decline
-
బంగారు కొండ దిగొస్తోంది!
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న భేరిష్ ధోరణి, అమెరికాలో నిరుద్యోగ గణాంకాలు రావడానికి ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో బంగారానికి అమ్మకాల సెగ తగిలింది. ఢిల్లీ మార్కెట్లో గురువారం ఒక్కరోజే 10 గ్రాములకు రూ.1,150 నష్టపోయింది. 99.9 శాతం స్వచ్ఛత బంగారం రూ.88,200కు దిగొచ్చింది. 99.5 శాతం స్వచ్ఛత బంగారం సైతం ఇంతే మేర నష్టపోయి రూ.87,800 స్థాయికి వచ్చేసింది. వెండి సైతం కిలోకి రూ.1,000 నష్టపోయి రూ.98,500 స్థాయి వద్ద ఉంది. ఎంసీఎక్స్‌లో బంగారం ఏప్రిల్ డెలివరీ కాంట్రాక్ట్ 10 గ్రాములకు రూ.554 నష్టపోయి రూ.85,320 వద్ద ఉంది. రూ.84,800 స్థాయిని కోల్పోతే బంగారంలో మరింత బలహీనత ఉండొచ్చని ఎల్కేపీ సెక్యూరిటీస్ కమోడిటీ రీసెర్చ్ అనలిస్ట్ జతీన్ త్రివేది తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ ఏప్రిల్ డెలివరీ కాంట్రాక్ట్ ఔన్స్‌కు 40 డాలర్లు నష్టపోయి 2,890 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ‘‘బంగారం మరో రికార్డు స్థాయికి చేరిన అనంతరం దిద్దుబాటుకు లోనైంది. డాలర్ గరిష్ట స్థాయి దిశగా చలించడంతోపాటు, టారిఫ్‌ల భయాలు ఇందుకు దారితీశాయి. ఐరోపా యూనియన్ నుంచి వచ్చే దిగుమతులపై 25 శాతం సుంకాలు విధిస్తామని, మార్చి 4 నుంచి మెక్సికో, కెనడాలపై టారిఫ్‌లు అమల్లోకి వస్తాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా చేసిన ప్రకటనతో సురక్షిత సాధనంగా బంగారానికి బలమైన డిమాండ్ కొనసాగొచ్చు’’అని అబాన్స్ హోల్డింగ్స్ సీఈవో చింతన్ మెహతా విశ్లేషించారు. -
మార్కెట్‌కు ట్రంప్ సుంకాల పోటు
ముంబై: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడా, మెక్సికో, చైనాలపై దిగుమతి సుంకాలు పెంచుతూ ఆదేశాలు జారీ చేయడంతో సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్ అరశాతం నష్టపోయింది. దేశీయ కరెన్సీ రూపాయి భారీ కోత, అధిక వెయిటేజీ రిలయన్స్ (–1.50%), ఎల్అండ్టీ (–4.50%) క్షీణతలూ ప్రతికూల ప్రభావం చూపాయి. సెన్సెక్స్ 319 పాయింట్లు నష్టపోయి 77,186 వద్ద నిలిచింది. దీంతో ఈ సూచీ 5 రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడినట్లైంది. నిఫ్టీ 121 పాయింట్లు క్షీణించి 23,361 వద్ద నిలిచింది. వాణిజ్య యుద్ధ భయాలతో ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయమే నష్టాల్లో మొదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 750 పాయింట్లు క్షీణించి 76,756 వద్ద, నిఫ్టీ 260 పాయింట్లు కుప్పకూలి 23,222 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. అయితే మిడ్ సెషన్ నుంచి కన్జూమర్ డ్యూరబుల్, ఐటీ, ఫార్మా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. దీంతో సూచీలు కొంతమేర నష్టాలు భర్తీ చేసుకోగలిగాయి. → క్యాపిటల్ గూడ్స్, ఇండ్రస్టియల్స్, విద్యుత్, యుటిలిటీస్, ఆయిల్‌అండ్‌గ్యాస్, మెటల్ షేర్లు భారీ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బీఎస్ఈ స్మాల్‌క్యాప్ సూచీ 2%, మిడ్‌క్యాప్ ఇండెక్స్ ఒకశాతం చొప్పున నష్టపోయాయి. → మార్కెట్ పతనంతో రూ.4.29 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. బీఎస్ఈలో మొత్తం కంపెనీల మార్కెట్ విలువ రూ.419 లక్షల కోట్లకు తగ్గింది. ప్రపంచ మార్కెట్లూ డీలా ట్రంప్ టారిఫ్ దాడికి ప్రతిగా తాము కూడా టారిఫ్‌లు పెంచుతామని కెనడా, మెక్సికో ప్రకటించడంతో వాణిజ్య యుద్ధ భయాలు మరింత తీవ్రమయ్యాయి. ఆసియాలో జపాన్, తైవాన్, కొరియా సూచీలు 3.50% క్షీణించాయి. ఇండోనేషియా, సింగపూర్, హాంగ్‌కాంగ్ దేశాలు 2–0.5% పతనమయ్యాయి. యూరప్ మార్కెట్లు 1% నష్టపోయాయి. అమెరికా సూచీలు నాస్డాక్ 1%, ఎస్అండ్పీ అరశాతం, డోజోన్ పావుశాతం నష్టాలతో ట్రేడవుతున్నాయి. -
అదానీ ఎంటర్‌ప్రైజెస్‌కు బొగ్గు సెగ
న్యూఢిల్లీ: బొగ్గు అమ్మకాలు గణనీయంగా పడిపోవడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో అదానీ ఎంటర్ప్రైజెస్ (ఏఈఎల్) నికర లాభం ఏకంగా 97 శాతం క్షీణించింది. రూ. 58 కోట్లకు పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో కంపెనీ నికర లాభం రూ. 1,888 కోట్లుగా నమోదైంది. ప్రధాన వినియోగదారయిన విద్యుత్ రంగంలో పునరుత్పాదక వనరుల వాటా పెరిగి బొగ్గుకు డిమాండ్ తగ్గడంతో అమ్మకాల పరిమాణం ఏకంగా 42 శాతం మేర క్షీణించింది. ఇక ఆ్రస్టేలియా కార్యకలాపాలకు సంబంధించి విదేశీ మారకంపరంగా నష్టాలు నమోదు కావడం కూడా తాజా పనితీరుకు కారణమయ్యాయి. సమీక్షాకాలంలో కంపెనీ ఆదాయం 9 శాతం తగ్గి రూ. 22,848 కోట్లకు పరిమితమైంది. మరోవైపు, ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో ఆదాయం 6 శాతం పెరిగి రూ. 72,763 కోట్లకు చేరగా, నికర లాభం 17 శాతం వృద్ధి చెంది రూ. 3,254 కోట్లకు ఎగిసింది. గురువారం బీఎస్ఈలో ఏఈఎల్ షేరు సుమారు మూడు శాతం క్షీణించి రూ. 2,253 వద్ద క్లోజయ్యింది. -
డీప్‌సీక్.. మార్కెట్ షేక్!
ముంబై: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల విధింపు భయాలు, చైనా ఏఐ స్టార్టప్ డీప్‌సీక్ ప్రభావంతో దేశీయ స్టాక్ సూచీలు సోమవారం ఒక శాతం నష్టపోయాయి. సెన్సెక్స్ 824 పాయింట్లు క్షీణించి 76వేల స్థాయి దిగువన 75,366 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 23,000 స్థాయిని కోల్పోయింది. మార్కెట్ ముగిసే సమయానికి 263 పాయింట్లు పతనమై 22,829 వద్ద నిలిచింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయమే నష్టాలతో మొదలయ్యాయి. అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో ఒక దశలో సెన్సెక్స్ 923 పాయింట్లు క్షీణించి 75,267 వద్ద, నిఫ్టీ 306 పాయింట్లు పతనమై 22,786 వద్ద కనిష్టాలు తాకాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ 9 పైసలు క్షీణించి 86.31 స్థాయి స్థిరపడింది. → ప్రధాన సూచీలు ఒకశాతమే పడినా.. మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు భారీగా క్షీణించాయి. అధిక వాల్యుయేషన్ల భయాలతో విక్రయాలు వెల్లువెత్తాయి. బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 3.5%, మిడ్ క్యాప్ సూచీ 2.7% పడింది. → స్టాక్ మార్కెట్ భారీ పతనంతో రూ.9.28 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.410.23 లక్షల కోట్ల(4.75 ట్రిలియన్ డాలర్లు)కు దిగివచి్చంది. ఈ సూచీలోని మొత్తం 30 షేర్లలో ఆరు మాత్రమే లాభాలతో గట్టెక్కాయి. → ఐటీసీ లిమిటెడ్ నుంచి విడదీసిన ఐటీసీ హోటల్స్ షేర్లు జనవరి 29న స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్ట్ కానున్నాయి. ఈ విషయాన్ని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. ఈ ఏడాది జనవరి 1న ఐటీసీ నుంచి ఐటీసీ హోటల్స్ ప్రత్యేక సంస్థగా విడిపోయింది. ప్రతి పది ఐటీసీ షేర్లకు ఒక ఐటీసీ హోటల్ షేరు ధరను కేటాయించారు.ఎందుకీ పతనం...→ అమెరికాలోని అక్రమ వలసదారులను వారి స్వదేశాలకు పంపే చర్యల్లో భాగంగా ట్రంప్ తాజాగా కొలంబియాపై 25% సుంకాలు విధించారు. ఇప్పటికే మెక్సికో, కెనడాలపై ఫిబ్రవరి 1 నుండి 25% వాణిజ్య సుంకాల విధింపును ప్రకటించారు. ఇది అంతర్జాతీయ వాణిజ్య యు ద్దాలకు దారితీయొచ్చనే భయాలు పెరిగాయి. → చైనా ఏఐ స్టార్టప్ డీప్‌సీక్ ఆర్1 ప్రపంచవ్యాప్తంగా టెక్ పరిశ్రమను కుదిపేస్తుంది. అమెరికా దిగ్గజ టెక్ కంపెనీల షేర్లు భారీగా పతనమయ్యాయి. ఈ ప్రభావం మన స్టాక్ మార్కెట్‌పై పడింది. → అమెరికా ఫెడరల్ రిజర్వ్ బుధవారం వడ్డీ రేట్ల కోతపై నిర్ణయం వెలువరించనుంది. ఈ ధఫా వడ్డీరేట్ల తగ్గింపు ఉండదని అంచనాలున్నాయి. → ఇప్పటి వరకు వెల్లడైన కార్పొరేట్ డిసెంబర్ క్వార్టర్ ఆర్థిక త్రైమాసిక ఫలితాలు నిరాశపరిచాయి. యూఎస్ టెక్ దిగ్గజాలలో కలవరం యూఎస్ ఏఐకు పోటీగా చైనీస్ ఆర్1 టెక్నాలజీ షేర్లలో భారీ అమ్మకాలు 3 శాతం పతనమైన నాస్డాక్ చాట్‌జీపీటీకి పోటీగా చైనీస్ డీప్‌సీక్ మైక్రోసాఫ్ట్, మెటా, ఒరాకిల్, గూగుల్ తదితర యూఎస్ టెక్నాలజీ దిగ్గజాలు వందల కోట్ల డాలర్లు వెచ్చించి రూపొందించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మోడల్స్, చాట్‌జీపీటీకి పోటీగా చైనా రంగంలోకి దిగింది. స్టార్టప్ డీప్‌సీక్.. అమెరికా ఏఐలకు దీటుగా ఆర్1ను విడుదల చేస్తోంది. దీంతో టెక్నాలజీ వర్గాల్లో ఆందోళనలకు తెరలేచింది. చైనా కారుచౌకగా ఏఐ సేవలు అందించనున్న అంచనాలు యూఎస్ ఇన్వెస్టర్లలో భయాలను కల్పించింది. దీంతో టెక్ కంపెనీలు లిస్టయిన నాస్డాక్ ఇండెక్స్ ప్రారంభంలోనే 3 శాతం పతనమైంది. మ్యాగ్నిఫిషియంట్ 7గా పేర్కొనే ఎన్విడియా, మైక్రోసాఫ్ట్, ఏఎండీ తదితరాలు అమ్మకాలతో డీలా పడ్డాయి. ప్రధానంగా ఏఐ అవకాశాలపై అంచనాలతో ఇటీవల భారీ ర్యాలీ చేస్తున్న ఎన్విడియా షేరు 17 శాతంపతనంకాగా.. మైక్రోసాఫ్ట్ 3 శాతంపైగా క్షీణించింది. ఫలితంగా ఒక్కరోజులోనే ఎన్విడియా మార్కెట్ విలువలో సుమారు 500 బిలియన్ డాలర్లు ఆవిరైంది. ఆర్1 ఎఫెక్ట్..: చైనా ఏఐ స్టార్టప్ డీప్‌సీక్ అభివృద్ధి చేసిన ఆర్1.. అమెరికా టెక్ కంపెనీలు అభివృద్ధి చేస్తున్న చాట్‌జీపీటీ, ఓపెన్ ఏఐ తదితరాలకు తీవ్ర పోటీతో చెక్ పెట్టనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ఏఐలో చైనా వేగాన్ని నిలువరించేందుకు వీలుగా ఇప్పటికే అమెరికా ఆధునిక సెమీ కండక్టర్ టెక్నాలజీలను ఎగుమతి చేయకుండా నిషేధించింది. ఎన్విడియా రూపొందిస్తున్న ఏఐ చిప్స్ తదితరాలపై ఆంక్షలు విధించింది. డీప్‌సీక్ అభివృద్ధి చేసిన తాజా ఏఐ మోడల్‌ను గత వారమే మార్కెట్లో విడుదల చేసింది. ఇది ఓపెన్ఏఐ, మెటా ప్లాట్‌ఫామ్స్‌కు దీటైన పోటీని ఇవ్వనున్నట్లు టెక్నాలజీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రధానంగా అమెరికా టెక్ దిగ్గజాలు వందల కోట్ల డాలర్లు వెచ్చించి అభివృద్ధి చేస్తున్న ఏఐ సేవలకు దీటుగా చైనీస్ ఏఐ చౌకగా సేవలు అందించే వీలుందని విశ్లేషకులు అంటున్నారు. ఇది తీవ్ర పోటీకి తెరతీయడంతో యూఎస్ టెక్ దిగ్గజాల పెట్టుబడులపై ఆశించిన స్థాయిలో రిటర్నులకు తెరపడవచ్చని ఆందోళన నెలకొంది. ఫలితంగా ఉన్నట్టుండి టెక్ కౌంటర్లలో అమ్మకాలు నమోదవుతున్నట్లు నిపుణులు తెలియజేశారు. ఆందోళనలు.. ‘డీప్’గత వారమే విడుదలైన డీప్‌సీక్ తాజా ఏఐ మోడల్.. అమెరికా ఐఫోన్ల టెక్ దిగ్గజం యాపిల్ ఇంక్ యాప్ స్టోర్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరినట్లు తెలుస్తోంది. దీంతో క్వాంట్ ఫండ్ చీఫ్ లియాంగ్ వెన్ఫెంగ్ ఏర్పాటు చేసిన ఈ ఓపెన్ సోర్స్డ్ ప్రొడక్ట్.. ఓపెన్ ఏఐ, మెటా ప్లాట్‌ఫామ్స్ కు పోటీగా నిలుస్తుందన్న అంచనాలు పెరిగాయి. వెరసి అడ్వాన్స్డ్ చిప్స్, అత్యున్నత కంప్యూటింగ్ పవర్‌లపై ఆధారపడిన ప్రస్తుత యూఎస్ ఏఐ బిజినెస్ మోడల్‌ను ఆర్1 దెబ్బతీయవచ్చన్న ఆందోళనలు వ్యాప్తిస్తున్నాయి. ఏఐ విస్తృతిలో ప్రధానంగా ఎన్విడియాకు భారీ అవకాశాలు లభించాయి. అయితే ఆర్1 సెగ ఎన్విడియాకు అధికంగా తగులుతుందనేది నిపుణులు మాట. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
త్రైమాసిక ఫలితాలు డీలా.. కంపెనీ షేర్ల నేలచూపులు
న్యూఢిల్లీ: కన్జూమర్ ఎలక్ట్రికల్ గూడ్స్ దిగ్గజం హావెల్స్(Havells) ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 3 శాతంపైగా క్షీణించి రూ. 278 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 288 కోట్లు ఆర్జించింది. వాటాదారులకు షేరుకి రూ. 4 చొప్పున మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. మొత్తం ఆదాయం మాత్రం 11 శాతం ఎగసి రూ. 4,953 కోట్లను తాకింది. గత క్యూ3లో రూ. 4,414 కోట్ల టర్నోవర్ నమోదైంది. అయితే మొత్తం వ్యయాలు 12 శాతం పెరిగి రూ. 4,576 కోట్లకు చేరాయి. స్పెన్సర్స్ రిటైల్..ఆర్పీ సంజీవ్ గోయెంకా గ్రూప్ సంస్థ స్పెన్సర్స్(Spencers) రిటైల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో మరోసారి నష్టాలు చవిచూసింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో రూ. 47 కోట్ల నష్టం ప్రకటించింది. అయితే గతేడాది(2023–24) ఇదే కాలంలో నమోదైన రూ. 51 కోట్లతో పోలిస్తే నష్టాలు 8 శాతంపైగా తగ్గాయి. మొత్తం ఆదాయం సైతం 21 శాతం క్షీణించి రూ. 517 కోట్లకు పరిమితమైంది. గత క్యూ3లో రూ. 654 కోట్ల టర్నోవర్ సాధించింది. మొత్తం వ్యయాలు 20 శాతం తగ్గి రూ. 567 కోట్లకు చేరాయి. కాగా.. జిఫీ బ్రాండుతో క్విక్‌కామర్స్‌లోకి ప్రవేశించినట్లు కంపెనీ వెల్లడించింది. పశ్చిమబెంగాల్లో కార్యకలాపాలు ప్రారంభించినట్లు పేర్కొంది. తదుపరి దశలో యూపీలో విస్తరించనున్నట్లు తెలియజేసింది. అనుబంధ సంస్థ ప్రీమియం రిటైల్ చైన్ నేచర్స్ బాస్కెట్‌ను పునర్వ్యవస్థీకరించే యోచనేమీ లేదని చైర్మన్ శాశ్వత్ గోయెంకా స్పష్టం చేశారు. నష్టాలు నమోదు చేస్తున్న కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మార్కెట్ల నుంచి వైదొలగినట్లు తెలియజేశారు.డీబీ కార్ప్..మీడియా రంగ దిగ్గజం డీబీ కార్ప్(DB Corp) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 5 శాతం క్షీణించి రూ. 118 కోట్లకు పరిమితమైంది. గతేడాది (2023 –24) ఇదే కాలంలో రూ. 124 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం నామమాత్ర క్షీణతతో రూ. 643 కోట్లకు చేరింది. గత క్యూ3లో రూ. 645 కోట్ల టర్నోవర్ అందుకుంది. మొత్తం వ్యయాలు సైతం రూ. 497 కోట్ల నుంచి రూ. 496 కోట్లకు స్వల్పంగా తగ్గాయి. ప్రింటింగ్, పబ్లిíÙంగ్ తదితర విభాగాల ఆదాయం యథాతథంగా రూ. 594 కోట్లుగా నమోదైంది. అయితే రేడియో బిజినెస్ 5 శాతం బలపడి రూ. 49 కోట్లకు చేరింది. సంస్థ దైనిక్ భాస్కర్, సౌరాష్ట్ర సమాచార్, దివ్య మరాఠీ తదితర ఐదు వార్తా పత్రికలను ప్రచురించే సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: రియల్టీలో పీఈ పెట్టుబడులు ప్లస్ఎల్టీఐమైండ్ట్రీ...ఐటీ సొల్యూషన్ల దిగ్గజం ఎల్‌టీఐమైండ్‌ట్రీ(LTI MindTree) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 7 శాతం క్షీణించి రూ. 1,085 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 1,169 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం 7 శాతం పుంజుకుని రూ. 9,661 కోట్లకు చేరింది. గత క్యూ3లో రూ. 9,017 కోట్ల టర్నోవర్ సాధించింది. విభిన్న ఏఐ వ్యూహాల నేపథ్యంలో కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా 1.68 బిలియన్ డాలర్ల విలువైన ఆర్డర్లు అందుకున్నట్లు కంపెనీ సీఈవో, ఎండీ దేవశిష్ చటర్జీ వెల్లడించారు. నూతన భాగస్వామ్యాలు, స్పెషలైజేషన్లు, ఏఐలపై కొనసాగుతున్న పెట్టుబడులు కొత్త ఏడాదిలోనూ వృద్ధికి దన్నుగా నిలవనున్నట్లు తెలియజేశారు. 2024 డిసెంబర్31కల్లా 742 యాక్టివ్ క్లయింట్లను కలిగి ఉంది. ఈ కాలంలో 2,362 మందికి ఉపాధి కలి్పంచడంతో మొత్తం సిబ్బంది సంఖ్య 86,800ను తాకింది. -
భారత్‌లో తగ్గిన పేదరికం
న్యూఢిల్లీ: భారత్‌లో గ్రామీణ, పట్టణ పేదరికం గణనీయంగా పడిపోయినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) పరిశోధనా నివేదిక ఒకటి పేర్కొంది. 2011–12 ఆర్థిక సంవత్సరంలో 25.7 శాతంగా ఉన్న గ్రామీణ పేదరికం 2023–24లో 4.86 శాతానికి దిగివచ్చినట్లు నివేదిక పేర్కొంది. ఇక ఇదే సమయంలో పట్టణ పేదరికం కూడా 13.7 శాతం నుంచి 4.09 శాతానికి తగ్గినట్లు వెల్లడించింది. వార్షికంగా చూస్తే, 2022–23లో 7.2 శాతంగా గ్రామీణ పేదరికం ఉంటే, పట్టణ పేదరికం 4.6 శాతంగా ఉంది. అంటే వార్షికంగా గ్రామీణ పేదరికం తగ్గితే (7.2 శాతం నుంచి 4.86 శాతానికి), పట్టణ పేదరికం స్వల్పంగా (4.06 శాతం నుంచి 4.09 శాతం) పెరిగింది. ఇక భారత్‌లో పేదరికం రేట్లు ఇప్పుడు 4–4.5 శాతం పరిధిలో ఉండవచ్చని సర్వే భావించింది. ప్రభుత్వ కార్యక్రమాల దన్ను పేదరికం తగ్గడానికి ప్రభుత్వ కార్యక్రమాలే కారణమని ఎస్బీఐ రీసెర్చ్ తెలిపింది. నేరుగా లబ్ధిదారులకు నిధుల బదిలీ (డీబీటీ), గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి, రైతుల ఆదాయాన్ని పెంచే చర్యలను ఆ సందర్భంగా ప్రధానంగా ప్రస్తావించింది. వినియోగం, వ్యయాలపై ఎస్బీఐ సర్వేలోని మరిన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. → ప్రభుత్వ పథకాల మద్దతుతో దిగువ ఆదాయ వర్గాల వ్యయాల్లో 5% వరకూ పెరుగుదల కనిపించింది. → ఆహార ధరల స్థిరత్వం వల్ల ఖర్చులు తగ్గాయి. → గ్రామీణ ప్రాంతాల్లో రవాణా వ్యవస్థ మెరుగుపడటంతో గ్రామీణ–పట్టణ ఆదాయ వ్యత్యాసాలు తగ్గాయి. 2023 ఆగస్టు–2024 జూలై మధ్య గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. → ఎక్కువ ఆదాయం కలిగిన రాష్ట్రాలు జాతీయ సగటు (31%) కంటే అధిక పొదులపు రేటును నమెదుచేసుకున్నాయి. → ఉత్తర ప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాలలో తక్కువ సేవింగ్స్ రేటు కనిపించింది. అధిక సంఖ్యలో ఆ రాష్ట్రాల నుంచి వలసలు దీనికి కారణం కావచ్చు. → పట్టణ పేదరికం మరింత తగ్గుతుందని విశ్వసిస్తున్నాము. -
వెలవెలబోతున్న పెయింట్స్ పరిశ్రమ
కోల్‌కత: భారతీయ పెయింట్స్ పరిశ్రమ తీవ్ర పోటీ, లాభాలపై ఒత్తిళ్లతో సవాళ్లను ఎదుర్కొంటోందని కేర్ఎడ్జ్ రేటింగ్స్ నివేదిక వెల్లడించింది. ‘2021–22, అలాగే 2022–23లో పరిశ్రమ బలమైన వృద్ధిని సాధించింది. దీర్ఘకాలంగా స్థిరపడిన ప్రముఖ కంపెనీలైన ఏషియన్ పెయింట్స్, బర్జర్ పెయింట్స్, కాన్సాయ్ నెరోలాక్, అక్జో నోబెల్, ఇండిగో పెయింట్స్ వంటి సంస్థల ఆదాయ వృద్ధి 2023–24లో 4 శాతానికి స్థిరపడింది. ఇది 2018–19 నుంచి 2022–23 మధ్య నమోదైన 14–15 శాతం వార్షిక వృద్ధి కంటే చాలా తక్కువ. ముడిసరుకు వ్యయాలు తగ్గడం, అమ్మకాల మిశ్రమంలో తక్కువ విలువ ఉత్పత్తుల వాటా పెరగడంతో ధరల తగ్గింపు కారణంగా గత ఆర్థిక సంవత్సరంలో ఈ క్షీణత ఏర్పడింది. పరిమాణం మాత్రం 10 శాతం దూసుకెళ్లింది. సవాళ్లు ఉన్నప్పటికీ ఈ రంగం 2025–26లో 8–10 శాతం వృద్ధిని సాధించడానికి సిద్ధంగా ఉంది’ అని కేర్ఎడ్జ్ రేటింగ్స్ అసోసియేట్ డైరెక్టర్ రిచా బగారియా తెలిపారు. నివేదిక ప్రకారం.. ఆపరేటింగ్ మార్జిన్లను.. ప్రకటన, సేల్స్ ప్రమోషన్ ఖర్చులు 100–200 బేసిస్ పాయింట్లు అధికమై ఆపరేటింగ్ మార్జిన్లను మరింత దెబ్బతీస్తుంది. 2019–20 నుంచి 2023–24 మధ్య పెయింట్స్ రంగంలో నిర్వహణ మార్జిన్లు సగటున 18 శాతం నుండి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో 16 శాతానికి వచ్చి చేరాయి. ధరల ఒత్తిడి, పెరుగుతున్న పోటీ కారణంగా 2025–26 నాటికి మార్జిన్స్ సుమారు 14 శాతానికి క్షీణిస్తాయని అంచనా. అయితే, స్థూల మార్జిన్ దాదాపు 40 శాతం స్థిరంగా ఉంటుందని అంచనా. ప్రధానంగా అధికం అవుతున్న ముడి చమురు ఉప ఉత్పత్తుల ఖర్చులను ఎదుర్కోవడానికి ఇటీవలి 1.5–2.5 శాతం ధరల పెంపు ఇందుకు కారణం. వ్యవస్థీకృత కంపెనీలు.. పెయింట్స్ రంగంలో వ్యవస్థీకృత కంపెనీల వాటా మధ్య కాలంలో 80 శాతానికి పెరగనుంది. ఇది ఇప్పటికే కార్యకలాపాలు సాగిస్తున్న, కొత్తగా ప్రవేశించిన కంపెనీల భారీ సామర్థ్య విస్తరణ ఇందుకు కారణం అవుతుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 100 కోట్ల లీటర్లకుపైగా అదనపు సామర్థ్యం తోడుకానుంది. ఇందులో అ త్యధిక వాటా కొత్త బ్రాండ్ల నుంచే ఉండనుంది. మొత్తం డిమాండ్‌లో 70–75 శాతం వాటా కలిగిన డెకొరేటివ్ పె యింట్స్ ఈ డిమాండ్‌ను నడిపిస్తున్నాయి. రీ–పెయింట్ కార్యకలాపాలు, పట్టణీకరణ, పెరుగుతున్న ఆదాయాలు ఇందుకు ఆజ్యం పోస్తున్నాయి. మొత్తం డిమాండ్‌లో పారిశ్రామిక పెయింట్స్ వాటా 25–30 శాతం. ఆటోమోటివ్, చమురు, సహజ వాయువు, మౌలిక రంగాల్లో వీటిని వినియోగిస్తున్నారు. కొత్త బ్రాండ్ల రాకతో.. గట్టి పోటీ, సార్వత్రిక ఎన్నికలు, సుదీర్ఘ రుతుపవనాలు, ధరల తగ్గింపు ప్రభావం కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో ఆదాయం మరింతగా ప్రభావితమైంది. జేఎస్‌డబ్లు్య పెయింట్స్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, ఇతర కొత్త బ్రాండ్ల ప్రవేశంతో మార్కెట్‌కు అంతరాయం కలిగించింది. కొత్త బ్రాండ్లు దూకుడుగా విస్తరించి సామర్థ్యం, డీలర్ నెట్వర్క్, సేల్స్ టీమ్‌లను కలిగి ఉన్నాయి. ఫలితంగా ప్రచార కార్యకలాపాలు, ప్రకటనల వ్యయం పెరిగింది. ఇందుకు అనుగుణంగా పోటీ పడేందుకు ఇప్పటికే కార్యకలాపాలు సాగిస్తున్న కంపెనీలు వాటి సొంత మూలధన వ్యయం, మార్కెటింగ్ పెట్టుబడులతో ప్రతిస్పందించడంతో ఒత్తిడి పెరిగింది. -
విదేశీ మారకద్రవ్య నిల్వలు: భారత్‌లో ఇంత తగ్గాయా?
భారతదేశంలో విదేశీ మారకద్రవ్య నిల్వలు భారీగా తగ్గిపోయాయి. డిసెంబర్ 13తో ముగిసిన వారానికి ఇండియన్ ఫారెక్స్ నిల్వలు 1.988 బిలియన్ డాలర్లు తగ్గి 652.869 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని ఆర్బీఐ వెల్లడించింది. అంతకు ముందువారంలో.. మొత్తం నిల్వలు 3.235 బిలియన్ల డాలర్లు తగ్గి 654.857 బిలియన్ల వద్ద నిలిచాయి.విదేశీ మారకద్రవ్య నిల్వలు గత కొన్ని వారాలుగా తగ్గుముఖం పడుతూనే ఉన్నాయి. డాలర్ విలువతో పోలిస్తే.. ఇతర కరెన్సీలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. విదేశీ కరెన్సీ ఆస్తులలో మార్పులు ఫారెక్స్ మార్కెట్లో సెంట్రల్ బ్యాంక్ జోక్యంతో పాటు నిల్వలలో ఉన్న విదేశీ ఆస్తుల విలువ పెరగడం లేదా తరుగుదల కారణంగా సంభవిస్తాయి.రూపాయిలో అస్థిరతలను తగ్గించడంలో సహాయపడటానికి ఆర్బీఐ చేసిన ఫారెక్స్ మార్కెట్ జోక్యాలతో పాటు రీవాల్యుయేషన్ కూడా తగ్గుముఖం పట్టింది. సెప్టెంబరులో ఫారెక్స్ నిల్వలు ఆల్ టైమ్ గరిష్ట స్థాయి 704.885 బిలియన్ డాలర్లకు పెరిగాయి.మారక ద్రవ్య నిల్వలు తగ్గినప్పటికీ.. బంగారం నిల్వలు 1.121 బిలియన్ డాలర్లు పెరిగి 68.056 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు ఆర్బీఐ తెలిపింది. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (SDRs) 35 మిలియన్ డాలర్లు తగ్గి 17.997 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు సమాచారం. -
మళ్లీ క్షీణించిన ఫారెక్స్ నిల్వలు
ముంబై: విదేశీ మారకం (ఫారెక్స్) నిల్వలు నవంబర్ 22తో ముగిసిన వారంలో 1.31 బిలియన్ డాలర్ల మేర క్షీణించి 656.58 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. దీనికి ముందు వారం (నవంబర్ 15తో అంతమైన)లో ఏకంగా 17.76 బిలియన్ డాలర్ల మేర విదేశీ మారకం నిల్వలు తగ్గి 657.89 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం.ఈ ఏడాది సెప్టెంబర్ చివరికి ఫారెక్స్ నిల్వలు ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి 704.88 బిలియన్ డాలర్లకు చేరడం తెలిసిందే. ఇక ఆ తర్వాత నుంచి క్రమంగా ఇవి తగ్గుముఖం పడుతున్నాయి. ముఖ్యంగా విదేశీ ఇన్వెస్టర్లు భారత క్యాపిటల్ మార్కెట్ల నుంచి పెట్టుబడులను పెద్ద మొత్తంలో ఉపసంహరించుకోవడం దీనివెనుక ప్రధాన కారణంగా ఉంది. నవంబర్ 22తో ముగిసిన వారంలో మొత్తం ఫారెక్స్ నిల్వల్లో విదేశీ కరెన్సీ నిల్వలు 3 బిలియన్ డాలర్ల మేర తగ్గి 566.79 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు ఆర్బీఐ గణాంకాలు వెల్లడించాయి.ఫారెక్స్ నిల్వల్లో కరెన్సీ రూపంలోనే అధిక భాగం ఉంటుంది. బంగారం నిల్వలు సైతం 1.82 బిలియన్ డాలర్ల మేర తగ్గి 67.57 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఐఎంఎఫ్ వద్ద ప్రత్యేక డ్రాయింగ్ రైట్స్ (ఎస్డీఆర్) విలువ 79 మిలియన్ డాలర్ల మేర తగ్గి 17.98 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. ఐఎంఎఫ్ వద్ద భారత నిల్వలు సైతం 15 మిలియన్ డాలర్లు తగ్గి 4.23 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు ఆర్బీఐ గణాంకాలు తెలిపాయి. -
AP: ‘రియల్’ రివర్స్! పడిపోయిన స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు
విజయవాడ పటమట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సాధారణంగా ప్రతి నెలా సగటున వెయ్యి నుంచి 1,200 రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. కానీ ఇప్పుడు 800 రిజిస్ట్రేషన్లు జరగడం కూడా గగనంగా ఉంది. గత మూడేళ్లూ స్థిరాస్తిలో దూసుకెళ్లిన విశాఖలో రిజిస్ట్రేషన్లు ఒక్కసారిగా పడిపోయాయి. తిరుపతిలోనూ భారీగా జరిగే రిజిస్ట్రేషన్లు అనూహ్యంగా తగ్గిపోయాయి.సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం నేల చూపులు చూస్తోంది. స్థిరాస్థులరిజిస్ట్రేషన్లు దారుణంగా పడిపోయాయి. అమ్మకాలు, కొనుగోళ్ల లావాదేవీలతో కిటకిటలాడే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద అసలు సందడే కనిపించడంలేదు. ఈ ఏడాది జూన్ నుంచిరిజిస్ట్రేషన్లు తగ్గిపోవడంతో ఆ శాఖ ఆదాయం భారీగా తగ్గిపోయింది. గత సంవత్సరం వచ్చినంత ఆదాయం ఈసారి వచ్చే పరిస్థితి లేదని ఉన్నతాధికారులు పెదవి విరుస్తున్నారు. చంద్రబాబు గద్దెనెక్కితే రియల్ బూమ్ వస్తుందంటూ ప్రచారం చేసిన వారంతా ఈ పరిస్థితి చూసి నెత్తీ నోరూ బాదుకుంటున్నారు.భారీగా తగ్గినరిజిస్ట్రేషన్లు.. 2023–24లో రాష్ట్రవ్యాప్తంగా 21.91 లక్షల స్థిరాస్తులరిజిస్ట్రేషన్లు జరగగా అంతకుముందు రెండేళ్లు కూడారిజిస్ట్రేషన్ల సంఖ్య 26 లక్షలకుపైనే ఉంది. ఈ ఏడాది కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు జరిగినరిజిస్ట్రేషన్లు సుమారు 12 లక్షలు మాత్రమే. ఆరి్థక సంవత్సరం ముగియడానికి ఇక నాలుగు నెలల సమయం మాత్రమే మిగిలింది. కనీసం గతేడాది తరహాలోరిజిస్ట్రేషన్లు జరగాలన్నా సుమారు మరో 10 లక్షలరిజిస్ట్రేషన్లు జరగాలి. మార్కెట్లో నెలకొన్న పరిస్థితులు గమనిస్తుంటే అది కష్టమేనని చెబుతున్నారు. సాధారణంగా ఏటారిజిస్ట్రేషన్ల సంఖ్య పెరుగుతుంది. ఈదఫా అదనంగా పెరగకపోగా గతంలో ఉన్న సంఖ్యను కూడా చేరుకునే అవకాశం కనిపించడంలేదు. లక్ష్యంలో సగం కూడా చేరుకోలేదు.. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.13,500 కోట్ల మేర ఆదాయాన్ని ఆర్జించాలనిరిజిస్ట్రేషన్ల శాఖ లక్ష్యంగా నిర్దేశించుకోగా ఇప్పటివరకు రూ.5,500 కోట్ల లోపే సమకూరింది. అలాంటప్పుడు మరో నాలుగు నెలల్లో రూ.8 వేల కోట్ల ఆదాయాన్ని సాధించడం ఎలా సాధ్యమని అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. గత సంవత్సరం (2023–24)లో రూ.9,546 కోట్ల ఆదాయం రాగా అంతకుముందు సంవత్సరం (2022–23)లో రూ.8,064 కోట్ల రాబడి వచ్చింది.రిజిస్ట్రేషన్ల ఆదాయం గతంలో టీడీపీ హయాంలో రూ.5 వేల కోట్ల లోపే ఉండగా వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా సుమారు రూ.10 వేల కోట్లకు చేరుకోవడం గమనార్హం. ప్రధాన జిల్లాల్లో నిరాశే.. ఈ ఆరి్థక సంవత్సరంలో విశాఖ జిల్లాలో లక్ష్యం రూ.1,526 కోట్లు కాగా దాని ప్రకారం అక్టోబర్ నాటికి రూ.862 కోట్ల ఆదాయం రావాల్సి ఉండగా రూ.561 కోట్లు మాత్రమే వచ్చాయి. అక్టోబర్ నాటికి కాకినాడ జిల్లా రూ.347 కోట్ల ఆదాయాన్ని రాబట్టాల్సి ఉండగా రూ.196 కోట్లే సాధించగలిగారు. ఎనీ్టఆర్ జిల్లాలో అక్టోబర్ వరకు రూ.695 కోట్ల ఆదాయం రావాల్సి ఉండగా రూ.398 కోట్లే వచ్చాయి. గుంటూరు జిల్లాలో రూ.659 కోట్లకుగానూ రూ.483 కోట్లు మాత్రమే రాబడి వచ్చింది. తిరుపతి జిల్లాలో రూ.442 కోట్లకుగానూ రూ.252 కోట్ల ఆదాయం మాత్రమే లభించింది. నంద్యాలలో అయితే 50 శాతం తగ్గుదల నమోదు కాగా అనకాపల్లి, కర్నూలు, పుట్టపర్తి జిల్లాల్లో తగ్గుదల 40 శాతం కంటే అధికంగా ఉంది.త్వరలో మార్కెట్ విలువ పెంపు!ఆదాయ లక్ష్యాన్ని సాధించాలంటే భూముల మార్కెట్ విలువలు పెంచడం మినహా మరో మార్గం లేదని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. త్వరలో మార్కెట్ విలువను 50 శాతం వరకు పెంచి ఆదాయం పెరిగినట్లు చూపించేందుకు సన్నాహాలు చేస్తోంది. దీంతో కొనుగోలుదారులపై ఆ మేరకు భారం పడనుంది. -
రూపాయి మరో కొత్త ఆల్‌టైం కనిష్టానికి..
డాలర్ మారకంలో రూపాయి విలువ 8 పైసలు నష్టపోయి సరికొత్త కనిష్ట స్థాయి 84.50 వద్ద స్థిరపడింది. ఉక్రెయిన్ రష్యా యుద్ధ ఉద్రికత్తలు తారస్థాయికి చేరడంతో డాలర్ ఇండెక్స్(106.65) బలోపేతం మన కరెన్సీపై ఒత్తిడి పెంచిందని ఫారెక్స్ నిపుణులు తెలిపారు. ఫారెక్స్ మార్కెట్లో ఉదయం 84.41 వద్ద మొదలైంది. ఇంట్రాడేలో 84.51 వద్ద కనిష్టాన్ని తాకింది. క్రూడాయిల్ ధరలు పెరగడం, విదేశీ ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున పెట్టుబడులు ఉపసంహరించుకోవడం, దేశీయ ఈక్విటీ మార్కెట్ పతనం తదితర అంశాలూ ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. -
మౌలిక రంగం.. మందగమనం
న్యూఢిల్లీ: ఎనిమిది పరిశ్రమల మౌలిక గ్రూప్ సెప్టెంబర్‌లో పేలవ పనితీరును ప్రదర్శించింది. వృద్ధి రేటు (2023 ఇదే నెలతో పోల్చి) కేవలం 2 శాతానికి పరిమితమైంది. గత ఏడాది ఇదే నెలలో ఈ గ్రూప్ వృద్ధి 9.5 శాతం. 2024 ఆగస్టుతో(1.6 శాతం క్షీణత) పోల్చితే మెరుగ్గా నమోదవడం ఊరటనిచ్చే అంశం. క్రూడ్ ఆయిల్, సహజ వాయువు, విద్యుత్ రంగాలు క్షీణ రేటును నమోదుచేసుకున్నాయి. బొగ్గు, రిఫైనరీ ప్రొడక్టులు, ఎరువులు, స్టీల్, సిమెంట్ వృద్ధి రేటు స్వల్పంగా ఉంది. కాగా ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–సెపె్టంబర్ మధ్య, ఈ గ్రూప్ వృద్ధి రేటు 4.2 శాతంగా నమోదైంది. -
పరిశ్రమలు రివర్స్‌గేర్!
న్యూఢిల్లీ: దేశ పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి రేటు రెండేళ్ల విరామం తర్వాత ఆగస్టు నెలలో ప్రతికూలానికి పడిపోయింది. మైనస్ 0.1 శాతంగా నమోదైంది. పరిశ్రమల ఉత్పత్తిని ప్రతిబింబించే పారిశ్రామిక ఉత్పాదక సూచీ (ఐఐపీ) వృద్ధి జూలై నెలకు 4.7 శాతంగా ఉండడం గమనార్హం. క్రితం ఏడాది ఆగస్టు నెలలోనూ ఐఐపీ 10.9 వృద్ధిని నమోదు చేసింది. ప్రధానంగా మైనింగ్, విద్యుదుత్పత్తి రంగంలో క్షీణత ఐఐపీ పడిపోవడంలో కీలకంగా పనిచేసింది. అదే సమయంలో తయారీ రంగంలోనూ ఉత్పాదకత పుంజుకోలేదు. జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్వో) ఈ వివరాలను విడుదల చేసింది. ఇక ప్రస్తుత ఆరి్థక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు (ఐదు నెలల్లో) ఐఐపీ వృద్ధి 4.2 శాతంగా ఉంది. క్రితం ఏడాది ఇదే కాలానికి నమోదైన 6.2 శాతం కంటే తక్కువ. వృద్ధి రేటు మైనింగ్ రంగంలో మైనస్ 4.3 శాతానికి పడిపోయింది. విద్యుదుత్పత్తి రంగంలో మైనస్ 3.7 శాతంగా నమోదైంది. తయారీలో 0.1 శాతంగా ఉంది. ఆగస్ట్ నెలలో అధిక వర్షాలు మైనింగ్ రంగంలో వృద్ధి క్షీణతకు కారణమని ఎన్ఎస్వో తెలిపింది. చివరిగా 2022 అక్టోబర్ నెలలో ఐఐపీ వృద్ధి ప్రతికూలంగా నమోదు కావడం గమనార్హం. -
బంగారం దిగుమతులు డౌన్
న్యూఢిల్లీ: పసిడి దిగుమతులు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) మొదటి నాలుగు నెలల్లో.. ఏప్రిల్ నుంచి జూలై వరకు 12.64 బిలియన్ డాలర్ల (రూ.1.05 లక్షల కోట్లు సమారు) విలువైన బంగారం దిగుమలు నమోదయ్యాయి. 2023 ఏప్రిల్–జూలై మధ్య దిగుమతులు 13.2 బిలియన్ డాలర్లతో పోలి్చనప్పుడు 4.23 శాతం తగ్గాయి. ఒక్కజూలై నెల వరకే చూస్తే పసిడి దిగుమతులు 10.65 శాతం తగ్గి 3.13 మిలియన్ డాలర్లుగా ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2023 జూలైలో 3.5 బిలియన్ డాలర్ల దిగుమతులు నమోదు కావడం గమనించొచ్చు. అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక అనిశి్చతులకు తోడు, అధిక ధరలే బంగారం దిగుమతులపై ప్రభావం చూపించినట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. పండుగల సీజన్ నేపథ్యంలో సెపె్టంబర్ నుంచి దిగుమతులు పెరగొచ్చని, దిగుమతి సుంకాన్ని ప్రభుత్వం తగ్గించడం సైతం ఇందుకు మద్దతుగా నిలుస్తుందని ఓ జ్యుయలరీ వర్తకుడు అభిప్రాయపడ్డారు. బంగారం, వెండి దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీని 15 శాతం నుంచి 6 శాతానికి ఇటీవలి బడ్జెట్లో భాగంగా కేంద్రం తగ్గించడం తెలిసిందే. గడిచిన ఆర్థిక సంవత్సరం (2023–24) మొత్తం మీద బంగారం దిగుమతులు 30 శాతం పెరిగి 45.54 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. మన దేశానికి దిగుమతి అవుతున్న బంగారంలో 40 శాతం స్విట్జర్లాండ్ నుంచి వస్తుంటే, యూఏఈ 16 శాతం, దక్షిణాఫ్రికా 10 శాతం వాటా కలిగి ఉన్నాయి. మన దేశ మొత్తం దిగుమతుల్లో బంగారం వాటా 5 శాతంగా ఉంది. గణనీయంగా వెండి దిగుమతులు ఏప్రిల్ నుంచి జూలై మధ్య మన దేశం నుంచి 9.1 బిలియన్ డాలర్ల విలువైన రత్నాలు, ఆభరణాల ఎగుమతులు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలోని గణాంకాలతో పోల్చి చూస్తే 7.45 శాతం తగ్గాయి. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో 648 మిలియన్ డాలర్ల విలువైన వెండి దిగుమతులు జరిగాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో దిగుమతులు 215 బిలియన్ డాలర్లతో పోల్చి చూసినప్పుడు రెండు రెట్లు పెరిగాయి. యూఏఈతో 2022 మే 1 నుంచి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమల్లోకి వచి్చంది. దీంతో ఆ దేశం నుంచి బంగారం, వెండి దిగుమతులు పెరిగిపోయాయి. దీనిపై పరిశ్రమ నుంచి ఆందోళన వ్యక్తం అవుతుండంతో కొన్ని నిబంధనలను సమీక్షించాలని భారత్ కోరుతోంది. పెరిగిన వాణిజ్య లోటు ఏప్రిల్ నుంచి జూలై వరకు దేశ వాణిజ్య లోటు 85.58 బిలియన్ డాలర్లకు చేరింది. ఒక్క జూలై నెలకే 23.5 బిలియన్ డాలర్లుగా వాణిజ్యలోటు నమోదైంది. చైనా తర్వాత బంగారం వినియోగంలో భారత్ రెండో అతిపెద్ద దేశంగా ఉంది. ప్రధానంగా జ్యుయలరీ పరిశ్రమ నుంచి బంగారానికి ఎక్కువ డిమాండ్ ఉంటోంది. -
ఎగుమతులు డౌన్
న్యూఢిల్లీ: దాదాపు మూడు నెలల పాటు సానుకూల గణాంకాలు నమోదు చేసిన ఎగుమతులు జూలైలో 1.2 శాతం క్షీణించాయి. 33.98 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. అదే సమయంలో దిగుమతులు 7.45 శాతం పెరిగి 57.48 బిలియన్ డాలర్లకు చేరాయి. క్రూడాయిల్, వెండి, ఎల్రక్టానిక్ గూడ్స్ దిగుమతులు పెరగడం ఇందుకు కారణం. మొత్తం మీద జూలైలో వాణిజ్య లోటు 23.5 బిలియన్ డాలర్లకు పెరిగింది. జూన్‌లో ఇది 21 బిలియన్ డాలర్లుగా ఉండగా, గతేడాది జూలైలో 19.3 బిలియన్ డాలర్లుగా నమోదైంది. సమీక్షాకాలంలో ముడి చమురు దిగుమతులు 17.44 శాతం పెరిగి 13.87 బిలియన్ డాలర్లకు, వెండి దిగుమతులు 439 శాతం ఎగిసి 165.74 మిలియన్ డాలర్లకు చేరాయి. ప్రస్తుత ధోరణులను బట్టి చూస్తే గతేడాది నమోదైన 778 బిలియన్ డాలర్ల ఎగుమతుల (ఉత్పత్తులు, సరీ్వసులు) స్థాయిని ఈసారి అధిగమించే అవకాశాలు ఉన్నాయని కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్ బరత్వాల్ తెలిపారు. పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు 22 శాతం క్షీణించడం కూడా ఎక్స్‌పోర్ట్స్ తగ్గుదలకు కారణమని వివరించారు. ధరలు పడిపోవడం, దేశీయంగా వినియోగం పెరగడం వంటి అంశాల వల్ల జూలైలో పెట్రోలియం ఎగుమతులు తగ్గినట్లు సునీల్ వివరించారు. ఆఫ్రికా తదితర మార్కెట్లకి కూడా ఎగుమతులను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, రవాణా రేట్లు భారీగా పెరిగిపోవడం, కమోడిటీల ధరలు తగ్గడం, కంటైనర్ల కొరత వంటి అంశాలు ఎగుమతులపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని భారతీయ ఎగుమతి సంస్థల సమాఖ్య (ఎఫ్ఐఈవో) ప్రెసిడెంట్ అశ్వని కుమార్ చెప్పారు. వచ్చే నెల నుంచి పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. → జూలైలో బియ్యం, జీడిపప్పు, నూనె గింజలు, మెరైన్ ఉత్పత్తులు, రత్నాభరణాలు, రసాయనాలు, కాటన్ యార్న్ ఎగుమతులు ప్రతికూల వృద్ధి నమోదు చేశాయి. → ఎలక్ట్రానిక్ గూడ్స్, ఫార్మా, ఇంజినీరింగ్ ఉత్పత్తుల ఎగుమతులు వరుసగా 37 శాతం, 8 శాతం, సుమారు 4 శాతం మేర పెరిగాయి. → బంగారం దిగుమతులు 10.65 శాతం తగ్గి 3.13 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. → చైనా నుంచి దిగుమతులు 13 శాతం పెరిగి 10.28 బిలియన్ డాలర్లకు చేరగా, ఎగుమతులు 9 శాతం క్షీణించి 1.05 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. బ్రిటన్, జర్మనీ, దక్షిణాఫ్రికా, మలేíÙయా తదితర దేశాలకు కూడా ఎగుమతులు తగ్గాయి. అమెరికా, నెదర్లాండ్స్, సింగపూర్ వంటి దేశాలకు మాత్రం పెరిగాయి. అమెరికాకు ఎగుమతులు 3 శాతం పెరిగి 6.55 బిలియన్ డాలర్లకు చేరాయి. అక్కడి నుంచి దిగుమతులు 1 శాతం పెరిగి 3.71 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఏప్రిల్–జూలై వ్యవధిలో.. → ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూలై వ్యవధిలో ఎగుమతులు 4% పెరిగి 144.12 బిలియన్ డాలర్లకు చేరగా దిగుమతులు సుమారు 8% వృద్ధి చెంది దాదాపు 230 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. సరుకులకు సంబంధించి ఎగుమతులు, దిగుమతుల మధ్య వాణిజ్య లోటు గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే 75.15 బిలియన్ డాలర్ల నుంచి 85.58 బిలియన్ డాలర్లకు పెరిగింది. అటు సేవల ఎగుమతుల విలువ 107 బిలియన్ డాలర్ల నుంచి 117 బిలియన్ డాలర్లకు పెరిగింది. → అమెరికాకు ఎగుమతులు 9 శాతం పెరిగి 27.44 బిలియన్ డాలర్లకు చేరగా, దిగుమతులు సుమారు 7 శాతం పెరిగి 15.24 బిలియన్ డాలర్లకు చేరాయి. వెరసి 12.2 బిలియన్ డాలర్ల మేర వాణిజ్య మిగులు నమోదైంది. అటు రష్యా నుంచి దిగుమతులు జూలైలో 23 శాతం పెరిగి 5.41 బిలియన్ డాలర్లకు, ఏప్రిల్–జూలై మధ్య కాలంలో 20 శాతం వృద్ధి చెంది 23.77 బిలియన్ డాలర్లకు చేరాయి. క్రూడాయిల్ దిగుమతులు పెరగడం ఇందుకు కారణం. -
ఐటీ కొలువులు.. చిగురిస్తున్న ఆశలు!
ఐటీ రంగం ఉద్యోగాల విషయంలో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. ఈ ఏడాది తొలి త్రైమాసికం (2023–24, క్యూ1)లో వరుసగా ఏడో క్వార్టర్లోనూ టాప్–5 ఐటీ దిగ్గజాల మొత్తం సిబ్బంది సంఖ్య తగ్గింది. అయితే, గతంతో పోలిస్తే తగ్గుదల జోరుకు భారీగా అడ్డుకట్ట పడటం సానుకూలాంశం. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరికల్లా మళ్లీ ఐటీ రంగం పెరిగిన ఉద్యోగులతో కళకళలాడే పరిస్థితి వస్తుందంటున్నారు పరిశ్రమ విశ్లేషకులు. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా... దేశీ ఐటీ రంగంలో ఇవి టాప్–5 కంపెనీలు. ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1లో వీటి మొత్తం సిబ్బంది సంఖ్య సీక్వెన్షియల్‌గా (గతేడాది క్యూ4తో పోలిస్తే) 2,034 మంది తగ్గారు. అయితే, టీసీఎస్, విప్రో, టెక్ మహీంద్రా.. ఈ మూడు దిగ్గజాలు మాత్రం ఏప్రిల్–జూన్ క్వార్టర్లో నికరంగా ఉద్యోగులను జత చేసుకోవడం విశేషం.‘గడిచిన ఐదు క్వార్టర్లలో ఉద్యోగుల తగ్గుదల జోరుకు క్రమంగా అడ్డుకట్ట పడటం సానుకూల పరిణామం’ అని హైరింగ్ కంపెనీ ఎక్స్‌ఫెనో బిజినెస్ హెడ్ (టెక్నాలజీ సిబ్బంది నియామకాలు) దీప్తి ఎస్ పేర్కొన్నారు. టాప్–5లో మూడు దిగ్గజ సంస్థలు క్యూ1లో నికరంగా ఉద్యోగులను జత చేసుకోవడంతో నియామకాల రికవరీ ఆశలు చిగురిస్తున్నాయని, ఈ ఆర్థిక సంవత్సరం చివరికల్లా ఐటీ పరిశ్రమ మళ్లీ కొత్త ఉద్యోగుల చేరికలతో కళకళలాడే అవకాశం ఉందని కూడా ఆమె అంచనా వేస్తున్నారు. హైరింగ్‌పై ఆర్థిక అనిశ్చితి ఎఫెక్ట్... దేశీ ఐటీ కంపెనీలకు ప్రధాన మార్కెట్లయిన అమెరికా, యూరప్‌లలో ఆర్థిక అనిశ్చితి కొనసాగుతుండటంతో గత ఏడాదిన్నరగా హైరింగ్‌కు ముఖం చాటేస్తున్నాయి. కొన్ని కంపెనీలు ఉద్యోగాల్లో కోతలకు కూడా తెరతీశాయి. అయితే, ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1 ఫలితాల్లో ఈ ప్రతికూల పరిస్థితులు సద్దుమణుగుతున్న సంకేతాలు వెలువడ్డాయి. టాప్–5 కంపెనీల మొత్తం సిబ్బంది సంఖ్య ఈ జూన్ నాటికి 15,23,742కు చేరింది. మార్చి చివరికి మొత్తం ఉద్యోగుల సంఖ్య 15,25,776గా నమోదైంది. టీసీఎస్ సిబ్బంది 6,06,998కి చేరింది. కొత్తగా 5,452 మంది జతయ్యారు. ఇన్ఫోసిస్ ఉద్యోగుల సంఖ్య 3.15 లక్షలకు చేరింది. 1,908 మంది తగ్గారు. హెచ్‌సీఎల్ టెక్‌లో దాదాపు 8,000 మంది తగ్గుదలతో మొత్తం సిబ్బంది 2.27 లక్షలకు చేరారు. విప్రోలో ఉద్యోగుల సంఖ్య క్యూ1లో స్వల్పంగా 337 మంది పెరిగి 2.34 లక్షలకు చేరింది. టెక్ మహీంద్రాకు నికరంగా 2,165 మంది జతకావడంతో మొత్తం ఉద్యోగులు 1.47 లక్షలకు పెరిగారు. అయితే, గతేడాది క్యూ1 నాటి సిబ్బంది సంఖ్యతో పోలిస్తే బిగ్–5 కంపెనీల్లో 46,325 మంది ఉద్యోగులు తగ్గారు. గడిచిన రెండేళ్లలో టాప్–5 కంపెనీల మొత్తం ఉద్యోగుల సంఖ్య 3 శాతం తగ్గగా... అంతక్రితం మూడేళ్ల కాలంతో పోలిస్తే 18 శాతం పెరిగారని దీప్తి తెలిపారు. ఐటీ హైరింగ్ విషయంలో సాధారణ స్థాయికి రావడానికి మరికొన్నాళ్లు పట్టే అవకాశం ఉన్నప్పటికీ, తాజా గణాంకాలు ఆశాజనకంగా ఉన్నాయని ఆమె చెబుతున్నారు. 2,034: టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా మొత్తం ఉద్యోగుల సంఖ్య క్యూ1లో సీక్వెన్షియల్‌గా తగ్గుదల.15,23,742: ఈ ఏడాది జూన్ (క్యూ1) చివరి నాటికి ఈ బిగ్5 కంపెనీల మొత్తం సిబ్బంది సంఖ్య 15,23,742. 5: గడిచిన ఐదు త్రైమాసికాలుగా సిబ్బంది తగ్గుదల క్రమంగా శాంతించడం సానుకూలాంశం. ఫ్రెషర్లకు చాన్స్.. ఐటీ రంగంలో ఫ్రెషర్ల హైరింగ్ భారీగా పుంజుకోనుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 15,000–20,000 మంది ఫ్రెషర్లను నియమించుకునే అవకాశం ఉందని ఇన్ఫోసిస్ క్యూ1 ఫలితాల సందర్భంగా ప్రకటించింది. విప్రో సైతం 10,000–12,000 మందికి ఈ ఏడాది ఉద్యోగావకాశాలు కల్పిస్తా మని పేర్కొంది. ప్రధానంగా జెనరేటివ్ ఏఐ, సైబర్‌సెక్యూరిటీ, క్లౌడ్ విభాగాల్లో కూడా అదనంగా ఉద్యోగులను తీసుకోనున్నట్లు కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. క్యూ1లో 3,000 మంది ఫ్రెషర్లకు (న్యూ జెన్ అసోసియేట్స్) అవకాశం ఇచి్చనట్లు తెలిపింది. ఇక హెచ్‌సీఎల్ టెక్ కొత్తగా 10,000 మంది ఫ్రెషర్లకు ఉద్యోగాలిస్తామని ప్రకటించింది. టీసీఎస్ సైతం క్యాంపస్ హైరింగ్‌పై దృష్టిపెడుతోంది. మొత్తంమీద ఈ ఐటీ పరిశ్రమ ఫ్రెష్ హైరింగ్ 1,00,000–1,20,000 స్థాయిలో ఉండొచ్చని హెచ్ఆర్ కన్సల్టెన్సీ ఎక్స్‌ఫెనో అంచనా. గతేడాది 60,000 స్థాయితో పోలిస్తే ఇది భారీగానే లెక్క. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
పసిడి డిమాండ్‌కు ధరల చెక్
ముంబై: భారత్‌లో పసిడి పరిమాణం డిమాండ్ ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో 5 శాతానికిపైగా పతనమైంది. 2023 ఇదే కాలంతో పోలి్చతే డిమాండ్ పరిమాణం 158.1 టన్నుల నుంచి 149.7 టన్నులకు పడిపోయింది. అధిక ధరలు, దీనితో కొనుగోళ్లు త్గగడం దీనికి కారణమని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) జూన్ త్రైమాసిక గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్ నివేదిక పేర్కొంది. ఈ నెల 23వ తేదీన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ కస్టమ్స్ సుంకాలను 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించడంతో బంగారం ధరలు భారీగా పడిన పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితి డిమాండ్‌కు ఏమాత్రం దోహదపడిందన్న అంశం ఆగస్టు త్రైమాసికంలో తెలియనుంది. తాజా డబ్ల్యూజీసీ నివేదికలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... → జూన్ త్రైమాసికం డిమాండ్ పరిమాణంలో తగ్గినా.. విలువలో మాత్రం 17 శాతం పెరిగి రూ.82,530 కోట్ల నుంచి రూ.93,850 కోట్లకు ఎగసింది. → 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.74,000 దాటితే, సగటు ధర ఇదే కాలంలో రూ.52,191.60 నుంచి రూ.62,700.50కు ఎగసింది. (దిగుమతి సుంకం, జీఎస్టీ మినహా). అంతర్జాతీయంగా చూస్తే, ఔన్స్ (31.1గ్రాములు) ధర ఇదే కాలంలో 1,975.9 డాలర్ల నుంచి 2,338.2 డాలర్లకు ఎగసింది. (అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్ న్యూయర్క్ కమోడిటీ ఎక్సే్చంజ్‌లో జూలై 16వ తేదీన ఔన్స్ ధర ఆల్‌టైమ్ హై 2,489 డాలర్లను తాకిన సంగతి తెలిసిందే) → ఇక జూన్ త్రైమాసికంలో ఆభరణాలకు పరిమాణ డిమాండ్ 17 శాతం పడిపోయి 128.6 టన్నుల నుంచి 106.5 టన్నులకు చేరింది. → ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ మాత్రం ఇదే కాలంలోలో 46 శాతం పెరిగి 29.5 టన్నుల నుంచి 43.1 టన్నులకు ఎగసింది. → రీసైకిల్డ్ గోల్డ్ పరిమాణం 39 శాతం తగ్గి 37.6 టన్నుల నుంచి 23 టన్నులకు పడింది. → దిగుమతులు 8 శాతం పెరిగి 182.3 టన్నుల నుంచి 196.9 టన్నులకు ఎగసింది.గ్లోబల్ డిమాండ్ 4 శాతం అప్మరోవైపు అంతర్జాతీయంగా పసిడి డిమాండ్ జూన్ త్రైమాసికంలో 4 శాతం పెరిగి 1,207.9 టన్నుల నుంచి 1,258.2 టన్నులకు ఎగసింది. హోల్‌సేల్, స్పాట్‌సహా సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు కొనసాగడం, ఈటీఎఫ్ అవుట్ఫోస్లో మందగమనం దీనికి కారణం. గోల్డ్ సరఫరా 4 శాతం పెరిగి 929 టన్నులుగా ఉంది.ఎదురుగాలిలోనూ ముందుకే.. బంగారానికి ఎదురుగాలి వీసే అవకాశం ఉంది. అయినప్పటికీ, గ్లోబల్ మార్కెట్లో కూడా మార్పులు జరుగుతున్నాయి, ఇవి బంగారం డిమాండ్‌కు మద్దతునిస్తాయి. డిమాండ్‌ను మరింత పెంచుతాయి. – లూయిస్ స్ట్రీట్, డబ్ల్యూజీసీ సీనియర్ మార్కెట్స్ విశ్లేషకురాలు -
రిలయన్స్ డీలా
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 5 శాతం క్షీణించి రూ. 15,138 కోట్లకు పరిమితమైంది. టెలికం, రిటైల్ బిజినెస్‌ల వృద్ధిని ఇంధన, పెట్రోకెమికల్ మార్జిన్లు దెబ్బతీశాయి. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 16,011 కోట్లు ఆర్జించింది. త్రైమాసికవారీ(క్యూ4)గా నికర లాభం 20 శాతం క్షీణించింది. తరుగుదల, ఎమారై్టజేషన్ వ్యయాలు 16 శాతం పెరిగి రూ. 13,596 కోట్లను తాకాయి. ఇబిటా 2 శాతం వృద్ధితో రూ. 42,748 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం 12 శాతం ఎగసి రూ. 2.57 లక్షల కోట్లను తాకింది. ఆయిల్ టు కెమికల్(ఓ2సీ) బిజినెస్ ఇబిటా 14 శాతం నీరసించి రూ. 13,093 కోట్లకు పరిమితమైంది. చమురు, గ్యాస్ ఇబిటా 30 శాతం జంప్‌చేసి రూ. 5,210 కోట్లయ్యింది. కేజీ డీ6 బ్లాక్ నుంచి రోజుకి 28.7 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్ల గ్యాస్‌ను ఉత్పత్తి చేసింది. జూన్ చివరికల్లా ఆర్ఐఎల్ నికర రుణ భారం రూ. 1.12 లక్షల కోట్లకు చేరింది. జియో ఇన్ఫోకామ్ గుడ్ జియో ప్లాట్‌ఫామ్స్ కన్సాలిడేటెడ్ నికర లాభం 12 శాతం వృద్ధితో రూ. 5,698 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం 13 శాతం బలపడి రూ. 34,548 కోట్లను తాకింది. దీనిలో భాగమైన రిలయన్స్ టెలికం సరీ్వసుల విభాగం జియో ఇన్ఫోకామ్ స్టాండెలోన్ నికర లాభం వార్షికంగా 12 శాతం ఎగసింది. రూ. 5,445 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం 10 శాతం పుంజుకుని రూ. 26,478 కోట్లకు చేరింది. వినియోగదారుల సంఖ్య 48.97 కోట్లను తాకింది. ఒక్కో వినియోగదారుడిపై సగటు ఆదాయం(ఏఆర్పీయూ) రూ. 181.7కు చేరింది. తలసరి డేటా వినియోగం రోజుకి 1జీబీని మించింది. దీంతో డేటా ట్రాఫిక్ కారణంగా ప్రపంచంలో అతిపెద్ద ఆపరేటర్‌గా అవతరించింది. చైనా వెలుపల అతిపెద్ద 5జీ ఆపరేటర్‌గా జియో నిలుస్తోంది. ఆర్ఐఎల్ షేరు బీఎస్ఈలో 2 % క్షీణించి రూ. 3110 వద్ద ముగిసింది. రిటైల్ బాగుంది...రిలయన్స్ రిటైల్ విభాగం ఆర్ఆర్వీఎల్ క్యూ1 నికర లాభం 5 శాతం వృద్ధితో రూ. 2,549 కోట్లయ్యింది. స్థూల ఆదాయం 8 శాతం ఎగసి రూ. 75,615 కోట్లను తాకింది. ఇబిటా 10 శాతంపైగా పుంజుకుని రూ. 5,664 కోట్లకు చేరింది. 331 కొత్త స్టోర్లను తెరిచింది. దీంతో వీటి సంఖ్య 18,918ను తాకింది. మరోపక్క కొత్తగా 30 మెట్రో(హోల్‌సేల్) స్టోర్లకు తెరతీసింది. వీటి సంఖ్య 200కు చేరింది. జర్మన్ దిగ్గజం మెట్రో ఏజీ నుంచి 2022 డిసెంబర్లో రిలయన్స్ రూ. 2,850 కోట్లకు మెట్రో బిజినెస్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.లాభాలు పటిష్టం కన్జూమర్, ఆయిల్ అండ్ గ్యాస్ బిజినెస్ ప్రభావంతో క్యూ1లో మెరుగైన ఇబిటాను సాధించాం. ఇది డైవర్స్ పోర్ట్‌ఫోలియో బిజినెస్‌కున్న పటిష్టతను ప్రతిఫలిస్తోంది. డిజిటల్ సర్వీసుల బిజినెస్ ప్రోత్సాహకర పనితీరు చూపుతోంది. రిటైల్ బిజినెస్ సైతం పటిష్ట ఆర్థిక ఫలితాలను సాధించింది. – ముకేశ్ అంబానీ, చైర్మన్, ఎండీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ -
అందుకే టిక్కెట్ ధర తగ్గించాం
‘‘పెద్ద సినిమాలకు టిక్కెట్ ధర ఎంత పెట్టినా ప్రేక్షకులు వస్తారు. కానీ, చిన్న సినిమాలకి తక్కువ రేట్లు ఉంటే కానీ రారు. అందుకే ‘పేక మేడలు’ టిక్కెట్ ధరని వంద రూ΄ాయలు చేశాం’’ అన్నారు నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని. వినోద్ కిషన్, అనూష కృష్ణ జంటగా నీలగిరి మామిళ్ల దర్శకత్వం వహించిన చిత్రం ‘పేక మేడలు’. రాకేశ్ వర్రే నిర్మించిన ఈ మూవీ రేపు విడుదలవుతోంది. ఈ సినిమాని రిలీజ్ చేస్తున్న ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ– ‘‘పేక మేడలు’లాంటి మంచి సిని మాని ప్రేక్షకులకు చేరువ చేయాలని విజయవాడ, వైజాగ్, హైదరాబాద్‌లలో యాభై రూ΄ాయలకే ప్రీమియర్స్ వేశాం. చూసినవారు సినిమా బాగుందన్నారు’’ అన్నారు. ‘‘ప్రీమియర్స్‌కి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఇది ప్రీ సక్సెస్ మీట్‌లాగా ఫీల్ అవుతున్నాను’’ అన్నారు నీలగిరి. ‘‘మా సినిమాను స΄ోర్ట్ చేస్తున్న ధీరజ్, రానా, అడివి శేష్, విశ్వక్ సేన్ గార్లకి కృతజ్ఞతలు’’ అన్నారు రాకేశ్ వర్రే. -
భారీగా తగ్గిన హెచ్‌సీఎల్ ఉద్యోగుల సంఖ్య
జూన్ 30, 2024తో ముగిసిన మొదటి త్రైమాసికంలో భారతదేశంలోని మూడో అతిపెద్ద ఐటీ కంపెనీ హెచ్‌సీఎల్ టెక్నాలజీ ఉద్యోగుల సంఖ్య 8,080 మంది తగ్గినట్లు సమాచారం. కంపెనీ క్యూ 1 ఫలితాల సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించింది. దీంతో ఉద్యోగుల సంఖ్య క్యూ1లో 2,19,401కి చేరింది.టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను పెంచుకుంటూ పోతుంటే.. హెచ్‌సీఎల్ మాత్రం ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటూ పోతోంది. గతంలో హెచ్‌సీఎల్ కంపెనీ ఉద్యోగుల సంఖ్య ఇతర ప్రత్యర్థి కంపెనీల కంటే కొంత ఎక్కువగానే ఉండేదని గణాంకాలు చెబుతున్నాయి.గురువారం టీసీఎస్ ఫలితాలను వెల్లడించిన సమయంలో.. ఉద్యోగుల సంఖ్యను కూడా ప్రకటించింది. మొదటి త్రైమాసికంలో కంపెనీ ఉద్యోగుల సంఖ్య 5452 పెరిగింది. దేంతో టీసీఎస్ హెడ్‌కౌంట్ 6,06,998కి చేరింది. ఫ్రెషర్స్ నియమాల విషయానికి వస్తే.. గత త్రైమాసికంలో హెచ్‌సీఎల్ కొత్త నియమాలకు కేవలం 1078 మాత్రమే. అంతకుముందు ఏడాది ఈ సంఖ్య 3096గా ఉండేది. దీన్ని బట్టి చూస్తే కొత్త ఉద్యోగుల నియమాలను కూడా అంతంతమాత్రమే అని తెలుస్తోంది.జూలై 11న జరిగిన క్యూ1 ఎర్నింగ్స్ కాన్ఫరెన్స్‌లో హెచ్‌సీఎల్ టెక్నాలజీ.. చీఫ్ పీపుల్ ఆఫీసర్ రామచంద్రన్ సుందరరాజన్ మాట్లాడుతూ.. ఈ త్రైమాసికంలో స్టేట్ స్ట్రీట్‌తో జరిగిన డివెస్టిచర్ను పరిగణనలోకి తీసుకుని హెడ్‌కౌంట్‌ను పరిశీలించాలి. సంస్థ ఎదుర్కొన్న కొన్ని అనిశ్చితుల వల్ల ఉద్యోగులను తొలగించాల్సి వచ్చింది. రాబోయే రోజుల్లో పెట్టుబడులు, నియమాల మీద ద్రుష్టి సారిస్తామని ఆయన అన్నారు. -
బైడెన్‌కు తగ్గిన భారతీయ- అమెరికన్ల మద్దతు
ఈ ఏడాది నవంబర్‌లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. ఇంతలో బైడెన్‌కు మద్దతునిచ్చే విషయంలో భారతీయ-అమెరికన్లు కాస్త వెనక్కు తగ్గినట్లు తెలుస్తోంది. ప్రతి రెండేళ్లకోసారి నిర్వహించే ఆసియన్-అమెరికన్ ఓటర్ సర్వే (ఏఏవీఎస్) తెలిపిన వివరాల ప్రకారం 2020 ఎన్నికలు- 2024 ఎన్నికల మధ్యకాలంలో జో బైడెన్‌కు మద్దతునిచ్చే భారతీయ-అమెరికన్ మద్దతుదారులలో 19 శాతం క్షీణత కనిపించింది.ఆసియా అండ్ పసిఫిక్ ఐలాండర్ అమెరికన్ వోట్ ఆసియన్ అమెరికన్స్ అడ్వాన్సింగ్ జస్టిస్‌ల సర్వే ప్రకారం 49 శాతం మంది భారతీయ-అమెరికన్ పౌరులు ఈ ఏడాది జో బైడెన్‌కు ఓటు వేసే అవకాశం ఉంది. 2020లో ఇది 65 శాతంగా ఉంది. 30 శాతం మంది భారతీయ-అమెరికన్ పౌరులు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఓటు వేసే అవకాశాలున్నాయని సర్వే వెల్లడించింది.డొనాల్డ్ ట్రంప్‌కు రెండు పాయింట్ల మేరకు ప్రయోజనం ఉండబోతోందని ఈ సర్వే తెలిపింది. గత రెండు దశాబ్దాలుగా అమెరికాలో ఆసియా అమెరికన్ ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గత నాలుగేళ్లలో 15 శాతం వృద్ధి నమోదైంది. భారతీయ-అమెరికన్ ఓటర్ల సంఖ్య తగ్గడం బైడెన్‌కు ఆందోళన కలిగించే అంశంగా మారింది.ఈ సర్వే ప్రకారం 55 శాతం భారతీయ-అమెరికన్ ఓటర్లు బైడెన్‌కు మద్దతు నివ్వగా, 38 శాతం మంది మాత్రమే ట్రంప్‌కు మద్దతు పలికారు. కాగా దక్షిణ కాలిఫోర్నియా గవర్నర్, అమెరికా రాయబారి నిక్కీ హేలీని 33 శాతం మంది భారతీయ-అమెరికన్లు ఇష్టపడుతున్నారు. అయితే హేలీ పేరు వినని వారు 11 శాతం మంది ఉండటం విశేషం. -
మూడేళ్లలో న్యాయం
న్యూఢిల్లీ: సోమవారం నుంచి అమల్లోకి వచి్చన నూతన నేర చట్టాల కింద ఎఫ్ఐఆర్ నమోదైన మూడేళ్లలోపు కోర్టులో న్యాయం అందేలా చేస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. బ్రిటిష్ వలస పాలనాకాలం నుంచి కొనసాగుతున్న భారతీయ శిక్షా స్మృతి(ఐపీసీ), నేర శిక్షాస్మృతి (సీఆర్పీసీ), భారత సాక్ష్యాధారాల చట్టాల స్థానంలో కొత్తగా భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్), భారతీయ సాక్ష్య అధినియమ్(బీఎస్ఏ) చట్టాలను అమల్లోకి తెచి్చన సందర్భంగా సోమవారం ఢిల్లీలో అమిత్‌షా పత్రికా సమావేశంలో మాట్లాడారు. ‘‘ కొత్త చట్టాల అమలుతో నేరాలు తగ్గుముఖం పడతాయి. నూతనచట్టాల కింద 90 శాతం వరకు నేరాలు నిరూపించబడి దోషులకు శిక్షలుపడతాయి. జీరో ఎఫ్ఐఆర్, ఫిర్యాదులపై పోలీసుల ఆన్లైన్ రిజి్రస్టేషన్, ఎస్ఎంఎస్ తదితర విధానంలో సమన్ల జారీ, హేయమైన నేరాలకు సంబంధించి ఘటనాస్థలిని వీడియో తీయడం, బాధితురాలి ఇంటి వద్ద వాంగ్మూలం తీసుకోవడం వంటి ఎన్నో నిబంధనలను కొత్త చట్టాలు తీసుకొచ్చాయి’’ అని షా చెప్పారు. 10 నిమిషాలకే కొత్త చట్టం కింద కేసు ‘‘కొత్త చట్టాలు సోమవారం అర్ధరాత్రి అమల్లోకి వచి్చన 10 నిమిషాలకే మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ సిటీలో కొత్త చట్టం కింద బైక్ దొంగతనం కేసు నమోదైంది. వలసపాలనాకాలంలో బ్రిటిష్ వాళ్లు నేరాలపై శిక్షకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. మేం కొత్త చట్టాల ద్వారా న్యాయానికి ప్రాధాన్యతనిస్తున్నాం. ఈ–ఎఫ్ఐఆర్, జీరో ఎఫ్ఐఆర్, ఎలక్ట్రానిక్, డిజిటల్ సాక్ష్యాల ద్వారా నేరాలపై ఫిర్యాదును మరింత సులభతరం చేశాం. సుదీర్ఘకాలం వేచి ఉండాల్సిన పనిలేకుండా త్వరగా న్యాయం జరిగేలా న్యాయవ్యవస్థకూ కాలపరిమితిని విధించాం. చిన్నారులు, మహిళలపై నేరాలను సున్నితమైనవిగా పరిగణించాం. కొత్త చట్టం ప్రకారం ఈ కేసుల్లో ఏడు రోజుల్లోపు దర్యాప్తు నివేదిక ఇవ్వాల్సిందే. నేర కేసుల్లో దర్యాప్తు ముగిసిన 45 రోజుల్లోపు కేసు తీర్పు చెప్పాల్సిందే. తొలిసారిగా ఒక కేసు విచారణ మొదలైన రోజు నుంచి 60 రోజుల్లోపు అభియోగాలు దాఖలుచేయాలి.511 సెక్షన్లను 358కి కుదించాం ఒకేలా ఉన్న వేర్వేరు సెక్షన్లను కలిపేశాం. దీంతో 511 సెక్షన్లకు బదులు 358 సెక్షన్లు మిగిలాయి. ఉదాహరణకు 6వ సెక్షన్ నుంచి 52వ సెక్షన్‌లోని నిబంధనలను ఒకే సెక్షన్లోకి మార్చారు. న్యాయం, పారదర్శకత, నిష్పాక్షికత లక్ష్యంగా ఈ మూడు చట్టాలను తెచ్చాం’’ అని షా వివరించారు. -
సెన్స్‌క్స్ డౌట్!
మళ్లీ వచ్చేది మోదీయే... ఈసారి ఎన్డీయే కూటమికి 400 పై చిలుకు సీట్లు పక్కా... బీజేపీకి కనీసం 370 సీట్లు ఖాయం... కమలనాథుల అంచనాలివి! తీరా ఎన్నికలు మొదలై ఒక్కో విడత పోలింగ్ ముగుస్తున్నకొద్దీ ఈ ఉత్సాహం మెల్లమెల్లగా నీరుగారుతోంది. నాలుగు విడతల్లోనూ పోలింగ్ గత ఎన్నికలతో పోలిస్తే తగ్గడంతో అధికార పార్టీలో కాస్త అలజడి మొదలైంది. ఇదే మూడ్ స్టాక్ మార్కెట్లోనూ ప్రతిబింబిస్తోంది. ఓటింగ్ తగ్గడంతో బీజేపీ సొంతంగా మేజిక్ ఫిగర్‌ను అందుకుంటుందో లేదోనన్న అనుమానాలు తలెత్తడంతో ఇన్వెస్టర్లలో విశ్వాసం దెబ్బతింది. రోజుకో కొత్త రికార్డులతో రంకెలేసిన బుల్ ఒక్కసారిగా రివర్స్ గేర్ వేసింది. ఎన్నికల ‘వేడి’కి తికమకపడుతోంది. నిన్నమొన్నటిదాకా పెట్టుబడుల వరద పారించిన విదేశీ ఇన్వెస్టర్లు పొలోమంటూ అమ్మకాలకు తెగబడుతున్నారు. అయి తే ఫలితాలపై అనిశ్చితి వల్లే సెంటిమెంట్‌పై ప్రభావం పడుతోందని, బీజేపీ మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఇన్వెస్టర్లు తరలివస్తారని నిపుణులు పేర్కొంటున్నారు... స్టాక్ మార్కెట్లో ఈసారి ఎన్నికల ముందస్తు ర్యాలీతో రికార్డుల మోత మోగింది. మోదీ 3.0పై నమ్మకానికి తోడు ఎన్డీయే సీట్ల సంఖ్య కూడా పెరుగుతుందన్న అంచనాలు దీనికి కారణం. అయితే, ఎన్నికల ‘వేడి’ జోరందుకుని, పోలింగ్ మొదలయ్యాక ఇన్వెస్టర్లలో నెమ్మదిగా నమ్మకం సడలుతూ వస్తోంది. ఇప్పటిదాకా పోలింగ్ పూర్తయిన నాలుగు విడతల్లోనూ గత ఎన్నికలతో పోలిస్తే ఓటింగ్ శాతం తగ్గడం దీనికి ఆజ్యం పోసింది. మండుటెండలు, పట్టణ ఓటర్ల నిరాసక్తత వంటి కారణాలు ఎన్నున్నా ... ఓటింగ్ పడిపోవడంతో ఫలితాల్లో బీజేపీ బంపర్ విక్టరీపై అనుమానాలు ఇన్వెస్టర్లలో గుబులు పుట్టిస్తున్నాయి. ఇటీవలే సెన్సెక్స్ (75,111 పాయింట్లు), నిఫ్టీ (22,795 పాయింట్లు) కొత్త ఆల్‌టైం గరిష్టాలను తాకిన తర్వాత భారీగానే క్షీణించాయి. గడచిన నెల రోజుల్లో సూచీలు దాదాపు 3 శాతం పైగానే పడటం దీనికి అద్దం పడుతోంది. గత ఎన్నికల్లో తొలి విడతల్లో పోలింగ్ తగ్గినా, క్రమంగా పుంజుకుంది. దాంతో మొత్తమ్మీద రికార్డు స్థాయిలో 67.4 శాతం ఓటింగ్ జరిగింది. బీజేపీ సొంత బలం కూడా 282 నుంచి 303 లోక్‌సభ స్థానాలకు ఎగబాకింది. ఈసారి మాత్రం తొలి విడత నుంచే ఓటింగ్ క్రమంగా తగ్గముఖం పడుతూ వస్తోంది. మిగతా 3 విడతల్లోనూ ఇలాగే మందకొడిగా జరిగితే మొత్తం ఓటింగ్ గతం కంటే 2 నుంచి 3 శాతం తగ్గేలా కని్పస్తోంది.విదేశీ ఇన్వెస్టర్లు పీఛే ముడ్... ఓటింగ్ శాతం తగ్గుతుండటం, ఎన్నికల ఫలితాలపై అనిశ్చితి నెలకొనడంతో విదేశీ ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ)లో కూడా ఆందోళన మొదలైంది. మన ఈక్విటీ మార్కెట్లలో గత నెలన్నరలో రూ.30 వేల కోట్లకు పైగా విలువైన షేర్లను అమ్మేయడం దీనికి నిదర్శనం. మార్కెట్లు భారీగా పడటానికి ఎఫ్‌పీఐల విక్రయాలే కీలకంగా నిలుస్తున్నాయి. 2023లో విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) ఏకంగా రూ.1.77 లక్షల కోట్లను దేశీ మార్కెట్లో కుమ్మరించి రికార్డులు బద్దలుకొట్టారు. అంతేకాదు, ఇందులో దాదాపు మూడో వంతు (రూ.58 వేల కోట్లు) ఒక్క డిసెంబర్లోనే ఇన్వెస్ట్ చేయడం విశేషం. దీనికి తోడు దేశీ ఇన్వెస్టర్లు, ఫండ్స్ జోరుతో బుల్ రంకెలేసింది. గతేడాది సెన్సెక్స్, నిఫ్టీ 20 శాతం రాబడులు అందించాయి. కార్పొరేట్ కంపెనీల లాభాలు పుంజుకోవడం, ప్రభుత్వ పెట్టుబడుల జోరు, స్థూల ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉండటం, వృద్ధి రేటు పుంజుకోవడం, సుస్థిర ప్రభుత్వం, స్థిరమైన పాలసీలు తదితర కారణాలతో విదేశీ ఇన్వెస్టర్లకు భారత్ ఆకర్షణీయ గమ్యస్థానంగా నిలుస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల విషయానికొస్తే, 2014లో ఎన్నికలు జరిగిన ఏప్రిల్–మే నెలల్లో విదేశీ ఇన్వెస్టర్లు రూ.23,607 కోట్ల విలువైన షేర్లు కొన్నారు. 2019 ఇదే కాలంలో రూ.29,113 కోట్లు దేశీ మార్కెట్లో కుమ్మరించారు. దీంతో 2019లో నాలుగో దశ పోలింగ్ ముగిసే నాటికి నెల రోజుల్లో సెన్సెక్స్ 3.7 శాతం, నిఫ్టీ 2.2 శాతం చొప్పున ఎగబాకాయి. ఈసారి మాత్రం ట్రెండ్ దీనికి పూర్తి భిన్నంగా ఉంది. ఒకపక్క విదేశీ ఇన్వెస్టర్లు తిరోగమన బాట పట్టగా.. దేశీయంగానూ ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తుండటం మార్కెట్‌కు ప్రతికూలంగా మారింది.విదేశీ మార్కెట్లు రయ్ రయ్ ఉక్రెయిన్–రష్యా యుద్ధం, మధ్య ప్రాచ్యంలో ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతల వంటి భౌగోళిక రాజకీయ అనిశ్చితుల ప్రభావం కంటే, ఎన్నికల ప్రభావమే మన మార్కెట్లో ప్రధానంగా కనిపిస్తోంది. విదేశీ మార్కెట్లు గత నెల రోజుల్లో భారీగా పెరిగినప్పటికీ.. మన సూచీలు ఆ స్థాయిలో పెరగకపోగా, 3 శాతం మేర పడిపోవడం దీనికి నిదర్శనం. గత నెల రోజుల వ్యవధిలో హాంకాంగ్ హాంగ్‌సెంగ్ ఇండెక్స్ ఏకంగా 15.2 శాతం జంప్ చేసింది. బ్రిటన్ ఎఫ్టీఎస్ఈ సూచీ 6 శాతం, యూఎస్ డోజోన్స్ 4.7 శాతం, జర్మనీ డాక్స్ సూచీ 4.1 శాతం, చైనా షాంఘై ఇండెక్స్ 3 శాతం చొప్పున ఎగబాకాయి. ‘‘ఎన్నికల ఫలితాలపై అనుమానంతోనే విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాల బాట పట్టారు. ఓటింగ్ శాతం భారీగా తగ్గితే, బీజేపీ అంచనాలు తారుమారు కావచ్చు. ఆ పార్టీ సాధించే సీట్లు గణనీయంగా తగ్గే అవకాశముంది. మిగతా విడతల ఓటింగ్‌పై ఇన్వెస్టర్లు దృష్టి సారిస్తారు. తదనుగుణంగానే మార్కెట్ల గమనం ఉంటుంది’ అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా అభిప్రాయపడ్డారు. ఎందుకీ ఆందోళన...బీజేపీకి గనుక సొంతంగా మెజారిటీ రాకపోతే ఎన్డీఏ పక్షాలపై పూర్తిగా ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంటుంది. దీనివల్ల ప్రాంతీయ పార్టీల డిమాండ్లకు తలొగ్గడం, బుజ్జగింపులు తదితరాలతో విధాన నిర్ణయాలపై ప్రభావం పడుతుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అంతేగాక కీలక బిల్లుల ఆమోదం విషయంలో ఇప్పుడున్న స్వేచ్ఛ లేకపోవడం కూడా అటు ఆర్థిక వ్యవస్థకు, ఇటు మార్కెట్లకు ప్రతికూలాంశం. చివరి మూడు విడతల్లో భారీగా ఓటర్లు పోటెత్తితే తప్ప ప్రస్తుత ఓటింగ్ శాతం ప్రకారం చూస్తే బీజేపీకి సొంతంగా 370, ఎన్డీఏ కూటమికి 400 పై చిలుకు సీట్ల లక్ష్యం నెరవేరే అవకాశాలు లేనట్టే. అంతేగాక గతంలో మాదిరిగానైనా రాకుండా బీజేపీ ఏ 260 సీట్ల దగ్గరో ఆగిపోతే మళ్లీ సంకీర్ణ లుకలుకలు తలెత్తే ఆస్కారం లేకపోలేదు. ఇవన్నీ మార్కెట్లకు రుచించని విషయాలే. విదేశీ ఇన్వెస్టర్లలో ఇలాంటి భయాలే నెలకొన్నాయిప్పుడు! అందుకే ప్రస్తుతానికి కొన్ని పొజిషన్లను తగ్గించుకుని, ఫలితాల తర్వాత పరిస్థితులను బట్టి మళ్లీ ఇన్వెస్ట్ చేయొచ్చనే భావన వారిలో కనబడుతోందని నిపుణులు విశ్లేíÙస్తున్నారు. సూచీల తాజా పతనంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సైతం స్పందించారంటే, ఇన్వెస్టర్లలో ఆందోళన అధికార పక్షాన్ని కూడా బాగానే కలవరపెడుతోందని పరిశీలకులు చెబుతున్నారు. ‘గతంలో కూడా మార్కెట్లు గట్టిగా పడిన సందర్భాలున్నాయి. కాబట్టి స్టాక్ మార్కెట్ కదలికలను నేరుగా ఎన్నికలకు ముడిపెట్టకూడదు. తాజా ఒడిదుడుకులకు ‘కొన్ని వదంతులు’ ఆజ్యం పోసి ఉండొచ్చు. నా అభిప్రాయం ప్రకారం జూన్ 4కు ముందే షేర్లు కొనుక్కోండి. ఫలితాల తర్వాత మార్కెట్ దూసుకెళ్తుంది’ అని అమిత్ షా తాజాగా వ్యాఖ్యానించారు.2004లో 20% క్రాష్ఎన్నికల ముందస్తు పరిస్థితులతో సంబంధం లేకుండా గత నాలుగు ఎన్నికల్లోనూ ఫలితాల తర్వాత సెస్సెక్స్, నిఫ్టీ భారీ లాభాలనే అందించాయి. అయితే 2004 ఎన్నికల్లో వాజ్‌పేయి సర్కారు అనూహ్య ఓటమి చవిచూడటం, హంగ్ కారణంగా ఫలితాల తర్వాత 20 శాతం మార్కెట్ క్రాష్ అయింది! కానీ మన్మోహన్ సింగ్ ప్రధానిగా యూపీఏ ప్రభుత్వం కొలువుదీరాక మార్కెట్ విశ్వాసం పుంజుకుంది. మిగతా ఏడాది కాలంలో రాబడులు దండిగానే వచ్చాయి. 2009 ఫలితాల తర్వాత మే 18 నుంచి డిసెంబర్ వరకు 31 వరకు సెన్సెక్స్, నిఫ్టీ ఏకంగా 40 శాతం దూసుకెళ్లడం విశేషం. ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు జోరుకు తోడు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల వరద, ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు అమెరికాలో సహాయక ప్యాకేజీలు కూడా దోహదం చేశాయి. 2019 ఎన్నికల తర్వాత మాత్రం మార్కెట్లు ఏమంత పెద్దగా పెరగలేదు. ప్రపంచ మార్కెట్లలో అనిశి్చతి, అమెరికా–చైనా వాణిజ్య యుద్ధం, బలహీన వృద్ధి రేటు వంటి ప్రభావాలతో 4 నుంచి 5 శాతం మాత్రమే రాబడులొచ్చాయి. అధికార పక్షం గెలుపు అంచనాలు తప్పొచ్చనే ఆందోళనల వల్లే దేశీ ఈక్విటీ మార్కెట్లలో తీవ్ర ఒడిదుడుకులు వస్తున్నాయి. ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. బీజేపీకి సీట్లు భారీగా తగ్గినా, సొంతంగా మెజారిటీ రాకపోయినా, ఫలితాల రోజున మార్కెట్ నుంచి తీవ్ర ప్రతిస్పందన ఉండొచ్చు. ఫలితా లొచ్చేదాకా∙ఇదే అలజడి ఉంటుంది– మాధవీ అరోరా, ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ ముఖ్య ఆర్థికవేత్త– సాక్షి, నేషనల్ డెస్క్ -
భారత్ సేవల రంగం నెమ్మది
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో మెజారిటీ వాటా కలిగిన సేవల రంగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటినెల ఏప్రిల్‌లో నెమ్మదించింది. హెచ్ఎస్బీసీ ఇండియా సర్వీసెస్ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ మార్చిలో 61.2 వద్ద ఉంటే, ఏప్రిల్‌లో 60.8కి తగ్గింది. అయితే ఈ స్థాయి కూడా 14 ఏళ్ల గరిష్ట స్థాయిలోనే కొనసాగుతుండటం గమనార్హం. కాగా, ఈ సూచీ 50పై ఉంటే దానిని వృద్ధి బాటగా, దిగువకు పడిపోతే క్షీణతగా పరిగణించడం గమనార్హం. మరోవైపు తయారీ, సేవలు కలగలిపిన హెచ్ఎస్బీసీ ఇండియా కాంపోజిట్ పీఎంఐ అవుట్‌పుట్ ఇండెక్స్ మార్చిలో 61.8 ఉంటే, ఏప్రిల్‌లో 61.5కు తగ్గడం మరో అంశం. అయితే ఇది కూడా 14 సంవత్సరాల గరిష్ట స్థాయే కావడం గమనార్హం. -
Lok sabha elections 2024: మేం మారమంతే!
ఈసీ ఎన్ని ప్రయత్నాలు చేసినా, హోటళ్లు మొదలుకుని బార్ల దాకా ఎందరు ఎన్ని ఆకర్షణీయమైన ఆఫర్లిచి్చనా బెంగళూరు ఓటర్లు మాత్రం మారలేదు. నగరంలో ఎప్పుడూ పోలింగ్ తక్కువగా నమోదవుతుండటంతో ఈసారి ఓటర్లను పోలింగ్ బూతులకు రప్పించేందుకు ఎన్నో వ్యాపార సంస్థలు యథాశక్తి ప్రయత్నించాయి. ఓటేస్తే భారీ డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించాయి. ఒక హోటల్ ఉచిత దోసెలు, మరో సంస్థ ఉచిత బీర్, ఇంకొన్ని మిల్‌్కõÙక్ తదితరాలపై 30 శాతం డిస్కౌంట్, వండర్లా వంటి రిసార్టులు ఎంట్రీ ఫీజుపై 15 శాతం తగ్గింపు వంటివి ఇచ్చాయి. కానీ ఇవేమీ బెంగళూరువాసులను కదిలించలేకపోయాయి. ఏప్రిల్ 26న కర్నాటకవ్యాప్తంగా 14 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగడం తెలిసిందే. మొత్తమ్మీద 69.23 శాతం మంది ఓటేస్తే బెంగళూరులో మాత్రం 54 శాతం మించలేదు. బెంగళూరు సెంట్రల్లో 52.81 శాతం, బెంగళూరు నార్త్‌లో 54.42 శాతం, బెంగళూరు సౌత్‌లో 52.15 శాతం పోలింగ్ నమోదైంది. బెంగళూరు రూరల్‌లో 67.29 శాతం ఓటు హక్కు నమోదవడం విశేషం! – సాక్షి, నేషనల్ డెస్క్ -
మార్చి వాణిజ్య ఎగుమతులు ఫ్లాట్
న్యూఢిల్లీ: దేశీ వాణిజ్య ఎగుమతులు గత నెల(మార్చి)లో నామమాత్ర క్షీణతతో41.68 బిలియన్ డాలర్లకు చేరాయి. ఈ బాటలో మార్చితో ముగిసిన పూర్తి ఏడాది(2023–24)కి సైతం 3 శాతం నీరసించి 437 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. రాజకీయ, భౌగోళిక సవాళ్లు గ్లోబల్ షిప్‌మెంట్స్‌ను దెబ్బతీశాయి. మరోపక్క మార్చిలో దిగుమతులు సైతం 6 శాతం క్షీణించాయి. వాణిజ్య శాఖ గణాంకాల ప్రకారం 57.28 బిలియన్ డాలర్లను తాకాయి. దీంతో గత నెలలో వాణిజ్య లోటు 15.6 బిలియన్ డాలర్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం మొత్తం దిగుమతులు 5.4 శాతం తక్కువగా 677.24 బిలియన్ డాలర్లను తాకాయి. వెరసి గతేడాదికి ఎగుమతులు, దిగుమతుల మధ్య అంతరం(వాణిజ్య లోటు) 240.17 బిలియన్ డాలర్లుగా నమోదైంది. మధ్యప్రాచ్యంలో సంక్షోభం ముదురుతున్న నేపథ్యంలో పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు వాణిజ్య కార్యదర్శి సునీల్ బర్త్వాల్ తెలియజేశారు. అవసరమైనప్పుడు తగిన చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. -
లాభాలు ఒకరోజుకే పరిమితం
ముంబై: స్టాక్ మార్కెట్ లాభాలు ఒక రోజుకే పరిమితమయ్యాయి. అమెరికా వడ్డీరేట్ల తగ్గింపు వాయిదా ఆందోళనలతో ఫైనాన్షియల్, ఆటో, ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. స్మాల్, మిడ్ క్యాప్ ఫండ్ల నిర్వహణ సామర్థ్యాలను పరీక్షించేందుకు స్ట్రెస్ టెస్ట్ నిర్వహించాలని సెబీ ఆదేశాలు జారీ చేసింది. ఆ ఫలితాలూ ట్రేడింగ్‌పై ప్రతికూల ప్రభావం చూపాయి. ఫలితంగా సెన్సెక్స్ 454 పాయింట్లు పతనమై 72,643 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 123 పాయింట్లు నష్టపోయి 22,024 వద్ద నిలిచింది. ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 612 పాయింట్లు క్షీణించి 72,485 వద్ద, నిఫ్టీ 215 పాయింట్లు పతనమై 21,932 వద్ద ఇంట్రాడే కనిష్టాలకు దిగివచ్చాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.849 కోట్ల షేర్లను విక్రయించారు. ఆయిల్ అండ్ గ్యాస్, ఇంధన, క్యాపిటల్ గూడ్స్, వినిమయ షేర్లూ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.682 కోట్ల షేర్లు అమ్మేశారు. వారం మొత్తంగా సెన్సెక్స్, నిఫ్టీ 2% చొప్పున నష్టపోయాయి. బీఎస్ఈ స్మాల్ క్యాప్ సూచీ 6%, మిడ్‌క్యాప్ ఇండెక్స్ 4% క్షీణించాయి. -
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు డీలా
న్యూఢిల్లీ: గత కొద్ది నెలలుగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐలు) వెనకడుగు వేస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి 9 నెలల్లో(ఏప్రిల్–డిసెంబర్) 13 శాతం క్షీణించాయి. అంతర్గత వాణిజ్యం, పరిశ్రమల ప్రోత్సాహక శాఖ (డీపీఐఐటీ) తాజాగా వెల్లడించిన గణాంకాల ప్రకారం 32.03 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ప్రధానంగా కంప్యూటర్ హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్, టెలికం, ఆటో, ఫార్మా రంగాలకు ఎఫ్‌డీఐలు నీర సించాయి. గతేడాది(2022–23) ఏప్రిల్–డిసెంబర్లో 36.74 బిలియన్ డాలర్ల విలువైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు లభించాయి. అయితే ఈ ఏడాది మూడో త్రైమాసికం(అక్టోబర్–డిసెంబర్)లో 18% ఎగసి 11.6 బిలియన్ డాలర్లను తాకాయి. 7 శాతం డౌన్: తాజా సమీక్షా కాలంలో ఈక్విటీ పెట్టుబడులుసహా మొత్తం ఎఫ్‌డీఐలు 51.5 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. గతేడాది తొలి 9 నెలల్లో లభించిన 55.27 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఇవి 7 శాతం తక్కువ. -
Living Planet Index: ఐదో వంతు జీవ జాతులు... అంతరించే ముప్పు
ప్రపంచవ్యాప్తంగా పలు కారణాలతో ఏటా వలస బాట పట్టే అసంఖ్యాక జీవ జాతులపై తొలిసారిగా సమగ్ర అధ్యయనానికి ఐక్యరాజ్యసమితి తెర తీసింది. ఇందులో భాగంగా 1997 ఐరాస ఒప్పందం ప్రకారం రక్షిత జాబితాలో చేర్చిన 1,189 జీవ జాతులను లోతుగా పరిశీలించారు. పరిశోధనలో తేలిన అంశాలను 5,000 పై చిలుకు జీవ జాతుల తీరుతెన్నులను 50 ఏళ్లుగా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్), లివింగ్ ప్లానెట్ ఇండెక్స్ సంస్థల గణాంకాల సాయంతో విశ్లేíÙంచారు. విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. 22 శాతం జీవ జాతులు అతి త్వరలో పూర్తిగా అంతరించనున్నట్టు తేలింది. మొత్తమ్మీద 44 శాతం జీవ జాతుల సంఖ్య నిలకడగా తగ్గుముఖం పడుతూ వస్తున్నట్టు వెల్లడైంది. ఈ వివరాలతో కూడిన తాజా నివేదికను ఐరాస ఇటీవలే విడుదల చేసింది. ‘‘ప్రపంచవ్యాప్తంగా ఏకంగా ఐదో వంతు వలస జీవజాతులు అంతరించే ప్రమాదంలో పడ్డాయి. జీవజాతుల వలసలు కొత్తగా మొదలైనవి కావు. అనాదిగా భూమ్మీదా, సముద్రంలోనూ అత్యంత కఠినతరమైన, భిన్న వాతావరణ పరిస్థితుల గుండా ఏటా వందల కోట్ల సంఖ్యలో సాగుతుంటాయి. ఇన్నేళ్లలో ఏనాడూ లేని ముప్పు ఇప్పుడే వచ్చి పడటానికి ప్రధాన కారణం మానవ జోక్యం, తత్ఫలితంగా జరుగుతున్న వాతావరణ మార్పులు, సాగుతున్న పర్యావరణ విధ్వంసమే’’ అని తేలి్చంది. ఇప్పటికైనా కళ్లు తెరిచి నష్ట నివారణ చర్యలు చేపట్టాల్సిన అవసరముందని ఐరాస వలస జాతుల సంరక్షణ సదస్సు కార్యదర్శి అమీ ఫ్రాంకెల్ అన్నారు. గత వారం ఉబ్జెకిస్తాన్‌లోని సమర్ఖండ్లో జరిగిన సదస్సు భేటీలో ఈ అంశాన్నే ఆయన నొక్కిచెప్పారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా 30 శాతం భూ, సముద్ర భాగాల సమగ్ర పరిరక్షణకు కృషి చేస్తామంటూ 2022 గ్లోబల్ బయో డైవర్సిటీ సమిట్‌లో పాల్గొన్న దేశాలు ప్రతిజ్ఞ చేశాయి. దాన్ని నెరవేర్చాల్సిన సమయం వచ్చింది’’ అన్నారు. ప్రమాదపుటంచుల్లో... 1979 ఐరాస రక్షిత జాబితాలోని 1,189 జీవ జాతులను నివేదిక లోతుగా పరిశీలించింది. అనంతరం ఏం చెప్పిందంటే... ► ప్రపంచవ్యాప్తంగా 44 శాతం వలస జీవ జాతుల సంఖ్య నానాటికీ భారీగా తగ్గుముఖం పడుతోంది. ► 22 శాతం అతి త్వరలో అంతరించేలా ఉన్నాయి. మొత్తమ్మీద ఐదో వంతు అంతరించే ముప్పు జాబితాలో ఉన్నాయి. ► ఇది జీవవైవిధ్యానికి తీవ్ర విఘాతం. మన జీవనాధారాలపైనా, మొత్తంగా ఆహార భద్రతపైనా పెను ప్రభావం చూపగల పరిణామం. ► ఆవాస ప్రాంతాలు శరవేగంగా అంతరిస్తుండటం మూడొంతుల జీవుల మనుగడకు మరణశాసనం రాస్తోంది. ► జంతువులు, చేపల వంటివాటిని విచ్చలవిడిగా వేటాడటం కూడా ఆయా జాతుల మనుగడను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ► కార్చిచ్చులు, గ్లోబల్ వారి్మంగ్ వంటివి ఇందుకు తోడవుతున్నాయి. ► భారీ డ్యాములు, గాలి మరలకు తోడు ఆకస్మిక వరదలు, అకాల క్షామాలు తదితరాల వల్ల వలస దారులు మూసుకుపోవడం, మారిపోవడం జరుగుతోంది. ఇది పలు జీవ జాతులను అయోమయపరుస్తోంది. ఏం చేయాలి? తక్షణం వలస జీవ జాతుల సంరక్షణ చర్యలకు పూనుకోవాల్సిన ఆవశ్యకతను నివేదిక నొక్కిచెప్పింది. అందుకు పలు సిఫార్సులు చేసింది... ► జీవావరణాల పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యమివ్వాలి. ► భారీ డ్యాములు తదితరాల పర్యావరణ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని తగు నష్ట నివారణ చర్యలు తీసుకోవాలి. ► ఈ అన్ని సమస్యలకూ తల్లి వేరు పర్యావరణ విధ్వంసం. కార్చిచ్చులకైనా, అకాల వరదలు, క్షామాలకైనా, గ్లోబల్ వార్మింగ్కైనా అదే ప్రధాన కారణం. కనుక దానికి వీలైనంత త్వరలో చెక్ పెట్టేందుకు దేశాలన్నీ కృషి చేయాలి. ఆహారం, పునరుత్పాదన వంటి అవసరాల నిమిత్తం వేలాది జీవ జాతులు వలస బాట పట్టడం ప్రపంచవ్యాప్తంగా అనాదిగా జరుగుతూ వస్తున్న ప్రక్రియ. పలు జంతు, పక్షి జాతులైతే కోట్ల సంఖ్యలో వలస వెళ్తుంటాయి. ఈ క్రమంలో కొన్ని పక్షి జాతులు ఏటా 10 వేల కిలోమీటర్లకు పైగా సుదీర్ఘ ప్రయాణాలు చేస్తుంటాయి! పర్యావరణ సంతులన పరిరక్షణకు కూడా ఎంతగానో దోహదపడే ప్రక్రియ ఇది. కానీ గ్లోబల్ వారి్మంగ్, వాతావరణ మార్పుల ప్రభావం జంతువులు, పక్షుల వలసపై కూడా విపరీతంగా పడుతోంది. ఈ ప్రమాదకర పరిణామంపై ఐరాస తీవ్ర ఆందోళన వెలిబుచి్చంది. దీనికి తక్షణం అడ్డుకట్ట వేయకపోతే కనీసం ఐదో వంతు వలస జీవులు అతి త్వరలో అంతరించిపోయే ప్రమాదం పొంచి ఉందని తాజా నివేదికలో హెచ్చరించింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వేర్ హౌజ్‌లకు తగ్గిన డిమాండ్.. హైదరాబాద్‌లో సైతం..
న్యూఢిల్లీ: దక్షిణాదిలోని ప్రముఖ పట్టణాలు హైదరాబాద్, బెంగళూరు గోదాముల లీజింగ్ గతేడాది స్వల్పంగా తగ్గినట్టు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ వెస్టిన్ తెలిపింది. వీటితోపాటు చెన్నై కలిపి చూస్తే 10.2 మిలియన్ చదరపు అడుగులు (ఎస్ఎఫ్టీ) లీజింగ్ నమోదైనట్టు పేర్కొంది. 2022లో లీజింగ్ పరిమాణం 10.7 మిలియన్ ఎప్‌ఎఫ్‌టీగా ఉంది. థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ సంస్థలు, ఇంజనీరింగ్, తయారీ కంపెనీలు, ఈ–కామర్స్ సంస్థలు గతేడాది గోదాముల లీజింగ్ డిమాండ్‌లో కీలక వాటా ఆక్రమించాయి. 2022లో గోదాముల లీజింగ్‌లో ఈ మూడు దక్షిణాది పట్టణాల వాటా 34 శాతంగా ఉంటే, గతేడాది 27 శాతానికి తగ్గింది. దేశవ్యాప్తంగా ఏడు ప్రముఖ పట్టణాల్లో గోదాములు, లాజిస్టిక్స్ వసతుల లీజింగ్ 21 శాతం పెరిగి 37.8 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది. 2022లో ఇది 31.2 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగానే ఉండడం గమనించొచ్చు. పట్టణాల వారీగా.. ►హైదరాబాద్‌లో గతేడాది గోదాముల లీజింగ్ 3.1 మిలియన్ చదరపు అడుగులుగా నమోదైంది. 2022లో ఇది 3.7 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది. ►బెంగళూరులో లీజింగ్ పరిమాణం 2022లో ఉన్న 4.1 మిలియన్ ఎస్ఎఫ్టీ నుంచి 2023లో 3.6 మిలియన్ ఎస్ఎఫ్టీకి తగ్గింది. ►చెన్నైలో మాత్రం 2022లో ఉన్న 2.9 మిలియన్ చదరపు అడుగుల నుంచి 2023లో 3.7 మిలియన్ ఎస్ఎఫ్టీకి పెరిగింది. ►ముంబైలో 10.2 మిలియన్ ఎస్ఎఫ్టీ లీజింగ్ నమోదైంది. 2022లో 6 మిలియన్ చదరపు అడుగులుగానే ఉంది. ►ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో 2022లో ఉన్న 7.3 మిలియన్ ఎస్ఎఫ్టీ నుంచి 2023లో 8.8 మిలియన్లకు పెరిగింది. ► పుణెలో 5.2 మిలియన్ల నుంచి 7 మిలియన్ల చదరపు అడుగులకు గోదాముల లీజింగ్ వృద్ధి చెందింది. పుణెలోని చక్దాన్ ఎండీసీ వాణిజ్య కేంద్రం ఈ వృద్ధికి దోహదపడినట్టు వెస్టిన్ నివేదిక తెలిపింది. ఇది తయారీ, లాజిస్టిక్స్ పార్కులకు ప్రముఖ కేంద్రంగా ఉంది. ► కోల్‌కతాలో గోదాముల లీజింగ్ 2022లో 2.1 మిలియన్ చదరపు అడుగులుగా ఉంటే, 2023లో 1.6 మిలియన్ ఎస్ఎఫ్టీకి తగ్గింది. ఈ ఏడాది సవాలే.. ‘‘2024–25 కేంద్ర బడ్జెట్ వచ్చే కొన్నేళ్ల కాలానికి దిక్సూచీ కానుంది. మౌలిక వసతుల అభివృద్ధికి ఇటీవలి మధ్యంతర బడ్జెట్లో సంబంధించి చేసిన ప్రకటనలు ఈ రంగంపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. 2023లో పెట్టుబడులు తగ్గుముఖం పట్టినందున 2024 భారత గోదాముల రంగానికి సవాలుగా నిలవనుంది’’అని వెస్టిన్ సీఈవో శ్రీనివాసరావు పేర్కొన్నారు. -
ఓలాకు తగ్గిన నష్టాలు
న్యూఢిల్లీ: 2023 ఆర్థిక సంవత్సరంలో ఓలా బ్రాండ్ మాతృసంస్థ ఏఎన్ఐ టెక్నాలజీస్ నికర నష్టాలు (కన్సాలిడేటెడ్) రూ.772 కోట్లకు తగ్గాయి. అంతక్రితం 2022 ఆర్థిక సంవత్సరంలో ఇవి రూ. 1,522 కోట్లుగా నమోదయ్యాయి. మరోవైపు, ఆదాయం 48 శాతం పెరిగి రూ. 1,680 కోట్ల నుంచి రూ. 2,481 కోట్లకు చేరింది. ఇక స్టాండెలోన్ ప్రాతిపదికన ఏఎన్ఐ టెక్నాలజీస్ నష్టం రూ. 3,082 కోట్ల నుంచి రూ. 1,083 కోట్లకు దిగివచి్చంది. ఆదాయం 58 శాతం వృద్ధి చెంది రూ. 1,350 కోట్ల నుంచి రూ. 2,135 కోట్లకు చేరింది. ఓలా మొబిలిటీ వ్యాపార విభాగం రూ. 250 కోట్ల నిర్వహణ లాభం నమోదు చేసింది. మొత్తం మీద గ్రూప్ స్థాయిలో ఏఎన్ఐ టెక్నాలజీస్ నష్టం రూ. 20,223 కోట్లకు చేరింది. -
ఎగుమతులు మళ్లీ మైనస్‌లోకి..
న్యూఢిల్లీ: అంతర్జాతీయ తీవ్ర అనిశ్చితి పరిస్థితులకు భారత్ వస్తు ఎగుమతులు అద్దం పడుతున్నాయి. అక్టోబర్‌లో ‘ప్లస్’లోకి వచి్చన ఎగుమతులు తిరిగి నవంబర్‌లో మైనస్‌లోకి జారిపోయాయి. 2022 ఇదే నెలతో పోలి్చతే 2023 నవంబర్‌లో ఎగుమతుల విలువ 2.83% క్షీణించి 33.90 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఇక 10 నెలల తర్వాత అక్టోబర్‌లో ఎగువబాటకు చేరిన దిగుమతులు నవంబర్‌లో మళ్లీ క్షీణతలోకి జారాయి. 4.33% పతనంతో 54.48 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. వెరసి ఎగుమతులు దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం– వాణిజ్యలోటు 20.58 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ముందు.. వెనుకలు ఇలా... అంతర్జాతీయ ఆర్థిక అనిశి్చతి, ఉక్రెయిన్ యుద్ధం, ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం సవాళ్లు, కఠిన ద్రవ్య పరిస్థితుల నేపథ్యంలో 2023 ఫిబ్రవరి నుంచి జూలై వరకూ భారత్ వస్తు ఎగుమతుల్లో అసలు వృద్ధిలేకపోగా క్షీణతలో నడిచాయి. అయితే ఆగస్టులో వృద్ధిలోకి (3.88 శాతం) మారినా, మళ్లీ సెప్టెంబర్‌లో 2.6 శాతం క్షీణించాయి. అక్టోబర్‌లో సానుకూల ఫలితం వెలువడింది. మరుసటి నెలలోనే మళ్లీ క్షీణరేటు నమోదయ్యింది. ఏప్రిల్–నవంబర్ మధ్య క్షీణ గణాంకాలే.. ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య భారత్ వస్తు ఎగుమతుల విలువ 6.51 శాతం క్షీణించి 278.8 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. దిగుమతుల విలువ కూడా 8.67 శాతం క్షీణించి 445.15 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. వెరసి ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్యలోటు– ఈ ఏడు నెలల్లో 166.36 బిలియన్ డాలర్లుగా ఉంది. ఎనిమిది నెలల కాలంలో పసిడి దిగుమతులు 21 శాతం పెరిగి 32.93 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. -
వృద్ధిలో భారత్ వేగం.. చైనా నెమ్మది
న్యూఢిల్లీ: ఎకానమీ బాటలో భారత్ వేగంగా పరోగమిస్తుంటే.. చైనా నెమ్మదిస్తోందని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ తన తాజా నివేదికలో పేర్కొంది. ‘చైనా స్లోస్... ఇండియా గ్రోస్’ అన్న శీర్షికన విడుదలైన నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► ఆసియా–పసిఫిక్ గ్రోత్ ఇంజిన్... చైనా నుండి దక్షిణ, ఆగ్నేయాసియాలకు మారుతుందని అంచనా. ►చైనా వృద్ధి రేటు 2023లో 5.4 శాతంగా అంచనా. 2024లో ఇది 4.6 శాతానికి తగ్గుతుంది. 2025లో 4.8 శాతానికి పెరుగుతుంది. 2026లో మళ్లీ 4.6 శాతానికి తగ్గుతుంది. ►ఇక భారత్ వృద్ధి 2026లో 7 శాతానికి పెరుగుతుంది. ఇదే సమయంలో వియత్నా వృద్ధి 6.8%, ఫిలిప్పైన్స్ వృద్ధి రేటు 6.4 %, ఇండోనేíÙ యా వృద్ధి 5 శాతంగా నమోదయ్యే వీలుంది. భారత్‌తో పాటు ఇండోనేíÙయా, మలేíÙయా, ఫి లిప్పైన్స్లో దేశీయ డిమాండ్ పటిష్టంగా ఉంది. ►భారత్ వృద్ధి రేటు 2023–24, 2024–25లో 6.4 శాతంగా ఉంటుంది. 2025లో 6.9 శాతంగా, 2026లో 7 శాతంగా సంస్థ అంచనావేస్తోంది. అధిక ఆహార ద్రవ్యోల్బణం, బలహీన ఎగుమతి పరిస్థితులు ఉన్నప్పటికీ భారత్‌లో ఆర్థిక క్రియాశీలత, డిమాండ్ పటిష్టంగా ఉన్నాయి. ►ఆసియా–పసిఫిక్ సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లను ఎక్కువగా ఉంచే అవకాశం ఉన్నందున, ఈ ప్రాంతంలోని రుణ గ్రహీతలకు రుణ వ్యయాలు, సేవలు భారీగా ఉంటాయి. ►మధ్యప్రాచ్యంలో సంఘర్షణలు విస్తరిస్తే.. అవి ప్రపంచ సరఫరా చైన్‌ను దెబ్బతీయవచ్చు. ఇది ఇంధన వ్యయాలను పెంచుతుంది. తద్వారా ద్రవ్యోల్బణం పెరుగుతంది. అధిక ఇన్పుట్ ఖర్చులు కార్పొరేట్ మార్జిన్లను తగ్గించే అవకాశం ఉంది. ఇది డిమాండ్ పరిస్థితులనూ దెబ్బతీసే అవకాశం ఉంది. ►ఆసియా–పరిఫిక్ ప్రాంత వృద్ధి అంచనాలను (చైనా మినహా) 2024కు సంబంధించి 4.4 శాతం నుంచి 4.2 శాతానికి తగ్గిస్తున్నాం. పారిశ్రామిక వృద్ధి అవకాశాలపైనా ప్రతికూల ప్రభావాలు ఉండవచ్చు. ప్రత్యేకించి ఎగుమతుల ఆధారిత తయారీ రంగం కఠిన పరిస్థితులను ఎదుర్కొనే ఇబ్బందులు ఉన్నాయి. -
పీనోట్ పెట్టుబడుల నేలచూపు
న్యూఢిల్లీ: దేశీ క్యాపిటల్ మార్కెట్లలో పార్టీసిపేటరీ నోట్ల(పీనోట్లు) పెట్టుబడులు గత నెల(అక్టోబర్)లో క్షీణించాయి. వరుసగా ఏడు నెలల పెరుగుదల తదుపరి వెనకడుగు వేసి రూ. 1.26 లక్షల కోట్లకు చేరాయి. తాజా గణాంకాల ప్రకారం ఈక్విటీ, రుణ, హైబ్రిడ్ సెక్యూరిటీలలో పీ నోట్ పెట్టుబడుల విలువ తగ్గింది. 2023 సెపె్టంబర్ చివరికల్లా రూ. 1,33,284 కోట్లుగా నమోదైన వీటి విలువ నవంబర్‌కల్లా రూ. 1,26,320 కోట్లకు పరిమితమైంది. సెబీ వద్ద రిజిస్టరైన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) పీనోట్లను జారీ చేసే సంగతి తెలిసిందే. దేశీ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు వీలుగా రిజిస్టర్‌కాని అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు ఎఫ్‌పీఐలు పీనోట్లను జారీ చేస్తారు. అయితే ఇందుకు తగిన పరిశీలన చేపట్టాకే జారీకి తెరతీస్తారు. కాగా.. పీనోట్ పెట్టుబడుల విలువ 2017 జులైలో రూ. 1.35 లక్షల కోట్లను తాకిన తదుపరి తిరిగి ఈ ఏడాది సెపె్టంబర్‌లోనే రూ. 1.33 లక్షల కోట్లకు చేరడం గమనార్హం! -
ఆటో పరిశ్రమకు టూవీలర్ల బ్రేక్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా అక్టోబర్‌లో రిటైల్‌లో అన్ని వాహన విభాగాల్లో 21,17,596 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 7.73 శాతం తగ్గుదల. 2022 అక్టోబర్‌తో పోలిస్తే గత నెలలో ద్విచక్ర వాహన విక్రయాలు ఏకంగా 12.6 శాతం క్షీణించడమే ఈ పరిస్థితికి కారణం. 2023 అక్టోబర్‌లో టూవీలర్లు దేశవ్యాప్తంగా 15,07,756 యూనిట్లు రోడ్డెక్కాయి. అక్టోబర్ 14 వరకు మంచి రోజులు లేకపోవడంతో ద్విచక్ర వాహన కొనుగోళ్లపై ప్రభావం చూపిందని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఏడీఏ) తెలిపింది. ప్యాసింజర్ వెహికిల్స్ విక్రయాలు 1.35 శాతం తగ్గి గత నెలలో 3,53,990 యూనిట్లకు వచ్చి చేరింది. త్రిచక్ర వాహనాలు ఏకంగా 45.63 శాతం దూసుకెళ్లి 1,04,711 యూనిట్లను తాకాయి. ట్రాక్టర్లు 6.15 శాతం పెరిగి 62,440 యూనిట్లు రోడ్డెక్కాయి. వాణిజ్య వాహనాలు 10.26 శాతం ఎగసి 88,699 యూనిట్లను చేరుకున్నాయి. అన్ని వాహన విభాగాల్లో అక్టోబర్ తొలి అర్ధ భాగంలో 2022తో పోలిస్తే అమ్మకాలు 8 శాతం తగ్గాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌తో పోలిస్తే గత నెలలో విక్రయాలు 13 శాతం పెరగడం విశేషం. నవరాత్రి కొత్త రికార్డు.. 2023 నవరాత్రి రిటైల్ అమ్మకాలు గతేడాదితో పోలిస్తే 18 శాతం వృద్ధితో కొత్త మైలురాయిని చేరుకున్నాయని ఫెడరేషన్ తెలిపింది. 2017 నవరాత్రి గణాంకాలను అధిగమించాయని వెల్లడించింది. 8 శాతం క్షీణతను చూసిన ట్రాక్టర్లు మినహా అన్ని విభాగాలు మెరుగైన వృద్ధిని కనబరిచాయి. టూ వీలర్లు 22 శాతం, త్రిచక్ర వాహనాలు 43, వాణిజ్య వాహనాలు 9, ప్యాసింజర్ వెహికిల్స్ 7 శాతం అధిక అమ్మకాలు సాధించాయి. ప్యాసింజర్ వాహనాల విభాగంలో కస్టమర్లు ఒక వైపు ఉత్సాహం, మరోవైపు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్టు స్పష్టమైంది. నవరాత్రి సమయంలో ప్రాంతీయ వైవిధ్యం ఉన్నప్పటికీ.. ప్యాసింజర్ వెహికిల్స్ విభాగంలో పరిశ్రమ బుకింగ్‌లలో పెరుగుదలను చూసింది. కొత్త మోడళ్ల పరిచయం, ముఖ్యంగా ఎస్‌యూవీల రాక, ఆకర్షణీయ ఆఫర్లు ఇందుకు దోహదం చేశాయని ఎఫ్ఏడీఏ తెలిపింది. విభిన్న పరిస్థితులు.. స్థానిక ఎన్నికల ప్రభావం, మార్కెట్ పరిపూర్ణత వల్ల పండుగ స్ఫూర్తి అన్ని ప్రాంతాల అమ్మకాల్లో ఒకే విధంగా లేదని ఫెడరేషన్ వివరించింది. ఊహించిన సులభ వాయిదా పథకాలతో కమర్షియల్ వెహికిల్ విభాగం బలమైన నవంబర్‌ను చూస్తోంది. పండుగ, నిర్మాణ కార్యకలాపాలు డిమాండ్‌ని పెంచుతున్నాయని ఎఫ్ఏడీఏ అభిప్రాయపడింది. ‘పండుగ రోజులు ప్యాసింజర్ వెహికిల్స్ బుకింగ్‌లను పెంచవచ్చు. అయినప్పటికీ తక్షణ అమ్మకాలపై సంవత్సరాంతపు తగ్గింపుల ఛాయ కనిపిస్తోంది. ప్యాసింజర్ వెహికిల్స్ నిల్వలు 63–66 రోజుల శ్రేణిలో ఉన్నాయి. దీపావళి అమ్మకాలు సందర్భానుసారంగా పెరగకపోతే నిల్వలు మరింత భారానికి దారితీయవచ్చు. ఇది పరిశ్రమ–వ్యాప్త పరిణామాలకు దారితీయవచ్చు. పొంచి ఉన్న ఆర్థిక భారం ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి తక్షణ, నిర్ణయాత్మక చర్య తప్పనిసరి’ అని ఫెడరేషన్ పేర్కొంది. -
టెక్ మహీంద్రా లాభం డౌన్
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం టెక్ మహీంద్రా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జూలై–సెపె్టంబర్ (క్యూ2)లో నికర లాభం 61 శాతం క్షీణించి రూ. 505 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 1,299 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం స్వల్పంగా 2 శాతం నీరసించి రూ. 12,864 కోట్లకు చేరింది. గత క్యూ2లో రూ. 13,130 కోట్ల టర్నోవర్ సాధించింది. ఎన్నో ఆటుపోట్లను చవిచూసిన తన కెరీర్‌లోకెల్లా గత కొన్ని త్రైమాసికాలు అత్యంత క్లిష్టమైనవంటూ టెక్ మహీంద్రా సీఈవో, ఎండీ సీపీ గుర్నానీ పేర్కొన్నారు. ► త్రైమాసికవారీగా 78% వృద్ధితో రూ. 5,300 కోట్లు(64 కోట్ల డాలర్లు) విలువైన డీల్స్ కుదుర్చుకుంది. ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్–జూన్)లో రూ. 2,980 కోట్ల విలువైన ఆర్డర్లు పొందింది. ► మొత్తం సిబ్బంది సంఖ్య 8 శాతంపైగా క్షీణించి 1,50,604కు పరిమితమైంది. గతేడాది క్యూ2 లో ఈ సంఖ్య 1,63,912గా నమోదైంది. ► ఉద్యోగ వలసల(అట్రిషన్) రేటు వార్షిక ప్రాతిపదికన 20% నుంచి 11%కి దిగివచి్చంది. ఫలితాల నేపథ్యంలో టెక్ మహీంద్రా షేరు 1.4% నష్టంతో రూ. 1,140 వద్ద ముగిసింది. -
ఎగుమతులు 3 శాతం డౌన్..
న్యూఢిల్లీ: ఈ ఏడాది సెసెప్టెంబర్‌లో ఎగుమతులు 2.6 శాతం క్షీణించి 34.47 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. గతేడాది ఇదే వ్యవధిలో ఎగుమతులు 35.39 బిలియన్ డాలర్లు. కమోడిటీల ధరలు తగ్గుముఖం పట్టడంతో వరుసగా 10వ నెల దిగుమతుల భారం కాస్త తగ్గింది. శుక్రవారం ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం .. దిగుమతులు 15% క్షీణించి 53.84 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. గత సెసెప్టెంబర్‌లో ఇవి 63.37 బిలియన్ డాలర్లు. సెప్టెంబర్‌లో దేశ వాణిజ్య లోటు 19.37 బిలియన్ డాలర్లకు దిగి వచి్చంది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–సెసెప్టెంబర్ మధ్య కాలంలో ఎగుమతులు 8.77% క్షీణించాయి. 211.4 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ఇదే వ్యవధిలో దిగుమతులు 12.23% తగ్గి 326.98 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఫలితంగా వాణిజ్య లోటు 115.58 బిలియన్ డాలర్లుగా ఉంది. ఎగుమతులపై ఆశాభావం.. అంతర్జాతీయంగా సవాళ్లు నెలకొన్నప్పటికీ సెసెప్టెంబర్ గణాంకాలు ఎగుమతులపరంగా ఆశావహ అవకాశాలను సూచిస్తున్నాయని కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్ బరత్వాల్ తెలిపారు. మిగతా ఆరు నెలల్లో ఎగుమతులు సానుకూల వృద్ధి నమోదు చేయగలవని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏప్రిల్, మే, జూన్, జూలైలో క్షీణత రెండంకెల స్థాయిలో ఉండగా.. ప్రస్తుతం సింగిల్ డిజిట్ స్థాయికి దిగి వచి్చందని సునీల్ పేర్కొన్నారు. 2023లో అంతర్జాతీయంగా వాణిజ్యం 0.8 శాతమే పెరగవచ్చని వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అంచనా వేసినప్పటికీ ఎగుమతులపరంగా భారత్ మెరుగ్గా రాణిస్తోందని సునీల్ చెప్పారు. ఆగస్టు గణాంకాల సవరణ.. కేంద్రం ఆగస్టు ఎగుమతుల గణాంకాలను 34.48 బిలియన్ డాలర్ల నుంచి 38.45 బిలియన్ డాలర్లకు సవరించింది. అలాగే దిగుమతులను 58.64 బిలియన్ డాలర్ల నుంచి 60.1 బిలియన్ డాలర్లకు మార్చింది. సెసెప్టెంబర్ 15న విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఆగస్టులో ఎగుమతులు అంతక్రితం ఏడాది అదే వ్యవధితో పోలిస్తే 6.86 శాతం క్షీణించినట్లు నమోదు కాగా.. తాజా సవరణతో 3.88 శాతం పెరిగినట్లయ్యింది. మరిన్ని విశేషాలు.. ► గత నెల ఎగుమతులకు సంబంధించి 30 కీలక రంగాల్లో 12 రంగాలు సానుకూల వృద్ధిని నమోదు చేశాయి. ముడిఇనుము, కాటన్ యార్న్, మాంసం, డెయిరీ, పౌల్ట్రీ, ఫార్మా, ఇంజినీరింగ్ ఉత్పత్తులు వీటిలో ఉన్నాయి. ► దిగుమతులపరంగా చూస్తే 30లో 20 రంగాలు ప్రతికూల వృద్ధి కనపర్చాయి. వెండి, ఎరువులు, రవాణా పరికరాలు, బొగ్గు, విలువైన రాళ్లు, క్రూడ్, రసాయనాలు, మెషిన్ టూల్స్ వీటిలో ఉన్నాయి. ► చమురు దిగుమతులు 20.32 శాతం క్షీణించి 14 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో దిగుమతులు 22.81 శాతం తగ్గి 82.3 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అటు పసిడి దిగుమతులు 7% పెరిగి 4.11 బిలియన్ డాలర్లకు చేరాయి. ప్రథమార్ధంలో 9.8% పెరిగి 22.2 బిలియన్ డాలర్లకు చేరాయి. -
సెప్టెంబర్‌లో కార్యాలయ ఉద్యోగ నియామకాలు తగ్గుదల
ముంబై: ఐటీ, బీపీవో, ఎఫ్ఎంసీజీ తదితర రంగాల్లో ప్రతికూల ధోరణులతో.. కార్యాలయ ఉద్యోగుల (వైట్ కాలర్) నియామకాలు సెప్టెంబర్‌లో 8.6 శాతం తగ్గాయి. ఆగస్ట్ నెలతో పోలిస్తే సెప్టెంబర్‌లో నియామకాలు 6 శాతం పెరిగినట్టు నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్ సర్వే నివేదిక వెల్లడించింది. సెప్టెంబర్‌లో మొత్తం 2,835 మంది కోసం నియామక ప్రకటనలు వెలువడ్డాయి. అంతక్రితం నెలలో 3,103 ఉద్యోగాలకు ప్రకటనలు విడుదలైనట్టు ఈ నివేదిక తెలిపింది. ప్రతి నెలా తన పోర్టల్‌పై వెలువడే పోస్టింగ్‌ల ఆధారంగా నౌకరీ డాట్ కామ్ ఈ నివేదికను విడుదల చేస్తుంటుంది. అంతర్జాతీయంగా అనిశి్చత పరిస్థితుల నేపథ్యంలో ఐటీ రంగంలో నియామకాలు గత కొన్ని నెలలుగా తగ్గుతూ వస్తున్న విషయాన్ని ఈ నివేదిక ప్రస్తావించింది. బీపీవో/ఐటీఈఎస్ రంగంలో 25 శాతం, ఎఫ్ఎంసీజీ పరిశ్రమలో 23 శాతం చొప్పున నియామకాలు క్షీణించాయి. ‘‘ఐటీ రంగంపై ప్రతికూల ప్రభావం కొనసాగుతూనే ఉంది. బ్యాంకింగ్ రంగలో బలమైన వృద్ధి ఉండడం ఆశావహం. మొత్తం మీద సీక్వెన్షియల్‌గా 6 శాతం వృద్ధిని చూడడం అన్నది భారత ఉద్యోగ మార్కెట్ బలంగా ఉందన్న దాన్ని సూచిస్తోంది’’అని నౌకరీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ పవన్ గోయల్ తెలిపారు. ఆతిథ్యరంగం , రవాణా నియామకాల పరంగా మెరుగైన వృద్ధిని చూశాయి. ఈ రంగాలకు సంబంధించి ముంబైలో ఎక్కువ జాబ్ ఆఫర్లు ఉన్నట్టు నౌకరీ తెలిపింది. సెప్టెంబర్ క్వార్టర్లో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సరీ్వసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ), హెల్త్‌కేర్ రంగాల్లో 7 శాతం నియాకాల వృద్ధి నమోదైంది. బ్రాంచ్ మేనేజర్, ఫైనాన్షియల్ కన్సల్టెంట్ నిపుణులకు డిమాండ్ నెలకొంది. ఆయిల్ అండ్ గ్యాస్, ఆటో రంగాల్లో 6 శాతం వృద్ధి కనిపించింది. కొత్త ఉద్యోగ నియామకాల్లో మెట్రోలతో పోలిస్తే, ఇతర పట్టణాల్లో వృద్ధి నెలకొంది. -
ఆర్థిక స్వేచ్ఛ సూచీలో ఒక మెట్టు తగ్గిన భారత్
న్యూఢిల్లీ: ఆర్థిక స్వేచ్ఛ సూచీ (ఈఎఫ్ఐ)లో ఉన్న 165 దేశాలలో భారతదేశం 2021లో ఒక మెట్టు దిగజారి 87వ స్థానానికి చేరుకుంది. 2020లో దేశం ర్యాంక్ 86. ఎకనామిక్ ఫ్రీడమ్ ఆఫ్ ది వరల్డ్: 2021 వార్షిక నివేదికను న్యూఢిల్లీకి చెందిన ఆర్థిక విశ్లేషణా సంస్థ– సెంటర్ ఫర్ సివిల్ సొసైటీతో కలిసి కెనడా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఫ్రేజర్ ఇన్స్టిట్యూట్ విడుదల చేసింది. కాగా, 1980 నుంచి చూస్తే భారత్‌కు సంబంధించి సూచీ 4.90 నుంచి గణనీయంగా 6.62కు పెరిగింది. వివిధ విభాగాల్లో కొన్ని దేశాలతో పోల్చితే వెనకబడ్డం తాజాగా భారత్ ర్యాంక్ తగ్గుదలకు ఒక కారణం. కాగా, సింగపూర్ ఇండెక్స్‌లో సింగపూర్ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత హాంకాంగ్, స్విట్జర్లాండ్, న్యూజిలాండ్, అమెరికా, ఐర్లాండ్, డెన్మార్క్, ఆ్రస్టేలియా, బ్రిటన్, కెనడా ఉన్నాయి. చైనాకన్నా (111) భారత్ పరిస్థితి మెరుగ్గా ఉండడం గమనార్హం. జాబితాలో వెనుజులా చివరన నిలిచింది. ఇతర ముఖ్యమైన ర్యాంకింగ్స్‌లో జపాన్ (20), జర్మనీ (23), ఫ్రాన్స్ (47), రష్యా (104) ఉన్నాయి. అంతర్జాతీయ వాణిజ్యం, నియంత్రణలు, రుణం, కారి్మక రంగం, న్యాయ వ్యవస్థ, మోథో హక్కులు వంటి 10 అంశాల ప్రాతిపదికన సూచీ కదలికలు ఉంటాయి. -
ఏడోనెలా ఎగుమతులు రివర్స్..పసిడి దిగుమతులు రయ్!
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి మందగమన పరిస్థితులను ప్రతిబింబిస్తూ ఎగుమతి–దిగుమతి గణాంకాలు వెలువడుతున్నాయి. భారత్ వస్తు ఎగుమతులు వరుసగా ఏడవనెల వృద్ధిలేకపోగా క్షీణబాటనే నడిచాయి. దిగుమతుల విషయంలో ఈ క్షీణత తొమ్మిది నెలల నుంచి నమోదవుతోంది. అధికారిక గణాంకాలను పరిశీలిస్తే.. ► ఆగస్టులో ఎగుమతులు 2022 ఇదే నెలతో పోల్చితే 6.86 శాతం తగ్గి 34.48 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ► ఇదే నెల్లో దిగుమతులు 5.23 శాతం క్షీణించి 58.64 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ► ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం-వాణిజ్యలోటు 24.16 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. జూలైలో ఈ విలువ 20.67 బిలియన్లు కావడం గమనార్హం. ► ఎగుమతుల రంగంలో తేయాకు, కాఫీ, బియ్యం, సుగంధ ద్రవ్యాలు, తోలు, రత్నాలు–ఆభరణాలు, జౌళి, పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు పడిపోయాయి. అయితే ముడి ఇనుము, ఎలక్ట్రానిక్ గూడ్స్, ఆయిల్ సీడ్స్, జీడిపప్పు, తివాచీ, ఇంజనీరింగ్, ఫార్మా, సముద్ర ఉత్పత్తులుసహా మొత్తం 30 కీలక రంగాల్లో 15 సానుకూల వృద్ధి రేటును నమోదు చేసుకున్నాయి. ఆర్థిక సంవత్సరం ఐదు నెలల్లో...కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకూ ఐదు నెలల్లో ఎగుమతులు 11.9 శాతం క్షీణించి 172.95 బిలియన్ డాలర్లుగా నమోదుకాగా, దిగుమతుల విలువ 12 శాతం క్షీణించి 271.83 బిలియన్ డాలర్లుగా ఉంది. వెరసి వాణిజ్యలోటు 98.88 బిలియన్ డాలర్లు. పసిడి దిగుమతులు: పసిడి దిగుమతులు ఆగస్టులో 38.75% పెరిగి 4.93 బిలియన్ డాలర్లుగా నమోదవగా, ఆగస్టు–ఏప్రిల్ మధ్య 10.48% పెరుగుదలతో 18.13 బిలియన్ డాలర్లుగా పసిడి దిగుమతుల విలువ ఉంది. రష్యా నుంచి దిగుమతులు రెట్టింపు రష్యా నుంచి భారత్ దిగుమతులు ఏప్రిల్-ఆగస్టు మధ్య రెట్టింపయ్యాయి. క్రూడ్ ఆయిల్, ఎరువుల దిగుమతులు పెరగడం దీనికి ప్రధాన కారణమని వాణిజ్య మంత్రిత్వశాఖ గణాంకాలు వెల్లడించాయి. 2022 ఏప్రిల్–ఆగస్టు మధ్య రష్యా నుంచి దిగుమతుల విలువ 13.77 బిలియన్ డాలర్లుకాగా, తాజా సమీక్షా కాలంలో ఈ విలువ 25.69 బిలియన్ డాలర్లకు ఎగసింది. చైనా, అమెరికాల తర్వాత రష్యా చమురు కొనుగోలులో భారత్‌ది మూడవ స్థానం. ఇక చైనా నుంచి దిగుమతులు ఈ ఐదు నెలల కాలంలో 43.96 బిలియన్ డాలర్ల నుంచి 42 బిలియన్ డాలర్లకు తగ్గాయి. -
పేపర్ పరిశ్రమ ఆదాయంలో క్షీణత
న్యూఢిల్లీ: అమ్మకాలు పెరిగినప్పటికీ పేపర్ కంపెనీల ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2023–24) 8–10 శాతం మేర క్షీణించొచ్చని ప్రమఖ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనా వేసింది. తీవ్ర పోటీ కారణంగా నికర ప్రయోజనం తగ్గొచ్చని పేర్కొంది. క్రితం ఏడాది మాదిరే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం మీద అమ్మకాల పరిమాణం 5–7 శాతం మేర పెరుగుతుందని అంచనా వేసింది. నిర్వహణ మార్జిన్ ఆరోగ్యకరంగా 18–19 శాతం స్థాయిలో ఉండొచ్చని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం కంటే తక్కువే అయినా, కరోనా ముందున్న నాటి 17 శాతం కంటే ఎక్కువేనని వివరించింది. దీంతో స్థిరమైన నగదు ప్రవాహాలు ఉంటాయని తెలిపింది. 2022–23లో పేపర్ పరిశ్రమ రికార్డు స్థాయిలో 30 శాతం ఆదాయ వృద్ధిని చూడడం గమనార్హం. 87 పేపర్ కంపెనీలపై అధ్యయనం చేసి క్రిసిల్ ఈ నివేదికను విడుదల చేసింది. పేపర్ పరిశ్రమలో సగం ఆదాయం ఈ కంపెనీల చేతుల్లోనే ఉంది. ప్యాకేజింగ్ పేపర్ వాటా మొత్తం మార్కెట్లో 55 శాతంగా ఉంది. ఆ తర్వాత రైటింగ్, ప్రింటింగ్ (డబ్ల్యూపీ) పేపర్ వాటా 30 శాతంగా ఉంది. మిగిలినది న్యూస్ ప్రింట్, స్పెషాలిటీ పేపర్. ప్యాకేజింగ్ పేపర్‌ను ఫార్మాస్యూటికల్స్, ఈ కామర్స్ గూడ్స్, కన్జన్యూమర్ డ్యూరబుల్స్, ఎఫ్ఎంసీజీ, రెడీమేడ్ విభాగాలు ఉపయోగిస్తుంటాయి. విద్యా రంగం, కార్పొరేట్ రంగం డబ్ల్యూపీ పేపర్‌ను ఉపయోగిస్తుంటుంది. డిమాండ్ ఇలా.. ప్యాకేజింగ్ పేపర్ అమ్మకాల పరిమాణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6–8 శాతం మేర పెరగొచ్చని క్రిసిల్ రేటింగ్స్ తెలిపింది. ఫార్మా, ఎఫ్ఎంసీజీ పరిశ్రమ నుంచి డిమాండ్ ఇందుకు మద్దతుగా నిలుస్తుందని పేర్కొంది. డబ్ల్యూపీ పేపర్ అమ్మకాల పరిమాణం 3–5 శాతమేర పెరుగుతుందని అంచనా వేసింది. ప్రభుత్వం వ్యయాలకు తోడు, నూతన వి ద్యా విధానం ఇందుకు అనుకూలిస్తుందని తెలిపింది. అలాగే, 2024 సాధారణ ఎన్నికల ముందు డబ్ల్యూపీ పేపర్‌కు డిమాండ్ పెరుగుతుందని పేర్కొంది. -
హోమ్ టెక్స్టైల్ పరిశ్రమకు పునరుజ్జీవం
ముంబై: హోమ్ టెక్స్టైల్ పరిశ్రమ ఈ ఏడాది 7–9 శాతం మధ్య ఆదాయ వృద్ధిని నమోదు చేయనుంది. దేశీయంగా కాటన్ ధరలు తగ్గుముఖం పట్టడంతో అంతర్జాతీయంగా తిరిగి తన వాటాను పెంచుకుందని క్రిసిల్ రేటింగ్స్ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో హోమ్ టెక్స్టైల్ కంపెనీల ఆదాయం 15 శాతం వరకు తగ్గడం గమనార్హం. పరిశ్రమ నిర్వహణ లాభం 1.5–2 శాతం వరకు మెరుగుపడి 14–14.5 శాతానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చేరుకోవచ్చని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. ముడి సరుకుల ధరలు తక్కువలో ఉండడం, నిర్వహణ పరమైన అనుకూలతలను పేర్కొంది. అయితే ఇప్పటికీ కరోనా ముందు నాటి కంటే తక్కువలోనే ఉన్నట్టు తెలిపింది. దీంతో పరిశ్రమ రుణ భారం స్థిరంగా కొనసాగొచ్చని అంచనా వేసింది. హోమ్ టెక్స్‌టైల్‌లో 40–45 శాతం మార్కెట్ వాటా కలిగిన 40 కంపెనీలను అధ్యయనం చేసిన తర్వాత క్రిసిల్ రేటింగ్స్ ఈ నివేదికను విడుదల చేసింది. ఎగుమతులు పెరుగుతాయి.. భారత హోమ్ టెక్స్టైల్స్ పరిశ్రమ మొత్తం ఆదాయంలో 70–75 శాతం ఎగుమతుల నుంచే వస్తోంది. ఇందులో యూఎస్ వాటా అధికంగా ఉంది. భారత ఎగుమతుల్లో సగం అమెరికాకే వెళుతుంటాయి. కాటన్ ధర క్యాండీకి గతేడాది మే నెలలో రూ.లక్షకు చేరుకోగా, అది ఇప్పుడు రూ.55,000కు తగ్గినట్టు క్రిసిల్ రేటింగ్స్ నివేదిక వెల్లడించింది. అమెరికాలో బడా రిటైల్ సంస్థల వద్ద నిల్వలు తగ్గిపోవడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత కంపెనీలకు ఆర్డర్ల రాక పెరుగుతుందని అంచనా వేసింది. అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో సవాళ్లు నెమ్మదించడంతో గడిచిన కొన్ని నెలలుగా అమ్మకాలు క్రమంగా పెరుగుతున్నట్టు తెలిపింది. ‘‘దేశీయ ముడి సరుకులు ఇప్పుడు పోటీనిచ్చే స్థాయికి తగ్గాయి. అంతర్జాతీయ కొనుగోలు దారులు చైనా ప్లస్ వన్‌కు ప్రాధాన్యం ఇస్తుండడం, యూఎస్ రిటైలింగ్ సంస్థలు తిరిగి స్టాక్ పెంచుకునేందుకు ఆసక్తి చూపిస్తుండడడంతో ఆదాయం పుంజుకుంటుంది’’అని క్రిసిల్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ మోహిత్ మఖీజా తెలిపారు. దీనికి నిదర్శనంగా 2022లో భారత కంపెనీల వాటా 44 శాతం నుంచి తిరిగి 47 శాతానికి చేరుకోవడాన్ని ప్రస్తావించారు. 2021లో ఈ వాటా 48 శాతంగా ఉంది. -
ఆఫీస్ స్పేస్ లీజింగ్ తగ్గొచ్చు
న్యూఢిల్లీ: కార్యాలయ స్థలాల (ఆఫీస్ స్పేస్) లీజు ఈ ఏడాదిలో 20 శాతం క్షీణించి 40 మిలియన్ చదరపు అడుగులకు (ఎస్ఎఫ్టీ) పరిమితం కావొచ్చని కొలియర్స్ ఇండియా నివేదిక తెలిపింది. కంపెనీలు తమ విస్తరణ ప్రణాళికలను వాయిదా వేస్తుండడం ఇందుకు కారణమని పేర్కొంది. దేశవ్యాప్తంగా ఆరు ప్రముఖ పట్టణాలపై వివరాలతో కూడిన నివేదికను గురువారం విడుదల చేసింది. స్థూలంగా ఆఫీస్ స్పేస్ లీజు 2023లో 40–45 మిలియన్ ఎస్ఎఫ్టీ మధ్య ఉండొచ్చని, క్రితం ఏడాదిలో ఇది 50.3 మిలియన్ చదరపు అడుగులుగా ఉందని తెలిపింది. కాకపోతే ఈ ఏడాది మార్చిలో వేసిన అంచనా కంటే ఎక్కువే ఉంటున్నట్టు పేర్కొంది. ఇక ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో (జూన్ వరకు) 24.7 మిలియన్ ఎస్ఎఫ్టీ ఆఫీస్ స్పేస్ లీజు నమోదైంది. ద్వితీయ ఆరు నెలల్లో (డిసెంబర్ వరకు) మరో 15.3–20.3 మిలియన్ చదరపు అడుగుల మధ్య ఉంటుందని అంచనా వేసింది. స్థూల లీజు పరిమాణంలో రెన్యువల్స్‌ను కలపలేదు. వెలుపలి డిమాండ్ బలహీనంగా ఉన్నప్పటికీ, బలమైన ఆర్థిక కార్యకలాపాలు ఆఫీస్ స్పేస్ లీజు ఈ మాత్రం మెరుగ్గా ఉండడానికి మద్దతుగా నిలిచినట్టు వివరించింది. ‘‘జనవరి–మార్చి మధ్య 10.1 మిలియన్ ఎస్ఎఫ్టీ మేర కార్యాలయ స్థలాలు భర్తీ అయ్యాయి. తర్వాతి మూడు నెలల కాలంలో ఇది మరింత పుంజుకున్నది. ఏప్రిల్–జూన్ మధ్య 14.6 మిలియన్ చదరపు అడుగులు మేర లీజు నమోదైంది. త్రైమాసికం వారీగా చూస్తే 46 శాతం పుంజుకున్నది’’అని కొలియర్స్ ఇండియా వివరించింది. పట్టణాల వారీగా.. బెంగళూరులో అత్యధికంగా 12–14 మిలియన్ ఎస్ఎఫ్టీ కార్యాలయ స్థలాల లీజు నమోదైంది. ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో 9–11 మిలియన్ ఎస్ఎఫ్టీ, చెన్నైలో 7–9 మిలియన్ చదరపు అడుగుల మేర కంపెనీలు లీజుకు తీసుకున్నాయి. హైదరాబాద్, ముంబై, పుణె మార్కెట్లలో ఇది 4–6 మిలియన్ చదరపు అడుగుల మధ్య ఉంది. సరఫరాకు తగ్గట్టు లీజు పరిమాణం నమోదు అవుతుండడం, ఖాళీ స్థలాలు ఫ్లాట్‌గానే ఉండడం వల్ల అద్దెలు పెరిగే అవకాశం ఉన్నట్టు కొలియర్స్ ఇండియా నివేదిక అంచనా వేసింది. ఆఫీస్ స్పేస్ డిమాండ్ మృదువుగా ఉన్నప్పటికీ, ఫ్లెక్సిబుల్ వర్క్స్పేసెస్కు డిమాండ్ స్థిరంగా కొనసాగుతున్నట్టు ఈ విభాగంలో సేవలు అందించే అర్బన్వోల్ట్ సహ వ్యవస్థాపకుడు అమల్ మిశ్రా తెలిపారు. -
భారత్ బ్యాంకింగ్ పటిష్టమవుతోంది: ఫిచ్
న్యూఢిల్లీ: కోవిడ్ తీవ్రత తగ్గుముఖం పట్టడంతో భారతీయ బ్యాంకుల నిర్వహణా పరిస్థితులు గణనీయంగా మెరుగుపడుతున్నట్లు రేటింగ్ ఏజెన్సీ– ఫిచ్ తన తాజా ప్రకటనలో పేర్కొంది. బ్యాంకింగ్‌కు సంబంధించి పలు సూచీలు కోవిడ్ ముందుస్తు పరిస్థితులకన్నాసైతం ముందంజలో ఉన్నట్లు వివరించింది. కొన్ని రంగాల విషయంలో బ్యాంకుల రుణ బకాయిలూ తగ్గుతున్నట్లు తెలిపింది. ‘ఆరి్థక వ్యవస్థ భారీ పరిమాణం, డిమాండ్ పరిస్థితులు లాభదాయకమైన వ్యాపారాన్ని సృష్టించడానికి అలాగే ఆదాయాలు పెరగడానికి, ఇబ్బందులను తగ్గించడానికి బ్యాంకింగ్‌కు మరిన్ని అవకాశాలను అందించాల్సి ఉంది’’ కూడా ఫిచ్ పేర్కొంది. -
పతంజలికి భారీ షాక్, లాభాలు ఢమాల్!
న్యూఢిల్లీ: పతంజలి ఫుడ్స్ నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చినప్పుడు 64 శాతం క్షీణించి రూ.88 కోట్లకు పరిమితమైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.241 కోట్లుగా ఉంది. ముఖ్యంగా వంట నూనెల ధరలు తగ్గుముఖం పట్టడంతో, ఈ విభాగంలో కంపెనీ నికర నష్టాలు ఎదుర్కొన్నది. ఫుడ్ వ్యాపారం మెరుగైన పనితీరుతో ఆదుకుంది. మొత్తం ఆదాయం రూ.7,370 కోట్ల నుంచి రూ.7,810 కోట్లకు పెరిగింది. (IT refund scam: తెలుసుకోండి: లేదంటే కొంప కొల్లేరే!) వంట నూనెల విభాగం ఆదాయం రూ.5,891 కోట్లుగా ఉంది. వంట నూనెల ఆదాయం తగ్గినప్పటికీ, అమ్మకాల పరిమాణం 1.4 టన్నుల మేర పెరిగినట్టు, ఇది వార్షికంగా క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 36 శాతం అధికమని పతంజలి ఫుడ్స్ తెలిపింది. ‘‘వంట నూనెల పరిశ్రమపై ధరలు క్షీణత ప్రభావం బలంగా పడింది. క్రితం త్రైమాసికం నుంచి చూస్తే ధరలు తగ్గిపోవడంతో, అధిక ధరల వద్ద కొనుగోలు చేసిన వంట నూనెల నిల్వ కారణంగా, రవాణాలో ఉన్న స్టాక్ కారణంగా నష్టపోవాల్సి వచ్చింది. (గోల్డ్ హిస్టరీ: అతిపెద్ద పతనం తులం ధర రూ.63.25 లే!) అధిక ధరల వద్ద కొనుగోలు చేసిన వంట నూనెల నిల్వలు ఉన్నప్పటికీ, ధరలు తగ్గించాలంటూ ప్రభుత్వం జోక్యం చేసుకోవడం లాభదాయకతపై ప్రతికూల ప్రభావం చూపించింది. జూన్ త్రైమాసికంలో నమోదైనదంతా కూడా సైక్లికలే’’అని వివరించింది. తమ ఫుడ్ అండ్ ఎఫ్ఎంసీజీ వ్యాపారం అనుకున్న విధంగా పనితీరు చూపించిందని.. నూతన ఉత్పత్తుల విడుదలతో ఇది మరింత వృద్ధిని చూస్తుందని పతంజలి ఫుడ్స్ సీఈవో సంజీవ్ ఆస్థానా పేర్కొన్నారు. ఆదాయం, లాభాలకు ఫుడ్ అండ్ ఎఫ్ఎంసీజీ పెద్ద మద్దతుగా నిలుస్తుందని చెప్పారు. -
ఎంత ప్రమాదమో తెలిసొచ్చింది.. వెలుగులు అణువంతే!
అణు బాంబు సృష్టికర్త ఒప్పెన్హీమర్ జీవిత గాథ హాలీవుడ్ తెరపైకెక్కడంతో ప్రపంచవ్యాప్తంగా మరోసారి అణు శక్తిపై చర్చ మొదలైంది. అణు పరిజ్ఞానం ఇప్పటిదాకా ఎన్నోసార్లు చర్చల్లో నానుతూనే ఉంది. ఇటీవలి కాలంలో పర్యావరణాన్ని పరిరక్షించే పునరుద్పాతక ఇంధన శక్తుల వినియోగంపై అవగాహన పెరగడంతో అణుశక్తి ప్రభ క్రమంగా తగ్గుతూ వస్తోంది. దాని స్థానాన్ని సౌర విద్యుత్ ఆక్రమిస్తోంది... అణు శాస్త్రవేత్త జె. రాబర్ట్ ఒప్పెన్హీమర్ 1940లో తొలిసారి అణు బాంబును సృష్టించారు. తర్వాత పదేళ్లకు 1950లో తొలి అణు విద్యుత్కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అప్పట్లో దాన్ని ఇంధన రంగంలో గేమ్ చేంజర్‌గా భావించారు. కానీ అణు విద్యుత్కేంద్రాలు ఎంత ప్రమాదకరమో అనుభవపూర్వకంగా తెలిసొచ్చాక వాటికి ఆదరణ క్రమంగా తగ్గుతూ వస్తోంది. జపాన్, అమెరికా, ఫ్రాన్స్ తప్ప మిగతా దేశాల్లో అణు ఇంధనానికి ప్రాధాన్యమూ తగ్గుతూ వస్తోంది. జర్మనీ ప్రభుత్వం 3 అణు విద్యుత్ కేంద్రాలను మూసివేయడం గమనార్హం. అణు వర్సెస్ సౌర విద్యుత్ 1970 దశకంలో అణు విద్యుత్ ఒక వెలుగు వెలిగింది. అణు శక్తికి అది స్వర్ణయుగమని చెప్పొచ్చు. చాలా దేశాల్లో భారీగా అణు ప్లాంట్లు ఏర్పాటు చేశారు. అలా ప్రపంచ విద్యుదుత్పత్తిలో అణు విద్యుత్ వాటా 1985 కల్లా ఏకంగా 15.1% దాకా పెరిగింది. కానీ 2022 నాటికి అది 9.1 శాతానికి పడిపోయింది. సౌరవిద్యుత్ వినియోగంలోకి రావడమే దీనికి ప్రధాన కారణం. ‘‘2021లో ప్రపంచ దేశాల్లో సౌర విద్యుత్ 1.04 టెరావాట్స్ కాగా, ప్రపంచ అణు విద్యుత్ సామర్థ్యం 463 గిగావాట్లు. అంటే అణు విద్యుత్ కంటే సౌర విద్యుత్ రెట్టింపు కంటే ఎక్కువగా ఉంది’’ అని ఇస్రోలో సోలార్ ప్యానెల్ డివిజన్ మాజీ శాస్త్రవేత్త మనీశ్ పురోహిత్ చెప్పారు. సౌర విద్యుత్‌తో లాభాలు... ► సౌర విద్యుత్‌కు ముడి సరుకు సూర్యుడే గనుక దానికి కొరత ఉంటుందన్న భయం లేదు. ► సోలార్ ప్యానెల్స్, యూనిట్ల ధర బాగా తగ్గింది. సోలార్ ప్లాంట్ నిర్మాణ వ్యయం మెగావాట్‌కు 10 లక్షల డాలర్లే. సౌర విద్యుత్ వ్యర్థాలను నిర్మూలించే క్రమంలో ఎలాంటి ప్రమాదానికీ ఆస్కారం లేదు. ► అణు విద్యుత్కేంద్రం ఏర్పాటే అత్యంత ఖరీదైన వ్యవహారం. కొత్తగా అణు ప్లాంట్ నిర్మాణానికయ్యే వ్యయం కనీసం 1,000 కోట్ల డాలర్లు. ► అణు విద్యుదుత్పత్తి వల్ల వెలువడే అణు ధారి్మక వ్యర్థాల నిర్మూలన అత్యంత ప్రమాదంతో కూడిన వ్యవహారం. ► ఒక్కో అణు విద్యుత్కేంద్రం నుంచి ఏటా కనీసం 20 మెట్రిక్ టన్నుల అణు ధారి్మక వ్యర్థాలు వెలువడతాయి. ► ప్రస్తుతం అన్ని దేశాల వద్దా కలిపి 90 వేల మెట్రిక్ టన్నుల అణు ధారి్మక వ్యర్థాలున్నాయి. వీటిని అత్యంత సురక్షిత పద్ధతిలో నిర్మూలించకపోతే ఎన్నో రకాలుగా తీవ్ర ముప్పు వాటిల్లుతుంది. ► పైగా అణు విద్యుత్కేంద్రాలతో ప్రమాదాలు కూడా ఎక్కువే. అందుకే కొత్త ప్లాంట్ల ఏర్పాటును అడ్డుకుంటూ ఎన్నో పోరాటాలు జరిగాయి, జరుగుతున్నాయి. ► దాంతో చాలా ఏళ్లుగా కొత్త అణు విద్యుత్కేంద్రాలేవీ రాలేదు. ► అమెరికా, జపాన్, ఫ్రాన్స్ మినహా మరే దేశాలు అణు విద్యుత్‌పై మొగ్గు చూపించకపోవడంతో అంతర్జాతీయంగా ఒప్పందాలు, పరస్పర సాంకేతిక సహకారం తగ్గిపోయాయి. ఫలితంగా అణు విద్యుత్ చుట్టూ చీకట్లు అలుముకున్నాయి. అణ్వాయుధాలు తగ్గిపోతున్నాయ్! ► అమెరికా, రష్యా మధ్య ప్రచ్ఛన్న యుద్ధంలో కొన్నేళ్లు పాటు అణ్వాయుధాల పోటీయే ప్రధానంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల దగ్గర 1986 నాటికి ఏకంగా 64,452 అణ్వాయుధాలు పోగుపడ్డాయి. ► ఇప్పుడు వాటి సంఖ్య 12,510కి తగ్గింది. వీటిలో 89% రష్యా, అమెరికా దగ్గరే ఉన్నాయి. ► అణు వినాశనం ఎంత భయానకంగా ఉంటుందో హిరోషిమా, నాగసాకిపై అమెరికా అణు బాంబు దాడులతో అందరికీ తెలిసొచి్చంది. ► ఏళ్లు గడిచే కొద్దీ అణ్వాయుధాల తయారీని తగ్గించడంపై దేశాలన్నీ దృష్టి సారించాయి. అణు విద్యుత్ రియాక్టర్ల సగటు జీవిత కాలం 60 ఏళ్లు. ఇప్పుడున్న వాటిలో చాలావరకు ఇక పనికి రాని స్థితికి వచ్చేశాయి. కొత్తవి ఏర్పాటు కావడం లేదు. దాంతో అణు విద్యుదుత్పత్తి తగ్గుతూ వస్తోంది – డాక్టర్ నితేంద్ర సింగ్, ఇండియన్ యూత్ న్యూక్లియర్ సొసైటీ వ్యవస్థాపకుడు -1968లో అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం కుదిరిన తర్వాత అణు శక్తిని ప్రజాప్రయోజనాలకే తప్ప, వినాశనానికి వాడొద్దని దేశాలన్నీ నెమ్మదిగా గ్రహించాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మెప్పించని మదర్సన్ సుమీ వైరింగ్
న్యూఢిల్లీ: మదర్సన్ సుమీ వైరింగ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) రూ.123 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.126 కోట్లతో పోలిస్తే 2 శాతం క్షీణించింది. మొత్తం ఆదాయం రూ.1,671 కోట్ల నుంచి రూ.1,859 కోట్లకు వృద్ధి చెందింది. ‘‘కంపెనీ క్రమం తప్పకుండా స్థిరమైన పనితీరును చూపిస్తోంది. గడిచిన కొన్ని త్రైమాసికాల్లో ఏర్పాటు చేసిన అదనపు తయారీ సామర్థ్యాలు ఆదాయ వృద్ధికి మద్దతుగా నిలవడం మొదలైంది’’అని మదర్సన్ సుమీ వైరింగ్ ఇండియా చైర్మన్ వివేక్ చాంద్ సెహ్గల్ తెలిపారు. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ, నిర్వహణ పనితీరు మెరుగుపరుచుకోవడం సాయపడినట్టు చెప్పారు. వ్యయాలు తగ్గించుకునేందుకు తాము తీసుకున్న చర్యలకు తోడు, కస్టమర్ల మద్దతుతో తమ భాగస్వాములకు రానున్న త్రైమాసికాల్లోనూ విలువను జోడిస్తామనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో కంపెనీ షేరు 2 శాతం తగ్గి రూ.59 వద్ద ముగిసింది. -
ఎగుమతులు భారీ పతనం.. మూడేళ్లలో ఇదే తొలిసారి!
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మందగమన ప్రభావం ముఖ్యంగా అమెరికా, యూరోప్ మార్కెట్ల నిరాశావాద ధోరణి భారత్ వస్తు ఎగుమతులు–దిగుమతులపై ప్రభావం చూపుతోంది. జూన్‌లో వస్తు ఎగుమతులు 22 శాతం క్షీణించి 32.97 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. గడచిన మూడేళ్లలో (కరోనా సంక్షోభ సమయం 2020 మే నెల్లో 36.47 శాతం క్షీణత) ఇంత స్థాయిలో వస్తు ఎగుమతుల పతనం ఇదే తొలిసారి. ఇక దిగుమతులు కూడా 17.48 శాతం క్షీణించి 53.10 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. వెరసి ఎగుమతులు దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్యలోటు జూన్‌లో 20.13 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. తొలి త్రైమాసికంలో క్షీణతే.. ఇక ఆర్థిక సంవత్సరం తొలి 3 నెలల్లో (ఏప్రిల్, మే, జూన్) చూస్తే వస్తు ఎగుమతులు 15.13 శాతం క్షీణించి 102.68 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు 12.67%క్షీణించి 160.28 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. వెరసి వాణిజ్యలోటు 57.6 బిలియన్ డాలర్లుగా ఉంది. విభాగాల వారీగా... జూన్‌లో చమురు దిగుమతుల విలువ 33.8 శాతం తగ్గి 12.54 బిలియన్ డాలర్లుగా ఉండగా, ఏప్రిల్–జూన్ మధ్య 18.52 శాతం క్షీణతతో 43.4 బిలియన్ డాలర్లుగా ఉంది. పసిడి దిగుమతులు జూన్‌లో 82.38 శాతం పెరిగి 5 బిలియన్ డాలర్లకు చేరింది. ఏప్రిల్–జూన్ త్రైమాసికాన్ని చూస్తే, 7.54 శాతం తగ్గి 9.7 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. జూన్‌లో వెండి దిగుమతులు 94.36 శాతం పడిపోయి 0.79 బిలియన్ డాలర్లకు చేరాయి. జూన్ ఎగుమతులకు సంబంధించి 30 కీలక రంగాల్లో 21 క్షీణత నమోదుచేసుకున్నాయి. వీటిలో పెట్రోలియం ఉత్పత్తులు, ప్లాస్టిక్, రెడీమేడ్ దుస్తులు, ఇంజనీరింగ్, రసాయనాలు, రత్నాభరణాలు, తోలు, మెరైన్ ఉత్పత్తులు ఉన్నాయి. ఎలక్ట్రానిక్ గూడ్స్ ఎగుమతులు జూన్‌లో 45.36% పెరిగి 2.43%గా నమోదయ్యాయి. ఏప్రిల్–జూన్‌లో ఈ ఎగుమతులు 47% పెరిగి 6.96 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. -
ఈ రంగాల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారా?
ముంబై: కార్యాలయ ఉద్యోగుల నియామకాలు (వైట్ కాలర్) జూన్ నెలలో 3 శాతం తక్కువగా నమోదయ్యాయి. ముఖ్యంగా ఐటీ, బీఎఫ్ఎస్ఐ, తయారీ రంగాలు నియామకాల పట్ల అప్రమత్తంగా వ్యవహరించినట్టు మానవ వనరుల ప్లాట్‌ఫామ్ ‘ఫౌండిట్’ ఓ నివేదిక విడుదల చేసింది. ఐటీలో 19 శాతం, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ (బీఎఫ్ఎస్ఐ) రంగంలో 13 శాతం, గృహోపకరణాల రంగంలో 26 శాతం, తయారీ రంగంలో 14 శాతం మేర నియామకాలు క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చినప్పుడు తగ్గాయి. వీటిల్లో కొన్ని రంగాలు నియామకాల విషయంలో మే నెలతో పోల్చిచూసినప్పుడు కాస్త మెరుగైన పనితీరు చూపించాయి. నెలవారీగా జాబ్ పోస్టింగ్‌ల డేటా ఆధారంగా ఫౌండిట్ ఇన్సైట్స్ ట్రాకర్ (గతంలో మాన్స్టర్ ఎంప్లాయిమెంట్ ఇండెక్స్) ఈ వివరాలు ప్రకటించింది. ఈ ఏడాది మే నెలతో పోలిస్తే కార్యాలయ ఉద్యోగుల నియామకాలు జూన్ నెలలో 2 శాతం పెరిగాయి. హెల్త్‌కేర్‌లో 11 శాతం, బీపీవోలో 7 శాతం, తయారీలో 5 శాతం, లాజిస్టిక్స్‌లో 9 శాతం మేర నియామకాల్లో వృద్ధి కనిపించింది. ముఖ్యంగా మెట్రోల్లో 3 శాతం మేర అధిక నియామకాలు నమోదయ్యాయి. టైర్–2 పట్టణాల్లో 2 శాతం మేర క్షీణత కనిపించింది. 0–2 ఏళ్ల అనుభవం ఉన్న ఫ్రెషర్లకు డిమాండ్ నెలకొనగా, మేనేజ్మెంట్ ఉద్యోగుల నియామకాలు 4 శాతం పెరిగాయి. 11–15 ఏళ్ల అనుభవం కలిగి సీనియర్ ఉద్యోగుల నియామకాలు ఒక శాతం, 7–10 ఏళ్ల అనుభవం ఉన్న విభాగంలో 2 శాతం, 4–6 ఏళ్ల అనుభవం కలిగిన విభాగంలో 2 శాతం మేర అధిక నియామకాలు నమోదయ్యాయి. రానున్న త్రైమాసికంలో మెరుగు.. ‘‘మేము ట్రాక్ చేస్తున్న మెజారిటీ రంగాల్లో నియామకాల్లో సానుకూల ధోరణి కనిపించడం ప్రోత్సాహకరంగా అనిపించింది. హెల్త్‌కేర్, తయారీ, ఐటీలోనూ కొంత మేర నియామకాలు పుంజుకున్నాయి. రానున్న త్రైమాసికంలో నియామకాలు మెరుగ్గా ఉంటాయని అంచనా వేస్తున్నాం. కంపెనీలు తమ నైపుణ్య అవసరాలను తిరిగి సమీక్షించుకోనున్నాయి’’అని ఫౌండిట్ సీఈవో శేఖర్ గరీష తెలిపారు. నైపుణ్యాలను ఎప్పటికప్పుడు పెంచుకోవడం, పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా మార్పును స్వీకరించడం అనేవి ప్రస్తుత మార్కెట్ వాతావరణంలో ఉద్యోగంలో రాణించేందుకు అవసరమని సూచించారు. ఐటీ రంగంలో కూడా తగ్గాయంటున్న నౌకరీ జాబ్‌స్పీక్ ఇండెక్స్ కార్యాలయ ఉద్యోగుల నియామకాలు (వైట్ కాలర్) జూన్ నెలలో మూడు శాతం తగ్గినట్టు నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్ సర్వేలో తేలిసింది. ఐటీ, రిటైల్, బీపీవో, ఎడ్యుకేషన్, ఎఫ్ఎంసీజీ, ఇన్సూరెన్స్ నియామకాల విషయంలో అప్రమ్తత ధోరణి వ్యవహరించడమే ఇందుకు కారణంగా ఉంది. ముఖ్యంగా ఐటీ రంగంలో గణనీయంగా తగ్గాయి. జూన్ నెలలో 2,795 ఉద్యోగాలకు పోస్టింగ్‌లు పడ్డాయి. 2022 జూన్ నెలలో ఇవి 2,878గానే ఉన్నాయి. ఇక ఈ ఏడాది మే నెల నియామకాలతో పోల్చి చూసినా జూన్‌లో 2 శాతం తగ్గాయి. నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్ ప్రతి నెలా ఉద్యోగ మార్కెట్ ధోరణులు, నియామకాల వివరాలను విడుదల చేస్తుంటుంది. కార్యాలయ ఉద్యోగ మార్కెట్ దీర్ఘకాలం తర్వాత నిర్మాణాత్మక మార్పును చూస్తున్నట్టు ఈ నివేదిక పేర్కొంది. ప్రధానంగా ఈ ఉద్యోగాలకు మెట్రో పట్టణాలు కీలక చోదకంగా ఉంటున్నట్టు గుర్తు చేసింది. రియల్ ఎస్టేట్, ఆయిల్ అండ్ గ్యాస్, ఫార్మా, బీఎఫ్ఎస్ఐ ఎక్కువ ఉద్యోగాలకు కల్పించినట్టు నౌకరీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ పవన్ గోయల్ వెల్లడించారు. ఐటీలో ఆందోళనకరం ఐటీ రంగంలో నియామకాల ధోరణి ఇప్పటికీ ఆందోళనకరంగా ఉన్నట్టు నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్ నివేదిక తెలిపింది. గతేడాది జూన్ నెలతో పోల్చిచూసినప్పుడు, ఈ ఏడాది జూన్‌లో ఐటీ నియామకాలు 31 శాతం తక్కువగా నమోదైనట్టు వివరించింది. అన్ని రకాల ఐటీ కంపెనీల్లోనూ ఇదే ధోరణి కనిపించినట్టు తెలిపింది. సాఫ్ట్వేర్ డెవలపర్స్, సిస్టమ్ అనలిస్టులకు డిమాండ్ క్షీణత కొనసాగినట్టు వెల్లడించింది. సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్, ఏఐ స్పెషలిస్ట్‌ల నియామకాలు సానుకూలంగా ఉన్నట్టు తెలిపింది. ఆయిల్ అండ్ గ్యాస్ రంగంలో బుల్లిష్ ధోరణి కొనసాగిందని, జూన్‌లో కొత్త ఉద్యోగ నియామకాలు ఈ రంగంలో క్రితం ఏడాది ఇదే మాసంతో పోల్చినప్పుడు 40 శాతం పెరిగాయని పేర్కొంది. పెద్ద ఎత్తున రిఫైనరీ సామర్థ్యాల విస్తరణ, దేశీయ డిమాండ్ అవసరాలను చేరుకునేందుకు కంపెనీల వ్యూహాలు నియామకాలకు మద్దతునిస్తున్నట్టు వివరించింది. ఫార్మా రంగంలో నియామకాలు 14 శాతం పెరిగాయి. ఆటోమొబైల్, హాస్పిటాలిటీ, బ్యాంకింగ్లోనూ నియామకాల గణాంకాలు సానుకూలంగా ఉన్నాయి. అత్యధికంగా అహ్మదాబాద్‌లో కార్యాలయ ఉద్యోగ నియామకాలు జూన్‌లో 23 శాతం వృద్ధి చెందాయి. వదోదరలో 14 శాతం, జైపూర్‌లో స్థిరంగా ఉన్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. -
స్టార్టప్స్‌లోకి పెట్టుబడులు డౌన్..
న్యూఢిల్లీ: దేశీ అంకుర సంస్థల్లోకి ఈ ఏడాది ప్రథమార్ధంలో (జనవరి–జూన్) పెట్టుబడులు 36 శాతం క్షీణించాయి. 3.8 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. గత నాలుగేళ్లలో అర్థ సంవత్సరానికి సంబంధించి స్టార్టప్స్‌లోకి పెట్టుబడులు ఇంత తక్కువ స్థాయికి పడిపోవడం ఇదే ప్రథమం. వ్యాపారాలకు సంబంధించి ప్రతి కోణంపై ఇన్వెస్టర్లు మరింత క్షుణ్నంగా మదింపు చేసేందుకు ఇన్వెస్టర్లు ఎక్కువ సమయం తీసుకుంటూ ఉండటమే ఇందుకు కారణం పీడబ్ల్యూసీ ఇండియా రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ‘గతేడాది ప్రథమార్ధంలో నమోదైన 5.9 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఈసారి పెట్టుబడులు 36 శాతం క్షీణించి 3.8 బిలియన్ డాలర్లకు పరమితమయ్యాయి. 298 డీల్స్ కుదిరాయి. ఈ ఫండింగ్‌లో ప్రారంభ దశ స్థాయి డీల్స్ వాటా 57 శాతంగా ఉంది. ఫిన్‌టెక్, సాస్, డీ2సీ సంస్థల్లోకి అత్యధికంగా పెట్టుబడుల ప్రవాహం కొనసాగింది‘ అని రిపోర్టు పేర్కొంది. వెంచర్ క్యాపిటలిస్టులు (వీసీ) పుష్కలంగా నిధులు సమీకరించినా, స్టార్టప్స్‌లోకి పెట్టుబడులు రావడం మందగించింది. అంకుర సంస్థల ప్రస్థానంలో ఇదొక దశ మాత్రమే. రాబోయే కొన్ని నెలల్లో మళ్లీ ఇన్వెస్ట్మెంట్లు పుంజుకునే అవకాశం ఉంది. ఈ మధ్యలో ఇన్వెస్టర్లు మరిన్ని విషయాలను మదింపు చేస్తున్నారు. ఫైనాన్స్ మొదలుకుని టెక్నాలజీ, హెచ్ఆర్, వ్యాపార ప్రక్రియలు మొదలైనవన్నీ చూస్తున్నారు. స్టార్టప్‌లలో పటిష్టమైన కార్పొరేట్ గవర్నెన్స్ వ్యవస్థ ఉందా లేదా అనేది పరిశీలిస్తున్నారు. ఆ తర్వాతే పెట్టుబడులపై నిర్ణయం తీసుకుంటున్నారు‘ అని పీడబ్ల్యూసీ ఇండియా పార్ట్నర్ అమిత్ నావ్కా తెలిపారు. నివేదికలోని మరిన్ని అంశాలు.. ► ప్రథమార్ధంలో వీసీల పెట్టుబడులు తగ్గాయి. విలీన, కొనుగోలు (ఎంఅండ్ఏ) లావాదేవీలు దాదాపు గతేడాది ద్వితీయార్ధం స్థాయిలో సుమారు 80 డీల్స్ నమోదయ్యాయి. వీటిలో 80 శాతం దేశీ లావాదేవీలు కాగా మిగతావి సీమాంతర ఒప్పందాలు. ► సాస్ (23), ఫిన్‌టెక్ (11), ఈ–కామర్స్.. డీ2సీ (10) విభాగాల్లో అత్యధికంగా ఎంఅండ్ఏ డీల్స్ కుదిరాయి. ► ప్రథమార్ధంలో వచి్చన పెట్టుబడుల విలువలో సాస్, డీ2సీ, ఫిన్‌టెక్, ఈ–కామర్స్ బీ2బీ, లాజిస్టిక్స్.. ఆటో టెక్ రంగాలు అత్యధికంగా 89 శాతం వాటా దక్కించుకున్నాయి. ► బెంగళూరు, ఎన్సీఆర్ (నేషనల్ క్యాపిటల్ రీజియన్), ముంబై నగరాలు కీలక స్టార్టప్ సిటీలుగా కొనసాగుతున్నాయి. ప్రథమార్ధంలో స్టార్టప్స్‌లోకి వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో 83 శాతం వాటా దక్కించుకున్నాయి. -
ప్చ్.. ఈ దేశాల్లో జనం పిల్లలను కనడం లేదు!
ఒకనొక సమయంలో ప్రపంచం మొత్తంమీద జనాభా పెరుగుతూ వచ్చింది. అయితే ఇప్పుడు జనాభా తగ్గుతూవస్తోంది. దీనికి కారణం లో బర్త్ రేట్. దీనికారణంగా ప్రపంచవ్యాప్తంగా పలు సమస్యలు తలెత్తనున్నాయి. Birth Rate : కొంతకాలం క్రితం వరకూ మనమంతా జనాభా నియంత్రణ గురించి మాట్లాడేవాళ్లం. అయితే ఇప్పుడు దీనికి రివర్స్ అయ్యింది. కొన్ని దేశాల్లో ఇప్పుడు జనాభా సంఖ్యను పెంచాలంటూ అక్కడి ప్రభుత్వాలు గగ్గోలు పెడుతున్నాయి. భూమిపై తొలిసారి జనసంఖ్య తక్కువవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. అయితే దీనివలన ఏమవుతుందనే ప్రశ్న మనందరిలో మెదులుతుంది. ప్రపంచంలో జననాల సంఖ్య తగ్గడానికి ప్రధాన కారణం మరణాల రేటు పెరగడం కాదు. జననాలు రేటు తగ్గడం. చైనా, భారత్‌లో కూడా 2.1 కంటే దిగువకు జనన రేటు.. సంతానోత్పత్తిలో మార్పుల ప్రభావాన్ని అధ్యయనం చేసే ఆర్థికవేత్త మాథియాస్ డోప్కే తెలిపిన వివరాల ప్రకారం జనన రేటు తగ్గుదల అనేది కొన్ని సంపన్న దేశాలు, దేశంలోని సంపన్న కుటుంబాలకు మాత్రమే పరిమితం కాలేదు. చైనా, భారత్, బ్రెజిల్, మెక్సికోతో సహా 15 పెద్ద ఆర్థిక వ్యవస్థలలో జనన రేటు 2.1 కంటే తక్కువగా ఉంది. ఇందులో అమెరికా వంటి సంపన్న దేశాలు, ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన చైనా, భారత్ కూడా ఉన్నాయి. తక్కువ జనన రేటుతో సమస్యలివే.. తక్కువ జననాల రేటు కారణంగా వృద్ధుల సంఖ్య పెరుగుతున్నది. గతంలో జపాన్,ఇటలీలలో ఎక్కువ మంది వృద్ధులు ఉండేవారు. కానీ ఇప్పుడు బ్రెజిల్, మెక్సికో,థాయ్‌లాండ్ కూడా ఈ జాబితాలో చేరాయి. సైకాలజిస్టులు తెలిపిన వివరాల ప్రకారం యువతకు సృజనాత్మకంగా ఆలోచించే శక్తి ఉంటుంది. యువత సమస్యను కొత్త మార్గంలో పరిష్కరిస్తుంది. యువత కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలు చేస్తుంటుంది. 2030 నాటికి, తూర్పు, ఆగ్నేయాసియా జనాభాలో సగం మంది 40 ఏళ్లు పైబడిన వారే ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా జననాల రేటు తగ్గుదల కారణంగా ఈ శతాబ్దం మధ్య నాటికి విద్యావంతులైన యువ కార్మికుల కొరత ఏర్పడుతుంది. జనం పిల్లలను కనాలని కోరుకోవడం లేదు. ఫలితంగా ప్రపంచంలో తక్కువ సంఖ్యలో యువత ఉంటుంది. ఫలితంగా దేశాభివృద్ధి కుంటుపడుతుంది. 1950-2021 మధ్య కాలంలో జననరేటు తగ్గుదల ఇలా.. దక్షిణ కొరియా: 86% చైనా: 81% థాయిలాండ్: 79% జపాన్: 77% ఇరాన్: 73% బ్రెజిల్: 72% కొలంబియా: 70% మెక్సికో: 70% పోలాండ్: 69% టర్కీ: 68% రష్యా: 67% సౌదీ అరేబియా: 67% మలేషియా: 66% మొరాకో: 66% ఉక్రెయిన్: 66% ఇటలీ: 65% కెనడా: 63% భారతదేశం: 63% పెరూ: 63% బంగ్లాదేశ్: 62% మయన్మార్: 62% స్పెయిన్: 62% వియత్నాం: 61% ఇండోనేషియా: 60% అల్జీరియా: 58% ఈజిప్ట్: 58% నేపాల్: 57% ఫిలిప్పీన్స్: 56% దక్షిణాఫ్రికా: 52% యునైటెడ్ స్టేట్స్: 52% ఫ్రాన్స్: 49% అర్జెంటీనా: 47% కెన్యా: 44% జర్మనీ: 43% యెమెన్: 42% ఘనా: 41% ఉజ్బెకిస్తాన్: 41% ఇరాక్: 40% యునైటెడ్ కింగ్డమ్: 39% పాకిస్తాన్: 37% నైజీరియా: 19% ఇది కూడా చదవండి: 17కు వ్యాపారం.. 19కి సెటిల్.. 22కు రిటైర్మెంట్.. అమెరికా కుర్రాడి సక్సెస్ స్టోరీ -
అక్కడ తగ్గుముఖం పట్టిన ఇళ్ల రిజిస్ట్రేషన్లు
న్యూఢిల్లీ: హైదరాబాద్ ప్రాంత పరిధిలో మే నెలలో ఇళ్ల రిజిస్ట్రేషన్లు 7 శాతం తగ్గాయి. మొత్తం 5,877 ఇళ్ల రిజిస్ట్రేషన్లను నమోదైనట్టు ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ వెల్లడించింది. హైదరాబాద్‌తోపాటు, మేడ్చల్ మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల పరిధిలో రిజిస్ట్రేషన్ల వివరాలు ఈ గణాంకాల్లో కలసి ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో నమోదైన రిజిస్ట్రేషన్లతో పోలిస్తే మే నెలలో 31 శాతం పెరిగాయి. కాకపోతే క్రితం ఏడాది మే నెలలో రిజిస్ట్రేషన్ల గణాంకాలతో పోలిస్తే 7 శాతం తగ్గాయి. మే నెలలో జరిగిన రిజిస్ట్రేషన్లు జరిగిన ఇళ్ల విలువ రూ.2,994 కోట్లుగా ఉంది. మొత్తం రిజిస్ట్రేషన్లలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో అత్యధికంగా 45 శాతం నమోదయ్యాయి. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లా పరిధిలోని రిజిస్ట్రేషన్ల వాటా 39 శాతంగా ఉంది. ఇక హైదరాబాద్ రిజిస్ట్రేషన్ల వాటా 16 శాతంగా ఉంది. రూ.25–50 లక్షల బడ్జెట్ మే నెలలో హైదరాబాద్ ప్రాంతంలో రిజిస్టర్ అయిన ఇళ్లలో ఎక్కువ శాతం రూ.25–50 లక్షల బడ్జెట్ మధ్య ఉన్నాయి. ఆ తర్వాత రూ.25 లక్షల్లోపు ఇళ్లు 17 శాతంగా ఉన్నాయి. రూ.కోటి రూపాయాలు అంతకుమించి విలువైన ఇళ్ల రిజిస్ట్రేషన్లు 9 శాతంగా ఉన్నాయి. క్రితం ఏడాది మే నెలలో ఈ విభాగం రిజిస్ట్రేషన్లు 6 శాతంతో పోలిస్తే 50 శాతం పెరిగాయి. 1,000–2,000 చదపు అడుగుల ప్రాపర్టీల వాటా 70 శాతంగా ఉంది. (ఇదీ చదవండి: భారతదేశంలో ఫస్ట్ బిలీనియర్ ఇతడే.. సంపద ఎంతో తెలుసా?) సగటు లావాదేవీ విలువ క్రితం ఏడాది ఇదే నెలతో పోలిస్తే 3 శాతం పెరిగింది. ‘‘హైదరాబాద్ నివాసిత మార్కెట్ ఆశావహంగా ఉంది. ఇళ్ల కొనుగోదారుల నుంచి బలమైన డిమాండ్ కనిపిస్తోంది. 1,000–2,000 చదరపు అడుగుల ఇళ్లకు ఎక్కువ డిమాండ్ ఉంది. ఆర్బీఐ వడ్డీ రేట్ల పెంపును నిలిపివేయడం కూడా సెంటిమెంట్‌ను బలపరిచింది’’అని నైట్‌ఫ్రాంక్ ఇండియా సీనియర్ బ్రాంచ్ డైరెక్టర్ శామ్సన్ ఆర్థర్ తెలిపారు. -
మేలో కొత్త వ్యాపార ప్రీమియం రూ.23,448 కోట్లు
న్యూఢిల్లీ: జీవిత బీమా కంపెనీల కొత్త వ్యాపార ప్రీమియం (కొత్త పాలసీల రూపంలో వచ్చేది) మే నెలలో 4.1 శాతం తగ్గి రూ.23,448 కోట్లకు పరిమితమైంది. 24 జీవిత బీమా కంపెనీలు క్రితం ఏడాది ఇదే నెలలో ఉమ్మడిగా రూ.24,480 కోట్లు ప్రీమియం ఆదాయం సంపాదించాయి. నూతన వ్యాపార ప్రీమియం పరంగా ఎల్ఐసీ 11.26 శాతం క్షీణతను నమోదు చేసింది. ఈ సంస్థకు నూతన పాలసీల రూపంలో మే నెలలో రూ.14,056 కోట్ల ప్రీమియం సమకూరింది. ఏడాది క్రితం ఇదే నెలలో ఎల్ఐసీకి వచ్చిన ఆదాయం రూ.15,840 కోట్లుగా ఉంది. ఈ గణాంకాలను బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ విడుదల చేసింది. ఎల్ఐసీ కాకుండా మిగిలిన 23 జీవిత బీమా సంస్థల ఉమ్మడి ప్రీమియం ఆదాయం 9 శాతం పెరిగి రూ.9,421 కోట్లుగా నమోదైంది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లో 24 జీవిత బీమా కంపెనీల నూతన వ్యాపార ప్రీమియం ఆదాయం రూ.36,043 కోట్లుగా ఉంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.42,420 కోట్లతో పోలిస్తే 15 శాతం తగ్గింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లో ఎల్ఐసీ నూతన వ్యాపార ప్రీమియం 28 శాతం క్షీణించి రూ.19,866 కోట్లకు పరిమితమైంది. -
ఈక్విటీ ఫండ్స్‌లోకి పెట్టుబడులు తగ్గుముఖం
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మే నెలలో పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించలేకపోయాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపించడంతో.. నికరంగా రూ.3,240 కోట్ల పెట్టుబడులు ఈక్విటీ పథకాల్లోకి వచ్చాయి. ఇది గడిచిన ఆరు నెలల కాలంలో నెలవారీ అత్యంత కనిష్ట స్థాయి ఈక్విటీ పెట్టుబడులు కావడం గమనించొచ్చు. ఈక్విటీ పథకాల్లోకి నికరంగా పెట్టుబడులు రావడం వరుసగా 27వ నెలలోనూ నమోదైంది. ఇక ఈ ఏడాది ఏప్రిల్ నెలలో వచ్చిన రూ.6,480 కోట్ల పెట్టుబడులతో పోలిస్తే సగానికి సగం తగ్గాయి. అంతకుముందు నెల మార్చిలోనూ రూ.20,534 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) మే నెలకు సంబంధించి గణాంకాలను శుక్రవారం విడుదల చేసింది. మొత్తం అన్ని రకాల మ్యూచువల్ ఫండ్స్‌లోకి మే నెలలో వచ్చిన నికర పెట్టుబడులు రూ.57,420 కోట్లుగా ఉన్నాయి. కానీ, ఏప్రిల్ నెలలో వచ్చిన రూ.1.21 లక్షల కోట్లతో పోలిస్తే 50 శాతానికి పైగా తగ్గాయి. 42 మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని ఉమ్మడి ఆస్తులు రూ.43.2 లక్షల కోట్లకు చేరాయి. ఏప్రిల్ చివరికి ఇవి రూ.41.62 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఆల్‌టైమ్ గరిష్టానికి సిప్ సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో రూ.14,749 కోట్ల పెట్టుబడులు మే నెలలో వచ్చాయి. ఇది నెలవారీ ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి కావడం గమనించొచ్చు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో వచ్చిన సిప్ పెట్టుబడులు రూ.13,728 కోట్లుగా ఉన్నాయి. అనిశ్చితుల్లోనూ పరిశ్రమ మంచి పనితీరు చూపించినట్టు యాంఫి సీఈవో ఎన్ వెంకటేశ్ పేర్కొన్నారు. ‘‘మార్కెట్లు పెరగడంతో లాభాల స్వీకరణకు తోడు, వేసవి విహార పర్యటనలు, విద్యా సంబంధిత ఖర్చులు మే నెలలో పెట్టుబడులు తగ్గడానికి కారణమై ఉండొచ్చు’’అని కోటక్ మహీంద్రా అస్సెట్ మేనేజ్మెంట్ డిజిటల్ బిజినెస్ సేల్స్ హెడ్ మనీష్ మెహతా తెలిపారు. లాభాల స్వీకరణకు తోడు, అమెరికా డెట్ సీలింగ్ పెంచడం వల్ల ఇన్వెస్టర్లు ఆందోళనతో ఈక్విటీల నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకుని ఉండొచ్చని మార్నింగ్‌స్టార్ రీసెర్చ్ మేనేజర్ మెల్విన్ శాంటారియా అభిప్రాయపడ్డారు. విభాగాల వారీగా.. ► లార్జ్‌క్యాప్ ఫండ్స్ రూ.1,362 కోట్లను ఆకర్షించాయి. ► ఫోకస్డ్ ఫండ్స్‌లోకి రూ.944 కోట్లు, ఈఎల్ఎస్ఎస్ పథకాల్లోకి రూ.504 కోట్ల చొప్పున వచ్చాయి. ► డెట్ పథకాలు రూ.46,000 కోట్లను ఆకర్షించాయి. ► డెట్ విభాగంలో లిక్విడ్ ఫండ్స్‌లోకి రూ.45,234 కోట్లు రాగా, హైబ్రిడ్ ఫండ్స్‌లోకి రూ.6,093 కోట్లు వచ్చాయి. ► ఓవర్‌నైట్ పథకాల నుంచి ఇన్వెస్టర్లు రూ.18,910 కోట్లను ఉపసంహరించుకున్నారు. ► ఆర్బిట్రేజ్ ఫండ్స్‌లోకి రూ.6,694 కోట్లు వచ్చాయి. ► బ్యాలన్స్డ్ హైబ్రిడ్, అగ్రెస్సివ్ హైబ్రిడ్ పథకాల నుంచి రూ.997 కోట్లు బయటకు వెళ్లాయి. ► గోల్డ్ ఎక్సే్ఛంజ్ ట్రేటెడ్ ఫండ్స్‌లోకి రూ.103 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. లార్జ్‌క్యాప్ కంపెనీలతో పోలిస్తే విలువల పరంగా తక్కువగా ఉండడంతో ఈ ఏడాది ఆరంభం నుంచి ఇన్వెస్టర్లు మిడ్, స్మాల్‌క్యాప్ ఫండ్స్‌ను ఎంచుకుంటున్నట్టు ఫయర్స్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ గోపాల్ కావలిరెడ్డి పేర్కొన్నారు. -
అకాల వర్షాలు.. తయారీ కంపెనీల అమ్మకాలకు స్పీడ్ బ్రేకర్!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉత్తరాది సహా పలు ప్రాంతాల్లో అకాల వర్షాలతో కూలింగ్ ఉత్పత్తులైన ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కూలర్ల అమ్మకాలు తగ్గినట్టు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. సాధారణంగా ఏప్రిల్, మే నెలలో వీటి అమ్మకాలు గణనీయంగా నమోదవుతుంటాయి. ఏప్రిల్, మే నెలలో ఇప్పటి వరకు వినియోగదారులు వర్షాల వల్ల తమ కొనుగోళ్లను వాయిదా వేసుకున్నట్టు పేర్కొన్నాయి. ఏప్రిల్‌లో అమ్మకాలు క్రితం ఏడాది ఇదే నెల విక్రయాలతో పోలిస్తే 15 శాతం తక్కువగా నమోదైనట్టు కొన్ని సంస్థలు వెల్లడించాయి. అయితే ఎండల తీవ్రత మళ్లీ పెరిగిన తర్వాత విక్రయాలు గాడిన పడతాయని ప్యానాసోనిక్, గోద్రేజ్, డైకిన్ తదితర సంస్థలు అంచనాతో ఉన్నాయి. ‘‘ఈ ఏడా ది ఏప్రిల్‌లో వాతావరణం చల్లగానే ఉంది. దీంతో గతేడాది ఏప్రిల్‌తో పోలిస్తే వృద్ధి తక్కువగానే ఉంది. ఇప్పటివరకు కస్టమర్లు ఎక్కువ మంది తమ కొనుగోళ్లను వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఇక్కడి నుంచి వేసవి కాలం ఇంకా ఎక్కువే మిగిలి ఉంది. కనుక అమ్మకాలు పుంజుకుంటాయని ఆశావహంగా ఉన్నాం’’అని ప్యానాసోనిక్ లైఫ్ సొల్యూషన్స్ ఇండియా బిజినెస్ హెడ్ (ఎయిర్ కండీషనర్లు) గౌరవ్ షా తెలిపారు. ఉత్తరాదిన అకాల వర్షాలతో ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, కూలర్ల అమ్మకాలపై ప్రభావం పడినట్టు కన్జ్యూమర్ ఎలక్ట్రా నిక్స్ అండ్ అప్లయన్సెస్ తయారీదారుల సంఘం (సీఈఏఎంఏ) సైతం తెలిపింది. తూర్పు, దక్షిణాది ప్రాంతాల్లో మాత్రం ఏప్రిల్ అమ్మకాల్లో మంచి వృద్ధి కనిపించినట్టు, పశ్చిమాదిన ఫ్లాట్‌గా ఉన్నట్టు సీ ఈఏఎంఏ ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగంజ వెల్లడించారు. మే నెల కీలకం.. ‘‘వేసవి సీజన్లో అమ్మకాల వృద్ధికి మే నెల కీలకం. అనుకున్న విధంగా ఉష్ణోగ్రతల్లో పెరుగుదల ఉంటే డిమాండ్ పుంజుకుంటుంది. అప్పుడు మార్కెట్లో నిల్వలు గణనీయంగా తగ్గుతాయి’’అని బ్రగంజ వివరించారు. ‘‘ఉష్ణోగ్రతల పెరుగుదలకు, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కూలర్ల అమ్మకాలకు మధ్య సంబంధం ఉంది. వేసవిలో దేశంలోచి చాలా ప్రాంతాల్లో వేడిగాలులు ఉంటాయనే అంచనాలు నెలకొన్నాయి. అలాగే, వేసవి సీజన్ కూడా ఎక్కువ రోజుల పాటు ఉండొచ్చని, జూన్‌లోనూ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చన్న అంచనాలున్నాయి’’అని గోద్రేజ్ అప్లయన్సెస్ బిజినెస్ హెడ్ కమల్ నంది తెలిపారు. ఎయిర్ కండీషనర్లు నేడు లగ్జరీ ఉత్పత్తి కంటే తప్పనిసరి అవసరంగా మారిపోయినట్టు చెప్పారు. అమ్మకాల్లో అత్యధిక వృద్ధి నమోదవుతున్న విభాగంగా ఉన్నట్టు తెలిపారు. తమ ఏసీ ఉత్పత్తుల అమ్మకాల్లోనూ గణనీయమైన వృద్ధి ఉన్నట్టు వెల్లడించారు. 1 నుంచి 2 టన్నుల పరిధిలో 5 స్టార్ ఏసీల అమ్మకాలు ఎక్కువగా ఉన్నట్టు చెప్పారు. రిఫ్రిజిరేటర్లలో ఫాస్ట్ఫ్రీ మోడళ్లు ఎక్కువగా అమ్ముడుపోతున్నట్టు పేర్కొన్నారు. అధిక వేడి వాతావరణం తిరిగి ఏర్పడగానే ఏసీల అమ్మకాలు పెరుగుతాయని, దీనిపై పెద్ద ఆందోళన లేదని డైకిన్ ఎయిర్ కండీషనింగ్ ఇండియా చైర్మన్, ఎండీ కన్వల్జీత్ జావా తెలిపారు. -
అనర్హత వేటుపడినప్పుడు రండి: సుప్రీం కోర్టు
ఢిల్లీ: ప్రజాప్రతినిధుల చట్టంలోని సెక్షన్ 8(3) రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన ఓ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఈ సెక్షన్ ప్రకారం.. ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే క్రిమినల్ కేసుల్లో దోషిగా తేలి.. రెండేళ్ల శిక్ష గనుక పడితే వాళ్ల సభ్యత్వం వెంటనే రద్దు అవుతుంది. రాహుల్ గాంధీపై అనర్హత వేటు నేపథ్యంతో ఈ సెక్షన్ గురించి దేశవ్యాప్త చర్చ కూడా నడిచింది. అయితే.. పీపుల్స్ రెప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్ 1951 సెక్షన్ 8(3) రాజ్యాంగ చెల్లుబాటును ప్రశ్నిస్తూ.. సామాజిక ఉద్యమకారుడు ఆభ మురళిధరన్ సుప్రీంలో పిటిషన్ వేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అనర్హత వేటు నేపథ్యంలోనే ఆయన ఈ పిటిషన్ వేయడం గమనార్హం. 1951 చట్టంలోని సెక్షన్ 8లోని సబ్ క్లాజ్ (1) ప్రకారం.. ఎంపీల అనర్హత కోసం నేరాల స్వభావాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయా నేరాలను వర్గీకరించారనే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఒక సెక్షన్‌లోని సబ్ క్లాసులు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయనే విషయాన్ని గమనించాలని ఆయన బెంచ్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే గురువారం ఈ పిటిషన్ చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ నరసింహ, జస్టిస్ పార్థీవాలాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ముందుకు వెళ్లింది. కానీ, ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించకుండానే బెంచ్ తిరస్కరించింది. ఈ పిటిషన్‌తో మీకు సంబంధం లేదు కదా. ఇది మీ మీద ఎలాంటి ప్రభావం చూపెడుతుంది?. మీకు శిక్ష పడినప్పుడు.. మీపై అనర్హత వేటు పడినప్పుడు అప్పుడు మా దగ్గరకు రండి. ఇప్పుడు మాత్రం పిటిషన్‌ను వెనక్కి తీసుకోండి.. లేదంటే మేమే డిస్మిస్ చేస్తాం. ఇలాంటి కేసుల్లో బాధిత వ్యక్తి పిటిషన్లను మాత్రమే మేం వింటాం అని బెంచ్ సున్నితంగా పిటిషనర్‌కు స్పష్టం చేసింది. దీంతో మురళీధరన్ తన పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు. ఇదీ చదవండి: గిరిజనులు వర్సెస్ గిరిజనేతరులతో అక్కడ అగ్గి -
టోకు ద్రవ్యోల్బణం @ 29 నెలల కనిష్టం
న్యూఢిల్లీ: టోకు ధరల ఆధారిత (డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం మార్చిలో 29 నెలల కనిష్టానికి దిగి వచ్చింది. 1.34 శాతానికి పరిమితమైంది. ఇంధనాలు, తయారీ ఉత్పత్తుల ధరలు తగ్గగా, ఆహార ఉత్పత్తుల భారం మాత్రం పెరిగింది. డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 3.85 శాతంగాను, గతేడాది మార్చిలో 14.63 శాతంగాను నమోదైంది. ఇది తగ్గడం వరుసగా పదో నెల. చివరిసారిగా 2020 అక్టోబర్‌లో డబ్ల్యూపీఐ ఆధారిత ధరల పెరుగుదల 1.31 శాతంగా నమోదైంది. ‘2023 మార్చిలో ద్రవ్యోల్బణం రేటు తగ్గడానికి ప్రధానంగా ప్రాథమిక లోహాలు, టెక్స్టైల్స్, ఆహారయేతర ఆర్టికల్స్, ఖనిజాలు, రబ్బర్.. ప్లాస్టిక్ ఉత్పత్తులు, క్రూడ్ పెట్రోలియం .. సహజ వాయువు, పేపర్ .. పేపర్ ఉత్పత్తుల ధరలు తగ్గుముఖం పట్టడమే కారణం‘ అని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సోమవారం తెలిపింది. తాజాగా ఫుడ్ బాస్కెట్లో గోధుమలు వంటి ధాన్యాల ధరలు నెమ్మదించగా.. కూరగాయలు, పండ్లు, పాలు, పప్పులు మొదలైన వాటి రేట్లు పెరిగాయని ఈక్విరస్ సెక్యూరిటీస్ ఒక నోట్లో పేర్కొంది. రిజర్వ్ బ్యాంక్ ఇప్పుడు కూడా వడ్డీ రేట్ల పెంపు విషయంలో నిర్ణయం తీసుకునే ముందు డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం స్థిరపడేలా చూడటంపైనా, వినియోగ ధరల ఆధారిత (సీపీఐ) ద్రవ్యోల్బణం మరింత తగ్గేలా చూడటంపైనా దృష్టి పెట్టాల్సి ఉంటుందని టీఐడబ్ల్యూ క్యాపిటల్ సీఈవో మోహిత్ రాల్హన్ అభిప్రాయపడ్డారు. ► ఆహార ఉత్పత్తుల రేట్ల పెరుగుదల ఫిబ్రవరిలో 3.81 శాతంగా ఉండగా, మార్చిలో 5.48 శాతంగా నమోదైంది. కూరగాయల ధరలు ఫిబ్రవరిలో 21.53 శాతం తగ్గగా (2022 ఫిబ్రవరి ధరతో పోల్చి), మార్చిలో ఈ తగ్గుదల రేటు 2.22 శాతంగానే ఉంది. ఉల్లి విషయంలో ఫిబ్రవరిలో 40.14 శాతం ధరలు తగ్గగా, మార్చిలో తగ్గుదల రేటు 36.83 శాతంగానే నమోదైంది. ► గోధుమల ధరలు 9.16 శాతం, పప్పుల రేట్లు 3.03 శాతం పెరిగాయి. -
డాయిష్ బ్యాంక్ 14% డౌన్
ఫ్రాంక్ఫర్ట్: అంతర్జాతీయంగా బ్యాంకింగ్ వ్యవస్థ సంక్షోభంపై ఆందోళన నెలకొన్న నేపథ్యంలో జర్మనీకి చెందిన డాయిష్ బ్యాంక్ షేర్లపైనా ప్రభావం పడింది. బ్యాంకు షేర్లు శుక్రవారం ఒక దశలో 14 శాతం క్షీణించాయి. ఆ తర్వాత కొంత కోలుకుని సుమారు 9 శాతం క్షీణతతో 8.52 యూరోల వద్ద ట్రేడయ్యాయి. బాండ్లను బీమా చేసేందుకయ్యే వ్యయాలు పెరిగిపోవడం డాయిష్ బ్యాంక్ పరిస్థితిపై ఆందోళనకు కారణమైనట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇటీవల స్విస్ బ్యాంక్ క్రెడిట్ సూసీ పతనానికి ముందు కూడా ఇలాంటి పరిణామమే చోటు చేసుకోవడం గమనార్హం. అయితే డాయిష్ బ్యాంక్ మరో క్రెడిట్ సూసీ కావచ్చన్న ఆందోళనలను జర్మనీ చాన్స్‌లర్ ఒలాఫ్ షోల్జ్ తోసిపుచ్చారు. బ్యాంక్ పటిష్టంగానే ఉందని స్పష్టం చేశారు. -
ఏడు శాతం కంటే తక్కువే.. మరింత తగ్గే అవకాశం
ముంబై: జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) తాజా అంచనా 7 శాతం కంటే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) వృద్ధి రేటు మరింత తగ్గే అవకాశం ఉందని ఇండియా రేటింగ్స్ తన తాజా అంచనాల్లో పేర్కొంది. చివరి త్రైమాసికంలో (జనవరి–మార్చి) వృద్ధి రేటు దాదాపు 4 శాతంగా ఉంటుందని కూడా పేర్కొంది. భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 2022–23 మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) 13.2 శాతంగా నమోదుకాగా, రెండవ త్రైమాసికంలో 6.3 శాతంగా ఉంది. మూడవ తైమాసికంలో (అక్టోబర్-డిసెంబర్) ఈ రేటు అంచనాలకన్నా తగ్గి 4.4 శాతంగా నమోదయ్యింది. అయితే మొత్తం ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7 శాతం నమోదవుతుందని రెండవ ముందస్తు అంచనాల్లో ఎన్ఎస్ఓ పేర్కొంది. ఈ స్థాయి వృద్ధి రేటు నమోదుకావాలంటే నాల్గవ త్రైమాసికంలో కనీసం 4.1 శాతం వృద్ధి రేటు నమోదుకావాల్సి ఉంటుంది. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కూడా 2022–23లో వృద్ధి రేటు 6.8 శాతంగానే అంచనావేస్తోంది. ఈ నేపథ్యంలో ఇండియా రేటింగ్స్ విశ్లేషకులు పరాస్ జస్రాయ్ చేసిన విశ్లేషణల్లో కొన్ని ముఖ్యాంశాలు.. ► వృద్ధి పురోగతికి పలు అవరోధాలు ఉన్నాయి. డిమాండ్ ఊపందుకోవడం లేదు. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో ఎగుమతుల్లో పురోగతి లేదు. రుణ వృద్ధి కఠిన ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోంది. ► ఇక ఉత్తరాదిలో వేసవి ఫిబ్రవరిలోనే తీవ్రంగా ఉంది. ఇది గోధుమ ఉత్పత్తిపై ఆందోళనలను సృష్టిస్తోంది. మార్చి– మే మధ్య వేసవి తీవ్రత మరింత ఉండే అవకాశం ఉందని వాతావారణ శాఖ హెచ్చరించడం కూడా ఇక్కడ పరిశీలనలోకి తీసుకోవాల్సిన అంశం. ► నాల్గవ త్రైమాసికంలో వ్యవసాయ రంగం వృద్ధి రేటు కనీసం 4.3 శాతం నమోదవుతుందన్న అంచనాలను వేసవి తీవ్రత విఘాతం కలిగించవచ్చు. ► ఇక ద్రవ్యోల్బణం తీవ్రత గ్రామీణ వినియోగ డిమాండ్‌పై ప్రభావితం చూపే వీలుంది. మహమ్మారి సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో పడిపోయిన డిమాండ్ ఇంకా నత్తనడకనే సాగుతోంది. ► మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) మిగుల్లో ఉంది. అయితే ఇప్పుడు మళ్లీ లిక్విడిటీ తగ్గుతుండడం మరో ఆందోళకరమైన అంశం. జనవరిలో బలమైన క్రెడిట్ డిమాండ్ కారణంగా బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ నాలుగు నెలల కనిష్టం 0.43 శాతానికి తగ్గింది. 2022 డిసెంబర్లో ఇది 0.53 శాతంగా ఉంది. -
మ్యూచువల్ ఫండ్స్‌లోనే తక్కువ ఫిర్యాదులు
ముంబై: భారతీయ మ్యచువల్ ఫండ్స్ పరిశ్రమ మొత్తం ఫైనాన్షియల్ మార్కెట్ వ్యవస్థలోనే అతి తక్కువ ఫిర్యాదులతో మెరుగైన స్థానంలో ఉందని మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) ప్రకటించింది. పరిశమ్రపై ఉన్నవి నిరాధార దూషణలే తప్పించి, వాస్తవాలు వేరని పేర్కొంది. భారత మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ ఎంతో పారదర్శకతతో, సమగ్ర సమాచారాన్ని వెల్లడిస్తున్నట్టు తెలిపింది. నెలవారీ ఫండ్స్ పెట్టుబడుల సమాచారం వెల్లడించడం ఆధారంగా 26 దేశాల్లో భారత్‌కు మొదటిస్థానాన్ని మార్నింగ్‌స్టార్ ఇచ్చినట్టు యాంఫి సీఈవో ఎన్ఎస్ వెంకటేశ్ ప్రకటించారు. యాంఫి ఇన్వెస్టర్ల నుంచి, పంపిణీదారుల నుంచి నేరుగా, సెబీ ద్వారానూ ఫిర్యాదులు అందుకుంటుందని వివరించారు. ఇలా వచ్చే ఫిర్యాదులను సాధారణమైన, తీవ్రమైన అని రెండు రకాలుగా వర్గీకరిస్తామని చెప్పారు. ‘‘డివిడెండ్ రాకపోవడం, అకౌంట్ స్టేట్మెంట్, కమీషన్ రాకపోవడం, రికార్డ్ అప్డేట్ చేయకపోవం సాధారణ ఫిర్యాదులు. దరఖాస్తు ఫారాల్లో అక్రమాలకు పాల్పడడం, మార్కెట్ యూనిట్లు, ఫండ్స్‌లో అవకతవకలకు పాల్పడడం, పంపిణీదారుల సేవల్లో లోపాలను తీవ్రమైనవిగా పరిగణిస్తాం’’అని వివరించారు. 2017 ఏప్రిల్ నుంచి 2022 సెప్టెంబర్ మధ్య కేవలం 5,330 ఫిర్యాదులు వచ్చినట్టు వెల్లడించారు. ఇదే కాలంలో ఫండ్స్ నిర్వహణలోని ఆస్తులు రూ.40 లక్షల కోట్లకు చేరాయన్నారు. బ్యాంకింగ్, క్రెడిట్ కార్డులు, బీమా, స్టాక్స్‌లో ఫిర్యాదులు చాలా ఎక్కువగా ఉంటాయన్నారు. -
హిందూ వృద్ధి రేటుకు దగ్గర్లో భారత్
న్యూఢిల్లీ: ప్రైవేట్ పెట్టుబడుల తగ్గుదల, వడ్డీ రేట్ల పెరుగుదల, అంతర్జాతీయంగా వృద్ధి మందగమన పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భారత్ ‘‘హిందూ వృద్ధి రేటుకు ప్రమాదకర స్థాయిలో చాలా దగ్గరగా’’ ఉందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ హెచ్చరించారు. సీక్వెన్షియల్‌గా త్రైమాసికాలవారీ వృద్ధి నెమ్మదిస్తుండటం ఆందోళన కలిగించే అంశమని ఆయన ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. 1950ల నుంచి 1980ల దాకా అత్యంత తక్కువ స్థాయిలో నమోదైన వృద్ధి రేటును హిందూ వృద్ధి రేటుగా వ్యవహరిస్తారు. ఇది సగటున 4 శాతంగా ఉండేది. 1978లో భారతీయ ఆర్థికవేత్త రాజ్ కృష్ణ ఉపయోగించిన ఈ పదం ఆ తర్వాత నుంచి అత్యంత నెమ్మదైన వృద్ధి రేటుకు పర్యాయపదంగా మారింది. జాతీయ గణాంకాల కార్యాలయం గత నెల విడుదల చేసిన గణాంకాల ప్రకారం..ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 13.2 శాతంగా ఉన్న స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు, రెండో క్వార్టర్లో 6.3 శాతానికి, తర్వాత మూడో త్రైమాసికంలో 4.4 శాతానికి పడిపోయింది. ఈ నేపథ్యంలో రాజన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘‘గత జీడీపీ గణాంకాలను తిరిగి ఎగువముఖంగా సవరించే అవకాశం ఉందని ఆశావహులు ఆశిస్తుండవచ్చు. కానీ సీక్వెన్షియల్ మందగమనం ఆందోళనకరంగా ఉందని నేను భావిస్తున్నాను. ప్రైవేట్ రంగం పెట్టుబడులు పెట్టేందుకు ఇష్టపడటం లేదు .. ఆర్బీఐ ఇప్పటికీ వడ్డీ రేట్లను పెంచుతూనే ఉంది .. ఈ ఏడాది ప్రపంచ వృద్ధి మందగించే అవకాశాలు ఉన్నాయి. అలాంటప్పుడు వృద్ధికి అవసరమైన తోడ్పాటు ఎక్కణ్నుంచి లభిస్తుందన్నది తెలియడం లేదు’’ అని రాజన్ పేర్కొన్నారు. తన ఆందోళనకు బలమైన కారణాలే ఉన్నాయని ఆయన చెప్పారు. నాలుగో త్రైమాసికంలో వృద్ధి మరింత నెమ్మదించి 4.2 శాతానికే పరిమితం కావచ్చని ఆర్బీఐ అంచనా వేస్తోందని తెలిపారు. ప్రస్తుతం అక్టోబర్–డిసెంబర్ త్రైమాసిక వృద్ధి రేటు దాదాపు మూడేళ్ల క్రితం నాటి కరోనా పూర్వపు 3.7 శాతం స్థాయికి దగ్గర్లో నమోదైందని పేర్కొన్నారు. ‘‘హిందూ వృద్ధి రేటుకు ఇది చాలా ప్రమాదకరమైన స్థాయిలో, అత్యంత దగ్గరగా ఉంది!! మనం ఇంకా మెరుగ్గా వృద్ధి సాధించాలి’’ అని ఆయన చెప్పారు. ఆశావహంగా సర్వీసులు.. ప్రభుత్వం తన వంతుగా మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెడుతోందని రాజన్ చెప్పారు. తయారీ రంగానికి ఊతమిచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలతో ఇంకా ఫలితాలు రావాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సర్వీసుల రంగం ఆశావహంగా కనిపిస్తోందని రాజన్ చెప్పారు. చాలా మటుకు సంపన్న దేశాలు సేవల ఆధారితమైనవే ఉంటున్నాయని.. భారీ ఎకానమీగా ఎదగాలంటే తయారీపైనే ఆధారపడాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. సర్వీసులతో .. నిర్మాణ, రవాణా, టూరిజం, రిటైల్, ఆతిథ్యం తదితర రంగాల్లో ఒక మోస్తరు నైపుణ్యాలు సరిపోయే ఉద్యోగాలను భారీగా కల్పించేందుకు వీలవుతుందని రాజన్ తెలిపారు. అదానీ గ్రూప్–హిండెన్‌బర్గ్ రీసెర్చ్ వివాదంపై స్పందిస్తూ ప్రైవేట్ కంపెనీలపై నిఘాను తీవ్రంగా పెంచాల్సిన అవసరాన్ని ఇది సూచిస్తుందని తాను భావించడం లేదన్నారు. తమ పని తాము చేసేలా నియంత్రణ సంస్థలను ప్రోత్సహిస్తూనే అటు వ్యాపార సంస్థలు .. ప్రభుత్వాల మధ్య లోపాయికారీ సంబంధాలను తగ్గించుకుంటే ఇలాంటివి తలెత్తడం తగ్గుతుందని ఆయన చెప్పారు. ఖాతాల్లో అవకతవకలు ఉన్నాయంటూ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలతో అదానీ గ్రూప్ సంస్థల షేర్లు కుప్పకూలిన సంగతి తెలిసిందే. -
ఉగ్రవాదం, తీవ్రవాదం 80% తగ్గాయి: అమిత్ షా
నాగపూర్: నరేంద్ర మోదీ హయాంలో కశ్మీర్లో ఉగ్రవాదం, ఈశాన్యంలో∙వామపక్ష తీవ్రవాదం 80 శాతం దాకా తగ్గుముఖం పట్టాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. శనివారం ఇక్కడ మరాఠా వార్తా లోక్మత్ స్వర్ణోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మోదీకి ముందు దాకా దేశం పలు అంతర్గత భద్రతా సవాళ్లతో సతమతమవుతూ ఉండేదన్నారు. అలాంటిది గతేడాది కశ్మీర్ లోయను ఏకంగా 1.8 కోట్ల మంది పర్యాటకులు సందర్శించడం గొప్ప ఘనత అని అభిప్రాయపడ్డారు. ‘‘అంతేగాక గత 70 ఏళ్లలో మొత్తం కలిపి కశ్మీర్‌కు రూ.12 వేల కోట్ల పెట్టుబడులు వస్తే గత మూడేళ్లలోనే మరో రూ.12 వేల కోట్ల పెట్టుబడులను మోదీ ప్రభుత్వం సాధించింది. పైగా కశ్మీర్లో ప్రతి ఇంటికీ నల్లా నీరు, కరెంటు అందించాం. ఇక ఈశాన్య రాష్ట్రాల్లో కూడా వామపక్ష తీవ్రవాదం పూర్తిగా అదుపులోకి వచ్చింది. 60 శాతం ప్రాంతాల్లో సాయుధ దళాల (ప్రత్యేక అధికారాల) చట్టాన్ని రద్దు చేశాం కూడా. రక్షణ రంగంలో దేశం స్వయంసమృద్ధంగా మారుతోంది. ఉపగ్రహ ప్రయోగాల్లో మనమెంతగా దూసుకెళ్తున్నదీ ప్రపంచమంతా చూస్తోంది. మన స్టార్టప్‌లు దుమ్ము రేపుతున్నాయి. ఇలా అన్ని రంగాల్లోనూ భారత్‌లో ప్రపంచంలో అత్యుత్తమ స్థానంలో చూడాలన్న ప్రధాని మోదీ ఆశయం నెరవేరేందుకు ఇంకెంతో దూరం లేదు’’ అన్నారు. అందుకు తగ్గట్టుగా వచ్చే పాతికేళ్ల అమృత కాలంలో పలు లక్ష్యాలు పెట్టుకుని ముందుకెళ్తున్నట్టు వివరించారు. -
కళ తప్పిన గోల్డ్ ఈటీఎఫ్‌లు
న్యూఢిల్లీ: గోల్డ్ ఎక్సేంజెడ్ ట్రేడెడ్ ఫండ్స్ గతేడాది పెద్దగా పెట్టుబడులను ఆకర్షించలేకపోయాయి. అంతక్రితం ఏడాదితో పోలిస్తే 2022లో గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి పెట్టుబడులు 90 శాతం తగ్గిపోయి, రూ.459 కోట్లకు పరిమితమయ్యాయి. 2021లో గోల్డ్ ఈటీఎఫ్ పథకాలు రూ.4,814 కోట్లను ఆకర్షించగా, 2020లో రూ.6,657 కోట్ల పెట్టుబడులు వీటిల్లోకి రావడం గమనార్హం. అయితే గతేడాది గోల్డ్ ఈటీఎఫ్‌ల నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం/పెట్టుబడులు), ఫోలియోలు పెరగడాన్ని గమనించొచ్చు. ఒక ఇన్వెస్టర్ పెట్టుబడికి కేటాయించే గుర్తింపునే ఫోలియోగా చెబుతారు. 2021 చివరి నాటికి గోల్డ్ ఈటీఎఫ్‌ల నిర్వహణలోని ఆస్తుల విలువ రూ.18,405 కోట్లుగా ఉంటే, 2022 డిసెంబర్ చివరికి 16 శాతం వృద్ధితో రూ.21,455 కోట్లకు చేరాయి. గోల్డ్ ఈటీఎఫ్ ఫోలియోల సంఖ్య గతేడాది 14.29 లక్షలు పెరగడంతో మొత్తం ఫోలియోల సంఖ్య 46.28 లక్షలకు చేరింది. గోల్డ్ ఈటీఎఫ్‌ల పట్ల ఇన్వెస్టర్లలో విశ్వాసానికి ఇది నిదర్శనమని నిపుణులు పేర్కొంటున్నారు. ‘‘బంగారం ధరలు పెరగడంతో ఇన్వెస్టర్లు పెట్టుబడులకు వెనక్కి తగ్గి ఉండొచ్చు. వడ్డీ రేట్లు పెరుగుదల, ద్రవ్యోల్బణం ఒత్తిళ్లతో ఈ ఏడాది ఎక్కువ భాగం ఆర్థిక వ్యవస్థ సవాళ్లను చూడొచ్చు’’అని మార్నింగ్ స్టార్ ఇండియా సీనియర్ రీసెర్చ్ మేనేజర్ కవితా కృష్ణన్ పేర్కొన్నారు. ఇక గతేడాది గోల్డ్ ఈటీఎఫ్‌ల కంటే ఇన్వెస్టర్లు ఈక్విటీలవైపు మొగ్గు చూపించారు. ఈక్విటీ పథకాలు గతేడాది రూ.1.6 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం దీన్నే తెలియజేస్తోంది. అయినప్పటికీ బంగారం ఈటీఎఫ్‌లు నికరంగా పెట్టుబడులను ఆకర్షించడం సానుకూలం. ఇక ముందు ఏంటి పరిస్థితి? మార్కెట్లలో అస్థిరతలు కొనసాగితే ఇక ముందూ గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి మరిన్ని పెట్టుబడులు వస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. గేమ్ ఆధారిత సేవింగ్స్ యాప్ ‘ఫెల్లో’ సీఈవో మనీష్మర్యాద మాత్రం సార్వభౌమ బంగారం బాండ్ల (ఎస్‌జీబీలు) మాదిరే గోల్డ్ ఈటీఎఫ్‌లకు సైతం పన్ను ప్రయోజనం అవసరమన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘‘మార్కెట్లో ఎస్‌జీబీల గురించే చర్చ నడుస్తోంది. గోల్డ్ ఈటీఎఫ్‌ల కంటే ఎస్‌జీబీల గురించే ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఎస్జీబీలకు పన్ను ప్రయోజనం ఉండడమే. ఎస్‌జీబీల మాదిరే గోల్డ్ ఈటీఎఫ్‌లు వృద్ధి చెందాలంటే, దీర్ఘకాల మూలధన లాభాల పన్నును సగానికి తగ్గించాలి. ఇది మంచి సానుకూల చర్య అవుతుంది. బంగారంలో దీర్ఘకాలం కోసమే ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెడుతుంటారు. కనుక గోల్డ్ ఈటీఎఫ్‌లను ఈఎల్ఎస్ఎస్ మాదిరి పన్ను ఆదా సాధనం కింద వర్గీకరించడం వల్ల ఎక్కువ మంది ఇందులో ఇన్వెస్ట్ చేస్తారు. ఇదొక ప్రధాన పెట్టుబడి సాధనంగా మారుతుంది’’అని మర్యాద చెప్పారు. -
ఉజ్వల లబ్ధిదారులకు రూ.500కే సిలిండర్
అల్వార్(రాజస్థాన్): కేంద్ర ప్రభుత్వ ఉజ్వల పథకం కింద లబ్ధిపొందే రాష్ట్రంలోని పేదలకు రూ.500కే వంటగ్యాస్ సిలిండర్ అందిస్తామని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రకటించారు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఏడాదికి 12 సిలిండర్లు ఈ ధరకే అందిస్తారు. ‘ ఉజ్వల పథకం కింద ప్రధాని మోదీ పేదలకు ఉచితంగా ఎల్పీజీ కనెక్షన్లు అయితే ఇచ్చారుగానీ ధరలు రూ.400 నుంచి ఏకంగా రూ.1,040కి పెరగడంతో ఎవరూ కొత్తగా సిలిండర్లు బుక్‌చేయట్లేరు. రాష్ట్రంలో ఇకపై ఉజ్వల పథకం లబ్దిదారులైన దారిద్రరేఖకు దిగువన ఉన్న పేదలకు రూ.500కే వంటగ్యాస్ సిలిండర్ అందిస్తాం. ఈ ధరకే ఏడాదికి 12 సిలిండర్లు ఇస్తాం’ అని సోమవారం గెహ్లాట్ చెప్పారు. సోమవారం రాజస్థాన్‌లోని అల్వార్‌లో జరుగుతున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో రాహుల్‌తోపాటు గెహ్లాట్, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే పాల్గొన్నారు. -
ధరల మంట.. పరిశ్రమలకు సెగ!
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి బుధవారం వెలువడిన అధికారిక గణాంకాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. రిటైల్ ద్రవ్యోల్బణం వరుసగా తొమ్మిదవ నెల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి కేంద్రం నిర్దేశిస్తున్న ఆరు శాతం వద్ద కట్టడి పరిధి దాటి నమోదయ్యింది. పైగా ఆగస్టులో 7% ఉంటే, సెప్టెంబర్‌లో 7.41%కి (2021 ఇదే నెల ధరలతో పోల్చి) పెరిగింది. గత ఏడాది సెప్టెంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.35 శాతమే. ఇక ఆగస్టులో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో వృద్ధిలేకపోగా 0.8 శాతం క్షీణించింది. సామాన్యునిపై ధరల భారం రిటైల్ ద్రవ్యోల్బణ బాస్కెట్లో కీలక ఆహార విభాగం ధరలు సెప్టెంబర్‌లో తీవ్రంగా పెరిగాయి. మొత్తంగా రిటైల్ ద్రవ్యోల్బణం ఐదు నెలల గరిష్టం... 7.41 శాతం పెరగ్గా, ఒక్క ఫుడ్ బాస్కెట్ ఇన్ఫ్లెషన్ 8.60 ( ఆగస్టులో 7.62 శాతం) శాతానికి చేరింది. కేంద్రం నిర్దేశిస్తున్న 6 శాతం రిటైల్ ద్రవ్యోల్బణం హద్దు మీరి పెరిగిన నేపథ్యంలో ఈ ఏడాది మే నుంచి వరుసగా నాలుగుసార్లు ఆర్బీఐ రెపోరేటు పెంచింది. మేలో 4 శాతంగా ఉన్న రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు) ఈ నాలుగు దఫాల్లో 190 బేసిస్ పాయింట్లు పెరిగి, ఏకంగా 5.9 శాతానికి (2019 ఏప్రిల్ తర్వాత) చేరింది. మరింత పెరగవచ్చనీ ఆర్బీఐ సంకేతాలు ఇచ్చింది. రిటైల్ ద్రవ్యోల్బణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సగటు అంచనా 6.7 శాతంకాగా, క్యూ2 , క్యూ3, క్యూ4ల్లో వరుసగా 7.1 శాతం, 6.5%, 5.8 శాతంగా ఉంటుందని ఆర్బీఐ భావిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఈ రేటు 5.1 శాతానికి దిగివస్తుందని అంచనావేసింది. అక్టోబర్, నవంబర్‌ల్లోనూ ద్రవ్యోల్బణం ఎగువబాటనే పయనిస్తే, తదుపరి పాలసీ సమీక్ష డిసెంబర్ 5 నుంచి 7 సమయంలో ఆర్బీఐ రెపో రేటును మరో అరశాతం పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. గడచిన తొమ్మిది నెలలుగా ద్రవ్యోల్బణం కట్టడిలో ఎందుకు లేదన్న అంశంపై కేంద్రానికి ఆర్బీఐ త్వరలో ఒక నివేదిక సమర్పిస్తుందని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. 18 నెలల కనిష్టానికి పారిశ్రామిక రంగం ఇక ఆగస్టులో పారిశ్రామిక ఉత్పత్తి గడచిన 18 నెలల్లో ఎన్నడూ లేని తీవ్ర పతన స్థాయి 0.8 శాతం క్షీణతను చూసింది. 2021 ఫిబ్రవరిలో ఐఐపీలో 3.2 శాతం క్షీణత నమోదయ్యింది. తాజా సమీక్షా నెల్లో సూచీలో దాదాపు 60 శాతం వెయిటేజ్ ఉన్న తయారీ రంగం కూడా 0.7% క్షీణతను (2021 ఇదే నెలతో పోల్చి) చూసింది. గత ఏడాది ఇదే కాలంలో తయారీ ఉత్పత్తి వృద్ధి రేటు 11.1%. మైనింగ్ ఉత్పాదకత 23.3 శాతం వృద్ధి నుంచి 3.9% క్షీణతలోకి జారింది. విద్యుత్ రంగం ఉత్పత్తి వృద్ధి రేటు 16% నుంచి 1.4 శాతానికి పడిపోయింది. క్యాపిటల్ గూడ్స్ విభాగంలో వృద్ధి రేటు 20% నుంచి 5%కి పడిపోయింది. -
ఎస్బీఐ లాభం @ రూ. 6,068 కోట్లు
ముంబై: ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్‌బ్యాంక్(ఎస్బీఐ) ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 7 శాతం క్షీణించి రూ. 6,068 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 6,504 కోట్లు ఆర్జించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన సైతం నికర లాభం రూ. 55 కోట్లు తగ్గి రూ. 7,325 కోట్లను తాకింది. మార్క్ టు మార్కెట్ నష్టాలు ప్రభావం చూపాయి. అయితే బిజినెస్, లాభదాయకత, ఆస్తుల(రుణాలు) నాణ్యతలో బ్యాంక్ పటిష్ట పనితీరు చూపినట్లు ఎస్బీఐ చైర్మన్ దినేష్ ఖారా పేర్కొన్నారు. బాండ్ల ఈల్డ్స్ బలపడటంతో ఎంటూఎం నష్టాలు పెరగడం లాభాలను దెబ్బతీసినట్లు పేర్కొన్నారు. పెట్టుబడులతో పోలిస్తే ఫైనాన్షియల్ ఆస్తుల విలువ క్షీణించినప్పుడు ఎంటూఎం నష్టాలు వాటిల్లే సంగతి తెలిసిందే. మార్జిన్లు ప్లస్: సమీక్షా కాలంలో ఎస్బీఐ నికర వడ్డీ ఆదాయం 13% పుంజుకుని రూ. 31,196 కోట్లను తాకింది. దేశీయంగా నికర వడ్డీ మార్జిన్లు 3.15 శాతం నుంచి 3.23 శాతానికి మెరుగుపడ్డాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 5.32 శాతం నుంచి 3.91 శాతానికి దిగివచ్చాయి. నికర ఎన్పీఏలు సైతం 1.77% నుంచి 1 శాతానికి తగ్గాయి. భవిష్యత్‌లోనూ రుణ నాణ్యతలో సవాళ్లు ఎదురుకాకపోవచ్చని ఖారా అంచనా వేశారు. తాజా స్లిప్పేజీలు రూ. 9,740 కోట్లుకాగా.. రికవరీ, అప్గ్రెడేషన్లు రూ. 5,208 కోట్లుగా నమోదయ్యాయి. రుణ నష్టాల కేటాయింపులు 15%పైగా తగ్గి రూ. 4,268 కోట్లకు చేరాయి. -
నష్టాల్లోనే వొడాఫోన్ ఐడియా
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో మొబైల్ సేవల కంపెనీ వొడాఫోన్ ఐడియా నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర నష్టం నామమాత్రంగా తగ్గి రూ. 7,297 కోట్లకు చేరాయి. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 7,319 కోట్ల నికర నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం 14 శాతం పుంజుకుని రూ. 10,410 కోట్లను తాకింది. ప్రస్తుత సమీక్షా కాలంలో వినియోగదారుపై సగటు ఆదాయం(ఏఆర్పీయూ) రూ. 104 నుంచి రూ. 128కు మెరుగుపడింది. టారిఫ్‌ల పెంపు ఇందుకు సహకరించింది. మార్చి నుంచి జూన్‌కల్లా మొత్తం వినియోగదారుల సంఖ్య 24.38 కోట్ల నుంచి 24.04 కోట్లకు వెనకడుగు వేసింది. అయితే 10 లక్షల మంది 4జీ కస్టమర్లు జత కలవడంతో వీరి సంఖ్య 11.9 కోట్లకు చేరినట్లు వెల్లడించింది. కొత్త చైర్మన్.. ఈ నెల(ఆగస్ట్) 19 నుంచి చైర్మన్‌గా రవీందర్ టక్కర్ బాధ్యతలు చేపట్టనున్నట్లు వొడాఫోన్ ఐడియా పేర్కొంది. ఈ నెల 18కల్లా హిమాన్షు కపానియా నాన్‌ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు కంపెనీ వెల్లడించింది. అయితే నాన్‌ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కొనసాగనున్నట్లు తెలియజేసింది. వొడాఫోన్ గ్రూప్ నామినీ అయిన టక్కర్ ప్రస్తుతం కంపెనీ ఎండీ, సీఈవోగా వ్యవహరిస్తున్నారు. టెలికం పరిశ్రమలో మూడు దశాబ్దాల నుంచి విధులు నిర్వహిస్తున్నారు. కీలక మార్కెట్లలో 5జీ సేవలను అందించేందుకు తగిన స్పెక్ట్రమ్‌ను తాజాగా సొంతం చేసుకున్నట్లు సీఈవో టక్కర్ వెల్లడించారు. ఫలితాల నేపథ్యంలో వొడాఫోన్ ఐడియా షేరు ఎన్ఎస్ఈలో 3.2 శాతం క్షీణించి రూ. 9.10 వద్ద ముగిసింది. -
మూడో నెలా ‘సేవలు’ పేలవం!
న్యూఢిల్లీ: కోవిడ్–19 సెకండ్‌వేవ్ నేపథ్యంలో సేవల రంగం వరుసగా మూడవనెల జూలైలోనూ క్షీణతలోనే ఉంది. ఇండియా సర్వీసెస్ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ జూలైలో 45.4గా నమోదయ్యింది. జూన్‌లో ఇది 41.2 వద్ద ఉంది. అయితే సూచీ 50పైన ఉంటేనే దానిని వృద్ధి ధోరణిగా పరిగణిస్తారు. సేవల రంగంలో వ్యాపార క్రియాశీలత, కొత్త ఆర్డర్లు, ఉపాధి కల్పన మరింత భారీగా పడిపోయినట్లు నెలవారీ సర్వే వెల్లడించినట్లు ఐహెచ్ఎస్ మార్కిట్ ఎకనమిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పోలియానా డీ లిమా పేర్కొన్నారు. రాబోయే ఏడాది ఉత్పత్తికి సంబంధించి పరిశ్రమలు నిరాశాజనకంగా ఉండడం మరో అంశం. ఈ తరహా నిరాశావాద ధోరణి ఏడాదిలో ఇదే తొలిసారి. మహమ్మారి కనుమరుగవడంపై అనిశ్చితి, ద్రవ్యోల్బణం ఒత్తిడులు, ఆర్థిక ఇబ్బందులు వంటి అంశాలు జూలైలో వ్యాపార విశ్వాసాన్ని దెబ్బతీసినట్లు డీ లిమా పేర్కొన్నారు. ఈ రంగంలో వరుసగా ఎనిమిది నెల జూలైలోనూ ఉపాధి అవకాశాలు క్షీణతలోనే ఉన్నాయి. మొత్తం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో మెజారిటీ వాటా సేవల రంగానిదే. సేవలు, తయారీ కలిపినా మైనస్సే... మరోవైపు సేవలు, తయారీ కలిపిన కాంపోజిట్ పీఎంఐ అవుట్‌పుట్ ఇండెక్స్ వరుసగా మూడవనెలా క్షీణతలోనే కొనసాగింది. జూన్‌లో 43.1 వద్ద ఇండెక్స్ ఉంటే, జూలైలో 49.2 వద్దకు చేరింది. ఇండెక్స్ కొంత పెరగడమే ఇక్కడ ఊరట. 50కి పైన సూచీ వస్తేనే కాంపోజిట్ ఇండెక్స్ వృద్ధిలోకి మారినట్లు భావించాల్సి ఉంటుంది. ముడి పదార్థాల ధరల తీవ్రత సూచీలపై పడుతున్నట్లు సర్వేలో తెలుస్తోంది. జూలైలో ఒక్క తయారీ రంగం మాత్రం క్షీణత నుంచి బయటపడ్డం కొంతలో కొంత ఊరటనిస్తున్న అంశం. జూన్‌లో 48.1 వద్ద క్షీణతలో ఉన్న ఐహెచ్ఎస్ మార్కిట్ ఇండియా మాన్యుఫాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) జూలైలో 55.3 వృద్ధిలోకి మారింది. వరుసగా 36 నెలలు 50 పైన వృద్ధి ధోరణిలోనే కొనసాగిన తయారీ పీఎంఐ, కరోనా కఠిన లాక్డౌన్ పరిస్థితుల నేపథ్యంలో 2020 ఏప్రిల్‌లో 50 పాయింట్ల దిగువకు క్షీణతలోకి జారిపోయింది. తిరిగి 2020 ఆగస్టులోనే వృద్ధి బాటకు వచ్చి, అదే జోరును కొనసాగించింది. అయితే సెకండ్‌వేవ్ ప్రభావంతో జూన్‌లో తిరిగి క్షీణతలోకి జారింది. -
బ్యాంకింగ్ మొండి బకాయిలు : ఇక్రా నివేదిక
సాక్షి, ముంబై: బ్యాంకింగ్ మొండి బకాయిల (ఎన్పీఏ) తీవ్రత ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) తగ్గుతుందని దేశీయ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా బుధవారం పేర్కొంది. 2021 మార్చితో ముగిసిన త్రైమాసికంలో స్థూలంగా మొండిబకాయిలు (జీఎస్‌పీఏ)లు మొత్తం రుణాల్లో 7.6 శాతం ఉంటే, ఈ రేటు 2021–22 మార్చి ముగిసే నాటికి 7.1 శాతానికి దిగివస్తాయని అంచనావేసింది. అధిక రికవరీలు, రుణ పునర్వ్యవస్థీకరణలు, వేగవంతమైన రుణ వృద్ధి ఇందుకు దోహదపడే ప్రధాన అంశాలని తన తాజా నివేదికలో పేర్కొంది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు చూస్తే.. ► స్థూల మొండిబకాయిలు 6.9 శాతం నుంచి 7.1 శాతం శ్రేణిలో ఉంటాయని భావిస్తున్నాం. నికరంగా ఈ శ్రేణి 1.9 శాతం 2 శాతం శ్రేణిలో ఉంటుందని అంచనా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) జీఎన్‌పీఏల అంచనాలతో పోల్చితే (9.8 శాతం) తాజా ఇక్రా అంచనాలు తక్కువగా ఉండడం గమనార్హం. ► కేవలం కొత్త పద్దులకు సంబంధించి ఎన్పీఏలు 2019–20లో రూ.3.7 లక్షల కోట్లు. రుణాల్లో ఇది 4.2 శాతం. 2020–21లో ఈ పరిమాణం రూ.2.6 లక్షల కోట్లు. రుణాల్లో 2.7 శాతం. అయితే 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఈ తరహా ఎన్పీఏలు పెరిగే అవకాశం ఉంది. మారటోరియం వంటి రెగ్యులేటరీ వెసులుబాట్లు ఏమీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం లేకపోవడం దీనికి కారణం. ► కోవిడ్–19 ప్రేరిత సవాళ్లను ఎదుర్కొంటున్న రుణగ్రహీతల ఆదాయం, ద్రవ్యలభ్యత సంబంధిత ఒత్తిడులు 2021–22 ఆర్థిక సంవత్సరం బ్యాంకింగ్ బ్యాలెన్స్ షీట్లలో ప్రతిబింబించవు. లిక్విడిటీ, నియంత్రణ, సరళీకరణ విధానాలు, అత్యవసర రుణ హామీ పథకం (ఈసీఎల్జీఎస్) వంటి కేంద్రం, ఆర్బీఐ తీసుకుంటున్న పలు చర్యలు దీనికి కారణం. ► రుణాలకు సంబంధించి కేటాయింపులు (క్రెడిట్ ప్రొవిజన్స్) 2019–20లో 3.7 శాతం. 2020–21లో ఈ రేటు 2.5 శాతానికి తగ్గింది. ► బ్యాంకింగ్ రంగంలో ప్రత్యేకించి ప్రభుత్వ రంగానికి సంబంధించి పరిస్థితి మెరుగుపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. వరుసగా ఐదు సంవత్సరాల తర్వాత 2020–21లో బ్యాంకులు లాభాలను చూశాయి. అలాగే నికర ఎన్పీఏలు గడచిన ఆరేళ్లలో అతి తక్కువ స్థాయిలో 3.1 శాతంగా నమోదయ్యాయి. మున్ముందు కూడా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ లాభాలతో కొనసాగే అవకాశాలే ఉన్నాయి. ► ఎన్పీఏల పరిస్థితి మెరుగుపడ్డంతోపాటు మూలధనం పెంపు చర్యలు కూడా సత్ఫలితాలను ఇస్తుండడం హర్షణీయం. బ్యాంకింగ్ రంగం వృద్ధి, పురోగతి, లాభదాయకతకు ఆయా అంశాలు మద్దతును ఇస్తున్నాయి. ► ఈ నేపథ్యంలో కరోనా సెకండ్ వేవ్ సవాళ్లను బ్యాంకింగ్ పటిష్టంగా ఎదుర్కొన్నట్లు ఇక్రా విశ్వసిస్తోంది. దీనితో బ్యాంకింగ్ రంగానికి ఇక్రా ‘స్టేబుల్’ అవుట్‌లుక్‌ను -
జీడీపీ బౌన్స్‌బ్యాక్
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ అంచనాలకు మించి రికవరీ అయ్యింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020 ఏప్రిల్–2021 మార్చి) జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) క్షీణ రేటు 7.5 శాతానికి పరిమితమయ్యింది. నిజానికి క్షీణత ‘సింగిల్ డిజిట్’కు పరిమితమవుతుందని పలు విశ్లేషణలు వచ్చినప్పటికీ, ఇంత తక్కువగా నమోదవుతుందని అంచనావేయలేదు. అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం– మూడీస్ ఆర్థిక వ్యవస్థ 9.5 శాతం క్షీణిస్తుందని అంచనావేసింది. తయారీ, వ్యవసాయం, విద్యుత్, గ్యాస్ రంగాలు ఆర్థిక వ్యవస్థ వేగవంతమైన రికవరీకి చేయూతను ఇచ్చాయి. వినియోగ డిమాండ్ మెరుగుపడితే రానున్న కాలంలో ఆర్థిక వ్యవస్థ మరింత ఊపునందుకునే అవకాశం ఉందని విశ్లేషణలు పేర్కొంటున్నాయి. కఠిన లాక్డౌన్ పరిస్థితులతో భారత్ ఆర్థిక వ్యవస్థ మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) భారీగా 23.9 శాతం క్షీణతను నమోదుచేసుకుంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో జీడీపీ 4.4 శాతం వృద్ధి రేటు నమోదైంది. వివిధ రంగాలు చూస్తే...: తయారీ: జూన్ నుంచీ కఠిన లాక్డౌన్ నిబంధనలను సడలించడంతో ఆర్థిక వ్యవస్థ క్రమంగా ఊపందుకుంది. జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థలో దాదాపు 15% వాటా ఉన్న తయారీ రంగం 0.6% వృద్ధి నమోదుచేసుకోవడం గమనార్హం. జూన్ క్వార్టర్లో ఈ విభా గం 39% క్షీణించింది. ► వ్యవసాయం: జీడీపీలో దాదాపు 15% వాటా ఉన్న వ్యవసాయం 3.4 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. ► విద్యుత్, గ్యాస్: 4.4% వృద్ధిని సాధించాయి. ► ఫైనాన్షియల్, రియల్టీ సేవలు: ఈ విభాగాలు క్షీణతలోనే ఉన్నాయి. 8.1 శాతం మైనస్ నమోదయ్యింది. ► ట్రేడ్, హోటల్స్, రవాణా, కమ్యూనికేషన్ విభాగాలు సైతం 15.6 శాతం నష్టాల్లోనే (క్షీణత) ఉన్నాయి. ► నిర్మాణం: ఆర్థిక వ్యవస్థలో భారీ ఎత్తున ఉపాధి అవకాశాలను కల్పిస్తున్న ఈ రంగం క్షీణత 8.6 శాతం. అయితే క్యూ1లో భారీగా ఇది 50% క్షీణించింది. ► ప్రభుత్వ వ్యయాలు: ఆందోళనకరంగానే ఉన్న ప్రభుత్వ వ్యయాలు మరో అంశం. ప్రభుత్వ వ్య యాలు సెప్టెంబర్ క్వార్టర్లో 12% క్షీణించింది. క్షీణత ఇలా...: జాతీయ గణాంకాల కార్యాలయం ప్రకటన ప్రకారం, 2020–21 సెప్టెంబర్ త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి విలువ రూ.33.14 లక్షల కోట్లు. 2019–20 ఇదే కాలంలో ఈ విలువ 35.84 లక్షల కోట్లు. అంటే విలువలో ఎటువంటి వృద్ధిలేకపోగా 7.5 శాతం క్షీణత నమోదయ్యిందన్నమాట. సాంకేతికంగా మాంద్యమే... ఒక ఆర్థిక వ్యవస్థ వరుసగా రెండు త్రైమాసికాలు క్షీణ రేటును నమోదుచేస్తే, ఆ పరిస్థితిని మాంద్యంగా పరిగణిస్తారు. జూన్, సెప్టెంబర్ త్రైమాసికాల్లో భారత్ వరుస క్షీణ రేటును నమోచేసిన నేపథ్యంలో దేశం సాంకేతికంగా మాంద్యంలోకి జారిపోయినట్లే భావించాల్సి ఉంటుంది. మొదటి ఆరు నెలల కాలంలో భారత్ ఆర్థిక వ్యవస్థ 15.7 శాతం క్షీణతను నమోదుచేసుకుంది. గత ఏడాది ఇదే కాలంలో 4.8 శాతం వృద్ధిరేటు నమోదయ్యింది. అయితే ఎకానమీ ‘వీ’ నమూనా వృద్ధి నమోదుచేసుకుంటుందని ఆర్థిక నిపుణులు భరోసాతో ఉండడమే ఊరట. దేశంలో క్రమంగా వినియోగ డిమాండ్ పుంజుకుంటోంది. ఆటో మొబైల్ పరిశ్రమ బాగుంది, నాన్–డ్యూరబుల్ రంగం మెరుగుపడుతోంది. రైలు రవాణా పెరుగుతోంది. వచ్చే ఏడాది తొలి నెలల్లోనే వ్యాక్సిన్ వస్తుందన్న అంచనాలు ఉన్నాయి. ఇవన్నీ వృద్ధికి ఊతం ఇచ్చేవి కావడం గమనార్హం. అయితే సెకండ్‌వేవ్ కేసుల భయాలూ ఉన్నాయి. ఇది రానున్న రెండు త్రైమాసికాల్లో ఆర్థిక వ్యవస్థను ప్రతికూలతలోకి నెడతాయన్న అంచనాలు ఉన్నాయి. ఇక ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న దానికన్నా (4% వద్ద నిర్దేశం) అధికంగా రిటైల్ ద్రవ్యోల్బణం ఉండడం గమనార్హం. వృద్ధి బాటలో చైనా దూకుడు ప్రధాన ఆర్థిక వ్యవస్థలుసహా ప్రపంచంలోని పలు దేశాల ఎకానమీలు కరోనా ప్రేరిత అంశాలతో క్షీణతలోకి జారిన నేపథ్యంలో... ఈ మహమ్మారికి పుట్టినిల్లు చైనా మాత్రం వృద్ధి బాటన సాగుతోంది. ఈ ఏడాది వరుసగా రెండవ త్రైమాసికం జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో ఆ దేశ ఎకానమీ 4.9 శాతం వృద్ధి రేటును (2019 ఇదే కాలంతో పోల్చి) నమోదుచేసుకుంది. కరోనా సవాళ్లతో మొదటి త్రైమాసికం జనవరి–మార్చి మధ్య 44 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా 6.8 శాతం క్షీణతకు జారిపోయిన చైనా ఆర్థిక వ్యవస్థ, మరుసటి క్వార్టర్ (ఏప్రిల్–జూన్)లోనే 3.2 శాతం వృద్ధి నమోదుచేసుకున్న సంగతి తెలిసిందే. 2020తో తొలి ఆరు నెలల కాలం (జనవరి–జూన్) చూసుకుంటే 1.6 శాతం క్షీణతలో ఉన్న చైనా, మూడు త్రైమాసికాలు కలిపితే 0.7 శాతం పురోగతిలో ఉంది. అక్టోబర్‌లో మౌలికం 2.5 శాతం క్షీణత మౌలిక రంగంలోని ఎనిమిది కీలక పరిశ్రమల ఉత్పత్తి అక్టోబర్‌లో 2.5 శాతం మేర క్షీణించింది. ముడి చమురు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఉక్కు ఉత్పత్తి పడిపోవడం ఇందుకు కారణం. మౌలిక రంగం క్షీణించడం ఇది వరుసగా ఎనిమిదో నెల. మార్చి నుంచి ఇది క్షీణ బాటలోనే ఉంది. 2019 అక్టోబర్‌లో ఎనిమిది మౌలిక పరిశ్రమల ఉత్పత్తి 5.5 శాతం క్షీణత నమోదు చేసింది. బొగ్గు, ఎరువులు, సిమెంట్, విద్యుదుత్పత్తి సానుకూల వృద్ధి కనపర్చగా, క్రూడాయిల్, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఉక్కు ప్రతికూల వృద్ధి నమోదు చేశాయి. ఏప్రిల్–అక్టోబర్ మధ్య కాలంలో చూస్తే మౌలికం 13% క్షీణించింది. గతేడాది ఇదే వ్యవధిలో 0.3% వృద్ధి నమోదైంది. విభాగాల వారీగా .. అక్టోబర్‌లో బొగ్గు ఉత్పత్తి 11.6%, సిమెంట్ (2.8%), విద్యుత్ (10.5%) వృద్ధి నమోదు చేశాయి. మరోవైపు క్రూడాయిల్ 6.2 శాతం, సహజ వాయువు 8.6%, రిఫైనరీ ఉత్పత్తులు 17 శాతం, ఉక్కు 2.7 శాతం మేర ప్రతికూల వృద్ధి నమోదు చేశాయి. 1950–51నుంచి భారత్ జీడీపీ డేటా అందుబాటులో ఉన్న నాటి నుంచి ఐదుసార్లు – 1958, 1966, 1967, 1973, 1980 ఆర్థిక సంవత్సరాల్లోనూ మైనస్ వృద్ధి నమోదైంది. అంచనాలు నిజమైతే 2020–21 ఆరవసారి అవుతుంది. అబ్బురపరుస్తున్నాయ్... ఆర్థిక రికవరీ అబ్బుర పరుస్తోంది. ప్రత్యేకించి తయారీ రంగం సానుకూలతలోకి రావడం హర్షణీయం. వ్యవస్థలో తిరిగి డిమాండ్ నెలకొంటోందని ఈ అంశం సూచిస్తోంది. – రాజీవ్ కుమార్, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ప్రోత్సాహకరం మహమ్మారి ప్రేరిత అంశాలు, గత త్రైమాసికం తీవ్ర నిరాశాకర ఫలితాల నేపథ్యంలో వెలువడిన తాజా గణాంకాలు కొంత ప్రోత్సాహకాన్ని ఇస్తున్నాయి. అయితే ఇక్కడ కొంత ఆందోళన కూడా ఉంది. ఆర్థిక క్షీణత మహమ్మారి వల్లే. ఈ సవాలు ఇంకా కొనసాగుతోంది. – కృష్ణమూర్తి సుబ్రమణ్యం, చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ ద్వితీయార్ధంలో ‘వృద్ధి’కి అవకాశం ప్రభుత్వం చేపట్టిన ఉద్దీపన చర్యలు, సంస్కరణలు ఇందుకు దోహదపడ్డాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ భాగంలో (అక్టోబర్–మార్చి) దేశం వృద్ధి బాటకు వస్తుందన్న విశ్వాసం కనబడుతోంది. 2021–22లో వృద్ధి రెండంకెల్లో నమోదు అవుతుందని భావిస్తున్నాం. అక్టోబర్‌లో భారీగా పెరిగిన వినియోగ డిమాండ్ ఆశావహ పరిస్థితులను సృష్టిస్తోంది. అయితే సెకండ్ వేవ్‌ను ఎదుర్కొనడమే ప్రస్తుతం కీలకాంశం. – ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ విశ్వాసాన్ని పెంచుతున్నాయ్ తాజా గణాంకాలు ఆర్థిక వ్యవస్థపై విశ్వాసాన్ని పెంచుతున్నాయి. కఠిన లాక్డౌన్ పరిస్థితులను క్రమంగా సడలిస్తున్న నేపథ్యం ఇది. ప్రభుత్వం చేపడుతున్న ఆర్థిక వ్యవస్థ సంస్కరణలు ఫలితాలను అందిస్తున్నాయి. ఇదే ధోరణి ఇకముందూ కొనసాగుతుందని భావిస్తున్నాం. వినియోగ డిమాండ్ మున్ముందు పుంజుకునే అవకాశం ఉంది. – చంద్రజిత్ బెనర్జీ, సీఐఐ డైరెక్టర్ జనరల్ తయారీలో విజయం అంచనాలకు మించి సానుకూల ఫలితం రావడం హర్షణీయం. భారత్ ఆర్థిక వ్యవస్థ వేగవంతమైన రికవరీ బాటలో ఉన్నట్లు అర్థం అవుతోంది. ముఖ్యంగా తయారీ రంగంలో సానుకూలత మంచి పరిణామం. ప్రోత్సాహకరమైనది. ఆర్థిక వ్యవస్థలో డిమాండ్‌ను పెంచేందుకు ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాల ఫలితమిది. – సంగీతా రెడ్డి, ఫిక్కీ ప్రెసిడెంట్ ముందుముందు మంచికాలం ఫలితాలు సంతోషాన్ని ఇస్తున్నాయి. తాజా ఫలితాలను చూస్తుంటే, డిసెంబర్, మార్చి త్రైమాసికాల్లోనూ మంచి ఫలితాలు వెలువడతాయన్న విశ్వాసం వ్యక్తం అవుతోంది. ఆర్థిక వ్యవస్థలో పలు విభాగాలు పురోగతి బాటన పయనిస్తుండడం గమనార్హం. ముఖ్యంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, పట్టణ ప్రాంతాల్లో వినియోగం మెరుగుపడుతోంది. – దీపక్ సూద్, అసోచామ్ సెక్రటరీ జనరల్ -
డ్రాగన్ శకం ముగిసింది!
గతమెంతో ఘనకీర్తి..?! భవిష్యత్తులో చైనా ఇదేవిధంగా చెప్పుకోవాల్సిన దుస్థితి వస్తుందేమో. పిన్ను నుంచి పెద్ద యంత్రం వరకు ఏ ఉత్పత్తిని అయినా తయారు చేయగలదు చైనా. అందుకే అంత వేగంగా ఎదిగి ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కాగలిగింది. కానీ, కరోనాతో, అమెరికాతో వాణిజ్య కయ్యం కారణంగా చైనా పరిస్థితి మారిపోనుందని నిపుణులు, పారిశ్రామికవేత్తల మాటలను పరిశీలిస్తే అర్థమైపోతోంది. ‘ప్రపంచానికి పరిశ్రమగా చైనా రోజులు ముగిసినట్టే’.. ఈ మాటలు అన్నది ఎవరో కాదు... ఫాక్స్‌కాన్ బాస్ యంగ్ లీ!. దీనికి కారణంగా ట్రేడ్ వార్ (వాణిజ్య యుద్ధం)ను ఆయన పేర్కొన్నారు. యాపిల్ ఐఫోన్ల నుంచి, డెల్ కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు ఇలా ఒకటేమిటి అన్నింటికీ తయారీ కేంద్రం చైనాయే. యాపిల్ కు ప్రధాన తయారీ భాగస్వాముల్లో ఒకటైన ఫాక్స్‌కాన్ తోపాటుచైనా కేంద్రంగా విస్తరించిన డజను వరకు టెక్నాలజీ కంపెనీలు ఇప్పుడు చైనా బయట వైపునకు చూస్తున్నాయి. చైనా మార్కెట్‌కు, యూఎస్ మార్కెట్‌కు సరఫరా వ్యవస్థలను వేర్వేరుగా నిర్వహించాల్సిన ఆవశ్యకతను మారిన పరిస్థితుల్లో అవి అవగతం చేసుకున్నాయి. చైనా బయట క్రమంగా మరింత తయారీ సామర్థ్యాన్ని ఏర్పాటు చేసుకోనున్నట్టు హాన్ హాయ్ ప్రెసిషన్ ఇండస్ట్రీ కంపెనీ (ఫాక్స్ కాన్ గా ట్రేడయ్యే సంస్థ) చైర్మన్ యుంగ్ లీ తెలిపారు. ప్రస్తుతానికి మొత్తం తయారీ సామర్థ్యంలో 30 శాతం చైనా బయట ఈ సంస్థ ఏర్పాటు చేసుకుంది. గతేడాది జూన్ నాటికి ఇది 25 శాతమే. ఏడాదిలో చైనా వెలుపల 5 శాతం తయారీని పెంచుకున్న ఈ సంస్థ.. భవిష్యత్తులో దీన్ని మరింతగా పెంచుకునే ప్రణాళికలతో ఉంది. చైనాలో తయారై అమెరికాలోకి ప్రవేశించే ఉత్పత్తులపై పెరిగే టారిఫ్‌ల భారం పడకుండా ఉండేందుకు గాను ఫాక్స్ కాన్ సంస్థ భారత్, ఆగ్నేయాసియా, ఇతర ప్రాంతాలకు తయారీని తరలించే ప్రయత్నాల్లో ఉన్నట్టు కంపెనీ ఫలితాల ప్రకటన సందర్బంగా యంగ్ లీ స్వయంగా మీడియాకు వెల్లడించారు. ‘‘భారత్ లేదా ఆగ్నేయాసియా లేదా అమెరికా.. ఏదైనా సరే ఆయా ప్రాంతాల్లో తయారీ ఎకోసిస్టమ్ ఉంది’’ అని లీ పేర్కొన్నారు. అయితే, ఫాక్స్ కాన్ తయారీలో చైనా ఇక ముందూ కీలకపాత్ర పోషిస్తుందని స్పష్టం చేశారు. కాకపోతే ప్రపంచానికి తయారీ కేంద్రంగా చైనా దశకం ముగిసినట్టేనని వ్యాఖ్యానించారు. భారత్ లో ఫాక్స్ కాన్ విస్తరణ అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రం కావడంతో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి సంస్థలు తమ తయారీ కేంద్రాలను చైనా బయట కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించాయి. అవసరమైతే యాపిల్ ఉత్పత్తులను పూర్తిగా చైనా బయట తయారు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని యంగ్ లీ గతేడాదే ఓ సందర్భంలో చెప్పడం గమనార్హం. దీర్ఘకాలంలో చైనాకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రానిక్ తయారీ కేంద్రాలు ఏర్పాటు కావడం తథ్యమని లీ మాటలతో స్పష్టమవుతోంది. ఫాక్స్‌కాన్ కు మన దేశంలోనూ తయారీ కేంద్రాలున్నాయి. మరిన్ని పెట్టుబడులతో సామర్థ్య విస్తరణ చేయనున్నట్టు ఈ సంస్థ ఇటీవలే ప్రకటించింది కూడా. భారత్ లో తయారీకి అమెరికాకు చెందిన యాపిల్ ప్రాధాన్యం ఇస్తోంది. దీంతో యాపిల్ తయారీ భాగస్వామిగా ఫాక్స్‌కాన్ సంస్థ భారత మార్కెట్ పట్ల విస్తరణ ప్రణాళికలతో ఉంది. అమెరికాకు సరఫరా చేసే ఉత్పత్తుల తయారీకి భారత్ ను ప్రధానంగా ఫాక్స్‌కాన్ పరిశీలిస్తుండడం గమనార్హం. యాపిల్ ఐపాడ్, మ్యాక్ ఉత్పత్తులకు డిమాండ్ కారణంగా ఫాక్స్ కాన్ జూన్ క్వార్టర్ లో 5,835 కోట్ల భారీ లాభాన్ని ప్రకటించడం గమనార్హం. ఈ సంస్థ తైవాన్ కు చెందినది. టెన్సెంట్ హోల్డింగ్స్‌కు చెందిన వీచాట్ వినియోగాన్ని అమెరికా పౌరులు వినియోగించకుండా నిషేధిస్తూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆదేశాలు జారీ చేయడం తెలిసిందే. పోటీతత్వంతో స్వావలంబన భారత్ భారత్ తన అవసరాలను దేశీయంగా తీర్చుకునేందుకు (ఆత్మ నిర్భర్) దేశీయ పరిశ్రమ కచ్చితంగా మరింత పోటీనిచ్చే విధంగా మారాల్సిన అవసరం ఉందని మాజీ కేంద్ర వాణిజ్య మంత్రి సురేష్ ప్రభు అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు రక్షణాత్మక విధానాలను అవలంబిస్తున్నతరుణంలో.. భారత్ కూడా తన అవసరాలకు తనపైనే ఆధారపడాల్సిన అవసరం ఉందన్నారు. స్వేచ్ఛాయుత మార్కెట్ కలిగిన అమెరికా సైతం రక్షణాత్మక విధానాలను అనుసరిస్తున్న విషయాన్ని ప్రభు గుర్తు చేశారు. కనుక రానున్న రోజుల్లో ఆత్మనిర్భర్ కు మరే ప్రత్యామ్నాయం లేదని పేర్కొన్నారు. ‘‘మన పరిశ్రమలను మరింత పోటీయుతంగా మార్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పోటీతత్వం మన పరిశ్రమల సమర్థతను పెంచుతుంది. ఆ పోటీయే మనకు మేలు చేస్తుందని నేను నమ్ముతున్నాను’’ అంటూ పీహెచ్ డీ చాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహంచిన కార్యక్రమంలో భాగంగా పేర్కొన్నారు. ఉద్యోగ కల్పనకు కేంద్రం ఎన్నో విధాానాలను అమలు చేసినట్టు ప్రభు చెప్పారు. చైనా ఉత్పత్తులకు తగ్గిన ఆదరణ! న్యూఢిల్లీ: చైనా తయారీ ఉత్పత్తుల పట్ల భారతీయుల్లో ఆసక్తి తగ్గుతోందని సోషల్ మీడియా వేదిక లోకల్‌సర్కిల్స్ తన సర్వేలో వెల్లడించింది. నవంబరు 10–15 మధ్య దేశవ్యాప్తంగా 204 జిల్లాల్లో ఈ సర్వే చేపట్టారు. దీని ప్రకారం సర్వేలో పాలుపంచుకున్న వారిలో పండుగల సీజన్లో కేవలం 29 శాతం మంది మాత్రమే చైనా ఉత్పత్తులను కొనుగోలు చేశారు. గతేడాది ఈ సంఖ్య 48 శాతం ఉంది. 2019లో చేపట్టిన సర్వేలో 14,000 మందికిపైగా పాల్గొన్నారు. 2019తో పోలిస్తే ప్రస్తుత సీజన్లో చైనా ఉత్పత్తులను కొనుగోలు చేసిన వారి సంఖ్య 40 శాతం తగ్గిందని లోకల్‌సర్కిల్స్ ఫౌండర్ సచిన్ తపారియా తెలిపారు. ఈ ఏడాది చైనా ఉత్పత్తులు కొన్నవారిలో 71 శాతం మంది తాము స్పృహతో కొనుగోలు చేయలేదని స్పష్టం చేశారు. డబ్బుకు తగ్గ విలువ కాబట్టే ఆసక్తి చూపామని 66% మంది తెలిపారు. దాడి తర్వాత పెరిగిన వ్యతిరేకత.. జూన్‌లో గాల్వన్ వ్యాలీలో చైనా సైనికుల దాడిలో భారత జవాన్లు వీర మరణం పొందిన సంఘటన తర్వాత చైనా ప్రొడక్ట్స్ పట్ల భారతీయుల్లో వ్యతిరేకత అధికమైంది. వచ్చే ఏడాది కాలంలో చైనా ఉత్పత్తులను బహిష్కరిస్తామని 87 శాతం మంది వెల్లడించారు. దేశీయంగా తయారైన ప్రొడక్ట్స్ ఖరీదు ఉన్నప్పటికీ నాణ్యత మెరుగ్గా ఉంటుందని అత్యధికులు ఈ విషయాన్ని వ్యక్తపరిచారు. పండుగల సమయంలో లైట్లు, ఇతర ప్లాస్టిక్ వస్తువులు ఒకసారి మాత్రమే వినియోగించేవి కావడంతో నాణ్యత ప్రధాన అంశం కాదని చాలా మంది అభిప్రాయపడ్డారు. -
ఎల్అండ్టీకి కోవిడ్ దెబ్బ
న్యూఢిల్లీ: ఇంజినీరింగ్, నిర్మాణ రంగ దిగ్గజం లార్సెన్ అండ్ టూబ్రో (ఎల్అండ్టీ)కు కోవిడ్–19 ప్రభావం తీవ్రంగానే తాకింది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (2020–21, క్యూ2)లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన (అనుబంధ సంస్థలన్నింటితో కలిపి) రూ.1,410 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.2,552 కోట్లతో పోలిస్తే 45 శాతం క్షీణించింది. మొత్తం ఆదాయం సైతం రూ.35,925 కోట్ల నుంచి రూ.31,594 కోట్లకు దిగజారింది. 12 శాతం తగ్గిపోయింది. కాగా, వ్యాపార పరిస్థితులు పుంజుకుంటుండటంతో ఈ ఏడాది తొలి త్రైమాసికంతో పోలిస్తే (సీక్వెన్షియల్‌గా) లాభం సుమారు 4 రెట్లు మెరుగుపడినట్లు కంపెనీ వెల్లడించింది. ‘కరోనా మహమ్మారి ప్రభావంతో ఆదాయం పడిపోయింది. ఆర్థిక సేవల వ్యాపారంలో అధిక క్రెడిట్ ప్రొవిజన్లు మెట్రో సేవలకు అంతరాయం కారణంగా లాభంలో 45 శాతం క్షీణతకు దారితీసింది’ అని కంపెనీ పేర్కొంది. కాగా, మొత్తం వ్యయాలు సైతం రూ.32,622 కోట్ల నుంచి రూ.29,456 కోట్లకు పడిపోయాయి. అంతర్జాతీయ కార్యకలాపాల ఆదాయం రూ.12,148 కోట్లుగా నమోదైంది. క్యూ2(జూలై–సెప్టెంబర్)లో కంపెనీ తన ఎలక్ట్రికల్, ఆటోమేషన్ (ఈఅండ్‌ఏ) వ్యాపారాన్ని ఫ్రాన్స్‌కు చెందిన ష్నిడర్ ఎలక్ట్రిక్ (ఎస్ఈ)కు విక్రయించింది. క్యూ2లో గ్రూపు స్థాయిలో ఎల్అండ్టీ రూ.28,039 కోట్ల కాంట్రాక్టులను చేజిక్కించుకుంది. క్రితం ఏడాది ఇదే క్వార్టర్‌తో పోలిస్తే 42% తగ్గాయి. ఫలితాల నేపథ్యంలో ఎల్అండ్టీ షేరు బుధవారం బీఎస్ఈలో 0.12% లాభంతో రూ.984 వద్ద ముగిసింది. -
కోవిడ్ క్రాష్ : అంబానీకి నష్టం ఎంతంటే?
సాక్షి, ముంబై: కోవిడ్-19 కల్లోలానికి ప్రపంచ మార్కెట్లు విలవిల్లాడాయి. అటు దేశీయ ఈక్విటీమార్కెట్లు కూడా ఫిబ్రవరి చివరి వారంలో భారీగా నష్టపోయాయి. గత ఆరు సెషన్లుగా వరుస నష్టాలతో ఇన్వెస్టర్ల సంపద రూ.10 లక్షల కోట్లు ఆవిరైపోయింది. శుక్రవారం ఒక్కరోజే రూ.4 లక్షల కోట్లకు పైగా సంపద నిమిషాల్లో కరిగిపోయింది. కరోనా వైరస్ వ్యాప్తికి ఎక్కడా అడ్డుకట్టపడకపోవడంతో ఇన్వెస్టర్లు, ట్రేడర్లు భారీ అమ్మకాలకు దిగారు. దీంతో దేశంలోని కుబేరులు కూడా సంపదను కోల్పోయారు. (5 నిమిషాల్లో రూ. 5 లక్షల కోట్లు హాంఫట్) ముఖ్యంగా ఈ సంవత్సరం మొదటి రెండు నెలల్లోని బలహీన ధోరణి భారత బిలియనీర్ల సంపదను ప్రభావితం చేసింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ సూచిక ప్రకారం, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ ఈ ఏడాది తన సంపదలో 5 బిలియన్ డాలర్లకు పైగా కోల్పోయారు.ఇండెక్స్‌లో పదిహేనవ స్థానంలో ఉన్న ఆసియా టాప్ బిలియనీర్ మొత్తం నికర విలువ 53.5 బిలియన్ డాలర్లు. సెన్సెక్స్1500 పాయింట్లు కుప్పకూలడంతో, మార్కెట్ క్యాప్ పరంగా టాప్‌లో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధర శుక్రవారం 4.12 శాతం క్షీణించి రూ.1,328 కు చేరుకుంది, మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ .8.4 లక్షల కోట్లకు పడిపోయింది. (టెక్ దిగ్గజాలకు కోవిడ్-19 సెగ) ఇదే వరుసలో ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా 884 మిలియన్ డాలర్లు కోల్పోయారు. విప్రో లిమిటెడ్ చైర్మన్ అజిమ్ ప్రేమ్‌జీ సంపద రెండు నెలల కాలంలో 869 మిలియన్ డాలర్లు క్షీణించింది. అలాగే గౌతమ్ అదానీ 496 మిలియన్ డాలర్లను కోల్పోయారు. విప్రో షేర్లు 4.53, అదానీ ఎంటర్ప్రైజెస్ 6.5శాతం నష్టపోయాయి. ఇంకా టీసీఎస్, హెచ్డీఎఫ్సీ, ఇన్ఫోసిస్ షేర్లు 2.5 -3.5 శాతం మధ్య, బజాజ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, టాటా స్టీల్ షేర్లు 4-5 శాతం మధ్య కుప్పకూలిన సంగతి తెలిసిందే. బెంచ్‌మార్క్ సూచికలు 7 శాతం పతనం కావడంతో సెంటిమెంటు పూర్తిగా దెబ్బతిందనీ జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ విశ్లేషించారు. కరోనా మహమ్మారి ముప్పు ఊహించనదానికంటే పెద్దగా ఉండనుందని అంచనా వేశారు. (కోవిడ్-19 : స్విస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం) -
వాహన రంగానికి ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ: దేశీయ వాహన రంగ పరిశ్రమ గతేడాదిలో భారీ క్షీణతను నమోదుచేసింది. భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం(సియామ్) శుక్రవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. 2019లో మొత్తం ఆటో రంగ పరిశ్రమ అమ్మకాలు 2,30,73,438 యూనిట్లు కాగా, అంతక్రితం ఏడాది (2018)లో అమ్ముడైన 2,67,58,787 యూనిట్లతో పోల్చితే ఏకంగా 13.77 శాతం తగ్గుదల చోటుచేసుకుంది. ఈ సంఘం వద్ద 1997 నుంచి ప్రతీ ఏడాదికి సంబంధించిన అమ్మకాల సమాచారం ఉండగా.. మునుపెన్నడూ లేని విధంగా గతేడాది విక్రయాలు భారీ క్షీణతను నమోదుచేశాయి. ఇక ప్యాసింజర్ వాహన విక్రయాలు 29,62,052 యూనిట్లుగా నిలిచాయి. ఈ విభాగంలో 12.75 శాతం తగ్గుదల చోటుచేసుకుంది. 2013 తరువాత అత్యంత కనిష్టస్థాయి ఇది. ద్విచక్ర వాహన విభాగంలో 14.19 శాతం తగ్గుదల (1,85,68,280 యూనిట్ల విక్రయాలు) నమోదు కాగా, వాణిజ్య వాహన విభాగంలో 14.99 శాతం క్షీణత నమోదైంది. గతేడాది అమ్మకాలు ఈ స్థాయిలో పడిపోవడానికి.. భారత్ స్టేజ్–సిక్స్(బీఎస్–6) నిబంధనల అమలు వంటి ప్రభుత్వ నిర్ణయాలు, రుణ లభ్యత గణనీయంగా తగ్గిపోవడం ప్రధాన కారణాలుగా ఉన్నాయని సియామ్ ప్రెసిడెంట్ రాజన్ వడేరా వ్యాఖ్యానించారు. ఇక ఈ ఏడాదిలోనైనా ప్రభుత్వం జీఎస్టీ రేటును 18 శాతానికి తగ్గించి, స్క్రాపేజ్ విధానాన్ని అమలుచేస్తే పరిశ్రమ కోలుకుంటుందని ఆశాభావం వ్యక్తంచేశారు. -
‘మౌలిక’రంగం తిరోగమనంలోనే...
న్యూఢిల్లీ: దేశంలో ఆర్థిక మందగమన పరిస్థితులకు ఎనిమిది మౌలిక పారిశ్రామిక రంగాల గ్రూప్ సెప్టెంబర్ ఫలితాలు ప్రతిబింబించాయి. సమీక్షా నెల్లో ఈ గ్రూప్‌లో అసలు వృద్ధిలేకపోగా – 5.2 శాతం క్షీణత నమోదయ్యింది. అంటే 2018 సెప్టెంబర్ ఉత్పత్తితో పోల్చితే 2019 సెప్టెంబర్‌లో ఉత్పత్తిలో అసలు వృద్ధిలేకపోగా క్షీణత నమోదయ్యిందన్నమాట. గురువారం విడుదలైన అధికారిక గణాంకాల ప్రకారం... ఎరువుల ఉత్పత్తి తప్ప అన్నీ మైనస్‌లోనే... ► బొగ్గు (–20.5 శాతం), క్రూడ్ ఆయిల్ (–5.4 శాతం), సహజ వాయువు (–4.9 శాతం), రిఫైనరీ ప్రొడక్టులు (–6.7 శాతం), సిమెంట్ (–2.1 శాతం), స్టీల్ (–0.3 శాతం) విద్యుత్ (–3.7 శాతం) క్షీణతను నమోదుచేసుకున్నాయి. అయితే ఒక్క ఎరువుల రంగం మాత్రం 5.4 శాతం ఉత్పత్తి వృద్ధిని నమోదుచేసుకుంది. ► 2018 సెప్టెంబర్‌లో ఈ 8 పరిశ్రమల వృద్ధిరేటు 4.3%. ► కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకూ చూస్తే– ఈ కాలంలో వృద్ధి కూడా కేవలం 1.3 శాతంగా నమోదయ్యింది. 2018 ఇదే కాలంలో ఈ రేటు 5.5 శాతంగా ఉంది. ► పారిశ్రామిక రంగంలో తీవ్ర మందగమన పరిస్థితులు నెలకొన్నాయని ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ పేర్కొంది. ► మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో ఈ ఎనిమిది పారిశ్రామిక రంగాల వాటా దాదాపు 40 శాతం. -
వాహన అమ్మకాలకు పెట్రో సెగ!
న్యూఢిల్లీ: వాహన విక్రయాలు ఈ ఏడాది సెప్టెంబరులో నెమ్మదించాయి. పలు దిగ్గజ ఆటో కంపెనీల ప్యాసింజర్ వాహన అమ్మకాలు క్షీణతను నమోదుచేయగా.. మరికొన్ని కంపెనీల విక్రయాలు కేవలం ఒక్క అంకె వృద్ధి రేటుకే పరిమితమైపోయాయి. ముడిచమురు ధరలు పెరిగిన నేపథ్యంలో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుదల విక్రయాలపై ప్రతికూల ప్రభావం చూపాయి. ఇదే సమయంలో పలు చోట్ల లోటు వర్షపాతం నమోదుకావడం, మరికొన్ని ప్రాంతాల్లో వరదలు ఉండడం వల్ల అమ్మకాలు అంతంత మాత్రంగానే కొనసాగాయని టయోటా కిర్లోస్కర్ మోటార్ డిప్యూటీ ఎండీ ఎన్ రాజా వ్యాఖ్యానించారు. ‘సెప్టెంబరు విక్రయాలు స్తబ్ధుగా ఉన్నాయి. క్రూడ్ ధరలు పెరగడం, వర్షపాతం తగ్గడం వంటి ప్రతికూల అంశాలతో వినియోగదారులు వెనక్కు తగ్గారు.’ అని ఎం అండ్ ఎం ప్రెసిడెంట్ రాజన్ వాడెరా అన్నారు. అయితే రానున్నది పండుగ సీజన్ కావడం వల్ల అమ్మకాలు ఊపందుకోనున్నాయని భావిస్తున్నట్లు ఫోర్డ్ ఇండియా ఎండీ అనురాగ్ మెహ్రోత్రా తెలిపారు. -
ఐఐటీల్లో క్యాంపస్ ప్లేస్మెంట్లు తగ్గాయి
న్యూఢిల్లీ: ఇండియన్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)ల్లో క్యాంపస్ ప్లేస్మెంట్లు గతేడాది 4.94 శాతం తగ్గాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 17 ఐఐటీల్లో 2014–15లో ప్లేస్మెంట్ల శాతం 72.82 అని, ఇది 2015–16లో 75.79కి పెరగ్గా 2016–17లో 70.85 శాతానికి తగ్గిందని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ గురువారం పార్లమెంట్లో వెల్లడించారు. ‘ఐఐటీల్లో క్యాంపస్ ప్లేస్మెంట్లు పెరగడం, తగ్గడం అనేది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. మారుతున్న మార్కెట్ పరిస్థితులు; విద్యార్థులు ఉన్నత విద్యకు ప్రాధాన్యమివ్వడం; ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, స్టార్టప్‌ల వైపు దృష్టి సారించడం వంటి కారణాలతో ఈ పరిస్థితి నెలకొంది’ అని రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. దేశంలో మొత్తం 23 ఐఐటీలు ఉండగా వాటిలో ఆరు ఐఐటీలు 2014–15, 2015–16 నుంచి మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. దీంతో మిగిలిన 17 ఐఐటీల్లో మాత్రమే క్యాంపస్ ప్లేస్మెంట్లు జరుగుతున్నాయి. -
ట్యాబ్స్ విక్రయాలు 16 శాతం డౌన్
న్యూఢిల్లీ: ట్యాబ్లెట్స్ విక్రయాలు వార్షిక ప్రాతిపదికన జనవరి–మార్చి త్రైమాసికంలో 16 శాతం క్షీణతతో 7.6 లక్షల యూనిట్లకు తగ్గాయి. హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీలు ట్యాబ్లెట్స్‌కి ప్రచారం కల్పించకపోవడమే దీనికి కారణమని రీసెర్చ్ సంస్థ సీఎంఆర్ తెలిపింది. ఇక అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంతో పోలిస్తే జనవరి–మార్చి త్రైమాసికంలో ట్యాబ్లెట్స్ అమ్మకాలు 6 శాతంమేర క్షీణించాయని పేర్కొంది. ఇక డేటావిండ్ 34 శాతం మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో ఉందని తెలిపింది. దీని తర్వాతి స్థానాల్లో ఐబాల్ (16 శాతం), శాంసంగ్ (15 శాతం), మైక్రోమ్యాక్స్ (8 శాతం) ఉన్నాయని పేర్కొంది. ప్రభుత్వ రంగాల నుంచి ట్యాబ్లెట్స్కు డిమాండ్ ఉంటోందని సంస్థ తెలిపింది. -
బంగారం ధరలు మరింత దిగి వస్తాయా?
ముంబై: బంగారం ధరలు మరింత పతనం దిశగా కదులుతున్నాయి. బలహీనమైన అంతర్జాతీయ ధోరణికారణంగా గ్లోబల్ మార్కెట్లలో బంగారం ధరలు నేలచూపులు చూస్తున్నాయి. ముఖ్యంగా ఫ్రాన్స్ తరువాతి అధ్యక్షుడిగా ఇమ్మాన్యూల్ మాక్రోన్ ఎన్నిక కానున్నారనే అవుతుందనే అంచనాలు , అమెరికా ఆర్థిక వ్యవస్థ బలపడుతున్న సంకేతాలకుతోడు బ్లూచిప్స్ ఆకర్షణీయ ఫలితాలు సాధిస్తుండటంతో ఇన్వెస్టర్లు రిస్క్‌తో కూడుకున్న స్టాక్స్‌లలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో బంగారం ఫ్యూచర్స్ పది గ్రాముల రూ. 121 నుంచి రూ .28,693 స్థాయికి పడిపోయింది. అలాగే మరో విలువైన లోహం వెండి సైతం ఫ్యూచర్స్ మార్కెట్ లో వెండి ధర కిలోధర రూ. 149 లు క్షీణించి రూ.40,778గాఉంది. ప్రస్తుతం న్యూయార్క్ కామెక్స్‌లో ఔన్స్(31.1 గ్రాములు) 0.2 శాతం క్షీణించి 1264 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. తద్వారా రెండు వారాల కనిష్టాన్ని నమోదు చేసింది. వెండి కూడా ఔన్స్ స్వల్ప క్షీణతతో 17.65 డాలర్లకు చేరింది. ఫ్రాన్స్‌లో రాజకీయ అనిశ్చితికి తెరపడటంతో ఇన్వెస్టర్లు పసిడి వంటి రక్షణాత్మక పెట్టుబడుల నుంచి స్టాక్స్, బాండ్లు వంటి సాధనాలవైపు దృష్టి మరల్చినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. అంతేకాదు ఇవిమరింత క్షీణించే అవకాశాలున్నాయని ఎనలిస్టులు చెబుతున్నారు. సిల్వర్ లో కూడా ఇదే ధోరణి ఉండొచ్చని భావిస్తున్నారు. సిల్వర్ ఓన్స్ 17 డాలర్లకు దిగివచ్చే చాన్స్ ఉందని చెబుతున్నారు. ట్రేడింగ్‌లో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అటు దేశీయ స్టాక్ మార్కెట్లు రికార్డ్ స్థాయిలను నమోదు చేస్తూ దూసుకుపోతున్నాయి. బెంచ్‌మార్క్ సూచీలు సెన్సెక్స్ 30 వేలు దాటగా, నిఫ్టీ 9350 వద్ద ఆల్‌టైం హైని దాటి స్థిరంగా ఉన్నాయి. దీనికితోడు డాలర్ మారకంలో రుపీ 20 నెలల గరిష్టాన్ని నమోదు చేసి తొలిసారి రూ.64 దిగువకు చేరడం విశేషం. -
మూడు నెలల క్షీణత నుంచి
కోలుకున్న సేవలు: నికాయ్ న్యూఢిల్లీ: మూడు నెలల నుంచీ అసలు వృద్ధిలేకపోగా క్షీణతలో ఉన్న సేవల రంగం తిరిగి ఫిబ్రవరిలో కోలుకుంది. డీమోనిటైజేషన్ అనంతరం మూడు నెలలు క్షీణతలో ఉన్న సేవల రంగం నికాయ్ ఇండియా (పర్చేంజింగ్ మేనేజర్స్ ఇండెక్స్– పీఎంఐ) సూచీ ఫిబ్రవరిలో 50.3 పాయింట్లకు చేరింది. జనవరిలో ఇది 48.7 పాయింట్ల వద్ద ఉంది. నికాయ్ సూచీ పాయింట్లు 50 పాయింట్లపైన ఉంటే, దానిని పురోగతిగా ఆ దిగువన ఉంటే క్షీణతగా పరిగణిస్తారు. కాగా ఆర్థిక వ్యవస్థ రికవరీ నెమ్మదిగానే ఉందని, వ్యాపార విశ్వాసం ఇంకా పుంజుకోవాల్సి ఉందనీ నికాయ్ సర్వే ఒకటి తెలిపింది. సేవలు – తయారీ కలిపితే... కాగా స్థూల దేశీయోత్పత్తి దాదాపు 70 శాతం వాటా ఉన్న సేవలు (దాదాపు 55 శాతం), తయారీ (దాదాపు 15 శాతం) రంగాలు కలిపి చూస్తే– నికాయ్ సూచీ ఫిబ్రవరిలో 50.7 పాయింట్ల వద్ద ఉంది. జనవరిలో ఇది క్షీణతలో 49.4 శాతంగా ఉంది.