కొంగుబంగారం... కొండ గట్టు
పెద్ద పెద్ద వృక్షాలు... నిశ్శబ్ద వాతావరణం... నల్ల రాతి బండల గాంభీర్యత... పక్షుల కిలకిలా రావాలతో ఓ పక్కన ప్రశాంతతను ప్రసాదిస్తూనే, మరోపక్క ఆధ్యాత్మిక నిలయంగా వెలుగొందుతోంది... కొండగట్టు. అక్కడ కొలువైన ఆంజనేయస్వామి భక్తుల కోరికలు తీరుస్తూ పూజలందుకుంటున్నాడు.
కరీంనగర్ జిల్లా, మల్యాల మండలం, ముత్యంపేట గ్రామ శివారులో... కొండగట్టు మీద... కోరంద పొదల మధ్యన పవన సుతుడు, శ్రీరామ పాదదాసుడు అయిన ఆంజనేయస్వామి స్వయంభువుగా వెలిశాడు. భక్తులు కోరిన కోర్కెలు తీర్చే ఆరాధ్యదైవ ంగా వెలుగొందుతున్నాడు. కొండగట్టులో ఆంజనేయ స్వామి... నారసింహస్వామి, ఆంజనేయస్వామి రెండు ముఖాలతో ఉంటాడు. నరసింహస్వామి అంటే సాక్షాత్తూ విష్ణుస్వరూపం కాబట్టి కొండగట్టు ఆంజనేయస్వామి వారికి శంఖం, చక్రం, వక్షస్థలంలో రాముడు, సీత ఉండడం విశేషం.
ఆలయ ప్రాశస్త్యం..
ఐదు వందల ఏళ్ల క్రితం సింగం సంజీవుడనే వ్యక్తి ఆవులను మేపుతూ కొండకు రాగా, ఒక ఆవు తప్పిపోయింది. వెతికి వేసారి చివరికి ఓ చింతచెట్టు కింద సేదతీరుతుండగా స్వప్నంలో స్వామి కనపడి ‘నేను కోరంద పొదల్లో ఉన్నాను. నాకు కాస్త ఎండ.. వాన.. ముండ్ల నుండి రక్షణ కల్పించు. నీ ఆవు ఇదిగో, ఇక్కడే ఉంది’ అని చెప్పాడు. సంజీవుడు నిద్రలోంచి లేచి చూడగా ఆవు ఎదురు వచ్చింది. వెంటనే కోరంద పొదలను తొలగించి చూస్తే శంఖు, చక్ర గదాలంకరణతో ఆంజనేయ స్వామి విశ్వరూపం దర్శనమిచ్చింది.
వెంటనే అతడక్కడ ఆలయాన్ని నిర్మించాడు. దక్షిణ భాగంలో చెక్కిన శిలాక్షరాలు ఈ కథ అంతటినీ మన కళ్లకు కడతాయి. కొండ గట్టు మీద చుట్టూ చిన్న కోటగోడ ఆకారంలో మూడు భిన్నమైన ప్రహరీలున్నాయి. వీటిని కొండల్‌రాయుడు కట్టించాడు. స్వామి భక్తుడైన చిలుమూరి రఘు పతిరావును చంపిన వారిపై పగ సాధించేం దుకు అతడి కొడుకు కొండల్ రాయుడు కోట, బురుజు కట్టి బలగాన్ని సేకరించాడు. అతడి గుర్రం అడుగులు, కోట గోడలు, కొలను గుంటలు ఇక్కడ దర్శనమిస్తాయి.
కొండగట్టు పేరు ఎలా వచ్చిందంటే..
ఆంజనేయస్వామి దేవాలయం నల్లరాతి బండల సమూహాలు, గుహలు, అనేక రకాల వృక్షజాతులతో కూడిన అటవీ ప్రాంతంలో ఉంది. చుట్టూ పెద్ద పెద్ద కొండలు, ఆ కొండలపై మళ్లీ ఒక చిన్న గుట్ట ఏర్పడగా, ఆ గుట్టపై ఆంజనేయస్వామి వెలిశాడు. అందుకే కొండగట్టు అని పేరువచ్చిందనే ప్రచారం ఉంది.
లక్ష్మణుడు మూర్ఛిల్లినప్పుడు ఆంజనేయస్వామి సంజీవని పర్వతం తీసుకొని వెళ్తుండగా అందులోంచి ఒక ముక్క రాలి ఈ కొండలలో పడిందని, అదే కొండగట్టుగా ప్రసిద్ధి చెందిందని, అందుకే శారీరక, మానసిక బాధలు, ఇతర గ్రహ బాధలున్నవారు స్వామిని దర్శించుకోగానే తొలగిపోతాయని పూర్వీకులు చెబుతుండేవారు. దేవాలయానికి సమీపంలో రాతి బండల మధ్య 30 గజాల లోతు పుష్కరిణి ఉంది. తపస్వీకులు స్నానాలు చేసి, స్వామిని సేవించి, సమీపంలోని గుహలో తపస్సు చేసేవారు.
ఒకే మంటపంలో మూడు వేర్వేరు గర్భగుడులున్నాయి. మధ్యలో ఆంజనేయ స్వామి, కుడిపక్కన వేంకటేశ్వరస్వామి ఉత్సవ మూర్తులు, ఎడమ పక్కన అమ్మవారు వెలిసి ఉండగా, ఆలయానికి పడమరవైపు క్షేత్ర పాలకుడు భేతాళస్వామి ఆలయం ఉంది. బేతాళస్వామికి దక్షిణాన రామపాదుకలు ఉండగా... ఫర్లాంగు దూరంలో పొలిమేర దేవత బొజ్జ పోతన్న ఉంటాడు. రామ పాదుకలకు కొద్ది ముందు భాగంలో సీతా పతివ్రతా తల్లి కూర్చొని, తన కష్టాలు తలుచుకుని ఏడ్చేదట. ఆ సాధ్వి కన్నీటి గుర్తులూ ఇక్కడ ఉన్నాయి.
ఐదు వందల ఏళ్లుగా నిత్య హారతులు..
కొండగట్టు ఆంజనేయస్వామికి ఐదు వందల ఏళ్లుగా నిత్య హారతులు కొనసాగు తున్నాయి. అనారోగ్యం, దీర్ఘకాల పీడితులు, మతిస్థిమితం లేనివారు, స్వామి సన్నిధిలో 11, 21, 41 రోజులు నిష్టతో పూజలు చేయడమే కాక, మూడుపూటలా భజనలు చేస్తున్నారు. బేతాళస్వామి ఆలయం వద్ద గ్రహపీడితులు విగ్రహానికి మొక్కి, అల్లుబండను ఆలింగనం చేసుకుంటారు. స్వామి కలలోకి వచ్చి గ్రహ బాధ నుండి విముక్తి కలిగిస్తున్నట్లు భక్తులు చెబుతుంటారు. స్వామిని సేవిస్తే సంపూర్ణ ఆరోగ్యం పొందుతారని భక్తుల విశ్వాసం.
చైత్ర పౌర్ణమి రోజున ఆంజనేయస్వామి జయంతి ఉత్సవాలను హనుమాన్ చిన్న జయంతిగా నిర్వహిస్తారు. వైశాఖ బహుళ దశమి రోజున అత్యంత ైవె భవంగా హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు నిర్వహిస్తారు. త్రయాహ్నిక, త్రికుండాత్మక, మహాయాగం, మూడురోజులపాటు స్వామికి ప్రత్యేక పంచా మృత అభిషేకం, సహస్ర నాగవల్లి అర్చన, సహస్ర దీపాలంకరణ, గరుడ వాహన సేవ నిర్వహిస్తారు. సుమారు 3 నుండి 5 లక్షల మంది దీక్షా పరులు స్వామిని దర్శించుకుని, దీక్ష విరమణ చేస్తారు.
- జవ్వాజి చంద్రశేఖర్, మల్యాల కంట్రిబ్యూటర్