వినూత్న పద్ధతులే.. ప్రాధాన్యతకు కారణం | interviews with Professor devang V. Khakhar | Sakshi
Sakshi News home page

వినూత్న పద్ధతులే.. ప్రాధాన్యతకు కారణం

Published Mon, Jun 30 2014 12:54 AM | Last Updated on Sat, Sep 2 2017 9:34 AM

వినూత్న పద్ధతులే.. ప్రాధాన్యతకు కారణం

వినూత్న పద్ధతులే.. ప్రాధాన్యతకు కారణం

 గెస్ట్ కాలమ్
 
‘ఐఐటీ-ముంబైలో చేరడమే ఆశయం’.. ‘ఐఐటీ-ముంబైలో సీఎస్‌ఈ చదవాలనుకుంటున్నాను’.. ‘ఐఐటీ-ముంబైలో ఏ బ్రాంచ్ వచ్చినా చేరతా ను’.. ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీలలో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ ర్యాంకర్లలో అత్యధిక విద్యార్థుల మాట ఇదే. పదహారు ఐఐటీలల్లో ఏదో ఒక ఇన్‌స్టిట్యూట్‌లో సీటు లక్ష్యంగా అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు సాధించిన విద్యార్థులు.. తొలి గమ్యంగా ఐఐటీ-ముంబైని ఎంపిక చేసుకుంటున్నారు. కారణం... ఈ క్యాంపస్‌లో బోధన, పరిశోధన తదితర అంశాల్లో అనుసరిస్తున్న వినూత్న పద్ధతులే అంటున్నారు ఐఐటీ-ముంబై డెరైక్టర్.. ప్రొఫెసర్ దేవాంగ్ వి. ఖఖర్. జేఈఈ అడ్వాన్స్‌డ్-2014 మొదటి దశ సీట్ అలాట్‌మెంట్ వివరాలు మంగళవారం విడుదల కానున్న నేపథ్యంలో.. ఐఐటీ-ముంబై విశిష్టతలు, విద్యార్థులకు అందుబాటులో ఉన్న సదుపాయాలపై ప్రొఫెసర్ దేవాంగ్ వి. ఖఖర్‌తో ఇంటర్వ్యూ...
 
ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్‌డ్ ర్యాంకర్లలో అధికులు ఐఐటీ-ముంబైకే తొలి ఓటు అంటున్నారు? దీనిపై మీ అభిప్రాయం?

ఈ ఏడాది అనే కాదు.. గత కొన్నేళ్లుగా ఐఐటీ ఎంట్రెన్స్ ర్యాంకర్లకు తొలి ప్రాధాన్యంగా ఐఐటీ-ముంబై నిలుస్తోంది. జేఈఈ-2013 గణాంకాలు పరిశీలిస్తే జాతీయస్థాయిలో టాప్-10లో ఎనిమిది మంది, టాప్-100లో 67 మంది ముంబై క్యాంపస్‌లో అడుగుపెట్టారు.
 
ఐఐటీ-ముంబైకి ఇంత ప్రాధాన్యం లభించడానికి కారణం?

ముఖ్యంగా బోధన, విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచేందుకు నిరంతరం చేపడుతున్న విశిష్టమైన కొత్త విధానాలే. విద్యార్థులు మెరుగైన పరిజ్ఞానం పొందేందుకు నిపుణులైన ఫ్యాకల్టీని నియమిస్తున్నాం. మొత్తం ఫ్యాకల్టీలో 98 శాతంపైగా పీహెచ్‌డీ ప్రొఫెసర్లే. వారు కూడా అంతర్జాతీయంగా అనేక జర్నల్స్, పబ్లికేషన్స్‌లో, అంతర్జాతీయ అనుభవం ఉన్నవారే. ఫ్యాకల్టీ- స్టూడెంట్ నిష్పత్తిని 1:13లో ఉంచుతున్నాం. దీంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య లభిస్తోంది. దీంతోపాటు ఆర్ అం డ్ డీ విషయంలో కూడా ఐఐటీ-ముంబై శరవేగంగా పురోగతి సాధిస్తోంది. గత మూడేళ్లలో సగటున 42 శాతం వృద్ధి సాధించింది. 2013-14 సంవత్సరంలో ఆర్ అండ్ డీ ద్వారా రూ. 217.17 కోట్లు లభించాయి. అంతేకాకుండా 72 పేటెంట్లు ఫైల్ చేయడం జరిగింది. 2008-09తో పోల్చితే ఇది 400 శాతం అధికం.
 
పరిశోధన - అభివృద్ధిలో విద్యార్థుల పాత్ర?

ఆర్ అండ్ డీ కార్యకలాపాల్లో అన్ని స్థాయిల విద్యార్థులు పాల్పంచుకునే అవకాశం కల్పిస్తున్నాం. పరిశోధన  కార్యకలాపాల్లో నేరుగా భాగస్వామ్యం ఉన్న విద్యార్థులను.. అనుభవజ్ఞులైన స్కాలర్స్‌తో సంప్రదింపుల దిశగా ప్రోత్సహిస్తున్నాం. ఇందుకోసం జాతీయ, అంతర్జాతీయ సెమినార్లకు హాజరయ్యేందుకు కూడా ఆర్థిక సహకారం అందిస్తున్నాం. ఇలా..  2012-13లో 254 మంది విద్యార్థులకు అంతర్జాతీయ సెమినార్లకు హాజరయ్యేందుకు నిధులు సమకూర్చాం. అంతేకాకుండా విదేశీ యూనివర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్స్.. పరిశ్రమ వర్గాలతో పటిష్టమైన ఒప్పందాలు వంటివి కూడా ఐఐటీ-ముంబైని ముందంజలో నిలుపుతున్నాయి.
 
అండర్-గ్రాడ్యుయేట్స్ కోసం ప్రత్యేకంగా తీసుకుంటున్న చర్యలు?

కొత్తగా అడుగుపెట్టే విద్యార్థుల విషయంలో ప్రధానంగా పరిగణించాల్సిన అంశం సిలబస్ పరంగా మౌలిక అంశాలపై నైపుణ్యాలు అందించడం. ఇందుకోసం ప్రత్యేకంగా స్టూడెంట్ మెంటార్ ప్రోగ్రామ్ విధానానికి రూపకల్పన చేశాం. ఇది బీటెక్ మొదటి, ద్వితీయ సంవత్సరాల విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ప్రోగ్రామ్. ఫ్యాకల్టీ కో-ఆర్డినేటర్ పర్యవేక్షణలో సీనియర్ స్టూడెంట్స్‌ను భాగస్వాములను చేస్తూ ఈ ప్రోగ్రామ్ రూపొందించాం. ద్వితీయ సంవత్సరం పూర్తయిన తర్వాత కూడా మెంటార్‌షిప్ అవసరమైన విద్యార్థులకు ఆయా డిపార్ట్‌మెంట్‌ల స్థాయిలో ఇది అందుబాటులో ఉంటుంది.
 
సీఎస్‌ఈ పట్ల అత్యధిక ఆదరణ ఉండటానికి కారణం?

ఐఐటీ-ముంబైలోని సీఎస్‌ఈ డిపార్ట్‌మెంట్ దేశంలోనే అతి పెద్ద డిపార్ట్‌మెంట్‌గా చెప్పొచ్చు. ఫ్యాకల్టీ వ్యక్తిగత పరిశోధన, పరిశ్రమల సహకారంతో పరిశోధన కార్యకలాపాలు జరుగుతున్నాయి. సీఎస్‌ఈ విభాగంలోనే పది రీసెర్చ్ ల్యాబ్స్ ఉన్నాయి. రీసెర్చ్‌లో కేవలం ఉన్నత స్థాయి కోర్సు విద్యార్థులనే కాకుండా ఈ బ్రాంచ్‌కు చెందిన విద్యార్థులందరినీ భాగస్వాములను చేస్తున్నాం. కోర్సుతో సంబంధం లేకుండా విద్యార్థుల ఆలోచనలను స్వీకరిస్తున్నాం. ఆచరణ సాధ్యమయ్యేవాటి విషయంలో ఆర్ అండ్ డీ కార్యకలాపాలకు ఉపక్రమిస్తున్నాం.
 
అకడెమిక్ ఎక్స్‌లెన్స్ దిశగా తీసుకుంటున్న చర్యలు?

కొత్త కోర్సుల ఆవిష్కరణ, ఎప్పటికప్పుడు సెంటర్స్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ రూపకల్పన, ల్యాబ్స్‌కు నిరంతరం మార్పులు చేర్పులు చేయడం వంటివి అకడెమిక్ ఎక్స్‌లెన్స్‌లో ప్రధానమైనవి. కేవలం క్లాస్ రూం టీచింగ్-లెర్నింగ్‌కే పరిమితం కాకుండా ఆన్‌లైన్ మెటీరియల్, వీడియో లెక్చర్స్ సదుపాయం వంటి టెక్నాలజీ బేస్డ్ లెర్నింగ్ విధానాలను కూడా అమలు చేస్తున్నాం. వీటి ద్వారా విద్యార్థులకు నిరంతరం నైపుణ్యాలు అందించేందుకు కృషి చేస్తున్నాం.
 
విద్యార్థులకు ఆర్థిక ప్రోత్సాహకాలు?

ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించే క్రమంలో ఇన్‌స్టిట్యూట్, పూర్వ విద్యార్థుల సొసైటీల ఆధ్వర్యంలో పలు స్కాలర్‌షిప్స్‌ను అందిస్తున్నాం. గతేడాది 210 మందికి స్కాలర్‌షిప్స్ ఇచ్చాం.
 
కరిక్యులం విషయంలో మార్పులు.. చేర్పులు?

పరిశ్రమ ప్రస్తుత అవసరాలు, కొత్తగా ఆవిష్కృతమవుతున్న అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ.. వాటికి సరితూగే విధంగా కరిక్యులంలో నిరంతరం మార్పులు చేస్తున్నాం. ఇందుకోసం పరిశ్రమ వర్గాలతో నిరంతర సంప్రదింపులు సాగిస్తున్నాం. ఫలితంగా కోర్సు పూర్తయి సర్టిఫికెట్ చేతికొచ్చే సమయానికి ప్రతి విద్యార్థికి జాబ్-రెడీ స్కిల్స్ అందించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నాం.
 
పరిశ్రమలు, ఇన్‌స్టిట్యూట్స్‌తో ఉన్న ఒప్పందాలు?

రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీకి సంబంధించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాం. బోయింగ్, జర్మన్ డెవలప్‌మెంట్ కోఆపరేషన్, నోకియా సీమెన్స్ నెట్‌వర్క్స్ తదితర.. వందకుపైగా విదేశీ విద్యా సంస్థలతో కలిసి ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్స్‌ను అందిస్తున్నాం. దేశంలోనూ ఓఎన్‌జీసీ, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ తదితర ప్రభుత్వ సంస్థలతోపాటు టీసీఎస్, టాటా స్టీల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వంటి మరెన్నో ప్రైవేట్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని పరిశోధన- అభివృద్ధి, కరిక్యులం డెవలప్‌మెంట్ వంటివి చేపడుతున్నాం.
 
ఇటీవల కాలంలో చాలామంది ఇండస్ట్రీ, ఇన్‌స్టిట్యూట్స్ ఒప్పందాలకు ప్రాధాన్యమిస్తున్నారు. దీనికి కారణం?

ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా సంస్థల మధ్య అనుసంధానం అవసరమవుతోంది. అంతర్జాతీయంగా అన్ని సంస్థలు సరిహద్దులతో సంబంధం లేకుండా విస్తరిస్తున్నాయి. పర్యవసానంగా వారి వాస్తవ అవసరాలు తీర్చే విధంగా ఆర్ అండ్ డీ ఆవిష్కరణలు, ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌ల ఆవశ్యకత ఏర్పడుతోంది. అకడెమిక్ స్థాయిలోనే వాటికి పునాది వేసే విధంగా పలు సంస్థలు ఇన్‌స్టిట్యూట్స్‌తో చేతులు కలుపుతున్నాయి. ఐఐటీ-ముంబై కూడా స్టూడెంట్ - ఫ్యాకల్టీ ఎక్స్ఛేంజ్  కోణంలో యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్ (అమెరికా), ది స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూజెర్సీ, బ్రౌన్ యూనివర్సిటీ వంటి అంతర్జాతీయ ఇన్‌స్టిట్యూట్స్‌తో ఎక్స్ఛేంజ్ ఒప్పందాలు కుదుర్చుకుంది.
 
ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కిల్స్, బోధన ప్రాధాన్యం.. ఈ విషయాల్లో ఐఐటీ-ముంబై అనుసరిస్తున్న విధానాలు?

నేటి అవసరాలను పరిగణనలోకి తీసుకుంటే విద్యార్థుల్లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కిల్స్‌ను అకడెమిక్ స్థాయి నుంచే పెంపొందించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ విషయంలో ఐఐటీ-ముంబై శరవేగంగా కదులుతోంది. ఎంటర్‌ప్రెన్యూరియల్ స్కిల్స్ పెంపొందించే విషయంలో.. సొసైటీ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పేరుతో ప్రత్యేకంగా టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేషన్ సెంటర్‌ను ప్రారంభించాం. గత పదేళ్లలో ఈ సెంటర్ ద్వారా 50కి పైగా కొత్త కంపెనీలు రూపుదిద్దుకున్నాయి. బ్యాచిలర్ స్థాయి నుంచే ఎంటర్‌ప్రెన్యూరియల్ స్కిల్స్ అందించే క్రమంలో.. బీటెక్‌లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ను మైనర్ ప్రోగ్రామ్‌గా త్వరలోనే ప్రారంభించనున్నాం.
 
అకడెమిక్‌గా అంతర్జాతీయ గుర్తింపు ఉన్నప్పటికీ.. ర్యాంకింగ్స్ పరంగా వెనుకంజలో ఉండటానికి కారణం?

 ర్యాంకింగ్స్‌లో అన్ని విషయాలను పరిశీలించాలి. అకడెమిక్ విభాగాల కు సంబంధించిన ర్యాంకుల్లో ఐఐటీ-ముంబై, ఇతర ఐఐటీల స్కోరు మెరుగ్గానే ఉంటోంది. అయితే ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ, స్టూడెంట్స్, స్టూడెంట్-ఫ్యాకల్టీ రేషియో, ప్రచురితమైన రీసెర్చ్ పేపర్స్ తదితర అంశాల కారణంగా ప్రపంచ ర్యాంకుల్లో కొంత వెనుకంజలో ఉంటున్నాం. వీటిని కూడా తీవ్రంగా పరిగణిస్తూ క్రమేణా మెరుగుపడేందుకు కృషి చేస్తున్నాం.
 
కెమికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్‌గా ఈ విభాగానికి గల భవిష్యత్తుపై మీ అభిప్రాయం?

కెమికల్ ఇంజనీరింగ్ ఎవర్‌గ్రీన్ అండ్ ఇంపార్టెంట్. కేవలం కెమికల్ రంగంలోనే కాకుండా ఫార్మా, బయో కెమికల్, బయోటెక్నాలజీ, పాలిమర్, సిమెంట్, ఫుడ్ ప్రాసెసింగ్, మెటీరియల్స్ ప్రాసెసింగ్ తదితర ఎన్నో విభాగాల్లో కెమికల్ ఇంజనీర్ల అవసరం ఉంది. కాబట్టి ఈ బ్రాంచ్ ఎంపిక విషయంలో ఆందోళన చెందక్కర్లేదు.

ఐఐటీ-ముంబైలో అడుగుపెట్టే విద్యార్థులకు మీరిచ్చే సలహా?

బోధన, అభ్యసనం, పరిశోధన తదితర కోణాల్లో సైన్స్, ఇంజనీరింగ్, టెక్నాలజీ విభాగాలకు సంబంధించి అకడెమిక్‌గా ఐఐటీ-ముంబై ఎన్నో అవకాశాలను కల్పిస్తోంది. విద్యార్థులు దీన్ని అందిపుచ్చుకోవాలి. అంతేకాకుండా విద్యార్థులను ఒత్తిడికి దూరం చేసే విధంగా సోషల్ సర్వీస్ తదితర ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా జరుగుతుంటాయి. వీటిలోనూ ఉత్సాహంగా పాల్పంచుకోవాలి. అప్పుడే సామాజిక స్పృహ కూడా ఏర్పడి బాధ్యత గల పౌరులుగా రూపొందుతారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement