బద్రీనాథ్ పవిత్ర మందిరానికి ప్రవేశ ద్వారం అయిన ఉత్తరాఖండ్‌లోని జోషీమఠ్ కుంగిపోవడం పాలకుల పర్యావరణ పట్టింపులేనితనానికి నిదర్శనం. కొండచరియలు విరిగిపడే ఈ భౌగోళిక సున్నిత ప్రాంతంలో సొరంగాల తవ్వకం, పేల్చడం వంటి నిర్మాణ పనులు చేయకూడదు. అయినా అతిపెద్ద జలవిద్యుత్ ప్రాజెక్టుల కోసం కేంద్రం హద్దుల్లేని మద్దతిచ్చింది. ఇది సరిపోదన్నట్టుగా, ఈ కొండల్లో 800 కిలోమీటర్ల పొడవైన నాలుగు లేన్ల ‘చార్‌ధామ్ హైవే ప్రాజెక్టు’ను ప్రారంభించింది. పైగా పర్యావరణ చట్టాల్లో 123 క్రమబద్ధీకరణ మార్పులను తీసుకొచ్చారు. ప్రధాని కార్యాలయం చార్‌ధామ్ వంటి ప్రాజెక్టులను నేరుగా పర్యవేక్షిస్తున్నప్పుడు, జోషీమఠ్ కుంగిపోతున్న ఘటనకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుంది.
జోషీమఠ్ కుంగిపోతోంది. ఈ ప్రాంతంలోని 600 ఇళ్లు బీటలు వారాయి. డజన్లకొద్దీ కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. హోటల్స్ వంటి కొన్ని వాణిజ్య భవనాలు అనిశ్చితంగా ఒకదానిపై ఒకటి ఒరిగిపోయాయి. సముద్ర మట్టానికి 6 వేల అడుగుల ఎత్తులో ఉండే ఈ పట్టణం ‘చార్ ధామ్’ లలో ఒకటైన బద్రీనాథ్ పవిత్ర మందిరం, హేమ్‌కుండ్ సాహిబ్ దగ్గరి సిక్కు తీర్థయాత్రా స్థలం, ఔలి దగ్గరి స్కీయింగ్ ఆకర్షణకు ప్రవేశ ద్వారం. హిమాలయాల్లో పర్యావరణపరంగా సున్నితమైన ప్రాంతంలో జోషీమఠ్ ఉంది. సాపేక్షికంగా యువ పర్వతమైన దీని భౌగోళికత ఇతర పర్వతాలతో పోలిస్తే భిన్నమైంది. సమీపంలోని హాథీ పర్వతం, ఔలి స్థిరమైన శిలలపై ఏర్పడి ఉండగా, జోషీమఠ్ ప్రాచీన కొండ చరియలలో భాగంగా ఉన్న స్థిరపడని బండరాళ్లతో ఏర్పడింది.
అందువల్ల ఇది కొండచరియలు విరిగిపడే ప్రాంతం. ఇక్కడ సొరంగాల తవ్వకం, పేల్చడం వంటివి చేస్తే నేలకు భంగం కలుగుతుంది. 1970లో ఒక కొండ నుంచి పెద్ద బండరాయి విడివడి అలకనంద నదిలో పడిపోయింది. ఆ ప్రాంతంలో పెరిగిన నిర్మాణ కార్య కలాపాలు, పెరుగుతున్న జనాభా ఒత్తడి వంటివే ఇలా కొండ చరియలు విరిగిపడటానికి కారణం అవుతున్నాయని డజన్ల కొద్ది శాస్త్రీయ అధ్యయనాలు నిర్ధారించాయి. స్థానిక ప్రజలకు రోడ్లు, నీటి సరఫరా, మురుగు నీటి వ్యవస్థ, స్థానిక వినియోగం కోసం చిన్న జలవిద్యుత్ ప్రాజెక్టు వంటివి హేతుబద్ధమే కావొచ్చు. కానీ వరుసగా ఏర్పడుతూ వచ్చిన ప్రభుత్వాలు ఈ ప్రాంతంలో హైవేలు, జలవిద్యుత్, మౌలిక వసతుల అభివృద్ధి వగైరా అతిపెద్ద ప్రాజెక్టులకు తెరతీశాయి. జోషీమuŠ‡ వంటి ఘటనలకు ప్రకృతిని, వాతావరణ మార్పును లేదా స్థానిక ప్రజలను తప్పు పట్టి ప్రయోజనం లేదు. ఇవన్నీ న్యూఢిల్లీలో రూపొందిస్తున్న విధానాలు కలిగిస్తున్న విపత్తుల ఫలితమేనని కింది కారణాల వల్ల చెప్పవచ్చు.
మొదటి కారణం, 2013 కేదార్‌నాథ్ విషాదం జరిగిన తర్వాత కూడా ఈ ప్రాంతంలో అతిపెద్ద జలవిద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం హద్దుల్లేని మద్దతును ఇవ్వడమే. ఉత్తరాఖండ్‌లో ఉనికిలో ఉన్న, నిర్మాణంలో ఉన్న జలవిద్యుత్ ప్రాజెక్టుల సుదీర్ఘ మన్నిక; అస్థిరమైన జోన్లలో అధిక అవక్షేపాల భారం... తీవ్ర సమస్య లుగా ఉంటూనే వచ్చాయి. దీన్ని దృష్టిలో ఉంచుకునే సుప్రీంకోర్టుచే నియమితులైన నిపుణుల బృందం, ‘మెయిన్ సెంట్రల్ థ్రస్ట్’ (ఎమ్‌సీటీ)పై ఉన్న భూభాగాన్ని సాధారణంగానూ, పేరుకుపోయే చలికాలపు మంచు భూభాగాన్ని ప్రత్యేకంగానూ జలవిద్యుత్ పనుల నుంచి దూరంగా ఉంచాలని సూచించింది.
2014 డిసెంబర్‌లో పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ ఒక అఫిడవిట్ దాఖలు చేసింది. 2013లో వరదలు ముంచెత్తడానికి జలవిద్యుత్ ప్రాజెక్టులు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావం చూపుతున్నాయని ఇందులో పేర్కొంది. కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ కూడా ఈ ప్రాంతంలో నివసించే ప్రజల భద్రతను పరిరక్షించడానికి ఇలాంటి ప్రాజెక్టులపై సమీక్ష అత్యవసరమని 2016 లోనే సుప్రీంకోర్టుకు తెలిపింది. అయితే 2013 నుంచి ఈ ప్రాంతంలోని ఏ జలవిద్యుత్ ప్రాజెక్టును కూడా సమీక్షించడం కానీ, నిలిపి వేయడం కానీ జరగలేదు. వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన ఈ అఫిడవిట్లన్నీ కాగితాల మీదే ఉండిపోయాయి.
హిమాలయాలపై జలవిద్యుత్ ప్రాజెక్టుల దాడి సరిపోలేదని కాబోలు... కేంద్ర ప్రభుత్వం 2016లో ఈ కొండల్లో 800 కిలోమీటర్ల పొడవైన నాలుగు లేన్ల ‘చార్ ధామ్ హైవే ప్రాజెక్టు’ను ప్రారంభిం చింది. దీనికోసం మైదానాల్లో ఉండే విధంగానే రోడ్డుకు ఇరువైపులా ఖాళీ ప్రాంతంతో 12 మీటర్ల వెడల్పు డబుల్ లేన్‌ను డిజైన్ చేశారు. అంటే వందలాది చెట్లను విచ్చలవిడిగా నరకడం, కొండ వాలులను అస్థిర పరచడం, సహజమైన ఊటలను ధ్వంసం చేయడం, వీటితో పాటు లోయల కింది భాగంలో చెత్త, వ్యర్థాలను కుప్పతెప్పలుగా పోయడం అని అర్థం.
ఈ ప్రాజెక్టును మదింపు చేయడానికి సుప్రీంకోర్టు నియమించిన అత్యున్నత సాధికారిక కమిటీ ఈ ప్రాంతంలో పర్యావరణ విధ్వంసానికి రోడ్డు వెడల్పే ప్రత్యక్ష కారణంగా ఉంటోందని భావించింది. అందుకని వెడల్పును తగ్గించినట్లయితే నష్టాన్ని కనీస స్థాయికి తగ్గించే అవకాశముందని పేర్కొంది. నిజానికి 5.5 మీటర్ల ‘క్యారేజ్ వే’తో పర్వత ప్రాంత రోడ్లను భిన్నంగా డిజైన్ చేయాలని సూచిస్తూ 2018లోనే రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఒక సర్క్యులర్ జారీచేసింది. కానీ తన సొంత నిబంధనలను అదే లెక్కచేయకుండా, ఆ సర్క్యులర్‌ను కోర్టు నియమించిన ప్యానెల్‌కు కూడా చూపకుండా దాచింది. బలహీనమైన పర్వత ప్రాంతాల్లో వెడల్పాటి హైవే నిర్మాణం కోసం ఒత్తిడి చేయడం ద్వారా రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ పర్యా వరణ విధ్వంసం జరగడాన్ని అనుమతించింది.
రెండో కారణం, ప్రాజెక్టుల కోసం పర్యావరణ నిబంధనలను పాతరేయడానికి సాహసించడమే. అన్ని భారీ ప్రాజెక్టులూ పర్యావరణ ప్రభావ మదింపు (ఈఐఏ)నకు లోబడి ఉండాలి; పర్యావరణ నిర్వ హణ పథకాన్ని(ఈఎంపీ) తప్పనిసరిగా కలిగి ఉండాలి. రోడ్డు ప్రాజెక్టుల కోసం, ఈఐఏ పరిధి 100 కిలోమీటర్లు మాత్రమే. కానీ ఈ నిబంధన నుంచి తప్పించుకోవడానికి చార్ ధామ్ ప్రాజెక్టును ఒక్కొక్కటీ 100 కిలోమీటర్ల కంటే తక్కువ ఉండేలా 53 ప్రాజెక్టులుగా విభజించారు. కాబట్టి పర్యావరణంపై అవిచ్ఛిన్నమైన, సంచిత ప్రభావాలు ఉంటున్నట్లు తెలుస్తున్నప్పటికీ ఎలాంటి క్రమబద్ధీకరణ, తనిఖీ లేకుండా; ప్రతిక్రియాత్మక పర్యావరణ నిర్వహణ పథకం లేకుండా ప్రాజెక్టును ప్రారంభించేశారు.
సరళతర వాణిజ్యం కోసం ప్రభుత్వం పర్యావరణ నిబంధనలకు తూట్లు పొడవడం కూడా అతిపెద్ద సమస్య అయింది. 2020 మార్చ్ నుంచి 2022 మార్చ్ వరకు పర్యావరణ చట్టాల్లో 123 క్రమబద్ధీకరణ మార్పులను తీసుకొచ్చారని ‘విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీ’ చేసిన అధ్యయనం తెలిపింది. ఈ మార్పుల్లో నాలుగింట మూడొంతులు చట్టాలను సడలించడానికీ, చట్టబద్ధమైన అవసరాలకు మినహాయింపులు ఇవ్వడానికీ సంబంధించినవే కావడం గమనార్హం.
మూడో కారణం ఏమిటంటే, ధార్మిక పర్యాటకం పేరుతో దాని సామర్థ్యాన్ని పట్టించుకోకుండా, పర్యావరణ సున్నిత ప్రాంతాల్లో విచ్చలవిడి టూరిజాన్ని ప్రోత్సహించడమే. హైవే ప్రాజెక్టుకు అదనంగా ప్రభుత్వం చార్ ధామ్ ప్రాంతంలో రైలు సర్వీసులను, రోప్ వేలను ప్రవేశపెట్టడానికి పథకాలు రూపొందిస్తోంది. క్రితంసారి కేదార్ నాథ్‌ను సందర్శించిన సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ– రైళ్లు, రోడ్లు, రోప్ వేలు తమతో పాటు ఉద్యోగాలను కొనితెస్తాయనీ, జీవి తాన్ని సులభతరం చేసి సాధికారతను కలిగిస్తాయనీ గొప్పగా ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ దాదాపు 17 గంటలపాటు ఏకాంతంలో గడిపిన ధ్యాన గుహ భక్తులకు ముఖ్య ఆకర్షణ కేంద్రంగా మారి పోయింది. దీని ఫలితంగా ఇలాంటి మరో మూడు ధ్యాన గుహలను పర్యాటకుల కోసం నిర్మిస్తున్నారు.
అంతిమంగా, జోషీమఠ్‌లో విపత్తు కలిగిన తర్వాత కూడా ప్రభుత్వ స్పందన మిడిమిడి జ్ఞానంతోనే ఉంటోంది. ప్రధాని కార్యాలయం నిర్వహించిన ఒక సమావేశంలో, ఈ ప్రమాదంలో 350 మీటర్ల కొండ ప్రాంతం మాత్రమే ప్రభావితమైందని తేలికచేసి మాట్లాడారు. ప్రధానమంత్రి, ప్రధాని కార్యాలయం ఛార్ ధామ్ వంటి ప్రాజెక్టులను నేరుగా పర్యవేక్షిస్తున్నప్పుడు, జోషీమఠ్ కుంగిపోతున్న ఘటనకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఆకర్షణీయమైన ప్రదర్శనలు కాకుండా, నిజమైన ప్రతిక్రియకు పూనుకోవాల్సిన సమయం ఇది!
దినేశ్ సి. శర్మ
వ్యాసకర్త
సైన్స్ అంశాల వ్యాఖ్యాత
(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment