మచిలీపట్నంలో కొనుగోలుదారులు లేక వెలవెలబోతున్న ఓ వస్త్ర దుకాణం
ఈ ఏడాది అంతగా కనిపించని సంక్రాంతి సందడి
చుక్కలనంటుతున్న నిత్యావసర సరుకుల ధరలు
గతేడాది సంక్రాంతితో పోలిస్తే భారీగా పెరిగిన వైనం
వంట నూనెలపై లీటర్‌కు రూ.30–40కి పైగా వాత
కిలో రూ.56–75 మధ్య బియ్యం
మూడున్నర రెట్లు పెరిగిన వెల్లుల్లి
పప్పుల ధరలు కిలోకు రూ.30–50 పెరిగిన పరిస్థితి
గతంతో పోలిస్తే పడిపోయిన వ్యాపారాలు.. వస్త్ర దుకాణాల్లో 75 శాతం అమ్మకాలు ఢమాల్
సగానికి సగం పడిపోయిన బంగారం కొనుగోళ్లు.. గత ఏడాదితో పోలిస్తే సగం అమ్మకాలు కూడా లేవంటున్న కిరాణా వ్యాపారులు
ధరలు అదుపు చేయడంలో చేతులెత్తేసిన ప్రభుత్వం
నిరుపేదలకు పండగ భారం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఈ ఏడాది సంక్రాంతి సందడి పెద్దగా కనిపించడం లేదు. అన్ని జిల్లాల్లోనూ వ్యాపారాలు అంతంత మాత్రమేనని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతుంటే సంతోషంగా పండుగ ఎలా చేసుకోవాలని పేద, మధ్యతరగతి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే వస్త్ర, బంగారు, ఇతర వ్యాపారాలన్నీ దాదాపు సగానికి సగం పడిపోయాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. సంక్రాంతి పూట పిండి వంటలు చేసుకునేందుకు కూడా సామాన్య, మధ్య తరగతి ప్రజలు దిక్కులు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
గత ఎనిమిది నెలలుగా ఆకాశమే హద్దుగా ఎగబాకుతున్న నిత్యావసరాల ధరలను చూసి జనం బెంబేలెత్తిపోతున్నారు. పండుగ పూట ఇంటికి వచ్చే బంధువులకు నాలుగు రకాల పిండి వంటలు కూడా చేసి పెట్టలేని దుస్థితిలో ఉన్నారు. గతేడాది జనవరితో పోల్చి చూస్తే ప్రస్తుతం మార్కెట్‌లో వంట నూనెల నుంచి బియ్యం వరకు మండుతున్న ధరలను చూసి గగ్గోలు పెడుతున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న ధరలకు కళ్లెం వేయలేని టీడీపీ కూటమి ప్రభుత్వం.. మరో వైపు ఎన్నికల్లో ఇచి్చన హామీలు అమలు చేయకపోగా, చంద్రన్న సంక్రాంతి కానుక సైతం ఇవ్వలేమని చేతులెత్తేసింది. ఈ పరిస్థితిలో ఏ విధంగా పండుగను సంతోషంగా జరుపుకోవాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
20–40 శాతం మేర పెరిగిన ధరలు
సంక్రాంతి వచ్చిందంటే పల్లెలన్నీ కళకళలాడుతుంటాయి. పండుగ నాలుగు రోజులు ఇంటికి వచ్చే కొత్త అల్లుళ్లకే కాదు.. బంధువులు, స్నేహితులకు ఘుమ ఘుమలాడే పిండి వంటలు వండి వడ్డించడం మన తెలుగువారి సంప్రదాయం. బూరెలు, గారెలు, అరిసెలు, సున్నుండలు, పొంగడాలు, పాకుండలు, కజ్జి కాయలు, పులిహోర ఇలా ఎవరికి వారు తమ స్థాయికి తగ్గట్టుగా పిండి వంటలు చేసుకుని ఆనందంగా గడుపుతారు. టీడీపీ కూటమి ప్రభుత్వం గద్దెనెక్కింది మొదలు నిత్యావసరాల ధరలు షేర్ మార్కెట్‌లా దూసుకెళ్లాయి.
కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులు ప్రభుత్వ అండదండలతో అందినకాడికి దోచుకుంటూనే ఉన్నారు. గతేడాది సంక్రాంతికి ముందు ఉన్న ధరలతో పోలిస్తే ప్రస్తుతం సగటున 20 నుంచి 40 శాతం మేర పెరిగాయి. నిత్యావసర వస్తువులే కాదు.. కాయగూరల ధరలు సైతం పెరిగాయి. వెల్లుల్లి అయితే రికార్డు స్థాయిలో మూడు రెట్లు పెరిగింది. పిండి వంటల్లో ఉపయోగించే పప్పులు, బెల్లం, నెయ్యి ధరలు కూడా గతేడాదితో పోలిస్తే భారీగా పెరిగాయి.
పప్పన్నానికీ దూరం
పండుగ పూట పప్పన్నం వండుకునేందుకు కూడా భయపడే పరిస్థితి నెలకొంది. పప్పు దినుసుల ధర సామాన్య, నిరుపేదలను బెంబేలెత్తిస్తోంది. గతేడాది జనవరిలో కిలో రూ.84.50 ఉన్న శనగపప్పు ప్రస్తుతం రూ.100–140 పలుకుతోంది. గత ఏడాది రూ.150 ఉన్న కందిపప్పు అయితే నేడు ఏకంగా రూ.160–224తో అమ్ముతున్నారు. గతేడాది రూ.126 పలికిన పెసరపప్పు నేడు రూ.140–170 పలుకుతోంది.
బహిరంగ మార్కెట్‌లో కిలోకు రూ.10 నుంచి రూ.20 తగ్గించామని ప్రభుత్వం గొప్పలు చెబుతున్నప్పటికీ, అవన్నీ నాసిరకం పప్పులే. గోధుమ పిండి సైతం గతేడాది కిలో రూ.50 పలుకగా, నేడు రూ.70 చొప్పున విక్రయిస్తున్నారు. బియ్యం ధర గురించి అయితే చెప్పనవసరం లేదు. గతేడాది ఫైన్ క్వాలిటీ బియ్యం కిలో రూ.57 ఉండగా, నేడు సాధారణ రకమే ఆ ధరతో విక్రయిస్తున్నారు. ప్రీమియం రకాలు రూ.64–75 మధ్య పలుకుతున్నాయి. లూజ్ బాస్మతి బియ్యం ధర కిలో రూ.120కి పైగానే ఉంది.
నూనెల ధర ధగధగ
దేశంలో మరెక్కడా లేని విధంగా రాష్ట్రంలో వంట నూనెల ధరలు విపరీతంగా పెరిగాయి. కేంద్రం దిగుమతి సుంకం పెంచిందన్న సాకుతో కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులు ఇష్టారాజ్యంగా రేట్లు పెంచేశారు. ప్రియా, ఫ్రీడం, రుచి ఇలా ప్రధాన బ్రాండ్ నూనెల ధరలన్నీ కిలోకు రూ.30–50 వరకు ఎగబాకాయి. దిగుమతి సుంకంతో సంబంధం లేని కొబ్బరి నూనె కిలోకు రూ.18, వేరుశనగ నూనెపై రూ.10, పూజాదికాలకు ఉపయోగించే నూనెలపై రూ.10–30 చొప్పున పెంచేశారు. ప్రియా ఆయిల్స్ ఇతర బ్రాండ్ ధరల కంటే రూ.20 అదనంగా ఉన్నాయి.
గతేడాది జనవరిలో లీటర్ 88.60 ఉన్న పామాయిల్ ప్రస్తుతం రూ.130 పలుకుతోంది. రూ.112.80 పలికిన సన్‌ఫ్లవర్ రిఫైండ్ ఆయిల్ ప్రస్తుతం రూ.150–160 చొప్పున అమ్ముతున్నారు. నెయ్యి కిలో రూ.150 నుంచి రూ.300 వరకు పెరిగింది. పాల ధరలు గతంతో పోలిస్తే లీటర్‌కు రూ.10–20 మేర పెరిగాయి. ఇలా బెంబేలెత్తిస్తున్న నిత్యావసర ధరల ప్రభావం వల్ల సామాన్య, మధ్య తరగతి ప్రజలకు సగటున ఒక్కో కుటుంబంపై రూ.వెయ్యి నుంచి రూ.2 వేల వరకు అదనపు భారం పడుతోంది.
ముందస్తు ఆర్డర్లు లేవు..
సంక్రాంతి గతంలో ఉన్నట్టు ఈ ఏడాది లేదు. ముందస్తు ఆర్డర్లు తగ్గిపోయాయి. కార్పొరేట్ గిఫ్టుల కోసం తప్పితే ప్రజల నుంచి వచ్చే ఆర్డర్లు లేవు. చిన్న కుటుంబం రూ.1,500 ఖర్చు చేస్తే 10 రకాల పిండి వంటలు అందించేవాళ్లం. అవి దాదాపు 11–12 కిలోలు ఉండేవి. గతంలో పెట్టిన డబ్బులకు ఇప్పుడు 8 కిలోలు కూడా ఇవ్వలేకపోతున్నాం. శనగపిండి, వంట నూనెల రేట్లు పెరగడంతో తక్కువ పిండి వంటలు కొనుక్కుంటున్నారు.
నెయ్యి క్వాలిటీదైతే రూ.వెయ్యి పలుకుతోంది. కంపెనీ నెయ్యి హోల్‌సేల్‌లోనే గతంలో కిలో రూ.500–550 ఉంటే ఇప్పుడు రూ.650 పలుకుతోంది. కొత్తగా అల్లుళ్లు, కోడళ్లకు సారె పెడితే 100 మందికి పంచుకునే వాళ్లుŠ. ఇప్పుడు 20–30 మందికే పరిమితం అయ్యేలా పెడుతున్నారు. ఫలితంగా మాకు ఆర్డర్లు తగ్గిపోయాయి.
– కె.సందీప్, పిండి వంటల వ్యాపారం, రావులపాలెం
మూడొంతుల వ్యాపారం పడిపోయింది
సాధారణ రోజుల్లో రోజుకు రూ.8 వేల నుంచి రూ.10 వేల దాకా వ్యాపారం జరిగేది. పండుగ సీజన్‌లో రోజుకు రూ.19 వేల వరకు జరిగేది. సంక్రాంతి పండుగకు 15 రోజుల ముందు నుంచి షాపు కిటకిటలాడేది. ఇంటిల్లిపాది కొత్త చెప్పులు కొనుగోలు చేసేవారు. కానీ ఆరు నెలల నుంచి వ్యాపారం బాగా తగ్గిపోయింది. సాధారణ రోజుల్లో రూ.2 వేలు దాటడం లేదు. ఈ పండుగ సీజన్‌లోనూ రూ.4 వేలకు మించడం లేదు. మూడొంతుల వ్యాపారం పడిపోయింది. దీనివల్ల ఇబ్బంది పడాల్సి వస్తోంది.
– ఇమ్రాన్, చెప్పుల వ్యాపారి, అనంతపురం
రూ.50 లక్షల నుంచి రూ.25 లక్షలకు..
చాలా రోజులుగా బంగారు నగల దుకాణం నిర్వహిస్తున్నా. కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా నగలు తయారీ చేయించి విక్రయిస్తుంటాను. పలువురు మహిళా కస్టమర్లకు వాయిదాల పద్ధతిలో కూడా నగలు చేయించి ఇస్తున్నా. గతేడాది వరకు సంవత్సరానికి రూ.50 లక్షల మేరకు వ్యాపారం సాగుతుండేది. ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. ఈ ఏడాది రూ.25 లక్షలకు మించి వ్యాపారం జరగలేదు. ప్రస్తుతం తమ చేతులో డబ్బుల్లేవని కస్టమర్లు చెబుతున్నారు.
– వి.శేషగిరిరావు, శ్రీ మహేశ్వరి జ్యూయలర్స్, ఆత్మకూరు
ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు
ఈ సంక్రాంతి పండుగ వ్యాపారుల పాలిట శాపంగా మారింది. లక్షల రూపాయలు అప్పులు చేసి ప్రధాన పట్టణాల నుంచి నిత్యావసర సరుకులు పెద్ద మొత్తంలో తెచ్చాం. కనీసం సాధారణ రోజుల్లో జరిగినంత వ్యాపారం కూడా జరగడం లేదు. గత ఏడాది సంక్రాంతికి పది రోజుల నుంచి పండుగ వరకు మా దుకాణంలో సుమారు రూ.25 లక్షల వరకు వ్యాపారం జరిగింది. ఈ ఏడాది జనవరి 12 వస్తున్నా కనీసం రూ.3 లక్షల వ్యాపారం జరగలేదు. ఇలాంటి పరిస్థితి గత పదేళ్లలో ఎప్పుడూ చూడలేదు.
– శ్రీరాములు, జనరల్ స్టోర్ యజమాని, తిరుపతి
ఇప్పుడే ఈ పరిస్థితి
పెద్ద పండుగ వేళ అస్సలు వ్యాపారం లేకపోవడం ఇప్పుడే చూస్తున్నాం. ఎవరిని అడిగినా డబ్బులేదంటున్నారు. ఇంతకు ముందుకంటే ఇప్పుడు ఆఫర్లు మంచిగా ఇస్తున్నాం. కానీ ఎవ్వరూ కొనడం లేదు. కాలానికి తగ్గట్టు టీవీలు, వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లలో కొత్త కొత్త ఫీచర్లతో వస్తున్నాయి. బాగానే సేల్ అవుతాయని ఆశించాం. కానీ ఎల్రక్టానిక్స్ రంగం మొత్తం పండుగ వేళ పడిపోయింది.
– బాలసుబ్రమణ్యం, ఎలక్ట్రానిక్స్ వ్యాపారి, నగరి
ఇలా అయితే పండుగ చేసుకునేదెలా?
నేను వ్యవసాయ పనులకు వెళ్తాను. నెలకు రూ.10 వేలు కూడా రావట్లేదు. నిత్యావసరాలకు గతంలో రూ.3 వేలయ్యేది. ప్రస్తుతం రూ.5 వేలకు పైగా ఖర్చవుతోంది. కందిపప్పు రూ.180 పైగానే ఉంది. వంట నూనె ధరలు చుక్కలనంటుతున్నాయి. ధరలు ఇలా మండిపోతుంటే పండుగలెలా చేసుకుంటాం? ఎవరైనా బంధువులు ఇంటికి వస్తే భయపడే పరిస్థితి కన్పిస్తోంది.
– ద్వారపూడి సత్యారావు, సీతారాంపురం, విజయనగరం జిల్లా
వ్యాపారాలు తగ్గిపోయాయి
ప్రస్తుతం వ్యాపారాలు 75% తగ్గిపోయాయి. చాలా ఏళ్లుగా సామర్లకోటలో వస్త్ర వ్యాపారం చేస్తున్నాను. గత సంక్రాంతి సీజన్లో రోజూ రూ.20,000 వ్యాపారం జరిగేది. ఈ సీజన్‌లో రూ.5,000 కూడా జరగడం లేదు. ప్రజల చేతిలో సొమ్ములు లేకపోవడం వల్ల కొనేవారు తగ్గిపోయారు.
– గ్రంథి సత్యనారాయణమూర్తి, వస్త్ర వ్యాపారి, సామర్లకోట, కాకినాడ జిల్లా
Comments
Please login to add a commentAdd a comment