ఎడారి పండు.. పోషకాలు మెండు
సాక్షి, సిటీబ్యూరో: అలసిన దేహమనే యంత్రానికి ‘ఖర్జూరం’ ఓ శక్తి వనరు.. తక్షణ శక్తి ప్రదాయని. ఎన్నో పోషకాలతో నిగనిగలాడే ఈ పండు ఆరోగ్యాన్ని పరిపుష్టం చేస్తోంది. నిగనిగలాడే రంగు, మంచి రుచితో ప్రతి ఒక్కరినీ తనవైపు తిప్పుకుంటుంది. రంజాన్ మాసంలో దీనికో ప్రత్యేకత ఉంది. ‘రోజా’ దీక్షలను పాటించేవారు ఈ పండునే బాగా ఇష్టపడతారు. ఉపవాసం పూర్తయిన తర్వాత దేహానికి కావాల్సిన తక్షణ శక్తి కోసం దీన్ని తీసుకోవడం అనవాయితీ.
ప్రస్తుతం పవిత్ర రంజాన్ మాసం కావడంతో ఈ పండుకు మరింత డిమాండ్ పెరిగింది. ఎడారి దేశాల్లో పండే ఈ ఫలం వివిధ అరబ్ దేశాల నుంచి 15 నుంచి 20 రకాల ఖర్జూరాలు నగర మార్కెట్లను ముంచెత్తాయి. ఇరానీ (నలుపు, ఎరుపు), కిమియా ఖజూర్, కల్మీ ఖజూర్, తైబా ఖజూర్, మగ్ధీ ఖజూర్, ఆల్ మదీనా.. తదితర రకాలు లభిస్తున్నాయి.
వీటి విక్రయాలకు నిలయమైన బేగంబజార్, గుల్జార్ హౌస్ తదితర ప్రాంతాల్లో హోల్‌సేల్ దుకాణాలు కొనుగోలు దారులతో కళకళలాడుతున్నాయి. ఇరాక్, ఇరాన్, సౌదీ, ఒమన్ దేశాల నుంచి ఈ పండ్లను దిగుమతి చేసుకుంటున్నట్లు బేగం బజార్‌లోని కాశ్మీర్ హౌస్ అధినేత ధీరజ్ కుమార్ తెలిపారు. కిలో ఇరాకీ ఖజూర్ రూ.50 నుంచి రూ.60, నలుపు రకం ఇరానీవి రూ.80 నుంచి రూ.100, ఎరుపు రూ.60, కీమియా ఖజూర్‌కు రూ.120-130 (బాక్స్), తైబా మగ్ధీ రకాలు రూ.130-140, ఆల్ మదీనా ఖజూర్ రూ.160-180 ధర పలుకుతోంది.
క్యాలరీస్ అధికం
- ఖర్జూరాల్లో క్యాలరీస్ అధికమని, మన దగ్గర డ్రై డేట్స్ వినియోగం ఎక్కువని గాంధీ ప్రకృతి వైద్యశాల వైద్యులు డా. శ్యామల తెలిపారు. ఈ పండులో పోషకాలు అధికమని వివరించారు.
- 100 గ్రాముల ఖర్జూరంతో 400-600 క్యాలరీల శక్తి లభిస్తుంది. ఫ్రెష్ డేట్స్‌లో క్యాలరీలు కాస్త తక్కువ.
- ఖర్జూరాల్లో ఐరన్, ఫైబర్ ఎక్కువ. క్యాల్షియం, పొటాషియం, కార్బొహైడ్రేట్స్, ప్రొటీన్స్, కాపర్ పాళ్లు కూడా పుష్కలంగా ఉంటాయి.
- 100 గ్రాముల డేట్స్‌లో 8-10 గ్రాముల ఫైబర్ ఉంటుంది.
- డేట్స్‌ను పాలతో కలిపి తీసుకుంటే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అందుకే పిల్లల్లో, వృద్ధుల్లో, ఏదైనా జబ్బు నుంచి కోలుకునే వారికి ఇది మంచి ఆహారం. ఖర్జూరం తినడం వల్ల ఎల్‌డీఎల్ కొలస్ట్రాల్ బాగా తగ్గి గుండె పనితీరు బాగుంటుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది.