ఈ ప్రపంచంలో అసాధారణమైన ప్రతీది మిస్టరీనే. మనం ఏ సపోర్ట్ లేకుండా ముందుకు వాలి నిలబడగలమా? బేస్‌లేకుండా ఏ వస్తువునైనా నిలబెట్టగలమా? ఎప్పుడైనా, ఎక్కడైనా ఇద్దరు వేరువేరు పొడవులు గల వ్యక్తుల ఎత్తులు సమాంతరంగా మారతాయా? ఈ వింతలన్నీ ఒకే చోట జరుగుతాయి. అమెరికాలోని ఓ మిస్టీరియస్ స్పాట్‌లో ఒక చీపురును నిలబెడితే.. ఏ సపోర్ట్ లేకుండా నిలబడుతుంది. కుర్చీ నేలకు ఆనకుండా.. గోడకు ఆనిస్తే.. అది నిలబడే ఉంటుంది. ఆశ్చర్యంగా ఉంది కదూ!
యూఎస్‌లోని మిషిగన్, సెయింట్ ఇగ్నస్ ప్రాంతంలో.. ‘ది ఒరెగాన్ వోర్టెక్స్’ అనే పర్యాటక కేంద్రాన్ని సందర్శిస్తే ఈ వింతలన్నిటినీ చూడొచ్చు. ఇక్కడున్న ‘ద హౌస్ ఆఫ్ మిస్టరీ’ అనే ఇంట్లోకి వెళ్తుంటే కళ్లు చెదరడం పక్కా! తూలుతూ, ఊగుతూనే ఇందులో అడుగుపెడతారంతా. ఈ ఇల్లు ఓ పక్కకు వాలి ఉంటుంది. ఈ ఇంట్లో గోడ మీద నిలబడొచ్చు! ఇక్కడ ఉండే ఓ ప్రత్యేకమైన రాయిని ఎక్కితే ఇద్దరు వ్యక్తుల ఎత్తులు ఒకే విధంగా కనిపిస్తాయి. నిలబడిన స్థానాలను మార్చుకున్నప్పుడు ఆ తేడాను గమనించొచ్చు. ఇక్కడ నడిస్తే అడుగులన్నీ వాలుగానే పడుతాయి.
ఈ విచిత్రమైన ప్రదేశాన్ని 1950లో కొందరు సర్వేయర్స్ కనుగొన్నారు. ఇక్కడ ఎలాంటి పరికరాలూ పనిచేయవు. సుమారు 300 అడుగుల డయామీటర్ సర్కిల్‌లో మాత్రమే ఈ వింత గోచరిస్తుంది. జీవితంలో ప్రత్యేకమైన అనుభూతి కోసం ఇక్కడికి కచ్చితంగా వెళ్లాల్సిందే అంటుంటారు పర్యాటకులు. ఈ థ్రిల్‌ని ఎంజాయ్ చెయ్యడానికి ఇక్కడికి ఎగబడుతుంటారు ఔత్సాహికులు. ఈ స్పాట్.. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు తెరచి ఉంటుందట. అయితే ఇక్కడ గురుత్వాకర్షణ శక్తి (గ్రావిటీ) ఎందుకు సాధారణంగా లేదు? అనేదానికి కారణాన్ని ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు. దాంతో ఈ ప్రదేశం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది.
సంహిత నిమ్మన
(చదవండి: బ్రిటీష్ కాలం నాటిది, ప్రపంచంలోనే ఖరీధైన స్టాంపు.. ధర ఎంతంటే..)
Comments
Please login to add a commentAdd a comment