dinesh sharma
-
నోబెల్ అవార్డులు చెప్పే పాఠాలు
ఈ ఏడాది భౌతిక, రసాయనశాస్త్ర నోబెల్ అవార్డులను పరిశీలించారా? ఈ రెండింటితోనూ రేపటితరం టెక్నాలజీగా చెప్పుకొంటున్న కృత్రిమ మేధకు సంబంధం ఉంది. కృత్రిమ మేధ పునాదులు దశాబ్దాల నాటి ఆవిష్కరణల్లో ఉన్నాయని ఈ పురస్కారాలు చాటుతున్నాయి. మౌలికాంశాలపై పరిశోధ నలు ఎంత ముఖ్యమో కూడా ఇవి మరోసారి స్పష్టం చేస్తున్నాయి. మానవ విజ్ఞానం విస్తరించేందుకూ ఇవి ఎంతగానో అవసరం. మౌలికాంశాల పరి శోధనలకు ప్రత్యామ్నాయం లేదు. భారతీయులెవరికీ నోబెల్ అవార్డులు దక్కడం లేదంటే... అందుకు కారణం అదే. అంతర్జాతీయ స్థాయి శాస్త్ర రంగంలో భారత్ తనదైన ముద్ర వేయాలంటే, మౌలికాంశాలపై పరిశోధనలకు పెద్దపీట వేయాలి. ఇదో దీర్ఘకాలిక కార్యక్రమం అన్నది కూడా గుర్తు పెట్టుకోవాలి.ఈ ఏడాది భౌతిక శాస్త్ర నోబెల్ అవార్డులు పొందిన జాన్ హాప్ఫీల్డ్, జెఫ్రీ హంటన్ భౌతిక శాస్త్ర సిద్ధాంతాలను, టూల్సును మెషీన్ లెర్నింగ్ కోసం ఉపయోగించారు. అణువు తిరిగే పద్ధతి సాయంతో హాప్ఫీల్డ్ సమా చారాన్ని నిల్వ చేసుకునే, పునర్మించే నిర్మాణం రూపొందించారు.హంటన్ సమాచార ధర్మాలను స్వతంత్రంగా గుర్తించగల పద్ధతిని ఆవిష్కరించారు. ప్రస్తుతం విస్తృత వినియోగంలో ఉన్న న్యూరల్ నెట్ వర్క్‌కు పునాదులు ఇవే. కాలక్రమంలో ఈ ఆవిష్కరణలు కంప్యూటర్లు కాస్తా మానవుల జ్ఞాపకశక్తి, నేర్చుకునే శక్తులను అనుకరించేంత శక్తి మంతమయ్యాయి.ఇప్పుడు ఈ ఏడాది రసాయన శాస్త్ర నోబెల్ అవార్డు సంగతి చూద్దాం. వాషింగ్టన్ యూనివర్సిటీకి చెందిన డేవిడ్ బేకర్, గూగుల్ డీప్‌మైండ్‌లో పని చేస్తున్న డెమిస్ హస్సాబిస్, జాన్ ఎం.బంపర్లకు ఈ పురస్కారం దక్కింది. ప్రొటీన్ డిజైన్‌ను కంప్యూటర్ల సాయంతో అంచనా వేసేందుకు బేకర్ ఒక పద్ధతిని ఆవిష్కరిస్తే, డీప్‌మైండ్ శాస్త్ర వేత్తలు ప్రొటీన్ల నిర్మాణాన్ని ముందస్తు అంచనా వేయగలిగారు. మన శరీరంలోని కణాలు, జీవక్రియలన్నింటికీ ప్రొటీన్లే కీలకం. అవి అతి సంక్లిష్టమైన పద్ధతుల్లో ముడుచుకుని ఉంటాయి. ఈ ముడతల్లోని తేడాలు, మార్పులు శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అణు నిర్మాణం, పరిసరాల్లోని నీటి పరమాణువులు ప్రొటీన్ ముడతలను నిర్ణయిస్తాయి. ఒకే ఒక్క ప్రొటీన్ లెక్కలేనన్ని ఆకారాల్లో ఉండవచ్చు. కొత్త ప్రొటీన్లను డిజైన్ చేసేందుకు అవసరమైన కంప్యూటర్ నియ మాలను బేకర్ అభివృద్ధి చేశారు. దీనివల్ల కొత్త చికిత్సలు, పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. ఇక గూగుల్ డీప్‌మైండ్ శాస్త్రవేత్తలు ఆల్ఫా–ఫోల్డ్ పేరుతో తయారు చేసిన సాఫ్ట్వేర్ అమైనో ఆమ్ల క్రమాన్ని బట్టి ప్రొటీన్ త్రీడీ నిర్మాణాన్ని ముందుగానే అంచనా కడుతుంది. పథ నిర్దేశకులకే నోబెల్...మౌలికాంశాలపై పరిశోధనలు ఎంత ముఖ్యమో ఈ అవార్డులు మరోసారి స్పష్టం చేస్తున్నాయి. సీవీ రామన్ తరువాత భారతీయు లెవరికీ నోబెల్ అవార్డు దక్కలేదంటే... కారణం ఇదే. హరగోబింద్ ఖొరానా, ఎస్.చంద్రశేఖర్, వెంకీ రామకృష్ణన్ వంటి వారు విదేశీ విశ్వవిద్యాలయాల్లో మౌలిక అంశాలపైనే పరిశోధనలు చేసి నోబెల్ అవార్డులు సాధించిన విషయం ఇక్కడ చెప్పుకోవాలి. నోబెల్ అవార్డులు సాధారణంగా సాంకేతిక, శాస్త్ర రంగాల్లో కొత్త మార్గాలను ఆవిష్కరించిన వారికే ఇస్తూంటారు. హాప్ఫీల్డ్ విషయాన్నే తీసుకుందాం. తొంభై ఒక్క సంవత్సరాల వయసున్న ఈయన ‘హాప్ ఫీల్డ్ నెట్వర్క్’ అని పిలుస్తున్న ఆవిష్కరణ కోసం 1980 నుంచే కృషి చేస్తున్నారు. హంటన్ ఆవిష్కరించిన ‘బోల్æ్ట›్జమన్ మెషీన్’ పద్ధతి కూడా దశాబ్దాల కృషి ఫలితమే. ఎంతో కాలం తరువాత 2010లో ఈ ఆవిష్కరణలు మెషీన్ లెర్నింగ్ రంగాన్ని సమూలంగా మార్చేశాయి. చాట్‌జీపీటీ వంటి వినియోగదారు ఉత్పత్తికి వీరి పరిశోధనలే మూలం. ఇదే విధంగా రసాయన శాస్త్రంలో బేకర్ ప్రొటీన్ నిర్మాణా లపై దశాబ్దాలుగా పరిశోధనలు చేస్తున్నారు. 1998లో ఆయన తన తొలి ఆవిష్కరణ ‘రొసెట్టా’ను సిద్ధం చేశారు. ఇలాంటి ఆవిష్కరణల్లో భారతీయుల పాత్ర కూడా ఉందన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు. కృత్రిమ మేధ, డిజిటల్ కంప్యూటర్లకు సంబంధించి శాస్త్రవేత్తల్లో ప్రాథమికంగా ఒక ఆలోచన మొదలైన 1950లలోనే గణాంక శాస్త్రవేత్తగా మారిన భౌతిక శాస్త్రవేత్త ప్రశాంత చంద్ర మహాలనోబిస్ ఒక భావనను ప్రతిపాదించారు. ‘మహాలనోబిస్ డిస్టెన్స్’ అని పిలిచే ఈ భావన వేర్వేరు డేటా పాయింట్లలోని తేడాలను లెక్కిస్తుంది. అనంతరం ఈ మహాలనోబిస్ డిస్టెన్స్‌ను కంప్యూటర్ సైన్స్, కృత్రిమ మేధ రంగాల్లో విస్తృతంగా వినియోగించారు. కోల్‌కతాలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ (ఐఎస్ఐ) వ్యవస్థాపకుడు కూడా మహాలనోబిసే. సైబర్నెటిక్స్ ప్రాము ఖ్యతను అప్పట్లోనే గుర్తించారు. ఇందుకు తగ్గట్టుగా 1955లోనే నార్బెర్ట్ వీనర్ వంటి వారిని ఐఎస్ఐ విజిటింగ్ ప్రొఫెసర్‌గా ఆహ్వానించారు. ద్విజేశ్ దత్తా మజుందార్ వంటి వారిని ఫజీ లాజిక్, న్యూరల్ నెట్వర్క్ వంటి రంగాల్లో పరిశోధనలకు వీనర్ పురిగొల్పారు.ప్రొఫెసర్ రాజ్ రెడ్డి భాగస్వామ్యం...1966లో అమెరికాలో డాక్టోరల్ విద్యార్థిగా ఉన్న రాజ్ రెడ్డి... మాటలను గుర్తించేందుకు ‘హియర్సే–1’ వంటి వ్యవస్థలను అభివృద్ధి చేశారు. మనుషుల్లానే కంప్యూటర్లు కూడా విషయాలను జ్ఞాపకం ఉంచుకునేలా, మనిషి మాటలను గుర్తించి అర్థం చేసుకోగల సామ ర్థ్యాన్ని కల్పించారు. ప్రస్తుతం కంప్యూటర్లు, రోబోలు మాటలను గుర్తించేందుకు ఉపయోగిస్తున్నది రాజ్ రెడ్డి అభివృద్ధి చేసిన ‘హియర్సే –2’, హార్పీ, డ్రాగన్ వంటి సిస్టమ్సే. ‘బ్లాక్‌బోర్డ్ మోడల్’ పేరుతో రాజ్ రెడ్డి అభివృద్ధి చేసిన సాఫ్ట్వేర్... కృత్రిమ మేధ వేర్వేరు మార్గాల నుంచి వచ్చే సమాచారాన్ని సమన్వయపరచుకునేందుకు కీలకంగా మారింది. ఈ ఆవిష్కరణకు గాను 1994లో ప్రొఫెసర్ రాజ్ రెడ్డికి కంప్యూటర్ సైన్సులో నోబెల్ అవార్డుగా పరిగణించే ‘టూరింగ్ అవార్డు’ దక్కింది. నోబెల్ అవార్డులు కృత్రిమ మేధ రంగంలో కీలక ఆవిష్కరణలకు దక్కడం బాగానే ఉంది. అయితే ఈ టెక్నాలజీతో వచ్చే ప్రమాదాలను కూడా ఈ ఏడాది నోబెల్ గ్రహీతలు గుర్తించారు. ఏఐ ఛాట్బోట్లు భయం పుట్టించేవే అని గూగుల్ కృత్రిమ మేధ విభాగపు అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న తరువాత హింటన్ వ్యాఖ్యానించడం గమనార్హం. కృత్రిమ మేధ విస్తృత వాడకం వల్ల సమాజంలో ఆర్థిక అసమానతలు పెరిగిపోతాయనీ, ఏఐ కారణంగా పెరిగిపోయే ఉత్పాదకత, సంపద ధనికులకు మాత్రమే సాయపడుతుందనీ అంచనా కట్టారు. కృత్రిమ మేధ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే చిన్నా చితకా ఉద్యోగాలు అనేకం లేకుండా పోతాయని హెచ్చరించారు. ఇలాంటి సమస్యలను అధిగమించేందుకు ప్రభుత్వాలు సార్వత్రిక సామాన్య వేతనం వంటి వాటిని పరిగణనలోకి తీసుకోవాలని హింటన్ సూచించారు. భారతీయులకు నోబెల్ అవార్డు దక్కక పోవడం గురించి కూడా మాట్లాడుకుందాం. పరిశోధనలకు అవసరమైన నిధులు కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ‘అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్’ ఒకదాన్ని ఏర్పాటు చేసింది. కాకపోతే ఇందుకు నిధులు ఎలా సమకూరుస్తారన్నది ఇంకా స్పష్టం కాలేదు. అంతర్జాతీయ స్థాయి శాస్త్ర రంగంలో భారత్ తనదైన ముద్ర వేయాలని కృత నిశ్చయంతో ఉంటే, యూనివర్సిటీల్లో మౌలికాంశాలపై పరిశోధనలకు పెద్దపీట వేయాలి. అలాగే అన్ని రకాల మద్దతు అందివ్వాలి. ఇదో దీర్ఘ కాలిక కార్యక్రమం అన్నది గుర్తు పెట్టుకోవాలి. అప్లైడ్ రీసెర్చ్, టెక్నా లజీ డెవలప్మెంట్లపై దృష్టి కేంద్రీకరించడం ద్వారా తక్షణ సామాజిక, పారిశ్రామిక అవసరాలను తీర్చుకోవచ్చు. స్థూలంగా చెప్పాలంటే నిధుల కేటాయింపు విషయంలో మౌలికాంశాలపై పరిశోధనలతోపాటు అప్లైడ్ రీసెర్చ్, టెక్నాలజీలు రెండింటికీ మధ్య ఒక సమతూకం సాధించాలి. ప్రైవేటు రంగం కూడా ఈ ఏడాది నోబెల్ అవార్డు గ్రహీతల నుంచి స్ఫూర్తి పొందాలి. రసాయన శాస్త్ర నోబెల్ అవార్డులో సగం గూగుల్ శాస్త్రవేత్తలకు దక్కిన విషయం గమనార్హం. మౌలికాంశాలపై పరిశోధనలకు ఆ ప్రైవేట్ కంపెనీ పెట్టిన పెట్టుబడులు ఇందుకు కారణం. నోబెల్ స్థాయి అవార్డు రావాలంటే, మౌలికాంశాలపై పరిశోధనలకు పెట్టుబడులు సమకూరుస్తుండటమే మార్గం.దినేశ్ సి.శర్మవ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
కొత్త బయోటెక్ సీసాలో పాత సారా
వాతావరణ మార్పులు; ఘన, ద్రవ వ్యర్థాల సమర్థ నిర్వహణ; వ్యవసాయ ఉత్పాదకతల పెంపు, మెరుగైన ఇంధన వ్యవస్థ, ఆరోగ్య సౌకర్యాలు... బయోటెక్నాలజీ సమర్థ వినియోగంతో భారత్ అధిగమించగల సవాళ్లల్లో ఇవి కొన్ని మాత్రమే. బోలెడన్ని ఉపాధి అవకాశాలు కల్పించేందుకూ బయో టెక్నాలజీ ఎంతో సాయం చేయగలదు. ఇదే విషయాన్ని గత నెల 31న విడుదల చేసిన ‘బయోటెక్నాలజీ ఫర్ ఎకానమీ, ఎన్విరాన్ మెంట్, ఎంప్లాయ్మెంట్ (బయో ఈ3)’ విధానం ద్వారా కేంద్రం కూడా లక్షించింది. ఈ విధానంలోని అతిపెద్ద లోపం ఏమిటంటే... ఇవన్నీ ఎప్పటిలోగా సాధిస్తామన్నది స్పష్టం చేయకపోవడం. ఎందుకంటే ఇవన్నీ 2021లో ‘నేషనల్ బయోటెక్నాలజీ అభివృద్ధి వ్యూహం’ పేరుతో విడుదల చేసిన పత్రంలో ఉన్నవే!‘బయో ఈ3’ విధానం ప్రధాన లక్ష్యం– వైవిధ్యభరితమైన కార్యకలాపాల ద్వారా పర్యావరణ, వాతావరణ మార్పుల ప్రభావాన్ని పరిరక్షిస్తూనే, సుస్థిరా భివృద్ధి వంటి అంతర్జాతీయ సమస్యలను దీటుగా ఎదుర్కొనేందుకు బయో మాన్యుఫాక్చరింగ్ పరిష్కారాలు వెతకడం! సృజనాత్మక ఆలోచనలను టెక్నాలజీలుగా వేగంగా పరివర్తించాలని కూడా సంకల్పం చెప్పుకొన్నారు. ఇప్పటివరకూ వేర్వేరుగా జరుగుతున్న కార్యకలాపాలన్నింటినీ బయోమాన్యుఫాక్చరింగ్ అనే ఒక ఛత్రం కిందకు తీసుకు రావాలనీ, సుస్థిరమైన అభివృద్ధి పథాన్ని నిర్మించాలనీ కూడా విధాన పత్రంలో పేర్కొన్నారు. ఈ విధానాన్ని ప్రతిపాదించే క్రమంలో కేంద్ర ‘బయోటెక్నాలజీ విభాగం’ (డీబీటీ) కార్యదర్శి రాజేశ్ గోఖలే జీవశాస్త్ర పారిశ్రామికీ కరణకు నాంది పలుకుతున్నట్లు ప్రకటించారు. ఈ రంగంలో భారత్‌ను అగ్రగామిగా నిలుపుతామన్నారు. ఈ విధానంలోని వాపును కాస్తా పక్కకు పెడితే – బయోటెక్నాలజీ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించడం, డిజిటలైజేషన్ , కృత్రిమ మేధ, మెషీన్ లెర్నింగ్ వంటి కొత్త సాంకేతిక పరిజ్ఞానాలను ఇందుకు వాడటం కీలకాంశా లుగా తోస్తాయి. ఇదే వాస్తవమని అనుకుంటే ఇందులో కొత్తదనమేమీ లేదు. ఎందుకంటే 2021లో ఇదే డీబీటీ ‘నేషనల్ బయోటెక్నాలజీ అభివృద్ధి వ్యూహం (2021–25)’ పేరుతో ఒక పత్రాన్ని విడుదల చేసింది. అందులోనూ కచ్చితంగా ఇవే విషయాలను ప్రస్తావించారు. కాకపోతే అప్పుడు ఆర్థికాంశాలు, కాలక్రమం, లక్ష్య సాధనకు మార్గాల వంటివి స్పష్టంగా నిర్వచించారు. బయోటెక్నాలజీ ఆధారంగా విజ్ఞాన, సృజనాత్మకతలతో నడిచే ఓ జీవార్థిక వ్యవస్థను అభివృద్ధి చేయాలన్నది 2021లో డీబీటీ పెట్టుకున్న లక్ష్యం. 2025 నాటికల్లా భారత్‌ను అంతర్జాతీయ బయో మాన్యు ఫాక్చరింగ్ హబ్‌గా రూపుదిద్దాలని అనుకున్నారు. బయో ఫౌండ్రీల వంటి వాటికి తగిన మౌలిక సదుపాయాలు కల్పించడం, నైపుణ్యం కలిగిన సిబ్బంది, కార్మికులను తయారు చేయడం, అందరికీ అందు బాటులో ఉండే వస్తువులను తయారు చేయగల పరిశ్రమలకు ప్రోత్సా హకాలు అందించడం ద్వారా లక్ష్యాన్ని సాధించాలని అప్పట్లో తీర్మానించారు. వాతావరణ మార్పులు, ఆహార భద్రత, పర్యావరణ అను కూల ఇంధనాలు, వ్యర్థాల సమర్థ నిర్వహణ వంటివి 2021లో గుర్తించిన ప్రాధాన్యతాంశాలు. తాజా జాబితాలోనూ ఇవే అంశాలను పునరుద్ఘాటించారు. కానీ డీబీటీ తెలివిగా పాత విధానం, వ్యూహాలను అస్సలు ప్రస్తావించకపోవడం గమనార్హం. అప్పడు నిర్దేశించుకున్న లక్ష్యాలను ఎందుకు సాధించలేకపోయారన్న ప్రశ్న నుంచి తప్పించు కునేందుకు అన్నమాట! 2021 విధానానికి అనుగుణంగా తీసుకున్న చర్య ఏదైనా ఉందీ అంటే... అది తాజా బడ్జెట్లో బయో ఫౌండ్రీల ప్రోత్సాహానికి ఒక పథకాన్ని ప్రకటించడం మాత్రమే. బయోటెక్నాలజీ ఏయే రంగాల్లో ఉపయోగపడగలదో చెప్పాల్సిన పని లేదు. టీకాల తయారీ మొదలుకొని కొత్త రకాల వంగడాల సృష్టి వరకూ చాలా విధాలుగా సహాయకారి కాగలదని గత నాలుగు దశా బ్దాల్లో నిరూపణ అయ్యింది. దేశ విధాన రూపకర్తలు దీని సామర్థ్యాన్ని ముందుగానే గుర్తించారు. 1986 లోనే బయోటెక్నాలజీ రంగానికి ఊతమిచ్చేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. తొలినాళ్లలో ఇది దేశవ్యాప్తంగా పరిశోధన, విద్య అవకాశాలను పెంచడం వల్ల ఈ రోజు అంతర్జాతీయ స్థాయిలో కీలక స్థానానికి చేరుకోగలిగింది. అయితే బయోటెక్నాలజీ ఆధారిత పరిశ్రమ వృద్ధి కొంచెం నెమ్మదిగానే జరిగిందని చెప్పాలి. వెంచర్ క్యాపిటలిస్టుల లేమి, తగిన వాతావరణం లేకపోవడం ఇందుకు కారణాలు. అయినప్పటికీ పరి శ్రమ అందుబాటులోకి తెచ్చిన ఉత్పత్తులేవీ డీబీటీ కార్యక్రమాల కారణంగా వచ్చినవి కాకపోవడం గమనార్హం. భారతీయ బయోటెక్ పరిశ్రమకు ఇష్టమైన ప్రతినిధిగా చూపే ‘బయోకాన్’... డీబీటీ ఏర్పాటు కంటే మునుపటిది. శాంత బయోటెక్, భారత్ బయోటెక్ వంటి కంపెనీలు కూడా టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డు వంటి ఇంకో ప్రభుత్వ విభాగపు రిస్క్ ఫైనాన్సింగ్ ద్వారా ఏర్పాటు చేసినవే. 2000లలో కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బయో టెక్నాలజీ రంగం కోసం ప్రత్యేక విధానాలను ప్రకటించడమే కాకుండా పరిశ్రమలకు ప్రోత్సాహకాలూ అందించాయి. హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీ, ఐకేపీ నాలెడ్జ్ పార్క్‌ల విజయం ఈ విధానాల ఫలమే. 2012లో మాత్రమే డీబీటీ పారిశ్రామిక ప్రోత్సాహం కోసం ప్రత్యేక వాణిజ్య విభాగాన్ని ఏర్పాటు చేసింది. దీన్నే ‘ద బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్’... క్లుప్తంగా బైరాక్ అని పిలుస్తారు. ప్రభుత్వం గతానుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలు, మన సామర్థ్యాల ఆధారంగా బయోటెక్నాలజీ రంగంలో పరిశ్రమలను ప్రోత్సహించాల్సి ఉంటుంది. కానీ తాజా విధానంలో జీనోమ్ వ్యాలీ, ఐకేపీ నాలెడ్జ్ పార్క్ వంటి విజయవంతమైన నమూనాల ప్రస్తావనే లేదు. కాకపోతే ఇదే భావనను ‘మూలాంకుర్ బయో ఎనేబ్లర్ హబ్’ అన్న కొత్త పేరుతో అందించింది. విధాన పత్రం ప్రకారం ఈ హబ్స్ ఆవిష్కరణలు, ట్రాన్స్లేషనల్ రీసెర్చ్‌లను సమన్వయ పరుస్తాయి. పైలట్ స్కేల్, వాణిజ్య పూర్వ పరిశోధనలకు సహకారం అందిస్తాయి. ఇప్పటికే దేశంలో ఉన్న టెక్నాలజీ క్లస్టర్లు చేస్తున్నది కూడా ఇదే. కేంద్రం సర్వరోగ నివారిణిగా ప్రచారం చేస్తున్న ఈ కొత్త విధానం నియంత్రణ వంటి అంశాలను పెద్దగా పట్టించుకున్నట్లు లేదు. మౌలిక పరిశోధనలకు తగినన్ని ప్రభుత్వ నిధులను అందుబాటులో ఉంచడం, సాంకేతిక పరిజ్ఞానం, మానవ వనరుల అభివృద్ధి విషయాల్లోనూ ప్రభుత్వం నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుందన్నదీ విస్మరించింది. బయో మాన్యుఫాక్చరింగ్‌కు నియంత్రణ వ్యవస్థ కీలకం. ఎందుకంటే జన్యు మార్పిడి చేసిన సూక్ష్మజీవులు, ఇతర జీవజాలాన్ని వాడతారు కాబట్టి. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించిన నిబంధనలు చెల్లాచెదురుగా ఉండటమే కాదు, పారదర్శకంగానూ లేవు. ఓ భారీ బయోటెక్ ఆధారిత వ్యవస్థను ఏర్పాటు చేయాలని అనుకున్నప్పుడు అంతకంటే ముందే స్వతంత్ర, చురుకైన చట్టపరమైన నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం అవసరం. ఐటీ విప్లవం మాదిరిగానే బయోటెక్నాలజీ ఆధారంగా సరికొత్త పారిశ్రామిక విప్లవాన్ని తీసుకొస్తామని డీబీటీ కార్యదర్శి వ్యాఖ్యానించారు. సమాచార రంగంలో వచ్చిన మార్పులే ఐటీ విప్లవానికి నాంది అనీ, ఏదో విధానాన్ని రూపొందించి విడుదల చేయడం వల్ల మాత్రమే ఇది రాలేదనీ ఆయన గుర్తించాలి. డిజిటల్ టెలిఫోన్ ఎక్స్చేజ్ను సొంతంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం గట్టిగా సంకల్పించడం, పెట్టుబడులు పెట్టడం, డెడ్లైన్లను విధించడం వల్లనే దేశంలో ఈ రోజు ఐటీ రంగం ఈ స్థాయిలో ఉంది. అలాగే ప్రభుత్వం స్వయంగా సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ పథకాన్ని ప్రవేశపెట్టడం వల్ల ఈ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందింది. ప్రభుత్వం కేవలం ప్రకటనలు చేయడం కాకుండా నిర్ణయాత్మకంగా వ్యవహరించడం కీలకం.విధానాలు అనేవి బాధ్యతాయుతమైన పాలనకు మార్గదర్శక పత్రాల్లా ఉండాలి. ఉన్నతాశయాలు, దార్శనికతతో ఉండటం తప్పు కాదు. కానీ, లక్ష్యాలేమిటి? వాటి సాధనకు ఉన్న కాలపరిమితి, సవా ళ్లపై అవగాహన అవసరం. కాలపరీక్షకు తట్టుకున్న పాత విధానాన్ని కాకుండా కొత్త మార్గాన్ని అనుసరించాలని డీబీటీ ప్రయత్నించింది. శాస్త్రీయ విభాగం అయినందుకైనా తార్కికమైన, ఆధారాల కేంద్రిత విధానాన్ని రూపొందించి ఉంటే బాగుండేది. ‘ఆర్థిక వ్యవస్థ’, ‘ఉపాధి కల్పన’ రెండూ శీర్షికలోనే ఉన్నా ఈ విధానం ప్రాథమ్యాలు అస్పష్టం, సందేహాస్పదం. వాక్చాతుర్యం తప్ప ఏమీలేదు.దినేశ్ సి. శర్మ వ్యాసకర్త సైన్స్ వ్యవహారాల వ్యాఖ్యాత(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
అంతరిక్ష కేంద్రం మీదుగా గగన్‌యాన్!
అంతరిక్షంలోకి చేరిన తొలి భారత వ్యోమగామిగా రాకేశ్ శర్మ రికార్డు సృష్టించిన నలభై ఏళ్లకు మరో భారతీయుడు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లోకి అడుగుపెట్టడం గర్వకారణమే. మానవ సహిత అంతరిక్ష యాత్ర (గగన్ యాన్ ) కోసం భారత్ ఎంపిక చేసిన నలుగురు వ్యోమగాముల్లో శుభాంశు శుక్లా ఒకరు. బెంగళూరులో వీరికి రష్యా ఆధ్వర్యంలో శిక్షణ నడుస్తోంది. శుక్లాను ఐఎస్ఎస్ పైకి పంపే విషయాన్ని ప్రకటిస్తూ ఇస్రో ఆయన్ని గగన్ యాత్రి అని పిలిచింది. దీంతో ఈయనకూ, మనం సమీప భవిష్యత్తులో చేపట్టే గగన్ యాన్కూ సంబంధం ఉన్నట్లు స్పష్టమైంది. ఐఎస్ఎస్, గగన్ యాన్ రెండూ వేర్వేరు రకాల అంతరిక్ష యాత్రలు. కాకపోతే ఐఎస్ఎస్ అనుభవాలు గగన్ యాన్ కూ ఉపయోగపడవచ్చునని ఇస్రో భావిస్తూండవచ్చు.1969లో మనిషి తొలిసారి జాబిల్లిపై అడుగు పెట్టింది మొదలు మానవ సహిత అంతరిక్ష ప్రయోగాలు బోలెడన్ని జరిగాయి. భూమి చుట్టూ తిరుగు తున్న స్పేస్స్టేషన్లకు వ్యోమగాములను పంపుతూనే ఉన్నాం. ఇలాంటి ప్రయోగాలకు సాధారణంగా శక్తిమంతమైన రాకెట్లను వాడుతూంటారు. అంతరిక్ష నౌక ఐఎస్ఎస్కు అనుసంధానమై కొన్ని రోజులు లేదా వారాలపాటు ఉంటుంది. ఆ తరువాత భూమికి తిరిగి వస్తుంది. 1970లలో సోవియట్ ‘సాల్యూట్’, అమెరికా ‘స్కైలాబ్’ ప్రయోగా లతో అంతరిక్ష కేంద్రాల యుగం ప్రారంభమైంది. తరువాతి కాలంలో సోవియట్ యూనియన్ మరింత పెద్దదైన మిర్ అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. చివరగా అమెరికా, రష్యా, యూరప్ సంయుక్తంగా ఐఎస్ఎస్ను నిర్మించాయి. చైనా తియాన్ గాంగ్ పేరుతో ప్రత్యేకంగా ఒక అంతరిక్ష కేంద్రాన్ని పదేళ్లుగా నిర్మిస్తోంది. 2035 కల్లా అంతరిక్ష కేంద్రాన్ని నిర్మిస్తామని భారత్ కూడా సంకల్పించడం విశేషం.భూ కక్ష్యలో తిరిగే అంతరిక్ష కేంద్రాన్ని చేరాలంటే శక్తిమంతమైన రాకెట్లు, మానవులను మోసుకెళ్లగల సామర్థ్యమున్న మంచి అంతరిక్ష నౌక అవసరం. ఇందుకు సోవియట్ యూనియన్ ‘సోయుజ్’, అమె రికా స్పేస్ షటిల్స్ తయారు చేసుకున్నాయి. ముప్ఫై ఏళ్లుగా వీటినే వాడుతున్నాయి. స్పేస్ షటిల్ రాకెట్ మాదిరిగా నిట్టనిలువుగా పైకి ఎగరగలదు. అంతరిక్ష నౌక మాదిరిగా సమాంతరంగానూ దూసు కెళ్లగలదు. విమానం మాదిరి ల్యాండ్ కూడా కాగలదు. అయితే 2003లో స్పేస్ షటిల్ కొలంబియా ప్రమాదానికి గురై అందులో భారతీయ సంతతి వ్యోమగామి కల్పనా చావ్లా మరణించింది మొదలు స్పేస్ షటిల్‌ల యుగం క్రమేపీ అంతరించింది. 2011 నాటికి పూర్తిగా నిలిపివేశారు. ఆ తరువాత కొన్నేళ్లకు ‘నాసా’ రష్యా తయారీ సోయుజ్ సాయంతో ఐఎస్ఎస్కు సరుకులు, వ్యోమగాములను రవాణా చేయడం మొదలుపెట్టింది. ప్రైవేట్‌రంగ ప్రవేశం...అంతరిక్ష ప్రయోగాల్లో ప్రైవేట్ కంపెనీలు పాల్గొనడం స్పేస్ షటిల్ కార్యక్రమం ముగిసిన తరువాతే మొదలైంది. దీర్ఘకాలిక అవస రాలను దృష్టిలో పెట్టుకుని నాసా అమెరికన్ కంపెనీల నిధులు, టెక్నా లజీల సాయంతో అంతరిక్ష రవాణా వ్యవస్థలను నిర్మించుకుంది. ఈ క్రమంలోనే ఐఎస్ఎస్కు సరుకులు, సిబ్బందిని రవాణా చేసే పని ప్రైవేట్ కంపెనీల పరమైంది. ఈ విధానం పుణ్యమా అని స్పేస్ఎక్స్, యునైటెడ్ లాంచ్ అలయన్స్(యూఎల్ఏ) వంటి పలు ప్రైవేట్ కంపె నీలు అంతరిక్ష రంగంలోకి అడుగుపెట్టాయి. 2012 నుంచి తన ఫాల్కన్ రాకెట్ల ద్వారా పలు మార్లు ఐఎస్ఎస్కు సరుకులు రవాణా చేసిన తరువాత స్పేస్ఎక్స్ 2020లో మొదటిసారి సిబ్బంది రవాణా బాధ్యతను నిర్వర్తించింది. ఇంకోవైపు యూఎల్ఏ కూడా తన అట్లాస్ వీ రాకెట్ ద్వారా పలు కార్గో ట్రిప్‌లు విజయవంతంగా పూర్తి చేసి సిబ్బంది రవాణ చేపట్టింది. ఈ ఏడాది జూన్ లో భారతీయ సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్‌ను ఐఎస్ఎస్కు మోసుకెళ్లిన స్టార్ లైనర్ యూఎల్ఏ తయారీనే. అయితే ఐఎస్ఎస్ చేరిన తరువాత ఈ స్టార్ లైనర్ మళ్లీ భూమ్మీదకు వచ్చే స్థితిలో లేనట్లు స్పష్టమైంది. థ్రస్టర్లలో సమస్యలు రావడంతో అది ఐఎస్‌ఎస్‌తోనే ఉండిపోయింది. శుభాంశూ శుక్లాను ఐఎస్ఎస్కు చేర్చే బాధ్యతను ఇస్రో ప్రైవేట్ కంపెనీ ‘ఆక్సియామ్ స్పేస్’కు అప్పగించింది. వాణిజ్య స్థాయిలో వ్యోమగాముల రవాణా చేపట్టగల సత్తా దీనికి ఉందని నాసా స్వయంగా సర్టిఫై చేసి ఉండటం గమనార్హం. అయితే ఆక్సియామ్కు సొంతంగా రాకెట్లు లేవు. స్పేస్‌ఎక్స్‌పై ఆధారపడుతోంది. 2021 మే నుంచి ఇప్పటివరకూ ఆక్సియామ్ మూడుసార్లు ఐఎస్ఎస్కు సిబ్బంది, సరుకులను రవాణా చేసింది. శుక్లాను మోసుకెళ్లడం నాలుగో మిషన్ అవుతుంది. కానీ ఆక్సియామ్, ఇస్రోల మధ్య జరిగిన వాణిజ్య ఒప్పందానికి లోబడి శుక్లా ఐఎస్ఎస్కు వెళతారా? లేక ఇస్రో – నాసాల ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా (సర్వీస్ ఛార్జీలు ఉన్నా లేకున్నా) వెళతారా? అన్నది స్పష్టం కాలేదు. 1984లో భారత్, సోవి యట్ యూనియన్ల మైత్రీ బంధానికి ప్రతీకగా రాకేశ్ శర్మ సోవియట్ అంతరిక్ష కేంద్రం సాల్యూట్కు వెళ్లారు. ఈ యాత్ర, శిక్షణలకు సంబంధించి సోవియట్ యూనియన్ కు భారత్ డబ్బు ఏమీ చెల్లించలేదు. సాల్యూట్ తరువాత వచ్చిన మిర్ పైకి సోవియట్ యూనియన్ 13 దేశాలకు చెందిన 104 మంది వ్యోమగాములను తీసుకెళ్లింది. 2001లో మిర్ కూలిపోయే ముందు వరకూ ఈ యాత్రలు జరిగాయి. చాలా యాత్రలకు ఆయా దేశాలు డబ్బులు చెల్లించడం గమనార్హం. 1990–2000 మధ్యకాలంలో నిర్మాణమైన ఐఎస్ఎస్లో భారత్‌కు భాగస్వామ్యం లేదు. వ్యోమగామిని పంపే అవకాశమూ రాలేదు. అప్పట్లో ఇస్రో, నాసాల మధ్య సంబంధాలు అంత బాగా లేవు. రష్యా నుంచి మనం క్రయోజెనిక్ ఇంజిన్లు తెచ్చుకోవడంపై పెద్ద వివాదమే నడుస్తుండేది. ఇస్రో కూడా తన ఉపగ్రహ కార్యక్రమాలపైనే ఎక్కువ దృష్టి పెట్టింది. పైగా వనరుల కొరత ఇస్రోను బాధిస్తూండేది. ఇస్రో అజెండాలోకి మానవ సహిత అంతరిక్ష ప్రయోగం చేరే సమయానికి ఐఎస్ఎస్ను సందర్శించే వారి జాబితా పెరిగిపోయింది. గత పాతికేళ్లలో 23 దేశాలకు చెందిన 280 మంది వ్యోమగాములు ఐఎస్ఎస్కు వెళ్లి వచ్చారు. వీరిలో కొంతమంది రెండు, నాలుగు సార్లు కూడా వెళ్లడం గమ నార్హం. సునీతా విలియమ్స్‌నే ఉదాహరణగా తీసుకుంటే, ఆమె ఐఎస్ఎస్కు వెళ్లడం ఇది మూడోసారి. అమెరికా, రష్యాల వ్యోమగాములు సుమారు 220 మంది ఐఎస్ఎస్ వెళ్లిన వారిలో ఉండగా... మిగిలిన వాళ్లు జపాన్ , కెనెడా, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, డెన్మార్క్, యూకే, బెల్జియం, స్పెయిన్, స్వీడన్ , నెదర్లాండ్స్, బ్రెజిల్, ఇజ్రాయెల్, కజకిస్తాన్ , బెల రూస్, మలేషియా, దక్షిణాఫ్రికా, కొరియా, సౌదీ అరేబియా, టర్కీ, యూఏఈలకు చెందినవారు. ఈ జాబితాలో 13 మంది ప్రైవేట్ వ్యక్తులు కూడా ఉన్నారు. ఆక్సియామ్ చేపట్టిన తొలి మానవ సహిత అంతరిక్ష యాత్రలోనూ నలుగురు ప్రైవేట్ వ్యక్తులు ఉన్నారు.2018లో ఇస్రో గగన్‌యాన్‌పై పని మొదలుపెట్టినప్పుడు భార తీయ వ్యోమగామిని ఐఎస్ఎస్పైకి పంపాలన్న ఆలోచన లేదు. ఎంపిక చేసిన నలుగురు వ్యోమగాములను యూరీ గగారిన్ స్పేస్ సెంటర్‌కు శిక్షణ కోసమని పంపారు. రష్యా అంతరిక్ష ప్రయోగసంస్థలతో కుదిరిన ఒప్పందంలోనూ మానవ సహిత అంతరిక్ష యానా నికి సంబంధించిన శిక్షణ ప్రస్తావన మాత్రమే ఉంది. అయితే ప్రధాని నరేంద్ర మోదీ 2022లో భారత స్వాతంత్య్ర 75 సంవత్సరాల వేడుకల సందర్భంగా గగన్ యాన్ గడువు ఆచరణ సాధ్యం కానంత తక్కువ సమయానికి కుదించడంతో పరిస్థితి మారిపోయింది. అందుకేనేమో... ఏడాది తరువాత ఐఎస్ఎస్ ఆలోచన వచ్చింది. మోదీ అమెరికా పర్య టన సందర్భంగా దీనికి సంబంధించిన ప్రకటన కూడా చేశారు. అయితే గగన్ యాన్ యాత్ర కోసం ఐఎస్ఎస్కు వెళ్లాల్సిన అవసరమేదీ లేదు కానీ అంతరిక్ష యాత్రకు సంబంధించి వాస్తవిక అనుభవం గడించేందుకు మాత్రం ఉపయోగపడుతుంది. ఏమైనప్పటికీ... అంతరిక్షంలోకి చేరిన తొలి వ్యోమగామిగా రాకేశ్ శర్మ రికార్డు సృష్టించిన నలభై ఏళ్లకు మరో భారతీయుడు అంతరిక్షంలోకి అడుగుపెడుతున్నాడంటే, అది మనందరికీ గర్వకారణమే.దినేశ్ సి. శర్మ వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
పరిశోధనల్లో చైనాతో పోటీ పడగలమా?
అంతర్జాతీయంగా ప్రతిష్ఠాత్మక జర్నల్స్ అయిన ‘నేచర్’, ‘ఎకనమిస్ట్’లు శాస్త్రరంగంలో చైనా అత్యంత శక్తిమంతంగా ఎదుగుతోందని ప్రకటించాయి. సైన్స్, టెక్నాలజీ రంగాల్లో మూడో అతిపెద్ద శక్తిగా భారత్ కొనసాగిన విషయం తెలిసిందే. అణు, అంతరిక్ష, వ్యాక్సిన్ అభివృద్ధి రంగాల్లో భారత్ రాణించిందన్నదీ వాస్తవమే. కానీ చైనా పలు కీలక రంగాల్లో భారత్‌తోపాటు అమెరికా, యూరప్‌లను సైతం అధిగమించింది. అంతరిక్ష రంగంలో చైనా మన కన్నా కనీసం పదేళ్లు ముందుంది. 2003లో తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర జరపడమే కాదు, సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని నిర్మిస్తోంది. ప్రపంచ టాప్–10 జాబితాలో భారతీయ పరిశోధన సంస్థలు లేవన్నది గమనార్హం. నిద్రాణంగా ఉన్న భారత్‌కు చైనా పురోగతి ఓ మేలుకొలుపు కావాలి.ఉన్నత విద్యా రంగంలో భారత్ గతంలో ఎన్నడూ లేని స్థాయి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. వైద్యం, పరిశోధన రంగాల్లో ప్రవేశానికి నిర్వహిస్తున్న పరీక్షల పద్ధతి, ప్రామాణికత రెండూ లీకేజీల పుణ్యమా అని ప్రశ్నార్థకంగా మారాయి. నీట్‌తోపాటు భారతీయ విశ్వవిద్యాలయాల్లో, జాతీయ పరిశోధన సంస్థల్లో రీసెర్చ్ ఫెలోషిప్ కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశ్న పత్రం కూడా లీక్ అయ్యింది. పరిశోధన రంగంలో ప్రాథమిక స్థాయిలో చేరే విద్యార్థుల కోసం ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్, ఐఐటీల వంటి సంస్థలు కూడా నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్‌పై ఆధారపడుతూంటాయి. పీహెచ్‌డీల్లో ప్రవేశానికి ఈ పరీక్షలో అర్హత సాధించడం తప్పనిసరి. బోధన వృత్తుల్లో స్థిరపడే వారికి కూడా. ఈ పరీక్షలను విశ్వసనీయతతో, సకాలంలో నిర్వహించడం భారతదేశ ఉన్నత విద్య, పరిశోధన రంగాలపై ప్రత్యక్షంగా ప్రభావం చూపుతుందన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఒకపక్క ఈ అనూహ్య పరిస్థితిని ఎదుర్కొంటుండగా, ఇంకోపక్క అంతర్జాతీయ స్థాయిలో పరిశోధన రంగంలో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ మార్పుల్లో చైనా కంటే భారత్ బాగా వెనుకబడిపోతూండటం గమనార్హం. పరిశోధన పత్రాల్లో టాప్ప్రపంచంలో ఒక దేశపు శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాల సత్తాను నిర్ధారించేది ఉన్నత విద్య, పరిశోధన రంగాల కోసం ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాల విస్తృతి ఎంత? అన్నది. ఎంత ఉత్పత్తి అవుతోంది? నాణ్యత ఏమిటి? అన్నది నిర్ధారించేందుకు చాలా మార్గాలున్నాయి. పరిశోధన వ్యాసాల ప్రచురణ, సాధించిన పేటెంట్లు, నోబెల్ వంటి అంతర్జాతీయ అవార్డులు, పారిశ్రామిక రంగానికి బదిలీ అయిన టెక్నాలజీలు, పరిశోధనల ద్వారా సమాజానికి ఒనగూరిన లబ్ధి... ఇలా చాలా మార్గాలున్నాయి. పరిశోధన పత్రాల ప్రచురణే ప్రధాన అంశంగా ఏటా రీసెర్చ్ రంగంలో అగ్రస్థానంలో ఉన్న వారి జాబితాను ‘నేచర్’ జర్నల్ ప్రచురిస్తుంటుంది. ఈ జాబితాలో అత్యున్నత స్థాయి పరిశోధన ఫలితాల ఆధారంగా 500 సంస్థలు ఉంటాయి. ఏటా జనవరి 1 నుంచి డిసెంబరు 31 మధ్య పరిణామాలను పరిగణనలోకి తీసుకుంటారు. మొత్తం 145 అంతర్జాతీయ జర్నళ్లలో ప్రచురితమైన పరిశోధన పత్రాలను పరిశీలించి, ఒక స్వతంత్ర శాస్త్రవేత్తల బృందం ఈ జాబితాను సిద్ధం చేస్తుంది. నేచర్ ప్రచురించిన తాజా జాబితాలో దేశాల పరిశోధన సామర్థ్యాల ఆధారంగా అమెరికా, జర్మనీ, యూకే, జపాన్ , ఫ్రాన్స్, కెనడా, దక్షిణ కొరియాలను కూడా అధిగమించి చైనా అగ్రస్థానంలోకి చేరింది. భారత్ తొమ్మిదో స్థానంలో ఉంటూ... టాప్ 10 దేశాల్లో ఒకటిగా ఉన్నామన్న సంతృప్తి మాత్రమే మనకు మిగిల్చింది. భారత్ వంతు గత ఏడాది చైనా వంతు కంటే ఎక్కువ కావడం కూడా గమనార్హం. అయితే సంస్థల స్థాయిలో పరిశోధన పత్రాలను పరిశీలిస్తే నిరాశే మిగులుతుంది. అంతర్జాతీయంగా టాప్ పది పరిశోధన సంస్థల్లో ఏడు చైనావి కావడం... హార్వర్డ్ (రెండో స్థానం), మ్యాక్స్ ప్లాంక్ సొసైటీ (మూడో స్థానం), ఫ్రెంచ్ నేషనల్ సెంటర్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ (ఏడో స్థానం) మాత్రమే టాప్ 10లోని ఇతర సంస్థలు కావడం గమనార్హం. మసాచూసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీలు సైతం 14, 15 స్థానాల్లో నిలిచాయి. చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అగ్రస్థానంలో ఉంది. టాప్–10లో లేము!టాప్ సంస్థల్లో భారతీయ పరిశోధన సంస్థలు చాలా దిగువన ఉన్నాయి. ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ 174వ స్థానంలో ఉంటే, ఐఐటీ–బాంబే 247లో ఉంది. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ 275లో, టాటా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ 283వ స్థానంలోనూ ఉన్నాయి. హోమీ భాభా నేషనల్ ఇన్ స్టిట్యూట్(296), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్–కోల్‌కతా (321), ఐఐటీ–గౌహతి (355), ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్(363), ఐసర్–భోపాల్(379), ఐఐటీ–కాన్పూర్(405), ఐఐటీ–మద్రాస్(407), ఐఐటీ–ఢిల్లీ (428), ఐసర్–పుణె (439), జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్(450), అకాడమీ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇన్నొవేటివ్ రీసెర్చ్(487) ర్యాంకింగ్ కూడా దిగువలోనే ఉండటం గమనార్హం. ర్యాంకింగ్‌ల మాట ఇలా ఉంటే, పరిశోధనలు చేస్తున్న రంగాల విషయం చూద్దాం. భౌతిక, రసాయన, భూ, పర్యావరణ రంగాల్లో చైనా అగ్రస్థానంలో ఉండగా... అమెరికా, యూరప్ రెండూ జీవ, వైద్య శాస్త్రల్లో ముందంజలో ఉన్నాయి. అప్లైడ్ సైన్సెస్ రంగంలోనూ చైనా నుంచే అత్యధిక పరిశోధన పత్రాలు ప్రచురితమవుతుండటం విశేషం.చైనా కొన్ని భారీ సైన్స్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు కూడా పెట్టింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్డ్–అపెర్చర్ రేడియో టెలిస్కోపు అలాంటిదే. కృష్ణ పదార్థం ఉనికిని గుర్తించేందుకు చేపట్టిన భారీ భూగర్భ పరిశోధన ఇంకోటి. అలాగే క్వాంటమ్ కంప్యూటింగ్ రంగంలోనూ పలు చైనా సంస్థల్లో ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి. అంతరిక్ష రంగం విషయానికి వస్తే... చైనా మన దేశం కంటే కనీసం పదేళ్లు ముందుందని చెప్పాలి. 2003లో తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర జరపడమే కాదు, సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని నిర్మిస్తోంది. ఇటీవలే జాబిల్లి నుంచి రాతి నమూనాలను విజయవంతంగా వెనక్కు తెచ్చిన రోబోటిక్ మిషన్ చేపట్టింది.మన స్పందన ఎలా ఉండాలి?శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో చైనా పురోగతికి మనం ఎలా స్పందించాలి? పదేళ్లుగా అధికారంలో ఉన్న ప్రభుత్వం చేస్తున్నట్లే వీటిని తిరస్కరించడం సులువైన పని అవుతుంది. జాబితా తయారీలో పలు లోటుపాట్లు ఉన్నాయని చెప్పవచ్చు. అయితే ఇది వాస్తవ పరిస్థితిని మార్చదు. ఇంకో పద్ధతి కూడా ఉంది. ఈ జాబితాను ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించడం. టాప్ దేశాల జాబితాలో భారత్ కూడా ఉంది కాబట్టి, దాని ఆధారంగా మరింత ముందుకు వెళ్లేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేయాలి. చైనా ఈ ఘనతలన్నీ సాధించేందుకు ఏం చేసింది? ఎక్కడ తప్పటడుగులు వేసిందన్నది నిజాయితీగా పరిశీలించి గుణపాఠాలు నేర్చుకోవాలి. ‘నైన్ లీగ్’ లేదా ‘ప్రాజెక్ట్ 211’లో భాగంగా దేశవ్యాప్తంగా యూనివర్సిటీలు, ప్రపంచస్థాయి పరిశోధన శాలలను అభివృద్ధి చేసేందుకు చైనా భారీగా నిధులు ఖర్చు పెడుతోంది. ఐసర్ వంటి సంస్థల అభివృద్ధికి భారత్ చేసిన ప్రయత్నంతో ఎన్నో లాభాలు వచ్చినా ఈ విషయంలో చేయాల్సింది ఇంకా మిగిలే ఉంది. పరిశోధన పత్రాల ప్రచురణకు చైనా నగదు బహుమతులను ప్రకటించి తప్పు చేసిందని చెప్పాలి. దీనివల్ల అనైతిక పద్ధతులు పెరిగిపోయాయి. భారత్ ఇలాంటి పని చేయకుండా ఉండటం అవసరం. భారత్‌లో శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో పురోగతిని అడ్డుకుంటున్న కొన్ని సాధారణ విషయాల్లో జీడీపీలో కొంత శాతాన్ని ఈ రంగాలకు కేటాయించకపోవడం కూడా ఉంది. నిధుల పంపిణీ పద్ధతులు, కొత్త పరిశోధన సంస్థల ఏర్పాటు, విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలకు ప్రోత్సాహం వంటివి స్తంభించిపోయి ఉన్నాయి. నేషనల్ సైన్స్ అకాడమీలు, ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ కార్యాలయం, టెక్నాలజీ ఫోర్కాస్టింగ్ ఏజెన్సీ వంటివి కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సెల్ఫీ పాయింట్ల వద్ద విజయోత్సవాలను నిర్వహించడంలో బిజీగా ఉండిపోయాయి. నిద్రాణంగా ఉన్న ఇలాంటి వారందరికీ చైనా పురోగతి ఓ మేలుకొలుపు కావాలి. దినేశ్ సి. శర్మ వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
నిబంధనల అమలులోనే అసలు చిక్కు!
భారతీయ మసాలాలపై హాంకాంగ్ ఈమధ్యే నిషేధం విధించింది. మూడు బ్రాండ్లపై ఈ నిషేధం వేటు పడింది. సింగపూర్‌లోనూ ఇంకో భారతీయ మసాలా కంపెనీపై ఇలాంటి క్రమశిక్షణ చర్యలే తీసుకున్నారు. ఎథిలీన్ ఆక్సైడ్ అనే కేన్సర్ కారక రసాయనం పరిమితికి మించి ఉన్నట్లు తేలడంతో ఆయా దేశాల నియంత్రణ సంస్థలు ఈ చర్యలకు పాల్పడ్డాయి. మాల్దీవులు చర్యలకు సిద్ధమవుతూండగా... అమెరికా, ఆస్ట్రేలియా ఆహార నియంత్రణ సంస్థలు కూడా మసాలాల్లో కలుషితాలపై నివేదికలను అధ్యయనం చేసే పనిలో ఉన్నాయి. నిజానికి ఇలాంటి చర్యలు భారతీయ కంపెనీలకు కొత్తేమీ కాదు. అమెరికా చేరుతున్న భారతీయ ఉత్పత్తుల్లో ఏటా కొన్ని వందలు నాణ్యత ప్రమాణాల లేమి కారణంగా తిరస్కరణకు గురవుతూనే ఉంటాయి. ఆయుర్వేద మందులపై కూడా ఎఫ్‌డీఏ తరచూ హెచ్చరికలు జారీ చేస్తూంటుంది. సీసం వంటి ప్రమాదకర భారలోహాలు, పదార్థాలు పరిమితికి మించి ఉంటాయన్నది వీరు తరచూ వ్యక్తం చేసే అభ్యంతరం. చిన్న పిల్లల ఆహారం విషయంలో ఇటీవలే అంతర్జాతీయ కంపెనీ నెస్లే భారత్‌లో మాత్రమే అధిక చక్కెరలు వాడుతున్న విషయం బయటపడ్డ సంగతి తెలిసిందే. ఇలాంటి ఘటనలు అన్నింటిలోనూ ఒక నిర్దిష్ట క్రమం కనిపిస్తుంది. కంపెనీ భారత్‌ది అయినా, విదేశీయులది అయినా సరే మా తప్పేమీ లేదని ప్రకటిస్తాయి. తయారు చేసిన దేశం లేదా ఎగుమతి చేస్తున్న దేశం నిర్దేశించిన ప్రమాణాలను పాటిస్తున్నామని కూడా చెబుతాయి. భారతీయ నియంత్రణ సంస్థలు ఇచ్చే సమాధానం కూడా పద్ధతిగా ఉంటుంది. ‘పరిస్థితిని అధ్యయనం చేస్తున్నాం’ అనేసి చేతులు దులిపేసుకుంటాయి. విదేశీ సంస్థలు సమచారం పంచుకోలేదన్న ఆరోపణ కూడా ఉంటుంది. ఎగుమతి ప్రోత్సాహక వ్యవస్థలు, కంపెనీలు రెండూ తాము బాధితులమని వాదిస్తూంటాయి. భారతీయ ఎగుమతులను మాత్రమే పాశ్చాత్య దేశాలు అడ్డుకుంటున్నాయని వాపోతాయి కూడా. ఈ మొత్తం వ్యవహారంలో నిస్సహాయంగా మిగిలిపోయేదెవరూ అంటే... వినియోగదారుడు మాత్రమే. కొంచెం సద్దుమణిగిన తరువాత అంతా షరా మామూలుగానే నడిచిపోతూంటుంది. కల్తీ, హానికారక, కాలుష్యాలతో కూడి ఆహార పదార్థాలు విదేశాలను చేరుతున్న విషయంలో అసలు సమస్య ఏమిటన్నది ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆహార నియంత్రణ వ్యవస్థ నిబంధనల్లోని లోటుపాట్లు సరి చేసే ప్రయత్నం జరగడం లేదు. ఇంకో ముఖ్యమైన విషయం పరిశ్రమలను, ఎగుమతులను కాపాడుకోవాలనే నెపంతో ప్రభుత్వాలు చేసే ప్రయత్నాలు. తప్పు చేసినా వాటి ప్రభావం నుంచి తప్పించేందుకు ప్రయత్నించడం. ఈ క్రమంలోనే వీళ్లు ప్రజారోగ్యాన్నీ; వినియోగదారులు, పౌర సమాజ నిపుణుల అభిప్రాయాలనూ తోసిపుచ్చుతూంటారు. వివాదాల్లో చిక్కుకున్న కంపెనీలు భారత్‌లోని ఫుడ్‌సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ)’ నిర్దేశించిన ప్రమాణాలను పాటిస్తున్నట్లు చెప్పుకుని ఎలాగోలా తప్పించుకుంటాయి. నెస్లే విషయంలో ఈమధ్య జరిగింది ఇదే. కాబట్టి... ఆహార రంగంలో ఎగుమతులకు సంబంధించి ప్రమాణాలను స్పష్టంగా నిర్వచించడం చాలా అవసరం. ఎఫ్ఎస్ఎస్ఏఐలో ఆహార ఉత్పత్తుల (పానీయాల నుంచి సముద్ర ఉత్పత్తుల వరకూ) ప్రమాణాలపై సమాచారం ఇచ్చేందుకు, నిర్దేశించేందుకు 26 శాస్త్రీయ కమిటీలు ఉన్నాయి. 2008లో ఎఫ్ఎస్ఎస్ఏఐ ఏర్పాటు జరిగినప్పుడు ఏర్పాటైన ఈ ప్యానెల్స్‌లో భారతీయ, విదేశీ కంపెనీ ప్రతినిధులు ఉన్నారు. ఈ విషయంపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగడంతో వీటి పునర్వ్యవస్థీకరణ జరిగినప్పటికీ ఆహార కంపెనీల ప్రతినిధుల పెత్తనమే ఇప్పటికీ కొనసాగుతోంది. కొన్నేళ్ల తరువాత ఇది కూడా మారింది. ప్రస్తుతం ఈ ప్యానెళ్లలో ఎక్కువగా శాస్త్రవేత్తలు, రిటైర్ అయిన వాళ్లు ఉంటున్నారు. అయినప్పటికీ నిబంధనల రూపకల్పనలో పరిశ్రమల ప్రభావం లేదని కచ్చితంగా చెప్పే పరిస్థితి లేదు. ప్రస్తుతమున్న ప్యానెళ్ల కూర్పును మచ్చుకు తరచి చూస్తే చాలామందికి ఇప్పుడు, లేదంటే గతంలో... పరిశ్రమలతో ఏదో ఒక లింకు కచ్చితంగా కనిపిస్తుంది. ఎఫ్ఎస్ఎస్ఏఐ ముందు ఈ ప్యానెళ్ల సభ్యుల పూర్వాపరాలను కచ్చితంగా బహిరంగపరచాలి. దీనివల్ల వినియోగదారుడికి తాను తినే ఆహారానికి సంబంధించి ఎవరు రూల్స్ తయారు చేస్తున్నారో స్పష్టంగా తెలుస్తుంది. అలాగే సీఐఐ, హిందుస్థాన్ లీవర్ వంటి సంస్థలతో ఎఫ్ఎస్ఎస్ఏఐ భాగస్వామ్యం వంటి ఏర్పాటు పలు సమస్యలకు దారితీస్తున్న విషయాన్ని గుర్తించాలి. నిష్పాక్షిక, పారదర్శక సంస్థగా ప్రజల మద్దతు పొందే ప్రయత్నం చేయడం అవసరం, మేలు కూడా. చాలా ఏళ్లు వినియోగదారు సమూహాలు, ఆరోగ్య నిపుణులు ఉప్పు, చక్కెర, కొవ్వులు అధికంగా ఉన్న ఆహార పదార్థాలపై ప్రత్యేకమైన లేబుల్ ఒకటి వేయాలని కోరుతున్నాయి. అయితే ఫుడ్ సేఫ్టీ అథారిటీ, పరిశ్రమ వర్గాలు రెండూ దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఇంకోవైపు ఎఫ్ఎస్ఎస్ఏఐ పరిశ్రమలు చేసే డిమాండ్లను నెరవేర్చడంలో చాలా చురుకుగానే ఉంటోంది. విటమిన్లు ఇతర పోషకాలను చేర్చిన ఆహారానికి ప్రత్యేకమైన లేబుల్ ఉండాలన్న పరిశ్రమ డిమాండ్‌ను ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆగమేఘాలపై ఒప్పేసుకోవడం ఒక ఉదాహరణ.ఆహార పదార్థాల విషయంలో నియంత్రణ అధ్వాన్నంగా ఉంటే... పరిశ్రమ వర్గాల నిబంధనల పాలన కూడా అంతే తక్కువ అని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) స్వయంగా గుర్తించిన విషయాన్ని ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. కాగ్ 2017 లోనే ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రమాణాలను నిర్దేశించేందుకు సమయ బద్ధమైన ప్రణాళిక ఏదీ పాటించడం లేదని విమర్శించింది. అసంపూర్తిగా ఉన్న సమాచారం ఆధారంగా ఎఫ్ఎస్ఎస్ఏఐ కంపెనీలకు లైసెన్సులు ఇచ్చింది, ఆహార పదార్థాలను పరిశీలించే ల్యాబొరేటరీలు 72లో 56 ల్యాబ్స్‌కు తగిన అక్రిడిషన్ సర్టిఫికెట్లు కూడా లేనవి ఎత్తి చూపింది. పార్లమెంటరీ కమిటీ ఒకటి కూడా ఆహార పదార్థాలకు సంబంధించిన నియమ నిబంధనల రూపకల్పన విషయంలో మరింత పారదర్శకత తీసుకు రావాల్సిన అవసరాన్ని తన నివేదిక రూపంలో స్పష్టం చేసిన విషయం గమనార్హం. ఆహార పదార్థాల విషయంలో కొంత జాగరూకతతో వ్యవహరించాలన్నది ఇప్పటికైనా గుర్తిస్తే అది ప్రజారోగ్యానికి మంచి చేయగలదని అర్థం చేసుకోవాలి. దినేశ్ సి. శర్మ వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
తప్పుడు ప్రకటనలకు విరుగుడు ఎలా?
తప్పుదోవ పట్టించేలా ప్రకటనలిచ్చారంటూ పతంజలి సంస్థ విషయంలో సుప్రీంకోర్టు వ్యవహరించిన తీరు అందరి దృష్టినీ ఆకర్షించింది. 1954 నాటి చట్టం కొన్ని రకాల వ్యాధులకు మందులను ప్రకటించడంపై నిషేధం విధిస్తోంది. అయినా ఫలానా ఔషధాలతో అద్భుతాలు జరుగుతాయనడం, వాటి సామర్థ్యంపై చిలువలు పలువలుగా చెప్పడం కొనసాగుతూనే ఉంది. తప్పుదోవ పట్టించే ప్రకటనల జారీ కేవలం ఒక్క సంస్థకు మాత్రమే పరిమితం కాలేదు. ప్రాయోజిత కార్యక్రమాల రూపంలో ఎన్నో తప్పుడు చికిత్సావిధానాలు, మందుల గురించి ప్రచారం జరుగుతోంది. దేశంలోని చట్టాలు సరిపోకపోవడమో, శక్తిమంతంగా లేకపోవడమో ప్రస్తుత సమస్యకు కారణం కాదు; చట్టాల అమలులో ఉదాసీనంగా ఉండటమే అసలు సమస్య.సుప్రీంకోర్టులో ఇటీవల ఓ ఆసక్తికరమైన వ్యవహారం నడిచింది. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలిచ్చారంటూ పతంజలి ఆయుర్వేద వ్యవస్థాప కుడు బాబా రామ్‌దేవ్, ఆచార్య బాలకృష్ణ విషయంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం వ్యవహరించిన తీరు అందరి దృష్టినీ ఆకర్షించింది. కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేననీ, ధిక్కరణ కేసు విష యంలో క్షమాపణలు స్పష్టంగా, బహిరంగంగా తగు ప్రాధాన్యంతో చెప్పాల్సిందేననీ సుప్రీంకోర్టు పట్టుబట్టిన విషయం తెలిసిందే. తుది తీర్పు మాటెలా ఉన్నా... ఈ కేసు అటు మందుల తయారీదారుకు, ఇటు నియంత్రణ వ్యవస్థలు, ప్రభుత్వాలు, వినియోగదారులకు చాలా పాఠాలు నేర్పింది. ఇంతకీ ఏమిటీ కేసు? అన్నింటికీ కేంద్రంగా ఉన్నవి 1954 నాటి డ్రగ్స్ అండ్ మేజిక్ రెమిడీస్ (అభ్యంతరకరమైన ప్రకటనల) చట్టం; 1940 నాటి డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ చట్టం... దీని కింద 1945లో రూపొందించిన నిబంధనలను రామ్‌దేవ్ బాబాకు చెందిన సంస్థలు ఉల్లంఘించాయన్నది ఆరోపణ. 1954 చట్టం కొన్ని రకాల వ్యాధులకు మందులను ప్రకటించడంపై నిషేధం విధిస్తోంది. కొన్ని రకాల మందుల ప్రకటనకు సంబంధించి పరిమితులు విధిస్తోంది. క్యాన్సర్, మధుమేహం, వంధ్యత్వం, ఎయిడ్స్, ఊబకాయం, తక్కువ వయసు లోనే వృద్ధాప్య లక్షణాలు కనిపించడం, అంధత్వం వంటి సమస్యల పరిష్కారానికి మందులున్నాయని ప్రకటనలు జారీ చేయకూడదు... ఔషధాలతో అద్భుతాలు జరుగుతాయనడం, వాటి సామర్థ్యంపై చిలు వలు పలువలుగా చెప్పడం వంటివి. 1940 నాటి చట్టం... భారత్‌లో మందులు, సౌందర్య సాధనాలు, వైద్య పరికరాలు తదితరాల తయారీ, పంపిణీ, అమ్మకాలకు సంబంధించిన ప్రాథమిక చట్టం.పతంజలి సంస్థ మధుమేహం మొదలుకొని థైరాయిడ్ సంబంధిత సమస్యలు, ఆఖరికి క్యాన్సర్ వ్యాధికీ మూలిక సంబంధిత మందులు ప్రతిపాదిస్తున్న విషయం తెలిసిందే. కోవిడ్ కాలంలో ఈ సంస్థ వ్యాధిని నయం చేస్తుందని చెబుతూ ‘కరోనిల్’ను ప్రవేశ పెట్టింది. అప్పటి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ దీనికి మద్దతు పలికారు. ఈ మందుపై అభ్యంతరాలు వ్యక్తమైనప్పుడు మార్కెటింగ్‌లో ‘చికిత్స’ స్థానంలో ‘నిర్వహణ’ అని మార్చి చేతులు దులుపుకుంది పతంజలి. ఎన్నో వ్యాధులకు చికిత్స కల్పిస్తామని ప్రక టనలు జారీ చేయడమే కాకుండా, ఆధునిక వైద్య పద్ధతినీ లక్ష్యంగా చేసుకుని విమర్శలకు దిగింది. ఈ అంశంపై విసుగు చెందిన కొందరు ఆరోగ్య కార్యకర్తలు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు.. చట్టాల ఉల్లంఘన జరిగిందని ఫిర్యాదు చేశారు. కోర్టు తగదని వారించినా తప్పుడు ప్రకటన జారీ మాత్రం ఆపలేదు. ఫలితంగా కోర్టు ధిక్కరణకూ పాల్పడినట్లు అయ్యింది. తప్పుదోవ పట్టించే ప్రకటనల జారీ కేవలం పతంజలి సంస్థకు మాత్రమే పరిమితం కాలేదు. నిర్దిష్ట సమయాల్లో దేశంలోనిపత్రికలు, న్యూస్ ఛానెళ్లు కూడా ప్రాయోజిత కార్యక్రమాల రూపంలో ఎన్నో తప్పుడు చికిత్స పద్ధతులు, మందుల గురించి ప్రచారం చేస్తూంటాయి. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లోనైతే ఇలాంటివి కుప్పలు తెప్పలు! తాజాగా సోషల్ మీడియా ‘ఇన్ఫ్లుయెన్సర్లు’ రంగంలోకి దిగారు. ప్రమాదకరమైన ఉత్పత్తులను కూడా వీరు ఆరోగ్యం పేరిట అమ్మడం, ప్రచారం చేయడం మొదలుపెట్టారు. పెద్ద కంపెనీలు నేరుగా ప్రకటనలు జారీ చేసే విషయంలో కొంత నిగ్రహం పాటిస్తాయి. బదులుగా పెయిడ్ న్యూస్, వైద్య సంబంధిత సదస్సుల ప్రాయోజకత్వం, వైద్యులకు గిఫ్టులు ఇవ్వడం వంటి అనైతిక చర్యల ద్వారా తమ ఉత్పత్తులకు ప్రచారం కల్పించుకునే ప్రయత్నం చేస్తూంటాయి. కొన్నేళ్ల క్రితం తగినన్ని సాక్ష్యాలు లేకపోయినా కొన్ని ఔషధాల సామర్థ్యం విషయంలో ఐఎంఏ స్వయంగా మద్దతు పలకడం చెప్పుకోవాల్సిన అంశం. వైద్యుల అనైతిక చర్యల విషయంలోనూ ఐఎంఏ రికార్డు ఏమంత గొప్పగా లేదు. దేశంలోని చట్టాలు సరిపోకపోవడమో, శక్తిమంతంగా లేకపోవడమో ప్రస్తుత సమస్యకు కారణం కాదు. ప్రభుత్వాలు చట్టాలను అమలు చేసే విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తూండటమే అసలు సమస్య. నియంత్రణ సంస్థలు కూడా నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నాయి.హెచ్ఐవీ/ఎయిడ్స్‌కు చికిత్స కల్పిస్తామంటూ రామ్‌దేవ్ చేసిన ప్రకటనలను 2008లో నేను ఖండించాను. స్వయంగా వైద్యుడైన అన్బుమణి రామ్‌దాస్ నేతృత్వంలోని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రామ్‌దేవ్‌కు నోటీసు జారీ చేసింది. కొంత కాలం గడిచిందో లేదో... మంత్రి ‘యూ టర్న్’ తీసుకున్నారు. గురుగ్రామ్‌లో రామ్‌దేవ్ బాబాతో కలిసి యోగా సెషన్ లో కనిపించారు. ఆ వేదికపై కూడా రామ్‌దేవ్ హెచ్ఐవీ/ఎయిడ్స్‌ల చికిత్సకు తన మందులు ఉపయోగపడతాయని ప్రకటించుకున్నారు. దాదాపు ఈ సమయంలోనే సీపీఎం ఎంపీగా ఉన్న బృందా కారత్ ఈ రామ్‌దేవ్ వ్యవ హారాన్ని ఉత్తరాఖండ్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. ప్రస్తుత కేసు సంగతికి వద్దాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నియంత్రణ సంస్థలు కలిసికట్టుగా ఉదాసీన వైఖరిని అవలంబించాయి. ఫలితంగా రామ్‌దేవ్ బాబా తన తప్పుడు ప్రకటనల జారీని యథేచ్ఛగా కొనసాగించగలిగారు. కేరళకు చెందిన ఆరోగ్య కార్యకర్త, ఆర్టీఐ ఉద్యమకారుడు డాక్టర్ కేవీ బాబు పతంజలి సంస్థపై వరుసగా ఫిర్యాదు చేస్తూ వచ్చారు. ఉత్తరాఖండ్‌లోని స్టేట్ లైసెన్సింగ్ అథారిటీకి పలుమార్లు లేఖలు రాశారు. దాంతో అధికారులు పతంజలి సంస్థ అలాంటి ప్రకటనలు జారీ చేయడం మానుకోవాలని లేఖ రాశారు. అంతేగానీ, అధికారం ఉన్నప్పటికీ చర్యలు చేపట్టలేదు. పైగా తప్పించుకునేందుకు మార్గమూ చూపించారు. 1954 చట్టం కింద కాకుండా డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ యాక్ట్‌లోని నిర్దిష్ట నిబంధన కింద నోటీసు జారీ చేశారు. ఈ నిబంధనపై అప్పటికే ముంబై హైకోర్టులో ఓ కేసు నడుస్తూ ఉంది. దీంతో పతంజలి సంస్థ ఆ కేసును చూపి ప్రకటనల జారీ కొనసాగించింది. ప్రశ్నార్థకమైన ఈ నిబంధనను 2018లో ఒక సవరణ ద్వారా కలిపారు. ఆరోగ్య సంబంధిత ప్రకటనల జారీలో ముందస్తు అనుమతులను అది తప్పనిసరి చేసింది.ఆహార పదార్థాల ప్రకటనల్లో సెలబ్రిటీలు పాల్గొనడం, వాటి గురించి ఊదరగొట్టడం కూడా ఒక సమస్య. ఇలాంటి కేసుల్లోనూ ఫుడ్ సేఫ్టీ రెగ్యులేటర్ పనితీరును నత్తను తలపించేదే. న్యూట్రాస్యూ టికల్స్, ఫుడ్ సప్లిమెంట్స్లకు సంబంధించిన ప్రకటనల విషయంలో ఇప్పటికైనా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. దేశంలో మారిపోతున్న మీడియా వ్యవహారాలను దృష్టిలో ఉంచుకుంటే... ప్రత్యక్ష, పరోక్ష ప్రకటనలకు ఉన్న అవకాశాన్ని పరిగణనలోకి తీసుకుంటే ప్రస్తుతం దేశంలో అమల్లో ఉన్న చట్టాల (ఔషధాలు, సౌందర్య సాధనాలకు సంబంధించినవి) సంపూర్ణ సమీక్ష అవసరం. మందులు, ఆహార పదార్థాలు, సప్లిమెంట్ల వంటి అన్ని అంశాలకు సంబంధించిన, భారతీయ వైద్య విధానానికి సంబంధించిన చట్టాలను కూడా పూర్తిగా సమీక్షించాలి. తప్పుదోవ పట్టించే ప్రకటనల విషయంలో చాలా కఠినంగా వ్యవహరించాలని ప్రస్తుతమున్న చట్టాలు చెబుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఫుడ్ అండ్ డ్రగ్ రెగ్యులేటరీ ఏజెన్సీల పని తీరునూ సమీక్షించాలి. తగినన్ని వనరులు, అధికారాలు సమ కూర్చడం, స్వతంత్రంగా వ్యవహరించేందుకు అవకాశం కల్పించడం ద్వారా పరిస్థితిలో ఏదైనా మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. దినేశ్ సి. శర్మవ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
రైతులకు ఉపగ్రహ ఊతం
ఉత్తర భారతదేశ రైతులు ఒకవైపు దేశ రాజధానిలో కనీస మద్దతు ధరతో పాటు ఇతర హక్కుల సాధన కోసం పోరు కొనసాగిస్తున్నారు. ఇంకోవైపు శ్రీహరి కోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్ర శాస్త్రవేత్తలు వాతావరణాన్ని మరింత మెరుగ్గా అంచనా వేసేందుకు ఇన్శాట్–3డీఎస్ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించారు. ఈ ఉపగ్రహం వాన రాకడ, పోకడలతోపాటు వాతావరణానికి సంబంధించి మరింత కచ్చితమైన అంచనాలను రూపొందించేందుకు ఉద్దేశించినది. రైతులతోపాటు, మత్స్యకారులకూ ఉపయోగపడుతుంది. వాతావరణ మార్పుల నేపథ్యంలో ఈ రెండు వర్గాలు పలు సమస్యలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ వర్గాలకు సకాలంలో అందే హెచ్చరికలు, దీర్ఘకాలిక అంచనాలు ఎంతో ఉపయోగపడతాయి. వాతావరణ మార్పుల ప్రభావం వల్ల 2050 నాటికి గోధుమ, వరి దిగుబడుల్లో గణనీయ మైన తగ్గుదల ఉంటుందని శాస్త్రవేత్తలు ఇప్పటికే హెచ్చరించారు. ఇన్షాట్–3డీఎస్ ప్రయోగం దేశంలోనే అతి పురాతనమైన ఉపగ్రహ ప్రయోగ కార్యక్రమం తాలూకూ పరిణతికి నిదర్శనం. ఇండియన్ నేషనల్ శాటిలైట్ (ఇన్శాట్) కార్యక్రమానికి యాభై ఏళ్ల క్రితమే బీజం పడింది. 1975లో ఇన్శాట్ శ్రేణి ఉపగ్రహాల ప్రయోగాలకు అనుమతులు లభించాయి. 1982లో తొలి ఉపగ్రహం (ఇన్శాట్–1ఏ) ప్రయోగం జరిగింది. మొదట్లో ఈ ఉపగ్రహాల్లో అత్యధికం ఫోర్డ్ ఏరోస్పేస్ అండ్ కమ్యూనికేషన్స్ కార్పొరేషన్ నుంచి కొనుగోలు చేసి, ఫ్లారిడా(యూఎస్)లోని కేప్ కానవెరల్ నుంచి ప్రయోగించేవారు. ఇన్శాట్–1 శ్రేణి ఉపగ్రహాల కారణంగా భారతీయ వాతావరణ విభాగం ఉపగ్రహ ఆధారిత వాతావరణ అంచనాల రంగంలోకి అడుగుపెట్టింది. తుపానులు, ఈదురుగాలులతోపాటు అల్పపీడనా లను కూడా ఉపగ్రహాల సాయంతో పరిశీలించడం మొదలైంది. 1992లో ప్రయోగించిన ఇన్శాట్–2 శ్రేణి ఉపగ్రహాలు మునుపటి వాటి కంటే సాంకేతికంగా ఎంతో పురోగతి సాధించినవి కావడం గమనార్హం. దేశీయంగా తయారు చేసిన చాలా హై రెజొల్యూషన్ రేడియో మీటర్లను ఇందులో ఉపయోగించారు. ఫలితంగా రోజువారీ వాతావరణ అంచనాలు, ముందస్తు అంచనాలు, మేఘాల ఛాయాచిత్రాల సేకరణ సులువు అయ్యింది. సమాచార వినిమయానికి కూడా... ఇన్శాట్–1, ఇన్శాట్– 2 శ్రేణి ఉపగ్రహాలు అటు వాతావరణ అంచనాలతోపాటు ఇటు సమాచార వినిమయం, బ్రాడ్‌కాస్టింగ్ రంగా లకూ ఎంతో ఉపయోగపడ్డాయి. ఇన్శాట్–2 శ్రేణిలోని కొన్ని ఉప గ్రహాల్లో వాతావరణ సంబంధిత పేలోడ్లు అసలు లేకపోవడం గమ నార్హం. కొన్ని రకాల సమాచారాన్ని సేకరించేందుకు (తుపానుల మధ్య భాగం వంటివి) భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అమెరికా రక్షణ శాఖ ఉపగ్రహాలపై ఆధారపడింది. ఈ సమస్యను అధిగ మించే లక్ష్యంతో ఐఎండీ 2002లో మెట్శాట్ను ప్రయోగించింది. తరు వాతి కాలంలో దీని పేరును కల్పన–1గా మార్చారు. కర్నాల్ (హరియాణా)లో పుట్టి, ‘నాసా’ వ్యోమగామిగా ఎదిగి 2002లో స్పేస్‌షటిల్ ప్రమాదంలో మరణించిన కల్పనా చావ్లా స్మరణార్థమన్న మాట! ఈ సమయంలోనే వాతావరణ పరిశోధనలకు ప్రత్యేకంగా ఒక ఉపగ్రహం ఉంటే బాగుంటుందన్న అభిప్రాయాన్ని ఐఎండీ వ్యక్తం చేసింది. ఫలితంగానే 2013లో ఇన్శాట్–3డీ శ్రేణి మూడోతరం వాతా వరణ ఉపగ్రహ ప్రయోగం జరిగింది. 2016లో ఇదే శ్రేణిలో ఇంకో ఉపగ్రహాన్ని కూడా విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఈ ఏడాది ఫిబ్రవరి –17న ప్రయోగించిన ఉపగ్రహం ఇన్శాట్–3డీ శ్రేణిలో తాజాది. కేంద్ర భూశాస్త్ర మంత్రిత్వ శాఖ ఈ ఉపగ్రహానికి నిధులు సమకూర్చింది. ఐఎండీతోపాటు నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్ (నోయిడా), ఇండియన్ ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియరాలజీ (పూణే) వంటి సంస్థలు ఈ ఉపగ్రహం అందించే సమాచారాన్ని ఉపయోగించుకుంటాయి. వాతావరణం, సముద్ర సంబంధిత సమగ్ర సమాచారాన్ని ఇన్శాట్–3డీఎస్ ద్వారా అందుకోవచ్చు. దీంట్లోని పరికరాలు ఆరు రకాల పౌనఃపున్యాలలో ఛాయాచిత్రాలు తీయగలవు. నేల నుంచి మొదలుపెట్టి అంతరిక్షం వరకూ వేర్వేరు ప్రాంతాలకు సంబంధించిన ఉష్ణోగ్రతలు, తేమశాతం వంటి వివరాలూ సేకరించగలవు. సముద్ర, భూ ఉపరితల ఉష్ణోగ్రతలు, మేఘాల లక్షణాలు, పొగమంచు, వాన, మంచు ఆవరించిన ప్రాంతం, పడిన మంచు మందం, కార్చిచ్చులు, వాతావరణంలోని కాలుష్యకారక కణాలు, టోటల్ ఓజోన్ వంటి వివరాలన్నింటినీ ఎప్పటికప్పుడు సేకరించేందుకు ఈ ఉపగ్రహం ఉపయోగపడుతుంది. ఈ దశలో ఒక వైపు ఉపగ్రహ నిర్మాణంలో దేశీ టెక్నాలజీల వాడకం పెంచుకుంటూనే ఇంకోవైపున ఉపగ్రహ సమాచారాన్ని అందుకునేందుకు, విశ్లేషించేందుకు అవసరమైన భూతల సామర్థ్యాన్ని కూడా భారత్ పెంచుకుంది. వాతావరణ ఉపగ్రహాల నుంచి సమా చారం అందుకునేందుకు ఐఎండీ కొత్త కొత్త ఎర్త్ స్టేషన్స్ నిర్మాణాన్ని చేపట్టింది. సమాచారాన్ని అప్పటికప్పుడు విశ్లేషించేందుకు కంప్యూ టింగ్ సామర్థ్యాన్ని కూడా పెంచుకుంది. వాతావరణ మోడలింగ్ కోసం సూపర్ కంప్యూటర్ను ఇచ్చేందుకు అమెరికా నిరాకరించిన 1980లలో సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (సీ– డాక్)ను ఏర్పాటు చేసి, దేశీయంగానే హై స్పీడ్ కంప్యూటింగ్ వ్యవస్థ లను అభివృద్ధి చేసే పనిలో పడింది. అప్పటి నుంచి ఇప్పటివరకూ భారత్ వాతావరణ సంబంధిత సూపర్ కంప్యూటింగ్ వ్యవస్థల నిర్మా ణంలో అగ్రగామి దేశంగా నిలిచింది. తాజాగా అంటే గత ఏడాది మరింత అత్యాధునిక వాతావరణ పరిశోధనల కోసం కేంద్ర భూపరి శోధన మంత్రిత్వ శాఖ రెండు సూపర్ కంప్యూటర్ల నిర్మాణానికి సిద్ధమైంది. ఫ్రెంచ్ కంపెనీ సాయంతో పది కోట్ల డాలర్ల ఖర్చుతో వీటిని నిర్మించనున్నారు. నోయిడా, పూణెల్లోని కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. టెక్నాలజీతోపాటు మారుతూ... వాతావరణ అంచనాల ఫలితాలను సామాన్యులకు చేర్చేందుకు ఐఎండీ టెక్నాలజీతోపాటుగా మారుతూ వచ్చింది. అడ్వయిజరీస్, ఎర్లీ వార్నింగ్, షార్ట్ – మీడియం రేంజ్ స్థానిక అంచనాల వంటివి అందించే వ్యవస్థలను కూడా కాలక్రమంలో ఏర్పాటు చేసుకుంది. ఒకప్పుడు వాతావరణ సమాచారాన్ని టెక్స్ట్ ఎస్ఎంఎస్ రూపంలో పంపితే, మొబైల్ ఫోన్ల కాలంలో వేర్వేరు భాషల్లో సమాచారాన్ని అందించే వీలేర్పడింది. అయితే వీటి ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం రైతులకు ఎంతవరకూ ఆచరణ సాధ్యమన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. వాట్సప్, సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్‌ల వంటి అనేకానేక సమాచార మాధ్యమాలు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఈ ప్రశ్నకు మరింత ప్రాధాన్యమూ ఏర్పడుతోంది. నకిలీ, తప్పుడు వార్తలు విచ్చలవిడిగా ప్రవహిస్తున్న ఈ కాలంలో విశ్వసనీయమైన సమాచారం అందించేందుకు భారత వాతావరణ విభాగం ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరముంది. ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవాలన్న భారత ప్రయత్నాల్లో ఇన్శాట్–3డీఎస్ ఒక కీలకమైన మైలురాయి అని చెప్పాలి. విదేశాల నుంచి ఉపగ్రహాల కొనుగోళ్లు, ప్రయోగాలు నిర్వహించే స్థితి నుంచి మనం సొంతంగా వాతావరణ ఉపగ్రహాల తయారీ, ప్రయోగాలను చేపట్టే స్థితికి చేరాము. అది కూడా భారతీయ రాకెట్ల సాయంతో మనకు కావాల్సిన కక్ష్యలో ప్రవేశ పెట్టగలుగుతున్నాము. సాంకేతిక పరిజ్ఞాన లభ్యతలో ఉన్న అంతరా లను జాగ్రత్తగా గుర్తించడం, విదేశీ టెక్నాలజీలను ఔపోసన పట్టడం, వ్యవస్థలు–ఉప వ్యవస్థల నిర్మాణానికి తగిన కార్యక్రమాలను అమల్లోకి తేవడం, ఇండియన్ స్పేస్ ఆర్గనైజేషన్ , ఐఎండీ, ఇతర శాస్త్రీయ సంస్థలతో సన్నిహితంగా పనిచేయడం వంటి అనేకానేక చర్యల వల్ల ఈ అభివృద్ధి సాధ్యమైంది. ఇటీవలి కాలంలో దేశీ టెక్నాలజీ పరిశ్రమల ముఖచిత్రంలో గణనీమైన మార్పులు వస్తున్నాయి. మైక్రో ఉపగ్రహ సమూహాల ప్రయోగంలో ప్రైవేట్ సంస్థలు బిజీగా ఉంటున్నాయి. వేగంగా ముంచుకొస్తున్న వాతావరణ మార్పులను దృష్టిలో పెట్టుకుని భారత ప్రభుత్వం కూడా సాంకేతిక పరిజ్ఞాన రంగంలో స్వావలంబ నకు, మరీ ముఖ్యంగా అత్యాధునిక టెక్నాలజీల విషయంలో మరిన్ని ఎక్కువ పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దినేశ్ సి. శర్మ వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ వర్ధిల్లాలి!
ఏటా జనవరిలో జరగాల్సిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు ఈసారి రద్దుకావడం అవాంఛనీయ పరిణామం. భారతీయ శాస్త్ర సమాజం ఒక పొందికతో పురోగమించేందుకు... నూటా పదేళ్లుగా సాగుతున్న ఈ సమావేశాలూ ఒక కారణమంటే అతిశయోక్తి కాదు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అనేది ఓ విభిన్న వేదిక. ప్రత్యేక అంశాలు ఇతివృత్తంగా ఏర్పాటు చేసే శాస్త్రీయ సెమినార్లలో ఆ యా రంగాల్లో నిష్ణాతులైన శాస్త్రవేత్తలు మాత్రమే పాల్గొంటారు. సైన్స్ కాంగ్రెస్‌లో మాత్రం అన్ని రంగాలకు సంబంధించిన చర్చోపచర్చలూ జరుగుతాయి. శాస్త్రవేత్తలతో పాటు సామాన్యులు, డిగ్రీ కాలేజీ, యూనివర్సిటీ విద్యార్థులు కూడా హాజరవుతారు. ఇవి వారికి ఎంతో స్ఫూర్తిదాయకం. అందుకే ఈ సమావేశాలు నిరాటంకంగా కొనసాగాలి. భారతీయ శాస్త్ర పరిశోధన రంగానికి జనవరి నెల చాలా ముఖ్యమైంది. ఏటా ఈ నెల లోనే ‘ఇండియన్ సైన్స్ కాంగ్రెస్’ సమావేశాలు ఘనంగా జరుగు తాయి. భారత ప్రధాని చేతుల మీదుగా ప్రారంభమయ్యే ఈ వార్షిక ఉత్సవాలకు దేశం నలుమూలల నుంచి వేలాది మంది శాస్త్రవేత్తలు, విద్యార్థులు హాజరవుతారు. కానీ ఈ ఏడాది సైన్స్ కాంగ్రెస్‌కు ఆతిథ్యం ఇవ్వాల్సిన లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ చివరి నిమిషంలో ఊహించని సమస్యల కారణంగా తప్పుకొంది. సమావేశాలకు ఆర్థిక సాయం అందించే కేంద్ర ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గడంతో ఈ ఏడాది కార్య క్రమాలు అనివార్యంగా రద్దయ్యాయి. కీలకమైన అంశాలపై మేధోమధనం జరిపేందుకు, ఆ విషయా లపై ప్రభుత్వాలకు సూచనలిచ్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌లో ఉంటాయి. ఇలాంటి సలహా, సూచనలు గతంలో విధాన రూపకల్పనకు ఉపయోగపడిన ఉదాహరణలు కోకొల్లలు. కేంద్రంలో పర్యావరణ విభాగం (తరువాతి కాలంలో మంత్రిత్వ శాఖ స్థాయికి ఎదిగింది) ఏర్పాటుకూ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఓషన్ డెవలప్ మెంట్ (ప్రస్తుతం ఎర్త్ సైన్సెస్ మినిస్ట్రీ) ఏర్పాటుకూ సైన్స్ కాంగ్రెస్ ఇచ్చిన సలహాలే కారణం. వీటన్నింటికీ మించి ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంచేలా అత్యంత కీలకంగా వ్యవహరించింది. నూరేళ్లకు పైగా అప్రతిహతంగా... 1914లో ఏర్పాటైంది మొదలు ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు ఏటా అప్రతిహతంగా కొనసాగాయి. కోవిడ్ కాలం నాటి పరిస్థితులు ఒక్కటే మినహాయింపు. అప్పట్లో లక్నోలోని కానింగ్ కాలేజ్ అధ్యాపకులు పి.ఎస్. మెక్‌మోహన్ , మద్రాస్‌లోని ప్రెసిడెన్సీ కాలేజీ అధ్యాపకులు జేఎల్ సైమన్ సెన్ మానస పుత్రికగా ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ ఆవిర్భవించింది. ‘బ్రిటిష్ అసోసియేషన్ ఫర్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్’ తరహాలో వారు ఈ సంస్థను ఏర్పాటు చేశారు. ప్యూర్, అప్లైడ్ సైన్స్ రంగాలపై అభినివేశం ఉన్న వారందరికీ ఒక వేదిక కల్పించడం దీని ప్రధానోద్దేశం. సమాజానికీ, సైన్స్కూ మధ్య ఒక వారధిగానూ ఈ సంస్థ ఉపయోగపడుతుందని వారు భావించారు. గణిత, ఖగోళ, భౌతిక, రసాయన, భౌగోళిక, జీవ శాస్త్రాల్లో పరిశోధనలు చేస్తున్న వారందరికీ తొలి ఉమ్మడి వేదిక కూడా ఇదే. ఆయా శాస్త్ర రంగాలకు సంబంధించిన కొత్త ఆలోచనలు పంచుకునేందుకు సైన్స్ కాంగ్రెస్ ఎంతో ఉపయోగపడింది. దశాబ్దాల సైన్స్ కాంగ్రెస్ సమావేశాల కారణంగా దేశంలో మరిన్ని శాస్త్రీయ సొసైటీలు, వృత్తినైపుణ్యమున్న సంస్థలు ఏర్పడ్డాయి. ఈ వేదిక ఈ కాలానికి సరిపోయేది కాదనీ, పాతకాలపు పద్ధతులనే కొనసాగిస్తోందనీ కొందరు అంటూంటారు. దేశంలో శాస్త్ర రంగాల అభివృద్ధితో పరుగులు పెడుతూనే, వేర్వేరు దశల్లో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఎలా ఎదిగిందో విస్మరించేవారే ఇలాంటి విమర్శలు చేయగలరు. ప్రాక్ – పశ్చిమాల మేళవింపు... ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ ప్రస్థానంలో తొలిదశ 1914–47 మధ్యకాలమని చెప్పవచ్చు. ఈ సమయంలో భారతీయ, యూరోపియన్ శాస్త్రవేత్తల మధ్య సమాచార వినిమయం ఎక్కువగా ఉండేది. యూరోపియన్ శాస్త్రవేత్తలు అనేకులు భారతీయ పరిశోధన సంస్థల్లో పనిచేస్తూండేవారు. తమ ఆలోచనలు పంచుకునేందుకు వీరికి ఉన్న ఒకే ఒక్క వేదిక ఇండియన్ సైన్స్ కాంగ్రెస్సే. దీనికి సమర్పించే అన్ని పరిశోధన వ్యాసాలనూ సమాకాలీన శాస్త్రవేత్తలు సమీక్షించేవారు. ఈ రకమైన సమీక్ష, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు అన్న భావన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ద్వారానే ఏర్పడ్డాయి. భారత్‌లో సైంటిఫిక్ జర్నల్స్ ప్రచురణ కూడా సైన్స్ కాంగ్రెస్ పుణ్యమే. ప్రఖ్యాత శాస్త్రవేత్త మేఘనాథ్ సాహా ప్రచురించిన ‘సైన్స్ అండ్ కల్చర్’ జర్నల్ దీనికి ప్రబల ఉదాహరణ. దేశంలో స్వాతంత్య్ర ఉద్యమం బాగా నడుస్తున్న 1930లలో జాతీయ నాయకత్వం దేశ భవిష్యత్తు కోసం ప్రణాళికలు రచించడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో దేశాభివృద్ధిలో సైన్స్‌ను వినియోగించడంపై దీని వేదికగా అనేక కొత్త ఆలోచనలపై చర్చ జరిగింది. పారిశ్రామికీకరణ, సమాజం పట్ల సైన్స్ బాధ్యత వంటి ఆలోచనలు పురుడు పోసుకున్నది ఇక్కడే. 1937లో జరిగిన సమావేశాల్లోనే జవహర్లాల్ నెహ్రూ ‘‘ఈ కాలపు స్ఫూర్తి సైన్స్. ఆధునిక ప్రపంచాన్ని శాసిస్తున్నదీ ఇదే. సైన్స్‌తో మిత్రత్వం నెరిపేవారిది, సమాజ పురోభివృద్ధికి దాని సాయం తీసుకునేవారిదే భవిష్యత్తు’’ అన్న వ్యాఖ్యలు చేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 1947లోనూ ఈ సమావేశాలకు నెహ్రూ అధ్యక్షుడిగా ఉన్నారు. 1964లో ఆయన మరణించేంత వరకూ కొనసాగారు. ఆ తరువాతి కాలంలో ఈ సమావేశాల్లో దేశ ప్రధాని శాస్త్రవేత్తలను ఉద్దేశించి ప్రసంగించే సంప్రదాయం మొదలైంది. చాలా సందర్భాల్లో దేశ ప్రధానులు ఈ వేదికపై నుంచి కొన్ని కీలకమైన విధాన నిర్ణయాలను కూడా ప్రకటించేవారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత దేశంలో శాస్త్ర పరిశోధనల పునాదులకు శ్రీకారం చుట్టారు. జాతీయ పరిశోధన సంస్థలు, రీసెర్చ్ కౌన్సిళ్లు పనిచేయడం మొదలైంది. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ కూడా ఒక కొత్త దశలోకి అడుగుపెట్టింది. శాస్త్ర పరిశోధనలపై చర్చలకు వేదికగా నిలుస్తూనే ప్రణాళిక, ఆహార సంక్షోభం, ఆరోగ్యాభివృద్ధి వంటి విస్తృత స్థాయి విధానపరమైన అంశాలపై కూడా చర్చలు మొదలయ్యాయి. యూనివర్సిటీ వ్యవస్థలోని పరిశోధకులతో పాటు జాతీయ పరిశోధన సంస్థలు, శాస్త్ర విభాగాలకు చెందినవారు ఇండి యన్ సైన్స్ కాంగ్రెస్ ప్రక్రియలో ఎక్కువగా పాలుపంచుకోవడం మొదలైంది. ఈ క్రమంలోనే కొన్ని దశాబ్దాల తరువాత ఆయా రంగా లకు ప్రత్యేకమైన సంస్థలు ఏర్పడటంతో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ తన ప్రాభవాన్ని కొంత కోల్పోయిందని చెప్పాలి. ఆయా రంగాల పరి శోధన పత్రాలను మునుపటిలా సైన్స్ కాంగ్రెస్‌లో కాకుండా ప్రత్యేక సంస్థలకు సమర్పించడం మొదలైంది. శాస్త్రీయ దృక్పథం పెరగాలంటే... ప్రస్తుతానికి వద్దాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో, సైన్స్ రంగంలో పోటీని దృష్టిలో పెట్టుకుంటే ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాల్లో శాస్త్రవేత్తలు తమ పరిశోధనల ఫలితాలను పంచుకోవాలని అను కోవడం అత్యాశే అవుతుంది. అందుకే ఈ సమావేశాలపై కొంతమంది పెదవి విరుస్తున్నారు. నిర్వాహకుల నిర్లక్ష్యం అనండి... ఇంకేమైనా కానివ్వండి... సైన్స్ వ్యతిరేకులు కొందరికి ఈ సైన్స్ కాంగ్రెస్ వేదికగా మారడం ఇటీవలి పరిణామం. ఒక్కటైతే నిజం. యువతరంతో తమ పరిశోధనల వివరాలను పంచుకోవాలని అనుకునే శాస్త్రవేత్తలకు, ఇతర రంగాల్లోని సహోద్యో గులతో ఆలోచనలు పంచుకోవాలనుకునేవారికి ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అవసరం ఇప్పటికీ ఉంది. నోబెల్ అవార్డు గ్రహీతలు ఇక్కడ చేసే ప్రసంగాలు ఎంతోమంది యువకులు, విద్యార్థులకు స్ఫూర్తినిస్తా యనడంలో సందేహం లేదు. ఈ కారణాలన్నింటినీ దృష్టిలో ఉంచు కుంటే ఈ సమావేశాలు భవిష్యత్తులోనూ కొనసాగాలి. సామాజిక మాధ్యమాల ద్వారా సూడోసైన్స్ కూడా సైన్స్ పేరిట చలామణి అవుతున్న ఈ సమయంలో దేశంలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు ఇలాంటి వేదికలు అనేకం అవసరం. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ 2024 సైన్స్ కాంగ్రెస్ సమావేశాలకు ఆర్థిక సాయాన్ని ఎందుకు నిలిపేసిందో వివరణ ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. దినేశ్ సి. శర్మ వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
సైన్సులో మన ఘన విజయాలు
చంద్రయాన్ –3 విజయవంతం కావడం శాస్త్రరంగంలో భారత్ 2023లో సాధించిన అతిగొప్ప విజయం. ఏళ్లపాటు శ్రమించిన శాస్త్రవేత్తలు, ఇంజినీర్ల విజయమిది. చంద్రయాన్ సక్సెస్ తరువాత కొంత కాలానికే భారతదేశపు ప్రతిష్ఠాత్మక ఆదిత్య–ఎల్1 ప్రయోగం కూడా విజయవంతంగా ముగియడం హైలైట్లలో మరొకటి. ‘లిగో ఇండియా’ ప్రాజెక్టుకు మన దేశం అంగీకరించడం ఒక మేలి మలుపు. మహారాష్ట్రలోని హింగోలి ప్రాంతంలో లిగో ఇండియా నిర్మాణం ప్రారంభమైంది. నేషనల్ క్వాంటమ్ మిషన్ కు కూడా 2023లోనే శ్రీకారం పడింది. అయితే, సెన్స్ రంగంలో ఇచ్చే పలు అవార్డులను రద్దు చేయడం, జీవ పరిణామ క్రమాన్ని వివరించే పాఠాలను పుస్తకాల్లోంచి తొలగించడం ఆందోళన రేకెత్తించిన కొన్ని ప్రభుత్వ నిర్ణయాలు. నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్ లను జాబిల్లి పైకి మోసుకెళ్లిన అపోలో–11 లూనార్ మాడ్యూల్లో బ్లాక్ అండ్ వైట్ టీవీ కెమెరా ఉండేది. ఆ ఇద్దరు వ్యోమగాములు చందమామపై మొదటిసారి అడుగుపెట్టిన చారిత్రక ఘట్టపు లైవ్ ప్రసారం ఈ కెమెరా ద్వారానే జరిగింది. అప్పట్లో ఈ ప్రసారాన్ని 53 కోట్ల మంది వీక్షించారు. అంతరిక్ష పరిశోధనల్లో 1969 జూలై 20 నాటి ఈ ఘటన అత్యంత కీలకమైందనడంలో సందేహం లేదు. అలాగే టెలివిజన్ ప్రసారాల్లోనూ ఓ మైలురాయిగా నిలిచింది. యాభై ఏళ్ల తరువాత 2023 ఆగస్టు 23న కూడా దాదాపు ఇలాంటి చారిత్రక ఘటనే భారత్ లోనూ నమోదైంది. చంద్రయాన్ –3 జాబిల్లిపై అడుగుపెట్టిన ఘట్టాన్ని యూట్యూబ్‌లోనే 80.9 లక్షల మంది వీక్షించారు. యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్‌కు సంబంధించి ఇదో రికార్డు. చంద్రయాన్ –3 విజయవంతం కావడం శాస్త్రరంగంలో భారత్ 2023లో సాధించిన అతిగొప్ప విజయం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏళ్లపాటు శ్రమించిన శాస్త్రవేత్తలు, ఇంజినీర్ల విజయ మిది. చంద్రయాన్ ప్రయోగం సక్సెస్ తరువాత కొంత కాలానికే భారతదేశపు ప్రతిష్ఠాత్మక ఆదిత్య–ఎల్1 ప్రయోగం కూడా విజయవంతంగా ముగియడం హైలైట్లలో మరొకటిగా చెప్పుకోవచ్చు. కొత్త సంవత్సరం తొలివారంలో ఈ అంతరిక్ష నౌక సూర్యుడిని పరిశీలించేందుకు అనువైన స్థానానికి చేరుకోనుంది. ఈ రెండు ప్రయోగాలు మాత్రమే కాకుండా 2023లో ‘ఇస్రో’ ఖాతాలో పలు కీలకమైన ప్రాజె క్టులను అమలు చేసిన ఖ్యాతి చేరింది. రీయూజబుల్ లాంచ్ వెహికల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని పరీక్షించడం, రెండోతరం నావిగేషన్ ఉప గ్రహాల్లో తొలి ప్రయోగం, మానవ సహిత ప్రాజెక్టు ‘గగన్‌యాన్ ’లో క్రూ ఎస్కేప్ మోడల్ పరీక్ష ఈ జాబితాలో కొన్ని మాత్రమే. అంతరిక్ష ప్రయోగాలకు ఆవల... దేశం శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో అంతరిక్ష ప్రయోగాలకు ఆవల కూడా మన దేశం పలు విజయాలను నమోదు చేసింది. లేజర్ ఇంటర్ఫెరోమీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ (లిగో ఇండియా)కి ప్రభుత్వం అంగీకరించడం ఒక మేలి మలుపు. మహారాష్ట్రలోని హింగోలి ప్రాంతంలో లిగో ఇండియా ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమైంది. ప్రపంచంలోనే అరుదైన గురుత్వ తరంగాల వేధశాలగా, అతి సున్నితమైన నాలుగు కిలోమీటర్ల పొడవైన ఇంటర్ఫెరోమీటర్ సొరంగం ఉన్నదిగా ఇది రికార్డులకు ఎక్కింది. కృష్ణ బిలాలు, న్యూట్రాన్ నక్షత్రాల వంటివి కలిసిపోయినప్పుడు పుట్టే గురుత్వ తరంగాలను గుర్తించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. అమెరికాలో ఇప్పటికే పని చేస్తున్న లిగో వేధశాలలతో కలిసి హింగోలి వేధశాల పనిచేస్తుంది. నేషనల్ క్వాంటమ్ మిషన్‌కు కూడా 2023లోనే అడుగు పడింది. సూపర్ కండక్టింగ్, ఫొటోనిక్ ప్లాట్‌ఫామ్‌ల సాయంతో మధ్యమ స్థాయి క్వాంటమ్ కంప్యూటర్లు తయారు చేయడం ఈ ప్రాజెక్టు ఉద్దేశం. దీంతోపాటే కృత్రిమ మేధ ద్వారా దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలను గుర్తించేందుకు కూడా జాతీయ స్థాయి కార్య క్రమం ఒకటి ఈ ఏడాది మొదలైంది. కృత్రిమ మేధను బాధ్యతా యుతమైన టెక్నాలజీగా అభివృద్ధి చేయడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. పరిశోధనల్లోనూ ఉన్నత స్థితిలో... భారతదేశంలో ప్రచార ఆర్భాటాలకు చిక్కని, అత్యుత్తమ, అంత ర్జాతీయ స్థాయి పరిశోధనలు ఎన్నో నమోదయ్యాయి. వీటిల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి హైదరాబాద్‌లోని లాకోన్స్లో ఒక పర్యావరణ వ్యవస్థలో జీవవైవిధ్యతను గుర్తించేందుకు అభివృద్ధి చేసిన పద్ధతి. సీసీఎంబీ అనుబంధ సంస్థ అయిన లాకోన్స్లో ఎస్. మను, జి.ఉమాపతి ఈ పరిశోధనకు నేతృత్వం వహించారు. నీరు, మట్టి, గాలుల్లోని డీఎన్ ఏ పోగుల ఆధారంగా జీవవైవిధ్యతను కొలవడం ఈ పద్ధతి ప్రత్యేకత. కర్నాల్(హరియాణా)లోని నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ శాస్త్రవేత్తలు దేశీ గిర్ జాతి ఆవును క్లోనింగ్ పద్ధతి ద్వారా సృష్టించడం 2023 విశేషాల్లో ఇంకోటి. బనారస్ హిందూ యూనివర్సిటీకి చెందిన జ్ఞానేశ్వర్ చౌబే నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం దక్షిణాసియా జన్యుక్రమాల్లో ఓ కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. సింహళీయులకు, శ్రీలంకలోని తమిళులకు మధ్య దగ్గరి జన్యు సంబంధాలు ఉన్నట్లు పరిశోధన పూర్వకంగా నిర్ధారించింది. ఆసక్తికరమైన ఇంకో విషయం ఏమిటంటే, ఈ రెండు వర్గాల ప్రజలకూ మరాఠా జనాభాకూ మధ్య సంబంధాలు ఉండటం! కోవిడ్ విషయానికి వస్తే, పుణె కేంద్రంగా పనిచేస్తున్న జెన్నోవా బయో ఫార్మాస్యూటికల్స్ దేశీయంగా తయారు చేసిన ఎంఆర్ఎన్ ఏ టీకాను విడుదల చేసింది. ఒమిక్రాన్ వైరస్ నియంత్రణకు పనికొస్తుందీ టీకా. విధాన నిర్ణయాలను పరిశీలిస్తే... దేశం మొత్తమ్మీద శాస్త్ర పరిశోధనలకు అవసరమై నిధుల కేటా యింపును పర్యవేక్షించేందుకు ‘నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ’ ఒకదాన్ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం చట్టం చేసింది. వివరాలు పూర్తిగా బహిరంగం కాలేదు. ఇదిలా ఉంటే దశాబ్దాలుగా పనిచేస్తున్న విజ్ఞాన్ ప్రసార్‌ను 2023లో మూసివేశారు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ (ఐఎస్‌సీఏ)కు నిధుల కేటాయింపులు తగ్గించారు. ఈ సంస్థ ఆధ్వర్యంలోనే ఏటా జాతీయ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు జరుగుతాయి. సైన్స్ రంగంలో ఇచ్చే పలు అవార్డులను రద్దు చేయడం, జీవ పరిణామ క్రమాన్ని వివరించే పాఠాలను పుస్తకాల్లోంచి తొలగించడం ఆందోళన రేకెత్తించిన కొన్ని ప్రభుత్వ నిర్ణయాలు. కేంద్ర ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ తన మద్దతు ఉపసంహరించుకోవడంతో జనవరిలో సైన్స్ కాంగ్రెస్ జరిగే అవకాశాలు లేవు. డీఎస్టీ తమ స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసేలా వ్యవహరించిందని ఐఎస్‌సీఏ ఆరోపిస్తోంది. సైన్స్ కాంగ్రెస్ సమావేశాలను లక్నోలో కాకుండా జలంధర్ సమీపంలోని పగ్వారాలో నిర్వహించాలన్న ఐఎస్‌సీఏ నిర్ణయం డీఎస్టీకి రుచించలేదు. 2023లో సైన్స్ కాంగ్రెస్‌ను నాగ్‌పూర్‌లో నిర్వహించారు. మరోవైపు పలు శాస్త్ర సంబంధిత విభాగాలు ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ విజ్ఞాన్ భారతి ప్రాయో జకత్వం వహిస్తున్న వార్షిక్ సైన్స్ ఫెస్టివల్‌కు పెద్ద ఎత్తున ఆర్థిక సహకారం అందిస్తూండటం గమనార్హం. దురదృష్టవశాత్తూ చాలా సంస్థలు రాజకీయ పెద్దల అడుగులకు మడుగులొత్తే స్థితికి చేరిపోయాయి. లక్నోలోని నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ 108 రేకులున్న కమలాన్ని అభివృద్ధి చేసి దానికి ‘నమో 108’ అని నామకరణం చేసింది. కేంద్ర శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన శాఖల మంత్రి జితేంద్ర సింగ్ ‘నమో 108’ను ఆవిష్కరిస్తూ ‘మతపరంగా కమలానికి, 108 సంఖ్యకు ఉన్న ప్రాముఖ్యతలను దృష్టిలో ఉంచుకుంటే ఈ కొత్త రకం కమలం చాలా ప్రత్యేకమైన గుర్తింపుని ఇస్తుంది’ అని వ్యాఖ్యానించారు. ‘నిరంతర కృషీవలుడు నరేంద్ర మోదీ అంతః సౌందర్యానికి ఈ కమలం ఓ గొప్ప బహుమానం’ అని కూడా అన్నారు. ఇంకో సీఎస్ఐఆర్ పరిశోధన సంస్థ నికోటిన్ మోతాదు తక్కువగా ఉన్న పొగాకు వంగడాన్ని అభివృద్ధి చేసింది. ఈ వంగడం అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ స్ఫూర్తి అని సీఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ ఎన్ .కళైసెల్వి వ్యాఖ్యానించారు. ఇంకో పక్క ఎన్సీఈఆర్టీ చంద్రయాన్ ప్రయోగ కీర్తి ప్రధానికి దక్కుతుందని పొగడటం ప్రస్తావనార్హం. ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ వంటి స్వతంత్ర సంస్థలు ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలోనూ నిశ్శబ్దంగా ఉండటం ఆశ్చర్య పరు స్తోంది. 2023లో భారతదేశం సాధించిన అతి గొప్ప విజయం చంద్రయాన్ అనుకుంటే... సైన్స్ సంస్థల రాజకీయీకరణ అత్యంత దురదృష్టకరమైనదిగా చెప్పాలి. దినేశ్ సి. శర్మ వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
శాస్త్ర విజ్ఞానంలోనూ రాజకీయాలా?
దేశంలో గడచిన దశాబ్దాల్లో అంతరిక్షం, అణుశక్తి, వాతావరణం వంటి అంశాలను రాజకీయాలకు అతీతంగా ఉంచారు. రాజకీయ నేతలు కూడా ఈ విషయంలో ఆరోగ్యకరమైన, స్పష్టమైన విభజనను పాటించారు. అయితే రాజకీయ మద్దతుకూ, సైన్స్‌ను రాజకీయం చేయడానికీ మధ్య చాలా తేడా ఉంది. శాస్త్ర పరిశోధనలకు కావాల్సినన్ని నిధులు సమకూర్చేందుకు రాజకీయ వర్గాల మద్దతు అవసరం. దేశ విస్తృత ప్రయోజనాలు, లక్ష్యాలు, ఆర్థిక వృద్ధికీ, పరిశోధనలకూ మధ్య పొంతన కుదరాలన్నా ఇది అవసరమే. కానీ చంద్రయాన్ –3 విజయం 2014 తరువాతి ఘనతగా కీర్తించడం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ దశాబ్దాలుగా విజయవంతంగా అనుసరిస్తున్న ప్రాజెక్టు ప్లానింగ్ పద్ధతులను అవమానించడమే! దేశంలోని చాలా శాస్త్రీయ సంస్థలు, పరిశో ధన సంస్థలు ఇటీవలి కాలంలో ‘సెల్ఫీ పాయింట్’లు ఏర్పాటు చేశాయి. ఇక్కడ సందర్శకులు సెల్ఫీలు తీసుకుని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్ రీళ్లు, ఫేస్బుక్ స్టోరీల కాలంలో ప్రభుత్వ సంస్థలు ఇలాంటి గిమ్మిక్కులకు తెగబడటం ఎక్కువైంది. అయితే పరిశోధన సంస్థల విషయంలో ఉద్దేశం వేరు. సెల్ఫీ కేంద్రాలను ఒక నిర్దిష్ట శైలిలో నిర్మించాలని ప్రభుత్వ పెద్దల నుంచి ఆదేశాలు వచ్చాయి. ప్రతిదాంట్లో ప్రధాని ఛాయాచిత్రం ఒకపక్క, ఆ సంస్థ విజయాలు ఇంకోపక్క ప్రదర్శించేలా ఏర్పాట్లు చేశారు. ప్రాథమిక జ్ఞానం ఉన్నవారికి కూడా దీని వెనుక మతలబు ఏమిటో అర్థం అవుతుంది. ఆయా సంస్థల విజయాలు ఒక వ్యక్తి దయాదాక్షిణ్యాలని పరోక్షంగా చెప్పే ప్రయత్నం ఇది. శాస్త్రీయ పరి శోధన సంస్థలు కూడా సులభంగా ఇందుకు అంగీకరించడం ఆశ్చర్య కరమైన విషయం కాదు. కొందరు ఇంకో అడుగు ముందుకేసి చిన్న పోస్టర్ల స్థానంలో పెద్ద పెద్ద కటౌట్లు పెట్టేశారు. భారతీయ సైన్స్‌కు ప్రధాని దైవదూత అన్న మాదిరిగా సందేశాలివ్వడం కేవలం సెల్ఫీ పాయింట్లకే పరిమితం కాలేదు. వెబ్సైట్లు, సోషల్ మీడియా హాండిల్స్, సైంటిఫిక్ ల్యాబ్స్‌తోపాటు పాఠ్య పుస్తకాల్లోకీ చేరుతోంది. ‘ఎన్సీఈఆర్టీ’ గత నెలలో విడుదల చేసిన ‘చంద్రయాన్ ఉత్సవ’ పుస్తక శ్రేణిలోనూ ఇది కనిపించింది. పది పుస్తకాలతో కూడిన ఇవి వేర్వేరు తరగతులకు ఉద్దేశించారు. అన్నింటి లోనూ ప్రధాన ఇతివృత్తం చంద్రయాన్ –3 విజయానికి ప్రధాన సూత్ర ధారి ప్రధాని అని చూపడమే. అది కూడా 2019 నాటి చంద్రయాన్ –2 వైఫల్యం తరువాత! సెకండరీ స్టేజ్ (కోడ్ 1.4ఎస్)లో ‘గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వ లక్షణాల ఫలితంగానే చంద్రయాన్ –3 విజయం సాధించింది’ అని స్పష్టంగా చెప్పారు. చంద్రయాన్ –2 పాక్షిక విజయంపై విశదీకరిస్తూ... ‘వనరులు, శ్రమ, డబ్బు నష్టపోయినా ప్రధాని నిరుత్సాహ పడలేదు. బదులుగా మరింత ఆత్మవిశ్వాసంతో ఇస్రో శాస్త్రవేత్తలు, ప్రజలను చైతన్యవంతులను చేశారు. సరికొత్త దార్శనికత ప్రదర్శించారు’ అని రాశారు.ఇందులో ప్రధాని ప్రస్తావన తొమ్మిది సార్లుంది. కానీ 2008లో చంద్ర యాన్ –1 ద్వారా జాబిల్లిపై నీటి ఉనికిని మొదటిసారిగా గుర్తించిన కీలకమైన విషయాన్ని మాత్రం విస్మరించారు. ఆత్మ విశ్వాసానికి దెబ్బ... చంద్రయాన్–3 విజయం 2014 తరువాతి ఘనతగా కీర్తించడం భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ దశాబ్దాలుగా విజయవంతంగా అనుసరిస్తున్న ప్రాజెక్టు ప్లానింగ్ పద్ధతులను అవమానించడమే. ఓ ప్రాజెక్టు విజయానికి రాజకీయ నేతలను కర్తలుగా చేస్తూ పొగడటం సైన్స్‌ను రాజకీయం చేయడమే అవుతుంది. రాజకీయ మద్దతుకూ, సైన్స్‌ను రాజకీయం చేయడానికీ మధ్య చాలా తేడా ఉంది. శాస్త్ర పరిశోధనలకు కావాల్సినన్ని నిధులు సమకూర్చుకునేందుకు రాజ కీయ వర్గాల మద్దతు అవసరం. దేశ విస్తృత ప్రయోజనాలు, లక్ష్యాలు, ఆర్థిక వృద్ధికీ, పరిశోధనలకూ మధ్య పొంతన కుదరాలన్నా ఇది అవసరమే. పండిట్ జవహర్లాల్ నెహ్రూ స్వయంగా దేశ శాస్త్ర పరి శోధన రంగాల తీరుతెన్నులను పర్యవేక్షించారు. సైన్స్‌లో పెట్టుబడుల ఆవశ్యకత గురించి అటు ప్రజలకు, ఇటు అధికారులకు, పార్లమెంటేరియన్లకు అర్థమయ్యేందుకు కృషి చేశారు. ఇవన్నీ ఆయన వెసులు బాటు కల్పించే వాడిగా చేశారు కానీ, నేరుగా పరిశోధన కౌన్సిళ్ల వ్యవహారాల్లో తలదూర్చలేదు. గడచిన కొన్ని దశాబ్దాల్లోనూ అంతరిక్షం, అణుశక్తి, వాతావరణం వంటి అంశాలను రాజకీయాలకు అతీతంగా ఉంచారు. రాజకీయ నేతలు కూడా ఆరోగ్యకరమైన, స్పష్టమైన విభజనను పాటించారు. శ్రీహరికోట నుంచి జరిగిన ముఖ్యమైన ప్రయోగాల్లో అప్పట్లో ప్రధాని రాజీవ్ గాంధీ రాజకీయంగా బద్ధ శత్రువైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావును వేదిక పైకి ఆహ్వానించిన విషయం గుర్తుచేసు కోవాలి. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా ఉండగా చంద్రయాన్ –1 ఆలోచన రూపుదిద్దుకుంది. కానీ పలు పార్లమెంటరీ కమిటీల్లో దీనిపై చర్చలు జరిగిన తరువాత గానీ ఆమోదించలేదు. తన పంద్రాగస్టు ప్రసంగంలో వాజ్‌పేయి చంద్రయాన్ –1 గురించి తొలిసారి ప్రకటించారు. ఇస్రో ఈ ప్రాజెక్టుకు సోమయాన్ అని పేరు పెడితే వాజ్‌పేయి దాన్ని చంద్రయాన్ అని మార్చారు. అయితే దీన్ని ఎప్పుడూ ఆయన తన వ్యక్తిగత విజయంగా చెప్పుకోలేదు. భారత్– అమెరికా అణు ఒప్పందం తుది దశ చర్చల వివరాలు ప్రతిపక్షాలకూ అందించేందుకు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ తన సీనియర్ సలహాదారును నియమించారు. అలాగే ప్రతిపక్ష పార్టీల పార్లమెంటు సభ్యులను వాతావరణ మార్పులపై జరిగే సదస్సులకు హాజరయ్యే ప్రతినిధి బృందాల్లో భాగస్వాములను చేశారు. జోక్యంతో ప్రమాదం... శాస్త్ర పరిశోధనల విషయంలో రాజకీయాలు ప్రమాదకరం. కేంద్ర శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన శాఖల మంత్రి జితేంద్ర సింగ్ పలుమార్లు తన బాస్ అయిన ప్రధాని మోదీ నేతృత్వం కారణంగానే 2014 తరువాత శాస్త్ర రంగంలో అనేక విజయాలు నమోదయ్యాయని పదేపదే చెప్పుకొన్నారు. ఇదే ఇప్పుడు ఎన్సీఈఆర్టీ పుస్తకాల్లోనూ వ్యక్తమైంది. ఇలాంటి ప్రకటనలు ఏళ్లుగా పని చేస్తున్న శాస్త్రవేత్తల నిబద్ధతను తక్కువ చేసి చూపుతాయి. చంద్రయాన్ –1 ఆలోచనకు బీజం 1999లో పడితే వాస్తవరూపం దాల్చింది 2008లో. దీని తరువాత చేపట్టిన ప్రయోగాలు... ఉదాహరణకు చంద్రయాన్ –3, ఆదిత్య ఎల్–1 కూడా 2014కు ముందే మొదలైనవి. వీటి విజయాలకు 2014 తరువాతి రాజకీయ నేతృత్వం కారణమని చెప్పుకోవడం అత్యంత కచ్చితత్వంతో ఎంతోకాలంగా విజయవంతంగా ఇస్రో అమలు చేస్తున్న ప్రాజెక్ట్ ప్లానింగ్, మేనేజ్మెంట్ వ్యవస్థలను అవమానించడమే. 2014 కంటే ముందు ప్రయోగించిన ఉపగ్రహాల సంఖ్యను, తరువాతి సంఖ్యను పోల్చడం కూడా సరికాదు. 2014 తరువాత ఇస్రో ప్రయోగించిన ఉపగ్రహాల్లో అత్యధికం మైక్రో శాటిలైట్ల మార్కెట్ పెరగడం పుణ్యంగా వచ్చినవి అని గుర్తుంచు కోవాలి. ఇంకో విషయం... సైన్స్ విషయాల్లో రాజకీయ జోక్యం పరిశోధన సంస్థల స్వతంత్రత తగ్గిపోయేందుకూ కారణమవుతుంది. ఇది కేంద్రీ కృత నిర్ణయాల అమలును ప్రోత్సహిస్తుంది. పరిశోధనల దిశను మారుస్తుంది. శాస్త్ర, సాంకేతిక రంగాలకు ఇప్పుడు కేటాయిస్తున్న నిధులను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. ఇలాంటి చర్యల వల్ల రాజకీయ సిద్ధాంతాలకు నప్పని శాస్త్రీయ పరిశోధనల ఫలితాలను తొక్కిపెట్టడం వంటివి జరగొచ్చు. జోషీమఠ్‌కు సంబంధించిన ఉపగ్రహ ఛాయాచిత్రాలను ఇస్రో తన వెబ్సైట్ నుంచి తొలగించాల్సి రావడం గమనించాలి. సైన్స్ అవార్డులను ప్రస్తుత గవర్నమెంటు రద్దు చేసింది. గుట్టుచప్పుడు కాకుండా అనేక పరిశోధన కేంద్రాలను కూడా మూసేసింది. ఫ్యామిలీ హెల్త్ సర్వేల ఇన్ ఛార్జ్ శాస్త్రవేత్తను ఇటీవలే సస్పెండ్ చేసి, రాజీనామా చేసేలా చేశారు. జన్యుమార్పిడి పంటల విషయంలో గతంలో స్వతంత్రంగా వ్యవహరించిన ‘ద ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ’ కూడా ఇప్పుడు సెల్ఫీ పాయింట్ల ఏర్పాటుకు సంతోషంగా అంగీకరిస్తోంది. ఎగిరే యంత్రాల విషయంలో భారతీ యుల జ్ఞానానికి డాక్యుమెంటరీ రుజువుగా వైమానిక శాస్త్రాన్ని ఎన్సీఈఆర్టీ ప్రస్తావిస్తే శాస్త్రవేత్తలు నోరెత్తకుండా ఉన్నారు. ఇవన్నీ సైన్స్ పురోగతికి ఏమాత్రం మేలు చేసేవి కావు. దినేశ్ శర్మ వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత (‘ది ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
ఒపెన్హైమర్తో మన అనుబంధం
జపాన్‌లోని హిరోషిమా, నాగసాకిలపై అణుబాంబు జారవిడిచి 78 ఏళ్లు అవుతోంది. ఆధునిక యుగంలో ఇంతటి విధ్వంసకరమైన ఘటన మరోటి చోటుచేసుకోలేదంటే అతిశయోక్తి కాదు. రెండో ప్రపంచయుద్ధం నాటి ఈ ఘటనపై లెక్కలేనన్ని పుస్తకాలు, డాక్యుమెంటరీలు, సినిమాలు వచ్చాయి. తాజాగా ప్రదర్శితమవుతున్న ‘ఒపెన్ హైమర్’ చిత్రం కూడా ఈ కోవకు చెందినదే. మన్హాటన్ ప్రాజెక్టులో భాగంగా తయారైన అణుబాంబులు, వాటి సృష్టికర్త జె.రాబర్ట్ ఒపెన్ హైమర్ ఇతివృత్తంతో సాగుతుంది ఈ సినిమా. ఒపెన్‌హైమర్‌కు ఉన్న భగవద్గీత, సంస్కృత జ్ఞానం ఆయనపై భారతదేశంలో ఆసక్తి పెరిగేందుకు కారణమయ్యాయి. భారతదేశ ఆధ్యాత్మికత పట్ల ఆరాధన కంటే కూడా ఈ దేశంతో ఆయనకున్న సంబంధం మరింత లోతైనది. జర్మనీలో పుట్టి అమెరికాలో సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్తగా ఎదిగిన ఒపెన్ హైమర్‌ను అణుబాంబు పితామహుడని కూడా అంటారు. ఒపెన్‌హైమర్‌కు ఉన్న భగవద్గీత, సంస్కృత జ్ఞానం ఆయనపై భారతదేశంలో ఆసక్తి పెరిగేందుకు కారణమయ్యాయి. భారతదేశ ఆధ్యాత్మికత పట్ల ఆయనకు ఉందని చెబుతున్న ఆరాధన కంటే కూడా ఈ దేశంతో ఆయనకున్న సంబంధం మరింత లోతైనది. దీన్ని 20వ శతాబ్దంలో ఆధునిక భౌతిక శాస్త్రం అభివృద్ధి నేపథ్యంలో చూడాలి. విశ్వం మొత్తానికి ఆధారమైన, మౌలికమైన కణాలపై అధ్య యనం సాగిన కాలం అది. అణు కేంద్రకం దాంట్లోని భాగాలను అర్థం చేసుకునే అణు భౌతికశాస్త్ర అభివృద్ధి కూడా ఈ కాలంలోనే వేగం పుంజుకుంది. అణుశక్తితోపాటు అణుబాంబుల తయారీకి దారితీసిన పరిశోధనలివి. ఈ కాలపు భారతీయ శాస్త్రవేత్తలు కూడా చాలామంది ఈ అణు భౌతిక శాస్త్ర రంగంలో కృషి చేశారు. దేబేంద్ర మోహన్ బోస్ (ఇతడి విద్యార్థిని బిభా చౌధురి), మేఘనాథ్ సాహా, సత్యేంద్రనాథ్ బోస్, హోమీ జహంగీర్భాభా, దౌలత్సింగ్ కొఠారీ, పియారా సింగ్ గిల్ వంటి మహామహులు వారిలో కొందరు మాత్రమే. వీరు ఆధునిక భౌతికశాస్త్రంలో పేరెన్నికగన్న వూల్ఫ్‌గాంగ్ పౌలీ, నీల్స్ బోర్, లార్డ్ రూథర్‌ఫర్డ్, పాల్ డైరాక్, ఎన్రికో ఫెర్మీ, ఎర్నెస్ట్ ష్రోడింగర్, జేమ్స్ చాద్విక్, జాన్ కాక్‌క్రాఫ్ట్, హిడెకీ యుకవాలతో కలిసి పని చేయడం లేదా వారితో సంబంధబాంధవ్యాలను కలిగి ఉండటం కద్దు. భాభాతో సంబంధం కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ఖగోళ వికిరణాలపై పరిశోధనలు చేస్తున్న సమయంలోనే హోమీ భాభాకు ఒపెన్ హైమర్ (కేంబ్రిడ్జ్‌లో సీనియర్. తరువాతి కాలంలో బెర్క్లీలో పనిచేశారు) గురించి ఒక అవగాహన ఉండింది. 1936లో భాభా, వాల్టర్ హైట్లర్ ఉమ్మడిగా ఖగోళ వికిరణ జల్లు (కాస్మిక్ రే షవర్స్) సిద్ధాంతాన్ని ప్రతిపాదించగా, ఒపెన్ హైమర్ ఓ ఏడాది తరువాత దాదాపుగా అలాంటిదే స్వతంత్రంగా ప్రతిపాదించారు. అప్పట్లో భాభాకు పాశ్చాత్యదేశాల్లోని గొప్ప భౌతిక శాస్త్రవేత్తలతో సంబంధాలు ఉండేవి. ఒకానొక దశలో 1940లో తనను ఒపెన్ హైమర్‌కు పరిచయం చేయాల్సిందిగా భాభా తన మిత్రుడు పౌలీని కోరారు. ఇద్దరూ కలిసి బెర్క్లీలో పరిశోధనలు చేయాలన్నది ఉద్దేశం. రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభం కావడంతో భాభా భారత్‌లోనే ఉండిపోవాల్సి వచ్చింది. భౌతికశాస్త్ర మౌలికాంశాలపై పరిశోధనలు చేసేందుకు ఓ సంస్థను స్థాపించే అవకాశమూ అప్పుడే లభించింది. తరువాతి కాలంలో భాభాకు అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూతో కలిసి భారతీయ అణుశక్తి కార్యక్రమాన్ని సిద్ధం చేసి అమలు చేసే అవకాశమూ దక్కింది. అణు రియాక్టర్ నిర్మాణానికి, యురేనియం శుద్ధికి అవసరమైన ఇంజినీరింగ్ నైపుణ్యాన్ని భాభా తనకు పాశ్చాత్య దేశాల్లో ఉన్నసంబంధాల ద్వారానే సంపాదించగలిగారు. ప్రిన్స్టన్ , కావెండిష్ వంటి ప్రసిద్ధ సంస్థల తరహాలో టాటా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టీఐఎఫ్ఆర్) స్థాపనకూ బాబా అంతర్జాతీయ సహ కారం అందేలా రూఢి చేసుకున్నారు. అయితే 1945లో హిరోషిమా, నాగసాకి లపై అణుబాంబులు పడిన తరువాత రాబర్ట్ ఒపెన్ హైమర్ వివాదాస్పద వ్యక్తి అయ్యారు. అయినా టీఐఎఫ్ఆర్లో పరిశోధకుల బృందాన్ని తయారు చేసే విషయంలో భాభా ఆయన సాయం తీసుకున్నారు. ఒపెన్ హైమర్ విద్యార్థి, ఆయనతో కలిసి మన్హాటన్ ప్రాజెక్టులో పనిచేసిన బెర్నార్డ్ పీటర్స్‌కు ఉద్యోగమిచ్చారు. అప్పట్లో ప్రిన్స్టన్లో పనిచేస్తున్న ఒపెన్ హైమర్ సోదరుడు ఫ్రాంక్ ఒపెన్ హైమర్కూ ఉద్యోగం ఆఫర్ చేశారు భాభా. రాబర్ట్‌ను సంప్రదించిన తరువాతే ఫ్రాంక్‌కు ఉద్యోగం ఇవ్వజూపినట్లు చరిత్రకారులు చెబు తారు. ఈ అణుశక్తి కార్యక్రమ ఏర్పాటుకు ఫ్రెంచ్ నోబెల్ గ్రహీత ఫ్రెడెరిక్ జోలియోట్ క్యూరీ సలహాలు కూడా నెహ్రూ స్వీకరించారు. పరోక్ష ప్రేరణ ఒపెన్ హైమర్‌పై విమర్శలు పెల్లుబుకుతున్న నేపథ్యంలో భాభా చేసిన కొన్ని నియామకాలపై నిరసన వ్యక్తమైంది. ఒపెన్ హైమర్‌కు కమ్యూనిస్టులతో ఉన్న గత సంబంధాలపై కూడా వివాదాలు తలె త్తాయి. ఒపెన్ హైమర్ కూడా తన మాజీ విద్యార్థి పీటర్స్‌ను కమ్యూ నిస్టు సానుభూతిపరుడిగా అభివర్ణించారు. దీంతో పీటర్స్ భారత్‌కు రావడం కష్టమైంది. ఎలాగోలా వచ్చిన తరువాత టీఐఎఫ్ ఆర్‌లో అతడిపై ఇంకోసారి దుమారం రేకెత్తింది. ఇంకోవైపు ఫ్రాంక్ ఒపెన్ హైమర్ కూడా అమెరికా ప్రభుత్వం పాస్‌పోర్టు ఇచ్చేందుకు నిరాకరిం చడంతో భారత్‌కు రాలేకపోయారు. అయితే అమెరికాలో రాబర్ట్ ఒపెన్ హైమర్ మాత్రం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్సుడ్ స్టడీస్ (ఐఏఎస్) డైరెక్టర్‌గా కొనసాగుతూ భారతీయ శాస్త్రవేత్తలు చాలామందికి మార్గదర్శకుడిగా వ్యవహరించారు. యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్‌లో యువ భౌతిక శాస్త్రవేత్తగా ఉన్న అల్లాడి రామకృష్ణన్ కు ప్రిన్స్టన్ యూనివర్సిటీ ఏడాది స్కాలర్షిప్ మంజూరు చేయడం మచ్చుకు ఒక ఉదాహరణ మాత్రమే.అల్లాడి భారత్‌కు తిరిగి వచ్చాక ఐఏఎస్ లాంటి సంస్థను స్థాపించాలని ఆశించారు. ఈ ఆలోచనే తరువాతి కాలంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్సెస్‌గా 1962లో మద్రాస్‌లో ఆవిష్కృతమైంది. భారత్‌కు తరచూ... ఆ కాలంలో స్వల్పకాలిక పర్యటనపై భారత్‌కు విచ్చేసే విదేశీ శాస్త్రవేత్తల్లో ఒపెన్ హైమర్ పేరు తరచూ వినిపించేది. పీసీ మహాల నోబిస్ ఆలోచనల రూపమైన ‘షార్ట్ విజిట్స్ ఆఫ్ సైంటిస్ట్ ఫ్రమ్ అబ్రాడ్’లో భాగంగా ఒపెన్ హైమర్‌తో పాటు నీల్స్ బోర్, నార్బెర్ట్ వీనర్, పీఎంఎస్ బ్లాకెట్, జోసెఫ్ నీధమ్, జేబీఎస్ హాల్డేన్ లాంటి మహామహులు భారత్‌కు వచ్చిపోయేవారు. వీరికి పంపే ఆహ్వాన పత్రికలపై నెహ్రూ స్వయంగా సంతకాలు చేసేవారు. ఇందులో చాలామంది నెహ్రూకు తెలుసు. 1945 అనంతర ఒపెన్ హైమర్ నైతిక దృక్కోణాన్ని నెహ్రూ బహిరంగంగా ప్రశంసించారు. 1959లో భారత జాతీయ సైన్్స కాంగ్రెస్ సమావేశాల ఆవిష్కరణ సందర్భంగా మాట్లాడుతూ, ఒపెన్ హైమర్ భగవద్గీత నుంచి స్ఫూర్తి పొందారని ఉల్లేఖించారు. పరి శోధనలు, ఆవిష్కరణలకు కూడా సామాజిక విపరిణామాలు ఉంటా యన్న విషయాన్ని పెద్ద శాస్త్రవేత్తలు గుర్తించేందుకు ఇది ఉపయోగ పడాలన్నారు. హిరోషిమా, నాగసాకిలపై అణుబాంబు ప్రయోగంతో రెండో ప్రపంచ యుద్ధం నాటకీయంగా ముగిసింది. ఈ ఘటన అమెరికా, సోవియట్ యూనియన్ల మధ్య అణ్వాయుధ పోటీకి దారితీసింది. అదే సమయంలో అణుశక్తిని శాంతియుత ప్రయోజనాల కోసం వాడుకునే ప్రయత్నాలూ మొదలయ్యాయి. వలసవాద శకం ముగిసిన తరువాత అణుశక్తిని శాంతియుత, వ్యూహాత్మక ప్రయోజనాల కోసం వాడుకోవడమన్న అంశం భారత్ లాంటి దేశాలకు ప్రధాన పరిశోధన ఇతివృత్తమైంది. ఈ నవతరం సైన్స్ ను అభివృద్ధి చేయడం భారత్‌కు ప్రథమ కర్తవ్యమైంది. అణుశక్తిని విద్యుదుత్పత్తికి ఉపయోగించుకుంటామని భారత్ పలుమార్లు స్పష్టం చేసింది. అయితే 1964లో చైనా అణుబాంబును పరీక్షించడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పదేళ్ల తరువాత భారత్ కూడా పోఖ్రాన్–1తో అణ్వస్త్ర దేశాల జాబితాలో చేరిపోయింది. కానీ భగవద్గీతకు నెలవైన భారత్ అణు మార్గం పట్టడాన్ని ఒపెన్ హైమర్ మాత్రం చూడలేకపోయారు! దినేశ్ సి. శర్మ వ్యాసకర్త సైన్స్ వ్యవహారాల వ్యాఖ్యాత (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
పరువు దక్కించుకునే ప్రయాణమా?
భారత్ సొంతంగా ఓ వ్యోమగామిని అంతరిక్షంలోకి పంపేందుకు ప్రయత్నిస్తున్నది. అలాంటప్పుడు ‘నాసా’ ప్రాయోజకత్వంతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి మన వ్యోమగామిని పంపించాల్సిన అవసరం ఏమిటి? యూఏఈ, సౌదీ అరేబియా, మలేసియా వ్యోమగాములు కూడా ఇక్కడకు వెళ్లారు. మన వ్యోమగాములను కూడా పంపాలని అనుకుని ఉంటే ఆ పని ‘ఇస్రో’ ఎప్పుడో చేసి ఉండేది. ఏదోలా మానవుడిని అంతరిక్షంలోకి పంపటం మన ప్రాధమ్యం కాదు. స్వాతంత్య్రం సాధించి 75 ఏళ్లు అయ్యే సమయానికి భారతీయ వ్యోమగామి అంతరిక్షంలోకి ప్రవేశిస్తారని మోదీ 2018లో ప్రకటించారు. ఈ అతిశయోక్తి హామీ నెరవేరలేదు. దానికొక అల్ప ప్రత్యామ్నాయంగా బహుశా ఇలా మన వ్యోమగామిని అక్కడికి పంపనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలి అమెరికా పర్యటన సందర్భంగా ఇరుదేశాల మధ్య సాంకేతిక పరిజ్ఞాన ఒప్పందాలు చాలానే జరిగాయి. వాటిల్లో అంతరిక్ష రంగానికి సంబంధించినవి కూడా రెండు ఉన్నాయి. ఒకటేమో శాంతి యుత ప్రయోజనాల కోసం అంతరిక్ష అన్వేషణకు ఉద్దేశించిన ‘ఆర్టి మిస్ అకార్డ్స్’. (ఆర్టిమిస్ అనేది ఒక గ్రీకు దేవత పేరు.) అమెరికాలో భారతీయ రాయబారి తరణ్‌జీత్ సింగ్ సంధూ ఈ ఒప్పందంపై సంతకం చేశారు. వాషింగ్టన్‌లోని ఓ హోటల్లో నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నీల్సన్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. రెండో ఒప్పందం... 2024లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్) పంపే భారతీయ వ్యోమగామికి అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) ప్రాయోజకత్వం వహించడం! భారత్, అమెరికాల మధ్య కుదిరిన ఒప్పందాలు దౌత్యపరంగా, సైన్స్ పరంగా చారిత్రాత్మకమైన వని వర్ణిస్తున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కుదుర్చుకున్న 2008 నాటి భారత్– అమెరికా అణు ఒప్పందంతో వీటిని పోలుస్తు న్నారు. అయితే వాస్తవం దీనికి చాలా భిన్నం. భారత్ సొంతంగానే ఓ వ్యోమగామిని అంతరిక్షంలోకి పంపేందుకు ప్రయత్నిస్తున్నది. ఈ కార్యక్రమం ఒకవైపు నడుస్తూండగానే అమెరికా ప్రాయోజకత్వంతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వ్యోమగామిని పంపించాల్సిన అవసరం ఏమొచ్చిందన్నది ప్రశ్న. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో కలిసి నిర్వహించిన విలేఖరుల సమా వేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ– ‘‘ఆర్టిమిస్ అకార్డ్స్‌లో భాగం కావాలన్న నిర్ణయం ద్వారా అంతరిక్ష సహకారంలో నేడు మేలిమి ముందడుగు వేశాం. క్లుప్తంగా చెప్పాలంటే భారత్ – అమెరికా భాగ స్వామ్యానికి ఆకాశం కూడా హద్దు కాబోదు’’ అని వ్యాఖ్యానించారు. భారత్‌లోనూ ఈ అంశంపై పెద్ద ఎత్తున సంబరాలు జరిగాయి. ‘‘మనం నర్సరీ రైమ్స్ పాడుకుంటున్న సమయంలోనే జాబిల్లి ఉపరితలంపై మనిషి కాలిడేలా చేసిన అమెరికా లాంటి దేశం జాబిల్లిపై ప్రయోగాల విషయంలో మన నుంచి సమాచారాన్ని, నైపుణ్యాన్ని ఆశిస్తోందంటే అంతకంటే గర్వకారణమైన విషయం ఇంకోటి ఉంటుందా?’’ ప్రధానమంత్రి కార్యాలయ సహాయ మంత్రి, అంతరిక్ష, అణుశక్తి రంగాల పర్యవేక్షకులైన జితేంద్ర సింగ్ చేసిన వ్యాఖ్య ఇది. అంతేకాదు, ఆర్టిమిస్ ఒప్పందం అంతరిక్ష రంగానికి సంబంధించిన కీలక టెక్నాలజీల దిగుమతిపై ఉన్న నియంత్రణలు తొలగేందుకు మార్గంగా మారతుందని కూడా ఆయన అన్నారు. ఫలితంగా భార తీయ కంపెనీలు అమెరికా మార్కెట్ల కోసం కొత్త కొత్త ఎలక్ట్రానిక్ వ్యవస్థలను అభివృద్ధి చేయగల సత్తా సంపాదిస్తాయని చెప్పారు. ఆర్టిమిస్ ఒప్పందం ద్వైపాక్షిక ఒప్పందం లేదా ట్రీటీ, ప్యాక్ట్ కాదు. ఆర్టిమిస్ కోసం భారతీయ నైపుణ్యాన్ని, సమాచారాన్ని కూడా కోరడం లేదు. జాబిల్లిపై ఒక స్థావరాన్ని ఏర్పాటు చేయడం ఆర్టిమిస్ లక్ష్యం. కీలక టెక్నాలజీల దిగుమతిపై నియంత్రణలు తొలగించే ప్రస్తా వన కూడా ఆర్టిమిస్ ఒప్పందంలో లేదు. నాసా వెబ్సైట్లో, జూన్ 23 నాటి నాసా పత్రికా ప్రకటనలో ఉన్న సమాచారం ప్రకారం... అంత రిక్షాన్ని శాంతియుత ప్రయోజనాల కోసం అన్వేషించడం, ఈ అన్వే షణకు సంబంధించి కొన్ని సాధారణ నియమ నిబంధనలు మాత్రమే ఉన్నాయి. పారదర్శ కత, అంతరిక్షంలో సిబ్బందికి సహకారం, ఖగోళ వస్తువుల నమోదు, శాస్త్ర సమాచారాన్ని విడుదల చేయడం, అంతరిక్ష వారసత్వాన్ని కాపాడటం, సుస్థిర పద్ధతుల్లో అంతరిక్షాన్ని వాడు కోవడం వంటివి. మంత్రి చెప్పిన ప్రకారం, ఒకవేళ నాసా భారత్ సహ కారాన్ని కోరుతున్నా... లేక దిగుమతులపై నిబంధనలను సడలించిందన్నా... నైజీరియా, రువాండా, బెహ్రాయిన్, కొలంబియా, ఈక్వడార్ వంటి దేశాలతో కూడా నాసా ఇదే తరహా ఒప్పందాలు చేసుకుంది. భారతదేశం ఆర్టిమిస్ అకార్డ్‌లో భాగమైన 27వ దేశమన్నది గుర్తుంచుకోవాలి. పైగా ఈ ఒప్పందాలన్నీ స్వచ్ఛందమైనవే. ఆర్టిమిస్ అకార్డ్ ఉద్దేశం బయటకు కనిపిస్తున్న దానికంటే చాలా భిన్నమైంది. అమెరికా విదేశీ వ్యవహారాల శాఖ మరోసారి అమెరికా ఆధిపత్యాన్ని నిలుపుకునేందుకు దీన్ని సృష్టించిందనాలి. చైనాతోపాటు ప్రైవేట్ అంతరిక్ష కంపెనీలు అనేకం మనుగడలోకి వస్తున్న నేపథ్యంలో ఇలాంటి ఒప్పందం ఒకటి అవసరమైంది. ఈ ఒప్పందాల ద్వారా అంతరిక్ష రంగానికి సంబంధించిన కొత్త నియమ నిబంధనలను రూపొందించేందుకు సిద్ధమవుతోంది. అంతరిక్ష రంగానికి సంబంధించి ఇప్పటికే ఐక్య రాజ్య సమితి ఆధ్వర్యంలో రూపొందిన చట్టాలు కొన్ని అందుబాటులో ఉన్నాయి. వీటిని ఇప్పుడు ఈ కాలానికి తగ్గ ట్టుగా మార్చాల్సిన అవసరముంది. ఈ ఉద్దేశాలను ముందుగానే పసి గట్టిన చైనా, రష్యా, జర్మనీ, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వంటివి ఆర్టి మిస్కు దూరంగానే ఉన్న విషయం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. ఆర్టిమిస్ ఒప్పందంలో పదాలను చాలా తెలివిగా ఉపయోగించారు. ఔటర్ స్పేస్ ట్రీటీకి (ఐక్యరాజ్య సమితి సిద్ధం చేసింది. 1967 జనవరి 27వ తేదీ నుంచి దేశాల ఆమోద ముద్రను ఆహ్వానిస్తున్నది) కట్టుబడి ఉండటం ఎంత ముఖ్యమో చెబుతూనే కొన్ని కొత్త విష యాలను ఇందులోకి చేర్చారు. ఈ ఒప్పందంలో వ్యోమగాముల రక్షణ వంటి విషాయల్లో ఐక్యరాజ్య సమితి ఒప్పందంతోపాటు ఖగోళ వస్తువుల వల్ల కలిగే నష్టానికి బాధ్యులపై 1972లో కుదిరిన అంతర్జాతీయ ఒప్పందానికీ కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు. కానీ... ఆర్టిమిస్‌లో అంతరిక్ష వారసత్వాన్ని కాపాడటం, సహజ వనరుల వినియోగానికి సురక్షిత ప్రాంతాల ఏర్పాటు (ఐక్యరాజ్య సమితి ఒప్పందాలకు భిన్నంగా) వంటి ఆలోచనలను జొప్పించారు. ఆర్టిమిస్ అకార్డ్ భవిష్య త్తులో ఐక్యరాజ్య సమితి అభివృద్ధి చేసే అంతరిక్ష ఒడంబడికలోని ప్రధాన అంశాలపై ఏకాభిప్రాయాన్ని సాధించేందుకు ఉద్దేశించిన ట్టుగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే బహుముఖీన సిద్ధాంతాలను తోసి రాజన్నారు. భారత్ ఇవేవీ ఆలోచించకుండా దౌత్యపరమైన వలలో చిక్కుకుంది. దేశీయంగా ఎలాంటి చర్చ జరపకుండా, అంతరిక్ష చట్టం ఏదీ చేయకుండా ‘ఊ’ కొట్టేసింది. అమెరికాతో కుదిరిన అంతరిక్ష ఒప్పందాల్లో ఇంకోటి వచ్చే ఏడాది నాసా భారతీయ వ్యోమగామిని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపడం. ఇది కూడా చాలా చిత్రమైందనే చెప్పాలి. ఎందుకంటే మానవ సహిత అంతరిక్ష ప్రయోగాల కోసం భారత్ ఇప్పటికే ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. నలుగురు వ్యోమగాములు రష్యాలో శిక్షణ కూడా పొందుతున్నారు. అమెరికా, రష్యా సంయుక్తంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి మన వ్యోమ గాములను పంపాలని అనుకుని ఉంటే ఆ పని ‘ఇస్రో’ ఎప్పుడో చేసి ఉండేది. ఎందుకు చేయలేదంటే, మానవుడిని అంతరిక్షంలోకి పంపటం ఇస్రో ప్రాధమ్యం కాదు కాబట్టి! అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం సుమారు 20 ఏళ్లుగా పనిచేస్తోంది. ఇప్పటివరకూ 21 దేశా లకు చెందిన 269 మంది వ్యోమగాములు అక్కడికి వెళ్లారు. అమెరికా, యూరోపియన్ దేశాలను మినహాయించినా యునైటెడ్ అరబ్ ఎమి రేట్స్, సౌదీ అరేబియా, మలేసియా వ్యోమగాములు కూడా ఇక్కడకు వెళ్లారన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. మానవ సహిత అంతరిక్ష ప్రయోగాలకు భారత్ సొంతంగా సిద్ధమవుతున్న తరుణంలో ఇక్కడికి వ్యోమగామిని పంపేందుకు తొందర పడటం ఎందుకు? భారత్ స్వాతంత్య్రం సాధించి 75 ఏళ్లు అయ్యే సమయానికి భారతీయ వ్యోమగామి అంతరిక్షంలోకి ప్రవేశిస్తారని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా 2018లో ప్రకటించారు. ఈ అతిశయోక్తి హామీ నెరవేర లేదు. అందుకే దానికొక అల్ప ప్రత్యామ్నాయంగా, పరువు దక్కించు కోవడానికి బహుశా ఇలా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వ్యోమ గామిని పంపనున్నారు. దినేశ్ సి. శర్మ వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
మనం చూసిన సాంకేతిక విప్లవం
ప్రపంచంలో మొబైల్ ఫోన్లు మొదలై యాభై ఏళ్లయ్యింది. అవి ఇండియాలోకి ప్రవేశించి నలభై ఏళ్లయ్యింది. అప్పట్లో ఆ ఫోన్లు అడుగు పరిమాణంలో ఉండేవి. వాటితో కేవలం మాట్లాడగలం. మెసేజులు, ఫొటోలు పంపలేము. 1990లలో ఇండియాలో మొబైల్ సేవలు ఊపందుకున్నాయి. అప్పుడు కూడా ‘టాక్ టైమ్’ ఖరీదైన వ్యవహారం. కానీ తర్వాతి రెండు దశాబ్దాల్లో అనేక మలుపులు తిరిగాయి. పాలసీ మార్పులు, ప్రీ–పెయిడ్ సర్వీస్, ఛోటా రీచార్జ్, సర్వీస్ నెట్‌వర్క్‌ల విస్తరణ, స్థానిక తయారీ వంటివన్నీ కలిసి మొబైల్ ఫోన్ సేవలను సరసమైన ధరలకే అందుబాటులోకి తెచ్చాయి. ఆధునిక మానవ చరిత్రలో అనేకమంది ప్రజల జీవితాలను స్పృశించిన అతి గొప్ప సాంకేతిక సాధనం మొబైల్ ఫోన్! ఆధునిక మానవ చరిత్రలో అనేకమంది ప్రజల జీవితాలను స్పృశించిన అతి గొప్ప సాంకేతిక సాధనం మొబైల్ ఫోన్. భారతదేశం స్వాతంత్య్రం పొందిన పలు దశాబ్దాల తర్వాత సగటు కుటుంబాలకు అందుబాటులోకి వచ్చిన ఆధునిక సాంకేతికతలు సైకిల్, చేతి గడియారం, లేదా ట్రాన్సిస్టర్ రేడియో మాత్రమే. 1960లు, 1970లలో నాలాగా భారత్‌లో పుట్టి పెరిగినవారు అప్పట్లో ఫోన్ కలిగి ఉండటం ఒక విలాసంగా ఉండేదని మీకు చెబుతారు. టెలిఫోన్ కనెక్షన్ కోసం వేచి ఉండే సమయం అయిదు నుంచి ఏడేళ్ల వరకు ఉండేది. ఫోన్ ఉన్న కుటుంబాలకు ఇరుగుపొరుగు వద్ద చాలా డిమాండ్ ఉండేది. తమ సంబంధీకుల కాల్స్ అందుకోవడానికి వారు ఈ సౌకర్యాన్ని ఉపయో గించుకునేవారు. వారు ఆ నంబర్‌ను పీపీ (ప్రైవేట్ పార్టీ) అని పంచు కునేవారు. అనధికారికంగా తమ ఫోన్లను ఇతరులు వాడకుండా యజ మానులు వాటిని లాక్ చేసేవారు. (ఇప్పుడు స్మార్ట్ ఫోన్లకు స్క్రీన్ లాక్ లాగా అప్పుడు ఫోన్ డయలర్‌ని లాక్ చేసేవారు.) నా తరం వారు నిజంగానే తమ జీవితకాలంలో లాండ్‌లైన్ ఫోన్ల నుంచి సర్వవ్యాపి అయిన స్మార్ట్ ఫోన్ల వరకు సంభవించిన సాంకేతిక వివ్లవానికి సాక్షీభూతులయ్యారు. మొబైల్ ఫోన్ ను 50 సంవత్సరాల క్రితమే ఆవిష్కరించారు. న్యూయార్క్‌లోని దాని ఆవిష్కర్త మార్టిన్ కూపర్ ప్రపంచంలోనే మొట్టమొదటి మొబైల్ కాల్‌ను 1973 ఏప్రిల్ 3న చేశారు. పాశ్చాత్య ప్రపంచంలో కూడా మొబైల్ ఫోన్ వినియోగదారీ వస్తువుగా మారటానికి దాదాపు రెండు దశాబ్దాలు పట్టింది. లాండ్‌లైన్ లాగే, మొబైల్ ఫోన్ కూడా ప్రారంభంలో విలాసంగానే ఉండేది. 1980లలో దాని ధర అమెరికాలో 4,000 డాలర్లు. వాటి పరిమాణం పెద్దదిగా ఒక అడుగు ఉండేది. దాన్ని ‘ఇటుక ఫోన్’ అనేవారు. 1990ల మధ్యలో నేను ఉపయోగించిన తొలి మొబైల్ ఇటుక సైజు కంటే కాస్త చిన్నదిగా ఉండేది. అప్పటికీ అది ఏ జేబులోనూ పట్టేది కాదు. ధర సుమారు యాభై వేలు. నేను పని చేస్తుండిన టెలివిజన్ ప్రొడక్షన్ కంపెనీ, ఫీల్డ్ అసైన్ మెంట్ల కోసం వెళ్లే విలేఖరుల కోసం కొన్ని హ్యాండ్ సెట్లను అద్దెకు తీసుకుంది. అవి ఒక డయలింగ్ ప్యాడ్‌తో కూడిన భారీ పరికరం, పొడుచుకువచ్చిన యాంటెన్నా, మందమైన రింగ్‌టోన్ తో ఉండేవి. గుర్తుంచుకోండి, దాంతో కేవలం మాట్లాడగలరు. మెసేజ్ చేయలేరు, ఫొటోలు పంపలేరు. మొబైల్ టెలిఫోన్ యుగంలోకి భారత్ 1987 జనవరి 1న ప్రవేశించిందని కొద్దిమందికే తెలుసు. మహానగర్ టెలిఫోన్ నిగమ్ తన ‘మొబైల్ రేడియో ఫోన్ సర్వీస్’ను ఢిల్లీలో ప్రారంభించడం ద్వారా ఇది మొదలైంది. అది కారులో అమర్చిన ఫోన్ యూనిట్‌ని ఉప యోగించి ప్రయాణిస్తున్నప్పుడు మాట్లాడటానికి వీలయ్యే ఒక ప్రాథమికమైన కార్ ఫోన్ సర్వీస్. కొన్ని డజన్ల ఫోన్లను మాత్రమే అప్పట్లో వ్యవస్థాపించారు. 1992లో దేశంలోని నాలుగు మెట్రో నగరాల్లో సెల్యులార్ టెలిఫోన్ సేవలను అందించడానికి ప్రైవేట్ కంపెనీలకు లైసెన్స్ ఇచ్చారు. మొట్టమొదటి వాణిజ్యపరమైన సెల్యులార్ మొబైల్ కాల్‌ను 1995 జూలై 31న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతిబసు కలకత్తా నుంచి న్యూఢిల్లీలో ఉన్న సమాచార మంత్రి సుఖ్‌రామ్‌కు చేశారు. కలకత్తాలో మొబైల్ కాల్ సర్వీస్‌ను మోడీ–టెల్స్ట్రా (బీకే మోడీ గ్రూప్, ఆస్ట్రేలియాకు చెందిన టెల్స్ట్రా జాయింట్ వెంచర్) అందించాయి. కొన్ని నెలల తర్వాత ఢిల్లీలో ‘భారతి’ సెల్యులార్ సేవలు ఆరంభించింది. ఆ రోజుల్లో మొబైల్ ఫోన్లో మాట్లాడటం ఖరీదైన వ్యవహారంగా ఉండేది – ఒక కాల్ చేయాలంటే నిమిషానికి రూ. 16.80, కాల్ రిసీవ్ చేసుకోవాలంటే రూ. 8.40 చెల్లించాల్సి వచ్చేది. ఫస్ట్ జనరేషన్ (1జి) డేటా టెక్నాలజీ అయిన జనరల్ పాకెట్ రేడియో సర్వీస్ (జీఆర్పీఎస్) అందించడానికి ఫోన్ కంపెనీలకు మరి కొన్నేళ్లు పట్టింది. తర్వాతి రెండు దశాబ్దాల్లో అనేక మలుపులు తిరిగాయి. పాలసీ మార్పులు, ప్రీ–పెయిడ్ సర్వీస్, ఛోటా రీఛార్జ్, కొత్త ప్రాసెసింగ్ టెక్నాలజీలు, దూకుడైన రోలవుట్ ప్లాన్స్, సర్వీస్ నెట్‌వర్క్‌ల విస్తరణ, లోకల్ మాన్యుఫ్యాక్చరింగ్ వంటివన్నీ కలిసి భారతీయులకు మొబైల్ ఫోన్లను సరసమైన ధరలకే అందుబాటులోకి తెచ్చాయి. అధిక కాల్ ఛార్జీలు పాతకథ అయిపోయాయి. జీఆర్పీఎస్ నుంచి, సూపర్ ఫాస్ట్ డేటా స్పీడ్ వరకు పయనించాం. మొబైల్ ఫోన్లు అంటే గతంలోలా ఎమర్జెన్సీ కాల్స్ చేసుకోవడానికి మాత్రమే కాదు, వినోదం నుంచి బ్యాంకింగ్ వరకు ప్రతి అవసరానికీ ఉపయోగపడుతున్నాయి. పిల్లలుగా ఉన్నప్పుడు, ల్యాండ్ లైన్ ఫోన్లో మనం సమాధానం ఇస్తుండగా మనకు కాల్ చేస్తున్న వ్యక్తి చిత్రాన్ని చూడటం సరదాగా ఉంటుందని జోక్ చేయడం నాకు గుర్తుంది. వీడియో కాల్స్ నిజంగానే ఇప్పుడు చిన్నపిల్లలాట అయిపోయింది! భారతీయ సెల్‌ఫోన్ విప్లవంలో మలుపులు టాక్ టైమ్‌కు ఎక్కువ ఖర్చు అవుతుండటం మొబైల్ ఫోన్లను సృజనాత్మకంగా ఉపయోగించడానికి దారితీసింది. సాధారణంగా, మీరు ఒక నంబరుకు కాల్ చేస్తున్నప్పుడు, ఆ వ్యక్తి కాల్ తీసు కోలేనప్పుడు దాన్ని మిస్డ్ కాల్ అంటారు. టాక్ టైమ్ ఆదా చేయ డానికి, జనం మిస్డ్ కాల్స్ చేయడం ప్రారంభించారు. ఉద్దేశపూర్వకంగా ‘కాల్ మి బ్యాక్’, ‘నేను చేరుకున్నాను’ వంటి ముందస్తుగా నిర్దేశించిన సందేశాలను తెలియచేయడానికి మిస్డ్ కాల్స్ ఇస్తుంటారు. యజమానులకూ, డ్రైవర్లు, ఇంటి పనిమనుషులు వంటి పరిమితమైన టాక్ టైమ్ ఉన్న వారికీ మధ్య సమాచారానికి ఇది అనుకూలమైన సాధనం. కంపెనీలు, రాజకీయ పార్టీలు, ప్రభుత్వ విభాగాలు తరచుగా వాడే మార్కెటింగ్ సాధనమే మిస్డ్ కాల్. సామాన్య ప్రజలకు మొబైల్ ఫోన్ ని రోజువారీ సాధనంగా చేసే ప్రయాణంలో ప్రీ–పెయిడ్ సర్వీస్ ఒక కీలక మలుపు. నెల చివరలో బిల్‌ని చెల్లించడానికి బదులుగా వినియోగదారులు టాక్ టైమ్‌ని కొని, దాన్ని నిర్దిష్ట కాలంలో తమ అవసరాల కోసం ఉపయో గిస్తారు. మరొక వినూత్న ఆవిష్కరణ ‘ఛోటా రీఛార్జ్’ లేదా మైక్రో రీఛార్జ్ కూపన్లు. నెలకు 200 లేదా 300 రీఛార్జ్కి బదులుగా కేవలం ఐదు రూపాయలకే చోటా రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇది కూరగాయల వ్యాపారి, వ్యవసాయ కూలీ వంటివారికి కూడా మొబైల్ సేవలను సరసమైన ధరకు అందించే గేమ్ ఛేంజర్ అయ్యింది. ఎఫ్ఎమ్సీజీ సిమ్ కార్డులు, రీఛార్జ్ సేవల రూపంలో ఫోన్ సర్వీస్‌ని స్థానిక పచారీ కొట్లు, ఫార్మసీలు, పాన్ షాపుల్లో విస్తృతంగా అందుబాటులో ఉంచడం జరిగింది. టెలికామ్ సంస్థల కోసం ‘పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్’ లాగా సేవ చేయడమే కాకుండా, ఈ ఫ్రాంచైజీలు కంపెనీ స్టోర్లలోని కస్టమర్ రిలేషన్స్ ఉద్యోగుల లాగా చందాదారుల సమస్యలను లాంఛనప్రాయంగా పరిష్కరి స్తాయి. ఫోన్లు, వాటి సేవలు వేగంగా అమ్ముడయ్యే వినియోగ సరుకులు (ఎఫ్ఎమ్సీజీ)గా మారిపోయాయి. దినేష్ సి. శర్మ వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
మూల్యం కారకులదేనన్న ఊసెక్కడ?
భోపాల్ గ్యాస్ దుర్ఘటన విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు ప్రవర్తించిన తీరు... నిర్లక్ష్యం, ఉదాసీనత, బాధితుల పట్ల పట్టింపులేనితనాలకు అద్దం పడుతోంది. నష్టపరిహారం కోసం కేంద్ర ప్రభుత్వం బాధితులకు ఏకైక ప్రతినిధిగా నిలబడటమే కాకుండా... ఒక కొత్త చట్టాన్ని అమల్లోకి తేవడం ద్వారా యూనియన్ కార్బైడ్ సంస్థతో రాజీపడిపోవడం కూడా ఒక తప్పిదమే. ఈ కేసు విషయమై మార్చి 14వ తేదీన సుప్రీంకోర్టు క్యూరేటివ్ పిటిషన్ ను కొట్టివేస్తూ, సంక్షేమ రాజ్యంగా కేంద్ర ప్రభుత్వం బాధితులకు చెల్లించాల్సిన నష్టపరిహార మొత్తంలోని హెచ్చుతగ్గులను సరి చేయాలని చెప్పింది. అయితే ఇది కాలుష్య కారకులే పరిహారం చెల్లించాలన్న ప్రాథమిక సూత్రానికి విరుద్ధమైనది. 1984 నాటి భోపాల్ దుర్ఘటన విషయంలో కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన క్యూరేటివ్ పిటిష న్ను ఈ నెల 14న సుప్రీంకోర్టు కొట్టేసింది. దీంతో దశాబ్దాల న్యాయ పోరాటానికి తెరపడినట్లు అయ్యింది. ఆధునిక యుగంలో పర్యావరణానికి సంబంధించి ఓ కార్పొరేట్ సంస్థ తీవ్ర నేరానికి పాల్పడిన తొలి ఘటన ఇదే కావచ్చు. 1984 డిసెంబరు 2వ తేదీ రాత్రి భోపాల్‌లోని యూనియన్ కార్బైడ్ కీటకనాశిని కర్మాగారం నుంచి మిథైల్ ఐసోసైనైడ్ అనే విషపూరిత రసాయనం విడుదలైంది. కొన్నివేల మంది ఊపిరాడక చనిపోయారు. వేల మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషపూరిత రసాయన ప్రభావం కొన్ని తరాల పాటు కనిపించింది. ప్రమాదం తాలూకూ విష వ్యర్థాలను బహిరంగంగా పడేసిన కారణంగా అక్కడి నేల కూడా కలుషితమైంది. పౌరులకు జరిగిన ఈ నష్టానికి, నేరపూరిత నిర్లక్ష్యానికి కంపెనీ, దాంట్లోని అధికారులదే బాధ్యతని న్యాయ స్థానాల్లో కేసులు దాఖలయ్యాయి. జిల్లా కోర్టులో మొదలైన న్యాయ పోరాటం దశాబ్దాల కాలంలో సుప్రీంకోర్టును చేరింది. దేశ అత్యున్నత న్యాయ స్థానంలోనైనా తమకు న్యాయం దక్కుతుందని బాధితులు ఆశించారు. అయితే క్యూరేటివ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేయడం వారికి అశనిపాతంలా మారింది. ప్రభుత్వాల నిర్లక్ష్యం భోపాల్ గ్యాస్ దుర్ఘటన విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు ప్రవర్తించిన తీరు... నిర్లక్ష్యం, ఉదాసీనత, బాధితుల పట్ల పట్టింపులేనితనాలకు అద్దం పడుతోంది. నష్టపరిహారం కోసం కేంద్ర ప్రభుత్వం బాధితులకు ఏకైక ప్రతి నిధిగా నిలబడటమే కాకుండా... ఒక కొత్త చట్టాన్ని (భోపాల్ గ్యాస్ లీక్ డిజాస్టర్ –ప్రాసెసింగ్ ఆఫ్ క్లెయిమ్స్– యాక్ట్ 1985) అమల్లోకి తేవడం ద్వారా యూనియన్ కార్బైడ్ సంస్థతో రాజీపడిపోయింది. ఇది ఓ మహా తప్పిదం. నష్టపరిహారం కోరుతూ ప్రభుత్వం 1988లో కేసు దాఖలు చేసింది. కొంత పరిహారం ప్రకటించారు కూడా. అయితే దీన్ని అందరూ ఊహించినట్టుగానే యూనియన్ కార్బైడ్ ఉన్నత న్యాయస్థానంలో సవాలు చేసింది. భారత్‌లో కేసులు ఉన్నాయనీ, తాము న్యాయ స్థానాన్ని ఎదుర్కొంటున్నా మనీ యూనియన్ కార్బైడ్ అమెరికాలో లిటిగేషన్ల ముప్పును తప్పించుకుంది. యూనియన్ కార్బైడ్ జరిపిన లాబీయింగ్... సుప్రీంకోర్టు సున్నిత ప్రోత్సాహం... వెరసి కేంద్ర ప్రభుత్వం మరో ఘోర తప్పిదం చేయడానికి కారణం అయ్యాయి. యూనియన్ కార్బైడ్ కేవలం రూ.715 కోట్లు చెల్లిస్తే అన్ని రకాల సివిల్, క్రిమినల్ కేసులు మూసివేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది. పాత పరిహారమే అంతిమం! అయితే బాధితులు మరోసారి సుప్రీంకోర్టు తలుపుతట్టి ఈ నిర్ణ యాన్ని సమీక్షించాలని కోరడం వల్ల కంపెనీ చెల్లి స్తానన్న పరిహారం చాలా తక్కువనీ, నేరం బాధ్యత కూడా తగినంతగా కంపెనీపై మోపలేదనీ స్పష్ట మైంది. కంపెనీ అధికారులపై 2010లో భోపాల్ జిల్లా కోర్టులో క్రిమినల్ కేసులు దాఖ లయ్యాయి. నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు రోజు వారీ కార్యకలాపాలు పర్యవేక్షించే అధి కారులకు శిక్ష కూడా పడింది. దీని పర్యవసానంగా గ్యాస్ దుర్ఘటనపై ప్రజల దృష్టి కేంద్రీకృతమైంది. ఇది కాస్తా తీవ్ర ఆందోళనకూ దారితీసింది. ఈ ఒత్తిడికి తలొగ్గిన కేంద్రం నష్ట పరిహారం మొత్తాన్ని పెంచేందుకు మంత్రులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సుప్రీంకోర్టులో గత తీర్పు సమీక్ష కోరుతూ కేసు దాఖలు చేయగా... అత్యున్నత న్యాయస్థానం దాన్ని కొట్టేసింది. పదమూడేళ్లపాటు సాగిన ఈ కేసు తాజా పరిణామం ఇది. సుప్రీంకోర్టు తాజా తీర్పులో– కంపెనీ, ప్రభుత్వాల మధ్య 1989లో కుదిరిన రాజీ ఒప్పందం ప్రకారం చెల్లించిన నష్టపరిహారమే ఫైనల్ అని తేల్చేసింది. అద నపు నష్టపరిహారం కోరేందుకు తగిన న్యాయ సూత్రం ప్రాతిపదిక లేదని స్పష్టం చేసింది. రాజీ ఒప్పందం వెనుక లాలూచీ? కేంద్రం, యూనియన్ కార్బైడ్‌ల మధ్య కుదిరిన రాజీ ఒప్పందం వెనుక ఎన్నో లాలూచీ వ్యవహారాలు నడిచాయని బాధితుల తరఫున క్యూరేటివ్ పిటిషన్ విచారణలో భాగమైన సంస్థలు ఆరోపిస్తున్నాయి. సమాచార హక్కు చట్టం కింద భారత్‌లో, అమెరికాలో సేకరించిన సమాచారం, పత్రాల ఆధారంగా వారు ఈ ఆరోపణలు చేశారు. ఈ పత్రాలను కోర్టుకు అందజేశారు. యూనియన్ కార్బైడ్ అధికారులు ప్రభుత్వాన్ని ఎలా తప్పుదోవ పట్టించింది ఈ పత్రాల ద్వారా వివరించారు. దుర్ఘటనలో బతికి బయటపడ్డ వారు ఎదుర్కొన్న గాయాలు స్వల్పమని కంపెనీ కేంద్ర ప్రభుత్వానికి నచ్చజెప్పిందన్నది వీరి ఆరోపణ. అయితే కోర్టు ఈ సాక్ష్యాలను తోసిపుచ్చింది. 1989 నాటి కోర్టు తీర్పును సమర్థించింది. అంతే కాకుండా, కేంద్ర ప్రభుత్వం తన క్యూరేటివ్ పిటిషన్ లో మోసం జరిగిందని ఏమీ చెప్పలేదని తెలిపింది. దురదృష్టవశాత్తూ కోర్టు ఈ క్యూరేటివ్ పిటిషన్ ను కేవలం కేంద్రం, యూనియన్ కార్బైడ్ కంపెనీల మధ్య వివాదంలా మాత్రమే చూసింది. బాధితుల పక్షాన నిలిచిన సంస్థలను థర్డ్ పార్టీ (మూడోపక్షం)గా అభివర్ణించింది. కేంద్రం భుజాలపై స్వారీ చేసే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించింది. కేంద్ర ప్రభుత్వం చేసిన తప్పిదాల కారణంగా యూనియన్ కార్బైడ్ దేశంలో అసలు విచారణకే గురి కాలేదు. దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రమాద బాధితులకు తగిన పరిహారం లభించకపోవడం శోచనీయం. దుర్ఘటన ప్రభావాలపై కొత్త కొత్త వివరాలు వెలుగులోకి వచ్చినా కోర్టు 1989 నాటి తీర్పే అంతిమం అని తేల్చేసింది. అప్పట్లో నిర్ణయించిన పరిహారం సాధారణ అంచనా అని మాత్రం కోర్టు ఒప్పుకొంది. మరణాలకు రూ. 3 వేలు, ‘దుస్సహమైన తీవ్ర గాయాలకు’ రూ. 30 వేలుగా అప్పుడు నిర్ణయించారు. కంపెనీకి తగిన పరిహారం చెల్లించాలి 2010లో దాఖలైన క్యూరేటివ్ పిటిషన్ అటు కేంద్రానికీ, ఇటు సుప్రీంకోర్టుకూ 1989 నాటి తప్పులను దిద్దుకునేందుకు ఒక అవకాశం కల్పించింది. కాలుష్యానికి కారణమైన వారే నష్ట పరిహారాన్ని, పరిస్థితిని చక్కదిద్దేందుకు అయిన ఖర్చులను భరించాలని అప్పటి నుంచి ఇప్పటివరకూ నడిచిన కాలంలో ఎన్నో తీర్పులు వచ్చాయి. 1985 నాటి ఓలియుమ్ గ్యాస్ లీక్ కేసులో కోర్టు వ్యాఖ్యానిస్తూ... ‘‘కంపెనీ ఎంత పెద్దది, సమృద్ధమైనది అయితే అది చేసిన నష్టానికి చెల్లించాల్సిన పరిహారం కూడా అంతే ఎక్కువ మొత్తంలో ఉండాలి. ప్రమాదకరమైన, ప్రమాదాలు జరిగేందుకు అవకాశం ఎక్కువగా ఉన్న పరి శ్రమలు, కంపెనీలకు కూడా ఇది వర్తిస్తుంది’’ అని స్పష్టం చేసిన విషయం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. మార్చి 14వ తేదీ సుప్రీంకోర్టు క్యూరేటివ్ పిటిషన్ ను కొట్టివేస్తూ. సంక్షేమ రాజ్యంగా కేంద్ర ప్రభుత్వం బాధితులకు చెల్లించాల్సిన నష్టపరిహార మొత్తంలోని హెచ్చుతగ్గులను సరి చేయాలని చెప్పింది. అయితే ఇది కాలుష్య కారకులే పరిహారం చెల్లించాలన్న ప్రాథమిక సూత్రానికి విరుద్ధమైనది. దినేశ్ సి. శర్మ వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
విధానాల శాపమే... ఈ పాపం!
బద్రీనాథ్ పవిత్ర మందిరానికి ప్రవేశ ద్వారం అయిన ఉత్తరాఖండ్‌లోని జోషీమఠ్ కుంగిపోవడం పాలకుల పర్యావరణ పట్టింపులేనితనానికి నిదర్శనం. కొండచరియలు విరిగిపడే ఈ భౌగోళిక సున్నిత ప్రాంతంలో సొరంగాల తవ్వకం, పేల్చడం వంటి నిర్మాణ పనులు చేయకూడదు. అయినా అతిపెద్ద జలవిద్యుత్ ప్రాజెక్టుల కోసం కేంద్రం హద్దుల్లేని మద్దతిచ్చింది. ఇది సరిపోదన్నట్టుగా, ఈ కొండల్లో 800 కిలోమీటర్ల పొడవైన నాలుగు లేన్ల ‘చార్ధామ్ హైవే ప్రాజెక్టు’ను ప్రారంభించింది. పైగా పర్యావరణ చట్టాల్లో 123 క్రమబద్ధీకరణ మార్పులను తీసుకొచ్చారు. ప్రధాని కార్యాలయం చార్ధామ్ వంటి ప్రాజెక్టులను నేరుగా పర్యవేక్షిస్తున్నప్పుడు, జోషీమఠ్ కుంగిపోతున్న ఘటనకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుంది. జోషీమఠ్ కుంగిపోతోంది. ఈ ప్రాంతంలోని 600 ఇళ్లు బీటలు వారాయి. డజన్లకొద్దీ కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. హోటల్స్ వంటి కొన్ని వాణిజ్య భవనాలు అనిశ్చితంగా ఒకదానిపై ఒకటి ఒరిగిపోయాయి. సముద్ర మట్టానికి 6 వేల అడుగుల ఎత్తులో ఉండే ఈ పట్టణం ‘చార్ ధామ్’ లలో ఒకటైన బద్రీనాథ్ పవిత్ర మందిరం, హేమ్‌కుండ్ సాహిబ్ దగ్గరి సిక్కు తీర్థయాత్రా స్థలం, ఔలి దగ్గరి స్కీయింగ్ ఆకర్షణకు ప్రవేశ ద్వారం. హిమాలయాల్లో పర్యావరణపరంగా సున్నితమైన ప్రాంతంలో జోషీమఠ్ ఉంది. సాపేక్షికంగా యువ పర్వతమైన దీని భౌగోళికత ఇతర పర్వతాలతో పోలిస్తే భిన్నమైంది. సమీపంలోని హాథీ పర్వతం, ఔలి స్థిరమైన శిలలపై ఏర్పడి ఉండగా, జోషీమఠ్ ప్రాచీన కొండ చరియలలో భాగంగా ఉన్న స్థిరపడని బండరాళ్లతో ఏర్పడింది. అందువల్ల ఇది కొండచరియలు విరిగిపడే ప్రాంతం. ఇక్కడ సొరంగాల తవ్వకం, పేల్చడం వంటివి చేస్తే నేలకు భంగం కలుగుతుంది. 1970లో ఒక కొండ నుంచి పెద్ద బండరాయి విడివడి అలకనంద నదిలో పడిపోయింది. ఆ ప్రాంతంలో పెరిగిన నిర్మాణ కార్య కలాపాలు, పెరుగుతున్న జనాభా ఒత్తడి వంటివే ఇలా కొండ చరియలు విరిగిపడటానికి కారణం అవుతున్నాయని డజన్ల కొద్ది శాస్త్రీయ అధ్యయనాలు నిర్ధారించాయి. స్థానిక ప్రజలకు రోడ్లు, నీటి సరఫరా, మురుగు నీటి వ్యవస్థ, స్థానిక వినియోగం కోసం చిన్న జలవిద్యుత్ ప్రాజెక్టు వంటివి హేతుబద్ధమే కావొచ్చు. కానీ వరుసగా ఏర్పడుతూ వచ్చిన ప్రభుత్వాలు ఈ ప్రాంతంలో హైవేలు, జలవిద్యుత్, మౌలిక వసతుల అభివృద్ధి వగైరా అతిపెద్ద ప్రాజెక్టులకు తెరతీశాయి. జోషీమuŠ‡ వంటి ఘటనలకు ప్రకృతిని, వాతావరణ మార్పును లేదా స్థానిక ప్రజలను తప్పు పట్టి ప్రయోజనం లేదు. ఇవన్నీ న్యూఢిల్లీలో రూపొందిస్తున్న విధానాలు కలిగిస్తున్న విపత్తుల ఫలితమేనని కింది కారణాల వల్ల చెప్పవచ్చు. మొదటి కారణం, 2013 కేదార్నాథ్ విషాదం జరిగిన తర్వాత కూడా ఈ ప్రాంతంలో అతిపెద్ద జలవిద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం హద్దుల్లేని మద్దతును ఇవ్వడమే. ఉత్తరాఖండ్‌లో ఉనికిలో ఉన్న, నిర్మాణంలో ఉన్న జలవిద్యుత్ ప్రాజెక్టుల సుదీర్ఘ మన్నిక; అస్థిరమైన జోన్లలో అధిక అవక్షేపాల భారం... తీవ్ర సమస్య లుగా ఉంటూనే వచ్చాయి. దీన్ని దృష్టిలో ఉంచుకునే సుప్రీంకోర్టుచే నియమితులైన నిపుణుల బృందం, ‘మెయిన్ సెంట్రల్ థ్రస్ట్’ (ఎమ్‌సీటీ)పై ఉన్న భూభాగాన్ని సాధారణంగానూ, పేరుకుపోయే చలికాలపు మంచు భూభాగాన్ని ప్రత్యేకంగానూ జలవిద్యుత్ పనుల నుంచి దూరంగా ఉంచాలని సూచించింది. 2014 డిసెంబర్లో పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ ఒక అఫిడవిట్ దాఖలు చేసింది. 2013లో వరదలు ముంచెత్తడానికి జలవిద్యుత్ ప్రాజెక్టులు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావం చూపుతున్నాయని ఇందులో పేర్కొంది. కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ కూడా ఈ ప్రాంతంలో నివసించే ప్రజల భద్రతను పరిరక్షించడానికి ఇలాంటి ప్రాజెక్టులపై సమీక్ష అత్యవసరమని 2016 లోనే సుప్రీంకోర్టుకు తెలిపింది. అయితే 2013 నుంచి ఈ ప్రాంతంలోని ఏ జలవిద్యుత్ ప్రాజెక్టును కూడా సమీక్షించడం కానీ, నిలిపి వేయడం కానీ జరగలేదు. వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన ఈ అఫిడవిట్లన్నీ కాగితాల మీదే ఉండిపోయాయి. హిమాలయాలపై జలవిద్యుత్ ప్రాజెక్టుల దాడి సరిపోలేదని కాబోలు... కేంద్ర ప్రభుత్వం 2016లో ఈ కొండల్లో 800 కిలోమీటర్ల పొడవైన నాలుగు లేన్ల ‘చార్ ధామ్ హైవే ప్రాజెక్టు’ను ప్రారంభిం చింది. దీనికోసం మైదానాల్లో ఉండే విధంగానే రోడ్డుకు ఇరువైపులా ఖాళీ ప్రాంతంతో 12 మీటర్ల వెడల్పు డబుల్ లేన్‌ను డిజైన్ చేశారు. అంటే వందలాది చెట్లను విచ్చలవిడిగా నరకడం, కొండ వాలులను అస్థిర పరచడం, సహజమైన ఊటలను ధ్వంసం చేయడం, వీటితో పాటు లోయల కింది భాగంలో చెత్త, వ్యర్థాలను కుప్పతెప్పలుగా పోయడం అని అర్థం. ఈ ప్రాజెక్టును మదింపు చేయడానికి సుప్రీంకోర్టు నియమించిన అత్యున్నత సాధికారిక కమిటీ ఈ ప్రాంతంలో పర్యావరణ విధ్వంసానికి రోడ్డు వెడల్పే ప్రత్యక్ష కారణంగా ఉంటోందని భావించింది. అందుకని వెడల్పును తగ్గించినట్లయితే నష్టాన్ని కనీస స్థాయికి తగ్గించే అవకాశముందని పేర్కొంది. నిజానికి 5.5 మీటర్ల ‘క్యారేజ్ వే’తో పర్వత ప్రాంత రోడ్లను భిన్నంగా డిజైన్ చేయాలని సూచిస్తూ 2018లోనే రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఒక సర్క్యులర్ జారీచేసింది. కానీ తన సొంత నిబంధనలను అదే లెక్కచేయకుండా, ఆ సర్క్యులర్‌ను కోర్టు నియమించిన ప్యానెల్‌కు కూడా చూపకుండా దాచింది. బలహీనమైన పర్వత ప్రాంతాల్లో వెడల్పాటి హైవే నిర్మాణం కోసం ఒత్తిడి చేయడం ద్వారా రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ పర్యా వరణ విధ్వంసం జరగడాన్ని అనుమతించింది. రెండో కారణం, ప్రాజెక్టుల కోసం పర్యావరణ నిబంధనలను పాతరేయడానికి సాహసించడమే. అన్ని భారీ ప్రాజెక్టులూ పర్యావరణ ప్రభావ మదింపు (ఈఐఏ)నకు లోబడి ఉండాలి; పర్యావరణ నిర్వ హణ పథకాన్ని(ఈఎంపీ) తప్పనిసరిగా కలిగి ఉండాలి. రోడ్డు ప్రాజెక్టుల కోసం, ఈఐఏ పరిధి 100 కిలోమీటర్లు మాత్రమే. కానీ ఈ నిబంధన నుంచి తప్పించుకోవడానికి చార్ ధామ్ ప్రాజెక్టును ఒక్కొక్కటీ 100 కిలోమీటర్ల కంటే తక్కువ ఉండేలా 53 ప్రాజెక్టులుగా విభజించారు. కాబట్టి పర్యావరణంపై అవిచ్ఛిన్నమైన, సంచిత ప్రభావాలు ఉంటున్నట్లు తెలుస్తున్నప్పటికీ ఎలాంటి క్రమబద్ధీకరణ, తనిఖీ లేకుండా; ప్రతిక్రియాత్మక పర్యావరణ నిర్వహణ పథకం లేకుండా ప్రాజెక్టును ప్రారంభించేశారు. సరళతర వాణిజ్యం కోసం ప్రభుత్వం పర్యావరణ నిబంధనలకు తూట్లు పొడవడం కూడా అతిపెద్ద సమస్య అయింది. 2020 మార్చ్ నుంచి 2022 మార్చ్ వరకు పర్యావరణ చట్టాల్లో 123 క్రమబద్ధీకరణ మార్పులను తీసుకొచ్చారని ‘విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీ’ చేసిన అధ్యయనం తెలిపింది. ఈ మార్పుల్లో నాలుగింట మూడొంతులు చట్టాలను సడలించడానికీ, చట్టబద్ధమైన అవసరాలకు మినహాయింపులు ఇవ్వడానికీ సంబంధించినవే కావడం గమనార్హం. మూడో కారణం ఏమిటంటే, ధార్మిక పర్యాటకం పేరుతో దాని సామర్థ్యాన్ని పట్టించుకోకుండా, పర్యావరణ సున్నిత ప్రాంతాల్లో విచ్చలవిడి టూరిజాన్ని ప్రోత్సహించడమే. హైవే ప్రాజెక్టుకు అదనంగా ప్రభుత్వం చార్ ధామ్ ప్రాంతంలో రైలు సర్వీసులను, రోప్ వేలను ప్రవేశపెట్టడానికి పథకాలు రూపొందిస్తోంది. క్రితంసారి కేదార్ నాథ్‌ను సందర్శించిన సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ– రైళ్లు, రోడ్లు, రోప్ వేలు తమతో పాటు ఉద్యోగాలను కొనితెస్తాయనీ, జీవి తాన్ని సులభతరం చేసి సాధికారతను కలిగిస్తాయనీ గొప్పగా ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ దాదాపు 17 గంటలపాటు ఏకాంతంలో గడిపిన ధ్యాన గుహ భక్తులకు ముఖ్య ఆకర్షణ కేంద్రంగా మారి పోయింది. దీని ఫలితంగా ఇలాంటి మరో మూడు ధ్యాన గుహలను పర్యాటకుల కోసం నిర్మిస్తున్నారు. అంతిమంగా, జోషీమఠ్‌లో విపత్తు కలిగిన తర్వాత కూడా ప్రభుత్వ స్పందన మిడిమిడి జ్ఞానంతోనే ఉంటోంది. ప్రధాని కార్యాలయం నిర్వహించిన ఒక సమావేశంలో, ఈ ప్రమాదంలో 350 మీటర్ల కొండ ప్రాంతం మాత్రమే ప్రభావితమైందని తేలికచేసి మాట్లాడారు. ప్రధానమంత్రి, ప్రధాని కార్యాలయం ఛార్ ధామ్ వంటి ప్రాజెక్టులను నేరుగా పర్యవేక్షిస్తున్నప్పుడు, జోషీమఠ్ కుంగిపోతున్న ఘటనకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఆకర్షణీయమైన ప్రదర్శనలు కాకుండా, నిజమైన ప్రతిక్రియకు పూనుకోవాల్సిన సమయం ఇది! దినేశ్ సి. శర్మ వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
స్థానిక భాషల్లో వైద్య విద్యా?
భారతదేశంలో సుమారు 600 వైద్య కళాశాలలు ఉన్నాయి. విద్యార్థులకు తమ రాష్ట్రం వెలుపలి కాలేజీల్లో అడ్మిషన్లను పొందే స్వేచ్ఛ ఉంది. ఇంగ్లిష్ ఉపయోగాన్ని త్యజించడం వల్ల అలాంటి అవకాశం వీరికి కష్టమవుతుంది. హిందీ మీడియం విద్యార్థి ఇకపై కర్ణాటక లేక మహారాష్ట్రలో చదవటం కష్టమైపోతుంది. అక్కడ బోధనా మాధ్యమం ఇంగ్లిష్ లేదా స్థానిక భాషలో ఉంటుంది. ఇలాంటి విద్యార్థులు విదేశీ డిగ్రీ చదవడం ఇంకా కష్టసాధ్యమైన విషయం. హిందీ వైద్య పాఠ్యపుస్తకాలను ప్రారంభించడాన్ని మన విద్యా రంగంలో పునరుజ్జీవనం, పునర్నిర్మాణంగా కేంద్ర పాలకులు కొనియాడుతున్నారు. కానీ నిజమైన పునరుజ్జీవనం భారతీయ భాషల్లో కొత్తదైన మూల జ్ఞానాన్ని సృష్టించడంతోనే సాధ్యపడుతుంది. ఇంగ్లిష్ నుంచి హిందీలోకి అనువదించిన మూడు సెట్ల వైద్య పాఠ్య పుస్తకాలను గత వారాంతంలో భోపాల్‌లో అట్టహాసంగా విడుదల చేశారు. మధ్య ప్రదేశ్‌లో ఎంబీబీఎస్ కోర్సు కోసం హిందీని బోధనా మాధ్యమంగా ప్రవేశపెట్టడానికి చేసిన ప్రయత్నంలో ఈ పాఠ్యపుస్తకాలు భాగం. నూతన విద్యావిధానం అమలుచేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రక టించిన ఆదేశాన్ని మధ్యప్రదేశ్ ప్రభుత్వం పాటిస్తోంది. ఇతర అంశా లతోపాటు, భారతీయ భాషల్లో సాంకేతిక, వైద్య కోర్సుల బోధనను నూతన విద్యావిధానం నొక్కి చెబుతోంది. వృత్తివిద్యా కోర్సుల కోసం జాయింట్ ఎంట్రెన్స్ పరీక్షలు వంటి అన్ని ప్రధానమైన పోటీ పరీక్షలను ఇప్పటికే ఇంగ్లిష్తో పాటు 12 భారతీయ భాషల్లో నిర్వ హిస్తున్నారు. యూనివర్సిటీలలో గ్రాడ్యుయేషన్ కోర్సులలో ప్రవేశం కోసం ఇటీవలే ప్రారంభించిన కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ పరీక్షలో కూడా ఈ విధానాన్నే అమలు పరుస్తున్నారు. ఉన్నత విద్య స్థాయిలో భారతీయ భాషల్లో బోధన పూర్తిగా కొత్త విషయం కాదు. దేశవ్యాప్తంగా విద్యా సంస్థలు వివిధ భారతీయ భాషల్లో పీహెచ్డీ స్థాయి వరకు కోర్సులను ప్రతిపాదిస్తున్నాయి. ఆయుర్వేదిక్ వైద్య కోర్సులను హిందీ, ఇతర భారతీయ భాషల్లో బోధిస్తున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం, తమిళనాడు ప్రభుత్వం తమిళంలో వైద్య విద్యా బోధన చేయాలనే ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. గతంలో ఉస్మానియా యూనివర్సిటీలో 1918 నుంచి 1948 వరకు ఉర్దూలో మెడిసిన్, ఇంజినీరింగ్ కోర్సులను బోధించారు. భోపాల్‌లో పాఠ్య పుస్తకాలను విడుదల చేసిన సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పినట్లుగా హిందీలో ఎంబీబీఎస్ కోర్సుల వెనుక లాజిక్ ఏమిటంటే– ఇంగ్లిషులో కంటే మాతృభాషలో విద్యా బోధన చేస్తే ఆలోచించడం, మననం చేయడం, హేతుపూర్వకంగా ఆలోచించడం, నిర్ణయాలు తీసుకోవడం వంటి అభిజ్ఞా నైపుణ్యాలు నేర్చుకోవడంలో పిల్లలు మెరుగ్గా ఉంటారన్నదే. మాతృభాషల్లో విద్యాబోధన వల్ల ప్రయోజనాలు ఉన్నప్పటికీ, ఈ మార్పును మరీ తొందరగా మొదలెట్టినట్లు కనిపిస్తోంది. సాంకే తిక, శాస్త్రీయ అంశాలకు సంబంధించిన పాఠ్యపుస్తకాలను అనువదిం చడంలో అతిపెద్ద సమస్య ఏమిటంటే, శాస్త్రీయ పదజాలాన్ని ఉపయో గించడమే. ఇంగ్లిష్‌లోని మూల పదజాలాన్ని అలాగే ఉంచాలా, భార తీయ భాషల్లోకి అనువదించవచ్చా? భోపాల్‌లో విడుదల చేసిన మూడు మెడికల్ పుస్తకాల (అనాటమీ, బయోకెమిస్ట్రీ, ఫిజియాలజీ) టైటిల్సు చూసినట్లయితే, ఇంగ్లిష్‌లో సుపరిచితమైన పదాలను యథా తథంగా తీసుకున్నట్లు కనిపిస్తోంది. అంటే వివరణాత్మక విషయాన్ని హిందీలో అందుబాటులో ఉంచుతారు. అది సంస్కృతీకరించిన హిందీలా కాకుండా, వాడుక భాషలోనే ఉంటుందని ఆశిద్దాము. ఏవిధంగా చూసినా సరే, వైద్య పుస్తకాలను అనువదించటం కష్టమైన ప్రయత్నం. ఎందుకంటే ఈ వైద్యవిద్యా పట్టభద్రులు మానవుల ప్రాణాలతో వ్యవహరిస్తారు. పైగా పాఠ్యపుస్తకాలు అనేవి వైద్య కోర్సులో ఒక భాగం మాత్రమే. పాఠ్యపుస్తకాలతోపాటు, వంద లాది రిఫరెన్స్ పుస్తకాలు, మాన్యువల్స్ కూడా వీరు తిరగేస్తారు. ఇవి చాలావరకు ఇంగ్లిష్‌లోనే ఉంటాయి. ఒక డాక్టర్ శిక్షణ, బాధ్యతల నిర్వహణలో ఇవి చాలా ముఖ్యమైనవి. హిందీ, ఇతర భారతీయ భాషల్లో శిక్షణ పొందిన వైద్యులకు తదుపరి చదువులు, కెరీర్ అవకా శాలు సవాలుగా నిలుస్తాయి. ఎందుకంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టడీస్, సూపర్ స్పెషలైజేషన్, మెడికల్ రీసెర్చ్ వంటివి ఇంగ్లిష్‌లోనే కొనసాగుతాయి. వైద్య బోధనను భారతీయ భాషల్లోనే చేయాలని ఆతృత ప్రదర్శిస్తున్నవారు వీటిని కూడా అనువదించి ఇస్తారా, ఇది ఎలా సాధ్యపడుతుంది అనేది స్పష్టం కావడం లేదు. పాఠ్యపుస్తకాలు, ‘కోర్స్‌వేర్’తో పాటు శిక్షణ పొందిన టీచర్లు, పరీక్ష యంత్రాంగం, బహు భాషా రీసెర్చ్ జర్నల్స్ వగైరాలు కూడా అవసరమే. జాతీయ వైద్య కమిషన్ లేక రాష్ట్ర వైద్య విద్యా విభాగాలు దీనికి సంబంధించి ఏదైనా బ్లూప్రింట్‌ను రూపొందించి ఉంటే దాన్ని ప్రజలకు అందు బాటులో ఉంచాలి. ప్రస్తుతం, భారతదేశంలో 600 వైద్య కళాశాలలు ఉన్నాయి. విద్యార్థులకు తమ రాష్ట్రం వెలుపలి కాలేజీల్లో అడ్మిషన్లను పొందే స్వేచ్ఛ ఉంది. ఇంగ్లిష్ ఉపయోగాన్ని త్యజించడం వల్ల అలాంటి అవకాశం వీరికి కష్టమవుతుంది. ఉదాహరణకు, మధ్యప్రదేశ్ నుండి హిందీ మీడియం డిగ్రీ ఉన్న ఒక విద్యార్థి ఇకపై కర్ణాటక లేక మహా రాష్ట్రలోని కాలేజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదవటం కష్టమైపోతుంది. ఎందుకంటే అక్కడ బోధనా మాధ్యమం ఇంగ్లిష్ లేదా స్థానిక భాషలో ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఇలాంటి విద్యార్థులు విదేశీ డిగ్రీ చదవడం ఇంకా కష్టసాధ్యమైన విషయంగా ఉంటుంది. ఉస్మానియా యూనివర్సిటీలో వైద్య విద్యలో కోర్సులు బోధిస్తు న్నప్పుడు విద్యార్థులందరికీ ఇంగ్లిష్‌లో ప్రావీణ్యం ఉండటం తప్పని సరిగా ఉండేది. పాఠ్యపుస్తకాలు కూడా ఆంగ్లంలో ఉండేవి. ఉర్దూలో బోధన ప్రారంభం కావడానికి ముందే, ఒక అనువాద బ్యూరోని ఏర్ప ర్చారు. శాస్త్రీయ పదజాలంతో వ్యవహరించడానికి అనువాద మెథడా లజీ వృద్ధిచేశారు. రవీంద్రనాథ్ టాగూరు సహా దేశమంతటి నుంచి విద్యా నిపుణులను సంప్రదించేవారు. ప్రస్తుత సందర్భంలో అలాంటి పథకం లేదు. విద్యార్థి బృందంతో సహా విద్యతో సంబంధమున్న ప్రతి ఒక్కరితోనూ విస్తృత సంప్రదింపులు జరపడం కూడా ఇప్పుడు లేకుండా పోయింది. పలు భారతీయ భాషల్లోకి పాఠ్య పుస్తకాలు అనువదించినట్లయితే, అనుకూలత లేదా సమరూపతకు హామీ ఇవ్వ డానికి సాంకేతిక పదాలను ప్రామాణీకరించాలి. మాతృభాషలో సాంకేతిక కోర్సులను బోధించడాన్ని సమర్థించే వారు జపాన్ను ఉదాహరణగా చూపుతున్నారు. జపనీస్ భాషలో బోధన ద్వారా జపాన్ గొప్ప సాంకేతిక, పారిశ్రామిక ముందంజ వేయగలిగిందని చెబుతున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం కూడా అప్పట్లో జపాన్ నుండి ప్రేరణ పొందింది. 1920లలో హైదరాబాద్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ డైరెక్టర్ సయ్యద్ రాస్ మసూద్‌ను జపనీస్ సాంకేతిక విద్యా నమూనా అధ్యయనం కోసం జపాన్ పంపించారు. చైనా, రష్యా, జర్మనీ కూడా తమతమ భాషల్లోనే సాంకే తిక విద్యలను బోధించేవి. ఇవి దశాబ్దాలపాటు శాస్త్ర సంబంధ పదజాలాన్ని అభివృద్ధి చేసుకున్నాయి. ఈ దేశాలకూ, భారతదేశానికీ మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసం ఏమిటంటే, అవి చాలావరకు ఏక భాషా సమాజాలు. భారత్ బహు భాషల నిలయం. ఐఐటీ, ఐఐఎం వంటి ఉన్నత విద్యాసంస్థల్లో కూడా భారతీయ భాషల్లో కోర్సులను ప్రవేశపెడతామని కేంద్ర హోంమంత్రి సెల విచ్చారు. ఇంజినీరింగ్ విద్యను భారతీయ భాషల్లోనే బోధించడానికి పది రాష్ట్రాల్లో సన్నాహాలు చేస్తున్నామని అమిత్ షా చెప్పారు. తమిళం, తెలుగు, మరాఠీ, బెంగాలీ, మలయాళం, గుజరాతీ భాష ల్లోకి ఇంజినీరింగ్ పుస్తకాలను అనువదిస్తున్నట్లు తెలిపారు. భారతీయ భాషల్లో బోధనలో పదజాలం, ఇతర సమస్యలతో పాటు అలాంటి ఇంజినీరింగ్ కోర్సులు కీలక రంగాల్లో పోటీతత్వాన్ని హరింప జేస్తాయి. ప్రత్యేకించి ఔట్ సోర్సింగ్ పరిశ్రమలో పోటీ ఎంతగా ఉంటుందో తెలిసిందే. సాఫ్ట్వేర్, ఐటీ ఆధారిత సేవల్లో భారత్ అగ్రగామిగా ఉండటానికి ఆంగ్లంతో సుపరిచితమైన ఇంజినీరింగ్ వర్క్ ఫోర్స్ కారణం అని చెప్పాల్సి ఉంటుంది. ప్రత్యేకించి ఇతర దేశాలు కూడా పోటీ పడుతున్నప్పుడు, సాధారణ ఉద్యోగాల స్థానంలో యాంత్రికీకరణ వేగంగా ప్రవేశిస్తున్నప్పుడు ఈ మార్కెట్లో భారత్ తన స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కోల్పోకూడదు. హిందీ వైద్య పాఠ్యపుస్తకాలను ప్రారంభించడాన్ని మన విద్యా రంగంలో పునరుజ్జీవనం, పునర్నిర్మాణంగా కొనియాడుతున్నారు. నిజమైన పునరుజ్జీవనం అనేది భారతీయ భాషల్లో కొత్తదైన మూల జ్ఞానాన్ని సృష్టించడంతోనే సాధ్యపడుతుంది. దినేశ్ సి. శర్మ వ్యాసకర్త వైజ్ఞానిక అంశాల వ్యాఖ్యాత (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
చిప్ తయారీలో ముద్ర వేయగలమా?
గుజరాత్‌లోని అహ్మదాబాద్ జిల్లాలో సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ యూనిట్‌తోపాటు ఓ డిస్ప్లే ఫ్యాబ్రికేషన్ యూనిట్, సెమీకండక్టర్ అసెంబ్లింగ్, టెస్టింగ్ కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయించినట్లు ‘వేదాంత’ గ్రూపు ప్రకటించింది. రెండు కారణాల వల్ల ఈ ప్రకటనకు ప్రాధాన్యం ఏర్పడింది. మొదటిది వీటి ఏర్పాటుకు ఏకంగా ఒక లక్ష యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతూండటం. ఇక రెండోది, ఈ ప్లాంట్ ముందు నుంచి సూచిస్తూ వచ్చిన మహారాష్ట్రలో కాకుండా గుజరాత్లో ఏర్పాటు కానుండటం! ఇంతకంటే ముఖ్యమైన విషయం ఇంకోటి ఉంది. వేదాంత గ్రూపు భాగస్వామిగా తైవాన్‌కు చెందిన హోన్ హై టెక్నాలజీ(ఫాక్స్‌కాన్) గ్రూపు వ్యవహరిస్తూండటం. సెమీకండక్టర్ల తయారీకి తైవాన్ పెట్టింది పేరన్నది తెలిసిన విషయమే. కోవిడ్ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చిప్‌లకు కొరత ఏర్పడటం కనువిప్పు లాంటి దని చెప్పాలి. ఒకరిద్దరు తయారీదారులపై ఆధారపడితే ఇబ్బందులు తప్పవని రుజువు చేసిందీ మహమ్మారి. ఈ కాలంలో సెమీకండక్టర్ చిప్‌లు కార్లు మొదలుకొని వాషింగ్ మెషీన్ల వరకూ అన్నింటిలో చేరి పోతున్నాయి. కోవిడ్ తదనంతర పరిస్థితుల్లో చాలామంది తయారీ దారులు తైవాన్‌లోని ఫ్యాబ్‌లపై (చిప్ తయారీ కేంద్రాలను ఫ్యాబ్లని పిలుస్తారు) ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని నిర్ణయించారు. అందుకే ఈ మార్కెట్లో సొంతంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని సము పార్జించుకోవడం భారత్‌కు ఎంతైనా అవసరం. ఈ ఏడాది అమెరికా ‘చిప్స్’ పేరుతో ఓ చట్టాన్ని ఆమోదించింది. ఇందులో భాగంగా మైక్రోప్రాసెసర్లు లేదా చిప్‌లు తయారు చేసే లేదా పరిశోధనలు చేసే అమెరికన్ కంపెనీలకు దాదాపు 5,200 కోట్ల డాలర్ల ప్రోత్సాహకాలు అందించనున్నారు. యూరోపియన్ యూనియన్ కూడా ఇలాంటి ఒక పథకాన్ని ప్రవేశపెట్టే ఆలోచనలో ఉంది. దక్షిణ కొరియా దేశీ సంస్థలకు సబ్సిడీలతో కలుపుకొని సుమారు 45,000 కోట్ల డాలర్లతో సెమీ కండక్టర్ల తయారీకి భారీ కార్యాచరణను సిద్ధం చేసింది. మన దేశంలో ‘సెమీ కండక్టర్ మిషన్’లో భాగంగా సుమారు 76 వేల కోట్ల రూపాయల ప్రోత్సాహకాలు చిప్స్, డిస్ప్లే ఫ్యాబ్స్‌కు ఇవ్వాలన్న నిర్ణయం జరిగింది. ప్రైవేట్ సంస్థలకు ప్రాజెక్టుకయ్యే ఖర్చులో దాదాపు 50 శాతం సబ్సిడీగా అందిస్తున్నారు. భారత్‌లో సెమీకండక్టర్ పరిశ్రమకు సంబంధించిన పునాదులు 1974లో పంజాబ్‌లో పడ్డాయని చెప్పాలి. సెమీ కండక్టర్ల డిజైనింగ్, ఫ్యాబ్రికేషన్లలో మన సామర్థ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరాన్ని గుర్తించిన కేంద్ర ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్ ఇందుకోసం విదేశీ సాయం తీసుకోవాలని తొలినాళ్లలో నిర్ణయించింది. ‘సెమీ కండక్టర్ కాంప్లెక్స్ లిమిటెడ్’ (ఎస్సీఎల్) ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర పడిన తరువాత 1976లో నిపుణుల బృందం మొహాలీ, మద్రాస్‌లలో ఒకచోట ఈ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని సూచిం చింది. ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్ మద్రాస్ విమానాశ్రయానికి దగ్గరగా ఉన్న ప్రాంతాన్ని సిఫారసు చేసింది. అయితే అప్పటి పంజాబ్ ముఖ్య మంత్రి జైల్‌సింగ్ అప్పటి ప్రధాని ఇందిరాగాంధీపై ఒత్తిడి తెచ్చి ఈ కాంప్లెక్స్ మొహాలీలో ఏర్పాటయ్యేలా చేసుకున్నారు. ఈ కేంద్రంలో అత్యధిక నైపుణ్యం ఉన్న వారి అవసరం ఎక్కువగా ఉంటుందనీ, దీని వల్ల స్థానికంగా ఉద్యోగావకాశాలేవీ పెరగవన్న విషయాన్ని జైల్ సింగ్‌కు వివరించాల్సిందిగా ఇందిరాగాంధీ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్ అధికారి అశోక్ పార్థసారథిని పురమాయించారు. అయినాసరే మొహాలీలోనే ఆ కాంప్లెక్స్ ఏర్పాటు కావాలని జైల్‌సింగ్ పట్టు పట్టడంతో భారత్‌లో తొలి సెమీ కండక్టర్ తయారీ కేంద్రం 1978లో మొహాలీలో ఏర్పాటైంది. అప్పట్లో ఈ ఫ్యాబ్‌కు రూ.15 కోట్లు ఖర్చు అయ్యింది. 1983లో అమెరికన్ మైక్రోసిస్టమ్స్ నుంచి పొందిన టెక్నా లజీ ఆధారంగా ఈ ఫ్యాబ్లో చిప్‌ల తయారీ మొదలైంది. ఎస్సీఎల్ ఏర్పాటయ్యే సమయానికి కొంచెం అటూయిటుగానే దేశంలో సెమీ కండక్టర్ డిజైనింగ్ కార్యకలాపాలు కూడా మొదల య్యాయి. చిప్ డిజైనింగ్‌లో అమెరికాలో పెద్ద పేరు సంపాదించిన ఐఐటీ – కాన్పూర్ పూర్వ విద్యార్థి ప్రభాకర్ గోయెల్ ఈ దిశగా చొరవ తీసుకున్నారు. ప్రభాకర్ మొదలుపెట్టిన ‘గేట్‌వే డిజైన్ ఆటోమేషన్’ సంస్థ చిప్‌లను పరీక్షించేందుకు వెరిలాగ్ పేరుతో టెస్టింగ్ టూల్‌ను తయారు చేసింది. వెరిలాగ్కు జపాన్, తైవాన్‌లలోని చిప్ తయారీ దారుల నుంచి మంచి డిమాండ్ ఏర్పడటంతో ప్రభాకర్ గోయెల్ సంస్థ లక్షల డాలర్లు ఆర్జించగలిగింది. వెరిలాగ్ రూపకల్పన కొంత శ్రమతో కూడిన వ్యవహారం కావడంతో ప్రభాకర్ ఈ ప్రక్రియను భారత్‌లో చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకోసం నోయిడాలోని ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్లో 1985లో కొంతమంది ఇంజినీర్లతో ఓ చిన్న యూనిట్‌ను మొదలుపెట్టారు. నాలుగేళ్ల తరువాత అమెరికాకు చెందిన కాడెన్స్ డిజైన్ సిస్టమ్స్ ప్రభాకర్ కంపెనీని కొనేసింది. ఈ రకంగా కాడెన్స్ సంస్థ భారత్‌లోనూ కాలుపెట్టిందని చెప్పాలి. సెమీ కండక్టర్ డిజైనింగ్ రంగంలోనే ఉన్న ఇంకో రెండు కంపెనీలు టెక్సస్ ఇన్స్ట్రుమెంట్స్, ఎస్టీ మైక్రోఎలక్ట్రానిక్స్ కూడా ఈ సమయంలోనే దేశంలో తమ కేంద్రాలను ఏర్పాటు చేశాయి. ఆ తరువాత పదేళ్ల కాలంలోనే ఇంటెల్ లాంటివాటితో కలుపుకొని ప్రపంచంలోని 25 సెమీకండక్టర్ డిజైనింగ్ కంపెనీల్లో 17 భారత్‌లో కేంద్రాలను తెరి చాయి. ఫలితంగా సెమీకండక్టర్ డిజైనింగ్ రంగంలో భారత్ ఓ బలీయమైన శక్తిగా మారింది. మైక్రోప్రాసెసర్లకు పెరుగుతున్న డిమాండ్‌ను తట్టుకునేందుకు అమెరికా, యూరప్ కంపెనీలు భారతీయ ఇంజినీర్ల డిజైనింగ్ నైపు ణ్యాన్నీ, తైవాన్‌లోని తయారీ కేంద్రాలనూ ఉపయోగించుకోవడం మొదలైంది. ఇంకోవైపు ఎస్సీఎల్ ఈ పోటీలో వెనుకబడి పోయింది. తయారీ టెక్నాలజీని ఆధునికీకరించే ప్రయత్నంలో ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం ఒకటి చోటు చేసుకోవడం... పునర్నిర్మాణానికి చాలా సమయం పట్టడంతో కంపెనీ మళ్లీ కోలుకోలేకపోయింది. కాకపోతే సాంకేతిక పరిజ్ఞాన మార్పిడిపై విదేశాలు నిషేధాలు విధించిన సమ యంలో అంతరిక్ష, రక్షణ రంగాల అవసరాలను తీర్చేందుకు మాత్రం ఉపయోగపడింది. తాజాగా ఎస్‌సీఎల్‌ను వాణిజ్యస్థాయి ఫ్యాబ్‌గా మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సెమీ కండక్టర్ రంగంలో భారత్ ఆశించిన స్థాయిలో రాణించ లేకపోయేందుకు కారణాలు చాలానే ఉన్నాయి. అవసరమైన మేరకు పెట్టుబడులు పెట్టలేకపోవడం, స్థానికంగా మైక్రోప్రాసెసర్లకు డిమాండ్ తక్కువగా ఉండటం, ప్రపంచవ్యాప్తంగా సెమీకండక్టర్ల వ్యాపారంలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకోవడం వంటివి మచ్చుకు కొన్ని. సెమీ కండక్టర్ రంగంలో టెక్నాలజీ చాలా వేగంగా మారిపోతూంటుంది. వేదాంత సంస్థ ఏర్పాటు చేయదలచుకున్న ఫ్యాబ్లో 28 నానోమీటర్ల టెక్నాలజీ నోడ్లను తయారు చేసేందుకు నిర్ణయించారు. కంప్యూటర్లకు గుండె వంటి సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లు, గ్రాఫిక్ ప్రాసెసర్లు, నెట్వర్కింగ్ చిప్స్, స్మార్ట్‌ఫోన్స్, కార్లు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లలో ఉపయోగించే మైక్రోప్రాసెసర్లను ఇక్కడ తయారు చేయవచ్చు. అయితే తైవాన్‌లో ప్రస్తుతం ఇంతకంటే చాలా సూక్ష్మమైన స్థాయిలో టెక్నాలజీ నోడ్లను తయారు చేసే పనిలో నిమగ్నమై ఉన్నాయి. ఇవెంత సూక్ష్మమైన వంటే... కేవలం మూడు నానోమీటర్ల సైజున్నవన్నమాట! మొహాలీలో ఏర్పాటైన ఎస్‌సీఎల్‌లో ఐదు మైక్రాన్ల (5,000 నానో మీటర్లు) సైజున్న ట్రాన్సిస్టర్ల తయారీ చేపట్టారు. ఈ సైజును 1.2 మైక్రాన్లకు(1,200 నానోమీటర్లు) తగ్గించేందుకు జరిగిన ప్రయత్నం లోనే ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది. ఆ సమయంలో కూడా అంత ర్జాతీయ సంస్థలు 0.8 మైక్రాన్ల సైజులో మాత్రమే ట్రాన్సిస్టర్ల తయా రీలో ఉండేవి. పదేళ్లలోపు ఎస్సీఎల్ ఈ అంతరాన్ని సొంతంగానే తగ్గించుకుని ఉండేది. విదేశీ టెక్నాలజీలను ఆపోశన పట్టడంలో భారతీయులు నైపుణ్యం కలవారన్నది తెలిసిందే. ఎప్పటి కప్పుడు మారిపోతూండే ఈ సెమీ కండక్టర్ డిజైనింగ్, ఫ్యాబ్రికేషన్ రంగంలో మనదైన ముద్ర వేయాలంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చు కోవడం ఎంతైనా అవసరం. ఇందుకు పరిశోధనలపై పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. ఇప్పటికైతే వేదాంత ప్రతిపాది స్తున్న జాయింట్ వెంచర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్పై మాట విప్పడం లేదు. సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి కూడా ఉంటుందా, లేదా అన్నది కూడా అస్పష్టం. భారత్ మరోసారి సెమీ కండక్టర్ రంగంలో లభిస్తున్న గొప్ప అవకాశాన్ని కోల్పోదనే ఆశిద్దాం! వ్యాసకర్త: దినేశ్ సి. శర్మ, వైజ్ఞానిక అంశాల వ్యాఖ్యాత (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
శాస్త్రశోధనల గొంతు నొక్కితే ఎలా?
పర్యావరణ పరిరక్షణ విషయంలో ఇండియా పనితీరు అట్టడుగున ఉందని యేల్ యూనివర్సిటీ విడుదల చేసిన ‘ది ఎన్విరాన్మెంటల్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్’ బయటపెట్టింది. దీన్ని కేంద్రం విమర్శించినప్పటికీ, ఇది దేశంలోని శాస్త్ర పరిశోధనా సంస్థల స్వయం ప్రతిపత్తిపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది. డెహ్రాడూన్‌లోని వైల్డ్‌లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తన పరిశోధనా వ్యాసాలను ప్రచురించే ముందుగా వాటిని అధికారుల పరిశీలన కోసం పంపాలని కేంద్ర మంత్రిత్వ శాఖ జారీ చేసిన హుకుం ఒకటి బయటపడింది. సామాజిక స్థాయిలో కోవిడ్ వ్యాప్తిని నిర్ధారించే సమాచారాన్ని తొక్కిపెట్టేసినట్లు కూడా వార్తలున్నాయి. దేశ రక్షణ ప్రాజెక్టులను మినహాయిస్తే, మిగిలిన పరిశోధనలపై చర్చించేందుకూ, సమర్థించుకునేందుకూ శాస్త్రవేత్తలకు స్వాతంత్య్రముండాలి. పర్యావరణ పరిరక్షణ విషయంలో ప్రపంచ దేశాలతో పోలిస్తే ఇండియా అట్టడుగున ఉందని ఇటీవలే విడుదలైన ‘ది ఎన్విరాన్మెంటల్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్’ (ఈపీఐ) తెలపడం దేశంలో శాస్త్ర పరిశోధన సంస్థల స్వయం ప్రతిపత్తిపై పలు ప్రశ్నలు లేవనెత్తుతోంది. అమెరికాలోని సుప్రసిద్ధ యేల్ విశ్వవిద్యాలయం సిద్ధం చేసిన ఈ జాబితాపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. వాతావరణ మార్పులు, పర్యావరణ పరిస్థితి వంటి పదకొండు వర్గాల్లో సుమారు 40 అంశాలను పరిశీలించి యేల్ యూనివర్సిటీ ‘ఈపీఐ’ని సిద్ధం చేయగా కేంద్రం మాత్రం ఈ అంశాల ఎంపికే తప్పని విమర్శించింది. అత్యధిక సమాచారం అవసరమయ్యే అంశాల ఆధారంగా ఒక దేశం పర్యావరణం, వన్యప్రాణి ఆవాస పరిరక్షణలకు చేస్తున్న ప్రయత్నా లను మదింపు చేయడం సరికాదని వ్యాఖ్యానించింది. అయితే కొన్ని ఆసక్తికరమైన పరిణామాలను ఇక్కడ మనం పరిగణనలోకి తీసు కోవాల్సి ఉంటుంది. ఈపీఐ విడుదలైన నేపథ్యంలోనే కేంద్రం పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ వ్యవహారం ఒకటి వెలుగు లోకి వచ్చింది. డెహ్రాడూన్‌లోని వైల్డ్‌లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఐఐ) తన పరిశోధనా వ్యాసాలను ప్రచురించే ముందుగా వాటిని అధికారుల పరిశీలన కోసం పంపాలని కేంద్ర మంత్రిత్వ శాఖ జారీ చేసిన హుకుం ఒకటి బయటపడింది. అంటే యేల్ లాంటి సంస్థలు తప్పుడు అవగాహనతో, సమాచారాన్ని ఊహించుకుని ఈపీఐ వంటి జాబితాలను రూపొందిస్తున్నాయని ఆరోపిస్తూనే... ఇంకోవైపు పర్యావరణ సంబంధిత శాస్త్రీయ సమాచారాన్నిచ్చే సంస్థల గొంతు నొక్కే ప్రయత్నం కేంద్ర మంత్రిత్వ శాఖ చేస్తోందన్నమాట! నిజానికి ఇలా మంత్రిత్వ శాఖలు పరిశోధన సంస్థల గొంతు నొక్కే ప్రయత్నం చేయడం కొత్తేమీ కాదు. డబ్ల్యూఐఐ స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థే అయినప్పటికీ కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ నేతృత్వంలోనే పనిచేస్తూం టుంది. ఇతర మంత్రిత్వ శాఖల్లోనూ ఇలాంటి సంస్థలు చాలానే ఉన్నాయి. నిధుల వితరణ మొదలుకొని అనేక అంశాల్లో మంత్రిత్వ శాఖలు సంస్థల గొంతు నొక్కే ప్రయత్నాలు చేస్తూంటాయి. కరోనా మహమ్మారి ప్రబలిన సందర్భంలోనూ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), వైద్య పరిశోధన విభాగాలు 2020 మే నెలలోనే దేశంలో సామాజిక స్థాయిలో కోవిడ్ వ్యాప్తిని నిర్ధారించే సమాచారాన్ని తొక్కిపెట్టేసినట్లు వార్తలున్నాయి. ఈ వివరాలు ప్రచురి తమై ఉంటే వైరస్ నియంత్రణలో కేంద్రం భేషుగ్గా పనిచేస్తోందన్న ప్రచారంలోని డొల్లతనం ఇట్టే బయటపడేది. ఆ తరువాతి కాలంలో ఇదే విషయం రుజువైన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు తమ పరిధిలోకి రాని పరిశోధనా సంస్థలపై కూడా పెత్తనం చలాయించే ప్రయత్నాలు చేసిన సందర్భాలు బోలెడు. భారత్‌లో ఎన్డీఎం–1 సూపర్ బగ్ ఉనికిని బ్రిటిష్ శాస్త్రవేత్తలు బట్టబయలు చేసినప్పుడు కేంద్ర ఆరోగ్య శాఖ, ఐసీఎంఆర్ రెండూ ఈ అంశంపై వ్యాఖ్యానించకుండా ప్రైవేట్ సంస్థ లనూ హెచ్చరించినట్లు సమాచారం ఉంది. వైద్యం కోసం పలువురు విదేశీయులు భారత్‌కు విచ్చేస్తున్నారన్న ‘మెడికల్ టూరిజం’ దెబ్బ తినకుండా ఈ ప్రయత్నం అన్నమాట. అయితే కొన్ని నెలల తరువాత ఆరోగ్య శాఖ స్వయంగా ఎన్డీఎం–1 కారణంగా కొన్ని మందులకు నిరోధకత ఏర్పడుతున్నట్లు అంగీకరించాల్సి వచ్చింది. ఈ అంశంపై ఒక టాస్క్‌ఫోర్స్‌నూ ఏర్పాటు చేయాల్సి వచ్చింది. నావీ1సీ పేరుతో ప్రయోగించిన ఓ ఉపగ్రహంలో తీవ్రస్థాయి లోపాలున్నాయనీ,వైఫై సిగ్నళ్లకు స్పందిస్తోందనీ 2018లో ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల శాస్త్రవేత్తలు గుర్తించగా... ఇస్రో వారి గొంతును నొక్కేసిందని సమాచారం. డబ్ల్యూఐఐ, నాగ్‌పూర్ కేంద్రంగా పనిచేస్తున్న నేషనల్ ఎన్విరాన్ మెంటల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (నీరి) వంటివి ఈ దేశానికి చాలా కీలకమైనవి. ప్రభుత్వ విధానాల రూపకల్పనకూ, పర్యావరణ పర్యవేక్షణకూ అవసరమైన పలు అంశాలపై ఈ సంస్థలు పరిశోధనలు చేస్తూంటాయి. భారీ ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చే ముందు వాటి కారణంగా వన్యప్రాణులకు, పర్యావరణానికి జరుగుతున్న నష్టంపై కూడా ఈ సంస్థలే నివేదికలివ్వాలి. 1990ల మధ్యలో డబ్ల్యూఐఐ శాస్త్రవేత్తలు దేశంలో ఆలివ్ రిడ్లే తాబేళ్ల దయనీయ పరిస్థితిపై ఓ శాస్త్రీయ జర్నల్‌లో ప్రచురించడం ఒక రకంగా సంచలనం సృష్టించిం దని చెప్పాలి. తూర్పు తీర ప్రాంతంలో ఈ తాబేళ్లకు భారీ ప్రాజెక్టులు, యాంత్రిక ట్రాలింగ్ల కారణంగా మరింత విపత్తు రానుందని డబ్ల్యూఐఐ హెచ్చరించింది కూడా! గహిర్మాత బీచ్‌లో వేల తాబేళ్లు సంతానోత్పత్తి చేస్తూంటాయి. అయితే ఈ ప్రాంతానికి దగ్గరలోని ఓ ద్వీపంలో క్షిపణి పరీక్షా కేంద్రం ఒకటి ఏర్పాటు కావడంతో తాబేళ్ల ఉనికి ప్రశ్నార్థకమైంది. ‘‘డీఆర్డీవో వాడే ప్రకాశవంతమైన లైట్లు ఆ తాబేళ్లకు ప్రాణాంతకంగా మారాయి’’ అని డబ్ల్యూఐఐ శాస్త్రవేత్త ఒకరు విస్పష్టంగా తన పరిశోధనా వ్యాసంలో రాశారు. ఆ తరువాత డీఆర్డీవో శాస్త్రవేత్తలు లైట్ల కాంతిని నియంత్రిస్తామని ప్రకటించాల్సి వచ్చింది. పర్యావరణ సంబంధిత వ్యాజ్యాల్లో చాలా సందర్భాల్లో న్యాయ స్థానాలు కూడా పరిశోధనా సంస్థల, ఆయా రంగాల్లో నిపుణుల ‘స్వతంత్ర’ నివేదిక కోసం అడుగుతూంటాయి. చార్ధామ్ హైవే డెవలప్మెంట్ ప్రాజెక్టుల విషయాన్నే ఉదాహరణగా తీసుకుంటే... జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టుకు సుప్రీంకోర్టు ఓకే చెప్పినా పర్యావరణ సంబంధిత ఆందోళనలను సమాధాన పరిచేందుకు ఓ పర్యవేక్షణ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి సాంకేతిక సహాయం డెహ్రాడూన్‌లోని ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ‘నీరి’ అందించాయి. ఐఐటీ రూర్కీ వంటి సంస్థలు తయారు చేసిన నివేదికలు పలు జలవిద్యుత్ కేంద్రాలకు అనుమతు లివ్వడంలో ఉపయోగపడ్డాయి. అయితే గతంలో ‘నీరి’ నివేదికలపై కూడా చాలా విమర్శలు వచ్చిన విషయం ఇక్కడ చెప్పుకోవాలి. ప్రాజెక్టును ప్రతిపాదించిన వారికి అవి అనుకూలంగా ఉన్నాయని పలువురు వేలెత్తి చూపారు. మధుర రిఫైనరీ వల్ల జరుగుతున్న వాయు కాలుష్యాన్ని తక్కువగా చూపి, చిన్న పరిశ్రమలనే తాజ్‌మహల్ కాలుష్యానికి నిందించినట్టుగా ‘నీరి’పై ఆరోపణలున్నాయి. ‘నీరి’ డైరెక్టర్ సేవలను అవినీతి ఆరోప ణల నేపథ్యంలో అర్ధంతరంగా ముగించాల్సి రావడం, కొత్త డైరెక్టర్ నియామకంలో విపరీతమైన జాప్యం జరగడం ఇటీవలి పరిణామాలే. ఏతావాతా... దేశ పర్యావరణ పరిరక్షణకు కీలకమైన సేవ లందిస్తున్న జాతీయ స్థాయి పరిశోధనా సంస్థల వ్యవహారాల్లో వేలు పెట్టడం ఏ ఒక్కరికీ మంచి చేసే విషయం కాదు. దురదృష్టవశాత్తూ ఇటీవలి కాలంలో అన్ని స్థాయుల్లోనూ ఈ రకమైన ధోరణి పెరిగి పోతోంది. లక్ష్యిత ప్రయోజనాలు ఏమైనప్పటికీ శాస్త్రీయ పరిశోధన లను మాత్రం స్థిరంగా కొనసాగించాలి. దేశ రక్షణకు సంబంధించిన వ్యూహాత్మక ప్రాజెక్టులను మినహాయిస్తే మిగిలిన పరిశోధనల వివ రాలను ప్రజలందరికీ అందుబాటులో ఉంచాలి. తమ పరిశోధనలపై చర్చించేందుకూ, సమర్థించుకునేందుకూ శాస్త్రవేత్తలకు పూర్తి స్వాతంత్య్రం ఉండాలి. అయితే దేశంలో అత్యున్నత విధాన నిర్మాతలైన డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్‌తో పాటు ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ వంటి సంస్థలు ఈ స్వయం ప్రతిపత్తి విషయంలో మౌనంగా ఉంటున్నాయి. పరిస్థితి చేయి దాటక మునుపే మేలుకోవడం ఎంతైనా అవసరం! దినేశ్ సి. శర్మ వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత -
పాలనలో టెక్నాలజీ కొత్తేమీ కాదు!
దేశంలో 2014కు ముందు ఇ–పరిపాలన ప్రాజెక్టులన్నీ కులీన వర్గాల కోసమే చేపట్టేవారనీ, తాము అధికారంలోకి వచ్చాకే పేదల సంక్షేమం కోసం టెక్నాలజీని ఉపయోగిస్తున్నామనీ కేంద్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోంది. జాతీయ అభివృద్ధికి శాస్త్ర, సాంకేతిక జ్ఞానాలను ఉపయోగించడం స్వాతంత్య్రానంతరమే మొదలైంది. ఈ దార్శనికతే... టెక్నాలజీ ఆధారిత ప్రభుత్వ రంగ పరిశ్రమల అభివృద్ధి రూపంలో పరిణమించింది. తర్వాతి ప్రభుత్వాలు ఈ పరంపరను కొనసాగిస్తూ తెచ్చిన... ప్యాసింజర్ రిజర్వేషన్, టెలిఫోన్, బ్యాంకింగ్ సేవల్లో కంప్యూటరీకరణ సామాన్యులకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. కేవలం డిజిటల్ టెక్నాలజీ ముందంజ ప్రాతిపదికగా, గత ప్రభుత్వాల హయాంలోని టెక్నాలజీలను చిన్నచూపు చూడటం తగదు. అధికారంలోకి వచ్చి 8 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సంబరాలు చేసుకుంటోంది. తాను సాధించిన అనేక విజయాలకు తోడుగా పేదలకు ప్రయోజనం కలిగించడానికి టెక్నాలజీని విస్తా రంగా ఉపయోగించడాన్ని అది ఎత్తిచూపుతోంది. గత వారం ఢిల్లీలో డ్రోన్ ఫెస్టివల్ ప్రారంభ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ... గతంలో, వర్తమానంలో టెక్నాలజీ ఉపయోగంలో ఉన్న వ్యత్యాసాలను పోల్చి చెప్పారు. 2014కు ముందు టెక్నాలజీని పేదల వ్యతిరేకిగా చిత్రించేవారనీ, దీన్ని ప్రజల సమస్యలలో ఒక భాగంగా పరిగణించేవారనీ మోదీ అభిప్రాయపడ్డారు. తాము అధికారంలోకి రాకముందు పాలనలో టెక్నాలజీని ఉపయోగించడం పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించే వాతావరణం ఉండేదనీ, దీని ఫలితంగా పేదలూ, మధ్య తరగతి ప్రజలూ అధికంగా బాధలకు గురయ్యేవారనీ మోదీ పేర్కొ న్నారు. గత పాలనా కాలాల్లో టెక్నాలజీని కులీనుల ప్రయోజనాల కోసం ఉద్దేశించినది మాత్రమే అని భావించేవారనీ, కానీ తమ ప్రభుత్వం టెక్నాలజీని ముందుగా ప్రజారాశులకు అందుబాటులోకి తెచ్చిందనీ చెప్పారు. అయితే ప్రధాని ప్రకటనలో రెండు అశాలు న్నాయి. ఒకటి: తాము అధికారంలోకి వచ్చిన తర్వాతే భారత్ పరి పాలనలో టెక్నాలజీని వాడటం మొదలెట్టింది. రెండు: 2014కు ముందు ప్రభుత్వాలు వాడిన టెక్నాలజీ ఫలితాలు పేదలకు అందు బాటులో ఉండేవి కావు. టెక్నాలజీ గురించి ఇలా సాధారణీకరించడం లేదా డిజిటల్ టెక్నాలజీ కోణం నుంచి మాత్రమే టెక్నాలజీని అంచనా వేయడం లేదా 2014కు ముందూ, 2014 తర్వాతా అనే చట్రంలో మాత్రమే టెక్నాలజీని అంచనావేయడం అనేది సమస్యాత్మకమే అని చెప్పాలి. స్వాతంత్య్రం వచ్చిన కాలం నుంచి లేదా అంతకుముందు కూడా టెక్నాలజీతో భారతదేశం సంక్లిష్టమైన సంబంధాన్ని కలిగి ఉండేది. మహాత్మాగాంధీ కాలం నుంచే సై¯Œ ్స, టెక్నాలజీ ఉపయోగం అనేది ప్రజల సంభాషణల్లో భాగమై ఉండేది. అయితే గాంధీ టెక్నాలజీ వ్యతిరేకి అని తప్పు ఆరోపణలకు గురవడం మరో విషయం. శ్రామిక ప్రజలను పక్కకు నెట్టి యంత్రాలను వాడటాన్ని మాత్రమే ఆయన వ్యతిరేకించారు తప్ప టెక్నాలజీని కాదు. ఇక జవహర్లాల్ నెహ్రూ విషయానికి వస్తే... ప్రజల సంక్షేమానికీ, జాతీయ అభివృద్ధికీ, శాస్త్ర, సాంకేతిక జ్ఞానాలను ఉపయోగించడం గురించీ నెహ్రూ గొప్పగా ప్రబోధించారు. ఈ దార్శనికతే... పరిశోధనా శాలలు, టెక్నాలజీ ఆధారిత ప్రభుత్వ రంగ పరిశ్రమల అభివృద్ధి రూపంలో పరిణమిం చింది. అణు ఇంధనం, అంతరిక్ష పరిశోధన, ఫార్మాస్యూటికల్స్, బయోటెక్నాలజీ వంటి పలు అంశాల్లో సాంకేతిక జ్ఞానం ఆనాడే పురుడు పోసుకుంది. గత 75 సంవత్సరాల సాంకేతిక అభివృద్ధిలో భారత్‌ను సమున్నతంగా నిలపడంలో ఈ సంస్థలు ఎంతగానో దోహదపడ్డాయని ఎవరూ మర్చిపోకూడదు. దీనికి ఇటీవలి తిరుగులేని ఉదాహరణ కోవిడ్ టీకాలు! రాజీవ్ గాంధీ హయాంలో 1980లలో టెక్నాలజీ వినియోగం చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. రాజీవ్ ప్రారంభించిన టెక్నాలజీ మిషన్లు నూనె గింజల నుంచి రోగనిరోధకత వరకు పలు రంగాల్లో టెక్నాలజీ వినియోగంపై దృష్టి సారించాయి. ఆ సమయంలోనే యావత్ ప్రపంచం పర్సనల్ కంప్యూటర్ విప్లవానికీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సాక్షీభూతమై నిలిచింది. టెలిఫోన్ సర్వీసులు, బ్యాంకింగ్, వాతావరణ అంచనా వంటి ఎన్నో ప్రజోపయోగ రంగాల మెరుగు దలకు ఈ పరిణామాలను సృజనాత్మకంగా ఉపయోగించు కోవడానికి అనేక ప్రాజెక్టులను దేశంలో మొదలెట్టారు. ప్యాసింజర్ రైల్వే రిజర్వే షన్, డిజిటల్ టెలికామ్ స్విచ్, బ్యాకింగ్ రంగంలో కంప్యూటరీకరణ, సూపర్ కంప్యూటర్ ‘పరమ్’ అభివృద్ది వంటి పలు అంశాలు ఇందులో ఉన్నాయి. అయితే వీటిలో ఏ ఒక్కటీ ప్రజలకు పర్సనల్ కంప్యూటర్ వంటి ఉపకరణం కావాలనీ, కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌ను వీరికి అందుబాటులోకి తేవలసిన అవసరం ఉందనీ సూచించేవి కావు. ఎందుకంటే ఆనాటికి భారత్‌లో ఇంటర్నెట్ ఉనికిలోనే ఉండేది కాదు. అయినప్పటికీ సగటు మనిషికి మాత్రం ఈ ప్రాజెక్టులన్నీ ఎంతగానో మేలు చేశాయి. ఎయిర్‌లై¯Œ ్స రిజర్వేష¯Œ లో కంప్యూటరీకరణకు ఎంతో ముందుగా ఈ ప్రాజెక్టులు ఉనికిలోకి వచ్చాయి. కాబట్టి ఆనాటి టెక్నా లజీ ప్రయోజనాలు మొదటగా కులీన వర్గాలను లక్ష్యంగా చేసుకో లేదన్నది నిజం. కాబట్టి 2014కు ముందు ఇ–పరిపాలన ప్రాజెక్టులు, భావనలు అనేవి కులీన వర్గాలకు సంబంధించినవే తప్ప అవి పేదలకు ప్రయోజనం కలిగించలేదనడం చాలా తప్పు. అయితే ఆనాటి కొత్త ప్రాజెక్టుల్లో సమస్యలు ఉండవచ్చు. అంత కచ్చితంగా అవి పని చేయకపోయి ఉండవచ్చు. కానీ భారతీయ సాంకేతిక జ్ఞాన ప్రయా ణంలో ఇవి కీలకమైన మూలమలుపులుగా నిలిచాయి. మొబైల్ ఫోన్ల ధరలు తగ్గడం, తక్కువ డేటా ప్రైజ్‌లతో ఇంటర్నెట్ ప్రాప్యత తక్కువ ధరకే అందుబాటులోకి రావడం, ఛోటా రీజార్జ్ వంటి మార్కెటింగ్ ఆవిష్కరణలు గత రెండు దశాబ్దాల కాలంలో డిజిటల్ టెక్నాల జీలనూ, వాటి అప్లికేషన్లనూ బాగా ముందుకు తీసుకుపోయాయి. లక్ష్యంగా పెట్టుకున్న సబ్సిడీల పంపిణీకి ప్రభుత్వాల చేతికి ఆధార్ ఆవిష్కరణ గొప్ప ఉపకరణాన్ని అందించింది. అయితే బయోమె ట్రిక్స్ ఆధారిత ఐడెంటిఫికేషన్ సిస్టమ్, మొబైల్ ఫోన్ కనెక్టివిటీతో సమ్మేళనం వంటివి ఒక్క సబ్సిడీల పంపిణీకి మాత్రమే కాకుండా ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో అనేక అప్లికేషన్ల కల్పనకు దారితీశాయి. తాము సాధించిన గొప్ప విజయాల్లో జామ్ (జన్‌ధన్, ఆధార్, మొబైల్) ఒకటని నరేంద్రమోదీ ప్రభుత్వం ఘనంగా చెప్పు కుంటోంది. యూపీఐ వంటి నూతన ఆవిష్కరణల ద్వారా డిజిటల్ పేమెంట్ ఎకో సిస్టమ్ వ్యాప్తిని కూడా కేంద్ర ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటోంది. కానీ దీన్ని సాధించడం కోసమే పెద్ద నోట్ల రద్దు వంటి చేదుమాత్రను దేశమంతటికీ తినిపించాల్సి వచ్చిందని ప్రభుత్వం నేటికీ ఒప్పుకోవడం లేదు. పైగా డిమాండ్ ఆధారిత వృద్ధి ఫలితంగా ఈ కొత్త ఆవిష్కరణలు ముందుకు రాలేదని గ్రహించాలి. మరోవైపున ఆధార్ ఉపయోగం ఎంత సర్వవ్యాప్తిగా మారిపోయిం దంటే... కంపెనీలు, బ్యాంకులు వంటి వాటితో యునీక్ ఐడెంటిఫి కేషన్ నంబర్‌ను షేర్ చేయాల్సి రావడం గురించి విద్యావంతులే ఆశ్చర్యపోతున్నారు. ఇటీవలే వినియోగదారులు తమ ఐడీ నంబర్లను ఎవరికీ షేర్ చేయవద్దని ‘ఉడాయ్’ ప్రజలకు బోధిస్తూ మెసేజ్ పంపింది కానీ ఆ మరుక్షణమే ప్రభుత్వం దాన్ని తొలగించడం గమ నార్హం. ఏదేమైనా ఇది మరింతగా గందరగోళాన్ని ఏర్పర్చింది. బయో మెట్రిక్స్, క్లోనింగ్, ఫిషింగ్ వంటి వాటి కారణంగా ప్రత్యక్ష నగదు బదలాయింపు వ్యవస్థలో తప్పుడు కేసులు బయటపడుతున్నాయి. పెద్దనోట్ల రద్దు అనేది డిజిటల్ పేమెంట్ల వైపుగా ప్రజలను బలవంతంగా మళ్లించినట్లే, ఆన్లైన్ క్లాసులు, ఇ–హెల్త్ వంటి అప్లికేషన్ల కోసం డిజిటల్ ఉపకరణాలను మరింతగా ఉపయోగించేలా కరోనా మహమ్మారి యావన్మంది ప్రజలను ఒత్తిడికి గురిచేసింది. ఈ రెండు కేసుల్లోనూ గ్రామీణ ప్రాంతాల్లో నాసిరకం కనెక్టివిటీ, డివైజ్‌ల ప్రాప్యత తీవ్ర అవరోధాలను కలిగిస్తున్నాయి. ఆన్లైన్ క్లాసులకు గానూ తమ ఫోన్లకు ఇంటర్నెట్ కనెక్షన్ల కోసం విద్యార్థులు ఊళ్లలో చెట్లమీదికి ఎక్కుతున్న ఫొటోలు, బయోమెట్రిక్ ఆథరైజేషన్ కోసం పెద్దలు పడుతున్న పాట్లు వైరల్ అయి డిజిటలైజేషన్ వ్యవస్థనే ప్రశ్నార్థకం చేసిపడేశాయి. ప్రతి గ్రామాన్నీ ఫైబర్ ఆప్టిక్స్‌తో కనెక్ట్ చేసే ప్లాన్ ఇప్పటికీ నత్తనడకన సాగుతోంది. ఇకపోతే ప్రభుత్వ సర్వీస్ ప్రొవైడర్ అయిన బీఎస్ఎన్ఎల్ నిదానంగా అంతరించే వైపు సాగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఆధార్‌తో, ఇంటర్నెట్ కనెక్టివిటీతో ఏర్పడుతున్న సమస్యలు ఒకవైపూ... ప్రతిచేతిలో స్మార్ట్ ఫోన్, ప్రతి క్షేత్రంలో డ్రోన్, ప్రతి ఇంట్లో సౌభాగ్యం అనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నినాద రూపంలోని ప్రచారార్భాటం మరోవైపూ దేశంలో సమాంతరంగా కొనసాగుతూనే ఉన్నాయి. వ్యాసకర్త: దినేష్ సి. శర్మ, సైన్స్ విషయాల వ్యాఖ్యాత -
అటవీ పరిరక్షణపై రాజీపడొద్దు!
చిన్న అవసరాలు తీర్చడం నుంచి, ఆహారం, పశుగ్రాసం, వైద్యానికి పనికొచ్చే మొక్కలు, వంటచెరుకు లాంటివాటిని నిరంతరాయంగా ఇస్తూ అడవులు లక్షలాది మందికి జీవనాధారంగా నిలుస్తున్నాయి. అయితే అటవీశాఖ అనుమతులను సాధించాల్సిన అవసరం లేకుండానే అటవీ ప్రాంతాల్లో ప్రాజెక్టులకు మినహాయింపులు కలిగించే వాతావరణం దేశంలో పెరుగుతోంది. అటవీ పరిరక్షణ చట్టానికి తాజాగా ప్రతిపాదించిన సవరణలు చట్టరూపం దాల్చితే, దేశంలోని అటవీ భూములను భారీ స్థాయిలో ఇతర ఉపయోగాలకు వాడుకోవడానికి మార్గం ఏర్పడినట్లే. కొత్త విద్యుత్ కర్మాగారాలు, హైవేలు, బుల్లెట్ ట్రెయిన్ కారిడార్లను ఏర్పాటుచేయడానికి అడవులను అడ్డంకిగా భావించకుండా– వాటిని మనం కాపాడుకోవాల్సిన ఉమ్మడి పర్యావరణ వారసత్వంగా పరిగణించాలి. స్వల్పకాలిక లక్ష్యాల కోసం విధానాలను మార్చుకోవడం ప్రమాదకరం. అనేక సందర్భాల్లో అటవీశాఖ అనుమతులను సాధించాల్సిన అవసరం లేకుండానే అటవీ ప్రాంతాల్లో ప్రాజెక్టులకు మినహాయింపులు కలిగించే వాతావరణం దేశంలో పెరుగుతోంది. 1980లో అటవీ పరిరక్షణ చట్టం ఉనికిలోకి రాకముందు సేకరించిన భూమిని వివిధ ప్రాజెక్టులకు మళ్లించడం జరుగుతున్నా, దానిలో చాలా భాగాన్ని ఇప్పటికీ వినియోగించడం లేదు. గత సంవత్సరం పర్యావరణ ప్రభావిత అంచనా (ఇఐఏ) చట్టాల్లో మౌలిక మార్పులను ప్రారంభించడం ద్వారా దేశ పర్యావరణ పరిరక్షణ చట్టాలపై బహుముఖ దాడికి రంగం సిద్ధమైంది. 1980 అటవీ పరిరక్షణ చట్టం స్వయంగా ఈ దాడిలో బాధితురాలు కాబోతోంది. ఆనాటి చట్టం భారత పర్యావరణ పరిరక్షణ వ్యవస్థలో అత్యంత కీలకమైంది. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ 1980 అటవీ పరిరక్షణ చట్టంలో తీవ్రమార్పులను ప్రతిపాదించింది. కేంద్ర మంత్రిత్వ శాఖ తీసుకొచ్చిన ఈ మార్పులను ఇటీవలే ప్రజా పరిశీలన నిమిత్తం బహిరంగపర్చారు. సుప్రీంకోర్టు 1996లో ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును ప్రభావితం చేసేలా అటవీ పరిరక్షణ చట్టానికి విస్తృతమైన భాష్యాన్ని బలహీన పర్చేలా ఈ మార్పులు చోటు చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. తాజాగా ప్రతిపాదించిన సవరణలు చట్టంలో భాగంగా మారితే, దేశంలోని అటవీ భూములును భారీ స్థాయిలో ఇతర ఉపయోగాలకు వాడుకోవడానికి మార్గం ఏర్పడినట్లే. భారతదేశంలో పర్యావరణ వ్యవస్థ అంత పాతదేమీ కాదు. ఆర్థిక పురోగతిలో పర్యావరణ అంశాలను మేళవించడం అనే భావన తొలిసారిగా నాలుగో పంచవర్ష ప్రణాళికా కాలంలో (1969–1974) తీసుకొచ్చారు. ఆనాటివరకు రాజకుటుంబాలు, విదేశీ పర్యాటకులు సఫారీ పేరుతో జంతువుల వేటను తీవ్రస్థాయిలో కొనసాగించేవారు. అప్పట్లో వన్యప్రాణుల విభాగం వ్యవసాయ మంత్రిత్వ కార్యాలయానికి అనుసంధానమై ఉండేది. ఇది వలసపాలనా కాలం నాటి చట్టాలతోటే నడిచేది. 1973లో ప్రారంభించిన టైగర్ ప్రాజెక్టు దేశంలో ప్రప్రథమ వన్యప్రాణి పరిరక్షణ ప్రాజెక్టుగా రికార్డుకెక్కింది. తదనంతరం మంత్రిత్వ శాఖగా మారిన పర్యావరణ విభాగం 1980లో ఉనికిలోకి వచ్చింది. అదే సమయంలో రిజర్వ్ చేసిన అడవులను రిజర్వ్డ్ పరిధిలోంచి తీసివేయాలన్నా, అటవీ భూములను అటవీయేతర ప్రయోజనాలకు ఉపయోగించాలన్నా కేంద్రప్రభుత్వ ముందస్తు అనుమతి తప్పనిసరి అని నాటి కేంద్ర ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. అలాంటి అనుమతుల విషయంలో ప్రభుత్వానికి సలహా ఇచ్చేందుకు ఒక సంప్రదింపుల కమిటీని కూడా నెలకొల్పారు. దీంతో చట్టబద్ధమైన ఆదేశంతో అటవీ పరిరక్షణ విధానానికి నాంది పలికినట్లయింది. అలాగే అటవీ భూములను మరే ఇతర ప్రాజెక్టుకోసమైనా మళ్లించడానికి ముందస్తు అనుమతి తప్పనిసరి చేశారు. ఈ క్రమంలో పర్యావరణ పరిరక్షణ చట్రం క్రమానుగతంగా రూపొందుతూ వచ్చింది కానీ అది ఎల్లప్పుడూ పర్యావరణ మెరుగుదలకు తోడ్పడలేదు. పర్యావరణ పరిరక్షణ అనే భావనను అవసరమైన దుష్టురాలిగా ప్రభుత్వాలు చూడసాగాయి. ఫలితంగా అటవీ పరిరక్షణ చట్టం 1980ల నుంచి అనేక మార్పులకు గురవుతూ వచ్చింది. పైగా అనేక వివాదాలకు, లావాదేవీలకు ఇది కేంద్రబిందువైంది. 1996 డిసెంబరులో సుప్రీంకోర్టు వెలువరించిన ఒక తీర్పు ఈ చట్టం పరిధిని విస్తృతం చేసింది. యాజమాన్యం, గుర్తింపు, వర్గీకరణలతో పనిలేకుండా ప్రభుత్వ రికార్డులో ’అడవి’గా నమోదైన అన్ని ప్రాంతాలకు ఇది వర్తిస్తుందని ఈ తీర్పు వ్యాఖ్యానించింది. ఈ అంశానికి కట్టుబడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారత అటవీ చట్టం, 1927, రాష్ట్ర ప్రభుత్వ చట్టాల కింద గుర్తించిన ప్రాంతాలను మాత్రమే అడవులుగా అన్వయిస్తూ వచ్చాయి. అయితే అడవులు అంటే నిఘంటువుల్లో ఉన్న అర్థాన్ని నిర్దారించే ప్రాంతాలను కూడా అటవీ పరిరక్షణ చట్టం కిందికి తీసుకురావాలని సుప్రీంకోర్టు తీర్పులో పేర్కొంది. అయితే పర్యావరణ పరిరక్షణ మంత్రిత్వ శాఖ అనేక ఉదంతాల్లో అటవీ శాఖ ఆమోదం పొందనవసరం లేనివిధంగా ప్రాజెక్టు ప్రతిపాదనలకు మినహాయింపు నిచ్చేలా పలు లొసుగులను సృష్టిం చాలని ఇప్పుడు ప్రయతిస్తూ ఉండటం గమనార్హం. అయితే 1980లో అటవీ పరిరక్షణ చట్టం ఏర్పడక ముందు సేకరించిన భూమి అటవీ భూమి అయినప్పటికీ దానికి, 1996 సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎలాంటి అనుమతులూ పొందనవసరం లేదు. లేదా దీన్ని రక్షిత అటవీప్రాతంగా దీన్ని గుర్తించాల్సిన అవసరం లేకుండా పోయింది. అదే విధంగా 1996 సుప్రీం తీర్పుకు ముందు రెవిన్యూ రికార్డుల్లో అడవిగా వర్గీకరించిన భూమిని అటవీ పరిరక్షణ చట్టం పరిధికి ఆవల ఉంచేయడం జరిగింది. అడవుల పెంపకం ఫలితంగా పెరిగిన కొత్త అడవులను వాస్తవానికి అడవులుగా గుర్తించ కూడదని కేంద్ర మంత్రిత్వ శాఖ భావిస్తోంది. మరొక మినహాయింపు ఏమిటంటే, అటవీ భూమిని వ్యూహా త్మక, రక్షణ ప్రాజెక్టుల కోసం ఉపయోగించుకోవడానికి రాష్ట్రాలకు నేరుగా అనుమతి నివ్వడం. అలాంటి ప్రాజెక్టుల గురించి సరైన నిర్వచనం ఇవ్వని నేపథ్యంలో అటవీ భూములను కొత్త ప్రాజెక్టులకు ఉపయోగించుకోవడానికి అడ్డదారులకు భారీగా అవకాశం ఇచ్చేశారు. పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ గణాం కాల ప్రకారం– అటవీ నిర్మూలనను అరికట్టడంలో అటవీ పరిరక్షణ చట్టం(ఎఫ్సీఏ) గొప్ప పాత్ర పోషించింది. 1951 నుంచి 1976 మధ్య ప్రతి సంవత్సరం 1.6 లక్షల హెక్టార్ల అటవీ భూమిని ఇతర అవసరాలకు మళ్లించడం జరిగేది. కానీ అటవీ పరిరక్షణ చట్టాన్ని అమలు చేయడంతో 1980 నుంచి 2011 మధ్య ఈ సంఖ్య ఏటా 32,000 హెక్టార్లకు తగ్గిపోయింది. కాబట్టి ఈ చట్టాన్ని నీరుగార్చే ఏ చర్య అయినా నిర్వనీకరణకు కారణం అవుతుంది. చిన్న అవసరాలు తీర్చడం నుంచి, ఆహారం, పశుగ్రాసం, వైద్యానికి పనికొచ్చే మొక్కలు, వంటచెరుకు లాంటివాటిని నిరంతరాయంగా ఇస్తూ అడవులు లక్షలాది మందికి జీవనాధారంగా నిలుస్తున్నాయి. కార్బన్ గ్రాహకాలుగా పనిచేస్తున్నాయి. అటవీ నిర్మూలన, అడవుల్లో జీవవైవిధ్యాన్ని దిగజార్చే ఏ చర్య అయినా కార్బన్ ఉద్గారాలకు కారణం అవుతుంది. వాతావరణ మార్పును నిరోధించాలంటే, అడవులను కాపాడుకోవడం, మరిన్ని అదనపు అడవులను సృష్టిం చడం తప్పనిసరి. వాతావరణ మార్పుపై ఐక్యరాజ్య సమితి విధానపరమైన సదస్సుకు అనుగుణంగా చేసుకున్న అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం కూడా ఇండియా దానికి కట్టుబడి ఉండాలి. కొత్త విద్యుత్ కర్మాగారాలు, హైవేలు, బుల్లెట్ ట్రెయిన్ కారిడార్లను ఏర్పాటుచేయడానికి అడవులను అడ్డంకిగా భావించకుండా– వాటిని కాపాడుకోవాల్సిన, విస్తరించాల్సిన ఉమ్మడి పర్యావరణ వారసత్వంగా పరిగణించాలి. సహజ వనరుల నియంత్రణ కోసం ముక్కలు ముక్కల ధోరణి కాకుండా అవిభాజ్యమైన కొనసాగింపు విధానం ఉండాలి. భారతదేశంలో అటవీ, వృక్ష ఆచ్ఛాదన ప్రస్తుతం ఒక భౌగోళిక ప్రాంతంలో ఉండాల్సిన 33 శాతం కాకుండా 25 శాతం కంటే తక్కువగా ఉంది. చెప్పాలంటే, అటవీ ఆచ్ఛాదనకు సంబంధించిన శాస్త్రీయమైన ఆడిట్ కూడా జరగాలి. చట్టంలో మార్పులకు సంబంధించి స్థానిక సమాజాలు, పౌర సమాజం, రాష్ట్రాలు, ఇతర పక్షాలతో కూడిన విస్తృతమైన ప్రజాబాహుళ్యంలో చర్చ జరగాలి. స్వల్పకాలిక లక్ష్యాలకు సరిపడేలా విధానాలను మార్చుకోవడం అనేది అత్యంత ప్రమాదకరం. – దినేష్ శర్మ వ్యాసకర్త సైన్స్ వ్యాఖ్యాత -
వ్యాక్సిన్ ప్రయోజనాలు... చెదిరిన క్షణం
భారతీయులకు ఒక్కటంటే ఒక్క వ్యాక్సిన్ కూడా బుక్ చేయకముందే వ్యాక్సిన్ ఎగుమతి అంశం భారత ప్రభుత్వ ఎజెండాలో చేరిపోయింది. జనవరి 28న ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ, కోవిడ్–19 వ్యాక్సిన్‌ను సరఫరా చేయడం ద్వారా భారత్ అనేక దేశాల ప్రజలను కాపాడుతున్నట్లు పేర్కొన్నారు. అంతే కానీ కోట్లాదిమంది తన ప్రజానీకానికి వ్యాక్సిన్ ఎలా వేయడం అనేది ప్రభుత్వాధినేత తలంపులో కూడా లేకుండా పోయింది. ఎన్నికల కేంపెయిన్ల కోసమే ఉచిత వ్యాక్సిన్లపై వాగ్దానం చేశారు. రానురాను టీకా కొరత తప్పదని తేలడంతో ప్రజాగ్రహం మిన్నుముట్టింది. దీనికి సెకండ్ వేవ్ మరింత ఆజ్యం పోసింది. రెండు డోసుల మధ్య అంతరాన్ని పెంచుతూ ప్రకటనలు వచ్చాయి. 2020 ప్రారంభంలో కోవిడ్–19పై పోరులో భారత్ ముందంజ వేసిన కారణంగా వ్యాక్సిన్ సమృద్ధిగా లభ్యమవుతుందన్న అంచనాలు చెదిరిపోయాయి. నెహ్రూ మంత్రివర్గంలో ఆరోగ్య శాఖామంత్రి రాజ్‌కుమారి అమృత్ కౌర్ ఢిల్లీలోని పాలం విమానాశ్రయంలో పెన్సిలిన్ బాక్సును అందుకుంటున్న నలుపు–తెలుపు చిత్రం ఈ సంవత్సరం ఫిబ్రవరిలో పలు వాట్సాప్ గ్రూప్‌లలో చక్కర్లు కొట్టింది. సాంక్రమిక వ్యాధులపై పోరాటానికి గాను కెనడియన్ రెడ్ క్రాస్ సంస్థ నుంచి భారత్‌కు అందిన బహుమతి అది. 2021లో భారత్ నుంచి కోవిడ్–19 వ్యాక్సిన్ కోసం అదే కెనడా ఎదురు చూస్తున్న వార్త.. అమృత్ కౌర్ చిత్రం పక్కనే అచ్చయింది. 1947లో మనకు కావలసిన మందులకోసం పాశ్చాత్య దేశాలపై ఆధారపడ్డామని, కానీ ఆనాడు మనకు మందులను పంపించిన దాతలే ఈరోజు వ్యాక్సిన్ల కోసం భారత్‌పై ఆధారపడుతున్నారని చెప్పడానికి ఇదొక పరోక్ష సూచన. తదనుగుణంగానే కొన్ని వారాలు గడిచేసరికి ఉన్నట్లుండి పరిస్థితి నాటకీయంగా ఎదురుతన్నింది. దాదాపు పన్నెండు దేశాల నుంచి విమానాల కొద్దీ వైద్య సరఫరాలు దిగుమతవుతున్న దృశ్యాలను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పంచుకోవడం ప్రారంభించింది. ఆ వైద్య సామగ్రిని విమానాశ్రయం నుంచి సుదూర ప్రాంతాలకు నేరుగా పంపించడం అనేది 1950లు, 1960లలో విదేశాల నుంచి ఆహార దిగుమతులను వచ్చినవి వచ్చినట్లుగా ఓడల నుంచి నేరుగా ప్రజల నోటికి అందించిన పాడుకాలాన్ని తలపింపచేశాయంటే ఆశ్చర్యపడాల్సింది లేదు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు కోవిడ్–19 వ్యాక్సిన్లను ఎగుమతి చేస్తోందంటూ ఐక్యరాజ్యసమితి మనల్ని ప్రశంసించి ఎంతో కాలం కాలేదు. కానీ అలాంటి భారత్ ఇంత వేగంగా సొంత ప్రజలకు వ్యాక్సిన్ అందించలేని దేశంగా ఎలా దిగజారిపోయింది? మనకు కనీస ప్రణాళిక అన్నది లేకపోవడమే దీనికి కారణం. 2009లో హెచ్1ఎన్1 మహమ్మారి విస్తరించిన సమయంలో శరవేగంతో వ్యాక్సిన్ అభివృద్ధి చేసిన అనుభవంతో భారతీయ కంపెనీలు కోవిడ్–19 వ్యాక్సిన్ పరుగుపందెంలో చాలా ముందుగానే అడుగుపెట్టాయి. ఆనాడు ప్రపంచ ఆరోగ్య వ్యవస్థ అందించిన సీడ్ స్ట్రెయిన్ మద్దతుతో సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్, పనాక్కా బయోటెక్ వంటి భారతీయ ఔషధ ఉత్పత్తి సంస్థలు కేవలం 12 నెలలలోపే హెచ్1ఎన్1 వ్యాక్సిన్లను అభివృద్ధి చేయగలిగాయి. జాతీయ ఔషధ నియంత్రణ సంస్థ నుంచి భారతీయ ఔషధ సంస్థలు అత్యవసరంగా ఉపయోగించే అధికారాన్ని కూడా త్వరగా సాధించుకున్నాయి. ఈ మొత్తం ప్రక్రియ వ్యాక్సిన్ ఉత్పత్తి విషయంలో ఎంతో ప్రోత్సాహకరంగా నిలిచింది. ప్రమాదకరంగా మారుతున్న సార్స్ వైరస్‌కి వ్యతిరేకంగా భారత్ అసాధారణ స్థాయిలో ఔషధ నిల్వలను ఉంచుకోగలిగింది. ప్రైవేట్ కంపెనీల నష్టభయాన్ని తప్పించే విషయంలో ముందస్తు కొనుగోలుకు సిద్ధపడటం అనేది కీలకంగా ప్రభావం చూపింది. అత్యవసర పరిస్థితుల్లో వ్యాక్సిన్లను భారీ స్థాయిలో నిల్వకు తగిన యంత్రాంగం అవసరం గురించి 2011లో తీసుకొచ్చిన జాతీయ వ్యాక్సిన్ విధాన పత్రం నొక్కి చెప్పింది. అయితే 2009లో మహమ్మారిని ఎదుర్కోవడానికి తీసుకొచ్చిన విధానాన్ని 2020లో తక్షణం అమలు చేయకపోవడానికి కారణాలను ఆరోగ్య శాఖే వివరించాల్సి ఉంటుంది. 2009లో వ్యాక్సిన్‌ని పెద్దమొత్తంలో నిల్వ చేసిన సీరమ్, భారత్ బయోటెక్ సంస్థలు నాటి హెచ్1ఎన్1 కంటే నేటి కోవిడ్–19 మరింత సవాలు విసిరిన నేపథ్యంలో ముందస్తు కొనుగోలు నిబద్ధతలో పాలుపంచుకున్నాయి. కానీ ఈ సారి సవాలు హెచ్1ఎన్1 ని మించిపోవడంతో పరిస్థితి తల్లకిందులై పోయింది. దీనికి భిన్నంగా పాశ్చాత్య దేశాలకు చెందిన ప్రభుత్వాలు బిలియన్ల కొద్దీ డాలర్లను వ్యాక్సిన్ అభివృద్ధిపై గుమ్మరించడమే కాకుండా ఏఎమ్‌సీల ద్వారా తమ ఔషథ కంపెనీలకు సహాయపడ్డాయి. ఈ కారణంతోటే ఆ దేశాలు ఇప్పుడు తమ జనాభాకు పెద్ద ఎత్తున వ్యాక్సిన్ వేయడంలో విజయవంతం కావడమే కాకుండా మహమ్మారి విస్తృతిని తగ్గించుకోగలిగాయి. ప్రపంచ మార్కెట్లకు 100 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులను సరఫరా చేస్తామని 2020 జూన్ 4న అస్ట్రాజెనెకాతో సీరమ్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. 2020 జూన్ 29న భారత్ బయోటెక్ కూడా తన వ్యాక్సిన్ తయారీ గురించి ప్రకటించింది. కానీ మన విధాన నిర్ణేతలు ఎఎమ్సీ వంటి అవకాశాలను అందిపుచ్చుకుని, అందుబాటులోని ఉత్పత్తి సామర్థ్యాలను పెంపొందించుకునే దిశగా ఎలాంటి సంకేతాలను పంపించలేదు. 2021 ప్రారంభంలో మాత్రమే కేంద్ర ప్రభుత్వం నుంచి స్థిరంగా ఆర్డర్లు వెళ్లాయి. కానీ ఆ సమయానికి సీరమ్, భారత్ బయోటెక్ సంస్థలు ఇతర దేశాలకు వ్యాక్సిన్ సరఫరాపై వాణిజ్య ఒడంబడికలు కుదుర్చుకున్నాయి. ఈ రెండు వ్యాక్సిన్ తయారీ సంస్థల సామర్థ్యాలను మెరుగుపర్చేందుకు గానీ, ఇతర వ్యాక్సిన్ ఉత్పత్తిదారులతో వ్యాక్సిన్ సరఫరాకు ఒప్పందానికిగానీ కేంద్ర ప్రభుత్వం ఏ ప్రయత్నాలూ చేపట్టలేదు. ఫైనాన్సింగ్, లైసెన్సింగ్‌తో సహా వ్యాక్సిన్ సరఫరాకు సంబంధించిన అన్ని అంశాలతో కోవిడ్–19ని ఎదుర్కోవడానికి ఉద్దేశించిన వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్‌పై జాతీయ నిపుణుల గ్రూప్ తొలి సమావేశం 2020 ఆగస్టు 12న జరిగింది. స్థానికంగా వ్యాక్సిన్ తయారీ సామర్ధ్యాన్ని భారత్ సంతరించుకుందని భారత్‌లోనే కాకుండా స్వల్పాదాయ, మధ్య ఆదాయ వనరులున్న దేశాలకు కూడా వ్యాక్సిన్‌ని ముందుగానే సరఫరా చేసే విషయంలో అంతర్జాతీయ సంస్థలతో కూడా భారత్ సంప్రదింపులు జరుపుతోందని ఈ నిపుణుల బృందం పేర్కొంది. 2020 ఆగస్టు 15న నిపుణుల గ్రూప్ తొలి సమావేశం జరిగిన మూడురోజుల తర్వాత ప్రధాని ప్రకటన చేస్తూ, వ్యాక్సిన్ల భారీ ఉత్పత్తికి ప్రాతిపదికను సిద్ధం చేశామనీ, వీలైనంత తక్కువ సమయంలో ప్రతి వ్యక్తికీ వ్యాక్సిన్లను అందుబాటులోకి తెచ్చే ఏర్పాట్లను తన ప్రభుత్వం సిద్ధం చేసిందని పేర్కొన్నారు. భారతీయులందరికీ 200 కోట్ల డోసులను సేకరించి టీకాలను అందించడానికి ఆగస్టు 12, 15 తేదీల మధ్య నిపుణుల బృందం చేసిన ప్లాన్ ఇదే అని చెప్పవచ్చా?! ఏమాత్రమూ కాదు. ఆ తర్వాత కొద్ది రోజులకే కేంద్ర ఆరోగ్య మంత్రి 2021 మధ్యనాటికి 40 కోట్ల నుంచి 50 కోట్ల డోసులను అందివ్వగలమని ప్రకటించారు. డిసెంబర్ 1న ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్.. మొత్తం జనాభాకు వ్యాక్సిన్ అందిస్తామని కేంద్ర ప్రభుత్వం ఎన్నడూ చెప్పలేదని పేర్కొంటూ ప్రధాని ప్రకటనను ఒక్కసారిగా పూర్వ పక్షం చేశారు. 2020నాటికి భారత్‌కు రెండు వ్యాక్సిన్లు మాత్రమే అందుబాటులో ఉంటాయని స్పష్టం కాగా, 2021 ఏప్రిల్ నాటికి వ్యాక్సిన్ సంబంధిత విధాన నిర్ణయం చతికిలబడిపోయింది. ఈలోగా భారత్ బయోటెక్ రూపొందించిన కోవాక్సిన్ స్వదేశీ ఉత్పత్తని, ఇది ప్రధాని నరేంద్రమోదీ వ్యక్తిగత విజయమని చెబుతూ పాలకపార్టీ రాజకీయం చేయడం మొదలెట్టింది. ఎన్నికల కేంపెయిన్ల కోసమే ఉచిత వ్యాక్సిన్లపై వాగ్దానం చేశారు. రానురాను టీకా కొరత తప్పదని తేలడంతో ప్రజాగ్రహం మిన్నుముట్టింది దీనికి సెకండ్ వేవ్ మరింత ఆజ్యం పోసింది. దీంతో వివిధ వయస్కుల వారికి వ్యాక్సిన్ షెడ్యూళ్లను ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు రెండు రకాల ధరలు ప్రకటించారు. రెండు డోసుల మధ్య అంతరాన్ని పెంచుతూ ప్రకటనలు వచ్చాయి. మొత్తంమీద 2020 ప్రారంభంలో కోవిడ్–19పై పోరులో భారత్ ముందంజ వేసిన కారణంగా వ్యాక్సిన్ సమృద్ధిగా లభ్యమవుతుందన్న అంచనాలు చెదిరిపోయాయి. దీంతో ప్రపంచ వ్యాక్సిన్ రాజధాని అనే భ్రమ కనీవినీ ఎరుగని గందరగోళంలో పడిపోయింది. వ్యాసకర్త :దినేష్ సి. శర్మ సైన్స్ వ్యాఖ్యాత (ట్రిబ్యూన్ సౌజన్యంతో) -
వ్యాక్సిన్ వికేంద్రీకరణతోనే లక్ష్యసాధన
కోవిడ్–19 పరీక్షలు, చికిత్సా సమయంలోనే రోగులను దోచుకున్న ప్రైవేట్ రంగ అరాచకం వ్యాక్సినేషన్ ప్రక్రియలోనూ కొనసాగదని చెప్పలేం. ప్రైవేట్ మార్కెట్లో రెండు డోసులకు కలిపి 2 వేల రూపాయల ధర పెడితే ఆర్థికంగా బలహీన వర్గాల ప్రజలు వ్యాక్సిన్ అసలు వేయించుకోలేరు. టీకాతో మహమ్మారి భరతం పట్టాలనే లక్ష్యాన్ని సాధించడమే కష్టసాధ్యమవుతుంది. దీనిబదులుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త పెట్టుబడులతో ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ రంగాన్ని బలోపేతం చేసే అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. పైగా ప్రజారోగ్య వ్యవస్థలో ప్రజల విశ్వాసాన్ని పెంపొందిస్తుంది. ఆరోగ్య సంరక్షణ సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు తొలి ప్రాధాన్యం ఇచ్చిన తర్వాత కోవిడ్– 19 వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రాధాన్యతా బృందాలను దాటి అర్హులైన ప్రజలకు చేరువవుతూ కొత్త దశలోకి ప్రవేశించబోతోంది. అలాగే రోగనిరోధక శక్తిని పెంపొందించే దిశగా ప్రారంభంలోని టీకాలు వేయించుకున్న వారు రెండో డోస్ కూడా పొందుతున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన కోటిమందికిపైగా ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు తొలిదశలో టీకాలు వేశారు. అయితే టీకా కవరేజీ దేశవ్యాప్తంగా ఒకే రీతిన సాగలేదు. చాలా రాష్ట్రాల్లో కోవిడ్–19పై యుద్ధం చేసిన ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్లుకూడా టీకా వేసుకోవడానికి ఇష్టపడలేదని వార్తలు. టీకాలు సమృద్ధిగా అందుబాటులో ఉన్నా, వ్యాక్సినేషన్ కార్యక్రమం ఊహించిన దానికంటే తక్కువగా సాగడంతో కొన్ని ప్రాంతాల్లో టీకా డోసులు వృథా అవుతున్నాయేమోనని ప్రశ్నలు తలెత్తాయి కూడా. పైగా ఇది ప్రైవేట్ మార్కెట్లో కూడా కోవిడ్–19 వ్యాక్సిన్లను అందుబాటులో ఉంచాలనే డిమాండుకు దారి తీసింది. ప్రస్తుత దశలో వ్యాక్సినేషన్ కార్యక్రమం పూర్తిగా ప్రభుత్వ నిధులతోనే జరుగుతోంది. తదుపరి దశలో 60 సంవత్సరాల పైబడిన, ఇతర వ్యాధులున్న 45 సంవత్సరాలు పైబడిన వారికి టీకాలు వేసేనాటికి వాటికయ్యే నిధులు ఎవరు అందిస్తారనేది స్పష్టం కావడం లేదు. ప్రభుత్వ రంగంలో వ్యాక్సినేషన్ నత్తనడకతో సాగుతోంది కాబట్టి ప్రైవేట్ రంగాన్ని అనుమతించాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. నిజానికి తదుపరి దశలో టీకాలు వేయించుకునే వారిలో చాలామందికి డబ్బులు చెల్లించగల సామర్థ్యం ఉందని వీరు వాదిస్తున్నారు. పైగా భారీస్థాయిలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించగల సామర్థ్యం ప్రభుత్వ రంగానికి లేదనే అభిప్రాయం ఆధారంగా వీరు ఇలా చెబుతున్నారు. అయితే ఇదెంత తప్పుధోరణి అంటే, మశూచి, పోలియో తదితర వ్యాధులకు గతంలో వ్యాక్సినేషన్ నిర్వహించి వ్యాధులను పూర్తిగా అరికట్టిన చరిత్ర ప్రభుత్వ రంగ ఆరోగ్య వ్యవస్థకు మాత్రమే ఉండేదని వీరు మర్చిపోతున్నారు. ప్రభుత్వ రంగ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ వల్లే దేశం నలుమూలలకూ వ్యాక్సిన్లను వేగంగా, సమర్థంగా అందించగలిగామన్నది వాస్తవం. చిన్నపిల్లలకు అత్యవసరమైన రోగనిరోధక వ్యవస్థ పెంపుదల కార్యక్రమం చాలావరకు ప్రభుత్వం అధ్వర్యంలోనే సాగుతోంది. నూటికి నూరు శాతం ప్రాణాధార వ్యాక్సిన్లను భారత్ అందించలేకపోతున్నప్పటికీ దేశ ఆరోగ్య సంరక్షణపై ప్రభుత్వరంగమే కీలకపాత్ర పోషిస్తోంది. అలాగని చెప్పి రోగనిరోధక వ్యవస్థ పెంపుదల వంటి కార్యక్రమాల్లో ప్రైవేట్ రంగానికి ఎలాంటి పాత్రా లేదని కాదు. అత్యవసర వ్యాక్సిన్ల సరఫరాదారుగా ప్రైవేట్ రంగం ఇప్పటికే తన వంతు పాత్ర పోషిస్తోంది. పైగా పట్టణ ప్రాంతాల్లో వ్యాక్సిన్ సరఫరాలో ప్రైవేట్ రంగం కీలకపాత్ర పోషిస్తోంది. ఇప్పటికే అనేక కేంద్రాల్లో కోవిడ్–19 వ్యాక్సినేషన్ ప్రక్రియలో ప్రైవేట్ రంగం పాత్ర పోషిస్తోంది కూడా. మొట్టమొదటగా వ్యాక్సిన్ ఎవరికి అవసరం అనేది నిర్ధారిం చడం, ప్రారంభ వారాలు లేక నెలల కాలంలో టీకా సరఫరా తక్కువగా ఉండటం వంటి కారణాలతో కోవిడ్–19 వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రభుత్వ రంగ ఆధ్వర్యంలోనే నిర్వహిస్తూ వచ్చారు. ఈ సూత్రాన్ని అమలు చేస్తున్న సమయంలో వ్యాక్సిన్‌కి అయ్యే ఖర్చును భరించడం అనేది ప్రాధాన్యత కలిగిన అంశం కాదు. భారత్‌లో మాదిరి కాకుండా టీకాను డబ్బు చెల్లించి వేసుకోవడం పెద్ద సమస్యగా కనిపించని అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా తొలి దశ వ్యాక్సినేషన్ని ప్రభుత్వరంగంలోనే కొనసాగించాలని నిర్ణయించారు. పేదదేశాలకు టీకాలు అందుబాటులో ఉంచడం అనే సమస్యను అభివృద్ధి చెందిన దేశాలు పట్టించుకోలేదన్నది వాస్తవం. ప్రపంచ మార్కెట్లలో ఇప్పటికే అందుబాటులో ఉన్న కరోనా టీకాలను అభివృద్ధి చెందిన దేశాలే ప్రత్యక్షంగా లేక అడ్వాన్స్ చెల్లించి మరీ కొనుగోలు చేస్తున్నాయి. అదే సమయంలో ఆఫ్రికా, ఆసియా ఖండాల్లోని పలు దేశాలకు టీకా సరఫరాలే లేవు. బహిరంగ మార్కెట్లలో కోవిడ్– 19 టీకాలను అందుబాటులో ఉంచాలని కోరుతున్న వారు దీన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ప్రభుత్వరంగం ఆధ్వర్యంలో రోగనిరోధక శక్తిని పెంచే కార్యక్రమానికి సంబంధించి ప్రారంభదశలో తలెత్తిన సాంకేతిక సమస్యలను తర్వాత్తర్వాత గణనీయ స్థాయిలో పరిష్కరించారు. రెండు వ్యాక్సిన్ల డోసులు అందుబాటులోకి వచ్చి ఉపయోగిస్తున్న సమయంలో ఇతర లోపాలను గుర్తించి పరిష్కరించవచ్చు. అందుకే టీకాల కార్యక్రమాన్ని వికేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. అయితే పూర్తిగా కేంద్రస్థాయిలో వ్యాక్సినేషన్ని అమలు చేయడానికి బదులుగా, ఒక్కో రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఎలాంటి ప్రభావం చూపిందనే అంశం ప్రాతిపదికగా రాష్ట్ర స్థాయి రోగనిరోధక శక్తి పెంపుదల కార్యక్రమాలను చేపట్టివలసిన అవసరం ఉంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి భిన్నంగా ఉన్నట్లయితే కేంద్రం నిర్ణయించిన ప్రాధాన్యతా బృందాల కిందికి రాకపోయిన్పటికీ, ఈ రెండు రాష్ట్రాల్లో కరోనాకు గురయ్యే వారికి వ్యాక్సిన్ వేసేలా ప్రాధాన్యతలను నిర్ణయించుకోవాలి. అదే సమయంలో రాష్ట్ర స్థాయిలో వ్యాక్సినేషన్ అమలు చేయడానికి కూడా ఇదే వర్తిస్తుంది. ఒక రాష్ట్రంలోని అన్ని జిల్లాలకూ ఒకే పరిమాణంలో టీకాలు అవసరం ఉండకపోవచ్చు. అలా లక్ష్యాన్ని నిర్దేశించుకుని తదనుగుణంగా పనిచేస్తే, వ్యాక్సినేషన్ కార్యక్రమం సమర్థవంతంగా అమలవుతుంది. రాజకీయ స్థాయిలో ఆయా రాష్ట్రాలను విశ్వాసంలోకి తీసుకున్నట్లయితే ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం లేవనెత్తిన సమస్యల వంటివాటిని పరిష్కరించడానికి వీలవుతుంది. రాష్ట్రాల ప్రభుత్వాలతో వ్యాక్సిన్ సంబంధిత సమాచారం విషయంలో పారదర్శకతను, క్రియాశీలతను ప్రదర్శిస్తే వ్యాక్సినేషన్ అమలు రాజకీయాల పాలబడటం నుంచి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధిగమించవచ్చు. వ్యాక్సిన్లను విస్తృతంగా అందుబాటులోకి తేవడంలో ఎదురయ్యే మరొక సమస్య వాటి ధర ఎంత అనేదే. ప్రభుత్వ రంగానికి అయితే సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్ సంస్థలు ప్రత్యేక ధరకు అంగీకరించాయి. అయితే ప్రైవేట్ మార్కెట్లలో విడుదల చేసే వ్యాక్సిన్ల ధర కాస్త ఎక్కువగానే ఉంటుందని సీరమ్ సంస్థ పేర్కొంది. నిర్వహణ ఖర్చులు, డాక్టర్ల ఫీజులు, శీతలీకరణ ఖర్చులు వంటి అంశాలు ప్రైవేట్ మార్కెట్లో వ్యాక్సిన్ ధరను బాగా పెంచుతాయి. తగినన్ని డోసులు అందుబాటులో ఉండటానికి ముందే, ప్రాధాన్యతా బృందాలకు వ్యాక్సిన్ వేయకముందే ఇలాంటి ద్వంద్వ ధరల విధానాన్ని అనుమతిస్తే ప్రభుత్వ సరఫరాలను దొంగిలించడం, బ్లాక్ మార్కెటింగ్ వంటి వాటికి దారితీసే ప్రమాదముంది. కోవిడ్–19 పరీక్షలు, చికిత్సా సమయంలోనే కరోనా రోగులను దోచుకున్న ప్రైవేట్ రంగంలోని దోపిడీ శక్తుల అరాచకం వ్యాక్సినేషన్ లోనూ కొనసాగదని చెప్పలేం. ప్రైవేట్ మార్కెట్లో రెండు డోసులకు కలిపి 2 వేల రూపాయల ధర పెడితే ఆర్థికంగా బలహీన వర్గాల ప్రజలు వ్యాక్సిన్ అసలు వేయించుకోలేరు. ఇలాంటివారి సంఖ్య గణనీయంగానే ఉంటుంది కనుక వ్యాక్సినేషన్ ద్వారా మహమ్మారి భరతం పట్టాలనే లక్ష్యాన్ని సాధించడమే కష్టసాధ్యమవుతుంది. సమాజంలో సంపన్నులు, పేదలు మధ్య, ప్రపంచవ్యాప్తంగా కలిగిన వారు, పేదల మధ్య విభజన రేఖ కారణంగానే కరోనా మహమ్మారి తీవ్ర స్థాయికి చేరుకుంది. కరోనా వ్యాక్సిన్ సరఫరాలను లాభాపేక్ష దృష్టి కలిగిన ప్రైవేట్ రంగానికి బదలాయిస్తే అది అసమానతలను మరింతగా పెంచి పోషిస్తుంది.దీనిబదులుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త పెట్టుబడులతో ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ రంగాన్ని బలోపేతం చేసే అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇది వ్యాక్సినేషన్ ప్రక్రియకు దోహదపడటమే కాకుండా టీబీ, పిల్లల వ్యాధులు వంటి వాటి నిర్మూలన వంటి ఇతర లక్ష్యాల సాధనకు తోడ్పడుతుంది. పైగా ప్రజారోగ్య వ్యవస్థలో ప్రజల విశ్వాసాన్ని పెంపొందిస్తుంది. వ్యాసకర్త: దినేష్ సి. శర్మ జర్నలిస్టు, కాలమిస్టు -
‘ఆమెకు హిందూ మతంపై గౌరవం లేదు’
లక్నో : కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి హిందూ మతంపై గౌరవం లేదని యూపీ డిప్యూటీ సీఎం దినేష్ శర్మ ఆరోపించారు. సీఎం యోగి ఆదిత్యానాథ్‌ను కాషాయ వస్త్రాలు ధరిస్తారంటూ ప్రియాంక చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. హిందూ ధర్మం హింసను, ప్రతీకారాన్ని ప్రేరేపించదని చెప్పేందుకు సంకేతమైన కాషాయ వస్త్రానికి యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ న్యాయం చేయడం లేదని ప్రియాంక వ్యాఖ్యానించిన నేపథ్యంలో దినేష్ శర్మ ఆమెకు దీటుగా బదులిచ్చారు. విపక్షాలు హింసను ప్రేరేపిస్తున్నాయని అన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్న కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ ఘర్షణలకు పాల్పడే వారికీ మద్దతు పలుకుతున్నారని మండిపడ్డారు. కాగా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపడుతున్న నిరసనకారులను యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ అణిచివేతకు గురిచేస్తున్నారని ప్రియాంక ఆరోపిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. పౌర చట్టంపై నిరసనల నేపథ్యంలో ప్రతీకారం తప్పదని ఆయన హెచ్చరించడాన్ని ఆమె తప్పుపట్టారు. హిందూ మతం హింసను, ప్రతీకారాన్ని హిందూ మతం కోరుకోదని ప్రియాంక చెప్పుకొచ్చారు. -
రాజకీయాలు చేసేందుకే ప్రియాంక అక్కడకు..
లక్నో : కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ సోన్‌భద్ర పర్యటనపై ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి దినేశ్ శర్మ విమర్శలు ఎక్కుపెట్టారు. సోన్‌భద్ర ప్రాంతంలో 144 సెక్షన్ అమలులో ఉందని, రాజకీయాలు చేయడానికే ప్రియాంక అక్కడకు వెళుతున్నారని ఆయన విమర్శించారు. సున్నితమైన అంశాలపై రాజకీయాలు చేయడం సరికాదని దినేశ్ శర్మ సూచించారు. శాంతి భద్రతలకే తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఆయన అన్నారు. కాంగ్రెస్ విమర్శలను దినేశ్ శర్మ తీవ్రంగా ఖండించారు. కాగా ఈ నెల 17న ఉత్తరప్రదేశ్ సోన్‌భద్ర జిల్లా గోరేవాల్ ప్రాంతంలో ఓ భూవివాదం విషయమై కాల్పులు చోటుచేసుకొని గోండీ తెగకు చెందిన 10మంది మరణించగా, బాధిత కుటుంబాల పరామర్శకు బయల్దేరిన ప్రియాంక గాంధీని పోలీసులు మధ్యలోనే అడ్డుకుని అరెస్ట్ చేసి మీర్జాపూర్‌లోని చునార్ గెస్ట్‌హౌస్‌కు తరలించారు. అయితే ప్రియాంక అరెస్ట్‌ను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. మరోవైపు చునార్ గెస్ట్‌హౌస్ ప్రియాంకా గాంధీ ధర్నా కొనసాగుతోంది. సోన్‌భద్ర బాధితుల్ని పరామర్శించేంతవరకూ తాను ఇక్కడ నుంచి కదిలేది లేదని ఆమె స్పష్టం చేశారు. ఇక ప్రియాంకా గాంధీని కలిసేందుకు వచ్చిన బాధిత కుటుంబ సభ్యులను పోలీసులు అడ్డుకున్నారు. అలాగే సోన్‌భద్రకు వెళ్లేందుకు వచ్చిన టీఎంసీ ప్రతినిధులను వారణాసి విమానాశ్రయంలోనే పోలీసులు అడ్డుకోవడం గమనార్హం. -
‘అభినవ’ పురాణాలు
బీజేపీతో ఏకీభవించని వారితో నేను ఏకీభవించను. కారణం– మన భారతీయ సంప్రదాయానికీ ఆధునిక జీవనానికీ నిచ్చెనలు వేస్తున్న ఒకే ఒక పార్టీ బీజేపీగా నేను భావిస్తాను. ‘మనవాళ్లు ఉత్త వెధవాయిలోయ్!’ అని గిరీశం తొందరపడి తీర్పునిచ్చాడు కానీ అతను కాని బీజేపీలో ఉంటే తన మనస్సు మార్చుకునేవా డని నా గట్టి నమ్మకం. ఇందుకు గట్టి ఉదాహరణ నాకు ఇటీవలే ఉత్త రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి దినేశ్ శర్మ మాటల్లో దొరి కింది. ఆయన లాకాయి లూకాయి మంత్రి కాడు. ఉప ముఖ్యమంత్రి. ఆయన అన్నారు కదా మన జర్న లిజం పురాణ కాలం నుంచే ప్రారంభమైందని నొక్కి వక్కాణించారు. అంతేకాదు, ఇందుకు బలమైన ఉదా హరణలు ఇచ్చారు. మొదటి ఉదాహరణ: మన భగవద్గీత. ధృతరా ష్ట్రుడితో ఎలా చెప్పాడయ్యా సంజయుడు? చూసింది చూసినట్టు ఒక్క అక్షరం పొల్లు పోకుండా 700 శ్లోకా లను వినిపించాడు. మహా భారత యుద్ధం పంచ రంగులతో ఆయన దివ్య దృష్టికీ కనిపించడానికీ ఈనాటి మన ఐపాడ్లకీ చాలా దగ్గర సంబంధం ఉన్నదని సంజయుని కథనిబట్టి మనం అర్థం చేసు కోవాలి. అలాగే పురాణాల్లో అనాదిగా వస్తున్న పాత్ర– నారదుడు. ఆయన ఎక్కడ పడితే అక్కడికి– ఆయా కారణాలకి చటుక్కున వెళ్లే టెక్నిక్కీ నేటి ‘గూగుల్’కీ పోలికలు లేవా? అని ఆయన బహిరంగ సభలో ప్రశ్నించారు. ‘మీ దిక్కుమాలిన గూగుల్ ఇవాళ ప్రారంభమైంది. కానీ భారతదేశంలో గూగు ల్– పురాణకాలంలో–మహాభారతం రోజుల నాటికే ప్రారంభమైందని’ ఆయన బల్ల గుద్దారు. మనం రెండుసార్లు ‘క్లిక్’ నొక్కితే ఎక్కడికి పడితే అక్కడికి వెళ్లి ఆయా సమా చారాల్ని తెలుసుకోవచ్చు. అది ఇవాళ్టి మాట. కానీ నారదుడు ‘నారాయణ, నారాయణ’ అని రెండుసార్లు అనడం ద్వారా– ఇటు ‘పారిజాతాపహరణా’న్ని, అటు ‘కృష్ణార్జున యుద్ధాన్ని’ నిర్వహిం చిన గొప్పతనాన్ని మరచిపోతున్నాం– అని వాక్రుచ్చారు. అలాగే రామాయణంలో మహాసాధ్వి సీత ‘టెస్ట్ ట్యూబ్’ నుంచి పుట్టిందని సోదాహరణంగా వివరిం చారు. ఆ లెక్కన ద్రోణుడు యజ్ఞాలు చేసే దోనెలో అతని వీర్యం పడగా పుట్టాడని పురాణం. యజ్ఞాల వేళల్లో వీర్యానికి ఏం అగత్యమున్నదో మనకు తెలీదు, ఏమైనా మన పురాణాల నిండా అడ్డమైన వాళ్లూ అడ్డమైన పద్ధతుల్లో పుట్టారు. ఈ విధానాలకీ, ఆధునిక జీవన విధానానికీ ఒక సాపత్యాన్ని వెదికిన సెకండరీ, హయ్యర్, సైన్స్ సాంకేతిక శాఖల మంత్రి గారి ‘ఆలోచనా సరళి’ని కొట్టి పారేయడానికి వీలు లేదు. ఇవన్నీ చాలా గొప్ప పరిశీలనలుగా నేను భావి స్తున్నాను. ఈ లెక్కన స్టీవ్ జాబ్స్ ఏ శూద్రక మహర్షో, బిల్ గేట్స్ కిందటి జన్మలో ఏ శుక మహర్షో అయి ఉంటారని నాకు గట్టి నమ్మకం. లేకపోతే– ఇంతగా ప్రపంచాన్నంతటినీ ఆకర్షించగల ప్రయోగా లను చెయ్యలేరు. నాకు మొదటినుంచీ శ్రీనాథుడిమీద ఈ నమ్మకం ఉండేది. నిజానికి ‘ఆధునిక కవులలో అద్భుతమైన పాత్రికేయుడు శ్రీనాథుడు’ అనే విషయం మీద పరిశోధన జరగాలని నా గట్టి నమ్మకం. ఆయన ‘కాశీఖండము’, ‘భీమ ఖండము’ వంటి మహా రచనలు చేస్తూనే– ఆంధ్ర దేశ మంతా తిరిగి– ఆయా ప్రాంత ఆహార విశేషాల గురించి చెప్పుకుపోయాడు. ఏమైనా కొన్ని తరాలు, శతాబ్దాలు, మళ్లీ మాట్లాడితే యుగాల కిందటి వాస్తవాలను మనకి పంచిన ఘనత బీజేపీది కాక ఇంకెవరికి ఉంటుంది? అని నాకు గర్వపడాలనిపిస్తుంది. మరి మన మహా భారతంలో విమానాలు న్నాయి. వాటిని మన ‘ఎయిర్ ఇండియా’ విమానా లతో పోల్చవచ్చునేమో. కాలదోషం పట్టి వాటిని ప్రస్తుతం ఎవరూ కొనుగోలు చెయ్యడం లేదు. అలాగే హఠాత్తుగా ఆడవారుగా మారిపోయిన మగ వారూ, మగవారిగా మారిపోయిన ఆడవారూ, నపుంసకులూ ఉన్నారు. మన కాలంలో వారు ఎవరో పోల్చవలసిన అవసరం బీజేపీ నాయకులకి ఉంది. ఏమైనా డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని కాల దన్నేలాగ– మన సంస్కృతికీ, పౌరాణిక సంస్కృతికీ నిచ్చెనలు వేయగలిగిన ఆలోచనా పటిమ, స్వదేశీ అభిమానం ఉన్న పార్టీగా నేను బీజేపీని గుర్తిస్తు న్నాను. రాబోయే ఎన్నికలలో తప్పనిసరిగా నా ఓటు బీజేపీకి వెయ్యబోతున్నానని ఇప్పుడే హామీని ఇస్తు న్నాను. వ్యాసకర్త: గొల్లపూడి మారుతీరావు