శ్రీ ఆంజనేయం
మల్యాల : కొండగట్టు ఆంజనేయస్వామి జయంతిని పురస్కరించుకుని లక్షలాది మంది తరలివచ్చి.. స్వామివారిని దర్శించుకున్నారు. రామలక్ష్మణ జానకీ..జైబోలో హనుమాన్ కీ.. శ్రీహనుమ..జయ హనుమ..జయజయ హనుమ.. అంటూ అంజన్న కీర్తిస్తూ వేలాదిమంది భక్తులు అంజన్న కొండకు తరలివచ్చారు. సుమారు రెండు లక్షల మంది స్వామివారిని దర్శించుకున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వాహనాల్లో, కాలినడకన అంజన్న సన్నిధికి చేరుకున్నారు.
మంగళవారం ఉదయం 9 గంటలకు పంచామృతాలతో స్వామివారికి అభిషేకం చేశారు. ఉత్సవమూర్తికి పట్టు పట్టువస్త్రాలు అలంకరించి, సహస్రనాగవల్లి అర్చన, హోమం, మహాపూర్ణాహుతి నిర్వహించారు. సాయంత్రం గరుడ వాహన సేవ నిర్వహించారు. ఉత్సవాలు ముగియడంతో భక్తులు అంజన్న నీకొండకు మళ్లొస్తామంటూ తిరుగుపయనమయ్యారు.
* హైదరాబాద్‌కు చెందిన కాంతితేజ కంపెనీ కుటుంబ సభ్యులు మూడురోజులుపాటు భక్తులకు అల్పాహారం, అన్నదానం చేశారు. బొజ్జపోతన్న నుంచి కొండపైకి మల్యాల ప్రైవేట్ పాఠశాలల ఆధ్వర్యంలో ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో మజ్జిగ అందించారు. కరీంనగర్ బాలాజీ ఆటోస్టోర్స్ వారు నీరు ఏర్పాటు చేశారు.
* దీక్ష విరమణకు వెళ్లే దారిలో నీళ్లు నిలవడంతో భక్తులు ఇబ్బందిపడ్డారు. మెట్లదారిని కింది వరకు పూర్తి శుభ్రం చేయకపోవడంతో దుర్వాసన వెదజల్లింది. మెట్లదారిలో చలివేంద్రం ఏర్పాటు చేసినా నీళ్లు నింపకపోవడంతోపాటు, చలివేంద్రాల నిర్వహణను పట్టించుకోలేదని భక్తులు విమర్శించారు.
* మెట్లదారి వెంట దీక్షాపరుల కోసం కేశఖండన టికెట్ కౌంటర్ ఏర్పాటు చేసినప్పటికీ ఉదయం 8గంటల వరకు తెరుచుకోలేదు.
* కొండపైకి వాహనాలను అనుమతించకపోవడంతో భక్తులు కాలినడక ఇబ్బంది కలగకుండా వెళ్లగలిగారు.