Indian Institutes of Technology
-
వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో.. భారత్‌వే 91!
టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ (THE) మ్యాగజైన్ సెప్టెంబర్ 27న ప్రకటించిన వరల్డ్ యూనివర్శిటీ ర్యాంకింగ్స్ 2024లో రికార్డు స్థాయిలో 91 భారతీయ విశ్వవిద్యాలయాలు జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ఈ ర్యాంకింగ్‌లలో అత్యంత ప్రముఖ భారతీయ విశ్వవిద్యాలయం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) బెంగళూరు, 2017 తర్వాత తొలిసారిగా అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవడం గమనార్హం. 2024 ప్రపంచ విశ్వవిద్యాలయ ర్యాంకింగ్స్‌లో భారతదేశం ఇప్పుడు నాల్గవ ఉత్తమ ప్రాతినిధ్యం కలిగిన దేశంగా ఎదిగింది. గతేడాది భారత్ నుంచి కేవలం 75 ఇన్స్టిట్యూట్లు మాత్రమే ర్యాంకింగ్స్‌లో చోటు దక్కించుకోగా.. ఇండియా ఆరో స్థానంలో నిలిచింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ తర్వాత, అన్నా యూనివర్శిటీ, జామియా మిలియా ఇస్లామియా, మహాత్మా గాంధీ యూనివర్శిటీ, శూలినీ యూనివర్శిటీ ఆఫ్ బయోటెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ సైన్సెస్‌లు భారతదేశం నుండి తదుపరి ఉత్తమ సంస్థలు. ఈ విశ్వవిద్యాలయాలన్నీ 501-600 బ్యాండ్‌లో ఉన్నాయి. అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం గత సంవత్సరం 801-1000 బ్యాండ్ నుంచి 601-800కి పెరిగింది. కోయంబత్తూరులోని భారతియార్ విశ్వవిద్యాలయం గత సంవత్సరం 801-1000 బ్యాండ్ నుంచి 601-800 బ్యాండ్‌కి మారింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గౌహతి (IIT గౌహతి) మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్) ధన్‌బాద్ ప్రపంచంలోని టాప్ 800 విశ్వవిద్యాలయాలలో స్థానం పొందాయి. ఈ ఇన్స్టిట్యూట్ తమ ర్యాంకింగ్‌లను 1001-1200 బ్యాండ్ నుండి 601-800కి మెరుగుపరుచుకుంది. జాబితాలో మొదటిసారిగా ప్రవేశించడం ద్వారా, మాలవీయ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, జైపూర్ 601-800 బ్యాండ్‌లోకి ర్యాంక్ చేయబడింది. అయితే అనేక అగ్రశ్రేణి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IITలు).. వరుసగా నాల్గవ సంవత్సరం ర్యాంకింగ్‌లను బహిష్కరించి ర్యాంకింగ్‌ల పారదర్శకత, ప్రమాణాలపై సందేహాన్ని వ్యక్తం చేశాయి. ఈ ఇన్స్టిట్యూట్లలో బాంబే, ఢిల్లీ, గౌహతి, కాన్పూర్, ఖరగ్‌పూర్, మద్రాస్, రూర్కీకి చెందిన ఏడు IITలు ఉన్నాయి. ఐఐటీ గౌహతి గతేడాది ర్యాంకింగ్స్‌లో చేరడం గమనార్హం. -
ఐఐటీల్లో క్యాంపస్ ప్లేస్మెంట్లు తగ్గాయి
న్యూఢిల్లీ: ఇండియన్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)ల్లో క్యాంపస్ ప్లేస్మెంట్లు గతేడాది 4.94 శాతం తగ్గాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 17 ఐఐటీల్లో 2014–15లో ప్లేస్మెంట్ల శాతం 72.82 అని, ఇది 2015–16లో 75.79కి పెరగ్గా 2016–17లో 70.85 శాతానికి తగ్గిందని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ గురువారం పార్లమెంట్లో వెల్లడించారు. ‘ఐఐటీల్లో క్యాంపస్ ప్లేస్మెంట్లు పెరగడం, తగ్గడం అనేది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. మారుతున్న మార్కెట్ పరిస్థితులు; విద్యార్థులు ఉన్నత విద్యకు ప్రాధాన్యమివ్వడం; ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, స్టార్టప్‌ల వైపు దృష్టి సారించడం వంటి కారణాలతో ఈ పరిస్థితి నెలకొంది’ అని రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. దేశంలో మొత్తం 23 ఐఐటీలు ఉండగా వాటిలో ఆరు ఐఐటీలు 2014–15, 2015–16 నుంచి మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. దీంతో మిగిలిన 17 ఐఐటీల్లో మాత్రమే క్యాంపస్ ప్లేస్మెంట్లు జరుగుతున్నాయి. -
జేఈఈ అడ్వాన్స్డ్ -2015లో మార్పులు
దేశంలో లక్షల మంది ఇంటర్మీడియెట్, తత్సమాన కోర్సుల విద్యార్థులు లక్ష్యంగా పెట్టుకునే ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ - 2015 కు రంగం సిద్ధమైంది. పరీక్ష తేదీలు ఖరారయ్యాయి. 2012 నుంచి అమలు చేస్తున్న బోర్డ్ పరీక్షల్లో టాప్-20 పర్సంటైల్ అనే నిబంధనలను సడలిస్తూ కొత్త ప్రవేశ విధానాన్ని ప్రకటించడంతో విద్యార్థుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఈ నేపథ్యంలో జేఈఈ అడ్వాన్స్డ్ కొత్త ప్రవేశ విధానం, విద్యార్థులు దృష్టి సారించాల్సిన అంశాలపై విశ్లేషణ.. జాయింట్ ఎంట్రెన్స ఎగ్జామ్ (జేఈఈ)-అడ్వాన్స్డ్.. ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ, ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స- ధన్‌బాద్‌లలో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష. ఐఐటీల్లో ప్రవేశానికి సంబంధించి 2012 నుంచి అమలు చేస్తున్న అడ్వాన్స్డ్ విధానం దేశవ్యాప్తంగా వేల మంది విద్యార్థుల్ని నిరాశకు గురి చేసింది. కారణం.. బోర్డ్ పరీక్షల్లో టాప్-20 పర్సంటైల్‌లో నిలవాలనే నిబంధన విధించడం. దీనివల్ల ఎందరో విద్యార్థులు ఎంట్రెన్స్‌లో రాణించినా టాప్-20 పర్సంటైల్‌లో నిలవలేక అవకాశాలు చేజార్చుకున్నారు. గతేడాది జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మంచి ర్యాంకులు వచ్చినా టాప్-20 పర్సంటైల్‌లో లేకపోవడంతో దేశవ్యాప్తంగా దాదాపు 15 వేల మంది విద్యార్థులు ఐఐటీల్లో అడుగుపెట్టే అవకాశాన్ని కోల్పోయారు. ఈ టాప్-20 పర్సంటైల్ ప్రభావం ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులపై అధికంగా కనిపించింది. బోర్డ్ పరీక్షల్లో 91 శాతం పొందిన విద్యార్థులు సైతం టాప్-20 పర్సంటైల్ జాబితాలో చోటు పొందలేక ఐఐటీలో సీటు సాధించలేకపోయారు. సరికొత్త విధానం.. విద్యార్థుల్లో ఆనందం జేఈఈ అడ్వాన్స్డ్ ప్రవేశ విధానం, కౌన్సెలింగ్లకు సంబంధించి మూడేళ్లుగా విద్యార్థుల నుంచి ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో జాయింట్ అడ్మిషన్ బోర్డ్.. జేఈఈ-అడ్వాన్స్డ్- 2015 ద్వారా ఐఐటీల్లో ప్రవేశాల నిబంధనల్లో సడలింపు ఇచ్చింది. అవి.. - జేఈఈ-మెయిన్ పరీక్షలో 1,50,000 మందిలో ఒకరిగా నిలవాలి. - విద్యార్థులు టాప్-20 పర్సంటైల్‌లో నిలవాలి లేదా ఇంటర్ బోర్డ్ పరీక్షల్లో 75 శాతం ఉత్తీర్ణత సాధించాలి. ఈ రెండింటిలో ప్రధానంగా రెండో నిబంధన ఇప్పుడు విద్యార్థులకు ఉపశమనం కలిగిస్తోంది. ఐఐటీ-జేఈఈ స్థానంలో 2012 నుంచి జేఈఈ-మెయిన్, అడ్వాన్స్డ్ అనే రెండు దశల్లో ప్రవేశ ప్రక్రియ ఉంటోంది. తాజా సడలింపుల ఫలితంగా బోర్డ్ పరీక్షల్లో టాప్-20 పర్సంటైల్‌లో నిలవకపోయినా జేఈఈ-అడ్వాన్స్‌డ్‌లో మంచి ర్యాంకు సాధించి, బోర్డ్ పరీక్షల్లో కనీసం 75 శాతం మార్కులు పొందితే ఐఐటీల్లో కౌన్సెలింగ్‌కు అర్హత లభిస్తుంది. జేఈఈ మెయిన్.. యథాతథం జేఈఈ-మెయిన్..ఐఐటీలు మినహా ఇతర కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో (ఎన్ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు తదితర) ప్రవేశానికి అవసరమైన పరీక్ష. తాజా సడలింపుల్లో మెయిన్ విషయంలో ఎలాంటి మార్పులూ చోటు చేసుకోలేదు. గత మూడేళ్ల మాదిరిగానే 2015లోనూ యథాతథంగా జరగనుంది. ఈ క్రమంలో.. కౌన్సెలింగ్ సమయంలో ఇంటర్మీడియెట్ మార్కులకు 40 శాతం వెయిటేజీ కొనసాగనుంది. విద్యార్థులు దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మార్కులా.. పర్సంటైలా జేఈఈ- మెయిన్, అడ్వాన్స్డ్ ఔత్సాహిక విద్యార్థులు ఇప్పుడు ప్రధానంగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి. అవి.. - జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు బోర్డ్ పరీక్షల్లో టాప్-20 పర్సంటైల్ లేదా 75 శాతం మార్కుల నిబంధన నేపథ్యంలో ఈ రెండింటిలో ఏదో ఒకదానిలో నిలిచేలా మార్కులు సాధించడం. - జేఈఈ మెయిన్‌లో యథాతథంగా బోర్డ్ పరీక్షల్లో మార్కులకు 40 శాతం వెయిటేజీ కొనసాగించనున్న నేపథ్యంలో బోర్డ్ పరీక్షల్లో అత్యధిక మార్కుల సాధన దిశగా కృషి చేయాలి. - ఫలితంగా జేఈఈ-మెయిన్, అడ్వాన్స్డ్ రెండింటికీ సంపూర్ణ సంసిద్ధత సొంతం చేసుకోవచ్చు. - కేవలం ఐఐటీలనే లక్ష్యంగా పెట్టుకుంటే బోర్డ్ పరీక్షలో 75 శాతం పొందే విధంగా అకడమిక్‌గా కృషి చేసి.. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో విజయం దిశగా సిద్ధం కావొచ్చు. - కానీ ఎన్ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని విద్యా సంస్థల్లో ప్రవేశం పొందాలంటే.. జేఈఈ మెయిన్ కౌన్సెలింగ్‌లో కీలక పాత్ర పోషిస్తున్న ఇంటర్మీడియెట్ మార్కులకు 40 శాతం వెయిటేజీ నిబంధనను అనుక్షణం గుర్తుంచుకోవాలి. ప్రిపరేషన్.. విశ్లేషణాత్మకం - జేఈఈ-మెయిన్, అడ్వాన్స్డ్ పరీక్ష తేదీలు కూడా వెల్లడైన నేపథ్యంలో ఔత్సాహిక విద్యార్థులు ఇప్పటినుంచే తమ ప్రిపరేషన్‌ను వ్యూహాత్మకంగా కొనసాగించాలి. - ‘ఐఐటీల్లో కౌన్సెలింగ్‌కు కనీసం 75 శాతం మార్కులు’ అనే సడలింపునకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకుండా.. ఎంట్రెన్స్ పరీక్షలో అత్యధిక మార్కులు సాధించేలా కృషి చేయాలి. - జేఈఈ-మెయిన్, అడ్వాన్స్డ్ రెండు పరీక్షల్లో గత మూడేళ్లుగా ప్రశ్నలు పూర్తిగా అనువర్తిత, విశ్లేషణాత్మక దృక్పథంతో ఆలోచించి సమాధానం ఇవ్వాల్సినవిగా ఉంటున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు సిలబస్‌లోని ప్రతి అంశాన్ని క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. సదరు సమస్య పరిష్కారానికి అందుబాటులో ఉన్న అన్ని మార్గాలపై అవగాహన పెంచుకోవాలి. దీనివల్ల అన్నిటిలోకి సులువైన మార్గంపై అవగాహన వస్తుంది. పరీక్షలో సమయ పాలనకు ఎంతో తోడ్పడుతుంది. - ప్రశ్న- సమాధానం అనే దృక్పథాన్ని వీడి అనువర్తిత ఆధారిత పరిష్కార మార్గాలను అన్వేషించే విధంగా ప్రిపరేషన్ సాగించాలి. - ఇంటర్మీడియెట్ సిలబస్‌ను, జేఈఈ-మెయిన్స్, అడ్వాన్స్డ్ సిలబస్‌లతో బేరీజు వేసుకోవాలి. - వాటిలో తాము ఇప్పటికే పట్టు సాధించిన అంశాలు.. బలహీనంగా ఉన్న టాపిక్స్‌తో ఒక పట్టిక రూపొందించుకోవాలి. - బలహీనంగా ఉన్న అంశాలకు మెయిన్స్, అడ్వాన్స్డ్ పరీక్షల్లో ఉంటున్న ప్రాధాన్యతను గత ప్రశ్నపత్రాల విశ్లేషణ ద్వారా తెలుసుకోవాలి. దీనికి అనుగుణంగా ఆయా అంశాలకు ప్రిపరేషన్ పరంగా ప్రాధాన్యం ఇవ్వాలి. - తాము బలహీనంగా ఉన్న అంశాలకు.. ఇతర ముఖ్యమైన టాపిక్స్ మధ్య అనుసంధానం ఉంటే కచ్చితంగా వాటిపై పట్టు సాధించాలి. ముఖ్యంగా ఇలాంటి ఇంటర్-రిలేటెడ్ అంశాలు ఫిజిక్స్ విభాగంలో ఎక్కువగా ఉంటాయి. - జేఈఈ-మెయిన్ వచ్చే ఏడాది ఏప్రిల్ చివరి వారంలో, అడ్వాన్స్డ్ మే 24, 2015న జరగనుంది. అంటే.. విద్యార్థులు ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయంలో సిలబస్‌లోని అన్ని అంశాలపై పట్టు సాధించడం సులభమే. - ఇంటర్మీడియెట్ సిలబస్‌ను డిసెంబర్ చివరి నాటికి పూర్తి చేసి జనవరి నుంచి ఫిబ్రవరి 15 వరకు జేఈఈ ప్రిపరేషన్‌కు కేటాయించడం ఉపయుక్తంగా ఉంటుంది. - ఫిబ్రవరి 15 తర్వాత నుంచి బోర్డ్ పరీక్షల ప్రిపరేషన్‌కు కేటాయించాలి. - సాధారణంగా మార్చి చివరి వారానికి బోర్డ్ పరీక్షలు ముగుస్తాయి. ఆ తర్వాత మెయిన్‌కు కనీసం నెల రోజుల వ్యవధి లభిస్తుంది. ఈ సమయంలో పూర్తిగా జేఈఈ సిలబస్ రివిజన్‌కే ప్రాధాన్యం ఇవ్వాలి. - ఆ తర్వాత అడ్వాన్స్‌డ్‌కు మరో నెల రోజుల సమయం లభిస్తుంది. అప్పుడు కూడా రివిజన్‌కే ఎక్కువ సమయం కేటాయించాలి. - అంటే ఔత్సాహిక విద్యార్థులు ఫిబ్రవరి నాటికి సిలబస్ ప్రిపరేషన్ పూర్తి చేయాలి. లేదంటే ఆ తర్వాత బోర్డ్ పరీక్షలు, ప్రాక్టికల్స్ వంటి వాటికి సమయం సరిపోతుంది. ఆ తర్వాత లభించే సమయంలో జేఈఈ సిలబస్ ప్రిపరేషన్ ఆశించిన ఫలితాన్ని ఇవ్వదు. - ఇప్పట్నుంచే బోర్డ్ పాఠ్యాంశాలను, జేఈఈ సిలబస్ అంశాలను తులనాత్మక అధ్యయనం చేస్తూ.. తమకు అనుకూలమైన రీతిలో ముఖ్యాంశాలు, షార్ట్‌కట్ మెథడ్స్‌తో కూడిన సొంత నోట్స్‌ను రూపొందించుకోవాలి. - గత పరీక్షల్లో ప్రశ్నల క్లిష్టత స్థాయి, నెగెటివ్ మార్కింగ్ వంటివి పరిగణనలోకి తీసుకుంటే మొత్తం కేటాయించిన మార్కు ల్లో 50 నుంచి 60 శాతం మార్కులు సాధిస్తే కౌన్సెలింగ్ కాల్ ఆశించొచ్చు. ఈ మేరకు విద్యార్థులు తమ వ్యూహాలకు పదును పెట్టాలి. ఉత్సాహాన్ని నింపే మార్పులు జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు సంబంధించి తాజా మార్పులు విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపుతాయనడంలో సందేహం లేదు. కానీ ఇదే సమయంలో విద్యార్థులు కనీస అర్హత నిబంధనకే పరిమితం కాకుండా.. అత్యధిక మార్కుల సాధనకు కృషి చేయాలి. ఫలితంగా ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశానికి అవసరమైన మెయిన్ పరీక్ష విషయంలో లాభిస్తుంది. ప్రిపరేషన్ పరంగా విద్యార్థులు విశ్లేషణాత్మక దృక్పథంతో ఆయా అంశాల్లో పట్టు సాధించాలి. ఒక అంశాన్ని చదివే సమయంలో సదరు అంశానికి గత నాలుగైదేళ్లలో లభించిన ప్రాధాన్యం, ప్రశ్నల క్లిష్టత స్థాయిని పరిశీలిస్తూ చదివితే మరింత ఉపయుక్తంగా ఉంటుంది. - ఆకాశ్ చౌదరి, డెరైక్టర్, ఆకాశ్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ మంచి ర్యాంకే ప్రధాన లక్ష్యం జేఈఈ అడ్వాన్స్డ్ విద్యార్థులకు పరీక్షలో మంచి ర్యాంకు ప్రధాన లక్ష్యం కావాలి. నిబంధనల్లో సడలింపు ఉపశమనం కలిగించే మాట వాస్తవం. కానీ లక్షల మంది పోటీ పడే పరీక్షలో అకడమిక్ మార్కులు, అర్హత నిబంధనల విషయంలో కనీస అంశాలనే పరిగణనలోకి తీసుకోకూడదు. తాజా పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థులు బోర్డ్ పరీక్షల్లోనూ అత్యధిక మార్కులు సాధించాల్సిన ఆవశ్యకత నెలకొంది. - ఎం. అరవింద్ కుమార్, ఐఐటీ ఫౌండేషన్ కోర్సు డెరైక్టర్ టి.ఐ.ఎం.ఇ. ఇన్స్టిట్యూట్ స్వీయ ప్రణాళిక.. వ్యూహాత్మక ప్రిపరేషన్‌తో విజయం జేఈఈ-అడ్వాన్స్డ్ విధానంలో తాజా సడలింపు వల్ల చాలా మంది విద్యార్థులకు ప్రయోజనం లభిస్తుంది. టాప్-20 పర్సంటైల్ నిబంధన కారణంగా మా బ్యాచ్‌లో చాలా మంది విద్యార్థులకు అడ్వాన్స్‌డ్‌లో మంచి ర్యాంకు వచ్చినా ఐఐటీల్లో సీటు లభించలేదు. జేఈఈ- అడ్వాన్స్‌డ్‌లో విజయం సాధించాలంటే ముందుగా మానసిక సంసిద్ధత ఉండాలి. పోటీ పడే వారి సంఖ్యను చూసి ఆందోళన చెందకుండా, ఆత్మవిశ్వాసంతో వ్యవహరించాలి. సరైన సమయపాలన, తమ వ్యక్తిగత బలాలు, బలహీనతలను అనుసరించి ప్రాక్టికల్ అప్రోచ్‌తో ప్రిపరేషన్ సాగించాలి. డిసెంబర్ చివరి నాటికి ఇంటర్ సిలబస్‌ను పోటీ పరీక్షలో కోణంలో చదవాలి. తర్వాత వీలైనంత ఎక్కువగా మాక్ టెస్ట్‌లు, ప్రాక్టీస్ టెస్ట్‌లు రాయాలి. - రావూరి లోహిత్,ఫోర్త ర్యాంకర్, జేఈఈ అడ్వాన్స్డ్-2014 జేఈఈ- 2015 సమాచారం జేఈఈ మెయిన్ నోటిఫికేషన్ : అక్టోబర్ రెండవ వారం జేఈఈ మెయిన్ పరీక్ష : 2015, ఏప్రిల్ చివరి వారం జేఈఈ అడ్వాన్స్డ్ - 2015 ముఖ్య తేదీలు ఆన్లైన్ రిజిస్ట్రేషన్: మే 2, 2015 నుంచి మే 7, 2015 వరకు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ సదుపాయం: మే 9, 2015 నుంచి మే 12, 2015 వరకు పరీక్ష తేదీ: మే 24, 2015 మార్కుల వెల్లడి: జూన్ 13, 2015 తుది ఫలితాల వెల్లడి: జూన్ 18, 2015 వెబ్సైట్: http://jeeadv.iitkgp.ac.in/ జేఈఈ పరీక్ష విధానం - జేఈఈ పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ తరహాలో, పెన్-పేపర్ విధానంలో జరుగుతుంది. - మెయిన్స్ ఒకే పేపర్‌గా మూడు గంటల వ్యవధిలో మూడు విభాగాల్లో (మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ) ఉంటుంది. - అడ్వాన్స్డ్ పరీక్ష రెండు పేపర్లుగా జరుగుతుంది. ప్రతి పేపర్‌కు కేటాయించిన సమయం మూడు గంటలు. ప్రశ్నించే విభాగాలు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఎడ్యు న్యూస్ ప్రతి జిల్లాలో ఇన్నోవేషన్ ల్యాబ్స్ పాఠశాల, యూనివర్సిటీల స్థాయిలో విద్యార్థులను పరిశోధన దిశగా ఆకర్షితులను చేసే క్రమంలో ప్రభుత్వం కొత్త చర్యలకు ఉపక్రమిస్తోంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఇన్నోవేషన్ ల్యాబ్స్ ఏర్పాటు దిశగా యోచిస్తోంది. దేశంలో పరిశోధన కార్యకలాపాలను పెంచేందుకు తలపెట్టిన రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్ పథకంలో భాగంగా.. ఈ కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది. ఈ ఇన్నోవేషన్ ల్యాబ్‌లను.. ఇండస్ట్రీ, అకడమిక్ వర్గాల భాగస్వామ్యంతో సంబంధిత ఉన్నత విద్యా మండళ్లకు అనుసంధానం చేయనున్నట్లు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ ప్రకటించారు. దేశానికి అవసరమైన పరిశోధనల విషయంలో విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచే అవగాహన కల్పించడం వీటి ప్రధాన ఉద్దేశం. ప్రతి ఏటా వేయి మంది అమెరికా అధ్యాపకుల రాక భారతీయ యూనివర్సిటీల్లో ఇక నుంచి ప్రతి ఏటా వేయి మంది అమెరికా అధ్యాపకులు గెస్ట్ లెక్చర్స్ ఇవ్వనున్నారు. ముఖ్యంగా సైన్స్ అండ్ ఇన్నోవేషన్స్ విభాగంలో ఈ లెక్చర్స్ ఇచ్చేందుకు ఎంపిక చేసిన వేయి మంది అమెరికా అధ్యాపకులు కేంద్ర ప్రభుత్వ గుర్తింపు ఉన్న యూనివర్సిటీలకు రానున్నారు. దీనికి సంబంధించిన పూర్తి విధి విధానాలను కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ త్వరలో రూపొందించనుంది. -
వినూత్న పద్ధతులే.. ప్రాధాన్యతకు కారణం
గెస్ట్ కాలమ్ ‘ఐఐటీ-ముంబైలో చేరడమే ఆశయం’.. ‘ఐఐటీ-ముంబైలో సీఎస్ఈ చదవాలనుకుంటున్నాను’.. ‘ఐఐటీ-ముంబైలో ఏ బ్రాంచ్ వచ్చినా చేరతా ను’.. ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీలలో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంకర్లలో అత్యధిక విద్యార్థుల మాట ఇదే. పదహారు ఐఐటీలల్లో ఏదో ఒక ఇన్స్టిట్యూట్లో సీటు లక్ష్యంగా అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు సాధించిన విద్యార్థులు.. తొలి గమ్యంగా ఐఐటీ-ముంబైని ఎంపిక చేసుకుంటున్నారు. కారణం... ఈ క్యాంపస్‌లో బోధన, పరిశోధన తదితర అంశాల్లో అనుసరిస్తున్న వినూత్న పద్ధతులే అంటున్నారు ఐఐటీ-ముంబై డెరైక్టర్.. ప్రొఫెసర్ దేవాంగ్ వి. ఖఖర్. జేఈఈ అడ్వాన్స్డ్-2014 మొదటి దశ సీట్ అలాట్మెంట్ వివరాలు మంగళవారం విడుదల కానున్న నేపథ్యంలో.. ఐఐటీ-ముంబై విశిష్టతలు, విద్యార్థులకు అందుబాటులో ఉన్న సదుపాయాలపై ప్రొఫెసర్ దేవాంగ్ వి. ఖఖర్తో ఇంటర్వ్యూ... ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంకర్లలో అధికులు ఐఐటీ-ముంబైకే తొలి ఓటు అంటున్నారు? దీనిపై మీ అభిప్రాయం? ఈ ఏడాది అనే కాదు.. గత కొన్నేళ్లుగా ఐఐటీ ఎంట్రెన్స్ ర్యాంకర్లకు తొలి ప్రాధాన్యంగా ఐఐటీ-ముంబై నిలుస్తోంది. జేఈఈ-2013 గణాంకాలు పరిశీలిస్తే జాతీయస్థాయిలో టాప్-10లో ఎనిమిది మంది, టాప్-100లో 67 మంది ముంబై క్యాంపస్‌లో అడుగుపెట్టారు. ఐఐటీ-ముంబైకి ఇంత ప్రాధాన్యం లభించడానికి కారణం? ముఖ్యంగా బోధన, విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచేందుకు నిరంతరం చేపడుతున్న విశిష్టమైన కొత్త విధానాలే. విద్యార్థులు మెరుగైన పరిజ్ఞానం పొందేందుకు నిపుణులైన ఫ్యాకల్టీని నియమిస్తున్నాం. మొత్తం ఫ్యాకల్టీలో 98 శాతంపైగా పీహెచ్డీ ప్రొఫెసర్లే. వారు కూడా అంతర్జాతీయంగా అనేక జర్నల్స్, పబ్లికేషన్స్‌లో, అంతర్జాతీయ అనుభవం ఉన్నవారే. ఫ్యాకల్టీ- స్టూడెంట్ నిష్పత్తిని 1:13లో ఉంచుతున్నాం. దీంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య లభిస్తోంది. దీంతోపాటు ఆర్ అం డ్ డీ విషయంలో కూడా ఐఐటీ-ముంబై శరవేగంగా పురోగతి సాధిస్తోంది. గత మూడేళ్లలో సగటున 42 శాతం వృద్ధి సాధించింది. 2013-14 సంవత్సరంలో ఆర్ అండ్ డీ ద్వారా రూ. 217.17 కోట్లు లభించాయి. అంతేకాకుండా 72 పేటెంట్లు ఫైల్ చేయడం జరిగింది. 2008-09తో పోల్చితే ఇది 400 శాతం అధికం. పరిశోధన - అభివృద్ధిలో విద్యార్థుల పాత్ర? ఆర్ అండ్ డీ కార్యకలాపాల్లో అన్ని స్థాయిల విద్యార్థులు పాల్పంచుకునే అవకాశం కల్పిస్తున్నాం. పరిశోధన కార్యకలాపాల్లో నేరుగా భాగస్వామ్యం ఉన్న విద్యార్థులను.. అనుభవజ్ఞులైన స్కాలర్స్‌తో సంప్రదింపుల దిశగా ప్రోత్సహిస్తున్నాం. ఇందుకోసం జాతీయ, అంతర్జాతీయ సెమినార్లకు హాజరయ్యేందుకు కూడా ఆర్థిక సహకారం అందిస్తున్నాం. ఇలా.. 2012-13లో 254 మంది విద్యార్థులకు అంతర్జాతీయ సెమినార్లకు హాజరయ్యేందుకు నిధులు సమకూర్చాం. అంతేకాకుండా విదేశీ యూనివర్సిటీలు, ఇన్స్టిట్యూట్స్.. పరిశ్రమ వర్గాలతో పటిష్టమైన ఒప్పందాలు వంటివి కూడా ఐఐటీ-ముంబైని ముందంజలో నిలుపుతున్నాయి. అండర్-గ్రాడ్యుయేట్స్ కోసం ప్రత్యేకంగా తీసుకుంటున్న చర్యలు? కొత్తగా అడుగుపెట్టే విద్యార్థుల విషయంలో ప్రధానంగా పరిగణించాల్సిన అంశం సిలబస్ పరంగా మౌలిక అంశాలపై నైపుణ్యాలు అందించడం. ఇందుకోసం ప్రత్యేకంగా స్టూడెంట్ మెంటార్ ప్రోగ్రామ్ విధానానికి రూపకల్పన చేశాం. ఇది బీటెక్ మొదటి, ద్వితీయ సంవత్సరాల విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ప్రోగ్రామ్. ఫ్యాకల్టీ కో-ఆర్డినేటర్ పర్యవేక్షణలో సీనియర్ స్టూడెంట్స్‌ను భాగస్వాములను చేస్తూ ఈ ప్రోగ్రామ్ రూపొందించాం. ద్వితీయ సంవత్సరం పూర్తయిన తర్వాత కూడా మెంటార్షిప్ అవసరమైన విద్యార్థులకు ఆయా డిపార్ట్మెంట్ల స్థాయిలో ఇది అందుబాటులో ఉంటుంది. సీఎస్ఈ పట్ల అత్యధిక ఆదరణ ఉండటానికి కారణం? ఐఐటీ-ముంబైలోని సీఎస్ఈ డిపార్ట్మెంట్ దేశంలోనే అతి పెద్ద డిపార్ట్మెంట్గా చెప్పొచ్చు. ఫ్యాకల్టీ వ్యక్తిగత పరిశోధన, పరిశ్రమల సహకారంతో పరిశోధన కార్యకలాపాలు జరుగుతున్నాయి. సీఎస్ఈ విభాగంలోనే పది రీసెర్చ్ ల్యాబ్స్ ఉన్నాయి. రీసెర్చ్‌లో కేవలం ఉన్నత స్థాయి కోర్సు విద్యార్థులనే కాకుండా ఈ బ్రాంచ్‌కు చెందిన విద్యార్థులందరినీ భాగస్వాములను చేస్తున్నాం. కోర్సుతో సంబంధం లేకుండా విద్యార్థుల ఆలోచనలను స్వీకరిస్తున్నాం. ఆచరణ సాధ్యమయ్యేవాటి విషయంలో ఆర్ అండ్ డీ కార్యకలాపాలకు ఉపక్రమిస్తున్నాం. అకడెమిక్ ఎక్స్‌లెన్స్ దిశగా తీసుకుంటున్న చర్యలు? కొత్త కోర్సుల ఆవిష్కరణ, ఎప్పటికప్పుడు సెంటర్స్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ రూపకల్పన, ల్యాబ్స్‌కు నిరంతరం మార్పులు చేర్పులు చేయడం వంటివి అకడెమిక్ ఎక్స్‌లెన్స్‌లో ప్రధానమైనవి. కేవలం క్లాస్ రూం టీచింగ్-లెర్నింగ్‌కే పరిమితం కాకుండా ఆన్లైన్ మెటీరియల్, వీడియో లెక్చర్స్ సదుపాయం వంటి టెక్నాలజీ బేస్డ్ లెర్నింగ్ విధానాలను కూడా అమలు చేస్తున్నాం. వీటి ద్వారా విద్యార్థులకు నిరంతరం నైపుణ్యాలు అందించేందుకు కృషి చేస్తున్నాం. విద్యార్థులకు ఆర్థిక ప్రోత్సాహకాలు? ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించే క్రమంలో ఇన్స్టిట్యూట్, పూర్వ విద్యార్థుల సొసైటీల ఆధ్వర్యంలో పలు స్కాలర్‌షిప్స్‌ను అందిస్తున్నాం. గతేడాది 210 మందికి స్కాలర్షిప్స్ ఇచ్చాం. కరిక్యులం విషయంలో మార్పులు.. చేర్పులు? పరిశ్రమ ప్రస్తుత అవసరాలు, కొత్తగా ఆవిష్కృతమవుతున్న అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ.. వాటికి సరితూగే విధంగా కరిక్యులంలో నిరంతరం మార్పులు చేస్తున్నాం. ఇందుకోసం పరిశ్రమ వర్గాలతో నిరంతర సంప్రదింపులు సాగిస్తున్నాం. ఫలితంగా కోర్సు పూర్తయి సర్టిఫికెట్ చేతికొచ్చే సమయానికి ప్రతి విద్యార్థికి జాబ్-రెడీ స్కిల్స్ అందించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నాం. పరిశ్రమలు, ఇన్‌స్టిట్యూట్స్‌తో ఉన్న ఒప్పందాలు? రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీకి సంబంధించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాం. బోయింగ్, జర్మన్ డెవలప్మెంట్ కోఆపరేషన్, నోకియా సీమెన్స్ నెట్వర్క్స్ తదితర.. వందకుపైగా విదేశీ విద్యా సంస్థలతో కలిసి ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్స్‌ను అందిస్తున్నాం. దేశంలోనూ ఓఎన్జీసీ, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ తదితర ప్రభుత్వ సంస్థలతోపాటు టీసీఎస్, టాటా స్టీల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వంటి మరెన్నో ప్రైవేట్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని పరిశోధన- అభివృద్ధి, కరిక్యులం డెవలప్మెంట్ వంటివి చేపడుతున్నాం. ఇటీవల కాలంలో చాలామంది ఇండస్ట్రీ, ఇన్స్టిట్యూట్స్ ఒప్పందాలకు ప్రాధాన్యమిస్తున్నారు. దీనికి కారణం? ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా సంస్థల మధ్య అనుసంధానం అవసరమవుతోంది. అంతర్జాతీయంగా అన్ని సంస్థలు సరిహద్దులతో సంబంధం లేకుండా విస్తరిస్తున్నాయి. పర్యవసానంగా వారి వాస్తవ అవసరాలు తీర్చే విధంగా ఆర్ అండ్ డీ ఆవిష్కరణలు, ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌ల ఆవశ్యకత ఏర్పడుతోంది. అకడెమిక్ స్థాయిలోనే వాటికి పునాది వేసే విధంగా పలు సంస్థలు ఇన్‌స్టిట్యూట్స్‌తో చేతులు కలుపుతున్నాయి. ఐఐటీ-ముంబై కూడా స్టూడెంట్ - ఫ్యాకల్టీ ఎక్స్ఛేంజ్ కోణంలో యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్ (అమెరికా), ది స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూజెర్సీ, బ్రౌన్ యూనివర్సిటీ వంటి అంతర్జాతీయ ఇన్‌స్టిట్యూట్స్‌తో ఎక్స్ఛేంజ్ ఒప్పందాలు కుదుర్చుకుంది. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కిల్స్, బోధన ప్రాధాన్యం.. ఈ విషయాల్లో ఐఐటీ-ముంబై అనుసరిస్తున్న విధానాలు? నేటి అవసరాలను పరిగణనలోకి తీసుకుంటే విద్యార్థుల్లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కిల్స్‌ను అకడెమిక్ స్థాయి నుంచే పెంపొందించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ విషయంలో ఐఐటీ-ముంబై శరవేగంగా కదులుతోంది. ఎంటర్ప్రెన్యూరియల్ స్కిల్స్ పెంపొందించే విషయంలో.. సొసైటీ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పేరుతో ప్రత్యేకంగా టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేషన్ సెంటర్‌ను ప్రారంభించాం. గత పదేళ్లలో ఈ సెంటర్ ద్వారా 50కి పైగా కొత్త కంపెనీలు రూపుదిద్దుకున్నాయి. బ్యాచిలర్ స్థాయి నుంచే ఎంటర్ప్రెన్యూరియల్ స్కిల్స్ అందించే క్రమంలో.. బీటెక్‌లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ను మైనర్ ప్రోగ్రామ్‌గా త్వరలోనే ప్రారంభించనున్నాం. అకడెమిక్‌గా అంతర్జాతీయ గుర్తింపు ఉన్నప్పటికీ.. ర్యాంకింగ్స్ పరంగా వెనుకంజలో ఉండటానికి కారణం? ర్యాంకింగ్స్‌లో అన్ని విషయాలను పరిశీలించాలి. అకడెమిక్ విభాగాల కు సంబంధించిన ర్యాంకుల్లో ఐఐటీ-ముంబై, ఇతర ఐఐటీల స్కోరు మెరుగ్గానే ఉంటోంది. అయితే ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ, స్టూడెంట్స్, స్టూడెంట్-ఫ్యాకల్టీ రేషియో, ప్రచురితమైన రీసెర్చ్ పేపర్స్ తదితర అంశాల కారణంగా ప్రపంచ ర్యాంకుల్లో కొంత వెనుకంజలో ఉంటున్నాం. వీటిని కూడా తీవ్రంగా పరిగణిస్తూ క్రమేణా మెరుగుపడేందుకు కృషి చేస్తున్నాం. కెమికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్‌గా ఈ విభాగానికి గల భవిష్యత్తుపై మీ అభిప్రాయం? కెమికల్ ఇంజనీరింగ్ ఎవర్గ్రీన్ అండ్ ఇంపార్టెంట్. కేవలం కెమికల్ రంగంలోనే కాకుండా ఫార్మా, బయో కెమికల్, బయోటెక్నాలజీ, పాలిమర్, సిమెంట్, ఫుడ్ ప్రాసెసింగ్, మెటీరియల్స్ ప్రాసెసింగ్ తదితర ఎన్నో విభాగాల్లో కెమికల్ ఇంజనీర్ల అవసరం ఉంది. కాబట్టి ఈ బ్రాంచ్ ఎంపిక విషయంలో ఆందోళన చెందక్కర్లేదు. ఐఐటీ-ముంబైలో అడుగుపెట్టే విద్యార్థులకు మీరిచ్చే సలహా? బోధన, అభ్యసనం, పరిశోధన తదితర కోణాల్లో సైన్స్, ఇంజనీరింగ్, టెక్నాలజీ విభాగాలకు సంబంధించి అకడెమిక్‌గా ఐఐటీ-ముంబై ఎన్నో అవకాశాలను కల్పిస్తోంది. విద్యార్థులు దీన్ని అందిపుచ్చుకోవాలి. అంతేకాకుండా విద్యార్థులను ఒత్తిడికి దూరం చేసే విధంగా సోషల్ సర్వీస్ తదితర ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా జరుగుతుంటాయి. వీటిలోనూ ఉత్సాహంగా పాల్పంచుకోవాలి. అప్పుడే సామాజిక స్పృహ కూడా ఏర్పడి బాధ్యత గల పౌరులుగా రూపొందుతారు.