Essential goods Price
-
ధరలు ధగధగ.. వ్యాపారం వెలవెల!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఈ ఏడాది సంక్రాంతి సందడి పెద్దగా కనిపించడం లేదు. అన్ని జిల్లాల్లోనూ వ్యాపారాలు అంతంత మాత్రమేనని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతుంటే సంతోషంగా పండుగ ఎలా చేసుకోవాలని పేద, మధ్యతరగతి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే వస్త్ర, బంగారు, ఇతర వ్యాపారాలన్నీ దాదాపు సగానికి సగం పడిపోయాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. సంక్రాంతి పూట పిండి వంటలు చేసుకునేందుకు కూడా సామాన్య, మధ్య తరగతి ప్రజలు దిక్కులు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత ఎనిమిది నెలలుగా ఆకాశమే హద్దుగా ఎగబాకుతున్న నిత్యావసరాల ధరలను చూసి జనం బెంబేలెత్తిపోతున్నారు. పండుగ పూట ఇంటికి వచ్చే బంధువులకు నాలుగు రకాల పిండి వంటలు కూడా చేసి పెట్టలేని దుస్థితిలో ఉన్నారు. గతేడాది జనవరితో పోల్చి చూస్తే ప్రస్తుతం మార్కెట్లో వంట నూనెల నుంచి బియ్యం వరకు మండుతున్న ధరలను చూసి గగ్గోలు పెడుతున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న ధరలకు కళ్లెం వేయలేని టీడీపీ కూటమి ప్రభుత్వం.. మరో వైపు ఎన్నికల్లో ఇచి్చన హామీలు అమలు చేయకపోగా, చంద్రన్న సంక్రాంతి కానుక సైతం ఇవ్వలేమని చేతులెత్తేసింది. ఈ పరిస్థితిలో ఏ విధంగా పండుగను సంతోషంగా జరుపుకోవాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 20–40 శాతం మేర పెరిగిన ధరలు సంక్రాంతి వచ్చిందంటే పల్లెలన్నీ కళకళలాడుతుంటాయి. పండుగ నాలుగు రోజులు ఇంటికి వచ్చే కొత్త అల్లుళ్లకే కాదు.. బంధువులు, స్నేహితులకు ఘుమ ఘుమలాడే పిండి వంటలు వండి వడ్డించడం మన తెలుగువారి సంప్రదాయం. బూరెలు, గారెలు, అరిసెలు, సున్నుండలు, పొంగడాలు, పాకుండలు, కజ్జి కాయలు, పులిహోర ఇలా ఎవరికి వారు తమ స్థాయికి తగ్గట్టుగా పిండి వంటలు చేసుకుని ఆనందంగా గడుపుతారు. టీడీపీ కూటమి ప్రభుత్వం గద్దెనెక్కింది మొదలు నిత్యావసరాల ధరలు షేర్ మార్కెట్లా దూసుకెళ్లాయి. కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులు ప్రభుత్వ అండదండలతో అందినకాడికి దోచుకుంటూనే ఉన్నారు. గతేడాది సంక్రాంతికి ముందు ఉన్న ధరలతో పోలిస్తే ప్రస్తుతం సగటున 20 నుంచి 40 శాతం మేర పెరిగాయి. నిత్యావసర వస్తువులే కాదు.. కాయగూరల ధరలు సైతం పెరిగాయి. వెల్లుల్లి అయితే రికార్డు స్థాయిలో మూడు రెట్లు పెరిగింది. పిండి వంటల్లో ఉపయోగించే పప్పులు, బెల్లం, నెయ్యి ధరలు కూడా గతేడాదితో పోలిస్తే భారీగా పెరిగాయి. పప్పన్నానికీ దూరం పండుగ పూట పప్పన్నం వండుకునేందుకు కూడా భయపడే పరిస్థితి నెలకొంది. పప్పు దినుసుల ధర సామాన్య, నిరుపేదలను బెంబేలెత్తిస్తోంది. గతేడాది జనవరిలో కిలో రూ.84.50 ఉన్న శనగపప్పు ప్రస్తుతం రూ.100–140 పలుకుతోంది. గత ఏడాది రూ.150 ఉన్న కందిపప్పు అయితే నేడు ఏకంగా రూ.160–224తో అమ్ముతున్నారు. గతేడాది రూ.126 పలికిన పెసరపప్పు నేడు రూ.140–170 పలుకుతోంది. బహిరంగ మార్కెట్లో కిలోకు రూ.10 నుంచి రూ.20 తగ్గించామని ప్రభుత్వం గొప్పలు చెబుతున్నప్పటికీ, అవన్నీ నాసిరకం పప్పులే. గోధుమ పిండి సైతం గతేడాది కిలో రూ.50 పలుకగా, నేడు రూ.70 చొప్పున విక్రయిస్తున్నారు. బియ్యం ధర గురించి అయితే చెప్పనవసరం లేదు. గతేడాది ఫైన్ క్వాలిటీ బియ్యం కిలో రూ.57 ఉండగా, నేడు సాధారణ రకమే ఆ ధరతో విక్రయిస్తున్నారు. ప్రీమియం రకాలు రూ.64–75 మధ్య పలుకుతున్నాయి. లూజ్ బాస్మతి బియ్యం ధర కిలో రూ.120కి పైగానే ఉంది. నూనెల ధర ధగధగ దేశంలో మరెక్కడా లేని విధంగా రాష్ట్రంలో వంట నూనెల ధరలు విపరీతంగా పెరిగాయి. కేంద్రం దిగుమతి సుంకం పెంచిందన్న సాకుతో కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులు ఇష్టారాజ్యంగా రేట్లు పెంచేశారు. ప్రియా, ఫ్రీడం, రుచి ఇలా ప్రధాన బ్రాండ్ నూనెల ధరలన్నీ కిలోకు రూ.30–50 వరకు ఎగబాకాయి. దిగుమతి సుంకంతో సంబంధం లేని కొబ్బరి నూనె కిలోకు రూ.18, వేరుశనగ నూనెపై రూ.10, పూజాదికాలకు ఉపయోగించే నూనెలపై రూ.10–30 చొప్పున పెంచేశారు. ప్రియా ఆయిల్స్ ఇతర బ్రాండ్ ధరల కంటే రూ.20 అదనంగా ఉన్నాయి. గతేడాది జనవరిలో లీటర్ 88.60 ఉన్న పామాయిల్ ప్రస్తుతం రూ.130 పలుకుతోంది. రూ.112.80 పలికిన సన్‌ఫ్లవర్ రిఫైండ్ ఆయిల్ ప్రస్తుతం రూ.150–160 చొప్పున అమ్ముతున్నారు. నెయ్యి కిలో రూ.150 నుంచి రూ.300 వరకు పెరిగింది. పాల ధరలు గతంతో పోలిస్తే లీటర్‌కు రూ.10–20 మేర పెరిగాయి. ఇలా బెంబేలెత్తిస్తున్న నిత్యావసర ధరల ప్రభావం వల్ల సామాన్య, మధ్య తరగతి ప్రజలకు సగటున ఒక్కో కుటుంబంపై రూ.వెయ్యి నుంచి రూ.2 వేల వరకు అదనపు భారం పడుతోంది.ముందస్తు ఆర్డర్లు లేవు.. సంక్రాంతి గతంలో ఉన్నట్టు ఈ ఏడాది లేదు. ముందస్తు ఆర్డర్లు తగ్గిపోయాయి. కార్పొరేట్ గిఫ్టుల కోసం తప్పితే ప్రజల నుంచి వచ్చే ఆర్డర్లు లేవు. చిన్న కుటుంబం రూ.1,500 ఖర్చు చేస్తే 10 రకాల పిండి వంటలు అందించేవాళ్లం. అవి దాదాపు 11–12 కిలోలు ఉండేవి. గతంలో పెట్టిన డబ్బులకు ఇప్పుడు 8 కిలోలు కూడా ఇవ్వలేకపోతున్నాం. శనగపిండి, వంట నూనెల రేట్లు పెరగడంతో తక్కువ పిండి వంటలు కొనుక్కుంటున్నారు. నెయ్యి క్వాలిటీదైతే రూ.వెయ్యి పలుకుతోంది. కంపెనీ నెయ్యి హోల్‌సేల్‌లోనే గతంలో కిలో రూ.500–550 ఉంటే ఇప్పుడు రూ.650 పలుకుతోంది. కొత్తగా అల్లుళ్లు, కోడళ్లకు సారె పెడితే 100 మందికి పంచుకునే వాళ్లుŠ. ఇప్పుడు 20–30 మందికే పరిమితం అయ్యేలా పెడుతున్నారు. ఫలితంగా మాకు ఆర్డర్లు తగ్గిపోయాయి. – కె.సందీప్, పిండి వంటల వ్యాపారం, రావులపాలెంమూడొంతుల వ్యాపారం పడిపోయింది సాధారణ రోజుల్లో రోజుకు రూ.8 వేల నుంచి రూ.10 వేల దాకా వ్యాపారం జరిగేది. పండుగ సీజన్లో రోజుకు రూ.19 వేల వరకు జరిగేది. సంక్రాంతి పండుగకు 15 రోజుల ముందు నుంచి షాపు కిటకిటలాడేది. ఇంటిల్లిపాది కొత్త చెప్పులు కొనుగోలు చేసేవారు. కానీ ఆరు నెలల నుంచి వ్యాపారం బాగా తగ్గిపోయింది. సాధారణ రోజుల్లో రూ.2 వేలు దాటడం లేదు. ఈ పండుగ సీజన్లోనూ రూ.4 వేలకు మించడం లేదు. మూడొంతుల వ్యాపారం పడిపోయింది. దీనివల్ల ఇబ్బంది పడాల్సి వస్తోంది. – ఇమ్రాన్, చెప్పుల వ్యాపారి, అనంతపురంరూ.50 లక్షల నుంచి రూ.25 లక్షలకు.. చాలా రోజులుగా బంగారు నగల దుకాణం నిర్వహిస్తున్నా. కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా నగలు తయారీ చేయించి విక్రయిస్తుంటాను. పలువురు మహిళా కస్టమర్లకు వాయిదాల పద్ధతిలో కూడా నగలు చేయించి ఇస్తున్నా. గతేడాది వరకు సంవత్సరానికి రూ.50 లక్షల మేరకు వ్యాపారం సాగుతుండేది. ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. ఈ ఏడాది రూ.25 లక్షలకు మించి వ్యాపారం జరగలేదు. ప్రస్తుతం తమ చేతులో డబ్బుల్లేవని కస్టమర్లు చెబుతున్నారు. – వి.శేషగిరిరావు, శ్రీ మహేశ్వరి జ్యూయలర్స్, ఆత్మకూరు ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు ఈ సంక్రాంతి పండుగ వ్యాపారుల పాలిట శాపంగా మారింది. లక్షల రూపాయలు అప్పులు చేసి ప్రధాన పట్టణాల నుంచి నిత్యావసర సరుకులు పెద్ద మొత్తంలో తెచ్చాం. కనీసం సాధారణ రోజుల్లో జరిగినంత వ్యాపారం కూడా జరగడం లేదు. గత ఏడాది సంక్రాంతికి పది రోజుల నుంచి పండుగ వరకు మా దుకాణంలో సుమారు రూ.25 లక్షల వరకు వ్యాపారం జరిగింది. ఈ ఏడాది జనవరి 12 వస్తున్నా కనీసం రూ.3 లక్షల వ్యాపారం జరగలేదు. ఇలాంటి పరిస్థితి గత పదేళ్లలో ఎప్పుడూ చూడలేదు. – శ్రీరాములు, జనరల్ స్టోర్ యజమాని, తిరుపతి ఇప్పుడే ఈ పరిస్థితి పెద్ద పండుగ వేళ అస్సలు వ్యాపారం లేకపోవడం ఇప్పుడే చూస్తున్నాం. ఎవరిని అడిగినా డబ్బులేదంటున్నారు. ఇంతకు ముందుకంటే ఇప్పుడు ఆఫర్లు మంచిగా ఇస్తున్నాం. కానీ ఎవ్వరూ కొనడం లేదు. కాలానికి తగ్గట్టు టీవీలు, వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లలో కొత్త కొత్త ఫీచర్లతో వస్తున్నాయి. బాగానే సేల్ అవుతాయని ఆశించాం. కానీ ఎల్రక్టానిక్స్ రంగం మొత్తం పండుగ వేళ పడిపోయింది. – బాలసుబ్రమణ్యం, ఎలక్ట్రానిక్స్ వ్యాపారి, నగరి ఇలా అయితే పండుగ చేసుకునేదెలా? నేను వ్యవసాయ పనులకు వెళ్తాను. నెలకు రూ.10 వేలు కూడా రావట్లేదు. నిత్యావసరాలకు గతంలో రూ.3 వేలయ్యేది. ప్రస్తుతం రూ.5 వేలకు పైగా ఖర్చవుతోంది. కందిపప్పు రూ.180 పైగానే ఉంది. వంట నూనె ధరలు చుక్కలనంటుతున్నాయి. ధరలు ఇలా మండిపోతుంటే పండుగలెలా చేసుకుంటాం? ఎవరైనా బంధువులు ఇంటికి వస్తే భయపడే పరిస్థితి కన్పిస్తోంది. – ద్వారపూడి సత్యారావు, సీతారాంపురం, విజయనగరం జిల్లావ్యాపారాలు తగ్గిపోయాయి ప్రస్తుతం వ్యాపారాలు 75% తగ్గిపోయాయి. చాలా ఏళ్లుగా సామర్లకోటలో వస్త్ర వ్యాపారం చేస్తున్నాను. గత సంక్రాంతి సీజన్లో రోజూ రూ.20,000 వ్యాపారం జరిగేది. ఈ సీజన్లో రూ.5,000 కూడా జరగడం లేదు. ప్రజల చేతిలో సొమ్ములు లేకపోవడం వల్ల కొనేవారు తగ్గిపోయారు. – గ్రంథి సత్యనారాయణమూర్తి, వస్త్ర వ్యాపారి, సామర్లకోట, కాకినాడ జిల్లా -
నిత్యవసర వస్తువులపై తగ్గిన జీఎస్టీ.. అమలు చేయని వ్యాపారస్తులు
సాక్షి, సిటీబ్యూరో: జీఎస్టీ అమలుతో నిత్యావసరాల ధరలు తగ్గి...వినియోగదారుడిపై భారం తగ్గుతుందని భావించినా క్షేత్రస్థాయిలో పరిస్థితులు దీనికి భిన్నంగా ఉన్నాయి. జీఎస్టీ అమలు నుంచి నేటి వరకు దాదాపు 210 నిత్యావసర వస్తువులపై పన్నులు తగ్గించారు. జీఎస్టీ ప్రారంభంలో పలు వస్తువులపై 28 శాతం ఉన్న పన్నును.. ప్రస్తుతం 18 శాతానికి, 18 శాతం పన్ను ఉన్న వస్తువులకు 12 శాతానికి తగ్గించారు. గతేడాది 12 శాతం పన్ను పరిధిలో వచ్చే నిత్యావసర వస్తువుల పన్నును 5 శాతానికి తగ్గించారు. కానీ వ్యాపారులు తగ్గిన పన్నుల ప్రకారం నిత్యావసర వస్తువులను విక్రయించడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ►పన్ను తగ్గించినా వినియోగదారుడికి ప్రయోజనం లేకుండా పోయింది. మరోవైపు తగ్గిన పన్నును వ్యాపారులు ధరల్లో కలుపుకొని విక్రయిస్తున్నారు. దీంతో వినియోగదారుడికి లబ్ధి చేకూరడం లేదు. ►పన్ను తగ్గించినా ఇప్పటికే పాత ధరల్లోనే వస్తువులు మార్కెట్లో అందుబాటులో ఉంచారు. పన్నులు తగ్గినట్లు ధరలు కూడా తగ్గాయా లేదా? ధరలు యథాతథంగా వ్యాపారులు విక్రయిస్తున్నారా? అవే విషయాలను పర్యవేక్షించడానికి యాంటీ ప్రాఫెటింగ్ కమిటీ ఉంటుంది. కానీ ప్రస్తుతం ఈ కమిటీ పర్యవేక్షణ కొరవడటంతో పన్ను తగ్గించకుండా వస్తువులు విక్రయిస్తూ అక్రమాలకు పాలుపడుతున్నారు. 28 నుంచి 18 శాతానికి తగ్గిన పన్ను జీఎస్టీ ప్రారంభంలో 28 శాతం పన్ను రేటు ఎక్కువగా ఉన్న వస్తువులపై వ్యాపారులు, వినియోగదారుల నుంచి వచ్చిన స్పందన ఆధారంగా జీఎస్టీ కౌన్సిల్లో చర్చించి చాలా వస్తువులకు 18 శాతం పన్ను పరిధిలోకి మార్చారు. ► గతేడాది మరికొన్ని 18–12 శాతానికి, 12–5 శాతానికి తగ్గించారు. దీని ద్వారా వినియోగదారుడికి ఎంతో ఉపశమం కలుగుతుందని భావించారు. కానీ పన్ను రేటు తగ్గిచడంతో కలిగే భారాన్ని వినియోగదారునికి బదలాయించక పోతే అది నేరంగా పరిగణించబడుతుంది. ►దీన్ని పర్యవేక్షించడానికి కమిటీలు ఏర్పాటు చేశారు. పన్ను తగ్గించడం వల్ల కలిగిన లాభాన్ని తమకు ఇవ్వడం లేదని వినియోగదారుడు వ్యాపారస్తులపై కమిటీకి ఫిర్యాదు చేయవచ్చు. ►తగ్గిన పన్ను ప్రకారం ధరలు తగ్గించకుండా అసలు ధరలో కలిపేసి అమ్ముతున్నారు. దీంతో తగ్గిన జీఎస్టీ వినియోగదారుడికి అందడం లేదు. ఎక్కువ పన్ను రేటు ఉన్నప్పుడు ఉన్న ధర తక్కువ పన్ను భారాన్ని వ్యాపారస్తులు వినియోదారుడికి బదలాయించాలి. ►లేని పక్షంలో దీన్ని నేరంగా పరిగణించి వ్యతిరేక లాభం కమిటీ విచారణ జరిపి కేసులు నమోదు చేస్తోంది. -
సామాన్యులకు కేంద్రం శుభవార్త..తగ్గిన 11 రకాల నిత్యావసర వస్తువుల ధరలు
సామాన్యులకు కేంద్రం శుభవార్త చెప్పింది. సెప్టెంబర్ నెలలో 11 రకాలైన నిత్యావసర వస్తువుల ధరల్ని తగ్గించినట్లు ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ట్వీట్ చేశారు. 2022 సెప్టెంబర్ 2న లీటరుకు రూ.132గా ఉన్న పామాయిల్ సగటు ధర అక్టోబర్ 2న గరిష్టంగా 11 శాతం తగ్గి రూ.118కి చేరింది. వనస్పతి నెయ్యి కిలో రూ.152 నుంచి 6 శాతం తగ్గి రూ.143కి చేరింది. त्यौहारों के समय में खाद्य पदार्थों के दामों में गिरावट, घर में उत्सव, बजट में राहत। pic.twitter.com/oklqSiOn3U — Piyush Goyal (@PiyushGoyal) October 3, 2022 సన్‌ఫ్లవర్ ఆయిల్ ధర లీటర్‌కు రూ.176 నుంచి రూ.165కి 6 శాతం తగ్గి రూ.165కి చేరగా, సోయాబీన్ ఆయిల్ లీటరుకు రూ.156 నుంచి రూ.148కి 5 శాతం తగ్గింది. ఆవనూనె ధర లీటరు రూ.173 నుంచి 3 శాతం తగ్గి రూ.167కి చేరింది. వేరుశెనగ నూనె లీటరు రూ.189 నుంచి 2 శాతం తగ్గి రూ.185కి చేరింది. ఉల్లి ధర కిలో రూ.26 నుంచి 8 శాతం తగ్గి రూ.24కి, బంగాళదుంప ధర 7 శాతం తగ్గి కిలో రూ.28 నుంచి రూ.26కి చేరింది. పప్పు దినుసులు కిలో రూ.74 నుంచి రూ.71కి, మసూర్ దాల్ కిలో రూ.97 నుంచి 3 శాతం తగ్గి రూ.71కి, మినప పప్పు కిలో రూ.108 నుంచి రూ.106కి 2 శాతం తగ్గాయి. గ్లోబల్ ధరల పతనంతో దేశీయంగా ఆహార చమురు ధరలు తగ్గుముఖం పట్టాయని ఆహార మంత్రిత్వ శాఖ తెలిపింది. గ్లోబల్ రేట్లు తగ్గడం,దిగుమతి సుంకాలు తగ్గడంతో, భారతదేశంలో వంట నూనెల రిటైల్ ధరలు గణనీయంగా పడిపోయాయని పేర్కొంది. చదవండి👉 సామాన్యులకు కేంద్రం శుభవార్త..తగ్గనున్న వంటనూనె ధరలు! -
నిత్యావసర సరుకులపై రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం
-
ధరల మంట.. బతుకు తంటా!
సాక్షి, సిటీబ్యూరో: ప్రజల ఆదాయం పెరగటంలేదు... కానీ పెరిగిన నిత్యావసరాల ధరలు మాత్రం పట్టపగలే చుక్కలను చూపిస్తున్నాయి. ఏం కొనేటట్టులేదు.. ఏం తినేటట్టులేదని సామాన్యులు వాపోతున్నారు. కరోనా, లాక్డౌన్ నేపథ్యంలో కోట్లాది కుటుంబాల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కొందరికి సరైనా ఉపాధి లభించడం లేదు. కొందరికి ఉద్యోగం ఉన్నా.. వేతనాల్లోనూ కోతల కారణంగా బడ్జెట్ తారుమారైంది. దీనికి తోడు ఇటీవల ఇంధనం, గ్యాస్ ధరలు భగ్గుమంటున్నాయి. పెరిగిన పెట్రో ధరల ప్రభావం నిత్యావసరాల ధరపై పడింది. దీంతో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కిరాణా షాపులో వారం క్రితం కొన్న సామగ్రి రేటు మరో వారానికి మారిపోతోంది. అమాంతంగా పెరుగుతున్న ధరలతో సామాన్య, మధ్యతరగతి వర్గాలవారు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెరిగిన ధరలతో నగరంలో ఒక్కో కుటుంబంపై నెలకు రూ.800 నుంచి రూ.1,000 వరకు అదనపు భారం పడుతోంది. ఫలితంగా సామన్యుల్లో పడిపోయిన పొదుపు సామర్థ్యం పడిపోయిందని ఆర్థిక రంగ నిపుణులు చెప్తున్నారు. పెరిగిన రవాణా చార్జీలతో .. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో వస్తు రవాణా చార్జీలు కూడా పెరుగుతున్నాయి. పెరిగిన రవాణా చార్జీల కారణంగా నిత్యావసర వస్తువులు, కూరగాయలపై పడుతుండటంతో వాటి ధరలు కూడా పెరిగి సామాన్యుడి నెలసరి బడ్జెట్ తారుమారు అవుతోంది. నెల జీతంతో ఇల్లు గడవని పరిస్థితి నెలకొంటోంది. నగరానికి వచ్చే పప్పులు, మసాల దినుసులు, ఇతర నిత్యావసర వస్తువుల్లో అధిక శాతం పొరుగున ఉన్న కర్ణాటక, మహారాష్ట్రతో పాటు ఉత్తరాది నుంచి దిగుమతి అవుతాయి. పెట్రో ధరలు పెరగడంతో రవాణా చార్జీలు పెరిగి నిత్యావసరాల ధరలు కూడా పెరిగాయి. దీనికి తోడు కరోనా, లాక్డౌన్ కారణంగా సమయానికి సరుకులు నగర మార్కెట్లకు దిగుమతి కావడంలేదు. గ్రేటర్ ప్రజల డిమాండ్‌కు తగ్గ సరఫరా లేకపోవడంతో కూడా వ్యాపారులు ధరలు పెంచేస్తున్నారు. ఈ ఏడాది వర్షాలు బాగా పడటంతో పంటలు దిగబడి పెరిగింది. ఈ నేపథ్యంలో పప్పుదినుసుల ధరలు తగ్గాల్సి ఉంది. అయితే, ప్రస్తుత పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. పంటలు దిగుమతి పెరిగినా ఇంధన ధరలు పెరగడంతో ట్రాన్స్‌పోర్టు ఛార్జీలు పెరిగి నిత్యావసరాలు అధిక ధరల మోత మోగిస్తున్నాయి. ప్రస్తుతం కిలో రూ. ల్లో 2 నెలల క్రితం కిలో రూ. ల్లో కందిపప్పు 100– 120 85 మినపప్పు 120 –130 100 పెసరపప్పు 100– 110 90 చక్కెర 40 –45 35 బియ్యం(మంచివి) 45– 55 32–35 గోధుమలు 42 36 జొన్నలు 60 45 -
ధరలు దరువేస్తుంటే దర్జాగా చూస్తుంటారా?
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ వేళ ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు నిత్యావసర వస్తువులు సరసమైన ధరలకు అందేలా చూడాల్సిన బాధ్యతను ప్రభుత్వం నిర్వర్తించడం లేదని హైకోర్టు అభిప్రాయపడింది. ధరల్ని అదుపు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, విపత్కర పరిస్థితుల్లో ప్రజలు దోపిడీకి గురికాకూడదని, ఈ బాధ్యతను ప్రభుత్వం విస్మరించకూడదని వ్యాఖ్యానించింది. ధరల నియంత్రణపై ప్రభుత్వ చర్యలు సంతృప్తికరంగా లేవంది. ధరల్ని అదుపు చేసే విషయాన్ని ప్రభుత్వం తేలిగ్గా తీసుకున్నట్లుగా ఉందని చెప్పడానికి.. జంట నగరాల్లో 290 కేసులు మాత్రమే నమోదు చేసినట్లుగా ప్రభుత్వ నివేదిక నిదర్శనమని పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా అధిక ధరలను అదుపు చేయాలని ఆదేశించింది. ధరలను నియంత్రించేందుకు తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదికను ఈ నెల 26 నాటికి సమర్పించాలని, తదుపరి విచారణను ఈ నెల 27న జరుపుతామని తెలిపింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిల ధర్మాç Üనం ఉత్తర్వులు జారీ చేసింది. నిత్యావసరాల ధరలు పెరిగాయని పత్రికల వార్తా కథనాన్ని పిల్‌గా పరిగణించి గురువారం మరోసారి విచారణ జరిపింది. కిలో కందిపప్పు రూ.200 ఎందుకుంది? ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బి.ఎస్.ప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. అధిక ధరలకు విక్రయాలు చేసే వారిపై కేసులు నమోదు చేయాలని ఎస్పీలు, కమిషనర్లకు డీజీపీ ఆదేశాలిచ్చారని చెప్పారు. జంటనగరాల్లో అధిక ధరలకు విక్రయించే వారిపై 290 కేసులు నమోదు చేశారని తెలిపారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ..ఇళ్లకే పరిమితమైన పేద, మధ్యతరగతి ప్రజలు ఎలా జీవించాలని ప్రశ్నించింది. -
సగం వేతనాలు.. ధరలకు రెక్కలు
సాక్షి, హైదరాబాద్: కరోనా కారణంగా ప్రభుత్వమే ఉద్యోగులకు 50 శాతం జీతాలు ఇస్తున్న వేళ, మిగిలిన జనం ఆర్థికంగా ఎన్నో అవస్థలు పడుతున్న తరుణంలో నిత్యావసరాల ధరలను ప్రభుత్వం అదుపు చేయలేకపోవడంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ధరలు ఆకాశాన్ని అంటుతున్న తీరును, అధికారులు నమోదు చేసిన కేసుల్ని బేరీజు వేస్తే చర్యలు శూన్యమని వ్యాఖ్యానించింది. వీటిపై పత్రికల్లో వచ్చిన కథనాలను పిల్‌గా పరిగణించిన హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సభ్యకార్యదర్శి జీవీ సుబ్రహ్మణ్యం నివేదిక అందజేశారు. దాన్ని చూస్తే ప్రభుత్వం చెప్పేదానికి, వాస్తవానికి పొంతన లేదని సీజే జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ విజయసేన్‌రెడ్డిల ధర్మాసనం అభిప్రాయపడింది. వేర్వేరు ప్రాంతాల్లోని షాపులకు జీవీ స్వయంగా వెళ్లి పరిశీలించి ఇచ్చిన నివేదికలో పప్పులు, పొద్దుతిరుగుడు నూనె, చిరుధాన్యాలు, గోధుమ పిండి, మటన్, చేపలు, చికెన్, కూరగాయల ధరలు పెరిగాయని హైకోర్టు ఎత్తిచూపింది. కోడిగుడ్లు, టమాటాల ధరలే తక్కువగా ఉన్నాయని, కూరగాయలు సగటున రూ.40లు ఉంటే, రూ.50లకు అమ్ముతుంటే కేసులు 270 మాత్రమే నమోదు చేయడమేమిటని ప్రశ్నించింది. నారాయణగూడ లాంటి రద్దీ ఏరియాలో గత నెల మూడే కేసులు ఉన్నాయంటే అక్రమ వ్యాపారులపై కొరడా ఝుళిపించలేనట్లేనని వ్యాఖ్యానించింది. నేరుగా ప్రభుత్వమే ధరలపై సమీక్షిస్తోందని ఏజీ బీఎస్ ప్రసాద్ చెప్పిన జవాబుతో ధర్మాసనం ఏకీభవించలేదు. ధరల్ని నియంత్రించాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగానే ధరలు ఉండేలా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలిచ్చినట్లు అదనపు డీజీ రాజీవ్ రతన్ హైకోర్టుకు నివేదించారు.ఏప్రిల్‌లో 270 కేసులు నమోదు చేస్తే హైదరాబాద్‌లో 114, సైబరాబాద్ 54, రాచకొండ 83, నల్లగొండ 13, వరంగల్ 5, నిజామాబాద్ 1 నమోదు చేశామన్నారు. జోన్స్‌లో పండ్లను విక్రయించే వీలుందా? కరోనా కేసులున్న రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లల్లో పండ్లను విక్రయించేందుకు ఉన్న అవకాశాల్ని వివరించాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది.మామిడి పంటకాలమని,సకాలంలో అమ్మకాలకు అనుమతి ఇవ్వకపోతే ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతికి ఆస్కారం ఉందని గుర్తు చేసింది. మార్కెటింగ్ సౌకర్యం లేకుంటే పండ్ల రైతులు నష్టపోతారని రిటైర్డు పశువైద్యుడు కె.నారాయణరెడ్డి పిల్ వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా విక్రయాలతోపాటు ఇతర రాష్ట్రాలకు ఎగుమతికి ఉత్తర్వులు ఇవ్వాలని న్యాయవాది చిన్నోళ్ల నరేష్‌రెడ్డి కోరారు. విచారణ 13కి వాయిదా పడింది. -
నిత్యావసరాలపై మరింత దృష్టి
రెడ్, ఆరెంజ్ క్లస్టర్లలో నిర్దేశించుకున్న నిబంధనలను తప్పక పాటించాలి. గ్రీన్ క్లస్టర్లలో సడలించిన నిబంధనల మేరకు పరిశ్ర మలు, అగ్రి ప్రాసెసింగ్ యూనిట్లు, వ్యవసాయ కార్యకలాపాల్లో భౌతిక దూరం తప్పక పాటిస్తూ కార్యకలాపాలు కొనసాగేలా చూడాలి. గుజరాత్లో చిక్కుకుపోయిన తెలుగు మత్స్యకారులకు ఒక్కొక్కరికి రూ.2 వేల చొప్పున ఇవ్వండి. అక్కడున్న సుమారు 6 వేల మంది మత్స్యకారులకు ఈ డబ్బు అందజేయాలి. ఆ రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఇది అమలయ్యేలా చూడాలి. -సీఎం వైఎస్ జగన్ సాక్షి అమరావతి: నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా మరింత దృష్టి సారించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ప్రజలందరికీ వాటిని మరింత అందుబాటులోకి తీసుకొచ్చే చర్యలను వేగవంతం చేయాలన్నారు. కోవిడ్–19 నివారణ చర్యలు, టెలి మెడిసిన్ పనితీరు, గ్రీన్ క్లస్టర్లలో సడలించిన నిబంధనల మేరకు కార్యకలాపాల కొనసాగింపు.. రెడ్, ఆరెంజ్ క్లస్టర్లలో నిర్దేశించుకున్న నిబంధనలను పాటించడం, నిత్యావసర వస్తువులు, ఆక్వా ఉత్పత్తుల నిల్వ, గుజరాత్లో తెలుగు మత్స్యకారుల బాగోగులు.. తదితర అంశాలపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో అధికారులు వెల్లడించిన అంశాలు, సీఎం సూచనలు, ఆదేశాలు ఇలా ఉన్నాయి. సడలింపులో జాగ్రత్తలు పాటించాల్సిందే ► నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా చూడాలి. వాటిని ప్రజలకు మరింత అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలి. ఈ విషయమై నిరంతరం పర్యవేక్షణ కొనసాగాలి. ► కోవిడ్–19 నేపథ్యంలో సడలింపుల మేరకు కార్యకలాపాలు ప్రారంభించిన రంగాల్లో కరోనా వైరస్ నివారణా చర్యలపై బాగా అవగాహన కల్పించాలి. దీనివల్ల కార్యకలాపాలు సజావుగా సాగడానికి వీలుంటుంది. ► గుజరాత్లో చిక్కుకుపోయిన తెలుగు మత్స్యకారుల బాగోగులపై దృష్టి పెట్టాలి. వారికి తగిన సదుపాయాలు సమకూర్చి, ఆహారం అందించాలని గుజరాత్ సీఎంకు ఫోన్ చేశాను. కేంద్ర ప్రభుత్వ అధికారులతోనూ మాట్లాడాం. అక్కడ వారికి ఏ ఇబ్బందీ రాకుండా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. రైతులు నష్టపోకూడదు ► రైతు భరోసా, మత్స్యకార భరోసా లబ్ధిదారుల జాబితాలను గ్రామ సచివాలయాల్లో 2 వారాల పాటు ప్రదర్శించాలి. తర్వాత గ్రీవెన్స్ కోసం కనీసం వారం రోజుల సమయం ఇవ్వాలి. ► ఆక్వా ఉత్పత్తులను నిల్వ చేయడానికి కోల్డ్ స్టోరేజీలపై సీఎస్ దృష్టి పెట్టాలి. ఫాంగేట్ వద్దే పంట కొనుగోలు పద్ధతిని సమర్థవంతంగా అమలు చేయాలి. కూపన్ విధానం ఏరకంగా పని చేస్తుందో అధికారులు పర్యవేక్షించాలి. ► గ్రామ సచివాలయాల్లోని అగ్రికల్చర్ అసిస్టెంట్లను వినియోగించుకోవాలి. ఆయిల్‌పాం ధర తగ్గుదలపై దృష్టి పెట్టాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులకు నష్టం రాకూడదు. పక్క రాష్ట్రంలో ఉన్న రేటు కన్నా.. తక్కువకు కొనే పరిస్థితి ఉండకూడదు. ► ఈ సమీక్షలో మంత్రులు బొత్స సత్యనారాయణ, కన్న బాబు, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక సీఎస్ జవహర్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
రాష్ట్ర స్థాయిలో 7 సమన్వయ కమిటీలు
సాక్షి, అమరావతి: లాక్డౌన్ పటిష్టంగా అమలు చేయడంతోపాటు నిత్యావసరాలు సరసమైన ధరలకు లభించేలా పర్యవేక్షించేందుకు రాష్ట్రస్థాయిలో 7 సమన్వయ కమిటీలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీల్లో పలువురు అధికారులకు చోటు కల్పించారు. సంబంధిత విభాగాలు, అంశాల వారీగా సమన్వయ కమిటీలకు బాధ్యతలు కేటాయించాలని పేర్కొన్నారు. ► నిత్యావసర వస్తువుల లభ్యత, అవసరాలను అంచనా వేసి కమిటీలు తగిన చర్యలు తీసుకోవాలి. ► 1902 స్పందన కాల్ సెంటర్‌కు జిల్లా, రాష్ట్ర స్థాయిలో వచ్చే సమస్యలను సమన్వయంతో వెంటనే పరిష్కరించాలి. రోజువారీ నివేదికను స్టేట్ కంట్రోల్ రూమ్‌కు సమర్పించాలి. ► ఇదే తరహాలో జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకోవాలి. రాష్ట్ర, జిల్లాస్థాయి కంట్రోల్‌రూమ్‌ల సమన్వయంతో పని చేయాలి. ► తయారీ రంగం, రవాణా, సర్వీసులు తదితర సమస్యలపై ప్రజలు రాష్ట్ర, జిల్లాస్థాయి కంట్రోల్ రూమ్‌లను సంప్రదించాలని సూచించారు. కమిటీలు ఇవే: ► రాష్ట్ర స్థాయి కో–ఆర్డినేషన్ కమిటీ ► తయారీ, నిత్యావసర వస్తువుల రాష్ట్రస్థాయి కమిటీ ► నిత్యావసర వస్తువుల సరఫరా రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీ, ► రాష్ట్ర స్థాయి రవాణా సమన్వయ కమిటీ ► స్థానిక సమస్యల పరిష్కారానికి సమన్వయ కమిటీ ► ఎన్జీవో, స్వచ్ఛంద సంస్థల పరిష్కారానికి సమన్వయ కమిటీ ► మీడియా సమన్వయ కమిటీ జిల్లా, నియోజకవర్గ స్థాయిల్లో టాస్క్‌ఫోర్స్.. అదేవిధంగా జిల్లా స్థాయి, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిల్లో వేర్వేరుగా టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటు చేస్తూ సీఎస్ నీలం సాహ్ని సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. లాక్డౌన్ పటిష్ట అమలుతోపాటు నిత్యావసర వస్తువులను సామాన్య ప్రజానీకానికి సాధారణ ధరలకు అందుబాటులో ఉంచేందుకు ఈ టాస్క్‌ఫోర్స్ కమిటీలు చర్యలు చేపడతాయి. -
అదుపులో నిత్యావసరాల ధరలు
సాక్షి, హైదరాబాద్/శంషాబాద్ రూరల్: జనతా కర్ఫ్యూ ముగిసిన వెంటనే అనూహ్యంగా కూరగాయలు, పండ్లు, ఇతర నిత్యావసర ధరలు పెంచిన వ్యాపారులు మంగళవారం కాస్త వెనక్కి తగ్గారు. చాలాచోట్ల కూరగాయల ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో వ్యాపారులు ధరలు తగ్గించారు. సోమవారంతో పోలిస్తే జనం సైతం మార్కెట్లకు తక్కువగా రావడం, డిమాండ్‌కు మించి కూరగాయల సరఫరా ఉండటంతో ధరలు అదుపులోకి వచ్చాయి. హైదరాబాద్‌లోని గడ్డిఅన్నారం, మలక్‌పేట, మెహిదీపట్నం వంటి 12 రైతుబజార్లలో ధరలు తగ్గాయి. టమాటా కిలో రూ. 20 నుంచి రూ. 30 మధ్య విక్రయించగా, పచ్చిమిర్చి కిలో రూ. 40–50, బంగాళదుంప రూ. 30–40, ఉల్లిగడ్డ రూ. 30–40 మధ్య ధరలకు విక్రయించారు. ప్రజలంతా సామాజిక దూరం పాటించాలన్న ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో పోలీసులు చాలాచోట్ల వినియోగదారులకు అవగాహన కల్పించారు. ఉగాది పండుగ పచ్చడికి అవసరమయ్యే మామిడాకులు, వేప పువ్వు, బెల్లాలను మాత్రం వ్యాపారులు అధిక ధరలకు అమ్మారు. వేపపువ్వు చిన్నకట్టను సైతం రూ. 20–30కి విక్రయించగా, మామిడాకుల కొమ్మను ఏకంగా రూ. 50 వరకు విక్రయించారు. సూపర్మార్కెట్లలోనూ సోమవారంతో పోలిస్తే రద్దీ తక్కువగా కనిపించింది. ధరలపై నియంత్రణ ఉంటుందని, జిల్లాల్లో కలెక్టర్ల స్థాయిలో ధరల నియంత్రణపై నిఘా వేసి ఉంచామని పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. పూల రైతు విలాపం... కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా చేపట్టిన లాక్డౌన్ పూల రైతులకు కష్టాలను మిగిల్చింది. గుడిమల్కాపూర్ మార్కెట్ రెండ్రోజులుగా మూతపడగా.. మంగళవారం సైతం మార్కెట్‌ను పోలీసులు బలవంతంగా మూసివేయించారు. ఉగాది పండుగ కోసం అమ్మకాలు ఉంటాయని చాలామంది రైతులు బంతి, చామంతి, జర్మనీ పూలతో మార్కెట్‌కు ఉదయమే చేరుకున్నారు. వారిని పోలీసులు అక్కడి నుంచి బలవంతంగా పంపించి వేశారు. చాలామంది రైతులు సాగు చేశారు. లాక్డౌన్ కారణంగా ఈనెల 31 వరకు పూల మార్కెట్‌ను మూసివేస్తున్నట్లు మార్కెట్ వర్తక సంఘం చైర్మన్ బి.మహిపాల్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. -
‘ధరలను అరికట్టలేని ప్రభుత్వాలు గద్దె దిగాలి’
నిర్మల్‌రూరల్ : పెరుగుతున్న నిత్యవసరాల ధరలను అరికట్టలేని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గద్దె దిగాలని బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) రాష్ట్ర కార్యదర్శి గద్దల శంకర్, జిల్లా అధ్యక్షుడు దేవోళ్ల గంగాధర్ డిమాండ్ చేశారు. స్థానిక ఎస్టీయూ భవన్లో బుధవారం పార్టీ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గద్దల శంకర్ మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పెట్రోల్, డీజిల్‌తోపాటు నిత్యవసరాల ధరలను ఏమాత్రం అరికట్టలేకపోయిందని విమర్శించారు. ఇప్పటికీ పప్పుల ధరలు చుక్కలనంటుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. జిల్లా అధ్యక్షుడు దేవోళ్ల గంగాధర్ మాట్లాడుతూ ముఖ్య కార్యకర్తలకు ఈ నెల 26న శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతీ నియోజకవర్గం నుంచి 25మందికి తగ్గకుండా హాజరు కావాలని పేర్కొన్నారు. సమావేశంలో బీఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవిదాస్ హస్డే, బీవీఎఫ్ జిల్లా కన్వీనర్ పట్ల బాపురావు, జిల్లా కార్యవర్గ సభ్యులు మార రాజన్న, నిర్మల్, ముథోల్, బోథ్, ఆదిలాబాద్, ఖానాపూర్ నియోజకవర్గాల అధ్యక్షుడు బొరోళ్ల ముత్యం, రవిచంద్రగౌడ్, హెచ్.ప్రకాశ్, డాక్టర్ గంగాధర్, రొడ్డ నారాయణ, హరినాథ్, పుట్టి పోశెట్టి, మనోజ్, జంగుబాబు, గంగయ్య, రాజేశ్వర్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.