ముస్లిం జనాభా పైపైకి.. హిందూ జనాభా కిందికి
న్యూఢిల్లీ: దేశంలో ముస్లిం జనాభా వేగంగా పెరుగుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అదే సమయంలో హిందువుల సంఖ్య నానాటికి తగ్గిపోతుందని వివరించింది. మతాల వారిగా జనాభా గణన వివరాలను మంగళవారం సాయంత్రం జనాభా లెక్కల ప్రధాన రిజిష్ట్రార్ అండ్ కమిషనర్ విడుదల చేశారు. దీని ప్రకారం 2001 నుంచి 2011 మధ్య కాలంలో 0.8శాతం వృద్ధితో ముస్లింల జనాభా 13.8 కోట్ల నుంచి 17.22 కోట్లకు పెరుగగా హిందువుల జనాభా 0.7శాతం తగ్గుదలతో 96.63 కోట్లుగా ఉన్నది. గత నాలుగేళ్ల కిందటే జనాభా లెక్కలు పూర్తయినప్పటికీ మతాలవారి జాబితాను నేడే ప్రకటించారు.
ఇంకా కులాల వారి జాబితా విడుదల చేయాల్సి ఉంది. ఇప్పటికే ఆర్జేడీ, జేడీయూ, డీఎంకే కులాల వారి జాబితా విడుదల చేయాలని డిమాండ్ చేశాయి కూడా. తాజాగా విడుదల చేసిన మతాలవారి 2011 జనాభా లెక్కల ప్రకారం.. దేశం మొత్తం జనాభా 121.09 కోట్లుకాగా అందులో హిందువులు 96.63 కోట్లు(దేశ జనాభాలో 79.8శాతం), ముస్లింలు 17.22 కోట్లు(14.2శాతం), క్రైస్తవులు 2.78 కోట్లు (2.3శాతం), సిక్కులు 2.08 కోట్లు(1.7శాతం), బౌద్దులు 84లక్షలు(0.7శాతం), జైనులు 45 లక్షలే(0.4శాతం),ఇతర మతాలకు చెందినవారు 79లక్షలు (0.7శాతం), అసలు ఏ మతానికి చెందనివారు 29లక్షలు (0.2శాతం) ఉన్నది. 2001 జనాభా లెక్కల ప్రకారం హిందువుల జనాభా 82.75 కోట్లతో దేశ జనాభాలో 80.45 శాతం ఉండగా ముస్లింల జనాభా 13.8 కోట్లతో 13.4 శాతం ఉంది. మొత్తం జనాభా వృద్ధి రేటు పదేళ్ల కాలంలో 17.7 శాతంగా నమోదైంది. ఇక క్రైస్తవులు, జైనుల జనాభా పెరుగుదలలో మాత్రం పెద్దగా మార్పు రాలేదని వివరించారు.