
అయోధ్య: యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాకు జనం పోటెత్తుతున్నారు. వీరిలోని చాలామంది అయోధ్యకు చేరుకుని, బాలరాముణ్ణి దర్శించుకుంటున్నారు. దీంతో అయోధ్యలోనూ జనప్రవాహం కనిపిస్తోంది. కుంభమేళా ప్రారంభమైనది మొదలు ప్రతిరోజూ రెండున్నర నుండి మూడు లక్షల మంది భక్తులు అయోధ్యకు వస్తున్నారు. దీంతో గరిష్ట సంఖ్యలో భక్తులు రాంలల్లాను దర్శనం చేసుకునేందుకు వీలుగా ఆలయాన్ని ప్రతిరోజూ 18 గంటల పాటు తెరిచి ఉంచుతున్నారు.
ఉదయం 5 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు భక్తులకు శ్రీరాముణ్ణి దర్శించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. అయితే ఆలయానికి భక్తులు పోటెత్తుతుండటంతో కొన్ని నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ప్రస్తుతం రెండవ అంతస్తుతో పాటు శిఖరంపై నిర్మాణ పనులు, సప్త మండపం, శేషావతార్ ఆలయం పనులు జరుగుతున్నాయి. ఈ పనుల్లో జాప్యం జరుగుతోంది. ఆలయ ప్రాకారాలు, స్తంభాలపై కుడ్యచిత్రాలను రూపొందించే పనులు కూడా మందకొడిగా కొనసాగుతున్నాయి. దర్శన్ మార్గ్ ప్రక్కనే ఉన్న యాత్రికుల సౌకర్యాల కేంద్రంలో జరుగుతున్న నిర్మాణ పనులను కూడా నిలిపివేశారు.
రామ్ మందిర్ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మాట్లాడుతూ భక్తులకు సులభ దర్శనం కల్పించేందుకు కొన్ని పనులు నిలిపివేశామన్నారు. గడచిన 10 రోజుల్లో 70 లక్షలకు పైగా భక్తులు అయోధ్యను సందర్శించారని తెలిపారు. ఉదయం నాలుగు గంటల నుండి సరయు నదిలో భక్తులు స్నానాలు చేస్తున్నారు. అయోధ్యకు దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచే కాకుండా, విదేశాల నుంచి కూడా భక్తులు తరలివస్తున్నారు. విదేశీ భక్తులు కూడా సరయు నదిలో స్నానం చేసిన తర్వాత రామ్‌లల్లా దర్శనం చేసుకుంటున్నారు.
ఇది కూడా చదవండి: Mahakumbh-2025: నేడు మరో సరికొత్త రికార్డు..
Comments
Please login to add a commentAdd a comment