saraswathi rama
-
దుబాయ్ టూర్: అది అరబిక్ కడలందం..
ఇసుక దిబ్బలు.. ఉప్పు ఊట ప్రకృతి నిర్దేశించిన ప్రాంతం.. అదే ఉప్పు ఊట తీరంలో.. అవే ఇసుక దిబ్బల మీద ఆకాశ హార్మ్యాలు, నోరెళ్లబెట్టే ఆశ్చర్యాలతో ఆ ప్రాంతం మానవ మేధస్సు మలచిన పర్యాటక దేశం అయింది! అందుకే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చరిత్రలో రాసుంటుంది ‘ది వర్డ్ ఇంపాజిబుల్ ఈజ్ నో వేర్ ఇన్ ది వొకాబులరీ ఆఫ్ ది యూఏఈ’ అని. గాడ్ మేడ్ వరల్డ్ .. మ్యాన్ మేడ్ డెన్మార్క్ అనే నానుడి వచ్చింది కాని దుబాయ్‌ను చూస్తే డెన్మార్క్ సరసన దుబాయ్నీ కలుపుకోవచ్చు. కళ్లు మూసి తెరిచేలోగా అభివృద్ధి అనే మాటకు ప్రాక్టికల్ రూపంగా చూడొచ్చు దుబాయ్‌ని. సాంకేతికత పునాదిగా.. లేబర్ క్యాంపుల స్వేదం గోడలుగా నిలబడ్డ అద్భుతం. అది అరబిక్ కడలందం.. చూసి.. అనుభూతిని పదిలపరచుకోవాల్సిందే. అభివృద్ధి సరే.. షాపింగ్ మాల్స్, అమ్యూజ్మెంట్ పార్క్స్ లేని ఒరిజినల్ దుబాయ్ ఎలా ఉంటుందో.. చూడాలన్న ఆశతో విమానం ఎక్కాను. దుబాయ్ చూడ్డానికి చలికాలం మంచి కాలం. టూరిస్ట్ సీజన్ కూడా. అన్నిరకాల సందళ్లతో దుబాయ్ ఫెస్టివల్‌గా అలరారుతుంది. అలా ఈ కరోనా టైమ్‌లో కూడా టూరిస్ట్‌లకు విమాన టికెట్లను కట్ చేసి గేట్లు తెరిచింది ఆ దేశం. అయితే కరోనా నిరోధక జాగ్రత్తలతో. ఇండియా నుంచి బయలుదేరే 72 గంటల ముందు కరోనా పరీక్ష చేసుకున్నా సరే.. దుబాయ్ విమానాశ్రయంలో దిగిన వెంటనే మళ్లీ కరోనా పరీక్ష చేయించుకోవాల్సిందే. విహారంలోనూ అడుగడుగునా ఆ జాగ్రత్తలు పాటించాల్సిందే. మాస్క్ లేకపోయినా.. భౌతిక దూరం పాటించకపోయినా మూడువేల దిర్హామ్స్ జరిమానా కట్టాల్సిందే. రోడ్ల మీద రెండు మీటర్లకో సర్కిల్ కనిపిస్తుంది. ఢిల్లీ నుంచి పదీ ముప్పై అయిదు నిమిషాలకు బయలుదేరి దుబాయ్‌లో దిగేసరికి మధ్యాహ్నం ఒంటిగంటైంది. ఎయిర్‌పోర్ట్‌లో ఫ్రీ కోవిడ్ టెస్ట్, పెయిడ్ కోవిడ్ రెండింటి సౌకర్యమూ ఉంది. పెయిడ్ టెస్ట్ చేయించుకొని గంటలో బయటపడ్డాం. కాని ఫలితాలు వెలువడే దాకా హోటల్ గది దాటే వీల్లేదు. ఎకానమీ బడ్జెట్లో ఫైవ్ స్టార్ సేవలందిస్తున్న రోవ్ హోటల్లో మా బస. పన్నెండు గంటల్లోపు అంటే తెల్లవారి ఉదయం మూడు గంటలకు నెగటివ్ అని, హ్యాపీగా దుబాయ్‌ని చుట్టిరావచ్చనే రిపోర్ట్ అందింది. మొత్తం నాలుగు రోజుల టూర్ అది. దుబాయ్ ఆత్మ దుబాయ్ ఫ్రేమ్ దుబాయ్ అనగానే బుర్జ్ ఖలీఫానే గుర్తు చేస్తుంది మెదడు. దుబాయ్ ఫ్రేమ్‌ని చూసేంత వరకు నేనూ బుర్జ్ ఖలీఫానే దుబాయ్ ఐడెంటిటీగా భావించాను. కాని ఫ్రేమ్‌ని చూశాక.. బుర్జ్ ఖలీఫా కేవలం టూరిస్ట్ అట్రాక్షన్ మాత్రమే అనిపించింది. ఎందుకంటే దుబాయ్ ఫ్రేమ్ దుబాయ్ ఆత్మ. ఆ నిర్మాణం అచ్చెరువొందే అద్భుతమే. దీర్ఘచతురస్రాకారంలో నిలువుగా ఉంటుందీ కట్టడం. 93 మీటర్ల వెడల్పు, 152 మీటర్ల పొడవున్న (అంటే ఇంచుమించు 50 అంతస్తుల ఎత్తు అన్నమాట) రెండు టవర్లను ఆ ఎత్తులోనే కలుపుతూ వంద చదరపు మీటర్ల వంతెనతో నిర్మాణమైన దుబాయ్ ఫ్రేమ్ దుబాయ్ చరిత్ర, వర్తమానం, భవిష్యత్‌కు ప్రతీక. ఆ ఫ్రేమ్ గడప భాగంలో దుబాయ్ గతాన్ని చూపే గ్యాలరీ ఉంటుంది. వాళ్ల జీవన శైలి, ఉపాధి, వర్తక వాణిజ్యాలు, వాడిన పనిముట్లు, పాత్రలు, దుస్తులు, ఆయుధాలు వంటివన్నీ అందులో చూడొచ్చు.. డిజిటల్ డిస్ప్లేలో. దీన్ని సందర్శించాక లిఫ్ట్‌లో స్కై డెక్ తీసుకెళ్లారు. మొత్తం దుబాయ్‌ని చూపించే అంతస్తు. రెండు టవర్లను కలిపే వంతెనే ఆ స్కై డెక్. ఆ వంతెన పై నుంచి ఉత్తరం దిక్కు చూస్తే పాత దుబాయ్ అంతా దర్శనమిస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే ఆయిల్ నిక్షేపాలను కనుగొనకముందున్న దుబాయ్.. సముద్రంలో ముత్యాలు, చేపల వేట వృత్తులుగా ఉన్న ప్రాంతం, దుకాణాలు, పరిశ్రమలు, ఇళ్లు, ఓ మోస్తరు మిద్దెలు, మేడలు, క్రీక్.. కనిపిస్తాయి.. 360 డిగ్రీల కోణంలో. దక్షిణం వైపు.. అదే 360 డిగ్రీల కోణంలో నవీన దుబాయ్ గ్లామర్, నిలువెత్తు ప్రగతి, ఠీవి కళ్లకు కడుతుంది. మధ్యలో గ్లాస్ వాక్‌వే ఉంటుంది. అంటే నడిచేదారి.. కిందికి చూస్తే పాత, కొత్త దుబాయ్ అంతా 360 డిగ్రీల కోణంలో మనల్ని వెంబడిస్తుంది. ఈ స్కై డెక్‌లో వర్తమాన దుబాయ్ పూర్వాపరాలన్నీ ఉంటాయి. ఇందులో దుబాయ్‌లో తొలిసారి ల్యాండ్ అయిన విమానం ‘ఎయిర్ ఇండియా’ అనీ, 1959 వరకు మన కరెన్సీ అక్కడ చలామణీలో ఉందన్న విషయాలూ తెలిశాయక్కడ. లిఫ్ట్‌లో కిందికి వెళ్లాక దుబాయ్ ఫ్యూచర్ గ్యాలరీ ఉంటుంది. వైద్య, వైజ్ఞానిక, పారిశ్రామిక రంగాల్లో అది సాధించబోయే అధునాతన అభివృద్ధికి సంబంధించిన నమూనాను చూపించే గ్యాలరీ అది. అక్కడే గాజు గోడలకు ఆనుకొని దుబాయ్ ఫ్రేమ్ నిర్మాణాన్ని వివరించే సమాచారమూ ఉంటుంది. ఈ ఫ్రేమ్ అమెరికాలోని స్ట్యాచ్యూ ఆఫ్ లిబర్టీ కన్నా హైట్, సెయింట్ లూయిస్‌లోని గేట్ వే ఆర్చ్ కన్నా తక్కువ. ఫ్రాన్స్‌లోని ఈఫిల్ టవర్‌కి దాదాపు సగం ఉంటుంది. 2018 నుంచి సందర్శనకు సిద్ధమైంది. ప్రతి రోజు 200 మంది సందర్శకులకు మాత్రమే అనుమతి ఉంటుంది అదీ 20 మంది చొప్పున ఒక బ్యాచ్‌గా. టికెట్స్‌ను ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలి. సాయంకాలం.. జుమేరా బీచ్ జుమేరా.. దుబాయ్‌లోని ధనిక వర్గం ఉండే తీర ప్రాంతం. చక్కటి విహార స్థలం. చిల్ ఈవినింగ్స్‌ను గడపాలనుకునే యూత్ మెచ్చే హ్యాంగవుట్ ప్లేస్. ఇండియన్, చైనీస్, థాయ్, జపనీస్, ఇటాలియన్, మెక్సికన్.. ఎన్నని చెప్తాం.. ప్రపంచంలోని అన్ని రుచులతో క్యుజైన్స్ ఘుమఘుమలాడుతుంటాయి. భారతీయ వంటకాలకు సంబంధించి ఇక్కడ బాంబే బంగ్లా ప్రసిద్ధి. ఈ రెస్టారెంట్ సెటప్ కూడా భారతీయ కోటను పోలి ఉంటుంది. ప్రతిరోజు ఆకాశంలో డ్రోన్స్ షో ఉంటుంది. షాపింగ్ ప్రియులకు ఫ్యాక్టరీ అవుట్‌లెట్స్ ఉంటాయి. విందువినోదాలతో జుమేరా బీచ్‌లో సాయంకాలాలను ఆనందంగా ఆస్వాదించవచ్చు. దుబాయ్ సూక్... ఎప్పుడెప్పుడు చూడాలా అని నేను ఆత్రుత పడ్డ ప్రాంతం.. ఒరిజినల్ దుబాయ్.. దుబాయ్ సూక్, బర్ దుబాయ్‌ను చూసే వేళ రానే వచ్చింది.. రెండో రోజున. సూక్ అంటే అరబ్బీలో అంగడి అని అర్థం. దుబాయ్‌లోని దిగువ, మధ్యతరగతికి అనువైన, అనుకూలమైన షాపింగ్ సెంటర్. వాకింగ్ టూర్‌గా సాగింది ఆ సందర్శన. దుబాయ్‌లో పెరిగి, అక్కడే ఉంటున్న హైదరాబాదీ వనిత ఫరీదా అహ్మద్ గైడ్‌గా వ్యవహరించింది. ముందుగా సుగంధ ద్రవ్యాలు రాశులుగా పోసి అమ్మే ‘స్పైస్ సూక్’ నుంచి మా వాకింగ్ టూర్ ప్రారంభమైంది. ఇరుకు రోడ్లు.. వాటికి వారగా రెండు వైపుల సంప్రదాయ దుకాణాల సముదాయంతో హైదరాబాద్‌లోని బేగం బజార్, సికింద్రాబాద్‌లోని జనరల్ బజార్‌ను గుర్తుకు తెస్తుంది దుబాయ్ సూక్. ఇరాన్, ఇండియా నుంచి వచ్చిన కుంకుమపువ్వు మొదలు అన్నిరకాల సుగంధ ద్రవ్యాలతో కొలువు తీరి ఉన్న ఆ అంగడిని చూసుకుంటూ దుబాయ్ స్పెషల్ అయిన అండా పరోటా, దుబాయ్ శాండ్విచ్.. ఖడక్ చాయ్ అమ్మే ఒక టీస్టాల్ ముందుకు వచ్చాం. దాన్ని నడిపిస్తున్నది ఒక మలయాళీ. వాటి రుచి చూడాల్సిందే అని పట్టుబట్టింది ఫరీదా. ఆర్డర్ ఇచ్చి.. అక్కడే .. నిత్యం రద్దీగా ఉండే ఆ ప్రాంతం మధ్యలో గుండ్రంగా వేసి ఉన్న బెంచీల దగ్గరకు వచ్చాం. ఆ హోల్‌సేల్ మార్కెట్లో సరుకులు మోసే కూలీలు సేద తీరడానికి ఏర్పాటు చేసిందా సీటింగ్ ఏరియా. అంత బిజీ ఏరియాలోనూ ప్రశాంతంగా అనిపించింది. ఈలోపు అండా పరాఠా (ఆమ్లెట్ పరాఠా), దుబాయ్ శాండ్విచెస్ విత్ డాకూస్ సాస్ రానే వచ్చాయి. ఫరీదా చెప్పింది వినకపోయి ఉంటే ఒక మంచి రుచిని మిస్ అయ్యేవాళ్లం. అక్కడున్న అందరికీ అండా పరాఠా రుచి తొలి పరిచయమే. దుబాయ్ శాండ్ విచెస్ కూడా... అందులో ఒమన్ నుంచి వచ్చిన చిప్స్ ప్రత్యేకం. అన్నిటికన్నా ముఖ్యం.. తప్పకుండా ప్రస్తావించాల్సిన టేస్ట్ డాకూస్ సాస్. కువైట్ టమాటా సాస్ అది. కారంగా కాకుండా.. తీపిగా కాకుండా.. జిహ్వ పదేపదే కోరుకునే రుచి అది. తర్వాత చెప్పుకోవాల్సింది ఖడక్ చాయ్.. దుబాయ్ స్పెషల్ చాయ్. వేడివేడి ఖడక్ చాయ్ పెదవులు దాటి.. నాలుక మీద నుంచి గొంతులోకి జారిందంటే చాలు.. ఒక్క సిప్‌కే ఉన్న చికాకులు.. వేధించే తలనొప్పి గాయబ్. కప్‌లో చాయ్ ఖలాస్ అయ్యేలోపు ఉత్సాహం వెంటపడుతుంది. అతిశయోక్తి కాదు అనుభవం. ఆ ఉత్సాహం వెంటరాగా మా నడకసాగింది. సుగంధ ద్రవ్యాలతో తయారైన ఔషధాలు, తలనూనెలు, కీళ్ల నొప్పుల ఆయిల్స్ అమ్మే దుకాణాలు అన్నిటినీ దాటుకొని అవతలి ఒడ్డున ఉన్న బర్ దుబాయ్ సూక్ మార్కెట్‌ను చూడ్డానికి తీసుకెళ్లే స్టీమర్లున్న తీరానికి చేరుకుని మోటార్ బోట్ ఎక్కాం. శివాలయం.. గ్రాండ్ మాస్క్ స్పైస్ సూక్కి ఆవల తీరం బనియా సూక్తో మొదలవుతుంది. బనియా సూక్ అంతా బట్టల దుకాణాల సముదాయం. ప్రపంచ పటంలో దుబాయ్ అస్తిత్వం కనిపించగానే పాకిస్తానీయులు చాలా మంది దుస్తుల వర్తకం కోసం దుబాయ్ చేరారు. ఆ అమ్మక ప్రాంతమే బనియా సూక్. అలా ఆ షాప్‌ల వెంట వెళుతుంటే ఆ గల్లీల్లో తులసి దళాల వాసన, గులాబీ, మందార, కనకాంబరం, చామంతి, బంతులు విరిసిన పూల మొక్కలు పలకరించాయి ఒక్కసారిగా. అరే.. అని అచ్చెరువొందేలోపే వాటిని ఆనుకొని ఉన్న కాశీదారాలు, హారతి కర్పూరాలు, వత్తులు, దీపపు కుందులు, పుట్నాల పప్పు ప్రసాదాలు విక్రయించే దుకాణాలూ .. విశాలమైన ప్రాంగణం.. క్యూ కోసం కట్టిన బారికేడ్లు..కనిపించాయి. ప్రశ్నార్థకంగా గైడ్ వైపు చూస్తే నవ్వుతూ ఆమె గోపురంలాంటి గుండ్రటి ఆకారాన్ని చూపించింది. ‘గుడా?’ అనే ఎక్స్‌ప్రెషన్‌ని పాస్ చేసేలోపే ‘శివాలయం’ అంది. శివరాత్రి రోజు బ్రహ్మాండమైన వేడుక జరుగుతుందట. ఆ ఆవరణను ఆనుకునే మస్జిద్ ఉంటుంది.. అదే ‘గ్రాండ్ మాస్క్’. ‘‘మస్జిద్ను ఆనుకునే ఈ గుడి ఉన్నా.. ఇప్పటి వరకు ఎలాంటి ఘర్షణ వాతావరణాన్ని కాని, ఇంత చిన్న అసహనాన్ని కాని నేను చూడలేదు, వినలేదు. ఎవరి ప్రార్థనలు వాళ్లు చేసుకుంటారు, వెళ్లిపోతారు. ఒకరికొకరు కనీసం డిస్టర్బెన్స్ కూడా ఫీలయిన సందర్భం లేదు’ అని తన అనుభవాన్ని చెప్పింది ఫరీదా. ఒక మంచి భావనను మనసునిండా నింపుకుంటూ ముందుకు నడిచాం. అరేబియన్ టీ హౌస్.. శివాలయం, గ్రాండ్ మాస్క్ దాటి ఎడమవైపు తిరిగి... కాస్త ముందుకు వెళితే మరో ఆపాత మధురాన్ని పదిలపరచుకుంటున్న దృశ్యం సాక్షాత్కరిస్తుంది. అదే అరేబియన్ టీ హౌసెస్ ఉన్న ఏరియా. దుబాయ్ కొత్త అభివృద్ధిలో ఆ ప్రాంతపు అసలైన జీవనశైలి, అలవాట్లు కొట్టుకుపోకుండా కాపాడుకునే ప్రయత్నమే ఆ వీధి. చాయ్, కాఫీల తయారీలో దుబాయ్‌ది భిన్నమైన రుచి... సేవనంలో వైవిధ్యమైన అభిరుచి. ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు లేని కాలంలో ఆ ఎడారి ఉష్ణోగ్రతను, వడగాల్పుల ధాటిని తట్టుకునేలా ఆనాటి ఇంటి నిర్మాణాలు ఎలా ఉండేవో అచ్చంగా ఆ ఇళ్లనే కట్టి.. వాకిట్లో గద్దెలు (పరుపులు), పిల్లోలు వేసి.. మధ్యలో టీ కెటిల్, కప్పులు పెట్టి తేనీటిని అందిస్తున్నారు. ఎప్పటికప్పుడు నేటివ్ మెమొరీస్‌ను తాజాపరచుకుంటున్నారు ‘అరేబియన్ టీ హౌస్’పేరుతో. ఆ స్ట్రీట్‌కి ఆనుకొని ఉన్న రోడ్డు దాటి ముందుకు సాగితే.. కూడలిలో ఓ పడవ (నమూనా) కనిపిస్తుంది. మిగిలిన ప్రపంచంతో దుబాయ్‌ని అనుసంధానించిన ఆ దేశపు తొలి పడవ ప్రయాణానికి ప్రతీకలా. అయితే ఇక్కడ ఒకటి ప్రస్తావించుకోవాలి. పూర్వ దుబాయ్ వాసులకు పడవ తయారు చేయడం తెలియదు. వాళ్లకు ఆ విద్య నేర్పింది ఎవరో తెలుసా? మలయాళీలు. దుబాయ్ వాసులు కేరళ వచ్చి వాళ్ల దగ్గర పడవ తయారీ నేర్చుకున్నారు. బదులుగా వాళ్లొచ్చి దుబాయ్‌లో వ్యాపారం చేసుకునే ఒప్పందాన్నీ కుదుర్చుకున్నారు. నేటికీ దుబాయ్ అరబ్బులకు కేరళీయులంటే అపారమైన అభిమానం, గౌరవం. ఇంకా చెప్పాలంటే ఇండియా అంటే మొదటగా వాళ్లకు గుర్తొచ్చేది కేరళనే. అడుగడుగునా మలయాళీలు కనిపిస్తారు అన్నిరకాల పనులు, బాధ్యతల్లో. కాని ఆ కూడలిలో ఉన్న పడవ నమూనాను తయారు చేసింది మాత్రం చైనీయులట. వాకింగ్ కంటిన్యూ చేస్తే.. కరీనా కపూర్ వంటి బాలీవుడ్ స్టార్ల కటౌట్లతో ఇండియన్ పార్టీ వేర్ షాపులు, మలబార్ గోల్డ్ వంటి గోల్డ్ షోరూమ్స్, ఆర్టిఫీషియల్ జ్యుయెలరీ దుకాణాలున్న మీనా బజార్, పానీ పూరీ, చాట్ భండార్లు, బిర్యానీ పాయింట్లు, కబాబ్ సెంటర్లు, మధ్యతరగతి (ఎక్కువగా భారతీయులు.. దాదాపు ప్రతి ఫ్లాట్ బాల్కనీలో తులసి మొక్కలు కనిపిస్తూంటాయి) రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లతో మినీ ఇండియా కనిపిస్తుంది. అక్కడ ‘అల్ ఉస్తాద్ స్పెషల్ కబాబ్’ చాలా ఫేమస్. ముఖ్యంగా ఇరానియన్ కబాబ్స్‌కి. ప్రపంచంలోని ఏ దేశం వాళ్లు దుబాయ్ వచ్చినా అల్ ఉస్తాద్ స్పెషల్ కబాబ్‌లో భోజనం చేయందే ఫ్లైట్ ఎక్కరు. మాంసాహార ప్రియుల జిహ్వచాపల్యానికి పర్ఫెక్ట్ అడ్రెస్. కుంకుమపువ్వుతో చికెన్, బోటీ చికెన్, చికెన్ కబాబ్స్, పుదీనా టీ కోసం ఇక్కడ క్యూ కడ్తారు. సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్, సంజయ్ దత్వంటి ఎందరో బాలీవుడ్ స్టార్లు కేవలం అల్ ఉస్తాద్ స్పెషల్ కబాబ్స్ టేస్ట్ చేయడానికే దుబాయ్ ప్రోగ్రామ్ పెట్టుకుంటారటంటే ఆ మసాలా ఘాటుకెంత క్రేజో చూడండి!! అలా అల్ ఉస్తాద్ స్పెషల్ కబాబ్‌లో లంచ్‌తో మా దుబాయ్ సూక్ వాకింగ్ టూర్ ముగిసింది. గ్లోబల్ విలేజ్ ఆ సాయంకాలం గ్లోబల్ విలేజ్‌కు వెళ్లాం. దునియా మొత్తం దుబాయ్ ముంగిట్లో ఉందా అనిపించే ఉత్సవం అది. ప్రపంచాన్ని ఒక గ్రామంగా చూపించే ఎగ్జిబిషన్. 78 దేశాల సంస్కృతులు, రుచులు, అభిరుచులు, ప్రత్యేకతలు, ఉత్పత్తులు ఆయా దేశాల పెవిలియన్స్ (గుడారాలు)లో ఆకర్షిస్తుంటాయి. నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు 159 రోజులు సాగే ఈ గ్లోబల్ విలేజ్‌కి ప్రతిరోజూ 45 వేల మంది సందర్శకులు హాజరవుతుంటారు. పదహారు లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలకు చెందిన 3 వేల అయిదు వందల షాపులు (రెస్టారెంట్స్‌ను కలుపుకొని), అడ్వెంచర్ గేమ్స్, అమ్యూజ్మెంట్ పార్క్స్, మ్యూజియంలు, టీ కొట్లు, కెఫ్టీరియాలతోపాటు నాటకాలు, న్యత్యాలకు వేదికలూ కొలువుతీరి ఉన్నాయి. అయితే దేశాలకు ప్రాతినిధ్యం వహించే వాటిని దుకాణాలు అనకుండా పెవిలియన్స్ అంటారు. అలా అన్నిట్లోకి ఇండియాదే అతి పెద్ద పెవిలియన్. మన దేశానికి సంబంధించి 250 షాపులున్నాయక్కడ. సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఒంటిగంట దాకా ఉంటుంది. 92 దేశాలకు చెందిన పదివేల మంది కార్మికులు ఇక్కడ పనిచేస్తుంటారు. 1997లో ప్రారంభమైన ఈ గ్లోబల్ విలేజ్‌కి 2021 సిల్వర్ జుబ్లీ ఇయర్. ఈ పాతికేళ్లలో ఒక్క ఏడు కూడా విరామం తీసుకోలేదు. 2020 కరోనా కాలంలోనూ నిర్వహించారు. ఎందుకంటే దుబాయ్‌లో ఏప్రిల్ తర్వాత కరోనా ప్రభావం కనపడింది అని చెప్పారు గ్లోబల్ విలేజ్ గైడ్. ప్రతి సోమవారం మహిళలు, ఫ్యామిలీ స్పెషల్‌గా ఉంటుందీ గ్లోబల్ విలేజ్. బాలీవుడ్ పార్క్స్.. మూడో రోజున బాలీవుడ్ పార్క్స్ మా విజిటింగ్ ప్లేస్ అయింది. హాలీవుడ్‌కు ‘యూనివర్సల్ స్టూడియో’ ఉంది. అలాంటి సినిమా ఫక్కీ వినోదాన్ని పంచే ప్రాంగణమేదీ బాలీవుడ్‌కు లేదు. అందుకే దుబాయ్‌లో చోటు సంపాదించుకుంది ‘బాలీవుడ్ పార్క్స్’ పేరుతో. ఇది పూర్తిగా ఫ్యామిలీ డెస్టినేషన్. సినిమాటిక్ రైడ్స్, థ్రిల్లింగ్ అట్రాక్షన్స్, బాలీవుడ్ యాక్షన్, మ్యూజిక్, డాన్స్, డ్రామా, స్టాండప్ కామెడీ వంటి వినోదాత్మకమైన లైవ్ షోస్ ఉంటాయిక్కడ. బాలీవుడ్ బ్లాక్‌బస్టర్స్ డాన్, లగాన్, షోలే, జిందగీ నా మిలేగీ దొబారా, రావన్, క్రిష్ వంటి సినిమా పేర్లతో థియేటర్లున్నాయి ఎంటర్టైన్మెంట్ షోస్ కోసం. అలాగే సంజయ్‌లీలా భన్సాలీ వంటి దర్శకుల సినిమాల సెట్టింగ్స్‌ను పోలిన కట్టడంతో రాజ్‌మహల్ అనే థియేటరూ ఉంది. మొత్తానికి చిన్న, పెద్ద అందరినీ అలరించే ఈ బాలీవుడ్ పార్క్స్ అచ్చంగా యూనివర్సల్ స్టూడియోను పోలి ఉంటుంది. అల్ సీఫ్.. ఆ సాయంకాలం అల్ సీఫ్‌కు వెళ్లాం. ఇదీ దుబాయ్ సూక్లాంటి నేటివిటీ షాపింగ్ ప్రాంతం. అరేబియా బ్యాక్‌వాటర్స్ ఒడ్డున పరుచుకొని ఉంటుంది. మట్టి గోడల ఇళ్లల్లో కొట్లను నిర్వహిస్తుంటారు. విహరిస్తూ ఉంటే చిన్నప్పుడు చదువుకున్న అరేబియా కథల్లోని ఇళ్లు, ఆ సంస్కృతి స్ఫురణకు వస్తూంటాయి. ఆ రోజు రాత్రి అక్కడే ఉన్న అల్ ఫనార్ రెస్టారెంట్లో డిన్నర్ ముగించాం. ఎక్కడికి వెళ్లినా దుబాయ్ ఖడక్ చాయ్‌ను సేవించాల్సిందే. బుర్జ్ ఖలీఫా... దుబాయ్ మాల్ ఈ రెండిటితోనే మోడర్న్ దుబాయ్ ప్రసిద్ధి అని వేరేగా చెప్పక్కర్లేదు. బుర్జ్ ఖలీఫా... ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన కట్టడం. రెసిడెన్షియల్ ఫ్లాట్స్, షాప్స్, హోటల్స్ ఉన్న ఆకాశహర్మ్యం అది. దీంట్లో కూడా మొదటి అంతస్తులో ఆ కట్టడం గురించిన వివరా లుంటాయి. బుర్జ్ ఖలీఫా స్కై (148వ అంతస్తు) వరకూ వెళ్లాం. ఆ బాల్కనీలో కూర్చొని కింద కనిపిస్తున్న దుబాయ్‌ను చూస్తూ టీ, కాఫీ తాగడం ఒక అనుభూతి. దుబాయ్ మాల్ కాంప్లెక్స్ నుంచే బుర్జ్ ఖలీఫాకు ప్రవేశం ఉంటుంది. అక్కడ ఫుడ్ కోర్ట్ ప్రాంగణంలోనే ఉంటుంది బుర్జ్ ఖలీఫా టికెట్ కౌంటర్. దుబాయ్ మాల్ విషయానికి వస్తే.. అదొక సముద్రం. సముద్రం అంటే గుర్తొచ్చింది.. ఆ మాల్లో ఆక్వేరియం ఒక అట్రాక్షన్. ప్రపంచంలోని ఫ్యాషన్ ట్రెండ్స్ అన్నీ ఆ మాల్లో దొరుకుతాయి. బట్టలు, బొమ్మలు, వరల్డ్ ది బెస్ట్ కాస్మోటిక్స్ మొదలు ఎలక్ట్రానిక్ గూడ్స్, టెక్నికల్ ఎక్విప్మెంట్స్ దాకా .. ప్రతి ఒక్కటీ దుబాయ్ మాల్లో లభ్యం. డ్యూటీ ఫ్రీ కాబట్టి మిగిలిన చోట్లతో పోలిస్తే ధరా తక్కువే. బట్టలు, బొమ్మల కన్నా ఎలక్ట్రానిక్ గూడ్స్, పెర్ఫ్యూమ్స్, సన్‌గ్లాసెస్ అక్కడ తీసుకుంటే మంచిదని అక్కడ ఓ షాపులో సేల్స్‌మన్‌గా పనిచేస్తున్న ఉత్తర తెలంగాణీయుడి సూచన. అయితే బుర్జ్ ఖలీఫాలా దుబాయ్ మాల్‌ను ఒక గంటలో చుట్టిపెట్టలేం. కనీసం ఒక్కరోజు కచ్చితంగా కావాలి.. షాపింగ్ చేసినా.. చేయకుండా మాల్ అంతా చూడాలనుకున్నా. ఒకవేళ అంత సమయం వెచ్చించలేకపోతే ముందుగా దుబాయ్‌మాల్ యాప్‌ను ఫోన్లో డౌన్లోడ్ చేసుకుంటే.. ఏ అంతస్తులో ఏ మూల ఏ షాప్ ఉందో ఆ యాప్‌లో తెలుసుకొని జీపీఆర్ఎస్ సహాయంతో నేరుగా వెళ్లొచ్చు. నాలుగే అంతస్తులైనా.. వైశాల్యంలో పెద్దది. అందుకే యాప్ ఫోన్లో ఉంటే ప్రయాస ఉండదు. ఇదీ నా దుబాయ్ ప్రయాణం. నిలువెత్తు దుబాయ్ ప్రగతికి ప్లాన్ చేసిన ఆర్కిటెక్ట్‌లలో.. రాళ్లు మోసిన కూలీలలో... శుభ్రంగా ఉంచుతున్న సఫాయి కర్మచారుల్లో.. టూరిస్ట్‌లకు సేవలందిస్తున్న హాస్పిటాలిటీలో.. డాక్టర్లలో.. నర్సుల్లో.. టీ కాచి వేడివేడిగా అందిస్తున్న చాయ్వాలాల్లో.. రెస్టారెంట్లలో.. కూడళ్లల్లో.. ప్రతిచోటా భారతీయులున్నారు. దుబాయ్ పురోగతిలో ఉపాధి పొందుతూ.. దుబాయ్ పురోగతికి పాటుపడుతూ! – సరస్వతి రమ -
అపర్ణశాల
అద్భుతమైన మూలాలు ఆమెవి.. నాన్న వైపు .. ఏ దేశమేగినా ఎందు కాలిడినా అనిన రాయప్రోలు సుబ్బారావు... అమ్మ వైపు.. స్వాతంత్య్ర సమరయోధుడు, జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఆంధ్రాబ్యాంక్ వ్యవస్థాపకుడు భోగరాజు పట్టాభిసీతారామయ్య.. సాహిత్యం, స్వాతంత్య్ర సమరం.. రెంటికీ వారసురాలు రాయప్రోలు సుబ్బారావుకి మనమరాలు.. పట్టాభి సీతారామయ్యకు మునిమనమరాలు! అయితే ఈ వైభవం మాత్రమే ఆమె ఉనికి కాదు! తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.. ఆమె అపర్ణ రాయప్రోలు. శోధన కోసం.. బోధన కోసం ఏ దేశమేగినా అక్కడ తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో సోషియాలజీ డిపార్ట్మెంట్ హెడ్. వలసల మీద పరిశోధన చేశారు.. దాన్ని ‘నెగోషియేటింగ్ ఐడెంటిటీస్ .. విమెన్ ఇన్ ది ఇండియన్ డయాస్పొరా’ అనే పుస్తకంగా ప్రచురించింది ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ. ఈ అస్తిత్వమే ఇవ్వాళ ఆమెను ఇక్కడ పరిచయం చేస్తోంది.. సికింద్రాబాద్‌లో పుట్టిపెరిగారు అపర్ణ. సెయింట్ ఆన్స్, కోఠీ విమెన్స్ కాలేజ్‌లు ఆమెకు విద్యను అందించిన వేదికలు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఎమ్మే సోషియాలజీ, ఎమ్‌ఫిల్ కూడా చేసి పీహెచ్డీ కోసం అమెరికా వెళ్లారు. యూనివర్శిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో పీహెచ్డీ చేశారు. ఈ దేశం నుంచి అమెరికా వెళ్లిన మొదటి తరం వలస కుటుంబాల్లోని మహిళల మీద. పిట్స్‌బర్గ్‌లోని వెంకటేశ్వరస్వామి దేవాలయం కేంద్రంగా ఆమె పరిశోధన సాగింది. ‘1960ల్లో ఇక్కడి నుంచి అక్కడికి వలస వెళ్లిన వాళ్లకు ఆ గుడి ఒక బడి లాంటిది. ఆ గుడే కేంద్రంగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ మొదలు సంస్కృతం వరకు అన్ని భాషల బోధన జరిగేది. శాస్త్రీయ సంగీతం, నృత్యాలూ పిల్లలకు నేర్పించేవారు. అలా మొదటి తరం వలసలోని మహిళలు సెకండ్ ఇండియాను క్రియేట్ చేశారు’ అని చెప్తారు అపర్ణ. పీహెచ్డీ పట్టా పుచ్చుకున్నాక కొన్నాళ్లు అక్కడే బోధనావృత్తిలో కొనసాగారు. తర్వాత ఇండియా వచ్చేసి ముంబైలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో బోధకురాలిగా చేరారు. కొన్నాళ్లున్నాక భర్త వినోద్ పావురాలతో కలిసి హైదరాబాద్ వచ్చేశారు. తర్వాత పోస్ట్‌డాక్టోరల్ ఫెలోషిప్ రావడంతో ఈసారి రెండో తరం మీద అంటే అక్కడే పుట్టి పెరిగిన భారతీయ సంతతి మీద పరిశోధన చేశారు. ‘ఇండియన్ అమెరికన్ ఐడెండిటీ మీద నా రీసెర్చ్ మొదలైంది 1998–99 ప్రాంతంలో. ఆ పిల్లలు వాళ్ల ఐడెంటీపట్ల చాలా క్లారిటీతో ఉన్నారు. అమెరికన్ బార్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ (ఏబీసీడీ) అంటూ మనమే కన్ఫ్యూజన్ అవుతున్నాం తప్ప వాళ్లకేం కన్ఫ్యూజన్ లేదు. అమెరికా అంటే నేషన్ ఆఫ్ ఇమ్మిగ్రెంట్స్ కదా.. అందులో వాళ్లూ భాగమనే ప్రాక్టికల్ థింకింగ్‌తో ఉన్నారు’ అంటారు ఆమె. ప్రస్తుతం ... రివర్స్ మైగ్రేషన్ మీద రీసెర్చ్ మొదలుపెట్టారు. అంటే అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్న వాళ్ల మీద. ‘ప్రపంచీకరణ, సాంకేతిక విప్లవం తర్వాత పరిస్థితులు మారిపోయాయి. అవకాశాలు అన్ని చోట్లా ఒకేరకంగా ఉంటున్నప్పుడు అమెరికాలోనే ఉండాల్సిన అవసరం లేదు.. అక్కడ నేర్చుకున్నది ఇక్కడికొచ్చి అమలు చేయాలనే ఆలోచనతో ఈ రివర్స్మైగ్రేషన్ మొదలైంది. ఇదీ మహిళల మీదే చేస్తున్నాను. ఇక్కడికి వస్తున్న వాళ్లలో ఐటీ నిపుణులు, ఇతర రంగాలతోపాటు అంట్రప్రెన్యూర్స్‌గా స్థిరపడాలనే అమ్మాయిలూ ఉన్నారు’ అంటూ వివరిస్తారు అపర్ణ. డైవర్సిటీ ఇండియాకు మోడల్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో సోషియాలజీ డిపార్ట్మెంట్ హెడ్‌గా దేశంలో ఏ యూనివర్శిటీలో లేని ఓ కొత్త స్టడీ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టారు ‘స్టడీ ఇన్ ఇండియా’ పేరుతో విదేశీ విద్యార్థుల కోసం. ఇది నాలుగు వారాల కోర్స్. అమెరికా, స్కాండినేవియా దేశాల విద్యార్థులు ఇక్కడికి వస్తున్నారు. ఇరవై ఏళ్లుగా ఈ ప్రాజెక్ట్ విజయవంతంగా కొనసాగుతోంది. ‘ఒకసారి పిట్స్బర్గ్ నుంచి మా ప్రొఫెసర్ వచ్చారు ఇక్కడికి (హైదరాబాద్). ఇస్లామిక్, హిందూ కల్చర్, క్రిస్టియన్ బ్రిటిష్ సెటిల్మెంట్స్, పార్సీలు, గురుద్వారాలు, ఆఫ్రికన్స్.. ఇలా విశిష్టమైన ఈ సిటీ కల్చర్‌కు ముచ్చటపడ్డారు. డైవర్సిటీ ఇండియాకు హైదరాబాద్‌ను మించిన మోడల్ ఉంటుందా ... ఫారిన్ స్టూడెంట్స్ కోసం స్టడీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయొచ్చు కదా అని అడిగారు. అవును కదా అనిపించింది మాక్కూడా. ఆలస్యం చేయకుండా ఆ ప్రయత్నంలో పడ్డాం. 1998లో మొదలుపెట్టాం. నిరాటంకంగా సాగుతోంది. మా ఈ ప్రోగ్రామ్‌ను చూసి పలు యూనివర్శిటీలకు యూజీసీ సిఫారసు చేస్తోంది ఇలాంటి కోర్స్‌ను ప్రవేశపెట్టమని. ఈ కోర్సు ద్వారా విదేశీ విద్యార్థులు ఈ దేశంలో జరుగుతున్న అభివృద్ధితోపాటు దక్షిణాసియా అభివృద్ధి, మీడియా, డిజిటలైజేషన్ వంటివాటి మీద అధ్యయనం చేస్తారు. ఇంకో మంచి విషయం ఏంటంటే ఈ కార్యక్రమానికి హాజరయ్యేవాళ్లలో అమ్మాయిలే ఎక్కువ. ఎంత ఉత్సాహంగా ఉంటారంటే తెలుగు, ఉర్దూ, హిందీ, సంస్కృత భాషలు నేర్చుకుంటారు. ఇక్కడి సంస్కృతి మీదా ఆసక్తి చూపిస్తుంటారు’ అని చెప్పుకొచ్చారు అపర్ణ. ఇంతేకాకుండా సోషియాలజీలో జెండర్నూ చేర్చి బోధిస్తున్నారు. పరిశోధనల్లో అడిగే ప్రశ్నలలో, మెథడాలజీలోనూ మార్పులు తీసుకు రావడానికి శ్రమిస్తున్నారు. వలసల పరిశోధనే కాకుండా లింగ వివక్ష, జెండర్ సోషలైజేషన్ మీదా చాలా కృషి చేస్తున్నారు. దీనికి సంబంధించి స్కూళ్లు, కాలేజీల్లో వర్క్‌షాపులు, సెమినార్లు నిర్వహిస్తున్నారు. ‘అమ్మాయిలకు తన హక్కుల గురించి చెప్తున్నాం. అలాగే అబ్బాయిలకు తన ప్రవర్తన ఎలా ఉండాలో కూడా చెప్పాలి. ఇదంతా సిలబస్‌లో భాగం కావాలి’ అంటారు రాయప్రోలు అపర్ణ. – సరస్వతి రమ తాత, ముత్తాతల జ్ఞాపకాలు రాయప్రోలు సుబ్బారావు మా తాతగారు. ఆయన రెండో కొడుకే మా నాన్నగారు రాయప్రోలు శ్రీనివాస మార్తాండ. ఆర్ఎస్ మార్తాండ్‌గా సుప్రసిద్ధులు. కవి. తాతగారి రాసే తత్వం మా ఇంట్లో నాన్నకు వచ్చినట్టుంది. మాకు రాలేదు మళ్లీ. అంటే జర్నల్స్‌కు వ్యాసాలు అవీ రాస్తాం కాని.. ఇలా కవిత్వం మాకు అబ్బలేదు. తాతగారి గురించిన జ్ఞాపకాలు అంటే మా ఇంట్లో ఉన్న లైబ్రరీనే. ఆయన గురించి పరిశోధన చేయడానికి ఎవరెవరో ఇంటికి వస్తూండేవారు. వాళ్లతో తాతగారు మాట్లాడుతుంటే వినడం.. ఇవే గుర్తు. ఇక అమ్మ (రాజేశ్వరి) వైపు అంటే.. ఆమె సుప్రసిద్ధ స్వాతంత్య్ర సమరయోధులు, ఆంధ్రబ్యాంక్ వ్యస్థాపకులు భోగరాజు పట్టాభి సీతారామయ్యగారికి మనవరాలు. మా అమ్మ తన పదకొండేళ్ల వయసులోనే మా ముత్తాతతోపాటు స్వాతంత్య్రోద్యమంలో పాల్గొంది. ఆయన జైల్లో ఉన్నప్పుడు ఎన్వలప్ కవర్ల వెనక ‘ది హిస్టరీ ఆఫ్ కాంగ్రెస్’ రాశారట. మా అమ్మకూ అలా కవర్ల వెనక రాసే అలవాటు ఉండేది’’ అంటూ తాత, ముత్తాతల గురించి తనకు తెలిసిన విషయాలను పంచుకున్నారు రాయప్రోలు అపర్ణ. -
రెక్కల ప్రయాణం
ఇంటి కాడ పిల్లజెల్లా ఎట్ల ఉండ్రో.. నా ముసలి తల్లి ఏమి బెట్టి సాదుతుందో.... చెడ్డ బతుకు చెడ్డ బతుకు చెడ్డ బతుకు చెడ్డ బతుకూ.... పాటను వాట్సప్‌లో వింటూండగా కాల్ వచ్చింది.. పాట ఆర్ద్రతతో మనసు చెమ్మగిల్లడం వల్ల రాజేందర్ కళ్లు మసకబారాయి... అందుకే ఆ కాల్ ఎవరిదో సరిగ్గా కనపడలేదు. మోచేయితో కళ్లు తుడుచుకొని చూశాడు. భార్య దగ్గర్నుంచి. వెంటనే లిఫ్ట్ చేశాడు. ‘ఆ.. హలో .. సంధ్యా..’ ‘ఏయ్.. ఇండియా ఓడలను పంపిస్తుందట కదా!’ ఆత్రంగా సంధ్య. ‘ఏందీ...’ అర్థంకాలేదు అతనికి. ‘గదే.. గల్ఫ్‌లో ఉన్న మనోళ్లందరినీ ఇండియా దీస్కపోతందుకు ఓడలను పంపిస్తుందట.. ఆడ స్టార్ట్ అయినయంట కూడా’ ఒకింత ఉత్సాహం, ఆనందం ఆమె స్వరంలో. ‘సంధ్యా... గా వాట్సప్‌ల చక్కర్లు గొట్టేది నమ్ముతవా?’ నిట్టురుస్తూ అతను. ‘యే.. వాట్సప్‌ల గాదు. వెబ్సైట్ న్యూస్‌ల చూసిన.. నిజమే’ ఆమె. ‘అయితే మనం మూటముల్లె సర్దుకొని రెడీగా ఉండమంటవ్ ఇండియావోతందుకు’ వెటకారంగా అతను. ‘నీకన్నీ పరాచకాలా? నా బాధ కనవడ్తలేదు.. ఇనవడ్తలేదు. కనీసం మనమేం బతుకు బతుకున్నమోనన్న సోయన్న ఉన్నదా లేదా? నువ్వు బహెరన్ల.. నేను ఈడ .. పిల్లలిద్దరు మనూర్ల... ఏం బతుకే ఇది? ఎవ్వరమన్నా సంతోషంగా ఉన్నమా? పిల్లలు రోజూ ఫోన్ల ఏడుస్తున్నరు.. అదన్నా వినవడుతుందా లేదా?’ దుఃఖం, బాధ, కోపం, అసహనం అన్నీ కలగలిశాయి ఆమె గొంతులో. ‘నన్నేం జేయమంటవ్ చెప్పు? నీకొక్కదానికే బాధుంటది కాని నాకుండదా? కరోనా కష్టం నాకు, నీకే కాదే.. లోకమంత ఉంది. విమానాలు నడుస్తున్నా.. పైసలు ఖర్చయితలేవని ఈడ కూసున్ననా?’ అని ఆగాడు.. ‘గట్లకాదు’ అని ఆమె ఏదో అనబోతుంటే.. ‘ఎట్ల కాదు.. నిన్ను దుబాయ్‌కి నేను పొమ్మన్ననా? నీకు జెప్పకుండా నేను బహెరన్ అచ్చిన్నా? గల్ఫ్‌ల ఉద్యోగం ఉంది అని చెప్తే నువ్వే కదా పో పో.. ఈడ ఎన్ని రోజులు చేసినా ఏమొస్తది? పిల్లగాండ్లను నేను జూసుకుంటా.. మీ అమ్మ సూత ఉంటది కదా.. భయమేంది నాకు అని నువ్వంటేనే నేనచ్చిన్నా.. నా అంతట నేను చెప్పకుండా పారిపోయి అచ్చిన్నా? ఆ...’ రెట్టించాడు అతను. ‘నేనే చెప్పిన.. అయితేందిప్పుడు’ ఉక్రోషం ఆమెలో. ‘ నేను కూడా సదివిన.. ల్యాబ్ టెక్నీషియన్‌కి ఈడ ఆరు వేలు కూడా ఇస్తలేరు.. నాక్కూడా ఆడనే చూడు అని నువ్వన్లేదా? మరి పిల్లలెట్లనే అంటే ఏమన్నవ్.. కొంచెం పెద్దగయిండ్రు కదా.. మీ అమ్మ, మా అమ్మ చూసుకుంటరు.. ఒక రెండుమూడేండ్లు కష్టపడి పైసలు కాపాయం చేసుకొని మల్లా ఇండియాకొద్దము అని నువ్వన్నవా లేదా? ’ గద్దించాడు. ‘నాకేం ఎరుక గిట్లయితదని.. ఒకల్లనొకల్లం చూసుకోకుండా గింత పరేషాన్ ఒస్తదని. నేను మన మంచికే చెప్పిన’ మనసులో దుఃఖం గొంతులోకొచ్చింది ఆమెకు. ‘గంతే.. ఇద్దరం మన కుటుంబం కోసమే ఆలోచించినమే. ఓల్లమనుకోలేదు గింత పాపపు గడియలు ఒస్తయ్.. కరోనాతో నా కొలువు వోతది..నువ్వు పంపే పైసల మీదనే పడి తినాల్సొస్తదని కలగన్ననా? గసుంటిది ముందే తెలుస్తే సముద్రంల వడి సచ్చిపోదు’ అని అతను అంటూండగా.. ‘ఏం మాట్లాడుతున్నవ్?’ అని కోపగించుకుంటూ ‘ నేనెప్పుడైనా అట్లన్ననా?’ అని ఏడ్వడం మొదలుపెట్టింది సంధ్య. ‘మరేందే? నేను మాత్రం సంతోషంగున్నట్టు. పిల్లలు కండ్లల్లకెంచి పోతలేరు. మా అమ్మ.. ఎట్లుందో.. అండ్ల షుగర్ పేషంట్.. మందులున్నయో లేవో... లేకపోయినా ఉన్నయనే చెప్తది. పిల్లలతో కూడా నిజం చెప్పనియ్యదు ఒట్టేస్తది. మా అమ్మ సంగతి నాకు బాగెరుక’ అంటూ అతనూ ఏడ్వడం మొదలుపెట్టాడు. ‘ఇగో నువ్వు బాధపడకు చెప్తున్నా.. ఎట్లయితేగట్లయితది. అందరితో మనం...’ భర్తకు ధైర్యం చెప్పడం మొదలుపెట్టింది. ‘పిల్లగాండ్లు ఫోన్ చేస్తున్నరంటేనే భయమైతుంది. ఎప్పుడొస్తరు.. ఎప్పుడొస్తరు అని రికామ లేకుండా అడుగుతుంటే ఏం జెప్తం..’ అతను. ‘ఊ... గా ఓడల సంగతి అయితే తెల్సుకో...’ అన్నది. ‘సరే’అన్నాడు. ‘పైసలున్నయా?’ అడిగింది. ‘ఊ...’ చెప్పాడు. ‘మా తమ్ముడ్ని పొయ్యి మనోల్లను చూసిరమ్మందామన్నా అయేటట్టు లేదు. ఎక్కడోల్లు అక్కడ్నే ఉండాల్నట. ఏ ఊరి నుంచి ఏ ఊరికి రాకపోకల్లేవట మా వోడు జెప్తుండు. నాకేం మనసున వడ్తలేదు’ అంది. ‘సరే ఫికర్వెట్టుకోకు. గా ఓడల సంగతి తెల్సుకుంట కని.. పైలం. ఉంట మరి’ అని ఫోన్ పెట్టేశాడు. అలాగే గోడకు చేరగిల పడి కళ్లు మూసుకున్నాడు క్యాంప్‌లోని తన గదిలో. రెండు రోజులుగా సరిగ్గా తిండి లేదు. ఆకలి గుర్రుమని పేగుల్ని కదిలిస్తూ నిద్ర పట్టనివ్వట్లేదు. ‘రాజేందర్ అన్నా..’అని పిలిచిన పిలుపుకి కళ్లు తెరిచాడు. వగరుస్తూ ఎదురుగా మల్లేష్. ‘ఏమైంది మల్లేష్.. గట్ల ఆయసపడ్తున్నవేంది?’ అంటూ లేచి కూర్చున్నాడు రాజేందర్. ‘అన్నా.. మన తెలుగోళ్లు అన్నం వండుకొని అచ్చిండ్రు.. బియ్యం, పప్పు, ఉప్పు, నూనె కూడా పంచుతరట.. దా పోదాం’ అంటూ రాజేందర్ చేయి పట్టుకొని లేపాడు మల్లేష్. ∙∙ ‘ఈ రోజు కూడా మీ ఆయనకు చెప్పినట్టు లేదు విషయం’ అడిగింది కరుణ.. వాళ్లాయనతో మాట్లాడి ఫోన్‌కట్ చేసిన స్నేహితురాలిని చూస్తూ. లేదన్నట్టుగా తలూపింది సంధ్య. ‘తనకూ రెండుమూడు నెల్ల కిందటనే జాబ్ పోయిందని రాజేందర్‌కు తెలిస్తే తట్టుకుంటడా? గుండె ఆగి సచ్చిపోతడు ఆడ్నే. అనుకుంది మనసులో. ‘మరి ఎన్ని రోజులు ఇట్లా మేనేజ్ చేస్తావ్?’ సంధ్య భుజం నొక్కుతూ అనునయంగా అడిగింది కరుణ. అవును ఎన్ని రోజులు తమ్ముడి దగ్గర పైసలు తీస్కుని మొగుడికి పంపిస్తది? కరోనాతోని వాడి పరిస్థితి కూడా మంచిగలేదని చెప్పిండు తమ్ముడు. అంటే ఇక పైసలు ఇచ్చుడు కాదని కదా’ ఆమె కళ్లనిండా నీళ్లు. కనపడకుండా కళ్లు మూసుకుంది. ఆ ఒత్తిడికి చెంపలమీదకు జారాయి కన్నీళ్లు. ‘అమ్మా...నీకు, నాన్నకు రెక్కలుంటే మంచిగ ఉండు.. మేము అడిగినప్పుడల్లా మా దగ్గరకు రావస్తుండే’ కూతురి అమాయకత్వం గుర్తొచ్చి మరింత పొంగింది దుఃఖం ఆమె కళ్లల్లో. - సరస్వతి రమ -
కరోనా ఏమోనని అనుమానం సర్
‘సర్... నేను గిరి...’ అని ఏదో చెప్పబోతుంటే దగ్గు అడ్డొచ్చింది. శ్వాస కూడా భారంగా వినిపిస్తోంది అవతల ఫోన్లో ఉన్న వాళ్లకు. ‘గిరిజా.. ఏమైంది? ఈ ఫోన్ నెంబర్ ఎవరిది? నీ ఫోన్‌కు ఏమైంది? వారం రోజుల్నించి ట్రై చేస్తున్నాం’ ఆదుర్దాగా అడిగాడు శ్రీనివాస్. ‘సర్.. నా ఫోన్ కావాలనే వాడట్లేదు. నా పరిస్థితి తెలిస్తే నా కొడుకు తట్టుకోలేడు. నిండా పన్నెండేళ్లు లేవు వాడికి.. నాకేమన్నా అయితే.. ఏమైపోతాడో.. వాళ్ల నాన్న సంగతి తెలుసు కదా మీకు’ అంటూ ఏడ్చేస్తోంది గిరిజ. కంగారుపడ్డాడు శ్రీనివాస్.. విషయం అర్థకాక.. అడిగాడు ఫోన్లో ..‘ఎందుకేడుస్తున్నావ్? నీ మాట కూడా భారంగా వస్తోంది.. ఏమైంది? పరిస్థితి అంటున్నావ్.. విషయం ఏంటో చెప్పు’ ఆందోళనగా. ‘సర్..’ అంటూ మళ్లీ దగ్గసాగింది గిరిజ.. దగ్గుతూనే చెప్పింది.. ‘కరోనా ఏమోనని అనుమానం సర్’ అని. పక్కన బాంబు పడ్డట్టు అదిరిపడ్డాడు శ్రీనివాస్. వెంటనే తేరుకొని ‘ఇప్పుడెక్కడున్నావ్? ఆసుపత్రికి వెళ్లలేదా?’ అడిగాడు. ఏడ్వసాగింది గిరిజ. ఏమీ అర్థంకాలేదు శ్రీనివాస్‌కు. ‘ఎక్కడున్నావ్?’ మళ్లీ రెట్టించాడు. ‘రూ.. రూమ్‌లో ’ చెప్పింది ఏడుస్తూనే. ‘రూమ్‌లో అంటే మీ హర్బాబ్ ఇంట్లో లేవా?’ కంగారుగానే అడిగాడు. ‘ఉహూ... కరోనా భయంతో పంపించేశారు. ఫ్రెండ్ రూమ్‌లో ఉంటున్నా..’ చెప్పింది ముక్కు తుడుచుకుంటూ. ‘అరే... మరి వాళ్లు ఉండనిస్తున్నారా?’ అడిగాడు.దానికి సమాధానం దాటవేసి.. ‘సర్.. ఈ విషయాలేవీ ఇంట్లో వాళ్లకు చెప్పకండి.. నా పిల్లాడికైతే అస్సలు తెలవద్దు. నేను మీకు ఫోన్ చేశానని.. బాగున్నానని.. ఇండియాకు వచ్చేస్తున్నానీ చెప్పండి ప్లీజ్’ వేడుకుంది. ‘అద్సరే గానీ.. ముందు నువ్వు కువైట్ వాళ్ల కరోనా హెల్ప్‌లైన్‌కు కాల్ చేసి నీ పరిస్థితి చెప్పు.. వాళ్లు ఆసుపత్రిలో చేర్చుకుంటారు. డబ్బు గురించి బెంగపడకు.. ట్రీట్మెంట్ ఫ్రీనే’ అంటూ ఇంకేదో జాగ్రత్తలు చెప్పబోతుండగానే ‘అలాగేనండీ.. నా పిల్లాడిని జాగ్రత్తగా చూసుకోండి.. ఇక్కడి విషయాలేం వాడికి చెప్పొద్దు ప్లీజ్ ’ అంటూ ఫోన్ కట్ చేసింది. ఇవతల శ్రీనివాస్‌కు చాలాసేపటి వరకు మెదడు పనిచేయలేదు. గిరిజ గురించిన ఆలోచనలే. పాపం.. కువైట్ వెళ్లడానికి అస్సలు ఇష్టపడలేదు. ఆ గిన్నెలు, బట్టలేవో ఏ విశాఖపట్నమో.. హైదరాబాదో వెళ్లి తోముతా.. ఉతుకుతా. కనీసం నేను, నా పిల్లాడైనా ఒక్క చోటుండొచ్చు అని భర్త కాళ్లావేళ్లా పడింది. వినలేదు మూర్ఖుడు. రెండు గోదావరి జిల్లాల్లో అప్పులు చేసిపెట్టాడు. పొలమూ పుట్రా, నగానట్రా అన్నీ హారతి కర్పూరం చేశాడు. పైగా అమ్మాయిల పిచ్చి. దానికి తోడు తాగుడు. అప్పులు తీర్చుతూ తన జల్సాలకు కొదువ లేకుండా చూసుకోవడానికే గిరిజను బలవంతంగా కువైట్ పంపాడు. పిల్లాడికి ఏడేళ్లున్నప్పుడు వెళ్లింది. ఇప్పటి వరకు రాలేదు. రమ్మని భర్తా ఆడగలేదు. రోజూ కొడుకుతో ఫోన్లో మాట్లాడుతుండేది. పది రోజులుగా అమ్మ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు.. అని వాడు ఒకటే టెన్షన్ పడిపోతున్నాడు. కువైట్ వెళ్లడం తప్పనిసరి అయ్యేటప్పటికి భర్త అప్పులు తీర్చడం కన్నా తన కొడుకును బాగా చదివించుకోవాలనే లక్ష్యంతో మాత్రమే వెళ్లింది గిరిజ. వెళ్లిన రెండేళ్ల వరకు తనకు పైసా పంపకపొయ్యేసరకి కొడుకును ఇబ్బందిపెట్టడం మొదలుపెట్టాడు. పిల్లాడి స్కూల్‌కి వెళ్లి అక్కడ గోల చేయడం, గిరిజ వాళ్ల అమ్మవాళ్లింటికి వెళ్లి గొడవలు పెట్టడం.. వాళ్లు గిరిజకు కంప్లయింట్ చేయడం వంటివి ఎదురయ్యే సరికి.. భర్త అప్పునూ తన ఖాతాలో వేసుకుంది. సంసారాన్ని ఓ గాడిలోకి తెచ్చే ప్రయత్నం చేసుకుంటోంది అని ఆమె ఆత్మీయులు, బంధువులు సంతోషపడ్తున్న టైమ్‌లో ఈ కరోనా పిడుగేంటో... అనుకుంటూ నిట్టూర్చాడు శ్రీనివాస్. తనే ఆమెకు ఉద్యోగం ఇప్పించాడు.. ఈ చేతులతోనే వీసా ప్రాసెసింగ్ చేయించాడు.. భగవంతుడా ఆ అమ్మాయి ఆరోగ్యవంతురాలై తన కొడుకుతో సంతోషంగా ఉండేలా చూడు’ అంటూ మనస్ఫూర్తిగా కాంక్షిస్తూ కువైట్‌లో తనకు తెలిసిన యాక్టివిస్ట్‌కు ఫోన్ కలిపాడు. ∙∙ ఫ్రెండ్ ఇంట్లో ఉంటున్నానని అబద్దం చెప్పింది. ఏమని చెప్తుంది మరి? కరోనా భయంతో హర్బాబ్ వాళ్లు రాత్రికి రాత్రే పాస్‌పోర్ట్ తన మొహాన విసిరి.. రావాల్సిన జీతం కూడా ఇవ్వకుండా.. ఏ లెక్కా తేల్చకుండా ఇంట్లోంచి బయటకు గెంటేస్తే.. ఎటు వెళ్తుంది? తనలాంటి పరిస్థితే ఉన్న ఆ ఇంటి డ్రైవర్ ఆశ్రయం కోరింది తోటి భారతీయుడే అన్న భరోసాతో. దేవుడా.. ఎంత తప్పు చేసింది తను? కష్టంలో ఒకరికి ఒకరం.. నేను తినేదే నువ్వు తిందువుగాని.. అంటూ తన రూమ్‌కి తీసుకెళ్లాడు. ఉన్న దాంట్లోనే ఇద్దరు తింటూ గది దాటి బయటకు వెళ్లకుండా వారం రోజులు బాగానే గడిపారు. ఇంతలోకే అతనికి జలుబు చేసింది. మాత్రలు తెచ్చుకుంటాను అని వెళ్లిన మనిషి అడ్రస్ లేకుండా పోయాడు. ఫోన్ కూడా ఇంట్లోనే వదిలి. రెండు మూడు రోజులు చూసింది.. నాలుగో రోజూ తెల్లారింది. అయినా మనిషి లేడు. సంబంధించిన సమాచారమూ లేదు. ధైర్యం చేసి అతని ఫోన్లోని ఒకటిరెండు కాంటాక్ట్స్‌కి ఫోన్ చేసింది.. ‘ఈ ఫోన్ అతను ఎవరో.. ఫోన్ మరిచి పోయాడు ఎక్కడున్నాడో చెప్తారా’ అని. విని ఫోన్ కట్ చేసేశారు. తర్వాత రెండు గంటలకు ఆ నంబర్ నుంచే మళ్లీ ఫోన్. ‘ఈ ఫోన్ అతని పేరు దినేశ్. కరోనా పాజిటివ్ వచ్చింది. హాస్పిటల్లో ఉన్నాడు. ఈ ఫోన్ ఎక్కడ మరిచిపోయాడు. మీకెక్కడ దొరికింది’ అంటూ. ఆ ప్రశ్నల పరంపర అలా కొనసాగుతూనే ఉంది.. చల్లబడి పోయింది గిరిజ. వారం రోజులు.. చిన్న గదిలో ఒక్కదగ్గరే ఉంటూ.. ఒకేచోట పడుకుంటూ.. ఒకే బాత్రూమ్ వాడుకుంటూ.. మెదడు మొద్దు బారిపోయింది ఆమెకు. కదలికల్లేవు. చేతిలో చిల్లిగవ్వలేదు. వాలంటీర్ల నంబర్లు లేవు. ఇంకెవరికి చెప్పుకోవాలో.. ఇంకెవరిని సహాయమడగాలో తెలియదు. ఆ షాక్‌లోంచి తేరుకున్నాక తన కొడుక్కి ఫోన్ చేసి మనసారా మాట్లాడుకుంది. తర్వాత రెండు రోజులకు ఆమెకూ జలుబు చేసింది.. దగ్గు... జ్వరం వచ్చాయి. ఇక మరణం తప్పదని ఊహించుకుంది. శ్రీనివాస్‌కు ఫోన్ చేసి తన కొడుకు గురించి జాగ్రత్తలు చెప్పింది. తనెలా పోయిందో కనీసం ఒక్కరికైనా తెలియాలి అని. ఆ అంతర్మ«థనంతో అలా గోడకు చేరగిల పడిందో లేదో బయట తలుపు బాదిన చప్పుడు ... భయంతో గట్టిగా కళ్లు మూసుకొని అలాగే కూర్చుండిపోయింది. ఈసారి ఇంకొంచెం గట్టిగా కొట్టారు తలుపుని. కొట్టి ఊరుకోలేదు.. గ్యాప్ ఇవ్వకుండా కొడుతూనే ఉన్నారు. తప్పదన్నట్టుగా లేచి అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్లి తలుపు తీసింది. ఎదురుగా హెల్త్ వాలంటీర్లు.. అంబులెన్స్‌తో సహా. ∙∙ ‘థాంక్యూ ప్రసాద్.. గిరిజను ఆసుపత్రిలో చేర్పించినం దుకు’ కువైట్‌లో ఉన్న స్నేహితుడికి ఫోన్లో కృతజ్ఞతలు చెప్తున్నాడు శ్రీనివాస్. -సరస్వతి రమ -
దునియా అంతా గులామే కరోనాకు
‘యేందో ఏమో. ఏడికివొయ్యి... ఏడికొస్తదో గిదంత!కొలువులు ఉండయ్.. యేడికెంచి అచ్చినోల్లు ఆడికి వోవాల్సిందే... అంటున్నరే....’ అన్న భర్త గొంతులోని దిగులు వినపడింది భూలతకు. ‘పోనితియ్.. అందరం ఒక్కతాడ్నే ఉండచ్చు. గంజి అండుకున్నా కలిసి తాగుతమన్న తుర్తన్నా ఉంటది. ఎట్లయితే అట్లాయే.. గవన్ని మనసుల వెట్టుకొని రందిపడకు.. మంచిగుండు’ దుబయ్‌లో ఉన్న భర్తకు ఫోన్లో ధైర్యం చెప్పింది భూలత. ‘ఊ... మీరు సుత పైలం.. అవ్వ, బాపు, పిల్లలు.. అందరూ పైలం..’ చెప్పి ఫోన్ కట్ చేసి... తన రూమ్మేట్స్ దగ్గరకు వచ్చి కూర్చున్నాడు మధుకర్ అప్పుడు దుబాయ్‌లో రాత్రి తొమ్మిది గంటలు.. కరోనా పరిస్థితులు ఆ లేబర్ క్యాంప్‌లోని వాళ్లను రోజూ రాత్రి అలా ఒక్కచోటికి చేరుస్తున్నాయి... రేపు ఎలా ఉంటుందో అన్న బెంగతో. ఆ క్యాంప్‌లో మధుకర్‌తోపాటు అతని ఊరికే చెందిన ఇద్దరు .. పాకిస్తాన్‌కు చెందిన అబ్దుల్.. ముగ్గురూ ఉన్నారు. బ్లాక్ టీ కాచుకొని.. నెమ్మది నెమ్మదిగా సిప్ చేస్తున్నారు సొంత విషయాలు.. ఇంటి జ్ఞాపకాలు మాట్లాడుకుంటూ. ఫోన్ సంభాషణ ముగించుకొని వచ్చిన మధుకర్‌ను అడిగాడు సాయిలు.. ‘అంతా మంచిదేనటనా ఊర్లే?’ అని. ‘ఆ... ’ పొడిగా జవాబిచ్చాడు మధుకర్. అందరూ ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయారు. భాష రాకపోయినా భావం అర్థమై అబ్దుల్ కూడా సైలెంట్ అయిపోయాడు. ‘భాయ్... హమారా ముల్క్ మే భీ సేమ్ సిట్యుయేషన్.. కరోనా సబ్ కో ఏక్ కర్రహా హై ’ అన్నాడు అబ్దుల్. ‘సచ్ హై... పూరీ దునియాకో ఏక్ కర్రాహా హై... నో పాకిస్తాన్... నో ఇండియా... ముసల్మాన్... హిందూ... క్రిస్టియన్... సిక్.. సబ్ ఏక్ హో రహా హై...’ అన్నాడు కిషన్. ‘హోజానేదో... కమ్‌సే కమ్ ఇస్కీ వజేసే.. యే దునియా ఇకట్టా హోరహీ హై...’ అన్నాడు సాయిలు నవ్వు ఆపి.. బ్లాక్ టీ సిప్ చేస్తూ..! ‘అరే... గప్పట్ల స్కైలాబ్‌తో కూడా గిదే పరేషానీ వచ్చినట్టుంది లే.. మా తాత చెప్తుండే గా ముచ్చట ’ అన్నాడు కిషన్. ఒక్కసారిగా అందరికీ కథలుగా విన్న స్కైలాబ్ సంగతులు గుర్తొచ్చినట్టున్నాయి. నవ్వులు ఆపేశారు. ‘హౌ.. హమారే ముల్క్ మే భీ కిస్సా సునాతే రహెతే బడే లోగ్...’ అబ్దుల్. ‘ఔ.. స్కైలాబ్ పడేటప్పుడు మా బాపు పదేళ్ల పిల్లగాడట. గప్పట్లనే మా తాత మస్కట్ వోయిండట. మా ఊర్లెకెంచి మస్కట్ వోయినోల్లలో మా తాత ఒకడు. ముగ్గురేమో వోయిండ్రట.. గదీ ఓడల. ఇచిత్రమేందో ఎరికేనా... గాల్లు మస్కట్‌కు చేరిన వారం రోజులకే స్కైలాబ్ పడ్తుంది.. ప్రపచం మంత నాశనమైపోతుందనే ముచ్చట తెల్శిందట. మా తాతోల్లు గాదు కని..వేరేటోల్లు ఎట్ల ఓడల అచ్చినటమో అట్లనే ఓడల దేశం పారిపోదమని ట్రె సుత చేసిండ్రట. ఆల్లను జైల్లో వెట్టుడు.. ఈడున్నోల్లు ఆల్ల పేరుమీద కోళ్లు, గొర్రెలు కోస్క తినుడు .. మా తాత ఆల్ల మేనేజర్‌ను వట్టుకొని ఇంటికి ఉత్తరం రాయించిండట... మల్ల ఒకల్లనొకల్ల సూస్కుంటమో లేదో.. మస్కట్ వోతందుకు షేసిన అప్పు ఎగవెట్టమని.. పోషమ్మ కాడ యాటలు కోసి దావత్ చేస్కొమ్మని.. తన వంతుది కూడా ఆల్లనే దినమని.. గిట్ల గమ్మతి గమ్మతి మచ్చట్లతోని లెటర్ రాయించిడట. ఇంకో విషయం ఎరికేనా? గా స్కైలాబ్ యేడనో సముద్రంలో వడి.. ప్రపంచమంతా మంచిగనే ఉన్నది కదా. యాటలు, కోళ్లు కోస్కోని దావత్ చేస్కున్నోల్లు, అగ్వసగ్వకు పొలాలు అమ్ముకొని ఆ పైసలతోని తినితాగినోళ్లకు లాస్ట్కొస్తే అప్పులే మిగిలినై. గసుంటోళ్ల దాంట్ల మా మేనమామ సూత ఉన్నడు’ అంటూ కిషన్ ఇంకేదో చెప్పబోతుంటే.. ‘ఇంకో విషయం ఎరికేనా అన్నావ్..గది చెప్పు ముందుగల్ల’ అంటూ అడ్డు తగిలాడు మధుకర్. ‘గాడికే అస్తున్నా.. మస్కట్‌కి వోయిన అప్పు ఎగ్గొట్టమని మా తాత రాయించిన ఉత్తరంను మా నాన్నమ్మకు సదివి ఇనిపించిందెవరంటే.. మస్కట్వోతందకు మా తాతకు అప్పు ఇచ్చిన కోమటి శంకరే’ అంటూ నవ్వడం మొదలుపెట్టాడు కిషన్. మిగిలిన వాళ్లూ శ్రుతి కలిపారు. అర్థంకాని అబ్దుల్‌కు కిషనే ట్రాన్స్‌లేట్ చేశాడు విషయాన్ని. ‘ఔ... శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్తోని .. మనూరి మీద కాల్వ పొయ్యేసరికి.. మస్తుమందికి భూమి కొనుక్కోవాల్నని పట్టిందిలే. గందుకు మీ తాత మస్కట్ వోతే... మా తాత మా నాయనమ్మ పుస్తెలు అమ్మి భూమి కోసం బయాన వెట్టిండట. స్కైలాబ్ ఆపతి రాంగనే.. ఆ బయాన తీస్కున్నోడు ఆ కాయితం చింపేశిండట. తర్వాత బయాన్నే ఇయ్యలేదు అని ప్లేట్ ఫిరాయించేసరకి ఊర్లె ఉన్న మర్రికి ఉరేస్కున్నడట మా తాత’ అంటూ ఒక్కసారిగా మౌనంగా అయిపోయాడు సాయిలు. అందరూ సైలెంట్ అయిపోయారు. ఆ గంభీర పరిస్థితి అర్థమైన అబ్దుల్.. ‘అరే.. హమారా కహానీ జెరా అలగ్ హై’ అంటూ చెప్పడం మొదలుపెట్టాడు.. ‘మీ నానమ్మ నగలు అమ్మి తాత పొలం కొంటే.. మా దాదీ మాకున్న గొర్రెలు, కోళ్లు అమ్మి నగలు చేయించమని తాత ప్రాణం తిన్నదట. అర్రే... నిఖా అయ్యి ఇన్నేండ్లయి ఒక్క నగ కూడా చేయించలేదు.. ఇప్పుడు అందరం సచ్చిపోయే దినమొచ్చే... ఇప్పుడన్నా ఒక్కటి చేయించు.. పెట్టుకొని సంతోషంగా ప్రాణం వదులుతా.. ’ అని మా తాతను నిద్రపోనివ్వలేదట మా దాది. ‘మరి చేయించిండా?’ ఆత్రంగా అడిగాడు సాయిలు. ‘చేయించక పోతే మా దాదీ ఊరుకుంటదా? చేయించిండు..గొర్రెలు గయాబ్.. స్కైలాబ్ గయాబ్.. అప్పు మిగిలింది. మా తాత పరిస్థితి సూడాల్నట అప్పుడు.. మా తాత వాళ్లమ్మ అమ్మి.. మా తాతను ఒక్కటే తిట్టుడట.. జోరు కా గులామ్ కైక అని’ చెప్పాడు అబ్దుల్. మళ్లీ నవ్వులు. ‘గిప్పుడు గీ కరోనా ఏం నౌబత్ తేనుందో మరి?’ నిట్టురుస్తూ అన్నాడు మధుకర్. ‘గిప్పుడు దునియా అంతా గులామే కరోనాకు’ అన్నాడు కిషన్. అంగీకరి స్తున్నట్టుగా మిగిలిన వాళ్లంతా మౌనంగా ఉండిపోయారు నవ్వులు ఆపేసి. -సరస్వతి రమ -
ఆమె సమరం
‘గంగా.. నేను మిమ్ముల మల్లా చూస్తనో లేదో.. ’ అంటూ ఏడ్చేస్తున్నాడు పోషన్న– ఇండియాలో ఉన్న తన భార్య గంగజలకు వీడియో కాల్ చేసి. ‘ఏ.. ఊకో.. గా జ్వరానికే గట్ల బేజారైతే ఎట్ల? ఏంగాదు’ భర్తకు ధైర్యం చెప్తోంది గంగజల. ‘లేదే.. కుడి షెయ్యి లేస్తలేదు.. చూష్నవ్ కదా.. ఏం మింగస్తలేదు.. మాట సూత సక్కగొస్త...’ అంటూండగానే అతని మాట పడిపోయింది. ఏదో చెప్పబోతున్నాడు.. గొంతు పెగలట్లేదు. దుఃఖం వస్తోంది అతనికి. ఏడుస్తున్నాడు. దుబాయ్‌లోని వర్కర్స్ క్యాంప్ గదిలో తన భర్త పడ్తున్న అవస్థ ఇండియాలో ఉన్న గంగజలకు భయం పుట్టించింది. అయితే ధైర్యం కోల్పోలేదు ఆమె. వెంటనే దుబాయ్‌లోనే ఉన్న గల్ఫ్ గ్రూప్ సేవా సమితి సభ్యులకు వాట్సప్‌లో వాయిస్ మెసేజ్ పెట్టింది. ఆ గ్రూప్ ద్వారా పోషన్నకు పని ఇప్పించిన ‘స్టార్ సర్వీస్ ఎల్ఎల్సి’ సిబ్బంది మీద ఒత్తిడి పెట్టించింది. ‘పోషన్నను ఆసుపత్రిలో చేర్పించండి లేదంటే వీసా ఇప్పించి ఇండియాకైనా పంపించండి’ అని వొత్తిడి తెచ్చింది. తప్పించుకోలేక పోషన్నను ఆసుపత్రిలో చేర్పించారు ఆ ఉద్యోగనియామక ఏజెన్సీ సిబ్బంది. దీనికి ముందు సంగతి కొక్కెరకాని పోషన్న ఉరఫ్ కొక్కెని పోషన్న యేడాదిన్నర కిందట దుబాయ్‌కి వెళ్లాడు. వీసాకోసం స్థానిక సబ్ ఏజెంట్, జగిత్యాల్లో ఉన్న లైసెన్స్డ్ గల్ఫ్ రిక్రూటింగ్ ఏజెంట్ (గల్ఫ్‌లో ఉపాధి చూపించేందుకు కేంద్రప్రభుత్వం ద్వారా అనుమతిపత్రం పొందిన ఏజెంట్)కి దాదాపు 70 వేల రూపాయలు చెల్లించాడు. స్టార్ సర్వీస్ ఎల్ఎల్సీ అనే దుబాయ్ ఏజెన్సీ ద్వారా అక్కడ పోషన్నకు పని ఇప్పించారు ఇక్కడి ఏజెంట్లు. ఇచ్చిన పని చేసుకుంటూ పోతున్న పోషన్నకు ఒకరోజు జ్వరంతో మొదలైన అనారోగ్యం పక్షవాతానికి దారితీసింది. తను పనిచేస్తున్న కంపెనీ తరపున పోషన్నకు ఇన్సూరెన్స్ లేకపోవడంతో ఆ సంస్థగాని, ఉద్యోగం చూపించిన ఏజెన్సీగాని పట్టించుకోలేదు. పోషన్నకు బీపీ ఎక్కువై, సరైన సమయంలో వైద్యం అందక కుడి చేయి అచేతనమైంది. ఆ తర్వాత మాటా పడిపోయింది. బీమా లేకే నిజానికి పోషన్నకు దొరికింది వర్క్ వీసా కాదు. విజిట్ వీసా. దీనివల్లే అక్కడ కంపెనీ అతనికి ఇన్సూరెన్స్, హెల్త్‌కార్డ్ రెండూ ఇవ్వలేదు. ఫలితంగా పోషన్న అనారోగ్యం పక్షవాతం దాకా పోయింది. దీనికంతటికీ కారకులు.. పోషన్నను దుబాయ్‌కి పంపిన ఏజెంట్లే. వాళ్లు అతనికి వర్క్ వీసా కాకుండా విజిట్ వీసా ఇవ్వడం వల్ల వలస కార్మికులకు ప్రభుత్వం ఇచ్చే ‘ప్రవాస భారతీయ బీమా’ పథకం వర్తించలేదు. రెండేళ్లకు కలిసి 325 రూపాయల ప్రీమియం చెల్లిస్తే వలస వెళ్లినచోట ఏదైనా ప్రమాదం జరిగినా, అంగవైకల్యం సంభవించినా పదిలక్షల రూపాయల బీమా వర్తిస్తుంది. పోషన్నలా అనారోగ్యం కలిగితే లక్ష రూపాయలతోపాటు, స్వదేశం రావడానికి ఎయిర్ టికెట్టూ దొరుకుతుంది. ఈ విషయం పోషన్నకు, గంగ జలకు తెలియక చాలా నష్టపోయింది ఆ కుటుంబం. ఏజెంట్లు తమకు చేసిన అన్యాయం మీద కడుపు మండింది ఆమెకు. పోరాటం షురూ తన భర్తకు వీసా ఇప్పించిన ఏజెంట్‌ను నిలదీసింది గంగజల. ‘విజిట్ వీసాకు బీమా ఉండదు’ అని చెప్పాడు. ‘పనికోసం దరఖాస్తు పెట్టుకుంటే విజిటింగ్ వీసా ఎలా ఇచ్చారు?’ అని ప్రశ్నించింది. మోసానికి పాల్పడినందుకు బీమా కింద వచ్చే లక్షరూపాయలు ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేసింది. ఈ విషయమై కలెక్టర్, ప్రొటెక్టర్ ఆఫ్ ఇమ్మిగ్రెంట్స్ (హైదరాబాద్, ఢిల్లీ)కూ దరఖాస్తు చేసుకుంది. విచారణకు ఆదేశమిచ్చారు జిల్లా కలెక్టర్. ఇది తెలిసి ఎంతోకొంత డబ్బిచ్చి పక్కకు తప్పుకోవాలనుకున్నాడు ఏజెంట్. ఒప్పుకోని గంగజల.. ‘ఇంటర్ వరకు చదువుకున్న నాకే మోసం జరిగితే అసలు అక్షరం ముక్క తెల్వకుండా గల్ఫ్‌కు పోతున్న ఎంతమందికి ఇంకెంత మోసం జర్గుతుండచ్చు? మా ఆయన మంచంల పడేదాకా ఈ పాలసీ గురించి తెల్వకపోయే. నా అసుంటోళ్లు ఇంకెంతమంది ఉన్నరో? గందుకే కొట్లాడుతున్నా. ఈ కొట్లాటతోని వేరోళ్లకన్నా తెలివస్తది.. తెలుసుకుంటరు. ఇందుకోసం అవసరమనుకుంటే ఢిల్లీకీ వోతా’ అంటోంది గంగజల. – సరస్వతి రమ ఈ మోసం ఎంత కాలం? జగిత్యాల జిల్లా, ధర్మపురి మండలం, జైన గ్రామంలో ఉండే గంగజల ఇంటర్ చదివింది. ఆపై చదివించే స్థోమత లేని ఆమె కుటుంబం అప్పటికే దుబాయ్ వెళ్లొచ్చిన పోషన్నకు ఇచ్చి పెళి ్లచేసింది. పెళ్లయిన యేడాదిన్నరకే పిల్లాడు పుట్టాడు. పెళ్లి, భార్య డెలివరీకి అయిన అప్పులు, ఊర్లో పనీ దొరక్క మళ్లీ గల్ఫ్‌కు వెళ్లాలనుకున్నాడు పోషన్న. తన బంగారం అమ్మి లక్షాయాభైవేల రూపాయలు భర్తకు ఇచ్చింది గంగజల. ఇరాక్‌కు వీసా ఇప్పిస్తానని ఆ డబ్బు తీసుకున్న ఏజెంట్ పారిపోయాడు. కొన్నాళ్లాగి గల్ఫ్ కోసం మళ్లీ ప్రయత్నించిన పోషన్నకు ఈసారి దుబాయ్‌కి వీసా దొరకడంతో దుబాయ్‌కు వెళ్లాడు. ఈ రకమైన మోసానికి గురయ్యాడు. -
బాపూ తెచ్చిన గిఫ్ట్ అది
‘బాపూ.. ఈసారి అచ్చేటప్పుడు టేప్‌రికార్డ్ (టేప్‌రికార్డర్) తేవే. ఊకే లక్ష్మయ్యబాపోళ్లింటికొచ్చి మాట్లాడుడు మంచిగనిపిస్తలేదు’ ‘అగో.. మేమేం అన్నమావోయ్.. గట్ల జెప్తున్నవ్ మీ బాపుతోని?’ ‘యే... గా పోరడు మాటలు వట్టించుకుంటావానోయ్? టేప్‌రికార్డ్ మీద షోకుతోని ఆల్ల బాపుకి గట్ల జెప్తుండు. నువ్వేందిరా పొల్లగా..సోల్ది వెడ్తున్నవ్ మెల్లగా?’ అంటూ వీపు మీద ఒక్కటి చరిచిన శబ్దం. ‘ఏ.. అమ్మ నువ్వూకో.. అన్నా.. నువ్వు పక్కకు జరుగు’ ‘ఆ.. దా... మాట్లాడు.. ’ ఎక్కసెక్కం. ఇంతలోకే పక్కకు తోసేసి ముందుకు వచ్చి గొంతు సవరించుకున్న శబ్దం.. ‘బాపూ.. మంచిగున్నవానే! టైమ్‌కి తింటున్నవా? ఎండలెక్కువైనయంట కదా.. పేపర్ల చదివిన. బాపూ ఒకవేళ సద్ది ఖరాబైతే తినకే. పడేయ్. ఇంటున్నవా? పైలమే. ఇగో.. అన్న ఏమేమో జెప్తడు ఈసారి టేప్‌రికార్డ్ తీస్కరా.. వాచీ తీస్కరా అన్కుంట. గవ్వేం బట్టిచ్చుకోకు. నేను మంచిగనే సదువుకుంటున్న. మల్లా జెప్తున్నా.. ఖరాబైన సద్ది తినకే.. పడేయ్’ ‘సాల్తియ్ చెప్పినకాడికి. పక్కకు జరుగు. ఇగో.. మీ షిన్నమ్మోల్ల అత్త షెప్పంపింది.. ఈ దీపావళికి మీ బామ్మర్దికి ఉంగురం వెట్టాల్నట. నువ్వు పంపిస్తెనే పెట్టుడు.. లేకపోతే నువ్వే ఆల్లకు సముదాయించుకో. మీ పెద్దమ్మి పెనిమిటికి ఏం బెట్టలేదు. గిప్పుడు షిన్నమ్మికి మొగడికి వెడితే పెద్దమ్మి ఊకుంటదా? నువ్వే ఇచారం జేస్కో ?’ అని ఇంకేదో చెప్పబోతుండగా.. ‘అమ్మా.. గా జోలి ఎందుకిప్పుడు? బాపుకి లేనిపోని అల్లర వెడ్తవా ఏందీ?’ ‘అగో..పెద్దోల్లనడుమ నువ్వెందే దీపా? షిన్నదాన్వి షిన్నదాన్లెక్కుండు’ ‘ గాల్లింటి ముచ్చట నీకెందుకు మరి? బీడీల షాట పక్కకు వెట్టి అన్నం బెట్టుపో.. లెవ్.. ’ ‘బాపూ. బా.......పు... ఎ....ప్పు.....డు... ’ అంటూ క్యాసెట్లో రీలు అరిగిపోయిన సంకేతం. కాసేపటికి అదీ ఆగిపోయింది. ఆ సంభాషణంతా ఆత్రంగా వింటున్న పదిహేనేళ్ల సంహితకు ఆ డిస్టర్బెన్స్ చిరాకు పుట్టించింది. ఏం చేయాలో తెలీక స్టాప్ బటన్ నొక్కి దాని హ్యాండిల్ పట్టుకొని ‘అమ్మా.. ’అని గట్టిగా పిలుస్తూ హాల్లో ఉన్న తల్లి దగ్గరకు వెళ్లింది. ‘ఏంది నీ లొల్లి?’ అడిగింది అమ్మ. ‘టేప్రికార్డర్లో క్యాసెట్ స్ట్రక్ అయినట్టుంది?’ ఏడుపు మొహంతో సంహిత. ‘ఓయ్.. ఏంచేశావ్ దీన్ని? నాకోసం మస్కట్ నుంచి మా బాపు తెచ్చిన గిఫ్ట్ తెలుసు కదా?’ బెదిరించినట్టుగా అంటూ కూతురు చేతుల్లోంచి టేప్‌రికార్డర్‌ను తీసుకుంటూ తన గదిలోకి నడిచింది ఆమె. తెలుసు అన్నట్టుగా తలూపుతూ తల్లి వెనకాలే వెళ్లింది. మంచమ్మీద కూర్చుంటూ టేప్రికార్డర్లోని ఎజెక్ట్ బటన్ నొక్కింది ఆమె. రీల్ అంతా చుట్టుకుపోయి క్యాసెట్ బయటకు రాలేదు. కింద మోకాళ్ల మీద కూర్చోని తను చేస్తున్న పనినే కుతూహలంగా చూస్తున్న కూతురునుద్దేశించి ‘ఇది మంచిగైంతర్వాత వినొచ్చుగని.. అప్పటిదాకా చదువుకో.. పో’ అన్నది ఆమె.. ఆజ్ఞాపిస్తున్నట్టుగా . ‘ఊ...’ అంటూ విసురుగా లేచి అలిగినట్టుగా పాదాలను నేలకేసి కొడ్తూ తన గదిలోకి వెళ్లిపోయింది సంహిత. నిట్టూరుస్తూ చేస్తున్న పనిమీదకు దృష్టి మరల్చింది మళ్లీ. రీల్ తెగిపోకుండా మెల్లగా బయటకు తీసి.. పక్కనే రీడింగ్ టేబుల్ మీదున్న పెన్ ఫోల్డర్లోంచి ఓ పెన్ను తీసి క్యాసెట్ చక్రాల్లో పెట్టి తిప్పింది. రీల్ అంతా క్రమంగా చుట్టుకోవడం ప్రారంభించింది. ఆమె జ్ఞపకాలు కూడా. ఆ ఇంట్లోంచే కాదు వాళ్లూరు నుంచే గల్ఫ్‌కు వెళ్లిన ఫస్ట్ పర్సన్ తన తాత . ఊర్నుంచి బస్‌లో బొంబైకి .. అక్కడ్నించి ఓడలో దుబాయ్‌కి పోయిండని. ‘ఎప్పుడో మూణ్ణెలకు ఒక్కపారి లెటర్ రాపిచ్చేటోడు బిడ్డా..’ అని నానమ్మ చెప్పిన మాట గుర్తుగురాగానే టేప్‌రికార్డర్ మంచం మీద పెట్టి.. మంచం కింద ఉన్న సందుగ బయటకు లాగి..ఆ పెట్టెను తెరిచింది. అందులోంచి రంగు మారిన రెండు మూడు ఉత్తరాలు, ఒక క్యాసెట్‌ను తీసుకుంది. అలాగే మంచం మీద కూర్చుని క్యాసెట్‌ను ఒళ్లో పెట్టుకొని.. ఒక ఉత్తరం మడత విప్పింది. ఆ మడతలోంచి మరో కాగితం మడత ఆమె ఒళ్లో పడింది. ముందు ఆ కాగితం తీసింది. అది తన బాపమ్మ .. తాతకు రాయించి.. ఎవరిచేతనో దుబాయ్‌కు పంపించాలని పెట్టిన ఉత్తరం. వెళ్లేవాళ్లు లేక అది అలాగే ఉండిపోయింది. చిన్నత్తమ్మ పెద్దమనిషి అయినప్పుడు ఆ సంగతి తాతకు చెప్పేతందుకు రాపిచ్చింది. అప్పటికే పెద్దత్త పెద్దమనిషై మూడేండ్లయిందట.. ఆ పిల్లనే పెండ్లికాక ఇంటిమీదున్నది.. ఇక షిన్నపిల్ల కూడా అయిందని ఊర్లె తెలిస్తే ఇకారం అని ఆ సంగతి ఎవ్వరికీ తెల్వనియ్యద్దని.. ఇంట్లదింట్లనే ఫలహారాలు చేస్కుంటమని తాతకు జెప్తూ రాయించిన ఉత్తరం. అది చదువుకొని నవ్వుకుంది ఆమె. ఆ ఉత్తరం రాసిన మనిషి అప్పటి సర్పంచ్. ఇంటికి వొయ్యి ఆ సంగతి ఆయన తన భార్యకు చెప్తే. ఆమె ఊరంతా చెప్పిందట.. లాస్ట్కొస్తే చిన్నత్తమ్మ ఫంక్షన్‌కి రెండు యాటలు తెగినయట. ఇది చెప్పుకుంట బాపు మస్తు నవ్వెటోడు. ‘బాపు’ అనుకోగానే తన ఒళ్లో ఉన్న క్యాసెట్ గుర్తొచ్చింది. గబగబా దాన్ని టేప్రికార్డ్లో పెట్టి ‘ప్లే’ నొక్కింది. గుర్ మంటూ సన్నగా శబ్దం చేస్తూ తిరగడం మొదలుపెట్టింది అది. ‘అయిదు అంతస్తుల మీద కెంచి వడ్డ. గట్లెట్లవడ్డనో అర్థమయితలేదు బిడ్డా... ఎప్పట్లెక్కనే మస్కున్నే వోయిన పనికాడికి. హుషార్గనే ఉన్నా.. పదకొండు గొట్టింటుంది బిడ్డా టైమ్.. ఎండ పాడైపోను.. మస్తుగెల్లింది’ నీరసంగా ఉంది ఆ గొంతు. ‘ఆ ఎండకో.. మరేంటికో తెల్వదు బిడ్డా.. ఒక్కపారిగా చెక్కరచ్చినట్టయింది.. గంతే ఏమైందో తెల్వదు.. తెల్వికొచ్చేపరికల్లా.. దవాఖాన్లున్న. నడుము బొక్క ఇర్గిందంట్రు బిడ్డా...నడ్సుడు బందేనట నేను. సచ్చేదాక గిట్ల మంచంలనే అంటున్రు..’ మూలుగుతూ సాగుతోంది ఆ స్వరం. ‘మల్ల మిమ్లను జూస్తనన్న ఆశైతే లేదు. నువ్వు మంచిగ సదువుకో బిడ్డా.. టీచర్ గావాలే. మీ తాత తర్వాత మనూర్లెకించి మళ్లా అవుటాఫ్కచ్చింది నేనే. గట్ల నువ్వు కూడా ఫస్టుండాలే బిడ్డా. మనూరి ఆడివిల్లల్లందరి కంటే బగ్గ సదుకోవాలే నువ్వు. టీచర్‌వి కావాల్రా బిడ్డా.. అమ్మను, అన్నను సూత నువ్వే జూసుకోవాల...’ ఇక వినలేక స్టాప్ బటన్ నొక్కేసింది. దుఃఖం ఆగట్లేదు. ఆ టేప్రికార్డ్ను హత్తుకొని ఏడుస్తోంది. ఆ గది గుమ్మం దగ్గరుండి అంతా విన్న సంహిత.. తల్లి దగ్గరకు పరిగెత్తుకొచ్చి ఆమెను వాటేసుకుంది. ‘తాత భయపడ్డట్టుగానే అమ్మవాళ్లను అతను చూడలేదు మళ్లీ. మస్కట్లోనే ప్రాణాలు వదిలాడు. తాత ఫైనల్ రిచ్యువల్స్ కూడా ఇండియాలో జరగలేదు. కాని అమ్మ.. గ్రేట్. తాత విష్ను ఫుల్‌ఫిల్ చేసింది. టీచర్ కాదు.. ప్రొఫెసర్ అయింది. వాళ్ల ఊరి నుంచి లండన్ వచ్చిన ఫస్ట్ పర్సన్... అమ్మ. మా అమ్మ’ అనుకుంటూ తల్లిని మరింతగా కరుచుకుపోయింది ఆ పిల్ల. -
ఆ రాత్రే కాదు.. అయిదు నెలలుగా లేడు
ఒళ్లో బిడ్డను ఎవరో తీసుకుంటున్నట్టనిపిస్తే అదిరిపడి కళ్లు తెరిచింది పద్మ. పక్కసీట్లోని ఆవిడ చేతుల్లో ఉంది బిడ్డ. గుక్కపట్టి ఏడుస్తోంది. చీరచెంగుతో మొహం తుడుచుకొని నిద్రమత్తు వదిలించుకుంటూ బిడ్డను తీసుకుంది పద్మ. ‘నాయమ్మ కదా.. ’ అంటూ భుజాల మీదుగా పమిటను లాక్కుని కిటికీ వైపు కాస్త ఓరగా తిరిగి బిడ్డకు పాలు పట్టడం మొదలుపెట్టింది. పాప పాలు తాగుతూంటే పిల్ల తల నిమురుతూ కిటికీలోంచి మేఘాలను పరికిస్తోంది పద్మ. ఏదో ఆలోచిస్తూన్నట్టున్న పద్మనే చూస్తోంది పక్కసీటావిడ. పద్మ కాస్త ఇటు తిరుగుతే ఆమెతో మాట కలపాలని. నిజం చెప్పొద్దూ.. పద్మ ఒళ్లో బొద్దుగా మెరిసిపోతున్న ఆ బిడ్డ భలే నచ్చింది ఆవిడకు, పక్కనే ఉన్న ఆమె భర్తకు కూడా.. కాసేపు ఎత్తుకొని ఆడించాలని.. ముద్దు చేయాలనీ ఉంది ఆ జంటకు. అందుకే పద్మతో మాట కలపాలని ఆరాటపడుతోంది ఆమె. పాప పొట్ట నిండినట్టుంది.. కబుర్లు మొదలుపెట్టింది .. ఊ.. ఉక్కు.. అంటూ! పమిట చెంగుతో బిడ్డ మూతి తుడిచి లేపి తన ఒళ్లో నిలబెట్టుకుంది పద్మ. పక్క సీటులో ఉన్న ఆవిడను చూసి చేతులేస్తోంది పాప. ఆవిడ భర్త చిన్నగా విజిల్ వేస్తే పాపను మచ్చిక చేసుకోచూస్తున్నాడు. ‘ఎన్ని నెలలు?’ అడిగింది ఆవిడ.. పాప చెయ్యి పట్టుకొని ముద్దాడుతూ. ‘అయిదు’ పాప జుట్టు సవరిస్తూ పద్మ. అంతే ఆ సమాధానానికే చనువు తెచ్చుకొని పాపను తీసుకుంది ఆవిడ. ఆమె,ఆవిడ భర్త పాపతో ఆటల్లో పడిపోయారు. విమానం హైదరాబాద్ దిశగా పోతోంది.. పద్మ మనసు వెనక్కి కువైట్‌కి మళ్లింది. యాక్సిడెంట్లో భర్త పోయాక ఉపాధి కోసం బెంగుళూరుకు పోయింది. ఇళ్లల్లో పని వెదుక్కుంది. అక్కడున్నప్పుడే కువైట్‌లో పనిచేసే వనిత పరిచయమైంది. ‘ఇక్కడెంత చేసినా అంతంత మాత్రమే సంపాదన. ఇదే పని కువైట్‌లో చేస్తే నీ పిల్లల బతుకన్నా బాగుపడ్తది. ఖఫీల్ ఇళ్లల్లో పనుంది నువ్వు చేస్తానంటే’ అన్నది. కువైట్‌కు తీసుకెళ్లింది. తన గదిలోనే పెట్టుకుంది. వనిత చెప్పినట్టు సంపాదన పర్వాలేదు. ఇంటికి దండిగానే పంపింది. అంతా బాగుంది.. అప్పుడే కనపడ్డాడు మహీంద్ర గుణసింఘే. తాము ఉండే కాంప్లెక్స్‌లోనే.. తమకెదురుగా ఉన్న గదిలో. ముందు చూపులతో వెంటాడాడు స్నేహంగా. తర్వాత మాటలు కలిపాడు ఆప్యాయంగా! దగ్గరయ్యాడు ప్రేమగా! పాప కెవ్వుమనే సరికి ఉలిక్కిపడి చూసింది. పక్కసీట్లోని ఆవిడ దగ్గర నుంచి తల్లి దగ్గరకు రావడానికి .. తల్లి దృష్టిని ఆకర్షించడానికి అరుస్తోంది చంటిది. అయినా పసిదాన్ని సముదాయిస్తూ తన ఒళ్లోనే ఉంచుకోవడానికి ప్రయత్నిస్తోంది ఆవిడ. పిల్ల ఉండట్లేదు. కాళ్లతో తన్ని పైపైకి లేస్తోంది. ‘బుజ్జి.. చిట్టి... ’ అంటూ పాపను దృష్టి మరల్చచూస్తోంది ఆవిడ. ఆమె ప్రయత్నాలను చూస్తూంటే పాపమనిపించింది పద్మకు. పాపను తన ఒళ్లోకి తీసుకుంటూ ‘మీ పిల్లలు పెద్దవాళ్లా?’ అడిగింది ఆమెను. ఏమీ చెప్పకుండా మౌనంగా ఉందామె. ‘మీతో వచ్చినారా?’ మళ్లీ అడిగింది పిల్లకు పాలిస్తూ పద్మ. ‘నాకు పిల్లల్లేరు’అంటూ సీట్ పౌచ్‌లో ఉన్న మ్యాగజైన్ తీసి తెరిచింది. ఇంకే వివరం చెప్పడానికి సుముఖంగాలేనట్టు. నొచ్చుకుంది పద్మ. తన పైటను గట్టిగా పట్టుకొని పాలు తాగుతున్న బిడ్డకేసి చూసుకుంది. బుగ్గలు కదిలినప్పుడల్లా కుడి బుగ్గ మీద సొట్ట.. అచ్చం అతని లాగే. భగభగమండింది మనసు. ‘ఎందుకు భయపడుతున్నావ్? నేనున్నాను కదా’ అంటూ చేయి పట్టుకున్నాడు అతను. ‘మహీ..నాకు ఇద్దరు పిల్లలు అక్కడ. ఇప్పుడు ఈ బిడ్డనూ కని ఎట్లా సాకేది? ఊళ్లో వాళ్లకు ఏమి చెప్పేది?’భయంగా అడిగింది. ‘నీ దేశంలో చెప్పాల్సిన అవసరం లేదు.. నా దేశంలో చెప్పాల్సిన అవసరమూ లేదు.. మన బిడ్డ మన దేశంలో మన దగ్గర హాయిగా ఉంటది’ అన్నాడు ఆమె చుబుకం పట్టి దగ్గరకు తీసుకుంటూ. ఏడుస్తూ అతణ్ణి అతుక్కు పోయింది. ‘పిచ్చిపద్మా.. బిడ్డను ఒదులుకుంటానని ఎట్లా అనుకున్నావ్? మన వాళ్లకి కావల్సింది డబ్బులు. పంపిస్తూనే ఉన్నాం. తర్వాత కూడా పంపిస్తాం. ఎప్పుడో ఒకసారి కలిసొస్తాం. నేను వెళ్లినప్పుడు బిడ్డ నీతో ఉంటుంది. నువ్వు వెళ్లినప్పుడు నాతో ఉంటుంది. ఇక్కడే చదివిద్దాం. అవన్నిటికీ ఇంకా చాలా టైమ్ ఉందిలే.. అప్పుడు చూద్దాం.. ఇప్పుడైతే ప్రశాంతంగా ఉండు’ అని ఆమెను హత్తుకున్నాడు భరోసాగా. ఆరునెలల గర్భవతిగా.. ఉన్నప్పుడే పనిమాన్పించాడు రెస్ట్ తీసుకో అని. అంతా తనే చూసుకున్నాడు. వనిత స్నేహితురాలు ఒకామె నర్స్. ఆమెనే డెలివరీ చేసింది తాముంటున్న గదిలోనే. ఆ టైమ్‌లో హోటల్లో డ్యూటీలో ఉన్నాడు అతను. ‘మహీంద్రా.. కూతురు పుట్టింది’ అతనికి ఫోన్ చేసి చెప్పింది వనిత. ఆ రాత్రి ఆత్రంగా ఎదురు చూసింది పద్మ అతని కోసం. ఆ రాత్రే కాదు అయిదు నెలలుగా లేడు. అతని జాడ కోసం తాను చేయగలిగిన అన్ని ప్రయత్నాల తర్వాత అర్థమైన సత్యం.. మోసపోయానని. ఈ విషాదంలో కనిపించిన ఆశ.. ఆమ్నెస్టీ. నిజానికి ఇండియాకు రావాలని లేదు. కాని కువైట్‌లో ఈ బిడ్డ ఏ జాతీ లేని అనాథ అవుతుంది. ఇండియాలో అనాథాశ్రమంలో వదిలినా ఆ దేశం పిల్లగానైనా పెరుగుతుంది. దుఃఖం ముంచుకొచ్చింది పద్మకు. ఏడుపును దిగమింగుకోడానికి బిడ్డ చిట్టిపిడికిలి పట్టుకొని నోటికి అదుముకుంటోంది. పక్కాసీటావిడ కంటపడింది. ‘ఆ.. పద్మా.. అంతాబాగేనా?’ ఫోన్లో వనిత. ‘ఊ...’ ముక్తసరిగా పద్మ. ‘పాప.. ’ వనిత. అప్పుడు కట్టలు తెచ్చుకుంది పద్మ దుఃఖం. ‘పాపను ఇచ్చేశాను’ చెప్పింది. ‘ఇచ్చేశావా? ఎవరికి?’ విస్తుపోతూ వనిత. ‘విమానంలో పరిచయమయ్యారు భార్యభర్తలు. హైదరాబాద్‌లో ఉంటారట. పిల్లల్లేరు. వాళ్ల ఒళ్లో పెట్టేశాను’ ఏడుస్తూనే పద్మ. ‘వాళ్ల గురించి ఏమైనా తెలుసుకున్నావా లేదా? వాళ్లు ఏం చేస్తుంటారు పిల్లా..’ వంటి ప్రశ్నలు అడుగుతూనే ఉంది వనిత. ఇవతల ఏడుస్తూనే ఉంది పద్మ. - సరస్వతి రమ -
థూ... ఏం బతుకురా నీది?
‘ఏమైంది? అస్తున్నవా?’ ఆత్రంగా అడిగింది లక్ష్మి భర్తను. ‘ఏంగాలె.. ఏడున్నదో ఆడ్నే ఉన్నది. అచ్చుడు కాదే..’ బాధగా చెప్పాడు సత్యం. ‘ఎట్ల మరి?’ కంగారుగా లక్ష్మి. ‘ఏం జెయ్యాలే చెప్పు? ఏదో తిప్పలు వడి అచ్చెటట్టు చూస్తగని.. ఎట్లున్నడు బాపు?’ ఆందోళనతో సత్యం. ‘ఇయ్యాల్నో .. రేపో అన్నట్టున్నడు...’ నెమ్మదిగా లక్ష్మి. దీర్ఘంగా శ్వాస తీసుకొని ‘అవ్వ...?’అడిగాడు. ‘నిన్నే యాదిచేస్తుంది.. ఎప్పుడొస్తవని..’ పొడిపొడిగానే చప్పింది లక్ష్మి. ఏమీ మాట్లాడలేదు సత్యం.. ఫోన్ డిస్కనెక్ట్ చేశాడు. చావుబతుకుల్లో ఉన్న తండ్రిని కూడా చూసుకోలేకపోతున్నాడు.. ‘థూ... ఏం బతుకురా నీది? బాపు, అవ్వను ఎన్నడన్నా పట్టిచ్చుకున్నవా? ఒక్కడే కొడుకని.. చెల్లెండ్లను కూడా కాదని మంచి తిండి, మంచి బట్టలు.. కష్టం ఏందో తెల్వకుండా పెంచిండ్రు.. ఇంటికి పెద్దోడివై ఏం జేషినవ్రా? నీ బతుకుల మన్నువడ. చెల్లెండ్ల పెండ్లికి పైస ఇచ్చినవా? ఉన్న పొలమన్నా అమ్మి పెండ్లి జేద్దామని చూసినా.. ఆ పొలమెన్నడో అమ్ముకొని ఆ పైసలతో మట్క (జూదం లాంటిది) ఆడి.. ఉల్టా అప్పువెట్టినవ్. ఆనాడే బాపు గుండెపగిలి సావాలే.. అయినా ఒక్క మాట అనకుండా.. తనే చెల్లెండ్ల పెండ్లి జేసిండు. ఎప్పుడూ నువ్వెట్ల బతుకుతవనే రందివడ్డడు గాని ఆయన పానం గురించి ఆలోచించుకున్నడ? నీ పెండ్లాం, కొడుకుని సాకుడు కూడా చేతగాకపాయే. బాపుతోపాటు సమానంగా పెండ్లాం కష్టవడ్డది.. ఇంటి కోసం. కొడుకు వయసోడైనంక గప్పుడు బుద్ధి దెచ్చుకొని.. దుబాయ్ దారి వడ్తివి. దానికీ అప్పు పుట్టింది బాపు మొహం, మల్ల మాట్లాడ్తే పెండ్లాం మొహం జూసే కదరా? ఏం పుట్టుకరా? అవును గిట్లనే ఏం పుట్టుకరా.. రాజా పుట్టుక నీది అని అవ్వ, బాపు, దోస్తులు అనీ అనీ గిట్ల జేసిండ్రు లాస్ట్కొస్తే..’ మనసులో తిట్టుకున్నాడు. వేదన కన్నీటి రూపంలో కళ్లలోకి ఉప్పొంగుతుండగా.. ఫోన్ రింగ్ అయింది! చూశాడు.. నీళ్లూరిన కళ్లు చూపును మసకబారుస్తున్నా.. స్పష్టంగా కనిపించింది నంబర్.. తన భార్య చేసింది. వణుకుతున్న చేతులతోనే లిఫ్ట్ చేశాడు. అవతలి వైపు మాట విని గోడకు చేరగిలపడ్డాడు. అయిపోయింది.. అంతా అయిపోయింది. ఇంకా తనను తన భుజమ్మీద నుంచి దింపని తండ్రి.. పోయాడు. ఆఖరి చూపు కూడా చూడని దౌర్భాగ్యానికి కుమిలిపోయాడు. ‘ఒరేయ్ ఏం బుట్టిందిరా నీకు? మంచిగ.. కంపెనీ వీసా దొరికింది.. కష్టమో నష్టమో పనిచేసుకుంటే అయిపోయేది కదరా? పనికి ఎక్కువైతుంది.. జీతం తక్కువైతుందని.. అచ్చిన ఆర్నెల్లకే కంపెనీ ఇడిసిపెట్టి పొయ్యి ఖలివెల్లి అయితివి. నీ యవ్వ.. నువ్వు జేస్తున్న పనికి జీతం తక్కువైందా? ఎన్నడు కష్టపడ్డవని పని ఇలువ తెలిసె నీకు? ఇప్పుడు ఏమాయే? బాపును చూసుకునే దిక్కు కూడా లేకపాయే. అదే కంపెన్లనే ఉంటే బతిమాలితెనో.. కాళ్లు వట్టుకుంటెనో.. అరబ్ సేuŠ‡ పంపుతుండే కావచ్చు.. ఏడు.. ఈడ్నే ఏడ్సుకుంట సావు’ తన దురదృష్టానికి తానే శాపనార్థాలు పెట్టుకున్నాడు సత్యం. ‘ఏందవ్వా... అస్తున్నడా సత్యం?’ వాడకట్టు పెద్ద అడిగాడు. రావట్లేదన్నట్టు తలూపింది లక్ష్మి. ‘మరి నీ కొడుకు అగ్గి వడ్తడా తాతకు?’ అడిగాడు లక్ష్మి ఆడపడచు మామ. ‘పొల్లగాడికి మస్కట్ వీసా అచ్చేటట్టున్నదట గీ రెండు మూడు దినాలల్లనే. అగ్గి వడితే ఊరు దాటొద్దు కదా.. దినాలు అయ్యేదాంక’ అన్నాడు సత్యం బావమరిది. ‘మరెట్లనయ్యా? కొడుకు రాకపోయే.. మనవడు వెట్టకపాయే.. ముసలోడి పానం ఇంటి సుట్టే తిరగాల్నా ఏందీ?’ గట్టిగా మాట్లాడాడు లక్ష్మి ఆడపడచు మామ. ‘లే.. నేను వడ్తా’ అన్నది లక్ష్మి స్థిరంగా. ఆ జవాబుతో అందరూ షాక్ తిన్నట్టుగా చూశారు. ‘అవ్.. షిన్నబాపు. మా మామకు అగ్గి నేను వడ్తా..’ మళ్లి అంతే స్థిరమైన స్వరంతో లక్ష్మి. ‘ఆ .. బాపూ... ఇప్పుడే అగ్గివెట్టింది అమ్మ’ ఫోన్లో చెప్పాడు సత్యం కొడుకు. ఆ మాట వినగానే తన రూమ్మేట్స్ని పట్టుకొని ఏడ్చేశాడు సత్యం. అతనిని ఆపడం అక్కడున్న ఆ నలుగురి తరమూ కాలేదు. ‘ఊకో.. సత్యం.. పోయినోడు రాడు కదా.. గిప్పుడు చేయాల్సినవి చేద్దాం..’ అని సముదాయించారు దోస్తులు. ‘గీడికి రా సత్యం.. ’అంటూ పిలిచాడు ఆ నలుగురిలో క్షురక వృత్తికి చెందిన ఒక దోస్తు. ఏడ్చుకుంటూనే వెళ్లి అతని ముందు కూర్చున్నాడు సత్యం. ఊర్లో తండ్రి చితి ఆరిపోయేలోపు సత్యం గుండు చేయించుకున్నాడు. తర్వాత చేయాల్సిన కార్యక్రమాలనూ తన గదిలోనే చేశాడు. సెల్ఫోన్లో ఉన్న తండ్రి ఫొటోను ప్రింట్ తీయించి.. గదిలో పెట్టి.. నివాళులర్పించాడు. పదోరోజు తండ్రికి ఇష్టమైన వంటకాలను వండాడు. అతని రూమ్మేట్స్ మందు తెచ్చి .. స్నేహితుడి ‘కడుపు చల్ల (తెలంగాణలో చావు విందులో ఈ ప్రక్రియ ఒక భాగం) చేశారు. ఆరోజు రాత్రి.. తండ్రి జ్ఞాపకాలతో జాగారమే అయింది సత్యానికి. ‘ఎంత పాపం చేశాడు? బతికున్నప్పుడు ఏనాడూ అతని కష్టం అర్థంచేసుకోలేదు. అర్థమయ్యే నాటికి మనిషే లేకుండావాయే! గిప్పుడు.. గీడ.. దేశం కాని దేశంలో ..గిదేం కర్మ? గుండు కొట్టించుకుంటే ఏమొస్తది? పిట్టకు పెడితే ఏమొస్తది? గివన్నీ సూడొస్తడా బాపు? అసలు తెలుస్తదా ఆయనకు? ఒరేయ్.. పోయినోల్లకు చేసుడు కాదురా.. గిప్పుడన్నా బుద్ధి తెచ్చుకొని ఉన్న అవ్వనన్నా మంచిగ చూసుకో. తిన్నవా? పన్నవా? పానం బాగుందా ? అని అర్సుకో. సంపాదించిందాంట్లేకెంచి అవ్వకోసమని ఇంత పక్కన వెట్టు’ అని సత్యం సత్యానికి చెప్పుకుంటున్నాడు. అతని ప్రవర్తనకు విస్తుపోయిన దోస్తులు ‘సత్యం..’ అంటూ అతని భుజం తట్టారు ‘ఏమైందిరా’ అన్నట్టు. సత్యానికి వాళ్లు కనిపించట్లేదు.. వాళ్ల మాట వినిపించట్లేదు. తనకు తానే కనిపిస్తున్నాడు.. వినిపిస్తున్నాడు. - సరస్వతి రమ -
పండగ ప్రయాణం
‘‘ఆకలేయట్లేదు.. నిద్రపట్టట్లేదు.. అసలు ఏ పనీ చేయబుద్ధవడం లేదు తెల్సా?’’ ఛాతీకి ఆనించుకున్న హ్యాండ్‌బ్యాగ్‌ను రెండు చేతుల మధ్య మరింత భద్రంగా బంధిస్తూ... సంతోషంతో తాదాత్మ్యం చెందుతూ చెప్పింది శ్యామల. ‘‘ఊ... ఇదిగో’’ అంటూ డ్రై ఫ్రూట్స్ ప్యాక్‌లోంచి ఖర్జూరం తీసి శ్యామలకు ఇచ్చింది దీవెన. బర్‌దుబాయ్‌లోని షాపింగ్ ఏరియాలో తీరిగ్గా నడుచుకుంటూ వెళ్తున్నారిద్దరూ! ‘‘దీవెనా... నాలుగేళ్ల తర్వాత ఊరెళ్తున్నాను.. నిజంగా చాలా హ్యాపీగా ఉంది’’ ఖర్జూరాన్ని తుడుచుకొని తింటూ చెప్పింది శ్యామల. ‘‘ఇక్కడికొచ్చాక మీ ఊరు వెళ్లడం ఇదే ఫస్ట్ టైమా?’’ తనూ ఒక ఖర్జూరాన్ని నోట్లో వేసుకుంటూ అడిగింది దీవెన. ‘‘మరి..? నాలుగు నెలల నా కొడుకును వదిలేసి వచ్చా!’’ గొంతుకు బాధ అడ్డంపడుతుండగా చెప్పింది శ్యామల. ఆమె కళ్లల్లో నిండిన నీళ్లను చూసి ఆప్యాయంగా శ్యామల చేయి నొక్కింది దీవెన. ఈ ఇద్దరికీ ఈ మధ్యే స్నేహం కుదిరింది. శ్యామలది తూర్పుగోదావరి, దీవెనది పశ్చిమ గోదావరి. తండ్రి లేడు. తల్లి చర్చిలో పనిచేస్తోంది. ఇద్దరు చెల్లెళ్లు, ఒక తమ్ముడు. టెన్త్ వరకూ చదువుకుంది. బాధ్యతల బరువు మోయడానికి మేనమామ సహాయంతో ఈ మధ్యే దుబాయ్‌కి వచ్చింది డొమెస్టిక్ వర్కర్‌గా. శ్యామలకు రూమ్మేట్గా చేరింది. ఇక్కడి వాతావరణం, పరిస్థితుల గురించి చెప్పి దీవెనలో ధైర్యం నింపింది శ్యామలే. అయినా తన కుటుంబ విషయాలెప్పుడూ దీవెనతో పంచుకోలేదు ఆమె. ఇంటికి ఫోన్ చేయాలనుకున్నప్పుడు కూడా సందులాంటి బాల్కనీలో నిలబడే మాట్లాడేది చిన్నగా. ఫోన్ సంభాషణ తర్వాత ప్రతిసారీ దిగులుతోనే నిద్రపోయేది. ఆ విషయాన్ని చాలాసార్లు గమనించినా గమనించనట్టే ఉండేది దీవెన. ఇప్పుడు.. సంక్రాంతికి ఊరెళ్లడానికి ఆమె యజమాని సెలవు ఇచ్చిన సంబంరంలో మొదటిసారి తన కుటుంబం గురించి చెప్తోంది శ్యామల. ‘‘నేను ఇక్కడికి వచ్చేరోజు.. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో పాలు తాగుతున్నవాడిని నా నుంచి బలవంతంగా విడిపించి నన్ను లోపలికి పంపాడు మా ఆయన. ఆ రోజు వాడు నా వైపు చేతులు చాస్తూ గుక్కపెట్టి ఏడ్చిన ఏడుపును జీవితంలో మరిచిపోలేను. ఈ నాలుగేళ్లలో ఏ రోజూ ప్రశాంతంగా నిద్రపోలేదు తెల్సా?’’ ఎంత దాచుకుందామనుకున్నా శ్యామలకు దుఃఖం ఆగట్లేదు. ‘‘శ్యామలా... ’’అంటూ అనునయించే ప్రయత్నం చేసింది దీవెన. గబగబ బ్యాగ్‌లోంచి మంచినీళ్ల సీసా తీసి ఇచ్చింది. ఆ బాటిల్ పట్టుకొని పక్కనే సిమెంట్ చప్టా మీద చతికిలిపడింది శ్యామల. పక్కనే దీవెనా కూర్చుంది. శుక్రవారం కావడం మూలాన.. ఆ షాపింగ్ ఏరియాలో అంతా ఇండియన్సే ఉన్నారు. జంటలు.. మగవాళ్ల గుంపులు.. ఆడవాళ్ల గుంపులు.. ఎక్కడ చూసినా! వీళ్లు కూర్చున్న ప్రదేశానికి దగ్గర్లో తెలుగు అమ్మాయిలు, మలయాళం అమ్మాయిలూ షాపింగ్ చేసుకుంటున్నారు. ‘‘ప్రతి శుక్రవారం ఇక్కడ పండగే’’ ఆ సందడిని చూస్తూ అంది దీవెన.. శ్యామలను తేలికపర్చడానికి. తనూ ఎదురుగా ఉన్న దుకాణాల మీద దృష్టిపెడుతూ . ‘‘ఇక్కడిక వచ్చిన కొత్తలో ఎంత ఇబ్బందిపడ్డానో! బాబును వదిలి ఉండలేకపోయా. షేక్ ఇంట్లో ఏ చిన్న పిల్ల ఏడ్పు వినపడ్డా నా కొడుకే గుర్తొచ్చేవాడు. పాల సలపరం భరించలేక ఒకసారి దొంగతనంగా.. షేక్ మూడో భార్య బిడ్డకు పాలిచ్చా. ఎక్కడి నుంచి చూసిందో ఏమో.. మహాతల్లి.. నా బిడ్డకు పాలిస్తావా? అంటూ వాతలు తేలేలా కొట్టింది. ఆ రోజు ఇక్కడి నుంచి పారిపోవాలని ట్రై చేశా! పాస్‌పోర్ట్ లేకుండా బయట దొరికితే జైల్లో కూర్చోబెడ్తారని డ్రైవర్ రాజు ఉన్నాడే.. అతను భయపెట్టాడు. ఆ రాత్రి మా ఆయనకు ఫోన్ చేసి ఏడ్చా! అయినా ఆయన కరగలేదు. బాబు ఎలా ఉన్నాడని అడిగినప్పుడల్లా ఆయనకున్న అప్పు గురించి ఏకరువు పెట్టేవాడు. ఇక్కడే ఉండక తప్పదని అర్థమైంది. అలవాటూ అయింది’’ అని నిట్టూరుస్తూ మంచి నీళ్లు తాగింది శ్యామల. గటగటా నీళ్లు తాగుతుంటే ఆమెనలా చూస్తూండిపోయింది దీవెన. ఒకచేత్తో నీళ్ల బాటిల్ దీవెనకు ఇస్తూ.. ఇంకో చేత్తో చుబుకం కింద నుంచి కంఠం వరకు కారిన నీళ్లను చున్నీతో తుడుచుకుంది శ్యామల. ‘‘అసలు ఎందుకొచ్చావ్ ఇక్కడికి?’’ శ్యామల కళ్లల్లోకి చూస్తూ దీవెన. ‘‘నా మొగుడికి ఏ పనీ చేతకాక. అప్పులపాలై ఉమ్మడిగా ఉన్న ఇంటినీ తాకట్టు పెట్టాడు. వాళ్ల అన్నదమ్ములకు తెలిసి గొడవై కొట్టుకున్నారు. పోలీస్ కేసైంది. అప్పుడు నేను నెల బాలింతను. ఒమన్‌లో ఉండే మా ఆయన పిన్ని కూతురే మా ఆయనకు సలహా ఇచ్చింది నన్ను ఇక్కడికి పంపమని. ఇప్పుడు వెళితే రానిక’’ చివరి మాటను కసిగా, స్థిరంగా పలికింది శ్యామల. ‘‘సర్లే ఇన్నాళ్లకు నీ కొడుకును చూసుకోబోతున్నావ్. హాయిగా షాపింగ్ చేసుకో.. వాడికేమేం కావాలో కొనుక్కో. ఇంక ఆ పాతవాటిని గుర్తుచేసుకోకు. రా వెళదాం’’ అంటూ శ్యామలను ఉత్సాహపరుస్తూ సిమెంట్ చప్టా మీద నుంచి లేపింది దీవెన. పిల్లాడికి చాక్లెట్లు, స్కూల్ బ్యాగ్, ఖర్జూరాల ప్యాకెట్లు, డిజిటల్ వాచీ, చిన్న పిల్లల చలువ కళ్లద్దాలు, నడిస్తే సౌండ్ వచ్చే షూ.. అంటూ తనకు నచ్చినవన్నీ కొని అలిసిపోయి సాయంకాలానికి రూమ్‌కి చేరారు. చేరీచేరంగానే.. వాటన్నిటినీ గబగబా బ్యాగులో సర్దేయడం మొదలుపెట్టింది శ్యామల. ఆమె ఆత్రం చూస్తుంటే ముచ్చటేసింది దీవెనకు. ‘‘తర్వాత సర్దుకోవచ్చు కదా.. కాసేపు రెస్ట్ తీసుకో’’ అంది నేల మీద పరిచి ఉన్న పరుపు మీద వాలిపోతూ దీవెన. ‘‘మళ్లీ మర్చిపోతా.. ఇప్పుడే సర్దుకోవడం బెటర్’’ అని శ్యామల చెప్తూండగానే ఆమె సెల్ మోగింది. బాల్కనీలోకి వెళ్లకుండా అక్కడే లిఫ్ట్ చేసింది. అవతల మాటలతో ఆమె మొహం వివర్ణమవుతోంది. కంగారు పడింది దీవెన. ఫోన్ కట్‌చేసి పరుపు మీద కూలబడింది శ్యామల. ‘‘ఏమైంది?’’ అని దీవెన అడగబోతుండగానే..ఏదో గుర్తొచ్చిన దానిలా శ్యామల ఫోన్ కలిపింది. ‘‘అమ్మా..నన్ను రావద్దని ఏదో కథచెప్తున్నాడేంటి మా ఆయన?’’ కోపంతో శ్యామల. ‘‘ఏం చెప్పమంటావ్.. నువ్వెళ్లిన యేడాదే ఎవరితోనే కాపురం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఆవిడకు నెలలు నిండాయట..’’ అంటూ ఇంకేదో చెప్తోంది అవతలి స్వరం. స్థాణువై పోయిన శ్యామల చేతిలోంచి ఫోన్ జారిపోయింది. -
ఒక్కపొద్దు
ఏ.. తియ్.. ముసలోడిలెక్క గురువారం ఒక్కపొద్దు.. ఏంది? ‘‘రాజేష్.. నీ వంతు పైసలు రాలే’’ డబ్బులు లెక్కచూసుకుంటూ అడిగాడు శ్రీధర్. ‘‘ఇస్తా.. మొదలువెట్టిండ్రా’’ ఒకచేత్తో అద్దం పట్టుకొని ఇంకో చేత్తో తల దువ్వుకుంటూ అన్నాడు రాజేష్. ‘‘ఆ.. అందరూ రెడీ అయిపోయిండ్రు’’ రాజేష్ వైపు చేయిచాపుతూ శ్రీధర్. అద్దం, దువ్వెన బంకర్ బెడ్ కింద ఉన్న బ్యాగ్‌లో పెట్టేసి ..జేబులోంచి దిర్హమ్స్ తీసి శ్రీధర్ చేతిలో పెట్టాడు. లెక్కపెట్టుకొని శ్రీధర్ వెళ్లబోతుంటే.. ‘‘దావత్ ఎక్కడ?’’ అడిగాడు రాజేష్. ‘‘మన రూమ్ల్నే’’ అని చెప్పి గబగబా గదిదాటి ఏదో గుర్తొచ్చినవాడిలా మళ్లీ వెనక్కి వచ్చి ‘‘రాజేష్.. కొంచెం రూమ్ సగవెట్టవా?’’ అంటూ తన బెడ్ మీదున్న టవెల్, లుంగీ, బనీను తీసి గబుకున్న బెడ్ కిందకు తోసి అంతే వేగంగా వెళ్లిపోయాడు శ్రీధర్. ఆ హడావిడి చూసి ‘‘హూ.. ’’అని నిట్టూరుస్తూ గది సర్దే పనిలోపడ్డాడు రాజేష్... ‘‘ఒక్క గురువారం దావత్ చేసుకోకపోతే ఏమైతదో? ఒకదిక్కు పైసలు సగవడక పరేషాన్ అవుకుంటనే ఇంకోదిక్కు దావత్‌లు.. ఏందోఏమో ఈళ్ల కథలు? ఈ శ్రీధర్‌కి చెప్పాలే.. పైసలు కాపాయం చేసుకోమ్మని. మొన్ననే ఆళ్ల అయ్యకు గుండె ఆపరేషన్ చేయించిండు. తమ్ముడ్ని హైదరాబాద్‌ల సదివిస్తుండు. బొంబైల చెల్లె ఉంటది. ఆ బావగాడు పెద్ద ఫాల్తుగాడు. ఈడ కష్టపడి పనిజేస్కుంట శ్రీధర్ .. ఊర్లె రెండకెరాల పొలం కొనుక్కున్నడు. కరెక్టుగా రిజిస్ట్రేషన్ రేపనంగా గద్దలెక్క అచ్చిండు పెండ్లాంను తోల్కొని బావగాడు. ‘‘బిజినెస్‌ల లాస్ అచ్చింది. అప్పులోల్లు ఇంటిమీదికి అస్తుండ్రు.. పురుగుల మందే గతి’’ అనుకుంట. పాపం జేస్తడు శ్రీధర్? అయింత పొలం క్యాన్సల్ జేసుకొని ఆ పైసలు బావ చేతిల పోషిండు’’అని శ్రీధర్ కష్టాలు తలుచుకుంటూ! ‘‘రాజేష్.. నాలుగు గ్లాసులే పెట్టినవేంది? నీదేది?’’ అడిగాడు మల్లేష్.. ఫిష్ పీస్‌ను నోట్లోవేసుకొని గ్లాసుల్లో మందు పోస్తూ! ‘‘నాకు గురువారం ఒక్కపొద్దు మల్లేషన్నా... ’’ అన్నాడు బాయిల్డ్ కూరగాయ ముక్కలు తింటూ! ‘‘ఏ.. తియ్.. ముసలోడిలెక్క గురువారం ఒక్కపొద్దు.. ఏంది?’’ అని రాజేష్‌ను చనువుగా గదమాయిస్తూ.. ‘‘ఏ మల్లేష్.. పొయ్యవయ్యా... రాజేష్‌కి కూడా మందు వొయ్యి’’అని పురమాయించాడు గంగాధర్. ‘‘వద్దన్నా.. నిజంగానే నాకు ఒక్కపొద్దు...’’ మందుపోసిన స్టీల్ గ్లాస్‌ను ఇస్తుంటే గాబరాగా వారించాడు రాజేష్. ‘‘దుబాయ్‌ల ఏం గురువారం? అచ్ఛ.. ఇప్పుడు టైమ్ ఎంతవయా?’’ అడిగాడు గంగాధర్‌ను మల్లేష్. ‘‘పదిన్నర’’ వాచ్ చూసుకుంటూ చెప్పాడు జాన్. ‘‘ఇంకేంది ఒక్కపొద్దు ఇడిషే టైమ్ అయిపోయినట్టే.. అరే ముక్కేసుకో.. చుక్కేసుకో భాయ్’’ ఆటపట్టిస్తూ మల్లేష్. ‘‘అవును రాజేష్.. ఈడ పదిన్నర అంటే ఇండియాలో పన్నెండు కదా.. ఇయ్యాల్టి దినం ఎల్లిపోయినట్టే.. అంటే శుక్రవారం కింద లెక్క’’ నచ్చజెప్పాడు శ్రీధర్. ‘‘ఏందివయా.. నవ్వు సూత ఆల్లతోనే కల్సినవ్’’ చిన్నగా విసుక్కుంటూ రాజేష్. ‘‘ఆ.... సాయిబాబా ఏమనుకోడు తియ్’’ గంగాధర్. ‘‘దేవుడు ఏమనుకోడే.. నా పెండ్లాంకు తెలిస్తే మనసు చిన్నగా చేసుకుంటది’’ అన్నాడు రాజేష్. అందరూ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. అందరి మనసులూ ఒక్కసారిగా సొంతూళ్లకు వెళ్లిపోయాయి. అందరికీ తమ కుటుంబాలూ తలపుల్లోకి వచ్చాయి. చాలాసేపు నిశ్శబ్దం.. ఎవరి జ్ఞాపకాల్లో వాళ్లు ఉండడం వల్ల. ‘‘అన్నా... క్రిస్మస్కు ఇండియా పోతున్నా.. ఇంటికేమన్నా తీస్కపోవాల్నా ’’ భారంగా ఉన్న ఆ వాతావరణాన్ని తేలిక చేయడానికి అన్నాడు జాన్. ‘‘అరే..ఇప్పుడు చెప్తున్నవా? తీస్కపోవుడే.. ఖాళీ చేతులతో ఎట్ల పంపిస్తం నిన్ను ?’’ సరదాగా శ్రీధర్. ఇంకా తన జ్ఞాపకాల్లోంచి బయటకు రాని గంగాధర్.. ‘‘రాజేష్.. నీకు తెల్సా.. పెండ్లయిన కొత్తల్నే నాకు మస్కట్ వీసా అచ్చిండే. మీ వదినకు నేను మస్కట్ పోవుడు అస్సలు ఇష్టంలేకుండే. మా ఆయన మస్కట్ వీసా క్యాన్సల్ అయితే శనివారం ఒక్కపొద్దుంటా అని దేవుడికి మొక్కుకుంది. ఒక వారం పట్టిందేమో ఒక్కపొద్దు గంతే.. ఆ మల్ల వారమే వీసా పక్కా అయింది. ఇగ జూస్కో మీ వదిన బాధ.. దేవుడికి గింత సుత కనికరం లేదని ఒకటే ఏడుపు. అరే.. ఏదైనా మనమంచికే. నేను మస్కట్వోతనే నాలుగు పైసలు పుడ్తయని దేవుడు నీ మొక్కు విన్లేదేమోనే అని జెప్పిన’’ అంటూ తన యాదిని పంచుకున్నాడు. ‘‘అప్పుడు వదిన ఏం అన్నదో తెల్సా.. అయితే నేను ఇడుస్తా.. నువ్వు పట్టు మల్లా వారం నుంచి ఒక్కపొద్దు అని మనోడితోని ఒట్టు కూడా ఏయించుకుంది’’ పూర్తి చేశాడు మల్లేష్. అందరూ ఒకటే నవ్వు. ‘‘పట్టిండా మల్ల?’’ శ్రీధర్ ఆత్రం. ‘‘ఎందుకు వట్టలే.. మంచిగ. మస్కట్ల మేమిద్దరమే కదా కల్సి ఉన్నం. శనివారం పడ్తుండే. పాపమనిపిస్తుండే తన అవస్థ చూసి. పొద్దునంత తినకుండా ఉపాసముంటే ఎర్రటెండల శోషొచ్చి పడుడు ఖాయమని పట్టపగలు తింటుండే. మస్కన్నే లేచి.. వండుకొని టిఫిన్కట్టుకొని సైట్ మీదకు వోతే.. మనోడు టిఫిన్మూత తీషేటాళ్లకు అది పాశిపోయి.. నీళ్లకు నీళ్లు అయితుండే ఆ ఎండకు’’ బాధగా చెప్పాడు మల్లేష్. ఒకరు గంగాధర్ భుజం తడితే ఇంకొకరు వీపు తట్టారు.. మరొకరు అతని భుజం మీద తలపెట్టారు.. మల్లేష్ అయితే గంగాధర్‌ను గట్టిగా వాటేసుకున్నాడు. అందరి కళ్లల్లో నీటి చెమ్మ. అలాంటి కష్టాలను అక్కడున్న అయిదుగురూ దాటారు.. ఇంకా అనుభవిస్తున్నారు కూడా! ‘‘ఇంతకీ రాజేష్.. నువ్వెందుకు ఒక్కపొద్దు పట్టినవో చెప్పవా?’’ అడిగాడు జాన్. ‘‘మా అక్కకు పానం బాలేనప్పుడు పట్టినం మేమిద్దరం’’ చెప్పాడు రాజేష్. ‘‘ఇప్పుడు నువ్వు చికెన్ తిని, మందు తాగంగనే ఏంగాదు’’ అని అంటూనే ‘‘అరే.. మాటలల్ల మర్శేపోయినం.. టైమెంతయింది?’’ అడిగాడు గంగాధర్. ‘‘పన్నెండు’’ చెప్పాడు శ్రీధర్ టైమ్ చూస్తూ! ‘‘ఇంకేంది ఈడ సూత దినమెల్లిపోయినట్టే.. చీర్స్’’ అన్నాడు మల్లేష్ ఉత్సాహంగా. మందు గ్లాస్ పెదవుల దగ్గరపెట్టుకుంటూ అనుకున్నాడు రాజేష్.. ‘‘అక్క పానం బాగుండాల. ఆమెకోసమే కాదు.. మా కోసం కూడా. ఆమె ఏ కొంచెం కిందిమీదచేసినా ఆల్ల అత్తగారు ఇంట్ల దిగవెడ్తరు. నా పెండ్లాం మిషీన్ కుట్టుడే కాకుండా రాత్రిపూట బీడీలు చేసుడూ మొదలువెట్టాలే.. నేనీడ ఓటీ స్టార్ట్ జెయ్యాలే’’అని. -
బాబా.. నేను నానీని
ఆ ప్రయాణం చాలా ఆహ్లాదంగా ఉంది రెహాన్కి. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత నానిని చూడబోతున్నాడు. తనకు బాగా గుర్తు... చిన్న తమ్ముడు పుట్టినప్పుడు వచ్చింది నానీ తమ దగ్గరకి. అప్పుడు తనకు అయిదేళ్లనుకుంటా. అప్పటిదాకా అమ్మకూచిగా .. వెనకాలే తిరిగిన తను .. అమ్మ ఒళ్లోకి బుజ్జి తమ్ముడు రాగానే ఒక్కసారిగా అమ్మ అటెన్షన్‌కు దూరమై ఒంటరైపోయాడు. అప్పుడు పట్టుకుంది నాని.. తన చేతిని. ఎంత భరోసా ఆ స్పర్శలో. అమ్మలాగే.. కాదు అమ్మే! ఎవరూ లేనప్పుడు ‘‘అమ్మీ’’ అనే పిలిచేవాడు. అలా పిలిచినప్పుడల్లా.. భయంతో అటూ ఇటూ చూసేది నానీ.. ఎవరైనా వింటున్నారేమోనని. అలా పిలిపించుకున్నందుకు నానీ వీపు మీద కొరడా మోతే. పిలిచినందుకు తనకూ తన్నులే. నానీ భయం కూడా అదే.. తనెక్కడ దెబ్బలు తినాల్సివస్తుందేమోనని. ‘‘బాబా.. నేను నానీని’’ అనేది. అవును నానీయే తన తోబుట్టువులకు. తనకు మాత్రం అమ్మే.. అనుకుంటూ కారు కిటికీలోంచి వెనక్కి వెళ్తున్న పచ్చని పొలాలు. కొబ్బరి చెట్లను చూశాడు. ఎంత బాగుంది... అచ్చం తన బాల్యంలాగే పచ్చగా! చిన్నప్పుడు అంతా బాగుండేది.. ఇంట్లో నానీ ఉండేది కాబట్టి! మమా (అమ్మ), బాబా (నాన్న)కూడా బాగా ఉండేవాళ్లు. అక్కలు, అన్నలు, చెల్లెళ్లు.. చక్కగా ఉండేది ఇల్లు. చిన్నన్న, నడిపి అక్క ఎప్పుడు చూసినా తనతో గొడవపెట్టుకునేవారు. ఏడుస్తూ నానీకి షికాయత్ చేసేవాడు. ‘‘పరాయివాళ్లు కాదుగా.. అక్కా, అన్నేగా అన్నది అంటూ కళ్లు తుడిచి ఖర్జూరాలతో చేసిన హల్వా తినిపించేది. తినేలోపు అక్క, అన్న మీద కోపం పోయేది.. కాదు మర్చిపోయేవాడు. అలా ఎదురు తిరిగే అలవాటే కాకుండా పోయింది. అన్నిటికి సర్దుకుపోయే తత్వం వచ్చేసింది. ఎంతలా అంటే.. తన నడిపి అక్క ఈడున్న అమ్మాయిని కొత్త మమాగా బాబా ఇంట్లోకి తెచ్చినా.. సర్దుకుపోయేంతగా! ఆ రోజు,.. జ్ఞాపకాల్లో ఇంకా తాజాగానే ఉంది. హైదరాబాద్ నుంచే ఒక అమ్మాయిని తెచ్చాడు బాబా... నిఖా చేసుకొని. తనకన్నా పెద్దవాళ్లెవరికీ ఆశ్చర్యం కలగలేదు. మమాకు కూడా. తనెందుకు అంత బాధపడ్డాడు? ఎంతగా కుమిలి కుమిలి ఏడ్చాడు. ఆ రాత్రి ఇంట్లో పార్టీ అయింది. ఒక్క ముక్క తింటే ఒట్టు. అందరూ పార్టీలో ఉంటే తను మాత్రం తన గదిలో ఏడుస్తూ కూర్చున్నాడు.భోజనం ప్లేట్‌తో నానీ తన గదిలోకి వచ్చింది.. ఆమెను చూడగానే పట్టుకొని ఏడ్చేశాడు వెక్కివెక్కి. మమా ఎందుకు ఏమీ పట్టనట్టు ఉందని నానీని అడిగాడు. అప్పుడు చెప్పింది నానీ.. మమా కూడా బాబా లైఫ్‌లోకి మూడో భార్యగా వచ్చిందని. అందుకే కొత్తమ్మాయి రావడం ఆమెకేమీ ఆశ్చర్యాన్ని, బాధను, ఇబ్బందినీ కలిగించట్లేదని. ఆ వయసులో అదంతా తనకు అర్థమయ్యీ కానట్టుగా ఉండింది. పెద్దక్క భర్త రెండో పెళ్లికి సిద్ధమయ్యేంత వరకు కూడా! దించిన కారు కిటికీలోంచి సన్నని జల్లు చల్లగా మొహాన్ని తాకింది. నాని ఊరడింపును తలపించింది ఆ తుంపర స్పర్శ. ‘‘ఇంకా ఎంతదూరంలో ఉన్నాం?’’ అడిగాడు ట్యాక్సీ డ్రైవర్‌ను. ‘‘ఆధా ఘంటా సాబ్’’ చెప్పాడు డ్రైవర్. విండో గ్లాస్ మూసేసి సీట్‌కి చేరగిలబడి తల వెనక్కి వాల్చుతూ కళ్లు మూసుకున్నాడు రెహాన్. ఊహ తెలిశాక.. ప్రీ యూనివర్శిటీ చదువుకోసం లండన్‌కు వెళ్లబోతూంటే నానీ చెప్పిన, నానీకి తను చెప్పిన మాటలు చెవుల్లో రింగుమంటూనే ఉంటాయ్ ఎప్పుడూ! వంటింటి గోడ చాటుగా ఉన్న నానీ దగ్గరకు వెళ్లాడు. అటూఇటూ చూసి చటుక్కున ఆమె కాళ్లకు దండం పెట్టాడు. ‘‘బాబా..’’ అంటూ అదిరిపడింది నానీ. ఆమె కళ్లల్లో సుళ్లు తిరిగిన నీటిని ఎన్నటికీ ... ఎన్నటికీ మరిచిపోలేడు... ఆ యాది ఇబ్బంది పెట్టినట్టుంది అతనికి కళ్లు తెరిచి ముందుకు వంగుతూ రెండు అరచేతులతో మొహం తుడుచుకుని.. అలాగే తన చేతుల్లో మొహం దాచుకున్నాడు. ‘‘బాగా చదువుకో.. నువ్వనుకున్నది సాధించు. కాని.. మీ బాబాలాగా నాలుగైదు పెళ్లిళ్లు చేసుకోవద్దు..’’ నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ చెప్పింది నానీ. ‘‘నానీ.. బాగా చదువుకొని అక్కడే మంచి ఉద్యోగం చేసుకొని.. అక్కడి అమ్మాయినే పెళ్లి చేసుకుంటా.. ఒకటే పెళ్లి సరేనా..’’ కన్నుగీటుతూ కొంటెగా చెప్పాడు నానీతో. ‘‘నిన్ను లండన్‌కు తీసుకెళ్లిపోతా.. నువ్వు నా దగ్గరే ఉండాలి.. నువ్వు నానీవి కాదు.. నాకు మమావే’’ చెప్తూ వెళ్లిపోయాడు.తల విదిలించి రెండు చేతులను జుట్టులోకి పోనిచ్చి... మెడ పైకెత్తాడు రెహాన్. తను లండన్ వెళ్లిన మూడు నెలలకే నానీని ఇండియా పంపించేసింది తన కుటుంబం. ఆమె వెళ్లిపోయాక.. తనకూ దుబాయ్ రావాలని అనిపించలేదు. అక్కడే స్పానిష్ అమ్మాయిని పెళ్లిచేసుకున్నాడు. ఒక కొడుకు కూడా! ఫోన్లో స్క్రీన్ సేవర్ మీదున్న తన ఫ్యామిలీపిక్ చూసుకుంటూండగా.. ‘‘సాబ్.. వచ్చేసినం’’డ్రైవర్ మాట వినిపించింది. కారు విండోలోంచి చూశాడు. రేకుల షెడ్డు ముందు ఆగింది కారు. వాకిట్లోని గట్టు మీద కూర్చుని .. కాళ్ల మధ్య అద్దం పెట్టుకొని.. తల దువ్వుకుంటూ కనిపించింది ఒక ముసలావిడ. గబగబా కారు దిగి.. ఆ దూరం నుంచే ఆమెను పోల్చుకున్నాడు. నానీయే! ఇంత వయసు మీదపడిందేంటి? అనుకుంటూ వడివడిగా ఆమె వైపు అడుగులు వేశాడు. కళ్ల ముందు ఆరడుగుల తెల్లటి ఆకారం కనిపించే సరికి పళ్ల మధ్య దువ్వెన పెట్టుకొని రెండు చేతులతో జుట్టు ముడివేసుకుంటూ లేచి నిలబడింది. అద్దం జారి రెహాన్ కాళ్ల మీద పడింది.. ‘‘మమా..’’ అన్నాడు కొంచెం బాధతో! ఆ మాటతో గుర్తుపట్టింది నానీ.. ‘‘బాబా’’ అంటూ! వంగి పాదం నులుముకుంటున్నవాడల్లా లేచి ‘‘నానీ.. గుర్తుపట్టావా?’’ అంటూ సంతోషంగా ఆమెను అక్కున చేర్చుకున్నాడు. ఆమెకు మాట కరువు. గట్టిగా పట్టేసుకుంది రేహాన్‌ను. ధారాపాతంగా ఆమె కంట కన్నీళ్లు. అలాగే అతణ్ణి పొదివి పట్టుకొని ఇంట్లోకి తీసుకెళ్లింది. కుశల ప్రశ్నలయ్యాయి. ఫోన్లో తన కొడుకు ఫోటో చూపించాడు. ‘‘పేరు?’’ అడిగింది నానీ. ‘‘నానీ’’ అన్నాడు. ‘‘ఊ.. వీడి పేరు బాబా..?’’ రెట్టించింది నానీ. ‘‘నానీ..’’ చెప్పాడు రెహాన్. ఆమె కళ్లల్లో సంభ్రమాశ్చర్యం! - సరస్వతి రమ -
మైలు
‘‘అందరూ పసుపు కల్పుకోతుండ్రు.. ఇయ్యాల్టికి మూణ్ణెల దినమాయే సర్పంచ్ సాబ్.. పీనుగ రాదు.. మమ్ముల పన్ల వెట్టుకోరు. సచ్చినోడు సచ్చిండు ఆడ.. బతికుండీ మా సావు అయితుంది ఈడ..’’ దుఃఖం కన్నా వేదన ఎక్కువగా వినిపించింది ఆమె మాటల్లో. ‘‘ముట్టుడున్నోల్లను కలుపుకోకు కదా ముత్తవ్వా? అందునా పసుపుతోట్లెకు ఎట్ల రానిస్తరు జెప్పు? శుభంగోలే.. అనుకుంటరు గదా...!’’ సముదాయించే ప్రయత్నం సర్పంచ్‌ది. ‘‘అవ్.. నేనుసుత ఏమంటలే.. కాని గిట్లెన్నొద్దులు మైలవట్టాలే? రోజూ ఆల్లీల్లు బువ్వ వంపిస్తే ఎట్లనిపిస్తది? ఎన్నిదినాలని మందింటి మొఖాలు జూస్కుంట కుసుంటం? పెద్దోడికి పనిలేదు.. షిన్న పోరగాండ్లను స్కూల్లకు రానియ్యరు.. ఉన్న నల్గురం చెర్వులవడి సద్దుమా?’’ నిస్సహాయంగా ఆమె. ‘‘ఏం జెయ్యమంటవ్ ముత్తవ్వా? ఈడికెంచి ఐడీ వోతే ఆడేమన్నా ముందుకు వడ్తది? నీ మొగడి పేరు ఒక కోపన్(రేషన్)కార్డ్‌ల లేకపాయే.. ఆధార్ టైమ్‌ల సూత రాకపోయే? అచ్చిండా?’’ అడిగాడు ఆమెను. ‘‘ఏడొచ్చే సర్పంచ్సాబ్.. నా షిన్నకొడుకు కడుపుల వడ్డంక నాలునెల్లకు వొయ్యిండటే.. గిప్పటిదాకా ఇంటిమొఖమే సూడకపోయే.. ఇప్పుడు మా షిన్నోడికిప్పుడు పదమూడేండ్లు..’’ చెప్పింది వస్తున్న ఏడుపును దిగమింగుకుంటూ! ‘‘సూడు మరి.. ఒక్కదాంట్ల పేరులేదు.. పోనీ పట్టాదార్ పాస్పుస్తకమన్నా పనికొస్తదనుకుంటే గుంటెడు భూమిలేకపాయే? ఏం జెయ్యమంటవ్?’’ అంటూ ఆమె వంక చూశాడు. దీర్ఘాలోచనతో ఎటో చూస్తోంది. మూడు కాలాలూ ఆకాశం కిందే పనిచేయడం వల్లేమో నలభై ఏళ్లకే అరవయ్యేళ్ల దానిలా అయిపోయింది. మొహంమీదన్నీ ముడతలే. ఆమెను అలా చూస్తుంటే ఎక్కడలేని జాలేసింది సర్పంచ్‌కు. తన కండ్లముందే వెరిగింది. అయిదుగురు అక్కచెల్లెళ్లలో ఆఖరుది. తండ్రి సచ్చిపోయేనాటికి ఏడేండ్ల పిల్ల. మేనమామలే సాకిండ్రు. పదిహేనేండ్లకు పెండ్లిచేసిండ్రు. పెనిమిటి కంచెట్టిది సుత తమ ఊరే. ముగ్గురన్నదమ్ములల్ల రెండోడు. నాలుగెకరాల పొలం ఉంటే ఆడివిల్లల పెండ్లికి అమ్మేసుకున్నరు. ముత్తవ్వ ఆల్లింటికి వోయేనాటికే ఆస్తి ఏం లేదు.. పొత్తుల ఇల్లు దప్ప. కూలీచేసుకొని బతుకుడే. అన్నదమ్ములు వంచుకుంటే వచ్చిన తనవంతు రెండు రూమ్‌లను అమ్ముకొని సౌదీకి వొయ్యిండు. ఖలివెల్లి (వర్క్ పరిమిట్ లేని వీసా) మీదనే. ఆడి నుంచి ఏం పంపిండో ఏమో.. గాని ఈ పదమూడేండ్లల బిగెడు జాగ గొన్లే.. ఇంత రేకుల ఇల్లేసుకోలే! అప్పులు దీరుంటయ్.. పాపం.. ఈ పిల్లొక్కతే.. మొన్నమొన్నటిదాకా.. రెక్కలకు రికామ లేకుండా పనిజేసింది. గిప్పుడే పెద్దోడింత షేతికొచ్చిండు.. పనిజేస్తున్నడు ఇగ తిరబడ్తరనుకునేటాల్లకు హార్టొచ్చి మొగడి పానం బోయిందనే సంగతిదెల్సే! పీనుగును తొందర్గ తీస్కరాతందకు తానేం జేయాల్నో అది జేస్తుండు.. ఐడీ కారట్ లేకపోతే ఏం అయితలేదు ఆడ.. అని ఆలోచించుకుంటూండగానే ఏదో తట్టినట్టయి.. ‘‘ముత్తవ్వా.. నీ మొగడు కంచెట్టిది ఇదే ఊరని..ఫలానోల్ల కొడుకని.. కుటుంబం ఫలానా ఇంట్ల ఉంటుందని నేనొక లెటరు రాసి.. సంతకం బెట్టి.. స్టాంపేసిస్తా.. ఎమ్మార్వో దగ్గరకు కొండవో. గిట్లేమన్నా పనైతదేమో సూతం’’ అన్నాడు సర్పంచ్. సరే అన్నట్టుగా తలూపింది ముత్తవ్వ. ‘‘అమ్మా.. సాయిగాడి అక్కపెండ్లి. దోస్తులంతా దావత్ చేసుకుంటుండ్రే’’ షర్ట్ ఇస్త్రీ చేసుకుంటూ దిగులుగా చెప్పాడు ముత్తవ్వ పెద్దకొడుకు ప్రమోద్. ‘‘ఊ’’ అంది పరధ్యానంగా ముత్తవ్వ పాత సూట్‌కేస్‌లో తన భర్త ఐడీ తాలూకు ఆధారాలేమన్నా దొరుకుతాయేమో అని వెదుకుతూ. ‘‘అమ్మా... ఇయ్యాల రాత్రికేనే దావతూ’’రెట్టించాడు ప్రమోద్. ‘‘నన్నేంజెయ్మంటవ్రా... సద్దునా’’ అంటూ తమను ఈ దశకు నెట్టిన పరిస్థితిని ఎదర్కోలేక వచ్చిన కోపాన్నంతా ఒక్కసారిగా కొడుకు మీద చూపింది. ఆమె అరుపుకి బిక్కచచ్చిపోయాడు పదిహేడేళ్ల కొడుకు. ఇంతలోకే బయట నుంచి ‘‘ముత్తి.. ఓ ముత్తి’’ అంటూ ఓ స్త్రీ పిలుపు. ‘‘మల్లా ఎవడికి ఏంబుట్టే’’ అని చిరాకుపడుతూ లోపలినుంచి వాకిట్లోకొచ్చింది ముత్తవ్వ. ఆమెను చూడగానే ఇందాకటి స్త్రీ ‘‘ఎన్నిసార్లు జెప్పాల్నే ముత్తీ.. నీ పిల్లల్ని అటెంకల రానియ్యద్దని? గుడిముంగట పిల్లగాండ్లు ఆడుకోంగ వొయ్యిండ్రట.. ఆ ఆటలల్లకలెవడి.. కోమటోల్ల పిల్లగాండ్లను తాకిండ్రట.. కోమటోల్ల సుశీల లొల్లిలొల్లి జేస్తుంది. నీ పిల్లగాండ్లకు పిలిపిచ్చుకో..’’ గట్టిగా చెప్పి విసావిసా వెళ్లిపోయింది. ఇందాకటి కోపం ఇంకా తగ్గనేలేదు.. ఇప్పుడు ఈ విషయం తోడై... విసురుగా లోపలికి వెళ్లి.. ఇస్త్రీ చేసుకున్న షర్ట్‌ను మడతపెట్టుకుంటున్న పెద్దకొడుకు జుట్టుపట్టుకొని.. పళ్లుబిగబట్టి.. తలను గొడకేసి నొక్కిపెడ్తూ.. ‘‘ఈడ మీ అయ్యజచ్చి.. ముట్టుట్ల ఏడుస్తుంటే మీకు దావత్‌లు కావల్సొచ్చినయారా.. దావత్‌లు? దోస్తులు, దావత్‌లు అన్నవంటే కాళ్లిర్గొగొట్టి పొయ్యిల వెడ్త బిడ్డా.. ఏమనుకుంటున్నవో.. ఇయ్యాల్టిసంది ఎవ్వడన్నా కాలు బయటవెట్టిండ్రో సూడుండ్రి మీ తడాఖ ఎట్లుంటదో! పో.. పొయ్యి అశోక్‌ను, చరణ్గాడ్రి తొల్కరాపో.. నడువ్’’ అంటూ జుట్టు అలాగే పట్టుకొని వీధి గుమ్మం వైపు తోసింది ప్రమోద్ను. ఆ తోపుకి గడపలో పడ్డాడు వాడు. కళ్లనిండా నీళ్లు.. అదిమిపట్టుకుంటూ లేచి వెనక్కి తిరిగి చూడకుండా బయటకి వెళ్లిపోయాడు. తలుపేసేసి చేరగిల పడి వెనకనుంచి తలను తలుపుకి బాదుకుంటూ ఏడ్వడం మొదలుపెట్టింది ముత్తవ్వ. ‘‘భగవంతుడా నేనేం పాపం జేసిన? నాకే ఎందుకు వెడ్తున్నవ్ ఈ పరీక్షలు? మొగడు సచ్చిండని ఏడ్వాన్నా? పీనుగు ఇంకా ఇంటికి రాలేదని ఏడ్వన్నా? కర్మ కాలేదని ఊరోల్లు దేంట్ల కలుపుకుంటలేరని..కల్వనిస్తలేరని ఏడ్వల్నా? ఇంట్ల మనుషులు రోగమొచ్చి మంచంల వడ్డా.. సచ్చినా తెల్లారే పనికి వోకపోతే ఎల్లరి పరస్థితికి ఏడ్వల్నా? పిల్లలు చెప్పిన మాటింటలేరని ఏడ్వల్నా? ఒక్కదాన్నే ఎన్నని జూస్కోవాలే? యేడికని వోవాలే? సౌదీకి వొయ్యి అప్పుల కుప్పనే వెట్టిండు ఒక్క రూపాయి వంపని మొగడు .. మంచి, చెడ్డ అర్సుకోని మొగడు ఉన్నా ఒకటే.. లేకపోయినా ఒకటే.. ఈ బాధ లోకంకేం ఎర్క? నా అసుంటోల్లు దినాం సచ్చుకుంటనే బత్కవడ్తిమి. ఏం మొగడు? ఏం సంసారం ఇది? బతికున్నప్పడూ సాధిచ్చే... సచ్చీ సాధించవట్టే.. ఎట్ల కొనముట్టుడు?’’ అనుకుంటూ తలచుకొని తలచుకొని గుండె పగిలేలా ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి పోయింది ముత్తవ్వ. -
దోస్తానా
సౌది అరేబియా.. రాబిక్ ప్రాంతంలోని లేబర్ క్యాంప్.. రాత్రి ఎనిమిది గంటలు.. కంటైనర్ గదిలో బంకర్ బెడ్ మీద కూర్చుని పక్కనే ఉన్న చిన్న కిటికీలోంచి ఆకాశంలో చుక్కల్ని చూస్తున్నాడు దశర«థ్ ఏదో ఆలోచిస్తూ! తన మీద ఎవరో నీరు చిలకరించినట్టనిపించి ఒక్కసారిగా దృష్టిమరల్చాడు. అజహర్.. స్నానం చేసివచ్చినట్టున్నాడు.. తన మీద జుట్టు దులిపి నవ్వుతున్నాడు ‘‘ఏమాలోచిస్తున్నావ్ దాస్ భాయ్’’ అంటూ! చేతుల మీద, మొహం మీద పడ్డ నీటి చుక్కల్ని తుడుచుకుంటూ ఏం లేదు అన్నట్టుగా నవ్వాడు దశరథ్. అజçహర్.. అటు తిరిగి టవెల్‌తో వీపు తుడుచుకొని... జబ్బల బనీను వేసుకొని.. ధోతీ చుట్టుకొని కాలు కిందనుంచి ఓ అంచు తీసి కుచ్చిళ్లు మడిచి నడుములో దోపుకుంటూ ఇటు వైపు తిరిగాడు. ఈ క్రమాన్నంతా ఆసక్తిగా గమనించిన దశరథ్.. ‘‘అజహర్.. పాకిస్తాన్లో ధోతీ ఎవరూ కట్టుకోరు కదా.. నీకెట్లా అలవాటైంది’’ అజహర్‌తో స్నేహం కుదిరిన ఈ అయిదేళ్లలో నూటముప్పయో సారి అడిగాడు. చెదరని చిరునవ్వుతో.. ‘‘మా తాత కట్టుకునేవాడు.. అదే మాకూ అలవాటైంది.. పార్టిషనప్పుడు ఇండియా నుంచే పాకిస్తాన్ వెళ్లారు కదా మా పెద్దలు.. అట్లా ధోతీ కల్చర్ మాకూ వచ్చుంటుంది’’ అజహర్ది కూడా అదే జవాబు నూటముప్పయోసారి. కిషన్‌తో అజహర్ పరిచయమయ్యాడు. అప్పుడు అజహర్ టాక్సీ డ్రైవర్‌గా పనిచేసేవాడు. దశరథ్ ఆజాద్ వీసా మీద కన్స్ట్రక్షన్ వర్కర్‌గా ఉన్నాడు. అతను, కిషన్ ఇంకొంతమంది కలిసి ఒకటే రూమ్‌లో ఉంటూండేవాళ్లు. అప్పటికి కిషన్‌కు సరైన పనిలేదు. ఆ టైమ్‌లోనే ఒకసారి అజహర్ టాక్సీ ఎక్కాడు కిషన్. ఆ రోజు దశరథ్కు ఇంకా గుర్తుంది.. రూమ్కొచ్చిన కిషన్ తనను పట్టుకొని ఏడ్చేశాడు. ‘‘అన్నా...మన దేశం దాటినంకనే మనుషులు అర్థమైతుండ్రు నాకు.. హిందు, ముస్లిం, ఇండియా, పాకిస్తాన్ కొట్లాటలన్నీ దేశంలోపల్నే. దాటితే లోకమంతా ఒకటేనే’’ అంటూ అజహర్ గురించి చెప్పాడు. తనకు ఉద్యోగం లేదని తెల్సి టాక్సీ సవారీ తీసుకోలేదట అజహర్. అప్పుడే కాదు.. కిషన్‌కు పని దొరికేదాకా ఎప్పుడు అజహర్ టాక్సీ ఎక్కినా పైసలు తీసుకోలేదు అతను. అట్లా వాళ్లిద్దరికీ దోస్తానా కుదిరి.. తనకూ అజహర్ దోస్తయి.. ఇప్పుడు పెయింటింగ్ పనిలోనే కాదు కంటైనర్ రూమ్మేట్ కూడా అయ్యాడు. సౌదీ అరేబియా పాతదవుతున్నా కొద్దీ కొత్త విషయాలెన్నో తెలిశాయి దశరథ్కు. అజహర్లాంటి వాళ్లు ఇంకొంతమంది ఉన్నారనీ అనుభవంలోకి వచ్చింది. ఆఫ్ఘానిస్తాన్ నుంచి సౌదీకి బతకడానికి వచ్చిన టాక్సీవాలాలు కూడా పనిదొరకని ఇండియన్స్ ఎవరు తమ టాక్సీ ఎక్కినా డబ్బులు తీసుకోరని. చాలా స్నేహంగా ఉంటారని. ఇదే విషయం తన చిన్నబాపుతో చెప్తుంటే గుండె బరువెక్కే ఒక జ్ఞాపకాన్ని పంచుకున్నాడు అతను. ఇరవై ఏండ్ల కిందట సౌదీకొచ్చిండు చిన్నబాపు. ఆరేండ్లున్నడు ఇక్కడ. అతనొచ్చిన కొత్తల్నే కార్గిల్ యుద్ధం అయింది. పాకిస్తానోళ్లు, మనోళ్లు కల్సే ఒకరూమ్‌లో ఉన్నరటప్పుడు. అన్నం తినే రూమ్‌ల టీవీ ఉండేదట. కార్గిల్ యుద్ధం వార్తల్ని వింటే ఇటు హిందుస్తానోళ్లు బాధపడ్తరేమో అని పాకిస్తానోళ్లు.. పాకిస్తానోళ్లు బాధపడ్తరేమోనని మనోళ్లు వార్తలే చూడకపోదురట. చిన్నబాపు ఆ ముచ్చట చెప్తుంటే కండ్లకెంచి నీళ్లుగారినయ్. ఇసుంటి సంగతులెన్నో అని దశరథ్ అనుకుంటూండగానే ‘‘క్యా భాయ్.. ఇత్నా క్యా సోంచ్రే?’’ అంటూ అజహర్ వచ్చి అతని పక్కన కూర్చున్నాడు. ‘‘ఏం లేదు’’ అంటూ ఆప్యాయంగా అజహర్ తొడ మీద చరిచాడు దశరథ్. ‘‘భాయ్.. జెడ్డాల్నే పని కాబట్టి కలుస్తూ ఉండు.. మర్చిపోకు’’ అన్నాడు దశరథ్ చేయిని తన చేతిలోకి తీసుకుంటూ అజహర్. ‘‘యాదిమర్చిపోయే దోస్తాన్నా ఇది? నువ్వు నా తమ్ముడిలాంటోడివి. కాదు తమ్ముడికంటే ఎక్కువే’’ అని అంటున్నప్పుడు దశరథ్ కళ్లు చెమ్మగిల్లాయి. అజహర్‌లో కూడా దిగులు మొదలైంది. నిజంగానే దశరథ్ తనకు అన్నలాంటివాడు. తను టాక్సీ డ్రైవర్‌గా ఉన్నప్పుడు అమ్మకు సుస్తీ చేసిందిæ. ట్రీట్మెంట్ కోసం కాస్త ఎక్కువ డబ్బే పంపించాల్సిన అవసరం వచ్చింది. రాత్రింబవళ్లు కష్టపడ్డానికి సిద్ధమయినా పని దొరకాలి కదా? ఆ వఖ్త్లో తనను ఆదుకుంది ఈ హిందుస్తానీ దోస్తులే. దాస్ భాయే.. తనూరోళ్లందరికీ చెప్పి.. ఓటీ చేసి.. వచ్చిన డబ్బంతా తనకు ఇప్పించాడు. భాయ్ అయితే ఓటీతోపాటు ఒకనెల జీతంకూడా ఇచ్చేశాడు. ‘‘చలో అజహర్.. నువ్వు రేపు తొందర్గా వెళ్లాలి కదా.. తిందాం రా..’’ అంటూ చేయిపట్టుకొని అజహర్‌ను లేపాడు. అప్పటికే తమ రూమ్మేట్స్ అంతా భోజనాల బల్ల దగ్గరున్నారు వీళ్లకోసం వెయిట్‌చేస్తూ. బల్ల మీద పెద్ద విస్తారాకులో భోజనం ఉంది. చుట్టూ అయిదుగురు కూర్చున్నారు. అందరూ తలా ఒక్క ముద్ద కలిపి దశరథ్కు తినిపించారు. దశరథ్ కూడా అందరికీ తినిపించాడు. తను తింటూ చివరి ముద్దలు మళ్లీ అజహర్‌కు పెట్టాడు. ఆ రాత్రంతా యాదితో జాగారమే అయింది దశరథ్కు. ఊర్లో ఇల్లు తప్ప జానెడు జాగలేదు. చిన్నబాపుకి ఉన్న పరిచయాలతో సౌదీకొచ్చిండు. మంచిపనే దొరికింది. సంపాదిస్తున్నగదాని కొంచెం అప్పు జేసి ఊర్లె పొలం గూడా కొన్నడు మొన్ననే. ఆ సంబ్రం ఇంకా పోనేలేదు గాయింతల్నే కఫీల్ (యజమాని) చెప్పిండు ఇంక నీకు నా దగ్గర పన్లేదు వేరే కఫీల్‌ను ఎతుక్కో అని. నెత్తిమీద పిడుగువడ్డట్టే అయింది. ‘‘హారి భగవంతుడా.. గిప్పటిగిప్పుడు ఏడికని వోవాలే? ఏ ఖఫీల్ దొరకాలే? అవ్వతోడు రందితోని నెలరోజులు మెతుకు ముట్టలేదు. యెట్ల కనివెట్టిండో కనివెట్టింటు అజహర్.. చెప్పేదాకా మనసున వట్టనియ్యలే.. ఏమైంది దాస్ భాయ్... బోలో అనుకుంట.సంగతిని. పరేషానే అయిండు కాని.. ధైర్యం జెప్పిండు. ఆ దినం నుంచి వారం కిందటిదాకా తనకు పనిప్పియ్యడానికి ట్రై చేస్తనే ఉండు. లాస్ట్‌కు సిరియా కాంట్రాక్టర్‌ను వట్టుకొని జెడ్డాల తనకు పనిదొర్కవట్టిండు... ఈ తలపులతో తెల్లవారు జామునెప్పుడు నిద్రలోకి జారుకున్నాడో దశరథ్! ‘‘దాస్భాయ్..’’ అంటూ భుజం తట్టినట్టనిపించేసరికి మత్తుగా కళ్లు తెరిచాడు దశరథ్. అజహర్.. సైట్‌కు వెళ్లడానికి రెడీ అయ్యి కనిపించాడు. ‘‘అరే.. మోటరొచ్చిందా?’’ అంటూ టైమ్ చూసుకున్నాడు. ఆరు అయింది. లాస్ట్ ట్రిప్ అన్నమాట. తనకోసం లాస్ట్ ట్రిప్దాకా ఉన్నట్టున్నాడు. లేచి అజహర్‌ను హత్తుకున్నాడు. అజహర్కూడా దశరథ్ను గట్టిగా పట్టుకుని ‘‘భాయ్.. కలుస్తుండు. ఈ తమ్ముడ్ని మర్చిపోకు’’ అని అంటూంటే మరింత గాఢంగా ఆలింగనం చేసుకున్నాడు దశరథ్. విడివడ్డాక.. ఆ ఆప్యాయతను షేక్‌హ్యాండ్ రూపంలో కూడా వ్యక్తికరించి వెళ్లలేక వెనుదిరిగాడు అజహర్. -
లాస్ట్ బస్
పాతికేళ్ల కిందట...నిజామాబాద్‌లో అప్పుడే బొంబాయి రైలు దిగిన సాయిలు.. స్టేషన్ బయటకు వచ్చాడు. పాన్ డబ్బా దగ్గర ఆగి.. చేతిలో ఉన్న బ్యాగ్‌ను భుజానికి తగిలించుకుంటూ ‘‘అన్నా మారుతీ బీడీకట్టియ్యే ఒకటి’’ అడిగాడు. షర్ట్ జేబులోంచి డబ్బులిచ్చి బీడీ కట్ట తీసుకుంటూ ‘‘టైమ్ ఎంతయిందే?’’ అడిగాడు డబ్బా అతణ్ణి. ‘‘పదకొండున్నర’’ చెప్పాడు డబ్బా యజమాని. కొంచెం ముందుకు వెళ్లి.. పంటికింద బీడీ పెట్టుకుంటూ ప్యాంట్ జేబులోంచి అగ్గిపెట్టెను తీసి బీడీ వెలిగించి దమ్ము లాగుతూ ఆకాశం కేసి చూశాడు సాయిలు. వానాకాలం పూర్తయిపోలేదు. అయినా చుర్రుమనిపిస్తోంది ఎండ. లోపలికి పోయిన చెంపలు.. మాసిన గడ్డం.. అతణ్ణి జబ్బుపడ్డ వాడిగా.. మతిస్థిమితం లేనివాడిగా చూపించే ప్రయత్నం చేస్తున్నాయి. చూపులను చుట్టుపక్కలకు సారించి.. బీడీ పీలుస్తూంటే గతం మెదడును ఆవరించింది. పదిహేనురోజులైతుంది ఇల్లు ఇడిషి. తీస్కవోయిన పైసలు దగ్గరవడ్తుంటే.. ఇక అక్కడుండు వేస్ట్ అని నిజాంబాద రైలెక్కిండు. అబ్బ.. ఏం ఊరు బొంబై! ఆ మనుషులు.. ఆ కథనే వేరే! అంతకుముందు మస్కట్ వొయిన దోస్తులు ‘‘వారీ.. బొంబైల కామటిపుర ఆడోళ్లుంటరూ... సీన్మ యాక్టర్ల లెక్కనే’’ అని షెప్తుంటే.. సూతమని కామటిపుర వోయిండు.... ఒక్కసారిగా బీడీ చురక తగిలేసరికి ముంబై తలపులను వదిలి బీడీ నలిపేసిండు. భుజమ్మీదున్న టవెల్ను తలకు పాగాలా.. కాస్త మొహాన్నీ కవర్‌చేస్తూ చుట్టుకున్నాడు. బ్యాగ్ తీసుకొని స్టేషన్ ఆవరణ దాటి బస్‌స్టాండ్ వైపు నడక సాగించాడు. లాస్ట్ బస్ వట్టుకోవాలే ఊరికి. ఎనిమిదికేమో ఉన్నట్టుంది. గప్పుడు వోతనే ఊర్లే అందరు పండుకుంటరు. తనను చూడంగనే ఇంట్లోళ్లు ఎట్ల అర్సుకుంటరో? పద్మకేం జెప్పాలే? అవ్వ (అమ్మ)కెట్ల మొఖం జూపియ్యాలే? బావ తాన అప్పు దీస్కున్నది గాక బావకు దెల్వకుండా షెల్లె బంగారం కూడా కుద్వవెట్టే.. ఇప్పుడు ఏం జెప్తడు? అప్పంటే యాదికొచ్చే.. యేడాదిల తీర్పుతాని ఉన్న మూడెకరాల పొలం కాయితాలూ సత్యనారాయణ సేuŠ‡ దగ్గర వెట్టే! హా రామచంద్రా.. ఎల్లదీసుడెట్లా? అసలు ఏ మొఖంబెట్టుకొని తిర్గాలే ఊర్లె? ఈ బెంగతోనే బస్టాండ్‌లోని ఉడిపి హోటల్లో భోజనం పూర్తి చేశాడు సాయిలు. టైమ్ చూసుకుంటే ఇంకా ఒంటిగంట దగ్గరే ఉంది. పక్కనే ఉన్న అశోక్ టాకీస్లోకెళ్లి కూర్చున్నాడు. సాయం కాలం ఏడు గంటలు.. చీకటి పడింది.. ‘‘పన్ల మీద నిజాంబాదకొచ్చి ఊర్లోల్లు మర్లిపొయ్యే యాళ.. ఈడ ఉండుడు మంచిదికాదు..’’ అనుకుంటూ రోడ్డు దాటి బస్టాండ్‌కు ఎదురుగా ఉన్న బజార్లోకి వెళ్లాడు. రోడ్డు పక్కన.. టిబెటన్లు స్వెటర్లు అమ్మే పాకలు, చెప్పుల దుకాణాలు, పళ్ల బండ్లూ ఉన్నాయి. చెప్పుల దుకాణనికి వెళ్లాడు. అందాజాతో పిల్లల పాదాల కొలతలు చెప్పి... కూతురి కోసం ఎత్తుమడమల చెప్పులు, కొడుకు కోసం కాన్వాస్ షూ కొన్నాడు. పేపర్ లిఫాఫాలో ప్యాక్ చేయించుకొని బ్యాగ్‌లో సర్దుకున్నాడు. ఆ బ్యాగ్ భుజానికేసుకొని.. గాం«ధీ చౌక్ వైపు నడవడం మొదలుపెట్టాడు. దార్లో ‘‘రిక్షా చాహియే భాయ్?’’ అంటూ బెల్ కొట్టి మరీ రిక్షా వాళ్లు అడుగుతున్నా.. వినిపించుకోకుండా ముందుకు నడుస్తూనే ఉన్నాడు.. పిక్చర్ ప్యాలెస్ లేన్‌లోకి మళ్లి.. థియేటర్ ముందున్న మిర్చీ బండి దగ్గరకు వెళ్లాడు. బిడ్డకు ఇష్టమని రెండు ప్లేట్ల మూంగ్ పకోడీ పార్సిల్ కట్టించుకుని తిరిగి బస్టాండ్ దారి పట్టాడు సాయిలు. ముగ్గురు నల్గురు తప్ప బస్‌లో జనమే లేరు! తనూరు వాళ్లసలే లేరు. ‘‘హవ్వర గొండ (హమ్మయ్య)’’అనుకుంటూ ఊపిరిపీల్చుకున్నాడు సాయిలు. కిటికీ సీట్లో కూర్చున్నాడు. మూతి కనిపించకుండా టవల్ కొనను పంటి కింద పెట్టుకొని కిటికీ అద్దానికి తల ఆనించి బయటకు చూస్తున్నాడు. ‘‘ఆ టికెట్వయా.. టికెట్ దీస్కో’’ సాయిలు సీట్ దగ్గరున్న ఇనుపరాడ్‌కు ఆనుకొని చంకలో పెట్టుకున్న టికెట్ చెస్ట్‌ను కుడిచేతిలోకి తీసుకుంటూ అడిగాడు కండక్టర్. ‘‘మోర్తాడ్’’ అని సాయిలు అంటూండగా పంటి కిందున్న టవల్ అంచు బయటకు వచ్చి కిటికీలోంచి వస్తున్న గాలి విసురుకు మొహం మీద నుంచి టవెలూ పక్కకు జరిగింది. టికెట్‌కు పంచ్ చేసి సాయిలు చేతిలో పెట్టబోతున్న కండక్టర్ అతణ్ణి చూశాడు. ‘‘అరే.. సాయిలూ...’’అన్నాడు ఒక్కసారిగా. ‘‘అయిపాయె.. గంగల గల్షిపాయే’’ అవమానంతో కూడిన దిగులు సాయిలులో. ‘‘అరే నువ్వు మస్కట్ వోయినవని జెప్పిండ్రు... గంతవోతే పదిహేన్ దినాలన్న అయిందో కాలేదో?’’ అడిగాడు కండక్టర్. కండక్టర్ మొహం చూసిన సాయిలు ఖంగుతిన్నాడు. తమ ఊరోడే. కండక్టర్ కొలువచ్చినంక నిజాంబాదల మకాంబెట్టిండు. ‘‘ఏంది సాయిలూ గీడగనవడ్తివి?’’ అంటూ సాయిలు పక్కనే కూర్చున్నాడు కండక్టర్ అసలు కూపీలాగందే వదిలేది లేదన్నట్టుగా. ఏమని జెప్తడు? ఏడని మొదలువెడ్తడు? గా భూకంపం.. గదాంతోని ఎల్కలు జచ్చి.. ప్లేగ్వాకి విమానాలు క్యాన్సలై.. విసా టైమెత్తిపొయ్యి.. మస్కట్ల ఉద్యోగం ఊష్టయిందని జెప్తే నమ్ముతరా? మస్కట్ వోతందుకు ఇగ రేపు బొంబై రైలు ఎక్కుతడనంగా.. ఎంత పెద్ద దావత్ ఇచ్చిండు? రెండు యాటలు తెగినయ్. సుట్టపోళ్లు.. కులపోళ్లనే గాదు.. ఊర్లందర్నీ విల్షి పోషమ్మ కాడ జాత్ర లెక్క జేషిండు. ఆడివిల్లకు బట్టలు వెట్టిండు. అవ్వను, పెండ్లాం బిడ్డల్ని చూస్కోమ్మని అత్తగారోల్లకు అప్పగింతలువెట్టిండు. బామ్మర్దికి పొలం జెయ్మని జెప్పిండు. దోస్తులైతే ‘‘మస్కట్ నుంచి అచ్చేటప్పుడు వాచ్‌లు, కండ్లద్దాలు దెచ్చుడే మాకోసం.. మస్కట్ సాయిలూ..’’ అని చిడాయించిండ్రు. బస్ ఎక్కియ్యనీకొచ్చిన అవ్వ ‘‘వారీ.. అంగీకి కుట్టిచ్చుకున్న దొంగ కీసాల వెట్టుకున్న నలపైవేలు పైలం రా’’ అని చెప్పుకుంట ఎంత గాయిజేసింది? గా లాతూర్ భూకంపం తన బత్కుల గింత పెద్ద ఆపద వెడ్తదని అనుకున్నడా? ప్లేగ్ ఏందీ? గదాంతోని సంబంధం లేని తన కొలువు పోవుడేంది? ఊర్ల తనకెమన్న ఇజ్జత్ ఉంటదా? ’’ అనుకుంటూ కండక్టర్ వంక చూసిన సాయిలు కళ్లల్లో నీళ్లు! -
బహరైన్ అమ్మ
‘‘అమ్మ బెహెరైన్‌కు వెళ్లినప్పుడు ఇది యేడాది పిల్లండీ. నాకు నాలుగేళ్లు. ఈ ఇరవై రెండేళ్లలో ఒక్కసారి కూడా అమ్మను మేం చూళ్లేదండీ. దీనికైతే ఆమె ఎలా ఉంటుందో కూడా తెలీదండీ..ఫొటోల్లో తప్ప. అమ్మ వెళ్లిన మొదట్లో ఓ నాలుగైదు సార్లు కనీసం నేను ఫోన్లో అమ్మ గొంతైనా విన్నానండీ. దీనికి ఆ భాగ్యమూ దొకరలా! నాన్న పోయినా.. తనను వాళ్లు పంపలేదండీ. పోయిన నాన్న కోసం కన్నా రాలేని అమ్మ కోసమే ఎక్కువగా ఏడ్చాం. నానమ్మనే అమ్మ అనుకున్నామండీ. ఇన్నేళ్లకు అమ్మ ఇంటికొస్తుందని పండగే చేసిందిది’’ ముందు గది తలుపు చెక్కకు ఆనుకొని నిలబడి ఉన్న చెల్లిని చూపిస్తూ అన్నాడు సూరిబాబు బాధగా. అన్నయ్య మాటలతో రేవతికి ఏడుపు ఆగలేదు. చున్నీలో మొహం దాచుకుంది. ఈ కుటుంబంతో సుధాకర్‌కు ఈ మధ్యే పరిచయం. మైగ్రెంట్స్ రైట్స్ గురించి పనిచేస్తున్న ఓ ఎన్జీవోలో కీలకమైన ఉద్యోగి. ఒకప్పుడు అతనూ బహెరైన్లో ఉండొచ్చాడు. ఆ పరిచయాలతోనే ఇరవై రెండేళ్ల తర్వాత అరుంధతి బహరైన్ నుంచి ఇండియా వచ్చేలా చేశాడు. అరుంధతి రాక ఖాయమై, టికెట్ కూడా కన్ఫర్మ్ అయిందని తెలియగానే.. అమ్మకు ఇక్కడ ఎలాంటి ఇబ్బందీ కలగకుండా ఇంట్లో అన్ని సౌకర్యాలూ పెట్టించి ఇంటిని బాగుచేయించాలని వాళ్లన్నతో పట్టుబట్టింది రేవతి. వంటింట్లో గట్టు, సింక్, సింక్‌లో కుళాయి, బాత్రూమ్లో కుళాయి, ఉన్న మూడు గదుల్లోనూ కొత్త ఫ్యాన్లు, కొత్త కూలర్ అన్నీ కొనిపించింది. రాగానే కట్టుకోవడానికని నాలుగు మంచి చీరలూ, రెండు నైటీలు తీసుకొచ్చింది. ‘‘ఏవే.. నీ పెళ్లికైనా ఇంత హడావిడి ఉంటుందో ? లేదో?’’ అని రేవతి స్నేహితురాళ్లూ ఆటపట్టించారు ఆమెను. ‘‘ ఏమాటకామాట చెప్పుకోవాలంటే నండీ.. అమ్మతో ఫోన్లో మాట్లాడించకపోయినా డబ్బులు మాత్రం ఠంచనుగా పంపించేవాడండీ. చెల్లి పెళ్లికుదిరితే పెళ్లికీ సాయం చేస్తానని మాటిచ్చాడండీ.. షేక్’’ కొనసాగించాడు సూరిబాబు. ‘‘మరి ఎందుకు చూడలేదు సంబంధాలు?’’ అన్నట్లుగా చూశాడు సుధాకర్. ‘‘మా అమ్మ వస్తేగానీ పెళ్లిచేసుకోనని బాసింపట్టేసుకుందండీ.. చుట్టాలంతా నాకేదో ఖర్చయిపోతుందని చెల్లి పెళ్లిచేయకుండా ఇంట్లో పెట్టేశానని కూడా అనుకున్నారు. ఆ మాట చెప్పి కూడా తనను పెళ్లికి ఒప్పించే ట్రై చేశానండీ. మా మేనత్తా నచ్చచెప్పింది. ఉహూ.. వింటేనాండీ.. అమ్మ రావాలి.. వచ్చాకే నా పెళ్లి అంటూ పట్టుబట్టింది. అందుకేగా మీ దగ్గరకొచ్చింది అమ్మ విషయంలో హెల్ప్ చేయమని’’ చెప్పుకుపోయాడు సూరిబాబు. ఇల్లంతా పరికించి చూశాడు సుధాకర్. తెల్లటి సున్నం, తలుపులకు రంగులతో కొత్త ఇల్లులా వెలిగిపోతోంది. ఇంటిముందు మల్లెచెట్టు కింద కూర్చన్న అరుంధతి వంకా చూశాడు. ఈ ఇంటితో.. ఇంట్లో వాళ్లతో తనకే సంబంధం లేనట్టుగా ఏదో పోగొటుకున్నట్టు దిగులుగా ఉంది ఆమె. తల్లి గురించి ఏడ్చి ఏడ్చి సూరిబాబు చెల్లి రేవతి కళ్లు ఉబ్బిపోయాయి. చీది చీది ముక్కు ఎర్రబడ్డది. ‘‘కొంచెం కాఫీ ఇస్తావామ్మా’’ రేవతి మనసు మరల్చడానికి అడిగాడు సుధాకర్. ‘‘అయ్యో.. సర్.. మా బాధ చెప్పుకోవడమే తప్ప కనీసం మంచినీళ్లయినా ఇవ్వలేదండీ’’ అని నొచ్చుకుంటూ లోపలికి వెళ్లింది. ఆ అమ్మాయి లోపలికి వెళ్లిందని నిర్ధారించుకున్నాక సుధాకర్ అడిగాడు సూరిబాబుని ‘‘మీరు పలకరించినా ఏమీ మాట్లాడట్లేదా?’’ ‘‘లేదండీ.. అసలు తెలుగు అర్థమైనట్టు కూడా లేదు’’ చెప్పాడు ఆరుబయట ఉన్న తల్లివంక చూస్తూ! ఎయిర్పోర్ట్ నుంచి ఈ ఊరికి తోడుగా ఆమెతో సుధాకరే ఉన్నాడు. ఈ వాతావరణానికి ఆమెను అలవాటు చేయడానికి సుధాకర్ ఆమెను మాట్లాడిస్తూన్నా అరుంధతి ముభావంగానే ఉంది తప్ప పెద్దగా మాట్లాడలేదు. ఆ మాట్లాడిన నాలుగు ముక్కలూ అరబ్ భాషకు సంబంధించనవే. ఇన్నేళ్లు అక్కడే ఉండడం వల్ల అది సహజం అనుకున్నాడు. అయితే అప్పుడే సుధాకర్‌కు ఆశ్చర్యం కలిగించిన విషయం.. ఆమె ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రాగానే ఆమెతో పాటు ఉన్న వాళ్లు తనను ఆమెకు, ఆమెను తనకు పరిచయం చేసినప్పుడు.. పిల్లల గురించి, వాళ్లెందుకు రాలేదని అడగకపోవడం. దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ కుర్చీలోంచి లేచి అరుధంతి దగ్గరకు వెళ్లాడు సుధాకర్. ‘‘అమ్మా..’’ అంటూ ఆమె భుజమ్మీద చేయివేశాడు అనునయంగా. అంతే అతని రెండు చేతులు పట్టుకొని ఏడ్చేసింది అరుంధతి. కడుపులోంచి వస్తోంది దుఃఖం. ‘‘అయ్యో.. అమ్మా.. ఎందుకేడుస్తున్నారు? ఏమైంది?’’ అడిగాడు అరబ్‌లో సుధాకర్. ‘‘పిల్లలు గుర్తొస్తున్నారు. వాళ్లు లేకుండా నేనుండలేను’’ అరబ్‌లోనే చెప్తూ అతని అరచేతుల్లో మొహం దాచుకొని పొగిలి పొగిలి ఏడ్వసాగింది. ఆ మాటకు బిత్తరపోయాడు సూరిబాబు. కాఫీ గ్లాసులతో అప్పుడే గుమ్మంలోకి వచ్చిన రేవతీ ఖిన్నురాలైంది. ‘‘నీ పిల్లలు ఇక్కడే ఉన్నారు కదమ్మా.. అందుకేగా ఇక్కడికి వచ్చారు’’ చెప్పాడు సుధాకర్ అరబ్‌లోనే. ‘‘ఏరీ.. వచ్చారా పిల్లలు?ఏరీ’’ అని వెదుక్కుంటూ లేచింది. ‘‘ ఇక్కడే ఉన్నా.. ఇదిగో కాఫీ తేవడానికి వంటింట్లోకి వెళ్లా... ’’అంటూ ఓ కాఫీ గ్లాస్‌ను సుధాకర్ దగ్గర పెడ్తూ ఇంకో కాఫీ గ్లాస్‌తో తల్లి దగ్గరకు పరిగెత్తింది రేవతి. ఈసారి అరుంధతి బిత్తరపోయింది. ‘‘అమ్మా.. ’’ అంటూ రేవతి ఆమెను హత్తుకోబోతుంటే అపరిచితురాలిని చూసినట్టు చూస్తూ తోసేసింది. ‘‘పిల్లల దగ్గరకు తీసుకెళ్లండి’’ అంటూ మళ్లీ సుధాకర్ దగ్గర వచ్చి అతని చేతులు పట్టుకుంది. ఇదంతా చూస్తున్న సూరిబాబుకి నోట మాటే రావట్లేదు. షాక్ అయినట్టుగా అలా ముందు గదిలోనే ఉండిపోయాడు. మల్లెపందిరి గుంజకు తలకొట్టుకుంటూ ఏడుస్తోంది రేవతి. సుధాకర్ వెళ్లి రేవతిని ఆపి.. ‘‘మీ అమ్మ ఇన్నేళ్లూ అక్కడే.. ఆ షేక్ పిల్లలను పెంచి పెద్దచేస్తూండడం వల్ల వాళ్లే తన పిల్లలనే భ్రమలో ఉంది. కొంచెం టైమ్ పడ్తుంది మామూలు అవడానికి. కంగారు పడకండి’’అని చెప్పి అరుంధతి దగ్గరకు వచ్చాడు. ఫోన్లో వీడియో ఆన్ చేసి ‘‘ఇందులో మీ పిల్లలకు చెప్పండి.. వచ్చి మిమ్మల్ని తీసుకెళ్లమని..’’ అంటూ ఆ ఫోన్‌ను ఆమె చేతికిచ్చాడు సుధాకర్. ఆత్రంగా ఫోన్ అందుకని ఏడుస్తూ అరబ్‌లో ఆ షేక్ పిల్లలకు ఏదో చెప్పసాగింది అరుంధతి. అయోమయంగా బయటకు వచ్చిన సూరిబాబుని చూసి.. అతని దగ్గరకు వెళ్లి.. భుజం తడుతూ ‘‘ఆమె మాట్లాడుతున్న ఈ వీడియోను షేక్‌కి పంపిద్దాం. పిల్లలతో మాట్లాడించమని చెబుదాం. వాళ్లతోనే నచ్చచెప్పే ప్రయత్నం చేయిద్దాం.. వర్రీ అవకండి. అంతా సర్దుకుం టుంది’’ అంటూ ధైర్యమిచ్చాడు సుధాకర్. -
కరామా
చర్చి ఆవరణలో గుంపులు గుంపులుగా మాట్లాడుకుంటున్న కేరళ, ఆంధ్రప్రదేశ్ మహిళలల్లో.. కరుణను వెదుక్కోసాగాడు గంగాధర్. అతణ్ణి చూసిన కరుణ ‘‘గంగాధర్...’’ అని పిలుస్తూ చేయి ఊపింది. తన పేరు వినిపించిన వైపు వెళ్లాడు. ‘‘మస్తు సేపట్నించి నిలబడ్డవా?’’ అడిగాడు. ‘‘లేదు ఇప్పుడే అయిపోయింది’’ అంది అతణ్ణి చేరుకుంటూ. చలికాలపు ఉదయం వాతావరణం ఆహ్లాదంగా ఉంది. ఇద్దరి నడక ఒక్కటిగానే సాగుతున్నా.. మనసుల్లో వేర్వేరు ఆలోచనలు! ‘‘ఎట్ల మొదలు వెట్టాలే?’’ అని గంగాధర్‌లో, ‘‘తను చెప్పేవాటికి ఒప్పు కుంటాడో లేదో?’’ అని లక్ష్మీ కరుణలో ఒకరకమైన అంతర్మ థనం! ‘‘సమర్ ఖండ్‌కి పోదామా?’’ అడిగాడు. సరే అన్నట్టుగా తలూపింది ఆమె. ‘‘ఆ హోటల్లో పనిచేస్తున్న ఫ్రెండ్.. కరామాలో బంకర్..’’ అని నాలుక్కర్చుకున్నాడు. ఆ చివరి మాట విననట్టే నటించింది ఆమె. ఇంకా చెప్పాలంటే ఆ మాటతో ఒక ధైర్యం కూడా వచ్చినట్టయింది ఆమెకు. తేలికగా శ్వాసను వదులుతూ హాయిగా నిట్టూర్చింది. అంతలోకే మనసులో ఏదో దిగులూ మొదలైనట్టుంది.. తన కేరళ ఫ్రెండ్ షేర్లీ పనిచేసే షేక్ దగ్గరే గంగాధర్ కూడా పనిచేస్తున్నాడు డ్రైవర్‌గా. అట్లా షేర్లీతోనే పరిచయం అయ్యాడు. అప్పటి నుంచి ప్రతి శుక్రవారం చర్చి దగ్గరకు వస్తున్నాడు. కలుస్తున్నాడు. అతని మనసులో ఏముందో తనకు తెలుసు.. కాని తనకిది కొత్త. దుబాయ్‌కి ఆ మాటకొస్తే గల్ఫ్‌కే తను వచ్చి యేడాది అవుతోంది. మూడేళ్ల పిల్లాడిని అమ్మ దగ్గర వదిలేసి. తాగుబోతు సచ్చినోడు.. వాడే బాగుంటే ఇక్కడ ఇలా.. ఈ దున్నపోతు పిల్లల ముడ్లు, షేక్ పెళ్లాల గుడ్డలు, ఎంగిలి కంచాలు కడిగే ఖర్మే పట్టేది కాదు. వాడికి కష్టపడ్డం చేతకాక తనను పంపించాడు. పిల్లాడు ఎలా ఉన్నాడో.. ఏం తింటున్నాడో...’’ అనుకుంటూంటే కళ్లల్లో నీళ్లొచ్చాయి లక్ష్మీ కరుణకు. ‘‘కరుణా.. నా రూమ్ ఇక్కడ్నే’’ అంటూ తన బ్యాచలర్ రూమ్ ఉన్న రెడ్డి కంపౌండ్‌ను చూపిస్తున్న గంగాధర్ మాటతో తన జ్ఞాపకాలను వదిలేసింది ఆమె. సమర్ ఖండ్‌లోని మూల టేబుల్ దగ్గర ఎదురెదురుగా కూర్చున్న వాళ్లను చూసి సర్వర్ డ్రెస్‌లో ఉన్న ఓ వ్యక్తి వచ్చాడు.. ‘‘హలో గంగన్నా..’’అంటూ! ‘‘ఆ.. రాజేష్’’అంటూ ఆ వ్యక్తికి షేక్ హ్యాండ్ ఇచ్చి ‘‘ కరుణ, ఆంధ్ర’’ అంటూ పరిచయం చేశాడు. పలకరింపుగా నవ్వింది ఆమె. ‘‘టిఫిన్ జేస్తరు కదా..?’’ అడిగాడు రాజేష్. అవునన్నట్టు తలూపాడు గంగాధర్. ‘‘ఇడ్లీ, దోసె.. పెసరట్టు.. ’’ అంటూ అతను ఇంకేదో చెప్పబోతుంటే ‘‘పెసరట్టు, ఉప్మా’’ అన్నది లక్ష్మీ కరుణ. రాసుకుంటూ ‘‘నీకు అన్నా..’’ అడిగాడు గంగాధర్‌ను. ‘‘రెండు ఇడ్లీ, వడ తమ్మీ’’చెప్పాడు గంగాధర్. రాసుకొని లోపలికి వెళ్లాడు అతను. గంగాధర్ కళ్లకు తన కళ్లు చిక్కకుండా హోటల్ నాలుగు దిక్కులను, అందులోని జనాన్ని పరిశీలించడం మొదలుపెట్టింది ఆమె. గంగాధర్ చూపులు కరుణ మీదున్నాయి కాని.. మెదడు తన ఊళ్లోని ఇంటికి వెళ్లింది. ఇద్దరు ఆడివిల్లలు.. కొడుకు పుడ్తడు మూడో కాన్పు సూడుండ్రిరా అని అమ్మ అంటే ఇంట్ల ఎవ్వరికీ తెల్వకుండా సర్కారు దవాఖాన్ల ఆపరేషన్ జేసుకొని అచ్చిండు. జీవితంల ఏదన్న మంచి పని జేషిండు అంటే గదే! ఉన్న రెండకరాల పొలంకు వారసుడు లేకుండా జేషిండు కొడుకు అని అమ్మ ముక్కు చీదని చుట్టపు ఇల్లు లేదు. గల్ఫ్‌ల ఉంటున్ననని ఆ పొలంకు రైతుబంధు కూడా వస్తలేదు. ఏం జేస్తడు? మంచమున్నంతల్నే కాళ్లు జాపుకోవాల్నని బాపమ్మ జెప్తుండే. తాత ఇచ్చిన షేనుందా? బాపు సంపాదించిపెట్టిన బంగ్లలున్నయా గంపెడు పోరగాండ్లను కని సాకతందుకు? పెండ్లాం నూకితే నూరడ్డాలు వడేటట్టు ఉంటది. ఆ బక్కపానానికి బీడీలు జేసుకుంట ఇల్లెల్లేటట్టు జూస్తుంది. తను పంపేది మిత్తీలు, అప్పులు కట్టతందుకే అయితుంది. కాపాయం దాకా రానేరాలే ఇంకా! గివన్నీ దల్సుకుంటే ఇండియాకే పోబుద్ధికాదు... ‘‘గంగన్నా...’’ అంటూ రాజేష్ అతని భుజం తడ్తేకాని తను దుబాయ్‌లో ఉన్న సంగతి గుర్తుకురాలేదు గంగాధర్‌కు. ‘‘ఏమైంది’’ అన్నట్టు సైగ చేసింది లక్ష్మీకరుణ. ‘‘ఏం లేదు’’ అన్నట్టు కళ్లతోనే చెప్పి ముందున్న టిఫిన్ ప్లేట్ వైపు చూశాడు. తన బ్యాగ్‌లోంచి శానిటైజర్ తీసి అతనికి ఇచ్చింది. చేతులు తుడుచుకొని టిఫిన్‌కు ఉపక్రమించాడు. ‘‘అన్నా.. మధు ఎరికే గదా నీకు?’’ అడిగాడు రాజేష్ గంగాధర్ పక్కనే కూర్చుంటూ. ‘‘కోరుట్ల మ«ధే గదా..’’ నోట్లో ఇడ్లీ ముక్కతో గంగాధర్. ‘‘ఔనే..! గాయన, కడ్తాల్ శ్రీను ఇద్దరు కల్సి కరామాలో ఒక కాంప్లెక్స్‌ల అపార్ట్మెంట్ లీజ్‌కి తీస్కున్నరు. గండ్లనే ఒక బంకర్బెడ్ ఉన్నదన్నడు మధు. ఇయ్యాల నువ్వు కలుస్తవని జెప్పిన. ఫోన్ నంబర్ ఇస్త నీకు.. పొయ్యి కలువు.. ఓకే అయినట్టే’’ చెప్పాడు రాజేష్. అతని మాటలు వింటూ లక్ష్మీకరుణ వంక చూశాడు గంగాధర్. ఆమె తల వంచుకొని ఉప్మాను పెసరట్టుతో చుడుతోంది. ‘‘సరే’’అన్నట్టు తలూపాడు గంగాధర్. ‘‘మంచిదన్నా మరి.. పోతా.. మేనేజర్ చూస్తే ఒర్రుతడు. మధు నంబర్ నీకు మెసేజ్ చేస్తా.. ’’ అంటూ లక్ష్మీకరుణ వైపూ తిరిగి వీడ్కోలుగా నవ్వి.. గంగాధర్ ఎడమ చేయిలో చేయివేసి ‘‘ఆడికి వొయినంక ఏదన్నా ప్రాబ్లం ఉంటే కాల్ జెయ్’’ అని చెప్పి పనిలోకి వెళ్లిపోయాడు రాజేష్. మెట్రో స్టేషన్‌వైపు వెళ్తుంటే చెప్పింది లక్ష్మీకరుణ.. ‘‘ముందు షాపింగ్‌కి పోదాం.. ’’ అని. అర్థమైంది గంగాధర్‌కు. లక్ష్మీకరుణను కాస్త ముందు నడవనిచ్చి జేబులోంచి పర్స్తీసి చూసుకున్నాడు.. అయిదు, ఇరవై నోట్ల దిర్హామ్‌ల చిన్న కట్ట ఉంది. ఊపిరి పీల్చుకొని ఆమెను అనుసరించాడు. అంతకు ముందు సాగిన వాళ్ల అంతర్మాథ నానికి వాళ్ల ప్రయత్నం లేకుండానే పరిష్కారం దొరికి నట్టయింది. ∙సరస్వతి రమ -
‘మీ అక్క ఒక్కతే కూసోని కాళ్లెట్ల గడుతదయ్యా’
‘‘ఎప్పుడడిగినా ఇగో అస్తడు.. అగో అస్తడంటిరి? ఏడి? లగ్గం మూర్తం టైముకి కూడా జాడలేకపాయే?’’ కోపాన్ని తమాయించుకుంటూ అతను. ‘‘నిజంగనే అస్తడనుకున్నం. చూస్తుండ్రు గదా.. మా బావ కోసం మేం జేయని ప్రయత్నం లేదు’’ పరిస్థితిని అర్థం చేయించే ప్రయత్నంలో అంజయ్య. ‘‘ఎంత సౌదిల ఉంటే మాత్రం ఒక్కగానొక్క ఆడివిల్ల పెండ్లికి రాకుంట ఉంటడా ఏ తండ్రి అయినా?’’ నిష్టూరంతో అతను. ‘‘నువ్వన్నది నివద్దే. మా బావకు సుత రావాల్ననే ఉంటది కదా అన్నా. గాయన లేకుండ పెండ్లి జేసుడు మాకు మాత్రం గమ్మతా చెప్పు! గివన్నీ మాట్లాడుకుంట జిలకర్రబెల్లం మూర్త ఎత్తిపోగొట్కోవద్దన్నా.. ఈడిదాకా ఓపిక వట్టిండ్రు.. గాయింత గీ అక్షింతలు వడేదాకా సబర్ వట్టుండ్రి జెర’’ బతిమాలుకున్నడు అంజయ్య. ‘‘మీ అక్క ఒక్కతే కూసోని కాళ్లెట్ల గడుతదయ్యా?’’ రాజీకొచ్చేస్తూ అతను. ‘‘అవునుల్లా..!’’ ఆలోచనల్లో పడ్డాడు అంజయ్య. అంతలోకే ఏదో తట్టినట్టయి ‘‘మేనమామను నేను కడుగుతా నా భార్యతో కూసోని’’ అంటూ లోపలికి వెళ్లాడు వాళ్లక్కకు చెప్పడానికి. పంచాయతీ ఆఫీస్‌నే పెళ్లి కోసం ఫంక్షన్ హాల్‌గా తీసుకున్నారు. ఆవరణలో పందిరి వేశారు. పంచాయతీ ఆఫీస్‌లోని రెండు గదులు, హాలును విడిదిగా చేసుకున్నారు.∙∙ ‘‘ఊకో బిడ్డా.. మీ నాన్న అస్తడు’’ అంటూ తన మేనకోడలిని బుదిరికిస్తున్న తన అక్కను పిలిచాడు అంజయ్య.. ‘‘అక్క ఒకపారిట్రా’’ అంటూ! ‘‘ఏమైందిరా అంజిగా..’’ ఉలిక్కిపడ్డట్టు ఒక్కసారిగా బిడ్డ మీద నుంచి తమ్ముడి మీదకు దృష్టిమరల్చింది లక్ష్మమవ్వ. ‘‘మీ ఇయ్యంకుడు కాళ్లెవరు కడ్గుతరు అని అడుగుతుండు’’ చిన్నగా చెప్పాడు అక్కకు. ‘‘అమ్మా..! నాన్న లేకుండా నేను ఈ పెండ్లి జేసుకోనే!’’ కుమిలి కుమిలి ఏడ్వసాగింది పెళ్లికూతురు. ‘‘అట్లనకు బిడ్డా! నోరెట్లాడితే నొసలట్లాడ్తదంటరు! నీ కాళ్లు మొక్కుతా’’ కూతురి తలను తన ఛాతిలో దాచుకుంటూ ఓదార్చింది లక్ష్మవ్వ. ‘‘సూడ్రా.. ఏం జెప్పాలే మీ బావ కథ. పిల్ల లగ్గం కుదరంగనే అస్తా అన్నడు. పదిహేర్రోజులల్లనే పెండ్లి జేసేద్దమే.. ఎక్వతక్వ ఛుట్టీలు దొర్కయ్ నాకు అని జెప్పిండు. ‘‘ఏమాయె ఎప్పుడొస్తున్నవ్’’ అని పోరంగా పోరంగా..‘‘ రేపే ఎల్తున్ననే.. సేటు ఆపిండు అర్జెంట్ పనుందని’’ అని జెప్పినోడు జిలకరబెల్లం టైమ్ దాకా కూడా పత్తా లేకపోతే ఏమనుకోవల్రా? ఇద్దరు కొడుకుల నడుమ పుట్టిన పిల్లని ఎంత పావురంతో పెంచుకున్నడు! బిడ్డ మంచి ఇంట్ల వడాల్నని ఎంత కష్టవడ్డడు! బిడ్డ పెండ్లి ఇట్ల్ల జేద్దమే.. అట్ల జేద్దమే.. ఆళ్లను విలుద్దం.. ఈళ్లను విలుద్దమని.. అస్సల్ టైమ్‌కి ఆయననే రాకపోతే ఎట్లరా? ’’ అంటూ లక్ష్మవ్వా కన్నీళ్లొత్తుకుంది. చివుక్కుమంది అంజయ్య మనసు. ‘‘ఊకోవే అక్కా.. మేమంతా లేమా? ’’ అంటూ లక్ష్మవ్వ వీపు నిమిరాడు ఓదార్పుగా. ఇంకోవైపు పెళ్లికూతురూ ఏడుస్తూనే ఉంది..తన సెల్ ఫోన్లో స్క్రీన్సేవర్గా ఉన్న వాళ్ల నాన్న ఫోటోను చూసుకుంటూ! లక్ష్మవ్వ తేరుకుని చీర కొంగుతో కళ్లు తుడుచుకుంటూ ‘‘ ఇయ్యంపులోల్లేమన్నా లొల్లి వెడ్తుండ్రా?’’ తమ్ముడిని అడిగింది ‘‘ఆ..! బిడ్డ పెండ్లికి మించిన పన్లేముంటయ్ అయ్యకు? కాళ్లెవలు కడ్గుతరు? అని అడుగుతుండు మీ వియ్యంకుడు’’ చెప్పాడు అంజయ్య. ‘‘నా బిడ్డ పెండ్లికి నేను కడ్గగ ఇంకోల్లు కడ్గుతరుల్లా..’’ పైట అంచును బొడ్లో దోపుకుంటూ గదమాయించింది ఆమె. ‘‘బావ లేకుండా నువ్వెట్లా కాళ్లు కడ్గుతవే?’’ అయోమయంతో అంజయ్య ‘‘ఎట్లేంది?ఆయన తువ్వాలు బొడ్ల చెక్కుకుంటా. ఇంకొక కొనను నా కొంగుకు ముడేసుకుంటా. ఇంకా మాట్లాడ్తే... పక్కపొంటి పీట మీద ఆయన ఫోటో వెట్కుంట’’ కచ్చితంగా చెప్పింది లక్ష్మవ్వ. అక్క తాపత్రయం ఆ తమ్ముడి కంట నీరు తెప్పించింది. ఆ మాటవిన్న పెళ్లికూతురైతే తల్లిని, మేనమామను పట్టుకొని ఏడ్చేసింది. ‘‘నడువుండ్రి.. నడువుండ్రి.. మూర్తం ఎత్తిపోదిక్కి! పంతులు లొల్లివెడ్తడు మల్ల..’’ అంటూ అక్క, మేనకోడలి భుజాలు పట్టుకొని ముందుకు నడిపించాడు అంజయ్య. అప్పటికే పందిట్లో బ్రాహ్మడి హడావిడి మొదలైంది.. ‘‘లక్ష్మవ్వా కన్యాదానం చెయ్యాలే..’’అంటూ తొందరపెట్టాడు పంతులు ‘‘అస్తున్న పంతులూ ’’ అంటూ మళ్లీ లోపలికి పరిగెత్తి.. భర్త ఫోటో, పెళ్లికోసమని అతనికి తెచ్చిన కొత్తబట్టల్లోని ఉత్తరీయాన్ని గబగబా తెచ్చింది లక్ష్మవ్వ. ఈలోపు పెళ్లి కూతురును పందిట్లోకి తీసుకొచ్చాడు మేనమామ అంజయ్య. పీట మీద భర్త ఫొటో పెట్టుకొని, బొడ్లో ఉత్తరీయం కొసను దోపుకొని, మరో కొసను కొంగుకు ముడివేయించుకొని కన్యాదాన కార్యక్రమానికి ఉపక్రమించింది లక్ష్మవ్వ. మండపంలో ఉన్న వాళ్లందరి మనసులూ భారమయ్యాయి ఆ దృశ్యం చూసి.. అందరి కళ్లలో నీటి చెమ్మ. ఆ వేడుకకు ఆవల.. కొంత దూరంలో.. ఓ వ్యక్తి.. పెళ్లికూతురు అన్నకు ఒక బ్యాగ్ ఇస్తూ ‘‘బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకున్నవా? పెండ్లయిపోయినంక ఒకసారి కాల్ చేయమన్నడు సేటు’ అని చెప్తున్నడు ఆ వ్యక్తి. ‘‘ఊ... ’’ అంటూ బ్యాగ్ అందుకుంటున్న పెళ్లికూతురి అన్నకు ఒక్కసారిగా దుఃఖం పొంగుకొచ్చింది. బ్యాగ్‌లో మొహం దాచుకుని గుండెపగిలేలా ఏడ్వసాగాడు. ఆ కుర్రాడిని ఎలా ఓదార్చాలో అర్థంకావట్లేదు వచ్చిన వ్యక్తికి. ‘‘మీ చెల్లె కోసమని సేఠ్ భార్య బంగారం పంపింది’’ అంటూ బ్యాగ్‌ని తడిమాడు అందులో ఆ బంగారం భద్రంగా ఉంది అన్నట్టుగా. ‘‘ఏడ్వకు పిల్లగా.. నువ్వే గిట్లయితే మీ అమ్మ, చెల్లె, మీ తమ్ముడ్ని ఎవరు ఊకోవెడ్తరు చెప్పు..’’ అంటూ ఆ పిల్లాడిని సముదాయించ చూశాడు. ఆ మాటతో మరింత దుఃఖం పెరిగింది ఆ పిల్లాడికి. ‘‘ఏడ్వకు పొల్లగా.. అందరికి అనుమానమొస్తది. ఎట్ల జెప్పాల్నో తెలుస్తలేదు.. శ..వం.. రాతందుకు పదిహేను రోజులైనా..’’ అని ఆగిపోయాడు ఆ వ్యక్తి. అంతే ఆ మాటకు బ్యాగ్ కిందపడేసి ఆ వ్యక్తిని పట్టుకొని మళ్లీ బోరుమన్నాడు ఆ అబ్బాయి. ‘ ‘రేపు ఇండియాకస్తడనంగా సైట్‌కి వోయిండు.. పై నుంచి కిందవడ్డడు.. నెత్తివగిలి ఆడ్దాన్నే ప్రాణమిడ్శిండు. ఈ సంగతి మీ చెల్లె పెండ్లి అయ్యేదాకా బయటవెట్టొద్దని సేఠే జెప్పిండు మీ ఊరోళ్లతోని’’ అంటూ జరిగింది మరోసారి చెప్పాడు ఆ వ్యక్తి.. అక్కడ పందిట్లో జీలకర్ర బెల్లం తంతు అయిపోయి.. అంక్షితలు పడ్తున్నాయేమో ఒక్కసారిగా బాజాభజంత్రీలు మోగసాగాయి గట్టిగా! -సరస్వతి రమ -
ఆ ఊళ్లో మళ్లీ అలజడి మొదలైంది
కొన్ని పదుల సంవత్సరాల తర్వాత ఆ ఊళ్లో ఆ రోజు మళ్లీ అలజడి మొదలైంది. పెద్దవాళ్లెందుకు అంత కలవర పడ్తున్నారో అర్థంకాని పిల్లలకు అదంతా అయోమయంగా ఉంది. ఎవరికీ పట్టని ఊరి చివరన ఉన్న బంగ్లా మాత్రం కొన్నేళ్ల తర్వాత బూజులు దులుపుకొని.. సున్నాలు వేసుకొని అందంగా ముస్తాబైంది. ఊరవతల ఉన్న చెరువు గట్టు.. చేలు, చెల్కల్లో ఆడ్డానికి వెళ్లే పిల్లలనెప్పుడూ ఆకర్షించని ఆ మేడ ఈ రోజు వాళ్లను తెగ ఊరిస్తోంది.. లోపలికి వెళ్లి చూసేలా! పెద్దవాళ్లేమో కట్టడి చేస్తున్నారు.దీన్నీ పట్టించుకోని ఆ బంగ్లా వారసురాలు.. మాతృతర్పణం సమర్పించేందుకు తన పెద్దలకు ఇష్టమైన వంటకాలను వండిస్తోంది. ఆ రాత్రి జరిగే ఆ విందుకు ఊళ్లో వాళ్లందరినీ ఆహ్వానించింది. ఆ ఊళ్లో అలజడికి అదే కారణం. ఆ రోజు తెల్లవారి.. వాకిళ్లు ఊడ్చుకుని కళ్లాపి చల్లుకుందామని వాకిళ్లలోకి వచ్చేసరికి.. కళ్లాపి చల్లి ముగ్గు కూడా పెట్టున్నాయి అందరి ముంగిళ్లు. విస్తుపోయారంతా.. ఒకరింటి వైపు ఒకరు చూసుకొని! ఆ ముగ్గు కిందే.. ‘‘ఈ రోజు రాత్రికి.. మా పెద్దలకు మాతృతర్పణం చేస్తున్నాను.. ఈ ఊరి ఆడబిడ్డగా మీ అందరినీ ఆ విందుకు పిలుస్తున్నాను.. తప్పకుండా రావాలి’’ అని రాసుంది ముగ్గు పిండితోనే! హతాశులయ్యారంతా ఇలా ఎవరైనా పిలుస్తారా? అని. అంతే పెద్దవాళ్లందరికీ చిన్నప్పడు తమ పెద్దలు.. ఆ పెద్దలకు వాళ్ల పెద్దలు చెప్పిన కథలు గుర్తొచ్చాయి. ఒకప్పుడు ఆ ఊరు.. ఊరు కాదు... బద్దకస్తుల అడ్డా! పనీపాటా లేకుండా మగవాళ్లంతా తాగి తందనాలాడుతుంటే.. ఆడవాళ్లు కష్టం చేస్తూ కుటుంబాలు నడిపేరు. ఆ కాలంలోనే ఆ ఊరి చివర ఆ బంగ్లా వెలిసింది. దాని పునాదుల నుంచి కప్పు దాకా అంతా ఆడవాళ్ల కష్టమే. అయితే ఆ బంగ్లా యజమాని, అతని కొడుకులు పనిచేయడానికి వచ్చిన చాలామంది ఆడవాళ్ల గౌరవ మర్యాదలను మంట గలిపారు. వాళ్లంతా ఆ ఇంట్లోనే ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ బంగ్లా కట్టడం పూర్తయి ఇంట్లో వాళ్లు గృహప్రవేశం చేసిన రోజే యజమాని రక్తం కక్కుకొని చనిపోయాడట. ఆ తర్వాత అమావాస్యకు ఆయన పెద్ద కొడుకు.. ఆ తర్వాత ఇంకో కొడుకు.. ఇలా ఆ ఇంట్లో మగవాళ్లంతా ప్రాణాలు కోల్పోయారు. వాస్తు దోషమేమో అని భయపడ్డ ఇంటి ఆడవాళ్లు బంగ్లా వదిలి వెళ్లిపోయారు. అప్పటి నుంచి కొన్నేళ్ల దాకా ఎవరూ లేక ఆ బంగ్లా అలా పాడుబడి భూత్ బంగ్లాగా పేరు తెచ్చుకుంది. అదే సమయంలో ఊళ్లో పరిస్థితులు చక్కబడ్డం మొదలుపెట్టాయి. ఏమైందో తెలియదు.. దసరా ముందు అమావాస్య రాత్రి... ఇలాగే ఆ ఊరికి కొంతమంది ఆడవాళ్లు వచ్చారు.. చక్కగా ముస్తాబై. ఆ ఊరి మర్రి కిందకు మగవాళ్లందరినీ విందుకు పిలిచారు. మగవాళ్లంతా వెళ్లారు. ఆ తెల్లవారి నుంచే వాళ్ల ప్రవర్తనలో నెమ్మదినెమ్మదిగా మార్పు రావడం మొదలుపెట్టింది. తాగుడు మానేశారు. పనులకు వెళ్లడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఆ ఊరి చివర బంగ్లాలో కూడా అలికడి వినిపించసాగింది ఆ ఊళ్లో వాళ్లకు. కొన్ని సంవత్సరాలు కొనసాగింది అది. ఆ సమయంలోనే ఊరికి బడి వచ్చింది. ఆడపిల్లలనూ బడికి పంపడం మొదలుపెట్టారు తల్లిదండ్రులు. పెద్ద కులాలు, చిన్న కులలాల మధ్య ఊళ్లో ఉన్న సరిహద్దులు చెరిగిపోయాయి. అప్పటిదాకా ఆడవాళ్లను ఏడిపించిన మగవాళ్లు వాళ్లను గౌరవించడం మొదలుపెట్టారు. కులం, మతం, కట్నం ఊసు లేకుండా పెళ్లిళ్లు అవసాగాయి. దేనికీ పెద్దవాళ్ల నుంచి అభ్యంతరాలు రావట్లేదు. వాదోపవాదాల్లేవు. అన్నీ చర్చలే! ఆ ఊరు గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు సర్పంచులుగా ఆడవాళ్లే ఏలారు. తర్వాత మండలం అయింది. దానికి రెవెన్యూ అధికారులు అమ్మాయిలే. మండల పరిషత్ ప్రెసిడెంట్‌గా ఆడవాళ్లే. అందరూ కలిసి ఆ ఊరిని ఓ తీరుగా తీర్చిదిద్దారు. ఊరికి పొలిమేరగా అడవిని పెంచారు. ఇదంతా కావడానికి కొన్నేళ్లు పట్టింది. అన్నేళ్లూ ఆ బంగ్లాలో అలికిడి ఉండింది. అయితే ఊరి బాగు మీదకు మనసు మళ్లించిన ఊళ్లో వాళ్లంతా ఆ బంగ్లా గురించి.. అందులోని అలికిడి గురించీ మెల్లగా మరిచిపోయారు. అంతేకాదు.. అదొక భూత్ బంగ్లా దాని జోలికి పోవద్దనే అప్రకటిత నిర్ణయానికీ వచ్చేశారు. ఆ బంగ్లాలో ఏవో శబ్దాలు మొదలుకాగనే ఏదో శక్తి వచ్చి ఆ ఊళ్లో మగవాళ్లను, ఊరినీ మార్చేసి రక్షించిందని నమ్ముతుంటారు. అన్నేళ్ల తర్వాత ఇప్పుడు ఇలా.. మళ్లీ ఆ బంగ్లా సున్నాలేసుకొని మెరుస్తూండేసరికి అందరికీ భయం మొదలైంది. ఆ రాత్రి విందుకు పిలిచిందెవరు? వెళ్లాలా వద్దా ? అని చర్చించుకోవడానికి ఊళ్లో వాళ్లంతా సమావేశమయ్యారు. ‘‘ఆ బంగ్లా దొర మునిమనమరాలో ఏమో.. తన ముత్తాత, తాతల వల్లే మన ఊరి ఆడోళ్ల ప్రాణాలు పోయినయ్ కదా.. బంగ్లా మీద నుంచి ఆ పీడను పోగొట్టుకునేతందకు వచ్చిందేమో’’ అన్నది ఓ పెద్ద మనిషి. ‘‘అట్ల అయితే బాజాప్త ఇంటింటికి వచ్చి చెప్పాలే కాని దొంగ లెక్క వాకిట్ల ముగ్గేసి చెప్పుడేంది?’’ ఒక నడి వయసు స్త్రీ అభ్యంతరం. ‘‘యే.. ఇంటికి తాళం ఉంటే గడపకు బొట్టు పెట్టి చెప్పమా? అట్లనే చెప్పిపోయిందేమో?’’ మరో పెద్దమనిషి సమర్థింపు. ‘‘పోయిందేమో అంటున్నవ్? ఒక్కామెనే ఉన్నట్టు నీకెట్ల ఎరుక?’’ ఒక పురుషుడి సందేహం. ‘‘అందరి వాకిట్ల రాత ఒక్క తీర్గనే ఉంటే ఒక్కామెనే అనుకుంటున్నా’’ సమాధానమిచ్చింది ఆమె. ‘‘ఇంతకీ గామె ఆడామెనే అనే గ్యారెంటీ కూడా ఏమీ లేదు.. మగోళ్లు కూడా వచ్చి ఉండొచ్చు ఆ బంగ్లాలకి’’ అన్నాడు ఇంకోతను. ‘‘సరే.. ఏది ఏమైనా.. ఆల్ల పెద్దలకు బియ్యం ఇచ్చుకుంటున్నరు కాబట్టి.. మంచి మనసుతో పిలుస్తున్నరు కాబట్టి పోవుడే మంచిది.. అయితే పిల్లల్ని తీస్కపోవద్దు’’ అని తీర్మానించింది ఇంకో పెద్దావిడ. అందరికీ ఆ తీర్మానం నచ్చింది. రాత్రి అయింది.. అందరూ వెళ్లారు. ఇంద్రభవనంలా ఉంది ఆ బంగ్లా. దాని గురించి ఇన్ని రోజులు కథలుగానే విన్నారు. ఇప్పుడు కళ్లారా చూస్తున్నారు. ఆ ఇంటిని చూసే సరికే వాళ్ల కడుపు నిండిపోయింది. భోజనాలకైతే రమ్మన్నారు కాని లోపలికి ఆహ్వానించే వాళ్లెవరూ కనపడట్లేదు వీళ్లకు. అలాగే గుంపులుగా డైనింగ్ హాల్లోకి నడిచారు ఊరి జనం. ‘‘రండి.. రండి.. మీకోసమే ఎదురుచూస్తున్నాం ’’ అంటూ ఎదురుపడ్డారు ఇరవైమంది ఆడవాళ్లు. నుదుటన కాసంత బొట్టు.. ఎర్రటి చీరలు.. చెరగని నవ్వులతో ఉన్న వాళ్లను చూసి ఈ జనాల్లోని కొంత మంది తమ ముందు తరాల వాళ్లను పోల్చుకోవడం మొదలుపెట్టారు. ఇంతలోకే ఆ ఆడవాళ్లు పోలికలు వెదుక్కుంటున్న వాళ్ల దగ్గరకు వచ్చి ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. అర్థమైంది వాళ్లకు. ఆ ఆడవాళ్లు తమ ముత్తవ్వలు, అవ్వలన్నమాట. అప్పుడే ఓ పాతికేళ్ల అమ్మాయి వచ్చింది. ఆమెను ఆ ఊరి ప్రజలకు పరిచయం చేశారు ఆ ఆడవాళ్లు తమ వారసురాలిగా. విందు వడ్డించారు. వాళ్లు తిని చేతులు కడుక్కుని తాంబూలం తీసుకునేటప్పటికీ ఆ ఆడవాళ్లెవరూ లేరు. ఆ అమ్మాయిని అడిగారు అంతా కంగారు!‘‘మిమ్మల్నందరినీ చూడాలనుకునే ఈ విందును ఏర్పాటు చేయమన్నారు. చేశాను. చూసుకున్నారు. ఇక ఈ ఊరికి వాళ్లు, నేను ఎవరూ అసవరం లేదు. ఈ బంగ్లాను అనాథ శరణాలయం చేయండి’’ అంటూ ఆమే అక్కడి నుంచి వెళ్లిపోయింది. - సరస్వతి రమ -
పిల్లలను ఆటలు ఆడుకోనివ్వండి..!
సాయం సంధ్యవేళ.. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని హోమ్‌వర్క్ చేసుకుంటోంది వినూత్న. పదమూడేళ్లుంటాయి. ఎనిమిదో తరగతి చదువుతోంది. ఫుట్‌బాల్‌లో అంటే పిచ్చి. ఆమె ఉన్న టీమ్‌కి ఓటమి ఉండదు. తల్లిదండ్రులేమో బిడ్డను మెడిసిన్ చదివించాలనే పట్టుదలతో ఉన్నారు. టేబుల్ మీద నోట్‌బుక్.. చేతిలో పెన్నుందే కాని పిల్ల చిత్తం మాత్రం గేట్ వైపు పరిగెడ్తోంది. సరిగ్గా అదే సమయానికి ఆ కాలనీలోనే ఇంకో ఇంట్లో కూడా ఇంచుమించు ఇదే దృశ్యం.. ‘‘ఒరేయ్ ... దిక్కులు చూడ్డం మానేసి.. పుస్తకంలోకి చూడు. రేపటి అసైన్‌మెంట్‌లో ఒక్క మార్క్ తగ్గినా ఒళ్లు పేలిపోతుంది జాగ్రత్త.. ’’ తర్జనితో బెదిరిస్తూ ఓ అమ్మ. ఆ మాటలోని తీవ్రత, అమ్మ మొహంలోని సీరియస్‌నెస్‌ను చూసి భయంతో ‘‘సరే’’అన్నట్లుగా తలూపాడే కాని పదకొండేళ్ల ఆ పిల్లాడి మనసూ మెయిన్ డోర్ దగ్గరే తచ్చాడుతోంది. ఈ రెండిళ్లలోనే కాదు ఆ కాలనీలో పిల్లలున్న అన్ని ఇళ్లలోనూ దాదాపు ఇదే పరిస్థితి. ఆ పిల్లల ఆసక్తి అంతా ఆ ఇళ్ల ప్రధాన ద్వారాలకేసే ఉంది. కావస్తోంది.. టైమ్ కావస్తోంది.. ద్వారాలు తెరుచుకోకుండా విశ్వప్రయత్నాలు మొదలుపెట్టారు పెద్దలు.. టైమ్ అయింది... భళ్లున తెరుచుకున్నాయి గేట్లు.. తలుపులు! ఆ విసురుకు అడ్డుగా పెట్టిన బంధనాలన్నీ చెల్లాచెదురయ్యాయి. ఓ ఇంట్లోకి ఫుట్‌బాల్ ప్రవేశించింది... ఒక ఇంట్లోకి క్రికెట్ బాల్.. ఇంకో ఇంట్లోకి టెన్నీ కాయిట్.. మరో ఇంట్లో టేబుల్ టెన్నిస్ బ్యాట్.. వేరే ఇంట్లో షటిల్ బ్యాట్.. ఆ పక్కింట్లోకి టెన్నిస్ ర్యాకెట్... అంతే పిల్లల్లో ఊపు.. అది ఇల్లు అన్న ధ్యాసే లేకుండా.. ఫుట్‌బాల్... వాలీబాల్.. షటిల్.. టీటీ.. టెన్నిస్..కబడ్డీ.. జిమ్నాస్టిక్స్.. చెస్... స్కిప్పింగ్.. ఖో ఖో, జంపింగ్.. రన్నింగ్.. ఎవరికి నచ్చిన ఆటను వాళ్లు ఆడుతున్నారు. ఆ పిల్లలను పట్టడం పెద్దవాళ్ల వల్ల కావట్లేదు. అలా ఓ గంట.. గంటన్నర వీరంగం తర్వాత స్విచ్ ఆఫ్ చేసినట్టుగా పిల్లలంతా సోఫాల్లో.. కుర్చీల్లో సాగిలపడ్డారు. చెమటతో తడిసి ముద్దయిపోయారు. ఆట వస్తువులన్నీ వచ్చిన దారినే తిరిగి వెనక్కి వెళ్లిపోయాయి. ఇంట్లో వస్తువులన్నీ చిందరవందరయ్యాయి.. తలలు పట్టుక్కూర్చున్నారు పెద్దలు! అలిసిపోయిన పిల్లలు స్నానం చేసొచ్చి.. బుద్ధిగా పుస్తకాలు ముందేసుకొని చదువుకోసాగారు. రెండునెలలుగా ఆ కాలనీలో జరుగుతున్న తీరిది. ఆ ఆట వస్తువులన్నీ ఎక్కడి నుంచి వస్తాయో.. ఎవరు పంపిస్తున్నారో తెలియదు. పోలీస్ కంప్లయింట్ కూడా ఇచ్చారు. అయినా జాడ దొరకలేదు. నష్టమైతే జరగట్లేదు కదా.. పోనీండి ఆడుకోనివ్వండి పిల్లలను అని పోలీసులూ ఆ కేస్‌ను వదిలేశారు. తల్లిదండ్రులే పట్టువదలని విక్రమార్కుల్లా ఉన్నారు .. ఆ ఆరా తీయడానికి. వంతుల వారీగా అన్వేషణ జట్లు తయారయ్యాయి పెద్దలవి. అయినా లాభం లేకపోయింది. విడివిడిగా ఎవరిళ్లల్లో వాళ్లు పిల్లలను ప్రశ్నించారు.. ‘‘ఆ ఆటవస్తువులు ఎక్కడి నుంచి వస్తున్నాయి.. మీరెందుకలా ప్రవర్తిస్తున్నారు?’’ అని. తెలియక.. తెల్ల మొహాలు వేశారు పిల్లలు. ఈ పిడుగులు నాటకాలు ఆడుతున్నారు అని పెద్దలు పిల్లల మీద స్పైని పెట్టారు. పాపం.. పిల్లలు అమాయకులని తేల్చింది ఆ స్పై టీమ్. మరి ఈ ఆట ఆడిస్తున్నదెవరు? ఎప్పటిలాగే ఆ రోజూ రాత్రి అయింది. ఒంటి గంటకు.. షరామామూలుగా పెద్దల చెవుల్లో మోత.. భరించరాని మోత.. ఆ తర్వాత హెచ్చరిక.. ‘‘మీ కాలనీ గ్రౌండ్లో కట్టిన షాపింగ్ కాంప్లెక్స్‌ను కూల్చేస్తారా? లేదా?’’ ఇసుక.. మట్టి.. కలగలిపి డబ్బాలో వేస్తే ఎలాంటి శబ్దం వస్తుందో అలాంటి స్వరంతో! దిగ్గున లేచి కూర్చున్నారంతా! పదే పదే ఆ హెచ్చరిక.. ప్రతి పది నిమిషాలకు ఒకసారి! ఇదేమీ పట్టని పిల్లలు ప్రశాంతంగా నిద్రపోతున్నారు. పెద్దవాళ్లకు మాత్రం నిద్ర లేదు! అలాగే తెల్లవారి పోయింది. అరవై రోజులుగా ఇది నిత్యకృత్యమే అయినా ఆ రాత్రి హెచ్చరికెందుకో పెద్దవాళ్లందరిలో గుబులు రేపింది. పిల్లలు స్కూళ్లకు వెళ్లిపోయాక.. ఆఫీసులు మానేసి మరీ కమ్యునిటీ హాల్లో సమావేశమయ్యారు. ‘‘ నిన్న రాత్రి వార్నింగ్ కొంచెం భయంగా ఉంది’’ అంది ఓ తల్లి. ‘‘అవును.. ఆ షాపింగ్ కాంప్లెక్స్ కూలగొట్టించకపోతే మన ఇళ్లే కూలిపోతాయ్ అన్నట్టుగా ఉంది ’’ అన్నాడు ఓ తండ్రి. ‘‘ఏం చేద్దాం?’’ కొంతమంది బయటకి అనేశారు కొంతమంది మనసులోనే ప్రశ్నించుకున్నారు. ‘‘అసలప్పుడు ఆ షాపింగ్ కాంప్లెక్స్ కట్టకుండా అడ్డుకుంటే అయిపోయేది!’’ విచారంగా అన్నాడు మరో తండ్రి. ‘‘అవున్నిజమే. అక్కడ గ్రౌండ్ ఉన్నప్పుడు పిల్లలెంత సంతోషంగా ఉన్నారు? ఎంత హెల్తీగా ఉన్నారు?’’ ఓ తల్లి గతంలోకి వెళ్లింది. స్కూల్ నుంచి రాగానే బ్యాగ్‌లు పడేసి గ్రౌండ్‌కి వెళ్లిపోయే వాళ్లు. ఆడినంత ఆడి ఇంటికొచ్చే వారు ఆకలితో నకనకలాడుతూ. స్నానం చేసొచ్చి ఏది పెడితే అది ఆవురావురంటూ తిని హోమ్ వర్క్ చేసుకొని పక్క మీద వాలిపోతే తెల్లవారి గంట కొట్టినట్టుగా కరెక్ట్ ఆరింటికి లేచేవాళ్లు. మెతుకు మిగల్చకుండా టిఫిన్ బాక్స్ తిరిగొచ్చేది. టీవీ పెట్టినా చూసేవారు కాదు పిల్లలు. ప్రాజెక్ట్ వర్క్ కోసం తప్ప కంప్యూటర్ వైపు కన్నెత్తే వారు కాదు. ఫోన్స్‌తో ఆటే లేదు. ఫ్రెండ్స్.. ఆటలే వాళ్ల లోకం. ఏ పని చెప్పినా.. పరిగెత్తడమే. నిదానమైన నడకే లేదు. అసలు ఎంత ఉత్సాహంగా ఉండేవాళ్లు? కాలనీ కూడా గలగల్లాడుతూ ఉండేది. అనుకోవద్దు కాని ఆ గ్రౌండ్లో షాపింగ్ మాల్ వచ్చినప్పటి నుంచి కాలనీకి ప్రేత కళొచ్చేసింది. పిల్లల్లో మునుపటి ఉత్సాహం లేదు. వేళ్లాడిపోతూ.. కళ్ల కింద నల్లటి చారలతో పదేళ్లకే పాతికేళ్ల వాళ్లలా తయారవుతున్నారు. పెద్దాళ్లంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పిల్లలంతా తమ కళ్లముందే నిస్సత్తువతో నిర్జీవంగా.. అకాల వార్ధక్యాన్ని మోస్తూ తిరిగుతున్నట్టనిపించింది వాళ్లకు. మొహమొహాలు చూసుకున్నారు అంతా! ‘‘అది చెప్పినట్టే చేద్దాం.. ఈ రాత్రికే ముహూర్తం పెట్టుకుందాం’’ ముక్త కంఠంతో అన్నారు. అదృశ్య శక్తేదో ఆదేశించినట్టు ఎవరిళ్లకు వాళ్లు వెళ్లిపోయారు. ఆ రాత్రి తాము చేయబోయే పనికి రంగం సిద్ధం చేసుకోవడంలో మునిగిపోయారు. మరుసటి రోజు ఉదయం.. స్కూల్‌కి వెళ్లబోతున్న పిల్లలు తమ ఇళ్లకు ఎదురుగా సూర్యుడి కిరణాలతో ఆడుకుంటున్న గ్రౌండ్‌ను చూసి షాక్ అయ్యారు. తేరుకొని పుస్తకాల సంచీని అక్కడే పడేసి సంతోషంతో కేరింతలు కొడుతూ ఆ గ్రౌండ్లోకి పరిగెత్తారంతా! -సరస్వతి రమ -
భజనలో తల తెగిన శరీరం
‘‘సర్.. సర్...’’ భుజం తట్టి లేపేసరికి మెలకువ వచ్చింది పరశురామ్‌కి. నిద్ర బరువుతోనే కళ్లు తెరిచి చూశాడు. చేతిలో ఏదో పట్టుకొని ఓ పిల్లాడు.. మసక మసకగా కనిపించాడు. కళ్లు నులుముకుంటూ లేచి కూర్చున్నాడు. ‘‘ చాయ్’’ అంటూ ఆ పిల్లాడు పరశురామ్ మొహం మీదకి చేయి చాపాడు. ‘‘ఏయ్.. ఏందిది? ఎవరు నువ్వు’’ చిరాకు పడుతూ నెమ్మదిగానే ఆ అబ్బాయి చేతిని పక్కకు తోశాడు. ఆ పిల్లాడు ఆ టీ గ్లాస్‌ను అక్కడే ఉన్న బల్ల మీద పెట్టి నవ్వుతూ వెళ్లిపోయాడు. పొగలు గక్కుతోంది టీ! సందేహంగానే టీ గ్లాస్ చేతుల్లోకి తీసుకున్నాడు పరశురామ్. ఓ గంటకు.. ‘‘సర్...’’ అంటూ గుమ్మం దగ్గర్నుంచి పిలుపు వినిపించింది. ఖాకీ యూనిఫామ్‌ను సరిగ్గా సర్దుకొని ‘‘ఎవరూ?’’ అంటూ గుమ్మం వైపు నడిచాడు పరుశురామ్. అక్కడ ఓ పదమూడేళ్ల పిల్ల.. చేతిలో టిఫిన్ ప్లేట్‌తో. ‘‘టిఫిన్’’ అంది అతని ముందుకు టిఫిన్ ప్లేట్‌ను చాస్తూ! ‘‘ఎందుకు? అసలు మీరెవరు?’’ ఉదయం చిరాకు కొనసాగింది అతనిలో. ‘‘తెలీదు’’ అన్నట్టుగా చేయి తిప్పతూ లోపలికి పరిగెత్తింది ఆ పిల్ల. టేబుల్ మీద టిఫిన్ ప్లేట్ పెట్టేసి అంతే వేగంగా బయటకూ వెళ్లిపోయింది ఆ అమ్మాయి. పరశురామ్‌కి ఏమీ అర్థం కాలేదు. ఇంతలోకే ట్రైన్ సిగ్నల్స్ అందేసరికి క్లియరెన్స్ ఇవ్వడానికి ఎర్ర జెండా, పచ్చ జెండా పట్టుకొని క్యాబిన్ బాల్కనీలోకి వెళ్లాడు. క్యాబిన్మన్గా రెండు రోజుల కిందటే ఆ ఉద్యోగంలో చేరి.. ఆ ఊరికొచ్చాడు పరశురామ్.‘‘ఊరవతల అడవిలో ఒంటి స్తంభం మేడలా ఉంటుందంట క్యాబిన్.. ఒక్కడివే ఎలా ఉంటావురా..’’ అంటూ శోకాలతో సాగనంపారు ఇంట్లో వాళ్లు. అడవిలో క్యాబిన్ ఉన్న మాట వాస్తవమే కాని తన పెద్దవాళ్లు భయ పడినట్టుగా.. భయపెట్టినట్టుగా ఏమీ లేదు. మూడోరోజు.. ఇదిగో ఇలా టీ, టిఫిన్ల సర్వీసూ మొదలైంది.. అని అనుకుంటూండగానే మళ్లీ ఠక్కున ఆలోచన వచ్చింది పరశురామ్‌కి.. ‘‘ఇంతకీ ఆ పిల్లలు ఎవరు?’’ అని. రోజుకు మూడు ట్రైన్లు ఇటు వస్తాయి.. ఇంకో మూడు ఇటు నుంచి వెళ్తాయి. ఆ పూట రెండు ట్రైన్లకు సిగ్నల్ ఇచ్చేసి వచ్చి.. మళ్లీ పడుకున్నాడు పరశురామ్. సరిగ్గా మధ్యాహ్నం ఒంటి గంటకు.. తలుపు దబదబా బాదిన చప్పుడు.. దిగ్గున లేచి కూర్చున్నాడు పరశురామ్. వెళ్లి తలుపు తీశాడు. ఓ నలుగురైదుగురు అమ్మాయిలు, అబ్బాయిల గుంపు... ‘‘సర్ లంచ్’’ అంటూ విస్తరాకులో చుట్టి ఉన్న భోజనం ప్యాక్‌ను పరశురామ్ మొహం ముందు పెట్టాడు ఆ గుంపులోని ఓ అబ్బాయి. వింతగా అనిపించింది పరశురామ్‌కి. ఆ ప్యాక్‌ను తీసుకుంటూ ‘‘ మీరంతా ఎవరు? పొద్దున్నుంచి చూస్తున్నా. వేళకు టీ, టిఫిన్, భోజనం తెచ్చిస్తున్నారెందుకు? వీటికి డబ్బులు ఎంత? అసలు ఎక్కడుంటారు మీరు?’’ అంటూ ప్రశ్నలు కురిపించాడు. ఆ మాటలకు నవ్వారు వాళ్లంతా. ‘‘సర్.. సాయం కాలం.. టీ, రాత్రి భోజనం కూడా తెస్తాం! ఆ.. అన్నట్టు ఈ రోజు రాత్రి ఒంటి గంటన్నరకు భజన ఉంటుంది.. మీ ఇంట్లోనే. దానికి పర్మిషన్ ఇవ్వండి చాలు.. ఈ సర్వీస్‌కి డబ్బులేం వద్దు’’ అంటూ వెళ్లిపోయారు ‘‘‘రెండు గంటలకు భజనేంటో’’ అనే అయోమయంతోనే లోపలికి వచ్చాడు పరశురామ్. విస్తరాకు విప్పాడు.. తనకు ఇష్టమైన మటన్ బిర్యానీ. తిన్నాడు. అద్భుతంగా ఉంది! ఎన్నడూ అలాంటి రుచి చూడలేదు. ఒకలాంటి మత్తు ఆవహించింది. మళ్లీ పడుకున్నాడు. సాయంత్రం... నాలుగు గంటలు.. ‘‘సర్.. సర్’’ అంటూ తన కాలు పట్టి ఎవరో లాగుతున్నట్టనిపిస్తే ఒక్కసారిగా కాలు విదిల్చుకుంటూ లేచి కూర్చున్నాడు పరశురామ్. ఎదురుగా పదేళ్ల పిల్లాడు.. ఉదయం టీ తెచ్చిచ్చిన పిల్లాడు. ఇప్పుడూ టీ గ్లాస్‌తో నిలబడి ఉన్నాడు. ఏమీ మాట్లాడకుండా టీ గ్లాస్ తీసుకొని చేతికున్న గడియారం చూసుకున్నాడు. ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది అతనికి. వెంటనే ల్యాండ్‌లైన్ ఫోన్ ఉన్న గదిలోకి వెళ్లి స్టేషన్‌కు ఫోన్ చేశాడు. ‘‘ఏ.. అలా అడుగుతున్నావ్? సిగ్నల్ క్లియర్ చేసింది నువ్వే కదా..’’ అని జవాబు వచ్చింది అవతలి నుంచి. ‘‘ఆ.. ఆ’’ అంటూ ఫోన్ పెట్టేసి ముందు గదిలోకి వచ్చేసరికి ఆ పిల్లాడు లేడు. ‘‘నేను సిగ్నల్ క్లియర్ చేయడమేంటి? అయినా ఇంత మొద్దు నిద్ర ఎలా పట్టింది?’’ అనుకుంటూ అక్కడే ఉన్న కుర్చీలో కూలబడ్డాడు. తల దిమ్ముగా అనిపించింది. చేతిలో ఉన్న టీ గ్లాస్‌లోంచి నెమ్మదిగా టీ సిప్ చేశాడు. అమృతం ఇలాగే ఉంటుందేమో అనిపించింది అతనికి ఆ రుచి చూడగానే! ఆ క్షణం నుంచి రాత్రి భోజనం కోసం ఎదురు చూడ్డం మొదలుపెట్టాడు. ఎనిమిదింటికి భోజనం వచ్చింది. తిన్నాడు. అదీ అంతే. అమోఘమైన రుచి! తిన్న వెంటనే నిద్ర రాబోతుంటే.. బలవంతంగా ఆపుకున్నాడు. మధ్యాహ్నం లాగా ట్రైన్ వెళ్లిపోతుందేమో అనే భయంతో! ఏదో పుస్తకం చదువుతూ కాలక్షేపం చేశాడు. సరిగ్గా పన్నెండు గంటల ముప్పై నిమిషాలు.. ఆ టైమ్‌లో కుడి వైపు నుంచి వచ్చే రైలుకి క్లియరెన్స్ ఇవ్వాలి. ఇచ్చి మళ్లీ లోపలికి వచ్చాడు. ఇక నిద్ర ఆగలేదు.. కమ్ముకు వచ్చింది. మళ్లీ ఒంటిగంటన్నర ట్రైన్‌కి సిగ్నల్ ఇవ్వాలి. ఎంతకైనా మంచిది అనుకొని అలారం పెట్టుకుని.. అలాగే కుర్చీలో కునుకు కోసం ఒరిగాడు. రాత్రి ఒంటి గంటా పదిహేను నిమిషాలకు.. పెద్ద పెద్ద రాగాలకు మెలకువ వచ్చింది పరశురామ్‌కి. పెడబొబ్బల్లాగే ఉన్నాయి ఆ స్వరాలు. అంతకంతకూ ఆ రాగాలు తన క్యాబిన్ దగ్గరకే వచ్చాయి. అప్పుడు గుర్తొచ్చింది.. ‘‘భజన’’ సంగతి. వెళ్లి తలుపు తీశాడు. పిల్లా..పెద్దాతో కలిసి పన్నెండు మంది సమూహం. వాళ్లలో తనకు టీ, టిఫిన్, లంచ్, డిన్నర్ తెచ్చిన వాళ్లూ ఉన్నారు. ప్రారంభమైంది భజన... బీభత్సంగా! ఆ కంఠస్వరాలకు ముందు జడుసుకున్నాడు పరశురామ్. రానురాను శ్రావ్యంగా.. చెవుల్లో తేనెలు పోసినట్టుగా మారిపోయాయి వాళ్ల గొంతులు. సమ్మోహితుడయ్యాడు అతను. తెలియకుండానే తనూ వాళ్లతో గొంతు కలిపాడు. పారవశ్యంతో ఊగిపోయాడు. ఒంటిగంటన్నర... ఎవరో తలుపు తట్టారు.. తన్మయత్వంతోనే వెళ్లి తలుపు తీశాడు.. ఎదురుగా ఓ యువకుడు.. నవ్వుతూ! అతని చేయి పట్టుకొని లోపలికి తీసుకొచ్చి ఆ గుంపుతో ఆ యువకుడిని కలిపి..వాళ్ల గానమాధుర్యంలో ఊగిపోయాడు పరశురామ్. ఉదయం ఆరున్నర గంటలు.. బయట ఏదో కలకలం.. చెవి పక్కనే పోరుపెటినట్టు్ట అనిపిస్తే కళ్లు తెరిచాడు పరశురామ్. ఆ కలకలం ఏడుపులుగా మారింది. మత్తు దిగినట్టయి ఠక్కున లేచి కిందికి పరిగెత్తాడు. జనాల గుంపును తోసుకుంటూ పోలీసులున్న చోటికి వెళ్లాడు.. అక్కడ తల, మొండెం.. వేరై ఉంది ఓ శరీరం. చూసి.. బిగుసుకుపోయాడు పరశురామ్. ఆ తల.. ఆ తల.. రాత్రి.. తలుపు.. కుర్రాడు.. లీలగా అతని మస్తిష్కంలో మెదులుతోంది ఆ రూపం! - సరస్వతి రమ -
కేఫ్.. కాఫీ
ఎప్పటిలా ఆ కెఫేలో అతని కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు మకరంద్. కేఫ్ అంతా కిక్కిరిసి ఉంది. చోటు లేదు. అసలే మనసు చెదిరి ఉన్నాడు. ఇక్కడికి వచ్చి అతను చెప్పే నాలుగు మాటలతో ఊరట పొందుదామనుకుంటే.. నిలబడ్డానిక్కూడా జాగా దొరక్కపోయేసరికి మరింత చిరాకు పడింది మనసు. కేఫ్ బయటే.. ఫుట్ పాత్ మీద నిలబడి షర్ట్ జేబులోంచి సిగరెట్ తీసి వెలిగించాడు. దమ్ములాగబోతున్న మకరంద్ నోట్లోంచి చటుక్కున సిగరెట్ లాగి అవతలపారేశాడు అతను. మకరంద్ కళ్లల్లో వెలుగు. అప్పటిదాకా ఆవహించి ఉన్న నైరాశ్యం ఒక్కసారిగా ఎగిరిపోయింది. ‘‘ఎక్కడికెళ్లారు సర్.. కనిపించలేదు’’అంటూ అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు మకరంద్. ‘‘ఎప్పుడూ ఉండే చోటే ఉన్నాను..’’ అంటూ మకరంద్ భుజాల చుట్టూ చేయి వేసి ఆ కుర్రాడిని లోపలికి తీసుకెళ్లాడు అతను. ఎప్పుడూ కూర్చునే చోట.. ఐసోలేటెడ్‌గా ఉన్న కార్నర్ టేబుల్ దగ్గర కూర్చున్నారిద్దరూ. ‘‘ఇందాక ఈ టేబుల్ కూడా ఖాళీ లేదు సర్’’ అన్నాడు మకరంద్. ‘‘సర్లే ఏంటీ విషయాలు?’’ అన్నాడు అతను. ‘‘సర్.. నాకు చచ్చిపోవాలనిపిస్తోంది’’ అన్నాడు మకరంద్ ఒక్కసారిగా.. కళ్లనిండా నీళ్లతో. ‘‘హూ... నీ నోటి నుంచి ఈ మాట వినకూడదనే కదా.. నీతో స్నేహం చేస్తోంది’’ నిట్టూర్చాడు అతను. ‘‘లేదు సర్.. నాకింకే దారీ లేదు. ఈ డీల్ కుదిరి ప్రాజెక్ట్ వస్తుందేమోనని ఆశతో వెయిట్ చేశా. కాని రాలేదు. ఈ రోజే తేలింది. ఈ ప్రాజెక్ట్ తప్ప నా కష్టాలు తీరే ఇంకే ఆధారమూ లేదు నా దగ్గర. అదీ పోయింది. చావొక్కటే..’’ అంటూ టేబుల్ మీద రెండు చేతులను ఆనించి తల దాచుకున్నాడు మకరంద్. ‘‘మకరంద్..’’ అంటూ ఆ అబ్బాయి తల నిమిరాడు అతను. 32 ఏళ్ల కుర్రాడు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో చదివొచ్చాడు. మెరిట్ స్టూడెంట్. చిన్నవయసులోనే వ్యాపార మెలకువలను ఔపోసన పట్టాడు. 27 ఏళ్లకే వ్యాపార సామ్రాజ్యానికి చక్రవర్తి అయ్యాడు. వందల మందికి ఉద్యోగాలు ఇచ్చాడు. అలాంటి పిల్లాడు.. ఇప్పుడు.. ఇక్కడ బేలగా.. బతుకుంటే భయంతో చావడానికి సిద్ధంగా కనిపిస్తున్నాడు. మకరంద్‌ను అలా చూస్తుంటే తన గతం గుర్తొచ్చింది అతనికి. అతనూ అంతే. వారసత్వంగా వచ్చిన వ్యాపారాన్ని కాదనుకొని కొత్త వ్యాపారం మొదలుపెట్టాడు. చిన్న వయసులోనే గొప్ప వ్యాపారవేత్తగా పేరుపొందాడు. యువత తమ ఆలోచనలను తేనీటితో పదును పెట్టుకోవడానికి ప్రపంచంలోనే మొదటి వేదికను ప్రారంభించాడు. థాట్స్ విత్ టీ.. కాఫీ.. చైన్ షాప్స్ను ఓపెన్ చేశాడు. దేశంలోని యూత్ అంతా బాగా ఇష్టపడ్డారు. వ్యాపారం బాగా సాగింది. లోన్స్తీసుకొని మరీ స్ప్రెడ్ చేశాడు. ఆ కుర్రాడికి వచ్చిన పరిస్థితే తనకు వచ్చింది.. ఏం చేశాడు? వెన్నులో వణుకుతో ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చాడుతను. ‘‘ఈ పిల్లాడికి సాయం చేయాలి.. ’’ అనుకున్నాడు. కళ్లు తుడుచుకుంటూ తల పైకెత్తాడు మకరంద్. ఎదురుగా అతను లేడు. చుట్టూ చూశాడు. ఎక్కడా కనిపించలేదు. కుర్చీలోంచి లేచి అతణ్ణి వెతకడానికి ఎంట్రెన్స్ వైపు వెళ్లబోతుంటే అతను కూర్చున్న కుర్చీలో ఒక లెటర్ కనిపించింది.. గాలికి ఎగిరిపోకుండా కాఫీ మగ్ పెట్టి. తీసుకుని చదువుకుంటూ బయటకు వెళ్లాడు. ‘‘సర్.. ఇందాకటి నుంచి ఎదురుచూస్తున్నాను మీ కోసం.. లేట్ అయిందే?’’ తనకు ఎదురుగా ఉన్న కుర్చీని లాక్కొని కూర్చుంట్ను వ్యక్తిని ఉద్దేశిస్తూ అంది వందన. ‘‘ఇక్కడే ఉన్నాను వేరే పనుల్లో’’ అన్నాడు అతను. ‘‘చెప్పమ్మా ఏంటీ విశేషాలు?’’ రెండు కాఫీలు ఆర్డర్ చేస్తూ అడిగాడు ఆ అమ్మాయిని. ‘‘ఉద్యోగం పోయింది సర్’’ అతని కళ్లల్లోకి చూస్తూ చెప్పింది ఆమె. ఆ అమ్మాయి కళ్లల్లో దిగులు. గత యేడాదిగా అతనికి పరిచయం ఆ పిల్ల. బాధ్యతగల అమ్మాయి. తాగుబోతు తండ్రి బాధ్యత మరిచిపోయి ఇంటిని పట్టించుకోకుండా తిరుగుతుంటే.. ఉద్యోగం చేస్తూ ఇంటి పెద్ద బాధ్యతను మోస్తోంది. అలాంటి ధైర్యం గల అమ్మాయి ఈ మాట అంటుందేంటి? షాక్ అయ్యాడు అతను. ‘‘ఏమైందమ్మా’’ అనునయంగా అడిగాడు. అంతే ఆ కాస్త అనునయానికే కట్టలు తెంచుకుంది ఆమె దుఃఖం. రెండు చేతుల్లో మొహం దాచుకొని భోరుమంది. ఎమ్మెఎస్ కోసం తమ్ముడిని అమెరికా పంపడానికి లోన్ తీసుకొని మరీ డబ్బు సమకూర్చింది. వాటిని దొంగతనం చేశాడు తండ్రి. ఆ సమస్యను గట్టెక్కలేక ఆత్మహత్యే శరణ్యం అనుకుంటోంది వందన. తండ్రి వల్ల చిన్నప్పటి నుంచి తాము పడ్డ కష్టాలను తలచుకుంటూ కుమిలి కుమిలి ఏడ్చి.. తేరుకొని .. ‘‘సారీ సర్.. ’’అంటూ ఎదురుగా చూసింది. ఖాళీగా ఉంది కుర్చీ. అతను లేడు. ఎక్కడికెళ్లాడో అని చూడ్డానికి వెళ్లబోతుంటే అతను కూర్చున్న కుర్చీలో కాఫీ మగ్ కింద మడతపెట్టి ఉన్న ఒక కాగితం కనపించింది. తీసుకుంది ఆమె. ‘‘నేను ఈ ఊరొచ్చినప్పుడల్లా భలే కాఫీ ఇప్పిస్తావ్ బాబూ..’’ కాఫీ సిప్ చేస్తూ అన్నాడు నర్సయ్య. చిర్నవ్వుతో చూశాడు అతను. అంతలోకే చిన్నబుచ్చుకుంటూ నర్సయ్య.. ‘‘ఏంటో బాబు... అప్పులు తప్ప వ్యవసాయంలో ఏమీ మిగలట్లేదు. అవి తీర్చడానికి బతుకే తాకట్టుపెట్టాల్సి వస్తోంది..’’ అంటూ తన జబ్బకున్న సంచీలోని పురుగుల మందు డబ్బాను తడుముకున్నాడు నర్సయ్య. ‘‘అంత మాటంటున్నావ్ ఏంటి పెద్దాయనా?’’ గాబరాపడ్డాడు అతను. ఎప్పటి నుంచి దాచుకున్న వేదనో.. కళ్లలోంచి ఉబికి వచ్చి భుజం మీది కండువాలో మొహం దాచుకున్నాడు నర్సయ్య. ఆత్మాభిమానం తన ప్రెజెన్స్‌ను గుర్తుచేసినట్టుంది. కండువాతో మొహం తుడుచుకుంటూ చూశాడు. అతను లేడు. తన జబ్బకున్న సంచీ కూడా మాయం. కాని ఆ టేబుల్ మీద రికార్డర్ లాంటిదేదో కనపడింది. తీసుకున్నాడు నర్సయ్య. రెండు రోజుల తర్వాత.. కేఫ్‌లో.. మకరంద్, వందన, నర్సయలతోపాటు ఇంకో పదిమంది అతని కోసం ఎదురుచూస్తున్నారు. వాళ్లలో ఏ దిగులూ లేదు. సంతోషంగా ఉన్నారు. వాళ్లకున్న సమస్యలు ఇంకా తీరిపోలేదు. కాని తీర్చుకుంటామన్న ధైర్యం.. ఆత్మవిశ్వాసంతో తొణికిసలాడుతున్నారు. అందరి చేతుల్లో ఏవో గిఫ్ట్‌లు.. అతనికి ఇద్దామని. అంతలోకే వాళ్లకు ఆ కేఫ్‌లోని గోడ మీద ఆ వ్యక్తి ఫోటో కనిపించింది దండతో. షాక్ అయ్యారంతా! ఫోటోలోని అతనికి శ్రద్ధాంజలి ఘటిస్తున్న ఓ సర్వర్‌ను అడిగింది వందన... ‘‘అతను...’’ అంటూ! ‘‘మా బాస్.. యేడాది కిందట ఆత్మహత్య చేసుకున్నాడు.ఈరోజు ఆయన సంవత్సరీకం’’ చెప్పాడు సర్వర్. ‘‘అంటే తనకు ఇచ్చిన ఉత్తరంలోని ఆత్మహత్య కథ ఇతనిదేనా?’’ అనుకుంది వందన. -సరస్వతి రమ -
చారులత వాళ్ల అమ్మ
‘‘ఎదీ చూడనీ’’ అంటూ ఎర్రగా కందిపోయిన పదకొండేళ్ల కూతురి లేత అరచేతులను తడిమింది తల్లి. ఆమె కళ్లల్లో నీళ్లను చూసిన చారులత ‘‘ఏం కాలేదులే అమ్మా ’’ అంటూ తన చేతులను విడిపించుకుంది. ‘‘నీ కన్నా పెద్దవాడికి రోజూ కోడిగుడ్లు, మాంసం పెడుతూ ఆరోగ్యంగా పెంచుతున్నారు కదా! బరువైన పనులు వాడికి చెప్పకుండా నీకెందుకు చెప్తున్నారు? చదువేమో వాడికి.. చాకిరి నీకా?’’ ఉక్రోషం ఆ తల్లి మాటల్లో! ‘‘నేనూ చదువుకుంటున్నా కదమ్మా నీ దగ్గర’’ తన రెండు చేతులతో తల్లిని గట్టిగా చుట్టేస్తూ చారులత! ‘‘నేను ఆ తప్పు చేయకుండా ఉండాల్సింది చిట్టితల్లీ...’’ దుఃఖంతో తల్లి గొంతు పూడుకుపోయింది. ‘‘మరెందుకు చేశావమ్మా?’’బాధతో కూతురి స్వరమూ వణికింది. ఆర్తిగా కూతురిని హత్తుకుంది ఆ అమ్మ. ‘‘ఒరే దివాకరం.. ఏదో మెసేజ్ వచ్చినట్టుంది కొంచెం చూడూ..’’అంటూ వరండాలో కూర్చున్న పదమూడేళ్ల మనవడి దగ్గరకొచ్చాడు తాత. తన ఫోన్లో గేమ్ ఆడుతున్న దివాకరం తాతను పట్టించుకోలేదు. అక్కడే ఆరుబయట గచ్చులో గిన్నెలు కడుగుతున్న చారులత తాత మాట విన్నది. తన అన్న వైపు చూసింది. అసలు ఈ లోకంలోనే లేడు అన్న. మళ్లీ తన పనిలో తాను పడింది చారులత. ‘‘ఒరేయ్ నాన్నా.. నిన్నేరా...?’’ముద్దుగా పిలిచాడు ఇంకోసారి. ఈసారి తలెత్తి తాత వైపు చూశాడు దివాకర్. ‘‘అబ్బా.. ఏంటి తాతా..?’’ విసుక్కున్నాడు వాడు. ‘‘ఇందాకా టింగ్ మందిరా ఫోన్. ఏదో మెసేజ్ వచ్చినట్టుంది చూసిపెట్టు నాన్నా..’’ బతిమాలుతూ తాత. ‘‘బాబ్బాబూ.. చూసిపెట్టరా.. మీ నాన్న దగ్గర్నుంచి అయ్యుంటది’’ బియ్యం చెరగడానికి వరండాలోకొచ్చిన నానమ్మా బతిమాలుతూ. విసురుగా తాత చేతిలోంచి ఫోన్ లాక్కున్నాడు దివాకర్. మెసేజ్ బాక్స్‌లోకి వెళ్లాడు. అన్రెడ్ మెసేజ్ తెరిచాడు. ఫోనెటిక్లో ఉంది ఆ సమాచారం. మైండ్‌లోనే కూడబలుక్కొని చదివాడు. ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు వాడికి. కడిగిన గిన్నెలను బుట్టలో వేసుకొని వంటింట్లోకి వెళ్తున్న చారులత గమనించింది అన్న అవస్థను. అయినా ఏమీ ఎరగనట్టు లోపలికి వెళ్లిపోయింది. ఇవతల తాత అడుగుతున్నాడు ‘‘మెసేజేనా? ఎక్కడి నుంచీ?’’అని. ‘‘ఏదో పనికిమాలిందిలే తాతా..’’ అంటూ ఫోన్‌ని ఆ ముసలాయనకిచ్చేసి మళ్లీ తన గేమ్‌లో పడిపోయాడు దివాకర్. రాత్రి .. భోజనాలయ్యాక.. వంటిల్లంతా సర్దేసి టీవీ ఉన్న గదిలోకి వెళ్లింది చారులత. అప్పటికే నానమ్మ, తాత ఇద్దరూ టీవీలో లీనమయ్యారు. ఆ వృద్ధ జంట కంటపడకుండా నెమ్మదిగా అడుగులో అడుగువేసుకుంటూ వాళ్ల వెనకాల ఉన్న టీపాయ్ వైపు నడిచి దాని మీదున్న ఫోన్ తీసుకొని మళ్లీ వంటగదిలోకి వెళ్లింది చారులత. సాయంకాలం తన తాతకు వచ్చిన మెసేజ్ చూసింది. అది తన తండ్రి చేసిందే. సౌది అరేబియా నుంచి. ఎవరి ఫోన్ నుంచో పంపించాడు. లేబర్ క్యాంప్‌లోని అతని గదిలో ఫ్రెండ్స్ మధ్య జరిగిన చిన్న గొడవ.. చిలికి చిలికి గాలి వానై.. ఆ రూమ్మేట్స్లో ఒకరిని హత్యచేసేదాకా వెళ్లిందని, అందులో నిందితుడిగా అతనూ పోలీసులకు పట్టుబడ్డాడని, ఉద్యోగం పోయిందని, ఇక్కడి లాయర్‌తో ఎంబసీ వాళ్లతో మాట్లాడించి.. అక్కడ లాయర్‌ను ఏర్పాటు చేయించాలని ఆ మెసేజ్ సారాంశం. ఫోనెటిక్లోనే ఉంది.. వచ్చీరాని ఇంగ్లిష్, తెలుగు కలగలిపి. చదివి షాక్ అయింది చారులత. వణుకుతున్న కాళ్లతో మళ్లీ ముందు గదిలోకి వచ్చి ఫోన్‌ను యథాస్థానంలో ఉంచింది. ఈ విషయం నానమ్మ, తాతకు చెప్పాలా? వద్దా? అమ్మను అడిగితే సరి.. అనుకుంటూ చిన్న పడకగదిలాంటి తన గది దగ్గరకు వచ్చి తలుపు తెరిచెంది చారులత. ‘‘బుమ్’’ అంటూ తలుపు చాటు నుంచి బిడ్డ ముందుకొచ్చింది అమ్మ భయపెడ్తున్నట్టుగా. ‘‘అబ్బా.. అమ్మా.. నేనైమైనా చిన్నపిల్లనా?’’ ‘‘అయితే భయపడలేదా?’’ అంటూ చిన్నపిల్లలా బుంగమూతి పెట్టి చాప మీద చతికిల పడింది ఆ అమ్మ. ‘‘ ఇంట్లోవాళ్లు భయపడ్తారు నీ గురించి తెలిస్తే..’’ అన్నది చారు.. తల్లి పక్కన తానూ చేరగిలపడుతూ! ‘‘ఏంటలా ఉన్నావ్? ఆ మెసేజ్ గురించేనా దిగులు?’’అంది అమ్మ. అవునన్నట్టుగా తలూపింది చారులత. నిట్టూరుస్తూ కూతురి పాదాలను తన ఒళ్లో పెట్టుకొని నెమ్మదిగా కాలివేళ్లను విరుస్తూ.. ‘‘మీ నాన్నకు పట్టాల్సిన గతే’’ అని.. అంతలోకే ఏదో గుర్తిచ్చినదానిలా ‘‘అవునూ.. ఆడపిల్లవు నీకు చదువెందుకని వాడికి చదువు చెప్పిస్తున్నారు కదా.. కాన్వెంట్ స్కూల్లో వేసి మరీ! వాడికెందుకు అర్థంకాలేదు ఈ మెసేజ్?’’ అంటూ కూతురిని ప్రశ్నించింది తల్లి. ‘‘అన్నయ్యని తిట్టడం ఆపమ్మా’’ అంటూ ఇంకేదో చెప్పబోతుంటే ‘‘ఆపను. ఈ ఇంటి పరిస్థితిని నేను చక్కదిద్దకపోతే.. నీకు, రేపు ఈ ఇంటికి వచ్చే ఇంకో ఆడపిల్లకూ నా గతే పడ్తుంది’’ అన్నది కళ్లు పెద్దవి చేసుకుంటూ ఆ అమ్మ. చారులతకు భయమేసింది.. ఒక్కసారిగా తల్లి ఒళ్లో ఉన్న తన కాళ్లను వెనక్కి లాక్కుంది. ఎప్పుడో అమ్మ చెప్పిన ఆమె గతం గుర్తుకురాసాగింది ఆ పిల్లకు. ఆ ఊళ్లో అమ్మ ఒక్కతే కాస్తోకూస్తో చదువుకుంది. తెలివైంది కూడా. చూడ్డానికీ చక్కగా ఉంటుంది. టెన్త్‌లో ఆ మండలానికే ఫస్ట్ వచ్చింది. ఇంకా చదువుకోవాలని.. అడ్వకేట్ కావాలని ఆశ పడింది. ఇంతలోకే దుబాయ్ నుంచి వచ్చిన నాన్న.. అమ్మను చూశాడు.. కట్నం లేకుండా పెళ్లి అన్నాడు.. నలుగురు ఆడపిల్లలో పెద్దయిన అమ్మకు ఆ సంబంధం రావడం వరమనుకున్నారు అమ్మమ్మ, తాత. ‘‘పెళ్లి వద్దు’’ అని అమ్మ మొరపెట్టుకున్నా వినకుండా పెళ్లిచేసేశారు. పెళ్లయ్యాక నాన్ననూ చాలా బతిమాలుకుంది అమ్మ.. చదువుకుంటానని. ‘‘ఆడపిల్లలకు చదువేంటి?’’ అని నానమ్మ, తాత కోప్పడ్డారు. నాన్ననూ కట్టడి చేశారు పెళ్లాం మాట వినొద్దని. పొలం పనులు చూసుకుంటూ ఇక్కడే ఉంటానన్న నాన్నను బలవంతంగా మళ్లీ గల్ఫ్‌కి పంపేశారు. అమ్మను ఇంట్లో, పొలంలో పనిమనిషిని చేశారు. అన్నయ్య, తను పుట్టాక కూడా పట్టుబట్టింది అమ్మ.. ప్రైవేట్‌గా చదువుకుంటానని. పడనివ్వలేదు నానమ్మ, తాతలు. గొడవపడింది అమ్మ. అయినా పట్టు వీడలేదు ముసలాళ్లు. కనీసం కూతురునైనా మంచి స్కూల్లో వేయిద్దామని నాన్నకు ఉత్తరాలు రాసింది. అమ్మవాళ్లు చెప్పినట్టే వినమని జవాబిచ్చాడు నాన్న. నానమ్మ, తాత తన విషయంలో కూడా మొండిగానే ఉన్నారు. ఆడపిల్లకు చదువొద్దని. తనను బడికి పంపించకుండా అమ్మతోపాటు పొలానికి పంపిస్తుంటే తట్టుకోలేని అమ్మ ఒకరోజు పొలంలోని బావిలో దూకి చనిపోయింది. ‘‘చారూ.. ’’ అంటూ రెండు భుజాలు పట్టుకొని తల్లి ఊపేసరికి ఈ లోకంలోకి వచ్చింది చారులత. ‘‘అమ్మా..’’ అంటూ కరుచుకుపోయింది ఆ పిల్ల. ‘‘చారూ.. ’’ నానమ్మా పిలిచింది. ‘‘అమ్మా.. నానమ్మ’’ అంది తల్లి నుంచి విడివడుతూ! ‘‘అర్థమైంది.. పుస్తకం మూసేస్తావ్ కదూ’’అంది ఆ తల్లి దిగులుగా! అవును అన్నట్టుగా తలూపుతూ పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకుంది చారులత.. ‘‘మీ నాన్న గురించి.. ’’ అని తల్లి ఏదో చెప్పబోతుంటే ‘‘నానమ్మ, తాతకు చెప్తాను.. వాళ్లు చూసుకుంటారులే ’’ అంటూ పుస్తకం మూసేసింది చారులత. - సరస్వతి రమ -
దరువు పడిందో.. చావు డప్పు మోగాల్సిందే!
మంచి చలికాలం.. అమావాస్య రాత్రి... పన్నెండు దాటి ఒక్కనిముషం.. ఆ ఊళ్లో ఎవరిళ్లల్లో వాళ్లే ఉన్నా.. ఎవ్వరికీ కంటి మీద కునుకు లేదు. ఈ అమావాస్య.. ఏ ఇంటి తలుపు మీద దరువు పడ్తుందో? ఎవరికి మూడుతుందోననే భయం.. ఊళ్లో వాళ్ల నిద్రలేమికి కారణం. దుప్పట్లో దూరి భయం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నా వాళ్ల వల్ల కావడంలేదు. గడియారం సెకన్ల ముల్లు చప్పుడుతోపాటు తమ గుండె చప్పుడూ వినిపించేంత నిశ్శబ్దం ఆవరించి ఉంది. ఊహ తెలియని పిల్లలు మాత్రమే ఆదమరిచి నిద్రపోతున్నారు. అనుకున్నట్టే.. ఒక వీధిలోని తలుపు మీద దరువు మొదలైంది. ఎంతలా అంటే ఆ ఊరంతటికీ వినిపించేంత. ఆ ఊళ్లోని చెట్టు, చేమ, కొండ, గుట్టా కదిలేంతగా.. వాగువంకలు ఉలిక్కిపడి తమ ప్రవాహాన్ని ఆపుకొనేంతగా! అలా ఆ ఇంటి తలుపు మోగుతూనే ఉంది... పది నిమిషాలదాకా! అల్లకల్లోలం ఆ పదినిమిషాల కాలం. మోత ఆగిపోయాక.. తలుపు తెరుచుకుంది. యాభై ఏళ్ల మనిషి బయటకు వచ్చాడు. వాకిట్లో ఓ విచిత్రమైన ఆకారం. నేలను ఊడుస్తున్న జుట్టు.. మర్రి ఊడలకు మల్లె జడలు కట్టి. కళ్లల్లోంచి నిప్పులు కురుస్తున్నాయి. లావుపాటి పెదవులు... విశాలమైన నుదుటి మీద పడమటి సూర్యుడు లాంటి బొట్టు! ఆ మనిషిని చూడగానే పై ప్రాణాలు పైనే పోతాయి. తలుపు తెరుచుకొని వచ్చిన వ్యక్తి పరిస్థితీ అలాగే ఉంది. ఇప్పటిదాకా ఆ ఊళ్లో వాళ్లెవరూ వాకిట్లో నిలబడ్డ ఆకారాన్ని చూడలేదు.. చూసే అవకాశం రాలేదు. తలుపు మీద దరువు పడ్డ ఇంట్లోంచి బయటకు వచ్చిన వ్యక్తులు తప్ప. ఆ వ్యక్తులు ఈ మనిషి గురించి ఊళ్లో వాళ్లకు వర్ణించి చెప్పే అవకాశం రాలేదు. వాళ్లెవరూ ప్రాణాలతో తిరిగి ఇంటికి చేరలేదు కాబట్టి. ఆ దరువు ఆగిన తర్వాత వాకిట్లో ఓ ఆకారం ప్రత్యక్షమవుతుందని.. అసలు ఆ దరువు వేస్తోంది ఆ ఆకారమే అని కూడా ఎవరికీ తెలియదు. దరువు అంటే భయం.. ఆ ఇంట్లో మనుషుల తప్పులు ఎంచే టైమ్ వచ్చిందని. ఆ తప్పులు చేసిన వాళ్లే తమ తప్పును గ్రహించి.. బయటకు రావాలని.. అలా వెళ్లిన వాళ్లకు అవే ఆఖరు ఘడియలని మాత్రమే తెలుసు. అందుకే అందరికీ అమావాస్య రాత్రవుతుందంటే భయం.. తెల్లవారుతుందంటే భయం! ఊరి నడిబొడ్డున ఉన్న క్లాక్ టవర్ దగ్గర శవం పడి ఉంటుంది... అప్పుడు తెలుస్తుంది.. కిందటి రాత్రి ఎవరికి మూడిందోనని! వాకిట్లో ఆకారం గిర్రున తిరిగి ముందుకు నడవసాగింది. ఇంట్లోంచి బయటకు వచ్చిన వ్యక్తి మారు మాట్లాడకుండా.. ఆ ఆకారాన్ని అనుసరించడం మొదలుపెట్టాడు. ‘‘ఏమేం చేశావ్?’’ కటువుగా, కరుకుగా అడిగింది ఆకారం. ‘‘చాలా చేశాను. పెద్ద కులం వాడిననే గర్వంతో నేను పనిచేసే.. నా దగ్గర పనిచేసే వాళ్లను కించపరిచాను. ఆడవాళ్లను చులకనగా చూశాను. పిల్లల్నీ హింసించాను. డబ్బులు వడ్డీలకు ఇచ్చి.. వాళ్ల రక్తం తాగాను. సంపాదన విషయంలో ఏనాడూ న్యాయంగా ఆలోచించలేదు.. ప్రవర్తించనూ లేదు. ఇప్పుడు నేనున్న ఇల్లు కూడా అలా అన్యాయంగా తీసుకున్నదే’’ మరబొమ్మలా చెప్పుకుపోతున్నాడు ఆ వ్యక్తి. ‘‘ఇవన్నీ పాతవి. మరి కొత్తది?’’ అదే కటువు, కరుకు స్వరం గద్దించింది. ‘‘ఒక పదిహేనేళ్ల పిల్లను.. ’’ ఆపాడు. అప్పటిదాకా ఏదో ట్రాన్స్‌లోంచి ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చినట్టుగా చుట్టుపక్కలంతా చూశాడు. ఊరి నడిబొడ్డు అయిన క్లాక్ టవర్.. ‘‘ఇందాకే కదా.. నా ఇంటిముందున్నా.. అంతలోకే ఇక్కడికెలా వచ్చాను’’ అనుకుంటూ అంతెత్తున ఉన్న క్లాక్ టవర్ వైపు చూశాడు. మెదడులేకుండా.. ఖాళీగా ఉన్న మనిషి పుర్రెలా అనిపించింది.. కనిపించింది క్లాక్‌టవర్ లేని ఆ చోటు. వణికిపోయాడు. పెదవులు తడారిపోతున్నాయి. ఆ ఆకారం గిర్రున్న వెనక్కి తిరిగింది. ఆ రూపం.. తన కళ్లముందు స్పష్టంగా కనిపించే సరికి అతని శరీరంలో వణుకు మరింత ఎక్కువైంది. ‘‘నీ.. నీ.. నీళ్లు.. క్కక్కక్కక్కావాలి... ’’ అడిగాడు కంపిస్తున్న స్వరంతో. అతని ఎదురుగా ఉన్న ఆ ఆకారం ఏమీ మాట్లాడలేదు. చింతనిప్పుల్లాంటి కళ్లను పెద్దవి చేసి చూసింది. ‘ఎఎఎఎఎఎవరు నువ్వు?’’ జారిపోతున్న ధైర్యాన్ని చిక్కబట్టుకునే ప్రయత్నంతో అడిగారు. భీకరంగా నవ్వింది ఆ ఆకారం. క్లాక్ లేని టవర్ వైపు తలతిప్పి చూసి.. మళ్లీ ఆ వ్యక్తి వంక దృష్టి మరల్చుతూ అన్నది.. ‘‘కాలాన్ని’’ అని. ఆ వ్యక్తిలో చిక్కుబడిన కాస్త ధైర్యమూ చటుక్కున పారిపోయింది. ‘‘న్నన్నన్నన్నన్నన్ను ఏం చ్చే...చ్చేచ్చే.. చ్చేయోద్దు..ప్లీజ్’’ బట్ట తల నుంచి చెమటలు వరదలు కట్టాయి అతనికి. మళ్లీ భీకరంగా నవ్విందా ఆకారం.. నోరంతా తెరిచి. తెరిచిన నోరు.. అలాగే ఉంచింది.. మూయలేదు! అర్థమైంది ఎదురుగా ఉన్న మనిషికి. మోకాళ్ల మీద కూర్చోని ప్రాధేయపడ్డం మొదలుపెట్టాడు.. నా భార్య, పిల్లలు దిక్కులేని వాళ్లవుతారు. ఇక నుంచి బుద్ధిగా ఉంటా..ప్లీజ్.. అంటూ. మళ్లీ వికటాట్టహాసం.. తెరలు తెరలుగా! ‘‘ఇలాంటి వేడుకోళ్లు, ప్రార్థనలు నీకూ ఎదురైన జ్ఞాపకం ఉందా?’’ ఆ ఆకారం అదే కరుకుదనంతో. ‘‘ఉంది.. ప్లీప్లీప్లీజ్.. ’’అంటూ ఆ ఆకారం కాళ్ల మీద పడబోయి షాక్ అయ్యాడు. అంత దుఃఖమూ మాయమైపోయింది ఆ షాక్‌కి. ఆ ఆకారం.. నేల మీద నిలబడి లేదు. గాల్లో ఉంది. నేల మీదున్నట్టు భ్రమపడ్డడాడు. గ్రహించినట్టుంది ఆ ఆకారం .. ‘‘కాలాన్ని కదా.. చేతికి చిక్కినట్టే కనపడ్తాను.. కాని నా ఆనవాలును కూడా పట్టుకోలేరు మీరు’’ అంది వ్యంగ్యంగా. చటుక్కున లేచి పరుగెత్తాడు అక్కడి నుంచి పారిపోవాలని. వెనక్కి తిరిగి చూస్తూ మరీ ముందుకు ఉరకసాగాడు. ఉన్న చోటు నుంచి ఆ ఆకారం ఒక్క అంగుళం కూడా కదల్లేదు. అతను పరుగుపెడ్తూనే ఉన్నాడు.. పెడ్తూనే ఉన్నాడు. ఎన్నో కోసులు.. పరుగెత్తి పరుగెత్తి అలుపొచ్చి.. సొమ్మసిల్లబోతూ ఒక చోట ఆగాడు. ఆయాసం తీర్చుకునేందుకు.. కాస్త వంగాడు. మెలిపెడ్తున్న కడుపును కుడిచేతి గుప్పిట్లో పట్టుకుంటూ తలను కాస్త పైకెత్తాడు. ఎదురుగా టవర్.. క్లాక్ లేకుండా.. మెదడు లేని పుర్రెను తలపిస్తూ! భయం.. తలలో బాంబు పేలి.. ఆ శబ్దం చెవుల గుండా వెళ్తూన్నట్టుగా! తనకెదురుగా చూశాడు.. అదే ఆకారం.. నోరు తెరిచి.. కర్కశంగా నవ్వుతూ! అంతే బిక్కచచ్చిపోయాడు ఆ వ్యక్తి! ఉన్నచోటనే కుప్పకూలిపోయాడు. తెల్లవారింది... ఊళ్లోని క్లాక్ టవర్ నాలుగు గంటలు కొట్టింది. ఊళ్లోని తలుపులన్నీ దాదాపు ఒక్కసారిగా తెరుచుకున్నాయ్. దరువు పడిన ఇంటి తలుపులు కూడా. ఆ ఇల్లాలు.. గుండెలు బాదుకుంటూ ఉరకసాగింది ఊరి నడిబొడ్డు వైపు.. ఆమె వెనకాలే ఊరి జనం. టవర్ ముందు తల పగిలి.. కడుపు చీరి.. పడున్న తన భర్తను చూసి స్థాణువైంది. జనాలకూ నోట మాటరాలేదు. ప్రతి అమావాస్య తెల్లవారి చూసే దృశ్యమే అయినా! ఆ గుంపులో ఓ వ్యక్తి.. ఆ ఊరికి కొత్తగా వచ్చిన యువకుడు..ఎందుకో క్లాక్ టవర్ వంక చూశాడు. ఆ గడియారం మీద రక్తం మరకలు! - సరస్వతి రమ -
నేలమాళిగ
ఒంటిగంట రాత్రి... గడ్డకట్టే చలి.. నిర్మానుష్యంగా ఉంది అంతా! ఆ ఇంట్లో నేల.. ఉన్నట్టుండి శబ్దం చేయసాగింది. ఫ్లోరింగ్‌లో లోపలి నుంచి ఎవరో బలంగా కొడ్తున్న శబ్దం... అంతకంతకూ ఎక్కువై... మార్బుల్ ఫ్లోర్ మీదున్న మంచం కిందపడిపోయింది. మంచం పడిపోగానే నేల సద్దుమణిగింది. గాఢ నిద్రలో ఉన్న నరేంద్ర.. తలకు దెబ్బతగలడంతో టక్కున కళ్లు తెరిచాడు. చూసుకుంటే .. పక్కకు ఒరిగి పోయిన మంచం నుంచి జారి ఉన్నాడు. తలకిందులుగా కనిపించింది గది.. తలంతా దిమ్ముగా ఉంది. ‘‘ఎలా పడ్డాను?’’ .. ‘‘ఇదేంటి?’’ అన్న ఆశ్చర్యం కించిత్తు కూడా లేదు అతని మొహంలో. 62 ఏళ్ల అతను లేచి.. రెండు చేతులతో తలను పట్టుకొని కాసేపు అలాగే కూర్చున్నాడు. కాస్త స్థిమితపడ్డాక.. మంచానికి కాస్త దూరంగా మూలన ఉన్న గది లైట్ స్విచ్వేసి.. . వంటింట్లోకి వెళ్లి మంచినీళ్లు తాగి వచ్చాడు. ఆ గదిలోకి వచ్చేసరికి లైట్ ఆరిపోయి ఉంది. మళ్లీ నేల లోపలి నుంచి చప్పుడు మొదలైంది. అది తనకు అలవాటే అన్నట్టుగా ఆ శబ్దాన్ని పెద్దగా పట్టించుకోకుండా.. బలమంతా ఉపయోగించి ఒరిగిన మంచాన్ని నాలుగు కాళ్ల మీద నిలబెట్టాడు. ఆ మంచం మీద అతను కూర్చోబోతుంటే.. నరేంద్ర కాళ్లను కింద నుంచి తన్నింది నేల. మళ్లీ లైట్ వేయడానికి మంచం దగ్గర్నుంచి కదిలాడు నరేంద్ర. నేలలోపల ఓ ఆకారం .. అది గమనించి.. అతని కంటే ముందే గబగబా లోపలి నుంచే గది ఆ మూలకు వెళ్లింది.. దానితో పోటీ పడుతున్నట్టుగా అతనూ వెళ్లి స్విచ్ వేశాడు.. వెలగలేదు. మళ్లీ ట్రై చేశాడు. వెలగలేదు. ‘‘ఏయ్ వదులు..’’ అన్నాడు కిందకు కాస్త వంగి నేల లోపలి ఆకారాన్ని ఉద్దేశిస్తూ! ‘‘నేను చెప్పింది విను మరి’’ అంది ఆ నేలమాళిగలోని ఆకారం. తల పంకించి ఆ చీకట్లోనే వచ్చి మంచం మీద కూర్చున్నాడు అతను. ‘‘అలా చీకట్లోనైనా కూర్చుంటావ్ కాని.. నేను చెప్పింది చేయవ్ అన్నమాట’’ అంది లోపలి ఆకారం. ఏమీ మాట్లాడకుండా.. మాళిగలోని ఆ ఆకారం వైపే చూడసాగాడు. చిత్రంగా... అక్కడంతా వెలుగు. ఆ ఆకారం ఉన్న మేరా! కాళ్లు కిందకు వేసి... తల కాస్త కిందకు వంచి.. మోకాళ్ల మీద మోచేతులు ఉంచి... కుడి అరచేత్తో ఎడమ అరచేతిని మడుస్తూ చుబుకం దగ్గర పెట్టుకొని ఆలోచనల్లో పడ్డాడు నరేంద్ర.. నేలమాళిగలోని ఆకారం కూడా సైలెంట్ అయిపోయి.. అతణ్ణే పరిశీలిస్తూ ఉంది. నరేంద్ర రిటైర్ అయ్యి రెండేళ్లవుతోంది. పిల్లలిద్దరూ యూరప్‌లో ఉన్నారు వాళ్ల కుటుంబాలతో. ఇండియాకు వచ్చే ఆలోచన కూడాలేదు.. కనీసం చుట్టపుచూపుగా కూడా. భార్య పోయాక.. సొంతూళ్లో.. అంత పెద్ద ఇంట్లో.. ఒంటరిగా.. భార్య జ్ఞాపకాలతో బతకడం కష్టమనిపించింది. అందుకే ఆ ఇంటికి.. ఆ ఊరికి.. తన వాళ్లకు దూరంగా.. హిల్స్టేషన్లాంటి ఈ చోటికి వచ్చేశాడు. ఇప్పుడుంటున్న చిన్న ఇల్లు కొనుక్కున్నాడు.. కొంచెం వాలు మీద.. చుట్టుపక్కల ఏ ఇల్లూ లేక.. ఏకాంతంగా.. ఉందని. కొనేటప్పుడు ఆ ఊళ్లోని చాలా మంది హెచ్చరించారు.. ఆ ఇంటి జోలికి వెళ్లొద్దని. ముప్పై ఏళ్ల నాటిది ఆ ఇల్లు. అంతకుముందెప్పుడో .. ఓ యాభై ఏళ్ల కిందట ఓ జమీందారు అక్కడ వేసవి విడిది కట్టుకున్నాడట. కోటలా ఉండేదట అది. అక్కడ ఆయనకు అన్నీ చూసిపెట్టడానికి ఒక వ్యక్తి ఉండేవాడట. ప్రతి వేసవిలో అక్కడికి వచ్చేవాడట జమీందారు. జమీందారీ రద్దతువుతున్నప్పుడు తన దగ్గరున్న డబ్బు, బంగారం, వెండి, రత్నాలు, వజ్రాలు అన్నీ తెచ్చి.. ఇక్కడ కోటలో పాతి పెట్టాడట. ఒకసారి.. వాటికి ఆశపడ్డ ఆ కోటలోని జమీందారు బాగోగులు చూసుకునే వ్యక్తి ... వాటిని పెద్ద మూటలో కట్టి.. తీసుకెళ్లబోతూ జమీందారుకు పట్టుబడ్డాడని.. వాటితోనే అతణ్ణి.. ఆ జమీందారు అదే గొయ్యిలో సజీవ సమాధి చేశాడనీ.. తర్వాత జమీందారు పాము కుట్టి చనిపోయాడని.. ప్రచారంలో ఉంది. అప్పటి నుంచి చాలా ఏళ్ల దాకా.. ఆ కోటను పట్టించుకునేవారే లేకుండిరట. ఆ బంగారం కోసం.. డబ్బు కోసం తవ్వకాలూ జరిగాయట. అలా తవ్వకాలు జరిపిన వాళ్లు .. కొన్ని రోజులకు ఆ చుట్టుపక్కలే ఏదో రకంగా మృత్యువాత పడ్డారని పుకారు. ఏదేమైతేనేం.. కొన్నాళ్లకు.. ఓ ఫ్రెంచ్ వ్యక్తి .. జమీందారు కుటుంబ సభ్యుల దగ్గర్నుంచి ఆ కోటను కొనుక్కున్నాడు. దాన్నంతా పడగొట్టించి.. చుట్టూ ప్లేస్ అలాగే పెట్టి.. చిన్న ఇల్లు కట్టించుకొని అందులో ఉండసాగాడు. ఆ ఫ్రెంచ్ వ్యక్తి ఆ జాగను కొనుక్కున్నాడని తెలిశాక.. ఊర్లో చాలామంది గుసగులు.. అతనికి ఆ నేలమాళిగలోని బంగారం బయటకు తీయడం తెలిసిందని. కానీ.. కొన్నాళ్లకే ఆ ఫ్రెంచ్ వ్యక్తి ఇంట్లోని బెడ్రూమ్లో మంచం మీద నుంచి కిందపడి.. తలకు బలమైన దెబ్బ తగిలి చనిపోయాడు. తర్వాత ఆ ఫ్రెంచ్ వ్యక్తి కుటుంబీకులు వచ్చి ఆ ఇంటిని ఇంకెవరికో అమ్మేశారు. ఆ కొనుక్కున్న వ్యక్తీ అలాగే చనిపోయాడు. అతని కుటుంబ సభ్యులు భయపడి ఆ ఇంటిని వేరే ఊరి వాళ్లకు అమ్మేసి వెళ్లిపోయారు. ఆనక వచ్చిన వాళ్లదీ అదే అనుభవం. వాళ్లు నరేంద్రకు అమ్మారు. అప్పుడు నరేంద్రను ఊళ్లో వాళ్లంతా భయపెట్టారు... నచ్చజెప్పారు.. హెచ్చరించారు ఇల్లు కొనద్దని. అయినా అలాంటివి నమ్మని నరేంద్ర ఇల్లు కొన్నాడు. కొన్ని మరుసటి రోజు నుంచే నేలమాళిగలోంచి చప్పుళ్లు ప్రారంభమయ్యాయి. మొదట్లో భయపడ్డాడు. యేడాదిగా అలవాటు పడ్డాడు. ఇప్పుడు ఆ ఆకారంతో మాట్లాడుతున్నాడు కూడా. చాలాసార్లు ఆ ఆకారం అతనికి తన దగ్గరున్న బంగారం.. వెండి.. వజ్రాలను ఆశ చూపింది.. తనను బయటకు తీస్తే వాటిని ఇస్తానని. నవ్వుతూ దాటవేస్తూనే ఉన్నాడు నరేంద్ర. ‘‘నాకు తెలుసు నువ్వు ఏం ఆలోచిస్తున్నావో?’’ లోపలి నుంచి ఆకారం అతని మౌనాన్ని, ఏకాంతాన్ని భంగపరిచింది. ‘‘ఈ ఇల్లు కొనుక్కున్నప్పుడే నా మొండితనం నీకు అర్థమై ఉంటుంది. ఇంకా నీ సహనాన్ని ఎందుకు పరీక్షించుకుంటావ్ చెప్పు?’’ అన్నాడు సౌమ్యంగా అతను. ‘‘అర్థమైంది కాబట్టే.. నిజంగా నీకు ఈ సంపదనంతా ఇచ్చి గాల్లో కలిసిపోదామనుకుంటున్నా’’ అంది ఆ ఆకారం. ‘‘అది నాది కాదు.. నాది కానిది ఏదీ నాకు వద్దు. నువ్ ఇప్పుడు గాల్లోనే ఉన్నావ్!’’ అన్నాడు అంతే నింపాదిగా అతను. ఆ ఆకారం అహం దెబ్బతిన్నది. మళ్లీ దబదబా నేలను బాదింది.. గదంతా కలియతిరుగుతూ.. గదిలోని టేబుల్, కుర్చీ.. బట్టల అలమరా కాళ్లు గుంజింది. ఒకొక్కటిగా అవన్నీ కింద పడిపోయాయి. అయినా అతను కదల్లేదు.. బెదరలేదు. ‘‘ నన్ను ఒక్కసారి బయటకు రానివ్వవా ప్లీజ్.. .. ఆ జమీందారిగాడి కుటుంబంలోని ఒక్కొక్కళ్లను చావగొడ్తా.. తర్వాత నువ్వు ఉండమన్నా ఉండను’’అంటూ కాళ్లబేరానికి వచ్చింది. నవ్వుతూ అన్నాడు అతను‘‘ఏ కాలం సంగతి నువ్వు మాట్లాడేది. అతనికి పుట్టిన వాళ్లంతా పోయారు’’అన్నాడు. ‘‘ఆయన మనవలు.. మునిమనవలు ఉంటారు కదా.. ’’ అంది అదే కసితో. ‘‘మనవలూ పోయారు. మునిమనమడు ఒక్కడే. ఉన్నాడు.. నీ ముందే’’ అన్నాడు నరేంద్ర. ఆకారం నుంచి మాట లేదు. కదలికా లేదు. ‘‘చెప్పాగా.. నాకు నీ దగ్గరున్న సంపద మీద ఆశలేదు. దాని మీద ఆశపడింది నువ్వు. దానితోనే ఉండిపో’’అని చెప్పి గది బయటకు నడిచాడు నరేంద్ర. - సరస్వతి రమ