విశ్లేషణ
అంతరిక్షంలోకి చేరిన తొలి భారత వ్యోమగామిగా రాకేశ్ శర్మ రికార్డు సృష్టించిన నలభై ఏళ్లకు మరో భారతీయుడు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లోకి అడుగుపెట్టడం గర్వకారణమే. మానవ సహిత అంతరిక్ష యాత్ర (గగన్ యాన్ ) కోసం భారత్ ఎంపిక చేసిన నలుగురు వ్యోమగాముల్లో శుభాంశు శుక్లా ఒకరు. బెంగళూరులో వీరికి రష్యా ఆధ్వర్యంలో శిక్షణ నడుస్తోంది. శుక్లాను ఐఎస్‌ఎస్ పైకి పంపే విషయాన్ని ప్రకటిస్తూ ఇస్రో ఆయన్ని గగన్ యాత్రి అని పిలిచింది. దీంతో ఈయనకూ, మనం సమీప భవిష్యత్తులో చేపట్టే గగన్ యాన్‌కూ సంబంధం ఉన్నట్లు స్పష్టమైంది. ఐఎస్‌ఎస్, గగన్ యాన్ రెండూ వేర్వేరు రకాల అంతరిక్ష యాత్రలు. కాకపోతే ఐఎస్‌ఎస్ అనుభవాలు గగన్ యాన్ కూ ఉపయోగపడవచ్చునని ఇస్రో భావిస్తూండవచ్చు.
1969లో మనిషి తొలిసారి జాబిల్లిపై అడుగు పెట్టింది మొదలు మానవ సహిత అంతరిక్ష ప్రయోగాలు బోలెడన్ని జరిగాయి. భూమి చుట్టూ తిరుగు తున్న స్పేస్‌స్టేషన్లకు వ్యోమగాములను పంపుతూనే ఉన్నాం. ఇలాంటి ప్రయోగాలకు సాధారణంగా శక్తిమంతమైన రాకెట్లను వాడుతూంటారు. అంతరిక్ష నౌక ఐఎస్‌ఎస్‌కు అనుసంధానమై కొన్ని రోజులు లేదా వారాలపాటు ఉంటుంది. ఆ తరువాత భూమికి తిరిగి వస్తుంది.
1970లలో సోవియట్ ‘సాల్యూట్’, అమెరికా ‘స్కైలాబ్’ ప్రయోగా లతో అంతరిక్ష కేంద్రాల యుగం ప్రారంభమైంది. తరువాతి కాలంలో సోవియట్ యూనియన్ మరింత పెద్దదైన మిర్ అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. చివరగా అమెరికా, రష్యా, యూరప్ సంయుక్తంగా ఐఎస్‌ఎస్‌ను నిర్మించాయి. చైనా తియాన్ గాంగ్ పేరుతో ప్రత్యేకంగా ఒక అంతరిక్ష కేంద్రాన్ని పదేళ్లుగా నిర్మిస్తోంది. 2035 కల్లా అంతరిక్ష కేంద్రాన్ని నిర్మిస్తామని భారత్ కూడా సంకల్పించడం విశేషం.
భూ కక్ష్యలో తిరిగే అంతరిక్ష కేంద్రాన్ని చేరాలంటే శక్తిమంతమైన రాకెట్లు, మానవులను మోసుకెళ్లగల సామర్థ్యమున్న మంచి అంతరిక్ష నౌక అవసరం. ఇందుకు సోవియట్ యూనియన్ ‘సోయుజ్’, అమె రికా స్పేస్ షటిల్స్ తయారు చేసుకున్నాయి. ముప్ఫై ఏళ్లుగా వీటినే వాడుతున్నాయి. స్పేస్ షటిల్ రాకెట్ మాదిరిగా నిట్టనిలువుగా పైకి ఎగరగలదు. అంతరిక్ష నౌక మాదిరిగా సమాంతరంగానూ దూసు కెళ్లగలదు.
విమానం మాదిరి ల్యాండ్ కూడా కాగలదు. అయితే 2003లో స్పేస్ షటిల్ కొలంబియా ప్రమాదానికి గురై అందులో భారతీయ సంతతి వ్యోమగామి కల్పనా చావ్లా మరణించింది మొదలు స్పేస్ షటిల్‌ల యుగం క్రమేపీ అంతరించింది. 2011 నాటికి పూర్తిగా నిలిపివేశారు. ఆ తరువాత కొన్నేళ్లకు ‘నాసా’ రష్యా తయారీ సోయుజ్ సాయంతో ఐఎస్‌ఎస్‌కు సరుకులు, వ్యోమగాములను రవాణా చేయడం మొదలుపెట్టింది.
ప్రైవేట్‌రంగ ప్రవేశం...
అంతరిక్ష ప్రయోగాల్లో ప్రైవేట్ కంపెనీలు పాల్గొనడం స్పేస్ షటిల్ కార్యక్రమం ముగిసిన తరువాతే మొదలైంది. దీర్ఘకాలిక అవస రాలను దృష్టిలో పెట్టుకుని నాసా అమెరికన్ కంపెనీల నిధులు, టెక్నా లజీల సాయంతో అంతరిక్ష రవాణా వ్యవస్థలను నిర్మించుకుంది. ఈ క్రమంలోనే ఐఎస్‌ఎస్‌కు సరుకులు, సిబ్బందిని రవాణా చేసే పని ప్రైవేట్ కంపెనీల పరమైంది. ఈ విధానం పుణ్యమా అని స్పేస్‌ఎక్స్, యునైటెడ్ లాంచ్ అలయన్స్(యూఎల్‌ఏ) వంటి పలు ప్రైవేట్ కంపె నీలు అంతరిక్ష రంగంలోకి అడుగుపెట్టాయి.
2012 నుంచి తన ఫాల్కన్ రాకెట్ల ద్వారా పలు మార్లు ఐఎస్‌ఎస్‌కు సరుకులు రవాణా చేసిన తరువాత స్పేస్‌ఎక్స్ 2020లో మొదటిసారి సిబ్బంది రవాణా బాధ్యతను నిర్వర్తించింది. ఇంకోవైపు యూఎల్‌ఏ కూడా తన అట్లాస్ వీ రాకెట్ ద్వారా పలు కార్గో ట్రిప్‌లు విజయవంతంగా పూర్తి చేసి సిబ్బంది రవాణ చేపట్టింది. ఈ ఏడాది జూన్ లో భారతీయ సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్‌ను ఐఎస్‌ఎస్‌కు మోసుకెళ్లిన స్టార్ లైనర్ యూఎల్‌ఏ తయారీనే. అయితే ఐఎస్‌ఎస్ చేరిన తరువాత ఈ స్టార్ లైనర్ మళ్లీ భూమ్మీదకు వచ్చే స్థితిలో లేనట్లు స్పష్టమైంది. థ్రస్టర్లలో సమస్యలు రావడంతో అది ఐఎస్‌ఎస్‌తోనే ఉండిపోయింది.
శుభాంశూ శుక్లాను ఐఎస్‌ఎస్‌కు చేర్చే బాధ్యతను ఇస్రో ప్రైవేట్ కంపెనీ ‘ఆక్సియామ్ స్పేస్’కు అప్పగించింది. వాణిజ్య స్థాయిలో వ్యోమగాముల రవాణా చేపట్టగల సత్తా దీనికి ఉందని నాసా స్వయంగా సర్టిఫై చేసి ఉండటం గమనార్హం. అయితే ఆక్సియామ్‌కు సొంతంగా రాకెట్లు లేవు. స్పేస్‌ఎక్స్‌పై ఆధారపడుతోంది. 2021 మే నుంచి ఇప్పటివరకూ ఆక్సియామ్ మూడుసార్లు ఐఎస్‌ఎస్‌కు సిబ్బంది, సరుకులను రవాణా చేసింది. శుక్లాను మోసుకెళ్లడం నాలుగో మిషన్ అవుతుంది.
కానీ ఆక్సియామ్, ఇస్రోల మధ్య జరిగిన వాణిజ్య ఒప్పందానికి లోబడి శుక్లా ఐఎస్‌ఎస్‌కు వెళతారా? లేక ఇస్రో – నాసాల ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా (సర్వీస్ ఛార్జీలు ఉన్నా లేకున్నా) వెళతారా? అన్నది స్పష్టం కాలేదు. 1984లో భారత్, సోవి యట్ యూనియన్ల మైత్రీ బంధానికి ప్రతీకగా రాకేశ్ శర్మ సోవియట్ అంతరిక్ష కేంద్రం సాల్యూట్‌కు వెళ్లారు.
ఈ యాత్ర, శిక్షణలకు సంబంధించి సోవియట్ యూనియన్ కు భారత్ డబ్బు ఏమీ చెల్లించలేదు. సాల్యూట్ తరువాత వచ్చిన మిర్ పైకి సోవియట్ యూనియన్ 13 దేశాలకు చెందిన 104 మంది వ్యోమగాములను తీసుకెళ్లింది. 2001లో మిర్ కూలిపోయే ముందు వరకూ ఈ యాత్రలు జరిగాయి. చాలా యాత్రలకు ఆయా దేశాలు డబ్బులు చెల్లించడం గమనార్హం.
1990–2000 మధ్యకాలంలో నిర్మాణమైన ఐఎస్‌ఎస్‌లో భారత్‌కు భాగస్వామ్యం లేదు. వ్యోమగామిని పంపే అవకాశమూ రాలేదు. అప్పట్లో ఇస్రో, నాసాల మధ్య సంబంధాలు అంత బాగా లేవు. రష్యా నుంచి మనం క్రయోజెనిక్ ఇంజిన్లు తెచ్చుకోవడంపై పెద్ద వివాదమే నడుస్తుండేది. ఇస్రో కూడా తన ఉపగ్రహ కార్యక్రమాలపైనే ఎక్కువ దృష్టి పెట్టింది. పైగా వనరుల కొరత ఇస్రోను బాధిస్తూండేది.
ఇస్రో అజెండాలోకి మానవ సహిత అంతరిక్ష ప్రయోగం చేరే సమయానికి ఐఎస్‌ఎస్‌ను సందర్శించే వారి జాబితా పెరిగిపోయింది. గత పాతికేళ్లలో 23 దేశాలకు చెందిన 280 మంది వ్యోమగాములు ఐఎస్‌ఎస్‌కు వెళ్లి వచ్చారు. వీరిలో కొంతమంది రెండు, నాలుగు సార్లు కూడా వెళ్లడం గమ నార్హం. సునీతా విలియమ్స్‌నే ఉదాహరణగా తీసుకుంటే, ఆమె ఐఎస్‌ఎస్‌కు వెళ్లడం ఇది మూడోసారి.
అమెరికా, రష్యాల వ్యోమగాములు సుమారు 220 మంది ఐఎస్‌ఎస్ వెళ్లిన వారిలో ఉండగా... మిగిలిన వాళ్లు జపాన్ , కెనెడా, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, డెన్మార్క్, యూకే, బెల్జియం, స్పెయిన్, స్వీడన్ , నెదర్లాండ్స్, బ్రెజిల్, ఇజ్రాయెల్, కజకిస్తాన్ , బెల రూస్, మలేషియా, దక్షిణాఫ్రికా, కొరియా, సౌదీ అరేబియా, టర్కీ, యూఏఈలకు చెందినవారు. ఈ జాబితాలో 13 మంది ప్రైవేట్ వ్యక్తులు కూడా ఉన్నారు. ఆక్సియామ్ చేపట్టిన తొలి మానవ సహిత అంతరిక్ష యాత్రలోనూ నలుగురు ప్రైవేట్ వ్యక్తులు ఉన్నారు.
2018లో ఇస్రో గగన్‌యాన్‌పై పని మొదలుపెట్టినప్పుడు భార తీయ వ్యోమగామిని ఐఎస్‌ఎస్‌పైకి పంపాలన్న ఆలోచన లేదు. ఎంపిక చేసిన నలుగురు వ్యోమగాములను యూరీ గగారిన్ స్పేస్ సెంటర్‌కు శిక్షణ కోసమని పంపారు. రష్యా అంతరిక్ష ప్రయోగసంస్థలతో కుదిరిన ఒప్పందంలోనూ మానవ సహిత అంతరిక్ష యానా నికి సంబంధించిన శిక్షణ ప్రస్తావన మాత్రమే ఉంది.
అయితే ప్రధాని నరేంద్ర మోదీ 2022లో భారత స్వాతంత్య్ర 75 సంవత్సరాల వేడుకల సందర్భంగా గగన్ యాన్ గడువు ఆచరణ సాధ్యం కానంత తక్కువ సమయానికి కుదించడంతో పరిస్థితి మారిపోయింది. అందుకేనేమో... ఏడాది తరువాత ఐఎస్‌ఎస్ ఆలోచన వచ్చింది. మోదీ అమెరికా పర్య టన సందర్భంగా దీనికి సంబంధించిన ప్రకటన కూడా చేశారు.
అయితే గగన్ యాన్ యాత్ర కోసం ఐఎస్‌ఎస్‌కు వెళ్లాల్సిన అవసరమేదీ లేదు కానీ అంతరిక్ష యాత్రకు సంబంధించి వాస్తవిక అనుభవం గడించేందుకు మాత్రం ఉపయోగపడుతుంది. ఏమైనప్పటికీ... అంతరిక్షంలోకి చేరిన తొలి వ్యోమగామిగా రాకేశ్ శర్మ రికార్డు సృష్టించిన నలభై ఏళ్లకు మరో భారతీయుడు అంతరిక్షంలోకి అడుగుపెడుతున్నాడంటే, అది మనందరికీ గర్వకారణమే.
దినేశ్ సి. శర్మ
వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత
(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment