Washington Murders Tube Sock Killings Unsolved Mystery Case - Sakshi
Sakshi News home page

సాక్స్‌ కిల్లర్‌..జంటలే టార్గెట్‌గా హత్యలు! అతడెవరనేది ఇప్పటకీ మిస్టరీనే!

Published Sun, Aug 13 2023 2:10 PM | Last Updated on Sun, Aug 13 2023 2:53 PM

Washington Murders Tube Sock Killings Unsolved Mystery Case - Sakshi

అది 1985 డిసెంబర్‌ 12, మధ్యాహ్నం ఒంటిగంట దాటింది. వాషింగ్టన్‌ లోని మినరల్‌ సమీపంలోని స్పానవేలో కె–మార్ట్‌ స్టోర్‌ కస్టమర్స్‌తో రద్దీగా ఉంది. ఆ బయట రెండేళ్ల పాప ఒక్కర్తే అయోమయంగా, అటు ఇటు తచ్చాడటాన్ని కొందరు స్టోర్‌ ఉద్యోగులు గమనించారు. వారు పాపను చేరదీసి, పోలీసులకు సమాచారమిచ్చారు. కాసేపటికి ఆ మార్ట్‌కు చేరుకున్న అధికారులు పాప పరిస్థితి చూసి, స్థానిక ఆసుపత్రిలో పరీక్షలు చేయించారు. పాప శారీరకంగా బాగానే ఉన్నా, ఏదో చూసి భయపడిందని గుర్తించి, తాత్కాలికంగా దగ్గర్లోని సంరక్షణ కేంద్రానికి తరలించారు. చిన్న పాప కావడంతో అందరినీ చూసి బెదిరిపోయింది.

తను ఎవరు? తన వాళ్లు ఎవరు? తనొక్కర్తే అక్కడెందుకు ఉంది?’ లాంటివన్నీ సమాధానం లేని ప్రశ్నలయ్యాయి. పాప వివరాల సేకరణలో భాగంగా పత్రికలకు కూడా పాప ఫొటో ఇచ్చి ‘ఎవరీ పాప?’ అనే శీర్షికతో వార్తలు రాయించారు అధికారులు. సరిగ్గా రెండు రోజులకు పాప వార్త ఉన్న న్యూస్‌ పేపర్, కొన్ని రియల్‌ ఫొటోలు పట్టుకుని.. లూయిస్‌ కాన్రాడ్‌ అనే మహిళ పోలీస్‌ స్టేషన్‌ కి వచ్చింది. ‘మార్ట్‌ ముందు దొరికిన పాప నా మనవరాలే, తన పేరు క్రిస్టల్‌’ అంటూ ఇంట్లోని పాప ఫొటోలను ఆధారంగా చూపించింది.

పాప దొరికిన రోజు (డిసెంబర్‌ 12) ఉదయాన్నే తన కూతురు డయానా రాబర్ట్‌సన్‌(21), అల్లుడు మైక్‌ రీమర్‌(36), క్రిస్టల్‌తో కలసి టకోమా సమీపంలోని పర్వతాలలో వన్‌  డే వెకేషన్‌  కోసం వెళ్లారని చెప్పింది లూయిస్‌. పాప ఒక్కర్తే ఒంటరిగా దొరికిందంటే.. మైక్, డయానాలకేమైందోనని కూలబడి ఏడ్చేసింది. లూయిస్‌ సమాచారంతో ఆ పర్వాతాల సమీపంలో మొత్తం గాలింపు చర్యలు మొదలుపెట్టారు అధికారులు. ఎక్కడా ఏ ఆధారం దొరకలేదు. ఇక మనవరాలు క్రిస్టల్‌ని ప్రేమగా ఒడిలో కూర్చోబెట్టుకుని ‘మీ అమ్మా నాన్న ఎక్కడున్నారు?’ అని ఆరా తీసింది లూయిస్‌. ఆ ప్రశ్నకు ‘మమ్మీ చెట్లలో ఉంది’ అని జవాబు ఇచ్చింది క్రిస్టల్‌. ఎన్నిసార్లు అడిగినా అదే సమాధానం చెప్పింది. క్రిస్టల్‌ చిన్నది కావడంతో తనని విచారించి ప్రయోజనం లేదని అర్థమైంది.

రెండు నెలలు గడిచిపోయాయి. 1986 ఫిబ్రవరి 18 ఉదయాన్నే వాషింగ్టన్‌లోని మినరల్‌కు ఉత్తరంగా ఉన్న రోడ్డుపై వాకింగ్‌కి వెళ్లిన ఓ వ్యక్తికి ఊహించని షాక్‌ ఎదురైంది. రోడ్డు నుంచి కాస్త లోపలికి గుబురు చెట్ల మధ్య.. కరుగుతున్న మంచుపెళ్లల్లో రెడ్‌కలర్‌ ప్లిమత్‌ పికప్‌ ట్రక్‌ కనిపించింది. దగ్గరకు వెళ్లి చూస్తే, దాని పక్కనే ఓ మహిళ కుళ్లిన నగ్న మృతదేహం భయపెట్టింది. ఆమె మెడకు సాక్స్‌తో ముడివేసి బిగించినట్లుంది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. డీఎన్‌ఏ పరీక్షలో అది డయానా శవమని తెలియడంతో మిస్సింగ్‌ కేసు కాస్త మర్డర్‌ కేసుగా మారింది. క్రిస్టల్‌  చెప్పినట్లే తన మమ్మీ చెట్ల మధ్య ఉండటం అధికారులను ఆశ్చర్యపరచింది.

అంటే తన తల్లి చావుని క్రిస్టల్‌ చూసే ఉంటుందని అంతా అంచనాకు వచ్చారు. అయితే ఆ చుట్టుపక్కల ఎక్కడా మైక్‌ జాడ కనిపించలేదు. ఆ పికప్‌ ట్రక్‌ మైక్‌దే కావడంతో దానిలో అంతా క్షుణంగా పరిశీలించారు. డ్రైవర్‌ పక్క సీట్‌లో రక్తం మరకలున్నాయి. వాటి శాంపిల్స్‌ ల్యాబ్‌కి పంపిస్తే, ఆ రక్తం మనిషిదే కాని ఎవరిదో తేలలేదు. ట్రక్‌లో దొరికిన ఒక ఎన్వలప్‌ కవర్‌ మీద ‘ఐ లవ్యూ డయానా’ అని రాసి ఉంది. అది మైక్‌ హ్యాండ్‌ రైటింగ్‌ అని లూయిస్‌ గుర్తించింది. డయానా కడుపులో పదిహేడు కత్తిపోట్లు ఉన్నాయని, మెడ చుట్టూ బిగించిన సాక్స్‌ ఆమెని కదలకుండా నియంత్రించడానికి మాత్రమే వాడిన సాధనమని తేలింది. ఓ పక్క దట్టమైన మంచు దర్యాప్తుకు ఆటకం కలిగిస్తున్నా, మైక్‌ కోసం తీవ్రంగా గాలించారు అధికారులు.

ఎక్కడా మైక్‌ ఆనవాళ్లు లేవు. అయితే గతంలో మైక్‌.. డయానా విషయంలో చాలా అనుచితంగా ప్రవర్తించేవాడని పోలీసుల దృష్టికి రావడంతో డయానాని అతడే చంపేసి పారిపోయాడని నమ్మారు. మైక్‌.. డయానాని చాలాసార్లు కొట్టేవాడని, చంపేస్తానని బెదిరించేవాడని, అతడి వేధింపులు భరించలేక విడిపోయి తనకు మైక్‌ దూరంగా ఉండాలంటూ డయానా కోర్టు ఉత్తర్వును కూడా పొందిందని, కొన్నాళ్లకు వాళ్లు మళ్లీ కలసి జీవించడం మొదలుపెట్టారని చెప్పింది. దాంతో మైక్‌ అనుమానితుడుగా మారాడు. అయితే కొందరు మైక్‌ కూడా బాధితుడు కావచ్చని, గడ్డకట్టే చలిలో మైక్‌ తన చలికోటును ట్రక్‌లో వదిలి పారిపోయే అవకాశం లేదని నమ్మారు. ఈ క్రమంలోనే డయానా మెడకు చుట్టిన సాక్స్‌ కీలక ఆధారమైంది.

మైక్, డయానా మిస్సింగ్‌కి ముందు.. అంటే 1985 ఆగస్ట్‌ 10న  స్టీఫెన్‌  హార్కిన్, రూత్‌ కూపర్‌ అనే జంట మర్డర్‌ కేసు తిరగేశారు అధికారులు. ఈ జంట వాషింగ్టన్‌లో తులే సరస్సు పక్కన క్యాంపింగ్‌కి వెళ్లి తిరిగి రాలేదు. నాలుగు రోజులకు స్టీఫెన్‌ తన కారు డ్రైవింగ్‌ సీట్‌లో శవమై కనిపించాడు. నుదుటి మీద బుల్లెట్‌ గాయం ఉంది. అతడు నిద్రిస్తున్న సమయంలోనే దాడి జరిగినట్లు తేలింది. వెంట తీసుకెళ్లిన వారి పెంపుడు కుక్క సమీపంలో బుల్లెట్‌ గాయాలతో చనిపోయి ఉంది. రూత్‌ బూట్లు తప్ప మరో ఆధారం కనిపించలేదు. సరిగ్గా రెండు నెలలకు (అంటే డయానా మర్డర్‌కి సరిగ్గా నెల క్రితం) స్టీఫెన్‌  దొరికిన మైలున్నర దూరంలో రూత్‌ తల, మొండెం వేరువేరుగా దొరికాయి. రూత్‌ మెడకు కూడా డయానా మెడకు కట్టినట్లే సాక్స్‌తో బిగించి ఉంది.

ఆమె కడుపులో చాలాసార్లు తుపాకీతో కాల్చినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. కాల్పుల కారణంగానే మరణించింది తప్ప సాక్స్‌ కారణంగా కాదని తేలింది. రూత్‌ మెడలోని సాక్స్, డయానా మెడలోని సాక్స్‌ రెండూ ఒకేలా ఉన్నాయని సాంకేతిక నిపుణులు కొందరు భావించారు. ఇది కచ్చితంగా సీరియల్‌ కిల్లర్‌ పనేనని వారి నమ్మారు. అయితే మైక్‌ జంతువుల కోసం వలపన్నే ప్రాంతం.. రూత్, స్టిఫెన్‌లు మృతదేహాలు దొరికిన ప్రాంతం రెండూ ఒకటే కావడంతో అనుమానాలన్నీ మైక్‌ మీదకు తిరిగాయి. నిజానికి మైక్‌.. తన భార్యను, కూతుర్ని తీసుకుని బయలుదేరేముందే ఆ వలపన్నిన ప్రాంతాన్ని ఒకసారి సందర్శించి వస్తామని ఇంట్లో చెప్పాడట. ఇన్ని ఆధారాలతో పాటు మైక్‌ కనిపించకపోవడంతో అతడే సీరియల్‌ కిల్లర్‌ అని కొందరు అధికారులు నమ్మడం మొదలుపెట్టారు.

అయితే ఈ తరహా కేసే మరొకటి పోలీసులు దృష్టికి వచ్చింది. 1985 మార్చి 9న వాషింగ్టన్‌ గ్రాంట్‌ కౌంటీలో ఎడ్వర్డ్‌ స్మిత్, కింబర్లీ లావైన్‌  అనే ప్రేమజంట మరణం వెనుక కూడా ఇదే సీరియల్‌ కిల్లర్‌ ఉండి ఉంటాడని నమ్మారు అధికారులు. అయితే ఎడ్వర్డ్‌ కారులో దొరికిన వేలిముద్రల ఆధారంగా 1989లో బిల్లీ రే బల్లార్డ్‌ అనే ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అతడు ఎడ్వర్డ్, కింబర్లీ హత్యల నేరాన్ని అంగీకరించాడు కాని రూత్‌ జంట, డయానా జంటల హత్యలు తనకు సంబంధం లేదన్నాడు.

1986 ఆగస్ట్‌ 22న మిస్‌ అయిన రాబర్ట్, డాగ్‌మార్‌ మిస్సింగ్‌ కేసును కూడా కలిపి విచారించారు. తర్వాత రాబర్ట్‌ క్రెడిట్‌ కార్డ్‌ వినియోగించిన ఓ సీరియల్‌ కిల్లర్‌ చార్లెస్‌ సింక్లైర్‌ని అరెస్ట్‌ చేశారు. అయితే విచారణ సమయంలోనే అతడు మరణించాడు. కాలక్రమేణా మినరల్‌ పరిసరప్రాంతాల్లో సీరియల్‌ కిల్లర్‌ ఉన్నాడని పుకార్లు స్థానికుల్ని పర్యటకులను తీవ్రంగా భయపెట్టాయి. మరోవైపు మైక్‌ కనిపించకపోవడంతో అతడే సీరియల్‌ కిల్లర్‌ అనే వాళ్ల సంఖ్య పెరిగిపోయింది. 2011 మార్చి 26న డయానా మృతదేహం దొరికిన మైలు దూరంలో హైకర్స్‌కి మనిషి పుర్రె కనిపించింది. రంగంలోకి దిగిన పోలీసులు దాన్ని స్వాధీనం చేసుకున్నారు.

దంత పరీక్షలతో ఆ పుర్రె మైక్‌దని తేలింది. దాంతో మైక్‌ కూడా ఆ సీరియల్‌ కిల్లర్‌ బాధితుడేనని, అసలు హంతకుడు వేరే ఉన్నాడని స్పష్టమైంది. మొత్తానికీ వాషింగ్టన్‌ మినరల్‌ సమీపంలోని ప్రేమ జంటలు, దంపతుల హత్యకేసులు.. రూత్, డయానా జంటల హత్యలతో కలిసి విచారించినా, ఎంతోమంది అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించినా అసలు సాక్స్‌ కిల్లర్‌ ఎవరో బయటపడలేదు. క్రిస్టల్‌(పాప) దొరికిన రోజు.. మైక్‌ రెడ్‌ కలర్‌ ట్రక్‌ని కె–మార్ట్‌ స్టోర్‌ ముందు చూశామని కొందరు సాక్షులు చెప్పారు. అంటే పాపను ఆ కిల్లరే ఆ స్టోర్‌ దగ్గర వదిలివెళ్లాడా? ఆ స్టోర్‌ దగ్గరకు వచ్చాడా? అనేది ఎప్పటికీ తేలలేదు. వాళ్లని చంపింది ఎవరు? ఆ కిల్లర్‌ ఇంకా ఎంత మంది మాయం చేశాడు? ఇలా వేటికీ సమాధానాలు లేవు. దాంతో ఈ కేసు నేటికీ మిస్టరీగానే మిగిలిపోయింది.
 -సంహిత నిమ్మన 

(చదవండి: ఇప్పటకీ అంతుతేలని కేర్‌టేకర్‌ అదృశ్యం కేసు! ఆరోజు ఏం జరిగింది..?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement