‘‘నాన్నా... నాన్నా..’’
మద్యం మత్తులో గుమ్మానికి చేరగిలబడి జోగుతున్న మల్లేష్ ఒక్కసారిగా కళ్లుతెరిచాడు. గుమ్మం బయట చూశాడు. ఎవరూ కనిపించలేదు. మళ్లీ అలాగే గుమ్మానికి తలానించాడు. మగతగా కన్ను అంటుకుంది.
‘‘నాన్నా.. నాన్నా...’’
ఉలిక్కిపడ్డాడు మల్లేష్. ఇంతకుముందటిలాగే కళ్లు తెరిచాడు. గుమ్మం అవతలకి చూశాడు. చిమ్మ చీకటి .. చిమ్మెట్ల శబ్దం తప్ప ఎవరూ కనిపించలేదు.. ఏమీ వినిపించట్లేదు. తూలుతూ లేచి బయటకు నడిచాడు. గుమ్మం బయట గోడకు ఆనించిన కర్రను తీసుకొని గాల్లో ఆడిస్తూ.. నేల మీద కొట్టాడు. చుట్టూ తిరిగొచ్చి.. ఆ గుమ్మం మెట్ల మీద కూర్చున్నాడు. పాంట్ జేబులోంచి సిగరెట్, అగ్గిపెట్టె తీశాడు. వెలిగించి దమ్ము లాగాడు. మత్తు వదిలినట్టయింది. రెండో పఫ్ పీల్చబోతుంటే వినిపించింది..
‘‘నాన్నా.. నాన్నా.. ఇటు చూడు నాన్నా..’’ అంటూ.
సిగరెట్‌ను అలాగే వేళ్ల మధ్యలో ఉంచి నెమ్మదిగా మెడ తిప్పి లోపలికి చూశాడు. ఓ మోస్తరు హాలు లాంటి ఆ గదికి జీరో బల్బ్ వెలుతురు సరిపోక.. గదంతా పర్చుకోలేదు వెలుగు. మసక మసకగానే ఉంది. మనుషులైతే కనిపించలేదు అతనికి. తల విదిలించి లోపల్నుంచి దృష్టి మరల్చబోతుంటే..
‘‘ముందు ఆ సిగరెట్ పడేయ్’’ ఆజ్ఞాపించింది స్వరం.
షాక్ అయ్యాడు మల్లేష్. అప్రయత్నంగా లేచి నిలబడ్డాడు.. సిగరెట్ పడేసి కాలితో నలిపేశాడు.
‘‘గుడ్ నాన్నా.. ’’
‘‘ఎ.. వ... ఎవరూ’’ వణుకుతున్న స్వరంతోనే కేకేశాడు మల్లేష్.
‘‘నీకు తెలుసు.. నేనేవెరో..!’’
మల్లేష్ కాళ్లూ వణుకుతున్నాయి. గుమ్మం దగ్గరే ఆగిపోయాడు.
‘‘లోపలికి రా నాన్నా.. రా.. నా పక్కన కూర్చో’’
మరబొమ్మలా నడుచుకుంటూ వెళ్లి కూర్చున్నాడు. ఆ మార్చురీ గదిలో ఉన్న ఒకే ఒక శవం పక్కన. స్ట్రెచర్ మీద కాకుండా చాపలో చుట్టిన ఆ శవాన్ని నేలమీదేశారు.
‘‘నిన్ను నాన్నా అంటున్నందుకు ఏమీ అనుకోవు కదా.. నా లాంటి పిల్లలు ఉండే ఉంటారు నీకు’’
తలూపాడు మల్లేష్.
టప్ టప్ మంటూ చుట్టగా ఉన్న చాప తెరుచుకుంది. అందులోంచి శవం లేచి కూర్చుంది.
గుండె ఆగినంత పనైంది మల్లేష్‌కి.
‘‘భయపడకు నాన్నా.. ’’
‘‘నువ్వెవరు అసలు?’’ భయంగా అడిగాడు మల్లేష్.
‘‘నీ కూతురినే’’
‘‘నాకు పిల్లల్లేరు. అయినా నువ్వు చనిపోలేదా? మరి నిన్నెందుకు ఈ మార్చురీలో పెట్టారు’’ మల్లేష్.
నవ్వుతోంది.. గట్టిగా నవ్వుతోంది.. తెరలుతెరలు తెరలుగా నవ్వుతోంది..
మల్లేష్ గుండె దడ పెరిగింది. డ్యూటీ డాక్టర్‌కి చెప్పాలి అని అనుకుంటూ లేవబోయాడు. ఎవరో పై నుంచి రెండు భుజాల మీద చేతులు వేసి పైకి లేవకుండా కిందకు నెట్టినట్టు కూలబడ్డాడు. ఆ శవం ఇందాకటిలాగే మొహం కనిపించకుండా జుట్టు వేలాడుతూ.. నేలకేసి చూస్తున్నట్టుగానే ఉంది.
మల్లేష్‌కంతా అయోమయంగా ఉంది. గుండె దడ పెరిగింది. జేబులో ఉన్న టాబ్లెట్ తీసుకోబోయాడు.
‘‘నీకేం కాదు నాన్నా..’’
‘‘నువ్వు శవానివి కాదు.. దయ్యానివి. నన్నెందుకు పట్టుకున్నావ్?’’ పొడిబారిపొతున్న గొంతును పెగల్చాడు మల్లేష్.
మళ్లీ నవ్వు.. తెరలు తెరలుగా!
‘‘చెప్పు.. ఎంతమంది కిడ్నీలు.. లివర్లు మాయం చేశారు మీరు?’’
హతాశుడయ్యాడు. శక్తినంతా కూడదీసుకుని ఆ గది ఆ మూలకు పరిగెత్తాడు. అక్కడున్న అల్మారా తెరిచి చూశాడు..బల్ల కింద చూశాడు.. గోడలు తడిమి తడిమి చూశాడు. ఆ గుడ్డి వెలుతురులో ప్రతి మూలను పరీక్షగా చూశాడు. ఎవరైనా అక్కడుండి మాట్లాడుతున్నారేమోనని.
మళ్లీ వెనక్కి వచ్చి.. కూర్చుని ఉన్న ఆ శవం ముక్కు దగ్గర వేలు పెట్టి చూశాడు. శవంగా నటిస్తున్న మనిషేమో అనుకొని. కాదు శవమే!
‘‘కంగారు పడకు.. నేను బతికున్న మనిషిని కాను. చచ్చిన శవాన్నే. యాక్సిడెంట్ అయి కొన ఊపిరితో వచ్చా.. అనాథనని తెలుసుకొని కిడ్నీలు తీసేసుకున్నారు.. లివరూ దానం చేసేసి.. అవయవాలు పనిచేయడం మానేశాయని ఊపిరి తీసేశారు. ఈ గదిలో పడేశారు. నా లాంటి కూతురుంటే ఈ పనిలో నువ్వు రక్తం అంటించుకోకపోయేవాడివి కదా..’’
‘‘నాకేం తెలియదు.. నువ్వు అనాథవని కూడా తెలియదు’’ మల్లేష్ మత్తు దిగిపోయి ఆ స్థానాన్ని భయం ఆక్రమించింది.
‘‘లెక్క చెప్పు నాన్నా.. పెకిలించిన కళ్లు, తోడేసిన కిడ్నీలు.. లాగేసిన లివర్ల లెక్కలు చెప్పు’’ మార్దవంగా ఉంది గొంతు.
‘‘ఏయ్.. భయపెడ్తున్నావా? ’’ లేని ధైర్యాన్ని కూడగట్టుకుంటూ బెదిరించే ప్రయత్నం చేశాడు మల్లేష్.
‘‘నాన్నా.. ’’గద్దించింది ఆ స్వరం.
అంతే సైలెంట్ అయిపోయాడు.
‘‘చెప్పూ...’’అంతే తీవ్రంగా.
‘‘నాకేం తెలియదు. అదంతా పెద్దవాళ్ల వ్యవహారం. దాంతో నాకేం సంబంధం లేదు. చూసీచూడనట్టుంటాను. లేకపోతే నేనూ నీలా శవంగా మారేవాడినెప్పుడో’’ చేతులు జోడించి తల వంచాడు మల్లేష్. ‘‘నిజంగానే నాకేం తెలియదు..నన్ను వదిలెయ్’’ అంటూ తల పైకెత్తిన మల్లేష్ స్థాణువయ్యాడు.
ఎదురుగా ఆ శవం లేదు.
దిగ్గున లేచి నిలబడ్డాడు. గదంతా కలియ చూశాడు. ఎక్కడా ఎవరూ లేరు. అసలు ఆ గదిలో శవమే లేదు. ఇది కలా? ఇంతకు ముందు జరిగింది కలా? అర్థం కాలేదు. తనను తాను గిల్లుకున్నాడు. నిజమే! కల కాదు. మరి శవం?
ఆ రాత్రి మల్లేష్‌కి జాగారమే అయింది. ఎప్పుడో తెల్లవారు జామున నిద్ర పట్టింది.
మరునాడు ఉదయం .. ఎనిమిది గంటలు..
‘‘మల్లేషన్నా.. ఓ మల్లేషన్నా.. లెవ్ లెవ్’’ తట్టి లేపుతుంటే మెలకువ వచ్చింది మల్లేష్‌కి. కళ్లు తెరిచి లేవబోతుంటే ఒళ్లంతా నొప్పులుగా అనిపించింది. మూలుగుతూ లేచి గుమ్మానికి ఒరిగాడు.
‘‘ఎందన్నా.. గంత యత్మినాన్‌గా కూసున్నవ్.. లే... పెద్ద డాక్టర్లిద్దరికీ రాత్రి యాక్సిడెంట్ అయింది. పోస్ట్‌మార్టమ్‌కి ఈడికే దెస్తుండ్రు.. లెవ్.. ’’ తొందరపెట్టింది యమున.
‘‘ఏంటీ.. ఏమన్నావ్?’’ తను విన్నది నిజమేనా కాదా నిర్ధారణ చేసుకోవడానికన్నట్టు మళ్లీ అడిగాడు మల్లేష్.
‘‘అవును మల్లేషన్నా.. ఏదో పార్టీ నుంచి ఇండ్లకు వోతుంటే అయ్యిందట యాక్సిడెంట్. ఆడిదాన్నే పానం బోయిందట ఇద్దరికీ. ఇంకా చిత్నమేందంటే ఇద్దరి కిడ్నీలూ లేవంట.. కండ్లూ..’’ చెప్తూనే ఉంది యమున..
మల్లేష్ చెవుల్లో గుయ్ మంటూ హోరు మొదలై.. కాసేపటికి ఏమీ వినపడకుండా అయిపోయింది.
బిత్తర చూపులతో ప్రతిమలా నిలబడిపోయాడు.
‘‘ఏమైందన్నా.. అన్నా..’’ అంటూ మల్లేష్‌ను కదుపుతోంది యమున.
Comments
Please login to add a commentAdd a comment