డీప్‌సీక్‌.. మార్కెట్‌ షేక్‌! | DeepSeek rise triggers Nvidia biggest-ever 465 billion dollers market crash | Sakshi
Sakshi News home page

డీప్‌సీక్‌.. మార్కెట్‌ షేక్‌!

Published Tue, Jan 28 2025 1:32 AM | Last Updated on Tue, Jan 28 2025 8:05 AM

DeepSeek rise triggers Nvidia biggest-ever 465 billion dollers market crash

76,000 దిగువకు సెన్సెక్స్‌ 

23,000 స్థాయి కోల్పోయిన నిఫ్టీ 

టెక్‌ షేర్లను కుదిపేసిన డీప్‌సీక్‌  

ఇన్వెస్టర్లకు రూ.9.28 లక్షల కోట్ల నష్టం 

ముంబై: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సుంకాల విధింపు భయాలు, చైనా ఏఐ స్టార్టప్‌ డీప్‌సీక్‌ ప్రభావంతో దేశీయ స్టాక్‌ సూచీలు సోమవారం ఒక శాతం నష్టపోయాయి. సెన్సెక్స్‌ 824 పాయింట్లు క్షీణించి 76వేల స్థాయి దిగువన 75,366 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 23,000 స్థాయిని కోల్పోయింది. మార్కెట్‌ ముగిసే సమయానికి 263 పాయింట్లు పతనమై 22,829 వద్ద నిలిచింది.

 ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయమే నష్టాలతో మొదలయ్యాయి. అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో ఒక దశలో సెన్సెక్స్‌ 923 పాయింట్లు క్షీణించి 75,267 వద్ద, నిఫ్టీ 306 పాయింట్లు పతనమై 22,786 వద్ద కనిష్టాలు తాకాయి. డాలర్‌ మారకంలో రూపాయి విలువ 9 పైసలు క్షీణించి 86.31 స్థాయి స్థిరపడింది.  

→ ప్రధాన సూచీలు ఒకశాతమే పడినా.. మిడ్, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు భారీగా క్షీణించాయి. అధిక వాల్యుయేషన్ల భయాలతో విక్రయాలు వెల్లువెత్తాయి. బీఎస్‌ఈ స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 3.5%, మిడ్‌ క్యాప్‌ సూచీ 2.7% పడింది. 
→ స్టాక్‌ మార్కెట్‌ భారీ పతనంతో రూ.9.28 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలోని కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ రూ.410.23 లక్షల కోట్ల(4.75 ట్రిలియన్‌ డాలర్లు)కు దిగివచి్చంది. ఈ సూచీలోని మొత్తం 30 షేర్లలో ఆరు మాత్రమే  లాభాలతో గట్టెక్కాయి.   
→ ఐటీసీ లిమిటెడ్‌ నుంచి విడదీసిన ఐటీసీ హోటల్స్‌ షేర్లు జనవరి 29న స్టాక్‌ ఎక్సే్చంజీల్లో లిస్ట్‌ కానున్నాయి. ఈ విషయాన్ని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. ఈ ఏడాది జనవరి 1న ఐటీసీ నుంచి ఐటీసీ హోటల్స్‌ ప్రత్యేక సంస్థగా విడిపోయింది. ప్రతి పది ఐటీసీ షేర్లకు ఒక ఐటీసీ హోటల్‌ షేరు ధరను 
కేటాయించారు.

ఎందుకీ పతనం...
→ అమెరికాలోని అక్రమ వలసదారులను వారి స్వదేశాలకు పంపే చర్యల్లో భాగంగా ట్రంప్‌ తాజాగా కొలంబియాపై 25% సుంకాలు విధించారు. ఇప్పటికే మెక్సికో, కెనడాలపై ఫిబ్రవరి 1 నుండి 25% వాణిజ్య సుంకాల విధింపును ప్రకటించారు. ఇది అంతర్జాతీయ వాణిజ్య యు ద్దాలకు దారితీయొచ్చనే భయాలు  పెరిగాయి. 
→ చైనా ఏఐ స్టార్టప్‌ డీప్‌సీక్‌ ఆర్‌1 ప్రపంచవ్యాప్తంగా టెక్‌ పరిశ్రమను కుదిపేస్తుంది.  అమెరికా దిగ్గజ టెక్‌ కంపెనీల షేర్లు భారీగా పతనమయ్యాయి. ఈ ప్రభావం  మన స్టాక్‌ మార్కెట్‌పై పడింది.    
→ అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ బుధవారం వడ్డీ రేట్ల కోతపై నిర్ణయం వెలువరించనుంది. ఈ ధఫా వడ్డీరేట్ల తగ్గింపు ఉండదని అంచనాలున్నాయి.  
→ ఇప్పటి వరకు వెల్లడైన కార్పొరేట్‌ డిసెంబర్‌ క్వార్టర్‌ ఆర్థిక త్రైమాసిక ఫలితాలు నిరాశపరిచాయి.

    యూఎస్‌ టెక్‌ దిగ్గజాలలో కలవరం 
    యూఎస్‌ ఏఐకు పోటీగా చైనీస్‌ ఆర్‌1 
    టెక్నాలజీ షేర్లలో భారీ అమ్మకాలు 
    3 శాతం పతనమైన నాస్‌డాక్‌ 
    చాట్‌జీపీటీకి పోటీగా చైనీస్‌ డీప్‌సీక్‌ 
మైక్రోసాఫ్ట్, మెటా, ఒరాకిల్, గూగుల్‌ తదితర యూఎస్‌ టెక్నాలజీ దిగ్గజాలు వందల కోట్ల డాలర్లు వెచ్చించి రూపొందించిన ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) మోడల్స్, చాట్‌జీపీటీకి పోటీగా చైనా రంగంలోకి దిగింది. స్టార్టప్‌ డీప్‌సీక్‌.. అమెరికా ఏఐలకు దీటుగా ఆర్‌1ను విడుదల చేస్తోంది. దీంతో టెక్నాలజీ వర్గాల్లో ఆందోళనలకు తెరలేచింది. చైనా కారుచౌకగా ఏఐ సేవలు అందించనున్న అంచనాలు యూఎస్‌ ఇన్వెస్టర్లలో భయాలను కల్పించింది.

 దీంతో టెక్‌ కంపెనీలు లిస్టయిన నాస్‌డాక్‌ ఇండెక్స్‌ ప్రారంభంలోనే 3 శాతం పతనమైంది. మ్యాగ్నిఫిషియంట్‌ 7గా పేర్కొనే ఎన్‌విడియా, మైక్రోసాఫ్ట్, ఏఎండీ తదితరాలు అమ్మకాలతో డీలా పడ్డాయి. ప్రధానంగా ఏఐ అవకాశాలపై అంచనాలతో ఇటీవల భారీ ర్యాలీ చేస్తున్న ఎన్‌విడియా షేరు 17 శాతంపతనంకాగా.. మైక్రోసాఫ్ట్‌ 3 శాతంపైగా క్షీణించింది. ఫలితంగా ఒక్కరోజులోనే ఎన్‌విడియా మార్కెట్‌ విలువలో సుమారు 500 బిలియన్‌ డాలర్లు ఆవిరైంది. 

ఆర్‌1 ఎఫెక్ట్‌..: చైనా ఏఐ స్టార్టప్‌ డీప్‌సీక్‌ అభివృద్ధి చేసిన ఆర్‌1.. అమెరికా టెక్‌ కంపెనీలు అభివృద్ధి చేస్తున్న చాట్‌జీపీటీ, ఓపెన్‌ ఏఐ తదితరాలకు తీవ్ర పోటీతో చెక్‌ పెట్టనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ఏఐలో చైనా వేగాన్ని నిలువరించేందుకు వీలుగా ఇప్పటికే అమెరికా ఆధునిక సెమీ కండక్టర్‌ టెక్నాలజీలను ఎగుమతి చేయకుండా నిషేధించింది. ఎన్‌విడియా రూపొందిస్తున్న ఏఐ చిప్స్‌ తదితరాలపై ఆంక్షలు విధించింది. డీప్‌సీక్‌ అభివృద్ధి చేసిన తాజా ఏఐ మోడల్‌ను గత వారమే మార్కెట్లో విడుదల చేసింది. ఇది ఓపెన్‌ఏఐ, మెటా ప్లాట్‌ఫామ్స్‌కు దీటైన పోటీని ఇవ్వనున్నట్లు టెక్నాలజీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రధానంగా అమెరికా టెక్‌ దిగ్గజాలు వందల కోట్ల డాలర్లు వెచ్చించి అభివృద్ధి చేస్తున్న ఏఐ సేవలకు దీటుగా చైనీస్‌ ఏఐ చౌకగా సేవలు అందించే వీలుందని విశ్లేషకులు అంటున్నారు. ఇది తీవ్ర పోటీకి తెరతీయడంతో యూఎస్‌ టెక్‌ దిగ్గజాల పెట్టుబడులపై ఆశించిన స్థాయిలో రిటర్నులకు తెరపడవచ్చని ఆందోళన నెలకొంది. ఫలితంగా ఉన్నట్టుండి టెక్‌ కౌంటర్లలో అమ్మకాలు నమోదవుతున్నట్లు నిపుణులు తెలియజేశారు.         

ఆందోళనలు.. ‘డీప్‌’
గత వారమే విడుదలైన డీప్‌సీక్‌ తాజా ఏఐ మోడల్‌.. అమెరికా ఐఫోన్ల టెక్‌ దిగ్గజం యాపిల్‌ ఇంక్‌ యాప్‌ స్టోర్‌ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరినట్లు తెలుస్తోంది. దీంతో క్వాంట్‌ ఫండ్‌ చీఫ్‌ లియాంగ్‌ వెన్‌ఫెంగ్‌ ఏర్పాటు చేసిన ఈ ఓపెన్‌ సోర్స్‌డ్‌ ప్రొడక్ట్‌.. ఓపెన్‌ ఏఐ, మెటా ప్లాట్‌ఫామ్స్‌ కు పోటీగా నిలుస్తుందన్న అంచనాలు పెరిగాయి. వెరసి అడ్వాన్స్‌డ్‌ చిప్స్, అత్యున్నత కంప్యూటింగ్‌ పవర్‌లపై ఆధారపడిన ప్రస్తుత యూఎస్‌ ఏఐ బిజినెస్‌ మోడల్‌ను ఆర్‌1 దెబ్బతీయవచ్చన్న ఆందోళనలు వ్యాప్తిస్తున్నాయి. ఏఐ విస్తృతిలో ప్రధానంగా ఎన్‌విడియాకు భారీ అవకాశాలు లభించాయి. అయితే ఆర్‌1 సెగ ఎన్‌విడియాకు అధికంగా తగులుతుందనేది నిపుణులు మాట.

  – సాక్షి, బిజినెస్‌ డెస్క్‌
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement