
వాషింగ్టన్: నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్,బుచ్ విల్మోర్‌లు అంతరిక్షం నుంచి మార్చి 19న భూమి మీదకు బయలుదేరనున్నారు. గతేడాది జూన్‌లో అంతర్జాతీయ స్పేస్‌స్టేషన్(ఐఎస్‌ఎస్)కు వెళ్లిన వారిద్దరు అనుకోని పరిస్థితుల్లో ఎనిమిది నెలలపాటు అక్కడే ఉండిపోయారు. అయితే వ్యోమగాములిద్దరు భూమి మీదకు వచ్చిన తర్వాత పలు రకాల సమస్యలను ఎదుర్కోనున్నట్లు తెలుస్తోంది.
జీరో గ్రావిటీ నుంచి భారీ గురుత్వాకర్షణ కలిగిన భూమి వాతావరణంలోకి 8 నెలల తర్వాత వారు రానుండడమే ఇందుకు కారణం. తాము భూమి మీదకు వచ్చిన తర్వాత చిన్న పెన్సిల్‌ను లేపినా పెద్ద బరువులు ఎత్తి వ్యాయామం చేసిన ఫీలింగే ఉంటుందని విల్మోర్ మీడియాకు తెలిపారు.‘ఇక్కడి నుంచి భూమి మీదకు వచ్చిన తర్వాత గ్రావిటీలో చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. భూమిపై పరిస్థితులకు అలవాటుపడే దాకా ఇబ్బందిగానే ఉంటుంది.
శరీరం బరువెక్కిన ఫీలింగ్ కలుగుతుంది’ అని విల్మోర్ వెల్లడించారు. స్పేస్‌లో తేలియాడుతూ ఉండే వ్యోమగాములు..భూమి మీదకు వచ్చిన తర్వాత ఆ ప్రత్యేక అనుభూతికి దూరమవుతారు. అంతరిక్షంలో ఎక్కువ కాలం ఉంటే వ్యోమగాముల ఆరోగ్య పరిస్థితిపై ప్రభావం చూపిస్తుంది.ఒక వ్యోమగామి అంతరిక్షంలోకి వెళ్లాక వారి శరీరం ఎర్రరక్తకణాలను నాశనం చేయడం ప్రారంభిస్తుంది.
ఎర్రరక్తకణాల సంఖ్య తగ్గించుకోవడం ద్వారా మైక్రోగ్రావిటీ పరిస్థితుల్లో శరీరం ఆక్సిజన్ అవసరాలను తగ్గించుకుంటుంది.గుండె పనితీరుపైనా అంతరిక్షం ప్రభావం చూపిస్తుంది.బోయింగ్ వ్యోమనౌకలో భాగంగా నాసా గత జూన్‌లో సునీత,విల్మోర్‌లను ఐఎస్‌ఎస్‌కు పంపించింది. వ్యోమనౌకలో లోపాలు తలెత్తడంతో వారం రోజుల కోసం వెళ్లిన ఇద్దరు ఏకంగా 8 నెలలు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment