సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే వేళ మకర సంక్రాంతిని సంబరంగా జరుపుకుంటాం. ఏడాదిలో తొలి పండుగ కూడా. మరి అలాంటి పండగకి ఘుమఘుమ లాడే పిండి వంటలు లేకపోతే ఎలా? కొత్త అల్లుళ్లు, అత్తారింటి నుంచి ఎంతో ఆశతో పుట్టింటికి వచ్చిన అమ్మాయిలతో సంక్రాంతి అంతా సరదా సరదాగా గడుస్తుంది. ఈ సంబరాల సంక్రాంతికోసం కొన్ని స్పెషల్ స్వీట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్వీట్ పొంగల్, బూందీ లడ్డూని సులభంగా తయారుచేసే రెసిపీ గురించి తెలుసుకుందాం.
సంక్రాంతి అనగానే ముందుగానే గుర్తొచ్చే స్వీట్ పొంగల్. కొత్త బియ్యం, నెయ్యి, బెల్లంతో పొంగల్ తయారు చేసిన బంధు మిత్రులకు పంచి పెడతారు.
స్వీట్ పొంగల్
స్వీట్ పొంగల్ తయారీకి కావాల్సిన పదార్థాలు : బియ్యం - ఒక కప్పు, పెసరపప్పు లేదా శనగపప్పు-అరకప్పు, పాలు - ఒక కప్పు, బెల్లం - అరకప్పు, కొబ్బరి తురుము - అరకప్పు, ఏలకులు - 4, జీడిపప్పు, ఎండు ద్రాక్షలు కొద్దిగా, నెయ్యి-అరకప్పు.
తయారీ
మొదటపెసరపప్పును నేతిలో దోరగా వేయించుకోవాలి. తర్వాత బియ్యాన్ని శుభ్రంగా కడగాలి. కుక్కర్‌లో కడిగిన బియ్యం, వేయించిన పప్పు రెండింటినీ వేసుకోవాలి. అందులో సరిపడా నీరు పోసి మూతపెట్టాలి. మూడు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి.
కుక్కర్ మూత వచ్చేదాకా బెల్లాన్ని సన్నగా తరిగిఉంచుకోవాలి. యాలకుల పొడి చేసుకోవాలి. కొబ్బరిని కూడా తురిమి పక్కన పెట్టుకోవాలి. అలాగే జీడిపప్పు, ఎండు ద్రాక్షల్ని నేతిలో వేయించుకోవాలి.
కుక్కర్ మూత వచ్చాక, ఉడికిన అన్నం, పప్పులో మరికొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇందులో ఒక కప్పు పాలు, బెల్లం నీళ్లు పోసి బాగా కలపాలి. సన్నని మంటమీద ఉడకనివ్వాలి. ఇందులో తురిమిన పచ్చి కొబ్బరి వేసి కలపి మరో పది నిమిషాలు ఉడికిస్తే చాలు. తరువాత నేతిలో వేయించి పెట్టుకున్న డ్రైఫ్రూట్స్ వేసుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ స్వీట్ పొంగల్ రెడీ.
బూందీ లడ్డు
కావలసిన పదార్థాలు: శనగ పిండి - 1 కేజీ, నీరు - తగినంత. నూనె - వేయించడానికి సరిపడా
పాకం కోసం: బెల్లం - 1కేజీ,కొద్దిగా నీళ్లు, యాలకుల పొడి - 1 టీస్పూన్, నిమ్మరసం - నాలుగు చుక్కలు, జీడిపప్పు ఎండు ద్రాక్ష, చిటికెడు పచ్చకర్పూరం
తయారీ విధానం : ముందుగా శనగపిండిని జల్లించుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఓ గిన్నె తీసుకుని జల్లించిన శనగపిండి వేసుకుని నీళ్లు కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఉండలు లేకుండా , మృదువుగా ఉండేలా జారుడుగా కలుపుకుని పక్కకు పెట్టుకోవాలి.
ఆ తర్వాత స్టౌ ఆన్ చేసి మూకుడు పెట్టి, సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె బాగా వేడెక్కాక, బూందీ గరిటె సాయంతో ముందుగానే కలిపి ఉంచుకున్న శనగపిండి మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా వేయాలి. సన్నగా ముత్యాల్లా బూందీ నూనెలో పడుతుంది. పిండిని ఒకేసారి ఎక్కువ మొత్తంలో బూందీ గరిటెలో వేయకూడదు. ఇలా చేస్తే పిండి ముద్దలు ముద్దలుగా పడుతుంది. కొద్దికొద్దిగా వేసుకుంటూ సన్న మంటమీద బూందీ చేసుకోవాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ మొత్తం బూందీనీ తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
పాకం తయారీ
ఒక కడాయిలో బెల్లం,నీళ్లు పోసి మరిగించాలి. బెల్లం కరిగి కాస్త పాకం వచ్చాక యాలకులు, పచ్చ కర్పూరం వేసి కలపాలి. తీగ పాక వచ్చేదాకా తిప్పుతూ ఉండాలి. నాలుగు చుక్కల నిమ్మరసం కలుపుకుంటే పాకం గట్టిపడకుండా ఉంటుంది. పాకం వచ్చాక జీడిపప్పులు,కిస్‌మిస్‌తోపాటు ముందుగా రెడీ చేసుకున్న వేడి వేడి బూందీలను పాకంలో వేసి బాగా కలపండి. కాస్త వేడి వేడిగా ఉండగానే చేతులకు నెయ్యి రాసుకొని మనకు కావాల్సిన సైజులో గుండ్రంగా ఉండలుగా చేసుకోవాలి. అంతే నోట్లో వేసుకుంటే కరిగిపోయే వెన్నలాంటి బూందీ లడ్డు రెడీ!
Comments
Please login to add a commentAdd a comment