వాషింగ్టన్: అమెరికాలోని అయోవా, జెఫ్రీ డహ్మెర్, టెడ్ బండీ వంటి నరహంతకులకు పోటీగా మరో హర్రర్ స్టోరీ వెలుగులోకి వచ్చింది. తన తండ్రి 30 ఏళ్లలో సుమారు 70 మంది మహిళలను హత్య చేసినట్లు ఓ మహిళ వెల్లడించటం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఆ మహిళల మృతదేహాలను పూడ్చిపెట్టేందుకు తాను, తన సోదరులు సహాయ పడేవారమని లూసీ స్టడీ అనే మహిళ న్యూస్‌వీక్ ఇంటర్వ్యూలో చెప్పింది. ఆ మృతదేహాలను ఎక్కడ పాతిపెట్టారో తనకు తెలుసునని చెప్పటం గమనార్హం. ఈ క్రమంలో ఆమె తెలిపిన ప్రాంతాల్లో పోలీసు శునకాలు మానవ అవశేషాలను గుర్తించినట్లు న్యూస్‌వీక్ పేర్కొంది.
నిందితుడు డొనాల్డ్ డీన్ స్టడీ 75 ఏళ్ల వయసులో 2013లో మరణించాడు. తాజాగా ఆ కిరాతకుడు చేసిన హత్యలపై అతడి కూతురు బయటపెట్టడం సంచలనంగా మారింది. మహిళలను హత్య చేసి వాటిని సమీపంలోని బావి, కొండ ప్రాంతంలోకి తీసుకెళ్లేందుకు తన పిల్లల సాయం తీసుకునేవాడు. మృతదేహాలను తీసుకెళ్లేందుకు తాము తోపుడు బండి లేదా టోబోగన్‌లను ఉపయోగించేవారమని నిందితుడి కూతురు వెల్లడించింది. బావిలో పడేశాక వాటిపై మట్టిపోసేవారమని చెప్పింది. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. చాలా మంది బాధితులను సమీపంలోని 100 అడుగుల లోతైన బావిలో పడేశారు. వారికి ఉన్న బంగారం దంతాలను ట్రోపీలవలే భావించి వాటిని తన తండ్రి దాచుకునేవారని చెప్పింది మహిళ.
లూసీ స్టడీ తన తండ్రిపై ఆరోపణలు చేసిన క్రమంలో పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. స్నిఫ్పర్ డాగ్స్‌తో ఆమె చెప్పిన బావి వద్ద సోదాలు చేపట్టినట్లు చెప్పారు. అయితే, ప్రస్తుతం మనుషులకు సంబంధించిన ఒక్క ఎముక సైతం కనిపించలేదని, కానీ, శునకాల ప్రవర్తన బట్టి ఇది పెద్ద శ్మశాన వాటికలా ఉందని తెలిపారు. నిందితుడు డొనాల్డ్ స్టడీ.. సెక్స్ వర్కర్లు, ఒమహా, నెబ్రస్కా ప్రాంతాల నుంచి మహిళలను మోసగించి తన 5 ఎకరాల విస్తీర్ణంలోని వ్యవసాయ క్షేత్రంలోకి తీసుకొచ్చి హత్య చేసి ఉంటాడని అధికారులు భావిస్తున్నారు.
అమెరికా చరిత్రలోనే..
లూసీ స్టడీ చేసిన ఆరోపణలు నిజమని తేలితే.. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద సీరియల్ కిల్లర్‌గా డొనాల్డ్ స్టడీ నిలవనున్నాడని అధికారులు తెలిపారు. జెఫ్పెరి డహ్మెర్ 17 మందిని హత్య చేశాడు. అలాగే టెడ్ బండీ అనే కిరాతకుడు 36 మందిని పొట్టనబెట్టుకున్నాడు. మరోవైపు.. బావిలో పడేసిన బాధితులందరిని తీసి సరైన రీతిలో తిరిగి అంత్యక్రియలు నిర్వహించాలనే కారణంగానే తాను ఈ విషయాలను బయటపెట్టినట్లు చెప్పింది లూసీ స్టడీ.
ఇదీ చదవండి: చాపకింద నీరులా విపత్తు.. దేశంలో ప్రతి 2 నిమిషాలకు ఒకరు దుర్మరణం..!
Comments
Please login to add a commentAdd a comment