
మహాకవి శ్రీశ్రీ చెప్పినట్టు ‘రాశి చక్రగతులలో/రాత్రిందివాల పరిణామాలలో/ బ్రహ్మాండ గోళాల పరిభ్రమణాలలో/ కల్పాంతాలకు పూర్వం కదలిక పొందిన/ పరమాణువు సంకల్పంలో...’ ప్రభ వించిన మానవుడు మరోసారి అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. కేవలం ఎనిమిది రోజులని భావించింది కాస్తా 286 రోజులపాటు అంతరిక్షంలో ఉండిపోక తప్పని వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్, వారిని వెనక్కి తీసుకురావడానికి వెళ్ళిన మరో ఇద్దరూ నిర్దేశించిన సమయానికల్లా క్షేమంగా, సురక్షితంగా భూమ్మీదకు చేరుకోవడం సంక్లిష్టమైన సవాళ్లపై విజ్ఞాన శాస్త్రం సాధించిన అపూర్వ విజయం.
మెక్సికో జలసంధి కెరటాల్లో వారిని తీసుకొచ్చిన స్పేస్ ఎక్స్ డ్రాగన్ కాప్సూ్యల్ తేలియాడుతుండగా డాల్ఫిన్ల గుంపు దాని చుట్టూ వలయాకారంలో స్వాగతిస్తున్నట్టు తిరుగాడటం ఆహ్లాదాన్ని పంచింది. మంగళవారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్)ను వీడి దాదాపు 16 గంటలు ప్రయాణించి భారత కాలమానం ప్రకారం తెల్లారు జామున 3.30కి చేరు కున్నారు. అంతరిక్షానికి రాకపోకలు సాగించటం, అక్కడున్నన్నాళ్లూ నిరంతర పరిశోధనల్లో నిమ గ్నులు కావటం ఒక అనుపమానమైన, అసాధారణమైన విన్యాసం. ఎంతో ఏకాగ్రత, మరెంతో ఆత్మ విశ్వాసమూ, ఓరిమి ఉంటే తప్ప ఆ పరిశోధనలు పరిపూర్తి చేయటం కష్టం.
ఎంతో ఇరుకైన ఒక చిన్న స్థలాన్ని మిగిలిన వారితో పంచుకోక తప్పక పోవటం సామాన్య విషయం కాదు. నిరుడు జూన్ 5న అంతరిక్షయానం ప్రారంభం కాగా, ఆ మరునాడు అక్కడికి చేరుకుని ఐఎస్‌ఎస్‌లో ఈ వ్యోమ గాములు పని ప్రారంభించారు. సునీత ఇప్పటికే మూడుసార్లు అంతరిక్షయానం చేయటంతో పాటు ఒక దఫా ఐఎస్‌ఎస్ కమాండర్‌గానూ వ్యవహరించారు.
సునీత, బుచ్ అంతరిక్షంలో చిక్కుకుపోయా రనటాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా అంగీకరించటం లేదు. వారిని సురక్షితంగా దించేందుకు అనువైన సమయం కోసం ఎదురుచూశామంటున్నది. వారికున్నంత ఆత్మవిశ్వాసం సాధారణ ప్రజలకుండదు. అందుకే సునీత రాక కోసం మానవాళి మొత్తం ఆదుర్దా ప్రదర్శించింది.
అంతరిక్షయానం ఎనిమిది రోజులే అనుకుని వెళ్లి తొమ్మిది నెలలు ఉండక తప్పక పోవటమంటే అది వారి మానసిక స్థితిని మాత్రమే కాదు... శారీరక స్థితిగతులనూ ప్రభావితం చేస్తుంది. కేవలం ఎనిమిది రోజులకోసమైతే వారు సాధారణ వ్యాయామంతో సరిపెట్టుకోవచ్చు. అసలు చేయక పోయినా ఫరవాలేదంటారు. కానీ ఇంత సుదీర్ఘకాలం అక్కడ కొనసాగాలంటే మాత్రం శరీ రాన్ని బాగా కష్టపెట్టాలి. సుదీర్ఘ వ్యాయామం తప్పదు. గుండె, రక్తనాళాలూ సక్రమంగా పని చేయ టానికి అవి అవసరం.
ఈ వ్యాయామాలు సహజంగానే కష్టంతో కూడుకున్నవి గనుక అందుకు వారిని మానసికంగా సంసిద్ధుల్ని చేయటంతోపాటు వారి దినచర్యలో అవసరమైన మార్పులు చేయాల్సి వస్తుంది. వారికి అందాల్సిన ప్యాకేజ్డ్ ఆహారం వివిధ రకాల రుచులతో సిద్ధంగానే ఉన్నా నచ్చింది తినడానికి లేదు. నిర్ణీత కొలతలో వాటిని తీసుకోవాల్సి ఉంటుంది.
ఇన్నిటిని తట్టుకుంటూ, నిర్దిష్టమైన సమయాల్లో వ్యాయామాలు చేస్తూ పరిశోధనలు సాగించటం, అందులో వెల్లడైన అంశా లపై పరస్పరం చర్చించుకుని నిర్ధారణలకు రావటం అంతరిక్ష యాత్రికులకు తప్పనిసరి.
ఇంతవరకూ మూడు దఫాలు అంతరిక్ష యాత్రకు వెళ్లిన సునీత మొత్తం 62 గంటల 6 నిమి షాలు స్పేస్ వాక్ చేశారంటే... ఆ రకంగా ఆమె మహిళా అంతరిక్ష యాత్రికుల్లో అగ్రస్థానాన్నీ, మొత్తం వ్యోమగాముల్లో నాలుగో స్థానాన్నీ పొందారంటే... అది సునీత దృఢసంకల్పానికి అద్దం పడుతుంది. ఈ అంతరిక్ష యానంలో భూమికి 408 కిలోమీటర్ల ఎత్తులో 900 గంటలపాటు ఆమె వివిధ రకాలైన 150 పరిశోధనల్లో నిమగ్నమయ్యారు.
ఈ తొమ్మిది నెలల్లో ఆమె పరిశోధనలు సాగించిన ఐఎస్‌ఎస్... భూకక్ష్యలో 4,576 సార్లు తిరగ్గా ఆ నిడివి 19 కోట్ల 40 లక్షల కిలోమీటర్లు! అబ్బురపరిచే విషయమిది. అవకాశం లభిస్తే స్త్రీలు అందరినీ మించుతారనడానికి సునీత ప్రతీక.
ఈ అంతరిక్ష యాత్రలైనా, అంతరిక్ష నౌకల అన్వేషణలైనా... వాటి అంతిమ సారాంశం ఏక గ్రహజీవిగా ఉన్న మనిషిని బహు గ్రహజీవిగా మార్చటం. అంతరిక్షంలో సాగించే పరిశోధనలు భవి ష్యత్తులో మనుషులందరూ సునాయాసంగా గ్రహాంతర యానాలు చేయటానికి, అక్కడి పరిస్థితు లకు తట్టుకోవటానికీ తోడ్పడతాయి. ఈ యాత్రలు మున్ముందు మనుషుల్ని పోలిన గ్రహాంతర జీవులతో మనల్ని అనుసంధానించవచ్చు. 1906లో హెచ్‌జీ వెల్స్ రచించిన ‘వార్ ఆఫ్ ది వర్ల్›్డ్స’ నవల ఊహించినట్టు ఆ గ్రహాంతర జీవులు మనపైకి దండయాత్రకొచ్చే ప్రమాదమూ లేకపోలేదు.
విశ్వం గురించిన మన జ్ఞానం పరిధి రోజురోజుకూ విస్తరిస్తోంది. కోట్లాది కాంతి సంవత్సరాల దూరంలో సైతం లెక్కలేనన్ని పాలపుంతలున్నాయని, భూమిని పోలిన గ్రహాల ఆచూకీ తెలిసిందని శాస్త్రవేత్తలు చెబుతుంటే ఎంతో విస్మయం కలుగుతుంది. రెక్కలు కట్టుకుని పైపైకి వెళ్లేకొద్దీ మన భూమి సూది మొన మోపినంత పరిమాణంలో కనిపిస్తుంది. అక్కడి నుంచి చూస్తే మనం కృత్రిమంగా ఏర్పర్చుకున్న సరిహద్దులు, ఆర్థిక సామాజిక తారతమ్యాలు కనబడవు. విషాదమేమంటే... ఎదిగినకొద్దీ విశాలం కావాల్సిన చూపు కాస్తా మూఢ విశ్వాసాల్లో, మూర్ఖత్వపు మలుపుల్లో సంకు చితమవుతోంది.
నలుగురు వ్యోమగాములు సగర్వంగా భూమ్మీదకు తిరుగు పయనమైన రోజే 400 మంది అమాయక పాలస్తీనా పౌరులు ఇజ్రాయెల్ బాంబుదాడుల్లో కన్నుమూశారంటే అది మనుషుల్లోని రాక్షసత్వాన్ని చాటుతుంది. ఇలాంటి విషాదాలకు తావులేని కాలం ఆగమిస్తే తప్ప ఈ విజయాలు మనకు పరిపూర్ణమైన సంతోషాన్ని కలగజేయలేవు.
Comments
Please login to add a commentAdd a comment