
అయోధ్య: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య(Ayodhya)లోగల రామాలయం మరో ఉత్సవానికి సిద్ధమవుతోంది. ఈ కార్యక్రమం మే నెలలో జరగనున్నదని తెలుస్తోంది. 2024, జనవరి 22న జరిగిన బాలరాముని ప్రాణప్రతిష్ఠ తరువాత ఇప్పుడు మందిర నిర్మాణంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. మే నెలలో ఆలయంలోని మరికొన్ని విగ్రహాల ప్రతిష్ఠాపన జరగనుంది. రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధికారులు త్వరలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.
ప్రస్తుతం మందిర నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి . ఈ పనులు 2025 చివరి నాటికి పూర్తి కావచ్చని అంచనా. మే నెలలో అయోధ్యలో జరిగే ప్రతిష్ఠాపన కార్యక్రమంతో దేశవ్యాప్తంగా అయోధ్యపైకి మరోమారు అందరి దృష్టి మరలనుంది. 2024, జనవరి 22న రామాలయంలోని గర్భగుడిలో బాలరాముణ్ణి ప్రతిష్ఠింపజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi), ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌తో పాటు దాదాపు 7,000 మంది ప్రముఖులు పాల్గొన్నారు.
రామ మందిరం మూడు అంతస్తులతో నిర్మితమవుతోంది. ప్రస్తుతం గ్రౌండ్ ఫ్లోర్ పూర్తయింది. మిగిలిన అంతస్తులతో పాటు శిఖర నిర్మాణం కొనసాగుతోంది. ఇవి కొనసాగుతుండగానే మే నెలలో ఆలయ సముదాయంలోని ఇతర దేవతల విగ్రహాల ప్రతిష్ఠాపన జరగనుంది. దశావతారం, శేషావతారం, నిషాదరాజు, శబరి, అహల్య, తులసీదాస్ తదితర మహనీయులకు సంబంధించిన 18 నూతన మందిరాల నిర్మాణం కొనసాగుతున్నదని ట్రస్ట్ పేర్కొంది. మే నెలలో జరిగే కార్యక్రమానికి లక్షలాది మంది భక్తులు అయోధ్యకు తరలివస్తారని ట్రస్ట్ భావిస్తోంది.
రామాలయంలో బాలరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించిన అనంతరం ఆలయానికి రోజుకు సగటున లక్షమంది వరకూ భక్తులు వస్తున్నారు. కాగా మే నెలలో జరిగే విగ్రహాల ప్రతిష్ఠాపన మహోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకావచ్చిన సమాచారం. ఈ కార్యక్రమం కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భద్రతా ఏర్పాట్లు, రవాణా సౌకర్యాలు, తాత్కాలిక టెంట్ సిటీలను సిద్ధం చేస్తోంది.
ఇది కూడా చదవండి: ‘అసమానతలను అర్థం చేసుకోండి’: బిల్‌గేట్స్