
న్యూఢిల్లీ: ఇండియన్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)ల్లో క్యాంపస్ ప్లేస్‌మెంట్లు గతేడాది 4.94 శాతం తగ్గాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 17 ఐఐటీల్లో 2014–15లో ప్లేస్‌మెంట్ల శాతం 72.82 అని, ఇది 2015–16లో 75.79కి పెరగ్గా 2016–17లో 70.85 శాతానికి తగ్గిందని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ గురువారం పార్లమెంట్‌లో వెల్లడించారు. ‘ఐఐటీల్లో క్యాంపస్ ప్లేస్‌మెంట్లు పెరగడం, తగ్గడం అనేది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది.
మారుతున్న మార్కెట్ పరిస్థితులు; విద్యార్థులు ఉన్నత విద్యకు ప్రాధాన్యమివ్వడం; ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, స్టార్టప్‌ల వైపు దృష్టి సారించడం వంటి కారణాలతో ఈ పరిస్థితి నెలకొంది’ అని రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. దేశంలో మొత్తం 23 ఐఐటీలు ఉండగా వాటిలో ఆరు ఐఐటీలు 2014–15, 2015–16 నుంచి మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. దీంతో మిగిలిన 17 ఐఐటీల్లో మాత్రమే క్యాంపస్ ప్లేస్‌మెంట్లు జరుగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment