Cityplus
-
ఎడారి పండు.. పోషకాలు మెండు
సాక్షి, సిటీబ్యూరో: అలసిన దేహమనే యంత్రానికి ‘ఖర్జూరం’ ఓ శక్తి వనరు.. తక్షణ శక్తి ప్రదాయని. ఎన్నో పోషకాలతో నిగనిగలాడే ఈ పండు ఆరోగ్యాన్ని పరిపుష్టం చేస్తోంది. నిగనిగలాడే రంగు, మంచి రుచితో ప్రతి ఒక్కరినీ తనవైపు తిప్పుకుంటుంది. రంజాన్ మాసంలో దీనికో ప్రత్యేకత ఉంది. ‘రోజా’ దీక్షలను పాటించేవారు ఈ పండునే బాగా ఇష్టపడతారు. ఉపవాసం పూర్తయిన తర్వాత దేహానికి కావాల్సిన తక్షణ శక్తి కోసం దీన్ని తీసుకోవడం అనవాయితీ. ప్రస్తుతం పవిత్ర రంజాన్ మాసం కావడంతో ఈ పండుకు మరింత డిమాండ్ పెరిగింది. ఎడారి దేశాల్లో పండే ఈ ఫలం వివిధ అరబ్ దేశాల నుంచి 15 నుంచి 20 రకాల ఖర్జూరాలు నగర మార్కెట్లను ముంచెత్తాయి. ఇరానీ (నలుపు, ఎరుపు), కిమియా ఖజూర్, కల్మీ ఖజూర్, తైబా ఖజూర్, మగ్ధీ ఖజూర్, ఆల్ మదీనా.. తదితర రకాలు లభిస్తున్నాయి. వీటి విక్రయాలకు నిలయమైన బేగంబజార్, గుల్జార్ హౌస్ తదితర ప్రాంతాల్లో హోల్‌సేల్ దుకాణాలు కొనుగోలు దారులతో కళకళలాడుతున్నాయి. ఇరాక్, ఇరాన్, సౌదీ, ఒమన్ దేశాల నుంచి ఈ పండ్లను దిగుమతి చేసుకుంటున్నట్లు బేగం బజార్‌లోని కాశ్మీర్ హౌస్ అధినేత ధీరజ్ కుమార్ తెలిపారు. కిలో ఇరాకీ ఖజూర్ రూ.50 నుంచి రూ.60, నలుపు రకం ఇరానీవి రూ.80 నుంచి రూ.100, ఎరుపు రూ.60, కీమియా ఖజూర్కు రూ.120-130 (బాక్స్), తైబా మగ్ధీ రకాలు రూ.130-140, ఆల్ మదీనా ఖజూర్ రూ.160-180 ధర పలుకుతోంది. క్యాలరీస్ అధికం - ఖర్జూరాల్లో క్యాలరీస్ అధికమని, మన దగ్గర డ్రై డేట్స్ వినియోగం ఎక్కువని గాంధీ ప్రకృతి వైద్యశాల వైద్యులు డా. శ్యామల తెలిపారు. ఈ పండులో పోషకాలు అధికమని వివరించారు. - 100 గ్రాముల ఖర్జూరంతో 400-600 క్యాలరీల శక్తి లభిస్తుంది. ఫ్రెష్ డేట్స్‌లో క్యాలరీలు కాస్త తక్కువ. - ఖర్జూరాల్లో ఐరన్, ఫైబర్ ఎక్కువ. క్యాల్షియం, పొటాషియం, కార్బొహైడ్రేట్స్, ప్రొటీన్స్, కాపర్ పాళ్లు కూడా పుష్కలంగా ఉంటాయి. - 100 గ్రాముల డేట్స్‌లో 8-10 గ్రాముల ఫైబర్ ఉంటుంది. - డేట్స్‌ను పాలతో కలిపి తీసుకుంటే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అందుకే పిల్లల్లో, వృద్ధుల్లో, ఏదైనా జబ్బు నుంచి కోలుకునే వారికి ఇది మంచి ఆహారం. ఖర్జూరం తినడం వల్ల ఎల్డీఎల్ కొలస్ట్రాల్ బాగా తగ్గి గుండె పనితీరు బాగుంటుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. -
వీరి నినాదం.. ప్రకృతి దేవోభవ
పండ్లతోట.. పూలబాట రాయదుర్గం: మన సిటీలో ఇంటి వెనుక కాస్త స్థలం ఉంటే అందులో రెండు గదుల ఇల్లు కట్టి అద్దెకిస్తే బాగుంటుందని ఆలోచిస్తారు. కానీ పచ్చని చెట్లు ఉంటే అదే పెద్ద ఆస్తి అని భావించారాయన. అందుకే పెరట్లోనే పండ్లు, పూల మొక్కలను పెంచుతూ పన్నెండేళ్ల క్రితమే హరితహారానికి శ్రీకారం చుట్టారు జీహెచ్ఎంసీ ఉద్యోగి అనంతయ్య. గచ్చిబౌలి డివిజన్ గోపన్‌పల్లి తండాలో నివసించే ఈయన తన ఇంటి ఆవరణలోని ఖాళీ స్థలంలో పూలు, పండ్ల మొక్కలను నాటారు. ప్రస్తుతం అవి పెద్దవై ఇంటి మొత్తాన్ని కప్పేసి.. చల్లని నీడను, స్వచ్ఛమైన గాలిని, పూలు, పండ్లను ఇస్తున్నాయి. ఇంటి పెరట్లో మామిడి, సపోటా, ఆల్ బుకార్, బొప్పాయి, సీతాఫలం, పనస, జామ చెట్లున్నాయి. వీటితో పాటు పూల మొక్కలు కూడా పెంచుతున్నారు. అనంతయ్య కుమారులు శివకుమార్, చంద్రశేఖర్ కూడా వీటి సంరక్షణలో పాలుపంచుకుంటూ.. సీజన్ల వారీగా ఆయా మొక్కలను నుంచి వచ్చే పండ్లను ఆస్వాదిస్తారు. ఉపాధి వేటలో పెరుగుతున్న వలసలు.. ఖాళీ అవుతున్న గ్రామాలు.. ఊపిరి సలపనంతగా కిక్కిరిసిపోతున్న పట్టణాలు.. ఉన్న అడవులను నరికేసి మౌలిక సదుపాయాల కల్పన. జనం పెరుగుతున్నారని భూమి విస్తీర్ణం పెరగదు కదా..! పచ్చని వనాలు కనుమరుగైపోయి.. కాంక్రీట్ భవంతులు భూతాల్లా భయపెడుతున్నాయి. కాలుష్యపు కోరలు చాస్తూ కర్మాగారాలు జీవన ప్రమాణాలను కాలరాస్తున్నాయి. కరెన్సీ కట్టల లెక్క సరిపోక.. పెరట్లో మొక్కలు పీకేసి.. ఇరుకు గదుల్లో ఆదాయం బ్యాలెన్స్ షీట్ చూసుకుంటూ మురిసిపోతున్నారు. ఇప్పుడు ప్రాణవాయువును సైతం కొనుక్కునే పరిస్థితి. దేహం రోగాల పుట్టగా మారిపోయింది. ‘చెట్టు’ తోడు లేకే కదా ఇన్ని అనర్థాలు..!! అందుకే పచ్చని హారం నిర్మాణ ం కోసం కొందరు పరితపిస్తున్నారు. భాగ్యనగరి సౌభాగ్యం వనాలతోనే ఉందని తమ చుట్టూ నందనవనాలు సృష్టిస్తున్నారు. ప్రకృతి రక్షణే పరమావధిగా.. జూబ్లిహిల్స్: ఇప్పటికైనా చెట్లను నరకడం ఆపేయాలి. లక్షల సంఖ్యలో మొక్కలు నాటి చెట్లుగా చూడాలి. పర్యావరణాన్ని ప్రాణంలా కాపాడాలి.. ఇదీ సాప్ట్వేర్ ఇంజినీర్ జయప్రకాశ్ నంబూరు స్వప్నం. ఈ స్వప్నాన్ని ఆచరణలో పెట్టేందుకు ఆరేళ్ల కిందట ఆయన నడుంబిగించారు. ఐదంకెల జీతాన్ని, అందమైన జీవితాన్ని వదిలేసి పర్యావరణ పరిరక్షణ ఉద్యమాన్ని ప్రారంభించారు. విజయనగరం జిల్లా కొత్తవలసకు చెందిన జయప్రకాశ్ ఇంజినీరింగ్ పూర్తి చేసి విదేశాల్లో పలు ఉద్యోగాలు చేశారు. ఆ దేశాల్లో పర్యావరణ పరిరక్షణకు ఇస్తున్న ప్రాధాన్యతను, ప్రజల్లో ఉన్న చైతన్యాన్ని గమనించిన ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి హైదరాబాద్‌కు వచ్చేసి పర్యావరణ పరిరక్షణకే అంకితమయ్యారు. ఇందుకోసం ‘ఐ గోగ్రీన్ ఫౌండేషన్’ను స్థాపించారు. ఠీఠీఠీ.జీజౌజట్ఛ్ఛజౌఠఛ్చ్టీజీౌ.ౌటజ పేరుతో వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. విసృ్తత స్థాయిలో పర్యావరణంపై ప్రచారం చేస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలు, కార్పొరేట్ సంస్థలను ఎంపిక చేసుకొని నీరు, విద్యుత్ ఆదా, మొక్కల పెంపకం, ప్లాస్టిక్ వాడకం నిషేధం తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ అంశాలను పాఠశాల, ఇళ్లల్లో అమలు చేసేలా వారిని ఒప్పిస్తున్నారు. రోటరీక్లబ్ సహకారంతో పలు జిల్లాల్లోని 200కు పైగా రోటరీ భవనాల్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయించారు. విస్తృతంగా మొక్కలు నాటించారు. ‘పర్యావరణ చైతన్య రథం’ పేరుతో ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేసి ప్రచారం చేస్తున్నారు. నగరంలో ఎక్కడైనా చెట్లను నరికేస్తున్నట్టు గుర్తిస్తే 1800 4255364 (టోల్ ఫ్రీ) నంబర్‌కు సమాచార ఇవ్వాలని కోరుతున్నారు. ఎక్కడన్నా చెట్లు తొలగిస్తుంటే వాటిని మరోచోట నాటుతున్నారు. కాలనీలు, డంపింగ్ యార్డ్‌ల్లో చెత్తను తగలబెడుతుంటే అడ్డుకునేందుకు ఓ ప్రత్యేక కార్యకర్తల బృందాన్ని నియమించారు. అంతేగాకుండా 040- 21111111 నెంబర్‌కు ఎవరన్నా ఫోన్ చేసినా వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. ‘దేశంలోని వంద కోట్ల మందిలో ప్రతి ఒక్కరు చిన్న పర్యావరణ అనుకూల పనిచేసినా దాని ప్రభావం విస్తృతంగా ఉంటుంది. ఒక్క మొక్కను నాటినా అది మహా వృక్షమై మనకు ఎంతో మేలు చేస్తుంది’ అని చెబుతున్నారు జయప్రకాష్. ‘చిగురించిన’ ఆదర్శం బంజారాహిల్స్: ఇంటి నిర్మాణానికి అడ్డు వస్తుందని చెట్లు నరికేస్తారు. ఇంటి ప్రహరీకి పగుళ్లు వస్తాయని గోడ పక్కన చెట్లను సైతం తొలగించే వారూ ఉన్నారు. చెట్టు నరికేస్తుంటే మనకెందుకులే.. అని పట్టించుకోనివారికీ నగరంలో కొదవలేదు. అయితే, బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని ఫార్చూన్ ఎన్క్లేవ్ అపార్ట్మెంట్ నివాసితులు మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. ఇక్కడివారు పచ్చదనం అంటే ప్రాణం పెడతారు. ఎక్కడో చెట్లను కొట్టేస్తున్నారని తెలుసుకుని ఆ చెట్లను తలా కొంత డబ్బు పోగు చేసి కొనుగోలు చేశారు. తమ అపార్ట్మెంట్ ఆవరణలో అప్పటికే ఉన్న వందలాది చెట్లతో స్థలం లేకపోతే ఎదురుగా ఉన్న రోడ్డులో వాటిని తెచ్చి నాటుకున్నారు. మెట్రోరైలు పనుల్లో భాగంగా అడ్డుగా ఉన్న భారీ చెట్లను జీహెచ్ఎంసీ, మెట్రో అధికారులు తొలగిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఫార్చూన్ ఎన్క్లేవ్ అపార్ట్మెంట్లో ఉన్న 43 కుటుంబాలు చెట్టు ప్రాముఖ్యం తెలుసు కాబట్టి వాటి రక్షణకు నడుం బిగించారు. నివాసితులంతా తలా కొంత డబ్బు పోగుచేసి తొలగించే చెట్లను ట్రీ రీలొకేట్ పద్ధతిలో తీసుకొచ్చి నాటుతున్నారు. ఒక్కో చెట్టుకు రూ. 10 వేలకు పైగా ఖర్చు చేశారు. ఈ చెట్లను అపార్ట్మెంట్ ఎదురు మార్గంలో నాటి వదిలేయలేదు.. అవి చక్కగా ఎదిగేలా జాగ్రత్తలు తీసుకున్నారు. నిత్యం నీళ్లు పోయడం, ఎరువు వేయడం వంటివి చేశారు. తలా ఒక రోజు చొప్పున చెట్టు రక్షణకు నిఘా ఉంచారు. ప్రస్తుతం అవి పచ్చగా ఎదిగి నీడనిస్తున్నాయి. పచ్చందాల కాలనీ.. శేరిలింగంపల్లి: పచ్చదనంతో ఆ కాలనీ కళకళలాడుతోంది. దీని సంరక్షణ కోసం స్థానికులు నిత్యం కొంత సమయం వెచ్చిస్తారు. కాలనీ చిన్నదే అయినా ఎటుచూసినా పచ్చదనమే. పక్షుల కిలకిల రావాలతో ఉదయం, సాయంత్రం సమయాల్లో పల్లె వాతావరణాన్ని ప్రతిబింబిస్తుంది.. శేరిలింగంపల్లి నల్లగండ్లలోని లక్ష్మీ విహార్ ఫేజ్-2 కాలనీ. ఇక్కడ నివసించే వారంతా విద్యాధికులు కావడంతో పచ్చదనానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారు. ఫలితంగా ఇక్కడ 30 వేలకు పైగా మొక్కలు, చెట్లు ఎంతో ఆహ్లాదాన్ని అందిస్తున్నాయి. కాలనీ ప్రధాన గేటు లోపల భాగంలో వేప, మామిడి, జామ, సపోటా, మల్లె, ఉసిరి, టేకు, అశోక, పనస చెట్లు ఉన్నాయి. రోడ్లకు ఇరువైపులా ఎగ్జోరా, అలమండ, జాత్రోపా సింగపూర్ ఎగ్జోరా, ఎల్కోనియా, స్వాతి పైలం, నైట్‌క్వీన్, ముసుండ తదితర మొక్కలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఏటా వీరు ‘ప్రకృతి దేవోభవ’ పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తారు. ‘మా కాలనీలో పచ్చదనానికి ప్రతిఒక్కరూ ప్రాధాన్యం ఇస్తారు. వేసవిలో మిగతా కాలనీలతో పోలిస్తే ఇక్కడ రెండు డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతుంద’ని కాలనీ అధ్యక్షుడు రవీంద్ర ప్రసాద్ దూబే తెలిపారు. తమ కాలనీలో పచ్చదనంతో పాటు ఇంకుడు గుంతలను తవ్వించడం వల్ల నీటి సమస్య కూడా లేదని, సీవరేజ్ నీటిని శుద్ధి చేసి గ్రీనరీకి వినియోగిస్తున్నామని కాలనీ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు రాంమూర్తి తెలిపారు. అతిథులకు మొక్కలు.. ఉప్పల్ : పచ్చదనమన్నా.. పక్షులన్నా ఆయనకు పంచ ప్రాణాలు. దీంతో తన ఇంటిని రకరకాల మొక్కలతో నింపి నందనవనంగా తీర్చిదిద్దారు. దీనిలో 40 రకాల పక్షులు గూళ్లు కట్టుకుని ఆవాసం ఏర్పరచుకున్నాయి. కర్ణాటకలోని కార్వార్ ప్రాంతానికి చెందిన ఎన్ఎఫ్సీ రిటైర్ట్ సైంటిఫిక్ ఆఫీసర్ సావంత్.. హబ్సిగూడ స్నేహనగర్ వీధి నెంబర్-8లో నివాసం ఉంటున్నారు. 1980లో ఇల్లు నిర్మించుకుని ఇక్కడే స్థిరపడ్డారు. తన ఇంటి చుట్టూ ఉన్న ఖాళీ స్థలంలో అనేక రకాల మొక్కలను పెంచుతున్నారు. ఉదయం 6 అయ్యిందంటే చాలు వేలాది పావురాలు సావంత్ అందించే ఆహారం కోసం నిరీక్షిస్తుంటాయి. మొక్కలను పెంచడమే కాదు.. ఇంటికి వచ్చిన అతిథులకు వాటి ప్రాముఖ్యతను వివరించి మొక్కలను పంచడం ఇతని హాబీ. -
పెట్స్‌తో జాగ్రత్త సుమా..!
కుక్క, పిల్లి, ఎలుక, పావురం, పిచ్చుక, గుర్రం, కుందేలు.. ఇలా ఏ ప్రాణినైనా పెంచుకునేందుకు నగరవాసులు మక్కువ చూపుతున్నారు. తమ ఆసక్తిని బట్టి, ఆర్థిక స్తోమతను బట్టి ఆయా జంతువులను సంరక్షిస్తున్నారు. కొందరికి ఇవి స్టేటస్ సింబల్‌గా కూడా మారిపోయాయంటే నగరవాసి జంతు ప్రేమ ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు. అయితే, ఎక్కువ మంది శునకాలను పెంచుకునేందుకే ఆసక్తి చూపుతున్నారు. వీటిని విదేశాల నుంచి కూడా తెప్పించుకుంటున్నారు. ఎంత ఖరీదైన జంతువైనా సరే పెంపకంలో జాగ్రత్తలు తప్పనిసరి అంటున్నారు వెటర్నరీ వైద్యులు. పెట్స్ ఆహారం, ఆరోగ్యం విషయంలో కనీస అవగాహన అవసరమంటున్నారు. - రాజేంద్రనగర్ / సాక్షి, సిటీబ్యూరో జునోసిస్ అంటే.. జంతువులకు వాటి నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులను జునోసిస్ అంటారు. ఈ వ్యాధుల్లో రేబీస్ ప్రధానమైంది. లూయి పాశ్చర్ 1885 జులై 6న యాంటీ రేబిస్‌ను తొలిసారిగా ఉపయోగించారు. ఈ రోజునే యాంటీ రేబీస్ డేగా కూడా వ్యవహరిస్తుంటారు. అవగాహన అవసరం.. పెంపుడు జంతువులకు వేసే వాక్సినేషన్‌పై చాలా మందికి అవగాహన లేదు. కొంతమంది ఖర్చుతో కూడిందని పట్టించుకోరు. పెట్స్‌కు మాములుగా కరిచే గుణం ఉంటుంది కాబట్టి దాదాపు అన్ని రకాల పెట్స్‌కి వ్యాక్సినేషన్ తప్పనిసరి. మనిషికి, జంతువుకు ఉండే కాంటాక్ట్‌లో అది కరవడం, గీరటం లాంటివి సాధారణంగా జరుగుతుంటాయి. దాని వల్ల ఏదైనా ఆరోగ్య సమస్య రావచ్చు. క్యాట్స్, ర్యాబిట్స్ లాంటివి పెంచుతున్నవారు కూడా వ్యాక్సినేషన్ అవసరాన్ని గుర్తించాలి. మా సంస్థ తరపునవ్యాక్సినేషన్ అవసరంపై అవగాహన చెపడుతున్నాం. వ్యాక్సిన్ వేయించడం పెట్‌కి మాత్రమే కాదు.. పెట్ ఓనర్స్, వారి చుట్టూ ఉన్నవారి రక్షణకు సంబంధించిన విషయం. - నిహార్, ఏఆర్‌పీఎఫ్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి వైద్య సలహాలు తప్పనిసరి జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే రోగాలను ‘జునాటిక్ డిసీజెస్’ అంటారు. ఎబోలా, బర్డ్‌ఫ్లూ, రేబిస్, ఆంత్రాక్స్.. వంటివి జునాటిక్ వ్యాధులే. ఈ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ఉండాలంటే రెగ్యులర్‌గా వెటర్నరీ వైద్యుల సలహాలు తీసుకోవాలి. పెంపుడు జంతువుల ఆరోగ్యం, స్కిన్ కేర్ ఎంత ముఖ్యమో, వాటి యజమానులు వారి హెల్త్ కూడా ముఖ్యమని గుర్తించాలి. ముఖ్యంగా ఇంట్లో డాగ్స్ ఉన్నవారు చర్మ సమస్యలు వస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. సిటీలో కుక్కలు, పిల్లులు తర్వాత పక్షులను పెంచుతున్నారు. వీటి వల్ల లంగ్స్‌కి సంబంధించిన వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంది. వాటిని నివారించేందుకు పక్షులకు సంబంధించిన వాటర్ వ్యాక్సిన్స్ ఇప్పించాలి. వైల్డ్ లైఫ్ యానిమల్స్, పెట్స్‌తో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు అవసరమైన జాగ్రత్తలు తప్పనిసరి. - డాక్టర్ మురళీధర్, డాక్టర్ డాగ్ హాస్పిటల్స్ పెట్స్‌ను పిల్లల్లా చూడాలి.. నాకు మూడేళ్ల బాబు. హ్యాపీ, డాలర్, డ్యూక్ పెట్స్ (డాగ్స్) ఉన్నాయి. డాగ్స్‌తో పిల్లలకు ఇన్ఫెక్షన్ అనేది నేను ఫేస్ చేయలేదు. సాధారణంగా ఆరు నెలలకు ఓసారి డాగ్స్‌కి పొట్ట క్లీన్ కావడానికి డీవార్మింగ్ చేస్తారు. అయితే, వీధి కుక్కలకు ఇలాంటిది లేకుండా బాగానే ఉంటాయి. నేను డీవార్మింగ్కి నాచురల్ రెమిడీస్, హోమియోపతి మందులు ఇస్తుంటా. నెలకోసారి పంప్కిన్, సన్‌ఫ్లవర్, తర్బూజా వంటి డ్రై గింజలు మిక్స్ చేసి ఇస్తుంటా. నా పెట్స్ హెల్దీగా ఉన్నాయి. పెట్స్‌కి మంచి హెల్దీ ఫుడ్ ఇవ్వాలి. సోయా, చికెన్, వెజిటేబుల్స్, ఎగ్, రైస్, యాపిల్ ఇలా అన్నీ వేసి వండుతాను. కొద్దిగా సాల్ట్, ఆయిల్ ఉండేలా చూస్తా. వాటికి రెగ్యులర్‌గా బ్రష్, కోంబింగ్, మంత్లీ బాత్ తప్పనిసరి. బాత్ చేసిన తర్వాత బాగా తుడవాలి. తడిగా ఉంచితే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. - సౌమ్య, పెట్లవర్ ఒత్తిడి మాయం.. చదువుకునేటప్పుడు నా దగ్గర డాగీస్ ఉండేవి. జాబ్‌లోకి వచ్చాక ప్రస్తుతం హాస్టల్లో ఉంటున్నా. ఆరు నెలల క్రితం బర్త్‌డే గిఫ్ట్‌గా బెర్రీ(డాగ్) నా దగ్గరకు వచ్చాడు. మొదటి మూడు నెలలు వరుసగా వ్యాక్సిన్ వేయించాను. తర్వాత వన్ ఇయర్‌కి ఒకటి. డాగ్స్‌కి జనరల్‌గా వామ్స్ వస్తుంటాయి. సిరప్, పౌడర్ వంటి మందులతో ట్రీట్మెంట్ ఉంటుంది. ఆఫీస్ నుంచి వచ్చాక బెర్రీతో కాసేపు ఆడుకుంటే ఒత్తిడి మొత్తం పోతుంది. వ్యాక్సిన్‌కి వెళ్లినప్పుడు డాక్టర్.. ఫుడ్, మెడికల్, బాతింగ్ ఎలా ఉండాలో చెప్పారు. పెట్స్‌కు కిడ్స్‌లా కేర్‌తో పాటు వ్యాక్సిన్ కూడా తప్పనిసరి. - స్వాతి, పెట్ లవర్ పెంపుడు శునకాలకు ఉచిత వ్యాక్సిన్ నేడు ‘ప్రపంచ జునోసిస్ డే’ను పురస్కరించుకుని సోమవారం నారాయణగూడలోని ‘వెటర్నరీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి’లో పెంపుడు కుక్కలకు ఉచితంగా రేబిస్ వ్యాధి నిరోధక టీకా వేయనున్నారు. ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాక్సిన్ వేయనున్నట్టు ఆసుపత్రి డిప్యూటీ డెరైక్టర్ డాక్టర్ భగవాన్ రెడ్డి తెలిపారు. పంపుడు శునకాల యజమానులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. కూకట్‌పల్లిలో.. కూకట్‌పల్లిలో బీజేపీ కార్యాలయం సమీపంలోని వెటర్నరీ ఆసుపత్రిలో నేడు కుక్కలకు, ఇతర పెంపుడు జంతువులకు ఉచిత రేబిస్ వ్యాధి నిరోధక టీకాలు వేయనున్నట్టు డాక్టర్ కృష్ణకుమార్ తెలిపారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు టీకాలు వేస్తామని, ఈ అవకాశాన్ని పెట్ లవర్స్ వినియోగించుకోవాలన్నారు. కుత్బుల్లాపూర్‌లో.. కుత్బుల్లాపూర్ పశు వైద్యశాలలో నేడు ఉచితంగా యాంటీ రేబిస్ టీకాలు వేయనున్నట్టు డాక్టర్ అనిల్ మురారి తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు టీకాలు వేస్తామన్నారు. వివరాలకు 99127 89456 నెంబర్లో సంప్రదించవచ్చు. మలక్‌పేటలో.. మలక్‌పేట పశు వైద్యశాలలో నేడు ఉచితంగా యాంటీ రేబిస్ టీకాలు వేయనున్నట్టు డాక్టర్ ఎం.సబిత తెలిపారు. మలక్‌పేట గంజ్ ఆవరణలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయం పక్కన ఉన్న పశు వైద్యశాలలో తిరుమల మెడికల్ హాల్ నేతృత్వంలో ఈ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. వివరాలకు 89789 01658 నెంబర్లో సంప్రదించవచ్చు. చాంద్రాయణగుట్టలో చాంద్రాయణగుట్ట పూల్‌బాగ్‌లోని నల్లవాగు హిందూ శ్మశానవాటిక ఎదురుగా గల పశు వైద్యశాలలో కుక్కలు, మేకలకు వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఇక్కడ సోమవారం నుంచి శనివారం వరకు వైద్యం అందిస్తారు. జంతువుల యజమానులు ఉదయం 8 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వ్యాక్సిన్ ఇప్పించవచ్చు. -
ముందే సినిమా చూపిస్త మామా..
బొమ్మను చేసి.. ప్రాణం పోసి ఎందరికో ప్రాణప్రదంగా మార్చిన రోజుల నుంచి ప్రాణమున్న మనిషి నుంచే బొమ్మను పుట్టించే రోజులొచ్చాయి. వ్యక్తి కదలికల నుంచి యానిమేషన్ క్యారెక్టర్ని క్రియేట్ చేయడమనే ప్రక్రియ కొత్త పుంతలు తొక్కుతూ.. సినిమాకి ముందు ‘నమూనా’ సినిమాని పుట్టించడానికి సిద్ధమైంది. మరోవైపు మార్కర్‌లెస్ మోషన్ క్యాప్చరింగ్‌తో సిటీ కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టింది. - తీయబోయే చిత్రాన్ని ముందే చూడొచ్చు - తెరకెక్కబోయే నటులకు ముందే డూప్‌లు - చిత్ర విచిత్రం.. మార్కర్‌లెస్ మోషన్ క్యాప్చరింగ్ మార్కర్లెస్లో మనమే ఫస్ట్ సాధారణంగా మోషన్ క్యాప్చరింగ్‌లో మార్కర్స్ వినియోగిస్తారు. వ్యక్తుల్ని చలింపజేసే కీళ్ల భాగాల్లో, బోన్స్ రొటేషన్ ఉన్న ప్రతి చోటా మార్కర్ పెట్టి వర్చువల్ ఫీల్డ్‌లో క్యారెక్టర్ని నిలబెట్టి.. కెమెరాతో ఆ సెన్సస్‌ని క్యాప్చర్ చేస్తారు. దీని కోసం స్పెషల్ సూట్ వేసుకుని శరీరంలో పలు చోట్ల మార్కర్స్ పెట్టుకుంటారు (ఆటల్లో కూడా దీనిని వాడుతున్నారు. ఉదాహరణకి క్రికెట్లో త్రో బౌలింగ్ వస్తుందంటే మోషన్ క్యాప్చర్స్ ద్వారానే పరీక్షిస్తారు) అయితే, ఈ మార్కర్స్, సూట్ ధరించాల్సిన అవసరం లేకుండానే కదలికల్ని క్యాప్చర్ చేసే వినూత్న ప్రక్రియను ఆసియాలోనే ప్రథమంగా నగరంలో అందుబాటులోకి తెచ్చింది క్రియేటివ్ మెంటర్స్. ‘మేం ఉపయోగించే టెక్నాలజీతో మార్కర్స్, సూట్ అవసరం లేకుండానే ఇన్‌స్టంట్‌గా మోషన్ క్యాప్చరింగ్ చేస్తాం. ఈ టెక్నాలజీని అమెరికన్ ఆర్మీ కోసం వినియోగిస్తారు. ఆసియాలోనే మార్కర్ లెస్ శైలి ఫస్ట్ టైమ్. దీని వల్ల సమయం ఆదా అవుతుంది. దాదాపు రూ.20 వేల ఖరీదుండే సూట్లు, అలాగే మార్కర్స్, ట్రాకర్స్ ఇవన్నీ కొనాల్సిన అవసరం లేదు’ అంటున్నారు మాదాపూర్‌లోని కావూరిహిల్స్‌లో ఉన్న క్రియేటివ్ మెంటర్స్ నిర్వాహకులు. ‘మోషన్ క్యాప్చరింగ్’ అనే సాంకేతిక అద్భుతం.. హాలీవుడ్ ‘అవతార్’, తమిళ సినిమా ‘కొచ్చాడియాన్’ తర్వాత క్రేజీగా మారిపోయింది. ఇప్పుడు సినిమాల్లో నటులకు మాత్రమే కాదు.. సినిమాకి కూడా డూప్‌ని సైతం సృష్టిస్తోంది. యానిమేషన్ ప్రక్రియ అనేది పేపర్ పెన్సిల్ నుంచి మొదలై.. గేమింగ్, సినిమా ద్వారా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోకి ప్రవేశించింది. దాని మీడియం మార్పు చేర్పులకు గురవుతూ సాఫ్ట్వేర్కి చేరుకుని 2డీ, 3డీ యానిమేషన్ సాఫ్ట్వేర్ సైతం అందుబాటులోకి వచ్చేశాయి. ఆ క్రమంలోనే కొన్నేళ్ల క్రితం పరిచయమైంది ఈ మోషన్ క్యాప్చరింగ్. బొమ్మని చేసి దానికి నడకలు నేర్పి నటింపజేసే బదులు, నిజమైన నటుడి అభినయాన్ని కెమెరా ద్వారా క్యాప్చరింగ్ చేసి యానిమేటెడ్ క్యారెక్టర్‌గా యూజ్ చేసే ఈ ప్రక్రియ ఇప్పుడు సినిమాల ప్రీ విజువలైజేషన్‌కు సరికొత్త మార్గంగా మారింది. ‘నమూనా’ సినిమా.. స్కెచ్‌లు, బొమ్మల సహితంగా సినిమా స్టోరీ బోర్డ్ తయారు చేయడం రూపకర్తలకు అలవాటే. దీని ద్వారా తీయబోయే సినిమా మీద యూనిట్‌కు అవగాహన కల్పిస్తారు. ఈ స్టోరీబోర్డ్ పూర్తిగా మాన్యువల్. అయితే మోషన్ క్యాప్చరింగ్ ప్రక్రియ పుణ్యమాని ఇప్పుడు ఏకంగా ‘అడ్వాన్స్డ్ ప్రీ విజువలైజేషన్ మూవీ’ అందుబాటులోకి వచ్చేసింది. ఈ ప్రక్రియ ద్వారా తీసే చిత్రం మొత్తాన్ని ముందే కళ్లకు కట్టినట్టు విజువలైజ్ చేయవచ్చు. కథకు అనుగుణంగా నటులను వినియోగించి వారి కదలికల ద్వారా యానిమేటెడ్ క్యారెక్టర్స్‌ని సృష్టిస్తూ షూటింగ్ తరహాలోనే ఈ విజువలైజేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. సినిమా మొత్తం ‘ప్రీ విజువలైజ్’ చేయించుకుంటే డెరైక్టర్ సెట్స్‌కి కూడా వెళ్లక్కర్లేదు. దీని వల్ల ప్రొడ్యూసర్‌కి సరైన బడ్జెట్ అంచనా వీలవుతుంది. పెద్ద హీరోని, ప్రొడ్యూసర్ని కన్విన్స్ చేయాలన్నా.. కథ మీద నమ్మకం ఉన్న డెరైక్టర్, స్టోరీ రైటర్లు ఈ డూప్ మూవీ తయారు చేయించుకొంటున్నారు. సాంగ్స్ ఉండని ఈ డూప్ మూవీ సుమారు 90 నిమిషాల నిడివి మాత్రమే ఉంటుంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ట్రాక్ కూడా కంపోజ్ చేస్తారు. సుమారు 45 రోజులు సమయం పడుతుంది. దీనికి కనీసం రూ.20 లక్షల దాకా ఖర్చవుతుందని యానిమేషన్ ఇండస్ట్రీ నిపుణులు అంటున్నారు. అయితే ఒక పెద్ద హీరో చిత్రం సగటు వ్యయం రూ.25 కోట్లు అనుకుంటే, ఈ ప్రీ విజువలైజేషన్ వల్ల ఆదా అయ్యే వేస్టేజ్‌తో పోల్చుకుంటే ఈ వ్యయం ఎక్కువేం కాదంటున్నారు నిపుణులు. మొత్తం సినిమా లేదా కొన్ని ప్రధానమైన యాక్షన్ సీన్స్ మాత్రమే తీయవచ్చు. బాహుబలి, రుద్రమదేవి వంటి చిత్రాలకు ఈ తరహాలోనే ప్రీ విజువలైజేషన్ చేసినట్టు సమాచారం. ‘నమూనా’ నటులకు డిమాండ్. పూర్తిస్థాయి మూవీ మేకింగ్, గేమింగ్ ఇండస్ట్రీ, విజువల్ ఎఫెక్ట్స్ ఇండస్ట్రీ, ప్రీ విజువలైజేషన్, మెడికల్ -స్పోర్స్ సైన్స్ ఫీల్డ్‌లో కూడా ఈ మోషన్ క్యాప్చరింగ్ ప్రక్రియ ఊపందుకుంటోంది. దాంతో దీని కోసం నటీనటుల అవసరం ఏర్పడుతోంది. అయితే యానిమేషన్ క్యారెక్టర్‌కు కొంతయినా వ్యక్తుల బాడీ లాంగ్వేజ్ నప్పాలి. అలాగే నటన కూడా వచ్చి ఉండాలి. ఇలా నటించేవాళ్లకి మంచి రెమ్యునరేషన్ కూడా అందుతోంది. మార్కర్లెస్తో మ్యాజిక్.. నగరంలోని సిట్ అండ్ మల్టీ మీడియాతో అసోసియేట్ అయి యానిమేషన్ రంగంలో గేమింగ్ డిజైన్ చేస్తున్నాం. జేఎన్ఏ ఎఫ్ఎల్ సర్టిఫికేషన్‌తో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాం. మోషన్ క్యాప్చరింగ్ ప్రక్రియ ఇప్పటికీ ఇండియాలో కేవలం నాలుగైదు సంస్థలు మాత్రమే అందిస్తున్నాయి. అయితే మేం అందిస్తున్న మార్కర్ లెస్ మోషన్ క్యాప్చరింగ్ మాత్రం ఆసియాలో మరెక్కడా లేదు. మూవీ ప్రీ విజువలైజేషన్‌కి ఇది బాగా ఉపకరిస్తుంది. అంతేకాదు దీని ద్వారా గేమ్స్, యానిమేషన్ కంటెంట్‌ను డొమెస్టిక్ మార్కెట్‌కి సప్లయ్ చేయవచ్చు. - కె. సురేష్‌రెడ్డి. క్రియేటివ్ మెంటర్స్ -
గుబాళించే కాలం..
అత్తరు పరిమళం మనస్సుకు ఎంతో హాయినిస్తుంది. మల్లెపూలు, గులాబీరేకులు, గంధపు చెక్కలు, మొగలిపువ్వుల ఆవిరే అసలైన అత్తర్. ఎంతకాలం ఎక్కువగా భద్రపరిస్తే అంత సువాసనను వెదజల్లుతుంది. నగరజీవన శైలిలో దీని ప్రాధాన్యం మరింత పెరిగింది. విశాఖ-కల్చరల్ : సెంట్ ఎంత ఎక్కువ కాలం భద్రపరిస్తే అంత సువాసనను వెదజల్లుతుంది. నకిలీలదైతే కొంతకాలంలోనే వాసనలో వ్యత్యాసాన్ని గమనించవచ్చు. వీటిని తోలుతో చేసిన కుప్పిలలో ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి రవాణా చేస్తారు. పురాతన కాలంలో కొంతమంది తమకు నచ్చిన అత్తరులను తయారు చేయించి, పెద్ద డ్రమ్ముల్లో నిల్వ ఉంచుకునేవారు. అవి చాలాకాలం పాటు నిల్వ ఉండేవి. వీడని పరిమళం జన్నతుల్ పిర్దోస్, మజ్మ, షాజహాన్, తమన్నా, నాయట్, హౌప్, బఖూర్, మొఖల్లత్, ఇత్రేఫిల్, షమామతుల్, అంబర్, హీన, జాఫ్రాన్, మిష్క్, దహనుల్‌ఊద్, రోజ్, కచ్చికలి అత్తరుల్లో ముఖ్యమైనవి. కృత్రిమంగా తయారు చేసేవి ఎన్ని ఉన్నా...పెట్టిన మరుక్షణమే వాసన పోయేవి ఉన్నాయి. అసలుసిసలైన అత్తరు అంటే ఒక్కసారి పూసుకున్నాక రెండు, మూడుసార్లు దుస్తులు ఉతికినా దాని పరిమిళం మాత్రం పోదు. రూ.10 నుంచి...రూ.వేల వరకూ.. సిటీలో డాబాగార్డెన్స్, జగదాంబ కూడలి, వన్ఏరియా, ద్వారకానగర్, పూర్ణామార్కెట్, కురుపాం మార్కెట్, మరికొన్ని కార్పొరేట్ షాపింగ్‌మాల్స్‌లోనూ లభిస్తున్నాయి. అత్తరుకే ప్రత్యేకమైన దుకాణాల్లో లభ్యమయ్యేవి మరింత భిన్నం. అరబ్బులు ఇష్టపడే దహనల్‌ఊద్ పది మి.లి.లకు రూ.2వేల నుంచి రూ.6వేల వరకు ఉన్నాయి. షమామతుర్ అంబర్, హీన వంటి 10మి.లి.ధర రూ.600, కచ్చికలి పదిగ్రాములు రూ.80, జన్నతుల్ ఫిర్దౌస్ పదిగ్రాముల రూ.120 ఉన్నాయి. సీజన్ వారీగా... సిటీలో సీజనల్‌వారీగా సెంట్స్ను వినియోగిస్తున్నారు. సాధారణంగా అన్ని రకాల అత్తరులను నిత్యం వినియోగించట్లేదు. వాడే పద్ధతి తెలియక సమయం కాని సమయంలో ఒంటికి పూసినా, వాసన పీల్చినా అనర్థాలు కలిగే అవకాశం ఉండడంతో సీజన్ బట్టి సెంట్ వెరైటీని వినియోగించడం పరిపాటి. వేసవిలో ఖస్, ఇత్రేఫిల్ చాలా మంచివి. ఇవి రెండు చల్లదనాన్ని ఇస్తాయి. ఇత్రేఫల్ మట్టివాసనను ఇస్తూ చల్లదనాన్ని కలిగిస్తుంది. వర్షాకాలం, చలిలో షమామతుల్ అంబర్, హీన, జాఫ్రాన్, మిష్క్, దహనుల్‌ఊద్ వంటివి వాడాలి. ఇవి వెచ్చదనాన్ని ఇస్తాయి. దుబాయ్ నుంచి దిగుమతి... సీజన్ బట్టి రకరకాల సెంట్స్ దుబాయి, ఖత్తర్ వంటి దేశాల నుంచి నగరానికి దిగుమతి అవుతాయి. మనదేశంలో ఉత్తరప్రదేశ్‌లోని ఖన్నోజ్ ప్రాంతం నుంచి కూడా దిగుమతి చేసుకుంటున్నట్టు హోల్‌సేల్ వ్యాపారి మహ్మద్ ఇమ్రాన్ తెలిపారు. సాధారణంగా వాడే సెంట్స్ ఇతర దేశాలతోపాటు బెంగళూరు, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్ నగరాల నుంచి విశాఖకు వస్తున్నాయి.. అల్యూమినియం డాబ్బాలను రవాణాకు వినియోగిస్తున్నారు. గాజుపాత్రలు మంచివే అయినా, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తరలించడం కష్టంతో కూడుకున్న పని. అందుకే అల్యూమినియం పాత్రల్లో తీసుకు వచ్చి ఇక్కడ గాజుపాత్రల్లో, సీసాల్లో నింపి బోటలింగ్ చేస్తున్నారు. 40 ఏళ్ల నుంచి ఇదే వ్యాపారం మాది షాదీనగర్. మా బాబా సమయంలో ఇక్కడకు వచ్చేశా. 40 ఏళ్ల నుంచి ఇత్తరు వ్యాపారం చేస్తున్నాం. ముఖ్యంగా సూఫిబ్రాండ్ అత్తరులను ఎక్కువగా విక్రయిస్తున్నాం. దుబాయ్, ఖత్తరు, మలేసియా, సింగపూర్, విదేశాల నుంచి హోల్‌సేల్‌గా తీసుకు వస్తుంటాం. రంజన్ మాసంలో ముస్లింలు ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. ఇక్కడ నుంచి ఐదు జిల్లాలకు హోల్‌సేల్‌గా విక్రయిస్తుంటాం. - మహ్మద్ తుగ్లాక్ ఇమ్రాన్‌ఖాన్, జగదాంబ జంక్షన్ -
సత్కారం
బేగంపేట సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాలలో అధ్యాపకులుగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్నవారిని గురువారం ఘనంగా కళాశాలలో సన్మానించారు. లెక్చరర్లు ఉమా జోసెఫ్, అలైనా జ్యోతి, శర్మిలా కన్ను, కార్తికేయ ఇందులో ఉన్నారు. అధ్యాపకుల అంకితభావం, అత్యున్నత ప్రమాణాలతో తమ కాలేజీ దేశంలో అత్యుత్తమంగా నిలిచిందని ప్రిన్సిపాల్ డాక్టర్ క్రిస్టినా ఫెర్నాండెజ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. - సోమాజిగూడ -
‘సిల్క్’ షోయగం
నగర ఫ్యాషన్ ప్రియుల కోసం విభిన్న వస్త్రాలతో ‘సిల్క్ ఆఫ్ ఇండియా’ వస్త్ర ప్రదర్శన గురువారం ప్రారంభమైంది. పట్టు, డిజైనరీ చీరలు, ఒక్క గ్రాము బంగారు ఆభరణాలతో శ్రీనగర్ కాలనీలోని సత్యసాయి నిగమాగమంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను వర్ధమాన నటి శ్వేత జాదవ్ ప్రారంభించారు. ఇక్కడి డిజైనరీ చీరలు ఆకట్టుకున్నాయని ఆమె పేర్కొన్నారు. హస్త, చేనేత కళాకారుల ఉత్పత్తులకు మార్కెట్ కల్పించేందుకు ఈ ప్రదర్శనను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు ఆశిష్ గుప్తా తెలిపారు. ప్రదర్శన ఈనెల 6 వరకు కొనసాగుతుందన్నారు. - శ్రీనగర్‌కాలనీ -
ఫ్యాషన్ ‘ఉష’స్సు
ప్రసిద్ధ ఫ్యాషన్ డిజైనర్, ప్రథమ మహిళా పైలట్ ఉషా రఘునాథన్.. మరోమారు నగరానికి వచ్చారు. ఆమె తాజాగా డిజైన్ చేసిన దుస్తుల కలెక్షన్స్‌ను బంజారాహిల్స్ రోడ్‌నెం.1లోని సింఘానియాస్ బొటిక్‌లో గురువారం లాంచ్ చేశారు. ఇదే తన చివరి కలెక్షన్ అని ఆమె ఈ సందర్భంగా ప్రకటించారు. అయితే, జీవితానికి ఏదీ చివరిదంటూ ఉండదని, తాను తొలుత పైలట్‌గా కెరీర్ ప్రారంభించి డిజైనర్ దాకా ఎన్నో రకాల ప్రొఫెషన్స్‌ను ఎంజాయ్ చేశానని చెప్పారు. భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా పర్యటించడమే తన లక్ష్యమన్నారు. రేఖ, హేమమాలిని, జయాబచ్చన్, షబానా అజ్మీ... వంటి ప్రముఖులు ఇష్టపడే సంప్రదాయ వస్త్రశైలులు అందించిన ఉషా రఘనాథన్ తమ బొటిక్‌లో కలెక్షన్ లాంచ్ చేయడం ఆనందదాయకమని, బ్లౌజ్‌లు, పట్టు చీరలు, సిల్క్-కాటన్ మిక్స్ చీరలు.. ఉష కలెక్షన్లో ఉన్నాయని షోరూమ్ నిర్వాహకులు తెలిపారు. - సాక్షి, లైఫ్‌స్టైల్‌ప్రతినిధి. -
డాక్టర్ కులశేఖర్ నిరుపేదల దైవం..
- ఉచితంగా వైద్యం.. - సగం ధరకే మందులు - సేవకు సలాం అంటున్న ప్రజలు వైద్యం.. ప్రస్తుత కాలంలో అత్యంత ఖరీదైన అంశం. జలుబుకు కూడా వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు కొందరు వైద్యులు. ఇక స్కానింగ్ వంటి అత్యవసర సేవలకైతే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. అలాంటిది రోజువారి కూలీలు, నిరుపేదలు వైద్యం చేయించుకోవాలంటే సాధ్యం కాదు. ఇలాంటివారు స్తోమత లేక నాటువైద్యాన్ని ఆశ్రయిస్తారు, లేదా చిట్కా వైద్యంతో సరిపెట్టుకుంటున్నారు. లేదంటే దేవుడిపై భారం వేస్తారు. ఇలాంటివారికి ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు డాక్టర్ జి.ఎస్.కులశేఖర్. మరోవైపు తక్కుత ధరకు మందులు సైతం ఇస్తున్నారు. నిజాంపేట్ రాజీవ్ గృహకల్ప ప్రాంతం.. బతుకుదెరువు కోసం వలస వచ్చిన కూలీల నివాసం. ఇక్కడివారికి రోగం వస్తే మందుల దుకాణాన్ని నమ్ముకుంటారు. లేదంటే ఏ ఆర్ఎంపీ వద్దకో వెళతారు. మందులు, కమీషన్ కోసం రాసే టెస్ట్‌లు వారిని బెంబేలెత్తిస్తాయి. అయినా రోగం తగ్గుతుందనే నమ్మకం మాత్రం లేదు. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నారు డా. కులశేఖర్. పగలంతా ఈఎస్ఐలో డిప్యూటీ సివిల్ సర్జన్‌గా పనిచేసే ఈయన ఈ పేద ప్రజలకు ఆపద్భాంధవుడు. ఈయన ‘పీపుల్స్ హెల్త్ ఇనిషియేటివ్’ పేరుతో ఆరోగ్య పథకాన్ని రూపొందించారు. తెల్లకార్డు ఉన్నవారు రూ. 100 చెల్లించి సభ్యత్వం తీసుకుంటే మూడు నెలల పాటు ఉచిత వైద్య సేవలు పొందవచ్చు. ఇలా వచ్చిన డబ్బుతో నిధి ఏర్పాటు చేసి మందులపై 50 శాతం రాయితీ ఇస్తున్నారు. ‘వేరే చోటికి వెళ్లిన ప్రతిసారి 100 రూపాయలు ఇవ్వాల్సిందే. ఇక్కడ మాత్రం ఒక్కసారి ఇస్తే సరిపోతుంది. తక్కువ ధరకు మందులు ఇస్తున్నారు. బాగా చూస్తారు. మా పేదోళ్లకి ఇంతకంటే ఇంకేం కావాలి’ అంటోంది స్థానిక మహిళలు చంద్రావతి, లక్ష్మి. అంబులెన్స్ సేవలు కూడా.. ‘చిన్న పిల్లలకు జ్వరం వస్తే కనీసం ఆరు వందలు ఖర్చు పెట్టాలి. ఇది పేదలకు మోయలేని భారమే. ఆర్ఎంపీలు ఇష్టమొచ్చిన విధంగా ఫీజులు వసూలు చేయడం, సరైన వైద్యం అందించకపోవడం గమనించా. ఇలా కాకుండా ప్రజలందరికి తక్కువ ధరలో క్వాలిటీ సర్వీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో స్వచ్ఛంద సంస్థ శ్రేయా ఫౌండేషన్‌తో కలిసి ఈ క్లినిక్‌ని ఏర్పాటు చేశా. డాక్టర్ వృత్తి నియమాల ప్రకారం పబ్లిసిటీ చేయరాదు. గతంలో ఇక్కడికి వచ్చిన వారు వేరేవారికి చెబుతున్నారు. రెగ్యులర్ విధులు ముగిశాక ఇక్కడ సేవలు అందిస్తున్నా. మాకు ఎలాంటి ఫండింగ్ లేదు. సభ్యత్వం కోసం పేషెంట్లు ఇచ్చిన డబ్బులతోనే తక్కువ ధరకు మందులు అందిస్తున్నాం. మరికొంత డబ్బు జమైతే అంబులెన్స్ సేవలు కూడా ఇస్తా’.. అని చెప్పారు డాక్టర్ కులశేఖర్. ఇలాంటి వారికి మరికొంత మంది వైద్యులు చేయి కలిపితే నిరుపేదల బతుకులు బాగుపడడం ఖాయమే. -
హలీం సలాం
అలా మొదలైంది.. ఆరో నిజాం నవాబు మహబూబ్ అలీఖాన్ తన సంస్థానంలో పోలీసు వ్యవస్థను బలోపేతం చేసేందుకు కీలకమైన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి పర్షియా నుంచి ప్రత్యేక ఆహ్వానితులు వచ్చారు. రంజాన్ ఉపవాసదీక్ష విరమణకు వడ్డించే వంటకాల్లో ఓ ప్రత్యేక డిష్ గురించి పర్షియా ప్రతినిధులు ప్రస్తావించారు. వెంటనే నవాబు షాహీ దస్తర్ ఖానా (వంటగది) సిబ్బందిని పిలిపించి ఆ వంటకాన్ని సిద్ధం చేయించారు. అదే హలీమ్. అలా పర్షియా నుంచి పరిచయమైన హలీం హైదరాబాద్ బిర్యానీలాగే ఇక్కడి వంటకమైంది. ఇరాన్, ఇరాక్, తదితర అరబ్ దేశాల్లో తయారయ్యే హలీంలో గోధుమలు, మాంసం, పప్పు, ఉప్పు, నూనె మాత్రమే వినియోగిస్తారు. కానీ హైదరాబాద్ హలీంకు మొదట నెయ్యి తోడైంది. ఆ తరవాత కారం, షాజీరా, లవంగాలు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి జతకట్టాయి. ఆ తరువాత అనేక రకాల మార్పులతో మరింత గొప్ప రుచిని సంతరించుకుంది. ఏడో నిజాం నాటికి హలీంకు అనూహ్యమైన డిమాండ్ వచ్చింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇరాన్, ఇరాక్, సింగపూర్, ఇండోనేషియా, యెమన్, అరబ్ ఎమిరేట్స్, అమెరికా, బ్రిటన్లలో లొట్టలేసుకుంటూ ఆరగించే వంటకం హైదరాబాద్ హలీం.. ఐదు దశాబ్దాల క్రితమే.. నవాబ్ ఉస్మాన్ ఆలీఖాన్ హయాంలో బ్రహ్మాండమైన ఆదరణ పొందినప్పటికీ హలీం అమ్మకాలు మాత్రం ఐదు దశాబ్దాల క్రితమే మొదలయ్యాయి. ఇరాన్ నుంచి నగరానికి వచ్చిన ఓ కుటుంబం పాతబస్తీలోని చార్మినార్ వద్ద మదీనా సర్కిల్లో ‘మదీనా’ పేరుతో హోటల్ పెట్టి హలీం విక్రయాలను ప్రారంభించింది. భిన్న‘రుచుల’ పసందు.. తొలినాళ్లలో నాన్‌వెజ్‌తో తయారైన హలీం ఇప్పుడు వెజిటేరియన్‌గా కూడా లభ్యమవుతోంది. నాన్‌వెజ్‌లో మటన్, చికెన్, బీఫ్, ఫిష్, ఈమూ హలీంలు ప్రత్యేకం. ఇందులో సైతం దక్కని, ఇరానీ, అరేబియన్, జఫ్రానీ, యమనీ విధానాల్లో తయారు చేస్తుంటారు. కొవ్వు తక్కువగా ఉండే ఈమూ హలీం తయారీ రెండేళ్ల క్రితం ప్రారంభమైంది. వెజిటేరియన్లో కూడా అనేక రకాలుగా హలీం హోటల్స్‌లో దొరుకుతోంది. ‘పిస్తా’కు ప్రత్యేక గుర్తింపు హలీం తయారీలో నాణ్యత, ప్రమాణాలు పాటిస్తున్నందుకు హైదరాబాద్ పిస్తా హౌస్‌కు జాతీయ స్థాయిలో జియోగ్రాఫికల్ ట్యాగ్ లభించింది. పాతబస్తీలోని శాలిబండలో 1997లో ప్రారంభమైన పిస్తా హౌస్ అనతి కాలంలో దేశ విదేశాలకు విస్తరించి ప్రత్యేకతను చాటుకుంది. ఇప్పటికే ఐఎస్ఐ మార్కుతో పాటు, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో 514 అవార్డులు లభించాయి. ప్రతిరోజు సుమారు ఐదు క్వింటాళ్ల వరకు హలీం తయారు చేసి హైదరాబాద్‌తో పాటు దేశంలోని వివిధ నగరాల్లో 400కు పైగా ఔట్లెట్ల ద్వారా విక్రయిస్తున్నారు. అమెరికాలోని డల్లాస్, కాలిఫోర్నియా, న్యూజెర్సీ, తదితర ప్రాంతాల్లో ‘పిస్తా’కు ఏడు బ్రాంచీలు ఉన్నాయి. తయారీ ప్రత్యేకం.. ఈ ప్రత్యేక వంటకం తయారీ కూడా ప్రత్యేకమే. హలీం తయారీకి కనీసం 9 గంటల సమయం పడుతోంది. తెల్లవారు జామున 4 గంటలకే తయారీ విధానం ప్రారంభమవుతుంది. హలీం వంటకంలో మటన్, గోధుమలు, అన్ని పప్పులు, బాస్మతి బియ్యం, నెయ్యి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిగడ్డ, పచ్చిమర్చి, యాలకులు, దాల్చినచెక్క, మిరియాలు, కొత్తిమీర, నూనె, డ్రైఫూట్స్ తదితర వాటిని వినియోగిస్తారు. ముందుగా గిన్నెలో మాంసం, నీటిని కలిపి బాగా ఉడికిస్తారు. అనంతరం గోధుమలు, బాసుమతి బియ్యం, పప్పులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాల దినుసులు, పచ్చిమిర్చి బాగా ఉడికించి మెత్తగా దంచుతారు. అనంతరం సమపాళ్లలో నెయ్యి కలుపుతారు. ఫిష్ హలీంలో గోధుమలు, మసాలాలు కలిపి ఉడికించి చివరన చేప ముక్కలను కలిపి తయారు చేస్తారు. రుచుల్లో రకాలు.. దక్కనీ హలీం ఇక్కడి ప్రజల ఆహారపు అలవాట్లకు అనుగుణంగా తయారు చేస్తారు. ఇందులో గోధుమలు కంటే మాంసం మోతాదు రెండింతలు అధికంగా ఉంటుంది. నెయ్యితో పాటు ఇతర దినుసులను వినియోగిస్తారు. ఇరానీ హలీం ఇరానీ హలీం ఘాటుగా ఉండదు. డ్రై ఫూట్స్‌తో పాటు గోధుమలు, మినపప్పు, తక్కువ మోతాదులో మసాల దినుసులు వినియోగిస్తారు. వెజిటేరియన్ హలీం శాకాహారుల కోసం ప్రత్యేకంగా వెజిటేరియన్ హలీంలను కూడా కొన్ని హోటల్స్ అందిస్తున్నాయి. గోధుమ రవ్వతో పాటు మసాల దినుసులు కలిపి ఈ వంటకం చేస్తారు. దీనిలో బీన్స, క్యారెట్, కీరా, పచ్చి బటానీ కలిపి ఉడికిస్తారు. ఘాటుగా ఉండకుండా పలు హోటల్స్‌లో పెరుగు, పాలు కూడా కలుపుతారు. ప్యారడైజ్ స్పెషల్.. హైదరాబాద్ బిర్యానికి ప్యారడైజ్ హోటల్‌కు ఎంత పేరుందో..స్వచ్ఛమైన హలీంకు సైతం ఇక్కడ గొప్ప ఆదరణ ఉంది. ‘హలీం తయారీకి ఉపయోగించే నాణ్యమైన మాంసం, గోధుమలు, స్వచ్ఛమైన నెయ్యి, దినుసులు అన్నీ హైదరాబాదీవే’అని చెబుతారు హోటల్ మేనేజర్ అహ్మద్. ప్రతి రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఇక్కడ హలీం ప్రియుల సందడి మొదలవుతుంది. 60 ఏళ్ల క్రితం ప్రారంభమైన ప్యారడైజ్ హోటల్లో 28 ఏళ్ల నుంచి హలీంను రుచి చూపిస్తున్నారు. ప్రపంచానికి రుచి చూ‘పిస్తా’.. ప్రపంచ వ్యాప్తంగా హలీం విక్రయాలను విస్తరించాలని నిర్ణయించాం. ఇందుకు ‘టార్గెట్- 2020’గా పెట్టుకున్నాం. ఇప్పటికే దేశంలోని మెట్రో నగరాలతోపాటు వివిధ దేశాలకు ‘హైదరాబాద్ పిస్తా హలీమ్’ను ఎగుమతి చేస్తున్నాం. అమెరికాలో ప్రత్యేకంగా హలీం తయారు చేస్తున్నాం. వచ్చే ఏడాది స్విడ్జర్లాండ్, జెనీవా నగరాల్లో కేంద్రాలను ప్రారంభిస్తాం. వెబ్సైట్ ద్వారా కూడా ఆర్డర్ తీసుకొని పంపిస్తున్నాం. - మహ్మద్ అబ్దుల్ మాజీద్, పిస్తాహౌస్ యాజమాని ధరలు ఇలా.. మటన్ హలీం రూ. 90 నుంచి 170 వరకు, చికెన్ రూ. 70 నుంచి 90 వరకు, వెజిటేరియన్ హలీం రూ.70 నుంచి రూ.90 వరకు లభిస్తోంది. వీటిలో సింగిల్, ప్లేట్, స్పెషల్, ఫ్యామిలీ, జంబో ప్యాక్ ధరలు వేర్వేర్వుగా ఉంటాయి. -
వండర్ బుక్ లో సాహస వీరుడు
హిమాయత్‌నగర్: ఒక కర్ర ముక్క తగిలితేనే ధారగా రక్తం కారుతుండటం మనం చూస్తేనే ఉంటాం. అలాంటిది ఓ యువకుడు పదునైన 5 అంగుళాల మేకును ముక్కులోకి దింపుకొంటే... పైగా దానిపై సుత్తితో కొడితే.. ఆలోచిస్తేనే ఎంత భయంకరంగా ఉంటుంది. అక్కడితో ఆగకుండా గోడలకు రంధ్రాలు చేసే డ్రిల్లింగ్ మిషన్‌తో అదే ముక్కులో డ్రిలింగ్ చేసుకుంటే... ఇంతకీ ఈ సాహసానికి పూనుకున్నది ఎవరనుకుంటున్నారా ఆ యువకుడు నల్గొండ జిల్లా అడ్డగూడూరుకు చెందిన క్రాంతి కుమార్. ప్రపంచంలోనే ఇలాంటి కఠినమైన సాహసాలు చేసేవారిలో ఇతడు మూడో స్థానంలో ఉన్నాడు. తన సాహసాలతో క్రాంతి కుమార్ వండర్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్సులో కూడా చోటు దక్కించుకున్నాడు. శుక్రవారం హిమాయత్‌నగర్ మీడియా సెంటర్లో వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ దక్షిణ భారత సమన్వయ కర్త బింగి నరేందర్ గౌడ్, తెలంగాణ, ఏపీ సమన్వయ కర్త గుర్రం స్వర్ణశ్రీ తదితరులు, విలేకరుల ముందు ఈ ప్రదర్శన చేసి అందర్నీ అబ్బుర పరిచాడు. క్రాంతి కుమార్ ప్రతిభను గుర్తించి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్సు మెమొంటో, గోల్డ్ మెడల్‌ను బహూకరించారు. ఈ కార్యక్రమానికి లోటస్ ల్యాప్ పబ్లిక్ స్కూల్ డెరైక్టర్ డాక్టర్ కోమట్రెడ్డి గోపాల్‌రెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేసి క్రాంతికుమార్ సాహసాన్ని ప్రశంసించారు. ఈ సందర్భంగా బింగి నరేందర్ గౌడ్ మాట్లాడుతూ అరుదుగా కనిపించే ఇలాంటి సాహసవంతులను ప్రభుత్వం ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు డాక్టర్ కె.వి. రమణాచారి హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. కాగా సాహస విన్యాసాన్ని ప్రదర్శించిన యువకుడు క్రాంతికుమార్ రోజు వారీ కూలీగా వాల్ పెయింటింగ్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. -
సర్కారు బడుల్లో..ఇంగ్లిష్ విద్య
♦ మంత్రి హరీష్‌రావు ♦ ప్రభుత్వ స్కూళ్లకు ‘రోటరీ’ బెంచీల పంపిణీ మాదాపూర్: ప్రభుత్వం సర్కారుబడుల్లో ఇంగ్లిషు మాధ్యమం ప్రవేశపెట్టేందుకు యోచిస్తోందని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి టి.హరీష్‌రావు పేర్కొన్నారు. రోటరీ ఫౌండేషన్ఆధ్వర్యంలో గురువారం 145 ప్రభుత్వ పాఠశాలకు 7,593 డ్యూయల్ డెస్క్‌లు పంపిణీ చేశారు. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి హరీష్‌రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విద్యలో నాణ్యత చాలా ముఖ్యమని, బోధనతో పాటు పాఠశాలల్లో అన్ని వసతులను కల్పించాలన్నారు. జూలై 3 నుంచి 10వ తేదీ వరకు రాష్ట్రంలో ‘హరితహారం’ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు చెప్పారు. ఇందులో ప్రతి విద్యార్థి 10 మొక్కలను నాటాలని సూచించారు. పోలియో నిర్మూలనకు రోటరీ ఫౌండేషన్ కృషి అభినందనీయమని పేర్కొన్నారు. రోటరీ ఇంటర్నేషనల్ డెరైక్టర్ మనోజ్ దేశాయ్ మాట్లాడుతూ.. త్వరలో విన్స్ పథకం ప్రవేశపెడుతున్నామని, ఇందులో పదేళ్లలో 10 వేల టాయిలెట్ల నిర్మాణం చేపడతామన్నారు. కాగా, కార్యక్రమం జరుగుతుండగా వీడియో క్రేన్ ప్రమాదవశాత్తు ఊడిపోయి టేబుల్‌పై పడి పక్కనే ఉన్న విద్యార్థినికి తగిలింది. దీంతో బాలికకు స్వల్ప గాయమైంది. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్, కర్నూలు ఎంపీ బుట్టా రేణుక, రోటరీ ఫౌండేషన్ కౌన్సిలర్ మర్రి రవీంద్రారెడ్డి,సేవ్ అవర్ స్కూల్స్ చైర్మన్ రవి వడ్లమాని, ఎం.వి. ఫౌండేషన్ శాంతాసిన్హా తదితరులు పాల్గొన్నారు. -
చిహ్నాల వనం
ఏదైనా సంస్థ ప్రజలకు చిరకాలం గుర్తుండాలంటే అందమైన ‘లోగో’ అవసరం. ఆ లోగోలోనే ఆ సంస్థ విధివిధానాలు కనిపిస్తాయి. ఇలాంటి లోగోలను తీర్చిదిద్దుతూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు రామంతాపూర్ శారదానగర్‌కు చెందిన వనం జ్ఞానేశ్వర్. ఎన్నో ప్రతిష్టాత్మకమైన సంస్థలకు చిహ్నాలను రూపొందించి ప్రశంసలు అందుకున్నారు. - రామంతాపూర్ - లోగోల రూపశిల్పి జ్ఞానేశ్వర్ - జాతీయ, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు చిత్రకళపై జ్ఞానేశ్వర్‌కు చిన్నతనం నుంచి ఉన్న మక్కువే అతడిని కళాకారుడిగా తీర్చిదిద్దింది. బాల్యం నుంచే వివిధ లోగోలను రూపొందించి మురిసిపోయేవాడు. సైన్ బోర్డు ఆర్టిస్ట్ జీవితం ప్రారంభించిన జ్ఞానేశ్వర్ ఓ ప్రముఖ ప్రకటనల కంపెనీలో ఉద్యోగం సంపాదించుకున్నారు. తన ప్రతిభకు సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి అత్యాధునిక పద్ధతుల్లో అనేక ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు లోగోలను తయారు చేస్తున్నారు. ఎన్టీఆర్ హయాంలో ఆంధ్రప్రదేశ్ లోగోలో స్పష్టత లేదని చెప్పడంతో సినీ స్టిల్ ఫొటోగ్రాఫర్ భూషణ్‌తో కలిసి అందులో మార్పులు చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ ఆదేశంతో ఆంధ్రప్రదేశ్ స్వర్ణోత్సవ లోగోను రూపొందించారు. - నగరంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెట్రో రైల్, తెలంగాణ ఆర్టీసీ లోగోలను తయారుచేసి ముఖ్యమంత్రి కేసీఆర్, రవాణశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి ప్రశంసలు అందుకున్నారు. - జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక సంస్థలకు ప్రచార సామగ్రి జ్ఞాపికలను, లోగోలను రూపొందించి శభాష్ అనిపించుకున్నారు. - అమెరికాలోని అట్లాంటాలో విజు చిలువేరు ఆధ్వర్యంలో నడుస్తున్న ‘గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ లోగోను తయారు చేశారు. ఇంకా.. - ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో మాధవ్ కటికనేని ఆధ్వర్యంలోని ఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరానికి పోస్టర్లు, జ్ఞాపికలు.. - మెల్బోర్న్లో నూకల వెంకటరెడ్డి నిర్వహిస్తున్న మెల్బోర్న్ తెలంగాణ ఫోరం లోగోలు, ప్రచార సామగ్రి.. - బ్రిస్బేన్ తెలంగాణ ఫోరం కోసం లోగోలు ప్రచార సామాగ్రిని రూపొందించారు. - నూతనంగా ఏర్పడిన తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ లోగోను రూపకర్త కూడా జ్ఞానేశ్వరే. ఆశయం తెలంగాణ రాష్ట్రంలో లోగోలను రూపొందించే విధంగా పలువురు యువతీయువకులకు శిక్షణ ఇచ్చి వారిని మంచి ఆర్టిస్ట్‌లుగా తీర్చిదిద్దడమే తన ఆశయమని జ్ఞానేశ్వర్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి అభినందనలు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) లోగోలో బంగారు వర్ణంతో కాకతీయ ద్వారం, లోగో మధ్యలో తెలంగాణ పల్లెలను కళ్లకు కట్టే విధంగా ఉన్న పచ్చిక, నగర సౌందర్యాన్ని తెలిపే చార్మినార్‌ను కలిపి లోగోను తయారుచేశారు. ఈ లోగోను చూసిన ముఖ్యమంత్రి కేసీఆర్ జ్ఞానేశ్వర్‌ను ప్రత్యేకంగా అభినందించారు. -
సిటీలో సెన్సేషనల్ మిసైల్.. లెట్స్ మూవ్
- కిక్ బాక్సింగ్‌కు మహిళలు ఫిదా - ‘గిమ్మీ ఫైవ్’ అంటూ జిమ్స్‌కు పయనం - క్రేజీ వర్కవుట్స్‌తో ఉత్తేజం నగరవాసులకు ఆరోగ్యపరమైన సూత్రాలను ఇప్పుడు బాగా వంటబట్టించుకుంటున్నారు. ‘వినదగు నెవ్వరు చెప్పిన’ అన్నట్టు.. ఇలాంటివి ఎవరు చెప్పినా ఆసక్తిగా పాటిస్తున్నారు. చెప్పేది మిస్ ఇండియా అయినా మిషెల్ ఒబామా అయినా.. ‘ఫిట్నెస్’ అంటే సిటీ మహిళలు సై అంటున్నారు. అలాగే ‘లెట్స్ మూవ్’ అంటూ మిషెల్ సంధించిన మిసైల్ లాంటి పంచ్‌లకు ఫిదా అయిపోయి కిక్స్‌తో రఫ్ఫాడించేస్తున్నారు. ఈ నేపథ్యంలో క్రేజీగా మారిన వర్కవుట్ కిక్ బాక్సింగ్ విశేషాలవి.. గత నెలలో అమెరికా దేశపు ప్రధమ మహిళ మిషెల్ ఒబామా ఒక వర్కవుట్ వీడియోను ఆన్లైన్లో పోస్ట్ చేశారు. స్వల్ప కాలంలోనే కోటి మందికి పైగా వీక్షకుల్ని సంపాదించిన ఆ వీడియోలో తన వర్కవుట్స్‌ని ఆమె పరిచయం చేశారు. మిషెల్ చేసిన 5 ఎక్సర్సైజ్ల్లో.. జంపింగ్ రోప్, మెడిసిన్ బాల్‌తో అబ్డామినల్ క్రంచెస్, బెంచ్ స్క్వాట్స్, డంబెల్ ప్రెసెస్, బాక్సింగ్.. ఉన్నాయి. కేవలం రెండు నిమిషాలు మించి లేని ఈ క్లిప్‌లో మిషెల్‌తో పాటు ఆమె ఫ్యామిలీ ట్రైనర్ కార్నెల్ మెకెల్లన్ కూడా కనిపిస్తారు. స్క్వాట్స్, క్రంచెస్ అయిపోయాక మిషెల్ బ్లూ బాక్సింగ్ గ్లవ్స్ ధరించి కిక్స్ మొదలుపెట్టారు. ఆమె ఇందులో ఒక టు-పంచ్ కాంబోను చూపించి ఆ తర్వాత గిర్రున తిరుగుతూ బ్యాగ్‌పై ఓ రౌండ్ హౌజ్ కిక్ ఇచ్చారు. మిగతావి ఎలా ఉన్నా... ఆమె పంచ్ బ్యాగ్‌పై పంజా విసురుతూ ఇచ్చిన రౌండ్ హౌజ్ కిక్స్..ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేశాయి. మిషెల్ వీడియో నగర మహిళల్లో కిక్ బాక్సింగ్ పట్ల అమాంతం క్రేజ్ పెంచేసింది. మరెందరికో ‘కిక్’.. తను ఏం తిన్నా తనను ఫిట్‌గా ఉంచే శక్తి కిక్ బాక్సింగ్‌కి ఉన్నట్టు గ్రహించానని టాలీవుడ్ సినీనటి రకుల్ ప్రీత్‌సింగ్ అంటోంది. ఫుడ్ డబుల్ అయినప్పుడు శాండ్బాగ్స్కి కిక్స్ ఇస్తూ రెట్టింపు సమయం గడుపుతానని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. మిషెల్ ఒబామా అప్లోడ్ చేసిన ‘లెట్స్మూవ్’ వీడియో మహిళల్ని ఎక్సర్సైజ్ల వైపు మళ్లించేలా స్ఫూర్తిదాయకంగా ఉందన్నారు సిటీ సోషలైట్ సుశీలా బొకాడియా. తాను రోజూ 2 గంటల పాటు వర్కవుట్ చేస్తానని, తన వర్కవుట్‌లో ఇప్పుడు కిక్ బాక్సింగ్ ప్రధానమైన భాగమని చెప్పారు. యోగా ట్రైనర్‌గా రోప్ యోగా వంటి వెరైటీ శైలుల్ని పరిచయం చేసిన రినా హిందోచా కూడా తాను ఇటీవలే కిక్ బాక్సింగ్‌ను సాధన చేస్తున్నానన్నారు. ఇది మహిళల్ని శక్తివంతం చేయడం మాత్రమే కాకుండా ఆత్మరక్షణకు కూడా ఉపకరిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. మిక్స్ చేస్తే మస్తు మస్తే.. చూడ్డానికి కష్టంగా అనిపించినా ఈ కిక్స్, పంచ్‌లు తేలిగ్గా చేయగలిగినవేనని జరీర్ చెప్పారు. ఇది మోకాలు, లోయర్ బ్యాక్‌లపై తక్కువ భారాన్ని వేసే వ్యాయామం. ఎప్పటికప్పుడు ఆసక్తిని పెంచుకునేందుకు వీలుగా దీనిని విభిన్న మార్గాల్లో చేయవచ్చు. ఏరోబిక్స్, వెయిట్ ట్రైనింగ్‌ను కూడా జత కలిపి చేయడం అలాంటి ఒక వైవిధ్యమార్గం. అయితే, కొత్తగా సాధన చేసేవారు తప్పనిసరిగా మంచి కార్డియో కిక్ బాక్సింగ్ ట్రైనర్‌ను ఎంచుకోవాలి. కొంత కాలం పాటు ట్రైనర్ శిక్షణలో కొనసాగి పరిణితి సాధించాక ఒక పంచ్ బ్యాగ్‌ను మాత్రం ఏర్పాటు చేసుకుని స్వయంగా సాధన కొనసాగించవచ్చు. ఫటాఫట్.. బెని‘ఫిట్’ ఒక క్రీడగా చాలా మంది అభిమానించే బాక్సింగ్‌ను ఆరోగ్య సాధనంగా మార్చడం ద్వారా చక్కని ఫిట్- వర్కవుట్‌గా మార్చవచ్చు. ఇపుడు జిమ్‌లు, ఫిట్నెస్ సెంటర్లలో దీన్ని ‘కార్డియో కిక్ బాక్సింగ్’గా వ్యవహరిస్తున్నారు. కరాటే కిక్‌లు, బ్లాక్స్ పంచ్‌లు వంటివి సంప్రదాయ ఎరోబిక్స్‌తో మిళితం చేసిన ఫిట్నెస్ ప్రోగ్రామ్.. ఈ కార్డియో కిక్ బాక్సింగ్. కరాటే, బాక్సింగ్‌ను మేళవించిన ఏరోబిక్ వ్యాయామ శైలి ఇది. బాడీ బ్యాలెన్సింగ్‌కి ఉపకరిస్తుంది. దీని ద్వారా ప్రారంభంలో గంటకి 400 నుంచి 500 క్యాలరీలు, రెగ్యులర్‌గా చేసేవారికి 800-900 క్యాలరీల వరకూ ఖర్చవుతాయి. ఇది ఫ్యాట్‌ని కరిగించే అత్యుత్తమ సాధనగా నగరానికి చెందిన ఫిట్నెస్ గురు జరీర్ పటేల్ చెబుతున్నారు. ఈ వర్కవుట్ కదలికల్లో చురుకుదనాన్ని పెంచుతుంది. పొట్ట భాగాన్ని సున్నితంగా బిగించి కిక్స్, పంచ్‌లు ఇవ్వడం ద్వారా అబ్డామినల్ మజిల్ బాగా పటిష్టమవుతుంది. అప్పర్ కట్, జాబ్, ఎల్బోహుక్, స్నాచ్, రివర్స్కిక్, రౌండ్ కిక్.. నేర్చుకుంటే స్వీయ రక్షణకూ ఉపకరిస్తుంది. లెట్స్ మూవ్.. చిన్నారులు బయటకు వెళ్లాలి, యాక్టివ్‌గా మారాలి అనే ఉద్దేశంతో అమెరికా ఫస్ట్ లేడీ ప్రారంభించిన ‘లెట్స్ మూవ్’ క్యాంపెయిన్‌లో భాగంగా ఓ వీడియోను మిషెల్ అప్లోడ్ చేశారు. దీనిలోనే ఆమె ప్రముఖులను, సాధారణ ప్రజలను ‘గిమ్మీ ఫైవ్’ అంటూ కోరుతున్నారు. అంటే ఫిట్-యాక్టివ్‌గా ఉండేందుకు 5 సూత్రాల మార్గం ఇవ్వమని అర్ధం. దీనికి స్పందనగా బరాక్ ఒబామా సైతం తన వీడియోను పోస్ట్ చేశారు. అందులో యాక్టివ్‌గా ఉండడానికి తాను చేసేవి జాగింగ్, కూర్చుని కాకుండా ‘వాక్ అండ్ టాక్’ మీటింగ్స్ వంటివి ఆయన పొందుపరచారు. -
సిటీలో సెన్సేషనల్ మిసైల్.. లెట్స్ మూవ్
♦ కిక్ బాక్సింగ్‌కు మహిళలు ఫిదా ♦ ‘గిమ్మీ ఫైవ్’ అంటూ జిమ్స్‌కు పయనం ♦ క్రేజీ వర్కవుట్స్‌తో ఉత్తేజం నగరవాసులకు ఆరోగ్యపరమైన సూత్రాలను ఇప్పుడు బాగా వంటబట్టించుకుంటున్నారు. ‘వినదగు నెవ్వరు చెప్పిన’ అన్నట్టు.. ఇలాంటివి ఎవరు చెప్పినా ఆసక్తిగా పాటిస్తున్నారు. చెప్పేది మిస్ ఇండియా అయినా మిషెల్ ఒబామా అయినా.. ‘ఫిట్నెస్’ అంటే సిటీ మహిళలు సై అంటున్నారు. అలాగే ‘లెట్స్ మూవ్’ అంటూ మిషెల్ సంధించిన మిసైల్ లాంటి పంచ్‌లకు ఫిదా అయిపోయి కిక్స్‌తో రఫ్ఫాడించేస్తున్నారు. ఈ నేపథ్యంలో క్రేజీగా మారిన వర్కవుట్ కిక్ బాక్సింగ్ విశేషాలవి.. గత నెలలో అమెరికా దేశపు ప్రధమ మహిళ మిషెల్ ఒబామా ఒక వర్కవుట్ వీడియోను ఆన్లైన్లో పోస్ట్ చేశారు. స్వల్ప కాలంలోనే కోటి మందికి పైగా వీక్షకుల్ని సంపాదించిన ఆ వీడియోలో తన వర్కవుట్స్‌ని ఆమె పరిచయం చేశారు. మిషెల్ చేసిన 5 ఎక్సర్సైజ్ల్లో.. జంపింగ్ రోప్, మెడిసిన్ బాల్‌తో అబ్డామినల్ క్రంచెస్, బెంచ్ స్క్వాట్స్, డంబెల్ ప్రెసెస్, బాక్సింగ్.. ఉన్నాయి. కేవలం రెండు నిమిషాలు మించి లేని ఈ క్లిప్‌లో మిషెల్‌తో పాటు ఆమె ఫ్యామిలీ ట్రైనర్ కార్నెల్ మెకెల్లన్ కూడా కనిపిస్తారు. స్క్వాట్స్, క్రంచెస్ అయిపోయాక మిషెల్ బ్లూ బాక్సింగ్ గ్లవ్స్ ధరించి కిక్స్ మొదలుపెట్టారు. ఆమె ఇందులో ఒక టు-పంచ్ కాంబోను చూపించి ఆ తర్వాత గిర్రున తిరుగుతూ బ్యాగ్‌పై ఓ రౌండ్ హౌజ్ కిక్ ఇచ్చారు. మిగతావి ఎలా ఉన్నా... ఆమె పంచ్ బ్యాగ్‌పై పంజా విసురుతూ ఇచ్చిన రౌండ్ హౌజ్ కిక్స్..ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేశాయి. మిషెల్ వీడియో నగర మహిళల్లో కిక్ బాక్సింగ్ పట్ల అమాంతం క్రేజ్ పెంచేసింది. మరెందరికో ‘కిక్’.. తను ఏం తిన్నా తనను ఫిట్‌గా ఉంచే శక్తి కిక్ బాక్సింగ్‌కి ఉన్నట్టు గ్రహించానని టాలీవుడ్ సినీనటి రకుల్ ప్రీత్‌సింగ్ అంటోంది. ఫుడ్ డబుల్ అయినప్పుడు శాండ్బాగ్స్కి కిక్స్ ఇస్తూ రెట్టింపు సమయం గడుపుతానని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. మిషెల్ ఒబామా అప్లోడ్ చేసిన ‘లెట్స్మూవ్’ వీడియో మహిళల్ని ఎక్సర్సైజ్ల వైపు మళ్లించేలా స్ఫూర్తిదాయకంగా ఉందన్నారు సిటీ సోషలైట్ సుశీలా బొకాడియా. తాను రోజూ 2 గంటల పాటు వర్కవుట్ చేస్తానని, తన వర్కవుట్‌లో ఇప్పుడు కిక్ బాక్సింగ్ ప్రధానమైన భాగమని చెప్పారు. యోగా ట్రైనర్‌గా రోప్ యోగా వంటి వెరైటీ శైలుల్ని పరిచయం చేసిన రినా హిందోచా కూడా తాను ఇటీవలే కిక్ బాక్సింగ్‌ను సాధన చేస్తున్నానన్నారు. ఇది మహిళల్ని శక్తివంతం చేయడం మాత్రమే కాకుండా ఆత్మరక్షణకు కూడా ఉపకరిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. మిక్స్ చేస్తే మస్తు మస్తే.. చూడ్డానికి కష్టంగా అనిపించినా ఈ కిక్స్, పంచ్‌లు తేలిగ్గా చేయగలిగినవేనని జరీర్ చెప్పారు. ఇది మోకాలు, లోయర్ బ్యాక్‌లపై తక్కువ భారాన్ని వేసే వ్యాయామం. ఎప్పటికప్పుడు ఆసక్తిని పెంచుకునేందుకు వీలుగా దీనిని విభిన్న మార్గాల్లో చేయవచ్చు. ఏరోబిక్స్, వెయిట్ ట్రైనింగ్‌ను కూడా జత కలిపి చేయడం అలాంటి ఒక వైవిధ్యమార్గం. అయితే, కొత్తగా సాధన చేసేవారు తప్పనిసరిగా మంచి కార్డియో కిక్ బాక్సింగ్ ట్రైనర్‌ను ఎంచుకోవాలి. కొంత కాలం పాటు ట్రైనర్ శిక్షణలో కొనసాగి పరిణితి సాధించాక ఒక పంచ్ బ్యాగ్‌ను మాత్రం ఏర్పాటు చేసుకుని స్వయంగా సాధన కొనసాగించవచ్చు. ఫటాఫట్.. బెని‘ఫిట్’ ఒక క్రీడగా చాలా మంది అభిమానించే బాక్సింగ్‌ను ఆరోగ్య సాధనంగా మార్చడం ద్వారా చక్కని ఫిట్- వర్కవుట్‌గా మార్చవచ్చు. ఇపుడు జిమ్‌లు, ఫిట్నెస్ సెంటర్లలో దీన్ని ‘కార్డియో కిక్ బాక్సింగ్’గా వ్యవహరిస్తున్నారు. కరాటే కిక్‌లు, బ్లాక్స్ పంచ్‌లు వంటివి సంప్రదాయ ఎరోబిక్స్‌తో మిళితం చేసిన ఫిట్నెస్ ప్రోగ్రామ్.. ఈ కార్డియో కిక్ బాక్సింగ్. కరాటే, బాక్సింగ్‌ను మేళవించిన ఏరోబిక్ వ్యాయామ శైలి ఇది. బాడీ బ్యాలెన్సింగ్‌కి ఉపకరిస్తుంది. దీని ద్వారా ప్రారంభంలో గంటకి 400 నుంచి 500 క్యాలరీలు, రెగ్యులర్‌గా చేసేవారికి 800-900 క్యాలరీల వరకూ ఖర్చవుతాయి. ఇది ఫ్యాట్‌ని కరిగించే అత్యుత్తమ సాధనగా నగరానికి చెందిన ఫిట్నెస్ గురు జరీర్ పటేల్ చెబుతున్నారు. ఈ వర్కవుట్ కదలికల్లో చురుకుదనాన్ని పెంచుతుంది. పొట్ట భాగాన్ని సున్నితంగా బిగించి కిక్స్, పంచ్‌లు ఇవ్వడం ద్వారా అబ్డామినల్ మజిల్ బాగా పటిష్టమవుతుంది. అప్పర్ కట్, జాబ్, ఎల్బోహుక్, స్నాచ్, రివర్స్కిక్, రౌండ్ కిక్.. నేర్చుకుంటే స్వీయ రక్షణకూ ఉపకరిస్తుంది. లెట్స్ మూవ్.. చిన్నారులు బయటకు వెళ్లాలి, యాక్టివ్‌గా మారాలి అనే ఉద్దేశంతో అమెరికా ఫస్ట్ లేడీ ప్రారంభించిన ‘లెట్స్ మూవ్’ క్యాంపెయిన్‌లో భాగంగా ఓ వీడియోను మిషెల్ అప్లోడ్ చేశారు. దీనిలోనే ఆమె ప్రముఖులను, సాధారణ ప్రజలను ‘గిమ్మీ ఫైవ్’ అంటూ కోరుతున్నారు. అంటే ఫిట్-యాక్టివ్‌గా ఉండేందుకు 5 సూత్రాల మార్గం ఇవ్వమని అర్ధం. దీనికి స్పందనగా బరాక్ ఒబామా సైతం తన వీడియోను పోస్ట్ చేశారు. అందులో యాక్టివ్‌గా ఉండడానికి తాను చేసేవి జాగింగ్, కూర్చుని కాకుండా ‘వాక్ అండ్ టాక్’ మీటింగ్స్ వంటివి ఆయన పొందుపరచారు. -
చదువుల సీజన్లో పుస్తకాల అడ్డా..
కేజీ టు పీజీ.. కేరాఫ్ కోఠి సెకండ్‌హ్యాండ్ పుస్తకాలకు ప్రత్యేక సెల్లార్ సుల్తాన్‌బజార్: విద్యాసంవత్సరం ప్రారంభమైందంటే విద్యార్థులకు పుస్తకాల కోసం ఒకటే టెన్షన్. ఏ షాప్‌కు వెళ్లినా కొన్ని పుస్తకాలు దొరుకుతాయి. మరికొన్ని ఉండవు. ఎక్కడికెళ్లినా ఇదే సమస్య ఎదురవుతుంది. సమయానికి పుస్తకాలు దొరక్క తల్ల్లిదండ్రులు సైతం హైరానా పడతారు. కానీ ఏ పుస్తకం కావాలన్నా.. అందరూ చూపించే దారి కేరాఫ్ ‘కోఠి’. కేజీ నుంచి పీజీ వరకు.. ఏ పుస్తకం కావాలన్నా ఆ ప్రాంతం పేరే చెబుతారు. ఇప్పుడు పాఠశాలలు, కళాశాలలు ప్రారంభం కావడంతో విద్యార్థులకు పైతరగతులకు కావాల్సిన పుస్తకాల అన్వేషణ మొదలైంది. కొత్త టెక్ట్స్, నోటు పుస్తకాలు, ఇతర స్టేషనరీ కొనుగోలు చేసేందుకు విద్యార్థులు, తల్లిదండ్రులు కోఠిలోని పుస్తకాల దుకాణాలకు పరుగులు పెడుతున్నారు. కోఠి, సుల్తాన్‌బజార్, ఆంధ్రాబ్యాంక్ చౌరస్తా తదితర ప్రాంతాల్లో ఉన్న పుస్తకాల దుకాణాల్లో దొరకని స్టేషనరీ అంటూ ఉండదు. పోటీ పరీక్షల పుస్తకాలు సైతం.. కోఠిలోని పుస్తకాల దుకాణాలలో కేజీ నుంచి పీజీ వరకు టెక్ట్స్ పుస్తకాలు లభ్యమవుతాయి. అంతేగాక ఎంసెట్, లాసెట్, డైట్‌సెట్, ఎడ్‌సెట్, ఏఐఈఈఈ.. ఇతర అన్ని పోటీ పరీక్షల పుస్తకాలు సైతం ఇక్కడ అందుబాటులో ఉంటాయి. వేసవి తర్వాత వర్షకాలంలో ఇక్కడ ‘పుస్తకాల సీజన్’గా పిలుస్తూ ప్రత్యేక డిస్కౌంట్ ఇస్తూ వ్యాపారులు విద్యార్థులను, వినియోగదారులను ఆకర్షిస్తున్నారు. కిలోల్లో నోటు పుస్తకాలు.. చిత్తు కాగితాలు కిలోలుగా అమ్మే ఈ రోజుల్లో నోటు పుస్తకాలు సైతం కిలోల్లో కొనవచ్చంటే అశ్చర్యపోతారు. కానీ కోఠిలో ఏ షాప్‌కు వెళ్లినా నోటు పుస్తకాలను కిలో లెక్కన అమ్ముతారు. చాలామందికి ఇది తెలియకపోయినా ఇక్కడ సీజనల్ వ్యాపారంలో భాగంగా వ్యాపారులు ఈ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఒక్క నోటు పుస్తకం కనీస ధర రూ.30 ఉంటే.. ఈ మొత్తానికి మూడు పుస్తకాలు సొంతం చేసుకోవచ్చు. దీంతో విద్యార్థులు ‘కిలో’ పుస్తకాలంటే ఆస్తకి చూపుతున్నారు. సెకండ్ హ్యాండ్ బుక్స్ కూడా.. అందరూ కొత్త టెక్ట్స్ పుస్తకాలు కొనలేరు.. ఇలాంటి విద్యార్థులకు కావాల్సిన పుస్తకాలను సగం ధరలో కూడా ఇక్కడ దొరుకుతాయి. పేరుకు సెకండ్ హ్యాండే గాని.. చాలావరకు కొత్త పుస్తకాలే ఉంటాయి. కోఠి ఆంధ్రాబ్యాంక్ చౌరస్తా కిందనున్న సెల్లార్లో ఇలాంటి దుకాణాలే ఉన్నాయి. ఒకటో తరగతి నుంచి ఇంజినీరింగ్, మెడిసిన్ ఇతర కోర్సుల పుస్తకాలు సగం ధరలో విక్రయిస్తున్నారు. రూ. 1200 ఉన్న పుస్తకం ఇక్కడ కేవలం రూ.400కు పొందవచ్చు. -
పవిత్ర మాసం ప్రారంభం
సకల శుభాల పవిత్ర మాసం రంజాన్ ప్రారంభమైంది. గురువారం నెలవంక దర్శనంతో ముస్లింలు ఉపవాసాలకు సమాయత్తమయ్యారు. మసీదుల్లో ఇమామ్‌లు రంజాన్ మాసాన్ని ప్రకటించారు.ముస్లింలు పరస్పరం ఆత్మీయ శుభాకాంక్షలు తెలుపుకుంటూ రంజాన్ మాసాన్ని ఆహ్వానించారు. నగరంలోని మసీదులన్నీ ఇప్పటికే ముస్తాబయ్యాయి. పవిత్ర ప్రార్థనలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. రంజాన్ పవిత్రత..ఉపవాసాల ప్రత్యేకతలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం... - చార్మినార్ సహర్.. ఉపవాసం(రోజా) ఉండదలచని వారు తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో భోజనం చేస్తారు. దీనినే ‘సహర్’ అంటారు. సాయంత్రం వరకు మంచినీటితో సహా ఏ పదార్థాన్ని తినరు కాబట్టి భోజనంలో పోషకాలు ఉండేలా చూసుకుంటారు. ఏదైనా కారణం వల్ల సహర్ తీసుకోకపోయినా వ్రతాన్ని మాత్రం ఆపరు. ఇఫ్తార్.. సూర్యాస్తమయం తరువాత ఏదైనా ఆహారం తీసుకుని ఆ రోజు దీక్షను విరమించడమే ‘ఇఫ్తార్’. ఖర్జూరాలతో ఇఫ్తార్ చేయడం ప్రవక్త సంప్రదాయం. అందుకే ముస్లింలంతా ఖర్జూరాలతోనే ఇఫ్తార్ చేస్తారు. ఉషోదయం నుంచి సూర్యాస్తమయం వరకు నిష్టతో ఉంటారు కనుక దీక్షను విరమించేటప్పుడు ఉపవాసి దేనిని అర్థించినా అల్లాహ్ స్వీకరిస్తాడని నమ్మకం. రంజాన్ సందర్భంగా దేశంలోనే అతిపెద్ద ఎల్ఈడీ లైటింగ్‌ను పాతబస్తీలోని శాలిబండలో ఏర్పాటు చేశారు. దీన్ని గురువారం ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ ప్రారంభించారు. చిత్రంలో పిస్తాహౌస్ ఎండీ ఎంఏ మజీద్ తదితరులున్నారు. నాలుగు వాక్యాలే ప్రధానం ఈ పవిత్ర మాసంలో మహ్మద్ ప్రవక్త నాలుగు విషయాలను అధికంగా స్మరించమని ఉపదేశించారు. అవేమంటే.. 1. లాయిలాహ ఇల్లల్లాహ్: దేవుని ఏకత్వాన్ని స్తుతించడం 2. అస్తగ్ఫిరుల్లా: అపరాధాల మన్నింపునకు దైవాన్ని వేడుకోవడం 3. అస్అలుకజన్నత్: స్వర్గాన్ని అనుగ్రహించమని అర్థించడం 4. అవుజుబికమిన్నార్: నరకం నుంచి విముక్తి ప్రసాదించమని కోరడం రంజాన్ మాసంలో... ♦ రంజాన్ మాసంలోని తొలి పది రోజులు కారుణ్యదినాలు ♦ 10 నుంచి 20 వరకు క్షమాపణ రోజులు ♦ 20 నుంచి 30 వరకు నరకాగ్ని నుంచి విముక్తి దినాలు ♦ ఉపవాస వ్రతం ప్రారంభించేందుకు ముస్లింలు సంకల్పం చేసుకుంటారు. ప్రారంభమైన తరావీ నమాజ్‌లు.. రంజాన్ ప్రారంభం కావడంతో గురువారం రాత్రి నుంచి నగరంలో మసీదులు, వివిధ ఫంక్షన్ హాళ్లలో తరావీ నమాజ్‌లు ప్రారంభమయ్యాయి. పవిత్ర మాసం ముగిసే (మళ్లీ నెలవంక దర్శనం) వరకు ప్రతిరోజూ తరావీ నమాజులు కొనసాగనున్నాయి. ఈ నమాజుల్లో రోజుకు ఖురాన్‌లోని కొన్ని అధ్యాయాలను చదివి వినిపిస్తారు. రంజాన్ మాసం పూర్తయ్యేలోగా ఖురాన్ పఠనం పూర్తి చేస్తారు. -
విదేశీ భాషలందు వెలుగు లెస్స..
- ఇంగ్లిష్తో పోటీగా విదేశీ భాషలకు ఆదరణ - ఫారిన్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలని సిటీజనుల తపన - విదేశీ భాష నేర్చిన వారికి కార్పొరేట్ కంపెనీల ప్రాధాన్యం నడుస్తున్న కార్పొరేట్ ప్రపంచంలో రాణించేందుకు ఇంగ్లిష్ అవసరం.. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్ని విదేశీ భాషలొస్తే అన్ని అవకాశాలు.. ప్రపంచవ్యాప్తంగా గణాంకాలు గమనిస్తే.. అత్యధికులు మాట్లాడే భాష చైనీస్ (20.7 శాతం), ఇంగ్లిష్ (6.2శాతం). అంటే 93.8 శాతం మంది జనాభా ఆంగ్లం మాట్లాడడం లేదనే వాస్తవాన్ని ప్రస్తుత తరం పూర్తిగా అర్థం చేసుకుంది. ఈ నేపథ్యంలో మన నగరంలో విదేశీ భాషలపై మక్కువ రెట్టింపవుతోంది. విదేశీ విజృంభణకు కారణాలెన్నో.. ► వేర్వేరు భాషలు నేర్చుకుంటున్న కొద్దీ మెదడు మరింత పదునెక్కుతుందట. ఈ విషయాన్ని యూనివర్సిటీ ఆఫ్ ఎడింబరో శాస్త్రవేత్తలు పరిశోధనాత్మకంగా స్పష్టం చేశారు. ► భాషలు ఎన్ని ఎక్కువ వస్తే అంత ఆలస్యంగా మతిమరుపు వస్తుందని, బహుభాషా ప్రవీణుల మెదడు అనేక అంశాల్లో చురుకుగా ఉంటుందని వీరు తాజా పరిశోధనతో తేల్చారు. ఇలాంటి పరోక్ష లాభాల సంగతెలా ఉన్నా.. ఐటీ సెక్టార్లో ట్రాన్స్లేషన్, ఇంటర్ప్రిటేషన్లకు ఉన్న భారీ డిమాండ్‌ను ఉపయోగించుకునేందుకు, ఇతర దేశాలకు సంబంధించిన సంస్కృతీ సంప్రదాయాలపై అవగాహన పెంచుకునేందుకు, కనీసం మూడు అన్యభాషలు నేర్చుకుని ఉండ డం కెరీర్‌కు దోహదపడుతుండడం, మల్టీ నేషనల్ కంపెనీలు ఫారిన్ లాంగ్వేజెస్ నేర్చుకుంటున్న వారికి ప్రాధాన్యం ఇస్తుండడం, విదేశాలకు రాకపోకలు సాగించే అవసరాలు పెరగడం.. ఇలా పలు రకాల లాభాలు విదేశీ భాష పట్ల మోజు పెంచుతున్నాయి. ► అప్పటికప్పుడు విదేశీ భాషలు నేర్చుకోవాల్సిన అవసరాలు కూడా మీద పడుతున్నాయి. నగరానికి చెందిన ఒక సంస్థ తమ ఉద్యోగుల బృందాన్ని మెక్సికోకు పంపాల్సి వచ్చింది. ఆఘమేఘాల మీద వారికి నెట్ ద్వారా ప్రాథమిక మెక్సికన్ భాషా పరిజ్ఞానంలో శిక్షణ ఇప్పించింది. ► రామకృష్ణమఠంతో పాటు ఇఫ్లూ, ఓయులో డిప్లొమా కోర్సులు, ఫ్రెంచ్ కోసం అలయెన్స్ ఫ్రాంఛైజ్, జర్మన్ కోసం గోతెజంత్రం ఉన్నాయి. ప్రైవేట్ ట్రైనింగ్ సెంటర్స్ కూడా వచ్చాయి. ‘త్వరలో సిటీలో జపనీస్ లాంగ్వేజ్ కోర్సును ఆఫర్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం’ అన్నారు జపాన్ సెంటర్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చర్ ప్రెసిడెంట్ రమాకాంత్. బెస్ట్ ఫ్రెండ్.. ఫ్రెంచ్.. గరంలో అత్యధికులు నేర్చుకుంటున్న భాషల్లో ఫ్రెంచ్ తొలి స్థానంలో నిలుస్తోంది. తర్వాత ఆంగ్లం సెకండ్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్‌గా పేరొందిన ఫ్రెంచ్ దేశవ్యాప్తంగా చూస్తే 2014లో స్కూల్ టు యూనివర్సిటీ స్థాయిలో నేర్చుకున్నవారి సంఖ్య 2.50 లక్షల పైచిలుకు ఉందట. దీనిలో కేవలం అలయెన్స్ ఫ్రాంఛైజ్ ద్వారా నేర్చుకున్నవారి సంఖ్య 35,800. కెరీర్ పరంగా కూడా ఇది మంచి అవకాశాలు అందిస్తోంది. నగరంలోని కార్పొరేట్ కంపెనీలు ఈ భాష తెలిసిన వారికి మంచి ఆఫర్స్ ఇస్తున్నాయి. కెరీర్ పరంగానూ ఇది ప్రాఫిటబుల్. ‘మొదటి నుంచి ఏదైనా విదేశీ భాష నేర్చుకోవాలనుకున్నా. ఫ్రెంచ్ కాంప్లెక్స్ లాంగ్వేజ్. దీనిలో అడ్వాన్స్డ్ డిప్లొమా చేశాను. అయితే దీన్ని కెరీర్‌గా చూడడం లేదు. కేవలం హాబీగా నేర్చుకున్నానంతే’ అంటూ చెప్పారు జ్యోత్స్న. జోష్.. స్పానిష్.. వకాశాలు, ఆదరణ పరంగా స్పానిష్ లాంగ్వేజ్‌కు రెండో స్థానం దక్కుతోంది. ఈ భాషను నేర్చుకోవడం సులభం అంటారు. దీంతో ఏదైనా ఒక విదేశీ భాష వచ్చి ఉండడాన్ని కనీస అర్హతగా భావిస్తున్న వారు స్పానిష్‌కి సై అంటున్నారు. సరిగా సాధన చేస్తే ఈ భాషను 18 నెలల స్వల్ప కాలంలోనే నేర్చుకోవచ్చనేది నిపుణుల మాట. కెరీర్ పరంగానూ ఇది మంచి ఆప్షన్. ‘ఆసక్తితో స్పానిష్‌లో ఎంఏ చేశాను. అయితే, ఇప్పుడది నాకు ప్రొఫెషన్‌గా ఉపకరిస్తోంది’ అని చెప్పారు సీతాఫల్మండిలో నివసించే సుమతి. ప్రస్తుతం ఆమె స్పానిష్ టీచర్. సౌత్ అమెరికా, మెక్సికోలో బాగా వినియోగించే స్పానిష్ ప్రపంచంలోనే అత్యధికులు ఉపయోగించే భాషల్లో 3వ స్థానంలో ఉంటుందంటున్నారు సుమతి. జర్మన్‌తో షైన్.. పంచంలో 1.8 శాతం మంది మాత్రమే జర్మన్ మాట్లాడతారు. అయితే మనం జర్మన్ దేశస్తులతో సంభాషించాలంటే తప్పనిసరిగా జర్మన్ నేర్చుకోవాల్సిందే. ఎందుకంటే జర్మన్లు ఇతర దేశ భాషలను నేర్చుకోవడానికి పెద్దగా ఇష్టపడరట. మరోవైపు జర్మనీ.. క్వాలిటీ సైంటిఫిక్ రీసెర్చ్, ఇన్నోవేషన్స్‌కు హబ్. అందుకనే చాలా మంది మనవాళ్లు అక్కడ చదువుకోవాలని ఆశిస్తారు. జర్మన్ యూనివర్సిటీస్లో చేరాలంటే.. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్‌కి కనీస స్థాయిలోనైనా జర్మన్ భాష వచ్చి తీరాలి. పెపైచ్చు భారతీయ విద్యార్థులకు జర్మనీ ఉచిత కోర్సులు కూడా ఆఫర్ చేస్తోంది. ‘ఉన్నత విద్య కోసం జర్మనీ వెళ్లేవారు పెరిగారు. ఎందుకంటే అక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ ఆఫర్ చేస్తున్నారు. అయితే, అలా చదవాలని కోరుకునే విద్యార్థులకు తప్పనిసరిగా జర్మన్ లాంగ్వేజ్ వచ్చి తీరాల్సిందే’ అని చెప్పారు దీప్తి. జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్న ఆమె తెలుగు, ఇంగ్లిష్, కన్నడ, హిందీ భాషలు వచ్చని చెబుతోంది ఈ మలక్‌పేట నివాసి. జపనీస్‌కు జేజేలు.. ష్టమైన భాషగా జపనీస్‌ను పేర్కొంటారు. అయినా ప్రస్తుతం దేశంలో 20వేల మందికిపైగా జపనీస్ భాష నేర్చుకుంటున్నారని అంచనా. జపనీస్ వెంచర్లు భారీగా దేశానికి తరలివస్తున్న నేపధ్యంలో జపాన్ భాష తెలిసిన వారికి డిమాండ్ బాగా పెరుగుతోంది. దీంతో పలు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ పార్ట్‌టైమ్ జపనీస్ లాంగ్వేజ్ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. ‘కెరీర్ ప్లాన్ అని కాకుండా వ్యక్తిగత ఇష్టంతో 1998లోనే సీఫెల్ నుంచి జపనీస్ నేర్చుకున్నాను. ఇది నేర్చుకోవడం నాకు జపాన్‌కు సంబంధించిన అనేక అంశాలపై అవగాహన పెంచింది’ అన్నారు చక్రపాణి. అప్పట్లో జపాన్ ప్రభుత్వం ఖర్చులు భరించి మరీ టీచర్ ట్రైనింగ్ ఇచ్చిన ముగ్గురు భారతీయుల్లో నగరానికి చెందిన చక్రపాణి కూడా ఒకరు. తదనంతర కాలంలో ఆయన జపాన్ లాంగ్వేజ్ టీచర్, బైలింగ్వల్ కన్సల్టెంట్‌గా చేశారు. చైనీస్.. చాలా టఫ్.. పంచవ్యాప్తంగా అత్యధిక జనాభా కలిగిన దేశం కాబట్టి.. సహజంగానే చైనీస్ మాట్లాడేవారు కూడా ఎక్కువే. ఎవరైనా సరే తమ దగ్గరకే వచ్చేలా ప్రపంచ దేశాలను ప్రొడక్ట్స్ పరంగా ప్రభావితం చేస్తున్న చైనాకు సిటీ నుంచి రాకపోకలు పెర గడం కూడా సహజమే. ఈ నేపధ్యంలో చైనీస్ లాంగ్వేజ్ పట్ల కూడా నగరవాసుల్లో ఆసక్తి పెరిగింది. అయితే, మిగిలిన భాషలతో పోలిస్తే ఇది నేర్చుకోవడం కాస్తంత కష్టమే అంటున్నారు భాషాభిమానులు. ‘నాకు విదేశీ భాషలు నేర్చుకోవడం ఇష్టం. ఆల్రెడీ జర్మన్లో ఎంఏ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఇఫ్లూలో 8 నెలలు పాటు ఈవెనింగ్ టైమ్‌లో చైనీస్ బేసిక్ కోర్సు చేశాను. ఈ లాంగ్వేజ్‌లో సర్టిఫికెట్ కోర్సు చేస్తే చాలు జనరల్ కన్వర్జేషన్కి సరిపోతుంది. ైచె నా మూవీస్ కూడా చూడవచ్చు. డిప్లొమా ఇన్ చైనీస్ కూడా చేద్దామనుకుంటున్నాను. సిటీలో చైనీస్ ట్రాన్స్లేటర్స్కి డిమాండ్ బాగానే ఉన్నప్పటికీ ఈ లాంగ్వేజ్ గురించి అవేర్నెస్, నేర్చుకునే వాళ్లు, నేర్పేవాళ్లూ తక్కువే’ అంటూ చెప్పారు శరత్. బీఫార్మసీ చేసి ఓయూ హాస్టల్లో ఉంటున్న ఆయన.. పార్ట్‌టైమ్‌గా జర్మన్ లాంగ్వేజ్ టీచర్‌గానూ చేస్తున్నారు. స్కూల్ స్థాయిలోనే.. జూబ్లీహిల్స్‌లోని రాక్వెల్ ఇంటర్నేషనల్ స్కూల్లో మాండరిన్ (సరళతరమైన చైనీస్)ను విద్యార్థులకు థర్డ్ లాంగ్వేజ్‌గా ఆఫర్ చేస్తున్నారు. ఇప్పటికే 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకూ విద్యార్థులు ఈ లాంగ్వేజ్‌ను ఎంచుకున్నారు కూడా. పిల్లలకు విదేశీ భాషా పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు సిటీలోని కొన్ని స్కూల్స్ ఆఫ్టర్ స్కూల్ అకాడమీ నిర్వహించే యోచనలో ఉన్నాయి. -
బడికి వేళాయె.. తొలిరోజు జ్ఞాపకం
బడికి వేసవి సెలవులు ఇచ్చే చివరి రోజు ప్రతి ఒక్కరికీ ఆనందం.. రేపటి నుంచి సెలవులని. సెలవులు ముగిశాక తొలిరోజు బడికి వెళ్లడం మహానందం.. కొత్త పుస్తకాలు, కొత్త తరగతిలోకి అడుగు పెడుతున్నామని. ఇప్పుడు వేసవి సెలవులు ముగిశాయి. నేటి నుంచి బడికి వెళ్లాలి. బడి గంట మోగుతున్నా సెలవుల మత్తు వీడని వాళ్లు కొందరైతే.. పాఠశాలలు ఎప్పుడు తెరుస్తారా.. అని చూసే వారు మరికొందరు. ఇటువంటి అనుభవాలు స్కూలుకు వెళ్లిన ప్రతి ఒక్కరికీ ఉంటాయి. తొలిరోజు బడికి వెళ్తే సమయం ఎలా గడిచిందో కొందరు ఉన్నతాధికారులు తమ బాల్యపు మధుర జ్ఞాపకాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. - సాక్షి, సిటీబ్యూరో ఎంతో హుషారు వచ్చేది బడి గడప తొక్కే తొలిరోజు పూజ చేయడం, గుడికి వెళ్లడం అలాంటివేవీ చేయకున్నా ఎక్కడా లేని, ఆనందం, హుషారు ఉండేది. ముఖ్యంగా ఆరు, ఏడు తరగతుల్లో ఆ తీరు బాగా కనిపించింది. ఐదు వరకు సొంతూరు నల్లగొండ జిల్లా లక్ష్మీదేవిగూడెంలోనే చదువుకున్నా. ఆరు, ఏడు తరగతుల కోసం మా పక్క ఊరు అమన్‌గల్‌కు వెళ్లేవాడిని. ఇది మా ఊరికి రెండు కిలోమీటర్ల దూరం. రోజూ స్నేహితులతో కలిసి నడుస్తుంటే అలసట తెలిసేది కాదు. పదో తరగతి వరకు నడకనే. పై తరగతుల పుస్తకాల కోసం వేసవి సెలవుల్లోనే వేట మొదలయ్యేది. జీవితాంతం సరిపడ ఆనందాన్ని బడికెళ్లే వయసులో పొందాను. - సోమిరెడ్డి, హైదరాబాద్ డీఈఓ కొంచెం బాధగా... సెలవుల్లో మహబూబ్ నగర్ లో ఉండే నాన్నమ్మ, అమ్మమ్మ ఊళ్లలో గడిపేవాళ్లం. పాఠశాలలు తెరుస్తున్నారంటే కొంచెంగా బాధగా అనిపించేది. కొత్త పుస్తకాలు, నోట్ బుక్స్, బ్యాగ్.. ఇవన్నీ కొంటుంటే ఉత్సాహం వచ్చేది. స్కూల్‌కు అప్పుడే వెళ్లాలన్న కుతూహలం కనిపించేది. అప్పట్లో బుక్స్ స్కూళ్లలో ఇచ్చేవారు కాదు. మా సోదరులు, అక్క చెల్లళ్ల నుంచి పాత పుస్తకాలు తీసుకునే దాన్ని. అప్పట్లో మా నివాసం బడీచౌడి. రాంకోఠిలోని అలెన్ స్కూల్లో, గన్‌ఫౌండ్రీలోని స్టాన్లీ స్కూల్లో చదువుకున్నా. - నిర్మల, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ తొలి రోజే నిర్ణయం.. వేసవి సెలవులు ప్రారంభం కాగానే చిలుకలూరిపేట నుంచి నందిపాడుకు వెళ్లేవాడిని. రెండు నెలల పాటు ఊళ్లోని స్నేహితులతో ఎంజాయ్ చేసి సెలవులు ముగిశాక సంతోషంగా స్కూలుకు వెళ్లే వాళ్లం. కొత్త క్లాసు, కొత్త పుస్తకాలు, కొత్త టీచర్స్ ఇలా అంతా కొత్తగా అనిపించేది. ఎప్పుడు చెప్పిన పాఠం అప్పుడే చదవాలని, హోం వర్క్ పూర్తి చేయాలని పాఠశాలకు వెళ్లిన తొలి రోజే ఓ నిర్ణయం తీసుకునే వాడిని. ఆ మేరకు అమలు చేసే వాడిని. - డాక్టర్ నరేంద్రనాథ్, నిమ్స్ డెరైక్టర్ సెలవులు ముగిసి పాఠశాలలు తెరుస్తున్నారంటే.. ఎప్పుడు తరగతులు ప్రారంభమవుతాయా.. అని ఆబగా ఎదరు చేసేవాడిని. ముఖ్యంగా బడి తెరిచిన రోజు చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా సమయం గడిచిపోయేది. చాలా రోజుల తరువాత ఫ్రెండ్స్‌ని కలుస్తున్నాన్న సంబరం. ప్రతి ఉపాధ్యాయునికి దగ్గరికి వెళ్లి పలకరించేవాడిని. పై తరగతికి వె ళ్తున్నానన్న ఆనందం మాటల్లో చెప్పలే నిది. తరగతి మారుతుండడంతో ముందుగా వెళ్లి బెంచీపై మంచి స్థలాన్ని వెతుక్కోవడం మొదలయ్యేది. పరిసరాలు శుభ్రంగా చేసుకునే వాళ్లం. అలా మొదటి రోజు చూస్తుండగానే ముగిసేది. - రమేష్, రంగారెడ్డి జిల్లా డీఈఓ కొన్ని రోజులే సెలవుల ధ్యాస.. వార్షిక పరీక్షలు రాసేటపుడు సెలవుల్లో చాలా పనులు చేయాలని అనుకునేవాడిని. ముఖ్యంగా పుస్తకాలు చదవడం, స్నేహితులను కలవడం, చుట్టాల ఇంటికి వెళ్లడం వంటివి చేయాలనుకునేవాడిని. అన్నీ జరగవు కదా! మూడు నుంచి పదో తరగతి వరకు రాయదుర్గంలోని ఒయాసిస్ స్కూల్లో చదువుకున్నా. పాఠశాలలు పునఃప్రారంభించే సమయంలో ఇంకొన్ని రోజులు ప్రకటిస్తే బాగుండేదనిపించేది. మరోపక్క స్కూల్‌కు వెళితే పాత మిత్రులను కలుసుకోవచ్చు.. పై తరగతిలో కొత్త విషయాలు నేర్చుకోవచ్చనే ఆతృత ఉండేది. చదువుపై దృష్టి సారించగానే సెలవుల ధ్యాస పోయేది. - రఘనందన్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ -
టార్గెట్‌కు టాలెంట్.. యాడ్ చేశాడు
సినిమాలో కన్నా అర నిమిషం యాడ్‌లో కనిపిస్తే వచ్చే గుర్తింపు చాలా ఎక్కువ. అదీ ఇంటర్నేషనల్ బ్రాండ్స్‌కు టీవీ ప్రకటనల్లో కనిపిస్తే.. సూపర్ పాపులారిటీ. అలాంటిది పెప్సీ, కోక్, స్ప్రైట్.. ఇలా ప్రముఖ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ యాడ్స్‌లో చేస్తే.. ఆ కిక్కే వేరు. ఇప్పుడు ఇదే కిక్కును.. లక్కును అందుకున్నాడు మన సిటీ కుర్రాడు కృష్ణ సుహాన్ (క్రిష్). చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసిన ఇతడు ఇప్పుడు ‘స్ప్రైట్’ యాడ్‌తో అందరినీ ఆకర్షిస్తున్నాడు. ఓ కుర్రాడు బైక్‌పై కూర్చుంటాడు.. మరో స్నేహితుడు వచ్చి ఆ బైక్ ఇమ్మని అడుగుతాడు.. అలాగేనంటూ.. పెట్రోలు ఇద్దరం కలిసి పోయిద్దామంటాడు. కలిసి శుభ్రం చేద్దామంటాడు.. ఈఎంఐ కూడా కలికి కడదామంటాడు.. ఇక ఆ స్నేహితుడికి ప్లాన్ అర్థమై.. బైక్ ఎవరి వద్ద ఉంటేనేంటి.. అంటూ తాళం తిరిగి ఇచ్చేస్తాడు. లేటెస్ట్ ‘స్ప్రైట్’ యాడ్ ఇది. ఇందులో బైక్ అడిగిన స్నేహితుడే.. క్రిష్. ఇతడి ‘యాడ్’ జర్నీ విశేషాలను ‘సాక్షి’తో పంచుకున్నాడు. ఆ వివరాలు అతని మాటల్లోనే.. - సాక్షి,హైదరాబాద్ తొలి అడుగు ఇలా పడింది.. ‘పాండవులు’ అనే టెలీఫిలిం నుంచి కెరీర్ మొదలెట్టా. 15 ఏళ్ల వయసులో సినిమాల్లో అవకాశం వచ్చింది. అలా 2004 నుంచి ‘చంటి- ది హీరో, సోగ్గాడు, స్వరాభిషేకం, గోల్కొండ హైస్కూల్, వేట’.. ఇలా చాలా చిత్రాల్లో నటించాను. 2007లో పెప్సీ యాడ్‌కి ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసి వెళ్లాను. అది ఒక చిన్న ఇంటర్నెట్ సెంటర్. ఓ చిన్న హ్యాండీకామ్‌తో పెప్సీ బాటిల్ ఇచ్చి ఏదో చెప్పమన్నారు. అస్సలు నమ్మకంగా అనిపించలేదు. స్టార్ క్రికెటర్స్‌తో వర్క్.. నెక్ట్స్ డే కాల్ చేసి తాజ్ బంజారాకి రమ్మన్నారు. యాడ్ ఫిలింలో పెద్ద క్రికెటర్స్ ఉంటారు అన్నారు. డూప్స్‌తో యాక్ట్ చేయిస్తారు అనుకున్నా. సంక్రాంతికి మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో షూటింగ్. ఫస్ట్ డే స్పాట్‌కి వెళితే 260 మంది పోలీసులు, లెక్కలేనంత జనం, మధ్యలో సచిన్ టెండూల్కర్, ధోనీ, సెహ్వాగ్, ద్రవిడ్, యువరాజ్.. ఐదుగురు రియల్ స్టార్ క్రికెటర్స్. ఫస్ట్‌టైం వాళ్లని చూసి సూపర్ ఎక్సైట్ అయ్యాను. జనం వాళ్ల ఆటోగ్రాఫ్ దొరికితే చాలు అనుకుంటారు. అలాంటిది వాళ్లతో కలిసి పనిచేశాను. ఫస్ట్ యాడ్ అంత పెద్ద బ్రాండ్. ఇండియాలో ఐదుగురు క్రికెటర్స్ చేసిన ఫస్ట్ యాడ్ కూడా అదే. తర్వాత 2008లో ‘కోక్’ దివాళి యాడ్‌కి పనిచేశాను. ఆ తర్వాత మళ్లీ 2015లో స్ప్రైట్‌కి వర్క్ చేశాను. అయితే ఈ యాడ్ కోసం మొదటి సారి ముంబై వెళ్లి అక్కడి వాళ్లతో పనిచేశాను. అక్కడి పనితీరు బాగా నచ్చింది. షాట్ మధ్యలో గ్యాప్ వస్తే ఆర్టిస్ట్ అలసిపోకుండా జాగ్రత్తగా చూసుకుంటారు. మన బాడీ లాంగ్వేజ్‌కి అనుగుణంగా యాక్ట్ చేసే ఫ్రీడం ఇస్తారు. స్ప్రైట్ యాడ్ హిందీ, తెలుగు రెండు భాషల్లోనే షూట్ చేశారు. తెలుగు వెర్షన్లో నేను యాక్ట్ చేశాను. వాటిని తర్వాత వేరే భాషల్లో డబ్ చేశారు. తెలుగులో వాయిస్ కూడా నాదే. చూసిన ప్రతివాళ్లు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. దీని తర్వాత కొన్ని వేరే బ్రాండ్స్ వాళ్లు ఆడిషన్‌కి పిలిచారు. ఈ క్రెడిట్ పేరెంట్స్‌దే.. ‘పుట్టింది.. పదో తరగతి వరకు చదువుకున్నది గుంటూరులో. స్కూల్లో చదువుతున్నప్పుడే డాన్స్ బేబీ డాన్స్‌లో చేశా. ఇది చూసిన ఇంటి చుట్టుపక్కలవారు.. ‘మీ పిల్లాడిలో చాలా టాలెంట్ ఉంది, హైదరాబాద్ షిఫ్ట్ అయితే బాగుంటుంది’ అని పేరెంట్స్‌కి సలహా ఇచ్చారు. అలా ఇంటర్ టైంకి హైదరాబాద్‌కు వచ్చేశాం. సిటీలోనే ఇంటర్, బీటెక్ కంప్యూటర్ సైన్స్ 82 శాతం మార్కులతో పూర్తి చేశా. కేవలం చదువు మాత్రమే కాదు, పిల్లలకు ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఉంటాలి, వాటిని ఎంకరేజ్ చెయ్యాలి అని మా పేరెంట్స్ నమ్మి, సపోర్ట్ చేయడం వల్లనే ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నా. ఈ గుర్తింపుకి పూర్తిగా మా పేరెంట్స్ ప్రోత్సాహమే కారణం’ అని చెప్పాడు క్రిష్. గొప్ప సినీ స్టార్ అవ్వాలి.. చిన్నప్పటి నుంచి ప్రొఫెషనల్ డాన్సర్‌ని అలా 700కి పైగా పెర్ఫార్మెన్స్లు ఇచ్చాను. ‘శిఖరం, మనసు మమత, అగ్నిపూలు, శశిరేఖా పరిణయం’ సీరియల్స్‌లో నటించాను. ఏఐఆర్- రెయింబోలో ఆర్జేగా కూడా చేశాను. కొన్ని చానెల్స్‌లో యాంకర్‌గా లైవ్‌షోలు చేశాను. మంచి పర్ఫార్మెన్స్తో సినిమా హీరోగా ప్రేక్షకులను ఆకట్టుకోవలన్నదే నా గోల్. -
ఆదరించిన ఊరును ఆదుకున్న నేస్తం
♦ నేపాల్‌లోని ‘టెచో' గ్రామానికి హెచ్‌సీయూ విద్యార్థుల అండ ♦ తాత్కాలిక నివాసాల ఏర్పాటుకు సాయం నేపాల్ భూకంపం.. ప్రతి మనిషిని కదిలించిన, కలచివేసిన ఉపద్రవం. ఈ వైపరీత్యం తర్వాత ఆ దేశాన్ని చూసి ‘ఆయ్యో పాపం’ అనుకున్నవారు ఉన్నారు. ఆదుకునేందుకు ముందుకు వచ్చినవారూ ఉన్నారు. రెండేళ్ల క్రితం చదువులో భాగంగా నేపాల్ వెళ్లిన ఓ హైదరాబాద్ కుర్రాడు తనకు ఆశ్రయమిచ్చిన గ్రామానికి సాయం చేయడానికి ఉద్యమించాడు. స్నేహితుల సాయంతో విరాళాలు సేకరించి భూకంపంలో నేలమట్టమైన ఇళ్ల నిర్మాణానికి ఖర్చు చేశాడు. ఇందుకు తానే స్వయంగా అక్కడకు వెళ్లి ప్రతి రూపాయి బాధితులకు అందేలా చూశాడు. ఆ యువకుడి పేరు ‘సిపాయి సర్వేశ్వర్’. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్డీ ఆంత్రోపాలజీ విద్యార్థి. ఇతడికి స్నేహితులు, వారి స్నేహితులు, ప్రొఫెసర్లు బాసటగా నిలిచారు. ఈ మహా యజ్ఞంలో మరో హెచ్‌సీయూ పీహెచ్డీ విద్యార్థి, బీహార్ వాసి నీలేశ్, ఢిల్లీ జేఎన్‌యూ పీహెచ్డీ విద్యార్థి హైదరాబాద్ వాసి గరిమెళ్ల సురేశ్ పాలుపంచుకున్నారు. - సాక్షి, సిటీబ్యూరో నివాసాల కోసం.. ‘విరాళాల సేకరణ కోసం నగరంలోని పలు ప్రాంతాల్లో ఫ్లాష్ మాబ్ నిర్వహించాం. భోజ్‌పురి, ఫోక్ సాంగ్స్ పాడాం. నేపాల్ బాధితులకు చేయూతనిచ్చేందుకు హైదరాబాదీల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇలా మేం రూ. 5.50 లక్షలు సేకరించాం. (నేపాల్ కరెన్సీలో 8.80 లక్షలు) ఆ డబ్బుతో మే 23న హైదరాబాద్ బస్సులో నేపాల్‌లోని టెచో గ్రామానికి చేరుకున్నాం. అక్కడి హపఫుచ ఆర్గనైజేషన్‌తో కలిసి ఏం చేయాలనేదానిపై చర్చించాం. అక్కడి విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్‌తో కలిసి సర్వే చేస్తే మొత్తం 2543 ఇళ్లు ఉన్న గ్రామంలో 550 ఇళ్లు ధ్వంసమయ్యాయి. సహాయం అందని 230 కుటుంబాలను గుర్తించాం. అక్కడివారికి తిండి, దుస్తులు అందుబాటులో ఉన్నాయి. అయితే, ఒక్కో టెంట్ కింద రెండు, మూడు కుటుంబాలు ఉంటున్నాయి. వచ్చేది వానాకాలం.. బాధితులు ఉండేందుకు తాత్కాలిక నివాసాలను ఏర్పాటు అవసరం. ఇతర సంస్థలు వెదురు ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. బహిరంగ ప్రాంతాల మరమ్మతు కోసం రూ.90 వేలు మినహా మిగతా డబ్బుతో సీజీఐ షీట్స్ కొని తాత్కాలిక నివాసాల నిర్మాణ ం చేపట్టాం. ఇలా ఒక్కో ఇంటికి రూ. 3,434 ఖర్చు చేశాం’ అవి వివరించారు. మళ్లీ వెళ్తాం.. ‘నేపాల్‌లో చేయాల్సిన సహాయక కార్యక్రమాలు చాలానే ఉన్నాయి. మేం రెండో విడత విరాళాలు సేకరించాలనుకుంటున్నాం. నేపాల్ నుంచి ‘సెవెన్ వండర్స్ బ్యాండ్’ను హైదరాబాద్‌కు రప్పిస్తున్నాం. వీరితో ఇక్కడ షోలు నిర్వహించి వచ్చిన డబ్బుతో అక్కడ సాయం చేస్తాం. నేపాల్ కల్చరల్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించేందుకు అక్కడి నుంచి చెఫ్‌లను తీసుకొస్తున్నాం. వాటితో వచ్చిన డబ్బుతో టెచో గ్రామ రూపు రేఖలు మార్చుతాం’ అంటూ వివరించాడు సర్వేశ్. ఫేస్బుక్ సాయం.. ఆంత్రోపాలజీలో పీహెచ్డీ చేస్తున్న సర్వేశ్ ఫీల్డ్‌వర్క్‌లో భాగంగా 2013లో నేపాల్‌లోని లలిత్పూర్ జిల్లా ‘టెచో’ గ్రామానికి వెళ్లాడు. దాదాపు ఏడాదిన్నర పాటు అక్కడి ప్రజలతో మమేకమై వారి వారి జీవన విధానం, సమస్యలపై పరిశోధన చేశాడు. ఈ సమయంలో స్థానిక ‘హపఫుచ వలంటరీ యూత్ ఆర్గనైజేషన్’తో పరిచయం ఏర్పడింది. ఇటీవల నేపాల్‌లో భూకంపంలో ఈ గ్రామం కూడా దెబ్బతింది. ఇళ్లు, తిండి లేక ఈ గ్రామ ప్రజలు అవస్థలు పడుతున్నారు. దీంతో ఈగ్రామానికి చెందిన లెక్చరర్ మహేశ్ ‘మా గ్రామస్తులను ఆదుకోండి’ అని ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. ఇది చదివి చలించిన సర్వేశ్ తాను ఫీల్డ్‌వర్క్ చేసిన ఆ గ్రామానికి చేయూతనివ్వాలనుకున్నాడు. విషయాన్ని ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకున్నాడు. విరాళాల సేకరణకు ఫేస్బుక్లో పేజీ క్రియేట్ చేశాడు. దాదాపు 700 మందికి పైగా సభ్యులుగా చేరి విరాళాల సేకరణలోనూ భాగమయ్యారు. ఫ్రెండ్స్, ఫ్రొఫెసర్లు.. ఇలా అందరూ తమకు తోచిన ఆర్థిక సాయం చేశారు. -
సరస్వతీ బిడ్డలం చదువు‘కొనలేం’..
వేలూ లక్షలు ఖర్చు పెట్టి కార్పొరేట్ స్కూళ్లలో ఖరీదుగా చదువు‘కొన’లేదు. మాసిపోయిన బెంచీలూ మసిబారిన గోడల నీడలో తప్ప. అడగకుండానే అన్నీ సమకూర్చే డాడీ, అడుగుకో ఆనందం కొనుక్కొచ్చే మమ్మీ అంటే తెలియదు. కాయకష్టంతో దోస్తీ చేసే అమ్మానాన్నలు తప్ప. అయినా ఈ చిన్నారులు చిన్నబోలేదు. చింత పడలేదు. పేదరికాన్ని మోస్తూనే ఉన్నారు. సరస్వతీ కటాక్షాన్ని సాధిస్తూనే ఉన్నారు. చెమట చిందిస్తూనే ఉన్నారు. చదువులో విజయాలు లిఖిస్తూనే ఉన్నారు. కాసింత ఆసరా దొరికితే... కాసింత ధైర్యం అందితే... ఈ పేదింటి రత్నాలు ఎన్నెన్ని కాంతులు విరజిమ్ముతాయో... మరెన్ని వెలుగులు ప్రసరిస్తాయో... విధి ‘రాత’ను మారుద్దామా? వీరి ‘రాత’కు తోడవుదామా? ఈ విద్యాకుసుమాలకు బాసటగా నిలవాలన్నా.. ఆర్థికంగా ఆదుకోవాలన్నా 9705347881, 9010234568 నెంబర్లలో సంప్రదించండి. స్పందించే హృదయం కోసం ఎదురుచూపులు పేదింట విద్యా కుసుమాలు విరబూశాయి. చదువుల తోటలో మార్కుల పంట పండిస్తున్నాయి. కూలి చేస్తేనే పూట గడిచే కుటుంబాలైనా.. చదువులో రాణిస్తున్నారు. ఆర్థిక సమస్యలు వెనక్కి లాగుతున్నా.. ఏమాత్రం నిరుత్సాహపడలేదు. సర్కారు బడులలో చదివినా... కార్పొరేట్ విద్యార్థులకు దీటుగా మార్కులు సాధించి... ప్రశంసలు అందుకుంటున్నారు. తాజాగా విడుదలైన పదో తరగ తి ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించి ఆదర్శంగా నిలిచారు. ఆర్థికంగా ఎవరైనా చేయూతనిస్తే... ఉన్నత చదువులు అభ్యసించి లక్ష్యాన్ని అందుకుంటామని చెబుతున్నారు. జీవితంలో నిలదొక్కుకున్నాక తమలాంటి పేద బిడ్డలకు బాసటగా నిలుస్తామని హామీ ఇస్తున్నారు. ఇస్త్రీ చేస్తూనే.. ముషీరాబాద్ : ప్రతిభకు పేదరికం అడ్డు కాదని నిరూపించింది రామ్‌నగర్‌కు చెందిన శ్రుతి. ఈ బాలిక టెన్త్‌లో 9.3 పాయింట్స్ సాధించింది. ఆంధ్ర మహిళా సభ బాలికల పాఠశాలలో పదో తరగతి చదివి...9.3 మార్కులతో పాఠశాల టాపర్‌గా నిలిచింది. రాంనగర్‌లోని గిరిశిఖర అపార్ట్మెంట్లో వాచ్‌మెన్‌గా పని చేస్తున్న యాదగిరి, లక్ష్మీల రెండో సంతానం శ్రుతి. వీరిది వరంగల్ జిల్లా మద్దూర్ మండలం డెక్కల్. నాలుగేళ్ల క్రితం పిల్లల చదువు, బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చి అపార్ట్మెంట్లో వాచ్‌మెన్‌గా బతుకు వెళ్లదీస్తున్నారు. శ్రుతి అక్క ఇంటర్ రెండో సంవత్సరం చదువుతుండగా, తమ్ముడు ఏడో తరగతి. వీరి ముగ్గురు స్కూల్ ఫీజులు, పుస్తకాలు, డ్రెస్‌లకే యాదగిరి కుటుంబం ఏటా దాదాపు రూ.లక్ష ఖర్చు చేస్తోంది. ఆర్థిక ఇబ్బందులతో ప్రభుత్వ పాఠశాలలో తన విద్యాబ్యాసాన్ని కొనసాగించిందీ బాలిక. తల్లి అదే అపార్ట్మెంట్లో ఇస్త్రీ చేస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలుస్తోంది. సెలవుల్లో, తీరిక సమయంలో శ్రుతి కూడా అమ్మకు సాయపడుతూ ఉంటుంది. బాసర త్రిబుల్ ఐటీలో సీటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. పాలిటెక్నిక్ పరీక్ష కూడా రాస్తోంది. దాతలు సహకరిస్తే ఉన్నత చదువులు చదువుతానని చెబుతోంది. అమ్మకు సహాయంగా... గచ్చిబౌలి: శేరిలింగంపల్లి మండలంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో మొదటి స్థానంలో నిలిచింది నలందేశ్వరి. శ్రీకాకుళం జిల్లా వంగర మండలం కొత్తపేటకు చెందిన బురిడి శివనాయుడు, దమయంతి దంపతులు తమ ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకును తీసుకొని కొన్నేళ్ల క్రితం బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చారు.శేరిలింగంపల్లిలోని పాపిరెడ్డినగర్ కాలనీలో ఉంటున్నారు. శివనాయుడు వాచ్మెన్. దమయంతి రోడ్డు పక్కన డబ్బాలో కిరాణా సామాను అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. వీరి రెండోకూతురు నలందేశ్వరి 7 నుంచి పదోతరగతి వరకు స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్లో చదివింది. పదో తరగతిలో 9.8 శాతం మార్కులు సాధించింది. పాఠశాల ముగిసిన తరువాత నిత్యం మియాపూర్‌లోని పోతుకూచి సోమసుందర సోషల్ వెల్ఫేర్ అండ్ చారిటబుల్ ట్రస్టుకు వెళ్లి చదువుకునేది. ఇంజినీరింగ్ చేసి... కలెక్టర్ కావాలన్నదే తన లక్ష్యమని నలందేశ్వరి చెబుతోంది. సెలవుల్లో ఇంటి వద్ద ఉన్నప్పుడు కిరాణా డబ్బాలో ఉండి అమ్మకు సాయం చేసేదాన్నని చెప్పింది. ఉపాధ్యాయులు..పోతుకూచి సోమసుందర సోషల్ వెల్ఫేర్ అండ్ చారిటబుల్ ట్రస్టు సహకారం మరిచిపోలేనిదని తెలిపింది. సాయం చేస్తే...రాణిస్తా.. సికింద్రాబాద్: నిరుపేద కుటుంబంలో పుట్టి... ప్రభుత్వ పాఠశాలలో చదివి... పదో తరగతిలో 9.3 మార్కులు సాధించి కళాశాల విద్యను అభ్యసించడానికి ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తోంది శాంతినగర్‌లోని శేషాపహడ్ మురికివాడకు చెందిన ఆర్.సుప్రజ. వరంగల్ జిల్లా నుంచి ఉపాధి కోసం నగరానికి వచ్చిన ఆర్.యేషోబు ఆటోడ్రైవర్. ఆయన భార్య రజిత ఇళ్లలో పనులు చేసుకుంటూ బతుకు బండిని లాగిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు సంతానం. వీరి పెద్దకుమార్తె ఆర్.సుప్రజ సమీపంలోని లాలాపేట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుకుంది. ఇటీవల వెల్లడించిన ఫలితాల్లో 9.3 మార్కులు సాధించింది. తల్లికి తోడుగా ఇళ్లలో పనులకు వెళుతూనే అత్యధిక మార్కులు సాధించింది సుప్రజ. తన తల్లిదండ్రుల ఆదాయం అంతంత మాత్రమేనని. తాను బాగా చదువుకుని మంచి ప్రభుత్వ ఉద్యోగం చేయాలన్న సంకల్పంతోనే 9.3 మార్కులు తెచ్చుకున్నానని తెలిపింది. తనను ఆదుకుని మంచి కళాశాలలో చదివించేవారు ఉంటే ఇంటర్లో సైతం మంచి మార్కులు సాధించి రికార్డు నెలకొల్పాలని ఉందని తెలిపింది. బాగా చదువుకుని టీచర్ ఉద్యోగం చేయాలన్నది తన ఆకాంక్ష గా సుప్రజ పేర్కొంది. నాన్న కల నెరవేరుస్తా... మూసాపేట: మూసాపేటకు చెందిన ఎమ్డీ వాజిద్ సనత్ నగర్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నారు. భార్య షాహిన్ గృహిణి. నెలకు రూ.8 వేల జీతంతో ఐదుగురు పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తున్నారు. అద్దె గదిలో నివాసం ఉంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. పంచశీల స్కూల్లో చదివిన చిన్న కుమార్తె ముస్కాన్ ఫాతిమా 9.8 మార్కులతో పాఠశాలటాపర్గా నిలిచింది. ‘నాన్న పదో తరగతి వరకే చదువుకున్నారు. ఇంట్లో ఒక డాక్టర్ ఉండాలన్న నాన్న కలను నిజం చేయడమే నా లక్ష్యం. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో మంచి మార్కులు సాధించా’నని సంతోషం వ్యక్తం చేస్తోందీ బాలిక. అమ్మ కష్టమే ఆసరాగా... మెహిదీపట్నం: అటు తల్లి.. ఇటు గురువుల అంచనాలను అందుకుంటూ ప్రభుత్వ పాఠశాలలో చదివి... ఇంగ్లీషు మీడియంలో పదో తరగతిలో 9.8 జీపీఏ తెచ్చుకున్నాడు తాళ్లగడ్డకు చెందిన సాయి ఫణీంద్ర కుమార్. ఆది నుంచీ ప్రణాళికాబద్ధంగా చదువుతూ ఉత్తమ ఫలితాలు సాధించాడు. ఫణీంద్ర 11 ఏళ్ల వయసులోనే తండ్రి శంకర్ మరణించాడు.తల్లి దుర్గ సంరక్షణలో క్రమశిక్షణతో పెరిగాడు. మూడో తరగతి నుంచి కార్వాన్ కుల్సుంపూర ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ వచ్చాడు. ‘అమ్మ ఇళ్లలో పనులు చేస్తూ... ఏ లోటూ రాకుండా చూసుకొని చదివించింది. పాఠశాలలో ఉపాధ్యాయులు ‘నీకు మంచి ర్యాంక్ వస్తుందని... చదవాలని’ ప్రోత్సహించారు. నేను 9 జీపీఏ అంచనా వేశా. నాకు 9.8 రావడం పట్ల అమ్మతో పాటు గురువులంతా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో సివిల్ ఇంజినీర్ కావడమే నా కల’ అంటున్నాడీ బాలుడు. ఐఏఎస్ లక్ష్యం... కాటేదాన్: నిజామాబాద్ ప్రాంతానికి చెందిన దిలీప్ కుటుంబంతో కలసి నగరానికి వ లస వచ్చాడు. స్థానికంగా ఓ బ్యాటరీ ఫ్యాక్టరీలో డ్రైవర్‌గా పని చేస్తూ... అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఆయనకు ఓ కూతురు, కుమారుడు సంతానం. కుమార్తె ప్రియాంక మైలార్‌దేవ్‌పల్లి ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివి.. 9 జీపీఏ సాధించింది. రాజేంద్రనగర్ మండలంలోనే టాపర్‌గా నిలిచింది. మంచి ఫలితాలు సాధించిన తమ కుమార్తెను ఉన్నత చదువులు చదివించేందుకు ప్రోత్సహిస్తానని తండ్రి దిలీప్ పేర్కొన్నాడు. కలెక్టర్ కావాలనేది తన లక్ష్యమని ప్రియాంక వివరించింది. చెరుకు బండే.. బతుకు బండీ రాయదుర్గం: చెరుకుబండి నడిస్తేనే వారి బతుకుబండి సాగుతుంది. వచ్చిన కొద్దిపాటి మొత్తంతో తన కూతురును చదివించి ఉత్తమ ఫలితాల సాధనకు ఆ తల్లిదండ్రులు కృషి చేశారు చిలుకూరు సమీపంలోని మేడిపల్లికి చెందిన నర్సింగరావు, విజయలక్ష్మి దంపతులు. తమ ముగ్గురు ఆడపిల్లలతో 13 ఏళ్ల క్రితం రాయదుర్గానికి వలస వచ్చారు. స్థానికంగా సీజన్లో చెరుకుబండి నడపడం, ఆ తర్వాత కూలీ పనులు చేస్తూ ఆ తల్లిదండ్రులు తమ బిడ్డలను చదివిస్తున్నారు. వీరి రెండో కూతురు సాయి ప్రసన్న పదో తరగతిలో 9.3 జీపీఏ సాధించింది. పేదింటి నుంచి వచ్చినా కష్టపడి చదివి ఆమె మంచి మార్కులు సాధించిందని స్థానిక నాగార్జున ఉన్నత పాఠశాల కరస్పాండెంట్ భరత్ కుమార్ తెలిపారు. ముగ్గురు పిల్లలు నాగార్జున ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్నారని, కరస్పాండెంట్ భరత్ కుమార్ పిల్లల ీఫీజుల విషయంలో అండగా నిలిచారని ఆ తల్లిదండ్రులు తెలిపారు. ఇంజినీర్‌ను కావాలన్నదే తన లక్ష్యమని సాయిప్రసన్న తెలిపింది. పాలు అమ్ముతూనే... కుత్బుల్లాపూర్ మండలం ప్రగతి నగర్లో వాచ్‌మెన్‌గా పనిచేసే శ్రీనివాస్, ఉదయ్లక్షి్ష్మల కుమారుడు నాగసతీష్. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదివి... 9 జీపీఏ సాధించాడు. ఉదయం 5 గంటల నుంచి ఇంటింటికి తిరిగి పాల ప్యాకెట్లు వేస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటూనే చదువు కొనసాగించాడా కుర్రాడు. తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి...శ్రద్ధగా చదివి మంచి మార్కులు సాధించాడు. ఇదిలా ఉండగా...తన ఉన్నత చదువులకు ఆర్థిక సాయం చేసేందుకు సినీ నటి రజిత ముందుకువచ్చారని నాగసతీష్ తెలిపాడు. ఇంటర్లో మంచి మార్కులు సాధించి...ఇంజినీర్ కావాలన్నదే తన లక్ష్యమని చెప్పాడు. ఇంజినీర్‌నవుతా.. మూసాపేట: మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తికి చెందిన శ్రీనివాస్‌గౌడ్, అంజమ్మ దంపతులు పదేళ్ల క్రితం హైదరాబాద్‌కు వలస వచ్చారు. కూకట్పల్లి ఆర్టీసి డిపో ఎదురుగా ఇండ్లీ బండి నడిపిస్తుంటారు. వీరికి ముగ్గురు కుమార్తెలు. మూసాపేట డివిజన్ ప్రగతినగర్‌లోని శ్రీసాయి విద్యానికేతన్ స్కూల్లో చదివిన స్వప్న పదో తరగతిలో 9.5 పాయింట్స్ సాధించింది. ఈ దంపతుల ఇద్దరు కుమార్తెలు బీటెక్, డిప్లమో చదివిస్తున్నాడు. స్కూల్ టాపర్‌గా నిలిచిన చిన్న కుమార్తె స్వప్న ఇంజినీర్‌ను అవుతానని...తల్లిదండ్రులను కంటికి రెప్పలా చూసుకుంటానని చెబుతోందీ బాలిక. ఎంత కష్టం వచ్చినా ముగ్గురు కుమార్తెలను మంచిగా చదివిస్తానని, తను పడుతున్న కష్టం కూతుళ్లు పడకూడదని శ్రీనివాస్‌గౌడ్ అంటున్నారు. డాక్టర్ కావాలనుంది.. మలక్‌పేట: మలక్‌పేట్ సలీం నగర్‌లోని గురుకుల పాఠశాల విద్యార్థిని దావల యామిని పదో తరగతిలో 9 జీపీఏ సాధించింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన దావల దుర్గారావు, సీతామహాలక్ష్మి దంపతులు జీవనోపాధి కోసం పదేళ్ల క్రితం నగరానికి వలస వచ్చారు. మన్సూరాబాద్‌లోని సాయినగర్ గుడిసెల్లో నివాసం ఉంటున్నారు. దుర్గారావు ప్లంబర్‌గా... సీతామహాలక్ష్మి గురుకుల పాఠశాలలో క్యాజువల్ లేబర్‌గా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. ఇంటి పనుల్లో తల్లికి తోడుగా ఉంటూనే చదువులో మంచి ప్రతిభ కనబరిచిందీ విద్యార్థిని. ఈ సందర్భంగా యామిని మాట్లాడుతూ.. మెడిసిన్ చదువుకుని... పేదలకు సేవచేసి ఉత్తమ డాక్టర్‌గా పేరు తెచ్చుకుంటానని తెలిపింది. మంచి మార్కులు సాధించేలా ప్రోత్సహించినతల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు రుణపడి ఉంటానని తెలిపింది. అమ్మ కష్టం వృథా కానివ్వను జగద్గిరిగుట్ట: జగద్గిరిగుట్ట శ్రీనివాస్‌నగర్‌లో ఉండే రజిత కుమార్తె ఉమ జగద్గిరిగుట్టలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివింది. పబ్లిక్ పరీక్షల్లో 9 జీపీఏ సాధించింది. ఉమ తండ్రి చిన్నప్పుడే మరణించడంతో తల్లి రజిత బిడ్డను కష్టపడి చదివించింది. వ చ్చిన అరకొర జీతంలో కుటుంబాన్ని పోషిస్తూ.. కొడుకు, కూతురును చదివిస్తోంది. తమ కూతురు చదువుకు ఎవరైనా దాతలు సహ కరించాలని రజిత కోరుతోంది. ఇంజినీర్‌ను కావడమే తన ధ్యేయమని.. తన తల్లి పడిన కష్టానికి ప్రతిఫలంగా... బాగా చదివి... సమాజానికి సేవ చేయాలని ఉందని ఉమ చెబుతోంది. -
ప్రకృతి దేవోభవ
- పర్యావరణ పరిరక్షణకు విద్యార్థుల కృషి - సెయింట్ జోసెఫ్స్ స్కూల్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు - పాఠశాల వేదికగా పనిచేస్తున్న ఎకోక్లబ్ పర్యావరణం దెబ్బతింటే బాధితులుగా మారేది భావితరాలే. అందుకే.. ప్రకృతిని కాపాడుకోవాల్సిన అంశంలో అత్యవసరంగా అవగాహన పెంచాల్సింది విద్యార్థుల్లోనే. ఈ విషయంలో ఆశాభావాన్ని రేకెత్తిస్తున్నాయి నగరంలోని పాఠశాలల్లో ఏర్పాటవుతున్న ‘ఎకో క్లబ్స్’. వీటిలో కొన్ని స్పష్టమైన విధానాలతో ముందడుగేస్తున్నాయి. ఇతర పాఠశాల విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. - సాక్షి, లైఫ్‌స్టైల్ ప్రతినిధి ‘మా స్కూల్లో 30 మంది విద్యార్థులు ఎకో క్లబ్లో వలంటీర్లుగా ఉన్నార’ని చెప్పారు కింగ్‌కోఠిలోని సెయింట్ జోసెఫ్స్ పబ్లిక్‌స్కూల్ టీచర్ రమ. ప్రస్తుతం తమ స్కూల్లోని ఎకోక్లబ్కు కో ఆర్డినేటర్‌గా ఉన్నారామె. పర్యావరణంపై విద్యార్థుల్లో అవగాహన పెంచే కార్యక్రమాలను నిర్వహించే ప్రముఖ స్వచ్ఛంద సంస్థ ‘వెల్త్ అవుటాఫ్ వేస్ట్’ (వావ్) ఆధ్వర్యంలో జరిగిన ఇంటర్ స్కూల్ రీసైక్లింగ్ కాంపిటీషన్లో 2014-15కు గాను పాఠశాలలోని ఎకో క్లబ్ విజేతగా నిలిచింది. ఈ పాఠశాల విద్యార్థులు 9,545 కిలోల పేపర్ వేస్ట్‌ను సేకరించి ‘వావ్’కి అందించడం ద్వారా గెలుపు దక్కించుకున్నారు. ఇదే ఏడాది మరో ఎన్జీఓ ‘టెరి’ నిర్వహించిన టెట్రాప్యాక్ల కలెక్షన్ పోటీలోనూ వీరు గెలుపొందారు. ఇంతే కాకుండా కొంతకాలంగా విభిన్న రకాల యాక్టివిటీస్ ద్వారా తమ ఎకో క్లబ్ విద్యార్థుల్లో చైతన్యం పెంచుతోందని వివరించారు రమ. పర్యావరణ స్పృహే ధ్యేయంగా.. స్కూల్లో 2005లో ఎకోక్లబ్ ఏర్పాటైంది. అదే ఏడాది నుంచి స్కూల్లో మొక్కలు నాటడం మొదలుపెట్టారు. ఫలితంగా అప్పటి వరకూ పచ్చని ఆకుకు సైతం నోచుకోని పాఠశాల ప్రాంగణంలో ఇప్పుడు వందలాది చెట్లు పెరిగాయి. ‘నాటిన 500 మొక్కల్లో ఎన్నో ఏపుగా పెరిగాయి. క్రోటన్స్ నుంచి పూల మొక్కల వరకూ మా స్కూల్ మొత్తం గ్రీనరీయే. త్వరలో ఆర్గానిక్ గార్డెనింగ్‌ను స్కూల్ టైపై ఏర్పాటు చేయనున్నాం’ అంటూ ఉత్సాహంగా చెప్పారు రమ. ఈ స్కూల్లోని ఎకోక్లబ్ ప్రసిద్ధ ఎన్జీఓ ‘టెరి’ నుంచి గత ఐదేళ్లుగా టెట్రాప్యాక్ల కలెక్షన్ పోటీలో గెలుపొందుతూ ఎన్విరాన్మెంట్ అంశాల్లో బెస్ట్ స్కూల్‌గా నిలుస్తోంది. పర్యావరణం అంశంలో అందుకున్న నగదు బహుమతులను సైతం వీరి క్లబ్ పాఠశాలలో ట్రీ ప్లాంటేషన్‌కు అవసరమైన ఖర్చులుగా వినియోగించడం విశేషం. ‘ఎనర్జీ సేవింగ్’ అంశంపై పీయూష్ గోయల్‌తో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ వర్క్‌షాప్‌కు మన రాష్ట్రం నుంచి ఎంపికైన ఏకైక స్కూల్ మాదే’నని వివరించారు ఆమె. హోలీ, దీపావళి, సంక్రాంతి పండుగల సమయంలో ఆర్గానిక్ రంగులు, టపాసులు.. వినియోగంపై తమ విద్యార్థులు రకరకాల అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారని, ప్లాస్టిక్ వినియోగాన్ని వద్దనే సందేశంతో పెయింటింగ్, వ్యాసరచన పోటీలతో పాటు తరచుగా ర్యాలీలు నిర్వహిస్తారని చెప్పారు. మనిషిని ప్రకృతి పుట్టిస్తే.. అభివృద్ధి పేరిట ఆ ప్రకృతినే నాశనం చేస్తున్నాడు మనిషి. ఆ ఫలితం ఇప్పటికే రకరకాల వైపరీత్యాల రూపంలో మనకు అనుభవంలోకి వస్తూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో యుక్త వయసులోనే ప్రకృతి, పర్యావరణ ప్రాధాన్యతను తెలియజెప్పే ఎకోక్లబ్స్ అన్ని స్కూల్స్‌లో ఇంతే యాక్టివ్‌గా మారితే.. పచ్చని భవితకు ఆసరాగా మారితే.. అంతకన్నా కావాల్సిందేముంది? -
సైన్స్ విజన్
జపాన్ టూర్‌పై విద్యార్థుల ఆనందం సాక్షి, సిటీబ్యూరో: మానవాళి మనుగడ, అభివృధ్ధిలో సైన్స్ ప్రాధాన్యత... అది విద్యార్థులకు కెరీర్ పరంగా అందించే విజయాలు... జపాన్ పర్యటన తె లియజెప్పిందని నగరానికి చెందిన పాఠశాల విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. జపాన్ సైన్స్ టెక్నాలజీ ఏజెన్సీ ‘సకురా సైన్స్ ప్రోగ్రామ్’లో భాగంగా లిటిల్ ఫ్లవర్ స్కూల్ విద్యార్థులు 25 మంది జపాన్‌లో పర్యటించారు. నగరానికి తిరిగి వచ్చిన సందర్భంగా వారు అక్కడి విశేషాలను పంచుకున్నారు. ఉన్నత పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, ప్రయోగశాలలు, క్యోటో యూనివర్సిటీ సందర్శన, టోక్యోకు బుల్లెట్ రైలు ప్రయాణం, జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ ఇండస్ట్రియల్ సైన్స్ అండ్ టె క్నాలజీ, టోక్యో ఎమెర్జింగ్ సైన్స్ అండ్ ఇన్నోవేషన్ మ్యూజియం... వంటివి సందర్శించడం మరిచిపోలేని అనుభూతిని అందించిందని వివరించారు. ఇదొక విజ్ఞాన, వినోదాల మేలు కలయికగా సాగిన పర్యటన అని పేర్కొన్నారు. ఈ పర్యటనలో పాల్గొన్న స్కూల్ ప్రిన్సిపల్ బ్రదర్ ఆంటోనిరెడ్డి, టీచర్ మేరియాన్లు కూడా తమ అనుభవాలను పంచుకున్నారు. -
బుక్ ఆర్ట
రబ్బర్ స్టాంప్, ప్రింట్, టెక్ట్స్ బుక్స్ వంటివి ఆమె చేతిలో పడితే కళా రూపాలుగా మారిపోతాయి. ఇండియాలో అంతగా ప్రాచుర్యంలో లేని ఈ సరికొత్త కళల్లో ఆమె అంతర్జాతీయ అవార్డులు గెలుచుకున్నారు. ఆమె పేరు మాలిని గుప్తా. పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే అయినా.. ఉండేది మాత్రం అమెరికాలో. తన కళారూపాలను ‘ఎక్స్పోజ్ యువర్ సెల్ఫ్ టు ఆర్ట్’ పేరుతో కళాకృతి గ్యాలరీలో ప్రదర్శన ఏర్పాటు చేశారామె. ఈ సందర్భంగా మాలిని గుప్తాతో ‘సాక్షి’ చిట్చాట... ఇక్కడి ఏర్పాట్లు.. మన దేశంలో కళలంటే ఆదరణ చాలా తక్కువ. టైం, డబ్బు వృథా అనే ఆలోచన ఉంది. ఇందుకు భిన్నంగా గ్యాలరీలు ప్రదర్శనలు ఏర్పాటు చేసుకునే వీలు, మీడియాలో కథనాలు రావటం చూస్తుంటే కళాకారులకు సంబంధించినంత వరకు చాలా మార్పులు వచ్చాయని అనిపిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ ఇప్పుడు చాలా మారింది. అప్పట్లో కళాకారుల కోసం గ్యాలరీలు లేవు. మై హోమ్టౌన్.. నేను పుట్టి, పెరిగింది హైదరాబాద్‌లోనే. 2002లో యూఎస్‌కి వెళ్లాను. ఎలక్ట్రానిక్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ చేశాను. అక్కడికి వెళ్లాక బీఎఫ్ఏ చేశాను. నా సొంత సిటీ అంటే ఎప్పుడు ప్రత్యేకమే. యూఎస్, యూకే దేశాల్లోని ఎన్ని సిటీల్లో ప్రదర్శనలు ఇచ్చినా హోమ్‌టౌన్‌లో ప్రదర్శన ఇవ్వటం చాలా ఎక్సైటింగ్ ఉంటుంది. సిటీలో మళ్లీ ఇలాంటి ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని ఆశిస్తున్నాను. అమెరికా నుంచి సిటీకి.. అమెరికాలోని నార్త్ పసిఫిక్ ఆర్ట్ కాలేజ్‌లో నేర్చుకున్నా. నా థీసిస్ సబ్జెక్ట్ ఆర్టిస్ట్ పుస్తకం. బైండ్ చేయడం, ప్రింట్ చేయడం అందులో భాగం. ఇక అప్పటి నుంచి పుస్తకం, అక్షరాలతో నా చెలిమి మరింత ఎక్కువైంది. నా థీసిస్‌కి అక్కడ అవార్డు కూడా లభించింది. ఆ తర్వాత నేను ఒరెగన్ ఆర్ట్ కాలేజ్‌లో బుక్ ఆర్ట్ నేర్చుకున్నాను. నాకు స్టోరీ టెల్లింగ్ అంటే చాలా ఇష్టం. నేనొక కళాకారిణిని. గ్రాఫిక్ డిజైనర్‌ని. నాకు సంబంధించి ఇవన్నీ కలిసింది బుక్ ఆర్ట్. దీంట్లో గ్రాఫిక్ డిజైన్, క్రాఫ్ట్, ఆర్ట్ అన్నీ ఉంటాయి. న్యూయార్క్, జర్మనీలో నిర్వహించిన పోటీల్లో నేను చేసిన పోస్టర్‌కి అంతర్జాతీయ అవార్డ్ వచ్చింది. ఆ తర్వాత కూడా చాలా అవార్డ్స్ వచ్చాయి. కానీ నా థీసిస్‌కి వచ్చిన అవార్డ్ నాకు చాలా స్పెషల్.