విశ్లేషణ
అంతర్జాతీయంగా ప్రతిష్ఠాత్మక జర్నల్స్ అయిన ‘నేచర్’, ‘ఎకనమిస్ట్’లు శాస్త్రరంగంలో చైనా అత్యంత శక్తిమంతంగా ఎదుగుతోందని ప్రకటించాయి. సైన్స్, టెక్నాలజీ రంగాల్లో మూడో అతిపెద్ద శక్తిగా భారత్ కొనసాగిన విషయం తెలిసిందే. అణు, అంతరిక్ష, వ్యాక్సిన్ అభివృద్ధి రంగాల్లో భారత్ రాణించిందన్నదీ వాస్తవమే. కానీ చైనా పలు కీలక రంగాల్లో భారత్‌తోపాటు అమెరికా, యూరప్‌లను సైతం అధిగమించింది. అంతరిక్ష రంగంలో చైనా మన కన్నా కనీసం పదేళ్లు ముందుంది. 2003లో తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర జరపడమే కాదు, సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని నిర్మిస్తోంది. ప్రపంచ టాప్–10 జాబితాలో భారతీయ పరిశోధన సంస్థలు లేవన్నది గమనార్హం. నిద్రాణంగా ఉన్న భారత్‌కు చైనా పురోగతి ఓ మేలుకొలుపు కావాలి.
ఉన్నత విద్యా రంగంలో భారత్ గతంలో ఎన్నడూ లేని స్థాయి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. వైద్యం, పరిశోధన రంగాల్లో ప్రవేశానికి నిర్వహిస్తున్న పరీక్షల పద్ధతి, ప్రామాణికత రెండూ లీకేజీల పుణ్యమా అని ప్రశ్నార్థకంగా మారాయి. నీట్‌తోపాటు భారతీయ విశ్వవిద్యాలయాల్లో, జాతీయ పరిశోధన సంస్థల్లో రీసెర్చ్ ఫెలోషిప్ కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశ్న పత్రం కూడా లీక్ అయ్యింది. పరిశోధన రంగంలో ప్రాథమిక స్థాయిలో చేరే విద్యార్థుల కోసం ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్, ఐఐటీల వంటి సంస్థలు కూడా నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్‌పై ఆధారపడుతూంటాయి.
పీహెచ్‌డీల్లో ప్రవేశానికి ఈ పరీక్షలో అర్హత సాధించడం తప్పనిసరి. బోధన వృత్తుల్లో స్థిరపడే వారికి కూడా. ఈ పరీక్షలను విశ్వసనీయతతో, సకాలంలో నిర్వహించడం భారతదేశ ఉన్నత విద్య, పరిశోధన రంగాలపై ప్రత్యక్షంగా ప్రభావం చూపుతుందన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఒకపక్క ఈ అనూహ్య పరిస్థితిని ఎదుర్కొంటుండగా, ఇంకోపక్క అంతర్జాతీయ స్థాయిలో పరిశోధన రంగంలో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ మార్పుల్లో చైనా కంటే భారత్ బాగా వెనుకబడిపోతూండటం గమనార్హం.
పరిశోధన పత్రాల్లో టాప్
ప్రపంచంలో ఒక దేశపు శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాల సత్తాను నిర్ధారించేది ఉన్నత విద్య, పరిశోధన రంగాల కోసం ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాల విస్తృతి ఎంత? అన్నది. ఎంత ఉత్పత్తి అవుతోంది? నాణ్యత ఏమిటి? అన్నది నిర్ధారించేందుకు చాలా మార్గాలున్నాయి. పరిశోధన వ్యాసాల ప్రచురణ, సాధించిన పేటెంట్లు, నోబెల్ వంటి అంతర్జాతీయ అవార్డులు, పారిశ్రామిక రంగానికి బదిలీ అయిన టెక్నాలజీలు, పరిశోధనల ద్వారా సమాజానికి ఒనగూరిన లబ్ధి... ఇలా చాలా మార్గాలున్నాయి.
పరిశోధన పత్రాల ప్రచురణే ప్రధాన అంశంగా ఏటా రీసెర్చ్ రంగంలో అగ్రస్థానంలో ఉన్న వారి జాబితాను ‘నేచర్’ జర్నల్ ప్రచురిస్తుంటుంది. ఈ జాబితాలో అత్యున్నత స్థాయి పరిశోధన ఫలితాల ఆధారంగా 500 సంస్థలు ఉంటాయి. ఏటా జనవరి 1 నుంచి డిసెంబరు 31 మధ్య పరిణామాలను పరిగణనలోకి తీసుకుంటారు. మొత్తం 145 అంతర్జాతీయ జర్నళ్లలో ప్రచురితమైన పరిశోధన పత్రాలను పరిశీలించి, ఒక స్వతంత్ర శాస్త్రవేత్తల బృందం ఈ జాబితాను సిద్ధం చేస్తుంది.
నేచర్ ప్రచురించిన తాజా జాబితాలో దేశాల పరిశోధన సామర్థ్యాల ఆధారంగా అమెరికా, జర్మనీ, యూకే, జపాన్ , ఫ్రాన్స్, కెనడా, దక్షిణ కొరియాలను కూడా అధిగమించి చైనా అగ్రస్థానంలోకి చేరింది. భారత్ తొమ్మిదో స్థానంలో ఉంటూ... టాప్ 10 దేశాల్లో ఒకటిగా ఉన్నామన్న సంతృప్తి మాత్రమే మనకు మిగిల్చింది. భారత్ వంతు గత ఏడాది చైనా వంతు కంటే ఎక్కువ కావడం కూడా గమనార్హం. అయితే సంస్థల స్థాయిలో పరిశోధన పత్రాలను పరిశీలిస్తే నిరాశే మిగులుతుంది.
అంతర్జాతీయంగా టాప్ పది పరిశోధన సంస్థల్లో ఏడు చైనావి కావడం... హార్వర్డ్ (రెండో స్థానం), మ్యాక్స్ ప్లాంక్ సొసైటీ (మూడో స్థానం), ఫ్రెంచ్ నేషనల్ సెంటర్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ (ఏడో స్థానం) మాత్రమే టాప్ 10లోని ఇతర సంస్థలు కావడం గమనార్హం. మసాచూసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీలు సైతం 14, 15 స్థానాల్లో నిలిచాయి. చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అగ్రస్థానంలో ఉంది.
టాప్–10లో లేము!
టాప్ సంస్థల్లో భారతీయ పరిశోధన సంస్థలు చాలా దిగువన ఉన్నాయి. ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ 174వ స్థానంలో ఉంటే, ఐఐటీ–బాంబే 247లో ఉంది. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ 275లో, టాటా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ 283వ స్థానంలోనూ ఉన్నాయి.
హోమీ భాభా నేషనల్ ఇన్ స్టిట్యూట్(296), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్–కోల్‌కతా (321), ఐఐటీ–గౌహతి (355), ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్(363), ఐసర్–భోపాల్(379), ఐఐటీ–కాన్పూర్(405), ఐఐటీ–మద్రాస్(407), ఐఐటీ–ఢిల్లీ (428), ఐసర్–పుణె (439), జవహర్‌లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ సైంటిఫిక్ రీసెర్చ్(450), అకాడమీ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇన్నొవేటివ్ రీసెర్చ్(487) ర్యాంకింగ్ కూడా దిగువలోనే ఉండటం గమనార్హం.
ర్యాంకింగ్‌ల మాట ఇలా ఉంటే, పరిశోధనలు చేస్తున్న రంగాల విషయం చూద్దాం. భౌతిక, రసాయన, భూ, పర్యావరణ రంగాల్లో చైనా అగ్రస్థానంలో ఉండగా... అమెరికా, యూరప్ రెండూ జీవ, వైద్య శాస్త్రల్లో ముందంజలో ఉన్నాయి. అప్లైడ్ సైన్సెస్ రంగంలోనూ చైనా నుంచే అత్యధిక పరిశోధన పత్రాలు ప్రచురితమవుతుండటం విశేషం.
చైనా కొన్ని భారీ సైన్స్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు కూడా పెట్టింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్డ్–అపెర్చర్ రేడియో టెలిస్కోపు అలాంటిదే. కృష్ణ పదార్థం ఉనికిని గుర్తించేందుకు చేపట్టిన భారీ భూగర్భ పరిశోధన ఇంకోటి. అలాగే క్వాంటమ్ కంప్యూటింగ్ రంగంలోనూ పలు చైనా సంస్థల్లో ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి.
అంతరిక్ష రంగం విషయానికి వస్తే... చైనా మన దేశం కంటే కనీసం పదేళ్లు ముందుందని చెప్పాలి. 2003లో తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర జరపడమే కాదు, సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని నిర్మిస్తోంది. ఇటీవలే జాబిల్లి నుంచి రాతి నమూనాలను విజయవంతంగా వెనక్కు తెచ్చిన రోబోటిక్ మిషన్ చేపట్టింది.
మన స్పందన ఎలా ఉండాలి?
శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో చైనా పురోగతికి మనం ఎలా స్పందించాలి? పదేళ్లుగా అధికారంలో ఉన్న ప్రభుత్వం చేస్తున్నట్లే వీటిని తిరస్కరించడం సులువైన పని అవుతుంది. జాబితా తయారీలో పలు లోటుపాట్లు ఉన్నాయని చెప్పవచ్చు. అయితే ఇది వాస్తవ పరిస్థితిని మార్చదు. ఇంకో పద్ధతి కూడా ఉంది. ఈ జాబితాను ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించడం. టాప్ దేశాల జాబితాలో భారత్ కూడా ఉంది కాబట్టి, దాని ఆధారంగా మరింత ముందుకు వెళ్లేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేయాలి.
చైనా ఈ ఘనతలన్నీ సాధించేందుకు ఏం చేసింది? ఎక్కడ తప్పటడుగులు వేసిందన్నది నిజాయితీగా పరిశీలించి గుణపాఠాలు నేర్చుకోవాలి. ‘నైన్ లీగ్’ లేదా ‘ప్రాజెక్ట్ 211’లో భాగంగా దేశవ్యాప్తంగా యూనివర్సిటీలు, ప్రపంచస్థాయి పరిశోధన శాలలను అభివృద్ధి చేసేందుకు చైనా భారీగా నిధులు ఖర్చు పెడుతోంది. ఐసర్ వంటి సంస్థల అభివృద్ధికి భారత్ చేసిన ప్రయత్నంతో ఎన్నో లాభాలు వచ్చినా ఈ విషయంలో చేయాల్సింది ఇంకా మిగిలే ఉంది. పరిశోధన పత్రాల ప్రచురణకు చైనా నగదు బహుమతులను ప్రకటించి తప్పు చేసిందని చెప్పాలి. దీనివల్ల అనైతిక పద్ధతులు పెరిగిపోయాయి. భారత్ ఇలాంటి పని చేయకుండా ఉండటం అవసరం.
భారత్‌లో శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో పురోగతిని అడ్డుకుంటున్న కొన్ని సాధారణ విషయాల్లో జీడీపీలో కొంత శాతాన్ని ఈ రంగాలకు కేటాయించకపోవడం కూడా ఉంది. నిధుల పంపిణీ పద్ధతులు, కొత్త పరిశోధన సంస్థల ఏర్పాటు, విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలకు ప్రోత్సాహం వంటివి స్తంభించిపోయి ఉన్నాయి. నేషనల్ సైన్స్ అకాడమీలు, ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ కార్యాలయం, టెక్నాలజీ ఫోర్‌కాస్టింగ్ ఏజెన్సీ వంటివి కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సెల్ఫీ పాయింట్ల వద్ద విజయోత్సవాలను నిర్వహించడంలో బిజీగా ఉండిపోయాయి. నిద్రాణంగా ఉన్న ఇలాంటి వారందరికీ చైనా పురోగతి ఓ మేలుకొలుపు కావాలి.
దినేశ్ సి. శర్మ
వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత
(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment