కమనీయ కథక్
"Coming together is a bigining.. keeping together is progress.. working together is success" అన్న హెన్రీ ఫోర్డ్ మాటకు ఈ జంట బెస్ట్ ఎగ్జాంపుల్! ఆ ఇద్దరూ కల్యాణంతో కళాసాధనకు ఆహ్వానం పలికారు. ఒకరినొకరు తెలుసుకుని.. ఒడిదుడుకుల్లోనూ ఒకటిగా మసలుకుంటున్నారు. కళాజగతిలో సుస్థిర స్థానం కోసం జంటగా అడుగులేస్తున్నారు కథక్ కపుల్.. రాఘవరాజ్ భట్, మంగళా భట్.
రాఘవది కళానేపథ్యం ఉన్న కుటుంబం. జానపద కళారూపాల మీద అర్ధశతాబ్దానికి పైగా కృషి చేసిన గోపాల్‌రాజ్‌భట్ కొడుకు. మూడున్నరేళ్ల వయసులోనే కాళ్లకు గజ్జెకట్టాడు. మంగళ బ్యాక్‌గ్రౌండ్ కూడా అలాంటిదే. వాళ్లన్నయ్య కిరణ్ కులకర్ణి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో థియేటర్ స్టూడెంట్, ఆర్టిస్ట్!
కలసింది అక్కడే..
బిర్జూ మహారాజ్ దగ్గర కథక్ నేర్చుకోవడానికి రాఘవరాజ్.. ఢిల్లీ ఎన్‌ఎస్‌డీ (నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా) ఆవరణలోని కథక్ కేంద్రలో చేరాడు. మహారాష్ట్రియన్ అయిన మంగళ కూడా కథక్ నేర్చుకోవడానికి అక్కడికే వచ్చింది. గురువే వేరు.. పండిత్ దుర్గాలాల్. కథక్ కళా క్షేత్రం ఒకరికొకరు పరిచయమయ్యేలా చేసింది.. ప్రాణ స్నేహితుల్లా మార్చింది. మంగళ తన జీవితంలోకి వస్తే నాట్యం ఓ యోగంలా మారుతుందని భావించిన రాఘవరాజ్.. తన మనసులోమాట ఆమె చెవిన వేశాడు. డ్యాన్స్ తప్ప మరో ఆలోచన లేని మంగళ.. ‘ఇద్దరికీ కథక్ కంటే మించింది లేదు. మా ఇద్దరి మోహం అదే అయినపుడు పెళ్లి మా మార్గాన్ని సుగమం చేస్తుంది’ అనుకుని సరేనంది. గురువులిద్దరి ఆశీర్వాదాలే పెళ్లి మంత్రాలై.. వీరిని జంటగా ముడివేశాయి.
డ్యాన్స్ పార్టనర్స్..
‘మా ధ్యాస, శ్వాస నాట్యమే. నాకైతే మేమిద్దరం భార్యాభర్తలమన్న స్పృహే ఉండదు. డ్యాన్స్ పార్టనర్స్ అనే అనిపిస్తుంది. ఇంటికి సంబంధించిన విషయాలు అంతగా పట్టించుకోం. మా వర్రీ, హర్రీ అంతా ప్రోగ్రామ్స్, నేను నడిపే ఆకృతి కథక్ కేంద్రం గురించే’ అని మంగళ చెప్తుంటే ‘ఇంటి విషయాలు లీస్ట్ బాదర్డ్’ అని రాఘవా ఒప్పుకుంటాడు. విమర్శలు, ప్రశంసలు రెండూ సమానమే అంటారిద్దరూ.
ఇద్దరం ఒక్కటే..
‘ప్రశంస ఎవరికి వచ్చినా ఇద్దరం తీసుకుంటాం.. విమర్శను పంచుకుంటాం’ అంటాడు రాఘవ . ‘ఇద్దరం కలసి షేర్ చేసుకున్న స్టేజ్ మీద రాఘవను మెచ్చుకుంటే నాకు గర్వంగా అనిపిస్తుంది. నన్ను మెచ్చుకున్నా.. రాఘవ కూడా అలాగే ఫీలవుతాడు’ అంటుంది మంగళ. ‘మా మధ్య ఇగోలకు స్థానం ఉండదు. మంగళ సోలో ప్రోగ్రామ్ ఉంటే టెక్నీషియన్‌గా మారిపోతా.. లైటింగ్ మొదలు అన్నీ దగ్గరుండి ఇష్టంగా చూసుకుంటా’నని చెప్తాడు రాఘవ. ‘తన సోలో ప్రోగ్రామ్స్‌కి నట్టువాంగం నేనే చెప్తా’ అని సమాధానమిచ్చింది మంగళ ఉత్సాహంగా. ‘ఇద్దరం కొరియోగ్రఫీ చేస్తాం. ‘భేషజాలకు పోకుండా ఒకరి సలహాను ఇంకొకరం పాటిస్తాం’అని రాఘవ చెప్పాడు. ‘అయితే నాది కరక్టే అనిపించినప్పుడు మాత్రం దానికే ఫిక్సయిపోతాను. కానీ రేర్‌గా’ అని చిన్నగా సవరించింది మంగళ.
డ్యాన్స్ కోసమే..
‘డ్యాన్స్ కోసమే భార్యాభర్తలమయ్యాం. కథక్ తర్వాతే ఇంకేదైనా. అలకలు, కోపతాపాలు సహజమే అయినా.. ప్రాక్టీస్‌లో పడిపోయామంటే అన్నీ మర్చిపోతాం. జంటగా ఇన్నేళ్ల ప్రయాణం డ్యాన్స్‌లోనే కాదు, మా వ్యక్తిత్వాల్లోనూ పరిణతి తెచ్చింది. ఆర్ట్ మాకిచ్చిన గిఫ్ట్ ఇది’ అని చెప్తుంది మంగళ. అవును ఈ రెండు సగాలను ఒక్కటిగా చేసి.. పరిపూర్ణత్వాన్నిచ్చిన నాట్యానికి జీవితమంతా రుణపడి ఉంటామంటారు ఈ ఇద్దరు. ఊపిరి ఉన్నంత కాలం కాళ్లగజ్జెలే కాదు అవి ముడివేసిన తమ అనుబంధమూ లయతప్పదంటున్నారు. ‘మేడ్ ఫర్ ఈచ్ అదర్’ అని వేనోళ్ల ప్రశంసలు అందుకున్న వీరు ‘వియ్ బోత్ ఆర్ మేడ్ ఫర్ కథక్ ’ అని చాటుతున్నారు.
ఇద్దరూ ఇద్దరే..
‘దేన్నయినా ముందుగా అంచనా వేసి రిజల్ట్ చెప్పేస్తుంది మంగళ. అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టవుతుంది. నేను కాస్త లేట్‌గా రియలైజ్ అవుతూ మళ్లీ అదే తప్పును రిపీట్ చేస్తుంటాను. తప్పు తెలుసుకొని తప్పు చేయడమే నా వీక్‌నెస్’ అంటాడు రాఘవ నవ్వుతూ. ‘ఆయనకూ చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయ్. చక్కగా స్కెచింగ్ చేస్తుంటాడు. అంతేకాదు అందులో నేనిచ్చే సలహాలను కూడా పాటిస్తుంటాడు. ఎవరు ఏది చెప్పినా వినయంగా వినడం రాఘవ ప్లస్ పాయింట్. మనీ మేనేజ్‌మెంట్‌లో మాత్రం ఇద్దరమూ వీక్’ అని తెలిపింది. ‘టెక్నాలజీ అప్‌డేట్ చేసుకోవడంలో వీక్. స్మార్ట్ ఫోన్ ఆపరేట్ చేయడం చేతకాదు’ అని రాఘవ అంటుంటే..‘పాపం నాకు స్మార్ట్ ఫోన్ గిఫ్ట్ ఇచ్చి.. తను మాత్రం ఎప్పటిదో బేసిక్ మోడల్ వాడుతుంటాడు చూడండి’ అంటూ రాఘవ చేతిలో ఉన్న ఫోన్ చూపించింది మంగళ. ‘నేను ఆల్ ఫోక్ డ్యాన్స్ ఫామ్స్, ఫోక్ సాంగ్స్‌లో కూడా బెస్ట్.. తనలోనూ ఓ హిడెన్ టాలెంట్ ఉంది. తబలా చక్కగా వాయిస్తుంది’అని భార్యలోని మెరిట్ మెచ్చుకున్నాడు.
- సరస్వతి రమ