ఆప్ కే లియే..
ఈసారి హైదరాబాద్ బుక్ ఫెయిర్ తన పుటలో ఒక కొత్త అంశానికి చోటిచ్చింది! అదే ‘అనగనగా’ యాప్! దీని రూపకర్త మార్టిన్! వృత్తిరీత్యా మినిస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్ విభాగంలో ఉద్యోగి.. ప్రవృత్తిరీత్యా సోషియో సైకాలజిస్ట్!. ఆ కథేమిటంటే..
- సరస్వతి రమ
కొన్నాళ్ల కిందట మార్టిన్ డిప్యూటేషన్‌పై మినిస్టర్ ఆఫ్ ఫారిన్ అఫైర్స్‌లో విధులు నిర్వహించారు. అందులో భాగంగా కొంతకాలం వేరే దేశాల్లోని ఇండియన్ ఎంబసీలలో పనిచేశారు. సోషియో సైకాలజిస్ట్ కూడా కాబట్టి ఆ జిజ్ఞాసతో ప్రవాసాంధ్రుల జీవనశైలిని గమనించారు. ఆ స్టడీలో పిల్లలకు కథలు చెప్పే ప్రక్రియ అంతరించిపోయిందని తేలింది. టెక్నాలజీ మాయలో పడ్డ ఈ తరం చదవడాన్ని మరిచిపోయింది. వాళ్లే చదవనప్పుడు వాళ్ల పిల్లలకేం చెప్తారు?. అందరూ కంప్యూటర్ గేమ్స్‌కి పరిమితమైపోయారు. ఇదే టెక్నాలజీ, ఈ తరం అలవాట్లనూ ఉపయోగించుకొని కథలు చెప్పే కళను పునరుద్ధరించాలనుకున్నారు. అందుకే ‘ఈ యాప్ పిల్లలకన్నా తల్లిదండ్రులకే ఎక్కువ ఉపయోగం’ అంటారు మార్టిన్. ‘వాళ్లకు కథలు తెలిస్తేనే కదా పిల్లలకు చెప్పగలుగుతారు’ అనేది ఆయన లాజిక్!.
ముందుకెలా వెళ్లిందంటే..
‘చాలామంది తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారంటే.. పిల్లలకు కావల్సిన భోజనం పెట్టడం, వాళ్లడిగిన ఆట వస్తువులు, గాడ్జెట్స్ తెచ్చివ్వడం, పిల్లలతో కలిసి టీవీ చూడ్డం, సినిమాకెళ్లడం.. ఇవన్నీ చేస్తే పిల్లలతో మీనింగ్ ఫుల్ టైమ్ గడిపినట్టే అని!. కానీ క్వాలిటీ టైమ్ ఇవ్వడమంటే అదికాదుకదా.. మన సంస్కృతి, మన భాష, మన కళలు, మన కథలు.. ఇలా మన పూర్తి నేటివిటీని పిల్లలకు అందిస్తేనే మనం వాళ్లకు మేలు చేస్తున్నట్టు’ అంటారు మార్టిన్. అందులో కథలు చాలా ముఖ్యమైనవి.
పిల్లలకు మనం కథలు చెప్తున్నామంటేనే జీవించడం నేర్పుతున్నామన్న మాట అని ఆయన అంటారు. ఆ కథలను నీతుల మోతతో బరువెక్కనీయకుండా ఈ కాలానికనుగుణంగా క్లుప్తంగా, తిన్నగా, ఉన్నది ఉన్నట్టు చెప్పగలిగితే చాలు. టెక్నికల్ టూల్స్ మన కమ్యూనికేషన్‌ను ఈజీ చేసేసి ఊహాశక్తిని తగ్గిస్తున్నాయి. కాబట్టి ఆ ఊహాశక్తిని కాస్త పెంచేలా కథలు చెప్పే విధానాన్ని మలుచుకుంటే మంచిది. ఆ రకమైన స్టోరీ టెల్లింగ్‌ను పేరెంట్స్ దగ్గర ప్రమోట్ చేయాలి అని ఓ నిశ్చయానికి వచ్చి ఆ ఆలోచనను ముగ్గురి స్నేహితులతో పంచుకున్నాడు. వాళ్లూ ఉత్సాహంగా ఓకే అన్నారు.
ఫస్ట్‌భెల్..
నలుగురూ కలిసి ‘ఫస్ట్ భెల్ టీమ్’గా ఏర్పడ్డారు. ‘స్కూల్లో పిల్లలు లాస్ట్ భెల్‌కి హుషారుగా, ఫస్ట్‌భెల్‌కి నీరసంగా ఉంటారు. అలాకాక మా కథల కోసం ఫస్ట్‌భెల్‌నూ అంత ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో ఆ పేరుపెట్టాం’ అంటారు మార్టిన్. యాప్ కోసం కావల్సిన డబ్బుని తమకొచ్చే జీతంలోంచే కొంత తీసి పక్కన పెట్టసాగారు. ఈ నలుగురి స్నేహితుల్లో మార్టిన్ సహా ముగ్గురు ఇంతకుముందే కొన్ని కథలు రాశారు కూడా.
ఆ అనుభవంతో పాతకథలన్నీ పోగుచేశారు. అందులోంచి కొన్ని ఎంచుకొని తెలుగు నేటివిటీకి అనుగుణమైన 20 ఎలిమెంట్లు ఉండేలా రీరైట్ చేశారు. ఒక్కో కథ నాలుగు నిమిషాల నిడివి ఉండేలా 300 కథలను రాసుకున్నారు. మళ్లీ వాటిలోంచి తుదిగా 120 కథలను ఎంచారు. పేదరాశి పెద్దమ్మ, విక్రమ్‌భేతాళ, పంచతంత్ర, వెర్రి వెంగళప్ప, జానపద కథలు.. ఇలా 12 విభాగాలుగా చేసి విభాగానికి పది చొప్పున ఆడియో రికార్డింగ్ చేయించారు. ఆడిషన్స్‌కి ఆడియన్స్‌నూ పిలిచి ఎవరిచేత ఏ కథను చెప్పిస్తే బాగుంటుందో వాళ్ల సలహా, సూచనలతో ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్‌లతో ఆయా కథలను చెప్పించారు.
ఈ కాన్సెప్ట్‌నంతా తీసుకొని తనికెళ్ల భరణి దగ్గరకు వెళ్లారు. ఆయన ఈ ప్రాజెక్ట్‌కి పూర్తి సహకారం ఉంటుందని భరోసా ఇవ్వడమే కాదు పన్నెండు విభాగాల ముందుమాటకు తన గొంతునిచ్చారు. అయితే, తమ కాన్సెప్ట్‌ను ప్రయోగవంతంగా నిరూపించుకోవడానికి భిన్నరంగాల్లోని పది కుటుంబాలను ఎంచుకున్నారు. ఇందులో రాజీవ్ కనకాల, సుమ దంపతులూ ఉన్నారు. రికార్డ్ చేసిన కథలను ఈ పది కుటుంబాలకు వినిపించి వాళ్ల అభిప్రాయాలు తీసుకోవడం, వాటికనుగుణంగా మార్పులు చేర్పులు చేయడం.. ఇలా ఈ కాన్సెప్ట్ యాప్ రూపంలోకి రావడానికి ఏడాదిన్నర పట్టిందట మార్టిన్ వాళ్ల టీమ్‌కి.
అనగనగా..
మొత్తానికి ఫస్ట్‌భెల్ కథలు ‘అనగనగా’ పేరుతో మొన్న అక్టోబర్‌లో యాప్‌లోకి ఒదిగిపోయాయి. ‘ఫోర్త్ లార్జెస్ట్ డౌన్‌లోడెడ్ ఇన్ ఇండియన్ యాప్స్. ఫైవ్ రేటింగ్ ఐఓఎస్, ఫైవ్ రేటింగ్ ఇన్ ఆండ్రాయిడ్ అండ్ ఫైవ్ రేటింగ్ ఇన్ విండోస్. ఇంత పెద్ద కంటెంట్ ఇచ్చిన యాప్ వరల్డ్‌లోనే లేదు. మాదే ఫస్ట్. ఇంకా కొంతమంది పేరెంట్స్ కోరిక మేరకు ఇందులో పరమానందయ్య శిష్యులు, తెనాలి రామకృష్ణ కథలనూ ఈ యాప్‌కి యాడ్ చేయబోతున్నాం. పిల్లల మొహంలో చిరునవ్వు, తద్వారా కుటుంబాల్లో ఆనందం తేవడమే తమ యాప్ ముఖ్య లక్ష్యం’ అంటూ ‘అనగనగా యాప్’ కథను ముగించారు మార్టిన్. అన్నట్టు పిల్లలకో గుడ్‌న్యూస్.. ఫిజిక్స్ సబ్జెక్ట్ అంటే పిల్లల్లో ఒక రకమైన భయం ఉంటుంది. దాన్ని పోగొట్టడానికి ఫిజిక్స్ సబ్జెక్ట్‌నంతా గేమ్ రూపంలో మార్చి ‘ఫిజ్‌వార్స్’ అనే యాప్‌నూ రూపొందించబోతోందీ టీమ్.