
నేడు(శనివారం) హనుమజ్జయంతి. దేశవ్యాప్తంగా వివిధ హనుమాన్ ఆలయాల్లో ఉత్సవశోభ నెలకొంది. భక్తులు హనుమంతుని దర్శనం కోసం బారులు తీరారు. బుద్ధిబలానికి ప్రతీకగా నిలిచిన హనుమంతునికి ఈరోజున భక్తులు విశేషంగా పూజలు చేస్తారు. హనుమజ్జయంతి(Hanuman Jayanti)ని దేశంలోని వివిధ ప్రాంతాల్లో రెండు భిన్న తేదీలలో జరుపుకుంటారు. ఈ రెండు తేదీల వెనుక వివిధ ప్రాంతీయ సంప్రదాయాలు, పురాణ గ్రంథాలలో భిన్నమైన వివరణలు ఉన్నాయి.
చైత్రంలో హనుమజ్జయంతి (మార్చి-ఏప్రిల్)
హిందూ పంచాంగం ప్రకారం చైత్ర మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి రోజు) హనుమజ్జయంతి జరుపుకుంటారు. ఇది సాధారణంగా మార్చి లేదా ఏప్రిల్ నెలలో వస్తుంది. ఉత్తర భారతదేశంలో (ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, హర్యానా వంటి రాష్ట్రాలు) ఈ తేదీన హనుమజ్జయంతి చేసుకుంటారు. ఈ రోజున భక్తులు హనుమాన్ ఆలయాలను సందర్శిస్తారు. హనుమాన్ చాలీసా(Hanuman Chalisa) పఠిస్తారు. ఉపవాసం ఉండి, వాయునందనుకి ప్రసాదాలు సమర్పిస్తారు.
మార్గశిరంలో హనుమజ్జయంతి (డిసెంబర్-జనవరి)
మార్గశిర మాసంలో కొందరు హనుమజ్జయంతిని చేసుకుంటారు. దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఈ తేదీన జరుపుకుంటారు. దక్షిణ భారత సంప్రదాయం ప్రకారం హనుమంతుడు మార్గశిర మాసంలో జన్మించాడని కొన్ని గ్రంథాలు పేర్కొన్నాయి. దక్షిణ భారతదేశంలో హనుమజ్జయంతి సందర్భంగా కొందరు 41 రోజుల పాటు దీక్ష చేపడతారు. ఈ దీక్ష చైత్ర పౌర్ణమి నుంచి మొదలై, మార్గశిర మాసంలోని అంజనేయ జయంతి రోజున ముగుస్తుంది. దీక్ష తీసుకున్న భక్తులు(Devotees) హనుమాన్ చాలీసా, సుందరకాండ పారాయణం చేస్తారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కొన్ని పురాణ గ్రంథాలలో చైత్ర మాసంలో హనుమంతుని జననం జరిగిందని పేర్కొన్నారు. మరికొన్ని గ్రంథాలలో మార్గశిర మాసంతో అనుసంధానిస్తారు. ఈ భిన్నమైన వివరణల కారణంగానే హనుమజ్జయంతి ఏటా రెండు తేదీలలో జరుగుతుంది. వాల్మీకి రామాయణం తదితర గ్రంథాలలో హనుమంతుని జన్మ సమయం గురించి స్పష్టమైన ఏకీకృత వివరణ లేకపోవడంతో ప్రాంతీయంగా భిన్న విశ్వాసాలు ఏర్పడ్డాయి. హనుమజ్జయంతి జరుపుకునే తేదీలు భిన్నంగా ఉన్నప్పటికీ భక్తులు ఆరోజున హనుమంతుడిని భక్తి పూర్వకంగా ఆరాధిస్తారు.
ఇది కూడా చదవండి: ‘సందీప్ 26/11 బాధితుడు కాదు.. కర్తవ్యాన్ని నెరవేర్చాడు’