద్దపల్లి: సంక్రాంతి పండుగ అనగానే పిండి వంటలు గుర్తుకొస్తాయి.. కానీ అప్పాలు అంటే సుల్తానాపూర్ గ్రామం గుర్తుకొస్తుంది. ఆ ఊరే అప్పాలకు కేరాఫ్ అడ్రస్. ఆ గ్రామస్తుల క్వాలిటీయే వారి బ్రాండ్. చూస్తేనే నోరూరించే పిండి వంటలు. ఒక్కఫోన్ చేస్తే చాలు.. ఎంచక్కా పిండివంటలు మన ఇంటికి వచ్చేస్తాయి. శుభకార్యాలకు కావాల్సిన సారెలో అందించే అన్నిరకాల పిండివంటలను తయారుచేసి తెలుగు రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర, ఇతర దేశాలకూ సరఫరా చేస్తూ స్వయం ఉపాధి పొందుతూ.. మరికొంతమందికి ఉపాధి ఇస్తూ లాభాల బాటలో పయనిస్తున్నారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుల్తానాపూర్ గ్రామానికి చెందిన మహిళలు.మాకు చేసివ్వరా... పదిహేడేళ్ల క్రితం సుల్తానాపూర్ గ్రామానికి చెందిన లక్ష్మి లీడర్‌గా పదిమంది సభ్యులతో ఒక గ్రూప్‌గా ఏర్పడ్డారు. ఇంటివద్దే ఉంటూ చిన్న మొత్తాలతో ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నారు. పలురకాలుగా ఆలోచిస్తున్న సమయంలో గ్రూప్‌లోని ఒక సభ్యురాలి ఇంట్లో వివాహ వేడుకకు పెద్దమొత్తంలో అప్పాలు తయారు చేయాల్సి వచి్చంది. దీంతో తమ గ్రూప్ సభ్యుల సహకారంతో ఆ పెళ్లికి కావాల్సిన సారెను అందరూ కలిసి సరదాగా సిద్ధం చేశారు. దీంతో ఆ వేడుకకు వచి్చన బంధువులు ‘మా బిడ్డ సీమంతం ఉంది కొంచెం చేసి పెడతారా? మా కొడుకు, కోడలు అమెరికా వెళుతున్నారు.. అప్పాలు చేసి పెడతారా’అని అడగటంతో వారికి వీరు సైతం చేసిచ్చారు. అయితే ఊళ్లో ఉన్న మనకే సారె తయారు చేయడానికి ఇతరుల సహాయంతో చేయాల్సిన పరిస్థితి నెలకొందని, సిటీలో ఉన్నవారి పరిస్థితి ఏమిటి? వారు అప్పాలు పెద్దమొత్తంలో ఎలా తయారు చేసుకుంటారు? అనే ఆలోచన లక్ష్మికి తట్టింది. దీన్నే ఉపాధిగా ఎందుకు మార్చుకోకూడదని గ్రూప్ సభ్యులకు తెలిపింది. తెలిసిన పని, తక్కువ పెట్టుబడితో కూడినది కావటంతో అందరూ సరేనన్నారు. దీంతో అప్పాలు చేయడం ఉపాధిగా మలుచుకొని లక్షణంగా లక్షలు సంపాదిస్తున్నారు. 8 గ్రూప్‌లు.. 400 మంది వర్కర్లుగ్రూప్నకు ఎటువంటి పేరు, బ్రాండ్ లేకపోయినా, క్వాలిటీతో మొదట తమ గ్రూప్ సభ్యులు, వారి బంధువులు, స్నేహితులకు ఆర్డర్లపై అప్పాలు తయారు చేసి ఇచ్చేవారు. అలా నోటిమాటతో క్వాలిటీ నచ్చి ఆర్డర్లు పెరుగుతూపోయాయి. దాదాపు ఏడాదికి రూ.50 లక్షల పైనే ఆర్డర్లు వస్తుండటంతో అప్పాలు కాల్చడానికి, పిండి పిసకడానికి, సకినాలు చుట్టడానికి, ఇతరత్రా పనులకు రోజువారి వర్కర్ల సాయం తీసుకుంటూ వారికి కూడా ఉపాధి కల్పింపిస్తున్నారు. వీరిని చూసి గ్రామంలో మరో 8 సంఘాలు ఏర్పడ్డాయి. ఒక్కో గ్రూప్‌లో పదిమంది సభ్యులతోపాటు, వారికి సాయం పనికి వచ్చే 50మంది వర్కర్లతో పాటు, పిండిగిరి్న, ట్రాలీ, కట్టెలు కొట్టేవారు తదితరులతో కలిసి దాదాపు 400 మందికిపైగా ఆ గ్రామంలో అప్పాలతో ఉపాధి పొందుతున్నారు.బాహుబలి అప్పాలు.. 32 వరుసలతో చక్రాల్లా సకినాలు, కిలో పరిమాణంలో లడ్డూ, గరిజ, బెల్లం అరిసెలు, నువ్వుల లడ్డూ, మురుకులు, చెగోడీలు, గవ్వలు, ఖారా, ఇతరత్రా వంటకాలను పెద్దఎత్తున తయారు చేయడం వీరి ప్రత్యేకత.ఆర్డర్‌పై విదేశాలకు మా గ్రామంలో 17 ఏళ్లుగా ఆర్డర్‌పై అప్పాలను తయారు చేస్తూ ఎగుమతి చేస్తున్నాం. అమెరికా, ఆ్రస్టేలియా, ఇంగ్లండ్ వంటి దేశాలు, తెలుగు రాష్ట్రాలతోపాటు మహారాష్ట్రకు సైతం పంపిస్తున్నాం. ఏడాదిలో రూ.50లక్షలపైగా ఆర్డర్లు వస్తాయి. తయారు చేసి వారు కోరుకున్న సమయానికి అందజేస్తాం. – తానిపత్తి లక్ష్మీదేవి, గ్రూప్ లీడర్కలిసి పనిచేస్తాం మా బంధువులం అందరం కలిసి అప్పాలను తయారు చేస్తాం. ప్రతీ ఒక్కరికి రోజుకు రూ.500 నుంచి రూ.600 వరకు గిట్టుబాటు అవుతుంది. ఆర్డర్లు ఎక్కువ వస్తే ఇతర గ్రూప్‌లతో పంచుకుంటాం. అందరం కలిసి పనిచేసుకుంటూ పిల్లలను మంచిగా సెటిల్ చేశాం. – అలివేణి, సుల్తానాపూర్ ఆర్డర్లపై తయారీ మా గ్రూప్ ద్వారా ఆర్డర్లపై సుమారు 11 ఏళ్లుగా అప్పాలను తయారు చేస్తూ విజయవాడ, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ నగరాలతోపాటు లండన్, అమెరికాకు పంపిస్తున్నాం. మా గ్రూపు సభ్యులకు ఉపాధి కల్పించటంతోపాటు ఇతరులకు సైతం ఉపాధి కల్పిస్తున్నందుకు సంతోషంగా ఉంది. – మాధవి, శ్రీరామ గ్రూప్ నిర్వాహకురాలు -
సంక్రాంతి రద్దీ.. ప్రయాణికులకు చుక్కలే!
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి రద్దీ మొదలైంది. విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో నగర వాసులు సొంత ఊళ్లకు తరలివెళ్తున్నారు. నగరం నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే అన్ని రెగ్యులర్ రైళ్లలో రిజర్వేషన్లు పూర్తిగా నిలిచిపోయి రిగ్రేట్ దశకు చేరాయి. కొత్తగా అందుబాటులోకి వచ్చిన చర్లపల్లి టెర్మినల్ నుంచి కాకినాడ, తిరుపతి, విశాఖ, విజయవాడ తదితర ప్రాంతాలకు కొన్ని ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. లక్షలాది మంది నగరవాసులు సొంత ఊళ్లకు తరలి వెళ్తుండగా.. అరకొరగా ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్లు ఏ మాత్రం ప్రయాణికుల డిమాండ్లను భర్తీ చేయడం లేదు. మరోవైపు అన్ని ప్రత్యేక రైళ్లు గంటల తరబడి ఆలస్యంగా నడుస్తూ ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి. దీంతో ప్రయాణికులు అతికష్టంగా బెర్తులు సంపాదించి రైలెక్కినా గంటల తరబడి పట్టాలపైనే పడిగాపులు కాయాల్సి వస్తోంది. సికింద్రాబాద్ నుంచి సాయంత్రం 6 గంటలకు బయలుదేరితే మరుసటి రోజు మధ్యాహ్నం 12 దాటినా విశాఖకు చేరుకోలేకపోయామని కూకట్‌పల్లికి చెందిన కృష్ణారావు విస్మయం వ్యక్తం చేశారు. మరోవైపు నాంపల్లి, కాచిగూడ స్టేషన్ల నుంచి శబరిమలకు నడిచే రైళ్లు కూడా అయ్యప్ప భక్తులకు నరకం చూపుతున్నాయి. రెండు రోజులు గడిచినా హైదరాబాద్ నుంచి శబరిమలకు, తిరిగి అక్కడి నుంచి ఇక్కడికి చేరుకోలేకపోతున్నట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చార్జీలు కూడా ‘ప్రత్యేకమే’.. ⇒నగరం నుంచి ప్రతి రోజు సుమారు వందకు పైగా రెగ్యులర్ రైళ్లు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తాయి. సుమారు 2.5 లక్షల మంది ప్రయాణం చేస్తారు. ప్రస్తుతం రోజుకు మరో 50 వేల మంది అదనంగా బయలుదేరే అవకాశం ఉంది. ఈ డిమాండ్ మేరకు అదనపు రైళ్లు లేవు. కొన్ని రైళ్లలో బెర్తులు, అదనపు బోగీలు ఏర్పాటు చేశారు. డిమాండ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు మాత్రం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. కానీ ఈ రైళ్లలో చార్జీలు కూడా ఎక్కువే. సాధారణ చార్జీలపై 25 శాతం వరకు అదనపు చార్జీలు విధిస్తారు. అయినప్పటికీ మరో గత్యంతరం లేక ప్రత్యేక రైళ్లను ఆశ్రయించే ప్రయాణికులకు రైళ్లలో పడిగాపులు తప్పడం లేదు. ⇒ ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పట్టాలపై రైళ్ల ఒత్తిడి పెరిగిందని, దీంతో సకాలంలో సిగ్నల్స్ లభించకపోవడం వల్ల జాప్యం చోటుచేసుకుంటోందని అధికారులు చెబుతున్నారు. కానీ ఈ ఆలస్యం ప్రయాణికుల పండగ సంతోషాన్ని ఆవిరి చేస్తోంది. కనిష్టంగా 3 నుంచి గరిష్టంగా 12 గంటల వరకు కొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. గతంలో ఇలాంటి ఫిర్యాదులు పెద్ద ఎత్తున వెల్లువెత్తినప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. సంక్రాంతి సందర్భంగా బయలుదేరిన ప్రయాణికులు భోగి పండగ రోజు కూడా సొంత ఊళ్లకు చేరుకోలేకపోయారు. ప్రస్తుతం మరోసారి అదే పరిస్థితి నెలకొందని పేర్కొంటున్నారు. ఆర్టీసీ సైతం అదే బాటలో.. ఆర్టీసీ సైతం ప్రత్యేక బస్సుల పేరిట 50 శాతం అదనపు దోపిడీకి దిగింది. ఏపీతో పాటు, తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో కూడా 25 శాతం నుంచి 50 శాతం వరకు అదనపు వసూళ్లకు పాల్పడుతోంది. చివరకు దివ్యాంగుల పాస్‌లను అనుమతించకుండా ఇష్టారాజ్యంగా చార్జీలు విధిస్తున్నారని ప్రయాణికులు చెబుతున్నారు. సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకొని సుమారు 6 వేలకు పైగా అదనపు బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. రెండు రోజులుగా ప్రయాణికుల రద్దీ పెరిగింది. ఎల్బీనగర్, ఉప్పల్, హయత్‌నగర్, ఎంజీబీఎస్, జేబీఎస్ తదితర ప్రాంగణాలుప్రయాణికులతో సందడిగా మారాయి.ప్రైవేట్ బస్సుల దోపిడీ.. సంక్రాంతి రద్దీని సొమ్ము చేసుకొనేందుకు ప్రైవేట్ ట్రావెల్స్ అడ్డగోలుగా దారి దోపిడీకి పాల్పడుతున్నాయి. సాధారణ రోజుల్లో హైదరాబాద్ నుంచి విశాఖకు లగ్జరీ రూ.1800 వరకు ఉంటుంది. ఇప్పుడు ఆ చార్జీ రూ.3000 వరకు చేరింది. అలాగే ఏసీ బస్సుల్లో రూ.2500 నుంచి ఏకంగా రూ.5000 వరకు పెరిగినట్లు ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంటిల్లిపాదీ కలిసి వెళితే చార్జీల కోసమే రూ.వేలల్లో ఖర్చు చేయాల్సి వస్తోందని ఏఎస్రావు నగర్‌కు చెందిన మల్లికార్జున్‌రావు చెప్పారు. అలాగే.. హైదరాబాద్ నుంచి కాకినాడ, విజయవాడ, తిరుపతి తదితర ప్రాంతాలకు సైతం ప్రైవేట్ బస్సుల దోపిడీ విమాన చార్జీలను తలపిస్తోంది.సాక్షి ఎఫెక్ట్.. బస్సులు సీజ్‌అధిక ఛార్జీలు వసూళ్లు చేస్తున్నప్రైవేట్ వాహనాల దందాపై సాక్షి వరుస కథనాలు ఇచ్చింది. దీంతో అధికారులు రంగంలోకి దిగారు. ఎల్బీనగర్ లో ప్రైవేట్ వాహనాలపై ఆర్టిఏ అధికారుల కొరడా జులిపించారు. సంక్రాంతికి అధిక బస్సు చార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేట్ వాహనాలపై ఆర్టిఏ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలోని టీం అడ్డుకుంది. దాదాపు 20 బస్సులపై కేసు నమోదు చేశారు. ఇక.. పెద్ద అంబర్ పేట్ వద్ద నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 10 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను ఆర్టీఏ అధికారుల సీజ్ చేశారు. మరోవైపు.. రాజేంద్రనగర్ ఆరాంఘడ్ చౌరస్తా వద్ద రంగారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారుల ఈ ఉదయం 4 గంటల నుంచే తనిఖీ చేపట్టారు. చెన్నై, తిరువంతపురం, పాండిచ్చేరి, మంగళూరు, మైసూరు, కన్యాకుమారి నుండి హైదరాబాద్ వస్తున్న బస్సులను తనిఖీలు చేస్తున్నారు . ఈ క్రమంలో నిబంధనలకు తూట్లు పొడుస్తున్నట్రావెల్స్‌పై కేసులు నమోదు చేస్తున్నారు. 11 బస్సుల పై కేసు నమోదు అయినట్లు సమాచారం. -
పల్లెకు పోదాం చలో చలో (ఫొటోలు)
-
ఆర్టీసీ కంటే నాలుగు రెట్లు అధిక ధర
-
బాబోయ్ సంక్రాంతి.. బస్ టికెట్ ధర రూ.5 వేలకు పైమాటే
సాక్షి, హైదరాబాద్ : సంక్రాతికి పండుగ కోసం పట్నం నుంచి పల్లెబాట పట్టిన ప్రయాణికులకు ప్రైవేట్ ట్రావెల్స్ ఝలక్ ఇస్తున్నాయి. ప్రయాణికుల జేబుకు చిల్లు పెడుతున్నాయి. నిబంధనలకు విరుద్దంగా టికెట్ ధరల్ని అమాంతం పెంచి సొమ్ము చేసుకుంటున్నాయి. ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు ఇష్టారీతిన టికెట్ ఛార్జీలు పెంచినా రవాణా శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారుని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.పండుగ వేళ ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు ఆర్టీసీ బస్సుల కంటే రెండు నుంచి మూడుంతలు అదనంగా వసూలు చేస్తున్నాయి. దీంతో అడ్డగోలుగా పెంచిన ఛార్జీలతో హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే ప్రయాణికులు ఒక్కో కుటుంబం రూ.15 వేల నుంచి 20,000 చెల్లించాల్సి వస్తుంది. ఏపీలోని విజయవాడ, గుంటూరు తిరుపతి, పాలకొల్లు, విశాఖపట్నం, భీమవరం, నర్సాపురం, రాజమండ్రి వెళ్లేందుకు ఒక్కో టికెట్‌పై రెండు నుంచి మూడు వేలు పెరగడంపై ప్రయాణికులు లబోదిబోమంటున్నారు.గతంలో రూ.1000 రూపాయలు, రూ.1200 ఉన్న టికెట్ తాజాగా రూ.3000 పైమాటే ఉంది. భీమవరం వెళ్లే ప్రయాణికుల నుంచి రూ. 3000 నుంచి రూ.4000, రాజమండ్రికి రూ. 3500 నుంచి రూ.4000 చెల్లించాల్సి వస్తుంది. ఇందేంటని ప్రశ్నిస్తే.. పండగ వేళ అంతే ఉంటాయి అని ప్రైవేట్ ట్రావెల్స్ బుకాయింపుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
Sankranti 2025 : భోగి ‘మంట నూనెలు’ పిండి వంటలు ఎలా?
సాక్షి, హైదరాబాద్: వంటనూనెల ధరలు భగ్గుమంటున్నాయి. ఎంతకూ తగ్గమంటున్నాయి. సంక్రాంతి పండుగ వేళ సామాన్యులకు దడ పుట్టిస్తున్నాయి. పిండివంటల నూనెలు మండిపోతున్నాయి. ఇక రోజూ వంటల్లో సరిపడా నూనె వాడేందుకే ఒకటికి, రెండుసార్లు ఆలోచించే పరిస్థితి వచ్చేసింది. హైదరాబాద్ నగరంలో రోజుకు వందల టన్నుల వంటనూనెల అమ్మకాలు జరుగుతున్నాయి. గృహ అవసరాలకే కాకుండా హోటల్స్, క్లబ్బులు, బార్లలో అత్యధికంగా వివిధరకాల వంట నూనెలు భారీగా వినియోగిస్తుంటారు. సంక్రాంతి పండుగ రావడంతో నగరంలో వంట నూనెల డిమాండ్ మూడింతలు ఎక్కువైంది. దీంతో నూనె ధరలు ఆమాంతం పెరిగాయి. హోల్‌సెల్ మార్కెట్ అన్ని రకాల నూనెలపై ధర రూ.5 నుంచి రూ.8 పెరిగింది. రిటైల్, బహిరంగ మార్కెట్లో ప్రతి లీటరు నూనెపై రూ.12 నుంచి రూ.15 పెరిగింది. అన్ని రకాల నూనెల ధరలు భగ్గుమంటున్నాయి పామాయిల్, రిఫైన్డ్ ఆయిల్, వేరుశనగ, రైస్‌బ్రాన్.. ఇలా అన్ని రకాల నూనెల ధరలు భారీగా పెరిగాయి. వంట నూనెలకు సంబంధించి హోల్‌సేల్ ధరలు, రిటైల్ మార్కెట్ ధరల మధ్య వ్యత్యాసం రూ.10 నుంచి రూ.20 వరకు ఉంది. హోల్‌సేల్ మార్కెట్లో పామాయిల్ కిలో ధర రూ.100 నుంచి రూ.105కు చేరింది. రిటైల్ మార్కెట్లో రూ.115కు చేరింది. సన్‌ఫ్లవర్ ఆయిల్ హోల్‌సేల్ మార్కెట్లో కిలో రూ.130 నుంచి రూ.140 మధ్య ఉండగా, ప్రస్తుతం రూ.145–150 పలుకుతోంది. కిలో వేరుశనగ నూనె ధర నెల క్రితం రూ.150 ఉండగా, ఇప్పుడు రూ.165కు పెరిగింది. వీటితోపాటు రైస్‌బ్రాన్ ఆయిల్ ధర రూ.140 నుంచి రూ.150 ఉండగా, ప్రస్తుతం రూ.160 పలుకుతోంది. ఈ స్థాయిలో వంటనూనెల ధరల మంటకు కారణం నూనెలపై దిగుమతి సుంకం పెరగడమేనని వ్యాపారులు అంటున్నారు. రాష్ట్రానికి దిగుమతయ్యే ముడి ఆయిల్‌పై సుంకాన్ని 5–10 శాతం నుంచి ఏకంగా 45 శాతానికి ప్రభుత్వం పెంచిందని, అందుకే ధరలు మండిపోతున్నాయని పేర్కొన్నారు. వంటనూనెల ధరలు మున్ముందు మరింతగా పెరిగే అవకాశాలున్నాయని చెబుతున్నారు. వంటనూనెలపై దిగుమతి సుంకం పెరగడం కొందరు వ్యాపారులకు వరంగా మారింది. పాత స్టాక్‌ను గోడౌన్లలో దాచేసి ధరలు పెంచి అమ్ముతున్నారు.ఇదీ చదవండి: వింటర్ కేర్ : పాదాల పగుళ్లకు స్ప్రే -
పండగొచ్చింది.. పల్లెబాట పట్టిన పట్నంవాసులు (ఫొటోలు)
-
పండగ కళ ఉట్టిపడేలా థీమ్ ఆర్ట్‌తో వెలిగిపోండి..!
గ్రాండ్‌గా వెలిగిపోయే వివాహ వేడుకైనా హుందాగా కదిలే సీమంతం ఫంక్షన్ అయినా ఆధునికంగా ఆలోచించే అమ్మాయిలు ఒకచోట చేరినా ఆ సందర్భంలో తమదైన ప్రత్యేకతను చూపాలనుకుంటారు. అందులో మరింత స్పెషల్‌గా నిలుస్తుంది ఫ్యాబ్రిక్ పెయింటింగ్(Fabric Painting) ఫ్యాషన్ రంగంలో(Fashion) హ్యాండ్ వర్క్(Hand Work) ఎప్పుడూ అగ్రస్థానంలో ఉంటుంది. అవే ప్రతియేటా రూపును మార్చుకొని కొత్తగా మన మదిని ఆకట్టుకుంటాయి. వాటిలో ఫ్యాబ్రిక్ పెయింటింగ్‌లు ఈ ఏడాది స్పెషల్‌గా సందడి చేయనున్నాయి. పండగ థీమ్మనవైన పండగల వేళ సంప్రదాయం ఉట్టిపడాలంటే అందుకు తగినట్టు వేషధారణలోనూ ఆ కళ కనిపించాలని కోరుకుంటున్నారు. పండగలో ప్రత్యేకంగా నిలిచే అమ్మవార్ల రూపాలు, పాదాలు, ఆభరణాలు, ముగ్గులు పెయింటింగ్ చేయించడం వీటి ప్రత్యేకత. వీటిలో సాదాసీదాగా కనిపించే పెయింటింగ్స్ కొన్ని అయితే పెయింటింగ్ కాంబినేషన్‌తో చేసే ఎంబ్రాయిడరీ, మగ్గం వర్క్, ప్యాచ్‌వర్క్‌లు అదనంగా జత కలుస్తున్నాయి.దంపతులకు ప్రత్యేకంవివాహ వేడుకలతో వధూవరుల దుస్తుల డిజైన్లు రిచ్‌గా కనిపించాలని కోరుకోని వారుండరు. దానితో పాటు తమ పెళ్లి ప్రత్యేకం అని చూపడానికి ఐదు రోజుల పెళ్లిలో ఏదో ఒకరోజు వధూవరుల రూపాలను పెయింటింగ్‌గా చిత్రించి, వాటిని ధరించడానికి ముచ్చట పడుతున్నారు. వీటిలో వారి వారి బడ్జెట్లను బట్టి ఎంపికలు ఉంటున్నాయి. సీమంతం వేడుకరాబోయే బిడ్డకు ఆహ్వానం పలకడానికి, తల్లీ–బిడ్డ క్షేమం కోసం చేసే ఈ వేడుకను... పెయింట్ చేసిన శారీస్, లెహంగాలతో ఎంతో సుందరంగా మార్చేస్తున్నారు. యశోదాకృష్ణ, గోపికా కృష్ణ, చిన్నారి ΄ాదాలు, కామధేను వంటి డిజైన్లు దుస్తులను అద్భుతంగా మార్చేస్తున్నాయి. తల్లిదండ్రులు–పిల్లల కాంబినేషన్ పెయింటింగ్స్ కూడా ఈ థీమ్‌లో చోటుచేసుకుంటున్నాయి.మోడరన్ మగువడెనిమ్స్, షర్ట్స్‌తో క్యాజువల్ వేర్‌గానూ, ఫ్రెండ్లీ గెట్ టు గెదర్ పార్టీల్లోనూ ప్రత్యేకంగా నిలవడానికి తమదైన థీమ్‌తో డిజైన్ చేయించుకుంటున్నారు. తమలోని ఆధునిక భావాలను డ్రెస్సింగ్ ద్వారా చూపుతున్నారు. దీనిలో భాగంగా పెయింటింగ్ చేసిన ఫ్యాబ్రిక్ ΄్యాచ్వర్క్ ఈ తరాన్ని బాగా ఆకట్టుకుంటోంది. -
కడప : యోగి వేమన విశ్వవిద్యాలయంలో సంక్రాంతి సంబరాలు (ఫొటోలు)
-
ఓ ఊరికథ.. సంక్రాంతి అంటే బెదరు!
సంక్రాంతి పండగ అంటే పల్లెల్లో ఎంతో సందడి ఉంటుంది. జనవరి నెల మొదలు కాగానే అన్ని గ్రామాల్లో ఈ పండుగ వాతావరణం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ప్రతి రోజూ ఇంటి ముందు ముగ్గులు వేయడం, హరిదాసుల సంకీర్తనలు, అందరూ కలసి ఒక చోట చేరి ఆడిపాడి సందడి చేయడం, ముగ్గుల పోటీలు నిర్వహించడం, వివిధ క్రీడా పోటీలు లాంటి కార్యక్రమాలు ఎంతో సందడిగా జరుగుతుంటాయి. అయితే ఇందుకు భిన్నంగా కొన్ని శతాబ్దాలుగా సంక్రాంతి పండుగకు ఓ గ్రామంలో సగానికి పైగా ప్రజలు దూరంగా ఉంటున్నారు. ఇందుకు గల కారణాలు... విశేషాలు తెలుసుకోవాలంటే అనంతపురం జిల్లా పి.కొత్తపల్లి గ్రామాన్ని సందర్శించి తీరాల్సిందే. – ఆత్మకూరు: అనంతపురం జిల్లా ఆత్మకూరు నుంచి కళ్యాణదుర్గం వెళ్లే మార్గంలో ఐదు కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే జాతీయ రహదారికి ఓ కిలోమీటరు దూరంలో పి.కొత్తపల్లి గ్రామం వస్తుంది. ఈ గ్రామంలో కమ్మ, బోయ, ఎస్సీ కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. దాదాపు 300 గడపలున్న ఈ గ్రామ ప్రజల ప్రధాన జీవనాధారం వ్యవసాయం. వరి, చీనీ, వేరుశనగ, టమాట పంటల సాగుతో జీవనం సాగిస్తున్నారు. గ్రామం చుట్టూ ఎటు చూసినా పచ్చని పంట పొలాలు కనువిందు చేస్తుంటాయి. సమైక్య జీవనానికి, స్వశక్తికి, సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిరూపాలుగా ఈ గ్రామస్తులు నిలుస్తున్నారు.అనాదిగా వస్తున్న ఆచారాన్ని గౌరవిస్తూ..సంక్రాంతి పండుగ విషయంలో బోదపాటి వారి భయాందోళనకు కారణమూ లేకపోలేదు. ఇందుకు సంబంధించి ఓ పురాతన కథను నేటికీ పూర్వీకులు చెబుతున్నారు. శతాబ్దాల క్రితం సంక్రాంతి సరుకుల కొనుగోలు కోసమని గ్రామానికి చెందిన బోదపాటి కుటుంబానికి సంబంధించిన వ్యక్తి ఆత్మకూరు సంతకు వచ్చారు. ఆ సమయంలో ఉన్నఫళంగా ఆయన కుప్పకూలి మృతి చెందాడు. ఇదేదో సాధారణ మృతిగానే అందరూ అప్పట్లో భావించారు. అయితే ఆ మరుసటి సంవత్సరం సంక్రాంతి పండుగ సరుకులు కొనుగోలు చేసేందుకు వచ్చిన బోదపాటి కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఇలా వరుసగా ఏటా సంక్రాంతి పండుగ చేయాలనే ఉద్దేశంతో సరుకులు కొనుగోలు చేసేందుకు వచ్చిన బోదపాటి కుటుంబంలోని ఎవరో ఒకరు మృత్యువాత పడుతుండడంతో ఒక్కసారిగా వారిలో ఆందోళన మొదలైంది. దీంతో సంక్రాంతి పండుగ జరుపుకోకూడదని బోదపాటి కుటుంబీకులు నిర్ణయించుకున్నారు. నాటి నుంచి నేటి వరకూ సంక్రాంతి పండుగకు బోదపాటి కుటుంబీకులు దూరంగా ఉంటూ వస్తున్నారు.సంక్రాంతి అంటే బెదరుహిందూ సంప్రదాయంలో వచ్చే ప్రతి పండుగనూ పి.కొత్తపల్లి వాసులు ఎంతో సంబరంగా జరుపుకుంటారు. అయితే సంక్రాంతి అంటే చాలు ఈ గ్రామంలో సగానికి పైగా జనాభా ఉన్న కమ్మ సామాజిక వర్గంలోని బోదపాటి వారు బెదిరిపోతుంటారు. సంక్రాంతి సందర్భంగా ప్రతి ఇంటి ముంగిట కనిపించే రంగవల్లులు వీరి ఇళ్ల ముందు కనిపించవు. గొబ్బెమ్మలు ఉండవు. పిండి వంటలు, నూతన వస్త్రాలకు దూరంగా ఉంటారు. ఇక గ్రామంలో జరిగే సంక్రాంతి సంబరాలకు సైతం బోదపాటి వారు దూరంగా ఉంటారు. రైతు కుటుంబంలో సాధారణంగా భోగి నాడు కనిపించే సందడి ఊసే ఉండదు. పశువులకు, పొలాల్లో నవధాన్యాలకు, ఇంట్లో పూజలు చేయరు. ఒక్క మాటలో చెప్పాలంటే సంక్రాంతి పండుగ నాడు కనీసం స్నానం చేయాలన్నా వీరు భయపడుతుంటారు.నేను పుట్టినప్పటి నుంచి చూడలేదుప్రస్తుతం నాకు 45 సంవత్సరాలు. నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకూ బోదపాటి వారు సంక్రాంతి పండుగను జరుపుకున్నది చూడలేదు. మా తాతల కాలం నుంచి కూడా ఇదే పద్ధతి కొనసాగుతూ వస్తోంది. ఒకవేళ బోదపాటి కుటుంబీకులు ఎవరైనా ధైర్యం చేసి పండుగ చేసేందుకు సిద్ధమైతే ఏదో ఒక ప్రమాదం బారిన పడుతున్నారు. దీంతో సంక్రాంతి నాడు ఇంట్లో పూజలు కూడా చేయం.– గోపాల్, పి,కొత్తపల్లి, ఆత్మకూరు మండలంపెద్దల ఆచారాలు గౌరవిస్తున్నాంసంక్రాంతి పండుగ అంటే మా పల్లెల్లో అందరూ ఎంతో ఆనందంగా గడుపుతారు. కొత్త అల్లుళ్ల రాకతో ప్రతి ఇంట్లోనూ సందడిగా ఉంటుంది. కానీ, బోదపాటి వంశానికి చెందిన దాదాపు వంద కుటుంబాల వారు సంక్రాంతి పండుగ చేసుకోం. పెద్దల ఆచారాలు గౌరవిస్తూ ఇళ్ల ముందు ముగ్గులు వేయడం, ఇల్లు, వాకిలి శుభ్రం చేయడం ఇతర ఆచారాలు ఏవీ చేయం.– రమాదేవి, పి,కొత్తపల్లి, ఆత్మకూరు మండలంస్నానం కూడా చేయంసంక్రాంతి అంటే అందరూ ఆనందంగా జరుపుకుంటారు. కానీ మా బోదపాటి వారు స్నానాలు కూడా చేయరు. పండుగ చేసుకుంటే ఏం జరుగుతుందో అనే భయం అందరిలోనూ ఉంది. దీంతో చాలా ఏళ్లుగా పండుగనాడు కూడా సాధారణ వంటకాలతోనే సరిపెట్టుకుంటాం.– రాజప్ప, పి.కొత్తపల్లి, ఆత్మకూరు మండలం -
ముగ్గుల పోటీలు, ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు
సాక్షి, ముంబై: దాదర్ నాయ్‌గావ్‌లోని ‘పద్మశాలీ యువక సంఘం’మహిళా మండలి ఆధ్వర్యంలో సోమవారం మహిళలకు ఆటల పోటీలు, ముగ్గుల పోటీలు నిర్వహించారు. మండలి కార్యదర్శి చెరిపల్లి పరమేశ్వరి, కోశాధికారి పేర్ల గీతాంజలి ప్రారంభించిన ఈ పోటీలకు రితిక దేశ్‌ముఖ్ న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. మహిళలు, బాలికలు ఎంతో ఉత్సాహంగా పోటీలలో పాల్గొన్న అందమైన రంగవల్లులను తీర్చిదిద్దారు. పోటీల విజేతలకు సంక్రాంతి ( జనవరి 14వ తేదీ) రోజున జరిగే కార్యక్రమంలో బహుమతులు ప్రదానం చేయనున్నట్లు సంఘం ప్రధాన కార్యదర్శి మహేశ్వరం చంద్రశేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా మండలి ఉపాధ్యక్షురాలు జిల్ల శారద, కార్యదర్శి చెరిపల్లి పరమేశ్వరి, సహకార్యదర్శులు బిట్ల సోని, కోశాధికారి పేర్ల గీతాంజలి, ఏలే తేజశ్రీ అడ్డగట్ల ఐశ్వర్య, చెదురుపు పద్మ, దొంత ప్రభావతి, ఇదం పద్మ, కైరంకొండ లక్షి్మ, కండ్లపెల్లి కవిత, కస్తూరి సావిత్రి, మహేశ్వరం సాక్షి, పగుడాల రోహిణి, ధర్మకర్తల మండలి చైర్మన్ కోడి చంద్రమౌళి, ట్రస్టీ తిరందాసు సత్యనారాయణ, కార్యవర్గ అధ్యక్షులు గంజి సీతారాములు, ప్రధాన కార్యదర్శి మహేశ్వరం చంద్రశేఖర్, దోర్నాల మురళీధర్, పుట్ట గణేష్ తదితరులు పాల్గొన్నారు. -
సంక్రాంతి స్పెషల్ స్వీట్స్ : నోరూరించేలా, ఈజీగా ఇలా ట్రై చేయండి!
సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే వేళ మకర సంక్రాంతిని సంబరంగా జరుపుకుంటాం. ఏడాదిలో తొలి పండుగ కూడా. మరి అలాంటి పండగకి ఘుమఘుమ లాడే పిండి వంటలు లేకపోతే ఎలా? కొత్త అల్లుళ్లు, అత్తారింటి నుంచి ఎంతో ఆశతో పుట్టింటికి వచ్చిన అమ్మాయిలతో సంక్రాంతి అంతా సరదా సరదాగా గడుస్తుంది. ఈ సంబరాల సంక్రాంతికోసం కొన్ని స్పెషల్ స్వీట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్వీట్ పొంగల్, బూందీ లడ్డూని సులభంగా తయారుచేసే రెసిపీ గురించి తెలుసుకుందాం.సంక్రాంతి అనగానే ముందుగానే గుర్తొచ్చే స్వీట్ పొంగల్. కొత్త బియ్యం, నెయ్యి, బెల్లంతో పొంగల్ తయారు చేసిన బంధు మిత్రులకు పంచి పెడతారు.స్వీట్ పొంగల్స్వీట్ పొంగల్ తయారీకి కావాల్సిన పదార్థాలు : బియ్యం - ఒక కప్పు, పెసరపప్పు లేదా శనగపప్పు-అరకప్పు, పాలు - ఒక కప్పు, బెల్లం - అరకప్పు, కొబ్బరి తురుము - అరకప్పు, ఏలకులు - 4, జీడిపప్పు, ఎండు ద్రాక్షలు కొద్దిగా, నెయ్యి-అరకప్పు.తయారీమొదటపెసరపప్పును నేతిలో దోరగా వేయించుకోవాలి. తర్వాత బియ్యాన్ని శుభ్రంగా కడగాలి. కుక్కర్లో కడిగిన బియ్యం, వేయించిన పప్పు రెండింటినీ వేసుకోవాలి. అందులో సరిపడా నీరు పోసి మూతపెట్టాలి. మూడు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. కుక్కర్ మూత వచ్చేదాకా బెల్లాన్ని సన్నగా తరిగిఉంచుకోవాలి. యాలకుల పొడి చేసుకోవాలి. కొబ్బరిని కూడా తురిమి పక్కన పెట్టుకోవాలి. అలాగే జీడిపప్పు, ఎండు ద్రాక్షల్ని నేతిలో వేయించుకోవాలి. కుక్కర్ మూత వచ్చాక, ఉడికిన అన్నం, పప్పులో మరికొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇందులో ఒక కప్పు పాలు, బెల్లం నీళ్లు పోసి బాగా కలపాలి. సన్నని మంటమీద ఉడకనివ్వాలి. ఇందులో తురిమిన పచ్చి కొబ్బరి వేసి కలపి మరో పది నిమిషాలు ఉడికిస్తే చాలు. తరువాత నేతిలో వేయించి పెట్టుకున్న డ్రైఫ్రూట్స్ వేసుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ స్వీట్ పొంగల్ రెడీ.బూందీ లడ్డు కావలసిన పదార్థాలు: శనగ పిండి - 1 కేజీ, నీరు - తగినంత. నూనె - వేయించడానికి సరిపడాపాకం కోసం: బెల్లం - 1కేజీ,కొద్దిగా నీళ్లు, యాలకుల పొడి - 1 టీస్పూన్, నిమ్మరసం - నాలుగు చుక్కలు, జీడిపప్పు ఎండు ద్రాక్ష, చిటికెడు పచ్చకర్పూరం తయారీ విధానం : ముందుగా శనగపిండిని జల్లించుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఓ గిన్నె తీసుకుని జల్లించిన శనగపిండి వేసుకుని నీళ్లు కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఉండలు లేకుండా , మృదువుగా ఉండేలా జారుడుగా కలుపుకుని పక్కకు పెట్టుకోవాలి.ఆ తర్వాత స్టౌ ఆన్ చేసి మూకుడు పెట్టి, సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె బాగా వేడెక్కాక, బూందీ గరిటె సాయంతో ముందుగానే కలిపి ఉంచుకున్న శనగపిండి మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా వేయాలి. సన్నగా ముత్యాల్లా బూందీ నూనెలో పడుతుంది. పిండిని ఒకేసారి ఎక్కువ మొత్తంలో బూందీ గరిటెలో వేయకూడదు. ఇలా చేస్తే పిండి ముద్దలు ముద్దలుగా పడుతుంది. కొద్దికొద్దిగా వేసుకుంటూ సన్న మంటమీద బూందీ చేసుకోవాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ మొత్తం బూందీనీ తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పాకం తయారీఒక కడాయిలో బెల్లం,నీళ్లు పోసి మరిగించాలి. బెల్లం కరిగి కాస్త పాకం వచ్చాక యాలకులు, పచ్చ కర్పూరం వేసి కలపాలి. తీగ పాక వచ్చేదాకా తిప్పుతూ ఉండాలి. నాలుగు చుక్కల నిమ్మరసం కలుపుకుంటే పాకం గట్టిపడకుండా ఉంటుంది. పాకం వచ్చాక జీడిపప్పులు,కిస్మిస్తోపాటు ముందుగా రెడీ చేసుకున్న వేడి వేడి బూందీలను పాకంలో వేసి బాగా కలపండి. కాస్త వేడి వేడిగా ఉండగానే చేతులకు నెయ్యి రాసుకొని మనకు కావాల్సిన సైజులో గుండ్రంగా ఉండలుగా చేసుకోవాలి. అంతే నోట్లో వేసుకుంటే కరిగిపోయే వెన్నలాంటి బూందీ లడ్డు రెడీ! -
Sankranti 2025 : సులువుగా చేసుకునే పిండి వంటలు మీకోసమే!
భారతదేశం అంతటా మకర సంక్రాంతిని చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. ముఖ్యంగా తెలుగువారు ఎంతో పవిత్రంగా భావించే అతి ముఖ్యమైన పండుగ. భోగి, సంక్రాంతి, కనుక, ముక్కనుమ ఇలా ఒక్కోరోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. సంక్రాంతి వస్తోందంటే బోలడెన్ని పిండి వంటలు చేయాలి. చుట్టాలు, బంధువులు ముఖ్యంగా కొత్త అల్లుళ్లకి మర్యాదల సందడి ఎక్కువగా ఉంటుంది. మరి సంక్రాంతికి ఈజీగా చేసుకునే కొన్ని వంటకాల్ని చూద్దాం. పూర్ణం బూరెలుకావల్సినవి: పచ్చి శనగపప్పు - 2 కప్పులుమినప్పప్పు - కప్పుకొత్త బియ్యం - 2 కప్పులుబెల్లం తురుము - 2 కప్పులునెయ్యి - అర కప్పునూనె -సరిపడతయారి: మినపప్పు, బియ్యం కడిగి సరిపడా నీళ్లు పోసి కనీసం నాలుగైదు గంటలు నానబెట్టాలి. తర్వాత జారుగా కాకుండా, మెత్తగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి. శనగపప్పులో తగినన్ని నీళ్లు పోసి కుక్కర్లో రెండు విజిల్స్ వచ్చేదాకా మెత్తగా ఉడికించుకోవాలి. చల్లారాక మందపాటి గిన్నెలో ఉడికించిన శనగపప్పుతోపాటు తరిగిన బెల్లం వేసి మళ్లీ ఉడికించాలి. బెల్లం పాకం వచ్చి, ఈ మిశ్రమం ఉండ చేసుకునే విధంగా అయ్యేలాగా ఉడికించుకోవాలి. చివరగా యాలకుల పొడి, నెయ్యి వేసి కలిపి దింపేయాలి. చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని మనకు కావాల్సిన సైజులో ఉండలు చేసుకోవాలి. ఆ తరువాత కడాయిలో నూనె పోసి బాగా కాగనివ్వాలి. ఇపుడు ముందే చేసిపెట్టిన ఒక్కో ఉండనూ మెత్తగా రుబ్బిన పప్పు మిశ్రమంలో ముంచి జాగ్రత్తగా నూనెలో వేసి, బంగారురంగు వచ్చేవరకు వేయించాలి. వేడివేడిగా బూరెల్లో నెయ్యి వేసుకొని తింటే భలే రుచిగా ఉంటాయి. నువ్వుల బొబ్బట్లు, బెల్లంతోకావల్సిన పదార్తాలు : తెల్ల నువ్వులు - 2 కప్పులు; బెల్లం తురుము - 2 కప్పులు; యాలకుల పొడి - ఒకటిన్నర టీ స్పూన్; మైదాపిండి- ఒకటిన్నర కప్పులు; నెయ్యి - సరిపడినంతతయారి: మైదాపిండిలో చిటికెడు ఉప్పు, కొద్దిగా నెయ్యి వేసి చపాతీ పిండిలాగా మృదువుగా కలుపుకోవాలి. ఆ తరువాత దీనిని కొద్దిసేపు తడిబట్ట కప్పి ఉంచాలి. ఈలోపు బాణలిలో నువ్వులు వేసి బంగారు వర్ణంలోకి వచ్చేవరకూ వేయించాలి. నువ్వులు చల్లారిన తర్వాత బెల్లం తురుము వేసి, రెండూ కలిపి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులో రుచికి, సువాసన కోసం యాలకులకు కూడా కలపాలి.ఇపుడు కలిపి ఉంచుకున్న పిండిని చిన్న ఉండలుగా చేసుకొని, చపాలీగా వత్తి అందులో నువ్వుల మిశ్రమం పెట్టి బొబ్బట్టు మాదిరిగా వత్తాలి. దీనిని పెనం మీద నెయ్యి వేస్తూ రెండు వైపులా మాడిపోకుండా జాగ్రత్తగా కాల్చుకోవాలి. ఇదీ చదవండి : ఆంధ్ర దంగల్‌కు సై అంటున్న.. తెలంగాణ కోళ్లు! ఇంట్రస్టింగ్ విషయాలు పాకం గారెలుకావల్సినవి: మినప్పప్పు -అర కిలో, బెల్లం అర కిలో, కొద్దిగా నీళ్లు, నూనె - వేయించేందుకు సరిపడా నెయ్యి - 50 గ్రాములు యాలకుల పొడి - 1 టీ స్పూన్ ఉప్పు - రుచికి సరిపడాతయారి: పొట్టు తీసిన మినప్పప్పును ముందురోజు రాత్రి నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం నీళ్లన్నీ వంపేసి, గారె చేయడానికి అనువుగా పిండి గట్టిగా ఉండేలా రుబ్బుకోవాలి. ఇందులో తగినంత ఉప్పు కలుపుకోవాలి.బెల్లం తురుములో తగినన్ని నీళ్లు పోసి లేతపాకం పట్టి, అందులో యాలకుల పొడి కలిపి పక్కన ఉంచాలి.గారెలు వత్తుకొని, నెయ్యి కలిపిన నూనెలో దోరగా వేయించి, వేడిగా ఉండగానే పాకంలో వేయాలి. వీటిని ఓ పూటంతా కదపకుండా ఉంచితే పాకంలో గారెలు బాగా నాని రుచిగా ఉంటాయి.గోధుమరవ్వ హల్వాకావల్సినవి: చిన్నగోధుమ రవ్వ - 1కప్పుపాలు - 2 కప్పులు; నీళ్లు - 1 కప్పుయాలకుల పొడి - చిటికెడుజీడిపప్పు పలుకులు - 10కిస్మిస్ - 10పంచదార - 2 కప్పులునెయ్యి - 4 పెద్ద చెంచాలుకుంకుమపువ్వు - కొద్దిగాతయారీ: మందపాటి గిన్నెలో నెయ్యి కొద్దిగా వేసి వేడిచేసుకోవాలి. ఇందులో జీడిపప్పు, కిస్మిస్ వేయించి పక్కన పెట్టుకోవాలి. తరువాత అదే నెయ్యిలో రవ్వ వేసి దోరగా కమ్మని వాసన వచ్చేదాకా వేయించుకోవాలి. ఈ రవ్వను ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇపుడు మరో గిన్నెలో చిక్కని పాలు, నీళ్లు కలిపి బాగా మరిగించాలి. దానిలో గోధుమరవ్వను కొద్ది కొద్దిగా పోస్తూ, ఉండలు లేకుండా కలుపుతూ ఉడకనివ్వాలి. రవ్వ బాగా ఉడికాక అందులో పంచదార, నెయ్యి కూడా వేసి బాగా కలపాలి. పంచదార కరిగి, హల్వా కొద్దిగా దగ్గరకి వచ్చేవరకు కలుపుతూ సన్నని మంట మీద ఉడికించాలి. దీంట్లో వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్, కుంకుమ పువ్వు వేసి మంట తీసేయాలి. ఘుమఘుమలాడే గోధుమరవ్వ హల్వా రెడీ. ఇదీ చదవండి : HMPV : మళ్లీ మాస్క్ వచ్చేసింది.. నిర్లక్ష్యం వద్దు! -
ఆంధ్ర దంగల్‌కు సై అంటున్న.. తెలంగాణ కోళ్లు! ఇంట్రస్టింగ్ విషయాలు
సంక్రాంతి పండుగలో డూడూ బసవన్నలు, రంగవల్లులు, హరిదాసులు, భోగిమంటలు, పిండివంటలు ఎంత ప్రాధాన్యత కలిగినవో.. కోడి పందేలకు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది.. గట్టిగా చెప్పాలంటే.. సంక్రాంతి సందడిలో కోడిపందేలే కీలంకంగా మారాయి కూడా.. ఆంధ్రలో సంక్రాంతికి కోడిపందేలకు మహిళలు సైతం వెళ్లి పందేలు కాస్తారంటే ఎంతటి క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.. అలాంటి ఆంధ్రా సంక్రాంతి కోడి పందేలకు నగరం నుంచి పందెం రాయుళ్లతో పాటు కోళ్లు కూడా వెళుతున్నాయి.. అంతే కాదు పందేల్లో ప్రత్యర్థి కోళ్లను ఢీ కొట్టేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ సారి పందేల బరిలోకి దిగేందుకు పాతబస్తీలోని కోళ్లు కాలుదువ్వుతున్నాయి. పాతబస్తీలో పందెపు కోళ్ల పెంపకంతోపాటు వాటికి బరిలో పడే విధంగా శిక్షణ కూడా ఇస్తున్నారు. దీంతో ఇక్కడ పెంచుతున్న కోళ్లకు భారీ డిమాండ్ ఏర్పడుతుంది. మరికొన్ని రోజుల్లో సంక్రాంతి నేపథ్యంలో దీనిపైనే ప్రత్యేక కథనం..– సాక్షి, సిటీబ్యూరోసంక్రాంతి కోడి పందేలకు ఇప్పటికే సర్వం సిద్ధమవుతోంది. బరిలో నిలిచే కోళ్లను ఇప్పటికే పందెంరాయుళ్లు జల్లెడపట్టేశారు. మరికొందరు ఆ ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. దీంతో ఒక్కో కోడి ధర పదివేల నుంచి లక్ష రూపాయల వరకూ పలుకుతోంది. జాతి, రంగును బట్టి కూడా ధరలను నిర్ణయిస్తారు. బరిలో దిగితే చావో రేవో తేల్చుకునేలా వాటికి శిక్షణ ఇస్తున్నారు. కొన్ని రకాల జాతి పుంజులైతే రూ.70 వేల నుంచి లక్ష వరకూ పలుకుతాయి.. అత్యంత ఖరీదుగా ఉండేవి సీతువ జాతి కోడి పుంజులు. ఆ తరువాతి స్థానాల్లో పర్ల, పచ్చకాకి, డేగ, కాకిపుంజు, పెట్టమారు రకాలున్నాయి. మెనూ చాలా ముఖ్యం.. అట్లపెనంపై గుడ్డును వేడిచేసి బాదం, నిమ్మ నూనెతో మసాజ్ చేస్తారు. చికెన్, ఎండు చేప ముక్కలు ధాన్యంలో కలిపి ఇస్తారు. ఇవేకాకుండా జీడి పప్పు, బాదం, పిస్తా, ఎండు ఖర్జూరం, కిస్మిస్, మేకపాలు, వీటితోపాటు బలవర్ధకమైన పోషకాలు ఉండే ఆహారం తినిపిస్తారు. గంట్లు, చోళ్ళు, బియ్యం, రాగులు మినప, శనగపప్పు, గోధుమ మిశ్రమాన్ని రోజూ తినిపిస్తారు. దీంతో పాటు మధ్యాహ్నం మటన్ కీమా, సాయంత్రం స్నాక్స్‌గా జొన్నలు, కోడిగుడ్లు పెడతారు. ప్రతి మూడు గంటలకూ ఓ సారి జీడిపప్పు, బాదం పిస్తా మిశ్రమాన్ని వడ్డిస్తారు. పుంజులకు బలమైన ఆహారం ఇస్తూనే కఠినమైన వ్యాయామం శిక్షణ ఇస్తారు. ఎంపికే కీలకం... కోడిపుంజు ఎంపిక నుంచి దానికి ఇచ్చే ఆహారం వరకూ అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. కోడిపందెం కోసం అన్ని రకాల జాతులూ పనికిరావు. ప్రత్యేకంగా సూచించిన వాటినే కోడిపందేలకు ఉపయోగిస్తారు. వీటిలో డేగా, నల్లకాకి, తెల్లపర్ల, నెమలి కాకి, కాకిడేగ, కత్తిరాయి, జుమర్, నూరీ, కగర్, డుమర్, యాకూద్, కాకిడేగ, అబ్రాస్, పచ్చ కాకి, సీతువా, అసీల్ ప్రధానమైనవి. సాధారణ కోడిపుంజుల కంటే పందెంకోళ్లు భిన్నంగా ఉంటాయి. 24 గంటలు వాటిపై ప్రత్యేక నిఘా పెడతారు. పోటీకి ప్రత్యేక శిక్షణ.. ప్రత్యర్థి దెబ్బలు తట్టుకుని సత్తా చాటేలా కోడి పుంజులకు తర్ఫీదు ఇస్తున్నారు. కోడి బలిష్టంగా తయారు కావడానికి పౌష్టికాహారాన్ని అందజేస్తున్నారు. పిల్లగా ఉన్నప్పటి నుంచే పందెం కోళ్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. రోజువారీ మెనూ, కసరత్తు, మాసాజ్తో వాటిని కుస్తీకి సిద్ధం చేస్తారు. నాలుగు నెలల శిక్షణా కాలాన్ని విభజించి పోటీకి తీర్చిదిద్దుతారు. ఉదయాన్నే వాటికి మౌత్ వాష్ చేయిస్తారు. ట్రైనర్ నోటిలో నీళ్లు పోసుకుని కోళ్ల ముఖంపై స్ప్రే చేస్తాడు. ఈ ప్రక్రియను కల్లె కొట్టడం అంటారు. పుంజు కండరాలు బిగుతుగా ఉండేందుకు వాకింగ్ చేయిస్తారు. వేడి నీళ్లు, స్పెషల్ షాంపూతో కోడికి స్నానం చేయిస్తారు. రెండు గంటల సమయం తర్వాత మళ్లీ శిక్షణ మొదలవుతుంది. మరో పుంజును బరిలో దించడం ద్వారా పోటీకి రెచ్చగొట్టేలా ట్రిక్స్ ఉపయోగిస్తారు. తద్వారా రెండు పుంజులూ పోటాపోటీగా పోరాడేలా చేస్తారు. ఈ పోటీ తర్వాత పుంజులకు మసాజ్ సెషన్ ఉంటుంది. అంతేకాదు.. తిన్నది ఒంటబట్టేవిధంగా కసరత్తులు ఉంటాయి. చెరువులో ఈత కొట్టిస్తారు. పందెం కోడి నిర్వహణకు నెలకు ఐదు నుంచి ఆరు వేల వరకూ ఖర్చు అవుతుంది భారీ డిమాండ్ ఉంది.. గత కొన్నేళ్లుగా ఆంధ్ర ప్రాంతానికి మా కోళ్లు పెందేలకు తీసుకెళుతున్నారు. దీంతో భారీ డిమాండ్ ఏర్పడింది. అప్పటి నుంచి మేము పందెం కోళ్లను పెంచుతున్నాం.. వాటికి ప్రత్యేక ఆహారంతో పాటు, శిక్షణ కూడా ఇస్తాం. కోడి బ్రీడ్, జీవనశైలిని బట్టి వాటి ఆహారం, శిక్షణ ఉంటుంది. ఇప్పటికే పలువురు మా కోళ్లను కొనుగోలు చేశారు. ఆల్ బొగ్దాది అండ్ స్కోర్ ఆసీల్ పేరుతో ఇన్‌స్టా అకౌంట్ నిర్వహిస్తున్నాము. దీని ద్వారా కోళ్లు కావాల్సిన వారు మమ్మల్ని సంప్రదించవచ్చు. – హబీబ్ జైన్, పందెం కోళ్ల ఫామ్ యజమాని .