
కొండగట్టు (చొప్పదండి): తెలంగాణలోని పుణ్యక్షేత్రం జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం శుక్రవారం కాషాయమయమైంది. హనుమాన్ చిన్నజయంతి సందర్భంగా దీక్షాపరులు భారీ సంఖ్యలో వచ్చి మాలవిరమణలు చేసుకొని మొక్కులు చెల్లించారు. లక్షకు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. జగిత్యాల కలెక్టర్ శరత్, బీజేపీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ స్వామివారిని దర్శించుకున్నారు.
ఏటా చైత్రపౌర్ణమిని పురస్కరించుకుని నిర్వహించే ఈ జయంతి ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి వేకువజామున సుప్రభాత సేవ, పంచామృతాభిషేకం, పట్టువస్త్రాలంకరణ చేశారు. భక్తులకు సరిపడా తాగునీరు లేక ఇబ్బంది పడ్డారు. పాతకోనేరులో నీరు బురదగా మారడంతో భక్తులు ఒక్కో బకెట్‌కు రూ.20 చొప్పున కొనుగోలు చేశారు.