Gravity
-
సునీత,విల్మోర్లకు ‘గ్రావిటీ’ భయం..!
వాషింగ్టన్: నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్,బుచ్ విల్మోర్లు అంతరిక్షం నుంచి మార్చి 19న భూమి మీదకు బయలుదేరనున్నారు. గతేడాది జూన్‌లో అంతర్జాతీయ స్పేస్‌స్టేషన్(ఐఎస్ఎస్)కు వెళ్లిన వారిద్దరు అనుకోని పరిస్థితుల్లో ఎనిమిది నెలలపాటు అక్కడే ఉండిపోయారు. అయితే వ్యోమగాములిద్దరు భూమి మీదకు వచ్చిన తర్వాత పలు రకాల సమస్యలను ఎదుర్కోనున్నట్లు తెలుస్తోంది. జీరో గ్రావిటీ నుంచి భారీ గురుత్వాకర్షణ కలిగిన భూమి వాతావరణంలోకి 8 నెలల తర్వాత వారు రానుండడమే ఇందుకు కారణం. తాము భూమి మీదకు వచ్చిన తర్వాత చిన్న పెన్సిల్‌ను లేపినా పెద్ద బరువులు ఎత్తి వ్యాయామం చేసిన ఫీలింగే ఉంటుందని విల్మోర్ మీడియాకు తెలిపారు.‘ఇక్కడి నుంచి భూమి మీదకు వచ్చిన తర్వాత గ్రావిటీలో చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. భూమిపై పరిస్థితులకు అలవాటుపడే దాకా ఇబ్బందిగానే ఉంటుంది.శరీరం బరువెక్కిన ఫీలింగ్ కలుగుతుంది’ అని విల్మోర్ వెల్లడించారు. స్పేస్‌లో తేలియాడుతూ ఉండే వ్యోమగాములు..భూమి మీదకు వచ్చిన తర్వాత ఆ ప్రత్యేక అనుభూతికి దూరమవుతారు. అంతరిక్షంలో ఎక్కువ కాలం ఉంటే వ్యోమగాముల ఆరోగ్య పరిస్థితిపై ప్రభావం చూపిస్తుంది.ఒక వ్యోమగామి అంతరిక్షంలోకి వెళ్లాక వారి శరీరం ఎర్రరక్తకణాలను నాశనం చేయడం ప్రారంభిస్తుంది.ఎర్రరక్తకణాల సంఖ్య తగ్గించుకోవడం ద్వారా మైక్రోగ్రావిటీ పరిస్థితుల్లో శరీరం ఆక్సిజన్ అవసరాలను తగ్గించుకుంటుంది.గుండె పనితీరుపైనా అంతరిక్షం ప్రభావం చూపిస్తుంది.బోయింగ్ వ్యోమనౌకలో భాగంగా నాసా గత జూన్‌లో సునీత,విల్మోర్లను ఐఎస్ఎస్కు పంపించింది. వ్యోమనౌకలో లోపాలు తలెత్తడంతో వారం రోజుల కోసం వెళ్లిన ఇద్దరు ఏకంగా 8 నెలలు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. -
కృష్ణబిలాల అన్వేషణలో
‘టైమ్’ మేగజీన్ 2024 సంవత్సరానికి గాను ‘100 మంది ప్రభావపూరిత వ్యక్తుల’ జాబితా ప్రకటించింది. ప్రపంచవ్యాప్త ఉద్దండులతో పాటు భారతీయులు కూడా ఈ ఎంపికైన వారిలో ఉన్నారు. వారిలో ఒకరు ఆస్ట్రోఫిజిసిస్ట్ ప్రియంవద రంగరాజన్. కృష్ణబిలాలను లోతుగా అధ్యయనం చేయడం ద్వారా సృష్టి పుట్టుకను విశదం చేయగల మర్మాన్ని ఈమె విప్పుతున్న తీరు అసామాన్యమని ‘టైమ్’ భావించింది. కోయంబత్తూరులో జన్మించి అమెరికాలో స్థిరపడ్డ ప్రియంవద పరిచయం. మన పాలపుంతలో ఎన్ని కృష్ణ బిలాలు (బ్లాక్ హోల్స్) ఉంటాయో తెలుసా? కనీసం కోటి నుంచి నూరు కోట్ల వరకు. అంతరిక్షంలో కృష్ణ బిలాలు ఒక నిగూఢ రహస్యం. ఐన్‌స్టీన్ వీటిని ఊహించాడుగాని ఆయన జీవించి ఉన్నంత కాలం వాటి ఉనికిపై వాస్తవిక ఆధారాలు వెల్లడి కాలేదు. 1967లో జాన్ వీలర్ అనే ఫిజిసిస్ట్ ‘బ్లాక్ హోల్’ పదం వాడినప్పటి నుంచి వీటిపై చర్చలు కొనసాగాయి. ఆ తర్వాతి కాలంలో ఉనికి గురించిన ఆధారాలు దొరికాయి. కృష్ణ బిలాలు కాంతిని కూడా మింగేసేంత శక్తిమంతమైనవి. చిన్న చిన్న బ్లాక్‌హోల్స్ నుంచి అతి భారీ (సూపర్ మాస్) బ్లాక్ హోల్స్ వరకూ మన పాలపుంతలో ఉన్నాయి. ఒక తార తన గురుత్వాకర్షణలో తానే పతనం అయినప్పుడు బ్లాక్ హోల్స్ ఏర్పడతాయనేది ఒక సిద్ధాంతమైతే ఇవి విశ్వం ఏర్పడే సమయంలోనే అంతరిక్ష ధూళిమేఘాలు తమపై తాము పతనవడం వల్ల ఏర్పడ్డాయని మరో సిద్ధాంతం. ఈ మరో సిద్ధాంతానికి ఊతం ఇస్తూ ప్రియంవద రంగరాజన్ సాగిస్తున్న పరిశోధనల వల్లే ఆమె తాజాగా ‘టైమ్’ మేగజీన్‌లో ‘హండ్రెడ్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షల్ పీపుల్’లో ఒకరుగా నిలిచారు. ఆమె పరిశోధన ప్రియంవద కృష్ణబిలాల పరిశోధనలో ప్రత్యేక కృషి చేశారు. గురుత్వాకర్షణ లెన్సింగ్ పద్ధతి ద్వారా నక్షత్ర మండలాల ఆవిర్భావాన్ని, వాటి పరిణామాలను, అనేక నక్షత్ర మండలాల మధ్య అంతర్గత సంబంధాలపై అధ్యయనం చేశారు. నక్షత్ర మండల సమూహాల గతిశీలతను అధ్యయనం చేయడానికి లెన్సింగ్, ఎక్స్–రే, సున్యావ్–జెల్డోవిక్ డేటాను ఉపయోగించారు. అంతే కాదు ఒక నక్షత్రం, కృష్ణబిలం కలయిక ద్వారా ఏర్పడే విద్యుదయస్కాంత, గురుత్వాకర్షణ తరంగాలపై కూడా అధ్యయనం చేశారు. ఆమెను ఎన్నో అవార్డులు వరించాయి. ప్రతిష్టాత్మక లిబర్టీ సైన్స్ సెంటర్ వారి ‘జీనియస్ అవార్డు’ కూడా దక్కింది. ఈ విశ్వం ఎలా పరిణామం చెందిందో తెలుసుకోవడానికి ప్రియంవద సాగిస్తున్న కృష్ణబిలాల అన్వేషణ చాలా కీలకంగా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కోయంబత్తూరులో జన్మించి... ప్రియంవద రంజరాజన్ కోయంబత్తూరులో జన్మించారు. తండ్రి ఉద్యోగం రీత్యా ఇంటర్ వరకూ ఢిల్లీలో చదువుకున్నారు. ఆమె అండర్ గ్రాడ్యుయేషన్ ‘మసాచుసెట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’లో జరిగింది. ఆ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ నుంచి పిహెచ్డి చేశారు. ప్రస్తుతం అమెరికాలోని యేల్ యూనివర్సిటీలోప్రోఫెసర్గా పని చేస్తున్నారు. ‘మ్యాపింగ్ ది హెవెన్స్: ది రాడికల్ సైంటిఫిక్ ఐడియాస్ దట్ రివీల్ ది కాస్మోస్‘ అనే ముఖ్యమైన గ్రంథాన్ని రచించారు. -
ఆ ఇంట్లోకి అడుగుపెట్టడమే..తూలుతూ, ఊగిపోతారు!
ఈ ప్రపంచంలో అసాధారణమైన ప్రతీది మిస్టరీనే. మనం ఏ సపోర్ట్ లేకుండా ముందుకు వాలి నిలబడగలమా? బేస్లేకుండా ఏ వస్తువునైనా నిలబెట్టగలమా? ఎప్పుడైనా, ఎక్కడైనా ఇద్దరు వేరువేరు పొడవులు గల వ్యక్తుల ఎత్తులు సమాంతరంగా మారతాయా? ఈ వింతలన్నీ ఒకే చోట జరుగుతాయి. అమెరికాలోని ఓ మిస్టీరియస్ స్పాట్లో ఒక చీపురును నిలబెడితే.. ఏ సపోర్ట్ లేకుండా నిలబడుతుంది. కుర్చీ నేలకు ఆనకుండా.. గోడకు ఆనిస్తే.. అది నిలబడే ఉంటుంది. ఆశ్చర్యంగా ఉంది కదూ! యూఎస్‌లోని మిషిగన్, సెయింట్ ఇగ్నస్ ప్రాంతంలో.. ‘ది ఒరెగాన్ వోర్టెక్స్’ అనే పర్యాటక కేంద్రాన్ని సందర్శిస్తే ఈ వింతలన్నిటినీ చూడొచ్చు. ఇక్కడున్న ‘ద హౌస్ ఆఫ్ మిస్టరీ’ అనే ఇంట్లోకి వెళ్తుంటే కళ్లు చెదరడం పక్కా! తూలుతూ, ఊగుతూనే ఇందులో అడుగుపెడతారంతా. ఈ ఇల్లు ఓ పక్కకు వాలి ఉంటుంది. ఈ ఇంట్లో గోడ మీద నిలబడొచ్చు! ఇక్కడ ఉండే ఓ ప్రత్యేకమైన రాయిని ఎక్కితే ఇద్దరు వ్యక్తుల ఎత్తులు ఒకే విధంగా కనిపిస్తాయి. నిలబడిన స్థానాలను మార్చుకున్నప్పుడు ఆ తేడాను గమనించొచ్చు. ఇక్కడ నడిస్తే అడుగులన్నీ వాలుగానే పడుతాయి. ఈ విచిత్రమైన ప్రదేశాన్ని 1950లో కొందరు సర్వేయర్స్ కనుగొన్నారు. ఇక్కడ ఎలాంటి పరికరాలూ పనిచేయవు. సుమారు 300 అడుగుల డయామీటర్ సర్కిల్లో మాత్రమే ఈ వింత గోచరిస్తుంది. జీవితంలో ప్రత్యేకమైన అనుభూతి కోసం ఇక్కడికి కచ్చితంగా వెళ్లాల్సిందే అంటుంటారు పర్యాటకులు. ఈ థ్రిల్‌ని ఎంజాయ్ చెయ్యడానికి ఇక్కడికి ఎగబడుతుంటారు ఔత్సాహికులు. ఈ స్పాట్.. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు తెరచి ఉంటుందట. అయితే ఇక్కడ గురుత్వాకర్షణ శక్తి (గ్రావిటీ) ఎందుకు సాధారణంగా లేదు? అనేదానికి కారణాన్ని ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు. దాంతో ఈ ప్రదేశం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. సంహిత నిమ్మన (చదవండి: బ్రిటీష్ కాలం నాటిది, ప్రపంచంలోనే ఖరీధైన స్టాంపు.. ధర ఎంతంటే..) -
గ్రావిటీ హోల్లో భూ ఆవిర్భావ నమూనా?
నేటికీ భూమి మూలం ఏమిటనేది శాస్త్రవేత్తలకు సైతం అంతుచిక్కని ప్రశ్నగా మిగిలింది. భూమి చరిత్ర ఏమిటి? అది ఎలా పుట్టింది? దీనిపై జీవం ఎలా మొదలైంది?.. ఇలాంటి కొన్ని ప్రశ్నలకు ఖచ్చితమైన సమాధానాలు ఇప్పటి వరకు వెల్లడికాలేదు. అయితే ఇప్పుడు గ్రావిటీ హోల్ దీనికి సరైన సమాధానం చెప్పనున్నది. దీని సాయంతో శాస్త్రవేత్తలు భూమి ఆవిర్భావానికి గల కారణాలను తెలుసుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. పరిశోధనలో ఏమి తేలింది? ఇటీవల బెంగుళూరులోని సెంటర్ ఫర్ ఎర్త్ సైన్సెస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ సంయుక్తంగా ఒక పరిశోధనను నిర్వహించాయి. హిందూ మహాసముద్రంలో గ్రావిటీ హోల్ ఉందన్న విషయాన్ని వారు గుర్తించారు. ఈ గురుత్వాకర్షణ కేంద్రం ఒక పురాతన సముద్ర అవశేషం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. లక్షల సంవత్సరాల క్రితమే ఈ సముద్రం భూమి నుండి కనుమరుగైంది. ఈ పరిశోధన భూ ఆవిర్భావ రహస్యాల పొరలను తెరిచింది. దీని సాయంతో రానున్న కాలంలో వీటి ఆధారంగా భూమి మూలానికి సంబంధించిన పలు విషయాలు తెలుసుకోగలమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. గురుత్వాకర్షణ రంధ్రం ఎంత లోతున ఉంది? పరిశోధకులు ఈ గురుత్వాకర్షణ రంధ్రంనకు ఐఓజీఎల్ అనే పేరు పెట్టారు. ఇది హిందూ మహాసముద్రంలో సుమారు రెండు మిలియన్ చదరపు మైళ్ల మేరకు విస్తరించి ఉంది. ఇక దీనిలోతు విషయానికి వస్తే ఇది భూమి క్రస్ట్ కింద 600 మైళ్లకు మించిన లోతున ఉంది. ఈ ఐఓజీఎల్ ఏనాడో అదృశ్యమైన టెథిస్ మహాసముద్రంలోని ఒక భాగమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం ఇది భూమి లోతుల్లో మునిగిపోయివుంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాగా గోండ్వానా, లారాసియా ఖండాలను టెథిస్ మహాసముద్రం వేరుచేసిందని కూడా శాస్త్రవేత్తలు చెబుతుంటారు. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం.. శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం ఈ గురుత్వాకర్షణ రంధ్రం సుమారు రెండు కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడి ఉంటుందని, ఇది రాబోయే కొన్ని మిలియన్ సంవత్సరాల వరకు అలాగే ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలా జరగడం వెనుక గురుత్వాకర్షణ శక్తి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమి విపరీతమైన గురుత్వాకర్షణ శక్తి గుండా వెళుతున్నప్పుడు ఈ గ్రావిటీ హోల్ ఏర్పడివుంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ గురుత్వాకర్షణ రంధ్రంపై జరిగిన పరిశోధన వివరాలు జియోఫిజికల్ రీసెర్చ్ లెటర్స్‌లో ప్రచురితమయ్యాయి. ఇది కూడా చదవండి: ‘స్మైలింగ్ డెత్’ అంటే ఏమిటి? చనిపోయే ముందు ఎందుకు నవ్వుతుంటారు? -
చందమామపై బాంబులు వేశారు.. ఎందుకంటే..
చిన్నప్పుడు గోరుముద్దలు తిన్నప్పటి నుంచి పెద్దయ్యాక వెన్నెలలో ఎంజాయ్ చేసేదాకా.. చందమామ అంటే ఎప్పుడూ ఆసక్తే. ఇప్పటికే మనిషి చంద్రుడిపై అడుగుపెట్టాడు. అక్కడ ఇండ్లు కట్టుకుని ఉండిపోయే ప్రయత్నాలూ జరుగుతున్నాయి. మరి అలాంటి చందమామపై బాంబులు పేలాయి తెలుసా? అదీ ఒకటీ రెండు సార్లు కాదు చాలా సార్లు. మరి ఎవరు బాంబులు వేశారు? ఎందుకు వేశారు? బాంబులు వేస్తే ఏం జరిగింది? బాంబులు వేయడమే కాకుండా ఇంకా ఏమేం చేశారు? అనే వివరాలు తెలుసుకుందామా? చంద్రుడిపై అడుగుపెట్టి 52 ఏళ్లు చందమామపై మనిషి అడుగుపెట్టి దాదాపు 52 ఏళ్లు అవుతోంది. 1969 జూలై 11న అమెరికన్ వ్యోమగామి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రుడిపై తొలి అడుగు వేశాడు. అమెరికా నిర్వహించిన అపోలో ప్రయోగాలతో మొత్తంగా 24 మంది చందమామపైకి వెళ్లారు. చివరిగా 1972 డిసెంబర్ 19న చంద్రుడిపై గడిపారు. ఇలా వెళ్లిన వ్యోమగాములు చంద్రుడిపై పలు రకాల పరిశోధనలు చేశారు. అక్కడి భూమి, వాతావరణం, గురుత్వాకర్షణ శక్తి, ఇతర అంశాలపై ప్రయోగాలు నిర్వహించారు. చంద్రుడి మట్టి, రాళ్లను భూమిపైకి తీసుకువచ్చారు. గోల్ఫ్ ఆడి.. ఎగిరి దుమికి.. చంద్రుడిపై వ్యోమగాములు ఏమేం చేశారో తెలుసా? అక్కడగోల్ఫ్ ఆడారు. ప్రఖ్యాత ‘హ్యామర్ అండ్ ఫెదర్ (పక్షి ఈకను, ఒక సుత్తి ని ఒకే ఎత్తు నుంచి వదిలి ఏది ముందు కింద పడుతుందో పరిశీలించడం)’ ప్రయోగాన్నీ చేశారు. గాల్లోకి ఎగిరి దూకారు. ఇవన్నీ ఎందుకో తెలుసా? చంద్రుడిౖ గురుత్వాకర్షణ (గ్రావిటీ)ని పరీక్షించడానికి. ఇక రోవర్‌ను నడుపుకొంటూ తిరగడం, అక్కడి ఉపరితలంతోపాటు భూమిని, నక్షత్రాలను ఫొటోలు తీయడం వంటివీ చేశారు. వీటన్నింటితోపాటు చేసిన మరో పరీక్షే బాంబులు వేయడం. అదెందుకో చూద్దామా.. గ్రనేడ్లు, మోర్టార్లతో.. అమెరికా చేసిన అపోలో 14, అపోలో 16 ప్రయోగాల్లో చంద్రుడిపైకి గ్రెనేడ్లు, మోర్టార్లు పంపారు. చంద్రుడిపై వ్యోమగాములు దిగిన ప్రదేశం నుంచి ఒకసారి కిలోమీటర్ దూరంలో, మరోసారి 3.5 కిలోమీటర్ల దూరంలో వాటిని పేల్చారు. రోవర్‌ను నడుపుకొంటూ వెళ్లి వాటిని అమర్చారు. ఇదంతా చంద్రుడి నేల నిర్మాణాన్ని పరిశీలించేందుకు చేపట్టిన ‘యాక్టివ్ సిస్మిక్ ఎక్స్పెరిమెంట్’లో భాగమే. బాంబులు పేలిన తర్వాత అక్కడి నేలలో ఏర్పడిన ప్రకంపనలను ప్రత్యేక పరికరాలతో నమోదు చేశారు. తర్వాత నాసా శాస్త్రవేత్తలు ఆ డేటాను విశ్లేషించి చంద్రుడి ఉపరితలం నిర్మాణాన్ని అంచనా వేశారు. ప్రయోగాల్లో తేలింది ఏమిటి? సాధారణంగా భూమిలో ఏర్పడిన ప్రకంపనలతో ప్రత్యేకమైన తరంగాలు (సిస్మిక్ వేవ్స్) ఏర్పడి.. నేల పొరల ద్వారా ప్రయాణిస్తాయి. ఈ తరంగాలు ఘన, ద్రవ పదార్థాలు, వివిధ మూలకాల ద్వారా వెళ్లేటప్పుడు వాటి వేగం, తీవ్రతలో మార్పులు వస్తాయి. శాస్త్రవేత్తలు దీనిని విశ్లేషించి నేల పొరల్లో ఏముంది, ఎలా ఉన్నాయన్నది గుర్తిస్తారు. ► భూమ్మీద సహజంగానే భూకంపాలు వస్తుంటాయి కాబట్టి.. శాస్త్రవేత్తలు సులువుగానే విశ్లేషిస్తారు. అదే చంద్రుడి నేల స్థిరంగా ఉండటంతో ప్రకంపనలు అతి తక్కువ. అందువల్ల బాంబులతో ప్రకంపనలు సృష్టించి, పరిశీలించారు. ► బాంబులు పేల్చిన ప్రాంతంలో 1.4 కిలోమీటర్ల మందంతో బసాల్ట్ (భూమిపై ఉండే తరహాలో మట్టి, రాళ్లతో కూడిన) పొర ఉన్నట్టు గుర్తించారు. చంద్రుడి నేల లోపల చాలా వరకు పగుళ్లు ఉన్నట్టు తేల్చారు. చంద్రుడిపై పడిన పెద్ద పెద్ద ఉల్కలే దీనికి కారణమని అంచనా వేశారు. ఆ బాంబులు ఇప్పటికీ అక్కడే.. అపోలో 14 మిషన్‌లో 22 గ్రనేడ్లు, ఒక మోర్టార్ తీసుకెళ్లారు. అందులో 13 గ్రనేడ్లు మాత్రమే పేలాయి. అపోలో 16 మిషన్‌లో మరో 22 గ్రనేడ్లు, 4 మోర్టార్లు తీసుకెళ్లారు. ఇందులో 19 గ్రనేడ్లు, 3 మోర్టార్లు పేలాయి. రెండుసార్లు కలిపి 12 గ్రనేడ్లు, రెండు మోర్టార్లు అలాగే చంద్రుడిపై పడి ఉన్నాయి. వీటన్నింటిలో ‘హెక్సానైట్రోస్టిల్బేన్’ అనే పేలుడు పదార్థం ఉంది. దానికి ఎక్కువ వేడిని తట్టుకునే శక్తి ఉండటంతో.. ఇప్పటికీ గ్రనేడ్లు, బాంబులు చంద్రుడిపై అలాగే ఉండి ఉంటాయని భావిస్తున్నారు. రెండు దేశాలు.. ఏడు జెండాలు చందమామపై రెండు దేశాల జెండాలు మాత్రమే ఉన్నాయి. ఆరు మిషన్లలో వేర్వేరు చోట్ల దిగిన అమెరికా వ్యోమగాములు ప్రతిసారి తమ దేశ జెండా ఒకదానిని పాతారు. తర్వాత చైనా తమ జెండాను చంద్రుడిపై పాతింది. అయితే చైనా వ్యోమగాములెవరూ చంద్రుడిపై దిగలేదు. కానీ రోవర్ ద్వారా పంపిన జెండాను పెట్టారు. ఇప్పటివరకు ఆరు ప్రయోగాల్లో చంద్రుడిపై మనుషులు దిగారు. అవన్నీ అమెరికా నిర్వహించిన అపోలో సిరీస్ మిషన్లే. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
‘ఆ ఆర్టికల్’ గురించి పాలకులకు తెలుసా ?
సాక్షి, న్యూఢిల్లీ : ‘గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ఎవరు కనుగొన్నారు?’ అన్న ప్రశ్నకు ‘ప్రముఖ గణిత శాస్త్రవేత్త ఇసాక్ న్యూటన్’ అని ఎవరైనా టక్కున సమాధానం చెప్పారంటే మన కేంద్ర మానవ వనరుల అభివద్ధి శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్‌కు కోపం వస్తుంది. ఎందుకంటే ఆయన దృష్టిలో న్యూటన్ కన్నా ముందే మన పురాణాల్లో గురుత్వాకర్షణ సిద్ధాంత ప్రస్తావన ఉంది. ఆరెస్సెస్ అనుబంధ సంస్థ ‘శిక్షా సంస్కృతి ఉత్తాన్ న్యాస్’ శనివారం ఏర్పాటు చేసిన ‘జ్ఞానోత్సవ్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. ఇలా మాట్లాడడం ఆయనకు కొత్త కాదు. ‘మన రాశి ఫలాల శాస్త్రం ముందు సైన్స్ ఎప్పుడూ పిగ్మీ’నే అని చెప్పడమే కాకుండా మన పూర్వికులు ఎప్పుడో అణు పరీక్షలు నిర్వహించారంటూ గత లోక్‌సభ వేదిక సాక్షిగా వాదించారు. అందుకేనేమో ఆయనకు ఈసారి కేంద్ర మంత్రిగా పదోన్నది వచ్చింది. అలా అని ఆయన్ని ఒక్కరినే తప్పుపట్టడం భావ్యం కాదు. చాలా మంది బీజేపీ నాయకులకు ఇలా మాట్లాడే అలవాటుంది. ఉత్తరప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి దినేశ్ శర్మ గతేడాది ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ‘టెస్ట్ ట్యూబ్ బేబీస్’ గురించి ప్రాచీన భారతీయులకు ముందే తెలుసునని, సీత పుట్టుకే అందుకు ఉదాహరణని చెప్పారు. టెలివిజన్ ప్రసారాల గురించి, విమానాల గురించి కూడా వారికి తెలుసని తెలిపారు. బీజేపీకి చెందిన మరో పార్లమెంట్ సభ్యుడు సత్యపాల్ సింగ్ ‘మానవ పరిణామక్రమం సిద్ధాంతం’ను అంగీకరించేందుకు అసలు సిద్ధంగా లేరు. ప్రాచీన రుషుల శిష్యులే నేటి మానవ జాతని పదే పదే చెబుతూ వస్తున్నారు. అంతెందుకు సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీయే, ప్రాచీన భారతీయులకు జన్యుశాస్త్రం గురించి అంతా తెలుసునని, ప్లాస్టిక్ సర్జరీ కూడా అప్పటికే ఉందని, అందుకు వినాయకుడికి ఏనుగు తలను అతికించడమే సాక్ష్యమని చెప్పారు. అసలు ఆత్మసాక్షిగా ఈ విషయాలను నమ్మి మాట్లాడుతారా? అవసరం కోసం మాట్లాడుతారా? అన్నది వారికే తెలియాలి. అసలు ఇంత అసంబద్ధంగా మాట్లాడే వారిని జనం ఎలా భరిస్తారబ్బా? అని అప్పుడప్పుడు అనిపిస్తుంది. జనంలో అక్షరాస్యత పెరగకపోవడం, ముఖ్యంగా శాస్త్రవిజ్ఞాన దృక్పథం లేక అజ్ఞానంలో బతుకుతుండటం వల్ల భరిస్తుండవచ్చు. కానీ భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో భాగమైన ‘ఆర్టికల్ 51ఏ’ ప్రకారం ప్రతి భారతీయ పౌరుడు శాస్త్రవిజ్ఞాన దృక్పథాన్ని అలవర్చుకోవాలని, అందుకు పాలకులు కృషి చేయాలని రాజ్యాంగ నిర్మాతలు నిర్దేశించారు. ఆ తర్వాత 2010లో కేంద్రం తీసుకొచ్చిన ‘విద్యా ప్రాథమిక హక్కు’ చట్టంలో ప్రతి విద్యార్థికి శాస్త్ర విజ్ఞాన దక్పథం ఉండాలన్న విషయాన్ని పొందుపర్చారు. దేశంలో అనాదిగా వస్తోన్న ‘బహిర్భూమి’ అనాచారం వల్ల ఏటా లక్షలాది మంది ప్రజలు అంటురోగాలకు గురై మరణిస్తున్నారని, దేశంలో మరుగుదొడ్ల నిర్మాణాన్ని ప్రోత్సహించాలంటూ ప్రభుత్వ విధాన నిర్ణేతలు చెప్పడం కూడా శాస్త్రవిజ్ఞాన దృక్పథమే. ఆ దిక్కుగా మరుగు దొడ్ల నిర్మాణానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిందీ, ఇస్తున్నది కూడా మన ప్రధాని నరేంద్ర మోదీనే. దేశంలో విద్యాభివద్ధి కోసం కొత్త విద్యా విధానాన్ని రూపొందించాలని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దాన్ని నిర్వహించాల్సిన బాధ్యత కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖదే. ఆ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న పోఖ్రియాల్ కొత్త విద్యా విధానాన్ని ఎలా రూపొందిస్తారన్నది అంతుచిక్కని ప్రశ్నే. అసలు కొత్త విద్యా విధానం రూపకల్పన కసరత్తులో భాగంగా నిర్వహించిన ‘జ్ఞానోత్సవ్’లోనే గురుత్వాకర్షణ శక్తి గురించి మాట్లాడారు. చంద్రుడి ఉపరితలాన్ని స్పర్శించి ప్రయోగాలు నిర్వహించేందుకు ‘చంద్రయాన్–2’ను పంపించిన భారత్‌లో ఇలాంటి పాలకులు ఉండడం ఆశ్చర్యమే. రాజ్యాంగానికి బద్ధులై ఉంటామని ప్రమాణ స్వీకారం చేసినందున పోఖ్రియాల్ సహా పాలకులంతా ‘ఆర్టికల్ 51 ఏ’ను గౌరవించాల్సిందే. -
గ్రావిటీ కాల్వ రెడీ!
కాళేశ్వరం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులోని నీటిని తరలించే అతి ముఖ్యమైన గ్రావిటీ కాల్వ నిర్మాణం పూర్తయింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కన్నెపల్లి పంపుహౌస్ నుంచి అడవి మార్గంలో 13.341 కిలోమీటర్ల దూరం రూ.800 కోట్ల వ్యయంతో నిర్మించిన గ్రావిటీ కాల్వ ద్వారా ఈ ఖరీఫ్ నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని తరలించనున్నారు. ఈ గ్రావిటీ కాల్వ నిర్మాణాన్ని 30 స్ట్రక్చర్లతో అత్యాధునిక టెక్నాలజీని వినియోగించి అతి తక్కువ సమయంలో పూర్తి చేశారు. వచ్చే నెల నుంచి రాష్ట్రంలోని 37లక్షల ఎకరాలకు ఈ కాల్వ ద్వారా సాగునీరు సరఫరా కానుంది. భవిష్యత్‌లో 3 టీఎంసీల సాగునీరు తరలించేలా కాల్వ నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం కన్నెపల్లి పంపుహౌస్‌లో 7 మోటార్ల బిగింపు పూర్తి కాగా మరో 2 నిర్మాణ దశలో, మరో రెండు పురోగతిలో ఉన్నాయి. అనతి కాలంలోనే పనులు పూర్తి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి 2016, మే 2న ముఖ్యమంత్రి కేసీఆర్ భూమి పూజ చేయగా.. అనతి కాలంలోనే పనులన్నీ పూర్తి చేసి నీటిని తరలించడానికి సిద్ధం చేశారు. కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత జలాలను వినియోగించి రాష్ట్రంలోని 37 లక్షల ఎకరాలకు సాగు నీరందించడానికి ఈ ప్రాజెక్టును రూపకల్పన చేయగా అటవీ, పర్యావరణ శాఖ అనుమతులకు సంబంధించి అడ్డంకులు త్వరగా తొలగిపోవడంతో గ్రావిటీ కెనాల్ (కాల్వ) పనులు పూర్తయ్యాయి. మేడిగడ్డ బ్యారేజీ వద్ద గోదావరికి అడ్డుకట్ట వేసి నిలిపిన నీటిని అప్రోచ్ కెనాల్ ద్వారా కన్నెపల్లి పంప్‌హౌస్‌లో అమర్చిన 11 మోటార్ల సాయంతో రివర్స్ పంపింగ్ ద్వారా తరలించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. పంప్‌హౌస్ నుంచి 1.5 కిలోమీటర్ల దూరం పైపులైన్ పూర్తయింది. ఈనెల 4న సీఎం కేసీఆర్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన సందర్భంగా జూలై నుంచి నీటిని తరలించడానికి సమన్వయంతో పనిచేయాలని కాంట్రాక్టర్లు, ఇంజనీర్లకు మార్గనిర్దేశం చేశారు. దీంతో పనుల్లో వేగం మరింత పెరిగింది. పర్యాటక అభివృద్ధికి అడుగులు ఈ గ్రావిటీ కాల్వ పొడవునా అందమైన రిసార్ట్సు, గెస్ట్‌హౌస్‌ల నిర్మాణానికి పర్యాటక శాఖ అడుగులు వేస్తుంది. ఇప్పటికే ఓ ప్రత్యేక బృందం హైదరాబాద్ నుంచి వచ్చి పరిశీలించి ప్రణాళికలు తయారు చేసింది. త్వరలో బోటింగ్ పాయింట్స్ కూడా పెట్టనున్న ట్లు తెలిసింది. దీనికి అనుగుణంగా పర్యాటకులకు ఆ హ్లాదాన్ని అందించడానికి ప్రభుత్వం ఆలోచిస్తుంది. కాల్వ నిర్మాణం ఇలా.. కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి అన్నారం వరకు 13.341 కిలోమీటర్ల వరకు అడవిలో కాల్వ 150–250 మీటర్ల వెడల్పు.. అడుగు భాగంలో 76 మీటర్లతో నిర్మాణం చేపట్టారు. రోజుకు 2 టీఎంసీల నీటిని తరలిస్తే కాల్వలో 5.5 మీటర్ల నీరు ప్రవహిస్తుంది. అదే 3 టీఎంసీలు తరలిస్తే 7.5 మీటర్ల నీరు వెళ్లేలా కాల్వ లైనింగ్ పూర్తి చేశారు. అధునాతన పద్ధతులతో 30 స్ట్రక్చర్లు గ్రావిటీ కాల్వలో 30 స్ట్రక్చర్లు నిర్మాణం చేపట్టారు. ప్రత్యేకమైన ఏడు పద్ధతులతో దీనిని నిర్మించారు. ఇందులో డీఎల్ఆర్ వంతెనలు 4, అండర్ టన్నెల్ వంతెనలు 8, ఎకో వంతెనలు 5, సూపర్స్పాసేజ్ వంతెనలు 5, ఇన్లెట్ వంతెనలు 6, పైపులైన్ వంతెన 1, డ్రాప్స్ వంతెన ఒకటి నిర్మించారు. సూపర్ స్పాసేజ్ వంతెనల ద్వారా అడవుల నుంచి, వాగుల ద్వారా పారే కాల్వ ల నీటిని ఇతర చెరువులకు తరలిస్తారు. అండర్ టన్నెల్ వంతెనల ద్వారా కాల్వ కింద ఉన్న బెడ్ నుంచి నీటిని తరలిస్తారు. ఇన్లెట్ వంతెనల ద్వారా చిన్న వర్షాలకు వచ్చే నీటిని యథావిధిగా కాల్వ గుండా తరలిస్తారు. ఎకో వంతెనలు అడవుల్లోని వన్యప్రాణులు ఇటు నుంచి అటు తిరగడానికి వీలుగా నిర్మించారు. వాటికి అనుగుణంగా అక్కడక్కడా చెట్ల పెంపకం చేపట్టనున్నారు. కాల్వను పరిశీలించడానికి ఇరువైపుల రోడ్డు నిర్మాణం జరుగుతోంది. ఎడమ వైపు 5.5, కుడి వైపు 1.8 కిలోమీటర్లు పూర్తయింది. -
జీరో గ్రావిటీలోనూ అదరగొట్టిన బోల్ట్
-
జీరో గ్రావిటీలోనూ అదరగొట్టిన బోల్ట్
పారిస్: జమైకా చిరుత.. స్టార్ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ పరుగులు తీయడంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు. కానీ ఈ సారి నేల మీద కాదు.. జీరో గ్రావిటీ వాతావరణంలో పరుగులు తీశాడు. తనతోపాటు పోటీలో పాల్గొన్న ఫ్రెంచ్ వ్యోమగామి జీన్ ఫ్రాంకోయిస్, నోవెస్పేస్ సీఈవో ఆక్టేవ్ డి గల్లె వారితో కలిసి పరుగులు తీశాడు. ఈ పందెంలో తొలుత తడబడిన బోల్ట్ చివర్లో మాత్రం విజేతగా నిలిచాడు. జీరో స్పేస్ సాంకేతికత తెలిసిన వారిపై అదే వాతావరణంలో సరదాగా జరిగిన రేస్‌లో గెలిచి తన సత్తా చాటాడు. అయితే ఇదంత జరిగింది ఎక్కడ అనుకుంటున్నారా.. జీరో గ్రావిటీతో ప్రత్యేకంగా తయారైన ఎయిర్‌బస్ జీరో జీలో ఈ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం బోల్ట్ తన స్టైల్లో షాంపైన్ బాటిల్‌తో తన విజయాన్ని సెలబ్రెట్ చేసుకున్నాడు. అయితే ఈ బాటిల్‌ను స్పేస్ టూరిజం పెంపొందించడానికి, వ్యోమగాముల కోసం ప్రత్యేంగా తయారు చేశారు. దీనిపై బోల్ట్ మాట్లాడుతూ.. తొలుత కొద్దిగా నీరసంగా ఫీల్ అయినప్పటికీ.. తర్వాత ఈ అనుభూతి చాలా బాగా అనిపించిందని తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తన పరుగుతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న బోల్ట్.. 2017లో లండన్ వేదికగా జరిగిన ప్రపంచ అథ్లెట్ ఛాంపియన్షిప్ అనంతరం అథ్లెటిక్స్ నుంచి రిటైరయ్యాడు. -
100 రోజులే గడువు
కాళేశ్వరం (మంథని): కాళేశ్వరం బ్యారేజీ పనుల్లో భాగంగా నిర్మిస్తున్న గ్రావిటీ కాల్వ తవ్వకాలకు 100 రోజులే గడువు ఉందని, ఏప్రిల్ 30 వరకు పనులు పూర్తి చేయాలని భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఆదివారం జయశశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అన్నారం బ్యారేజీ నుంచి కన్నెపల్లి పంప్ హౌస్ వరకు నిర్మిస్తున్న గ్రావిటీ కాల్వను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన కాంట్రాక్టర్లకు పలు సూచనలు చేశారు. వీజేఆర్ కంపెనీ 100 రోజుల్లో కోటి క్యూబీక్ మీటర్లు, వెల్సా కంపెనీ 30 లక్షల క్యూబీక్ మీటర్ల మట్టి తవ్వకాలు జరుపాలని డెడ్ లైన్ ఇచ్చారు. ఏప్రిల్ 30 వరకు పూర్తి చేయాలని ఆదేశించారు. జూన్–జూలైలో కాల్వ నుంచి నీటిని తరలించాల్సి ఉందని, ప్రస్తుతం ఉన్నవి కాకుండా అదనంగా మరిన్ని యంత్రాలను తీసుకువచ్చి పనుల్లో వేగం పెంచాలని పేర్కొన్నారు. అటవీ శాఖ ద్వారా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని మంత్రి కాంట్రాక్టర్లకు హామీ ఇచ్చారు. తాను 15 రోజుల తర్వాత వచ్చి కాల్వ త్వకాలను పరిశీలిస్తానని తెలిపారు. తరువాత కన్నెపల్లి పంప్ హౌస్‌లో ఇరిగేషన్, కంపెనీలతో సమీక్ష నిర్వహించారు. అన్నారం గోదావరి తీరం వద్ద కాల్వ పనులకు అడ్డంగా ఉన్న ఇసుక క్వారీకి సంబంధించిన ఇసుక కుప్పలను మిషన్ల సాయంతో తొలగించాలని అధికారులకు ఆదేశించారు. ఆయన వెంట మంథని ఎమ్మెల్యే పుట్ట మ««ధు, నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్కే.జోషి, ఈఎన్సీ మురళీధర్‌రావు, డీఎఫ్ఓ రవికిరణ్, ఎస్ఈ సుధాకర్‌రెడ్డి, ఈఈ రమణారెడ్డి, డీఈఈ ప్రకాశ్, మెగా కంపెనీ డైరెక్టర్ కృష్ణరెడ్డి, సీజీఎం వేణు, పీఎం వినోద్, ఎఫ్డీఓ వజ్రారెడ్డి, రేంజర్ రమేష్, డీఎస్పీ కేఆర్కే.ప్రసాదరావు, ఎస్సై శ్రీనివాస్ ఉన్నారు. రెండు గంటల పాటు కాల్వ వెంటే... తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుస్తున్న కాళేశ్వరం బ్యారేజీ ప్రాజెక్టు పనులపై భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు ప్రత్యేక దృష్టి సారించారు. గత 45 రోజులుగా గ్రావిటీ కాల్వ తవ్వకాల పనులు నడుస్తున్న నేపథ్యంలో మంత్రి రెండోసారి కాల్వ బాటపట్టారు. మంత్రి గత నెల 26న పర్యటించిన విషయం తెలిసిందే.. తాజాగా ఆదివారం దాదాపు రెండు గంటల పాటు కాల్వ వెంట అడవిలోనే ప్రయాణించి తవ్వకాలను పరిశీలించారు. అడవిలో మొత్తం 13.2 కిలోమీటర్లు దూరం 330 హెక్లార్ల అడవిలో మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం 9.50 కిలోమీటర్ల తవ్వకాలు పూర్తయ్యాయి. -
కాలుష్యం మారింది..‘కాలింక్’గా!
సాక్షి నాలెడ్జ్ సెంటర్: కాలుష్య సమస్యకు బెంగళూరుకు చెందిన ముగ్గురు యువకులు పరిష్కారాన్ని కొనుగొన్నారు. కాలుష్యాన్ని ఎలాగూ అరికట్టలేకపోతున్నాం.. అలాంటప్పుడు దానిని రోజూ ఉపయోగించే వస్తువుగా మార్చేస్తే ఎలా ఉంటుందన్న వారి ఆలోచన నుంచి పుట్టిందే ‘కాలింక్’.. ఇదేదో కొత్తగా ఉందనుకుంటున్నారా? అవును ఇది సరికొత్త ఆవిష్కరణే.. వాహనాలు, పరిశ్రమలు వెదజల్లే కాలుష్యాన్ని అనిరుధ్ శర్మ, నిఖిల్ కౌషిక్, నితేష్ కధ్యాన్లు ‘చిక్కనైన నల్లటి సిరా’గా మార్చివేసి అందరికీ అందుబాటులోకి తెచ్చారు. ఫ్యాక్టరీల చిమ్నీలు, జనరేటర్లు, కార్ల ఎగ్జాస్ట్ పైపుల నుంచి వెలువడే కర్బన ఉద్గారాల్ని, మసిని సేకరించి అనంతరం శుద్ధీకరణ ప్రక్రియ ద్వారా ఇంక్ రూపంలోకి మారుస్తున్నారు. ఈ చిక్కటి ఇంక్ ప్రింటర్ల కాట్రిడ్జ్‌లు, స్క్రీన్ ప్రింటింగ్, చిత్రకళకు కాలిగ్రాఫి పెన్లు, వైట్‌బోర్డు మార్కర్ల తయారీలో ఉపయోగిస్తున్నారు. 2016 జూన్‌లో బెంగళూరులో నెలకొల్పిన ‘గ్రావికీ లాబ్స్’ ద్వారా ఈ ఇంక్ తయారీని కొనసాగిస్తున్నారు. పారిశ్రామిక, ఇతర కాలుష్య వ్యర్థాల్ని శుద్ధిచేసి వర్ణ ద్రవ్యాలుగా, సిరాగా మార్చడంతో పాటు వివిధదేశాల్లో ప్రాచుర్యం కల్పించేందుకు వారు కృషి చేస్తున్నారు. ఈ సంస్థ చేపడుతున్న ప్రాజెక్టులో భాగంగా న్యూఢిల్లీలోని రోడ్లకు ఈ ఇంక్‌ను ప్రయోగాత్మకంగా ఉపయోగించబోతున్నారు.ఈ ప్రక్రియలో ఉత్పత్తయ్యే వ్యర్థాల్ని కూడా వేస్ట్ మేనేజ్మెంట్ కంపెనీలు రీసైకిల్ చేయడం విశేషం. విదేశాల్లోను ఎయిర్ ఇంక్‌కు ప్రాచుర్యం ప్రస్తుతానికి వీధులు, కూడళ్లలో గోడలపై చిత్రాలు గీసే కళాకారులు, డిజైనర్లకు ఈ ఎయిర్ ఇంక్ ఎక్కువగా ఉపయోగపడుతోంది. విదేశాలతో సహా మన దేశంలోనూ గోడ, వీధి చిత్రాలకు పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా ఈ ఇంక్‌ను మరింత ప్రాచుర్యంలోకి తీసుకొచ్చేందుకు అనిరుధ్ అండ్ కో ప్రయత్నిస్తోంది. కళారంగం ద్వారానే ఈ ఇంక్‌కు మరింత ప్రచారం తీసుకురావాలని భావిస్తున్నారు. 45 నిమిషాల కాలుష్యంతో 30 మి.లీ. ఇంక్ ఎయిర్ ఇంక్‌కు 2013లో అనిరు«ధ్శర్మ పెట్టినపేరు కాలింక్. వాతావరణంలోకి కాలుష్యం చేరకముందే దాన్ని ఎలా బంధించాలన్న అన్న ఆలోచన నుంచి వచ్చిందే కాలింక్ ప్రయోగం.తర్వాత అనిరుధ్, కౌషిక్‌లు కలిసి ‘సిలిండ్రికల్ మెటల్ కాంట్రాప్షన్’ను రూపొందించారు. వాటిని కార్ల పొగ గొట్టాలకు, పారిశ్రామిక చిమ్నీలకు ఏర్పాటుచేసి కాలుష్య రూపంలో ఉన్న ముడిపదార్థాన్ని సేకరించారు. 45 నిమిషాలు వెలువడే కాలుష్యంతో ఒక ఎయిర్ ఇంక్‌లో పట్టే 30 మిల్లీలీటర్ల ఇంక్‌ను తయారు చేయవచ్చని గుర్తించారు. కిక్ స్టార్టర్ అనే వెబ్సైట్ ద్వారా ప్రచారాన్ని ప్రారంభించి ఎయిర్ ఇంక్ ఉత్పత్తికోసం పదిరోజుల్లో 14 వేల డాలర్ల(రూ.9 లక్షలు)కు పైగా సేకరించారు. ప్రస్తుతం దేశంలోని వివిధ రాష్ట్రాలతో సహా, ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన సంస్థలకు పెద్దమొత్తంలో కాలింక్ను సరఫరా చేసే విషయంపై చర్చలు జరుపుతున్నట్లు కౌషిక్ చెప్పారు. పలువురు భారతీయ చిత్రకారులతో కూడా కలిసి పనిచేసే ఆలోచన ఉందని తెలిపారు. గ్రావికీ ఆన్లైన్ స్టోర్స్ ద్వారా త్వరలో ఇంక్‌ను విక్రయించే ఏర్పాట్లు చేస్తున్నారు. మిగతా వాటి కంటే ఎయిర్ ఇంక్ మార్కర్ల మన్నిక ఎక్కువని, ఇందులో వేరే రంగుల్ని జతచేసుకోవచ్చని కౌషిక్ చెప్పారు. -
2022లో అంగారకుడిపైకి మానవుడు
మెక్సికో సిటీ: అంగారక గ్రహం(మార్స్)పై మానవ నివాసయోగ్య పరిస్థితులు ఉన్నాయా, లేవా ? అన్న అంశంపై ఓ పక్క శాస్త్రవేత్తలు పరిశోధనలు కొనసాగిస్తుండగానే సాధ్యమైనంత త్వరగా అక్కడ మానవ కాలనీని నిర్మించాలనే వ్యూహంతో టెక్ బిలియనీర్, స్సేస్ ఎక్స్ వ్యవస్థాపకులు ఎలాన్ మస్క్ వేగంగా దూసుకుపోతున్నారు. గ్రహాంతర రవాణా వ్యవస్థ (ఇంటర్ ప్లానెటరీ ట్రాన్స్‌పోర్టు సిస్టమ్) కింద తాము రూపొందిస్తున్న రాకెట్లు మానవులను అంగారక గ్రహానికి తీసుకెళతాయని ఆయన చెప్పారు. మానవుల తొలిబ్యాచ్‌ను తీసుకొని తమ రాకెట్ భూమి నుంచి 2022లో బయల్దేరుతుందని ఆయన మెక్సికోలో జరిగిన 67వ ఆస్ట్రోనాటికల్ కాంగ్రెస్‌లో తెలియజేశారు. భూమి నుంచి అంగారక గ్రహానికి వెళ్లడానికి ప్రస్తుత అంచనాల ప్రకారం 80 రోజులు పడుతుందని, ఈ 80రోజుల ప్రయాణం బోరు కొట్టకుండా ఉండేందుకు గురుత్వాకర్షణలేని ఆటలు ఆడేందుకు, ఇష్టమైన సినిమాలు చూసేందుకు, వీనుల విందైన సంగీతం వినేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని మస్క్ తెలిపారు. అలా ఓ పది లక్షల మందిని అక్కడికి తీసుకెళ్లాలన్నది తమ లక్ష్యమని ఆయన చెప్పారు. ప్రస్తుత అంచనాల ప్రకారం మానవులను అంగారక గ్రహానికి తీసుకెళ్లి అక్కడ నివాసాన్ని కల్పించేందుకు ఒక్కొక్కరికి దాదాపు వెయ్యి కోట్ల డాలర్లు ఖర్చు అవుతుందని, ఈ ఖర్చును భారీగా తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. ఒకసారి ప్రయోగించిన రాకెట్‌ను, అది తీసుకెళ్లిన ఉపగ్రహాన్ని పదే పదే ఉపయోగించేందుకు వీలుగా తయారు చేయడం వల్ల ఖర్చును తగ్గించవచ్చని, భవిష్యత్తులో జరిగే శాస్త్రవిజ్ఞాన పురోభివృద్ధి వల్ల కూడా సహజంగానే కొంత ఖర్చు తగ్గవచ్చని ఆయన చెప్పారు. ఎంత తగ్గినా యాభై లక్షల డాలర్లకన్నా తగ్గక పోవచ్చని కూడా ఆయన అన్నారు. మానవ అంతరిక్ష నౌకను తీసుకెళ్లే రాకెట్‌ను తాము పటిష్టంగా రూపొందిస్తున్నామని, అపోలో అపరేషన్ ద్వారా చంద్రుడిపైకి మానవులను తీసుకెళ్లిన నాసా శాటర్న్ వీ రాకెట్‌కన్నా నాలుగు రెట్లు శక్తివంతమైన ఇంజన్లను ఇందులో ఉంటాయని తెలిపారు. ఒకటి పనిచేయకపోతే మరోటి పనిచేసేలా రాకెట్లో పలు ఇంజన్లను ఏర్పాటు చేస్తున్నామని ఆయన చెప్పారు. మానవ నౌకను తీసుకెళ్లే రాకెట్ పొడవు దాదాపు 400 అడుగులు, వెడల్పు 39 అడుగులు ఉంటుందని మస్క్ తెలిపారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అంగారక గ్రహానికి వెళ్లే మొదటి బ్యాచ్ మనుషులు ప్రాణాలు త్యజించడానికి సిద్ధంగా ఉండాలని ఆయన ఎన్నారు. మొదటి బ్యాచ్‌లో తమరు వెళతారా ? అన్న ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ వెళ్లాలనే ఉద్దేశం ఏమీ లేదని, తమ కంపెనీ పురోభివృద్ధి కోసం ఎల్లప్పుడు కృషిచేసే వ్యక్తి ఎవరైనా ఇలాంటి సాహసం చేయకపోవచ్చని అన్నారు. చంద్రుడిపై సగం రోజులు చీకటిగా ఉండడం, అక్కడ మానవ నివాసిత వాతావరణం లేకపోవడం వల్ల తాను చంద్రుడిపైకి వెళ్లే ప్రయోగానికి విముఖత చూపానని, అంగారక గ్రహంపై కావాల్సినంత సౌరశక్తి కూడా ఉంటుందని, మిథేన్, ఆక్సిజన్ గ్యాస్ ద్వారా అక్కడ మొక్కలు పెంచేందుకు కూడా అవకాశం ఉందని ఆయన వివరించారు. మరో 40 నుంచి 100 ఏళ్ల కాలంలో అంగారకుడిపై మానవ నివాస ప్రాంతాలు ఏర్పడుతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. -
కంపెనీ సీఈవోకు ఉద్యోగుల గిఫ్ట్!
-
కంపెనీ సీఈవోకు ఉద్యోగుల గిఫ్ట్!
ఏ కంపెనీలోనైనా ఉద్యోగులకు యాజమాన్యం జీతాలు పెంచే పద్ధతి చూస్తాం. ఓ కంపెనీ సీఈవో మాత్రం తన ఉద్యోగులకు స్వంత జీతంలో కొంత భాగాన్ని ఉద్యోగులకు జీతం పెంచేందుకు వెచ్చించాడు. దాంతో సీఈవో తమపై చూపిస్తున్న అభిమానానికి ఉద్యోగులు ఫిదా అయిపోయారు. తమను ఉద్యోగులుగా కాక స్వంత మనుషులుగా గుర్తిస్తున్న సీఈవోను సైతం సంతోషపెట్టాలనుకున్నారు. అందుకే సదరు సంస్థలో పనిచేసే ఉద్యోగులు వారి జీతాలనుంచీ సేకరించిన డబ్బుతో ఆయనకిష్టమైన బహుమతిని ఇచ్చి.. సర్ ప్రైజ్ చేశారు. తన కంపెనీలో పనిచేస్తున్న 120 మంది ఉద్యోగులకు ఒక్కొక్కరికి ఏడాదికి 70 వేల డాలర్ల జీతాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్న గ్రేవిటీ కంపెనీ సీఈవో డాన్ ప్రైస్ పై ఉద్యోగులూ ప్రత్యేకాభిమానం ప్రదర్శించారు. తమ జీతాల్లో కొంత డబ్బు సేకరించి ఆయనకిష్టమైన, అత్యంత ఖరీదైన టెల్సా కారును కొని, బహుమతిగా ఇచ్చారు. ఈ అనుకోని సందర్భానికి ఆనందంలో మునిగిపోయిన సదరు సీఈవో.. తన సంతోషాన్ని ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. తనకు ఉద్యోగులు బహుమతిగా ఇచ్చిన కారు ఫోటోతో పాటు.. ఈ విషయాన్ని నేను నమ్మలేకపోతున్నానని, నిజంగా షాక్ తిన్నానని, ఇలా జరుగుతుందని కల్లో కూడా అనుకోలేదంటూ పోస్ట్ చేశాడు. గ్రేవిటీ కంపెనీ సీఈవోగా ఉన్న డాన్ ప్రైస్ వేతనం 11 లక్షల డాలర్లు. అయితే దాన్ని 70 వేలకు తగ్గించుకున్న ఆయన.. మిగిలిన మొత్తాన్ని సంస్థలోని ఉద్యోగుల వేతనాలను పెంచేందుకు వినియోగించాడు. కంపెనీలో ఉద్యోగులందరికీ కనీసం ఏడాదికి 70 వేల డాలర్లు ఉండాలంటూ ఆయన తీసుకున్న నిర్ణయం అప్పట్లో ప్రపంచం మొత్తాన్నే ఆకట్టుకుంది. అయితే ఉద్యోగుల మనసులో అంతటి స్థానాన్ని సంపాదించిన డాన్ ప్రైస్ స్వంత సోదరుడి నుంచి ఓ కేసును ఎదుర్కొంటున్నాడు. గ్రేవిటీ కంపెనీలో వాటాదారుడుగా సోదరుడు.. ప్రైస్ అత్యధిక జీతం పొందుతున్నాడని అతనిపై కేసు వేశాడు. అయితే మూడు వారాల విచారణను ఎదుర్కొన్న డాన్... సోదరుడి కేసులో ప్రతి విషయాన్నీ ఆధారాలు సమర్పిస్తూ దీటుగా ఎదుర్కొంటూ వచ్చాడు. కేసు చివరి దశలో ఉండగా సంస్థ ఉద్యోగులకు భారీగా వేతనాలను పెంచేశాడు. -
సీఈవోను సర్ప్రైజ్ చేసిన ఉద్యోగులు!
ఆయనో మంచి మనస్సున్న బాస్. తన కంపెనీలో పనిచేస్తున్న 120 మంది ఉద్యోగులకు జీతాన్ని కళ్లుతిరిగే రీతిలో పెంచి వారి జీవితాల్లో వెలుగులు నింపారు. ఒక్కొక్కరికీ ఏడాదికి కనీసం 70వేల డాలర్లకు(రూ. 46.97 లక్షలు) జీతాన్ని పెంచుతూ ఆయన అసాధారణమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. మరీ అంత మంచి బాస్‌కు తమ వంతుగా ఏదైనా చేయాలని ఉద్యోగులు భావించడం భావ్యమే కదా. అందుకే ఆయన కలను నెరవేర్చేందుకు సంకల్పించారు. తమ జీతాల్లో కొంతమొత్తాని దాచిపెట్టి అత్యంత ఖరీదైన కారు 'టెల్సా'ను ఆయనకు కానుకగా ఇచ్చారు. ఈ సర్ప్రైజ్ గిఫ్టుతో ఆనందంలో మునిగిపోయారు ఆ సీఈవో.. 'ఇది నిజంగా షాక్ లాంటిదే. దీనిని నేను నమ్మలేకపోతున్నాను. ఇలాంటిది ఒకటి జరగుతుందని నేను కలలో కూడా అనుకోలేదం'టూ ఉబ్బితబ్బిబ్బవుతున్నారు గ్రేవిటీ కంపెనీ సీఈవో డాన్ ప్రైస్. ప్రైస్ ఇటీవల తన వేతనాన్ని 11 లక్షల డాలర్ల నుంచి 70 వేల డాలర్లకు తగ్గించుకొని.. ఆ మొత్తాన్ని ఉద్యోగుల వేతనాలకు బదలాయించారు. గ్రేవిటీలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ కనీసం ఏడాదికి 70వేల డాలర్ల జీతం ఉండాలని ఆయన తీసుకున్న నిర్ణయం వ్యాపార ప్రపంచంలో విస్మయం కలిగింది. మరోవైపు గ్రేవిటీ కంపెనీలో 30శాతం వాటా కలిగిన సోదరుడి నుంచే ఆయన కేసు ఎదుర్కొంటున్నారు. గ్రేవిటీ కంపెనీ సీఈవో అయిన ప్రైస్ ఎక్కువ వేతనాన్ని పొందుతున్నాడని ప్రధాన వాటాదారుడైన ఆయన సోదరుడు కేసు వేశాడు. ఈ కేసు కొలిక్కివచ్చే దశలో ఉండటంతో గ్రేవిటీ ఉద్యోగులు ఊహించనిరీతిలో తమ బాస్ కలల కారును కానుకగా ఇచ్చి సర్ ప్రైజ్ చేశారు. -
గ్రావిటీని కాదని ఎత్తిపోతలెందుకు?
* కాళేశ్వరం ప్రతిపాదనపై అఖిలపక్ష నేతలు, ఉద్యమకారుల మండిపాటు * గజ్వేల్, సిద్దిపేట కోసం రాష్ట్ర ప్రయోజనాలను సమాధి చేశారని విమర్శ సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ మార్చి కాళేశ్వరం దగ్గర్లోని మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మించి నీటిని మళ్లించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను అఖిలపక్ష నేతలు, జలసాధన సమితి, ప్రాజెక్టు పరిరక్షణ సమితి సభ్యులు తీవ్రంగా తప్పుపట్టారు. గజ్వేల్, సిద్దిపేట నియోజకవర్గాల లబ్ధికోసం మొత్తం తెలంగాణ ప్రయోజనాలకు ప్రభుత్వం సమాధి కడుతోందని విమర్శించారు. ప్రాణహితకు అనుమతులన్నీ లభించి జాతీయ హోదా దక్కే సమయంలో డిజైన్ మార్పుతో ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.80 వేల కోట్లకు పెంచేయడం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేయడమేనని అన్నారు. ఇప్పటికే జరిగిన ఒప్పందాలను విస్మరించి కొత్తగా రాష్ట్రానికి నష్టం కలిగేలా మహారాష్ట్రతో ఒప్పందం చేసుకోవడం రాష్ట్ర ప్రయోజనాలకు తాకట్టు పెట్టడమే అని ధ్వజమెత్తారు. గురువారం ప్రాణహిత-చేవెళ్ల-కాళేశ్వరం ప్రాజెక్టు ప్రతిపాదనలపై సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో అఖిలపక్ష నేతలు, జల సాధన సమితి నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ శాసనసభా పక్షం ఉపనేత టి.జీవన్‌రెడ్డి, తెలంగాణ బచావో మిషన్ నేత యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, టీడీపీ అధికార ప్రతినిధి రాజారాం యాదవ్, జల సాధన సమితి కన్వీనర్ నైనాల గోవర్ధన్, ప్రాణహిత పరిరక్షణ సమితి కన్వీనర్ ప్రతాప్, నీటి పారుదల రంగ నిపుణుడు సారంపల్లి మల్లారెడ్డిలు ఇందులో పాల్గొన్నారు. పరీవాహక జిల్లాలకే మొదటి హక్కు : టి.జీవన్‌రెడ్డి ‘తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మిస్తే సుమారు 80 కిలోమీటర్ల మేర గ్రావిటీ ద్వారా నీటిని తరలించే అవకాశం ఉంది. దీనిపై 2012లో రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడే మహారాష్ట్రతో ఒప్పందం కుదిరింది. కానీ గత ఏడాది మహారా్రష్ట్ర గవర్నర్‌తో సీఎం కేసీఆర్ భేటీ తర్వాత కాళేశ్వరాన్ని తెరపైకి తెచ్చారు. తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టేలా నిర్ణయాలు చేశారు. నిజానికి గోదావరి పరీవాహకం ఉన్న ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాలకు గోదావరిపై మొదటి హక్కుంది. ఆ జిల్లాల అవసరాలు తీరాకే మెదక్‌కు నీటిని తరలించాలి. మెదక్ జిల్లాలో నిర్మించే రిజర్వాయర్లను ఆదిలాబాద్ జిల్లాలోనే నిర్మించాలి. అలా కాకుండా ప్రతిపక్షాలు, మేధావుల సూచనలను పక్కనపెట్టి ఇష్టారీతి నిర్ణయాలు చేస్తే చూస్తూ ఊరుకోం’. గ్రావిటీ వదిలి ఎత్తిపోతలా..: నైనాల గోవర్ధన్ ‘మహారాష్ట్రతో తాజాగా కుదుర్చుకున్న ఒప్పందంవల్ల గ్రావిటీ ద్వారా వచ్చే నీటిని రాష్ట్రం కోల్పోతుంది. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి నీటిని ఎత్తిపోయాలన్న నిర్ణయంతో అదనపు ఖర్చుతో పాటు అధిక విద్యుత్తు అవసరం. అదీగాక 152 మీటర్ల వద్ద మహారాష్ట్ర భూభాగంలో 1,852 ఎకరాలు మాత్రమే ముంపు ఉండగా, మేడిగడ్డ వద్ద 103 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మిస్తే 3,075 ఎకరాల ముంపు ఉంటుంది. మహారాష్ట్ర అంత ముంపును ఎలా అంగీకరించిందో ప్రభుత్వం చెప్పాలి’. కమీషన్ల కోసమే : యెన్నం ‘కేవలం కమీషన్ల కోసమే ప్రాజెక్టుల రీడిజైన్ అంటున్నారు. ఆ డబ్బుతోనే జీహెచ్ఎంసీ, ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో రాజకీయాలు చేశారు’. నాటకాలు ఆడుతున్నారు: రాజారాం యాదవ్ ‘అధికారం రాకముందు ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్‌రావులు ఇప్పుడు కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు కూడబెట్టుకునేందుకు నాటకాలు ఆడుతున్నారు’. -
ఇక భూమిపైనా మూన్‌వాక్ చేయొచ్చు!
న్యూయార్క్: చంద్రుడిపై కాలు మోపిన తొలి దేశం తమదేనని అమెరికా గొప్పగా చెప్పుకుంటూ ఉంటుంది. మీకు కూడా అలా చంద్రుడిపై నడిచే అవకాశం వస్తే బావుండునని ఎప్పుడైనా అనుకున్నారా.. అలాంటి ఆలోచనలు ఉన్నవాళ్ల కోరిక తీరే ప్రత్యామ్నాం ఒకటి త్వరలో అందుబాటులోకి రానుంది. చంద్రుడిపై నడిచే వారు ఎలాంటి అనుభూతికి లోనవుతారో అచ్చం అలాంటి ఫీలింగ్‌నే భూమ్మీద కూడా అందించే కొత్త రకం షూలను అమెరికాకు చెందిన ఒక కంపెనీ రూపొందించింది. వీటికి ‘20: 16 మూన్ వాకర్’ అని నామకరణం చేశారు. భూమి, చంద్రుడి మీద ఉన్న వాతావరణంలో తేడాకు ప్రధాన కారణం అక్కడ భూమ్యాకర్షణ శక్తి అత్యంత తక్కువగా ఉండటమే. అందుకే ఈ షూలలో అమర్చే ఎన్45 నియోడిమియమ్ అనే ప్రత్యేక అయస్కాంతాలు భూమి ఆకర్షణను నిరోధిస్తాయి. అప్పడు మనకు చంద్రుడిపై నడిచేవారికి ఎలాంటి అనుభవం కలుగుతుందో అలానే ఉంటుంది. ఈ అయస్కాంతాల్లో ఎన్40, 42, 45.. అనే భిన్న రకాల అయస్కాంతాలను ఉపయోగిస్తున్నారు. వీటిలో ఎన్45 అత్యంత శక్తిమంతమైనదనీ.. ధర కూడా అందుబాటులో ఉంటుందని వీటిని రూపొందిస్తున్న పాట్రిక్ జిజిరీ వెల్లడించారు. -
'గ్రావిటీ'కి ఆస్కార్ అవార్డుల పంట
లాస్ ఏంజిల్స్ : ప్రపంచ చలనచిత్ర రంగంలో అత్యున్నతంగా భావించే ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. లాస్ ఏంజెలెస్‌లోని కొడాక్ థియేటర్లో 86వ ఆస్కార్ అవార్డుల ప్రదానం జరుగుతోంది. ఈసారి 'గ్రావిటీ' అవార్డుల పంట పండింది. జార్జ్ క్లూనీ, శాండ్రా బుల్లక్ కథానాయకులుగా నటించిన ‘గ్రావిటి’ చిత్రం ఏకంగా అయిదు అవార్డులను సొంతం చేసుకుని దూసుకు పోతోంది. మరో రెండు విభాగాల్లోనూ పోటీ పడుతోంది. ఇప్పటి వరకు ఆస్కార్ అవార్డులు పొందిన వ్యక్తులు..చిత్రాలు.. ఉత్తమ నటుడు- లియోనార్డో డికాప్రియో(బ్రూస్) ఉత్తమ సహాయనటుడు- జారెడ్ లెటో (డల్లాస్ బయ్యర్స్ క్లబ్) ఉత్తమ సహాయనటి- లుపిటా యాంగో (12 ఇయర్స్ ఎ స్లేవ్) ఉత్తమ యానిమేషన్ చిత్రం- ఫ్లోజెన్ అయిదు అవార్డులను సొంతం చేసుకున్న గ్రావిటీ ఉత్తమ ఛాయాగ్రహణం చిత్రం : గ్రావిటీ ఉత్తమ సౌండ్ ఎడిటింగ్ : గ్లెన్ ఫ్రీ మాంట్లే (గ్రావిటీ) ఉత్తమ సౌండ్ మిక్సింగ్ : స్కిప్ లీవ్ సే, నివ్ ఆద్రి (గ్రావిటీ) ఉత్తమ విజువల్ ఎఫెక్ట్ : టిమ్ వెబ్బర్, క్రిస్ లారెన్స్ (గ్రావిటీ) ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్ : (గ్రావిటీ) ఉత్తమ కాస్టూమ్స్ డిజైన్ చిత్రం : ద గ్రేట్ గాట్స్ బీ ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రం : 20 ఫీట్ ఫ్రం స్టార్ డమ్ ఉత్తమ విదేశీ చిత్రం : ద గ్రేట్ బ్యూటి ఉత్తమ మేకప్, కేశాలంకరణ చిత్రం : డల్లాస్ బయ్యర్స్ క్లబ్ ఉత్తమ యానిమేటెడ్ లఘు చిత్రం : మిస్టర్ హుబ్లాట్ ఉత్తమ లైవ్ యాక్షన్ లఘు చిత్రం : హీలియం 'గ్రావిటీ’ ఇదో విజువల్ వండర్ సంచలన చిత్రాలను రూపొందించిన వార్నర్ బ్రదర్స్ సంస్థచే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబడిన భారీ అంతరిక్ష సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘గ్రావిటీ' (Gravity). జార్జ్ క్లోనీ, సాండా బుల్లోక్ వంటి ప్రముఖ స్టార్లు ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. అంతర్జాతీయ అంతరిక్షం కేంద్రం నేపధ్యంతో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ ఆల్ఫోన్సో కారోన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం కోసం ఆల్ ఫోన్సో సుమారు నాలుగున్నర సంవత్సరాలు శ్రమించారు. ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రానికి సంబంధించి వినియోగించిన టెక్నాలజీ ప్రతి ఒక్కరిని మంత్రముగ్గులను చేసింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో తలెత్తే పలు సమస్యలను ఇద్దరు వ్యోమగామలు ఎలా అధిగమించగలిగారు అనే అంశాలను దర్శకుడు అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ అనుభూతులతో చూపించటం జరిగింది. ఈ 3డీ స్పేస్ థ్రిల్లర్ మీకు ఆకాశంలో ఉన్న అనుభూతులను చేరువ చేసింది.