
‘సిట్’ రైట్ కాదు...అంతా రాంగే
ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఎక్కడ?
విచారణ పేరిట ఇష్టానుసారంగా తిప్పుతూ వేధింపులు.. బెదిరింపులు..
ప్రలోభాలు.. సీసీ కెమెరాలు లేవు..జనరల్ డైరీ నమోదూ లేదు
సిట్ ముసుగులో రెడ్‌బుక్ కుట్రలు
సుప్రీంకోర్టు ఆదేశాలు బేఖాతర్
సాక్షి, అమరావతి: రెడ్‌బుక్ కుట్రలను అమలు చేయడమే లక్ష్యంగా సాగుతున్న టీడీపీ కూటమి సర్కారు పోలీసు గూండాగిరీకి తెగిస్తోంది! అందుకోసం సిద్ధం చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) రాజ్యాంగేతర శక్తిగా మలుచుకుంది! గత ప్రభుత్వ హయాంలో అనుసరించిన మద్యం విధానాలపై అక్రమ కేసులతో బరితెగిస్తోంది. ఈ క్రమంలో సీఐడీ ద్వారా అక్రమ కేసుతో వేధించేందుకు పన్నిన పన్నాగం ఫలించకపోవడంతో ‘సిట్’ను తెరపైకి తెచ్చింది. ప్రలోభపెట్టో.. వేధించో.. హింసించో... తిమ్మిని బమ్మిని చేయాలని సిట్‌ను ఆదేశించింది. దర్యాప్తు పేరిట వేధింపులకు కుతంత్రం పన్నింది. సిట్ పోలీస్ స్టేషన్ ఎక్కడన్నది గుర్తించకుండా బరితెగించి సాగిస్తున్న ఈ కుట్ర ఇలా ఉంది..!
సిట్ పోలీస్ స్టేషన్ ఎక్కడ..?
నిబంధనల ప్రకారం సిట్‌ను ప్రత్యేక పోలీస్ స్టేషన్‌గా ప్రకటించి ఎక్కడి నుంచి పని చేస్తుందో అధికారికంగా నోటిఫై చేయాలి. అంటే సిట్ పోలీస్ స్టేషన్ ప్రాంగణాన్ని గుర్తించాలి. కక్ష సాధింపే లక్ష్యంగా పెట్టుకున్న చంద్రబాబు ప్రభుత్వం ఈ నిబంధనలను నిర్భీతిగా ఉల్లంఘిస్తోంది. వైఎస్సార్‌సీపీ హయాంలో మద్యం విధానంపై అక్రమ కేసు నమోదు చేసిన కూటమి సర్కారు సిట్‌ను ఏర్పాటు చేస్తూ ప్రత్యేక పోలీస్ స్టేషన్‌గా ప్రకటించింది. అయితే ఆ పోలీస్ స్టేషన్ ఎక్కడ అన్నది నోటిఫై చేయలేదు. సిట్ పోలీస్ స్టేషన్ భౌతికంగా ఎక్కడ ఉందో వెల్లడించకపోవడం వెనుక పక్కా కుట్ర ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
దర్యాప్తు పేరుతో వేధింపుల కుట్ర...
సిట్ పోలీస్ స్టేషన్ ప్రాంగణాన్ని ఇప్పటివరకు గుర్తించకపోవడం వెనుక పక్కా కుట్ర ఉంది. పోలీస్ స్టేషన్‌ను అధికారికంగా గుర్తిస్తే అక్కడి నుంచే సిట్ విధులు నిర్వహించాలి. ఈ కేసులో నిందితులనుగానీ సాక్షులనుగానీ విచారించాలంటే నోటీసులు జారీ చేసి అక్కడకే పిలవాలి. ఆ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలోనే విచారించాలి. సక్రమ కేసు అయితే ఈ నిబంధనలను కచ్చితంగా పాటిస్తారు. రెడ్‌బుక్ కుట్రలో భాగంగా నమోదు చేసిన అక్రమ కేసు కాబట్టే కూటమి ప్రభుత్వం బరి తెగిస్తోంది.
ఈ కేసులో సాక్షులా? నిందితులా? ఇతరులా? అనేది స్పష్టం చేయకుండా పలువురిని ఇప్పటికే విచారణ పేరుతో వేధించింది. వారిని ఎక్కడ విచారించిందో రహస్యంగా ఉంచింది. బెవరేజెస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి, పూర్వ ఉద్యోగి సత్య ప్రసాద్, ప్రభుత్వ మాజీ సలహాదారు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి తదితరులను రోజుల తరబడి గుర్తు తెలియని ప్రదేశాల్లో నిర్బంధించి దర్యాప్తు పేరిట వేధించింది. ఎక్కడికి తరలించారో వారి కుటుంబ సభ్యులకు కనీస సమాచారం కూడా ఇవ్వలేదు.
అదే రీతిలో మద్యం డిస్టిలరీల ప్రతినిధులను కూడా దర్యాప్తు పేరిట బెంబేలెత్తించారు. తాము చెప్పినట్లు చేయకుంటే వారి వ్యాపారాలను దెబ్బ తీస్తామని హడలెత్తించారు. వారిని ఏ ప్రాంతంలో విచారించారో స్పష్టత లేదు. సిట్ అధికారులతోపాటు రిటైర్డ్ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్, ప్రైవేటు వ్యక్తులు ఈ కేసు దర్యాప్తు పేరిట పలువురిని తీవ్రంగా వేధించారు. తాము చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలాలు ఇవ్వాలని బెదిరించారు. లేదంటే వారి కుటుంబ సభ్యులు, సమీప బంధువులపై సైతం అక్రమ కేసులు బనాయించి వేధిస్తామని హెచ్చరించారు.
ప్రభుత్వ మాజీ సలహాదారు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డిని అదే రీతిలో బెదిరించగా ఆయన సమీప బంధువులను కూడా తీవ్రంగా వేధించినట్లు సమాచారం. అజ్ఞాత ప్రదేశాల్లో ఈ వ్యవహారాలను సాగించారు. అదే పోలీస్ స్టేషన్‌ను గుర్తించి అధికారికంగా ప్రకటిస్తే నిందితులు, సాక్షులు, ఇతరులను అక్కడే విచారించాల్సి ఉంటుంది. అందుకే సిట్ పోలీస్ స్టేషన్ అన్నది ఎక్కడో ప్రకటించకుండా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు.
సీసీ టీవీ కెమెరాలు లేవు... జనరల్ డైరీ లేదు..
సిట్ దర్యాప్తు ప్రహసనంలో సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా చంద్రబాబు ప్రభుత్వం బేఖాతరు చేస్తోంది. అన్ని పోలీస్ స్టేషన్లలో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు స్పష్టంగా నిర్దేశించింది. టీడీపీ కూటమి ప్రభుత్వం పోలీస్ స్టేషన్లలో సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేయకపోవడాన్ని ఇటీవల హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది.
సోషల్ మీడియా కార్యకర్తలను అక్రమంగా నిర్బంధించి వేధిస్తున్న కేసు విచారణ సందర్భంగా పోలీసు శాఖపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అయినా సరే చంద్రబాబు ప్రభుత్వ తీరు మారలేదని సిట్ వ్యవహారం వెల్లడిస్తోంది. విచారణ పేరుతో ఎవరెవర్ని పిలుస్తున్నారు..? ఎంతసేపు తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు..? ఏ సమయంలో వచ్చారు... తిరిగి ఎప్పుడు వెళ్లారు..? వారితో పాటు న్యాయవాదులు వచ్చారా..? ఇలా ఏ ఒక్క అంశం అధికారికంగా రికార్డు కావడం లేదు.
ఇక ఈ కేసుకు సంబంధించి జనరల్ డైరీ (జీడీ) నమోదు చేయడం లేదు. తద్వారా దర్యాప్తు ప్రాథమిక ప్రమాణాలను సిట్ బేఖాతరు చేస్తోంది. దాంతో ఈ కేసు దర్యాప్తులో సిట్‌కు జవాబుదారీతనం లేకుండా పోయింది. దర్యాప్తు పేరుతో ఎంతమందిని వేధించినా...శారీరకంగా, మానసికంగా హింసించినా తమను ప్రశ్నించకుండా ఉండాలన్నదే సిట్ లక్ష్యం. ప్రభుత్వ పెద్దల రెడ్‌బుక్ కుట్రలను అమలు చేయడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్న సిట్ దర్యాప్తు ప్రమాణాలు, సుప్రీంకోర్టు ఆదేశాలు, పౌరులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తోందని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
డిస్టిలరీ ప్రతినిధికి చిత్రహింసలు..
అక్రమ కేసులతో వేధిస్తున్న సిట్ అరాచకాలకు తెలంగాణకు చెందిన ఓ డిస్టిలరీ ప్రతినిధి జైపాల్‌రెడ్డికి ఎదురైన చేదు అనుభవమే నిదర్శనం. దర్యాప్తు పేరుతో జైపాల్‌రెడ్డిని అక్రమంగా నిర్బంధించిన సిట్ అధికారులు ఆయన్ను తీవ్రస్థాయిలో హింసించినట్లు తెలుస్తోంది. గుర్తు తెలియని ప్రదేశానికి తరలించి మూడు రోజులపాటు తీవ్ర వేధింపులకు గురి చేశారు. తాము చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని సిట్ ఇన్‌చార్జీగా ఉన్న విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్‌బాబు ఆయనపై విరుచుకుపడినట్లు సమాచారం.
జైపాల్‌రెడ్డిని తీవ్రంగా హింసించి బెంబేలెత్తించారు. అయినప్పటికీ తాను అవాస్తవాలను వాంగ్మూలంగా ఇవ్వబోనని ఆయన నిరాకరించడంతో సిట్ అధికారుల కుట్ర బెడిసికొట్టింది. ఇదే రీతిలో పలువురు సాక్షులు, డిస్టిలరీల ప్రతినిధులను సిట్ బృందం అక్రమ నిర్భందాలతో వేధిస్తూ అరాచకానికి తెగబడుతోంది. ఈ కుతంత్రాన్ని అమలు చేసేందుకే సిట్ పోలీస్ స్టేషన్‌ను అధికారికంగా గుర్తించకుండా కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment