ఆలయ నమూనాపై చర్చిస్తున్న ఆనంద్‌సాయి
కొండగట్టు(చొప్పదండి): జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆలయాన్ని ఆగమశాస్త్రం ప్రకారం యాదాద్రి తరహాలో అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారని వాస్తు సలహాదారు, ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి వెల్లడించారు. సీఎం కేసీఆర్ ఈ నెల 14న కొండగట్టు పర్యటనకు రానున్న నేపథ్యంలో ఆనందసాయి ఆదివారం స్వామివారి సన్నిధికి చేరుకున్నారు.
అంజన్న దర్శనం తర్వాత కలెక్టర్ యాస్మిన్ బాషా, ఎస్పీ భాస్కర్, ఇతర అధికారులు, నాయకులతో సమావేశమై ఆలయ మాస్టర్‌ప్లాన్‌పై చర్చించారు. ఆలయంలో ఇప్పుడున్న ప్రాకారంతోపాటు మరోదానిని నిర్మించాల్సి ఉందన్నారు. పుణ్యక్షేత్రంలో 1980 నాటి భవనాలు ఉన్నాయని, గర్భగుడిలోని స్వామివారు భక్తులకు కనిపించడంలేదని చెప్పారు. ఆలయానికి నాలుగువైపులా గోపురాలు, ముఖమండపం నిర్మాణాన్ని ప్రత్యేకంగా డిజైన్ చేస్తామని ఆనందసాయి వివరించారు.
ఆలయంలోకి వచ్చే భక్తులకు స్వామివారి చరిత్ర తెలిసేలా ప్రతీస్తంభంపై రాసి ఉంచుతామని చెప్పారు. ఆలయంలో 108 అడుగుల పొడవైన ఆంజనేయస్వామి విగ్రహం ఏర్పాటు చేయాలని సీఎం యోచిస్తున్నారని పేర్కొన్నారు. భేతాళ స్వామి, శ్రీరాముడి ఆలయం, సీతమ్మ కన్నీటిధారలు పరిశీలించిన ఆనంద్‌సాయి ఆలయంలో చాలామార్పులు ఉంటాయని వెల్లడించారు. ఈ సమాచారం మొత్తాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment