సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్ నివారణ చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కరోనా చికిత్స, వాక్సినేషన్‌పై సీఎం జగన్ సమీక్షించారు. అన్ని జిల్లాల్లో పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సమీక్ష సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోవిడ్ కేర్ సెంటర్లలో ఉన్నవారికి మంచి సదుపాయాలు ఇవ్వడంతో పాటు ఆస్పత్రుల్లో చేరుతున్నవారిలో అర్హులైన అందరికీ కూడా ఆరోగ్యశ్రీ కింద చికిత్స పూర్తిస్థాయిలో అందించాలన్నారు.
కోవిడ్ చికిత్సలో భాగంగా అనుసరించాల్సిన విధానాలపై ఎప్పటికప్పుడు అడ్వైజరీస్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్ అమలు తీరు దేశం మొత్తం మాట్లాడుకునేలా ఉండాలని, విప్లవాత్మక చర్యగా మనం ఆరోగ్యశ్రీని అమలు చేస్తున్నామని తెలిపారు. బీమా సంస్థలు రేట్లకన్నా.. ఆరోగ్యశ్రీ కింద చికిత్సలకు మంచి రేట్లు చెల్లిస్తున్నామని, జీఎంపీ ప్రమాణాలున్న మందులనే మనం ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలో చేపడుతున్న అనేక కార్యక్రమాలు కాలక్రమేణా దేశానికి తప్పనిసరిగా ఆదర్శనీయంగా నిలుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.కనీసం 8–10 రోజులు క్షేత్రస్థాయిలో ఉండి ఆరోగ్యశ్రీ అమలుపై ఆరా తీయాలని ఆరోగ్యశ్రీ సీఈఓకి ఆదేశించారు. క్షేత్ర స్థాయి పరిశీలనలద్వారా ఆరోగ్యశ్రీ మరింత బలోపేతం చేయాలని సీఎం జగన్ సూచించారు.
► రాష్ట్రంలో కోవిడ్ విస్తరణ పరిస్థితులను వివరించిన అధికారులు
► కేసులు నమోదు అవుతున్నా ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం ఉన్నవారి సంఖ్య చాలా స్వల్పంగా ఉందని తెలిపిన అధికారులు
► ఆస్పత్రుల్లో చేరుతున్నవారు కూడా దాదాపు చికిత్సతో కోలుకుంటున్నారని తెలిపిన అధికారులు
► క్రమంగా పాజిటివిటీ రేటు కూడా తగ్గుముఖం పడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయన్న అధికారులు
► 1.06లక్షలకుపైగా కేసుల్లో కేవలం 2709 మందే ఆస్పత్రుల్లో చేరారని తెలిపిన అధికారులు
► ఇందులో ఐసీయూలో చేరిన వారు కేవలం 287 మంది మాత్రమేనని దాదాపుగా వీళ్లుకూడా కోలుకుంటున్నారని తెలిపిన అధికారులు
► ఆస్పత్రుల్లో చేరినవారికి కూడా 93శాతం మంది ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందుతున్నారని తెలిపిన అధికారులు
► 18 ఏళ్ల పైబడ్డ వారికి 90.34 శాతం మందికి రెండు డోసుల వాక్సినేషన్ పూర్తయ్యిందన్న అధికారులు
► 15 నుంచి 18 ఏళ్ల మధ్యనున్నవారికి 98.91శాతం మొదటి డోస్ పూర్తయ్యిందన్న అధికారులు
Comments
Please login to add a commentAdd a comment