కొన్ని పదుల సంవత్సరాల తర్వాత ఆ ఊళ్లో ఆ రోజు మళ్లీ అలజడి మొదలైంది. పెద్దవాళ్లెందుకు అంత కలవర పడ్తున్నారో అర్థంకాని పిల్లలకు అదంతా అయోమయంగా ఉంది. ఎవరికీ పట్టని ఊరి చివరన ఉన్న బంగ్లా మాత్రం కొన్నేళ్ల తర్వాత బూజులు దులుపుకొని.. సున్నాలు వేసుకొని అందంగా ముస్తాబైంది. ఊరవతల ఉన్న చెరువు గట్టు.. చేలు, చెల్కల్లో ఆడ్డానికి వెళ్లే పిల్లలనెప్పుడూ ఆకర్షించని ఆ మేడ ఈ రోజు వాళ్లను తెగ ఊరిస్తోంది.. లోపలికి వెళ్లి చూసేలా!
పెద్దవాళ్లేమో కట్టడి చేస్తున్నారు.దీన్నీ పట్టించుకోని ఆ బంగ్లా వారసురాలు.. మాతృతర్పణం సమర్పించేందుకు తన పెద్దలకు ఇష్టమైన వంటకాలను వండిస్తోంది. ఆ రాత్రి జరిగే ఆ విందుకు ఊళ్లో వాళ్లందరినీ ఆహ్వానించింది. ఆ ఊళ్లో అలజడికి అదే కారణం. ఆ రోజు తెల్లవారి.. వాకిళ్లు ఊడ్చుకుని కళ్లాపి చల్లుకుందామని వాకిళ్లలోకి వచ్చేసరికి.. కళ్లాపి చల్లి ముగ్గు కూడా పెట్టున్నాయి అందరి ముంగిళ్లు. విస్తుపోయారంతా.. ఒకరింటి వైపు ఒకరు చూసుకొని!
ఆ ముగ్గు కిందే.. ‘‘ఈ రోజు రాత్రికి.. మా పెద్దలకు మాతృతర్పణం చేస్తున్నాను.. ఈ ఊరి ఆడబిడ్డగా మీ అందరినీ ఆ విందుకు పిలుస్తున్నాను.. తప్పకుండా రావాలి’’ అని రాసుంది ముగ్గు పిండితోనే!
హతాశులయ్యారంతా ఇలా ఎవరైనా పిలుస్తారా? అని. అంతే పెద్దవాళ్లందరికీ చిన్నప్పడు తమ పెద్దలు.. ఆ పెద్దలకు వాళ్ల పెద్దలు చెప్పిన కథలు గుర్తొచ్చాయి. ఒకప్పుడు ఆ ఊరు.. ఊరు కాదు... బద్దకస్తుల అడ్డా! పనీపాటా లేకుండా మగవాళ్లంతా తాగి తందనాలాడుతుంటే.. ఆడవాళ్లు కష్టం చేస్తూ కుటుంబాలు నడిపేరు. ఆ కాలంలోనే ఆ ఊరి చివర ఆ బంగ్లా వెలిసింది.
దాని పునాదుల నుంచి కప్పు దాకా అంతా ఆడవాళ్ల కష్టమే. అయితే ఆ బంగ్లా యజమాని, అతని కొడుకులు పనిచేయడానికి వచ్చిన చాలామంది ఆడవాళ్ల గౌరవ మర్యాదలను మంట గలిపారు. వాళ్లంతా ఆ ఇంట్లోనే ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ బంగ్లా కట్టడం పూర్తయి ఇంట్లో వాళ్లు గృహప్రవేశం చేసిన రోజే యజమాని రక్తం కక్కుకొని చనిపోయాడట. ఆ తర్వాత అమావాస్యకు ఆయన పెద్ద కొడుకు.. ఆ తర్వాత ఇంకో కొడుకు.. ఇలా ఆ ఇంట్లో మగవాళ్లంతా ప్రాణాలు కోల్పోయారు. వాస్తు దోషమేమో అని భయపడ్డ ఇంటి ఆడవాళ్లు బంగ్లా వదిలి వెళ్లిపోయారు. అప్పటి నుంచి కొన్నేళ్ల దాకా ఎవరూ లేక ఆ బంగ్లా అలా పాడుబడి భూత్ బంగ్లాగా పేరు తెచ్చుకుంది.
అదే సమయంలో ఊళ్లో పరిస్థితులు చక్కబడ్డం మొదలుపెట్టాయి. ఏమైందో తెలియదు.. దసరా ముందు అమావాస్య రాత్రి... ఇలాగే ఆ ఊరికి కొంతమంది ఆడవాళ్లు వచ్చారు.. చక్కగా ముస్తాబై.
ఆ ఊరి మర్రి కిందకు మగవాళ్లందరినీ విందుకు పిలిచారు. మగవాళ్లంతా వెళ్లారు. ఆ తెల్లవారి నుంచే వాళ్ల ప్రవర్తనలో నెమ్మదినెమ్మదిగా మార్పు రావడం మొదలుపెట్టింది. తాగుడు మానేశారు. పనులకు వెళ్లడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఆ ఊరి చివర బంగ్లాలో కూడా అలికడి వినిపించసాగింది ఆ ఊళ్లో వాళ్లకు. కొన్ని సంవత్సరాలు కొనసాగింది అది. ఆ సమయంలోనే ఊరికి బడి వచ్చింది. ఆడపిల్లలనూ బడికి పంపడం మొదలుపెట్టారు తల్లిదండ్రులు. పెద్ద కులాలు, చిన్న కులలాల మధ్య ఊళ్లో ఉన్న సరిహద్దులు చెరిగిపోయాయి. అప్పటిదాకా ఆడవాళ్లను ఏడిపించిన మగవాళ్లు వాళ్లను గౌరవించడం మొదలుపెట్టారు.
కులం, మతం, కట్నం ఊసు లేకుండా పెళ్లిళ్లు అవసాగాయి. దేనికీ పెద్దవాళ్ల నుంచి అభ్యంతరాలు రావట్లేదు. వాదోపవాదాల్లేవు. అన్నీ చర్చలే! ఆ ఊరు గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు సర్పంచులుగా ఆడవాళ్లే ఏలారు. తర్వాత మండలం అయింది. దానికి రెవెన్యూ అధికారులు అమ్మాయిలే. మండల పరిషత్ ప్రెసిడెంట్‌గా ఆడవాళ్లే. అందరూ కలిసి ఆ ఊరిని ఓ తీరుగా తీర్చిదిద్దారు. ఊరికి పొలిమేరగా అడవిని పెంచారు. ఇదంతా కావడానికి కొన్నేళ్లు పట్టింది. అన్నేళ్లూ ఆ బంగ్లాలో అలికిడి ఉండింది.
అయితే ఊరి బాగు మీదకు మనసు మళ్లించిన ఊళ్లో వాళ్లంతా ఆ బంగ్లా గురించి.. అందులోని అలికిడి గురించీ మెల్లగా మరిచిపోయారు. అంతేకాదు.. అదొక భూత్ బంగ్లా దాని జోలికి పోవద్దనే అప్రకటిత నిర్ణయానికీ వచ్చేశారు. ఆ బంగ్లాలో ఏవో శబ్దాలు మొదలుకాగనే ఏదో శక్తి వచ్చి ఆ ఊళ్లో మగవాళ్లను, ఊరినీ మార్చేసి రక్షించిందని నమ్ముతుంటారు. అన్నేళ్ల తర్వాత ఇప్పుడు ఇలా.. మళ్లీ ఆ బంగ్లా సున్నాలేసుకొని మెరుస్తూండేసరికి అందరికీ భయం మొదలైంది. ఆ రాత్రి విందుకు పిలిచిందెవరు? వెళ్లాలా వద్దా ? అని చర్చించుకోవడానికి ఊళ్లో వాళ్లంతా సమావేశమయ్యారు.
‘‘ఆ బంగ్లా దొర మునిమనమరాలో ఏమో.. తన ముత్తాత, తాతల వల్లే మన ఊరి ఆడోళ్ల ప్రాణాలు పోయినయ్ కదా.. బంగ్లా మీద నుంచి ఆ పీడను పోగొట్టుకునేతందకు వచ్చిందేమో’’ అన్నది ఓ పెద్ద మనిషి.
‘‘అట్ల అయితే బాజాప్త ఇంటింటికి వచ్చి చెప్పాలే కాని దొంగ లెక్క వాకిట్ల ముగ్గేసి చెప్పుడేంది?’’ ఒక నడి వయసు స్త్రీ అభ్యంతరం.
‘‘యే.. ఇంటికి తాళం ఉంటే గడపకు బొట్టు పెట్టి చెప్పమా? అట్లనే చెప్పిపోయిందేమో?’’ మరో పెద్దమనిషి సమర్థింపు.
‘‘పోయిందేమో అంటున్నవ్? ఒక్కామెనే ఉన్నట్టు నీకెట్ల ఎరుక?’’ ఒక పురుషుడి సందేహం.
‘‘అందరి వాకిట్ల రాత ఒక్క తీర్గనే ఉంటే ఒక్కామెనే అనుకుంటున్నా’’ సమాధానమిచ్చింది ఆమె.
‘‘ఇంతకీ గామె ఆడామెనే అనే గ్యారెంటీ కూడా ఏమీ లేదు.. మగోళ్లు కూడా వచ్చి ఉండొచ్చు ఆ బంగ్లాలకి’’ అన్నాడు ఇంకోతను.
‘‘సరే.. ఏది ఏమైనా.. ఆల్ల పెద్దలకు బియ్యం ఇచ్చుకుంటున్నరు కాబట్టి.. మంచి మనసుతో పిలుస్తున్నరు కాబట్టి పోవుడే మంచిది.. అయితే పిల్లల్ని తీస్కపోవద్దు’’ అని తీర్మానించింది ఇంకో పెద్దావిడ. అందరికీ ఆ తీర్మానం నచ్చింది.
రాత్రి అయింది.. అందరూ వెళ్లారు. ఇంద్రభవనంలా ఉంది ఆ బంగ్లా. దాని గురించి ఇన్ని రోజులు కథలుగానే విన్నారు. ఇప్పుడు కళ్లారా చూస్తున్నారు. ఆ ఇంటిని చూసే సరికే వాళ్ల కడుపు నిండిపోయింది.
భోజనాలకైతే రమ్మన్నారు కాని లోపలికి ఆహ్వానించే వాళ్లెవరూ కనపడట్లేదు వీళ్లకు. అలాగే గుంపులుగా డైనింగ్ హాల్లోకి నడిచారు ఊరి జనం.
‘‘రండి.. రండి.. మీకోసమే ఎదురుచూస్తున్నాం ’’ అంటూ ఎదురుపడ్డారు ఇరవైమంది ఆడవాళ్లు. నుదుటన కాసంత బొట్టు.. ఎర్రటి చీరలు.. చెరగని నవ్వులతో ఉన్న వాళ్లను చూసి ఈ జనాల్లోని కొంత మంది తమ ముందు తరాల వాళ్లను పోల్చుకోవడం మొదలుపెట్టారు. ఇంతలోకే ఆ ఆడవాళ్లు పోలికలు వెదుక్కుంటున్న వాళ్ల దగ్గరకు వచ్చి ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. అర్థమైంది వాళ్లకు. ఆ ఆడవాళ్లు తమ ముత్తవ్వలు, అవ్వలన్నమాట. అప్పుడే ఓ పాతికేళ్ల అమ్మాయి వచ్చింది. ఆమెను ఆ ఊరి ప్రజలకు పరిచయం చేశారు ఆ ఆడవాళ్లు తమ వారసురాలిగా. విందు వడ్డించారు.
వాళ్లు తిని చేతులు కడుక్కుని తాంబూలం తీసుకునేటప్పటికీ ఆ ఆడవాళ్లెవరూ లేరు. ఆ అమ్మాయిని అడిగారు అంతా కంగారు!‘‘మిమ్మల్నందరినీ చూడాలనుకునే ఈ విందును ఏర్పాటు చేయమన్నారు. చేశాను. చూసుకున్నారు. ఇక ఈ ఊరికి వాళ్లు, నేను ఎవరూ అసవరం లేదు. ఈ బంగ్లాను అనాథ శరణాలయం చేయండి’’ అంటూ ఆమే అక్కడి నుంచి వెళ్లిపోయింది.
- సరస్వతి రమ
Comments
Please login to add a commentAdd a comment