
మహిళల వేషధారణ, ఆహార్యం ఆధారంగా అత్యాచారాలు జరుగుతున్నాయన్న వాదనలకు చెంపపెట్టు ఈ వార్త. ఆడవారి వయసు, ప్రదేశంతో సంబంధం లేకుండా మృగాళ్లు అమానుషంగా ప్రవర్తిస్తున్న ఘటనai ప్రపంచంలో ఏదో ఒక మూల జరుగుతూనే ఉన్నాయి. మారాల్సింది ఆడవాళ్ల దుస్తులు కాదు, కామాంధుల దుష్టబుద్ది అని నూటికి నూరుపాళ్లు స్పష్టం చేసిన విచారకరమైన వార్త ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. గురుగ్రామ్ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై ప్రాణపాయ స్థితిలో ఉన్న 46 ఏళ్ల మహిళపై లైంగిక దాడి జరిగిన ఘటన కలకలం రేపింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గురుగ్రామ్ ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వెంటిలేటర్‌లో ఉన్నప్పుడు ఎయిర్ హోస్టెస్‌పై లైంగిక దాడి జరిగింది. డిశ్చార్జ్ అయిన తర్వాత మహిళ తన భర్తకు ఈ సంఘటన గురించి చెప్పడంతో విషయం వెలుగు చూసింది. తనపై లైంగిక వేధింపుల గురించి ఏప్రిల్ 13న తన భర్తకు చెప్పగా అతను పోలీసులకు సమాచారం అందించాడు.
ఏప్రిల్ 6న గురుగ్రామ్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు)లో వెంటిలేటర్‌లో ఉన్నప్పుడు తనపై లైంగిక దాడి జరిగిందని ఒక ఎయిర్ హోస్టెస్ ఆరోపించిందని పోలీసులు తెలిపారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. ఆమె ఫిర్యాదు ప్రకారం, ఆమె కంపెనీ తరపున శిక్షణ కోసం గురుగ్రామ్‌కు వచ్చి ఒక హోటల్‌లో బస చేసింది. ఈ సమయంలో, అనుకోకుండా నీటిలో మునిగిపోవడంతో ఆమె ఆరోగ్యం క్షీణించింది, ఆ తర్వాత ఆమెను చికిత్స కోసం ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. ఆ తర్వాత, ఏప్రిల్ 5న, ఆమె భర్త ఆమెను చికిత్స కోసం గురుగ్రామ్‌లోని మరొక ఆసుపత్రిలో చేర్చారు. ఈ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై ఉండగానే కొంతమంది సిబ్బంది ఆమెపై లైంగిక దాడి చేశారనీ, ఇద్దరు నర్సులు కూడా ఆమె చుట్టూ ఉన్నారని బాధితురాలు తన ఫిర్యాదులో ఆరోపించింది. సంఘటన జరిగిన సమయంలో ఆమె కూడా అపస్మారక స్థితిలో ఉండటంతో ఏమీ మాట్లాడలేకపోయాననీ, భయపడ్డాని ఆమె పోలీసులకు తెలిపింది. ఏప్రిల్ 13న ఆమెను ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశారు. తరువాత ఈ ఘటన గురించి భర్తకు తెలిపింది.
ఇదీ చదవండి: నాన్న అంటే అంతేరా...! వైరల్ వీడియో
తమ పోలీసు బృందం నిందితుడిని గుర్తించడానికి డ్యూటీ చార్ట్, సీసీటీవీ ఫుటేజ్‌ను విశ్లేషిస్తోందని గురుగ్రామ్ పోలీసు ప్రతినిధి సందీప్ కుమార్ తెలిపారు. ఒక నిందితుడిని గుర్తించి అతని వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్ ముందు నమోదు చేశామన్నారు. పూర్తి విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుమంటామని సందీప్ తెలిపారు. మరోవైపు ఈ విషయంపై వ్యాఖ్యానించడానికి ఆసుపత్రి అధికారులు నిరాకరించారు. ఆసుపత్రి భద్రతా సిబ్బందిని సంప్రదించినప్పుడు, ఈ సంఘటన గురించి తమకు తెలియ దన్నారు.