గేట్ ముందున్న ఆ గుంపును చూసి నివ్వెరపోయాడు వాచ్‌మన్. పదిపన్నెండు మంది దాకా ఉన్నారు.
ఆ గుంపుకి నాయకత్వం వహిస్తున్న వ్యక్తి అనుకుంటా.. షర్ట్ జేబులోంచి ఏదో కార్డ్ తీసి‘‘ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్’’ అంటూ ఆ కార్డ్ చూపించారు వాచ్‌మన్‌కి.
ఒక్కసారి నిద్ర ఎగిరిపోయి.. గేట్ తెరిచాడు. వాళ్లు లోపలికి వెళ్తుంటే ‘‘అర్ధరాత్రి పూట కూడా ఇన్‌కమ్‌టాక్స్ రెయిడ్స్ జరుగుతాయా అంటూ ఆవులించాడు వాచ్‌మన్.
మెయిన్ డోర్ దగ్గరకు వెళ్లి కాలింగ్ బెల్ నొక్కారు వాళ్లు.
హాల్లోనే పడుకున్న ఆ ఇంటి సర్వెంట్ లేచి తలుపు తెరిచాడు. వాచ్‌మన్‌కు చూపించినట్టే కార్డ్ చూపించి లోపలికి తోసుకుని వచ్చేశారు వాళ్లు. ఆ సర్వెంట్ గబగబా ఆ ఇంటి యజమాని బెడ్‌రూమ్ దగ్గరకు వెళ్లి తలుపు తట్టాడు. యజమానురాలు తలుపు తెరిచింది. విషయం చెప్పాడు సర్వెంట్. భర్తను లేపింది.
ఆరాత్రి తాగిన మత్తు, నిద్ర మత్తు రెండూ వదిలాయి అతనికి. పైజామా మీద షర్ట్ వేసుకుంటూ హాల్లోకి వచ్చాడు..
అక్కడ ఎవరూ లేరు! యజమాని వెనకాలే వచ్చిన సర్వెంట్‌కూ హాల్లో ఎవరూ కనిపించలేదు.
‘‘అయ్యో.. వీళ్లేరి? ఇక్కడే ఉండే సర్.. అంటూ విశాలంగా ఉన్న ఆ హాలంతా కలియతిరిగాడు. హాల్లో ఉన్న మెట్ల మీంచి గబగబా పైకెక్కి మేడ మీదా చూశాడు.. ఎక్కడా కనిపించలేదు. అంతే వేగంగా కిందకు వచ్చాడు..
సోఫోలో తల మీద తువ్వాలు కప్పుకొని కూలబడ్డ యజమాని.. పక్కనే ఏడుస్తూ నిలబడ్డ యజమానురాలూ కనిపించారు.
‘‘ఏమైం..’’ అని మాట పూర్తిచేసే లోపే అరిచాడు యజమాని.. ‘‘ఎవడు పడితే వాడికి అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా తలుపు తీస్తావా?’’ అంటూ!
తల వంచుకున్న ఆ సర్వెంట్ అప్రయత్నంగా మెయిన్ డోర్ వైపు చూశాడు. గడియ వేసిన తలుపు వేసినట్టే ఉంది.
‘‘సర్.. ’’అని పిలుస్తూ తలుపు వైపు చూపించాడు. చూసిన యజమాని అవాక్కయ్యాడు. మెదడులో ఏదో తట్టినట్టు ఇంటర్‌కమ్‌లో వాచ్‌మన్‌ను ఏదో అడిగాడు.. ‘‘ఎవరూ రాలేదు సర్’’ చెప్పాడు వాచ్‌మన్.
ఎవరూ రాకపోతే.. సర్వెంట్‌కు ఆ పన్నెండు మంది ఎలా కనిపించినట్టు.. పోనీ అతను భ్రమపడ్డాడే అనుకున్నా.. ఇంట్లో ఎక్కడెక్కడ ఏమేం దాచామో తమకే తెలియని సొమ్ము ఎలా పోయినట్టు? పోనీ కనికట్టు జరిగిందనుకున్నా.. ఇదే టైమ్‌కి ఫారిన్ బ్యాంకుల్లో ఉన్న డబ్బంతా ఎలా పోయినట్టు ఆ బ్యాంక్ అధికారులకే తెలియకుండా.. అక్కడా ఫ్రాడ్ జరిగిందనుకున్నా.. భూములు, పొలాల డాక్యూమెంట్స్ పోయీ.. ఆ భూముల్లోకి ఇప్పటికిప్పుడే ఈ ఇళ్లన్నీ ఎలా వచ్చినట్టు.. ఆ పొలాల ధాన్యం ఎలా మాయమైనట్టు? తన ఫోన్‌లోని ఇళ్ల ఫోటోలు చూసుకుంటూ అనుకున్నాడు యజమాని.
‘‘ఒకసారి ఫైనాన్స్ మినిస్టర్‌కు కాల్ చేసి కనుక్కోండి.. రెయిడ్ గురించి’’ సూచించింది భార్య
కనుక్కున్నాడు.. అదేం లేదే అని జవాబు వచ్చింది.
ఆ యజమానీ ఒక మంత్రే.
సరిగ్గా అదే సమయానికి ఇంకో మంత్రి ఇంట్లోనూ ఇలాంటి పరిస్థితే!
లేట్‌నైట్ పార్టీ చేసుకొని వస్తూ .. పార్టీలో పరిచయమై.. పార్టీ ముగిసేలోపు ఫ్రెండ్స్ అయిన ఇద్దరబ్బాయిలు, ఇద్దరమ్మాయిలను ఇంటికి తీసుకొచ్చాడు సదరు మంత్రి కొడుకు. తెల్లవారు జాము నాలుగింటికి ఆకస్మాత్తుగా మెలకువొచ్చి లేచి చూసిన ఆ ఇంటివాళ్లకు ఇల్లు గుల్లౖయె కనిపించింది. సేమ్ .. విదేశీ బ్యాంకుల్లో దాచుకున్న సొమ్మంతా పోయింది దస్తావేజులతో సహా. స్థిరాస్థి అన్యాక్రాంతమైంది. మూసిన తలుపులు మూసినట్టే ఉన్నాయి కాని ఆ నలుగురు ఫ్రెండ్స్ మాత్రం మాయమయ్యారు.
ఏమీ అర్థం కాక తలలు పట్టుకున్నారు.
ఈ రెండు సంఘటనలు జరిగిన తెల్లవారి పది గంటలకు.. మంత్రులు, శాసన సభ్యులు, నేతలు, పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ అధికారులతో కూడిన ఒక హిట్ లిస్ట్.. మారుమూల గ్రామాల నుంచి, పట్టణాలు, నగరాల దాకా ప్రతి ఇంటి గోడ మీదా వెలసింది. ఆ వ్యక్తుల ఇళ్లల్లో రెయిడ్స్ జరగబోతున్నాయని. దేశమంతా కలకలం. ఆ జాబితాలో ఉన్న వ్యక్తులకైతే చెప్పక్కర్లేదు.
పాలనా వ్యవస్థ కుటుంపడింది. ఉన్న భద్రతా సిబ్బందినంతా ఆ లిస్ట్‌లోఉన్న వీఐపీల ఇళ్లముందు కాపలా పెట్టారు.
ఇంకో వైపు .. పేరున్న దర్యాప్తు సంస్థలు, ప్రైవేట్ డిటెక్టివ్‌లు అంతా రంగంలోకి దిగారు.. అంతకుముందు ఇద్దరు మంత్రుల ఇళ్లల్లో దొంగతనం చేసిన ముఠాను, ఈ హిట్‌లిస్ట్ తయారు చేసిన వ్యక్తులను పట్టుకునేందుకు.
గంటలు క్షణాలైపోయి హిట్‌లిస్ట్‌లో పేర్కొన్న కౌంట్‌డౌన్ మొదలవనే అయింది.
రాత్రి పన్నెండు..
ఆ జాబితాలోని వీఐపీలెవరికీ కంటి మీద కునుకు లేదు. ప్రభుత్వ యంత్రాగానికీ కుదురుపట్టడం లేదు. దేశంలోని ప్రజలకూ నిద్రలేదు ఏం జరుగబోతుందనే ఆసక్తితో.
అది అమావాస్య రాత్రయినప్పటికీ ఆకాశంలో వెన్నెల విరగకాసింది.. దీపాలే అక్కర్లేనంతగా!
నిమిష నిమిషానికీ వీఐపీలకు గుండె దడ.. జనాలకు కుతూహలం పెరుగుతోంది.
పన్నెండు పన్నెండు నిమిషాలకు..
వీఐపీల ఇళ్ల దగ్గర విపరీతమైన గాలి.. ఉరుములు.. మెరుపులు. ఆ ఇళ్ల దగ్గర తప్ప మిగతా దేశమంతా ప్రశాంతంగానే ఉంది.
ఒక్కసారిగా ఆ ఇళ్లల్లో కరెంట్ పోయింది. గాలి ఎక్కువైంది.. ఇళ్ల కప్పులు ఎగిరిపోయాయి.. మెరుపులు నిరంతరాయంగా.. నేలకు దివిటీ పట్టునట్టు..
భద్రతా సిబ్బంది అంతా అప్రమత్తమయ్యారు.
దేశంలో.. టీవీలున్న ఇళ్లల్లో.. టీవీలు కట్టేసిన లోగిళ్లల్లో ఒక్కసారిగా టీవీలు ఆన్ అయ్యాయి.. ఆ టీవీల్లో.. అదివరకే నడుస్తున్న టీవీల్లో.. హఠాత్తుగా కొన్ని దృశ్యాలు ప్రసారమవడం మొదలయ్యాయి..
హిట్ లిస్ట్‌లో ఉన్న వీఐపీ ఇళ్లల్లో ఉన్న సొమ్మంతా సంచులు సంచులుగా ఇంటి పై కప్పు నుంచి గాల్లో పైకి లేవడం.. టీవీ స్క్రీన్ చిన్న చిన్న స్క్రీన్స్‌గా స్ల్పిట్ అయ్యి విదేశాల్లోని ఆ వీఐపీల ఇళ్లు, బ్యాంకుల్లోంచి డబ్బు, బంగారం, వెండి, వజ్రాలు, దస్తావేజులూ మాయవమడం.. ఆ వీఐపీల చరాస్తులను జనాలు ఆక్రమించుకోవడం.. అన్నీ కనిపించసాగాయి.
ఎక్కడ పడితే అక్కడ టీవీలు ప్రత్యక్షమవుతున్నాయి.. ఈ దృశ్యాలను చూపిస్తున్నాయి.
దేశమంతా షాక్.. సంచలనం..
కాపలా ఉన్న భద్రతా సిబ్బంది నిశ్చేష్టులై నిలబడిపోయారు.
దర్యాప్తు బృందాలు, వ్యక్తులకు కాళ్లు, చేతులు ఆడ్డంలేదు.
ఉదయం నాలుగింటి వరకు నిరవధికంగా ఆ ఇళ్ల నుంచి డబ్బు, దస్కం పోతూనే ఉంది.
అది ముగియగానే ఒక్కసారిగా సూర్యుడు ఉదయించాడు. గాలి, ఉరుములు, మెరుపులు అన్నీ పోయి పరిస్థితి మామూలు అయింది.
వీఐపీలంతా రోడ్డు మీదకొచ్చారు.
స్లమ్స్, మురికి మాయమైపోయి అంతా శుభ్రంగా ఉంది. ఎక్కడపడితే అక్కడ చెట్టుచేమలతో దేశమంతా పచ్చగా కనబడుతోంది. స్వచ్ఛమైన గాలి వీస్తోంది. జనాలందరూ గుండెల నిండా ఊపిరి తీసుకుంటున్నారు. వాళ్ల మొహాల్లో ఒకరమైన భద్రత... భరోసా.. ఠీవీ కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment