Horror Story
-
మిస్టరీ.. అసలు డోల్స్ని ఎవరు చంపారు? వెరా ఏమైంది?
కొన్ని కథనాంశాలు కొందరి స్వార్థపరుల ఆలోచనల్లోంచి పుట్టుకొస్తాయి. అవి వ్యథలుగా మారి ఇంకొందరి భయాల్లోంచి, మరికొందరి నమ్మకాల్లోంచి కథలు కథలుగా వినిపిస్తాయి. బెంగళూరు చరిత్రలో వాజ్ విల్లా మిస్టరీ కూడా అలాంటిదే.‘వాజ్ విల్లా’.. 2002 వరకూ అదొక నివాసయోగ్యమైన సాధారణ ఇల్లు. ఒక హత్య, కొన్ని పుకార్లు.. ఏవో అస్పష్టమైన కదలికలతో కలగలసి ఆ ఇంటిని భూత్ బంగ్లాగా మార్చాయి. చివరికి శిథిలం చేసి.. ఛిద్రం చేసి.. చరిత్రలో కలిపేశాయి. అసలు ఆ రియల్ క్రైమ్ స్టోరీ.. హారర్ స్టోరీగా ఎలా మారింది?బెంగళూరులో ఎంతో రద్దీగా ఉండే ఎస్టీ మార్కెట్ రోడ్‌కి అతి సమీపంలో 10,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండేది ఆ ఇల్లు. దీన్ని 1943లో నాటి బాంబే హైకోర్టు ప్రఖ్యాత న్యాయవాది ఇ.జె. వాజ్ కట్టించారు. వెరా వాజ్, డోల్స్ వాజ్ అనే తన ఇద్దరు కుమార్తెలకు ఆ ఇంటిని బహుమతిగా ఇచ్చాడు. వెరా, డోల్స్ ఇద్దరూ వివాహం చేసుకోలేదు. వృద్ధాప్యం వరకూ అదే ఇంట్లో కలసి ఉన్నారు. అయితే 2002 సెప్టెంబర్ 4న తెల్లవారు జామున ఆ ఇంట్లోకి ఎవరో ఆగంతకులు ప్రవేశించి.. 75 ఏళ్ల డోల్స్ వాజ్ని కిరాతకంగా పొడిచి, చంపి పారిపోయారు. ఆ హత్యను వెరా కళ్లారా చూసింది.అయితే హంతకులు పారిపోవడంతో సరైన సాక్ష్యం లేకుండా పోయింది. నాటి పోలీసు కమీషనర్ హెచ్.టి. సాంగ్లియా .. 80 ఏళ్ల వయసున్న వెరాను సురక్షిత ప్రదేశానికి మార్చాలని ఆదేశించారు. అందుకు ఆమె అంగీకరించలేదు. అయినా భద్రతాకారణాల దృష్ట్యా వెరా కూడా ఆ ఇంటిని విడిచివెళ్లక తప్పలేదు. తన బంధువుల్లో కొందరు తన ఆస్తిని లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించిన వెరా.. తన చెల్లెలి హత్యకు కారణమైన వారిని పట్టుకోవాలని ఏళ్ల పాటు న్యాయపోరాటం చేసింది. ఊరు వదిలిపోవాలంటూ వెరాకు బెదిరింపులు కూడా వచ్చాయట.డోల్స్ హత్య తర్వాత 12 ఏళ్ల పాటు ఆ ఇంట్లో మనుషులే లేకపోవడంతో.. ఆ ఇల్లు శిథిలావస్థకు చేరి.. ఆ ఇంట్లో దయ్యం ఉందని.. డోల్స్ ఆత్మ అక్కడే తిరుగుతోందని.. ఇలా ఎన్నో పుకార్లు పుట్టుకొచ్చాయి. స్థానికులూ ఆ పుకార్లను బలపరుస్తూ.. ఆ ఇంట్లో ఎవరో ఉన్నట్లుగా రాత్రుళ్లు వింత శబ్దాలు వినిపిస్తున్నాయని.. పియానో ప్లే చేస్తున్నట్లుగా అనిపిస్తోందంటూ ఆ ఇంటి ముందు నుంచి వెళ్లడానికి కూడా వణికిపోయేవారు. ఎందుకంటే డోల్స్కి పియానో అంటే చాలా ఇష్టం. ఆ విషయం చుట్టుపక్కలవారందరికీ తెలుసు. అందుకే రాత్రిళ్లు పియానో వాయించిన శబ్దం ఆ ఇంట్లోంచి వచ్చేసరికి.. విన్నవారంతా హడలిపోయేవారట. దానికి తగ్గట్టు ఆ ఇంటి చుట్టూ పెద్ద ఎత్తున గడ్డి, పిచ్చి మొక్కలు పెరిగిపోవడంతో.. చూడటానికీ భయంకరంగా ఉండేది. ఇంటి ముందు పార్క్ చేసిన హిల్మాన్ మింక్స్ అనే ఓల్డ్ మోడల్ కారు తుప్పుపట్టి ఉండేది. కిటికీ అద్దాలు పగిలిపోయి.. తలుపులు కుంగిపోయి.. ఇల్లు కూడా కళావిహీనంగా మారిపోయింది.దాంతో ఆ ఇంట్లో ఏదో ఉందన్న వార్తలు అక్కడివారిని భయపెట్టేవి. అయితే వెరా మాత్రం దాన్ని తీవ్రంగా ఖండించేది. కావాల్సినవారే తమ ఆస్తిపై కన్నేసి.. తన సోదరిని హత్య చేయించి.. ఇలా ఆత్మలు, దయ్యాలతో కేసును పక్కతోవ పట్టిస్తున్నారని వాపోయేది. అయినా ఫలితం లేదు. డోల్స్ని చంపింది ఎవరో నేటికీ తేలలేదు. ఐదేళ్ల క్రితం శిథిలమైన ఆ ఇంటిని కూల్చివేసినట్లు మీడియాలో వార్తలు కూడా వచ్చాయి.మరి ఆ కోట్ల రూపాయాల ఆస్తిని ఎవరు సొంతం చేసుకున్నారు? అసలు డోల్స్ని ఎవరు చంపారు? వెరా ఏమైంది? ఆత్మల పుకార్లు సృష్టించింది ఆస్తికోసమేనా? పియానో వాయించడంలో కూడా హత్యకు కారణం అయిన వారి హస్తం ఉందా? చుట్టుపక్కల వారిని భయపెట్టి.. కావాలనే దయ్యం కథను అల్లారా? లేదంటే నిజంగానే ఆ ఇంట్లో డోల్స్ ఆత్మ ఉండేదా? ఇలా వేటికీ సమాధానాలు లేవు. దాంతో ఈ గాథ నేటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. – సంహిత నిమ్మనఇవి చదవండి: పర్యాటకులకు వింత ఉద్యోగాలు.. ఏంటో తెలుసా!? -
‘మా నాన్న 70 మంది మహిళలను చంపేశాడు.. నేనే సాక్ష్యం’
వాషింగ్టన్: అమెరికాలోని అయోవా, జెఫ్రీ డహ్మెర్, టెడ్ బండీ వంటి నరహంతకులకు పోటీగా మరో హర్రర్ స్టోరీ వెలుగులోకి వచ్చింది. తన తండ్రి 30 ఏళ్లలో సుమారు 70 మంది మహిళలను హత్య చేసినట్లు ఓ మహిళ వెల్లడించటం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఆ మహిళల మృతదేహాలను పూడ్చిపెట్టేందుకు తాను, తన సోదరులు సహాయ పడేవారమని లూసీ స్టడీ అనే మహిళ న్యూస్‌వీక్ ఇంటర్వ్యూలో చెప్పింది. ఆ మృతదేహాలను ఎక్కడ పాతిపెట్టారో తనకు తెలుసునని చెప్పటం గమనార్హం. ఈ క్రమంలో ఆమె తెలిపిన ప్రాంతాల్లో పోలీసు శునకాలు మానవ అవశేషాలను గుర్తించినట్లు న్యూస్‌వీక్ పేర్కొంది. నిందితుడు డొనాల్డ్ డీన్ స్టడీ 75 ఏళ్ల వయసులో 2013లో మరణించాడు. తాజాగా ఆ కిరాతకుడు చేసిన హత్యలపై అతడి కూతురు బయటపెట్టడం సంచలనంగా మారింది. మహిళలను హత్య చేసి వాటిని సమీపంలోని బావి, కొండ ప్రాంతంలోకి తీసుకెళ్లేందుకు తన పిల్లల సాయం తీసుకునేవాడు. మృతదేహాలను తీసుకెళ్లేందుకు తాము తోపుడు బండి లేదా టోబోగన్లను ఉపయోగించేవారమని నిందితుడి కూతురు వెల్లడించింది. బావిలో పడేశాక వాటిపై మట్టిపోసేవారమని చెప్పింది. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. చాలా మంది బాధితులను సమీపంలోని 100 అడుగుల లోతైన బావిలో పడేశారు. వారికి ఉన్న బంగారం దంతాలను ట్రోపీలవలే భావించి వాటిని తన తండ్రి దాచుకునేవారని చెప్పింది మహిళ. లూసీ స్టడీ తన తండ్రిపై ఆరోపణలు చేసిన క్రమంలో పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. స్నిఫ్పర్ డాగ్స్‌తో ఆమె చెప్పిన బావి వద్ద సోదాలు చేపట్టినట్లు చెప్పారు. అయితే, ప్రస్తుతం మనుషులకు సంబంధించిన ఒక్క ఎముక సైతం కనిపించలేదని, కానీ, శునకాల ప్రవర్తన బట్టి ఇది పెద్ద శ్మశాన వాటికలా ఉందని తెలిపారు. నిందితుడు డొనాల్డ్ స్టడీ.. సెక్స్ వర్కర్లు, ఒమహా, నెబ్రస్కా ప్రాంతాల నుంచి మహిళలను మోసగించి తన 5 ఎకరాల విస్తీర్ణంలోని వ్యవసాయ క్షేత్రంలోకి తీసుకొచ్చి హత్య చేసి ఉంటాడని అధికారులు భావిస్తున్నారు. అమెరికా చరిత్రలోనే.. లూసీ స్టడీ చేసిన ఆరోపణలు నిజమని తేలితే.. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద సీరియల్ కిల్లర్‌గా డొనాల్డ్ స్టడీ నిలవనున్నాడని అధికారులు తెలిపారు. జెఫ్పెరి డహ్మెర్ 17 మందిని హత్య చేశాడు. అలాగే టెడ్ బండీ అనే కిరాతకుడు 36 మందిని పొట్టనబెట్టుకున్నాడు. మరోవైపు.. బావిలో పడేసిన బాధితులందరిని తీసి సరైన రీతిలో తిరిగి అంత్యక్రియలు నిర్వహించాలనే కారణంగానే తాను ఈ విషయాలను బయటపెట్టినట్లు చెప్పింది లూసీ స్టడీ. ఇదీ చదవండి: చాపకింద నీరులా విపత్తు.. దేశంలో ప్రతి 2 నిమిషాలకు ఒకరు దుర్మరణం..! -
మిస్టర్ క్రూయెల్.. 10 నుంచి 15 ఏళ్ల అమ్మాయిలు మాత్రమే టార్గెట్
ఉన్మాదపు కోరల్లో చిక్కి, అన్యాయంగా ముగిసిన జీవితాలను చదివినప్పుడు.. అప్రయత్నంగానే కళ్లు చెమరుస్తాయి. ఏళ్లు గడిచినా.. నాటి ఆక్రందనలు నేటికీ.. నిస్సహాయస్వరంతో స్పష్టంగా వినిపిస్తాయి. కొన్ని ఛాయాచిత్రాలు వాటిని కళ్లకు కడుతుంటాయి. ఆస్ట్రేలియన్ విషాదగాథల్లో ఒకటైన కార్మీన్ చాన్ అనే 13 ఏళ్ల అమ్మాయి కథ అలాంటిదే. అది 1991 ఏప్రిల్ 13. అర్ధరాత్రి కావస్తోంది.. రాత్రి అయితే చాలు.. పది నుంచి పదిహేనేళ్లలోపు ఆడపిల్లలున్న కుటుంబానికి నిద్ర కరువయ్యే రోజులవి. ఆస్ట్రేలియా, టెంపుల్స్టోవ్లోని ఓ ఇంట్లో అలికిడి మొదలైంది. ముఖానికి నల్లటి ముసుగు ధరించిన ఒక వ్యక్తి ఎమర్జెన్సీ డోర్ నుంచి లోపలికి చొరబడ్డాడు. ఆ రోజు ఆ ఇంట్లో జాన్ చాన్, ఫిలిస్ చాన్ దంపతులు.. వారి ముగ్గురు ఆడపిల్లలు నిద్రిస్తున్నారు. నిశబ్దంగా బెడ్రూమ్లోకి అడుగుపెట్టిన ఆ ఆగంతుకుడు.. కావాలనే అలికిడి చేశాడు. ఉలిక్కిపడి లేచిన వాళ్లపై తుపాకీ గురిపెట్టాడు. క్షణాల్లో అందరినీ రాగి తీగలతో కట్టి బంధించాడు. ముగ్గురిలో ఒక బాలికను ఎత్తుకుని అక్కడి నుంచి ఉడాయించాడు. ఆ అమ్మాయి పేరే కార్మీన్ చాన్. కార్మీన్ తల్లి, సోదరీమణులు రోజులు గడుస్తున్నాయి. కార్మీన్ చాన్ ఆచూకీ మాత్రం దొరకలేదు. కార్మీన్ ఫొటోలతో పోస్టర్లు, రివార్డులు అంటూ గాలింపు తీవ్రమైంది. బాలికని ఎత్తుకుని వెళ్లినవాడు మీడియాకి, పోలీసులకి ముసుగు వ్యక్తిగా, ఆస్ట్రేలియన్ బూగీమ్యాన్ (boogeyman)గా సుపరిచితుడే. అప్పటికే అతడిపై ఎన్నో కేసులు ఉన్నాయి. పత్రికల్లో, టీవీల్లో.. అప్పటికే అతడిపై ఎన్నో కథనాలు వచ్చాయి. దాంతో ‘నా బిడ్డను దయచేసి విడిచిపెట్టు’ అంటూ మీడియా సమక్షంలో కార్మీన్ తల్లి ఫిలిస్ చాన్.. బూగీమ్యాన్ని ప్రాధేయపడింది. ఆ రోజు ఆ తల్లి ఏడ్చిన ఏడుపు చూస్తే ప్రతి హృదయం ద్రవిస్తుంది. అప్పుడు ఆమెకు చాలా మంది ఒకే మాట చెప్పారు.. ‘బూగీమ్యాన్ తప్పకుండా నీ బిడ్డను విడిచిపెట్టేస్తాడు.. ఎందుకంటే గతంలో ఎంతో మంది పిల్లల్ని అలానే వదిలిపెట్టాడు కదా’ అంటూ జరిగిన కథలను గుర్తుచేశారు. సరిగ్గా ఏడాది తర్వాత.. 1992 ఏప్రిల్ 9న.. థామస్టౌన్, పల్లపు ప్రాంతంలోని డంపింగ్ యార్డులో కుళ్లిన దేహాన్ని కుక్కలు పీకుతుంటే.. కొందరు గుర్తించారు. అది కార్మీన్ మృతదేహమని పోస్ట్‌మార్టమ్ రిపోర్టులు తేల్చాయి. ఫిలిస్ చాన్ రోదనలు మిన్నంటాయి. ఏ ఒక్కరూ ఆమెని ఓదార్చలేకపోయారు. కార్మీన్ సమాధి వద్ద మిగిలిన ఇద్దరు ఆడపిల్లలతో.. కూలబడి ఏడ్చే ఫొటో నాటి విషాదాన్ని కళ్లకు కడుతుంది. కార్మిన్ తలపై మూడుసార్లు కాల్చినట్లు తేలింది. కానీ ఆ క్రూరుడు మాత్రం దొరకలేదు. నాటి నుంచి ఆ ఆగంతుకుడికి మిస్టర్ క్రూయెల్ అని పేరు పెట్టింది మీడియా. మిస్టర్ క్రూయెల్పైన 1987 ఆగస్ట్ 22న మెల్బోర్న్ ఈశాన్య శివార్లలోని లోయర్ ప్లెంటీలోని ఒక ఇంట్లో నిద్రిస్తున్న 11 ఏళ్ల బాలికను ఎత్తుకెళ్లి, లైంగికదాడి చేసినట్లు తొలిసారి కేసు నమోదైంది. కొన్ని రోజుల తర్వాత ఆ బాలికను విడిచిపెట్టేశాడు. అయితే అతడి చేతిలో కత్తితో పాటు, ముఖానికి నల్ల ముసుగు ఉందని ఆ బాధితురాలు చెప్పింది. దాంతో అప్పట్లో పోలీసులు అతడ్ని పట్టుకోలేకపోయారు. గతంలో అతడు వృద్ధ సన్యాసినులపై లైంగికదాడులకు పాల్పడినట్లూ పలు కేసులున్నాయి. కార్మీన్ తల్లిదండ్రులు 1988, డిసెంబర్లో ఈస్ట్ రింగ్వుడ్లో నివసిస్తున్న 10 ఏళ్ల బాలికను మిస్టర్ క్రూయెల్ అపహరించి లైంగికదాడికి పాల్పడ్డాడు. స్కూల్‌కు వెళ్లిన చిన్నారి చీకటిపడినా ఇంకా ఇంటికి రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. సుమారు 18 గంటల తర్వాత ఆ చిన్నారి ఆచూకీ లభించింది. అయితే, నిందితుడు అప్పటికే జారుకున్నాడు. ఈ ఘటన చోటుచేసుకున్న కొద్ది రోజుల్లోనే మిస్టర్ క్రూయెల్ మరో బాలికను అపహరించాడు. క్యాంట్బ్యరీలో నివసిస్తున్న 13 ఏళ్ల బాలికను ఎత్తుకెళ్లిన మిస్టర్ క్రూయెల్.. రెండు రోజులపాటు లైంగికదాడికి పాల్పడ్డాడు. సుమారు 50 గంటల తర్వాత ఆమెను ప్రాణాలతో విడిచిపెట్టాడు. స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో ఆమెను ఎత్తుకెళ్లినట్లు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అందరినీ ప్రాణాలతో వదిలిపెట్టిన మిస్టర్ క్రూయెల్.. కార్మీన్ని చంపడానికి కారణం ఏమై ఉంటుందని ఆలోచించి ఆ దిశగా విచారణ మొదలుపెట్టారు పోలీసులు. బహుశా కార్మీన్ అతడి ముఖం చూసి ఉంటుంది.. గుర్తు పడుతుందనే భయంతోనే కార్మీన్ని చంపేసి ఉంటాడు అనే అంచనాకు వచ్చారు చాలామంది. మొత్తానికి ఎందరో ఆడపిల్లల జీవితాలను నాశనం చేసిన మిస్టర్ క్రూయెల్ ఎవరు అన్నది నేటికీ తేలలేదు. ఎందరో అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని విచారించారు కానీ ఫలితం లేదు. అసలు ఈ మిస్టర్ క్రూయెల్ ఎవరు? అంత ధైర్యంగా ఇళ్లల్లోకి జొరబడి పిల్లల్ని ఎత్తుకుని వెళ్లే సాహసం ఎలా చేయగలిగాడు? అతడి వెనుక ఎవరైనా ఉన్నారా? అసలు ఆ ముసుగు మనిషి ఒక్కడేనా? లేక ఒక ముఠాసభ్యులంతా ఇలా ముసుగులేసుకుని నేరాలకు పాల్పడేవారా? అనేది మాత్రం నేటికీ మిస్టరీనే. -సంహిత నిమ్మన -
ఆ ఊళ్లో మళ్లీ అలజడి మొదలైంది
కొన్ని పదుల సంవత్సరాల తర్వాత ఆ ఊళ్లో ఆ రోజు మళ్లీ అలజడి మొదలైంది. పెద్దవాళ్లెందుకు అంత కలవర పడ్తున్నారో అర్థంకాని పిల్లలకు అదంతా అయోమయంగా ఉంది. ఎవరికీ పట్టని ఊరి చివరన ఉన్న బంగ్లా మాత్రం కొన్నేళ్ల తర్వాత బూజులు దులుపుకొని.. సున్నాలు వేసుకొని అందంగా ముస్తాబైంది. ఊరవతల ఉన్న చెరువు గట్టు.. చేలు, చెల్కల్లో ఆడ్డానికి వెళ్లే పిల్లలనెప్పుడూ ఆకర్షించని ఆ మేడ ఈ రోజు వాళ్లను తెగ ఊరిస్తోంది.. లోపలికి వెళ్లి చూసేలా! పెద్దవాళ్లేమో కట్టడి చేస్తున్నారు.దీన్నీ పట్టించుకోని ఆ బంగ్లా వారసురాలు.. మాతృతర్పణం సమర్పించేందుకు తన పెద్దలకు ఇష్టమైన వంటకాలను వండిస్తోంది. ఆ రాత్రి జరిగే ఆ విందుకు ఊళ్లో వాళ్లందరినీ ఆహ్వానించింది. ఆ ఊళ్లో అలజడికి అదే కారణం. ఆ రోజు తెల్లవారి.. వాకిళ్లు ఊడ్చుకుని కళ్లాపి చల్లుకుందామని వాకిళ్లలోకి వచ్చేసరికి.. కళ్లాపి చల్లి ముగ్గు కూడా పెట్టున్నాయి అందరి ముంగిళ్లు. విస్తుపోయారంతా.. ఒకరింటి వైపు ఒకరు చూసుకొని! ఆ ముగ్గు కిందే.. ‘‘ఈ రోజు రాత్రికి.. మా పెద్దలకు మాతృతర్పణం చేస్తున్నాను.. ఈ ఊరి ఆడబిడ్డగా మీ అందరినీ ఆ విందుకు పిలుస్తున్నాను.. తప్పకుండా రావాలి’’ అని రాసుంది ముగ్గు పిండితోనే! హతాశులయ్యారంతా ఇలా ఎవరైనా పిలుస్తారా? అని. అంతే పెద్దవాళ్లందరికీ చిన్నప్పడు తమ పెద్దలు.. ఆ పెద్దలకు వాళ్ల పెద్దలు చెప్పిన కథలు గుర్తొచ్చాయి. ఒకప్పుడు ఆ ఊరు.. ఊరు కాదు... బద్దకస్తుల అడ్డా! పనీపాటా లేకుండా మగవాళ్లంతా తాగి తందనాలాడుతుంటే.. ఆడవాళ్లు కష్టం చేస్తూ కుటుంబాలు నడిపేరు. ఆ కాలంలోనే ఆ ఊరి చివర ఆ బంగ్లా వెలిసింది. దాని పునాదుల నుంచి కప్పు దాకా అంతా ఆడవాళ్ల కష్టమే. అయితే ఆ బంగ్లా యజమాని, అతని కొడుకులు పనిచేయడానికి వచ్చిన చాలామంది ఆడవాళ్ల గౌరవ మర్యాదలను మంట గలిపారు. వాళ్లంతా ఆ ఇంట్లోనే ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ బంగ్లా కట్టడం పూర్తయి ఇంట్లో వాళ్లు గృహప్రవేశం చేసిన రోజే యజమాని రక్తం కక్కుకొని చనిపోయాడట. ఆ తర్వాత అమావాస్యకు ఆయన పెద్ద కొడుకు.. ఆ తర్వాత ఇంకో కొడుకు.. ఇలా ఆ ఇంట్లో మగవాళ్లంతా ప్రాణాలు కోల్పోయారు. వాస్తు దోషమేమో అని భయపడ్డ ఇంటి ఆడవాళ్లు బంగ్లా వదిలి వెళ్లిపోయారు. అప్పటి నుంచి కొన్నేళ్ల దాకా ఎవరూ లేక ఆ బంగ్లా అలా పాడుబడి భూత్ బంగ్లాగా పేరు తెచ్చుకుంది. అదే సమయంలో ఊళ్లో పరిస్థితులు చక్కబడ్డం మొదలుపెట్టాయి. ఏమైందో తెలియదు.. దసరా ముందు అమావాస్య రాత్రి... ఇలాగే ఆ ఊరికి కొంతమంది ఆడవాళ్లు వచ్చారు.. చక్కగా ముస్తాబై. ఆ ఊరి మర్రి కిందకు మగవాళ్లందరినీ విందుకు పిలిచారు. మగవాళ్లంతా వెళ్లారు. ఆ తెల్లవారి నుంచే వాళ్ల ప్రవర్తనలో నెమ్మదినెమ్మదిగా మార్పు రావడం మొదలుపెట్టింది. తాగుడు మానేశారు. పనులకు వెళ్లడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఆ ఊరి చివర బంగ్లాలో కూడా అలికడి వినిపించసాగింది ఆ ఊళ్లో వాళ్లకు. కొన్ని సంవత్సరాలు కొనసాగింది అది. ఆ సమయంలోనే ఊరికి బడి వచ్చింది. ఆడపిల్లలనూ బడికి పంపడం మొదలుపెట్టారు తల్లిదండ్రులు. పెద్ద కులాలు, చిన్న కులలాల మధ్య ఊళ్లో ఉన్న సరిహద్దులు చెరిగిపోయాయి. అప్పటిదాకా ఆడవాళ్లను ఏడిపించిన మగవాళ్లు వాళ్లను గౌరవించడం మొదలుపెట్టారు. కులం, మతం, కట్నం ఊసు లేకుండా పెళ్లిళ్లు అవసాగాయి. దేనికీ పెద్దవాళ్ల నుంచి అభ్యంతరాలు రావట్లేదు. వాదోపవాదాల్లేవు. అన్నీ చర్చలే! ఆ ఊరు గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు సర్పంచులుగా ఆడవాళ్లే ఏలారు. తర్వాత మండలం అయింది. దానికి రెవెన్యూ అధికారులు అమ్మాయిలే. మండల పరిషత్ ప్రెసిడెంట్‌గా ఆడవాళ్లే. అందరూ కలిసి ఆ ఊరిని ఓ తీరుగా తీర్చిదిద్దారు. ఊరికి పొలిమేరగా అడవిని పెంచారు. ఇదంతా కావడానికి కొన్నేళ్లు పట్టింది. అన్నేళ్లూ ఆ బంగ్లాలో అలికిడి ఉండింది. అయితే ఊరి బాగు మీదకు మనసు మళ్లించిన ఊళ్లో వాళ్లంతా ఆ బంగ్లా గురించి.. అందులోని అలికిడి గురించీ మెల్లగా మరిచిపోయారు. అంతేకాదు.. అదొక భూత్ బంగ్లా దాని జోలికి పోవద్దనే అప్రకటిత నిర్ణయానికీ వచ్చేశారు. ఆ బంగ్లాలో ఏవో శబ్దాలు మొదలుకాగనే ఏదో శక్తి వచ్చి ఆ ఊళ్లో మగవాళ్లను, ఊరినీ మార్చేసి రక్షించిందని నమ్ముతుంటారు. అన్నేళ్ల తర్వాత ఇప్పుడు ఇలా.. మళ్లీ ఆ బంగ్లా సున్నాలేసుకొని మెరుస్తూండేసరికి అందరికీ భయం మొదలైంది. ఆ రాత్రి విందుకు పిలిచిందెవరు? వెళ్లాలా వద్దా ? అని చర్చించుకోవడానికి ఊళ్లో వాళ్లంతా సమావేశమయ్యారు. ‘‘ఆ బంగ్లా దొర మునిమనమరాలో ఏమో.. తన ముత్తాత, తాతల వల్లే మన ఊరి ఆడోళ్ల ప్రాణాలు పోయినయ్ కదా.. బంగ్లా మీద నుంచి ఆ పీడను పోగొట్టుకునేతందకు వచ్చిందేమో’’ అన్నది ఓ పెద్ద మనిషి. ‘‘అట్ల అయితే బాజాప్త ఇంటింటికి వచ్చి చెప్పాలే కాని దొంగ లెక్క వాకిట్ల ముగ్గేసి చెప్పుడేంది?’’ ఒక నడి వయసు స్త్రీ అభ్యంతరం. ‘‘యే.. ఇంటికి తాళం ఉంటే గడపకు బొట్టు పెట్టి చెప్పమా? అట్లనే చెప్పిపోయిందేమో?’’ మరో పెద్దమనిషి సమర్థింపు. ‘‘పోయిందేమో అంటున్నవ్? ఒక్కామెనే ఉన్నట్టు నీకెట్ల ఎరుక?’’ ఒక పురుషుడి సందేహం. ‘‘అందరి వాకిట్ల రాత ఒక్క తీర్గనే ఉంటే ఒక్కామెనే అనుకుంటున్నా’’ సమాధానమిచ్చింది ఆమె. ‘‘ఇంతకీ గామె ఆడామెనే అనే గ్యారెంటీ కూడా ఏమీ లేదు.. మగోళ్లు కూడా వచ్చి ఉండొచ్చు ఆ బంగ్లాలకి’’ అన్నాడు ఇంకోతను. ‘‘సరే.. ఏది ఏమైనా.. ఆల్ల పెద్దలకు బియ్యం ఇచ్చుకుంటున్నరు కాబట్టి.. మంచి మనసుతో పిలుస్తున్నరు కాబట్టి పోవుడే మంచిది.. అయితే పిల్లల్ని తీస్కపోవద్దు’’ అని తీర్మానించింది ఇంకో పెద్దావిడ. అందరికీ ఆ తీర్మానం నచ్చింది. రాత్రి అయింది.. అందరూ వెళ్లారు. ఇంద్రభవనంలా ఉంది ఆ బంగ్లా. దాని గురించి ఇన్ని రోజులు కథలుగానే విన్నారు. ఇప్పుడు కళ్లారా చూస్తున్నారు. ఆ ఇంటిని చూసే సరికే వాళ్ల కడుపు నిండిపోయింది. భోజనాలకైతే రమ్మన్నారు కాని లోపలికి ఆహ్వానించే వాళ్లెవరూ కనపడట్లేదు వీళ్లకు. అలాగే గుంపులుగా డైనింగ్ హాల్లోకి నడిచారు ఊరి జనం. ‘‘రండి.. రండి.. మీకోసమే ఎదురుచూస్తున్నాం ’’ అంటూ ఎదురుపడ్డారు ఇరవైమంది ఆడవాళ్లు. నుదుటన కాసంత బొట్టు.. ఎర్రటి చీరలు.. చెరగని నవ్వులతో ఉన్న వాళ్లను చూసి ఈ జనాల్లోని కొంత మంది తమ ముందు తరాల వాళ్లను పోల్చుకోవడం మొదలుపెట్టారు. ఇంతలోకే ఆ ఆడవాళ్లు పోలికలు వెదుక్కుంటున్న వాళ్ల దగ్గరకు వచ్చి ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. అర్థమైంది వాళ్లకు. ఆ ఆడవాళ్లు తమ ముత్తవ్వలు, అవ్వలన్నమాట. అప్పుడే ఓ పాతికేళ్ల అమ్మాయి వచ్చింది. ఆమెను ఆ ఊరి ప్రజలకు పరిచయం చేశారు ఆ ఆడవాళ్లు తమ వారసురాలిగా. విందు వడ్డించారు. వాళ్లు తిని చేతులు కడుక్కుని తాంబూలం తీసుకునేటప్పటికీ ఆ ఆడవాళ్లెవరూ లేరు. ఆ అమ్మాయిని అడిగారు అంతా కంగారు!‘‘మిమ్మల్నందరినీ చూడాలనుకునే ఈ విందును ఏర్పాటు చేయమన్నారు. చేశాను. చూసుకున్నారు. ఇక ఈ ఊరికి వాళ్లు, నేను ఎవరూ అసవరం లేదు. ఈ బంగ్లాను అనాథ శరణాలయం చేయండి’’ అంటూ ఆమే అక్కడి నుంచి వెళ్లిపోయింది. - సరస్వతి రమ -
పిల్లలను ఆటలు ఆడుకోనివ్వండి..!
సాయం సంధ్యవేళ.. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని హోమ్‌వర్క్ చేసుకుంటోంది వినూత్న. పదమూడేళ్లుంటాయి. ఎనిమిదో తరగతి చదువుతోంది. ఫుట్‌బాల్‌లో అంటే పిచ్చి. ఆమె ఉన్న టీమ్‌కి ఓటమి ఉండదు. తల్లిదండ్రులేమో బిడ్డను మెడిసిన్ చదివించాలనే పట్టుదలతో ఉన్నారు. టేబుల్ మీద నోట్‌బుక్.. చేతిలో పెన్నుందే కాని పిల్ల చిత్తం మాత్రం గేట్ వైపు పరిగెడ్తోంది. సరిగ్గా అదే సమయానికి ఆ కాలనీలోనే ఇంకో ఇంట్లో కూడా ఇంచుమించు ఇదే దృశ్యం.. ‘‘ఒరేయ్ ... దిక్కులు చూడ్డం మానేసి.. పుస్తకంలోకి చూడు. రేపటి అసైన్‌మెంట్‌లో ఒక్క మార్క్ తగ్గినా ఒళ్లు పేలిపోతుంది జాగ్రత్త.. ’’ తర్జనితో బెదిరిస్తూ ఓ అమ్మ. ఆ మాటలోని తీవ్రత, అమ్మ మొహంలోని సీరియస్‌నెస్‌ను చూసి భయంతో ‘‘సరే’’అన్నట్లుగా తలూపాడే కాని పదకొండేళ్ల ఆ పిల్లాడి మనసూ మెయిన్ డోర్ దగ్గరే తచ్చాడుతోంది. ఈ రెండిళ్లలోనే కాదు ఆ కాలనీలో పిల్లలున్న అన్ని ఇళ్లలోనూ దాదాపు ఇదే పరిస్థితి. ఆ పిల్లల ఆసక్తి అంతా ఆ ఇళ్ల ప్రధాన ద్వారాలకేసే ఉంది. కావస్తోంది.. టైమ్ కావస్తోంది.. ద్వారాలు తెరుచుకోకుండా విశ్వప్రయత్నాలు మొదలుపెట్టారు పెద్దలు.. టైమ్ అయింది... భళ్లున తెరుచుకున్నాయి గేట్లు.. తలుపులు! ఆ విసురుకు అడ్డుగా పెట్టిన బంధనాలన్నీ చెల్లాచెదురయ్యాయి. ఓ ఇంట్లోకి ఫుట్‌బాల్ ప్రవేశించింది... ఒక ఇంట్లోకి క్రికెట్ బాల్.. ఇంకో ఇంట్లోకి టెన్నీ కాయిట్.. మరో ఇంట్లో టేబుల్ టెన్నిస్ బ్యాట్.. వేరే ఇంట్లో షటిల్ బ్యాట్.. ఆ పక్కింట్లోకి టెన్నిస్ ర్యాకెట్... అంతే పిల్లల్లో ఊపు.. అది ఇల్లు అన్న ధ్యాసే లేకుండా.. ఫుట్‌బాల్... వాలీబాల్.. షటిల్.. టీటీ.. టెన్నిస్..కబడ్డీ.. జిమ్నాస్టిక్స్.. చెస్... స్కిప్పింగ్.. ఖో ఖో, జంపింగ్.. రన్నింగ్.. ఎవరికి నచ్చిన ఆటను వాళ్లు ఆడుతున్నారు. ఆ పిల్లలను పట్టడం పెద్దవాళ్ల వల్ల కావట్లేదు. అలా ఓ గంట.. గంటన్నర వీరంగం తర్వాత స్విచ్ ఆఫ్ చేసినట్టుగా పిల్లలంతా సోఫాల్లో.. కుర్చీల్లో సాగిలపడ్డారు. చెమటతో తడిసి ముద్దయిపోయారు. ఆట వస్తువులన్నీ వచ్చిన దారినే తిరిగి వెనక్కి వెళ్లిపోయాయి. ఇంట్లో వస్తువులన్నీ చిందరవందరయ్యాయి.. తలలు పట్టుక్కూర్చున్నారు పెద్దలు! అలిసిపోయిన పిల్లలు స్నానం చేసొచ్చి.. బుద్ధిగా పుస్తకాలు ముందేసుకొని చదువుకోసాగారు. రెండునెలలుగా ఆ కాలనీలో జరుగుతున్న తీరిది. ఆ ఆట వస్తువులన్నీ ఎక్కడి నుంచి వస్తాయో.. ఎవరు పంపిస్తున్నారో తెలియదు. పోలీస్ కంప్లయింట్ కూడా ఇచ్చారు. అయినా జాడ దొరకలేదు. నష్టమైతే జరగట్లేదు కదా.. పోనీండి ఆడుకోనివ్వండి పిల్లలను అని పోలీసులూ ఆ కేస్‌ను వదిలేశారు. తల్లిదండ్రులే పట్టువదలని విక్రమార్కుల్లా ఉన్నారు .. ఆ ఆరా తీయడానికి. వంతుల వారీగా అన్వేషణ జట్లు తయారయ్యాయి పెద్దలవి. అయినా లాభం లేకపోయింది. విడివిడిగా ఎవరిళ్లల్లో వాళ్లు పిల్లలను ప్రశ్నించారు.. ‘‘ఆ ఆటవస్తువులు ఎక్కడి నుంచి వస్తున్నాయి.. మీరెందుకలా ప్రవర్తిస్తున్నారు?’’ అని. తెలియక.. తెల్ల మొహాలు వేశారు పిల్లలు. ఈ పిడుగులు నాటకాలు ఆడుతున్నారు అని పెద్దలు పిల్లల మీద స్పైని పెట్టారు. పాపం.. పిల్లలు అమాయకులని తేల్చింది ఆ స్పై టీమ్. మరి ఈ ఆట ఆడిస్తున్నదెవరు? ఎప్పటిలాగే ఆ రోజూ రాత్రి అయింది. ఒంటి గంటకు.. షరామామూలుగా పెద్దల చెవుల్లో మోత.. భరించరాని మోత.. ఆ తర్వాత హెచ్చరిక.. ‘‘మీ కాలనీ గ్రౌండ్లో కట్టిన షాపింగ్ కాంప్లెక్స్‌ను కూల్చేస్తారా? లేదా?’’ ఇసుక.. మట్టి.. కలగలిపి డబ్బాలో వేస్తే ఎలాంటి శబ్దం వస్తుందో అలాంటి స్వరంతో! దిగ్గున లేచి కూర్చున్నారంతా! పదే పదే ఆ హెచ్చరిక.. ప్రతి పది నిమిషాలకు ఒకసారి! ఇదేమీ పట్టని పిల్లలు ప్రశాంతంగా నిద్రపోతున్నారు. పెద్దవాళ్లకు మాత్రం నిద్ర లేదు! అలాగే తెల్లవారి పోయింది. అరవై రోజులుగా ఇది నిత్యకృత్యమే అయినా ఆ రాత్రి హెచ్చరికెందుకో పెద్దవాళ్లందరిలో గుబులు రేపింది. పిల్లలు స్కూళ్లకు వెళ్లిపోయాక.. ఆఫీసులు మానేసి మరీ కమ్యునిటీ హాల్లో సమావేశమయ్యారు. ‘‘ నిన్న రాత్రి వార్నింగ్ కొంచెం భయంగా ఉంది’’ అంది ఓ తల్లి. ‘‘అవును.. ఆ షాపింగ్ కాంప్లెక్స్ కూలగొట్టించకపోతే మన ఇళ్లే కూలిపోతాయ్ అన్నట్టుగా ఉంది ’’ అన్నాడు ఓ తండ్రి. ‘‘ఏం చేద్దాం?’’ కొంతమంది బయటకి అనేశారు కొంతమంది మనసులోనే ప్రశ్నించుకున్నారు. ‘‘అసలప్పుడు ఆ షాపింగ్ కాంప్లెక్స్ కట్టకుండా అడ్డుకుంటే అయిపోయేది!’’ విచారంగా అన్నాడు మరో తండ్రి. ‘‘అవున్నిజమే. అక్కడ గ్రౌండ్ ఉన్నప్పుడు పిల్లలెంత సంతోషంగా ఉన్నారు? ఎంత హెల్తీగా ఉన్నారు?’’ ఓ తల్లి గతంలోకి వెళ్లింది. స్కూల్ నుంచి రాగానే బ్యాగ్‌లు పడేసి గ్రౌండ్‌కి వెళ్లిపోయే వాళ్లు. ఆడినంత ఆడి ఇంటికొచ్చే వారు ఆకలితో నకనకలాడుతూ. స్నానం చేసొచ్చి ఏది పెడితే అది ఆవురావురంటూ తిని హోమ్ వర్క్ చేసుకొని పక్క మీద వాలిపోతే తెల్లవారి గంట కొట్టినట్టుగా కరెక్ట్ ఆరింటికి లేచేవాళ్లు. మెతుకు మిగల్చకుండా టిఫిన్ బాక్స్ తిరిగొచ్చేది. టీవీ పెట్టినా చూసేవారు కాదు పిల్లలు. ప్రాజెక్ట్ వర్క్ కోసం తప్ప కంప్యూటర్ వైపు కన్నెత్తే వారు కాదు. ఫోన్స్‌తో ఆటే లేదు. ఫ్రెండ్స్.. ఆటలే వాళ్ల లోకం. ఏ పని చెప్పినా.. పరిగెత్తడమే. నిదానమైన నడకే లేదు. అసలు ఎంత ఉత్సాహంగా ఉండేవాళ్లు? కాలనీ కూడా గలగల్లాడుతూ ఉండేది. అనుకోవద్దు కాని ఆ గ్రౌండ్లో షాపింగ్ మాల్ వచ్చినప్పటి నుంచి కాలనీకి ప్రేత కళొచ్చేసింది. పిల్లల్లో మునుపటి ఉత్సాహం లేదు. వేళ్లాడిపోతూ.. కళ్ల కింద నల్లటి చారలతో పదేళ్లకే పాతికేళ్ల వాళ్లలా తయారవుతున్నారు. పెద్దాళ్లంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పిల్లలంతా తమ కళ్లముందే నిస్సత్తువతో నిర్జీవంగా.. అకాల వార్ధక్యాన్ని మోస్తూ తిరిగుతున్నట్టనిపించింది వాళ్లకు. మొహమొహాలు చూసుకున్నారు అంతా! ‘‘అది చెప్పినట్టే చేద్దాం.. ఈ రాత్రికే ముహూర్తం పెట్టుకుందాం’’ ముక్త కంఠంతో అన్నారు. అదృశ్య శక్తేదో ఆదేశించినట్టు ఎవరిళ్లకు వాళ్లు వెళ్లిపోయారు. ఆ రాత్రి తాము చేయబోయే పనికి రంగం సిద్ధం చేసుకోవడంలో మునిగిపోయారు. మరుసటి రోజు ఉదయం.. స్కూల్‌కి వెళ్లబోతున్న పిల్లలు తమ ఇళ్లకు ఎదురుగా సూర్యుడి కిరణాలతో ఆడుకుంటున్న గ్రౌండ్‌ను చూసి షాక్ అయ్యారు. తేరుకొని పుస్తకాల సంచీని అక్కడే పడేసి సంతోషంతో కేరింతలు కొడుతూ ఆ గ్రౌండ్లోకి పరిగెత్తారంతా! -సరస్వతి రమ -
భజనలో తల తెగిన శరీరం
‘‘సర్.. సర్...’’ భుజం తట్టి లేపేసరికి మెలకువ వచ్చింది పరశురామ్‌కి. నిద్ర బరువుతోనే కళ్లు తెరిచి చూశాడు. చేతిలో ఏదో పట్టుకొని ఓ పిల్లాడు.. మసక మసకగా కనిపించాడు. కళ్లు నులుముకుంటూ లేచి కూర్చున్నాడు. ‘‘ చాయ్’’ అంటూ ఆ పిల్లాడు పరశురామ్ మొహం మీదకి చేయి చాపాడు. ‘‘ఏయ్.. ఏందిది? ఎవరు నువ్వు’’ చిరాకు పడుతూ నెమ్మదిగానే ఆ అబ్బాయి చేతిని పక్కకు తోశాడు. ఆ పిల్లాడు ఆ టీ గ్లాస్‌ను అక్కడే ఉన్న బల్ల మీద పెట్టి నవ్వుతూ వెళ్లిపోయాడు. పొగలు గక్కుతోంది టీ! సందేహంగానే టీ గ్లాస్ చేతుల్లోకి తీసుకున్నాడు పరశురామ్. ఓ గంటకు.. ‘‘సర్...’’ అంటూ గుమ్మం దగ్గర్నుంచి పిలుపు వినిపించింది. ఖాకీ యూనిఫామ్‌ను సరిగ్గా సర్దుకొని ‘‘ఎవరూ?’’ అంటూ గుమ్మం వైపు నడిచాడు పరుశురామ్. అక్కడ ఓ పదమూడేళ్ల పిల్ల.. చేతిలో టిఫిన్ ప్లేట్‌తో. ‘‘టిఫిన్’’ అంది అతని ముందుకు టిఫిన్ ప్లేట్‌ను చాస్తూ! ‘‘ఎందుకు? అసలు మీరెవరు?’’ ఉదయం చిరాకు కొనసాగింది అతనిలో. ‘‘తెలీదు’’ అన్నట్టుగా చేయి తిప్పతూ లోపలికి పరిగెత్తింది ఆ పిల్ల. టేబుల్ మీద టిఫిన్ ప్లేట్ పెట్టేసి అంతే వేగంగా బయటకూ వెళ్లిపోయింది ఆ అమ్మాయి. పరశురామ్‌కి ఏమీ అర్థం కాలేదు. ఇంతలోకే ట్రైన్ సిగ్నల్స్ అందేసరికి క్లియరెన్స్ ఇవ్వడానికి ఎర్ర జెండా, పచ్చ జెండా పట్టుకొని క్యాబిన్ బాల్కనీలోకి వెళ్లాడు. క్యాబిన్మన్గా రెండు రోజుల కిందటే ఆ ఉద్యోగంలో చేరి.. ఆ ఊరికొచ్చాడు పరశురామ్.‘‘ఊరవతల అడవిలో ఒంటి స్తంభం మేడలా ఉంటుందంట క్యాబిన్.. ఒక్కడివే ఎలా ఉంటావురా..’’ అంటూ శోకాలతో సాగనంపారు ఇంట్లో వాళ్లు. అడవిలో క్యాబిన్ ఉన్న మాట వాస్తవమే కాని తన పెద్దవాళ్లు భయ పడినట్టుగా.. భయపెట్టినట్టుగా ఏమీ లేదు. మూడోరోజు.. ఇదిగో ఇలా టీ, టిఫిన్ల సర్వీసూ మొదలైంది.. అని అనుకుంటూండగానే మళ్లీ ఠక్కున ఆలోచన వచ్చింది పరశురామ్‌కి.. ‘‘ఇంతకీ ఆ పిల్లలు ఎవరు?’’ అని. రోజుకు మూడు ట్రైన్లు ఇటు వస్తాయి.. ఇంకో మూడు ఇటు నుంచి వెళ్తాయి. ఆ పూట రెండు ట్రైన్లకు సిగ్నల్ ఇచ్చేసి వచ్చి.. మళ్లీ పడుకున్నాడు పరశురామ్. సరిగ్గా మధ్యాహ్నం ఒంటి గంటకు.. తలుపు దబదబా బాదిన చప్పుడు.. దిగ్గున లేచి కూర్చున్నాడు పరశురామ్. వెళ్లి తలుపు తీశాడు. ఓ నలుగురైదుగురు అమ్మాయిలు, అబ్బాయిల గుంపు... ‘‘సర్ లంచ్’’ అంటూ విస్తరాకులో చుట్టి ఉన్న భోజనం ప్యాక్‌ను పరశురామ్ మొహం ముందు పెట్టాడు ఆ గుంపులోని ఓ అబ్బాయి. వింతగా అనిపించింది పరశురామ్‌కి. ఆ ప్యాక్‌ను తీసుకుంటూ ‘‘ మీరంతా ఎవరు? పొద్దున్నుంచి చూస్తున్నా. వేళకు టీ, టిఫిన్, భోజనం తెచ్చిస్తున్నారెందుకు? వీటికి డబ్బులు ఎంత? అసలు ఎక్కడుంటారు మీరు?’’ అంటూ ప్రశ్నలు కురిపించాడు. ఆ మాటలకు నవ్వారు వాళ్లంతా. ‘‘సర్.. సాయం కాలం.. టీ, రాత్రి భోజనం కూడా తెస్తాం! ఆ.. అన్నట్టు ఈ రోజు రాత్రి ఒంటి గంటన్నరకు భజన ఉంటుంది.. మీ ఇంట్లోనే. దానికి పర్మిషన్ ఇవ్వండి చాలు.. ఈ సర్వీస్‌కి డబ్బులేం వద్దు’’ అంటూ వెళ్లిపోయారు ‘‘‘రెండు గంటలకు భజనేంటో’’ అనే అయోమయంతోనే లోపలికి వచ్చాడు పరశురామ్. విస్తరాకు విప్పాడు.. తనకు ఇష్టమైన మటన్ బిర్యానీ. తిన్నాడు. అద్భుతంగా ఉంది! ఎన్నడూ అలాంటి రుచి చూడలేదు. ఒకలాంటి మత్తు ఆవహించింది. మళ్లీ పడుకున్నాడు. సాయంత్రం... నాలుగు గంటలు.. ‘‘సర్.. సర్’’ అంటూ తన కాలు పట్టి ఎవరో లాగుతున్నట్టనిపిస్తే ఒక్కసారిగా కాలు విదిల్చుకుంటూ లేచి కూర్చున్నాడు పరశురామ్. ఎదురుగా పదేళ్ల పిల్లాడు.. ఉదయం టీ తెచ్చిచ్చిన పిల్లాడు. ఇప్పుడూ టీ గ్లాస్‌తో నిలబడి ఉన్నాడు. ఏమీ మాట్లాడకుండా టీ గ్లాస్ తీసుకొని చేతికున్న గడియారం చూసుకున్నాడు. ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది అతనికి. వెంటనే ల్యాండ్‌లైన్ ఫోన్ ఉన్న గదిలోకి వెళ్లి స్టేషన్‌కు ఫోన్ చేశాడు. ‘‘ఏ.. అలా అడుగుతున్నావ్? సిగ్నల్ క్లియర్ చేసింది నువ్వే కదా..’’ అని జవాబు వచ్చింది అవతలి నుంచి. ‘‘ఆ.. ఆ’’ అంటూ ఫోన్ పెట్టేసి ముందు గదిలోకి వచ్చేసరికి ఆ పిల్లాడు లేడు. ‘‘నేను సిగ్నల్ క్లియర్ చేయడమేంటి? అయినా ఇంత మొద్దు నిద్ర ఎలా పట్టింది?’’ అనుకుంటూ అక్కడే ఉన్న కుర్చీలో కూలబడ్డాడు. తల దిమ్ముగా అనిపించింది. చేతిలో ఉన్న టీ గ్లాస్‌లోంచి నెమ్మదిగా టీ సిప్ చేశాడు. అమృతం ఇలాగే ఉంటుందేమో అనిపించింది అతనికి ఆ రుచి చూడగానే! ఆ క్షణం నుంచి రాత్రి భోజనం కోసం ఎదురు చూడ్డం మొదలుపెట్టాడు. ఎనిమిదింటికి భోజనం వచ్చింది. తిన్నాడు. అదీ అంతే. అమోఘమైన రుచి! తిన్న వెంటనే నిద్ర రాబోతుంటే.. బలవంతంగా ఆపుకున్నాడు. మధ్యాహ్నం లాగా ట్రైన్ వెళ్లిపోతుందేమో అనే భయంతో! ఏదో పుస్తకం చదువుతూ కాలక్షేపం చేశాడు. సరిగ్గా పన్నెండు గంటల ముప్పై నిమిషాలు.. ఆ టైమ్‌లో కుడి వైపు నుంచి వచ్చే రైలుకి క్లియరెన్స్ ఇవ్వాలి. ఇచ్చి మళ్లీ లోపలికి వచ్చాడు. ఇక నిద్ర ఆగలేదు.. కమ్ముకు వచ్చింది. మళ్లీ ఒంటిగంటన్నర ట్రైన్‌కి సిగ్నల్ ఇవ్వాలి. ఎంతకైనా మంచిది అనుకొని అలారం పెట్టుకుని.. అలాగే కుర్చీలో కునుకు కోసం ఒరిగాడు. రాత్రి ఒంటి గంటా పదిహేను నిమిషాలకు.. పెద్ద పెద్ద రాగాలకు మెలకువ వచ్చింది పరశురామ్‌కి. పెడబొబ్బల్లాగే ఉన్నాయి ఆ స్వరాలు. అంతకంతకూ ఆ రాగాలు తన క్యాబిన్ దగ్గరకే వచ్చాయి. అప్పుడు గుర్తొచ్చింది.. ‘‘భజన’’ సంగతి. వెళ్లి తలుపు తీశాడు. పిల్లా..పెద్దాతో కలిసి పన్నెండు మంది సమూహం. వాళ్లలో తనకు టీ, టిఫిన్, లంచ్, డిన్నర్ తెచ్చిన వాళ్లూ ఉన్నారు. ప్రారంభమైంది భజన... బీభత్సంగా! ఆ కంఠస్వరాలకు ముందు జడుసుకున్నాడు పరశురామ్. రానురాను శ్రావ్యంగా.. చెవుల్లో తేనెలు పోసినట్టుగా మారిపోయాయి వాళ్ల గొంతులు. సమ్మోహితుడయ్యాడు అతను. తెలియకుండానే తనూ వాళ్లతో గొంతు కలిపాడు. పారవశ్యంతో ఊగిపోయాడు. ఒంటిగంటన్నర... ఎవరో తలుపు తట్టారు.. తన్మయత్వంతోనే వెళ్లి తలుపు తీశాడు.. ఎదురుగా ఓ యువకుడు.. నవ్వుతూ! అతని చేయి పట్టుకొని లోపలికి తీసుకొచ్చి ఆ గుంపుతో ఆ యువకుడిని కలిపి..వాళ్ల గానమాధుర్యంలో ఊగిపోయాడు పరశురామ్. ఉదయం ఆరున్నర గంటలు.. బయట ఏదో కలకలం.. చెవి పక్కనే పోరుపెటినట్టు్ట అనిపిస్తే కళ్లు తెరిచాడు పరశురామ్. ఆ కలకలం ఏడుపులుగా మారింది. మత్తు దిగినట్టయి ఠక్కున లేచి కిందికి పరిగెత్తాడు. జనాల గుంపును తోసుకుంటూ పోలీసులున్న చోటికి వెళ్లాడు.. అక్కడ తల, మొండెం.. వేరై ఉంది ఓ శరీరం. చూసి.. బిగుసుకుపోయాడు పరశురామ్. ఆ తల.. ఆ తల.. రాత్రి.. తలుపు.. కుర్రాడు.. లీలగా అతని మస్తిష్కంలో మెదులుతోంది ఆ రూపం! - సరస్వతి రమ -
తంబూరా మోగిందో.. ప్రాణం ఆగిపోవాల్సిందే!
‘‘మనమెందుకు దొంగల్లా రాత్రిళ్లు బయలుదేరాలి? ఎంచక్కా పొద్దున్నే వెళదాం’’ అంది ఇరవయ్యేళ్ల అమ్మాయి. ఒక్కసారిగా ఆ గుంపులో కలకలం. తర్జభర్జనలు. ‘‘ష్.. సైలెన్స్!’’ అంటూ గద్దించింది ఓ పెద్దావిడ. ‘‘ఈ అమ్మాయి చెప్పింది కరెక్టే. మనమెందుకు దొంగల్లా రాత్రిళ్లు వీధుల్లోకి వెళ్లాలి? సూర్యోదయానికి ముందే బయలుదేరుదాం..!’’ కొనసాగించింది ఆ పెద్దావిడ. ‘‘వీధి కుక్కలతో ప్రమాదమేమో.. ఒక్కసారి ఆలోచించండి..’’ అన్నాడు ఆ గుంపులోని ఓ నడివయసు వ్యక్తి. చిన్నాపెద్దా అంతా ఘొల్లున నవ్వారు. ‘‘హుష్షూ... ’’ అని మళ్లీ ఆ గుంపును నియంత్రిస్తూ ‘‘ప్రమాదం లేదు.. ప్రమోదం లేదు. నగర సంకీర్తనకు పొద్దున్నే అందరూ సిద్ధంకండి’’ అని చెప్తూ అక్కడి నుంచి వెళ్లిపోయింది ఆ పెద్దావిడ. ఆమె అటు వెళ్లిందో లేదో.. ఆ గుంపులో మళ్లీ సందడి మొదలైంది. ఓ పాతికేళ్లమ్మాయి తన ముందు కూర్చున్న ఆరేళ్ల పిల్ల జుట్టులోంచి పేలు తీస్తూ పొరపాటున జుట్టునూ లాగింది. ‘‘అబ్బా.. ’’ అంటూ ఆ పిల్ల ఆ పాతికేళ్లమ్మాయిని గిల్లింది ప్రతీకారంగా. ‘‘ఒసేవ్.. పేలే...’’అంటూ ఆ పిల్ల నెత్తి మీద మొట్టికాయ వేసింది ఆ పాతికేళ్లమ్మాయి. ఇంకోవైపు.. ‘‘ఒరేయ్.. నా చొక్కా వదల్రా..?’’ అంటూ పదేళ్లబ్బాయి వెంటపడ్డాడు పద్దెనిమిదేళ్ల కుర్రాడు. ‘‘ఇది నాది.. మొన్న రాత్రి నాలుగోనంబర్ వీధిలోని డాబా మీద ఆరేసుంటే ఎత్తుకొచ్చా’’ అంటూ వాడు ఆ కుర్రాడికి అందకుండా పరిగెత్తుతూనే ఉన్నాడు. ఆ చిన్న చిన్న గొడవలు, అల్లర్లు, అలకలతో ఆ పొద్దు గడిచింది. సూరీడు.. ఆ ఊరి తూరుపు కొండను ఇంకా ఎక్కలేదు. ఆ చూరు కింది వాళ్లంతా లేచి రెడీ అయిపోయారు. నుదుటన విబూది రాసుకున్నారు. నలుగురు నలుగురు కలిసి వరుస కట్టి.. ఆ సమూహంతో బయలుదేరింది. సణుగుడుగా మొదలైన సంకీర్తన.. ఊళ్లోకి వచ్చేసరికి పెద్ద రాగంగా మారింది. ఒక్కసారిగా ఆ ఊళ్లోని జనమంతా ఉలిక్కిపడి లేచారు. ఒక్క క్షణం అయోమయం. సమయం చూసుకున్నారు. అయిదు గంటలు! ఈ సంకీర్తన ఎప్పటిలా రాత్రి వస్తుందని ..నిద్రను ఎగరగొడ్తుందని.. అసలు నిద్రపోకుండా కాచుక్కూచున్నారు. ఇంకొంతమందేమో ..ఆ సంకీర్తన గుంపులో కనిపించే తమ వాళ్లను చూడ్డం కోసం కిటికీ కన్నాల్లోంచి.. చూరు సందుల్లోంచి కళ్లను వేల్లాడేశారు. అలా వేచి వేచి కళ్లు కాయలు కాచినా ఆ సంకీర్తన సమూహం రాకపోయేసరికి ఆ అలసటతో ఎప్పుడు నిద్రలోకి జారుకున్నారో తెలియనేలేదు. ఇదిగో ఇప్పుడు ఇలా.. ఆ గళంతో ఒక్కసారిగా మెలకువ వచ్చింది. ఆత్రం.. బెరుకు.. భయం.. కలవరం.. అన్నీ ఒక్కసారి చుట్టుముట్టాయి అందరినీ! రానురానూ ఆ సంకీర్తన దగ్గరవుతోంది. జనాల్లో గుబులు, అలజడి మొదలైంది. ఆ సంకీర్తన సమూహం తమ ఊరికొచ్చి వారం అవుతోంది.. ముందు రెండు రోజులు ఊరంతా బాగా ఎంజాయ్ చేసింది. తర్వాత రెండు రోజులు ఆ కర్ణకఠోర గళాలు ఊరి చెవులను చిల్లులు పడేలా చేసింది. ఆ తర్వాత నుంచి ఆ సమూహంలోని మనుషులు.. వాళ్లు చేసే పని వెన్నులోంచి వణుకు పుట్టించడం మొదలుపెట్టింది. ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు.. ఎక్కడుంటున్నారో తెలియదు. భిక్షాటన చేస్తారు. భిక్షగా వాళ్లు కోరేది ఆహారాన్ని కాదు.. మనుషులను. ఈ నిజం అనుభవంలోకి వచ్చిన రెండు రోజులకే ఊళ్లో సగం మందికి వెరుపు జ్వరాలు పట్టుకున్నాయ్. ఈ మసక వెలుతురు కూడా అలాంటి భయాన్నే కలిగిస్తోంది. ఓ ఇంటి ముందు నుంచి వెళ్తుంటే ఆ సంకీర్తన గుంపులో ఉన్న ఎనిమిదేళ్ల పిల్లాడు ఆ ఇంటి వాకిట్లో ఆగిపోయాడు. ఆ పిల్లోడి కంటే నాలుగు అడుగులు ముందుకు కదిలిన ఆ గుంపు ఆగిపోయింది. అలాగే అక్కడే నిలబడి చేతుల్లో ఉన్న తంబూర తంత్రులను ఒక్కసారిగా మీటారు శ్రుతి, లయ ఏమీ లేకుండా! ఒక్కసారిగా ఆపారు.... మళ్లీ మీటారు.. మళ్లీ ఆపారు. చివరిసారిగా మీటారు. ఆ ఇంటి తలుపులు తెరుచుకున్నాయ్. ఇంట్లోని వాళ్లంతా వచ్చి గేట్ దగ్గర నిలబడ్డారు. ఆ పిల్లాడిని చూసి హతాశులయ్యారంతా! అతను ఆ ఇంటివాడే. ఆ సభ్యులకు కొడుకు, మనవడు, మేనల్లుడు, తమ్ముడు అవుతాడు. ఆ అబ్బాయి ఆ ఇంటి వైపు మొహం తిప్పకుండానే చేతిని చాచి చూపుడువేలితో ఆ సభ్యుల్లోని ఒక వ్యక్తిని చూపించాడు. ఆ వ్యక్తి ఈ అబ్బాయికి మేనమామ అవుతాడు. ఆ అబ్బాయి అలా చూపించే సరికి ఆ ఇంట్లో వాళ్లంతా ఒక్కసారిగా ఘొల్లుమన్నారు. ఆ గుంపు అదే పనిగా శ్రుతి, లయ లేకుండా తంబూరలు వాయించడం మొదలుపెట్టింది. ఎనిమిదేళ్ల కుర్రాడు ముందుకు కదిలాడు. వెనకాలే ఆ పిల్లాడి మేనమామ అడుగులు కదిపాడు.. వణుకుతూ! సమూహం కూడా ముందుకు సాగింది. మేనమామకు గతం గుర్తుకొస్తోంది. ఆ పిల్లాడి పట్ల తను ప్రవర్తించిన తీరు గుర్తొచ్చింది. ఆ దారిపొడువునా ఆ పాశవిక తలపోతలే! ఆ గుంపులోని ఇంకో మనిషి మరో ఇంటి ముందు ఆగేదాకా సాగిన ఆ ప్రయాణంలో అతనికి తన మీద తనకే అసహ్యం వేసింది. విరక్తి కలిగింది. ఆ జీవితాన్ని అంతం చేసుకోవాలన్న కోరిక బలంగా పుట్టింది. ఆ సమూహం తంబూరాలు మీటుతూనే ఉంది.. శ్రుతిలయ తప్పి! ఆ వ్యక్తి తన చేతులతో తానే గొంతు నులుముకొని ప్రాణాలు తీసుకున్నాడు. ఒక్కసారిగా తంబూరాల మోత ఆగింది. ‘‘ఎవరికి మూడిందో’’ అనుకున్నారు ఊళ్లోని మిగిలిన జనాలు! ఇంకో ఇంటి వాకిట్లో పాతికేళ్ల అమ్మాయి ఆగింది. నాలుగు అడుగులు ముందు ఆగిన సమూహం... మూడుసార్లు తంబూరాలు మీటింది.. ఆపింది.. ఈసారి ఆ ఇంట్లోంచి ఒక్కడే వ్యక్తి వచ్చాడు. అతను.. ఆ పాతికేళ్లమ్మాయి భర్త. మిగిలిన సభ్యులున్నా.. అతనే వచ్చాడు.. విషయమై అర్థమై! మళ్లీ తంబూరాలను వెర్రి ఆవేశంతో మీటుతూ ఆ సమూహం ముందుకు నడిచింది. అందరి తలలూ కిందకి వేసి ఉన్నాయి. అందరి మొహాలను కప్పేస్తూ కిందికి జాలువారిన ఆ జుట్టు నేలను ఊడుస్తోంది. వాళ్లను అనుసరిస్తూ క్షణంలో ఆ గుంపులో కలిసిపోయింది ఆ పాతికేళ్ల అమ్మాయి. ఆ భర్తకు పశ్చాత్తాపం మొదలైంది. మగపిల్లాడే కావాలని ఆ అమ్మాయికి నరకం చూపించాడు. హింసించాడు. తను చేసిన తప్పు తెలిసొచ్చి... గట్టిగా ఏడుస్తూ నేల మీద కూలబడిపోయాడు. వెంటనే సమూహం తంబూర నాదాల్ని తీవ్రం చేసింది.. శ్రుతిలయ లేకుండా. ఆ భర్త.. నేలమీదున్న రాయిని తీసుకొని తల కొట్టుకోవడం మొదలుపెట్టాడు. తంబూరా తంత్రులు మోగుతూనే ఉన్నాయ్.. ఆ చప్పుడికి మెదడు చిట్లేలా. తల పగిలి రక్తం చిమ్ముతున్నా ఆ నొప్పి.. బాధ తెలియట్లేదు అతనికి. అలా కొట్టుకొని కొట్టుకొని చలనం లేకుండా పడిపోయాడు ఆ భర్త! తంబూరాలూ ఆగిపోయాయి! ముందుకు నడుస్తూ నడుస్తూ ఆ సమూహమూ చీకట్లో అదృశ్యమైపోయింది... గాల్లో కలిసిపోయింది. - సరస్వతీ రమ -
కేఫ్.. కాఫీ
ఎప్పటిలా ఆ కెఫేలో అతని కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు మకరంద్. కేఫ్ అంతా కిక్కిరిసి ఉంది. చోటు లేదు. అసలే మనసు చెదిరి ఉన్నాడు. ఇక్కడికి వచ్చి అతను చెప్పే నాలుగు మాటలతో ఊరట పొందుదామనుకుంటే.. నిలబడ్డానిక్కూడా జాగా దొరక్కపోయేసరికి మరింత చిరాకు పడింది మనసు. కేఫ్ బయటే.. ఫుట్ పాత్ మీద నిలబడి షర్ట్ జేబులోంచి సిగరెట్ తీసి వెలిగించాడు. దమ్ములాగబోతున్న మకరంద్ నోట్లోంచి చటుక్కున సిగరెట్ లాగి అవతలపారేశాడు అతను. మకరంద్ కళ్లల్లో వెలుగు. అప్పటిదాకా ఆవహించి ఉన్న నైరాశ్యం ఒక్కసారిగా ఎగిరిపోయింది. ‘‘ఎక్కడికెళ్లారు సర్.. కనిపించలేదు’’అంటూ అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు మకరంద్. ‘‘ఎప్పుడూ ఉండే చోటే ఉన్నాను..’’ అంటూ మకరంద్ భుజాల చుట్టూ చేయి వేసి ఆ కుర్రాడిని లోపలికి తీసుకెళ్లాడు అతను. ఎప్పుడూ కూర్చునే చోట.. ఐసోలేటెడ్‌గా ఉన్న కార్నర్ టేబుల్ దగ్గర కూర్చున్నారిద్దరూ. ‘‘ఇందాక ఈ టేబుల్ కూడా ఖాళీ లేదు సర్’’ అన్నాడు మకరంద్. ‘‘సర్లే ఏంటీ విషయాలు?’’ అన్నాడు అతను. ‘‘సర్.. నాకు చచ్చిపోవాలనిపిస్తోంది’’ అన్నాడు మకరంద్ ఒక్కసారిగా.. కళ్లనిండా నీళ్లతో. ‘‘హూ... నీ నోటి నుంచి ఈ మాట వినకూడదనే కదా.. నీతో స్నేహం చేస్తోంది’’ నిట్టూర్చాడు అతను. ‘‘లేదు సర్.. నాకింకే దారీ లేదు. ఈ డీల్ కుదిరి ప్రాజెక్ట్ వస్తుందేమోనని ఆశతో వెయిట్ చేశా. కాని రాలేదు. ఈ రోజే తేలింది. ఈ ప్రాజెక్ట్ తప్ప నా కష్టాలు తీరే ఇంకే ఆధారమూ లేదు నా దగ్గర. అదీ పోయింది. చావొక్కటే..’’ అంటూ టేబుల్ మీద రెండు చేతులను ఆనించి తల దాచుకున్నాడు మకరంద్. ‘‘మకరంద్..’’ అంటూ ఆ అబ్బాయి తల నిమిరాడు అతను. 32 ఏళ్ల కుర్రాడు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో చదివొచ్చాడు. మెరిట్ స్టూడెంట్. చిన్నవయసులోనే వ్యాపార మెలకువలను ఔపోసన పట్టాడు. 27 ఏళ్లకే వ్యాపార సామ్రాజ్యానికి చక్రవర్తి అయ్యాడు. వందల మందికి ఉద్యోగాలు ఇచ్చాడు. అలాంటి పిల్లాడు.. ఇప్పుడు.. ఇక్కడ బేలగా.. బతుకుంటే భయంతో చావడానికి సిద్ధంగా కనిపిస్తున్నాడు. మకరంద్‌ను అలా చూస్తుంటే తన గతం గుర్తొచ్చింది అతనికి. అతనూ అంతే. వారసత్వంగా వచ్చిన వ్యాపారాన్ని కాదనుకొని కొత్త వ్యాపారం మొదలుపెట్టాడు. చిన్న వయసులోనే గొప్ప వ్యాపారవేత్తగా పేరుపొందాడు. యువత తమ ఆలోచనలను తేనీటితో పదును పెట్టుకోవడానికి ప్రపంచంలోనే మొదటి వేదికను ప్రారంభించాడు. థాట్స్ విత్ టీ.. కాఫీ.. చైన్ షాప్స్ను ఓపెన్ చేశాడు. దేశంలోని యూత్ అంతా బాగా ఇష్టపడ్డారు. వ్యాపారం బాగా సాగింది. లోన్స్తీసుకొని మరీ స్ప్రెడ్ చేశాడు. ఆ కుర్రాడికి వచ్చిన పరిస్థితే తనకు వచ్చింది.. ఏం చేశాడు? వెన్నులో వణుకుతో ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చాడుతను. ‘‘ఈ పిల్లాడికి సాయం చేయాలి.. ’’ అనుకున్నాడు. కళ్లు తుడుచుకుంటూ తల పైకెత్తాడు మకరంద్. ఎదురుగా అతను లేడు. చుట్టూ చూశాడు. ఎక్కడా కనిపించలేదు. కుర్చీలోంచి లేచి అతణ్ణి వెతకడానికి ఎంట్రెన్స్ వైపు వెళ్లబోతుంటే అతను కూర్చున్న కుర్చీలో ఒక లెటర్ కనిపించింది.. గాలికి ఎగిరిపోకుండా కాఫీ మగ్ పెట్టి. తీసుకుని చదువుకుంటూ బయటకు వెళ్లాడు. ‘‘సర్.. ఇందాకటి నుంచి ఎదురుచూస్తున్నాను మీ కోసం.. లేట్ అయిందే?’’ తనకు ఎదురుగా ఉన్న కుర్చీని లాక్కొని కూర్చుంట్ను వ్యక్తిని ఉద్దేశిస్తూ అంది వందన. ‘‘ఇక్కడే ఉన్నాను వేరే పనుల్లో’’ అన్నాడు అతను. ‘‘చెప్పమ్మా ఏంటీ విశేషాలు?’’ రెండు కాఫీలు ఆర్డర్ చేస్తూ అడిగాడు ఆ అమ్మాయిని. ‘‘ఉద్యోగం పోయింది సర్’’ అతని కళ్లల్లోకి చూస్తూ చెప్పింది ఆమె. ఆ అమ్మాయి కళ్లల్లో దిగులు. గత యేడాదిగా అతనికి పరిచయం ఆ పిల్ల. బాధ్యతగల అమ్మాయి. తాగుబోతు తండ్రి బాధ్యత మరిచిపోయి ఇంటిని పట్టించుకోకుండా తిరుగుతుంటే.. ఉద్యోగం చేస్తూ ఇంటి పెద్ద బాధ్యతను మోస్తోంది. అలాంటి ధైర్యం గల అమ్మాయి ఈ మాట అంటుందేంటి? షాక్ అయ్యాడు అతను. ‘‘ఏమైందమ్మా’’ అనునయంగా అడిగాడు. అంతే ఆ కాస్త అనునయానికే కట్టలు తెంచుకుంది ఆమె దుఃఖం. రెండు చేతుల్లో మొహం దాచుకొని భోరుమంది. ఎమ్మెఎస్ కోసం తమ్ముడిని అమెరికా పంపడానికి లోన్ తీసుకొని మరీ డబ్బు సమకూర్చింది. వాటిని దొంగతనం చేశాడు తండ్రి. ఆ సమస్యను గట్టెక్కలేక ఆత్మహత్యే శరణ్యం అనుకుంటోంది వందన. తండ్రి వల్ల చిన్నప్పటి నుంచి తాము పడ్డ కష్టాలను తలచుకుంటూ కుమిలి కుమిలి ఏడ్చి.. తేరుకొని .. ‘‘సారీ సర్.. ’’అంటూ ఎదురుగా చూసింది. ఖాళీగా ఉంది కుర్చీ. అతను లేడు. ఎక్కడికెళ్లాడో అని చూడ్డానికి వెళ్లబోతుంటే అతను కూర్చున్న కుర్చీలో కాఫీ మగ్ కింద మడతపెట్టి ఉన్న ఒక కాగితం కనపించింది. తీసుకుంది ఆమె. ‘‘నేను ఈ ఊరొచ్చినప్పుడల్లా భలే కాఫీ ఇప్పిస్తావ్ బాబూ..’’ కాఫీ సిప్ చేస్తూ అన్నాడు నర్సయ్య. చిర్నవ్వుతో చూశాడు అతను. అంతలోకే చిన్నబుచ్చుకుంటూ నర్సయ్య.. ‘‘ఏంటో బాబు... అప్పులు తప్ప వ్యవసాయంలో ఏమీ మిగలట్లేదు. అవి తీర్చడానికి బతుకే తాకట్టుపెట్టాల్సి వస్తోంది..’’ అంటూ తన జబ్బకున్న సంచీలోని పురుగుల మందు డబ్బాను తడుముకున్నాడు నర్సయ్య. ‘‘అంత మాటంటున్నావ్ ఏంటి పెద్దాయనా?’’ గాబరాపడ్డాడు అతను. ఎప్పటి నుంచి దాచుకున్న వేదనో.. కళ్లలోంచి ఉబికి వచ్చి భుజం మీది కండువాలో మొహం దాచుకున్నాడు నర్సయ్య. ఆత్మాభిమానం తన ప్రెజెన్స్‌ను గుర్తుచేసినట్టుంది. కండువాతో మొహం తుడుచుకుంటూ చూశాడు. అతను లేడు. తన జబ్బకున్న సంచీ కూడా మాయం. కాని ఆ టేబుల్ మీద రికార్డర్ లాంటిదేదో కనపడింది. తీసుకున్నాడు నర్సయ్య. రెండు రోజుల తర్వాత.. కేఫ్‌లో.. మకరంద్, వందన, నర్సయలతోపాటు ఇంకో పదిమంది అతని కోసం ఎదురుచూస్తున్నారు. వాళ్లలో ఏ దిగులూ లేదు. సంతోషంగా ఉన్నారు. వాళ్లకున్న సమస్యలు ఇంకా తీరిపోలేదు. కాని తీర్చుకుంటామన్న ధైర్యం.. ఆత్మవిశ్వాసంతో తొణికిసలాడుతున్నారు. అందరి చేతుల్లో ఏవో గిఫ్ట్‌లు.. అతనికి ఇద్దామని. అంతలోకే వాళ్లకు ఆ కేఫ్‌లోని గోడ మీద ఆ వ్యక్తి ఫోటో కనిపించింది దండతో. షాక్ అయ్యారంతా! ఫోటోలోని అతనికి శ్రద్ధాంజలి ఘటిస్తున్న ఓ సర్వర్‌ను అడిగింది వందన... ‘‘అతను...’’ అంటూ! ‘‘మా బాస్.. యేడాది కిందట ఆత్మహత్య చేసుకున్నాడు.ఈరోజు ఆయన సంవత్సరీకం’’ చెప్పాడు సర్వర్. ‘‘అంటే తనకు ఇచ్చిన ఉత్తరంలోని ఆత్మహత్య కథ ఇతనిదేనా?’’ అనుకుంది వందన. -సరస్వతి రమ -
ఈ లిస్ట్‌లో పేరున్నవారికి ముచ్చెమటలు..
గేట్ ముందున్న ఆ గుంపును చూసి నివ్వెరపోయాడు వాచ్‌మన్. పదిపన్నెండు మంది దాకా ఉన్నారు. ఆ గుంపుకి నాయకత్వం వహిస్తున్న వ్యక్తి అనుకుంటా.. షర్ట్ జేబులోంచి ఏదో కార్డ్ తీసి‘‘ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్’’ అంటూ ఆ కార్డ్ చూపించారు వాచ్‌మన్‌కి. ఒక్కసారి నిద్ర ఎగిరిపోయి.. గేట్ తెరిచాడు. వాళ్లు లోపలికి వెళ్తుంటే ‘‘అర్ధరాత్రి పూట కూడా ఇన్‌కమ్‌టాక్స్ రెయిడ్స్ జరుగుతాయా అంటూ ఆవులించాడు వాచ్‌మన్. మెయిన్ డోర్ దగ్గరకు వెళ్లి కాలింగ్ బెల్ నొక్కారు వాళ్లు. హాల్లోనే పడుకున్న ఆ ఇంటి సర్వెంట్ లేచి తలుపు తెరిచాడు. వాచ్‌మన్‌కు చూపించినట్టే కార్డ్ చూపించి లోపలికి తోసుకుని వచ్చేశారు వాళ్లు. ఆ సర్వెంట్ గబగబా ఆ ఇంటి యజమాని బెడ్రూమ్ దగ్గరకు వెళ్లి తలుపు తట్టాడు. యజమానురాలు తలుపు తెరిచింది. విషయం చెప్పాడు సర్వెంట్. భర్తను లేపింది. ఆరాత్రి తాగిన మత్తు, నిద్ర మత్తు రెండూ వదిలాయి అతనికి. పైజామా మీద షర్ట్ వేసుకుంటూ హాల్లోకి వచ్చాడు.. అక్కడ ఎవరూ లేరు! యజమాని వెనకాలే వచ్చిన సర్వెంట్కూ హాల్లో ఎవరూ కనిపించలేదు. ‘‘అయ్యో.. వీళ్లేరి? ఇక్కడే ఉండే సర్.. అంటూ విశాలంగా ఉన్న ఆ హాలంతా కలియతిరిగాడు. హాల్లో ఉన్న మెట్ల మీంచి గబగబా పైకెక్కి మేడ మీదా చూశాడు.. ఎక్కడా కనిపించలేదు. అంతే వేగంగా కిందకు వచ్చాడు.. సోఫోలో తల మీద తువ్వాలు కప్పుకొని కూలబడ్డ యజమాని.. పక్కనే ఏడుస్తూ నిలబడ్డ యజమానురాలూ కనిపించారు. ‘‘ఏమైం..’’ అని మాట పూర్తిచేసే లోపే అరిచాడు యజమాని.. ‘‘ఎవడు పడితే వాడికి అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా తలుపు తీస్తావా?’’ అంటూ! తల వంచుకున్న ఆ సర్వెంట్ అప్రయత్నంగా మెయిన్ డోర్ వైపు చూశాడు. గడియ వేసిన తలుపు వేసినట్టే ఉంది. ‘‘సర్.. ’’అని పిలుస్తూ తలుపు వైపు చూపించాడు. చూసిన యజమాని అవాక్కయ్యాడు. మెదడులో ఏదో తట్టినట్టు ఇంటర్కమ్లో వాచ్‌మన్‌ను ఏదో అడిగాడు.. ‘‘ఎవరూ రాలేదు సర్’’ చెప్పాడు వాచ్‌మన్. ఎవరూ రాకపోతే.. సర్వెంట్‌కు ఆ పన్నెండు మంది ఎలా కనిపించినట్టు.. పోనీ అతను భ్రమపడ్డాడే అనుకున్నా.. ఇంట్లో ఎక్కడెక్కడ ఏమేం దాచామో తమకే తెలియని సొమ్ము ఎలా పోయినట్టు? పోనీ కనికట్టు జరిగిందనుకున్నా.. ఇదే టైమ్‌కి ఫారిన్ బ్యాంకుల్లో ఉన్న డబ్బంతా ఎలా పోయినట్టు ఆ బ్యాంక్ అధికారులకే తెలియకుండా.. అక్కడా ఫ్రాడ్ జరిగిందనుకున్నా.. భూములు, పొలాల డాక్యూమెంట్స్ పోయీ.. ఆ భూముల్లోకి ఇప్పటికిప్పుడే ఈ ఇళ్లన్నీ ఎలా వచ్చినట్టు.. ఆ పొలాల ధాన్యం ఎలా మాయమైనట్టు? తన ఫోన్లోని ఇళ్ల ఫోటోలు చూసుకుంటూ అనుకున్నాడు యజమాని. ‘‘ఒకసారి ఫైనాన్స్ మినిస్టర్‌కు కాల్ చేసి కనుక్కోండి.. రెయిడ్ గురించి’’ సూచించింది భార్య కనుక్కున్నాడు.. అదేం లేదే అని జవాబు వచ్చింది. ఆ యజమానీ ఒక మంత్రే. సరిగ్గా అదే సమయానికి ఇంకో మంత్రి ఇంట్లోనూ ఇలాంటి పరిస్థితే! లేట్‌నైట్ పార్టీ చేసుకొని వస్తూ .. పార్టీలో పరిచయమై.. పార్టీ ముగిసేలోపు ఫ్రెండ్స్ అయిన ఇద్దరబ్బాయిలు, ఇద్దరమ్మాయిలను ఇంటికి తీసుకొచ్చాడు సదరు మంత్రి కొడుకు. తెల్లవారు జాము నాలుగింటికి ఆకస్మాత్తుగా మెలకువొచ్చి లేచి చూసిన ఆ ఇంటివాళ్లకు ఇల్లు గుల్లౖయె కనిపించింది. సేమ్ .. విదేశీ బ్యాంకుల్లో దాచుకున్న సొమ్మంతా పోయింది దస్తావేజులతో సహా. స్థిరాస్థి అన్యాక్రాంతమైంది. మూసిన తలుపులు మూసినట్టే ఉన్నాయి కాని ఆ నలుగురు ఫ్రెండ్స్ మాత్రం మాయమయ్యారు. ఏమీ అర్థం కాక తలలు పట్టుకున్నారు. ఈ రెండు సంఘటనలు జరిగిన తెల్లవారి పది గంటలకు.. మంత్రులు, శాసన సభ్యులు, నేతలు, పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ అధికారులతో కూడిన ఒక హిట్ లిస్ట్.. మారుమూల గ్రామాల నుంచి, పట్టణాలు, నగరాల దాకా ప్రతి ఇంటి గోడ మీదా వెలసింది. ఆ వ్యక్తుల ఇళ్లల్లో రెయిడ్స్ జరగబోతున్నాయని. దేశమంతా కలకలం. ఆ జాబితాలో ఉన్న వ్యక్తులకైతే చెప్పక్కర్లేదు. పాలనా వ్యవస్థ కుటుంపడింది. ఉన్న భద్రతా సిబ్బందినంతా ఆ లిస్ట్‌లోఉన్న వీఐపీల ఇళ్లముందు కాపలా పెట్టారు. ఇంకో వైపు .. పేరున్న దర్యాప్తు సంస్థలు, ప్రైవేట్ డిటెక్టివ్లు అంతా రంగంలోకి దిగారు.. అంతకుముందు ఇద్దరు మంత్రుల ఇళ్లల్లో దొంగతనం చేసిన ముఠాను, ఈ హిట్‌లిస్ట్ తయారు చేసిన వ్యక్తులను పట్టుకునేందుకు. గంటలు క్షణాలైపోయి హిట్‌లిస్ట్‌లో పేర్కొన్న కౌంట్‌డౌన్ మొదలవనే అయింది. రాత్రి పన్నెండు.. ఆ జాబితాలోని వీఐపీలెవరికీ కంటి మీద కునుకు లేదు. ప్రభుత్వ యంత్రాగానికీ కుదురుపట్టడం లేదు. దేశంలోని ప్రజలకూ నిద్రలేదు ఏం జరుగబోతుందనే ఆసక్తితో. అది అమావాస్య రాత్రయినప్పటికీ ఆకాశంలో వెన్నెల విరగకాసింది.. దీపాలే అక్కర్లేనంతగా! నిమిష నిమిషానికీ వీఐపీలకు గుండె దడ.. జనాలకు కుతూహలం పెరుగుతోంది. పన్నెండు పన్నెండు నిమిషాలకు.. వీఐపీల ఇళ్ల దగ్గర విపరీతమైన గాలి.. ఉరుములు.. మెరుపులు. ఆ ఇళ్ల దగ్గర తప్ప మిగతా దేశమంతా ప్రశాంతంగానే ఉంది. ఒక్కసారిగా ఆ ఇళ్లల్లో కరెంట్ పోయింది. గాలి ఎక్కువైంది.. ఇళ్ల కప్పులు ఎగిరిపోయాయి.. మెరుపులు నిరంతరాయంగా.. నేలకు దివిటీ పట్టునట్టు.. భద్రతా సిబ్బంది అంతా అప్రమత్తమయ్యారు. దేశంలో.. టీవీలున్న ఇళ్లల్లో.. టీవీలు కట్టేసిన లోగిళ్లల్లో ఒక్కసారిగా టీవీలు ఆన్ అయ్యాయి.. ఆ టీవీల్లో.. అదివరకే నడుస్తున్న టీవీల్లో.. హఠాత్తుగా కొన్ని దృశ్యాలు ప్రసారమవడం మొదలయ్యాయి.. హిట్ లిస్ట్‌లో ఉన్న వీఐపీ ఇళ్లల్లో ఉన్న సొమ్మంతా సంచులు సంచులుగా ఇంటి పై కప్పు నుంచి గాల్లో పైకి లేవడం.. టీవీ స్క్రీన్ చిన్న చిన్న స్క్రీన్స్‌గా స్ల్పిట్ అయ్యి విదేశాల్లోని ఆ వీఐపీల ఇళ్లు, బ్యాంకుల్లోంచి డబ్బు, బంగారం, వెండి, వజ్రాలు, దస్తావేజులూ మాయవమడం.. ఆ వీఐపీల చరాస్తులను జనాలు ఆక్రమించుకోవడం.. అన్నీ కనిపించసాగాయి. ఎక్కడ పడితే అక్కడ టీవీలు ప్రత్యక్షమవుతున్నాయి.. ఈ దృశ్యాలను చూపిస్తున్నాయి. దేశమంతా షాక్.. సంచలనం.. కాపలా ఉన్న భద్రతా సిబ్బంది నిశ్చేష్టులై నిలబడిపోయారు. దర్యాప్తు బృందాలు, వ్యక్తులకు కాళ్లు, చేతులు ఆడ్డంలేదు. ఉదయం నాలుగింటి వరకు నిరవధికంగా ఆ ఇళ్ల నుంచి డబ్బు, దస్కం పోతూనే ఉంది. అది ముగియగానే ఒక్కసారిగా సూర్యుడు ఉదయించాడు. గాలి, ఉరుములు, మెరుపులు అన్నీ పోయి పరిస్థితి మామూలు అయింది. వీఐపీలంతా రోడ్డు మీదకొచ్చారు. స్లమ్స్, మురికి మాయమైపోయి అంతా శుభ్రంగా ఉంది. ఎక్కడపడితే అక్కడ చెట్టుచేమలతో దేశమంతా పచ్చగా కనబడుతోంది. స్వచ్ఛమైన గాలి వీస్తోంది. జనాలందరూ గుండెల నిండా ఊపిరి తీసుకుంటున్నారు. వాళ్ల మొహాల్లో ఒకరమైన భద్రత... భరోసా.. ఠీవీ కనిపిస్తోంది. -
చిత్రంగా అన్నీ ఒకేసారి మాయం
రాత్రి తొమ్మిది గంటలు... ఓ పదిపదిహేను మంది కల్లు ముంతలు ముందు పెట్టుకొని కూర్చుని ఉన్నారు. సాయంకాలం ఆరు గంటల నుంచి తాగుతూనే ఉన్నారు. ఆ ఊళ్లో కాని.. ఆ ఊరికి ఉన్న నాలుగు పొలిమేరల్లో కాని ఎక్కడా ఒక్క తాటి చెట్టూ లేదు.. ఈత చెట్టూ లేదు. అయినా కుండల కొద్ది కల్లును తీసుకొచ్చి అమ్ముతున్నారు.. వీళ్లు తాగుతున్నారు. ‘‘అరేయ్.. య్యీ క్షొత్త క్షళ్లు దుక్కాణం భల్లే ఉంద్షిరా... ’’ అన్నాడు ఒకడు మాటా.. శరీరమూ తూలుతూ. ‘‘అవ్వన్రర్రేయ్య్య్... ర్రెండ్రోజ్జుల్లే అయ్యింది ఈ క్షొట్టు ప్పెట్టి.. య్యెంత్ష గ్గిర్రాక్కో షూడూ.. ’’ అన్నాడు ఇంకొకడు.. చుట్టూ ఉన్న అందరినీ చూపించడానికి గాల్లోకి ఎత్తిన చేయి.. సత్తువ లేక జారిపోతుండగా! ఇంతలోకే అక్కడున్న ఇంకో నలుగురు ఏదో మాటా మాటా పెరిగి.. తాగిన మైకంలో కొట్టుకునే దాకా వెళ్లారు. అలా ఓ అరగంట గడిచింది. ఆ కల్లు రుచికి ఆ కంపౌండ్లోంచి కదల్లేకపోతున్నారంతా! తెచ్చిన పైకం అయిపోయింది. అప్పటిదాకా తియ్యగా మాట్లాడుతూ కల్లుతోపాటు మంచింగ్‌కి చేపల ఫ్రై, మిరపకాయ బజ్జీలూ వేడివేడిగా వడ్డించిన వాళ్లు కసురుకోసాగారు. ‘‘మ్మాద్ది.. ఇద్దే ఊ.......ర్రు కదా స్సామ్మీ... న్నమ్మండీ... ఈ అప్.. అప్.. య్యేందదీ... ఆ.. య్యీ అప్ప్పూపూ... ర్రేప్పట్టిద్ది క్షల్పి ర్రేప్పు క్కల్లు మ్ముంతలో పెట్షి త్తెస్స్..స్సా’’ అన్నాడు ఓ నలభై ఏళ్ల వ్యక్తి. ‘‘ ఇవ్వాళ మత్తు పీల్చుకో.. రేపు కల్లు పోస్తా.. అంటే కుదర్దు కదా సారూ. డబ్బిస్తేనే కల్లు’’ షరతు పెట్టింది కల్లుకొట్టు యజమానురాలు తన భర్తేదో మాట్లాడుతుంటే మాట్లాడనివ్వకుండా. ‘‘నేను మట్లాడబోతుంటే నువ్వెందుకు మధ్యలో వచ్చావ్?’’ భార్యను విసుక్కున్నాడు ఆ భర్త. ‘‘చూశాలే.. కిందటూళ్లలో ఏం మాట్లాడావో! ఇదిగో.. ఈ మాయదారిగాళ్ల మత్తు మాటలకు లొంగిపోయావో.. పాక పీకేసుకొని పోవాల్సిందే గానీ.. నువ్వు బో.. నేను మాట్లాడ్తా’’ అంటూ భర్తను అక్కడి నుంచి పంపించేసింది ఆమె. విసవిసా అక్కడి నుంచి వెళ్లిపోయాడు భర్త. ‘‘ఏమయ్యోయ్.. కొట్టు కట్టేస్తున్నాం గానీ యిక లేవండీ...’’ అంటూ అందరినీ అదిలించడం మొదలుపెట్టింది. రేపు డబ్బులిస్తాం.. ఈ పూటకు ఇంకాస్త కల్లు పొయ్యండని బతిమాలుకున్నారంతా. ‘‘కుదర్దు అంటే కుదర్దు’’ కరాఖండిగా చెప్పింది ఆమె. ఆ పాక తలుపు మూయబోతుంటే అందరూ కలిసి ఒక్కసారిగా దాడికి దిగారు.. ‘‘ఎలా కట్టేస్తావ్’’ అంటూ. ‘‘అయితే ఇళ్లకెళ్లి డబ్బుతేపోండి’’ అంది ఆమె నింపాదిగా! తోకముడిచారంతా. వాళ్ల వాలకం చూసి ‘‘ఇంట్లో కూడా డబ్బు లేనప్పుడు ఎందుకు ఈ అర్భాటాలు? పొండి.. సొమ్మున్నప్పుడే రండి’’ అంటూ మళ్లీ ఆమె పాక తలుపుమూయబోతుంటే.. ‘‘ఆగ్గాగ్గు..! షొ.. షొ.. ష్షొమ్మంట్టే గ్గుర్ర్... త్తొష్షింద్ది.. మాయ్యాలి.. ష్షొమ్ములు వ్వాక్కేన్నా.. డబ్బ్లు ఇష్షే ద్దాక్కా...’’ అన్నాడొక ముప్పై అయిదేళ్ల వ్యక్తి. ‘‘డబుల్ ఓకే.. ఇప్పుడు తెస్తావా?’’ రెచ్చగొడుతూ ఆమె. ‘‘ఊ.... ’’ అంటూ తూలుతూ.. కనురెప్పలు మూస్తూ తెరుస్తూ అక్కడి నుంచి కదిలాడు అతను. ‘‘మీరు కూడా మీ ఆడోళ్ల సొమ్ములు తెచ్చి ఈ కల్లుకోసం తాకట్టు పెట్టుకోవచ్చు’’ అంది టేబుల్ మీదున్న కల్లు సీసాలను చూపిస్తూ ఆ యజమానురాలు. అంత మత్తులోనూ ఇళ్లకు వెళ్లడానికి వాళ్లు తటపటాయిస్తుంటే.. ‘‘ఈ కల్లు కావాలంటే సొమ్ము తేవాల్సిందే. మీ ఇష్టం.. తెస్తామంటే.. మీరొచ్చేదాకా కొట్టు మూసేయను’’ హామీ ఇస్తున్నట్టు చెప్పింది ఆ యజమానురాలు. భరోసాతో వాళ్లు ఇళ్లకు వెళ్లారు. పొద్దంతా కష్టం చేసొచ్చి.. అలసిపోయి పడుకున్న భార్యల, తల్లుల మెడలో ఉన్న బంగారు తాళి, కాళ్లకున్న వెండి కడియాలు, పిల్లల కాళ్లకున్న వెండి పట్టీలు అన్నిటినీ తీసుకెళ్లిపోయారు ఆ మదిర కోసం. ఆ రాత్రంతా కల్లుతాగి మత్తులో ఆ పాకముందే మట్టిలో చిత్తుగా పడిపోయారు. తెల్లవారింది... నిద్రలేచిన ఆడవాళ్లు ఇంటి తలుపులు బార్లా తెరిచి ఉండడంతో ముందు ఉలిక్కిపడ్డారు. తర్వాత ‘‘ఈ దొంగ సచ్చినోళ్లు తప్పతాగి ఏ రాత్రో వచ్చి అన్నం తినడానికి తలుపులను తన్ని ఉంటారు’’ అనుకుంటూ ఉన్న ఆ రెండు గదుల ఇంటిలో ముందు గదిలో చూశారు. వసారాలోనూ చూశారు. కనిపించలేదు. వంటింట్లో అన్నం తిన్న ఆనవాళ్లూ కనిపించలేదు. ఇంటికొచ్చిన వాళ్లు ఆ మైకంలో మళ్లీ ఎక్కడికి వెళ్లిపోయారో అనుకుంటూ పనుల్లో పడ్డారు. కాసేపటికే పిల్లలు.. ‘‘అమ్మా.. పట్టీల్లేవు’’ అంటూ ఏడుస్తూ తల్లుల దగ్గరకు వచ్చారు. ‘‘అరే రాత్రికి రాత్రే ఏమయ్యాయి? పైగా ఆ ఊళ్లోని ఇళ్లల్లోని పిల్లలందరి కాళ్లకు ఒకేసారి ఎలా పోతాయి? దొంగలు పడ్డారా?’’ అని సంశయిస్తూ తమ మెడలను తడుముకున్నారు ఆ స్త్రీలు. తాళి లేదు. కాళ్లనూ చూసుకున్నారు కడియాల్లేవ్’’ అంతే అందరి గుండె ఝల్లుమంది. ‘‘దొంగలు పడ్డారా ఏంటీ?’’ అనుకుంటూ వీథుల్లోకి వచ్చారంతా. మాట్లాడుకున్నారు. మథన పడ్డారు. సరే.. ఇంతకీ ఊళ్లోని మగవాళ్లేరీ? ఎంత తాగుడికి బానిసలైనా అర్ధరాత్రికైనా ఇంటికి చేరేవారు. కాని చిత్రంగా ఓ రెండుమూడు రోజులగా .. ఆ కొత్త కల్లు కొట్టు వచ్చినప్పటి నుంచి వాళ్ల తీరు మారింది. గమనించినా.. తాగుబోతు నాయాళ్లు అని పట్టించుకోలేదు. ఇంటి తలుపులు బార్లా తెచిరి ఉండడం.. సొమ్ములు మాయమవడం.. ఆలోచిస్తుంటే కంక్లుజన్ దొరికింది వాళ్లకు. అంతే చీపురు కట్టలు, పొయ్యిలో కర్రలు, రోకలిబండలు తీసుకొని ఆ స్త్రీ దండు కొత్త కల్లు కొట్టు దగ్గరకు పరిగెత్తారు. వాళ్లు అక్కడికి చేరే సరికి ఆ ఊరి మగవాళ్లంతా సోయిలేకుండా పడి ఉన్నారు.. అక్కడ కల్లు కొట్టు కాదు కదా.. కనీసం ఆ ఆనవాలే లేదు. ఖంగుతిన్న మహిళామణులు అదే చీపుర్లతో భర్తలను తట్టి నిద్రలేపారు. మత్తు వీడిన వాళ్లూ హతాశులయ్యారు. ‘‘ఈ ఊరు బాగా వర్కవుట్ అయిందిరా డింభక్! మీ అమ్మ భలే యాక్ట్ చేసింది. లేకపోతే ఈ సొమ్ములు వచ్చేవి కావు’’ అన్నాడు అతను. ‘‘ఈ రాత్రే ఇక్కడి నుంచి వెళ్లిపోతున్నామా?’’ అడిగింది భార్య. ‘‘ఈ రాత్రే ఏంటీ.. ఇప్పుడే రండి నాతో’’ అంటూ ఆ ఊరి శ్మశానంలోని మర్రి చెట్టు మీద నుంచి గాల్లోకి ఎగిరాడు అతను. ఆ వెంటే అతని కుటుంబమూ గాల్లోకి ఎగిరింది. - సరస్వతి రమ -
డాక్టర్ల కిడ్నీలు, కళ్లు పీకేసింది ఎవరు..?
‘‘నాన్నా... నాన్నా..’’ మద్యం మత్తులో గుమ్మానికి చేరగిలబడి జోగుతున్న మల్లేష్ ఒక్కసారిగా కళ్లుతెరిచాడు. గుమ్మం బయట చూశాడు. ఎవరూ కనిపించలేదు. మళ్లీ అలాగే గుమ్మానికి తలానించాడు. మగతగా కన్ను అంటుకుంది. ‘‘నాన్నా.. నాన్నా...’’ ఉలిక్కిపడ్డాడు మల్లేష్. ఇంతకుముందటిలాగే కళ్లు తెరిచాడు. గుమ్మం అవతలకి చూశాడు. చిమ్మ చీకటి .. చిమ్మెట్ల శబ్దం తప్ప ఎవరూ కనిపించలేదు.. ఏమీ వినిపించట్లేదు. తూలుతూ లేచి బయటకు నడిచాడు. గుమ్మం బయట గోడకు ఆనించిన కర్రను తీసుకొని గాల్లో ఆడిస్తూ.. నేల మీద కొట్టాడు. చుట్టూ తిరిగొచ్చి.. ఆ గుమ్మం మెట్ల మీద కూర్చున్నాడు. పాంట్ జేబులోంచి సిగరెట్, అగ్గిపెట్టె తీశాడు. వెలిగించి దమ్ము లాగాడు. మత్తు వదిలినట్టయింది. రెండో పఫ్ పీల్చబోతుంటే వినిపించింది.. ‘‘నాన్నా.. నాన్నా.. ఇటు చూడు నాన్నా..’’ అంటూ. సిగరెట్‌ను అలాగే వేళ్ల మధ్యలో ఉంచి నెమ్మదిగా మెడ తిప్పి లోపలికి చూశాడు. ఓ మోస్తరు హాలు లాంటి ఆ గదికి జీరో బల్బ్ వెలుతురు సరిపోక.. గదంతా పర్చుకోలేదు వెలుగు. మసక మసకగానే ఉంది. మనుషులైతే కనిపించలేదు అతనికి. తల విదిలించి లోపల్నుంచి దృష్టి మరల్చబోతుంటే.. ‘‘ముందు ఆ సిగరెట్ పడేయ్’’ ఆజ్ఞాపించింది స్వరం. షాక్ అయ్యాడు మల్లేష్. అప్రయత్నంగా లేచి నిలబడ్డాడు.. సిగరెట్ పడేసి కాలితో నలిపేశాడు. ‘‘గుడ్ నాన్నా.. ’’ ‘‘ఎ.. వ... ఎవరూ’’ వణుకుతున్న స్వరంతోనే కేకేశాడు మల్లేష్. ‘‘నీకు తెలుసు.. నేనేవెరో..!’’ మల్లేష్ కాళ్లూ వణుకుతున్నాయి. గుమ్మం దగ్గరే ఆగిపోయాడు. ‘‘లోపలికి రా నాన్నా.. రా.. నా పక్కన కూర్చో’’ మరబొమ్మలా నడుచుకుంటూ వెళ్లి కూర్చున్నాడు. ఆ మార్చురీ గదిలో ఉన్న ఒకే ఒక శవం పక్కన. స్ట్రెచర్ మీద కాకుండా చాపలో చుట్టిన ఆ శవాన్ని నేలమీదేశారు. ‘‘నిన్ను నాన్నా అంటున్నందుకు ఏమీ అనుకోవు కదా.. నా లాంటి పిల్లలు ఉండే ఉంటారు నీకు’’ తలూపాడు మల్లేష్. టప్ టప్ మంటూ చుట్టగా ఉన్న చాప తెరుచుకుంది. అందులోంచి శవం లేచి కూర్చుంది. గుండె ఆగినంత పనైంది మల్లేష్‌కి. ‘‘భయపడకు నాన్నా.. ’’ ‘‘నువ్వెవరు అసలు?’’ భయంగా అడిగాడు మల్లేష్. ‘‘నీ కూతురినే’’ ‘‘నాకు పిల్లల్లేరు. అయినా నువ్వు చనిపోలేదా? మరి నిన్నెందుకు ఈ మార్చురీలో పెట్టారు’’ మల్లేష్. నవ్వుతోంది.. గట్టిగా నవ్వుతోంది.. తెరలుతెరలు తెరలుగా నవ్వుతోంది.. మల్లేష్ గుండె దడ పెరిగింది. డ్యూటీ డాక్టర్‌కి చెప్పాలి అని అనుకుంటూ లేవబోయాడు. ఎవరో పై నుంచి రెండు భుజాల మీద చేతులు వేసి పైకి లేవకుండా కిందకు నెట్టినట్టు కూలబడ్డాడు. ఆ శవం ఇందాకటిలాగే మొహం కనిపించకుండా జుట్టు వేలాడుతూ.. నేలకేసి చూస్తున్నట్టుగానే ఉంది. మల్లేష్కంతా అయోమయంగా ఉంది. గుండె దడ పెరిగింది. జేబులో ఉన్న టాబ్లెట్ తీసుకోబోయాడు. ‘‘నీకేం కాదు నాన్నా..’’ ‘‘నువ్వు శవానివి కాదు.. దయ్యానివి. నన్నెందుకు పట్టుకున్నావ్?’’ పొడిబారిపొతున్న గొంతును పెగల్చాడు మల్లేష్. మళ్లీ నవ్వు.. తెరలు తెరలుగా! ‘‘చెప్పు.. ఎంతమంది కిడ్నీలు.. లివర్లు మాయం చేశారు మీరు?’’ హతాశుడయ్యాడు. శక్తినంతా కూడదీసుకుని ఆ గది ఆ మూలకు పరిగెత్తాడు. అక్కడున్న అల్మారా తెరిచి చూశాడు..బల్ల కింద చూశాడు.. గోడలు తడిమి తడిమి చూశాడు. ఆ గుడ్డి వెలుతురులో ప్రతి మూలను పరీక్షగా చూశాడు. ఎవరైనా అక్కడుండి మాట్లాడుతున్నారేమోనని. మళ్లీ వెనక్కి వచ్చి.. కూర్చుని ఉన్న ఆ శవం ముక్కు దగ్గర వేలు పెట్టి చూశాడు. శవంగా నటిస్తున్న మనిషేమో అనుకొని. కాదు శవమే! ‘‘కంగారు పడకు.. నేను బతికున్న మనిషిని కాను. చచ్చిన శవాన్నే. యాక్సిడెంట్ అయి కొన ఊపిరితో వచ్చా.. అనాథనని తెలుసుకొని కిడ్నీలు తీసేసుకున్నారు.. లివరూ దానం చేసేసి.. అవయవాలు పనిచేయడం మానేశాయని ఊపిరి తీసేశారు. ఈ గదిలో పడేశారు. నా లాంటి కూతురుంటే ఈ పనిలో నువ్వు రక్తం అంటించుకోకపోయేవాడివి కదా..’’ ‘‘నాకేం తెలియదు.. నువ్వు అనాథవని కూడా తెలియదు’’ మల్లేష్ మత్తు దిగిపోయి ఆ స్థానాన్ని భయం ఆక్రమించింది. ‘‘లెక్క చెప్పు నాన్నా.. పెకిలించిన కళ్లు, తోడేసిన కిడ్నీలు.. లాగేసిన లివర్ల లెక్కలు చెప్పు’’ మార్దవంగా ఉంది గొంతు. ‘‘ఏయ్.. భయపెడ్తున్నావా? ’’ లేని ధైర్యాన్ని కూడగట్టుకుంటూ బెదిరించే ప్రయత్నం చేశాడు మల్లేష్. ‘‘నాన్నా.. ’’గద్దించింది ఆ స్వరం. అంతే సైలెంట్ అయిపోయాడు. ‘‘చెప్పూ...’’అంతే తీవ్రంగా. ‘‘నాకేం తెలియదు. అదంతా పెద్దవాళ్ల వ్యవహారం. దాంతో నాకేం సంబంధం లేదు. చూసీచూడనట్టుంటాను. లేకపోతే నేనూ నీలా శవంగా మారేవాడినెప్పుడో’’ చేతులు జోడించి తల వంచాడు మల్లేష్. ‘‘నిజంగానే నాకేం తెలియదు..నన్ను వదిలెయ్’’ అంటూ తల పైకెత్తిన మల్లేష్ స్థాణువయ్యాడు. ఎదురుగా ఆ శవం లేదు. దిగ్గున లేచి నిలబడ్డాడు. గదంతా కలియ చూశాడు. ఎక్కడా ఎవరూ లేరు. అసలు ఆ గదిలో శవమే లేదు. ఇది కలా? ఇంతకు ముందు జరిగింది కలా? అర్థం కాలేదు. తనను తాను గిల్లుకున్నాడు. నిజమే! కల కాదు. మరి శవం? ఆ రాత్రి మల్లేష్‌కి జాగారమే అయింది. ఎప్పుడో తెల్లవారు జామున నిద్ర పట్టింది. మరునాడు ఉదయం .. ఎనిమిది గంటలు.. ‘‘మల్లేషన్నా.. ఓ మల్లేషన్నా.. లెవ్ లెవ్’’ తట్టి లేపుతుంటే మెలకువ వచ్చింది మల్లేష్‌కి. కళ్లు తెరిచి లేవబోతుంటే ఒళ్లంతా నొప్పులుగా అనిపించింది. మూలుగుతూ లేచి గుమ్మానికి ఒరిగాడు. ‘‘ఎందన్నా.. గంత యత్మినాన్గా కూసున్నవ్.. లే... పెద్ద డాక్టర్లిద్దరికీ రాత్రి యాక్సిడెంట్ అయింది. పోస్ట్‌మార్టమ్‌కి ఈడికే దెస్తుండ్రు.. లెవ్.. ’’ తొందరపెట్టింది యమున. ‘‘ఏంటీ.. ఏమన్నావ్?’’ తను విన్నది నిజమేనా కాదా నిర్ధారణ చేసుకోవడానికన్నట్టు మళ్లీ అడిగాడు మల్లేష్. ‘‘అవును మల్లేషన్నా.. ఏదో పార్టీ నుంచి ఇండ్లకు వోతుంటే అయ్యిందట యాక్సిడెంట్. ఆడిదాన్నే పానం బోయిందట ఇద్దరికీ. ఇంకా చిత్నమేందంటే ఇద్దరి కిడ్నీలూ లేవంట.. కండ్లూ..’’ చెప్తూనే ఉంది యమున.. మల్లేష్ చెవుల్లో గుయ్ మంటూ హోరు మొదలై.. కాసేపటికి ఏమీ వినపడకుండా అయిపోయింది. బిత్తర చూపులతో ప్రతిమలా నిలబడిపోయాడు. ‘‘ఏమైందన్నా.. అన్నా..’’ అంటూ మల్లేష్‌ను కదుపుతోంది యమున. -
చారులత వాళ్ల అమ్మ
‘‘ఎదీ చూడనీ’’ అంటూ ఎర్రగా కందిపోయిన పదకొండేళ్ల కూతురి లేత అరచేతులను తడిమింది తల్లి. ఆమె కళ్లల్లో నీళ్లను చూసిన చారులత ‘‘ఏం కాలేదులే అమ్మా ’’ అంటూ తన చేతులను విడిపించుకుంది. ‘‘నీ కన్నా పెద్దవాడికి రోజూ కోడిగుడ్లు, మాంసం పెడుతూ ఆరోగ్యంగా పెంచుతున్నారు కదా! బరువైన పనులు వాడికి చెప్పకుండా నీకెందుకు చెప్తున్నారు? చదువేమో వాడికి.. చాకిరి నీకా?’’ ఉక్రోషం ఆ తల్లి మాటల్లో! ‘‘నేనూ చదువుకుంటున్నా కదమ్మా నీ దగ్గర’’ తన రెండు చేతులతో తల్లిని గట్టిగా చుట్టేస్తూ చారులత! ‘‘నేను ఆ తప్పు చేయకుండా ఉండాల్సింది చిట్టితల్లీ...’’ దుఃఖంతో తల్లి గొంతు పూడుకుపోయింది. ‘‘మరెందుకు చేశావమ్మా?’’బాధతో కూతురి స్వరమూ వణికింది. ఆర్తిగా కూతురిని హత్తుకుంది ఆ అమ్మ. ‘‘ఒరే దివాకరం.. ఏదో మెసేజ్ వచ్చినట్టుంది కొంచెం చూడూ..’’అంటూ వరండాలో కూర్చున్న పదమూడేళ్ల మనవడి దగ్గరకొచ్చాడు తాత. తన ఫోన్లో గేమ్ ఆడుతున్న దివాకరం తాతను పట్టించుకోలేదు. అక్కడే ఆరుబయట గచ్చులో గిన్నెలు కడుగుతున్న చారులత తాత మాట విన్నది. తన అన్న వైపు చూసింది. అసలు ఈ లోకంలోనే లేడు అన్న. మళ్లీ తన పనిలో తాను పడింది చారులత. ‘‘ఒరేయ్ నాన్నా.. నిన్నేరా...?’’ముద్దుగా పిలిచాడు ఇంకోసారి. ఈసారి తలెత్తి తాత వైపు చూశాడు దివాకర్. ‘‘అబ్బా.. ఏంటి తాతా..?’’ విసుక్కున్నాడు వాడు. ‘‘ఇందాకా టింగ్ మందిరా ఫోన్. ఏదో మెసేజ్ వచ్చినట్టుంది చూసిపెట్టు నాన్నా..’’ బతిమాలుతూ తాత. ‘‘బాబ్బాబూ.. చూసిపెట్టరా.. మీ నాన్న దగ్గర్నుంచి అయ్యుంటది’’ బియ్యం చెరగడానికి వరండాలోకొచ్చిన నానమ్మా బతిమాలుతూ. విసురుగా తాత చేతిలోంచి ఫోన్ లాక్కున్నాడు దివాకర్. మెసేజ్ బాక్స్‌లోకి వెళ్లాడు. అన్రెడ్ మెసేజ్ తెరిచాడు. ఫోనెటిక్లో ఉంది ఆ సమాచారం. మైండ్‌లోనే కూడబలుక్కొని చదివాడు. ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు వాడికి. కడిగిన గిన్నెలను బుట్టలో వేసుకొని వంటింట్లోకి వెళ్తున్న చారులత గమనించింది అన్న అవస్థను. అయినా ఏమీ ఎరగనట్టు లోపలికి వెళ్లిపోయింది. ఇవతల తాత అడుగుతున్నాడు ‘‘మెసేజేనా? ఎక్కడి నుంచీ?’’అని. ‘‘ఏదో పనికిమాలిందిలే తాతా..’’ అంటూ ఫోన్‌ని ఆ ముసలాయనకిచ్చేసి మళ్లీ తన గేమ్‌లో పడిపోయాడు దివాకర్. రాత్రి .. భోజనాలయ్యాక.. వంటిల్లంతా సర్దేసి టీవీ ఉన్న గదిలోకి వెళ్లింది చారులత. అప్పటికే నానమ్మ, తాత ఇద్దరూ టీవీలో లీనమయ్యారు. ఆ వృద్ధ జంట కంటపడకుండా నెమ్మదిగా అడుగులో అడుగువేసుకుంటూ వాళ్ల వెనకాల ఉన్న టీపాయ్ వైపు నడిచి దాని మీదున్న ఫోన్ తీసుకొని మళ్లీ వంటగదిలోకి వెళ్లింది చారులత. సాయంకాలం తన తాతకు వచ్చిన మెసేజ్ చూసింది. అది తన తండ్రి చేసిందే. సౌది అరేబియా నుంచి. ఎవరి ఫోన్ నుంచో పంపించాడు. లేబర్ క్యాంప్‌లోని అతని గదిలో ఫ్రెండ్స్ మధ్య జరిగిన చిన్న గొడవ.. చిలికి చిలికి గాలి వానై.. ఆ రూమ్మేట్స్లో ఒకరిని హత్యచేసేదాకా వెళ్లిందని, అందులో నిందితుడిగా అతనూ పోలీసులకు పట్టుబడ్డాడని, ఉద్యోగం పోయిందని, ఇక్కడి లాయర్‌తో ఎంబసీ వాళ్లతో మాట్లాడించి.. అక్కడ లాయర్‌ను ఏర్పాటు చేయించాలని ఆ మెసేజ్ సారాంశం. ఫోనెటిక్లోనే ఉంది.. వచ్చీరాని ఇంగ్లిష్, తెలుగు కలగలిపి. చదివి షాక్ అయింది చారులత. వణుకుతున్న కాళ్లతో మళ్లీ ముందు గదిలోకి వచ్చి ఫోన్‌ను యథాస్థానంలో ఉంచింది. ఈ విషయం నానమ్మ, తాతకు చెప్పాలా? వద్దా? అమ్మను అడిగితే సరి.. అనుకుంటూ చిన్న పడకగదిలాంటి తన గది దగ్గరకు వచ్చి తలుపు తెరిచెంది చారులత. ‘‘బుమ్’’ అంటూ తలుపు చాటు నుంచి బిడ్డ ముందుకొచ్చింది అమ్మ భయపెడ్తున్నట్టుగా. ‘‘అబ్బా.. అమ్మా.. నేనైమైనా చిన్నపిల్లనా?’’ ‘‘అయితే భయపడలేదా?’’ అంటూ చిన్నపిల్లలా బుంగమూతి పెట్టి చాప మీద చతికిల పడింది ఆ అమ్మ. ‘‘ ఇంట్లోవాళ్లు భయపడ్తారు నీ గురించి తెలిస్తే..’’ అన్నది చారు.. తల్లి పక్కన తానూ చేరగిలపడుతూ! ‘‘ఏంటలా ఉన్నావ్? ఆ మెసేజ్ గురించేనా దిగులు?’’అంది అమ్మ. అవునన్నట్టుగా తలూపింది చారులత. నిట్టూరుస్తూ కూతురి పాదాలను తన ఒళ్లో పెట్టుకొని నెమ్మదిగా కాలివేళ్లను విరుస్తూ.. ‘‘మీ నాన్నకు పట్టాల్సిన గతే’’ అని.. అంతలోకే ఏదో గుర్తిచ్చినదానిలా ‘‘అవునూ.. ఆడపిల్లవు నీకు చదువెందుకని వాడికి చదువు చెప్పిస్తున్నారు కదా.. కాన్వెంట్ స్కూల్లో వేసి మరీ! వాడికెందుకు అర్థంకాలేదు ఈ మెసేజ్?’’ అంటూ కూతురిని ప్రశ్నించింది తల్లి. ‘‘అన్నయ్యని తిట్టడం ఆపమ్మా’’ అంటూ ఇంకేదో చెప్పబోతుంటే ‘‘ఆపను. ఈ ఇంటి పరిస్థితిని నేను చక్కదిద్దకపోతే.. నీకు, రేపు ఈ ఇంటికి వచ్చే ఇంకో ఆడపిల్లకూ నా గతే పడ్తుంది’’ అన్నది కళ్లు పెద్దవి చేసుకుంటూ ఆ అమ్మ. చారులతకు భయమేసింది.. ఒక్కసారిగా తల్లి ఒళ్లో ఉన్న తన కాళ్లను వెనక్కి లాక్కుంది. ఎప్పుడో అమ్మ చెప్పిన ఆమె గతం గుర్తుకురాసాగింది ఆ పిల్లకు. ఆ ఊళ్లో అమ్మ ఒక్కతే కాస్తోకూస్తో చదువుకుంది. తెలివైంది కూడా. చూడ్డానికీ చక్కగా ఉంటుంది. టెన్త్‌లో ఆ మండలానికే ఫస్ట్ వచ్చింది. ఇంకా చదువుకోవాలని.. అడ్వకేట్ కావాలని ఆశ పడింది. ఇంతలోకే దుబాయ్ నుంచి వచ్చిన నాన్న.. అమ్మను చూశాడు.. కట్నం లేకుండా పెళ్లి అన్నాడు.. నలుగురు ఆడపిల్లలో పెద్దయిన అమ్మకు ఆ సంబంధం రావడం వరమనుకున్నారు అమ్మమ్మ, తాత. ‘‘పెళ్లి వద్దు’’ అని అమ్మ మొరపెట్టుకున్నా వినకుండా పెళ్లిచేసేశారు. పెళ్లయ్యాక నాన్ననూ చాలా బతిమాలుకుంది అమ్మ.. చదువుకుంటానని. ‘‘ఆడపిల్లలకు చదువేంటి?’’ అని నానమ్మ, తాత కోప్పడ్డారు. నాన్ననూ కట్టడి చేశారు పెళ్లాం మాట వినొద్దని. పొలం పనులు చూసుకుంటూ ఇక్కడే ఉంటానన్న నాన్నను బలవంతంగా మళ్లీ గల్ఫ్‌కి పంపేశారు. అమ్మను ఇంట్లో, పొలంలో పనిమనిషిని చేశారు. అన్నయ్య, తను పుట్టాక కూడా పట్టుబట్టింది అమ్మ.. ప్రైవేట్‌గా చదువుకుంటానని. పడనివ్వలేదు నానమ్మ, తాతలు. గొడవపడింది అమ్మ. అయినా పట్టు వీడలేదు ముసలాళ్లు. కనీసం కూతురునైనా మంచి స్కూల్లో వేయిద్దామని నాన్నకు ఉత్తరాలు రాసింది. అమ్మవాళ్లు చెప్పినట్టే వినమని జవాబిచ్చాడు నాన్న. నానమ్మ, తాత తన విషయంలో కూడా మొండిగానే ఉన్నారు. ఆడపిల్లకు చదువొద్దని. తనను బడికి పంపించకుండా అమ్మతోపాటు పొలానికి పంపిస్తుంటే తట్టుకోలేని అమ్మ ఒకరోజు పొలంలోని బావిలో దూకి చనిపోయింది. ‘‘చారూ.. ’’ అంటూ రెండు భుజాలు పట్టుకొని తల్లి ఊపేసరికి ఈ లోకంలోకి వచ్చింది చారులత. ‘‘అమ్మా..’’ అంటూ కరుచుకుపోయింది ఆ పిల్ల. ‘‘చారూ.. ’’ నానమ్మా పిలిచింది. ‘‘అమ్మా.. నానమ్మ’’ అంది తల్లి నుంచి విడివడుతూ! ‘‘అర్థమైంది.. పుస్తకం మూసేస్తావ్ కదూ’’అంది ఆ తల్లి దిగులుగా! అవును అన్నట్టుగా తలూపుతూ పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకుంది చారులత.. ‘‘మీ నాన్న గురించి.. ’’ అని తల్లి ఏదో చెప్పబోతుంటే ‘‘నానమ్మ, తాతకు చెప్తాను.. వాళ్లు చూసుకుంటారులే ’’ అంటూ పుస్తకం మూసేసింది చారులత. - సరస్వతి రమ -
అది జడ కాదు.. ఉరితాడు
‘‘వావ్... వండర్ఫుల్.. వాట్ ఏ ప్లేస్!’’ అన్నాడు ధర్మసాగర్.. చుట్టూ ఉన్న ప్రకృతిని ఆహ్వానిస్తున్నట్టుగా రెండు చేతులూ గాల్లో చాపి.. గుండె నిండా గాలిపీల్చుకొని ఆ వాతావరణాన్ని ఆస్వాదిస్తూ . ఏటవాలు ప్రాంతం పక్కనే నది.. మూడు పాయలుగా చీలిపోతూ.. మళ్లీ కలుస్తూ జడలా! చుట్టు పక్కల పచ్చని చెట్లు.. కనుచూపు మేరలో ఉత్తర దిక్కున కొండలు.. అద్భుతం! ఆ చోటుకి ఆయన రావడం అయిదోసారి అతను ఇండియాకు వచ్చిన ఈ ముప్పై రోజుల్లో. ‘‘ఇన్నాళ్లూ ఈ చోటు నా కంట పడకుండా ఎలా ఉంది అవినాశ్?’’ ఆశ్చర్యపోతూ ధర్మసాగర్. ‘‘కొండల్లో దాక్కొని సర్’’ వెటకారంగా అవినాశ్. ఆ వెటకారాన్ని గ్రహించే స్థితిలో లేడు ధర్మసాగర్. తన మనసులోని పథకం పేపర్ మీద బ్లూప్రింట్‌గా మారిన తీరును.... తెల్లవారి అదే ప్లేస్‌లో తన ఫ్యాక్టరీకి జరగబోయే శంకుస్థాపనను తలుచుకుంటున్నాడు. ఉప్పొంగుతోంది సంతోషం! అతని యాటిట్యూడ్ చిరాగ్గా ఉంది అవినాశ్‌కు. ఆ అబ్బాయి తండ్రి, తాతకు ధర్మసాగర్ వాళ్ల కుటుంబంతో అనుబంధం ఉంది. ధర్మసాగర్ వాళ్ల పొలాలను అవినాశ్ తాత, తండ్రే చూసేవారు. ఆ స్నేహంతోనే ఇప్పుడు తనతో ఈ అన్యాయాన్ని చేయిస్తున్నారనే కోపం, బా«ధను వెటకారంగా బయటపెడ్తున్నాడు అవినాశ్. ‘‘ఇంత వేగంగా.. ఇంత ఈజీగా అయిపోతుందని అనుకోలేదు తెల్సా?’’ ధర్మసాగర్ మాటతో ఆలోచనల్లోంచి బయటపడ్డాడు అవినాశ్. ‘‘సర్... ’’ అన్నాడు రెండు దవడలూ నొక్కిపడుతూ. ‘‘ఇదే అమెరికాలో, యూరప్‌లో అయితే ఎన్వారాన్మెంట్కి హార్మ్, ఇన్హ్యూమన్థింగ్ అంటూ సవాలక్ష ఆంక్షలు.. వేలకోటి పర్మిషన్ల హార్డిల్స్తో మొండిచెయ్యి చూపించేశాళ్లు’’ ధర్మసాగర్. ‘‘ఇక్కడైతే డబ్బు పడేస్తే చాలు పర్మిషన్లు వచ్చిపడ్డాయ్ కదా సర్’’ వెటకారంగానే అవినాశ్. ఎప్పటిలాగే పట్టించుకోలేదు ధర్మాసాగర్. ‘‘అవును.. నేనుకున్నదానికంటే కూడా తక్కువ ఖర్చులో నా ఫ్యాక్టరీకి పర్మిషన్ వచ్చింది’’ అని ముక్తాయింపు ఇచ్చి.. ‘‘అవినాశ్...’’పిలిచాడు. ‘‘సర్.. ’’ అయిష్టం «ధ్వనించింది ఆ స్వరంలో. అక్కడ ఏ కొత్త మనిషి ఉన్నా దాన్ని పసిగట్టేవాడే. కాని ధర్మాసాగర్కే పట్టడంలేదు. ‘‘అదిగో.. అక్కడ.. జలవిహార్ లాంటిది ప్లాన్ చేస్తా భారీ ఎత్తున. ఇదిగో ఇటు వైపు రిసార్ట్స్.. ’’ అంటూ నది మూడు పాయల తీరాలను చూపిస్తూ ధర్మాసాగర్ చెప్తూంటే అతణ్ణే తీక్షణంగా చూడసాగాడు అవినాశ్. ‘‘ఒరేయ్.. తెలియకుండానే మన కుటుంబానికి అంతోఇంతో సాయం చేశాడు ఆయన. నీ చదువుకీ కాస్తోకూస్తో ఆయన పరపతిని ఉపయోగించుకున్నాం. ఇప్పుడు నువ్వు మొండికేసినా... అతను ఆ ప్రాజెక్ట్ ఆపడు. ఇంకా పెద్ద స్థాయికి వెళ్లయినా తెచ్చుకోగలడు. వాళ్లంతా కూడితే అరాచకమేరా! ఆ ఊరివాళ్లు మరింత ఇబ్బంది పడ్తారు. నేను చెప్పేది చెప్పా.. ఆనక నీ ఇష్టం’’ అంటూ పెద్ద బండను తన నెత్తిమీద పెట్టాడు తండ్రి. నిదానంగా విశ్లేషించుకున్న అవినాశ్‌కు తండ్రి చెప్పిందీ కరెక్టే అనిపించింది. తను కాదంటే ఇంకా పై స్థాయికి వెళ్లి మరింత నాశనం చేస్తాడు ఆ ఊరిని. తన పరిధిలోనే కానిస్తే పోతుంది అని వీలైనంత తక్కువ నష్టం జరిగేలా ఆ ఫ్యాక్టరీ ప్లాన్‌ను తయారు చేయించాడు. అయినా జరగబోయేది మామూలు నాశనం కాదు.. గలగలపారే ఆ నది విషం అయిపోతుంది. పండే పంటలు, ఆ పరిసరాల్లోని గాలి, చెట్టు, చేమ.. గొడ్డు, గోద.. మనుషులు అన్నీ.. అంతా.. అందరూ విషమే! అవినాశ్ కళ్లల్లో నీళ్లు.. అటు తిరిగి తన రెండు చేతులను చూసుకున్నాడు. ‘‘ఛీ.. ఈ చేతులతోనా ఈ పని చేస్తోంది’’ అనుకుంటూ తలకొట్టుకోబోతుంటే.. ఓ మెరుపు... ఎదురుగా.. నదిలో! భ్రాంతా? నిజమా? అనుకుంటూ కళ్లు నులుముకొని మళ్లీ చూశాడు. నిజమే. నదిలో అమ్మాయి.. కాదు.. నదే.. కాదు అమ్మాయి.. అవును.. కాదు.. అవును .. కాదు.. అయోమయం.. విస్మయం అవినాశ్‌లో! అర్థంకాక మళ్లీ పరీక్షగా చూశాడు. ఏమీలేదు అక్కడ. అంతా మామూలుగానే ఉంది. పాపం.. వెర్రితల్లికి జరగబోయే విపత్తేం తెలుసు? అమాయకంగా.. ప్రశాంతంగా ఎలా ప్రవహిస్తుందో?’’ బాధగా మూలిగింది అవినాశ్ మనసు! మళ్లీ ఇటు వైపు తిరిగి ధర్మసాగర్‌ను చూశాడు. అతని లోకంలో అతను ఉన్నాడు. సూర్యాస్తమయం అయింది. పక్షులన్నీ గోల చేస్తూ గూళ్లకు చేరుతున్నాయి. పడమటి ఎర్రటి కాంతి నీళ్లల్లో ప్రతిబింబిస్తోంది. అదోరకంగా మారిపోయింది వాతావరణం. అక్కడ ఉండాలనిపించలేదు అవినాశ్‌కు. ‘‘పొద్దు పోయింది.. వెళదాం సర్.. చిట్టడవే అయినా.. చీకటి పడితే ప్రమాదమే’’ అంటూ జీప్ వైపు నడిచాడు అవినాశ్. కదల్లేక కదల్లేక కదులుతూ అవినాశ్‌ను అనుసరించాడు ధర్మసాగర్. చిట్టడవి దాటగానే.. ఓ రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న గెస్ట్‌హౌస్‌లో ధర్మసాగర్ బస. తన రూమ్ కిటికీలోంచి చూస్తే.. నది కనిపిస్తుంది. వెన్నెల్లో మెరిసే దాని సోయగాన్ని కళ్లల్లో నింపుకోవచ్చు. ధర్మసాగర్‌ను ఆ గెస్ట్‌హౌస్‌లో దింపేసి ఊళ్లోకి వెళ్లిపోయాడు అవినాశ్. రాత్రి.. భోజనాలయ్యాక.. కిటికీ దగ్గరున్న స్టడీ టేబుల్ ముందు కుర్చీ లాక్కొని కూర్చున్నాడు. తన బ్లూ ప్రింట్‌ను టేబుల్ మీద పరిచి అంగుళం అంగుళం తడిమిచూసుకున్నాడు. కళ్లద్దాలు ముక్కు మీదకు జారుతోంటే పైకి తోసుకుంటూ ప్రతి చిన్న డీటైల్నూ మళ్లీ మళ్లీ సమీక్షించుకున్నాడు. ‘‘పర్ఫెక్ట్’’ అనుకుంటూ నిద్రకుపక్రమించాడు. హోరు.. గర్జించట్లేదు.. రొద పెడ్తోంది. మెదడును డిస్టర్బ్చేసే రొద! చలి.. శరీరాన్ని గడ్డకట్టించే చలి! అంతకంతకూ ఎక్కువై.. ధర్మసాగర్‌ను నిద్రలేపింది. కళ్లు తెరిచి చూశాడు.. ఏమీ అర్థం కాలేదు. లేచినిలబడ్డాడు. ఎక్కడో ఆరుబయట ఉన్నట్టు మాత్రం తెలుస్తోంది.. వెన్నెల వెలుతురును బట్టి. చుట్టూ పరికించాడు. ‘‘అర్రే.. తను ఫ్యాక్టరీ కట్టే స్థలం..!’’ అనుకుంటూ ఎదురుగా చూశాడు. నది లేదు. కళ్లు చిట్లించి మరీ చూశాడు. ఇసుక తిన్నెలు తప్ప నీటి జాడే లేదు. చుట్టురా తిరిగాడు. చెట్టు, చేమ, కొండలు, గుట్టలు.. అన్నీ అలాగే ఉన్నాయ్. నది.. దాని మూడు పాయలు తప్ప! ఎవరో తోసేసినట్టు దబ్బున కిందపడ్డాడు ‘‘అబ్బా.. అని నడుం పట్టుకుంటూ తలెత్తాడు.. షాక్! అంటే.. అంటే.. తను ఇప్పటిదాకా.. నోరు తెరిచాడు.. మాట పడిపోయింది. తెల్లని చీరలో ప్రశాంత వదనంతో ఓ స్త్రీ మూర్తి... నదిని మూడు పాయలుగా చేసి అల్లిన జడతో! ధర్మాసాగర్ కిందపడేదాకా ఆ జడలోనే ఉన్నాడు. ఇక్కడికి అతణ్ణి తీసుకొచ్చిందీ ఆ జడే! ఆ స్త్రీ.. ఒక్కసారిగా వెనకనున్న జడను ముందుకు వేసింది తలను కాస్త కదిపి.. అంతే ఆ ఇసుకతెన్నెలను మీంచి పరవళ్లు తొక్కుతూ ఆ చెట్టూచేమా పాదాలను తాకుతూ.. ఉప్పెనై ముందుకొచ్చింది.. చెవులు చిల్లులు పడే ఘోషతో ! ధర్మసాగర్... వణికిపోతున్నాడు. ఆమె మొహంలో చిరునవ్వు చెదరలేదు. నవ్వుతూనే ఆ ఏటవాలు ప్రాంతాన్ని.. దాని మీదున్న ఫ్యాక్టరీ కట్టే స్థలాన్నీ.. అక్కడ నిలబడి ఉన్న ధర్మసాగర్నూ ఆ జడలో చుట్టేసింది. ఊపిరి ఆడలేదు ధర్మసారగ్కు. వెళ్లి.. తనెప్పుడూ పరుగులుపెట్టే చోట ఆ జడను విప్పేసింది ఆ స్త్రీ మూర్తి. తెల్లవారింది.. ఎప్పటిలా మూడు పాయలుగా ప్రశాంతంగా సాగిపోతోంది ఆ నది. -
బీ47 గదిలో ఏముంది?
‘‘హాయ్...’’ అంటూ పక్కకు జరుగుతూ క్లాస్ రూమ్ బెంచి మీద చోటిచ్చాడు శ్రవణ్. ‘‘హలో’’ అని బదులిచ్చాడు కాని ఆ అబ్బాయి పక్కన కూర్చోవడానికి సంశయపడ్డాడు చందు. వెళ్లి వెనక బెంచీలో కూర్చున్నాడు. తర్వాత ముగ్గురు అబ్బాయిలు, ఇద్దరమ్మాయిలు వచ్చారు.. వాళ్లెవరూ కూడా శ్రవణ్ కూర్చున్న బెంచీ మీద కూర్చోలేదు. చోటు లేకపోయినా మిగిలిన బెంచీల మీదే సర్దుకున్నారు. శ్రవణ్ తప్ప ఈ బెంచీ మీద ఎవరూ లేరు. ఎందుకో అర్థం కాలేదు. తనేమైనా శుభ్రంగా కనిపించడం లేదా? నోట్లో దుర్వాసనేమైనా వస్తోందా? అని క్లాసెస్ అయిపోయాక బాత్రూమ్లోకి వెళ్లి చూసుకున్నాడు. అద్దంలో తనను తాను చూసుకుంటే మురికిగా ఏమీ కనిపించలేదు. కొత్త బట్టలు కావు కాని.. ఇస్త్రీ బట్టలే వేసుకున్నాడు. నీట్‌గానే ఉన్నాడు. కుడి అరచేయి నోటికి అడ్డం పెట్టుకొని తన శ్వాసను చెక్ చేసుకున్నాడు. చక్కగా ఉంది. మరెందుకు? అని ఆలోచించుకుంటూ క్యాంటీన్ దగ్గరకు వెళ్లాడు. క్లాస్మేట్స్ అంతా అక్కడే ఉన్నారు. శ్రవణ్‌ను చూసి కరచాలనం చేస్తూ అందరూ పరిచయం చేసుకున్నారు. పక్కన కూర్చోమంటూ చోటు చూపించారు. క్లాస్‌రూమ్‌లో వాళ్ల ప్రవర్తనకు, క్యాంటీన్లో వాళ్ల తీరుకు పొంతన లేదు. తెల్లవారి కూడా అదే పరిస్థితి. శ్రవణ్ పక్కన .. ఆ బెంచీమీద ఎవరూ కూర్చోలేదు. విరామ సమయంలో క్యాంటీన్ దగ్గర మాత్రం ఎలాంటి అరమరికల్లేకుండా.. ఆప్యాయంగా ఉన్నారు. ఎంత ఆలోచించినా ఆ తేడా ఎందుకో అర్థంకాలేదు శ్రవణ్‌కు. ఆ రాత్రి.. హాస్టల్లో .. భోజనాల దగ్గర.. రెండు రోజుల విచిత్రమైన ఎక్స్‌పీరియెన్స్ నుంచి తేరుకోని శ్రవణ్ బెరుకు బెరుకుగానే ప్లేట్లో భోజనం వడ్డించుకొని చివరన ఉన్న టేబుల్ దగ్గరకు వెళ్లి కూర్చున్నాడు. కెలుకుతున్నాడు కాని ముద్ద దిగడం లేదు. ఆలోచనలన్నీ తన ఇల్లు, గడిపిన జీవితం చుట్టూనే ఉన్నాయి. పేద కుటుంబం. రెండు ఎకరాల పొలం, రెండు గదుల పెంకుటిల్లు తప్ప అరగజం జాగా లేదు ఇంకెక్కడా. ఆ వ్యవసాయం కూడా.. వానల్లేక కుంటు పడింది. చాలామంది లాగే అప్పుల బాధ భరించలేని తండ్రి పురుగుల మందు తాగి చనిపోయాడు. తల్లి తన పొలం ఇంకొకరికి కౌలుకిచ్చి కూలీగా మారింది. శ్రవణ్‌కు ఒక చెల్లి.. టీటీసీ ట్రైనింగ్‌లో ఉంది. ఈ పట్టణంలో ఆ అమ్మాయి లేడీస్ హాస్టల్లో.. తను యూనివర్శిటీ హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు. తల్లి దగ్గర్నుంచి డబ్బులు ఆశించకూడదని ఇద్దరూ పని చేసుకుంటూ చదువుకుంటున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకుని పీజీ ఎంట్రెన్స్ రాశాడు. సీట్ వచ్చింది. ఒక లక్ష్యంతో యూనివర్శిటీలోకి అడుగుపెట్టాడు. పూటకో అనుభవం ఎదురవుతోంది. క్లాస్మేట్స్ మంచోళ్లా? తను చెడ్డవాడా? గతం గుర్తొచ్చో.. నిస్సహాయత వల్లో తెలీదు కాని కళ్లల్లో నీళ్లు తిరిగాయి శ్రవణ్‌కి. అటూ ఇటూ చూసి.. గబగబా కళ్లు తుడుచుకుని తినడం మొదలుపెట్టాడు. ‘‘ఎందుకేడుస్తున్నావ్?’’ ఆ ప్రశ్న వినిపించేసరికి ఉలిక్కిపడి పక్కకు చూశాడు శ్రవణ్. ఒక అబ్బాయి... క్లాస్మేట్ అయితే కాదు. క్లాస్‌లో చూడలేదు. బహుశా.. సీనియరో.. జూనియరో..! ‘‘నేనేం ఏడ్వట్లేదు’’అన్నాడు నీళ్లు తాగుతూ శ్రవణ్. ‘‘క్లాస్‌రూమ్‌లో జరుగుతున్నదానికి హర్ట్ అయ్యావా?’’నింపాదిగా ఆ అబ్బాయి. ‘‘నీకెందుకు?’’ అన్నట్టు అతణ్ణి చూసి అక్కడి నుంచి విసావిసా వెళ్లిపోయాడు శ్రవణ్. రాత్రి...పదకొండు.. బెడ్ మీద దిండుకి చేరగిల పడి పుస్తకం చదువుకుంటున్నాడు శ్రవణ్. ఇంతలోకే ఫోన్ మోగింది. ‘‘చెల్లే అయ్యుంటుంది’’ అనుకుంటూ ఫోన్ చూశాడు. చెల్లెలే. లిఫ్ట్ చేసి.. క్షేమసమాచారాలు, ఆరోజు జరిగిన విషయాలూ మాట్లాడుకొని ఫోన్ పెట్టేశాడు. ఆవులిస్తూ పుస్తకం మూసేశాడు. బెడ్ ల్యాంప్ ఆర్పేస్తూ దుప్పటి కప్పుకున్నాడు. కాసేపటికి పక్కనుంచి గురక మొదలైంది. మంచి నిద్రలో ఉన్న శ్రవణ్‌కు కాస్త డిస్టర్బెన్స్‌గా అనిపించింది. అటు తిరిగి పడుకున్నాడు. ఈసారి ఇంకాస్త ఎక్కువైంది గురక శబ్దం. తల కిందున్న దిండును చెవులకు అడ్డంగా పెట్టుకున్నాడు. ‘‘భయపడకు.. భయపడితే ఓడిపోతావ్! సాధించాలి’’అన్న మాటలు వినిపించాయి. దిగ్గున లేచి కూర్చున్నాడు. పక్కనే చీకట్లో ఒక ఆకారం కనిపించింది. తుఫాను ఈదురు గాలుల చలిలోనూ శ్రవణ్‌కు ముచ్చెమటలు పట్టాయి. భయపడ్తూనే బెడ్‌ల్యాంప్ స్విచ్ ఆన్ చేశాడు. వెలగలేదు. వణుకుతున్న కాళ్లతోనే బెడ్ దిగి మూలనున్న ఆ గది లైట్ బటన్ నొక్కాడు. ఒక్క వెలుగు వెలిగి ఫట్‌మని శబ్దం చేస్తూ ఆరిపోయింది లైట్. ఆ లిప్తకాలంలోనే బెడ్ మీద ఉన్న ఆకారం కనిపించింది. ఆ రాత్రి డైనింగ్ టేబుల్ మీద తన పక్కన కూర్చున్న అబ్బాయే. ఇక్కెడికెలా వచ్చాడు? మిగిలినవన్నీ ఫిలప్ అయ్యి.. ఇదొక్క గదే ఖాళీగా ఉందని తనకు ఇచ్చారు. క్లాస్రూమ్ బెంచీ లాగే ఈ గదినీ తనతో షేర్ చేసుకోవడానికి ఎవరూ రాలేదు. హాస్టల్లోని అన్ని గదులూ ఒక వరుసలో ఉంటే ఈ బీ 47 ఒక్కటే.. వాటికి దూరంగా విసిరేసినట్టు ఉంటుంది. చదువుకోవడానికి ప్రైవసీ దొరుకుతుందని.. సంతోషడ్డాడు తను. ఈ గోలేంటి? భయంతో పాటు ఆలోచనలూ తీవ్రమయ్యాయి. ‘‘నేనున్న గదిలోకి వీడెక్కడి నుంచి వచ్చాడని ఆశ్చర్యపోతున్నావ్ కదూ? ఇది నా గదే.. నీ కన్నా ముందు!’’ అంటూ ఆ ఆకారం గాల్లోకి లేచి శ్రవణ్ ముందున్న స్టడీ టేబుల్ కుర్చీని కిర్రున లాక్కుంటూ అందులో కూర్చుంది. ‘‘భయపడకు. నిన్నేమనను. నీకు తోడుగా ఉండడానికే వచ్చా!’’ అంది ఆ ఆకారం. ‘‘అసలు నువ్వ్వ్..వ్వెవరూ...’’ భయంతో శ్రవణ్ మాటలు తడబడ్డాయి. ‘‘నా పేరు అంగద్. ఇక్కడే ఫిజిక్స్‌లో ఎమ్మెస్సీ చేశా. యూనివర్శిటీ ఫస్ట్ కూడా. రేపు నీ సీనియర్స్‌ను అడుగు నా గురించి. పీహెచ్‌డీకి ప్రిపేర్ అవుతున్నప్పుడు హాస్టల్లో గొడవలు జరిగాయి. మా క్లాస్మేట్స్ కొంతమంది ఒక అమ్మాయిని ఏడిపించారు. ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఆమె నాతో చనువుగా ఉండేది. దాన్ని ఆసరాగా చేసుకొని నా క్లాస్మేట్స్ ఆమె ఆత్మహత్యకు నేనే కారణమన్నట్టుగా ఓ సూసైడ్ నోట్ రాసి ఆమె చేతిలో పెట్టారు. అంతా నా మీదకు వచ్చింది. హెడ్స్ అందరికీ నిజం తెలిసినా.. నోరు విప్పలేదు. ఈ విషయం ఊళ్లో ఉన్న మా పేరెంట్స్‌కి చేరింది.. పరువు తీశాననే బాధతో సూసైడ్ చేసుకున్నారు. నా మీద నిందకన్నా.. మా పేరెంట్స్ నన్ను నమ్మలేదనే నిజంతో చాలా హర్ట్ అయ్యా.. ’ ‘ఇదే గదిలో ఆ రోజు రాత్రి నేనూ ఆత్మహత్య చేసుకున్నా. ప్రాణం పోయింది కాని చదువుమీదున్న పాశం పోలేదు. అందుకే ఇక్కడే తచ్చాడుతున్నా. నువ్వు కూర్చుంటున్న బెంచి మీదే కూర్చునే వాడిని. అలవాటుగా.. ఆ బెంచి మీద కూర్చున్న వాళ్లతో స్నేహం చేద్దామని.. ఈ గదిలో ఉంటున్నా వాళ్లకు తోడుగా ఉందామని.. మాట్లాడ్డం మొదలుపెడితే... దయ్యమంటూ వెలివేశారు. ఎవరినీ నా దగ్గరకు రానివ్వకుండా చేశారు. ఇన్నాళ్లకు నువ్వు ఒక్కడివే.. ధైర్యంగా ఈ గదిలోకి అడుగుపెట్టావ్. ఆ బెంచి మీద కూర్చుంటున్నావ్. భయపడకు నిన్నేం చేయను. సబ్జెక్ట్స్‌లో డౌట్స్ ఉంటే అడుగు.. చెప్తా.. టీచర్‌లాగా. తోడుంటా.. అన్నలాగా!’’ చెప్తోంది ఆ ఆకారం. క్లాస్మేట్స్ ప్రవర్తన వెనక రహస్యం తెలిసింది. బిగుసుకుపోయాడు శ్రవణ్. - సరస్వతి రమ -
దరువు పడిందో.. చావు డప్పు మోగాల్సిందే!
మంచి చలికాలం.. అమావాస్య రాత్రి... పన్నెండు దాటి ఒక్కనిముషం.. ఆ ఊళ్లో ఎవరిళ్లల్లో వాళ్లే ఉన్నా.. ఎవ్వరికీ కంటి మీద కునుకు లేదు. ఈ అమావాస్య.. ఏ ఇంటి తలుపు మీద దరువు పడ్తుందో? ఎవరికి మూడుతుందోననే భయం.. ఊళ్లో వాళ్ల నిద్రలేమికి కారణం. దుప్పట్లో దూరి భయం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నా వాళ్ల వల్ల కావడంలేదు. గడియారం సెకన్ల ముల్లు చప్పుడుతోపాటు తమ గుండె చప్పుడూ వినిపించేంత నిశ్శబ్దం ఆవరించి ఉంది. ఊహ తెలియని పిల్లలు మాత్రమే ఆదమరిచి నిద్రపోతున్నారు. అనుకున్నట్టే.. ఒక వీధిలోని తలుపు మీద దరువు మొదలైంది. ఎంతలా అంటే ఆ ఊరంతటికీ వినిపించేంత. ఆ ఊళ్లోని చెట్టు, చేమ, కొండ, గుట్టా కదిలేంతగా.. వాగువంకలు ఉలిక్కిపడి తమ ప్రవాహాన్ని ఆపుకొనేంతగా! అలా ఆ ఇంటి తలుపు మోగుతూనే ఉంది... పది నిమిషాలదాకా! అల్లకల్లోలం ఆ పదినిమిషాల కాలం. మోత ఆగిపోయాక.. తలుపు తెరుచుకుంది. యాభై ఏళ్ల మనిషి బయటకు వచ్చాడు. వాకిట్లో ఓ విచిత్రమైన ఆకారం. నేలను ఊడుస్తున్న జుట్టు.. మర్రి ఊడలకు మల్లె జడలు కట్టి. కళ్లల్లోంచి నిప్పులు కురుస్తున్నాయి. లావుపాటి పెదవులు... విశాలమైన నుదుటి మీద పడమటి సూర్యుడు లాంటి బొట్టు! ఆ మనిషిని చూడగానే పై ప్రాణాలు పైనే పోతాయి. తలుపు తెరుచుకొని వచ్చిన వ్యక్తి పరిస్థితీ అలాగే ఉంది. ఇప్పటిదాకా ఆ ఊళ్లో వాళ్లెవరూ వాకిట్లో నిలబడ్డ ఆకారాన్ని చూడలేదు.. చూసే అవకాశం రాలేదు. తలుపు మీద దరువు పడ్డ ఇంట్లోంచి బయటకు వచ్చిన వ్యక్తులు తప్ప. ఆ వ్యక్తులు ఈ మనిషి గురించి ఊళ్లో వాళ్లకు వర్ణించి చెప్పే అవకాశం రాలేదు. వాళ్లెవరూ ప్రాణాలతో తిరిగి ఇంటికి చేరలేదు కాబట్టి. ఆ దరువు ఆగిన తర్వాత వాకిట్లో ఓ ఆకారం ప్రత్యక్షమవుతుందని.. అసలు ఆ దరువు వేస్తోంది ఆ ఆకారమే అని కూడా ఎవరికీ తెలియదు. దరువు అంటే భయం.. ఆ ఇంట్లో మనుషుల తప్పులు ఎంచే టైమ్ వచ్చిందని. ఆ తప్పులు చేసిన వాళ్లే తమ తప్పును గ్రహించి.. బయటకు రావాలని.. అలా వెళ్లిన వాళ్లకు అవే ఆఖరు ఘడియలని మాత్రమే తెలుసు. అందుకే అందరికీ అమావాస్య రాత్రవుతుందంటే భయం.. తెల్లవారుతుందంటే భయం! ఊరి నడిబొడ్డున ఉన్న క్లాక్ టవర్ దగ్గర శవం పడి ఉంటుంది... అప్పుడు తెలుస్తుంది.. కిందటి రాత్రి ఎవరికి మూడిందోనని! వాకిట్లో ఆకారం గిర్రున తిరిగి ముందుకు నడవసాగింది. ఇంట్లోంచి బయటకు వచ్చిన వ్యక్తి మారు మాట్లాడకుండా.. ఆ ఆకారాన్ని అనుసరించడం మొదలుపెట్టాడు. ‘‘ఏమేం చేశావ్?’’ కటువుగా, కరుకుగా అడిగింది ఆకారం. ‘‘చాలా చేశాను. పెద్ద కులం వాడిననే గర్వంతో నేను పనిచేసే.. నా దగ్గర పనిచేసే వాళ్లను కించపరిచాను. ఆడవాళ్లను చులకనగా చూశాను. పిల్లల్నీ హింసించాను. డబ్బులు వడ్డీలకు ఇచ్చి.. వాళ్ల రక్తం తాగాను. సంపాదన విషయంలో ఏనాడూ న్యాయంగా ఆలోచించలేదు.. ప్రవర్తించనూ లేదు. ఇప్పుడు నేనున్న ఇల్లు కూడా అలా అన్యాయంగా తీసుకున్నదే’’ మరబొమ్మలా చెప్పుకుపోతున్నాడు ఆ వ్యక్తి. ‘‘ఇవన్నీ పాతవి. మరి కొత్తది?’’ అదే కటువు, కరుకు స్వరం గద్దించింది. ‘‘ఒక పదిహేనేళ్ల పిల్లను.. ’’ ఆపాడు. అప్పటిదాకా ఏదో ట్రాన్స్‌లోంచి ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చినట్టుగా చుట్టుపక్కలంతా చూశాడు. ఊరి నడిబొడ్డు అయిన క్లాక్ టవర్.. ‘‘ఇందాకే కదా.. నా ఇంటిముందున్నా.. అంతలోకే ఇక్కడికెలా వచ్చాను’’ అనుకుంటూ అంతెత్తున ఉన్న క్లాక్ టవర్ వైపు చూశాడు. మెదడులేకుండా.. ఖాళీగా ఉన్న మనిషి పుర్రెలా అనిపించింది.. కనిపించింది క్లాక్‌టవర్ లేని ఆ చోటు. వణికిపోయాడు. పెదవులు తడారిపోతున్నాయి. ఆ ఆకారం గిర్రున్న వెనక్కి తిరిగింది. ఆ రూపం.. తన కళ్లముందు స్పష్టంగా కనిపించే సరికి అతని శరీరంలో వణుకు మరింత ఎక్కువైంది. ‘‘నీ.. నీ.. నీళ్లు.. క్కక్కక్కక్కావాలి... ’’ అడిగాడు కంపిస్తున్న స్వరంతో. అతని ఎదురుగా ఉన్న ఆ ఆకారం ఏమీ మాట్లాడలేదు. చింతనిప్పుల్లాంటి కళ్లను పెద్దవి చేసి చూసింది. ‘ఎఎఎఎఎఎవరు నువ్వు?’’ జారిపోతున్న ధైర్యాన్ని చిక్కబట్టుకునే ప్రయత్నంతో అడిగారు. భీకరంగా నవ్వింది ఆ ఆకారం. క్లాక్ లేని టవర్ వైపు తలతిప్పి చూసి.. మళ్లీ ఆ వ్యక్తి వంక దృష్టి మరల్చుతూ అన్నది.. ‘‘కాలాన్ని’’ అని. ఆ వ్యక్తిలో చిక్కుబడిన కాస్త ధైర్యమూ చటుక్కున పారిపోయింది. ‘‘న్నన్నన్నన్నన్నన్ను ఏం చ్చే...చ్చేచ్చే.. చ్చేయోద్దు..ప్లీజ్’’ బట్ట తల నుంచి చెమటలు వరదలు కట్టాయి అతనికి. మళ్లీ భీకరంగా నవ్విందా ఆకారం.. నోరంతా తెరిచి. తెరిచిన నోరు.. అలాగే ఉంచింది.. మూయలేదు! అర్థమైంది ఎదురుగా ఉన్న మనిషికి. మోకాళ్ల మీద కూర్చోని ప్రాధేయపడ్డం మొదలుపెట్టాడు.. నా భార్య, పిల్లలు దిక్కులేని వాళ్లవుతారు. ఇక నుంచి బుద్ధిగా ఉంటా..ప్లీజ్.. అంటూ. మళ్లీ వికటాట్టహాసం.. తెరలు తెరలుగా! ‘‘ఇలాంటి వేడుకోళ్లు, ప్రార్థనలు నీకూ ఎదురైన జ్ఞాపకం ఉందా?’’ ఆ ఆకారం అదే కరుకుదనంతో. ‘‘ఉంది.. ప్లీప్లీప్లీజ్.. ’’అంటూ ఆ ఆకారం కాళ్ల మీద పడబోయి షాక్ అయ్యాడు. అంత దుఃఖమూ మాయమైపోయింది ఆ షాక్‌కి. ఆ ఆకారం.. నేల మీద నిలబడి లేదు. గాల్లో ఉంది. నేల మీదున్నట్టు భ్రమపడ్డడాడు. గ్రహించినట్టుంది ఆ ఆకారం .. ‘‘కాలాన్ని కదా.. చేతికి చిక్కినట్టే కనపడ్తాను.. కాని నా ఆనవాలును కూడా పట్టుకోలేరు మీరు’’ అంది వ్యంగ్యంగా. చటుక్కున లేచి పరుగెత్తాడు అక్కడి నుంచి పారిపోవాలని. వెనక్కి తిరిగి చూస్తూ మరీ ముందుకు ఉరకసాగాడు. ఉన్న చోటు నుంచి ఆ ఆకారం ఒక్క అంగుళం కూడా కదల్లేదు. అతను పరుగుపెడ్తూనే ఉన్నాడు.. పెడ్తూనే ఉన్నాడు. ఎన్నో కోసులు.. పరుగెత్తి పరుగెత్తి అలుపొచ్చి.. సొమ్మసిల్లబోతూ ఒక చోట ఆగాడు. ఆయాసం తీర్చుకునేందుకు.. కాస్త వంగాడు. మెలిపెడ్తున్న కడుపును కుడిచేతి గుప్పిట్లో పట్టుకుంటూ తలను కాస్త పైకెత్తాడు. ఎదురుగా టవర్.. క్లాక్ లేకుండా.. మెదడు లేని పుర్రెను తలపిస్తూ! భయం.. తలలో బాంబు పేలి.. ఆ శబ్దం చెవుల గుండా వెళ్తూన్నట్టుగా! తనకెదురుగా చూశాడు.. అదే ఆకారం.. నోరు తెరిచి.. కర్కశంగా నవ్వుతూ! అంతే బిక్కచచ్చిపోయాడు ఆ వ్యక్తి! ఉన్నచోటనే కుప్పకూలిపోయాడు. తెల్లవారింది... ఊళ్లోని క్లాక్ టవర్ నాలుగు గంటలు కొట్టింది. ఊళ్లోని తలుపులన్నీ దాదాపు ఒక్కసారిగా తెరుచుకున్నాయ్. దరువు పడిన ఇంటి తలుపులు కూడా. ఆ ఇల్లాలు.. గుండెలు బాదుకుంటూ ఉరకసాగింది ఊరి నడిబొడ్డు వైపు.. ఆమె వెనకాలే ఊరి జనం. టవర్ ముందు తల పగిలి.. కడుపు చీరి.. పడున్న తన భర్తను చూసి స్థాణువైంది. జనాలకూ నోట మాటరాలేదు. ప్రతి అమావాస్య తెల్లవారి చూసే దృశ్యమే అయినా! ఆ గుంపులో ఓ వ్యక్తి.. ఆ ఊరికి కొత్తగా వచ్చిన యువకుడు..ఎందుకో క్లాక్ టవర్ వంక చూశాడు. ఆ గడియారం మీద రక్తం మరకలు! - సరస్వతి రమ -
స్పీడ్ పెరిగింది
షారుక్ ఖాన్ నిర్మాతగా ఫుల్ స్పీడ్‌లో ఉన్నారు. కానీ, హీరోగా చేసే కొత్త ప్రాజెక్ట్‌ను అంగీకరించడానికి మాత్రం టైమ్ తీసుకుంటున్నారు. ఆల్రెడీ ‘బార్డ్ ఆఫ్ బ్లడ్, క్లాస్ ఆఫ్ 83’ సినిమాలను నెట్‌ఫ్లిక్స్ కోసం నిర్మిస్తున్న ఆయన తాజాగా ఓ హారర్ సిరీస్‌కు సహ నిర్మాతగా వ్యవహరించనున్నారని తెలిసింది. ‘బీతాల్’ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సిరీస్‌లో వినీత్ కుమార్ సింగ్, ఆహనా కుమ్రా ముఖ్య పాత్రల్లో నటించనున్నారు. రాధికా ఆప్టే ‘గౌల్’ సిరీస్‌ను డైరెక్ట్ చేసిన ప్యాట్రిక్ గ్రహం ఈ చిత్రానికి దర్శకుడు. త్వరలో షూటింగ్ స్టార్ట్ కానుంది. షారుక్ సినిమాల విషయానికి వస్తే అట్లీ దర్శకత్వంలో ఓ సినిమలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. -
రావిచెట్టుకు రక్తం కారుతోంది..!
‘‘శాంతమ్మా.... శాంతమ్మా....’’ పిలుస్తూ గేట్ తోసుకుని లోపలికి వచ్చేశాడు లింబాద్రి వగరుస్తూ! ఆ గాబరా.. తొందర చూసి.. ‘‘ఏమైందీ’’ అంటూ వసారాలోకి వచ్చింది శాంతమ్మ. ‘‘బయట ఉన్న రావి చెట్టును కొట్టేస్తారట’’చెప్పాడు అదే గాబరాతో. ‘‘ఎవరూ’’ అంతే నింపాదిగా ఆమె. ‘‘రోడ్డేదో పెద్దగ చేస్తారట.. ఆ ఆఫీసర్లు కొలతలు తీసుకుంటూ మాట్లాడుకుంటూంటే విన్నా అమ్మా.. ’’ ఇంకా గాబరాపాటు పోలేదు అతని గొంతులో. ఆమె గుండెలో రాయిపడ్డట్టయింది. మెడ కాస్త పైకెత్తి వీధిలోకి చూసింది. లింబాద్రి చెప్పినట్టుగానే బయటేదో హడావిడిగా ఉంది. నిజానికి ఓ నెల కిందటి నుంచి అంటున్నారు వీధిలో వాళ్లు... ఆ రోడ్డును వెడల్పు చేస్తారట అని. కాని ఆ చెట్టు మీదకు ఎవరి దృష్టీ పోలేదు. కాళ్లూచేతులూ ఆడ్డం లేదు శాంతమ్మకు. తన మామగారు నాటిన మొక్క. ఇప్పుడు వృక్షమైంది. తను పెళ్లిచేసుకొని వచ్చిన కొత్తలో ఆ పరిసరాలు ఇప్పటిలా లేవు. చాలా నిర్మానుష్యంగా ఉండేవి. అసలది అప్పుడు ఓ కాలనీయే కాదు. అక్కడో ఇల్లు.. ఇక్కడో ఇల్లు విసిరేసినట్టుగా ఉండేవి. తనే ఆ ఇంటి ఆఖరి కోడలు. తన తర్వాతే తన ఆడపడచు పెళ్లి అయింది. ఇంట్లో పనంతా చేసుకొని సాయంకాలం పూట ఆ చెట్టు కిందే కూర్చొని కబుర్లు చెప్పుకునే వాళ్లు తోడికోడళ్లు.. ఆడపడచు. తెల్లవారికి కూరలు తరుక్కోవడమూ అక్కడే. ఆ ఇంట్లోని పిల్లల హోంవర్క్, చదువు, ఆటలు, పాటలు అన్నీ ఆ చెట్టు నీడలోనే. ఆ చెట్టుతో తన అనుబంధం మరింత ప్రత్యేకమైనది. శాంతమ్మ భర్త సంజీవ్ దుబాయ్‌లో పనిచేసేవాడు. ఎప్పుడో యేడాదికి ఒక్కసారి వచ్చి పదిహేను రోజులుండిపోయేవాడు. అతను దుబాయ్‌లో ఉన్నప్పుడు పంపిన ఉత్తరాలను ఆ చెట్టుకిందే ఏకాంతంగా కూర్చొని చదువుకునేది. తిరిగి జాబు అక్కడే రాసేది. పిల్లాడు పుట్టాక.. ఆ చెట్టు కిందే ఆడిస్తూ అన్నం తినిపించేది. పాటలు, పద్యాలు.. అన్నీ ఆ చెట్టు సాక్షిగానే సాగాయి. ఇంట్లో అత్త, మామలతో మాట పట్టింపు వచ్చినా.. ఆ చెట్టుతోనే చెప్పుకొని ఏడ్చేది. పుట్టింట్లో అన్నా, వదిన మర్యాద తక్కువైనా చెప్పుకోవడానికి ఆ చెట్టే దిక్కు. అన్నదమ్ములంతా ఆస్తిని పంచుకోవాలనుకున్నప్పుడు .. కేవలం ఆ చెట్టు కోసమే మిగిలిన వాటా డబ్బులు చెల్లించి ఆ ఇంటిని తీసుకొమ్మని భర్తను పోరింది శాంతమ్మ. ‘‘ఈ పాతిల్లు ఎందుకు? వేరే చోట చక్కగా కట్టుకుందామని భర్త చెప్పినా వినకుండా. శాంతమ్మ కొడుక్కి అప్పటికి పందొమ్మిదేళ్లు.. వాడూ ఆ ఇల్లే కావాలని పట్టుపట్టాడు. దాంతో సంజీవ్ కాదనలేక పోయాడు. గతంలోంచి బయటకు వచ్చి వడివడిగా.. వీధిలోకి వెళ్లింది శాంతమ్మ. తలుపులు గడియ వేసి ఆమె వెనకే వెళ్లాడు లింబాద్రి. అతను శాంతమ్మకు తోబుట్టువు కంటే ఎక్కువ. ‘‘ఏంటండీ.. రావి చెట్టును కొట్టేస్తున్నారా?’’ అడిగింది అక్కడున్న ఆర్ అండ్ బీ వర్కర్స్‌ను. ‘‘అవును మేడం.. వైడెనింగ్‌లో తప్పేట్టు లేదు’’ చెప్పాడు సూపర్వైజర్. ‘‘ఇది ఏళ్ల నాటి చెట్టండి.. అలా ఎలా కొట్టేస్తారు?’’ వాదనకు దిగింది శాంతమ్మ. ‘‘తప్పదు.. ’’ అంటూ రోడ్డు మీద పెట్టిన కెమెరా ట్రైపాడ్‌ను తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయాడు అతను. మిగిలిన వాళ్లూ ఎవరిపనుల్లో వాళ్లు పడ్డారు. శాంతమ్మ ఏదో చెప్తున్నా వినిపించుకోలేదు వాళ్లు. దిగులుగా ఆమె ఆ చెట్టు దగ్గరకు వెళ్లింది. ఒక్కసారిగా చెట్టు తలూపినట్టు కొమ్మలన్నీ కదిలాయి సన్నగా సవ్వడి చేస్తూ! అక్కడున్న అందరి అటెన్షనూ చెదిరింది వర్కర్స్ సహా. చెట్టు వైపు చూశారు. అది తన కొమ్మలన్నిటినీ వంచి శాంతమ్మతో ఏదో చెప్పుకుంటున్నట్టు అనిపించింది వాళ్లకు. శాంతమ్మా.. ఆ చెట్టుతో మాట్లాడుతోంది... ‘‘నీకేం కాదు.. నేనున్నాగా! కాపాడుకుంటా’’ అంటూ. విస్తుపోయారంతా. ఆ చెట్టు కాండాన్ని కాసేపు నిమిరి ఇంట్లోకి వెళ్లిపోయింది. ఆ వెనకే లింబాద్రి వెళ్లబోతుంటే... అక్కడున్న వాళ్లంతా ఆపారు. ‘‘ఏంది సామీ.. ఆయమ్మ.. ఆ చెట్టుతో ఏందో మాట్లాడుతాంది?’’ అని. వాళ్లందరినీ గంభీరంగా ఓ చూపు చూసి.. ఏమీ జవాబు చెప్పకుండా మౌనంగా శాంతమ్మ వాళ్లింట్లోకి వెళ్లిపోయాడు. రాత్రి.. శాంతమ్మను ఎంత బతిమాలినా మెతుకు ముట్టలేదు. అలాగే పడుకుండిపోయింది. బాధతో లింబాద్రీ ఏమీ తినలేదు. వాకిట్లోకి వచ్చాడు. వీధిలైట్ వెలుగులో.. ఎదురుగా రావి చెట్టు.. దీనంగా.. కనపడింది లింబాద్రికి. గేట్ మీద రెండు చేతులు పెట్టి ఆ చేతులకు తన చుబుకం ఆనించి రావిచెట్టునే చూడసాగాడు. ఆ రోజు బాగా గుర్తు... ప్రత్యూష్ పందొమ్మిదో పుట్టనరోజు.. సంజీవ్ సర్ బండీ కొనిపెట్టాడు. ఆ సంతోషం ఆ పిల్లాడి కళ్లల్లో మెరుస్తూ ఉంది. ఫ్రెండ్స్‌కి చూపిస్తానని వెళ్లాడు. జీవంతో రాలేదు. యాక్సిడెంట్లో పోయాడు. తీసుకొచ్చి ఈ చెట్టుకిందే పడుకోబెట్టారు. చిత్రంగా ఆ రోజు నుంచి ఆ చెట్టు తీరు మారిపోయింది. ఓ మనిషి పూనినట్టు.. ఇంకా చెప్పాలంటే అచ్చంగా ప్రత్యూష్లా ప్రవర్తించడం మొదలుపెట్టింది. దాన్ని ముందు కనిపెట్టింది తనే! పిల్లాడి శవం ఇంకా తీయకముందే శోకదేవతలా ఉన్న శాంతమ్మ చెవిలో చెప్పాడు చిన్నగా. శాంతమ్మ కొడుకును చూడ్డం మానేసి చెట్టును చూడ్డం స్టార్ట్ చేసింది. నిజంగా తన కొడుకులాగే అనిపించింది ఆ రావి చెట్టు. పిల్లాడి దేహాన్ని శ్మశానానికి తీసుకెళ్తుంటే.. ఏడుస్తూ వెంట పరిగెత్తబోయిన శాంతమ్మను ఈ చెట్టు కొమ్మలు వెనక్కి లాగినట్టు ఒక్కడుగు కూడా ముందుకు వేయలేకపోయింది. అందరూ ఆశ్చర్యపోయారు. షాక్‌లో ఉందేమోనని అనుకున్నారు. ఆ రోజు ఆ చెట్టు చెప్పింది ఆమెతో.. ‘‘అమ్మా.. నేనక్కడికీ వెళ్లలేదు. ఇక్కడే ఉన్నా.. నీతోనే ఉంటా.. నేనే ప్రత్యూష్ని’’ అని. ఆ మాటలు లింబాద్రికీ వినపడ్డాయి. మూడో రోజు ప్రత్యూష్కి ఇష్టమైన వంటకాలను చేసి చెట్టు మొదట్లో పెట్టింది. మరుక్షణమే ఆ విస్తరి ఖాళీ అయింది. అప్పుడు.. ఆ చెట్టు మీద ప్రత్యూష్ ఉన్నాడని శాంతమ్మ రూఢి చేసుకుంది. ఆ క్షణం నుంచి ఇప్పటిదాకా.. దాన్ని కన్న బిడ్డకంటే జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తోంది. చెట్టంత కొడుకు పోయాడన్న దిగులుతో మంచం పట్టిన శాంతమ్మ భర్త యేడాదికే తుది శ్వాస విడిచాడు. అయినా అంతగా బాధపడలేదు ఆమె. చుట్టుపక్కల వాళ్లు, బంధువులు అంతా ముక్కున వేలేసుకున్నారు. అర్థం చేసుకోగలిగిన వాళ్లు కొడుకు పోయిన షాక్ నుంచి ఇంకా తేరుకోలేదని సమాధానపడ్డారు. ‘‘మామా...’’పిలిచినట్టయింది. గేట్ తీసుకొని చెట్టు దగ్గరకు వెళ్లాడు లింబాద్రి. ‘‘చెప్పు బాబూ..’’ లింబాద్రి. ‘‘అమ్మ భోంచేయలేదు కదూ..’’ ‘‘ఉహూ.. నీ మీదే దిగులుతో ఉంది’’ చెప్పాడు లింబాద్రి. ‘‘నా గురించి చింత వద్దు.. అమ్మను జాగ్రత్తగా చూసుకో’’ వెళ్లి చెట్టును హత్తుకున్నాడు లింబాద్రి. అతని కళ్లల్లో నీళ్లు. ‘‘సార్.. అది చెట్టు కాదు సార్.. దయ్యం’’ భయంతో పారిపోతూ చెప్పారు చెట్టును నరికేయడానికి వచ్చిన కూలీలు. ‘‘ఏమైంది.. ఆ చెమటలేంటి? ఆ కంగారేంటీ?’’ సూపర్వైజర్ అయోమయంగా. ‘‘గొడ్డలితో వేటు వేసిన చోటల్లా రక్తం వస్తోంది సార్.. పొయ్యి చూడండి.. వరద కట్టింది రక్తం. మావల్ల కాదు.. మేం పోతున్నాం.. ’’ అంటూ పరిగెత్తారు ఆ కూలీలు. ఏమీ అర్థంకాని సూపర్వైజర్.. చెట్టు దగ్గరకు వెళ్లి చూశాడు. నిజంగానే రక్తం.. కాలువై పారుతుంది. అక్కడున్న జనమంతా హాహాకారాలు చేస్తున్నారు. నిశ్చేష్టుడైపోయాడు సూపర్వైజర్. - సరస్వతి రమ -
శ్మశానంలో ఊయల..
వేసవి రాత్రి.. ఆరుబయట.. చల్లగా ఉంది. ఆమె తన గూడు ముందే ఉన్న వేప చెట్టుకి ఊయల కట్టే ప్రయత్నం చేస్తోంది. ఆ చప్పుడికి లోపలి నుంచి ఓ కేక.. మూలుగులా! ‘‘ఏం చేస్తున్నావే బయట?’’ ‘‘వేప చెట్టుకు ఊయల కడ్తున్నానమ్మా...!’’ చేస్తున్న పని మీద నుంచి దృష్టి మరల్చకుండానే సమాధానమిచ్చింది ఆమె. ‘‘రాత్రివేళల్లో చెట్ల కింద ఉండకూడదు తెలుసా?’’ హెచ్చరిక లోపలి నుంచే. వెనక్కి తిరిగి.. ‘‘అమ్మా.. ’’ అని నవ్వుతూ విసుక్కుంది. ఆ అమ్మకూడా నాలుక కర్చుకున్నట్టుంది మాటలేదు. కాసేపటికి ఏదో తట్టినట్టు ‘‘ఊయల దేనితో కడ్తున్నావే?’’ సందేహం వెలిబుచ్చింది. ‘‘ఊ... తాళ్లు’’ అంది చెట్ట కొమ్మ మీదకి వేసిన తాళ్లను కిందకి లాగుతూ! ‘‘తాళ్లా? ఎక్కడివి?’’ మళ్లీ ప్రశ్న. ‘‘అమ్మా... ఈ చెట్టు మీద వేల్లాడినవన్నీ పోగేశా... తెలిసీ అడుగుతావేంటీ?’’ తాళ్లను లాగడంలో అలసిపోయినట్టుందేమో.. నడుం మీద చేతులు పెట్టుకొని సేద తీరుతూ చిరు కోపాన్ని ప్రదర్శించింది ఆమె. ఇంతలోకే పక్కనే పిట్ట గోడ మీదున్న ఫోన్ గుర్ర్... గుర్ర్.. మంటూ వైబ్రేట్ అయింది. ‘‘అబ్బా... ఈ టైమ్‌లో ఎవరో..’’ అని చిరాకు పడుతూ ఫోన్ అందుకుంది. ‘‘హాయ్’’ ‘‘హెలో.. వాట్సప్?’’ ‘‘పడుకున్నావా?’’ అంటూ వరుసగా మూడు మెసేజ్‌లు ఉన్నాయి. ‘‘పట్టువదలని పరాక్రముడు.. ’’అనుకుంటూ.. ఆ మూడు మెసేజ్‌లకు రిప్లయ్ ఇచ్చింది..‘‘పడుకోలేదు.. ఊయలూగుతున్నా’’ అని! అవతలి నుంచి వెంటనే రెస్పాన్స్. ‘‘వావ్.. వెన్నెల్లో ఊయలా?’’ అంటూ. ఆమె..ఆ వెంటనే.. ‘‘ వెన్నెల్లో కాదు.. చీకట్లోనే.. రేపు అమావాస్య..’’ అంటూ కన్నుగీటే ఇమోజీతో రిప్లయ్ ఇచ్చింది అవతల మెసేజ్ రిసీవ్ చేసుకున్న వ్యక్తి.. ఆమె ఇంప్రెషన్ కోసం తండ్లాడుతున్నాడు గత కొద్ది రోజులుగా! ఆ ఊళ్లో జరిగిన ఆర్ట్ ఎగ్జిబిషన్లో ఆమెను చూశాడు. అప్పటి నుంచి మనసు పారేసుకున్నాడు. ఎలాగో ఆమె నంబర్ సంపాదించాడు. పలకరించాలంటే భయపడ్డాడు. ఈ పరిచయం.. పరిచయం వరకే ఉంటే ఓకే.. కాని ప్రేమగా మారి ముందుకు వెళితే.. తను ఆమెతో ఉండగలడా? సాధ్యమా? సాధ్యం కాకపోతే ఆ అమ్మాయి పరిస్థితి? ‘‘ముందు మాట్లాడు.. తర్వాత సంగతి తర్వాత’’ అంటూ మెదడు ధైర్యమిచ్చి.. ప్రోత్సహించింది. అలా మొదలైన ఆ ఫోన్ మెసేజ్ కమ్యూనికేషన్‌ను అంతవరకే పరిమితం చేయడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు. కాదు.. అతను అంతవరకే ఉండేలా ఆమె నియంత్రిస్తోంది. ఇప్పుడు.. ప్రస్తుత సందర్భంలో.. అదే అనుకుంటున్నాడు.. ఆ కన్నుగిటే ఇమోజీకి జవాబివ్వకుండా.. ‘‘కలిసి ఉండడం సాధ్యం కాకపోతే అనవసరంగా ఆ అమ్మాయి పరిస్థితేంటో అని ఎంత పిచ్చిగా ఆలోచించాడు? ఇన్ని రోజులైనా ఆమె తన సంభాషణతో ఈ పరిచయాన్ని ఒక అంగుళం కూడా ముందుకు తీసుకెళ్లలేదు. ఇలాంటి గట్టి పిల్లనా తను తేలిగ్గా అంచనా వేసింది?’’ అని. అలా అనుకుంటున్నాడే కాని.. ఆమె ఆ ముక్తసరి.. ముక్కుసూటి తీరు.. అతనిలో పట్టుదలను పెంచుతోంది. ఎలాగైనా ఆమెను.. కలవాలి అని. ఇంకా చెప్పాలంటే ఆ పిల్లను ప్రేమించడం మొదలుపెట్టాడు. అందుకే ఆ క్షణాన ఆమెకు మెసేజ్ పెట్టాడు.. ‘‘నిన్ను కలవాలనుంది’’ అని. ఆమె ఆ మెసేజ్‌ను చూడకుండా ఇగ్నోర్ చేసింది. షాపింగ్ మాల్లోని లేడీస్ సెక్షన్లో న్యూ ఎరైవల్స్ దగ్గర అమర్చిన డ్రెసెస్‌ను ఆసక్తిగా గమనిస్తోంది ఆమె. ‘‘హాయ్’’ అన్న పిలుపు వినిపించి ఉలిక్కిపడి చూసింది. నవ్వుతూ అతను. ‘‘ఓ హాయ్’’ తేరుకుంటూ ఆమె. ‘‘డ్రెస్ కొంటున్నావా?’’ అతను. ‘‘లేదు.. చూస్తున్నా’’ ఆమె. అతను నవ్వాడు. ‘‘అవునూ.. ఇంతకుముందే ఈ షాప్ అంతా కలియ తిరిగాను. ఎక్కడా కనపడలేదు నువ్వు! అంత హఠాత్తుగా ఎలా ప్రత్యక్షమయ్యావ్?’’ ఆశ్చర్యపోతూ ఆమె. ఇద్దరూ కలిసి నడుస్తున్నారు. ప్రసన్నంగా ఉంది ఆమె మొహం. ‘‘ఇదే మంచి అవకాశం.. మనసులో ఉన్నది చెప్పేయ్’’ రెచ్చగొడుతోంది అదని మెదడు. ఏదో వినిపడినట్టు వెంటనే అతని వైపు చూసింది ఆమె ‘‘ఏమన్నా అన్నారా?’’ అంటూ. అనలేదన్నట్టు.. అన్నాను అన్నట్టు తల అడ్డదిడ్డంగా ఊపుతూ ‘‘నువ్వంటే నాకు ఇష్టం.. నీతో కలిసి బతకాలనుంది’’ చెప్పాడు టపీమని. తాపీగా అతని కళ్లల్లోకి చూసింది ఆమె. ‘‘నిజం... నువ్ లేకుండా ఉండలేను.. నీ కోసం ఈ లోకాన్ని కూడా వదులుకుంటా’’ అతను. అలాగే చూస్తూ ఆమె. ‘‘ప్లీజ్.. చెప్పు..’’ ఆమె మౌనం అతనికి భారమైంది. ఆమె గబగబా తన సెల్ఫోన్లో ఏదో టైప్‌చేసి అతని ఫోన్ నంబర్‌కి సెండ్ చేసి.. ఫోన్ చూసుకో అన్నట్టు సైగ చేసింది. చూశాడు అతను. అడ్రస్.. ‘‘ఎవరిది?’’ అడిగాడు. ‘‘మాదే.. రాత్రి ఇంటికి రా.. ఇంట్లో ఎవరూ ఉండరు. చెప్తాను’’ అంది. అతని మొహంలో ఆనందం. ‘‘సరే మరి.. నేను వెళ్తా’’అంది లేచి నిలబడుతూ! రాత్రి.. పదకొండు అవుతోంది.. ఆమె చెప్పిన అడ్రస్‌కు వచ్చాడు. ఒక్క వీధి దీపం తప్ప అక్కడ ఇళ్లే కాదు జనసంచారమే లేదు. అయినా కాస్త ముందుకు నడిచాడు. వేప చెట్టు.. దానికి కట్టి ఉన్న ఊయలా కనిపించాయి. ‘‘హమ్మయ్యా.. వచ్చేశా’’ అనుకుని గబగబా ముందుకు నడిచాడు. పెద్ద ప్రహరీ.. పెద్ద గేట్.. గేట్ తీసుకొని లోపలికి వెళ్లాడు. బయటి స్ట్రీట్ లైట్ వెలుతురు పడి.. శ్మశానం స్పష్టంగా దర్శనమిస్తోంది.. భయంగా వేపచెట్టు వైపు చూశాడు.. ఊయల ఊగుతోంది.. నెమ్మది నెమ్మదిగా వేగం పెంచుకుంటూ! - సరస్వతి రమ -
నేలమాళిగ
ఒంటిగంట రాత్రి... గడ్డకట్టే చలి.. నిర్మానుష్యంగా ఉంది అంతా! ఆ ఇంట్లో నేల.. ఉన్నట్టుండి శబ్దం చేయసాగింది. ఫ్లోరింగ్‌లో లోపలి నుంచి ఎవరో బలంగా కొడ్తున్న శబ్దం... అంతకంతకూ ఎక్కువై... మార్బుల్ ఫ్లోర్ మీదున్న మంచం కిందపడిపోయింది. మంచం పడిపోగానే నేల సద్దుమణిగింది. గాఢ నిద్రలో ఉన్న నరేంద్ర.. తలకు దెబ్బతగలడంతో టక్కున కళ్లు తెరిచాడు. చూసుకుంటే .. పక్కకు ఒరిగి పోయిన మంచం నుంచి జారి ఉన్నాడు. తలకిందులుగా కనిపించింది గది.. తలంతా దిమ్ముగా ఉంది. ‘‘ఎలా పడ్డాను?’’ .. ‘‘ఇదేంటి?’’ అన్న ఆశ్చర్యం కించిత్తు కూడా లేదు అతని మొహంలో. 62 ఏళ్ల అతను లేచి.. రెండు చేతులతో తలను పట్టుకొని కాసేపు అలాగే కూర్చున్నాడు. కాస్త స్థిమితపడ్డాక.. మంచానికి కాస్త దూరంగా మూలన ఉన్న గది లైట్ స్విచ్వేసి.. . వంటింట్లోకి వెళ్లి మంచినీళ్లు తాగి వచ్చాడు. ఆ గదిలోకి వచ్చేసరికి లైట్ ఆరిపోయి ఉంది. మళ్లీ నేల లోపలి నుంచి చప్పుడు మొదలైంది. అది తనకు అలవాటే అన్నట్టుగా ఆ శబ్దాన్ని పెద్దగా పట్టించుకోకుండా.. బలమంతా ఉపయోగించి ఒరిగిన మంచాన్ని నాలుగు కాళ్ల మీద నిలబెట్టాడు. ఆ మంచం మీద అతను కూర్చోబోతుంటే.. నరేంద్ర కాళ్లను కింద నుంచి తన్నింది నేల. మళ్లీ లైట్ వేయడానికి మంచం దగ్గర్నుంచి కదిలాడు నరేంద్ర. నేలలోపల ఓ ఆకారం .. అది గమనించి.. అతని కంటే ముందే గబగబా లోపలి నుంచే గది ఆ మూలకు వెళ్లింది.. దానితో పోటీ పడుతున్నట్టుగా అతనూ వెళ్లి స్విచ్ వేశాడు.. వెలగలేదు. మళ్లీ ట్రై చేశాడు. వెలగలేదు. ‘‘ఏయ్ వదులు..’’ అన్నాడు కిందకు కాస్త వంగి నేల లోపలి ఆకారాన్ని ఉద్దేశిస్తూ! ‘‘నేను చెప్పింది విను మరి’’ అంది ఆ నేలమాళిగలోని ఆకారం. తల పంకించి ఆ చీకట్లోనే వచ్చి మంచం మీద కూర్చున్నాడు అతను. ‘‘అలా చీకట్లోనైనా కూర్చుంటావ్ కాని.. నేను చెప్పింది చేయవ్ అన్నమాట’’ అంది లోపలి ఆకారం. ఏమీ మాట్లాడకుండా.. మాళిగలోని ఆ ఆకారం వైపే చూడసాగాడు. చిత్రంగా... అక్కడంతా వెలుగు. ఆ ఆకారం ఉన్న మేరా! కాళ్లు కిందకు వేసి... తల కాస్త కిందకు వంచి.. మోకాళ్ల మీద మోచేతులు ఉంచి... కుడి అరచేత్తో ఎడమ అరచేతిని మడుస్తూ చుబుకం దగ్గర పెట్టుకొని ఆలోచనల్లో పడ్డాడు నరేంద్ర.. నేలమాళిగలోని ఆకారం కూడా సైలెంట్ అయిపోయి.. అతణ్ణే పరిశీలిస్తూ ఉంది. నరేంద్ర రిటైర్ అయ్యి రెండేళ్లవుతోంది. పిల్లలిద్దరూ యూరప్‌లో ఉన్నారు వాళ్ల కుటుంబాలతో. ఇండియాకు వచ్చే ఆలోచన కూడాలేదు.. కనీసం చుట్టపుచూపుగా కూడా. భార్య పోయాక.. సొంతూళ్లో.. అంత పెద్ద ఇంట్లో.. ఒంటరిగా.. భార్య జ్ఞాపకాలతో బతకడం కష్టమనిపించింది. అందుకే ఆ ఇంటికి.. ఆ ఊరికి.. తన వాళ్లకు దూరంగా.. హిల్స్టేషన్లాంటి ఈ చోటికి వచ్చేశాడు. ఇప్పుడుంటున్న చిన్న ఇల్లు కొనుక్కున్నాడు.. కొంచెం వాలు మీద.. చుట్టుపక్కల ఏ ఇల్లూ లేక.. ఏకాంతంగా.. ఉందని. కొనేటప్పుడు ఆ ఊళ్లోని చాలా మంది హెచ్చరించారు.. ఆ ఇంటి జోలికి వెళ్లొద్దని. ముప్పై ఏళ్ల నాటిది ఆ ఇల్లు. అంతకుముందెప్పుడో .. ఓ యాభై ఏళ్ల కిందట ఓ జమీందారు అక్కడ వేసవి విడిది కట్టుకున్నాడట. కోటలా ఉండేదట అది. అక్కడ ఆయనకు అన్నీ చూసిపెట్టడానికి ఒక వ్యక్తి ఉండేవాడట. ప్రతి వేసవిలో అక్కడికి వచ్చేవాడట జమీందారు. జమీందారీ రద్దతువుతున్నప్పుడు తన దగ్గరున్న డబ్బు, బంగారం, వెండి, రత్నాలు, వజ్రాలు అన్నీ తెచ్చి.. ఇక్కడ కోటలో పాతి పెట్టాడట. ఒకసారి.. వాటికి ఆశపడ్డ ఆ కోటలోని జమీందారు బాగోగులు చూసుకునే వ్యక్తి ... వాటిని పెద్ద మూటలో కట్టి.. తీసుకెళ్లబోతూ జమీందారుకు పట్టుబడ్డాడని.. వాటితోనే అతణ్ణి.. ఆ జమీందారు అదే గొయ్యిలో సజీవ సమాధి చేశాడనీ.. తర్వాత జమీందారు పాము కుట్టి చనిపోయాడని.. ప్రచారంలో ఉంది. అప్పటి నుంచి చాలా ఏళ్ల దాకా.. ఆ కోటను పట్టించుకునేవారే లేకుండిరట. ఆ బంగారం కోసం.. డబ్బు కోసం తవ్వకాలూ జరిగాయట. అలా తవ్వకాలు జరిపిన వాళ్లు .. కొన్ని రోజులకు ఆ చుట్టుపక్కలే ఏదో రకంగా మృత్యువాత పడ్డారని పుకారు. ఏదేమైతేనేం.. కొన్నాళ్లకు.. ఓ ఫ్రెంచ్ వ్యక్తి .. జమీందారు కుటుంబ సభ్యుల దగ్గర్నుంచి ఆ కోటను కొనుక్కున్నాడు. దాన్నంతా పడగొట్టించి.. చుట్టూ ప్లేస్ అలాగే పెట్టి.. చిన్న ఇల్లు కట్టించుకొని అందులో ఉండసాగాడు. ఆ ఫ్రెంచ్ వ్యక్తి ఆ జాగను కొనుక్కున్నాడని తెలిశాక.. ఊర్లో చాలామంది గుసగులు.. అతనికి ఆ నేలమాళిగలోని బంగారం బయటకు తీయడం తెలిసిందని. కానీ.. కొన్నాళ్లకే ఆ ఫ్రెంచ్ వ్యక్తి ఇంట్లోని బెడ్రూమ్లో మంచం మీద నుంచి కిందపడి.. తలకు బలమైన దెబ్బ తగిలి చనిపోయాడు. తర్వాత ఆ ఫ్రెంచ్ వ్యక్తి కుటుంబీకులు వచ్చి ఆ ఇంటిని ఇంకెవరికో అమ్మేశారు. ఆ కొనుక్కున్న వ్యక్తీ అలాగే చనిపోయాడు. అతని కుటుంబ సభ్యులు భయపడి ఆ ఇంటిని వేరే ఊరి వాళ్లకు అమ్మేసి వెళ్లిపోయారు. ఆనక వచ్చిన వాళ్లదీ అదే అనుభవం. వాళ్లు నరేంద్రకు అమ్మారు. అప్పుడు నరేంద్రను ఊళ్లో వాళ్లంతా భయపెట్టారు... నచ్చజెప్పారు.. హెచ్చరించారు ఇల్లు కొనద్దని. అయినా అలాంటివి నమ్మని నరేంద్ర ఇల్లు కొన్నాడు. కొన్ని మరుసటి రోజు నుంచే నేలమాళిగలోంచి చప్పుళ్లు ప్రారంభమయ్యాయి. మొదట్లో భయపడ్డాడు. యేడాదిగా అలవాటు పడ్డాడు. ఇప్పుడు ఆ ఆకారంతో మాట్లాడుతున్నాడు కూడా. చాలాసార్లు ఆ ఆకారం అతనికి తన దగ్గరున్న బంగారం.. వెండి.. వజ్రాలను ఆశ చూపింది.. తనను బయటకు తీస్తే వాటిని ఇస్తానని. నవ్వుతూ దాటవేస్తూనే ఉన్నాడు నరేంద్ర. ‘‘నాకు తెలుసు నువ్వు ఏం ఆలోచిస్తున్నావో?’’ లోపలి నుంచి ఆకారం అతని మౌనాన్ని, ఏకాంతాన్ని భంగపరిచింది. ‘‘ఈ ఇల్లు కొనుక్కున్నప్పుడే నా మొండితనం నీకు అర్థమై ఉంటుంది. ఇంకా నీ సహనాన్ని ఎందుకు పరీక్షించుకుంటావ్ చెప్పు?’’ అన్నాడు సౌమ్యంగా అతను. ‘‘అర్థమైంది కాబట్టే.. నిజంగా నీకు ఈ సంపదనంతా ఇచ్చి గాల్లో కలిసిపోదామనుకుంటున్నా’’ అంది ఆ ఆకారం. ‘‘అది నాది కాదు.. నాది కానిది ఏదీ నాకు వద్దు. నువ్ ఇప్పుడు గాల్లోనే ఉన్నావ్!’’ అన్నాడు అంతే నింపాదిగా అతను. ఆ ఆకారం అహం దెబ్బతిన్నది. మళ్లీ దబదబా నేలను బాదింది.. గదంతా కలియతిరుగుతూ.. గదిలోని టేబుల్, కుర్చీ.. బట్టల అలమరా కాళ్లు గుంజింది. ఒకొక్కటిగా అవన్నీ కింద పడిపోయాయి. అయినా అతను కదల్లేదు.. బెదరలేదు. ‘‘ నన్ను ఒక్కసారి బయటకు రానివ్వవా ప్లీజ్.. .. ఆ జమీందారిగాడి కుటుంబంలోని ఒక్కొక్కళ్లను చావగొడ్తా.. తర్వాత నువ్వు ఉండమన్నా ఉండను’’అంటూ కాళ్లబేరానికి వచ్చింది. నవ్వుతూ అన్నాడు అతను‘‘ఏ కాలం సంగతి నువ్వు మాట్లాడేది. అతనికి పుట్టిన వాళ్లంతా పోయారు’’అన్నాడు. ‘‘ఆయన మనవలు.. మునిమనవలు ఉంటారు కదా.. ’’ అంది అదే కసితో. ‘‘మనవలూ పోయారు. మునిమనమడు ఒక్కడే. ఉన్నాడు.. నీ ముందే’’ అన్నాడు నరేంద్ర. ఆకారం నుంచి మాట లేదు. కదలికా లేదు. ‘‘చెప్పాగా.. నాకు నీ దగ్గరున్న సంపద మీద ఆశలేదు. దాని మీద ఆశపడింది నువ్వు. దానితోనే ఉండిపో’’అని చెప్పి గది బయటకు నడిచాడు నరేంద్ర. - సరస్వతి రమ -
హారర్ స్టోరీ
హ్యూమర్‌ప్లస్ ఇంతలో హీరోయిన్ వచ్చి ‘‘అంధెరీకి నమ్‌కారం’’ అంది తెలుగులో. దెయ్యం జడుసుకుని ‘‘పిశాచాలు కూడా ఇలాంటి భాష మాట్లాడవు. తెలుగు రాని అమ్మాయిని హీరోయిన్గా తీసుకోవడానికి మించిన హారర్ ఎఫెక్ట్ ఏముంటుంది?’’ అని అరిచింది. ఒక దెయ్యానికి సినిమాల్లో చేరాలని కోరిక పుట్టింది. తన సినిమాలు చూసి తానే భయపడే ఒక హారర్ డెరైక్టర్ దగ్గరికి వెళ్లింది. ‘‘ఇంతవరకూ దెయ్యం సినిమాలు తీసిన వాళ్లున్నారు కానీ, దెయ్యంతోనే సినిమాలు తీసినవాళ్లెవరూ లేరు. నాకైతే మేకప్, గ్రాఫిక్స్ అక్కరలేదు’’ అని చెప్పింది దెయ్యం. ‘‘ఫీల్డ్‌లో దెయ్యాలెవరో, మనుషులెవరో తెలుసుకోవడం కష్టంగా ఉంది. నువ్వు దెయ్యమే అనడానికి రుజువేంటి?’’ అని అడిగాడు డెరైక్టర్. దెయ్యం తన కాళ్లను వెనక్కి తిప్పి చూపించింది. కోరల్ని బయటపెట్టి గాల్లోకి ఎగిరింది. డెరైక్టర్ సంతోషించి ‘దెయ్యం భయం’ అనే సినిమా స్టార్ట్ చేశాడు. ముహూర్తం రోజున దెయ్యం పూజ చేసి దేవుడికి కొబ్బరికాయ కొట్టింది. ‘‘దెయ్యాలు కూడా పూజ చేస్తాయా?’’ అని అడిగాడు డెరైక్టర్. ‘‘దెయ్యాలు పూజ చేయడం, సింహాలు సన్యాసం తీసుకోవడం ఇప్పుడు ఫ్యాషన్. మనుషుల కంటే ఎక్కువగా దెయ్యాల్నే దేవుడు ప్రేమిస్తాడు’’. ‘‘ఎందుకని?’’ ‘‘భయం. కొలిచేవాడికి వరాలివ్వడం పాత పద్ధతి. కరిచేవాడికే ఇప్పుడు వరాలు’’ అంది దెయ్యం. గడియారం సరిగ్గా పన్నెండు కొడితే దెయ్యం ‘హిహిహి’ అని నవ్వుతూ వచ్చి భయపెట్టాలి. ఇది ఫస్ట్ షాట్. ‘‘ప్రేక్షకులకి కామన్సెన్స్ లేకపోయినా, దెయ్యాలకి టైం సెన్స్ వుంది. అందువల్ల మేం అర్ధరాత్రి బయటికి రావడం మానుకొని చాలాకాలమైంది’’ అంది దెయ్యం. ‘‘తరతరాలుగా సినిమాల్లో వస్తున్న సాంప్రదాయమిది’’ అన్నాడు డెరైక్టర్. ‘‘అందుకే మీరు ఆదాయం లేకుండా చస్తున్నారు. అసలు గంటలు కొట్టే గడియారాలు ఎవరి కొంపలోనైనా ఉన్నాయా? పొరపాటున ఎక్కడైనా మోగినా అది టీవీ సీరియల్లో యాడ్ అనుకుంటాం గానీ మిడ్నైట్ అయ్యిందని అనుకుంటామా?’’ అని ప్రశ్నించింది దెయ్యం. ‘‘మరి ఏదో ఒక హారర్ ఎఫెక్ట్ వుండాలి కదా’’ అన్నాడు డెరైక్టర్. ఇంతలో హీరోయిన్ వచ్చి ‘‘అంధెరీకి నమ్‌కారం’’ అంది తెలుగులో. దెయ్యం జడుసుకుని ‘‘పిశాచాలు కూడా ఇలాంటి భాష మాట్లాడవు. తెలుగు రాని అమ్మాయిని హీరోయిన్గా తీసుకోవడానికి మించిన హారర్ ఎఫెక్ట్ ఏముంటుంది?’’ అని అరిచింది. ‘‘నువ్వెక్కువ నటిస్తున్నావు. మనుషులు ఎలాగూ బతికినంతకాలం నటిస్తారు. చచ్చి కూడా నటించాల్సి రావడం నీకు పట్టిన విషాదం’’ అని కోపగించుకున్నాడు డెరైక్టర్. ‘‘నా విషాదం సంగతి పక్కనపెట్టు. అసలు నీ సినిమాలు ఎందుకు ఫెయిలవుతున్నాయో నీకు తెలుసా?’’ ‘‘జనానికి సినిమాలు చూడ్డం రాదు’’. ‘‘చూడ్డం రాక కాదు, చూడడానికి రావడం లేదు. ప్రతిరోజూ వంద రకాల భయాలతో బతుకుతున్నవాడిని ఇక కొత్తగా నువ్వేం భయపెడతావు.’’ ‘‘భయమనేది ఆక్సిజన్ లాంటిది. అది ఎంతిచ్చినా సరిపోదు. అందువల్ల వికృతంగా నవ్వి భయపెట్టు’’. ‘‘అరే హౌలా, మేము వికృతంగా నవ్వుతామని ఎవరు చెప్పార్రా నీకు? బతికినప్పుడు లక్షా తొంభైవేల సమస్యలుంటాయి. చచ్చిం తరువాత ప్రశాంతంగా వుంటాం. హాయిగా వుండేవాడు వికృతంగా ఎందుకు నవ్వుతాడు చెప్పు?’’ అని అడిగింది దెయ్యం. ‘‘తెరమీద తర్కం పనికిరాదు. రూల్స్ మిస్సయితే గోల్స్ దక్కవు’’. ‘‘ప్రాస ఎక్కువైతే శ్వాస ఆడదు. పంచ్‌లు ఎక్కువైతే పంక్చరవుతుంది’’ ‘‘సరే అదంతా ఎందుకుగానీ, నువ్వు దెయ్యం కాబట్టి ఆ చెట్టు మీద వుంటావు. కింద హీరోయిన్ వుంటుంది’’ ‘‘ఒకసారి ఆ చెట్టు చూడు, కరెంట్, డిష్, ఇంటర్నెట్ ఇన్ని వైర్లు దాని మీద నుండి వెళుతున్నాయి. ఆ తీగలకు చుట్టుకుంటే దెయ్యాలకి చాలా ప్రమాదం. ఎందుకంటే అవి రెండోసారి చావలేవు. అందుకని మేము చెట్లమీద వుండడం మానేసి చాలా కాలమైంది. ‘‘దెయ్యంతో సినిమా తీయడం ఇంత కష్టమని నాకు తెలియదు’’. ‘‘సినిమాల్లో నటించడం ఇంత కష్టమని నాకూ తెలియదు. అయినా మీ భయాలేవో మీరు భయపడకుండా నాకెందుకు చుడతారు చెప్పు. ఈరోజుల్లో మనుషులే దెయ్యాలను భయపెడుతు న్నారు. అర్ధరాత్రి వరకూ టీవీలు చూస్తూ, ఫోన్లలో మాట్లాడుతూ మాకు నిద్ర లేకుండా చంపుతున్నారు’’ అని విసుక్కుంటూ దెయ్యం ప్యాకప్ చెప్పేసింది. - జి.ఆర్.మహర్షి -
భయపెడతానంటున్న శృతి!!