అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూలతలు
రూపాయి భారీ కోత ప్రభావం
అరశాతం పతనమైన సూచీలు
ఒక్క రోజులో రూ.4.29 లక్షల కోట్ల ఆవిరి
ముంబై: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడా, మెక్సికో, చైనాలపై దిగుమతి సుంకాలు పెంచుతూ ఆదేశాలు జారీ చేయడంతో సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్ అరశాతం నష్టపోయింది. దేశీయ కరెన్సీ రూపాయి భారీ కోత, అధిక వెయిటేజీ రిలయన్స్ (–1.50%), ఎల్‌అండ్‌టీ (–4.50%) క్షీణతలూ ప్రతికూల ప్రభావం చూపాయి. సెన్సెక్స్ 319 పాయింట్లు నష్టపోయి 77,186 వద్ద నిలిచింది. దీంతో ఈ సూచీ 5 రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడినట్లైంది.
నిఫ్టీ 121 పాయింట్లు క్షీణించి 23,361 వద్ద నిలిచింది. వాణిజ్య యుద్ధ భయాలతో ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయమే నష్టాల్లో మొదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 750 పాయింట్లు క్షీణించి 76,756 వద్ద, నిఫ్టీ 260 పాయింట్లు కుప్పకూలి 23,222 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. అయితే మిడ్ సెషన్ నుంచి కన్జూమర్ డ్యూరబుల్, ఐటీ, ఫార్మా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. దీంతో సూచీలు కొంతమేర నష్టాలు భర్తీ చేసుకోగలిగాయి.
→ క్యాపిటల్ గూడ్స్, ఇండ్రస్టియల్స్, విద్యుత్, యుటిలిటీస్, ఆయిల్‌అండ్‌గ్యాస్, మెటల్ షేర్లు భారీ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్ సూచీ 2%, మిడ్‌క్యాప్ ఇండెక్స్ ఒకశాతం చొప్పున నష్టపోయాయి.
→ మార్కెట్ పతనంతో రూ.4.29 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. బీఎస్‌ఈలో మొత్తం కంపెనీల మార్కెట్ విలువ రూ.419 లక్షల కోట్లకు తగ్గింది.
ప్రపంచ మార్కెట్లూ డీలా
ట్రంప్ టారిఫ్ దాడికి ప్రతిగా తాము కూడా టారిఫ్‌లు పెంచుతామని కెనడా, మెక్సికో ప్రకటించడంతో వాణిజ్య యుద్ధ భయాలు మరింత తీవ్రమయ్యాయి. ఆసియాలో జపాన్, తైవాన్, కొరియా సూచీలు 3.50% క్షీణించాయి. ఇండోనేషియా, సింగపూర్, హాంగ్‌కాంగ్ దేశాలు 2–0.5% పతనమయ్యాయి. యూరప్ మార్కెట్లు 1% నష్టపోయాయి. అమెరికా సూచీలు నాస్‌డాక్ 1%, ఎస్‌అండ్‌పీ అరశాతం, డోజోన్ పావుశాతం నష్టాలతో ట్రేడవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment