క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
రెడ్, ఆరెంజ్ క్లస్టర్లలో నిర్దేశించుకున్న నిబంధనలను తప్పక పాటించాలి. గ్రీన్ క్లస్టర్లలో సడలించిన నిబంధనల మేరకు పరిశ్ర మలు, అగ్రి ప్రాసెసింగ్ యూనిట్లు, వ్యవసాయ కార్యకలాపాల్లో భౌతిక దూరం తప్పక పాటిస్తూ కార్యకలాపాలు కొనసాగేలా చూడాలి.
గుజరాత్‌లో చిక్కుకుపోయిన తెలుగు మత్స్యకారులకు ఒక్కొక్కరికి రూ.2 వేల చొప్పున ఇవ్వండి. అక్కడున్న సుమారు 6 వేల మంది మత్స్యకారులకు ఈ డబ్బు అందజేయాలి. ఆ రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఇది అమలయ్యేలా చూడాలి.
-సీఎం వైఎస్ జగన్
సాక్షి అమరావతి: నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా మరింత దృష్టి సారించాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ప్రజలందరికీ వాటిని మరింత అందుబాటులోకి తీసుకొచ్చే చర్యలను వేగవంతం చేయాలన్నారు. కోవిడ్–19 నివారణ చర్యలు, టెలి మెడిసిన్ పనితీరు, గ్రీన్ క్లస్టర్లలో సడలించిన నిబంధనల మేరకు కార్యకలాపాల కొనసాగింపు.. రెడ్, ఆరెంజ్ క్లస్టర్లలో నిర్దేశించుకున్న నిబంధనలను పాటించడం, నిత్యావసర వస్తువులు, ఆక్వా ఉత్పత్తుల నిల్వ, గుజరాత్‌లో తెలుగు మత్స్యకారుల బాగోగులు.. తదితర అంశాలపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో అధికారులు వెల్లడించిన అంశాలు, సీఎం సూచనలు, ఆదేశాలు ఇలా ఉన్నాయి.
సడలింపులో జాగ్రత్తలు పాటించాల్సిందే
► నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా చూడాలి. వాటిని ప్రజలకు మరింత అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలి.
ఈ విషయమై నిరంతరం పర్యవేక్షణ కొనసాగాలి.
► కోవిడ్–19 నేపథ్యంలో సడలింపుల మేరకు కార్యకలాపాలు ప్రారంభించిన రంగాల్లో కరోనా వైరస్ నివారణా చర్యలపై బాగా అవగాహన కల్పించాలి. దీనివల్ల కార్యకలాపాలు సజావుగా సాగడానికి వీలుంటుంది.
► గుజరాత్‌లో చిక్కుకుపోయిన తెలుగు మత్స్యకారుల బాగోగులపై దృష్టి పెట్టాలి. వారికి తగిన సదుపాయాలు సమకూర్చి, ఆహారం అందించాలని గుజరాత్ సీఎంకు ఫోన్ చేశాను. కేంద్ర ప్రభుత్వ అధికారులతోనూ మాట్లాడాం. అక్కడ వారికి ఏ ఇబ్బందీ రాకుండా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి.
రైతులు నష్టపోకూడదు
► రైతు భరోసా, మత్స్యకార భరోసా లబ్ధిదారుల జాబితాలను గ్రామ సచివాలయాల్లో 2 వారాల పాటు ప్రదర్శించాలి. తర్వాత గ్రీవెన్స్ కోసం కనీసం వారం రోజుల సమయం ఇవ్వాలి.
► ఆక్వా ఉత్పత్తులను నిల్వ చేయడానికి కోల్డ్ స్టోరేజీలపై సీఎస్ దృష్టి పెట్టాలి. ఫాంగేట్ వద్దే పంట కొనుగోలు పద్ధతిని సమర్థవంతంగా అమలు చేయాలి. కూపన్ విధానం ఏరకంగా పని చేస్తుందో అధికారులు పర్యవేక్షించాలి.
► గ్రామ సచివాలయాల్లోని అగ్రికల్చర్ అసిస్టెంట్లను వినియోగించుకోవాలి. ఆయిల్‌పాం ధర తగ్గుదలపై దృష్టి పెట్టాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులకు నష్టం రాకూడదు. పక్క రాష్ట్రంలో ఉన్న రేటు కన్నా.. తక్కువకు కొనే పరిస్థితి ఉండకూడదు.
► ఈ సమీక్షలో మంత్రులు బొత్స సత్యనారాయణ, కన్న బాబు, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక సీఎస్ జవహర్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment