వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. మూడు దేశాలపై సుంకాలు విధించి అందరికీ ఝలక్ ఇచ్చారు. మెక్సికో, కెనడా, చైనా దేశాలపై టారిఫ్‌లు విధించారు. ఈ క్రమంలో దేశీయ తయారీని పెంచడానికి, ఫెడరల్ ప్రభుత్వానికి ఆదాయాన్ని పెంచుకునేందుకు ఆ సుంకాలను ఉపయోగిస్తామని ట్రంప్ హామీ ఇచ్చారు. దీంతో, ఆయన నిర్ణయంపై చర్చ నడుస్తోంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేశారు. అధికారం చేపట్టిన తర్వాత దూకుడు పెంచారు. ఈ క్రమంలో ఒకేసారి మూడు దేశాలపై సుంకాలను విధించారు. కెనడా, మెక్సికన్ దిగుమతులపై 25 శాతం, చైనా నుంచి వచ్చే వస్తువులపై 10 శాతం సుంకం విధించినట్లు వైట్‌హౌస్ అధికారులు తెలిపారు. ఈ మేరకు సుంకాలను విధించే ఉత్తర్వుపై ట్రంప్ సంతకం చేశారు.
ఈ సందర్భంగా ట్రంప్.. ‘మెక్సికో, కెనడా దిగుమతులపై 25% సుంకం (కెనడియన్ ఎనర్జీపై 10%), చైనాపై 10% అదనపు సుంకాన్ని అమలు చేశాను. ఫెంటానిల్ సహా మన దేశంలోకి వస్తున్న అక్రమ విదేశీయులు, ప్రాణాంతక మాదకద్రవ్యాలను అరికట్టేందుకు అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం (ఐఈఈపీఏ) ద్వారా ఈ సుంకాలు విధించాను. మనం అమెరికన్లను రక్షించాల్సిన అవసరం ఉంది. అందరి భద్రతను నిర్ధారించడం అధ్యక్షుడిగా నా కర్తవ్యం. అక్రమ విదేశీయులు, మాదకద్రవ్యాల వరద మన సరిహద్దుల గుండా ప్రవహించకుండా నిరోధించడానికి నేను నా ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేశాను. అమెరికన్లు దీనికి అనుకూలంగా ఓటు వేశారు’ అని చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉండగా.. టారిఫ్‌ల విషయంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో అమెరికా వృద్ధి తగ్గడమే కాదు.. కెనడా, మెక్సికో దేశాల్లో ఆర్థిక మాంద్యం సంభవించే ప్రమాదం ఏర్పడింది. అలాగే, ఈ ఏడాది అమెరికా ఆర్థిక వృద్ధి 1.5% తగ్గుతుందని పలువురు నిపుణులు చెబుతున్నారు. ఇక, ట్రంప్ ఆదేశాల ప్రకారం మంగళవారం అర్ధరాత్రి 12:01 గంటలకు (భారత కాలమానం ప్రకారం 05:01 గంటలకు) సుంకాలు అమల్లోకి వస్తాయి. రవాణాలో ఉన్న వస్తువులు, కటాఫ్ సమయానికి ముందే అమెరికా సరిహద్దులోకి ప్రవేశించే వారికి సుంకాల నుంచి మినహాయింపు ఉండనుంది. సరిహద్దు వెంబడి సంక్షోభం తగ్గే వరకు సుంకాలు అమలు చేస్తామని ట్రంప్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment