domestic stock market
-
బుల్.. కొత్త రికార్డుల్!
ముంబై: ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లు తగ్గింపు, అమెరికా, ఆసియా మార్కెట్లలో సానుకూల సంకేతాలు కలిసిరావడంతో దేశీయ స్టాక్ సూచీల రికార్డుల ర్యాలీ శుక్రవారం కూడా కొనసాగింది. సెన్సెక్స్ 1,360 పాయింట్లు ఎగసి తొలిసారి 84 వేల స్థాయిపైన 84,544 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 375 పాయింట్లు పెరిగి 25,750 ఎగువున 25,791 వద్ద నిలిచింది. ఇరు సూచీలకిది ఇది సరికొత్త రికార్డు ముగింపు. ఉదయం లాభాలతో మొదలైన సూచీలు రోజంతా తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. ప్రభుత్వరంగ బ్యాంకులు మినహా అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఒక దశలో సెన్సెక్స్ 1,510 పాయింట్లు బలపడి 84,694 వద్ద, నిఫ్టీ 433 పాయింట్లు ఎగసి 25,849 వద్ద జీవితకాల గరిష్టాలు నమోదు చేశాయి. ముఖ్యంగా ప్రైవేట్ రంగ బ్యాంకులు, మెటల్, ఆటో, రియల్టీ రంగాలకు చిన్న, మధ్య తరహా షేర్లకు భారీ డిమాండ్ నెలకొంది. దీంతో బీఎస్ఈ స్మాల్, మిడ్ క్యాప్ సూచీలు వరుసగా 1.37%, 1.16 శాతం చొప్పున పెరిగాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ పది పైసలు పెరిగి 83.55 స్థాయి వద్ద స్థిరపడింది. ఆసియా మార్కెట్లు ఒకటిన్నర శాతం లాభపడ్డాయి. యూరప్ మార్కెట్ల ఒకటిన్నర శాతం నష్టపోయాయి. రంగాల వారీగా రియల్టీ ఇండెక్స్ 3.21%, ప్రైవేటు రంగ బ్యాంక్ సూచీ 3%, క్యాపిటల్ గూడ్స్ ఇండెక్సు 2.32% లాభపడ్డాయి. ఆటో, ఇండ్రస్టియల్, మెటల్, కన్జూమర్ సూచీలు 2% పెరిగాయి. → పసిడి రుణాల వ్యాపారంపై గతంలో విధించిన ఆంక్షలను ఆర్బీఐ ఎత్తివేయడంతో ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ షేరు భారీగా లాభపడింది. బీఎస్ఈలో 7% పెరిగి రూ.531 వద్ద స్థిరపడింది.→ ఐటీడీ సిమెంటేషన్ ఇండియా షేరు 20% లాభపడి రూ.566 వద్ద అప్పర్ సర్క్యూట్ తాకింది. ఈ కంపెనీలో అదానీ ఈ కంపెనీలో 46.64% వాటా కొనుగోలు చేయ నుందన్న వార్తలతో ఈ షేరుకుడిమాండ్ నెలకొంది. → సెన్సెక్స్ 1,330 పాయింట్లు ర్యాలీ చేయడంతో ఒక్కరోజులో రూ.6.24 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలో కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.472 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్‌లో 30కి గానూ 26 షేర్లు లాభపడ్డాయి. నాలుగు షేర్లు నష్టపోయాయి. సెన్సెక్స్ ఈ ఏడాదిలో ఒక్క ట్రేడింగ్ సెషన్లోనే 1000కి పైగా పాయింట్లు లాభపడటం ఇది పదోసారి కావడం విశేషం. → ఐసీఐసీఐ(4%), హెచ్డీఎఫ్సీ బ్యాంకు(2%) షేర్లు రాణించి సూచీలకు దన్నుగా నిలిచాయి. సెన్సెక్స్ ఆర్జించిన మొత్తం 1,360 పాయింట్లలో సగ భాగం ఈ షేర్ల నుంచి వచ్చాయి. ఇంట్రాడేలో ఐసీఐసీఐ బ్యాంకు అయిదున్నర శాతం ర్యాలీ చేసి రూ.1361 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. -
నిఫ్టీ.. సిల్వర్ జూబ్లీ!
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ చరిత్రలో గురువారం ఓ మరపురాని అద్భుతం చోటు చేసుకుంది. జాతీయ స్టాక్ ఎక్సే్చంజీ సూచీ ఎన్ఎస్ఈ తొలిసారి 25,000 పాయింట్ల శిఖరాన్ని అధిరోహించింది. సెన్సెక్స్, నిఫ్టీలు ఇంట్రాడే, ముగింపుల్లోనూ సరికొత్త రికార్డులు నెలకొల్పాయి. సెపె్టంబర్లో వడ్డీరేట్ల తగ్గింపు ఉండొచ్చని ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ సంకేతాలతో ఆయిల్‌అండ్‌గ్యాస్, బ్యాంకింగ్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా సెన్సెక్స్ 126 పాయింట్లు పెరిగి 81,868 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 60 పాయింట్లు బలపడి 25 వేల స్థాయిపైన 25,011 వద్ద నిలిచింది. ముఖ్యంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్ షేర్లు సూచీలను ముందుకు నడిపించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం లాభాలతో మొదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 388 పాయింట్లు బలపడి 82,129 వద్ద, నిఫ్టీ 127 పాయింట్లు ఎగసి 25,078 వద్ద జీవితకాల గరిష్టాలు అందుకున్నాయి. పశి్చ మాసియాలో యుద్ధ ఉద్రిక్తతల ప్రభావంతో మిడ్‌సెషన్ నుంచి గరిష్టాల వద్ద ఇన్వెస్టర్లు ఎఫ్ఎంసీజీ, ఐటీ, యుటిలిటీ, టెక్ షేర్లలో లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. దీంతో సూచీలు ఆరంభ లాభాలు కోల్పోయి స్వల్ప లాభాలతో ముగిశాయి. కాగా అమెరికా మార్కెట్లు భారీ నష్టాలతో ట్రేడవుతున్నాయి.25,000 ప్రయాణం ఇలా.. → 1996, ఏప్రిల్ 22న 13 కంపెనీల లిస్టింగ్‌తో నిఫ్టీ సూచీ 1000 పాయింట్ల వద్ద ప్రయాణం ప్రారంభించింది. తొలినాళ్లలో దేశంలో తీవ్ర రాజకీయ అస్థిరత (1996–98), తర్వాత ఆసియా ఆర్థిక సంక్షోభం, డాట్‌కామ్ బబుల్, ప్రపంచ ఆర్థిక సంక్షోభం(2007) ప్రతికూల ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తూ తొలిసారి 5,000 పాయింట్లను చేరేందుకు 11 ఏళ్లు పట్టింది.→ సత్యం కుంభకోణం, యూరోపియన్ రుణ సంక్షోభం, ట్యాపర్ తంత్రం, జీఎస్టీ అమలు సవాళ్ల ఆటుపోట్లను ఎదుర్కొని 25 జూలై 2017న 10,000 మైలురాయిని చేరింది.→ ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ సంక్షోభం, కార్పొరేట్ పన్ను, కోవిడ్ మహమ్మారి సూచీని పట్టి కుదిపాయి. కరోనా తొలి వేవ్ సమయంలో 7,600కు పడిపోయిన నిఫ్టీ కేవలం 220 రోజుల్లోనే రెండింతలకు కోలుకోవడం విశేషం. ఈ క్రమంలో 5 ఫిబ్రవరి 2021న 15,000 స్థాయిని అందుకుంది. → కరోనా వేళ పెంచిన వడ్డీరేట్లను తగ్గించేందుకు, పెరిగిన ద్రవ్యోల్బణ కట్టడికి ఆర్బీఐ, ఫెడ్ రిజర్వ్‌తో పలు దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్ల పెంపు ప్రారంభం ప్రక్రియ ప్రారంభించాయి. ఇదే సమయంలో ఇజ్రాయిల్ – పాలస్తీనా యుద్ధ భయాలు తెరపైకి వచ్చాయి. ఈ సవాళ్లను ధీటుగా ఎదుర్కొని గతేడాది (2023) సెపె్టంబర్ 11న 20,000 స్థాయికి చేరింది. → ఇక 20,000 స్థాయి నుండి 25000 పాయింట్లు చేరేందుకు 220 ట్రేడింగ్ సెషన్ల సమయం తీసుకుంది. సూచీకి ఇదే అత్యంత వేగవంతమైన 5,000 పాయింట్ల లాభం. -
స్వల్ప లాభాలకు అవకాశం
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ ఈ వారం లాభాలు అందుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. స్థూల ఆర్ధిక గణాంకాలు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐలు) పెట్టుబడుల తీరు తెన్నులు సూచీలకు దారి చూపొచ్చంటున్నారు. వీటితో పాటు ప్రపంచ పరిణామాలు, డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ కదలికలు కూడా స్వల్ప కాలానికి ట్రెండ్‌ను నిర్దేశించనున్నట్లు అంచనా వేశారు. ‘‘దేశీయంగా ట్రేడింగ్‌ను ప్రభావితం చేసే ప్రధాన వార్తలేవీ లేనందును ప్రపంచ పరిణామాలపై ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చు. చైనా రియల్ ఎస్టేట్ సమస్యలు, డాలర్ ఇండెక్స్ హెచ్చు తగ్గులు, బాండ్లపై రాబడులు, యూఎస్ నిరుద్యోగ డేటా అంశాలు ఈక్విటీ మార్కెట్ల దిశానిర్దేశాన్ని మార్చగలవు. సాంకేతికంగా నిఫ్టీకి దిగువ స్థాయిలో 19,200 వద్ద తక్షణ మద్దతు, ఎగువ స్థాయిలో 19,600 వద్ద కీలక నిరోధం కలిగి ఉందని ఆప్షన్స్ డేటా సూచిస్తోంది’’ అని స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ సీనియర్ సాంకేతిక నిపుణుడు ప్రవేశ్ గౌర్ తెలిపారు. స్థూల ఆర్ధిక గణాంకాలు మెప్పించడంతో పాటు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు కలిసిరావడంతో గత వారం మొత్తంగా సెన్సెక్స్ 500 పాయింట్లు, నిఫ్టీ 169 పాయింట్లు లాభపడ్డాయి. ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు ఆందోళనలు తగ్గుముఖం పట్టడం, రియల్ ఎస్టేట్‌తో ఆర్థిక వ్యవస్థ పుంజుకునేందుకు చైనా ఉద్దీపన చర్యలు చేపట్టడంతో గత వారం ప్రపంచ వ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లలో లాభాల్లో కదలాడాయి. స్థూల ఆర్ధిక డేటాపై దృష్టి దేశీయంగా ఆగస్టు సేవల రంగ పీఎంఐ డేటా మంగళవారం విడుదల అవుతుంది. అదే రోజు జూలై అమెరికా ఫ్యాక్టరీ ఆర్డర్లు, ఆగస్టు వాహన అమ్మకాలు వెల్లడి కానున్నాయి. మరుసటి రోజు బుధవారం యూఎస్ జూలై వాణిజ్య లోటు, యూరో జోన్ రిటైల్ అమ్మకాలు.., గురువారం అమెరికా నిరుద్యోగ గణాంకాలు, చైనా వాణిజ్య లోటు డేటా విడుదల అవుతుంది. శుక్రవారం యూఎస్ హోల్‌సేల్ ఇన్వెంటరీ, జపాన్ క్యూ2 జీడీపీ వృద్ధి, కరెంట్ ఖాతా డేటా వెల్లడి అవుతుంది. అదే రోజున దేశీయంగా ఆగస్టు 25వ తేదీతో ముగిసిన బ్యాంకు రుణాలు, డిపాజిట్ వృద్ది డేటా, సెపె్టంబర్ ఒకటో తేదితో ముగిసిన ఫారెక్స్ నిల్వలు డేటా విడుదల అవుతుంది. ఈ వారంలో రెండు ఐపీఓలు రత్నవీర్ ప్రెసిషన్ ఇంజినీరింగ్ ఐపీఓ సెపె్టంబర్ 4న మొదలై ఆరో తేదిన ముగిస్తుంది. పబ్లిక్ ఇష్యూ ద్వారా కంపెనీ రూ.165.03 కోట్లను సమీకరించాలని యోచిస్తోంది. ఇష్యూ ధరను రూ. 93–రూ. 98గా నిర్ణయించారు. షేర్లు ఈ నెల 14న స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్ట్ కానున్నాయి. జూపిటర్ లైఫ్ లైన్ హాస్పిటల్స్ పబ్లిక్ ఇష్యూ సెపె్టంబర్ 6న మొదలై ఎనిమిదో తేదీ ముగుస్తుంది. పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 869.08 కోట్లను సమీకరించాలని యోచిస్తోంది. ధరల శ్రేణి రూ.695– రూ. 735 గా ఉంది. షేర్లు ఈ నెల 14న స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్ట్ కానున్నాయి. నాలుగు నెలల కనిష్టానికి ఎఫ్‌పీఐ పెట్టుబడులు భారత ఈక్విటీ మార్కెట్లలో విదేశీ పెట్టుబడులు ఆగస్టులో స్వల్పంగా తగ్గాయి. ద్రవ్యోల్బణ ఆందోళనలు, క్రూడాయిల్ ధరలు పెరగడం వంటి పరిణామాలతో ఆగస్టులో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) రూ.12 వేల కోట్లకు తగ్గించారు. అంతకు ముందు వరుసగా మూడు నెలల పాటు ఎఫ్‌పీఐలు రూ.40 వేల కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడులు పెట్టారు. ‘‘పూర్తిగా నిధుల ఉససంహరణ కంటే వేచి ఉండే ధోరణిని అనుసరిస్తున్నారు. ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలో అనిశ్చితి నెలకొంది. పరిస్థితులు వేగంగా మారుతున్న నేపథ్యంలో ఎఫ్‌పీఐ పెట్టుబడులపై ప్రభావం ఉంటుంది’’ అని మారి్నంగ్ స్టార్ ఇండియా రీసెర్చ్ మేనేజర్ హిమాన్షు శ్రీవాస్తవ తెలిపారు. గత నెలలో విదేశీ ఇన్వెస్టర్లు క్యాపిటల్ గూడ్స్, హెల్త్‌కేర్ రంగాల్లో ఎక్కువగా షేర్లు కొనుగోలు చేశారు. -
బడ్జెట్‌పై అంచనాలు, క్యూ3 ఫలితాలు కీలకం
ముంబై: ట్రేడింగ్ నాలుగురోజులే ఈ వారంలో బడ్జెట్‌పై అంచనాలు, కార్పొరేట్ క్యూ3 ఫలితాలు, ప్రపంచ పరిణామాలు దేశీయ స్టాక్ సూచీలకు దిశానిర్ధేశం చేస్తాయని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. నెలవారీ డెరివేటివ్స్ ఎక్స్పైరీ(బుధవారం) నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తతో ఒడిదుడుకుల ట్రేడింగ్‌కు అవకాశం ఉండొచ్చంటున్నారు. వీటితో పాటు దేశీయ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ ధరలపై మార్కెట్ వర్గాలు దృష్టి సారించవచ్చంటున్నారు. ‘‘అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి పరిస్థితులతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ఈ ప్రతికూల ప్రభావం దేశీయ మార్కెట్లపై స్పష్టంగా కనిపిస్తోంది. క్యూ3 ఆర్థిక ఫలితాల సీజన్ కొనసాగుతున్నందున స్టాక్, రంగాల ఆధారిత ట్రేడింగ్‌కు అవకాశం ఉంది. కొంత కాలం నిఫ్టీ 17,800–18,250 పరిధిలోనే ట్రేడవుతోంది. ఈ వారంలోనూ అదే శ్రేణిలో కదలాడొచ్చు. బడ్జెట్ వెల్లడి తర్వాత తదుపరి మూమెంటమ్ చూడొచ్చు’’ అని స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ లిమిటెడ్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా తెలిపారు. తీవ్ర ఒడిదుడులకులకు లోనవుతూ.., పరిమిత శ్రేణిలో కదలాడిన సూచీలు గతవారం స్వల్ప లాభాలను ఆర్జించగలిగాయి. సెన్సెక్స్ 361 పాయింట్లు, నిఫ్టీ 71 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. ఐటీ, మెటల్, క్యాపిటల్ గూడ్స్, ఆయిల్ అండ్ గ్యాస్, విద్యుత్ స్టాకులకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఎఫ్ఎంసీజీ, ఆటో, ఫార్మా షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఎఫ్ఐఐల బేరీష్ వైఖరి ఈ కొత్త ఏడాదిలో దేశీయ మార్కెట్ పట్ల విదేశీ ఇన్వెస్టర్లు బేరీష్ వైఖరిని ప్రదర్శిస్తున్నారు. ఈ జనవరి 20 నాటికి రూ.15,236 కోట్ల షేర్లను అమ్మేశారు. చైనా లాక్డౌన్ ఎత్తివేతతో ఎఫ్ఐఐల అక్కడి మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనికి తోడు అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యం దిశగా అడుగులేస్తుంనే భయాలు ఇందుకు కారణమయ్యాయి. ఫైనాన్స్, ఐటీ, టెలికాం షేర్లను భారీగా విక్రయిస్తున్నారు. కేవలం మెటల్, మైనింగ్ షేర్లను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇదే సమయంలో(జనవరి 21 నాటికి) సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.16,000 వేల షేర్లను కొనుగోలు చేసి మద్దతుగా నిలుస్తున్నారు. ‘‘బడ్జెట్‌పై ఆశలు నెలకొన్నప్పటికీ.., బలహీన స్థూల ఆర్థిక గణాంకాల నమోదు కారణంగా రానున్న రోజుల్లో విదేశీ ఇన్వెస్టర్లు భారత ఈక్విటీ పట్ల బేరీష్ వైఖరినే ప్రదర్శింవచ్చు’’ అని రిలిగేర్ బ్రోకింగ్ సాంకేతిక రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా తెలిపారు. కార్పొరేట్ ఆర్థిక ఫలితాలు రిలయన్స్ ఇండస్ట్రీస్ గత శుక్రవారం మార్కెట్ ముగిసిన తర్వాత క్యూ3 గణాంకాలను వెల్లడించింది. ఈ ఫలితాల ప్రభావం సోమవారం (23న) ట్రేడింగ్‌లో ప్రతిఫలించే అవకాశముంది. ఇదే వారంలోనే యాక్సిస్ బ్యాంక్, మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, బజాజ్ ఆటో, సిప్లా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, బజాజ్ ఫైనాన్స్‌సహా 300కి పైగా కంపెనీలు తమ మూడో క్వార్టర్ ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్నాయి. ఈ నేపథ్యంలో సంబంధిత కంపెనీల షేర్లు ఒడిదుడుకులకు లోనవచ్చు. ట్రేడర్లు షేరు ఆధారిత ట్రేడింగ్‌కు ఆసక్తి చూపవచ్చు. బుధవారమే ఎఫ్అండ్ఓ ఎక్స్పైరీ ఈ గురువారం జనవరి 26 గణతంత్ర దినోవత్సం సందర్భంగా ఎక్సే్చంజీలకు సెలవుకావడంతో బుధవారమే నెలవారీ డెరివేటివ్స్ కాంట్రాక్టుల గడువు ముగియనుంది. ట్రేడర్లు తమ పొజిషన్లపై తీసుకునే స్క్యేయర్ ఆఫ్ లేదా రోలోవర్ అనుగుణంగా మార్కెట్ స్పందించవచ్చు. నిఫ్టీకి ఎగువ స్థాయిలో 18,100–18,200 శ్రేణిలో నిరోధం, దిగువ స్థాయిలో 18,000–17,800 వద్ద తక్షణ మద్దతు ఉందని ఆప్షన్ డేటా సూచిస్తోంది. ప్రపంచ పరిణామాలు బ్యాంక్ ఆఫ్ జపాన్ ద్రవ్య విధాన సమావేశపు నిర్ణయాలు నేడు విడుదల కానున్నాయి. అమెరికాతో పాటు యూరోజోన్ జనవరి తయారీ, సేవా రంగ గణాంకాలు రేపు(మంగళవారం) వెల్లడి కానుంది. యూఎస్ గృహ విక్రయాలు, నిరుద్యోగ గణాంకాలు, క్యూ4 జీడీపీ అంచనా గణాంకాలు గురువారం(జనవరి 26న) విడుదల కానున్నాయి. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల ట్రేడింగ్‌ను ప్రభావితం చేసే ఈ కీలక స్థూల ఆర్థిక గణాంకాలను ఇన్వెస్టర్లు క్షుణ్ణంగా పరిశీలించే వీలుంది. ప్రీ బడ్జెట్ అంచనాలు వచ్చే ఏడాది(2024)లో జరిగే సాధారణ ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టే చివరి బడ్జెట్ ఇది. మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించి మూలధన వ్యయానికి భారీగా నిధులు కేటాయించవచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. గ్రామీణాభివృద్ధి, రైల్వేలు, రోడ్డు, రక్షణ రంగాలకు ప్రాధాన్యత ఇవ్వవచ్చంటున్నారు. బడ్జెట్ సంబంధిత ముఖ్యంగా మౌలిక వసతులు, క్యాపిటల్ గూడ్స్, సిమెంట్, ఎరువుల రంగాల షేర్లలో కదలికలు గమనించవచ్చు. -
రికార్డుల ర్యాలీ కొనసాగేనా..?
న్యూఢిల్లీ: దేశీయ స్టాక్ మార్కెట్ గతవారం వరుస రికార్డులతో దూసుకెళ్లింది. మొత్తం ఐదు ట్రేడింగ్ రోజుల్లో.. ఏకంగా నాలుగు రోజులు సూచీలు కొత్త శిఖరాలకు ఎగబాకాయి. జీఎస్టీలో వడ్డనలు లేకపోవడం, అమెరికా–చైనాల మధ్య కుదిరిన తొలి దశ వాణిజ్య ఒప్పందం, యూరోపియన్ యూనియన్‌తో బ్రిటన్ ఒప్పందానికి ప్రధాని బోరిస్ జాన్సన్ అంగీకారం తెలపడం వంటి సానుకూల అంశాల నేపథ్యంలో గడిచిన వారంలో సెన్సెక్స్ 672 పాయింట్లు, నిఫ్టీ 185 పాయింట్ల మేర పెరిగాయి. శుక్రవారం 12,294 పాయింట్లకు చేరుకుని ఇంట్రాడే గరిష్టస్థాయిని నమోదుచేసిన నిఫ్టీ చివరకు 12,272 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 41,810 పాయింట్లకు చేరుకుని.. చివరకు 41,682 వద్ద నిలిచింది. ఈ స్థాయి రికార్డులతో జోరుమీదున్న మన మార్కెట్.. ఈవారంలో ఏ విధంగా ఉండనుందనే అంశానికి, ప్రధానంగా అంతర్జాతీయ అంశాలే కీలకంగా ఉండనున్నాయని దలాల్ స్ట్రీట్ పండితులు అంచనా వేస్తున్నారు. కన్సాలిడేషన్‌కు చాన్స్..! వరుసగా రెండు వారాల పాటు ర్యాలీ కొనసాగించిన దేశీ మార్కెట్ ఈ వారంలో దిద్దుబాటుకు గురయ్యే అవకాశం ఉందని అంచనా. వాల్యుయేషన్స్ ప్రియంగా మారడమే ఇందుకు కారణంగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఫండమెంటల్‌గా బలంగా ఉన్న కంపెనీల షేర్లను మాత్రమే ఈ వారంలో కొనుగోలు చేయడం వివేకవంతమైన విధానమని, మార్కెట్ బాగా పెరిగినందున కన్సాలిడేషన్‌కు అవకాశం ఉందని రెలిగేర్ బ్రోకింగ్ పరిశోధన విభాగం వీపీ అజిత్ మిశ్రా అన్నారు. బాగా పెరిగిన షేర్ల నుంచి ప్రాఫిట్ బుకింగ్ జరిగి వ్యాల్యూ పిక్స్ వైపునకు పెట్టుబడులు మారే అవకాశం ఉన్నందున తాను కూడా కన్సాలిడేషన్ జరగవచ్చని భావిస్తున్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధనా విభాగం చీఫ్ నాయర్ చెప్పా రు. ఏడాది చివరి రోజులు కావడంతో స్టాక్ స్పెసి ఫిక్ ర్యాలీకి మాత్రమే అవకాశం ఉందని సామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమీత్ మోడీ విశ్లేషించారు. సెన్సెక్స్ 30 సూచీ నుంచి యస్ బ్యాంక్ అవుట్ బొంబే స్టాక్ ఎక్సే్ఛంజ్ (బీఎస్ఈ) బెంచ్‌మార్క్ సూచీ (సెన్సెక్స్)లోని 30 షేర్ల జాబితాలో ఈ వారంలోనే భారీ మార్పులు జరగనున్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి టాటా మోటార్స్, టాటా మోటార్స్ డీవీఆర్, యస్ బ్యాంక్, వేదాంత షేర్లను ఇండెక్స్ నుంచి తొలగించి.. వీటి స్థానంలో అల్ట్రాటెక్ సిమెంట్, టైటాన్, నెస్లే ఇండియా షేర్లను బీఎస్ఈ చేర్చనుంది. ఇదే విధంగా బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ వంటి పలు సూచీల్లో కూడా మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఈ మార్పుల కారణంగా ఫండ్ మేనేజర్లు వారి పోర్ట్‌ఫోలియోలో భారీ మార్పులను చేయనున్నారని దలాల్ స్ట్రీట్ వర్గాలు చెబుతున్నాయి. ఇక డిసెంబర్ సిరీస్ ఎఫ్ అండ్ ఓ ముగింపు ఉండడం వల్ల రికార్డుల ర్యాలీ కొనసాగేందుకు అవకాశాలు తక్కువని అంచనా వేస్తున్నారు. ఈ వారంలో ట్రేడింగ్ నాలుగు రోజులే.. క్రిస్మస్ సందర్భంగా బుధవారం (25న) దేశీ స్టాక్ ఎక్స్ఛేంజీలు సెలవు ప్రకటించాయి. దీంతో ఈ వారంలో ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితమైంది. గురువారం (26న) ఉదయం మార్కెట్ యథావిధిగా ప్రారంభమవుతుంది. -
గతవారం బిజినెస్
ఎస్బీఐ రూ. 15,000 కోట్ల సమీకరణ క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ ప్లేస్మెం ట్ (క్విప్) మార్గంలో రూ. 15,000 కోట్లు సమీకరించినట్లు ఎస్బీఐ వెల్ల డించింది. క్విప్ కింద షేరు ఒక్కింటికి రూ. 287.25 చొప్పున మొత్తం 52.2 కోట్ల షేర్లను జారీ చేసినట్లు పేర్కొంది. ఈ నిధులను క్యాపిటల్ అడెక్వసీ నిష్పత్తిని మెరుగుపర్చుకునేందుకు, ఇతరత్రా అవసరాల కోసం వినియోగించుకోనున్నట్లు ఎస్బీఐ తెలిపింది. ఫండ్ మేనేజర్లకు అచ్చొచ్చిన 2017 దేశీయ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే విదేశీ ఫండ్స్‌కు ఈ ఏడాది ఇప్పటి వరకు లాభాల వర్షమే కురిసింది. టాప్ 30 ఫండ్స్ సగటున ఈ ఏడాది ఇప్పటి వరకు 25% రాబడులను అందుకున్నవే. మోర్గాన్ స్టాన్లీ ఇండియా ఇన్వెస్ట్మెంట్ ఫండ్ 32% వృద్ధితో అగ్ర స్థానంలో ఉంది. దేశీయ ఫండ్ మేనేజర్లు లాభాల విషయంలో మరింత మెరుగ్గా ఉన్నారు. రూ.4.8 లక్షల ఆస్తులతో కూడిన 109 ఫండ్స్ సగటు వృద్ధి డాలర్లలో చూసుకుంటే 27%గా ఉంది. ఐదేళ్లలో నిఫ్టీ 30,000!! ప్రముఖ అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ మోర్గాన్ స్టాన్లీ మాత్రం నిఫ్టీ వచ్చే ఐదేళ్లలో 30,000 పాయింట్ల స్థాయికి చేరుతుందని అంటోంది. సమీప కాలంలో అంటే ఈ నెలలోనే సెన్సెక్స్ 34,000 వరకూ పెరగొచ్చంటోంది. వృద్ధి గైడెన్స్‌కి కట్టుబడి ఉన్నాం: ఇన్ఫీ ప్రాజెక్టులను కొనసాగించేందుకు కొంత మంది క్లయింట్లు భారీ డిస్కౌంట్లు అడుగుతున్నప్పటికీ.. ఈ ఏడాది ఆదాయ వృద్ధికి సంబంధించి ఇచ్చిన 6.5–8.5% గైడెన్స్‌కి కట్టుబడి ఉన్నామని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ స్పష్టం చేసింది. ఐటీ బడ్జెట్ పూర్వ స్థాయిల్లోనే కొనసాగుతున్నప్పటికీ.. కొన్ని సంస్థలు 3–5 ఏళ్ల రెన్యువల్ డీల్స్ విషయంలో 30–40% తక్కువకే ప్రాజెక్టులు చేయాలని కోరవచ్చని సంస్థ సీవోవో యూబీ ప్రవీణ్ రావు చెప్పారు. శాంసంగ్ భారీ విస్తరణ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్లో ప్రముఖ కంపె నీ అయిన శాంసంగ్ దేశీయంగా స్మా ర్ట్ఫోన్లు, రిఫ్రిజిరేటర్ల తయారీ సామర్థ్యాన్ని రెట్టింపు చేయనుంది. ఇందుకోసం ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా ప్లాంట్ ఆవరణ పక్కనే ఉన్న 35 ఎకరాల విస్తీర్ణంలో కొత్ల ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. దీనిపై రూ.4,915 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. ఈ విస్తరణ ప్రాజెక్టు వచ్చే రెండేళ్లలో పూర్తి కానుంది. బ్యాంకుల రేట్ల తగ్గింపు భారీ గృహ రుణాలపై వడ్డీరేటును ఎస్బీఐ స్వలంగా 10 బేసిస్ పాయిం ట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) తగ్గించింది. దీనితో మహిళలకు సంబంధించి ఈ రుణ రేటు 8.55 శాతంగా ఉంటుంది. ఇతరులకు 8.60 శాతంగా అమలవుతుంది. తాజా నిర్ణయం జూన్ 15వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని ఎస్బీఐ తెలిపింది. ఇక ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ) మార్జినల్ కాస్ట్ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్ఆర్)ను 0.20 శాతం తగ్గించింది. ఈ రేటు జూన్ 12వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. మరొకవైపు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ తన బేస్ రేటును ప్రస్తుత 9.50 శాతం నుంచి 9.45 శాతానికి తగ్గించింది. జూలై 1 నుంచి తాజా రేటు అమలవుతుంది. ఆర్బీఐ పాలసీ యథాతథం ద్రవ్యోల్బణం భయాలను కారణంగా చూపుతూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక పాలసీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో ను మాత్రం 0.5 శాతం తగ్గించింది. దీనితో ఈ రేటు 20 శాతానికి తగ్గింది. రెపోను పాలసీ కమిటీ యథాతథంగా కొనసాగించింది. అంటే గడిచిన 8 నెలలుగా ఈ రేటు 6.5 శాతంగానే ఉంది. మారలేదు. ఇక రివర్స్ రెపో యథాపూర్వం 6 శాతంగా కొనసాగనుంది. తగ్గిన ఎంఎఫ్ నిర్వహణ ఆస్తులు మ్యూచువల్ ఫండ్ (ఎంఎఫ్) పరిశ్రమ నిర్వహణ ఆస్తుల (ఏయూఎం) విలువ మే నెలలో 1.15 శాతం క్షీణతతో రూ.19.03 లక్షల కోట్లకు తగ్గింది. మనీ మార్కెట్ విభాగాల నుంచి ఔట్‌ఫ్లో ఉండటం దీనికి ప్రధాన కారణం. ఇక ఎంఎఫ్ పరిశ్రమ నిర్వహణ ఆస్తుల విలువ ఏప్రిల్ నెలలో రూ.19.26 లక్షల కోట్లకు ఎగసింది. ఇది ఆల్‌టైం గరిష్ట స్థాయి. వాహన విక్రయాల్లో 9 శాతం వృద్ధి దేశీ ప్యాసెంజర్ వాహన విక్రయాలు మే నెలలో 8.63 శాతం వృద్ధితో 2,31,640 యూనిట్ల నుంచి 2,51,642 యూనిట్లకు పెరిగాయి. కొత్త మోడళ్ల ఆవిష్కరణ, యుటిలిటీ వాహనాలకు బలమైన డిమాండ్ ఉండటం వంటి అంశాలు అమ్మకాల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. ఇక దేశీ కార్ల విక్రయాలు కూడా 4.8 శాతం వృద్ధితో 1,58,996 యూనిట్ల నుంచి 1,66,630 యూనిట్లకు పెరిగాయి. 82.9 కోట్లకు ఇంటర్నెట్ యూజర్లు! దేశంలో ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య 2021 నాటికి రెట్టింపుతో 82.9 కోట్లకు చేరుతుందని సిస్కో విజువల్ నెట్వర్కింగ్ ఇండెక్స్ అంచనా వేసింది. అంటే దాదాపు 59 శాతం మంది భారతీయులకు ఇంటర్నెట్ చేరువ కానుంది. ఐపీవో కాలమ్.. టెలికం సంస్థలకు ఉత్పత్తులు, డిజైన్ సేవలు అందించే తేజాస్ నెట్వర్క్స్ ఐపీవో ఈ నెల 14న ప్రారంభం కానుంది. ఒక్కో షేరుకు ధరల శ్రేణిని రూ.250–257గా ఖరారు చేశారు. రిలయన్స్ మ్యూచువల్ ఫండ్ ఐపీవోకు రానుంది. అనిల్ అంబానీ గ్రూపు ఈ మేరకు సన్నాహాలు మొదలు పెట్టింది. ఐపీవో ద్వారా రూ.20 వేల కోట్ల మార్కెట్ విలువ లభిస్తుందన్న అంచనాతో ఉంది. ఎరిస్ లైఫ్‌సైన్సెస్ తన ఐపీవోకు సంబంధించిన షేర్ల ధరల శ్రేణిని రూ. 600–603గా నిర్ణయించింది. ఐపీవో ద్వారా రూ.1 ముఖ విలువ గల 2,88,75,000 షేర్లను కంపెనీ విక్రయిస్తోంది. జూన్ 16న ప్రారంభమయ్యే ఆఫర్ 20న ముగుస్తుంది. ఆన్లైన్ టికెటింగ్ సంస్థ టికెట్‌న్యూలో చైనాకి చెందిన ఆలీబాబా గ్రూప్ సంస్థ ఆలీబాబా పిక్చర్స్ గ్రూప్ మెజారిటీ వాటాలు కొనుగోలు చేసింది. అయితే ఇందుకోసం ఎంత వెచ్చించినదీ వెల్లడి కాలేదు. ప్రవాస భారతీయుడు వీకే చావ్లాకి చెందిన చావ్లా హోటల్స్.. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుల సారథ్యంలోని ట్రంప్ హోటల్స్‌తో చేతులు కలిపింది. ఈ భాగస్వామ్య ఒప్పందం ప్రకారం అమెరికాలోని మిస్సిసిపీలో నాలుగు హోటల్స్‌ను రూపొందించనున్నారు. అమెరికన్ ఐడియా పేరిట మూడు, సియోన్ బ్రాండ్ కింద మరొకటి వీటిలో ఉండనుంది. మౌలిక రంగ సంస్థ జీఎంఆర్ గ్రూప్ కంపెనీ జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ మరో ప్రాజెక్టును చేజిక్కించుకుంది. ఇన్ఫ్రా దిగ్గజం టెర్నా భాగస్వామ్యంతో గ్రీస్‌లోని క్రీతి నగరంలో ఉన్న హిరాక్లియో విమానాశ్రయం అభివృద్ధి, నిర్వహణ ప్రాజెక్టును దక్కించుకున్నట్లు కంపెనీ తెలిపింది. పెట్రోనెట్ ఎల్ఎన్జీ సంస్థలో తమకున్న మొత్తం 10 శాతం వాటాలు విక్రయించినట్లు ఫ్రాన్స్‌కి చెందిన జీడీఎఫ్ ఇంటర్నేషనల్ వెల్ల డించింది. ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా 7.5 కోట్ల షేర్లను అమ్మినట్లు పేర్కొంది. సగటున షేరు ఒక్కింటికి రూ.421.63 ధరతో లావాదేవీల మొత్తం విలువ రూ.3,162.22 కోట్లుగా ఉంటుందని జీడీఎఫ్ తెలిపింది. ఐటీ కన్సల్టింగ్, సాఫ్ట్వేర్ సర్వీస్ కంపెనీ బోధ్‌ట్రీ తాజాగా ఇన్ఫోసిస్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఇన్ఫోసిస్ క్లయింట్లకు జీఎస్టీ పరిష్కారాలను బోధ్‌ట్రీ అందించనుంది. ఈ ప్రాజెక్టు విలువ రూ.200 కోట్లు. రష్యాకి చెందిన ప్రభుత్వ రంగ సంస్థ వినెష్కోనోమ్బ్యాంక్తో కలిసి ఐటీ, ఇన్నోవేషన్ ఫండ్ ప్రారంభించినట్లు శ్రేయి ఇన్ఫ్రా ఫైనాన్స్ సంస్థ తెలిపింది. దీని ప్రకారం రెండు సంస్థలు 200 మిలియన్ డాలర్ల మేర టెక్నాలజీ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయనున్నాయి. భారతీ ఎయిర్టెల్, టెలీనార్ ఇండియా విలీనానికి కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) గ్రిన్ సిగ్నల్ ఇచ్చిం ది. సెబీ, స్టాక్ ఎక్సే్చంజ్‌లు ఇప్పటికే ఆమోదం తెలిపాయి. దివాన్ హౌసింగ్ గ్రూపులో భాగమైన డీహెచ్ఎఫ్ఎల్ వైశ్యా, ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ విలీనానికి నేషనల్ హౌసింగ్ బోర్డు (ఎన్‌హెచ్‌బీ) ఆమోదం తెలిపింది. ఈ రెండు సంస్థల విలీనం ఆగస్ట్ నాటికి పూర్తి కానుంది. -
ఆఖర్లో ‘కొనుగోళ్ల’ రికవరీ..
► సెన్సెక్స్ 190 పాయింట్లు లాభం ► 7,100 పాయింట్ల పైకి నిఫ్టీ ముంబై: ఆఖర్లో కొనుగోళ్ల మద్దతుతో దేశీ స్టాక్‌మార్కెట్లు బుధవారం కోలుకున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 190 పాయింట్లు పెరిగి 23,382 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ కీలకమైన 7,100 మైలురాయిని దాటి 60 పాయింట్ల లాభంతో 7,108 వద్ద ముగిసింది. భారీగా పతనమైన షేర్లు.. ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల స్టాక్ల్లో కొనుగోళ్లు జరిగాయి. ప్రధానంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లలో కొనుగోళ్లతో సెంటిమెంటు మెరుగుపడింది. అయితే, రూపాయి మారకం విలువ ఒక దశలో 30 నెలల కనిష్టమైన 68.67 శాతానికి పడిపోవడంతో ఇన్వెస్టర్లు కొంత ఆచితూచి వ్యవహరించారు. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నడుమ దేశీ సూచీలు బుధవారం ప్రతికూలంగా మొదలైనప్పటికీ.. ఆ తర్వాత యూరోపియన్ సూచీలు ప్రారంభమయ్యాక లాభాల్లోకి మళ్లినట్లు హెమ్ సెక్యూరిటీస్ డెరైక్టర్ జైన్ చెప్పారు. సెన్సెక్స్ 23,435-22921 మధ్య తిరుగాడి చివరికి 190 పాయింట్లు (0.82 శాతం) పెరుగుదలతో 23,382 పాయింట్ల వద్ద ముగిసింది. అటు సెన్సెక్స్ 7,124 - 6,961 మధ్య తిరుగాడింది. ఎగుమతుల తగ్గుదల గణాంకాలతో క్రితం రోజు బ్లూచిప్ షేర్లలో ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరించడంతో సెన్సెక్స్ 362 పాయింట్లు క్షీణించింది. జేఎస్పీఎల్ మరింత డౌన్.. షేర్ల విషయానికొస్తే... జిందాల్ స్టీల్ అండ్ పవర్ షేర్లలో అమ్మకాలు రెండో రోజూ కొనసాగాయి. కంపెనీ రుణభారంపై ఆందోళనలతో షేరు మరో 3.47 శాతం క్షీణించింది. యునెటైడ్ బ్రూవరీస్ హోల్డింగ్స్ మరో 5 శాతం తగ్గింది. అయితే షేర్ల బైబ్యాక్ కారణంతో డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ స్టాక్స్ 4 శాతం పెరిగాయి. సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 21 స్క్రిప్స్ పెరిగాయి. -
21 నెలల కనిష్టానికి సూచీలు
♦ 262 పాయింట్ల నష్టంతో ♦ 23,759 పాయింట్లకు సెన్సెక్స్ కంపెనీల ఆర్థిక ఫలితాలు నిరాశాజనకంగా ఉంటున్న నేపథ్యంలో భారీ ఎత్తున అమ్మకాలు వెల్లువెత్తాయి. దీనితో బుధవారం దేశీ స్టాక్ మార్కెట్ గణనీయంగా నష్టపోయింది. బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ 21 నెలల కనిష్టానికి క్షీణించాయి. సెన్సెక్స్ క్రితం ముగింపుతో పోలిస్తే బుధవారం మరింత తక్కువగా 23,938 పాయింట్ల వద్ద ప్రారంభమై ఒక దశలో 23,637 పాయింట్ల స్థాయికి కూడా క్షీణించింది. చివరికి 262 పాయింట్ల నష్టంతో (దాదాపు 1%) దాదాపు 21 నెలల కనిష్టమైన 23,759 పాయింట్ల వద్ద ముగిసింది. 2014 మే 12న సెన్సెక్స్ చివరిసారిగా 23,551 వద్ద ముగిసింది. ఆ తర్వాత ఇదే కనిష్టం. అటు నిఫ్టీ కూడా 82 పాయింట్లు (1.13శాతం) తగ్గి 21 నెలల కనిష్టం 7,216 వద్ద ముగిసింది. చివరిసారిగా 2014 మే 16 నిఫ్టీ 7,203 పాయింట్ల స్థాయిలో ముగిసింది. బ్యాంకింగ్ షేర్లు భారీగా నష్టపోయాయి. బీఎస్ఈలో బ్యాంకింగ్ స్టాక్స్ సూచీ 2 శాతం పైగా క్షీణిం చింది. కాగా మందగమనం భయాలతో ఆసియా మార్కెట్లు బలహీనంగానే ముగిశాయి. జపాన్‌కి చెందిన నికాయ్ 2.31% నష్టపోయింది. క్రితం రోజున ఇది 5.41% పడింది. సింగపూర్ స్ట్రెయిట్ టైమ్స్ కూడా 1.57% తగ్గింది. వరుసగా ఏడు సెషన్ల పాటు తగ్గిన యూరప్ సూచీలు మాత్రం మెరుగ్గా ట్రేడయ్యాయి. బలహీనంగానే భారత్ ఆర్థిక వ్యవస్థ: డాయిష్ బ్యాంక్ న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ బలహీన ధోరణిలోనే ఉందని ప్రపంచ ఆర్థిక సేవల దిగ్గజం డాయిష్ బ్యాంక్ నివేదిక పేర్కొంది. 7 శాతం పైగానే వృద్ధి రేటు నమోదవుతున్నా... ఆర్థిక వృద్ధి ధోరణి మాత్రం బలహీనంగానే కనిపిస్తోందని విశ్లేషించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 7.6 శాతం ఉంటుందని కేంద్ర గణాంకాల కార్యాలయం అంచనావేస్తున్నప్పటికీ వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉందని తెలిపింది. పలు సర్వేలు, గణాంకాలు ఆర్థిక వ్యవస్థ బలహీనతలను తెలియజేస్తున్నాయని బ్యాంక్ నివేదిక వెల్లడించింది. కాగా బడ్జెట్ అనంతరం ఆర్బీఐ రెపో రేటు పావుశాతం తగ్గుతుందని జపాన్ బ్రోకరేజ్ సంస్థ నొమురా అంచనా వేసింది. -
ఒడిదుడుకులు కొనసాగుతాయ్!
న్యూఢిల్లీ: దేశీ స్టాక్ మార్కెట్లలో ఒడిదుడుకుల ధోరణి కొనసాగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రధానంగా డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు నేపథ్యంలో తీవ్ర హెచ్చుతగ్గులకు అవకాశం ఉందని పేర్కొన్నారు. మరోపక్క, సంవత్సరాంతం కారణంగా ఇన్వెస్టర్ల పొజిషన్లు తక్కువగానే ఉండే అవకాశం ఉండటంతో మార్కెట్లు అక్కడక్కడే కదలాడొచ్చని(సైడ్‌వేస్) కూడా భావిస్తున్నారు. ‘గురువారం డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు కారణంగా ట్రేడర్ల రోలోవర్ల ప్రభావంతో ఒడిదుడుకులు ఉండొచ్చు. వాస్తవానికి కొత్త సంవత్సరం ముందు గ్లోబల్ మార్కెట్లలో పెద్దగా కదలికలు ఉండవు. అయితే, మన మార్కెట్లలో మాత్రం డెరివేటివ్స్ క్లోజింగ్ వల్ల భారీ హెచ్చుతగ్గులకు ఆస్కారం ఉంది’ అని ట్రేడ్‌స్మార్ట్ ఆన్లైన్ వ్యవస్థాపక డెరైక్టర్ విజయ్ సింఘానియా పేర్కొన్నారు. చాలావరకూ సంస్థాగత ఇన్వెస్టర్లు సంవత్సరాంత సెలవుల్లో ఉండటంతో ట్రేడింగ్ పరిమాణం చాలా స్వల్పంగా ఉంటుందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. డాలరుతో రూపాయి మారకం విలువ కదలికలు, అంతర్జాతీయంగా ముడిచమురు ధర హెచ్చుతగ్గులు.. ఈ వారంలో మన మార్కెట్ ట్రెండ్‌కు దిశానిర్ధేశం చేస్తాయని సింఘానియా చెప్పారు.మార్కెట్లు పుంజుకోవడానికి తగిన కీలక ట్రిగ్గర్స్ కోసం వేచిచూస్తున్నాయని.. అయితే, ఏడాది చివరి రోజుల కారణంగా ఇన్వెస్టర్లు పెట్టుబడులకు ముందుకొచ్చే అవకాశాల్లేవని శామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమీత్ మోదీ వ్యాఖ్యానించారు. దీంతో మార్కెట్లు స్వల్ప శ్రేణిలో కదలికలకే పరిమితం కావచ్చనేది ఆయన అంచనా. ప్రభుత్వం సంస్కరణల విషయంలో చురుగ్గా వ్యవహరిస్తుండటంతో విదేశీ ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐ) సెంటిమెంట్ మళ్లీ మెరుగవనుందని జియోజిత్ బీఎన్పీ పారిబా ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్(ఫండమెంటల్ రీసెర్చ్) వినోద్ నాయర్ పేర్కొన్నారు. దీంతో వచ్చే ఏడాది భారత్ స్టాక్ మార్కెట్లు పురోగమించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా, ప్రస్తుత డిసెంబర్ నెలలో ఇప్పటివరకూ ఎఫ్‌పీఐలు రూ.6,537 కోట్ల మేర నికర విక్రయాలు జరిపారు. గతవారం మార్కెట్... గత వారంలో దేశీ మార్కెట్లు లాభాలను నమోదుచేశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 319 పాయింట్లు ఎగబాకి రూ.25,839 వద్ద ముగిసింది. ఇక ఎన్ఎస్ఈ కూడా 99 పాయింట్లు ఎగసి రూ.7,861 వద్ద స్థిరపడింది. -
ఇంకా ఒడిదుడుకుల్లోనే..!
సెంటిమెంట్‌పై పారిస్ ప్రభావం * టోకు ద్రవ్యోల్బణంపై దృష్టి * తిరోగమనం కొనసాగొచ్చు! * ఈ వారం మార్కెట్ గమనంపై నిపుణులు... న్యూఢిల్లీ: దేశీ స్టాక్ మార్కెట్ మరికొద్ది రోజులు పతనబాటలోనే కొనసాగే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. పారిస్‌లో చోటుచేసుకున్న భయానక ఉగ్రవాద దాడుల ప్రభావం సోమవారం తొలుత మార్కెట్‌పై పడవచ్చని భావిస్తున్నారు. అటు తర్వాత ఇదేరోజున వెలువడే అక్టోబర్ నెల టోకు ధరల ద్రవ్యోల్బణం గణాంకాలపై ఇన్వెస్టర్లు ప్రధానంగా దృష్టిసారించనున్నట్లు వారు అభిప్రాయపడ్డారు.‘కార్పొరేట్ కంపెనీల రెండో త్రైమాసిక ఫలితాలు దాదాపు ముగిశాయి. దీంతో ఇక దేశీ మార్కెట్లు.. విదేశీ పరిణామాలనే నిశితంగా గమనిస్తుంటాయి. అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు వాదనలు బలపడుతున్న నేపథ్యంలో మన మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుత తిరోగమన ధోరణి కొనసాగవచ్చు. మోదీ ప్రభుత్వం చేపడుతున్న ఆర్థిక సంస్కరణలు వాస్తవ రూపంలోకి వస్తేనే మార్కెట్లకు జోష్ లభిస్తుంది. బుల్స్ మార్కెట్లోకి తిరిగి ప్రవేశించాలంటే సంస్కరణల అమలు చాలా కీలకంగా నిలుస్తుంది’ అని సామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమీత్ మోడీ పేర్కొన్నారు. బిహార్ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఘోరంగా ఓడిపోవడంతో గత వారం కూడా మార్కెట్లు పడిపోయిన సంగతి తెలిసిందే. ఎన్నికల ఫలితాల కోసం వేచిచూసే ధోరణిని అవలంబించిన విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌ఫీఐలు).. ఇక ఆర్థిక సంస్కరణల అమలుపై దృష్టిసారించనున్నారని.. మరికొంతకాలం దూరంగానే ఉండొచ్చని జిమీత్ అభిప్రాయపడ్డారు. దాడుల ప్రభావం తాత్కాలికమే... పారిస్‌లో ఉగ్రవాద దాడుల ప్రభావం మార్కెట్లపై తాత్కాలికంగానే వుంటుందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. 2001లో అమెరికాలోనూ, 2004, 2005 సంవత్సరాల్లో యూరప్‌లోనూ ఉగ్రవాదుల దాడులు జరిగిన సందర్భంలో వాటి ప్రభావం ఒకటి, రెండు రోజులే వుందని, అటుతర్వాత మార్కెట్లు వేగంగా కోలుకున్నాయని వారు గుర్తుచేస్తున్నారు. తదుపరి రోజుల్లో ఆర్థికాంశాల ఆధారంగానే మార్కెట్ కదులుతుందని వారన్నారు. ఫెడ్ సంకేతాలతో ఆందోళన... వచ్చే నెలలో జరగనున్న పాలసీ సమీక్షలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ దశాబ్దకాలం తర్వాత వడ్డీరేట్లను పెంచేందుకు సిద్ధమవుతోందన్న వాదనలు జోరందుకుంటున్నాయి. గతవారంలో ఫెడ్ చైర్పర్సన్ జానెట్ ఎలెన్ కూడా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్న నేపథ్యంలో రేట్ల పెంపు ఉండొచ్చన్న సంకేతాలిచ్చారు. దేశీ మార్కెట్ సెంటిమెంట్‌ను రేట్ల పెంపు తీవ్రంగా దెబ్బతీసే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. మరోపక్క, గ్లోబల్ మార్కెట్ల కదలికలు, విదేశీ ఇన్వెస్టర్ల ధోరణి, డాలరుతో రూపాయి మారకం విలువ హెచ్చుతగ్గులతో పాటు టోకు ధరల ద్రవ్యోల్బణం గణాంకాలు కూడా ఈ వారం మన మార్కెట్ గమనాన్ని నిర్ధేశించనున్నాయని క్యాపిటల్ వయా గ్లోబల్ రీసెర్చ్ డెరైక్టర్ వివేక్ గుప్తా పేర్కొన్నారు. వడ్డీరేట్లపై ఫెడ్ నిర్ణయం భారత్ స్టాక్ మార్కెట్‌కు కీలకమైన ట్రిగ్గర్‌గా నిలుస్తుందన్నారు. గతవారం వెలువడిన గణాంకాల్లో పారిశ్రామికోత్పత్తి సూచీ నాలుగు నెలల కనిష్టానికి(3.6 శాతం) పడిపోగా.. రిటైల్ ద్రవ్యోల్బణం 5 శాతం పైకి ఎగబాకిన సంగతి తెలిసిందే. ఇటీవలి మార్కెట్ పతనంతో చాలా ఇండెక్స్ దిగ్గజాలు భారీగా అమ్మకాల ఒత్తిడి(ఓవర్‌సోల్డ్)కి గురయ్యాయని.. అయితే, తక్షణం మళ్లీ పుంజుకునే దాఖలాలేవీ కనబడటం లేదని రెలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్లిక్ వ్యాఖ్యానించారు. గతవారం మార్కెట్... బిహార్ ఎన్నికల ఫలితాలు, పారిశ్రామికోత్పత్తి పడిపోవడం ఇతరత్రా ప్రభావాలతో దేశీ మార్కెట్లు వరుసగా మూడో వారంలోనూ నష్టాల్లోనే ముగిశాయి. గతవారంలో సెన్సెక్స్ కీలకమైన 26 వేల పాయింట్ల స్థాయిని కోల్పోయింది. 654 పాయింట్లు క్షీణించి 25,611 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ 192 పాయింట్లు నష్టపోయి 7,762 వద్ద ముగిసింది. రెండు వారాల్లో 2,800 కోట్లు వెనక్కి... కార్పొరేట్ల రెండో త్రైమాసిక ఫలితాలు నిరాశాజనకంగా ఉండటం, అమెరికాలో వడ్డీరేట్ల పెంపు భయాలతో విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) పెట్టుబడులను వెనక్కితీసుకుంటున్నారు. గడచిన రెండు వారాల్లో(ఈ నెల 2-13 వరకూ) దేశీ మార్కెట్ల నుంచి రూ.2,819 కోట్ల నికర అమ్మకాలు జరిపారు. స్టాక్ మార్కెట్ల నుంచి రూ.2,505 కోట్లను, డెట్ మార్కెట్(బాండ్లు) నుంచి రూ.313 కోట్లను వెనక్కి తీసుకున్నారు. అక్టోబర్ నెలలో రూ.22,350 కోట్ల మొత్తాన్ని ఎఫ్‌పీఐలు నికరంగా పెట్టుబడిపెట్టిన సంగతి తెలిసిందే. -
తీవ్ర ఒడిదుడుకులు..!
న్యూఢిల్లీ: దేశీ స్టాక్ మార్కెట్లో ఈ వారం తీవ్ర హెచ్చుతగ్గులు ఉండొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రధానంగా అక్టోబర్ డెరివేటివ్ కాంట్రాక్టులకు గురువారం గడువు ముగింపు దీనికి ప్రధాన కారణమని చెప్పారు. నవంబర్ కాంట్రాక్టుల నుంచి స్టాక్స్, ఇండెక్స్‌ల లాట్ సైజులు భారీగా పెరుగుతుండటం కూడా మార్కెట్లపై ప్రభావం చూపుతుందనేది వారి అభిప్రాయం. ఇక భారతీ ఎయిర్టెల్, హెచ్డీఎఫ్సీ, మారుతీ సుజుకీ, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి బ్లూచిప్ కంపెనీ రెండో త్రైమాసికం(క్యూ2) ఫలితాలు మార్కెట్ల ట్రెండ్‌ను నిర్దేశించనున్నాయని ట్రేడ్ స్మార్ట్ ఆన్లైన్ వ్యవస్థాపక డెరైక్టర్ విజయ్ సింఘానియా వ్యాఖ్యానించారు. డెరివేటివ్ విభాగంలో ట్రేడర్ల రోలోవర్లు, బిహార్ ఎన్నికల నేపథ్యంలో నెలకొనే కొత్త పరిణామాలు కూడా మార్కెట్లపై ప్రభావం చూపవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా, వేదాంత, ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, లుపిన్ తదితర దిగ్గజాలు కూడా ఈ వారం ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్నాయి. అక్టోబర్ సిరీస్ ఎఫ్ఏఅండ్వో కాంట్రాక్టుల ముగింపు కారణంగా మార్కెట్ కొంత కుదుపులకు గురయ్యే అవకాశం ఉందని.. ఫలితాలను వెల్లడిస్తున్న, ప్రకటించిన స్టాక్స్ ఆధారితంగా కదలికలు ఉండొచ్చని రిలయన్స్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ హితేష్ అగర్వాల్ పేర్కొన్నారు. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ధోరణి, డాలరుతో రూపాయి మారకం విలువ హెచ్చుతగ్గులు, అంతర్జాతీయంగా ముడిచమురు ధరలో మార్పులు కూడా మన మార్కెట్ కదలికలను నిర్దేశించనున్నట్లు విజయ్ సింఘానియా చెప్పారు. బిహార్ ఎన్నికల ఫలితాలు(నవంబర్ 8న) వెల్లడయ్యేవరకూ ఇన్వెస్టర్లు వేచిచూసే ధోరణిని అనుసరించే అవకాశాలున్నాయని సామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమీత్ మోడీ పేర్కొన్నారు. కాగా, గత శుక్ర వారం చైనా కేంద్ర బ్యాంక్ మరో విడత పాలసీ వడ్డీరేటును పావు శాతం, రిజర్వ్ రిక్వైర్మెంట్ రేషియో(ఆర్ఆర్ఆర్)ను అర శాతం తగ్గించిన నేపథ్యంలో దీని ప్రభావం ఈ సోమవారం ప్రపంచ మార్కెట్లపై ఉండొచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. మరోపక్క, అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఈ వారం(27, 28 తేదీల్లో) పాలసీ సమీక్షను నిర్వహించనుంది. వడ్డీరేట్ల పెంపు విషయంలో ఫెడ్ తీసుకోబోయే నిర్ణయం కూడా ప్రపంచ మార్కెట్లను తీవ్రంగా ప్రభావితం చేయనుంది. అయితే, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి, అమెరికాలో మందకొడిగానే ఉన్న జాబ్ మార్కెట్ తదితర అంశాల నేపథ్యంలో వడ్డీరేట్ల పెంపును మరోసారి ఫెడ్ వాయిదా వేయొచ్చని.. ఇక ఈ ఏడాది దీనిపై నిర్ణయం ఉండకపోవచ్చన్న అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి. గత వారం మార్కెట్... వరుసగా నాలుగో వారం కూడా దేశీ స్టాక్ మార్కెట్ లాభాల్లోనే కొనసాగింది. గతవారం బీఎస్ఈ సెన్సెక్స్ 256 పాయింట్లు ఎగసి 27,471 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 57 పాయింట్ల లాభంతో 8,295 వద్ద స్ధిరపడింది. ఆరు నెలల గరిష్టానికి ఎఫ్‌పీఐల పెట్టుబడులు ఆర్బీఐ అనూహ్యంగా అర శాతం రెపో రేటును తగ్గించడం, స్థూల ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల నేపథ్యంలో దేశీ మార్కెట్లలోకి విదేశీ ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐ) నిధుల ప్రవాహం మళ్లీ జోరందుకుంటోంది. అక్టోబర్‌లో ఇప్పటివరకూ ఎఫ్‌పీఐలు నికరంగా రూ.19,000 కోట్లను వెచ్చించారు. ఇది 6 నెలల గరిష్ట స్థాయి(మార్చిలో రూ.20,723 కోట్ల నికర పెట్టుబడులు) కావడం గమనార్హం. స్టాక్స్‌లో రూ.5,545 కోట్లు, డెట్ మార్కెట్లో(బాండ్స్) రూ.13,838 కోట్లను అక్టోబర్‌లో నికరంగా ఇన్వెస్ట్ చేశారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఎఫ్‌పీఐలు రూ.23,000 కోట్ల పెట్టుబడులను(డెట్, ఈక్విటీ) నికరంగా వెనక్కి తీసుకోవడం తెలిసిందే. -
ఐటీ, ఫార్మా షేర్లలో ‘స్వీకరణ’
⇒మార్కెట్ అప్డేట్ ⇒సెన్సెక్స్ 134 పాయింట్లు, నిఫ్టీ 43 పాయింట్లు క్షీణత ముంబై: ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో దేశీ స్టాక్ మార్కెట్ గురువారం క్షీణించింది. సెన్సెక్స్ 134 పాయింట్లు తగ్గి 28,666 వద్ద ముగిసింది. ఇది వారం రోజుల కనిష్టం. అటు నిఫ్టీ 43 పాయింట్లు క్షీణించి 8,707 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దిగ్గజం టీసీఎస్ ఆర్థిక ఫలితాల వెల్లడికి ముందు ఐటీ, ఫార్మా స్టాక్స్‌లో ఇన్వెస్టర్లు భారీగా లాభాల స్వీకరణ జరిపారు. అమెరికా, ఆసియా మార్కెట్ల సానుకూల ధోరణుల మధ్య దేశీ మార్కెట్ ఒకింత మెరుగ్గానే ప్రారంభమైంది. కానీ మధ్యాహ్నం కల్లా ఆ లాభాలన్నీ ఆవిరై సెన్సెక్స్ ఒక దశలో 300 పాయింట్లు మేర క్షీణించింది. అయితే, రిఫైనరీ రంగ సంస్థలతో పాటు మరికొన్ని స్టాక్స్‌లో కొనుగోళ్లు జరగడంతో మళ్లీ కాస్త కోలుకుంది. చివరికి 0.46 శాతం నష్టంతో 28,666 పాయింట్ల వద్ద ముగిసింది. ఏప్రిల్ 7 నాటి 28,517 పాయింట్ల స్థాయి తర్వాత ఇదే కనిష్టం. ఇన్వెస్టర్లు వరుసగా రెండో రోజూ లాభాల స్వీకరణపై దృష్టి పెట్టడంతో దేశీ ఈక్విటీలు బలహీనంగా ట్రేడయినట్లు వెరాసిటీ బ్రోకింగ్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ జిగ్నేష్ చౌదరి చెప్పారు. ప్రధాన ఐటీ షేర్లు ఇన్ఫోసిస్ టెక్నాలజీస్, టీసీఎస్‌లు 1-1.7 శాతం మధ్య క్షీణించాయి. ఎస్అండ్పీ, బీఎస్ఈ ఆల్‌క్యాప్ ఇండెక్స్ ప్రారంభం ముంబై: బీఎస్ఈ, ఎస్ ఆండ్ పీ డోజోన్స్ల జాయింట్ వెంచర్ ఆసియా ఇండెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ గురువారం ‘బీఎస్ఈ, ఎస్ అండ్ పీ ఆల్‌క్యాప్ ఇండెక్స్’తోపాటు మరో 18 ఇండెక్స్‌లను ప్రారంభించింది. ఆల్‌క్యాప్ ఇండెక్స్‌లో 700 లిస్టెడ్ కంపెనీల స్టాక్స్ భాగంగా ఉంటాయి. ఈ కొత్త ఇండెక్స్‌ను లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్, లార్జ్‌మిడ్‌క్యాప్, మిడ్స్మాల్క్యాప్లు అనే ఐదు రకాల ఇండెక్స్‌లుగా, పది రంగాలకు సంబంధించిన ఉప ఇండెక్స్‌లుగా విభజిస్తారు. ఆ పది రంగాలలో మెటీరియల్స్, వినియోగదారు వస్తు సేవలు, ఎనర్జీ, ఫైనాన్స్, ఎఫ్ఎంసీజీ, హెల్త్‌కేర్, ఇండస్ట్రీయల్, ఐటీ, టెలికం, యుటిలిటీస్లు ఉన్నాయి. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్, హెల్త్‌కేర్, ఐటీ, ఎఫ్ఎంసీజీలకు సంబంధించిన ఎస్ అండ్ పీ బీఎస్ఈ ఇండెక్స్ స్థానంలో కొత్త ఇండెక్స్‌లు రానున్నాయి. -
సర్కారీ షేర్లొస్తున్నాయ్.!
⇒ కోల్ ఇండియాలో రేపు 10% వాటా విక్రయం ⇒ కేంద్ర ప్రభుత్వానికి రూ.24,000 కోట్లు లభించే చాన్స్... ⇒ రిటైలర్లకు 20% షేర్ల కేటాయింపు; బిడ్డింగ్ ధరలో 5% డిస్కౌంట్ కూడా.. ⇒ మార్చిలోపే ఓఎన్జీసీలో డిజిన్వెస్ట్‌మెంట్ న్యూఢిల్లీ: దేశీ స్టాక్ మార్కెట్లో ప్రభుత్వ రంగ కంపెనీ(పీఎస్‌యూ)ల షేర్లు వెల్లువెత్తనున్నాయి. ఈ ఏడాది పీఎస్‌యూల్లో వాటా విక్రయం(డిజిన్వెస్ట్‌మెంట్) లక్ష్యానికి మరో 60 రోజులే వ్యవధి ఉండటంతో కేంద్ర ప్రభుత్వం జోరు పెంచుతోంది. ప్రధానంగా బడా కంపెనీలపై దృష్టిపెట్టింది. ఇందులో భాగంగా జనవరి 30న(రేపు) బొగ్గు దిగ్గజం కోల్ ఇండియాలో 10 శాతం వాటాను విక్రయించనున్నట్లు ప్రకటించింది. ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) రూపంలో నేరుగా స్టాక్ మార్కెట్లో షేర్లను వేలం ప్రక్రియ ద్వారా విక్రయించనున్నట్లు కోల్ ఇండియా స్టాక్ ఎక్స్ఛేంజీలకు వెల్లడించిన సమాచారంలో పేర్కొంది. 30న స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ప్రారంభం నుంచి ముగింపు వరకూ(ఉదయం 9.15 నుంచి సాయంత్రం 3.30) షేర్ల విక్రయం జరుగుతుందని తెలిపింది. బుధవారం కంపెనీ షేరు ధర బీఎస్ఈలో స్వల్ప లాభంతో రూ.384 వద్ద ముగిసింది. దీనిప్రకారం చూస్తే కేంద్ర ఖజానాకు రూ.24,257 కోట్లు లభిస్తాయని అంచనా. అమ్మకానికి 63.17 కోట్ల షేర్లు... ప్రస్తుతం కోల్ ఇండియాలో కేంద్ర ప్రభుత్వానికి 89.65 శాతం వాటా ఉంది. ఓఎఫ్ఎస్ ద్వారా 10 శాతానికి సమానమైన 63.17 కోట్ల షేర్లను విక్రయానికి పెడుతోంది. తొలుత 5 శాతం వాటా, మరో 5 శాతాన్ని అదనంగా విక్రయించే ఆప్షన్‌తో ఓఎఫ్ఎస్ ఉంటుంది. ఈ మొత్తం షేర్లలో 20 శాతాన్ని రిటైల్ ఇన్వెస్టర్లకు... 25 శాతాన్ని మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ కంపెనీలకు కేటాయించనున్నారు. ఇప్పటివరకూ రిటైలర్లకు ఓఎఫ్ఎస్లో కోటా 10 శాతం కాగా, ఈ ఇష్యూలో రెట్టింపు చేస్తున్నారు. అంటే ఒక్కో రిటైల్ ఇన్వెస్టర్ గరిష్టంగా రూ.2 లక్షల విలువైన షేర్లను కొనుగోలు చేయొచ్చు. గురువారం మార్కెట్లు ముగిశాక షేర్ల వేలానికి సంబంధించి కనీస ధర(ఫ్లోర్ ప్రైస్)ను ప్రకటించనున్నారు. రిటైర్ ఇన్వెస్టర్లకు బిడ్డింగ్ ప్రైస్‌లో 5 శాతం డిస్కౌంట్ కూడా లభించనుంది. ప్రపంచంలో అతిపెద్ద బొగ్గు ఉత్పత్తి కంపెనీగా నిలుస్తున్న కోల్ ఇండియా... 2010 అక్టోబర్‌లో ఐపీఓ ద్వారా స్టాక్ మార్కెట్లో లిస్టయింది. ఈ ఇష్యూ ద్వారా 10 శాతం వాటా విక్రయించిన కేంద్రానికి రూ.15,199 కోట్లు లభించాయి. దేశంలో ఇప్పటిదాకా వచ్చిన అతిపెద్ద ఐపీఓగా కూడా ఇది నిలిచింది. డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యంపై దృష్టి... ఇండియన్ ఆయిల్(ఐఓసీ), బీహెచ్ఈఎల్, నాల్కో, డ్రెడ్జింగ్ కార్పొరేషన్, ఎన్‌ఎండీసీల్లో కూడా ఈ ఆర్థిక సంవత్సరంలోనే వాటాను విక్రయించే అవకాశాలున్నాయి. పీఎస్సీ, ఆర్ఈసీల్లోనూ 5 శాతం చొప్పున వాటా అమ్మకానికి కేంద్రం సిద్ధంగా ఉంది. ఐసీఓలో 10%, నాల్కో, బీహెచ్ఈఎల్, డ్రెడ్జింగ్ కార్పొరేషన్లలో 5% చొప్పున వాటాలను అమ్మాలనేది ప్రభుత్వ ప్రణాళిక. ఈ ఏడాది(2014-15)లో డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ.43,425 కోట్లను సమీకరించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. గతేడాది డిసెంబర్లో సెయిల్‌లో 5 శాతం వాటాను అమ్మడం ద్వారా ఇప్పటిదాకా లక్ష్యంలో రూ.1,715 కోట్లు మాత్రమే లభించాయి. ఇంకో రెండు నెలల్లో ఆర్థిక సంవత్సరం ముగుస్తుండటంతో ఎలాగైనా లక్ష్యాన్ని అందుకునేలా కేంద్రం వేగంగా చర్యలు చేపడుతోంది. మరోపక్క, జీడీపీలో ద్రవ్యలోటును 4.1%కి కట్టడి చేయాలన్న లక్ష్యాన్ని సాధించాలన్నా ఈ డిజిన్వెస్ట్‌మెంట్ నిధుల చాలా కీలకంగా మారాయి. కోల్ ఇండియా డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారానే లక్ష్యంలో సగం నిధులు సమకూరనుండటం గమనార్హం. వరుసలో ఓఎన్జీసీ... ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపే(మార్చిలోగా) మరో పీఎస్‌యూ చమురు అగ్రగామి ఓఎన్జీసీలో కూడా వాటా విక్రయించనున్నట్లు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బుధవారం వెల్లడించారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు భారీగా పతనం సవాలుగా నిలుస్తున్నప్పటికీ వెనక్కితగ్గబోమని చెప్పారు. కంపెనీలో 5 శాతం వాటాను విక్రయించాలనేది కేంద్రం ప్రణాళిక. ఒకపక్క క్రూడ్ క్షీణత, మరోపక్క పెట్రో సబ్సిడీ భారం కారణంగా ఇటీవలి కాలంలో ఓఎన్జీసీ షేర ధర పడిపోతూ వస్తోంది. గతేడాది జూన్‌లో రూ.472 స్థాయి నుంచి ప్రస్తుతం(బుధవారం బీఎస్ఈలో) రూ.354 స్థాయికి దిగజారింది. ప్రస్తుత షేరు ధర ప్రకారం చూస్తే ఈ వాటా అమ్మకం ద్వారా ఖజానాకు రూ.15,000 కోట్లు లభించొచ్చని అంచనా. కేంద్ర ప్రభుత్వానికి ఓఎన్జీసీలో 68.94 శాతం వాటా ఉంది. హెచ్ఏఎల్ లిస్టింగ్‌కు సన్నాహాలు... ప్రభుత్వ రంగ హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్)ను స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ చేసేందుకు ప్రయత్నాలు జోరందుకుంటున్నాయి. ఈ మహారత్న కంపెనీ పబ్లిక్ ఆఫర్(ఐపీఓ)కు వీలుగా డెరైక్టర్ల బోర్డును ఏప్రిల్ 1కల్లా పునర్వ్యవస్థీకరించనున్నారు. మరోపక్క, కేవలం విమానయాన తయారీ సంస్థగానే కాకుండా ఈ రంగంలోని టెక్నాలజీ విభాగంపై కూడా మరింత దృష్టిసారించనున్నట్లు ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్న కంపెనీ చైర్మన్ ఆర్కే త్యాగి బుధవారమిక్కడ తెలిపారు. -
బేర్ విశ్వరూపం
సెన్సెక్స్ 855 పాయింట్లు క్రాష్... 27,000 దిగువకు నిఫ్టీ 251 పాయింట్ల పతనం; 8,127 వద్ద క్లోజ్ పాయింట్ల లెక్కన ఐదున్నరేళ్లలో ఇదే అతిపెద్ద పతనం... శాతాలవారీగా చూస్తే మాత్రం పడింది 3 శాతమే వెంటాడిన ‘గ్రీస్’ భయాలు.. ముడిచమురు ధర ప్రపంచ ఆర్థిక మందగమనంపై ఆందోళనలూ తోడు చమురు-గ్యాస్, రియల్టీ, లోహ షేర్లు విలవిల... కొత్త ఏడాదిలో తొలిసారి దేశీ స్టాక్ మార్కె ట్‌కు తీవ్రమైన దెబ్బతగిలింది. ముందురోజు అమెరికా, యూరప్ మార్కెట్లలో భారీ పతనం ప్రభావంతో మన మార్కెట్లు కూడా గ్యాప్‌డౌన్‌తో ఆరంభమయ్యాయి. క్రితం ముగింపు 27,842 పాయింట్లతో పోలిస్తే 140 పాయింట్లకు పైగా నష్టంతో బీఎస్ఈ సెన్సెక్స్ మొదలైంది. ఇక ఆ తర్వాత నుంచీ పతనం మరింత తీవ్రతరమైంది. ఒకనొక దశలో 905 పాయింట్లు ఆవిరై 27,000 దిగువకు పడిపోయింది. చివరకు 855 పాయింట్ల క్షీణతతో 26,987 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ విషయానికొస్తే... 251 పాయింట్లు కుప్పకూలి... 8,127కు దిగజారింది. రెండు ప్రధాన సూచీలూ 3 శాతం చొప్పున పతనమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ తాజా ముగింపులు రెండున్నర వారాలకుపైగా కనిష్టస్థాయిలు కావడం గమనార్హం. పతనానికి పరాకాష్ట...: ఇటీవలి కాలంలో ఎన్నడూ చవిచూడని అత్యంత ఘోరమైన నష్టాన్ని దేశీ మార్కెట్లు మూటగట్టుకున్నాయి. 2009 జూలై 6న సెన్సెక్స్ 869 పాయింట్లు... నిఫ్టీ 258 పాయింట్ల చొప్పున కుప్పకూలాయి. అంటే ఐదున్నరేళ్ల తర్వాత ఇంత భారీ నష్టాలు ఇదే తొలిసారి. శాతాలపరంగా చూస్తే.. 2013 సెప్టెంబర్‌లో ఇదే స్థాయిలో (3%) క్షీణత నమోదైంది. అన్నీ నేలచూపులే...: దేశీ మార్కెట్లో ఎడాపెడా అమ్మకాలతో బీఎస్ఈలో అన్ని రంగాల సూచీలూ తీవ్ర నష్టాలతో ముగిశాయని ట్రేడర్లు పేర్కొన్నారు. ప్రధానంగా చమురు-గ్యాస్ రంగం ఇండెక్స్అత్యధిక పతనాన్ని(4.17 శాతం) మూటగట్టుకుంది. రియల్టీ 3.66 శాతం, మెటల్ సూచీ 3.49 శాతం, యంత్రపరికాల ఇండెక్స్ 3.24 శాతం, విద్యుత్ రంగం సూచీ 3.13 శాతం చొప్పున భారీగా కుప్పకూలాయి. మరోపక్క, బ్లూచిప్స్ బాటలోనే... బీఎస్ఈ స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ ఇండెక్స్‌లు 2.95 శాతం చొప్పున క్షీణించాయి. ప్రపంచ మార్కెట్లన్నీ పతనంవైపే.. గ్రీస్ భయాలు, క్రూడ్ పతనం, ఆర్థిక మందగమనం ఆందోళనలతో సోమవారం రాత్రి యూరప్ మార్కెట్లు కుప్పకూలాయి. జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ వంటి ప్రధాన దేశాల సూచీలు 3 శాతంపైగా నష్టపోయాయి. అమెరికా ప్రధాన సూచీలైన డోజోన్స్ 330 పాయింట్లు, నాస్డాక్ 84 పాయింట్ల చొప్పున దిగజారాయి. దీని ప్రభావం మంగళవారం ఆసియా మార్కెట్లపై పడింది. జపాన్, హాంకాగ్, సింగపూర్, తైవాన్, దక్షిణకొరియా వంటి ప్రధాన సూచీలు 0.32 శాతం-3 శాతం స్థాయిలో నష్టపోయాయి. చైనా షాంఘై ఇండెక్స్ మాత్రం స్వల్పంగా 0.03% లాభపడింది. మంగళవారం కూడా ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ ఇండెక్స్‌లు భారీ పతనబాటలో కొనసాగుతున్నాయి. అమెరికా సూచీల్లో డోజోన్స్ 178 పాయింట్లు, నాస్డాక్ 78 పాయింట్ల నష్టంతో ట్రేడవుతున్నాయి. ఇవీ ముఖ్యాంశాలు... మంగళవారం నాటి క్రాష్ ప్రభావంతో బీఎస్ఈలో మొత్తం లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ(ఇన్వెస్టర్ల సంపదగానూ వ్యవహరిస్తారు) రూ.2.9 లక్షల కోట్ల మేర ఆవిరైంది. రూ.96.74 లక్షల కోట్లకు పడిపోయింది.సెన్సెక్స్‌లో 30 షేర్లకు గాను 29 నష్టాల పాలయ్యాయి. హెచ్‌యూల్ మాత్రమే 1.89 శాతం లాభంతో ముగిసింది.ఇక నిఫ్టీలోని 50 షేర్ల జాబితాలో 48 షేర్లు నష్టపోయాయి.సెన్సెక్స్‌లో అత్యధికంగా ఓఎన్జీసీ 5.89% పడిపోయింది. తర్వాత స్థానాల్లో సెసా స్టెరిలైట్(5.09 శాతం), టాటా స్టీల్(4.88 శాతం), హెచ్డీఎఫ్సీ(4.69 శాతం), రిలయన్స్ ఇండస్ట్రీస్(4.67%), భెల్(4.45%), టాటా మోటార్స్(4.39%), ఐసీఐసీఐ బ్యాంక్(4.2%), ఎస్బీఐ(4.05%), టాటా పవర్(3.92%), టీసీఎస్(3.60%), యాక్సిస్ బ్యాంక్(3.54%), హీరో మోటోకార్ప్(3.43%), ఎల్అండ్టీ(3.38%), గెయిల్(3.2%), ఎన్టీపీసీ(3.13%) చొప్పున దిగజారాయి.. మార్కెట్లో క్రాష్‌ను ప్రతిబింబిస్తూ... ట్రేడయిన ప్రతి నాలుగు స్టాక్స్‌లో ఒకటి నష్టపోవడం గమనార్హం.విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) కూడా ఇటీవల ఎన్నడూ లేనంత భారీ ఎత్తున అమ్మకాలు జరిపారు. ప్రాథమిక గణాంకాల ప్రకారం... రూ.1,570 కోట్ల మేర స్టాక్స్‌ను నికరంగా విక్రయించినట్లు అంచనా. అయితే, దేశీ సంస్థలు(డీఐఐలు) రూ.1,190 కోట్ల నికర కొనుగోళ్లు జరపడం విశేషం.ఎన్ఎస్ఈ క్యాష్ విభాగంలో రూ.17,100 కోట్లు, బీఎస్ఈ నగదు విభాగంలో రూ.3,139 కోట్ల మేర టర్నోవర్ నమోదైంది. ఇక ఎన్ఎస్ఈ డెరివేటివ్స్‌లో రూ.2.91 లక్షల కోట్లు, బీఎస్ఈలో రూ.23,690 కోట్ల టర్నోవర్ నమోదయింది.నిఫ్టీ ఫ్యూచర్స్ జనవరి కాంట్రాక్టు ధర అకస్మాత్తుగా 8,000 పాయింట్ల కనిష్టాన్ని తాకడంతో ఫ్లాష్ క్రాష్(ఫ్యాట్ ఫింగర్ ట్రేడ్) లాంటిదేమైనా జరిగిందా అన్న ఊహాగానాలు చెలరేగాయి. అయితే, అలాదేమీ లేదని... ట్రేడింగ్ సాధారణ పరిస్థితుల్లోనే కొనసాగిందని ఎన్ఎస్ఈ వర్గాలు స్పష్టం చేశాయి. బేర్ పంజా విసిరింది. స్టాక్ మార్కెట్ల చరిత్రలో మరో ‘అమంగళ వారం’ నమోదైంది. రివ్వున పెరుగుతూ వచ్చిన స్టాక్ మార్కెట్లు చిగురుటాకుల్లా వణికిపోయాయి. యూరోజోన్ నుంచి గ్రీస్ వైదొలగొచ్చన్న భయాలకు తోడు... ముడిచమురు ధర మహా పతనం ప్రపంచ మార్కెట్లకు ముచ్చెమటలు పట్టిస్తోంది. దీనికితోడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై నెలకొన్న ఆందోళనలు ద‘లాల్’స్ట్రీట్‌తో పాటు విదేశీ సూచీలను అతలాకుతం చేశాయి. సెన్సెక్స్ ఐదున్నరే ళ్లలో అతిపెద్ద పతనాన్ని చవిచూసింది. ఏకంగా 855 పాయింట్లు కుప్పకూలి... 27,000 పాయింట్ల దిగువకు పడిపోయింది. చమురు, గ్యాస్; రియల్టీ, లోహ రంగాల షేర్లు భారీగా క్షీణించాయి. మంగళవారం ఒక్కరోజే దేశీ ఇన్వెస్టర్ల సంపద రూ.3 లక్షల కోట్ల మేర ఆవిరైపోయింది. -
8,200 అధిగమించిన నిఫ్టీ
66 పాయింట్లు లాభం సెన్సెక్స్ 245 పాయింట్లు ప్లస్ 27,372 వద్ద ముగింపు విదేశీ మార్కెట్ల ప్రోత్సాహం ప్రపంచ మార్కెట్ల ప్రోత్సాహంతో వరుసగా రెండో రోజు దేశీ స్టాక్ మార్కెట్ పురోగమించింది. ముందురోజు 130 పాయింట్లు ఎగసిన నిఫ్టీ తాజాగా 66 పాయింట్లు పుంజుకుంది. వెరసి మళ్లీ 8,200 పాయింట్ల కీలక స్థాయికి ఎగువన 8,225 వద్ద ముగిసింది. ఇక సెన్సెక్స్ 245 పాయింట్ల వృద్ధితో 27,372 వద్ద స్థిరపడింది. గురువారం కూడా 416 పాయింట్లు జంప్‌చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన దిద్దుబాటు నేపథ్యంలో నిఫ్టీ 650 పాయింట్లు కోల్పోయిన కారణంగా మార్కెట్లో రిలీఫ్ ర్యాలీకి తెరలేచినట్లు నిపుణులు వ్యాఖ్యానించారు. బుధవారం అర్థరాత్రి అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రెట్ల పెంపునకు సంబంధించి మరికొంత కాలం వేచిచూడనున్నట్లు పేర్కొనడంతో వరుసగా రెండో రోజు ఆసియా, యూరప్, అమెరికా స్టాక్ మార్కెట్లు లాభపడ్డాయి. దీంతో దేశీయంగానూ సెంటిమెంట్ బలపడినట్లు నిపుణులు తెలిపారు. లిస్టింగ్‌లో 12% మాంటె కార్లో డౌన్ దుస్తుల తయారీ సంస్థ మాంటె కార్లో ఫ్యాషన్స్ లిస్టింగ్ ఇన్వెస్టర్లను నిరుత్సాహపరచింది. రూ. 645 ధరలో ఇటీవలే పబ్లిక్ ఇష్యూ పూర్తిచేసుకున్న కంపెనీ షేరు తొలుత బీఎస్ఈలో 9% నష్టంతో రూ. 585 వద్ద లిస్టయ్యింది. ఆపై కనిష్టంగా రూ. 528ను తాకింది. ఇది 18%పైగా పతనమై, చివరికి 12% నష్టంతో రూ. 566 వద్ద స్థిరపడింది. ఐపీవో ద్వారా కంపెనీ రూ. 350 కోట్లను సమీకరించగా, ఇష్యూకి దాదాపు 8 రెట్లు అధిక స్పందన లభించింది.ఎన్ఎస్ఈలోనూ 12% జారి రూ. 567 వద్ద ముగిసింది. 2 ఎక్స్ఛేంజీలలోనూ కలిపి 75 లక్షలకుపైగా షేర్లు ట్రేడయ్యాయి. -
మార్కెట్ ః 100 లక్షల కోట్లు
మార్కెట్ అప్డేట్ చిన్న, మధ్య తరహా షేర్లకు డిమాండ్ మరోసారి దేశీ స్టాక్ మార్కెట్ కొత్త రికార్డు సాధించింది. తొలిసారి ముగింపులో రూ. 100 లక్షల కోట్ల విలువను నిలుపుకుంది. వాస్తవానికి గత శుక్రవారం ఇంట్రాడేలో ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే మొత్తం లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) తొలిసారి రూ. 100 లక్షల కోట్ల మార్క్‌ను తాకింది. అయితే ఆపై అమ్మకాల కారణంగా వెనక్కి తగ్గింది. కాగా, బుధవారం ట్రేడింగ్ ముగిసేసరికి బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల విలువ రూ. 1,00,40,625 కోట్ల(1.6 ట్రిలియన్ డాలర్లు) వద్ద నిలవడం ద్వారా మార్కెట్ మరో రికార్డును సొంతం చేసుకుంది. ఇందుకు బ్లూచిప్స్‌తోపాటు మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు సైతం పురోగమించడం లాభించింది. ఈ ఏడాదిలోనే మార్కెట్ విలువకు రూ. 29 లక్షల కోట్లు(500 బిలి యన్ డాలర్లు) జమకావడం చెప్పుకోదగ్గ విశేషం! 2009లో నమోదైన రూ. 50 లక్షల కోట్లతో పోలిస్తే ఇది రెట్టింపుకాగా, 2003లో ఉన్న రూ. 10 లక్షల విలువతో పోలిస్తే 10 రెట్లు ఎగసింది!! తద్వారా విలువరీత్యా ప్రపంచంలోని టాప్-10 ఎక్స్ఛేంజీలలో బీఎస్ఈ స్థానాన్ని పొందింది. ఇక సెన్సెక్స్ దిగ్గజాలలో టీసీఎస్ ఒక్కటీ రూ. 5 లక్షల కోట్ల మార్కెట్ విలువను సాధించింది. అక్కడక్కడే.... ఉదయం నుంచీ పలుమార్లు ఒడిదుడుకులకు లోనైన మార్కెట్ చివరికి మిశ్రమంగా ముగిసింది. సెన్సెక్స్ నామమాత్రంగా ఒక పాయింట్ నష్టపోయి 28,443 వద్ద నిలవగా, నిఫ్టీ 13 పాయింట్లు లాభపడి 8,538 వద్ద స్థిరపడింది. బీఎస్ఈలో ప్రధానంగా మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు 1.5% పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 1,929 లాభపడితే, 1,082 మాత్రమే నష్టపోయాయి. 200 షేర్లు ఏడాది గరిష్టాన్ని తాకడం విశేషం. సెన్సెక్స్ దిగ్గజాలలో ఓఎన్జీసీ, భెల్ 2.5%పైగా పురోగమించగా, డాక్టర్ రెడ్డీస్ అదే స్థాయిలో డీలాపడింది. -
రూ. 100 లక్షల కోట్లు
కొత్త మైలురాయిని తాకిన దేశీ స్టాక్ మార్కెట్ విలువ సెన్సెక్స్, నిఫ్టీ కొత్త శిఖరాలతో పైపైకి... ⇒ 11 ఏళ్లలో 10 రెట్లు జంప్... ⇒ 5 లక్షల కోట్ల విలువతో టీసీఎస్ టాప్ ⇒ రూ. లక్ష కోట్ల క్లబ్లో 19 బ్లూచిప్స్ ⇒ సెన్సెక్స్-30 కంపెనీల విలువ రూ.47,21,345 కోట్లు దేశీ స్టాక్ మార్కెట్లో బుల్ దుమ్ముదులిపేస్తోంది. రోజుకో కొత్త రికార్డులతో చెంగుచెంగున పరుగులుపెడుతోంది. దీంతో ప్రధాన సూచీలైన బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ కొత్త ఆల్‌టైమ్ గరిష్టాలతో చరిత్ర సృష్టిస్తున్నాయి. ఈ రికార్డు పరుగులతో శుక్రవారం దేశీ స్టాక్ మార్కెట్ విలువ చరిత్రలో ఎన్నడూ చూడని కొత్త మైలురాయిని తాకింది. బీఎస్ఈలో లిస్టయిన మొత్తం కంపెనీల మార్కెట్ విలువ తొలిసారిగా రూ. 100 లక్షల కోట్ల స్థాయిని అధిగమించింది. ఇప్పటికే ట్రిలియన్(లక్ష కోట్లు) డాలర్ల క్లబ్లో దూసుకుపోతున్న దేశీ మార్కెట్ ప్రస్తుతం 1.627 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇక రూ. లక్ష కోట్ల మార్కెట్ విలువగల జాబితాలో 19 బ్లూచిప్ కంపెనీలు స్థానం సంపాదించడం విశేషం. మన స్టాక్ మార్కెట్లకు ఈ ఏడాదిని బుల్ నామ సంవత్సరంగా చెప్పుకోవచ్చు. 2014 ఆరంభం నుంచే మొదలైన దూకుడు ఏడాది చివరివరకూ కొనసాగుతూనే ఉండటం దీనికి నిదర్శనం. మార్కెట్ జోరుతో సెన్సెక్స్ ఏకంగా ఈ ఏడాది ఇప్పటివరకూ 35 శాతంపైగా ఎగబాకింది. అంటే 7,546 పాయింట్లు జతచేసుకుంది. శుక్రవారం కూడా సెన్సెక్స్, నిఫ్టీ కొత్త ఆల్‌టైమ్ గరిష్టాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 28,822 పాయింట్లను తాకింది. దీంతో బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ (దేశీ స్టాక్ మార్కెట్ క్యాప్) ఒకానొక దశలో రూ.100,07,500 కోట్లకు ఎగబాకింది. అయితే, సెన్సెక్స్ చివర్లో కొద్దిగా దిగిరావడంతో మార్కెట్ విలువ రూ.99,83,701 కోట్ల వద్ద స్థిరపడింది. ఇక శుక్రవారం 8,617 పాయింట్లను తాకిన ఎన్ఎస్ఈ నిఫ్టీ ఈ ఏడాది ఇప్పటిదాకా 2,262 పాయింట్లు(36%) దూసుకెళ్లింది. లిస్టెడ్ కంపెనీల మొత్తం షేర్ల విలువనే మార్కెట్ క్యాప్‌గా వ్యవహరిస్తారు. దీన్నే ఇన్వెస్టర్ల మొత్తం సంపదగా చెప్పొచ్చు. 2 ట్రిలియన్ డాలర్ల దిశగా... 2007లో తొలిసారిగా మన స్టాక్ మార్కెట్ ట్రిలియన్ డాలర్ల క్లబ్‌లోకి చేరింది. అయితే, 2008లో అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభంతో ప్రపంచ మార్కెట్లు కుప్పకూలడం మన మార్కెట్‌నూ అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. దీంతో మార్కెట్ క్యాప్ రీత్యా ట్రిలియన్ డాలర్ల క్లబ్ నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఆతర్వాత మళ్లీ 2009 మే నెలలో ట్రిలియన్ డాలర్ల క్లబ్‌లోకి చేరిన దేశీ స్టాక్ మార్కెట్ ఆ తర్వాత ఒకట్రెండు సార్లు మినహా ఈ ప్రతిష్టాత్మక స్థాయిని నిలబెట్టుకుంటూ వస్తోంది. ప్రస్తుతం(డాలరుతో రూపాయి మారకం విలువ 61 ప్రకారం) బీఎస్ఈ మొత్తం లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ డాలర్లలో చూస్తే 1.627 ట్రిలియన్ డాలర్ల వద్ద ఉంది. అంటే 1,618 బిలియన్ డాలర్ల కింద లెక్క. మార్కెట్ల పరుగు ఇలాగే కొనసాగితే రానున్న కొద్ది నెలల్లో 2 టిల్రియన్ డాలర్ల మార్కును కూడా అందుకోవడం పెద్ద కష్టమేమీకాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకీ జోరు... ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రికవరీ బాటపడుతోందన్న సంకేతాలతో స్టాక్ మార్కెట్లు కూడా ఏడాది కాలంగా బలపడుతూ వస్తున్నాయి. దీనికితోడు దేశీయంగా విదేశీ పెట్టుబడులకు గేట్లు తెరిచేలా ప్రకటించిన కొన్ని సంస్కరణలు భారత్‌పై ఇన్వెస్టర్లలో విశ్వాసం పెంచేలా చేశాయి. మరోపక్క, నరేంద్ర మోదీ ప్రధానిగా కేంద్రం సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు కావడంతో దేశీ మార్కెట్‌ను ఉత్తేజితం చేసింది. అంచనాలకు అనుగుణంగానే మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ)కు అనుకూలంగా పలు రంగాల్లో పరిమితుల పెంపు, కొత్తగా రైల్వేల వంటి వాటిలోకీ ఎఫ్‌డీఐలను అనుమతించడం భారత్‌పై నమ్మకాన్ని మరింత పెంచాయి. దీంతో స్టాక్ మార్కెట్లు రోజుకో కొత్త చరిత్ర సృష్టిస్తున్నాయి. ఈ ఏడాది ఆరంభం నుంచి ఇప్పటిదాకా చూస్తే విదేశీ సంస్థాగ ఇన్వెస్టర్లు రికార్డు స్థాయిలో భారత స్టాక్స్‌లో నికరంగా 15 బిలియన్ డాలర్లకు పైగా(సుమారు రూ.92,000 కోట్లు)ను కుమ్మరించారు. ‘భారత్ భవిష్యత్తు ఆర్థిక శక్తిగా ఆవిర్భవించనుందని చెప్పేందుకు బీఎస్ఈ సాధించిన ఈ కొత్త మైలురాయి నిదర్శనం. దేశంలోని క్యాపిటల్ మార్కెట్ యంత్రాంగం ద్వారా మరింత సంపదతోపాటు ఉద్యోగాల సృష్టికి కూడా దోహదం చేయనుంది’ అని బీఎస్ఈ సీఈఓ ఆశిష్ కుమార్ చౌహాన్ పేర్కొన్నారు. ⇒ 2003లో బీఎస్ఈలోని లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ.10 లక్షల కోట్లు. ప్రస్తుత 100 లక్షల కోట్లతో పోలిస్తే 11 ఏళ్ల వ్యవధిలో 10 రెట్లు పెరిగింది. ⇒ ఇక 2009లో రూ.50 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌తో పోలిస్తే అయిదేళ్లలో రెట్టింపు అయింది. ⇒100 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌లో సెన్సెక్స్-30 కంపెనీల వాటా దాదాపు సగం(రూ. 47,21,345 కోట్లు). ఇందులో టాప్-10 కంపెనీల విలువ రూ.27,83,902 కోట్లు. ⇒ ఇక బీఎస్ఈలో టాప్-100 కంపెనీల మార్కెట్ క్యాప్ రూ. 74,12,920 కోట్లు. ⇒ పస్తుత మొత్తం మార్కెట్ విలువలో 50% వాటా కంపెనీల ప్రమోటర్లది కాగా... 20% వాటా విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల చేతిలో ఉంది. మిగతాది దేశీ సంస్థలు, రిటైల్ ఇన్వెస్టర్ల వద్దనున్న షేర్ల వాటా. ⇒ బీఎస్ఈలో ప్రస్తుతం 5,500 పైగా కంపెనీలు లిస్టయ్యాయి. లిస్టెడ్ కంపెనీల పరంగా ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. ప్రపంచ టాప్-10 ఎక్స్ఛేంజీల్లో బీఎస్ఈకి స్థానం ఆసియాలోనే అత్యంత పురాతన ఎక్స్ఛేంజ్గా పేరొందిన మన బీఎస్ఈ రూ. 100 లక్షల కోట్ల మైలురాయితో మరో అరుదైన ఘనతను కూడా సొంతం చేసుకుంది. మార్కెట్ విలువ పరంగా ప్రపంచ టాప్-10 స్టాక్ ఎక్స్ఛేంజీల్లో ఒకటిగా(10వ ర్యాంకు) నిలిచింది. ప్రస్తుతం ఉన్న 1,627 బిలియన్ డాలర్ల విలువలో 500 బిలియన్ డాలర్లు(దాదాపు రూ.29 లక్షల కోట్లు) ఈ ఏడాదిలోనే జత కావడం విశేషం. కాగా, ప్రపంచ నంబర్ వన్ అయిన న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్ మార్కెట్ విలువ 19,100 బిలియన్ డాలర్లతో పోలిస్తే మన మార్కెట్ క్యాప్ పదో వంతు మాత్రమే. ఇక మన స్ధూల దేశీయోత్పత్తి(జీడీపీ) విలువ సుమారు 1,900 బిలియన్ డాలర్లుకాగా.. అమెరికా జీడీపీ విలువ 16,800 బిలియన్ డాలర్లుగా అంచనా. సరికొత్త రికార్డులు తొలిసారి 8,600కు నిఫ్టీ ⇒ 28,800 దాటిన సెన్సెక్స్ ⇒ క్షీణిస్తున్న చమురు ధరల ఎఫెక్ట్ ⇒ వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలు కూడా గడిచిన రెండు రోజుల లాభాలను మించుతూ మూడో రోజు స్టాక్ మార్కెట్లు హైజంప్ చేశాయి. ఉదయం నుంచీ పెరిగిన కొనుగోళ్లతో చివరి వరకూ లాభాలతో పరుగుతీశాయి. వెరసి అటు బీఎస్ఈ, ఇటు ఎన్ఎస్ఈలలో మరోసారి రికార్డుల గంట మోగింది. 255 పాయింట్లు ఎగసిన సెన్సెక్స్ 28,694 వద్ద నిలవగా, నిఫ్టీ 94 పాయింట్లు పుంజుకుని 8,588 వద్ద ముగిసింది. ఇవి కొత్త ముగింపులుకాగా, ఇంట్రాడేలోనూ లైఫ్‌టైమ్ గరిష్టాలు నమోద య్యాయి. మిడ్ సెషన్లో 383 పాయింట్లు జంప్‌చేసిన సెన్సెక్స్ తొలిసారి 28,822ను తాకగా, నిఫ్టీ 8,617కు చేరింది. ప్రధానంగా బ్యాంకింగ్, ఆటో రంగాలు కళకళలాడాయి. ఇవీ కారణాలు అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు 2010 ఆగస్ట్ స్థాయికి పతనంకావడంతో సెంటిమెంట్ మెరుగైందని నిపుణులు పేర్కొన్నారు. బ్రెంట్ ర కం ముడిచమురు ధర బ్యారల్‌కు 72 డాలర్ల స్థాయికి పడిపోగా, నెమైక్స్ సైతం 69 డాలర్ల వద్ద కదులుతోంది. చమురు ధరల క్షీణతతో ధరలు దిగివస్తాయని, తద్వారా వడ్డీ రేట్ల తగ్గింపునకు రిజర్వ్ బ్యాంక్‌నకు వీలు ఏర్పడుతుందన్న అంచనాలు బ్యాంకింగ్ షేర్లకు బూస్ట్‌నిచ్చాయి. పీఎస్‌యూ దిగ్గజాలు పీఎన్బీ, కెనరా బ్యాంక్, బీవోబీ, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్బీఐ 8-5% మధ్య పురోగమించగా, ప్రయివేట్ రంగ బ్యాంకింగ్ షేర్లు ఇండస్ఇండ్, కొటక్ మహీంద్రా, యాక్సిస్, యస్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, ఐసీఐసీఐ 4-2% మధ్య ఎగశాయి. -
2003-08 ర్యాలీ పునరావృతం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుతం దేశీయ స్టాక్ మార్కెట్ ర్యాలీ సుదీర్ఘకాలం కొనసాగుతుందని, 2003-08లో జరిగిన ర్యాలీ పునరావృతమయ్యే అవకాశాలున్నాయని మ్యూచువల్ ఫండ్ సంస్థ యూటీఐ అంచనా వేస్తోంది. ఇప్పటి వరకు దేశీయ స్టాక్ మార్కెట్ చరిత్రలో ప్రధానంగా ఆరు బుల్ ర్యాలీలు నమోదు కాగా అందులో 2003-08 ర్యాలీ తప్ప మిగిలినవన్నీ ఒక కారణంతో జరిగాయని, కానీ 2003-08 ర్యాలీ దేశ ఆర్థిక మూలాలకు అనుగుణంగా జరిగిందని యూటీఐ ఫండ్ మేనేజర్ లలిత్ నంబియార్ తెలిపారు. అదే విధంగా ప్రస్తుత ర్యాలీ కూడా దేశీయ ఫండమెంటల్స్ ఆధారంగానే జరుగుతున్నట్లు కనపడుతోందని, ఇది దీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉందన్నారు. మంగళవారం యూటీఐ కొత్త ఫండ్ వివరాలను తెలియచేయడానికి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఆరు బుల్ ర్యాలీల సగటు కాలపరిమితి 90 వారాలుగా ఉండి 171 శాతం లాభాలను అందిస్తే, గడిచిన ర్యాలీ సుదీర్ఘకాలంగా అంటే 246 వారాలు జరగడమే కాకుండా అత్యధికంగా 614 శాతం లాభాలను అందించినట్లు తెలిపారు. ప్రస్తుత ర్యాలీ మొదలై 68 వారాలు అయ్యిందని, ఈ సమయంలో సూచీలు 50 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నాయన్నారు. అన్ని సానుకూలాంశాలే.. స్టాక్ మార్కెట్ ర్యాలీని ప్రభావితం చేసే అయిదు అంశాల్లో రుణాలకు డిమాండ్ పెరగక పోవడం తప్ప మిగిలిన నాలుగు అంశాలు అంటే ద్రవ్యోల్బణం తగ్గడం, వడ్డీరేట్లు తగ్గడానికి సానుకూల వాతావరణం ఏర్పడటం, కంపెనీల లాభాల్లో వృద్ధి మొదలవడం, కంపెనీల షేర్ల విలువలు ఆకర్షణీయంగా ఉండటం అనేవి స్టాక్ సూచీలు మరింత పెరుగుతుయడానే నమ్మకాన్ని కలిగిస్తున్నాయని నంబియార్ తెలిపారు. 1995 నుంచి పరిశీలిస్తే ఏటా రుణాల్లో కనిష్టవృద్ధి సగటున 9.62%గా ఉం టే ఇప్పుడిది 9.72% గా ఉందని, ఈ గణాం కాలు క్రెడిట్ డిమాండ్ కనిష్టస్థాయికి చేరిందన్న అంశాన్ని తెలియ చేస్తోందన్నారు. 1997లో రుణాల్లో వృద్ధి కనిష్టంగా 9.6 శాతంగా ఉంటే, 2006లో గరిష్టంగా 30.88 శాతంగా నమోదయ్యింది. ఇప్పుడిప్పుడే కన్జూమర్ డ్యూరబుల్స్, ఆటోమొబైల్ వంటి రంగాల్లో రుణాలకు డిమాండ్ పెరుగుతోందని, ఒక్కసారి విద్యుత్, కోల్, ఇన్ఫ్రా రంగాల సమస్యలు పరిష్కారమైతే పారిశ్రామిక రుణాలకు డిమాండ్ ఏర్పడుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. కంపెనీల ఎబిటా మార్జిన్ కూడా పదేళ్ల కనిష్ట సగటుకు చేరిందని, ఇది రానున్న కాలంలో పెరిగే అవకాశం ఉందన్నారు. ద్రవ్యోల్బణం తగ్గడం, ముడి చమురు ధరలు, బంగారం ధరలు తగ్గడంతో ద్రవ్యలోటు కూడా తగ్గుముఖం పట్టిందని, దీంతో ఆర్బీఐ వడ్డీరేట్లు తగ్గించడానికి మార్గం ఏర్పడిందన్నారు. మార్చి తర్వాత నుంచి వడ్డీరేట్లు తగ్గవచ్చన్నారు. ఒడిదుడుకులు తప్పవు ప్రతీ బుల్ ర్యాలీ మధ్యలో చిన్న చిన్న కరెక్షన్లు ఉంటాయని, వీటిని కొనుగోళ్లకు వినియోగించుకోవాలని నంబియార్ సూచించారు. 2003-08 మధ్య జరిగిన సుదీర్ఘ ర్యాలీ ఆరుసార్లు సర్దుబాటుకు గురయ్యిందని, ప్రస్తుత ర్యాలీ కూడా దీనికి మినహాయింపు కాదన్నారు. ప్రస్తుత కరెక్షన్ ఎప్పుడు ఎందుకు వస్తుందో చెప్పలేమన్నారు. రాజ్యసభలో జీఎస్టీ, బీమా బిల్లులు ఆమోదానికి ఆటం కం ఎదురైనప్పుడు లేదా ఉక్రెయిన్, ఇస్లామిక్ మిలిటెంట్స్ వంటి సంఘటనల రూపంలోనైనా ఈ కరెక్షన్ రావచ్చన్నారు. వచ్చే నెలలో కొత్త పథకం యూటీఐ ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్ సిరీస్-2 న్యూ ఫండ్ ఆఫర్ డిసెంబర్ 4న ప్రారంభమై డిసెంబర్ 18తో ముగియనుంది. ఇది 1,102 రోజుల క్లోజ్డ్ ఎండెడ్ ఈక్విటీ పథకం. ఎన్ఎఫ్వో ద్వారా కనీసం రూ. 500 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. సిరీస్-1లో రూ. 500 కోట్లు లక్ష్యం పెట్టుకోగా రూ. 770 కోట్లు సమీకరించినట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
ఐటీసీ డీలా, ఓఎన్జీసీ అప్
నాలుగో రోజూ నష్టాలే - సెన్సెక్స్ 74 పాయింట్లు డౌన్ - ఇంట్రాడేలో 25,000 దిగువకు - 7,500 దిగువన నిఫ్టీ ముగింపు ఇరాక్ సంక్షోభం కొనసాగుతుండటంతో దేశీ స్టాక్ మార్కెట్లు మరోసారి నీరసించాయి. రుతుపవనాల మందగమనం, ముడిచమురు ధరల పెరుగుదల వంటి అంశాలు సెంటిమెంట్‌ను బలహీనపరచడంతో వరుసగా నాలుగో రోజు మార్కెట్లు నష్టపోయాయి. సెన్సెక్స్ 74 పాయింట్లు క్షీణించి 25,031 వద్ద నిలవగా, 18 పాయింట్లు తగ్గిన నిఫ్టీ 7,493 వద్ద ముగిసింది. ఇది రెండున్నర వారాల కనిష్టంకాగా, రైల్వే ధరల పెరుగుదలతో ద్రవ్యోల్బణానికి రెక్కలు వస్తాయన్న అందోళనలు కూడా ఇన్వెస్టర్లను అమ్మకాలవైపు మళ్లించాయని నిపుణులు పేర్కొన్నారు. వెరసి ఒక దశలో సెన్సెక్స్ 225 పాయింట్లకుపైగా పతనమై 24,878 వద్ద కనిష్టాన్ని తాకింది. అయితే తొలుత 100 పాయింట్ల లాభంతో ట్రేడింగ్ మొదలయ్యింది. సెన్సెక్స్ 4 రోజుల్లో 489 పాయింట్లను కోల్పోయింది. ఎక్సైజ్ డ్యూటీ ఎఫెక్ట్ సిగరెట్లపై ఎక్సైజ్ డ్యూటీని పెంచుతారన్న వార్తలతో ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీ 6%పైగా దిగజారింది. మరోవైపు ఆయిల్ దిగ్గజం ఓఎన్జీసీ దాదాపు 5% ఎగసింది. మిగిలిన సెన్సెక్స్ దిగ్గజాలలో ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, హెచ్‌యూఎల్ 2.5-1% మధ్య నష్టపోగా, హీరోమోటో, భెల్, సెసాస్టెరిలైట్, ఎంఅండ్ఎం, ఐసీఐసీఐ బ్యాంక్ అదే స్థాయిలో పుంజుకున్నాయి. శుక్రవారం రూ. 221 కోట్ల విలువైన షేర్లను విక్రయించిన ఎఫ్ఐఐలు తాజాగా రూ. 214 కోట్ల అమ్మకాలు చేపట్టాయి. అంతర్జాతీయ సహకారంపై సెబీ దృష్టి న్యూఢిల్లీ: ప్రపంచ స్టాక్ మార్కెట్లలో కీలక పాత్ర పోషించే విధంగా దేశీ క్యాపిట ల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కసరత్తు మొదలుపెట్టింది. ఇందుకు అనుగుణంగా నియంత్రణ విధానాలను అభివృద్ధి చేయనుంది. కీలక కేసులకు సంబంధించి విదేశీ సంస్థల నుంచి సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునేందుకు తగిన విధానాలను పటిష్టం చేయనుంది. ఇందుకు మద్దతుగా పూర్తిస్థాయిలో అంతర్జాతీయ వ్యవహారాల టీమ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం. యూఎస్, యూకే వంటి అభివృద్ధి చెందిన మార్కెట్లలో అనుసరిస్తున్న నిఘా విధానాలను సెబీ సమగ్రంగా పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. చక్కెర షేర్లకు గిరాకీ చక్కెరపై దిగుమతి డ్యూటీని ప్రభుత్వం 15% నుంచి 40%కు పెంచడంతోపాటు, మిల్లులకు రూ. 4,400 కోట్ల వరకూ వడ్డీరహిత రుణాలను అదనంగా ఇవ్వనుండటంతో చక్కెర షేర్లకు గిరాకీ పుట్టింది. శ్రీరేణుకా, బజాజ్ హిందుస్తాన్, బలరామ్‌పూర్ చినీ, ధంపూర్, ఆంధ్రా షుగర్స్, ఈఐడీ ప్యారీ, త్రివేణీ, సింభోలీ, ద్వారికేష్, శక్తి షుగర్స్ 10-5% మధ్య పురోగమించాయి. కాగా, మార్కెట్లు నీరసించినప్పటికీ చిన్న షేర్లు వెలుగులో నిలిచాయి. మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు 0.6% బలపడగా, ట్రేడైన షేర్లలో 1,562 లాభపడ్డాయి. 1,387 షేర్లు నష్టపోయాయి.