Franklin Delano Floyd Terrorized Really Kill Suzanne And Michael - Sakshi
Sakshi News home page

కూతుర్నే పెళ్లాడిన ఓ నీచపు తండ్రి కథ..ఆఖరికి ఆమె కొడుకుని సైతం..

Published Sun, Aug 20 2023 2:17 PM | Last Updated on Sun, Aug 20 2023 2:20 PM

Franklin Delano Floyd Terrorized Really Kill Suzanne And Michael - Sakshi

జాలి, దయ, తప్పు, ఒప్పు తెలియని పశుత్వం మనిషిరూపంలో ఉంటే.. అమాయకమైన జీవితాలు ఎలా ఆగమవుతాయో చెప్పే ఉదంతమే ఇది. ‘ఫ్రాంక్లిన్‌ డెలానో ఫ్లాయిడ్‌’ అనే రాక్షసుడు.. తన ఇష్టానుసారంగా కాలరాసిన కొందరి అభాగ్యుల తలరాత ఇది. 

1994 సెప్టెంబర్‌ 12, ఉదయం పదకొండు దాటింది. అమెరికా ఓక్లహోమాలోని చోక్టావ్‌లో ‘ఇండియన్‌ మెరిడియన్‌ ఎలిమెంటరీ స్కూల్‌’లో ఒక్కసారిగా పిల్లలంతా పెద్దపెద్దగా కేకలేస్తున్నారు. కొందరైతే భయంతో ఏడుస్తున్నారు. స్కూల్‌ టీచర్స్‌ అంతా వెనక్కి అడుగులేస్తుంటే.. ప్రిన్సిపల్‌ జేమ్స్‌ డేవిస్‌ మాత్రం చేతులు పైకెత్తి నెమ్మదిగా ముందుకు అడుగులేస్తున్నాడు. నిజానికి అతడి తలకు గురిపెట్టిన తుపాకీనే.. అతడ్ని గదమాయిస్తూ ముందుకు తోస్తోంది. గన్‌  పట్టుకున్న ఆ ఆగంతకుడి ఆజ్ఞలే అక్కడున్న అందరినీ వణికిస్తున్నాయి. అతడు చెప్పినట్లే ప్రిన్సిపల్‌.. ఓ క్లాస్‌రూమ్‌లోని ఆరేళ్ల మైకేల్‌ హ్యూజ్‌ అనే బాబు దగ్గరకు వెళ్లాడు. క్షణాల్లో ఆ బాబుని తన చేతుల్లోకి తీసుకున్న ఆ ఆగంతకుడు.. సరాసరి ప్రిన్సిపల్‌ని ఓ కారు దగ్గరకు నడిపించి, డ్రైవ్‌ చెయ్యమన్నాడు. అతడి ఆదేశాలతోనే ఆ కారు ముందుకు కదిలింది.

కిడ్నాప్‌ అయింది ప్రిన్సిపల్‌తో పాటు మైకేల్‌ అని పోలీసులకి తెలియగానే.. ఆ ఆగంతకుడు వారెన్‌ జడ్సన్‌ మార్షల్‌ అని వాళ్లకు క్లారిటీ వచ్చేసింది. వెంటనే పోలీస్‌ రికార్డ్స్‌ నుంచి ఓ ఫొటో తీసి.. కొందరు ప్రత్యక్ష సాక్షుల(టీచర్స్‌)కి చూపించి నిర్ధారించుకుని మరీ వేట మొదలుపెట్టేశారు. ఐదు గంటల తర్వాత.. ఓ అడవి సమీపంలో ‘హెల్ప్‌ హెల్ప్‌’ అనే అరుపులు జేమ్స్‌ని గుర్తించేలా చేశాయి. అతణ్ణి ఎవరో చెట్టుకు కట్టేశారు. అయినా, సురక్షితంగానే ఉన్నాడు. జేమ్స్‌ని ‘మైకేల్‌ ఎక్కడ?’ అని అడిగితే.. ‘నన్ను కట్టేసి.. బాబుని తీసుకుని అతడు (వారెన్‌) పారిపోయాడ’ని సమాధానమిచ్చాడు.

నిజానికి మైకేల్‌ తల్లి షారోన్‌ మార్షల్‌ అనుమానాస్పద మృతిలో వారెన్‌ (ఆమె భర్తే) ప్రధాన నిందితుడు. తల్లి మరణం తర్వాత మైకేల్‌ని సంరక్షణ  కేంద్రానికి తరలించి.. ఆమె భర్త వారెన్‌ని అరెస్ట్‌ చేశారు. పలు ఆంక్షలతో పోలీసులు వదిలిపెట్టిన ప్రతిసారి వారెన్‌.. నేను నా భార్య షారోన్‌ ని చంపలేదు.. నా కొడుకు మైకేల్‌ను నాకు తిరిగి అప్పగించండి అని రచ్చ చేసేవాడు. నాలుగేళ్లుగా అదే మాట మీదున్న వారెన్‌.. చివరికి మైకేల్‌ని కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లిపోయాడు. ఇక్కడే మరో ట్విస్ట్‌ ఉంది. షారోన్‌ కేసు విచారణ సమయంలోనే మైకేల్‌.. వారెన్‌ కన్నకొడుకు కాదని డీఎన్‌ఏ రిపోర్ట్‌లు తేల్చాయి. షారోన్‌ కి రహస్యంగా మరో వ్యక్తితో సంబంధం ఉందని, అతడే మైకేల్‌ తండ్రి అని అధికారులు నమ్మారు. అదే నమ్మకంతో వారెన్‌.. షారోన్‌ ని చంపేసి ఉంటాడని కూడా భావించారు.

బాబు కిడ్నాప్‌ అయిన రెండు నెలలకు వారెన్‌  పోలీసులకు దొరికేశాడు. అయితే మైకేల్‌ అతడితో లేడు. మైకేల్‌ ఎక్కడ? అనే ప్రశ్నకు అతడు సరైన సమాధానం ఇవ్వలేదు. పోలీస్‌ ట్రీట్‌మెంట్‌ మొదలైంది. అయినా నోరు విప్పలేదు. కొన్ని రోజులకి ‘మైకేల్‌ సురక్షితంగానే ఉన్నాడు.. కానీ అతడి వివరాలు ఎప్పటికీ చెప్పను’ అని మొండికేశాడు. నిజం చెప్పకపోవడంతో కస్టడీలోనే ఉండిపోయాడు. అప్పుడే అతడు చేసిన మరిన్ని అకృత్యాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. ఇంతలో ఫ్లోరిడాకు చెందిన షీరల్‌ కమెస్సో అనే పద్దెనిమిదేళ్ల అమ్మాయి మిస్సింగ్‌ కేసులో అనుమానితుడైన క్లారెన్స్‌ హ్యూజ్, ఈ వారెన్‌ ఒక్కరేనని తేలింది. పైగా షీరల్, షారోన్‌ ఇద్దరూ మంచి స్నేహితులు.

వారెన్‌  (క్లారెన్స్‌)తో షీరల్‌కి ఏదో విషయంలో వాగ్వాదం జరిగిందట. తర్వాత కొంత సమయానికే ఆమె కనిపించకుండా పోయిందట! ఆమె మిస్‌ అయిన కాసేపటికే వారెన్‌ కుటుంబం ఫ్లోరిడా నుంచి ఓక్లహోమా షిఫ్ట్‌ అయ్యారట! పైగా పేర్లు కూడా మార్చేసుకున్నారు. అన్నీ అనుమానించదగ్గ అంశాలే కావడంతో వారెన్‌ (క్లారెన్స్‌) చుట్టూ కేసు బిగుసుకుంది. ఇక అతడి భార్య షారోన్‌ అతడి కంటే పాతికేళ్లు పైనే చిన్నది కావడంతో.. మైకేల్‌ని ఎత్తుకెళ్లినట్లే.. షారోన్‌ ని కూడా ఎత్తుకొచ్చాడా? అనే అనుమానం వారెన్‌ నేరపుటల్ని కదిలించింది. వారెన్‌ (క్లారెన్స్‌) అసలు పేరు ఫ్రాంక్లిన్‌ డెలానో ఫ్లాయిడ్‌ అని తెలిసినప్పటి నుంచి అతడి నేరాల చిట్టా ఒక్కొక్కటిగా బయటపడటం మొదలైంది. ఫ్రాంక్లిన్‌ ఊరికో పేరు మార్చేవాడని తేలింది.

విచారణలో ఉన్న ఫ్రాంక్లిన్‌ రోజుకో అబద్ధం చెప్పేవాడు. పొంతనలేని సమాధానాలతో పిచ్చెక్కించేవాడు. అయితే 1995లో దొరికిన కొన్ని ఆధారాలతో 2002లో షీరల్‌ని హత్య చేసింది ఫ్రాంక్లిన్‌నే అని నిర్ధారణ అయ్యి అతడికి జీవితఖైదు పడింది. ఇక జైల్లోనే మగ్గిపోయాడు.‘షీరల్‌ మర్డర్‌ కేసులో శిక్షపడింది కాబట్టి.. ఎలాగో నీ జీవితం జైల్లోనే ముగుస్తుంది. ఇప్పుడైనా మైకేల్, షారోన్‌ ల గురించి నిజం చెప్పు’ అంటూ 2014లో ఎఫ్‌బీఐ ఏజెంట్స్‌ ఫ్రాంక్లిన్‌ ని మళ్లీమళ్లీ ప్రశ్నించారు. దాంతో మైకేల్‌ని ఆ రోజే చంపి ఓక్లహోమా/టెక్సాస్‌ సరిహద్దు సమీపంలో పాతేశానని చెప్పాడు ఫ్రాంక్లిన్‌. అయితే ఆ పరిసరాల్లో ఎక్కడా మైకేల్‌ అవశేషాలు కూడా దొరకలేదు. దాంతో అతడు చెప్పింది నిజమో అబద్ధమో తేలలేదు.

ఇక ఫ్రాంక్లిన్‌ బయటపెట్టిన షారోన్‌ కథ ఎందరినో కంటతడి పెట్టించింది. షారోన్‌ అసలు పేరు సుజానే సేవకీస్, తను నా మొదటి భార్య శాండీ బ్రాండెన్‌  పెద్ద కూతురు, అంటే సుజానే(షారోన్‌)కి నేను సవతితండ్రిని, ఆమెకి ఐదేళ్ల వయసున్నప్పుడు 1975లో కరోలినా నుంచి ఎత్తుకొచ్చా అని చెప్పాడు. వెంటనే ఆధారాల కోసం శాండీ కథను, ఫ్రాంక్లిన్‌ గతాన్ని లోతుగా తవ్వడం మొదలుపెట్టారు పోలీసులు. ఫ్రాంక్లిన్‌ 17 ఏళ్ల నుంచి 31 ఏళ్ల వరకూ చేసిన నేరాలు ఒక ఎత్తయితే.. 31 ఏళ్ల నుంచి చేసిన కుట్రలు మరో ఎత్తు. అమెరికాలోని జార్జియా నుంచి ఇల్లినాయీ వరకూ ఎన్నో లైంగిక, హత్య నేరాలకు పాల్పడి.. కొన్నింటికి శిక్షలు అనుభవించి.. మరికొన్నింటికి పాల్పడినా, చిక్కకుండా తప్పించుకుని పారిపోయి.. 1974 నాటికి కరోలినా చేరుకున్నాడు.

అక్కడ పరిచయం అయ్యింది శాండీ బ్రాండెన్‌ అనే నలుగురు పిల్లల తల్లి. ఫ్రాంక్లిన్‌ ఆమెని ప్రేమించి, పెళ్లి చేసుకున్నాడు. కొన్ని నెలలు గడిచే సరికి.. శాండీ ఏదో చెక్‌ విషయంలో 30 రోజులు జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. ఫ్రాంక్లిన్‌ అసలు స్వరూపం తెలియని శాండీ.. జైలుకి వెళ్తూ వెళ్తూ తన పిల్లలందరినీ ఫ్రాంక్లిన్‌ కే అప్పగించి వెళ్లింది. ఆమె తిరిగి జైలు నుంచి వచ్చేసరికి ఇంట్లో తన పిల్లలు, భర్త ఫ్రాంక్లిన్‌ ఎవ్వరూ కనిపించలేదు. కొన్ని రోజులకి తన నలుగురు పిల్లల్లో.. ఇద్దరు ఆడపిల్లలు స్థానిక సంరక్షణ కేంద్రంలో ఉన్నారని తెలుసుకుని వారిని చేరుకుంది. మరి పెద్ద కూతురు సుజానే, కొడుకు ఫిలిప్‌ని ఫ్రాంక్లిన్‌ ఎత్తికెళ్లాడని గుర్తించి.. కంప్లైంట్‌ ఇవ్వడానికి ట్రై చేసింది.

అయితే సవతి తండ్రికి పిల్లలపై హక్కు ఉంటుంది కాబట్టి కేసు నమోదు చెయ్యలేమని అధికారులు చెప్పారు. దాంతో శాండీ కొన్నేళ్లకు తన ఇద్దరు పిల్లల మీద ఆశలొదులుకుని బతకడం మొదలుపెట్టింది. 1987లో కూతురుగా పెరిగిన సుజానే(షారోన్‌)ని.. ఫ్రాంక్లిన్‌ (వారెన్‌) రెండో పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు ఆమె వయసు 16. సరిగ్గా ఏడాదికి మైకేల్‌ జన్మించాడు. మైకేల్‌ తన కొడుకు కాదని తెలిసి, హిట్‌ అండ్‌ రన్‌ సాకుతో సుజానేని చంపేసే ఉంటాడని అధికారులు అంచనా వేశారు.

ఇదంతా 2014లో ఫ్రాంక్లిన్‌ చెప్పిన ఆధారాలతో వెలికి తీసిన కథ. మరి సుజానే తమ్ముడు ఫిలిప్‌ని ఏం చేశావ్‌? అని ఫ్రాంక్లిన్‌ని ప్రశ్నిస్తే.. అప్పట్లోనే ఓ జంటకు దత్తత ఇచ్చానని చెప్పాడు. ఇక 2019లో ఫిలిప్‌ స్టీవ్‌ అనే వ్యక్తి.. సుజానే నా అక్క,  ఫ్రాంక్లిన్‌ ఎత్తుకొచ్చిన శాండీ కొడుకుని నేనే అని డీఎన్‌ఏ పరీక్షకు సిద్ధమయ్యాడు. 2020లో అది నిర్ధారణైంది. దాంతో ఫిలిప్‌ తిరిగి శాండీ కుటుంబాన్ని కలుసుకున్నాడు. మరోవైపు ఫ్రాంక్లిన్‌ 79 ఏళ్ల వయసులో 2023 జనవరి 23న ఫ్లోరిడాలోని జైల్లోనే మరణించాడు. ఏది ఏమైనా సుజానే, మైకేల్‌లను నిజంగానే ఫ్రాంక్లిన్‌ చంపాడా? మరి మైకేల్‌ అవశేషాలు ఏమయ్యాయి? అనే ప్రశ్నలు నేటికీ మిస్టరీనే.
--సంహిత నిమ్మన 

(చదవండి: సాక్స్‌ కిల్లర్‌..జంటలే టార్గెట్‌గా హత్యలు! అతడెవరనేది ఇప్పటకీ మిస్టరీనే!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement